29, నవంబర్ 2010, సోమవారం

ఒక మౌనం వెనుక...







ఒక మౌనం వెనుక 

కాలం ఏదైతేనేం .. కారణాలు  ఏవైతేనేం 
సాధించాడటానికి, శోధించటానికి,
శోభిల్లడానికి అబలల  శరీరాలే కావాలి  ..
కూడబెట్టుకోవడానికో , దోచిపెట్టడానికో ..
సహజ సంపదలే కావాలి...

ఈ కల్కి యుగంలో మానమర్యాదలని కాపాడటానికి ..
ఏ గోపాలుని అదృశ్య  హస్తం రాదని,
విరబోసిన కురులకి  రక్తతర్పణం చేయగల
పతి ఉండడని తెలుసు..

నట్టడవిలోను, నడిరోడ్డు పైనా
ఆత్మ రక్షణకై కూడా చంపడానికి
వెనుకాడే   ఆ చేతులు
నరకడం కూడా తెలిసిన ఆ చేతులు ..
న్యాయం   కోసం అర్దిస్తాయి
సిగ్గు విడిచి ఆక్రోశిస్తాయి..

పాలెగాళ్ళ నేరాల గుట్టుని విప్పని రాక్షస రాజ్యంలో
రాజకీయరాబందుల వీక్షణంలో  తీక్షతని కోల్పోయినా..
చేయని తప్పుకి - ఏలినవాడి   సానుభూతికి  మధ్య  
ప్రశ్న తలెత్తి  రుతువుల కాలమానం తో ..
మానని గాయం పై ముల్లులా   గుచ్చుతూనే ఉంది.
పచ్చిగాయాలు పచ్చగా ఉండటం
మన తప్పు కాదు తల్లీ.. చెల్లీ..

దారి తప్పిన మదగజాలని  ప్రయాసకోర్చి పట్టి
జంతుశాలకి పంపిన నాగరికులకి
గూడాలపై బడిన మృగాలని శిక్షించలేక
న్య్యాయం కళ్ళు మూసుకుంటే  
ఆటవిక న్యాయం కన్నుతెరిచి 
కుక్షిని చీల్చ లేకా కాదు...
వధ్యశాలకి  పంపడం చేతకాకా  కాదు ..

వేటాడటం , భూమిని దున్నడం తెలిసిన
వారికి  సానపెట్టడం  తెలుసు..
మూగ భావాలతో  గుండెల్ని తడమడం తెలుసు.
బాణాలతో  .. గుచ్చి చంపడం తెలుసు..
అలసిన న్యాయ పోరాటాల వెనుక,
ఆయేషా కథ మలుపుల మధ్య
మరో.. పూలందేవి  ఆవిర్భవానికి 
బీజం పడే ఉంటుంది.

ఈ.. అత్యాచారాల నెలవులో ..
దురంధరుల కొలువులో..
ఎన్నో దురాగతాల   సాక్షిగా..
మౌన సంఘటితాల మధ్య
శక్తుల కొలుపు జరుగుతూనే ఉంటుంది.

ఒక మౌనం వెనుక... 
ఒక విస్ఫోటనం ఉండనే ఉంటుంది..
అరణ్య రోదనలోను .. ఆరని కసి ..
నివురుకప్పిన నిప్పులా.. ఉంటుంది ..
గాయ పడిన పులి
పంజా  రుచి  చూపడానికి పొంచి  ఉంటుంది.

మూగపోయిన కలం నాలుక
చీలిక చీలికలుగ  మారి 
దునుమాడటానికి  సిద్ధంగానే  ఉంది..   

(వాకపల్లి    ఉదంతం పై వ్రాసిన కవిత .. భూమిక లో ప్రచురితమైన కవిత )         

28, నవంబర్ 2010, ఆదివారం

కాలానికి కళ్ళెం వేయజాలం కనుక..


మనుషులు  వారివారి మాటలతో .. చేతలతో,, చూపులతో ,  ప్రవర్తనతో .. ఇతరులని బాధిస్తారు. వేధిస్తారు .. కానీ.. అదే మనుషులు సృష్టించిన సాహిత్యం ..సంగీతం .. మనసులని .. సేదతీరుస్తాయి .. ఎంత వైచిత్రం.. అందులకు సాక్షీభూతం .. కాలం కదా.. అందుకే .. కాలానికి కళ్ళెం వేయజాలం  కనుక.. పూలచట్రంలో.. బంధించి  అయినా.. కాలంతో.. ఆహ్లాదంగా.. పరుగెడదాం...    
l

25, నవంబర్ 2010, గురువారం

నువ్వు వదిలేసిన కాడితో

పల్లెలలో రైతుల జీవితాలు కడగండ్ల మయం. వర్షాభావ పరిస్థితులు,నకిలీ మందులు,ప్రకృతి వైపరీత్యాలు,గిట్టుబాటు ధరలు లేకపోవడం తో పాటు.. వీటన్నిటి మధ్య  రైతు కి ఉన్న వ్యసనం వ్యవసాయం చేయడం మరియు కొన్ని వ్యక్తి గత వ్యసనాలు. పీకల లోతు  అప్పుల్లో కూరుకుపోయి..అప్పులు తీర్చే మార్గం కానరాక తన మానాన తానూ ఓ దారి వెతుక్కుని ఆత్మహత్య చేసుకుంటే.. మిగిలిన పాపానికి ఆ ఇల్లాలికి యెంత కష్టం.
ఆ కష్టాలే..ఈ కవిత. యువ కవితలు పేరిట  ప్రచురింపబడి .. ఆ సంవత్సరపు ఉత్తమ కవితలలో చోటు చేసుకున్నది.
ఆ కవిత  . ఈ కవిత 



నువ్వు వదిలేసిన కాడితో

ఏ ఏటికి ఆఏడు చెలమలోని  నీళ్ళులాగ
అవసరాలు ఊరుతూనే ఉండాయని
చేసిన అప్పులు వడ్డీతో కలసి
సాలుసాలుకి రెళ్ళు దుబ్బుల్లా
పెరుగుతూనే ఉండాయని
బాధల్లన్ని మరిచిపోవాలని
అప్పుడు ఆ  మందు తాగినావు ..
ఏకంగా  ఇప్పుడు ఈ మందు తాగేసి
పురుగులా మాడిపోయావు.
.
కొంగు ముడి  పడ్డ నాటినుండి ..
నేను సాయంగా ఉండానన్న సంగతి మరిసేసి
నిన్ను కన్నోళ్ళకి   మనం కన్నోళ్ళకి
నన్నే ఒంటి నిట్టాడిని  చేసి పోయినాక
నన్ను గాలికి  ఒగ్గేసి..
నువ్వు గాలిలో కల్సిపోయాక
నేను రోజూ ధైర్యం అనే మందు తాగుతూనే ఉండాను ..

నువ్వు ఉన్నప్పుడు సాయం చేస్తానని రాని చేతులు
నా ముందుకొచ్చాయి  లెక్కలేనన్ని..
బిక్క చచ్చి బక్క చిక్కి ఉన్న శరీరాల చుట్టూ ..
ఆకలి చూపులు కాకుల్లా.. గ్రద్ధల్లా..
గిరికీలు కొడుతూనే ఉండాయి.
నువ్వు చస్తే మారతాయని  అనుకున్నబాధలు
పెనంలోనుండి పొయ్యిలోకి మారినాయి.

నడిరేతిరి కీచురాళ్ళ రొదలా..
అప్పులాళ్ళ బాధలు,పేగులు తిప్పేసే బిడ్డల
 తీరని ఆకలి కేకలు..
దాయలేని యవ్వనపు ప్రాయపు పొంగులు..
మోటబాయి లోని నీళ్ళు లాగానే
నీరింకిన కళ్ళల్లో భయం, దైన్యం
శూన్యం తారట్లాడుతున్నాయి.

మనోల్ల చూపుల్లో చుక్కలు పొడవాలంటే ..
మా చుట్టూ తిరిగే చూపులకి ముళ్ళ కంచెలు కొట్టి
మా చూపులకి అగ్గి రగిలించుకుని..
ఆమడ దూరంలో వాళ్ళని ఆపేసి
నువ్వు వదిలేసిన కాడితో ..
బతుకు సేద్యం చేస్తూనే ఉండాల.
బతుకుతూనే ఉండాల.. బతుకుతూనే ఉండాల
ఒంటి చేత్తో ఆవలి ఒడ్డుకి చేరేదాక..
బతుకుతూనే ఉండాల. బతుకుతూనే  ఉండాల..

21, నవంబర్ 2010, ఆదివారం

అమ్మ

అమ్మ ..
ఏ కవి కలానికి అందనిది
ఏ సూక్ష్మదర్శినికి .. చిక్కనిది ..
అమ్మ ప్రేమ..
సృష్టి ఉన్నంత కాలం..
తల్లిబిడ్డల ప్రేమ అనంతం ..
 అపూర్వం. అజరామరం ..
అమ్మలందరికి.. పాదాభి వందనం ..
నన్ను కన్న తల్లికి..
శతసహస్ర పాదాభి వందనం.. .

ఒక..ముద్ర.






జీవితం అనేది
అనుభూతుల పుష్పగుచ్చం.
రోజు మారితే పువ్వులు వాడినట్లు 
అనుభూతులు వాడిపోతే
మనం నిత్యం మరణిచినట్లే..!!
అందుకే .. నిత్యనూతనంగా ..
అనుభూతులను ప్రోది చేసుకుంటూ ..
వాడని వసంతరాగం ఆలపిస్తూ..
ఆనందంగా..గడిపేయడం నాకు ఇష్టం. 
ఈ చిన్ని జీవితంలో.. 
మనకంటూ..ఒక..ముద్ర..
మనమే వేసుకుని ..
ఉత్తేజంగా.. బ్రతికేద్దాం .. బ్రతికిద్దాం ..
ఇదే.. నేను.. మనసా..తలపోసేది 
వాచా.. వ్యక్తీకరించేది..
కర్మణా.. ఆచరించి..చూపేది.. ఇదే.. ఇదే..!! ఇలాగే!!!
బ్లాగ్ లోకంలోకి.. 
కొత్తగా.. అడుగిడి..
వనజవనమాలి..
తొలి..సంతకం.. ఇది..