25, నవంబర్ 2010, గురువారం

నువ్వు వదిలేసిన కాడితో

పల్లెలలో రైతుల జీవితాలు కడగండ్ల మయం. వర్షాభావ పరిస్థితులు,నకిలీ మందులు,ప్రకృతి వైపరీత్యాలు,గిట్టుబాటు ధరలు లేకపోవడం తో పాటు.. వీటన్నిటి మధ్య  రైతు కి ఉన్న వ్యసనం వ్యవసాయం చేయడం మరియు కొన్ని వ్యక్తి గత వ్యసనాలు. పీకల లోతు  అప్పుల్లో కూరుకుపోయి..అప్పులు తీర్చే మార్గం కానరాక తన మానాన తానూ ఓ దారి వెతుక్కుని ఆత్మహత్య చేసుకుంటే.. మిగిలిన పాపానికి ఆ ఇల్లాలికి యెంత కష్టం.
ఆ కష్టాలే..ఈ కవిత. యువ కవితలు పేరిట  ప్రచురింపబడి .. ఆ సంవత్సరపు ఉత్తమ కవితలలో చోటు చేసుకున్నది.
ఆ కవిత  . ఈ కవిత నువ్వు వదిలేసిన కాడితో

ఏ ఏటికి ఆఏడు చెలమలోని  నీళ్ళులాగ
అవసరాలు ఊరుతూనే ఉండాయని
చేసిన అప్పులు వడ్డీతో కలసి
సాలుసాలుకి రెళ్ళు దుబ్బుల్లా
పెరుగుతూనే ఉండాయని
బాధల్లన్ని మరిచిపోవాలని
అప్పుడు ఆ  మందు తాగినావు ..
ఏకంగా  ఇప్పుడు ఈ మందు తాగేసి
పురుగులా మాడిపోయావు.
.
కొంగు ముడి  పడ్డ నాటినుండి ..
నేను సాయంగా ఉండానన్న సంగతి మరిసేసి
నిన్ను కన్నోళ్ళకి   మనం కన్నోళ్ళకి
నన్నే ఒంటి నిట్టాడిని  చేసి పోయినాక
నన్ను గాలికి  ఒగ్గేసి..
నువ్వు గాలిలో కల్సిపోయాక
నేను రోజూ ధైర్యం అనే మందు తాగుతూనే ఉండాను ..

నువ్వు ఉన్నప్పుడు సాయం చేస్తానని రాని చేతులు
నా ముందుకొచ్చాయి  లెక్కలేనన్ని..
బిక్క చచ్చి బక్క చిక్కి ఉన్న శరీరాల చుట్టూ ..
ఆకలి చూపులు కాకుల్లా.. గ్రద్ధల్లా..
గిరికీలు కొడుతూనే ఉండాయి.
నువ్వు చస్తే మారతాయని  అనుకున్నబాధలు
పెనంలోనుండి పొయ్యిలోకి మారినాయి.

నడిరేతిరి కీచురాళ్ళ రొదలా..
అప్పులాళ్ళ బాధలు,పేగులు తిప్పేసే బిడ్డల
 తీరని ఆకలి కేకలు..
దాయలేని యవ్వనపు ప్రాయపు పొంగులు..
మోటబాయి లోని నీళ్ళు లాగానే
నీరింకిన కళ్ళల్లో భయం, దైన్యం
శూన్యం తారట్లాడుతున్నాయి.

మనోల్ల చూపుల్లో చుక్కలు పొడవాలంటే ..
మా చుట్టూ తిరిగే చూపులకి ముళ్ళ కంచెలు కొట్టి
మా చూపులకి అగ్గి రగిలించుకుని..
ఆమడ దూరంలో వాళ్ళని ఆపేసి
నువ్వు వదిలేసిన కాడితో ..
బతుకు సేద్యం చేస్తూనే ఉండాల.
బతుకుతూనే ఉండాల.. బతుకుతూనే ఉండాల
ఒంటి చేత్తో ఆవలి ఒడ్డుకి చేరేదాక..
బతుకుతూనే ఉండాల. బతుకుతూనే  ఉండాల..
  

2 కామెంట్‌లు:

Sujata M చెప్పారు...

చాలా బావుంది !

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Sujatha gaaru

Thank you somuch