నీలాంజన అనే ఫ్రెండ్ ఉంది. నాతోపాటు సంస్థలో పనిచేసేది. బాగా చదువుకుంది ఎందుకో అప్పట్లో వివాహం చేసుకోలేదు యాబై రెండేళ్ళ వయస్సులో వొక రచయితను పెళ్ళి చేసుకుంది. మీ వూరులోనే వుందట.. ఈసారి నేను వచ్చినప్పుడు నన్ను ఆమె యింటికి తీసుకెళ్ళాలి అంది ఉమ ఫోన్ లో మాట్లాడుతూ.
"రచయితా, అతని పేరేమిటి ?" ఆసక్తిగా అడిగింది హేమ.
"ఏదో పేరు. నోట్లో ఆడుతుంది కానీ బయటకు రావడంలేదు. లెక్చరర్ గా చేసి రిటైర్ అయ్యాడంట. భార్య చనిపోయిన తర్వాత అరవై యెనిమిదేళ్ళ వయస్సులో ఈమెని పెళ్ళి చేసుకున్నాడు" అంది.
“ఆమెలా చేసుకుంది అంత వయస్సాయనను. గట్టిగా వున్నన్నాళ్ళు వుండి ఆఖరికి యేదో వొక ఆధారం దొరికితే చాలనుకుని కాటికి కాళ్ళు జాపుకున్న వాడిని చేసుకుంటారు. ఏం బలహీనతో యేమో, వయసు పెరిగే కొద్ది వొంటరిగా బ్రతకలేమన్న భయం ప్రవేశిస్తుందేమో మరి" విసుక్కున్నట్టు అంది హేమ.
"నువ్వన్నది నిజమే, ఎమ్ ఏ చేసింది. ఆంగ్లం హిందీ మీద మంచి పట్టున్న మనిషి. మంచి ప్రసంగాలు చేసేది. ఆమె మాట్లాడుతుంటే హాలంతా పిన్ డ్రాప్ సైలెన్స్. ఊపిరి పీల్చుకోకుండా 45 నిమిషాలు, సమయమిస్తే యింకా యింకా మాట్లాడేది. సడన్ గా ఆ రచయితను పెళ్ళి చేసుకుని గృహిణిగా స్థిర పడింది. ఆ పెళ్ళి కూడా బంధువులు కుదిర్చి చేసారంట. తమ్ముళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లల మధ్య బాగానే ఉండేది. తర్వాతెందుకోవుండలేకపోయింది. ఒకసారి వెళ్లి చూసి రావాలి నువ్వు తీసుకెళ్ళాలి తప్పదు అంది.
"ముందు నువ్వు నీ కొలువుకి సెలవులిచ్చి రావమ్మా, కనీసం పది రోజులైనా వుండాలిక్కడ, లేకపోతే వూరుకోను" అంది హేమ.
*****************
"సరేలే .. నీ వుద్యోగం ఎలా వుంది?. బాగానే సంపాదిస్తున్నావ్. బరువులు తగ్గాయి. ఇక పెళ్ళి చేసుకోరాదు ఈ రోజుల్లో అమ్మాయిలకు భలే డిమాండ్ వుందిలే. అదే అబ్బాయిలైతే ముప్పై దాటితే పెళ్లవడం కష్టంగా ఉంది" అంది హేమ
"సరేలే .. నీ వుద్యోగం ఎలా వుంది?. బాగానే సంపాదిస్తున్నావ్. బరువులు తగ్గాయి. ఇక పెళ్ళి చేసుకోరాదు ఈ రోజుల్లో అమ్మాయిలకు భలే డిమాండ్ వుందిలే. అదే అబ్బాయిలైతే ముప్పై దాటితే పెళ్లవడం కష్టంగా ఉంది" అంది హేమ
"సుఖంగా వున్న ప్రాణానికి పెళ్ళి ఆలోచన యెందుకులే ? ఇప్పుడీ వయసులో చేసుకుని సాధించేదేముంది చెప్పు? చేసుకోదల్చుకుంటే సంస్థలో మాతోపాటు పనిచేసేవాళ్ళనే చేసుకుంటాను. ఆలోచనా విధానం దగ్గరగా వుంటుంది. కాస్త సేవ చేసేందుకు అనుమతి వుంటుంది."
"అయితే ఆలోచనలు కలిస్తేనే పెళ్ళి చేసుకుంటానంటావ్,"
"ఎక్కడో అయినవాళ్ళకు దూరంగా మెయిడ్ గా పనిచేసే బదులు మంచి స్థితిపరులైన రెండో సంబంధం వాడిని చేసుకుని సుఖపడటం నేర్చుకో అని అమ్మ గొడవ పెడుతుంది. రెండు మూడు సంబంధాలున్నాయి కూడా. నా మనస్తత్వం నాకు తెలుసు ఆలోచనలకు ముల్లు గుచ్చుకుంటే పోట్లాడతాను. అదే మనసుకు గుచ్చుకుంటే నొచ్చుకుని దూరంగా జరుగుతాను. ముడుచుకుని ఒంటరినై పోతాను. నాలాంటి వాళ్లకి పెళ్ళి అవసరమా ?"
"నీకవసరం లేదేమో కానీ లోకానికి అవసరం. రెండో పెళ్ళి చేసుకునే పురుషుల క్యూ చెంతాడంత వుంటుంది. పాపం వాళ్ళ పై జాలి చూపిస్తావని చెపుతున్నా" అని కొంటెగా అంది హేమ
"మరీ చిన్నపిల్లవైపోతున్నావ్" అంటూ హేమ వీపుపై గట్టిగా చరిచింది.
"ఆడదానికి పెళ్ళి అనే వల పడటానికి వయసుతో పనేమీ లేదులే. 80 యేళ్ళు వచ్చాక కూడా పెళ్ళి సంబంధాలు వస్తాయి. అంత డిమాండ్ వుంది, దిగులు పడకు" అంది హేమ మళ్ళీ కొంటెగా .
ఉమకి ఆ మాటల్లో లోతు అర్ధమై ఆపకుండా నవ్వింది.
"ఇలాగే నవ్వు. నీ నవ్వు చూసి ఎవరో వొక బాలా కుమారుడు యేదో వొకనాడు నిన్నెత్తుకుపోయి తన వంటగదికి పట్టమహిషిని పడక గదికి వేశ్యను చేస్తానంటాడు చూడు" అంది హేమ.
"ఇలాగే నవ్వు. నీ నవ్వు చూసి ఎవరో వొక బాలా కుమారుడు యేదో వొకనాడు నిన్నెత్తుకుపోయి తన వంటగదికి పట్టమహిషిని పడక గదికి వేశ్యను చేస్తానంటాడు చూడు" అంది హేమ.
"ఆ ఊబి లో నేనెప్పుడూ పడనులే కానీ , వొకసారి నీలాంజన దగ్గరకు వెళ్ళి వద్దాం ప్లీజ్ ప్లీజ్ .. ."
"ఎందుకు తన అనుభవాలు చెపుతుందని, తెలుసుకోవాలనే ఆసక్తి కదూ నీకు. మొత్తానికి గ్రౌండ్ వర్క్ బాగానే చేస్తున్నావ్ అయితే త్వరలో పప్పన్నం పెడతావ్" అంది.
"అదేమీ కాదులే చాలా సంవత్సరాలైంది చూసి. మంచి మనిషి. వెళ్ళాలి తప్పదు" అభ్యర్ధనగా చూసింది ఉమ..
తను తెచ్చిన నీలాంజన నెంబర్ కు ఫోన్ చేస్తే గుర్తుపట్టి సంతోషంగా మాట్లడింది. ఇంటికి రమ్మని ఆహ్వానించి పదేళ్ళకి పైగానే అయిందిగా నన్ను చూసి గుర్తు పడతావో లేదో నాకు శరీరమంతా సొరియాసిస్ వచ్చింది అని చెప్పింది.
"అయ్యో అలాగా" అని ఊరుకుంది ఉమ
నాలుగు రోజుల తర్వాత వీలు చూసుకుని నీలాంజన చెప్పిన అడ్రెస్స్ కి చేరుకొని కాల్ చేస్తే మూడు రోజులనుండి హాస్పిటల్ లో ఉన్నాం. భర్తకి బాగోకపోతే హాస్పిటల్ లో జాయిన్ చేసాను అని చెప్పింది.
హాస్పిటల్ వివరాలు తెలుసుకుని యిద్దరూ అక్కడికి వెళ్ళారు.అతను ఐ సి యూ లో వుంటే ఆమె కారిడార్ లో పడిగాపులు పడుతూ కనిపించింది.
"ఎలా ఉండేవారు నీలాంజన. మిమ్మల్నిలా చూస్తానని యెన్నడూ అనుకోలేదు" అంది ఆమెని సానుభూతిగా చూస్తూ.
"రెండేళ్ళ నుండే ఇలా మొదలైంది'' అంది విచారంగా.
విపరీతమైన మానసిక వొత్తిడి వుంటేకూడా సోరియాసిస్ వస్తుందని డాక్టర్స్ చెపుతుంటే వింది హేమ. ఆమె కూడా ఆ జాబితాలో మనిషని గ్రహించేసింది.
"మీరు కష్టంలో వున్నారు. రాకూడని పరిస్తితుల్లో వచ్చినట్టున్నాము క్షమించండి" అంది హేమ.
"పర్లేదండీ అభిమానం ఉండబట్టేగా వెతుక్కుని మరీ వచ్చారు. ఉమ కూడా యెక్కువ రోజులు ఉండటానికి వీలవుతుందో లేదోనని రమ్మన్నాను".
"మీ వారి వయస్సు మరీ అంత మీద పడలేదు ఇంకొంత కాలం జీవిస్తే మంచి సాహిత్యం వస్తుందేమో ఆయన కలం నుండి" అంది.
"ఒకపుడు మీలాగానే నేను భ్రమపడినదాన్నేనీళ్ళ గురించో ఆడదాని కన్నీళ్ళ గురించో పన్నీరు గురించో ఆకట్టుకునే కథలు వ్రాయగలరు కానీ భార్యను బాధించని వాళ్లుంటారా” అంది నిర్లిప్తతంగా.
గాలి జొరబడని హాస్పిటల్ కారిడార్ లో వరుస కుర్చీలలో కూర్చుని తన మనసు ఉక్కపోతని స్నేహితురాలు ఉమ ముందు దూసిపోసింది నీలాంజన.
"రెండో పెళ్ళి చేసుకునే పురుషుడు చెప్పే అతిశయాల ముందు.. సినిమా పాటల్లో ప్రేమికుడు పాడే అతిశయాలు కూడా పనికిరావనుకో.".
హేమకు ఆమాట వింటుంటే ప్రియా ప్రియా చంపొద్దె అనే పాట గుర్తుకొచ్చి పెదవులపై నవ్వులు విరబూసాయి.
నీలాంజన చెప్పుకుపోతుంది అలాంటి మాటలకు కళ్ళు మూసుకుపోయి తమకి తాము అన్యాయం చేసుకుంటున్నారు ఆడవాళ్ళూ. ఈయన విషయానికే వస్తే రచనలు ఆదర్శంగా ఉంటాయి కదా, మనిషి కూడా అలాగే ఉంటాడనుకున్నా, మొదటి పరిచయం గుడిలో. నా అవివాహ జీవితాన్ని గురించి మాట్లాడి జీవితాన్ని పండ బెట్టుకోవాలి కానీ యెండ బెట్టుకోకూడదు అని చెప్పాడు. నీ సంపాదనకు అలవాటు పడ్డ మీ వాళ్ళు పెళ్ళి చేసే ఆలోచన వున్నట్టు లేదు. నువ్వు బిడియాలను వొడకట్టేయాలి. కావాల్సినదానికొరకు పెదవి విప్పాలి అని ఉద్బోధ చేసాడు. తరచి చూసుకుంటే కొన్ని మాటలు సత్యానికి దగ్గరగా అవును కదా అనిపింపజేసాయి. ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాను. నిలువునా పూచిన కొమ్మనై అతని దరి చేరాను. అతనేమో తన శృంగార యజ్ఞంలో నేనొక సమిధను అనుకునేవాడు. అతను నాకు గొడుగయ్యాడు అనుకున్నా . ఆయనేమో నాకు పైటయ్యాను అనుకునేవాడు. ఇంకా తానొక దీనజన బంధువును అనికూడా చెప్పుకునేవాడు. వివాహానికి పూర్వం గుండెల్లో పెట్టుకుని దేవతలా పూజించుకుంటాను అని వాగ్ధానం చేస్తారు కానీ నరకంలో దేవతలుండలేరు అని పురుషులు యెప్పటికి తెలుసుకోలేరు" అంది ఆవేదనగా.
మనిషికి అణువణువునా అహంకారమే.. ఏ పని స్వతంత్రంగా చేయడానికి వీలులేదు. ఏ చిన్న పని చేయబోయినా నిన్నెవడూ చేయమన్నాడు అనడం పరిపాటి. అతను తాగకుండా కాఫీ తాగడాన్ని కూడా తప్పు పట్టేవాడు. రెండుపూటలా కూరేమి చేయమంటారు అని అడిగి చేయాలి. అతను సంతృప్తిగా తిని చేయికడిగాక తుడుచుకోవడానికి నాప్కిన్ అందించి వక్కపలుకులు అందించాక కానీ భోజనానికి కూర్చోకూడదు. కంచాలు కంచాలు లాగిస్తూ కూర్చోకుండా.. త్వరగా రా, కాళ్ళు పట్టాలి అనేవాడు.
వింటున్న హేమ ముఖం చిట్లించింది. ఉమ యింకా చెప్పమన్నట్టు ఉత్సాహంగా చూసింది
పెళ్ళి చేసుకుని నాలుగేళ్ళైనా తన పెన్షన్ వివరాలలో నామిని కాలమ్ లో భార్యగా నా పేరు వ్రాయించడానికి యేవో కుంటి సాకులు చెప్పేవాడు. అడిగినవారికి అడగనివారందరికీ ఈ వయస్సులో పెళ్ళి చేసుకోవడానికి పెద్ద కారణమేమిలేదు. ఒక అభాగ్యురాలికి నీడనిచ్చి నా తర్వాత కూడా కాస్త డబ్బులొచ్చే యేర్పాటు చేద్దామని యిలా చేసాను అనేవాడు. ఈ వయసులో నాకు పెద్ద కోరికలేమి వుంటాయ్, అన్నీ ఆమెతోనే కడతేరి పోయాయి అనేవాడు కాస్త వైరాగ్యం నటిస్తూ. అతని అభ్యుదయపు కబుర్లు విని “విన్నావు కదమ్మా, ఆయన్ని బాగా చూసుకో పిల్లాజెల్లా కూడా లేరు మనసులో మాట చెప్పుకోవడానికి నాలుగురోజులుండి రావడానికి” అని అనేవారు ఆ వచ్చినవాళ్ళు.
నేనే ఆఫీస్ చుట్టూ తిరిగి వివరాలిచ్చి నామిని పేరుగా ఎంటర్ చేసుకుని వస్తే నీకు అన్ని తెలుసే. బాగానే పనులు చేయించుకోవడం తెలుసు. లంచంగా యేమిచ్చావ్ ముద్దా కౌగిలా.. అని అసహ్యంగా మాట్లాడేవాడు. తరచూ నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కనివ్వను నీకు, అనాధశరణాలయానికి రాసేస్తాను అనేవాడు. రచయితలు కూడా ఇలాగ వుంటారా అని ఆశ్చర్యపోయేదాన్ని అని వాపోయింది నీలాంజన.
"రచయితల్లోనే పైత్యం ఎక్కువ కనబడుతుందిపుడు. సంప్రదింపు మార్గాలు సులువయ్యాక ఓ రాయేసి చూద్దాం అనుకోవడం మొదలెట్టారు. నా అనుభవంలోకి వచ్చిన ఇద్దరు ముగ్గురు గురించి చెపుతాను వినండి"..
"పత్రికలో వచ్చిన కథ బాగుంది అంటూ వొకతను ఫోన్ చేసాడు. అతను కూడా వొక రచయిత అంట. బోలెడంత లిస్ట్ చెప్పాడు. అందులో నేను చదివినవీ వున్నాయి. అందుకనే అపుడు కాస్త యెక్కువగా మట్లాడాల్సివచ్చింది. కొన్నాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసాడు కథల గురించే అన్నాడు. వ్యక్తిగత వివరాలు అడిగాడు. విడో ని అని పిల్లలు దూరదేశాల్లో వున్నారని చెప్పాను. దాచుకోవాల్సింది వుందని తర్వాత తెలిసింది. మళ్ళీ కొన్నాళ్ళకు ఫోన్ చేసి విడోవర్ అని.. మీకు అభ్యంతరం లేకుంటే వొక విషయం అడుగుతాను అన్నాడు కాస్త సంస్కారంగా. అడగండీ అనగానే మిమ్మలను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. కోపం తన్నుకొచ్చింది. వాడికి నా వాసం గ్రాసం గురించి యేమైనా చెప్పానా? ఎంత దైర్యం? తమాయించుకుని క్షమించండి నాకలాంటి ఆలోచన లేదు అని సున్నితంగా ఫోన్ పెట్టేసాను. వాడు తర్వాత కూడా ఫోన్ చేస్తూనే వున్నాడు. బ్లాక్ లిస్ట్ లో పెట్టేసా."
"అలాగే ఇంకొకతను పేరు చెప్పనులే, గవర్నమెంట్ సర్వీస్ లో వున్నాడు. సాహితీ ప్రియుడైతే మనసారా అభినందిచకమానం. కానీ ఆ ముసుగేసుకుని వేటాడేరకం. ఏదో వొక సాహిత్యకార్యక్రమంలో చూసి వివరాలు సేకరించాడు. మిమ్మలను చదివాను. ఓ పిల్ల తెమ్మెర తాకితే చాలు మీ చూపులను గుర్తుకు తెచ్చింది అంటూ పైత్యం వెళ్ళగక్కాడు. కవి కదా మరి. మరొకరోజు మన వేవ్ లెంగ్త్స్ కలుస్తున్నాయి. మిమ్మలను చూసే కొలది నాకేదో Spirit inject అవుతుంది. నా జీవితకాలమంతా వెతుకుతున్నా యిటువంటి వ్యక్తికోసం. మీరు ఊ అంటే ప్లాట్ కారు అన్నీ యేర్పాటు చేస్తాను. మనసైనపుడు కలుస్తూవుంటాను అని రహస్య నెంబరు నుండి మెసేజ్ పెట్టాడు. అసహ్యమేసింది. ఇలా మీ యేర్పాటులలో మీరుంటే మీ భార్య తనకు వేవ్ లెంగ్త్స్ కలిసే వాళ్ళ కోసం వెతుక్కోవచ్చు జాగ్రత్తండీ.. అన్నాను. ఈ చిత్తకార్తె కుక్కల సొంగలు ఫోన్ ద్వారా యిలా కారుతూ వుంటాయి. ఆడది వొంటరిగా వుంటుందని తెలిస్తే చాలు పడకగదికో వంటగదితో పనికొస్తుందని చిత్తచాపల్యమో నాలుక చాపల్యమో గుర్తుకొస్తాయి యిలాంటివాళ్ళకు" అని కసి తీరా తిట్టింది హేమ .
కాసేపు మౌనం రాజ్యమేలింది.
చెవి ప్రక్కన తలానించి చిన్నగా ఇలా జరిగిందని నాకెప్పుడూ చెప్పలేదే? అంది ఉమ.
"నువ్వు మంచి మనిషివి అనిపించలేదు అందుకే చెప్పలేదు" అంది హేమ నవ్వుతూ వాతావరణాన్ని తేలిక చేయాలని.
మళ్ళీ కొనసాగిస్తూ ...ఇంకొకరి అనుభవం కూడా చెపుతున్నా వినండి. ఆమె తొలిమలిగా కథలు వ్రాస్తున్నరోజులు. ఆమె వ్రాసిన కథకు మంచి పేరు వచ్చింది. ఒక సాహిత్య భాంధవుడు ఆమెను కలిసి మట్లాడాడు. మీరేదో వార్షిక కథల సంకలనాలు వేస్తారటగా. అందులో నేను వ్రాసిన కథ వేయడానికి అవకాశం వుంటుందా అని అడిగిందట. అప్పటికి అతను నవ్వి వూరుకున్నాడు. మర్నాడు ఆమె పని చేస్తున్న ఆఫీస్ నెంబర్ కి ఫోన్ చేసి .. నీ కథను తీసుకుని డిన్నర్ కు రా ... మంచి చెడ్డా మాట్లాడుకుందాం అన్నాడట. ఇదేమిటి ఇలా అంటున్నాడు. కనీసం ఫ్యామిలీతో కలిసి రా అని అనకుండా వొంటరిగా రమ్మంటాడేమిటీ కథను గురించి నాతో చర్చించేది ఏముంటుంది.. అ కథపై అప్పటికే వేదికలపై బోలెడంత చర్చ జరిగింది అనుకుని అనేక అనుమానాలతో వెళ్ళకుండా వుండిపోయింది. అప్పుడే కాదు తర్వాతెప్పుడూ కూడా ఆమె కథ ఆ సంకలనాలలో రాలేదు అని చెప్పింది.
అంతలో "పిన్నీ.. ఏవో మెడిసన్ కావాలి అంటున్నారు. వెళ్ళి పట్టుకొస్తాను" అంటూ వచ్చింది వొక యువతి. నీలాంజన హ్యాండ్బేగ్ తెరిచి కొంత డబ్బు ఆమెకి యివ్వబోయింది. భలేదానివి పిన్నీ! ఈ మాత్రం నేను ఖర్చు పెట్టకూడదా? నువ్వు తొందరపడి నగలు అమ్మేసి డబ్బులు తెచ్చావు. ఆయన అదృష్టం అది. జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన మీరిద్దరూ కూడా కర్పూరంలా కరిగిపోయే గుణం వున్నవారు” అని లి్ప్ట్ వైపు అడుగులు వేసింది.
"అదేంటి? మీ వొంటి మీద బంగారం అమ్మేసారా? "ఆశ్చర్యపోయింది ఉమ.
"మరి ఏం చేయను. ఎటిఎమ్ కార్డ్ కనబడుతున్నా ఏమీ చేయలేకపోయాను పిన్ నెంబర్ కూడా తెలియదు".. అంది నిస్సహాయంగా..
"ఎవరామె, ఏమవుతుంది మీకు? మళ్ళీ ఉమ ఆరా.
"పెంపుడు కూతురు. మొదటి భార్య చెల్లెలి కూతురు. బెంగుళూరులో వుంటుంది. వుద్యోగానికి సెలవు పెట్టి వచ్చింది. మా పెద్దమ్మను కూడా క్షణక్షణం యిలాగే సాధించి పెట్టేవాడు. పుణ్యాత్మురాలు జబ్బు చేసి యీ బాధలనుండి విముక్తి పొందింది అంటుంది యెపుడూ."
అసలేం జరిగిందంటే పది రోజుల కిందట బేగ్ కి బట్టలు సర్దుకుని వెళ్ళిపోయాడు. అభిమాని నడుపుతున్న వృద్ధాశ్రమంలో ప్రశాంతంగా బ్రతుకుతానని. వేసుకునే మందులు కూడా చేతిలో పెడితే కాని మింగని ఆయనకు వేడి వేడిగా రుచికరంగా యెవరొండి పెడతారక్కడ? గంట మోగినపుడు వెళ్ళి కూర్చుని తినిరావడం సౌకర్యాలు లేకపోవడం చూసి విసుక్కుంటుంటే యిక్కడ యిలాగే వుంటాయ్. మీకిష్టమైతే వుండండి లేకపోతే దయచేయండి అన్నాడట ఆ శిష్యుడు కమ్ అభిమాని. వెంటనే పెట్టె సర్దుకుని వచ్చేసాడు. నేను వివరాలేమీ అడక్కుండా మాములుగానే వేణ్ణీళ్ళు పెట్టి స్నానం చేస్తుంటే ఒళ్ళు రుద్ది.. గబగబా వంట చేసి వడ్డించాను. తిని త్రేపుతూ అక్కడిలా జరిగింది అని చెప్పి.. మళ్ళీ నీ పాపిష్టి చేతి కూడు తినాలని నాకు రాసి పెట్టి వుంది. అందుకే వచ్చానన్నాడు.
పన్నెండేళ్ళలో యెన్నడూ యెదురుమాటాడని యెప్పుడూ వొక మాట కూడా అనని నేను కడుపు మండి “మరి యెందుకు వచ్చారు? ఆ బేరేజీ యెక్కి కృష్ణలో దూకేపని కదా” అన్నాను. నావైపు క్రోధంగా చూసి వేలు చూపిస్తూ “నువ్వెవరవే నన్నుచావమని చెప్పడానికి ? చెప్పడానికి కూడా అర్హత వుండాలి అది తెలుసుకో ముందు " అని అంటూ చొక్కా తొడుక్కుని కిందకి వెళ్ళారు. కాసేపటి తర్వాత వచ్చి పడుకున్నారు. నేను పుస్తకం చదువుకుంటూ హాలులో పడుకున్నాను. ఓ గంట గంటన్నర తర్వాత మందులిద్దామని గదిలోకి వెళితే నురగలు క్రక్కుతూ కనబడితే కంగారు పడి అంబులెన్స్ కు ఫోన్ చేసాను. ప్రక్కనే కొత్త నిద్రమాత్రల సీసా ఖాళీగా కనబడింది.
ఆయన తమ్ముళ్ళకు ఫోన్ఆ చేసాను. ఆత్మహత్యా ప్రయత్నం చేసాడని చెప్పుకుంటే మనకే నగుబాటు అలా అని చెప్పకు. ఊపిరి అందడంలేదు అని చెప్పు. వెనక ముందు మేము వస్తాం అన్నారే కానీ వొక్క తమ్ముడూ రాలేదు. మరొకసారి ఫోన్ చేస్తే ఆయనేమన్నా తక్కువాడా! పిల్లల్లేరు ఆస్తిలో భాగం యెందుకు, చిన్నాచితకవాళ్ళం, మా పిల్లలకు వుంటుంది అంటే విని వుదారం చూపాడా? పైగా నా వాటా వాళ్ళకెందుకివ్వాలని అసహ్యంగా మాటలు జారిన అహంకారి. ఎలాగూ పోతే రావాలిగా, అప్పటికి వస్తాంలే అన్నారు.
“పురుషులందు రచయిత పురుషులు వేరు కాదయా. అందరూ ఆ దుంపలో వాళ్ళే! కాకపోతే కొంతమంది మరీ దురద దుంప లాంటి వారు ఈయన లాగా” అంది హేమ.
”కట్టుకున్న వాడు ఎలాంటి వాడనేది కాదు, మగవాడితో ముడిపడిన ప్రతి ఆడదాని కథ కంచి కెళ్ళని కథే కదా.. కాటికెళ్ళేదాకా వాడి చుట్టూరే తిరుగుతూ వుంటుంది” నిర్వేదంగా అంది నీలాంజన.
ఉమను ఎలాగోలా పెళ్ళికి ఒప్పించమని వాళ్ళమ్మ చెప్పిన విషయాన్నియింతటితో మర్చిపోవాలనుకుంది హేమ
ఆ సాయంత్రానికి నలుగురు డాక్టర్ల మూడు రోజుల విశ్వప్రయత్నం తర్వాత అతనిప్పుడు సేఫ్. మీరెళ్ళి చూడొచ్చు అన్న డాక్టర్ మాట నీలాంజన కళ్ళలో వెలుగురేఖను గీసింది.
నీలాంజన భర్తను చూడటానికి వెళ్ళబోతుంటే నువ్వు కూడా వెళ్ళు అని ఉమ వైపు చూసి సైగ చేసింది హేమ.
"ఇలాంటి దుర్మార్గుడిని చూడాటానికి అసహ్యమేస్తుంది. నేను వెళ్ళను కానీ నువ్వెళ్ళు" అంది ఉమ గుస గుసగా .
వడి వడిగా నడిచి నీలాంజనతో పాటు హేమ కూడా లోపలకి వెళ్ళింది. కళ్ళు మూసుకునే వున్నాడు ఆమె భర్త. నీలాంజన అతని చేతిమీద అరచేతిని ఆన్చి నెమ్మదిగా కదిపింది. అతను కళ్ళు తెరచి ఎదురుగా వున్న ఆమెని చూడగానే . "... డా, నన్నెందుకు బతికించావే హాయిగా చావనీయకుండా, నీ చేతి పాపిష్టి కూడు తినడానికా" అన్నాడు క్రోధంగా.
సెలైన్ పెట్టబోతున్న నర్స్ బాటిల్ వదిలేసి గిరుక్కున తిరిగి ఆమె వైపు చూసింది. ఆక్రోశంతో ఒకవిధమైన కీచు గొంతుతో ఆమె అరిచిన అరుపు ధబ్ మన్నసెలైన్ బాటిల్ శబ్దంతో పాటు కలిసిపోయింది. తర్వాత ముఖాన చేతులుంచుకుని గట్టిగా యేడుస్తూ గోడని ఆసరాగా చేసుకుంది నీలాంజన.
“కొన్ని భావ ప్రకటనలను రికార్డ్ చేయడానికి భాష సరిపోదు” బాధగా అనుకుంది హేమ.
*********0********
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి