29, మే 2024, బుధవారం

సౌందర్యానుభవం మాటలుగా..

 ఒక శిల్పాన్ని కాని, ఒక చిత్రపటాన్నికాని, ఒక ఛాయాచిత్రాన్ని కాని, ఒక వ్యక్తి రూపాన్ని కాని, ఒక దృశ్యాన్నికాని, చూసినప్పుడు ఒకా నొక అనుభూతి మన మనస్సుమీద ముద్రవేస్తుంది. ఒక వాసన, ఒక స్పర్శ, ఒక రుచి, ఒక నాదం, ఒక రూపం మనలో నిద్రాణమై ఉన్న సహజాతా లను తట్టి లేపుతాయి. నిత్యజీవితంలో కలిగే ఈ అనుభవ వైవిధ్యం కళా సృష్టిలోకూడా సంవేద్యమవుతుంది. సామాజికుడికి అనుభూతమవుతుంది. ప్రతి మనిషిలోనూ ఇవి వుంటాయి. కొంత ఎక్కువగా వున్నవారు కవులు రచయితలు చిత్రకారులు సంగీతకారులు అవుతారు. నేనూ… అదే కోవలోకి చెందినదాన్ని అయివుంటాను.అందుకే… ఈ సౌందర్యానుభవం… 




28, మే 2024, మంగళవారం

చెరగని గీత ఆడియో లో

 నలుపు తెలుపు చామాన చాయ గోధుమ రంగు పాల గులాబీ రంగు.. ఏ రంగైతేనేం!? అందరిలో ప్రవహించేది ఆ రక్తమే కదా అది ఒకటే రంగు కదా! అంటారు కానీ ఈ రంగుల మధ్య యెన్ని అంతరాలు వున్నాయో, జాతి దేశం మతం కులం వర్ణం అన్నీ వివక్ష ని చూపించేవే! 

కంప్యూటర్ యుగంలో మనుషులే భూగోళం అంతా తిరిగేస్తున్నారు. కానీ, మనుషుల మధ్య అంతరాలు యెన్నో తిష్ఠ వేసుకునే వున్నాయి. తమ మనస్సుల్లో అవి చెరగని గీత లు గీసుకునే వున్నాయి. మనిషి తనం ప్రదర్శించలేని మానవత్వం చూపలేని గిరి గీసుకుని కూర్చున్న మనుషుల మధ్య పసి మనసులు గాయపడ్డాయని తెలియకుండానే గాయపడే సందర్భాలెన్నో! అదేమిటో తెలుసుకోవాలంటే “చెరగని గీత” కథ వినండీ..




https://youtu.be/SAJ7NhRD1C4?si=l0L0GVBrpb1RoZeK

25, మే 2024, శనివారం

నిర్జీవం నుండి నిద్రాణం లోకి

 తొలగిన సంకెళ్ళ నుండి స్వేచ్ఛ లభించినా తమ జీవితాల్లో మార్పు రాని మనుషులు కొందరు. అందుకు కారణం వ్వవస్థ వొకటే కారణం కాదు వ్యక్తి వైఫల్యం కూడా! తమను తాము నిర్మించుకోలేని ఏ వ్యక్తైనా సమాజాన్ని తప్పుపడతాడు. ఏడు దశాబ్దాల స్వాతంత్ర్య ఫలాలు మనిషిని కార్యోన్ముఖుడిని చేయకపోగా అదఃపాతాళానికి తొక్కేసే రాజకీయ వ్యవస్థ పై ఆరోపణ చేస్తున్న ఒక పలాయనవాది కథ ఇది. ఈ కథలో కనబడినవి వాస్తవాలే అధికం. వినండీ..




24, మే 2024, శుక్రవారం

నాయనమ్మ

మా నాయనమ్మ అందరి నాయనమ్మ ల లానే ఒక ముసలావిడ.  నాకు తను తెలిసిన ఇరవయ్యేళ్ళుగా ఆమె ముడుతలు పడిన చర్మంతో వృద్ధురాలి గానే వుండేది. తెలిసినవారు ఆమె వయసులో చాలా అందంగా ఉండేదనీ, ఆమె కు  భర్త కూడా వుండేవాడనీ అంటూంటారు. కానీ అది ఇపుడు నమ్మడం కష్టం.  మా తాత గారి ఫోటో పెద్ద చెక్క ఫ్రేము లో కట్టివుండేది.అది, మా ఇంటి చావిట్లో వేలాడుతూండేది.  ఆయన పెద్ద తల పాగా, వొదులుగా వుండే బట్టలూ వేసుకుని ఉంటాడందులో.  ఆయన పొడవైన తెల్లని గడ్డం, అతని చాతీని దాదాపూ కప్పేసి, ఓ వందేళ్ళ వృద్ధుడిలాగా కనిపిస్తారు ఆ ఫోటో లో. ఆయన్ని చూస్తే భార్యా పిల్లలూ  ఉండే తరహా మనిషి లా కనిపించరు. కేవలం బోలెడు మంది మనవలే ఉన్న వాడిలా కనిపిస్తారు.  మా నాయనమ్మ ఒకప్పుడు యవ్వనంగా, అందంగా ఉండేది అన్న ఆలోచనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది.  ఆమె తాను చిన్నప్పుడు ఆడిన ఆటల గురించీ కూడా ఎప్పుడూ చెప్తూండేది.  వాటిని మేము నాయనమ్మ చెప్పే మిగిలిన ప్రవక్తల కధల్లానే వినేవాళ్ళం. 

ఆమె  పొట్టిగా, లావుగా, ఎప్పుడూ,కొంచెం ముందుకి వొంగి ఉండేది. ఆమె ముఖం నిండా ముడుతలూ, గీతలూ చెదురు ముదురుగా గీసినట్టుండేవి. తను ఎప్పుడూ చూడడానికి ఇలానే ఉండేదని మా మనసుల్లో ఒక స్థిర చిత్రం ముద్రించుకుపోయింది.    ఆవిడని ఇంకో విధంగా ఊహించుకోగలిగే ఆలోచనే మాకు లేదు.   తను ఎప్పుడూ ఇలానే వృద్ధురాలి లానే వుండేది. ఎంత వృద్ధురాలంటే ఇరవయ్యేళ్ళు గా ఆమె అంతే, వృద్ధురాలి లా ఉండటమే మాకు తెలుసు. ఆమె లో చక్కదనం కన్నా అందం ఎక్కువ.   తను బాలెన్స్ కోసం వొంగిన తన నడుము మీద ఒక చెయ్యి వేసుకుని, తెల్లని బట్టల్లో, ఇల్లంతా కుంటుతూ నడుస్తూ ఉండేది.  ఇంకో చెయ్యి ఎప్పుడూ జప మాల ని పట్టుకుని, ఒక్కో పూసనీ తిప్పుతూ ఉండేది.  తన వెండి జుత్తు, తన మొహాన్నంతటినీ అలల్లా తాకుతూ ఎగురుతూ ఉండేది. తన పెదవులు ఎప్పుడూ ఏదో వినబడని ప్రార్ధనని పలుకుతూ ఉండేవి. అవును తను అందమైన మనిషి.  చలి కాలంలో తెల్లగా పర్వతాల మీద పరచుకున్న మంచులా దిగంతాల వరకూ విస్తరించుకున్న ప్రశాంత లహరి లా ఒక శ్వాసించే శాంతి, తృప్తీ మా నాయనమ్మ. 

నాయనమ్మా, నేనూ మంచి స్నేహితులం.  చిన్నతనంలో నన్ను మా తల్లిదండృలు ఆమె దగ్గర విడిచిపెట్టి నగరంలో ఉన్నన్నాళ్ళూ మేము ఒకర్నొకరం అంటిపెట్టుకునే వుండేవాళ్ళం.  తను నన్ను పొద్దున్నే నిద్ర లేపి, తయారు చేసి స్కూల్ కి పంపేది.  తన ప్రభాత  కీర్తనల్ని ఒకే రాగంలో పాడుతూ నా స్నానపానాదులు ముగించేది. అలా ఆమె ముఖతః కీర్తనల్ని నేర్చుకుంటానేమో అని తన ఆశ !  కానీ  ఆమె గొంతు నాకు నచ్చినా, ఆ కీర్తనల ని నేర్చుకునే  సదుద్దేశ్యం నాకుండేది కాదు. 

అప్పుడు తను అప్పుడే కడిగిన పలకా, పచ్చని బలపం, మట్టి తో చేసిన సిరా బుడ్డీ, ఒక వెదురు పెన్నూ సిద్ధం చేసి ఒక కట్ట గా కట్టి, నా చేతికి ఇచ్చేది.  ఒక మందమయిన నిల్వపెట్టిన చపాతీ నిండా వెన్నా, చక్కెరా కలిపి రాసిస్తే అది తిని, స్కూల్ కి బయలుదేరేవాళ్ళం.  ఆమె తనతో ఒక కట్ట గా కొన్ని చపాతీలని ఊరిలో వీధి కుక్కల కోసం తెచ్చేది.  

నాయనమ్మ ఎప్పుడూ నాతో పాటూ స్కూల్ కి వచ్చేది. ఎందుకంటే స్కూల్ ఒక ప్రార్ధనాలయానికి అనుబంధంగా వుండేది. పూజారి రోజూ నాకు అక్షరాలూ, ప్రభాత కీర్తనా నేర్పించేవారు. పిల్లలందరూ వరండా అంచులెమ్మడి, చతురస్రాకారంలో కూర్చుని కీర్తన, అక్షరమాలా వల్లె వేస్తూంటే, నాయనమ్మ మాత్రం ఆలయంలో కూర్చుని గ్రంధ పఠనం చేసేది. మా ఇద్దరి చదువూ ముగిసాకా, ఇద్దరం ఇంటిబాట పట్టేవాళ్ళం. అప్పుడు మాకు తోడుగా వీధి కుక్కలూ వచ్చేవి. వాటి కోసం మేము తెచ్చి వేసే చపాతీల కోసం,  వాటిల్లో అవి అరచుకుంటూ, గొణుక్కుంటూ, మా వెంటే ఇంటి దాకా వచ్చేవి. 

మా తల్లిదండ్రులు నగరంలో సుఖంగా స్థిరపడ్డాకా, మేమూ నగరానికి వెళ్ళాం.  నాయనమ్మ కీ నాకూ ఉన్న స్నేహం లో ఇదో పెద్ద మలుపు.  మేమిద్దరం ఒకే గదిలో ఉంటున్నప్పటికీ, నాయనమ్మ ఇక్కడ నాతో స్కూలికి వచ్చేది కాదు. నేను ఇంగ్లీషు స్కూల్ లో చేరాను. బస్ లో వెళ్ళేవాడిని. వీధుల్లో కుక్కలు ఊరి లో అన్ని వుండేవి కావు కాబట్టి, నాయనమ్మ ఇంటి ఆవరణ లో  వాలే పక్షులకీ, పిచ్చుకలకీ ఆహారం పెట్టడానికే తనను పరిమితం చేసుకుంది.  

ఏళ్ళు గడిచే కొద్దీ మేమిద్దరం ఒకరినొకరు చూసుకునేదే తగ్గిపోయింది.  కొన్నాళ్ళ వరకూ ఆమె నన్ను పొద్దున్నే లేపి స్కూల్ కి తయారు చేసేది. నేను స్కూల్ నుండీ వచ్చాకా ఆరోజు టీచర్ స్కూల్ లో ఏమి చెప్పారో ఎంతో ఆసక్తి గా అడిగేది. నేనూ ఆమె కు ఇంగ్లీష్ పదాలూ, కొత్త కొత్త సంగతులూ, గురుత్వాకర్షణ శక్తీ, ఆర్కెమెడీస్ సూత్రాలు లేదా చుట్టుపక్కల ప్రపంచం గురించి చెప్పే వాణ్ణి. ఇదంతా విని ఆమె చాలా సంతోషించేది. కానీ ఇంగ్లీష్ స్కూల్లో చెప్పే ఈ విషయాలన్నీ నిజమని మాత్రం నమ్మేది కాదు.  ఈ స్కూల్లో దేవుడి గురించీ, ధార్మికత గురించీ ఏమీ చెప్పట్లేదని బాధపడేది.  ఒక రోజు నేను సంగీత పాఠాల్లో చేరబోతున్నట్టు చెప్పాను నాయనమ్మ కు. అది విని తను చాలా బాధపడింది.  ఆవిడ దృష్టి లో సంగీతానికీ అశ్లీల స్నేహాలకూ సంబంధం వుంది. అది కేవలం బిచ్చగాళ్ళకూ, వేశ్యలకూ సంబంధించిన విద్య అని ఆమె ఉద్దేశ్యం.   మర్యాదస్తులకు సంగీతం ఏమిటన్నది ఆమె అభ్యంతరం.  ఇలా నా సంగీత పాఠాల అనంతరం, నాతో మాటలు బాగా తగ్గించేసింది నాయనమ్మ. 

నేను కాలేజీ కి వెళ్ళాకా, నాదీ అంటూ వేరే ఒక గది దొరికింది ఇంట్లో. అంతటితో  నాకూ నాయనమ్మ కూ  ఉన్న బంధం కూడా తెగిపోయినట్లైంది.   తన ఒంటరితనంతో నాయనమ్మ వెంటనే రాజీ పడిపోయింది.  చాలా అరుదుగా తన రాట్నాన్ని విడిచిపెట్టి , ఎవరితోనైనా మాట్లాడేది. పొద్దుట్నించీ పొద్దు పోయేదాకా ఆ రాట్నం వొడుకుతూ, పెదవులతో ఏవో ప్రార్ధనలు చేస్తూ ఒంటరిగానే కాలం గడిపేసేది.  ఒక్క మధ్యాహ్నాలు మాత్రం వరండాలో తీరిగ్గా కూచుని, ఆవరణలో వాలే పిచ్చుకలకు రొట్టెల్ని చిన్న చిన్న ముక్కలుగా తుంపి వెదజల్లుతూ గడిపేసేది. ఆ సమయంలో నాయనమ్మ చుట్టూ వాలే పక్షుల హడావిడీ, వాటి కిచ కిచలూ, గోలా చూసి తీరాల్సిందే! కొన్ని పిచ్చుకలు వచ్చి ఆవిడ కాళ్ళ మీదా, భుజాల మీదా వాలేవి.  కొన్ని తల మీద కూడా.  ఆవిడ నవ్వుతూ ఉండేది గానీ ఎప్పుడూ ఆ పక్షుల్ని అదిలించలేదు.  ఈ మధ్యాహ్నపు అరగంట సమయమూ.. చాలా సంతోషకరమైన సమయం నాయనమ్మకు. 

నేను విదేశాల్లో చదువుకుంటానని నిర్ణయించుకున్నాక, నాయనమ్మ చాలా బాధపడుతుందని ఖచ్చితంగా అనుకున్నాను.  నేను అయిదేళ్ళ పాటూ ఇంటికి దూరంగా ఉండబోతున్నాను. తన వయసు రీత్యా ఈ మధ్య కాలంలో నాయనమ్మ కాలం చెయ్యదని నమ్మకం లేదు.  కానీ నాయనమ్మ అస్సలు సెంటిమెంటల్ గా ప్రవర్తించలేదు. తను నన్ను సగర్వంగా సాగనంపింది. రైల్వే స్టేషన్ లో అందరితో పాటూ వచ్చి వీడ్కోలు ఇచ్చింది.  తన పెదవులు ఏవో ప్రార్ధన ని పలుకుతున్నాయి, చేతులు జప మాల ని తిప్పుతున్నాయి అప్పుడు ఆవిడ నన్ను దగ్గరకు తీసుకుని నుదిటి మీద మౌనంగా పెట్టుకున్న ముద్దు - ఆ చెమ్మా, ఆ స్పర్శా, ఇదే ఆఖరుది, మళ్ళీ ఈ స్పర్శ దొరుకుతుందా అని చాలా భయపడ్డాను.   ఇదే మా ఇద్దరి మధ్యా ఆఖరి భౌతికమైన స్పర్శ అని అనిపించింది. 

కానీ అలాంటిదేమీ జరగలేదు. అయిదేళ్ళయ్యాకా, నేను విదేశాల నుండీ తిరిగొచ్చాకా నాయనమ్మ నన్ను స్టేషన్ లో నే కలుసుకుంది. నా  చేతిని తన చేతుల్లో అదుముకుని నా పక్కన కూర్చుందన్న మాటే గానీ నాతో కబుర్లు చెప్పే తీరిక తనకి లేదు. తన పెదవులు ఏవో కీర్తన ని జపిస్తున్నాయి.  నేను వొచ్చిన మొదటి రోజు కూడా  ఆ మధ్యాహ్నం పక్షుల భోజన సమయం మాత్రమే నాయనమ్మ ఆనందకరమైన సమయం.   ఆ పక్షుల భోజనాన్ని మాత్రం మరిచిపోలేదు తను.   వాటిని తీరిగ్గా, మురిపెంగా తిడుతూ, ప్రేమగా తిండి పెట్టింది నాయనమ్మ. అవే నాకు మిగిలిన అపురూప క్షణాలు.

ఆ రోజు సాయంత్రం నుండీ ఆమె లో మార్పు కనపడింది. ఆ పూట తను ఎటువంటి ప్రార్ధన, కీర్తనా అదీ చెయ్యలేదు.  ఇరుగు పొరుగు అమ్మలక్కలందరినీ  పిలిపించుకుని ఒక పాత ఢోలక్ తీయించి పాట పాడ్డం మొదలు పెట్టింది.  తన సాగిన సన్నని వేళ్ళతో  ఢోలక్ ని గంటల తరబడి వాయిస్తూ ఇంటికి తిరిగొచ్చిన వీరుల స్వాగత గీతాలు పాడింది.  అతి గా అలిసిపోతావు, వొద్దూ అని మేమెంత వారించినా, ఆపలేదు.  అదే ఆఖరు.  నేను నాయనమ్మ ప్రార్ధన అంటూ చెయ్యకుండా వుండడం చూడటం  అదే మెదటిసారి. 

మరుసటి రోజు పొద్దున్న కల్లా ఆమెకు సుస్తీ చేసింది.  చిన్న జ్వరం.   డాక్టరు అదే మెల్లగా తగ్గి పోతుందని చెప్పారు. అయితే  నాయనమ్మ కు మాత్రం అది తగ్గిపోతుందని నమ్మకం లేదు.  ఇక తనను   మృత్యువు సమీపించిందని మాతో అంది.   ఇక చావుకు కొద్ది గంటల సమయమే ఉంది కాబట్టి మాతో మాటలాడి సమయం వృధా చెయ్యకుండా ఉండేందుకు మేము ఎంత వారిస్తున్నా వినకుండా జప మాల తీసుకుని ప్రార్ధన మొదలుపెట్టింది.  కాసేపటికి మాకు అనుమానమే రాక మునుపే ఆమె పెదవుల కదలిక ఆగిపోయింది.   జీవం లేని వేళ్ళ నుండీ జప మాల జారిపోయింది.    మాకు ఆమె చనిపోయిందని తెలిసేటప్పటికీ,  ఆమె మొహం నిండా  ఎంతో ప్రశాంతత పరచుకుంది. 

ఆమెను శాస్త్ర  ప్రకారం మంచం మీద నుండీ దించి, నేల మీద పడుకోబెట్టి  ఒక ఎర్రని వస్త్రంతో కప్పాము.  కాసేపు ఏడుపులూ అవీ అయ్యాక తనని అలా ఒంటరిగా విడిచిపెట్టి అంతిమ సంస్కారపు ఏర్పాట్లలో మునిగిపోయాము. 

సాయంకాలం నాయనమ్మ గదిలోకి తన శరీరాన్ని అంతిమ సంస్కారం కోసం తీసుకెళ్ళేందుకు వచ్చాం.  అదో మరిచిపోలేని దృశ్యం.  అప్పటికి సూర్యాస్తమయం అవుతూంది. వరండా అంతా బంగారపు అగ్ని అంటుకున్నట్టు పల్చని వెలుతురు.  నాయనమ్మ గది లో ఆమె దేహం, ఆ ఎర్రని వస్త్రంలో చుట్టబడి నేల మీద వుంది.  గది లో నేల మీదా, వసారాలోనూ, ఆవరణ అంతటా వందలాది పిచ్చుకలూ, చిన్నా పెద్దా పక్షులూ - నిశ్శబ్దంగా - ఎటువంటి కువ కువలూ లేకుండా ఆమె చుట్టు పక్కలంతా వాలి ఉన్నాయి. మేము నడవడానికి ఖాళీ నే లేకుండా. 

ఆ పక్షుల ని చూసి మేమంతా జాలిపడ్డాం. మా అమ్మ వాటికోసం కొన్ని రొట్టెలు తెచ్చి, వాట్ని చిన్ని చిన్ని ముక్కలు గా తుంపి వేసారు. కానీ ఆ  పిచ్చుకలు వాటిని గమనించనే లేదు.  నాయనమ్మ శరీరాన్ని మేము తీసుకువెళ్ళిపోయేదాకా వుండి అవి మౌనంగా ఎగిరి వెళ్ళిపోయాయి.  మరుసటి రోజు పని వాడు వచ్చి ఆవరణ నిండా ఉన్న రొట్టె ముక్కల్ని తుడిచి శుభ్రం చేసాడు.

************************

కుష్వంత్ సింగ్..   భారతీయ రచయిత, న్యాయవాది, రాజకీయవేత్త, జర్నలిస్టు.ఇండో-ఆగ్లియన్ రచయితగా కుష్వంత్ సింగ్ విశిష్ట లౌకిక వాదిగా సుపరిచితులు. సిక్కుల చరిత్ర  సాహిత్యం లాంటి అనేక అంశాలపై అద్భుతమైన రచనలు చేసిన కుష్వంత్ సింగ్, సునిశితమైన హాస్యానికి పెట్టింది పేరు. యోగన పత్రికకు సంపాదకులుగానూ, "ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా", "ద నేషనల్ హెరాల్డ్",, "హిందూస్థాన్ టైమ్స్" పత్రికలకు సంపాదకత్వం వహించారు. ‘The Portrait of a Lady’ రచన వారి నాయనమ్మ గురించి రాసిన స్కెచ్ అనుకోవచ్చు.

ఇలాంటి కథలను పిల్లల చేత తప్పక చదివించాల్సింది వుంది. కుటుంబంలో పెద్దలకు పిన్నలకు మధ్య వుండే అనుబంధం, ప్రేమ మాత్రమే కాదు, వారి నుండి పిల్లలు నేర్చుకొనదగ్గ సంస్కృతి సంప్రదాయాలు ధార్మిక విషయాలు ఔన్నత్యం మొదలగునవి కూడా వుంటాయి. ఈ కథలో తమ భావోద్వేగాలను ప్రేమను మనుషులు మాత్రమే కాదు జంతువులు పక్షులు కూడా ఎలా అనుభవిస్తాయో ప్రతిభావంతంగా చెప్పగల్గారు.  ఈ కథ NCERT విద్యార్ధులకు 11వ తరగతి లో పాఠ్యాంశంగా వుంది.






22, మే 2024, బుధవారం

తల్లి-రుకైయ్యా రీహానా ఆడియో లో

 కథల ఒడ్డున.. కాసాపు ఆగుదామా! 

సృష్టిలో ఉత్కృష్టభావాన్ని భాగాలుగా విడగొడితే అందులో మాతృప్రేమకే అగ్రస్థానం లభిస్తుంది. అది పశువైనా శిశువైనా సరే. జంతువులు పశుపక్ష్యాదులు అనేక కీటకజాతులలో మాతృప్రేమ సొంతంగా మనుగడ సాగించేంతవరకే పరిమితంగా వుంటుంది. తర్వాతంతా ఆ సంతతి ప్రకృతిలో తమలాగానే ఇంకొకటిగా అనుకుంటూ మనుగడ సాగిస్తాయి. 

ప్రత్యేకంగా మనిషికి మాత్రమే కొన్ని బంధాలు అనుబంధాలు జీవితాంతం పెనవేసుకుని వుంటాయి.

అందులో ప్రతి మనిషికి అమూల్యమైనది మాతృప్రేమ. మాతృ ప్రేమకు మించిన ప్రేమ ఉంటుందా లోకంలో అని ఆశ్చర్యపడటం వింతేమి కాదు కూడా. 

ఇటీవల కాలంలో  అప్పుడప్పుడూ మాతృత్వ లక్షణం మసకబారుతున్నదా అనే అనుమానాలు పొడజూపినట్లనిపించినా.. అనేకానేక ఉదంతాలు విన్నా చూసినా చదివినా హృదయం చెమరిస్తుంది. అమ్మ ప్రేమకు మన అణువణువు అంజలి ఘటిస్తుంది. 

 చాలాకాలం క్రిందట ఒక ఉర్దూ కథ చదివాను. ఆ కథ చదివిన పిమ్మట చాలా దుఃఖం కల్గింది. ఆ దుఃఖాన్ని అనుభవించడం ప్రతి మనిషికీ చేతనవును కూడా మరీ హృదయం అంత పాషాణం కాకపోయినట్లైతే!

మనకుతల్లి లేదా అమ్మ అనే భావనే అపురూపం. తల్లిబిడ్డలది నాభీసంబంధం. ఎక్కడో  దూరంగా బిడ్డకు ఇసుమంత కష్టం కల్గినా నొప్పి కల్గినా.. అది అమ్మ మనసుకు తెలిసిపోతుంది. బిడ్డ క్షేమం కోసం తల్లడిల్లుతుంది. వీలైతే ఆ బాధ తాను భరించి బిడ్డకు ఆ బాధనుండి విముక్తి కల్గించాలని తపన పడుతుంది. కానీ దేహమానసిక బాధలు ఎవరివి వారే భరించాల్సిరావటం ప్రకృతిచ్చిన శిక్ష. 

ఈ కథలో తల్లి అత్యంత సాధారణమైన తల్లే. ఆమెలో ఏ ప్రత్యేకతలు లేవు. అయితే మాత్రమేం.. ఆమె నిరంతర ఆలోచనా స్రవంతి కొడుకు చుట్టూనే. అతని బిడ్డల చుట్టూనే. ఏనాడు చిన్న ఆరోపణ కూడా చేయని ఆమె తల్లి ప్రేమ మనల్ని వెక్కివెక్కి ఏడిపిస్తుంది. ఎన్నో ఏళ్ళ తర్వాత తనను చూడవచ్చిన బిడ్డకు రాచమర్యాదలు జరిపించాలని ఘనమైన అతిధి సత్కారాలు చేయాలని అతనికీ అతని బిడ్డలకూ కానుకలనివ్వాలని తపించిపోయింది. ఆ కొడుకుతో పాటు కథ చదువుతున్న మనం కూడా  ఉద్విగ్నతకు గురవుతాం. కొడుకు పశ్చాతాపంతో మొదలైన కథ ముగింపుకొచ్చేసరికి అణువణువును కరిగించి కన్నీటి వర్షంలో తడిపేస్తుంది. ఒక స్త్రీ రచయితగా మరొక స్త్రీ అంతరంగ చిత్రణను అద్భుతంగా ఆవిష్కరించిన కథను అందరూ చదివితీరాలనే ఆకాంక్షతో ఈ కథను పరిచయం చేస్తున్నాను.. 

మీరూ  ఈ కథను చదవండి. మనలో ఆవిరైపోతున్న మానవత్వ విలువలను మేలుకొలుపుతుందీ కథ. మనని కనిపెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని మనను సున్నితంగా హెచ్చరిస్తుంది.

 రుకైయ్యా రీహానా వ్రాసిన “తల్లి"  కథను నేను చదివిన ఉత్తమకధలలో ఒకటిగా పరిచయం చేస్తున్నాను వినండీ..

హృద్యమైన కథ… వినండీ.. 



18, మే 2024, శనివారం

మబ్బులు విడివిడి ఆడియో లో

 చరిత్రని మర్చి పోతున్నావ్ ! ఇక్కడంతకీ ముందు గొప్ప రాజులు ఉండేవారు, రాజ్యాలు ఉండేవి. మొఘలు సామ్రాజ్యపు రాజులు గొప్ప వాళ్ళే కాదనను, కానీ పరిజ్ఞానం ఏ ఒక్కరి సొంతం కాదు టర్కీ వాళ్ళో, యూరిపియన్స్ గొప్ప వాళ్ళు అనే ముందు మన హంపీ నిర్మాణాలని, అజంతా ఎల్లోరా కట్టడాల సాంకేతిక పరిజ్ఞానాన్ని తక్కువగా చూడకు . ముస్లిం దండయాత్రలో కూల్చి వేసింది కట్టడాలని, దోచుకు వెళ్ళింది మన సంపదలని మాత్రమే కాదు మన సాంస్కృతిక జీవనాన్ని కూడా విచ్చినం చేసారు “

తప్పకుండా వినండీ..




17, మే 2024, శుక్రవారం

DNA టెస్ట్ చేయించిన భర్త

 రాయికి నోరొస్తే!? -వనజ తాతినేని

శీల పరీక్ష కు ఒప్పుకున్న ఓ ఇల్లాలి కథ.

ఇక్కడ నమ్మడం నమ్మక పోవడమన్నది సమస్య కాదు పద్మా, యెవరికైనా తల్లి నిజం తండ్రి నమ్మకం.  ఆ నమ్మకమే ప్రశ్నార్ధకం అయి కూర్చుంటే దానికి నిరూపణ చేయాల్సి రావడం ఆ తల్లికి  కష్టమే?  కానీ తప్పదు, నమ్మకం లేనివాడు నా మేనల్లుడు, అల్లుడు కావచ్చు అవమాన పడుతుంది నా కూతురు కావచ్చు. ముద్దాయి స్థానంలో మన అమ్మాయి నిలబడి వుంది కాబట్టి నిరూపించుకోవాల్సిన అవసరం మనకి వుంది కదా! అందుకు అపర్ణ వొప్పుకున్నందుకు బరువు తీరినట్లు వుంది" అన్నాడు విశ్వం


************

DNA టెస్ట్ అంటే ఏమిటో, పిల్లలని టెస్ట్ ల పేరిట యెన్ని సూదులు పొడిచి నమూనాలు సేకరిస్తారో ?పాపం,పుణ్యం  యేమి యెరుగని అమాయకపు పిల్లలెలా తట్టుకుంటారో ఆని భయపడిపోయింది పద్మ.

తర్వాత ఏమైంది.. కథ విని తెలుసుకోండి..

https://youtu.be/ItvMbGYj4J0?feature=shared



12, మే 2024, ఆదివారం

పూలమ్మి ఆడియో రూపంలో

 పూలమ్మి    కథ  వినండీ.. 

ఏదో పూలు అమ్ముకునేది..కదా! నాలుగు డబ్బులు పడేస్తే పువ్వుని నలిపినట్టు నలిపేద్దామ్  ..అనుకునే మనుషులమ్మా వీళ్ళంతా .

ఒకడు కన్ను గీటు తాడు.ఇంకొకడు..పూలన్నీ నేనే కొంటాను..రాత్రికి వచ్చేయి అంటాడు.

ఆడ పుట్టుక పుట్టిన పాపానికి .. ఈ చిత్తకార్తే కుక్క ముండా కొడుకులకి లోకువైపోయాను. నన్ను వదిలేయ్..అయ్యా.. ! అంటే వినలేదు. బలవంతం చేయబోయాడు.  పూలు కట్టే చేతులు కదా.. పువ్వులా ఉంటాననుకున్నాడు.  ఈ చేతులు దారాన్ని  పువ్వుల కుత్తుకకి బిగించిన చేతులు కూడానమ్మా... ఆ దారంతోనే ఉరి వేద్దునూ.  పాపమంటుకుంటుందని బ్లేడు తీసుకుని.. బరికేసినా.." అని  చెప్పింది.. మల్లి. 



11, మే 2024, శనివారం

ఔనా! ఆడియో రూపంలో

 రచయిత వ్రాయకూడని విషయాలు కొన్ని వుంటాయి. ఊహించి వ్రాసే విషయాలు వుంటాయి. రచయిత ఏమి రాయాలి అన్నది కేవలం రచయిత ఇష్టం. సమాజంలో జరుగుతున్నాయని ఆ వాస్తవాలను రచనల్లో చెప్పవలసి వచ్చినప్పుడు సూచనప్రాయంగా చెబుతూవుంటారు. ఈ కథ వ్రాయాలా వద్దా అని చాలా సంవత్సరాలు ఆలోచించాను. వ్రాయదగిన సామాజిక మార్పులు కనబడినప్పుడు వ్రాసాను. రచయితకు తనపై తనకు సెన్సార్ షిప్ వుండాలని భావిస్తాను. ఈ కథ #ఈస్తటిక్_సెన్స్ కథాసంపుటిలో వుంది. -వనజ తాతినేని.


#ఔనా!  కథ వినండీ.. #ఈస్తటిక్_సెన్స్ #వనజతాతినేని #vanajatatineni 

8, మే 2024, బుధవారం

కాటుక మబ్బులు ఆడియో కథ

 కాటుక మబ్బులు కథ ని ఆడియో బుక్ గా యిప్పటికి నలుగురు చేసారు. ఎందుకో ఎవరి గొంతులోనూ కథ భావం వొలికించలేదు. అందుకే నేనే వినిపించే ప్రయత్నం చేసాను. ఎలా వుందో విని చెబుతారు కదూ! YouTube లో upload చేసిన కథను జతపరిచాను. వినండి మిత్రులారా! కథ వినిపించిన తీరు యెలా వుందో చెప్పడం మర్చిపోకండీ! ధన్యవాదాలు 




3, మే 2024, శుక్రవారం

వదిలేసాక

 










వదిలేయండి వదిలేయండి 

అంటారు. 

తీరా వొదిలేసాక.. 

పట్టించుకోలేదు కటిక మనసు 

అంటారు. 


ఎప్పుడెంత వొదిలేయాలో 

ఎప్పుడెంత పట్టించుకోవాలో 

వారు నిర్దేశిస్తారట

మనం పాటించాలట. 


మనం కన్నవాళ్ళే 

వాళ్ళకో తోడు దొరికాక.. 

గుండెల్లో గునపాలు దించుతారు

మనసును చిత్రవధ చేస్తారు


చేతిలో దిండు లాక్కుపోయినట్టు 

పిల్లలను లాక్కెళ్ళిపోతారు

వాళ్ళకు కావాల్సినవాళ్ళకు చేరిక చేసి

మనకు అవమానపు తొడుగువేసి

నవ్వుకుంటారు. 


మనం కూడా పిల్లలను అలాగే పెంచి

వారికి ధార పోసామని మర్చిపోతారు

హక్కులు భలే గుర్తుంటాయి 

ముఖాన కప్ కాఫీ పొయ్యకపోయినా.


ఇనుప అడ్డుగోడలు

కట్టుకున్నాక.. బంధాలను

పెంచుకొనుట తెంచుకొనుట

చాలా సులభం సౌఖ్యం కూడా! 


కోతిని రాణి ని చేసి సింహాసనమెక్కించి

కొండముచ్చులు భజన చేసినట్టు

వుంది రాజ్యం. 

సౌఖ్యాన్ని మరిచి సొద లెందుకు 

వ్యధలెందుకు నరుడా! 


నన్నంటుకోకు నామాలకాకి

అన్నట్టు ఏకాకివై మిగలిపో

కొడుకులను కన్నందుకు నీకిది శిక్ష

నావ ఏ తీరమో చేరకపోదుగా.. 

ఏదో ఒక తీరాన్ని వదిలేయక తప్పదుగా! 


-వనజ తాతినేని

03/05/2024.