#ఈస్తటిక్_సెన్స్ #వనజతాతినేని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
#ఈస్తటిక్_సెన్స్ #వనజతాతినేని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, మే 2024, శనివారం

ఔనా! ఆడియో రూపంలో

 రచయిత వ్రాయకూడని విషయాలు కొన్ని వుంటాయి. ఊహించి వ్రాసే విషయాలు వుంటాయి. రచయిత ఏమి రాయాలి అన్నది కేవలం రచయిత ఇష్టం. సమాజంలో జరుగుతున్నాయని ఆ వాస్తవాలను రచనల్లో చెప్పవలసి వచ్చినప్పుడు సూచనప్రాయంగా చెబుతూవుంటారు. ఈ కథ వ్రాయాలా వద్దా అని చాలా సంవత్సరాలు ఆలోచించాను. వ్రాయదగిన సామాజిక మార్పులు కనబడినప్పుడు వ్రాసాను. రచయితకు తనపై తనకు సెన్సార్ షిప్ వుండాలని భావిస్తాను. ఈ కథ #ఈస్తటిక్_సెన్స్ కథాసంపుటిలో వుంది. -వనజ తాతినేని.


#ఔనా!  కథ వినండీ.. #ఈస్తటిక్_సెన్స్ #వనజతాతినేని #vanajatatineni 

24, ఏప్రిల్ 2023, సోమవారం

సౌందర్యమంటే.. సృహ, స్వీయ ప్రేమ

 


ఎలాగో.. ఒక కథ ఆమె దృష్టిలో పడింది. అది చదివాక  ఆ కథా రచయితనైన నేను బాగా నచ్చాననుకుంటా.. మరొక రచయిత ద్వారా నా ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నారు. నెంబరు అందగానే వెంటనే కాల్ చేసారు. నేనిక్కడ వున్నానాయే!  వాట్సాప్ లో మెసేజ్ చేసారు. నా కథ ను ఓ ప్రముఖ రచయితకు పంపారట. ఆ రచయిత కూ ఆమె కు మంచి స్నేహం అంట. ఈమెకు నచ్చిన కథ ను ఆ స్నేహితురాలైన ప్రముఖ రచయిత చదివి.. ఈ మధ్య వనజ గారి కథను సమీక్షించాను అని చెప్పారంట. 

 రెండు రోజుల తర్వాత వాట్సాప్  కాల్ లో మాట్లాడారు. ఎన్నో ప్రశంసలు ఆమె నుండి. నా బ్లాగ్ లో చాలా చదివి వచ్చారు. ఈ కథ “ఈస్తటిక్ సెన్స్” కథ బాగా నచ్చింది. ఆడియో బుక్ చేసి తన ఛానల్ ద్వారా మరికొందరికి పరిచయం చేయాలని అభిలాష ను వ్యక్తీకరించారు. అంతకన్నా భాగ్యం యేముందీ.. అని ఉత్తరక్షణం అనుమతించాను. ఆడియో బుక్ చేసి పంపారు.. ఆమె తన ఛానల్ లో ఆడియో బుక్ రిలీజ్ చేసాక ఆ కథ ఆడియో ను పరిచయం చేయడం కోసం.. యెదురు చూసాను. ఇదిగో.. ఇలా మీ ముందుకు వచ్చేసింది.. నా ఛానల్ లో కూడా! 

కథ ఎక్కువమందికి చేరడమే కదా కావాల్సింది.. 

కథ ను మీరు కూడా వింటారు కదూ.. 

ఈ కథ ను చదివి బాగా నచ్చి ఆడియో బుక్ చేసిన వారు.. S.Rajya Lakshmi-Psychologist. 

 Uma Nuthakki Dr.Geetanjali Bharathi Bharathi ఈ పోస్ట్ లో ఉదహరించిన రచయితలు.. నా మిత్రులు. చైతన్యవంతమైన ఒరవడి తో  ముందుకు సాగుతున్న S. Rajyalakshmi గార్కి హృదయపూర్వక ధన్యవాదములతో.. 🙏🎈

#ఈస్తటిక్_సెన్స్  #వనజతాతినేని  కథ .. ఇక్కడ.. లింక్ లో వినగలరు. 


20, మార్చి 2023, సోమవారం

ఔనా!

 


ఔనా!    -వనజ తాతినేని. 

పన్నెండేళ్ళుగా  మెదడు  నిండా ఓ పాత్రను మోస్తున్నాను. అప్పుడామె తన కథను చెపుతున్నప్పుడు  కనులు పెద్దవి చేసి చెవులు రిక్కించి ఆశ్చర్యంతో రోమాలు నిక్కబొడుచుకున్నట్లు జ్ఞాపకం వుంది. ఇదంతా ఆమె చెప్పిందా నేను  నిజంగానే విన్నానా అనుకుంటూ   నన్ను నేను గిల్లి చూసుకున్నాను కూడా. స్త్రీ పురుష సంబంధాల గురించి లోతుగా ఆలోచిస్తున్నప్పుడల్లా ఆ పాత్ర   గుర్తుకొస్తుంటుంది. గుర్తుకొచ్చినప్పుడల్లా రెండు మూడు రోజులు ఆలోచిస్తూ వుంటాను. మరి ఆమె చెప్పిన విషయమైతే సామాన్యమైన విషయంలా నేను భావించలేదు మరి. 


ముఖ్యంగా కథ రాయాలి అనుకున్నప్పుడల్లా నన్ను గురించి రాయి అని ఆమె అడుగుతున్నట్లే వుండేది.  రాసే సాహసం చేయలేదు అనను కానీ రాయకూడని విషయాలు కొన్ని ఉంటాయని గిరిగీసుకుని కూర్చున్నాను. సాధారణంగా  ధనబలం వుండి ఎవరేమనుకుంటే నా కేమిటి నా జీవితం నా ఇష్టం అనుకుంటూ జీవితం పట్ల  అమితాసక్తితో  విచ్చలవిడిగా విహరించేవారిని  మనం చూస్తుంటాం కదా ! ఆ కోణంలో చూస్తే ఆ పాత్ర అంత నాగరిక జీవనంలో జీవించిన పాత్రా కాదు. పెద్ద చదువుసంధ్యలున్న స్త్రీ లా కూడా అనిపించలేదు.  అలా అని ఆమె కడు పేదరికంలో జీవనం కొనసాగిస్తూ అవసరాల కోసం శరీరాలను ఫణంగా పెడుతూ  నిర్లక్ష్యంగా బ్రతికే తెగువ కల్గిన పాత్రా కాదు.  ఈ రెండు రకాల మధ్య గల మధ్యతరగతి జీవితం గడిపే కుటుంబ స్త్రీ అంత నిర్భయంగా నిస్సంకోచంగా   మసలగల్గినదంటేనే ఆశ్చర్యం నాకు. ఇప్పుడిక కథలోకి వెళదాం.


**************


పన్నెండేళ్ళ క్రితం వారం రోజుల్లో అమెరికాకు ప్రయాణమవుతున్న కొడుకును తీసుకుని శ్రీశైలం వెళ్ళాను నేను.  మధ్యాహ్నం పన్నెండుకల్లా అక్కడకు చేరుకున్న మాకు వసతి సౌకర్యం లభించేసరికి రెండుగంటల సమయం పట్టింది. మర్నాడు గురుపౌర్ణమి. పుణ్యక్షేత్రాలన్నీ రద్దీగా వుంటాయన్న సంగతి మర్చిపోయాను. ఎప్పుడూ విడిది చేసే సత్రానికి వెళ్ళి రూమ్ అడిగితే ఎంతమంది అడిగాడు. నేను అబ్బాయి అనగానే మా వంక పట్టి పట్టి చూసి కాసేపు ఆగండి అన్నాడు. అరగంట వేచివున్నా మాకన్నా వెనుక వచ్చినవారికి రూమ్ లు కేటాయిస్తూ మమ్మల్ని అలాగే నిలబెట్టాడు. అతని వద్దకు వెళ్ళి గోత్రం పేరు ఇంటి పేరు చెప్పాను. “ఖాళీ లేవమ్మా, ఇద్దరు వుంటే అసలు ఇవ్వడం లేదు” అన్నాడు. అబ్బాయి వంక నా వంక అతను చూసే చూపులు నాకు అవమానంగా అనిపించేయి.


 స్నేహితురాలికి ఫోన్ చేసాను. ఆమె బంధువులు ఎవరో వున్నారని తెలిసి,మాట సాయం చేస్తారని.  అప్పుడు ఆమె మాటలు వింటే నేను అబ్బాయి మాత్రమే ఎందుకు వచ్చామా అని చింతించాను. తల్లి కొడుకు కలిసి వెళ్ళినా అనుమానంగా చూసే రోజులు వచ్చేసాయి. పుణ్యక్షేత్రాల పవిత్రతను చెడగొడతన్నారని ఎవరికి పడితే వారికి రూమ్ లు ఇవ్వడం లేదంట. ఇరవై రాకముందే బిడ్డలు పుట్టి వాళ్ళు తాటిచెట్లలా పెరిగితే మనం నలబైల్లో వుండి వాళ్ళకు అక్కల్లా కనబడతన్నాం. నలుగురైదుగురు వుంటామంటే తప్ప ఇద్దరికి మాత్రం రూమ్ లు ఇవ్వడం లేదంట”అంది. 


“అమ్మ కొడుకు అని నిరూపించడానికి ఆధారాలు కూడా పట్టుకెళ్ళాలా.. ఆ సంగతి తెలిసి వుంటే అబ్బాయి పాస్ పోర్టు, రేషన్ కార్డు తెచ్చుకునేదాన్నిగా అని విసుకున్నాను. సత్రం రిసెప్షన్ లో రూమ్ లు ఇచ్చేవాడు  పిల్లాడిని నన్ను ఎంత  అనుమానంగా చూసాడో తెలుసా! ఎంత అవమానం అనిపించిందో నాకు. ఇంకెప్పుడూ ఈ సత్రానికి రాను. విరాళాలు రాయను” అన్నాను చికాకుగా. 


అక్కడి నుండి గంగ సదన్ కి వచ్చి రూమ్ తీసుకుని ప్రెష్ అయి భోజనానికి వెళ్ళడానికి కిందకు వస్తుండగా ముందెళ్ళిన  సత్రం గుమస్తా ఎదురై “ఇందాక పొరబాటు జరిగిందమ్మా, క్షమించాలి మీరు. భోజనానికి మన సత్రానికే రావచ్చు. ఇక్కడ ఖాళీ చేసి అక్కడికి వస్తే ఏసి రూమ్ ఇస్తామన్నారు” అన్నాడు.


 స్నేహితురాలి ఫోన్ సిఫారసు ఫలితం అని అర్థమై “వద్దులెండి. మీ రూల్స్ ఏమిటో తెలిసాయి కదా. ఈ సారి వచ్చినపుడు అన్ని వివరాలు తెలిసేటట్టు ఆధారాలు వెంట తెచ్చుకుంటాం అన్నాను విసురుగా. అసలు అబ్బాయి ముందు అలాంటి విషయం వొకటి చర్చకు రావడం నాకు ఇష్టం లేకపోయింది. 


ప్రదోషసమయంలో  మల్లికార్జునుడి దర్శనం అమ్మ వారి హారతి ప్రాతఃకాల అభిషేకం అమ్మవారికి కుంకుమ పూజ అన్నీ ప్రశాంతంగా జరిగిపోయాక.. నేను గుడిలో ప్రదక్షిణలు చేసుకుంటాను వస్తావా అని అడిగాను అబ్బాయిని. “రాత్రి సరిగ్గా నిద్రపోలేదమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను. నువ్వు తీరిగ్గా ప్రదక్షిణలు చేసుకుని రా” అని రూమ్ తాళం తీసుకుని వెళ్ళిపోయాడు.  నాలుగు ప్రాకారాల మధ్య చుట్టూ రద్దీగా సంచరిస్తున్న భక్తులను  తప్పించుకుంటూ  నేను కొన్ని ప్రదక్షిణలు చేసిన తర్వాత మా పక్కనే వున్న రూమ్ లో వున్నావిడ ఎదురైంది. నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. పంచాక్షరీ జపిస్తూ వున్న నేను పట్టించుకోనట్టూ ముందుకు సాగాను. 


ఆమె పేరు మీనమ్మ అని చెప్పినట్టు గుర్తు. చామానఛాయ రంగుతో  కళగల ముఖంతో బలిష్ఠమైన ఆకృతితో చాలా ఉత్సాహంగా కనబడింది. మళ్ళీ తర్వాత ప్రదక్షిణలో వృద్ద మల్లికార్జునుడి గుడి దగ్గర ఎదురైంది. 


నవ్వుకుంటూ దగ్గరకు వచ్చి పలకరించింది. ఎన్ని ప్రదక్షిణ లు చేస్తున్నారు అని. నోరు విప్పక తప్పింది కాదు. అంతటితో ఆగకకుండా  ఏ ఊరు ఏం చేస్తారు అని వివరాలు అడిగింది. చెప్పిన తర్వాత “ తన పేరు చెప్పింది.  నా వయస్సు ఎంతనుకున్నావ్ “ అని అడిగింది  నా ప్రదక్షిణకు అంతరాయం కల్గిస్తూ, నడకలో నడక కలుపుతూ. 


చిరాకు పడ్డాను.  ఆమెను అంతకు ముందు రోజు దేవాలయం పరిసరాల్లో చూసాను. రాత్రి సత్రం భోజనశాలలో చూసాను. ఉదయాన్నే పాతాళగంగకు నేను దిగుతుంటే మెట్లెక్కుతూ ఎదురైతే చిన్న చిరునవ్వుతో పలకరించాను. ఇప్పుడీమె ఎదురై ఆరాలు తీయడం ఈ అసంబద్దమైన ప్రశ్న వేయడం. అసలు ఆమెకు ఎంత వయస్సు వుంటే నాకెందుకటా అని మనస్సులో విసుక్కుంటూనే అప్రయత్నంగా నలభై నలబై అయిదు మధ్య వుంటాయేమో అని సమాధానమివ్వగానే గలగలా నవ్వింది. “ఏబై నాలుగు” అంది. ఓహో అన్నట్టు చూసానేమో! 


“కాసేపు ఈడ కూర్చుందామా “ అని అడిగింది. కాదనబుద్ధి కాలేదు. త్రిఫల వృక్షాల క్రింద చప్టాపై కూర్చున్నాం. 


“ఎన్ని రోజులైంది!? మీరొచ్చి “ అన్నాను.


 “నెలా పదిరోజులైంది”


“ఎందుకు అన్ని రోజుల నుండి వున్నారు? ఏమైనా మొక్కు వుందా  లేదా మండల దీక్ష లాంటిదా”  


పకపకా నవ్వింది. గుండె జల్లుమంది. అప్రయత్నంగా లేచి నిలబడ్డాను. 

నిన్న సాయంత్రం రూమ్ శుభ్రం చేసే ఆమె మాటలు గుర్తొచ్చాయి.  వాళ్ళది కన్నడ రాష్ట్రం.  మనిషి చూస్తే  ఉత్సాహంగా ఆరోగ్యంగానే వుండట్టు వుంటుంది. చేష్టలు చూస్తే ఏమిటో పిచ్చి పిచ్చిగా గొణుక్కుంటూ చేతులు తిప్పుకుంటూ నవ్వుకుంటూ వుంటది. కొడుకు అనుకుంటా. రోజు రెండు పూటలా చేయి పట్టుకుని వదలకుండా తిప్పుకుంటా వస్తాడు. నలబై రోజులు నిద్ర చేస్తే పిచ్చి గిచ్చి తగ్గుద్ది ఒంటి మీద చేరిన దెయ్యాలు వొదులుతయ్యి అని చెప్పారంట. ఓపిగ్గా తిప్పుతున్నాడు బిడ్డ” అని. 


“కూర్చో బుజ్జమ్మా” అంటూ చేయి పట్టుకుని గుంజింది. బెరుకు బెరుకుగా కూర్చున్నాను. 


“నిన్ను చూస్తుంటే నా మనస్సులో వున్నదంతా విప్పి చెప్పుకోవాలని అనిపిస్తుంది” అంది. 


ఎందుకు అని అడగలేకపోయాను. మనిషి సాత్వికంగా ముఖం  పవిత్రంగా కళకళలాడుతూ వుంది.మాట్టాడకుండా ఆమె వంక నిశితంగా చూసాను.


“ నీతో వచ్చింది కొడుకా” అనడిగింది. 


“అవును, ఒక్కడే కొడుకు, వారం రోజుల్లో అమెరికా కి పై చదువులు చదవటానికి పోతున్నాడు. స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు అందుకుని పోవాలని వచ్చాం. అభిషేకం చేసుకున్నాం. స్వామి స్పర్శ దర్శనం అయింది. రాత్రికి బయలుదేరతాం” అన్నాను. 


“నాతో వుండింది నా కొడుకు అనుకొంటివా” అడిగింది. 


“అవును, అట్టాగే వున్నాడు, అలాగే అనుకుంటున్నా”


మళ్ళీ గట్టిగా నవ్వింది. నా చెవి దగ్గర ముఖం పెట్టి రహస్యం చెబుతున్నట్టు చెప్పింది. “అందరూ అనుకునేటట్డు  వాడు నా కొడుకు కాదు నా ప్రియుడు” అంది. 


ఆశ్చర్యపోలేదు వేగంగా ఆలోచించాను. సందేహం లేదు ఈమెకు నిజంగానే మతి భ్రమించి వుంటుంది. ఇంతకు ముందు తన వయస్సెంత అని అడిగింది ఇప్పుడిలా. తొందరగా ఈ మనిషిని వదిలించుకుని పోవాలి అనుకుంటూ చుట్టుపక్కల ఎక్కడైనా ఆమె కొడుకు కనబడతాడేమో అని చూపులతో గాలిస్తున్నాను. 


“నువ్వు నమ్మడం లేదు కదూ, నేను చెప్పింది నిజం బుజ్జమ్మా! దేవళంలో కూర్చుని అబద్దం ఎందుకు చెపుతాను. నన్ను నమ్ము” అంది దీనంగా.


“నీ నిజాలన్నీ నాకెందుకు, నన్ను వొదిలేస్తే నా ప్రదక్షిణ లు నేను చేసుకుంటా “ విసుగు ప్రదర్శించాను. 


“నా సొదే అనుకో నా కథే అనుకో అది కూడా వింటే నీకు పుణ్యం దక్కుద్ది అనుకో. ఇలాంటి కథ నువ్వెప్పుడూ విని వుండవు’’ అని ఊరించింది.


కథలంటే ఇష్టం కనుక “సరే చెప్పు మరి”అన్నాను వింటే కానీ వొదిలి పెట్టేటట్టు లేదని. 


“నేను  కాపు బిడ్డను. నెల్లూరు ఆత్మకూరు కాడ చిన్న పల్లె. పద్నాలుగేళ్ళ వయస్సుప్పుడు    రాయచూర్ కి వలసబోయిన కుటుంబంలో వాడికిచ్చి పెళ్ళిజేసారు. వొళ్ళు ఇరగ పనిచేయడం మొగుడు చెప్పినమాట ఎదురుచెప్పకుండా ఇనడం. మోటుమనిషి. ముగ్గురు బిడ్డల తల్లినయ్యానన్నమాటే కానీ  నేను మనసు నిండా సుఃఖ పడిందే లేదు. భర్త ప్రేమ దక్కిందే లేదు. అంతా అతుకుల బొంతే అనుకో. మన పెద్దాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే.. అందరూ అని కాదులే.. మా తాత లాంటోళ్ళు అనుకో ’’


చెప్పడం ఆపి కాసిని నీళ్ళు తాగింది. కథ వినే ఉత్సాహంలో ఆలస్యం భరించలేకుండా వున్నా నేను. 


“మా తాత పెద్ద కవి లే. కవిత్వం రాసేవాడు. గజళ్ళు చదివేవోడు. అందరికీ నోరార విప్పి చెప్పేవాడు. జమీన్ & రైతు చదివి వినిపిస్తా వుండేవాడు. మా నాయన చిన్నగా వున్నప్పుడే మా అవ్వ చనిపోయిందంట. మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా నలుగురు బిడ్డలను సాకినాడు. రోజూ ఆయన  వొళ్ళో కూర్చుని ఇన్న మాటలే అనుకో, బాగా గమనం వుండాయ్. ఇట్టా అనేటోడు “ బొట్టా! మనిషన్న  వాడికి జీవితంలో అన్ని దశల్లోను ప్రేమ శాంతి దొరకాలి. సముద్రం నుంచి కొంత, అడవి నుంచి కొంత, నాయన నుంచి కొంత, అమ్మ నుంచి కొంత, సేయితుల నుంచి కొంత, భర్త నుంచి కొంత, బిడ్డల నుండి కొంత ఇట్టా అందరి నుండి కొంత కొంత గ్రాసం ప్రేమ జవురుకుంటే కానీ ఈ కట్టె చల్లారదు” అని. 


“ఆయనెందుకు చెప్పాడో కానీ ఆయన చెప్పినవేమి నాకెప్పుడూ దొరకలేదు. ఆకులుపోకలు అందుకున్నప్పుడు నుండి ఎదురు చూపే మిగిలింది. మొగుణ్ని మనసు నిండా కరువుదీరా కౌగలించుకున్నదే లేదు. ఈ ఆకలి శరీరానిది కాదు మనసుది. బిడ్డల పెళ్ళిళ్ళై మనవళ్ళు మనవరాళ్ళు పుడుతున్న కొద్దీ ముసలిదాన్ని అయిపోతన్నాను నా మనసు ఆకలి తీరకుండా ఏడ చచ్చిపోతానేమోనని వొకటే దిగులయ్యేది. నేను మాత్రం జీవమున్న ప్రతిదాన్ని నిండా కావిలించుకుంటాను. పిల్లలు, పిల్లల పిల్లలను,దూడను  పెయ్యను కుక్కను మేకను పిల్లిని ఆఖరికి అంతంతలావు మానులను కూడా వాటేసుకుంటాను.అయినా మనసుకు నెమ్మది లేదు. కంటినిండా నిదుర పట్టేది కాదు. ఆఖరికి నా ఆకలిని కనిపెట్టినవాడు ఒకడు కనిపించాడు. కుడియెడంగా నా కొడుకు వయస్సు వున్నవాడు. వాడిని తగులుకున్నాను. తప్పా ఒప్పా అని ఆలోచించలేదు నేను. శరీరానికేనా భోగానుభవం మనస్సుకు ఉండొద్దూ. ఆకలిగా వున్నప్పుడు అందుబాటులో వున్నది తిని ఆకలి తీర్చుకున్నట్టు మొగుడు పెళ్ళాం మధ్య  కాపురం సక్రమంగా  వర్దిల్లినా  వాళ్ళ మధ్య గాఢానురాగం లేకపోతే అది ఓటి కుండ లెక్క. నలబై ఏళ్ళ కాపరంలో మొగుడి గుండెల మీద పడి ఆదమరించిది లేదు. నా మనస్సు సేదదీరింది లేదు. కంటికి కనబడని నరమానవుడికి తెలియని వియోగ దుఃఖం ఏదో  ఎప్పుడూ నన్ను అతుక్కొని వుండేది.  అందుకే దైర్యం చేసా. ఈ నలబై రోజులు వాడు నన్ను ప్రియంగా చూసుకున్నాడు. వాడు నా ఆకలిని గుర్తించాడో అశాంతిని కనిపెట్టాడో ఆర్తిని అర్దం చేసుకున్నాడో కానీ నలభై రోజుల నుండి మరో లోకం చూయిచ్చాడు. స్వర్గం అంటే ఇట్టాగే వుంటదేమో అనిపించింది అనుకో. ఇప్పుడు నా మనసుకు తృప్తిగా నెమ్మళంగా వుంది. ఇట్టా చేసినందుకు నేనేమి సిగ్గుపడటం లేదమ్మాయ్! పాపభీతి బిడియం నన్నేం తరుముకొస్తలేదు. దేవుడు సాచ్చిగా చెబుతున్నా, నువ్వు నమ్మాలి” అంది. 


ఆశ్చర్యమో అసహ్యమో అయోమయమో ఏమో తెలియదు. ఇది నిజమా అబద్దమా అన్న ఆలోచనా లేదు. నోట మాటరాలేదు. ఎలాంటి మనిషిని విన్నాను. ఇంత దైర్యమా, తెంపరితనమా! పైగా అపరిచితురాలినైన నాకు కూర్చోబెట్టి మరీ చెపుతుంది అని నివ్వెరపోయి కళ్ళు విప్పార్చుకుని ఆమెనే చూస్తూ..  ఔనా! అని మాత్రం అనగల్గాను. 


మళ్ళీ చెప్పడం మొదలెట్టింది. 

“మొన్న మా ఊరు వాళ్ళు కనబడ్డారు. ఊరంతా గోలగోలగా వుంది. నువ్వు ఈడ వుండావా అని ఆశ్చర్యంగా అడిగారు. ఈపాటికి నేను ఈడ వుండానని నా కుటుంబానికి ఉప్పు అందేవుంటంది. నా మొగుడో పిల్లకాయలో రేపో మాపో వచ్చి ఇక్కడ వెతుకుతారు. నన్ను తీసుకునిపోతారు. పరువు కోసం అసలు విషయాన్ని  గంప కింద దాపెట్టి   తీర్ధయాత్రలకు వెళతానంటే   వద్దంటున్నామని ఎవరితో చెప్పాపెట్టకుండా   గుళ్ళు గోపురాలు చూడటానికి  పోయిందని  అని చెప్పుకుంటాడేమో నా మొగుడు”  చెప్పడం ఆపి మళ్ళీ గల గలా నవ్వింది. 


“ఒకవేళ ఇదంతా తెలిసి ఈ ముసలిముండకు రంకు మొగుడు కావాల్సొచ్చిందా అని కోడళ్ళు అసహ్యించుకున్నా, కూతురు చీదరగా చూసినా, జవసత్వాలు చచ్చిన మొగుడు రొప్పుతూ కాళ్ళతో కుమ్మినా లెక్కపెట్టేదే లేదు. ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు నాకు  కావాల్సింది నాకు దక్కించుకున్నాను. ఈ తృప్తి చాలు నాకు “ అంటూ గర్వంగా సంతృప్తిగా నవ్వింది. 


నేను నోటమాట రాక వింటూ వుండిపోయాను.


ఇంకో సంగతి చెప్పనా నీకు, ఇక్కడ నిత్యం  పాతాళగంగకు పోయి పచ్చలబండను చూసివస్తాను. ఎందుకో తెలుసా! కూతురిని మోహించిన రాజు ని పచ్చలబండవై పడివుండమని శపించింది అంటగా. మరి నేను కొడుకు వరుసయ్యే వాడిని మోహించాను కదా! లోలోన నేను ఏ బండను అవుతాననే భయం అనుకుంటా.  మనిషి బతికివుండగానే కోరికతో పెయ్య కాలుతుంటే చచ్చినాక వచ్చే పాపపుణ్యాల గురించి చింత ఎందుకంటా అంటా నేను. నువ్వు ఏమన్నా అనుకో,ఎవురికో వొకరికి నా లోపలి బాధ చెప్పుకోకపోతే కుమ్మరి పురుగు తొలిచినట్టు మెదడును ఈ విషయం తొలిచేత్తా వుంటంది. అందుకే చెప్పుకుని తెరిపిన పడ్డా. ఇప్పుడు మనసంతా తేలిగ్గా వుంది” 


వింటున్న నాకు ఆమె చెప్పిన విషయం జీర్ణం కావడానికి సమయం పట్టేట్టు అనిపించింది. ప్రశాంతంగా ప్రదక్షిణలు చేసుకుంటూ వున్న నన్ను కదిలించి మరీ  ఒక విధమైన షాక్ యిచ్చింది. 


“వస్తాను బుజ్జమ్మా! వాడు కూడా బయలుదేరతానంటున్నాడు. పెళ్శి కావాల్సిన పిల్లోడు. వాడన్నట్టు  రేపో మాపో మా  వాళ్ళ కంటబడి నలుగురు నోళ్ళల్లో నానడం ఎందుకు చెప్పు? నేను కూడా ఈ రూమ్ ఖాళీ చేసి మా కన్నడ సత్రంలో రూమ్ తీసుకుంటా. పోయొస్తా! రహస్యాలు నేను దాచుకోలేనబ్బా పొట్టపగిలిపోద్ది” గలగలా నవ్వుకుంటూ వెలుపలి ద్వారం వైపుకు నడుచుకుంటూపోయింది. 


ఆ క్షణంలో విచిత్రంగా ఆమె పట్ల నాకు అసహ్యం కల్గలేదు. అభావంగా ధ్వజస్థంభం దగ్గరకు చేరుకుని చేతులు జోడించి నమస్కరించుకుని తిరిగి ప్రదక్షిణ ప్రారంభించాను. 


నేను రూమ్ కి చేరేసరికి మీనమ్మ రూమ్ లో పిల్లలతో కూడిన కుటుంబం కనబడింది. 


రాత్రి బస్టాండ్ లో  మీనమ్మ ఇద్దరు ముగ్గురు మనుషుల మధ్య కూర్చుని తనలో తనే మాట్టాడుకుంటూ తేడాగా నవ్వుకుంటూ చెదిరిన బొట్టు చిరిగిన జాకెట్ తో కనబడింది. ఆమెనే చూస్తున్న నన్ను చూసి నవ్వింది. 

విషయం అర్ధమై పలకరిద్దామని దగ్గరకు వెళ్ళాను. కన్నడ యాస తెలుగు లో  “అమ్మా, కాస్త దూరంగా వుండమ్మా,ఆమె కు మైండ్ సరిగా లేదు, మనుషులను కొడతంది రక్కుతుంది’’ అన్నాడు వయసు మళ్లి తల నెరిసిన అతను.


నేను మీనమ్మ వైపు అనుమానంగా చూసి వెనక్కి జరిగాను. 


“అవును,నేను కొడతా,తిడతా,రక్కుతా,  అంతా నా ఇష్టం. నువ్వు నా పతి దేవుడివి పతి దేవుడివి,పతిదేవుడివి, సుగంధం తెలియని రాతి దేవుడివి” రాగం తీసింది.


“నెలన్నర అయింది ఇల్లు ఇడిచి. ఏడేడో తిరిగాం. ఆఖరికి ఈడ దొరికింది. పిచ్చి ముదిరిపోయింది” అన్నాడు. మనసులో నవ్వుకున్నాను.


మేము ఎక్కిన బస్ కదిలేటప్పుడు విండో సీట్ లో కూర్చున్న నన్ను చూస్తూ.. 


“ బుజ్జమ్మా, నన్ను గుర్తుంచుకో, టాటా’’ అని చెయ్యి వూపింది.నేను చెయ్యి ఊపాను. “ నువ్వు పిచ్చి వాళ్ళతో కూడా ఫ్రెండ్ షిప్ చేస్తావమ్మా” అన్నాడు నా కొడుకు నవ్వుతూ.


************

కథ అయిపోయింది. 


ఆనాడు ఆమె చెప్పిన విషయం సామాన్యమైన విషయం కాకపోబట్టే  ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆలోచించి చూస్తే.. అదొక ఆశ్చర్యకరమైనదిగా తోస్తుంది. 


మీనమ్మ కోణంలో  నుండి చూస్తే ఏది పవిత్రం, ఏది పాపం ఏది పుణ్యం.  ప్రతి మనిషి కోర్కెల పుట్ట. ఆ పుట్టలో నిదురించిన సర్పాలెన్నో! అవకాశం దొరికిన చోట దైర్యం వున్నవాళ్ళు పాపపుణ్యాల భీతి లేనివారు బిడియాలను సంకోచాలను వొదిలి తమకు కావాల్సింది పొందుతారు. మిగిలిన వారు నీతినియమాల పేరిట వారిపై కొరడా ఝళిపించాలనుకుంటారు. 


సహజీవనాలు తప్పుకాదు అని చెప్పుకుంటున్న ఈ కాలంలో మీనమ్మ ను నేనెలా తప్పు పట్టేది? అలాగని ఎలా సమర్దించేది!? వావివరుస లేకుండా బాబాయి కొడుకుతో అక్రమ సంబంధం నెరిపే బంధువుల అమ్మాయిని చూస్తూ,  సొంత పిన్ని కూతురినే గర్భవతిని చేసిన ఇంజినీరింగ్ చదివే యువకుడు గురించి విని.. ఏమిటీ కాముక లోకం! ఎక్కడుందీ లోపం!? అమలిన శృంగారం గుమ్మరించిన పూర్వ కథలు హాస్యాస్పదం అని పిల్లలకు  సెక్స్ ఎడ్యుకేషన్ ముఖ్యమని వాదించే వారిని చూస్తూ  సెక్స్ ఎడ్యుకేషన్ పోర్న్   ఒకటి కాదు అని వొప్పించడానికి ప్రయత్నించే నేను ఈ కథ కాని కథ గురించి రాయటానికే సంసిద్దురాలినయ్యాను. విజ్ఞత విచక్షణ వున్నవాళ్ళు ఎప్పుడూ వుంటారు. అవి లేని వారి గురించే మనం జాగ్రత్త పడాలి. చలం రాజేశ్వరి ని దాటి మనం చాలా ముందుకువచ్చాం. రాయడానికి చర్చించడానికి ఇంకా సంకోచాలు వుంటే ముందు ముందు లోకం ఏమికానున్నదో. మీనమ్మ భర్త లాంటి భర్తలకు భార్యల హృదయాన్ని టార్చ్ వేసి చూపించాలి కదా! 


విలువలు మారుతున్నప్పుడు రచనలు కూడా మారాలి కదా! మంచినీళ్ల ప్రాయంగా  ఎల్లప్పుడూ నీతులు వల్లించడం  ఏదైతే వుందో అది మురుగునీటి గుంటను శుభ్రం చేయాలనుకుని అందులో గంగాళం మంచినీటిని గుమ్మరించినట్లు వుంటుందని నాకనిపించింది. 


అందుకే  మీనమ్మ కథ ఇప్పుడిలా మీ ముందుకొచ్చి కూర్చుంది. పన్నెండేళ్ళు నా ఆలోచనల్లో మోసిన బరువును మీరు మోయాలిపుడు. అన్నట్టు మీనమ్మ ను వొకటి అడగడం మరిచాను. మీరు పుస్తకాలు చదువుతారా, మీ తాతగారు చలం పుస్తకాలు కానీ మీతో చదివించారా అని. ఆమె చలం పాత్ర అనిపించింది మరి. ఆమె ఎక్కడైనా ఎదురైతే మీరీ విషయం అడగడం మర్చిపోవద్దే. 


****************౦*****************


#ఈస్తటిక్_సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.










19, మార్చి 2023, ఆదివారం

రుణ బంధాలు

రుణ బంధాలు - వనజ తాతినేని


హఠాత్తుగా ఓ విషయం గుర్తుకొచ్చింది కరుణకు. అయ్యో! అతనికి నేను డబ్బు బాకీ పడ్డాను కదూ అనుకుంటూ వున్న పళాన లేచి పర్స్ తీసుకుని బండేసుకుని అతనిని వెదుక్కుంటూ బయలుదేరింది. అనేకసార్లు రోడ్డు ప్రక్కన ఆగుతూ నాలుగుచక్రాల తోపుడుబండ్లపై  పండ్లు కూరగాయలు అమ్ముతున్న అనేకమందితో మాట్లాడుతూ అతని ఆనవాళ్ళు చెబుతూ  ఆరా తీసింది. ఆచూకీ అందినట్టే అంది జారిపోతుంది.  అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరికొంతమందిని అడుగుతూ  వెతుక్కుంటూ మరొక సెంటరుకు   వెళ్ళింది. 


అక్కడో పరిచితురాలు కనబడింది. ముఖమంతా సంతోషంగా విప్పార్చుకుని మిమ్మలనే తలుచుకుంటున్నాను. ఎక్కడుంటున్నారు అని ఆరా తీసింది.కుశలప్రశ్నలు అయ్యాక ఫోన్ నెంబరు అడిగితీసుకుని మిమ్మలను వొక సహాయం చేయమని అడుగుదామనుకుంటున్నాను. ఇక్కడేమి అడుగుతానులెండి అని కాస్త సంస్కారం ప్రదర్శించి సాయంత్రం ఫోన్ చేస్తాను అంటూ సెలవు తీసుకుంది. 

సహాయం అనగానే గుండె గుబేల్మంది కరుణకు. ఏమి సహాయం అడుగుతుందో ఏమో! డబ్బుకు సంబంధించినదైతే కాదు కదా! అదే అయితే చాలా జాగ్రత్తగా వుండాలి.  నేనెక్కడనుండీ తెచ్చివ్వగలనూ!  అసలే ఆధారితను.కొడుకు అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నంతమాత్రాన అమ్మలకు ఆర్ధిక స్వాతంత్ర్యం  వుంటుందా?  ఆర్ధిక స్వాతంత్ర్యం వున్నా యిచ్చే మనసు వుంటుందా, పిల్లలకు యేవో అమర్చాలని, అది కొనాలి యిది కొనాలనే తాపత్రయంతో కొట్టుమిట్టాడతారు. తమ అవసరాలను కూడా వాయిదా వేసుకునో అసలు మానుకునో యింకా పిల్లల కోసం తాపత్రయపడే వారిలో నేను కూడా వుంటాను. ఇక  నేనేమి యితరులకు యేం సాయం చేయగలను? అని ఆలోచనచేస్తూ  వెతుకున్న మనిషి గురించి మరిచిపోయి నాలిక్కరచుకుంది.ఆపై రహదారికి యిరువైపులా దృష్టి సారించింది.అలా రెండు మూడు కిలోమీటర్లు చూపుల జల్లెడ వేసి గాలించినా అతని జాడ కనబడలేదు. 

ఇలా వెదికితే యీ వెదుకులాట సఫలం కాదనుకుంటూ తెలిసినతను ప్రకాష్ కు ఫోన్ చేసింది. అతని గుర్తులు చెప్పి అతను ఎక్కడన్నా కనబడుతున్నాడా అనడిగితే ఆమె  గతంలో చెప్పినది గుర్తుపెట్టుకుని అతను మీకు యివ్వాల్సిన డబ్బులు యివ్వలేదా అని అడిగాడు. అందుక్కాదు వేరే పని వుంది. అతను యెక్కడ కనబడినా నాకు ఫోన్ చేయి లేదా అడ్రస్ అడిగి తీసుకో అని చెప్పి  ఇంటికి వచ్చి పడింది. 

కరుణ అతనికి యివ్వాల్సిన నూట యెనభై రూపాయల సంగతి ఆమెను వెంటాడుతూనే వుంది. అతని పేరు కూడా సరిగా గుర్తు లేదు. ఏదో ముస్లిమ్ ల పేరు.  నాలుగు చక్రాల బండిపై కూరగాయలు అమ్మేవాడు. తాజాగా నాణ్యంగా వుండేవి. తూకం కూడా మోసం లేకుండా యిచ్చేవాడు.  రేటు యెక్కువైనా అతని దగ్గరే కొనేది కరుణ.  అతను వొకోసారి నెలల తరబడి కనబడేవాడు కాదు. అపుడు చచ్చుపుచ్చుల రైతుబజారు కూరగాయలే ఆధారం. చానాళ్ళ తర్వాత కనబడిన అతనిని కూరగాయలు తీసుకుని  రావడం లేదే అని అడిగితే యేవో యిబ్బందులు చెప్పాడు. కూరగాయలు కూడా తక్కువ తెస్తున్నావ్ యెక్కువ రకాలు తెచ్చుకుంటే అందరూ కొనుక్కుంటారు. నీకూ తిరిగినందుకు గిట్టుబాటవుతుంది కదా అంటే రైతులు అప్పివ్వడం లేదు. పెట్టుబడికి డబ్బులేదని చెపితే జాలి కలిగి  వెంటనే నేనిస్తాను వొక నెలలో నాకిచ్చేయాలని షరతు పెట్టి  డబ్బిచ్చి ఫోన్ నెంబరు అడిగితీసుకుంది. ఆ మొత్తం ద్విచక్రవాహనం బాగు చేయించుకోవటానికి కేటాయించుకున్న మొత్తం. ఆ అవసరాన్ని మరో నెలకు వాయిదా వేసి బండి రిపేరులతో ఆగిపోయి నానా యిబ్బందులు పడింది కూడా.

ఇక ఆ తర్వాత అతను ఆ వీధిలో కనబడటం మానేసాడు. ఫోన్లే.. పాపం! అతను యేమి యిబ్బందిలో వుండి రావడం లేదో నా డబ్బులు కోసం బాగా బేరం జరిగే కాలనీలో బతుకుతెరువు పోగొట్టుకుంటాడా అని ఆలోచన చేసింది కరుణ. అనుకున్న నెలరోజుల తర్వాత అతనిచ్చిన నెంబరుకు ఫోన్ చేస్తే ఆ నెంబరులో ఉలుకుపలుకు రెండూ లేవు. కోపంగా యేనాడో ఋణపడివుంటాను. అందుకే బీరువాలో దాచుకున్న డబ్బుకు కాళ్ళొచ్చి అతని చేతిలోకి నడిచెళ్ళాయని తిట్టుకుని సరిపెట్టుకుంది.  అందుకే తనకుమాలిన ధర్మం పనికి రాదు, అడిగి మరీ సాయం చేయకూడదు అంటారు పెద్దలు.పెద్దల మాట తాను వింటేగా! కష్టంలో వున్నామనగానే కరిగిపోయే మనసు. తగినశాస్తి జరిగింది తనకు అని నిట్టూర్చింది.

రెండేళ్ళ తర్వాత రోడ్డు వారగా అదే బండిలో కూరగాయలమ్ముకుంటూ కనబడ్డాడతను. బండి ఆపి కాలనీలోకి రావడం  లేదెందుకని అడిగితే అప్పుడునుండి యిక్కడ వుండటం లేదమ్మా   ఇక్కడ బతకలేకపోతున్నానని మా ఊరికి వెళ్ళపోయా. అక్కడా ఏం లాభం లేదు.బతకడం కష్టంగా వుంది.మళ్ళీ ఇక్కడే నయమని వచ్చేసాను అన్నాడు. సరేనని తలూపి నాణ్యంగా కనబడుతున్న కూరగాయలు తీసుకుంది. నేను పర్స్ తీసుకుని రాలేదు రేపు అటువైపు రా డబ్బులిచ్చేస్తా అంది కరుణ. 

“మీకు యివ్వాలి కదమ్మా” అన్నాడతను.” నేనిపుడు ఆ డబ్బులు విషయం అడిగానా” అని తీవ్రంగా మందలించి “నేను యివ్వలేక పోతున్నాను అని ఫోన్ చేసి చెప్పి వుండాల్సింది. మనుషులపై నమ్మకం లేకుండా చేస్తున్నారు కదయ్యా” అని కోపగించుకుని వచ్చేసింది. అతను కూరగాయలు అమ్ముకోవడానికి కాలనీలోకి రానూ లేదూ అతనికి కరుణ కూరగాయలకివ్వాల్సిన డబ్బులు యివ్వనూలేదు. అలా ఆమె అతనికి బాకీ పడిపోయింది. 

గతమంతా జ్ఞాపకం వచ్చి.. ఏమైనా సరే అతని డబ్బు అతనికిచ్చేయాలి. రేపు యెలాగైనా సరే అతని ఆచూకీ కనిపెట్టాలి. పెనమలూరు మసీదు సందులో వుంటాడంట. పేరు బడే సాహెబ్ అంట. ఈ వివరాలు చాలు. అతనిని వెతికి పట్టుకోడానికి అని స్థిమితపడింది.

సాయంత్రం కాఫీ త్రాగుతున్న సమయంలో పొద్దున కనబడిన పరిచితురాలు ఫోన్ చేసింది. విషయం యేమై వుంటుందో అని సంశయిస్తూనే ఫోన్ తీసింది. అనుకున్నదంతా అయింది. ఆమెకు డబ్బు అవసరపడిందంట. ఒక లక్ష రూపాయలు ఇవ్వాలి మీరు. వడ్డీ యెంతైనా పర్లేదు.. ఒక నెలలో ఇచ్చేస్తాను అంది. లేవు అని చెప్పి ఆమెను వదిలించుకోవడానికి పావుగంటపైనే పట్టింది. మరలా రేపు చేస్తాను ఆందామె.ఆమెకా అవకాశం లేకుండా నెంబరు బ్లాక్ లిస్ట్ లో పెడుతూ మనుషులు చెపితే విని అర్దం చేసుకుంటే బాగుండును అనుకుంది. 

అమెరికాలో కొడుకున్నంత మాత్రాన డాలర్లు చెట్లకు కాస్తాయా యేమిటి? ఈ కోవిడ్ మొదలైనప్పటినుండి డబ్బు అప్పివ్వమని పీక్కుతింటున్నారు జనం. సర్దుబాటు చేయమనే వారు అప్పు అడిగేవారు సాయం చేయమని అడిగేవారు పూజలు చేయించుకోమని అడిగేవారు ఇలా ఎందరో. అడగడానికి కూడా మొహమాటపడుతూ అడిగేవారు కొందరైతే ధాటీగా అడిగేవారు ఇవ్వక తప్పదని జులుం చేసేవారూ కొందరున్నారు. ఈ బాధలేమిటో  భగవంతుడా అని విసుక్కోవటం పరిపాటి అయిపోయింది కరుణకు. 


“తండ్రీ కుబేరా! కాస్త దయ తలచి నా వరండా తోటలో మనీ ప్లాంట్ తీగకు నోట్ల ఆకులు కాయించు తండ్రీ.. నన్ను అప్పు అడిగిన వారందరికీ పంచుతాను. నాలా తల్లులందరూ అమెరికా కొడుకులున్న తల్లులుగా మారేందుకు ఊత మిస్తాను” అని కోరుకుంటున్నాను. ప్చ్.. కుబేరుడు కూడా ప్రార్దిస్తున్న భక్తుల మధ్య రద్దీలో వున్నాడు కాబోలు ఆయన కూడా నా మాట వినిపించుకోవడంలేదు అని హాస్యపు ఆలోచనలు చేసింది. ఇలా అప్పులడిగిన వారందరికీ డబ్బు యివ్వగల్గితే  తనకు యెన్ని స్నేహాలు బంధుత్వాలు నిలిచివుండేవో అనుకుంది కరుణ. డబ్బు వుండి కూడా యివ్వలేదని భావించిన స్నేహితుల ప్రవర్తన నిష్ఠూరాలు గుర్తొచ్చి మనసంతా చేదుగా మారిపోయింది.    

 

కరుణ కుటుంబానికి  వాళ్ళు మంచి స్నేహితులే. ఉన్నపళంగా యేదో ఆపదలో చిక్కున్నారు. కష్టపడి కొనుకున్న భూమిని ఓ ధనవంతుడు ఆక్రమించి రౌడీయిజం చెలాయించి అక్కడ వున్న షాపుని రాత్రికి రాత్రే దౌర్జన్యంగా నేలమట్టం చేయించాడు. దానిని కాపాడుకోవాలంటే  అప్పటికప్పుడు పది లక్షలు ఖర్చు పెట్టాలని వకీలు చెప్పాడంట.ఆమాట విన్న కరుణ “అయ్యబాబోయ్ అంత డబ్బా.. నేనిచ్చే పరిస్థితులలో లేను” అంది. “మీకు పరపతి వుంది. మీరు  అప్పు అడిగితే యెవరూ కాదనరు. మీరు తప్ప యెవరూ చేయలేరు యీ సాయం” అని ముందర కాళ్ళకు బంధం.

 ‘’కాదండీ నేను యెవరినీ అడగలేను అదీ అబ్బాయికి తెలియకుండా’’అని కరుణ మొహమాటం. 

‘’తప్పేముంది. అబ్బాయిని అడిగే చేయండి’’ అని వారి సలహా. 

‘’సరే అడిగి చూస్తాను’’ అంది నిజాయితీగానే. 

ఏదో రెండు మూడు ప్రయత్నాలు చేసింది కూడా. కానీ వాళ్ళు పెట్టిన షరతులు వడ్డీల రేట్లు విని తనవల్ల కాదనిపించింది కరుణకు. అడిగిన మిత్రునికి  మెసేజ్ చేసింది ఆపదకాలంలో ఆదుకోలేనందుకు క్షమాపణ అడిగింది కూడా.  ప్రస్తుతం తామెదుర్కొంటున్న ఆర్ధిక యిబ్బంది గురించి కూడా వివరించింది. తానున్న పరిస్థితిలో  యేమీ సహాయం చేయలేను కూడా చెప్పింది. అప్పుడేమి అనకపోయినా తర్వాతర్వాత వారి నిష్టూరపు మాటలు దెప్పిపొడుపు మాటల వల్ల  బాధపడుతూ అశాంతితో వారి నెంబరును బ్లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రుణాలు  యిస్తేనో యిప్పిస్తేనో మనగలిగే నిలిచివుండే స్నేహాలా యివి?  ఆ ఒక్క కారణం చేత ఆత్మీయులు శత్రువులైపోతారా అని విరక్తి చెందింది.

అలాగే మరికొందరు స్నేహితులు. అమ్మాయి చదువుకు యితర దేశం వెళుతుంది ఖర్చుల కోసం రెండు లక్షలు కావాలని వొకరు, కాలేజీ ఫీజులు కట్టాలని మరొకరు, ఆస్థి తనఖాలో వుంది విడిపించుకోకపోతే దిక్కులేని వారిమైపోతాము నాలుగు లక్షలు సర్దుబాటు చేయండని  యింకొకరు కాళ్ళావేళ్ళా పడటం జరిగింది. అప్పటికప్పుడు మాయమైపోవడానికి ప్రవరుడికి తెలిసిన పసరు విద్య నాక్కూడా తెలిసివుంటే బాగుండునని బలంగా కోరుకుంది కరుణ. ఫోన్ నెంబరు మార్చేయాలనుకుంది. ఆ నెంబరుతో ముడిపడిన లంకెలను గుర్తు తెచ్చుకుని ఆ ప్రయత్నం మానుకుంది. రెండేళ్ళ కాలంలో స్నేహితులనదగ్గవారిలో సగానికి పైగా దూరం జరిగారు ఆమెకు.  తొలుత నిష్ఠూరమాడినా తర్వాత అర్దం చేసుకొన్న కొందరు మాములుగానే వున్నారు. కరుణ కూడా వారిపట్ల సానుకూలధోరణితో పాపం! యేదో ఇబ్బందులొచ్చి నన్నడుగుతున్నారు తప్ప అంతకుముందెన్నడూ నన్నడిగినవాళ్ళు కాదు వీళ్ళు.అవసరంలో సాయం చేయలేని అసక్తకు నాకు మాత్రం బాధ లేదూ! అని కళ్ళు తుడుచుకుంది.

అప్పు అడిగినవారు యెంత ఆశతో  యిస్తారనే నమ్మకంతో ఇవ్వరనే అపనమ్మకంతో ఆలోచనలు చేస్తూ నలిగిపోతారో.. ఇవతలివారు కూడా వారి సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకుంటూ లేవని చెప్పడానికి  మొహమాటపడుతూ చెప్పలేక నలిగిపోతారు. ఇచ్చే మనసుండి అవకాశం లేక లేదని చెప్పడం కూడా  మనిషికి అదొక యాతన.  గుమ్మం ముందు నిలిచి భవతి బిక్షాందేహి అని అడిగిన ఆదిశంకరుడికి కేవలం ఉసిరిక మాత్రమే ఇవ్వగల్గిన పేద ఇల్లాలు తన ఆర్ధిక దుస్థితిలో   సిగ్గిల్లుతూ  అభిమానం పడే యాతనలాంటిదే, ఇవ్వడం కుదరదని చెప్పేటపుడు కలిగే యాతన కూడా. నా బాధను కూడా స్నేహితులు అర్దం చేసుకుంటే బాగుండును అని బాధపడుతుంది. -

ధనం మూలం మిదం జగత్ అన్నట్లు ధనంతోనే అన్ని బంధాలు ముడిపడివున్నవని అర్దమవుతున్నప్పుడు మంచి స్నేహాలు కనుమరుగైపోతున్నందుకు కరుణకు బాధగా వుంటుంది. ప్చ్..నాకంటూ కొంత సొంత డబ్బు వుంటే బాగుండును తిరిగి  యిచ్చినా యివ్వకపోయినా చిన్నచిన్న అవసరాలలో సాయపడివుండేదాన్ని. మాట సాయం చేయవచ్చు కానీ అప్పు తెచ్చి యివ్వడం అంటే సుతారం యిష్టంలేదు. వారు తిరిగివ్వడం ఆలస్యమైతేనో వారి పరిస్థితులు మారిపోయి అసలివ్వకపోతేనో ఆ రుణ బాధ  వొత్తిడి భరించడం నావల్లకాదు.  గతంలో నమ్మకంగా చెప్పిన మాటలకు మోసపోయి డబ్బు యిప్పించి వాళ్లు ముఖం చాటేసి వెళ్ళిపోతే  యిప్పించిన పాపానికి రుణం తీర్చాల్సివచ్చింది. అలాగే బేంక్ రుణాలకు ష్యూరిటి యిచ్చి యిబ్బందులు పడింది.రుణం అంటే పామును చూసినంత భయం ఆమెకు. రుణం తెచ్చుకున్నా ఎవరికైనా యిప్పించినా  ఆ రుణం తీర్చకపోయినా మనసుకు శాంతి వుండదు.నియంత్రణ లేని ధరల కాలంలో అప్పు చేయనివాడు దున్నపోతై పుట్టును అన్నట్టుంది అనుకుంది. 

కరుణ కొడుకుతో ఆ విషయాలను పంచుకుంది. “అర్దించడమన్నది యెవరికైనా అభిమానాన్ని చంపుకోవలసి రావడమే!  చూసేవారికి దూరపుకొండలు నునుపు. ఇక్కడ వున్నవాళ్ళు కోట్లు సంపాదిస్తారు అనుకుంటారేమో! ఇక్కడా అందరివీ చాలీచాలని బతుకులే. ఎవరినీ అప్పు అడగకుండా గుట్టుగా సంసారం నెట్టుకొచ్చుకుంటున్నామంటే క్రెడిట్ కార్డ్ ల చలువే తప్ప మరొకటి కాదమ్మా”అన్నాడతను.“సహాయం చేయమని అడిగిన వాళ్ళందరికీ మనం సహాయం చేయలేమూ అప్పులు యివ్వలేము.  నువ్వు కూడా మధ్యవర్తిగా వుండి అప్పులు ఇప్పించవద్దు. డబ్బు వ్యవహారాలతో పెట్టుకుంటే బంధుత్వాలు స్నేహాలు కూడా దెబ్బతింటాయమ్మా.ఇలాంటి వాటి జోలికి నువ్వు వెళ్ళవద్దు అని నిక్కచ్చిగా చెప్పి  అంతగా నీకు చిన్న చిన్న సాయాలు యేమైనా చేయాలనుకుంటే గిఫ్ట్ అకౌంట్ వొకటి యేర్పాటు చేసుకో. నేను అపుడపుడు అందులో డబ్బు వేస్తాను. ఆ డబ్బును నీ యిష్టమైనట్లు ఖర్చు పెట్టుకో, యెవరికైనా యివ్వాలనిపిస్తే యివ్వు. నేను సంపాదించడం లేదు నాకు ఆర్థిక స్వాతంత్ర్యం లేదు అని పదే పదే కించపరుచుకోకు “అన్నాడు తల్లి మనసును ఆమె ఆలోచనలను పసిగట్టి.

అమ్మకు గిఫ్ట్ అకౌంట్. సంతోషంతో పొంగిపోయింది కరుణ.

అబ్బాయి చెప్పిన సూచనలు ప్రకారమే నడుచుకోవాలి. డబ్బు ప్రసక్తి లేని స్నేహాలు బంధుత్వాలు వుంటేనే మంచిది. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలు. ఈ విషయంలో యిలా కచ్చితంగానే వుండాలి. అలాగే అమ్మలందరినీ పిల్లలు యిలా అర్దం చేసుకుంటే యెంత బాగుండును. అయినా  మనుషులు తనలా బాధ్యతలన్నీ తీరిపోయాయని రిలాక్స్ అయిపోయి ఖాళీగా వుండటం వల్ల అనవసరపు ఆలోచనలు పెరగడం అయినవారిపై అధిక శ్రద్ధతో ఆరాలు అనవసర జోక్యాలు పెరుగుతాయి.ఓపిక వున్నన్నాళ్ళు యేదో వొక పనిచేయాలి. పిల్లలపై అన్నివిధాలా  ఆధారపడటం నిరాశావాదంలో ముంచేస్తుంది. చేసే పనిలో వ్యాపారంలో నష్టం వచ్చిందని ప్రయత్నం మానుకోకూడదు. కొత్తమార్గాలు అన్వేషించాలి. నిలబడటం ఆలస్యమైతే కావచ్చు కానీ నిలబడటం సాధ్యమే. ప్రయత్నాల వల్ల మనుషులతో సాంగత్యం పెరుగుతుంది. అనుభవాలను మార్పిడి చేసుకుంటాం అంతే కదా అనుకుంది ఆత్మవిశ్వాసంతో. 

మరుసటిరోజు  ప్రొద్దునే ప్రకాష్ ఫోన్ చేసాడు. ‘’అమ్మా! నువ్వు వెతుకుతున్న కూరగాయల బండి అతను సెంటర్ లో బండి పెట్టాడు. మామిడిపండ్లు అమ్ముతున్నాడు. వెంటనే వస్తే దొరుకుతాడు. నువ్వు వెంటనే రా, నేను అక్కడే వుంటాను’’ అన్నాడు. 

కరుణ వెంటనే బయలుదేరి వెళ్ళింది.  వెళ్ళేటపుడు నూట యెనబై రూపాయలు తీసుకుని వెళ్ళడం మర్చిపోలేదు. ఎదురుగా బండి ఆపిన  ఆమెను చూసి   కూరగాయల బండి అతని ముఖంలో రకరకాల భావాలు.’’ తొందరలో మీ డబ్బులు యిచ్చేస్తానండి’’ అన్నాడు సూటిగా ఆమె వంక చూడలేక మామిడిపండ్ల వైపు చూస్తూ. 

‘’ఇదిగో, నీకు కూరగాయల డబ్బులు నూట యెనబై రూపాయలు యివ్వాలి కదా, ఈ రుణబాధ నాకసలు నిద్ర పట్టకుండా చేస్తుంది అవి యివ్వడానికే వచ్చాను” అని డబ్బు యిచ్చేసింది.  “నేనప్పుడు నీకిచ్చిన డబ్బు నీకు సాయం చేసాననుకో. నువ్వు ఆ అప్పు సంగతి మర్చిపో’’ అని చెప్పి వచ్చేసింది కరుణ. 

‘’ మొత్తానికి భలేవారమ్మా మీరు’’ అన్నాడు ప్రకాష్ నవ్వుతూ.  

కరుణ నవ్వి బండి తీసింది. రుణ భారం తీర్చుకున్న ఆమెకు మనసులో భారం తీరింది. ఆలోచనల్లో  కొత్తపుంతలు. నా పాత ఎంబ్రాయిడరీ షాపు మళ్ళీ ప్రారంభించాలి.  దానితోపాటు నాణ్యమైన కుంకుడుకాయలు సేకరించి పూర్తి ఆర్గానిక్ పద్దతులలో పొడి పట్టించి విదేశాలకు యెగుమతి చేయడం ఆర్ధిక స్వావలంబనలో బలపడటం. మరొకటి యేమిటంటే అడిగిన వారందరికీ రుణాలు ఇవ్వడం ఇప్పించడం చేయలేనోమో కానీ  నాకొడుకిచ్చిన గిఫ్ట్ మనీ నాకుండగా యిలాంటి చిన్న చిన్న సాయాలు యీ మాత్రం చేయలేనా! చిన్నచిన్న సాయాలే రుణబంధాలు అనుకుంటూ  ఉత్సాహంగా ముందుకు సాగింది.

****************0***************

#ఈస్తటిక్ _సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.




18, మార్చి 2023, శనివారం

చెరగని గీత

 చెరగని గీత - వనజ తాతినేని


ఇక్కడ అందరూ భలే కలసిమెలసి ఇళ్ళు కొనుక్కొన్నారు. నాకు భలే నచ్చిందిలే మీ కమ్యూనిటి” అంది అమ్మ. అబ్బాయి ఇల్లు తీసుకున్నాక  అమ్మ అమెరికా రావడం అదే తొలిసారి. 


అబ్బాయి నిగూఢంగా నవ్వాడు. అమ్మకు అర్థంకాలేదెందుకో. 


“తెల్లోళ్ళు నల్లోళ్ళు అరవోళ్ళు పంజాబోళ్ళు తెలంగాణా వాళ్ళు  కడపోళ్ళు తెనాలోళ్ళు బెజవాడోళ్ళు అంతా పక్కపక్కన ఎదురుబొదురు వున్నారు.మూడొంతులు మనవాళ్ళే. భయం లేదు లే” అంది మళ్లీ అబ్బాయితో. 


“తప్పు అలా అనకూడదు. ఇక్కడ ఎవరూ మరొకరిని ఏమి అనరు, అస్సలు పట్టించుకోరు కూడా. మనమే ఏవేవో ఊహించుకుని భయపడకూడదు” అన్నాడు అమ్మ అపోహలను పోగొట్టడం తన భాద్యత గా భావించి. 


“మన తెలుగోళ్ళు కూడా ఒకొరితో మరొకరు పలుక్కోరా ” అమ్మ ప్రశ్న.


“రెండేళ్ళైంది ఇక్కడకొచ్చి.  ఇంతవరకూ పక్కింటామెను చూడలేదు నీ కోడలు. అతనితో అప్పుడప్పుడు ఒక నిమిషం రెండు నిమిషాలు  నేను మాట్లాడటమే”


“అయ్యో! ఇది మరీ విడ్డూరంగా వుంది. ఇరుగు పొరుగు మరీ అంత విచిత్రంగా వుంటారా” పైకి అనేసింది అమ్మ. 


 వాకింగ్ కి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరింటి ముందూ ఆగి ఉత్సాహంగా  పూలు చెట్లూ  ఫోటోలు తియ్యకు, అనుమానిస్తారు, కంప్లైంట్ కూడా చేస్తారు” అని హెచ్చరించాడు అబ్బాయి. 


“అలాగే” అంది. స్వగతంలో అనుకుంది. విరిసిన ముద్దు ముఖంతో వేలదరహాసాలు చిందిస్తున్న నా మనుమరాలిని చూసుకోవడమే నాకిష్టమైన వ్యాపకం. ఈ పువ్వులు గివ్వులు నాకేమి వద్దు పో! “ అని.


“వద్దన్నా నువ్వు తీస్తూనే వుంటావ్ అని చెప్పా. సీరియస్ గానే చెబుతున్నా తీయొద్దు “ అంటూ  అమ్మ చేతిలో టూల్ ని తను తీసుకుని మొక్కల మధ్య తవ్వుతూ “ నీ మనవరాలు నిద్ర లేచినట్టు వుంది. కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళు” అన్నాడు. 


ఈ లోపు మనుమరాలు తలుపు దగ్గరకు వచ్చి “నాయనమ్మా నేను నేనూ” అని కేకలు వేస్తుంది. కాళ్ళు చేతులు కడుక్కొని  పాపాయికి తగలకుండా డోర్ తీసి “బంగారు తల్లీ! అప్పుడే నిద్ర లేచేవెందుకే, ఏమి ఆరిపోతుందని ఇక్కడ” అని ఎత్తుకుని ముద్దులాడింది నాయనమ్మ. వచ్చిన నాలుగు రోజుల్లోనే నాయనమ్మను అంటుకొని పోయింది.  చీటికిమాటికి నాయనమ్మ నాయనమ్మా అంటూ పిలవడం చిన్నితల్లీ అంటూ నాయనమ్మ హత్తుకోవడం. వారి మురిపాలకు ఇంట్లో వాళ్ళ దిష్టి కూడా తగిలేటట్టు వున్నారిద్దరూనూ.


******

“చిన్ని తల్లీ, నా బంగారు కొండా, రామ్మా ! వొళ్ళు తుడుచుకుని క్రీమ్ రాసుకుని పౌడర్ అద్దుకుని కొత్త గౌన్ వేసుకుందువు గాని, నా బంగారు తల్లి రా!” నాయనమ్మ మనుమరాలిని ముద్దుగా దగ్గరకు రమ్మని పిలిచింది. స్నానం చేసొచ్చిన ఒంటితో బెడ్ మీద ఆటలాడటం మిక్కిలి సరదా.


ఉహూ.. రాను, పట్టుకో పట్టుకో నాయనమ్మా పట్టుకో” మంచం తలకోడువైపుకు వెళ్ళి నాయనమ్మ ను ఆటపట్టించింది. 


“అనగనగా ఒక రాజు అంట, ఆ రాజు పేరేమో అంటూ మనుమరాలిని కథ లో లీనంచేయాలని మాయలో పెట్టాలని ప్రయత్నిస్తూ నాయనమ్మ నెమ్మదిగా మంచం చుట్టూ తిరిగివెళ్ళింది. చిన్నితల్లి పకపక నవ్వుకుంటూ అందకుండా ఇంకో వైపు పరుగుతీసింది. మంచం కొసకు వెళ్ళి గబుక్కున వెనక్కి తిరిగింది చిన్నితల్లి. చూస్తున్న నాయనమ్మకు గుండె ఝల్లుమంది. పాప నాలుగడుగుల బెడ్ పై నుండి కింద పడితే.. కించిత్ కోపం ప్రదర్శిస్తూ.. 


“అమ్మో! ఇంకొంచెం వుంటే కిందకు పడిపోయి వుండేదానివి. ఎంత దెబ్బ తగిలేదో. చెప్పినమాట వినమ్మా! బంగారు తల్లివి కదూ! రైమ్స్ లో డాక్టర్ ఏమి చెప్పాడు? మంచంపై ఎగరకూడదు అని చెప్పాడా లేదా?”

నాయనమ్మ బతిమలాడటం చిన్నితల్లికి నచ్చింది. ఆట ఆపి “పాప ఢాం అంటంది. పాపకు అబ్బు అయితే ఇంజెషన్, నర్స్ ఆంటీ” అని చేతిపైన యాక్షన్ చేసి చూపించింది.


“అవును మరి. అందుకే మంచం మీద ఎగరకూడదు అంటా” మాటల్లో పెట్టి పాప ని చటుక్కున పట్టుకుంది. ఇష్టంగా నాయనమ్మకు దొరికి డైపర్ వేయించుకుని క్రీమ్ రాయించుకుని గౌన్ వేసుకునేటప్పటికి మళ్ళీ ఆట మొదలెట్టింది. 


“ఇదిగో ఇలా అయితే నీతో కటీఫ్, నాయనమ్మ వెళ్ళిపోద్దీ. కొత్త గౌను గాజులు అన్నీ ఎదురింటి రీటా పాపకు ఇచ్చేస్తది. నాయనమ్మ రీటా పాపను పెంచుకుంటది అంట” అని బెదిరించింది. నీ ఉత్తుత్తి మాటలు నాకు తెలుసులే నాయనమ్మా అన్నట్టు పాప మనోహరంగా నవ్వింది కానీ నాయనమ్మకు చిక్కలేదు. 


ఇక ఇలాకాదు అనుకుంటూ రీటా పాపకు ఇచ్చేస్తా గౌన్. నేను కిందకు వెళ్ళిపోతున్నాను. ఈ డార్క్ రూమ్ లో నువ్వు ఒక్కదానివే ఇక్కడే వుండు అంటూ లైట్ ఆఫ్ చేసి తలుపు మూసి బయట చప్పుడు చేయకుండా తలుపు దగ్గరే నిలబడింది. 


నాయనమ్మా! గట్టిగా అరుస్తూంది పాప. గౌను వేయి, పాపది గౌను, రీటా పాపకు వద్దు” అనడం విని నవ్వుకుని తలుపు తెరిచి లైట్ ఆన్ చేసింది. నాయనమ్మ బెడ్ దగ్గరకు రాగానే గబగబ వచ్చి నాయనమ్మ చంకనెక్కింది. పాపను ముద్దాడి గౌన్ తొడిగి బొట్టు పెట్టి చేతులకు గాజులు వేసి విబూధి బొట్టు పెట్టి స్వామికి దణ్ణం పెట్టుకుందాం రా దేవుడి గదిలోకి తీసుకెళ్ళింది. మందిరం ముందు బుద్ధిగా నిలబడి దణ్ణం పెట్టుకుని మళ్ళీ నాయనమ్మ చంక నెక్కింది. 


మెట్లు దిగి కిందకు వస్తూ “హమ్మయ్య ఇవ్వాళ్టికి ఈ స్నానం తతంగం అయ్యింది. ఇక అన్నం తినే దగ్గర ఎంత అల్లరి పేచీ పెట్టుద్దో” అనుకుంది నాయనమ్మ. 


ప్రతిరోజూ పాప తనకు ఇష్టం లేనప్పుడల్లా  అన్నం వద్దనో   పాలు వద్దని పేచీ పెట్టడం, నీ కేప్ లు వేసుకోకుండా చెప్పులు వేసుకోకుండా పరుగులు తీయడం చేతులకు వేసిన బంగారు గాజులు తీసి విసిరికొట్టడంతో పాటు పెద్దలు వారించినప్పుడల్లా అమ్మ వద్దు నాన్న వద్దు నాయనమ్మ వద్దు అంటూ తిరస్కారం తెలియజేయడం మొదలెట్టింది. పాప అలా అన్నప్పుడల్లా.. నువ్వు అలాగే చెయ్యి. నీ బొమ్మలు నీ గౌనులు నీ గాజులు కొత్త చెప్పులు అన్నీ రీటా పాపకు ఇచ్చేస్తా అని నాయనమ్మ అమ్మ బెదిరించడం మాములైపోయింది. 


రీటా పాప అని చెప్పే అమ్మాయిది కూడా కుడియెడంగా చిన్నితల్లి వయస్సే! తెల్లగా పాలు కారే బుగ్గలతో అమ్మ నాన్న డాగీ తో కలసి కనబడుతూ వుంటుంది. ఎక్కువగా సాయంత్రం వేళల్లో వాకింగ్ కు వెళుతూ కనబడుతుంది. ఆ పిల్ల అసలు పేరేమిటో తెలియదు. నాయనమ్మ ఆ పాపకు రీటా పాప అని పేరు పెట్టింది అంతే! నాయనమ్మకు తెలియకుండా మనుమరాలి మనసులో రీటా పాప కు పెద్ద స్థానం ఏర్పడిపోయింది. నాయనమ్మ రూమ్ లోకి వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద కిటికీ అద్దాల గుండా బ్లెండర్స్ లేపి మరీ ఎదురింటి వైపు చూస్తూ రీటా పాప అని చూపించేది. ఆ పిల్ల కనబడకపోతే రీటా పాప ఏది? లేదు, రీటా పాప లేదు అంటూ చేతులు త్రిప్పి చూపించేది. 


ఒకోసారి తనను బెదిరిస్తూ అన్న మాటను పట్టుకుని రీటా పాపకు ఇచ్చేస్తామన్న వస్తువును పట్టుకుని మెయిన్ డోర్ వైపు పరుగులుదీసేది. గరాజ్ తలుపులు తీసివుంటే ఆ వస్తువును తీసుకుని రోడ్డు దాటి వారి ఇంటి వైపు వెళుతూ “రీటా పాపా, రా, బొమ్మ తీచుకో అని” కేకలు పెట్టేది. తన బొమ్మలను తను తినేదాన్ని తన గౌన్లను ఆ పిల్లకు ఇచ్చేస్తా” అనే ఇష్టాన్ని అంగీకారాన్ని ప్రదర్శించేది. 


మనుమరాలిలో ఆ ఇచ్చే గుణాన్ని చేసే ప్రయత్నాన్ని చూసి నాయనమ్మకు సంబరం. “నా బంగారు తల్లి, నీకు అన్నీ నాన్న సుగుణాలు వచ్చేయి” అంటూ ముద్దులు కురిపించేది.


చిన్ని తల్లి కోవిడ్ 19 లో పుట్టింది. ఆ పాప పుట్టే సమయానికి అదే హాస్ఫిటల్ లో మూడొందల మంది కోవిడ్ పేషంట్ లు వున్నారు. ప్రీమెచ్యూర్ బేబిగా కట్టుదిట్టమైన రక్షణ చర్యల మధ్య ఇరవై వొక్క రోజులు వారి మధ్య గడిపి వచ్చిన బిడ్డను అమ్మ నాన్న అపురూపంగా భద్రంగా పెంచుకుంటారు. తగిన జాగ్రత్తలూ ఎక్కువే!  ఏదో రెండు మూడు కుటుంబాల స్నేహితులు బంధువులు తప్ప  మనుషుల పరిచయమే లేదు.  రెండేళ్ళపాటు మనుషులకు దూరంగా వుండటం వల్ల ఎక్కువమంది మనుషుల సాంగత్యం కూడా లేకపోవడం వల్ల కొత్త మనుషులను చూస్తే ఉక్కిరిబిక్కిరి అవుతుంది. భయం బెరుకు కూడా. నన్నంటుకోకు నేనసలే అత్తిపత్తి ఆకు అనుకుంటూ ఎవరైనా కొత్త మనిషిని చూస్తే చాలు అమ్మ చంకకు అంటుకొనిపోద్ది. మగవాళ్ళ దగ్గరకు అసలు వెళ్ళదు. ఆడవాళ్ళ దగ్గరకు తోటి పిల్లల దగ్గరకు వెళ్ళడానికి కాస్త సమయం తీసుకునేది.


ట్రావెల్ బేన్ ఎత్తివేయడంతో అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ పరిచయమయ్యారు. కాస్త మనుషుల లోకంలోను తన ఈడు పిల్లల లోకంలోను పడింది కానీ కలసి ఆడుకోవడానికి స్నేహం చేయడానికి తోడు లేక పిల్లల కోసం మొహమాచిపోయేది. తోటి పిల్లలను చూస్తే చాలు ముఖం వికసించేది. వారితో కలిసిపోవాలని ఉబలాటపడేది. 


రీటా పాప కనబడుతుందేమో అని కళ్ళతో వెతుక్కొనేది. ఆ రీటా పాప చిన్నితల్లి వైపు ఒక్కసారన్నా చూసిందో లేదో! ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా ఈ ఇంటి వైపు కన్నెత్తి చూడరు. ఇంటిముందున్న వేన్ పై ఏదో పేరుతో హౌస్ క్లీనింగ్ డాట్ కమ్ అని వుండేది. అది వేసుకుని రీటా పాప తండ్రి, తెల్లని హంస లాంటి కారు వేసుకుని రీటా పాప తల్లి బయటకు వెళుతుండేవారు. బ్రాండెడ్ బట్టలు వేసుకుని ధనవంతులు లాగానే కనబడేవారు నాయనమ్మ కళ్ళకు. వారికి బంధువులు స్నేహితులు కూడా ఎక్కువే. వారాంతంలో  ఇంటి ముందు కార్ల రద్దీ ఎక్కువగానే వుండేది. 


నాయనమ్మ కు మనుమరాలికి మధ్య మాటల్లో రీటా పాప గురించి వారి కుటుంబం గురించి కబుర్లు నడుస్తూ వుండేవి. మధ్యాహ్నం పూట గరాజ్ ఓపెన్ చేసి గోరు ముద్దలు తినిపిస్తూ.. “ఇవాళ రీటా పాప వాళ్ళ అమ్మమ్మ మామయ్య వచ్చినట్టు వున్నారు. ఇందాక బయటకు వెళ్ళారా, అదిగో చూడు ఇప్పుడు రీటా పాపకు కొత్త గౌను, పింక్ కలర్ గొడుగు కొనుక్కొచ్చుకున్నారు. రీటా పాప అవి తీసుకుని లోపలకు వెళుతుంది చూడు” అని చెప్పింది. వాళ్ళింటి వైపే చూస్తూ.. ఊ అనేది పాప. 


సాయంత్రం అందరూ వాకింగ్ కు వెళుతుంటే అందరినీ ఆసక్తిగా చూసేది. కొందరు పిల్లలు చిన్నితల్లికి హాయ్ చెప్పేవారు. కొందరు పెద్దలు ఆగి నాయనమ్మతో మాట్లాడేవారు. పంజాబీ అంకుల్ చిన్నితల్లితో దోబూచులాట ఆడుతూ పకపకా నవ్వించేవాడు.  తెలంగాణా అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలూ  అంకుల్స్ ఆంటీలు అందరూ చిన్ని తల్లితో మాటలు కలిపేవారు. బ్లాక్ అంకుల్ ఆంటీ కూడా హాయ్ చెప్పేవారు. బ్లాక్ అంకుల్ నాయనమ్మను హాయ్ మా అని పలకరించేవాడు. అతని భార్య నమస్తే అమ్మా అని సంస్కారంగా పలకరించేది.


కానీ రీటా పాప అమ్మ నాన్న  అపరిచితుల్లా ముఖం మీద ఏ భావం కనబడకుండా చెక్కముఖాలేసుకుని ఆగకుండా చిన్నితల్లి ఆ పిల్లకు హాయ్ చెబుతున్నా పట్టించుకోకుండా రీటా పాపను చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళేవారు. నాలుగైదుసార్లు ఆ విషయాన్ని గమనించిన నాయనమ్మ ముఖం నల్లబడింది. మనుమరాలి ఉత్సాహాన్ని రీటా పాపతో స్నేహం చేయాలన్న ఆకాంక్షను కనిపెట్టింది. కానీ అసాధ్యమని తెలిసిపోయింది. 


నాయనమ్మ కళ్ళే కాదు మనసు కూడా పూర్తిగా విచ్చుకున్న తరుణం కూడా అది.  తనే పొరబాటు చేసానని అనుకుంది. ఇంకెప్పుడూ చిన్నితల్లినే కాదు ఎవరినీ కూడా తెలిసీ తెలియకుండా కూడా బెదిరించడం ద్వారా పోల్చడం ద్వారా అవతలి వారిపట్ల అమితాస్తక్తి ని కల్గించకూడదూ అని  గట్టిగా నిర్ణయించుకుంది. 


ఇంట్లోకి వచ్చి “చిన్నితల్లి దగ్గర ఆ రీటా పాప గురించి పదే పదే ప్రస్తావించి మనం చాలా తప్పు పని చేస్తున్నాం. ఆ పిల్లతో స్నేహం చేయాలని తన బొమ్మలు తినుబండారాలు పంచుకోవాలని మన పిల్ల ఆరాటపడుతుంది. ఆ పిల్ల అమ్మ నాన్న ఆ పిల్లను ఇటువైపు చూడనీయరు. మన చిన్నితల్లి బాగా నిరాశపడుతుంది. ఆ పిల్ల గురించి మనం మాట్లాడటం ఆపేద్దాం” అని ఇంట్లో వారికి సూచన చేసింది. 


అలా చేయడమే కాదు, ఆచరణలో ప్రయత్నించింది కూడా. 


మరొకరోజు అబ్బాయితో అంది అమ్మ తన అసంతృప్తిని వెల్లడిస్తూ.. 

మన కుటుంబాల్లోని నాలుగవ తరం వారందరిలో మూడొంతులు మంది ఇక్కడికే వచ్చేసారు. ఈ వలసల వల్ల ఏమి బావుకుంటున్నాం. ఇక్కడ కూడా మనుషులు మనుషుల్లో కలవరు. అంటరానితనం వొంటరితనం అనాదిగా ఈ జాతికి అదే మూలధనం  అన్నది  ఇక్కడ కూడా వుంది. ఇది మాత్రం నాకేమి నచ్చలేదబ్బాయ్” 


 “అసలు నేటివ్ అమెరికన్స్ వేరే వుంటారు. ఈ తెల్లవాళ్ళంతా ఎక్కడెక్కడ నుండో వచ్చినవాళ్ళే! నల్లవాళ్ళందరూ బానిసలుగా తీసుకొచ్చినవాళ్ళ సంతతే! ఎన్నో వివక్షలుంటాయ్. ఇక్కడ బతకాలంటే ఇవన్నీ పట్టించుకోకూడదు.  అమ్మా! ఎక్కువ ఆలోచిస్తునట్టున్నావ్ వదిలేయ్”


మళ్లీ తనే తల్లికి విశదీకరించే ప్రయత్నం చేసాడు.


“ఈ కమ్యూనిటిలో అందరూ ఇండియన్సే వున్నారని కొంతమంది తెల్లవాళ్ళు ఇళ్ళు అమ్ముకుని వెళ్ళిపోయారు రెండేళ్ళలోనే.ఆహారం వండేటప్పుడు వచ్చే ఘాటైన వాసనలు వారికి నచ్చవట”


“మనవాళ్ళు మాత్రం అద్దెకు ఇళ్ళు  అందరికీ ఇస్తారా ఏమిటీ? అందుకు అనేక కారణాలు. అలాగే ఎవరి కారణాలు వారికి వుంటాయిగా మరి’’అంది కొడుకుతో.


నాయనమ్మ  సాయంసమయాల్లో పాపను ఇంటి ముందు వైపుకు తీసుకువెళ్ళకుండా వెనుక వైపు తోట బయటకు తీసుకెళ్ళి కడపోళ్ళ పిల్లలతో తెలంగాణా పిల్లలతో కలిసి ఆడుకునేటట్లు ఉరికొల్పింది. చిన్నితల్లి కూడా వారితో కలిసిమెలిసి  అక్కా అన్న అంటూ బాగా ఆడుకుంటుంది. కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్న అక్క  అభినయాన్ని అనుకరించింది కూడా. 


హమ్మయ్య ! కాస్త పెద్దపిల్లలన్న మాటేకానీ మనుమరాలు ఆడుకోవడానికి కొద్దిమంది పిల్లలు దొరికారు అది చాలు అనుకుని  నాయనమ్మ నిశ్చింతగా నిట్టూర్చింది.


ఆ రోజు ఉదయం పదకొండు గంటల వేళ సన్నగా చినుకులు పడుతున్న సమయంలో  చిన్నతల్లి అమ్మ మీటింగ్ లోనూ నాన్న కాల్స్ లోనూ బిజీగా వున్న సమయం. చిన్నితల్లి ఆడుకుంటూ గట్టిగట్టిగా అరుస్తూ అల్లరి చేస్తుంది. అమ్మా! కాసేపు అమ్మాయిని బయటకు తీసుకెళ్ళు, కాల్ లో వున్నాను అన్నాడు చిన్నితల్లి నాన్న. వంటగదిలో వున్న నాయనమ్మ స్టవ్ ఆపేసి వచ్చి చిన్నితల్లిని చంకనేసుకుని తలుపుతీసుకుని గరాజ్ లోకి వచ్చింది. గరాజ్ ఓపెన్ చేసింది. చిన్నితల్లి  వాన వాన అంటూ నాయనమ్మ చంక దిగి బయటకు పరిగెత్తింది. 


“బంగారు తల్లీ పడపోతావ్, అబ్బు అవుద్ది, నీ కేప్ వేసుకుందువుగాని వుండు అంటూ వుండగానే డాగీని రీటాను పట్టుకున్న రీటా అమ్మా నాన్నలు గబగబ నడుస్తూ వస్తూ చిన్నితల్లికి కనబడ్డారు. చిన్నితల్లి గబగబా లోపలికి వచ్చి తనకెంతో ఇష్టమైన జెజె బొమ్మను  తీసుకుని బయటకు పరిగెత్తుతూ “ రీటా పాపా, తీసుకో తీసుకో జెజె ను తీసుకో “ అంటూ ఎదురెళ్ళింది. రీటా పాప అమ్మనాన్న చిన్నితల్లిని చూసి పట్టించుకోనట్లు చూసి రీటాను కుక్కను లాక్కుంటూ చిన్నితల్లిని దాటుకుని ముందుకు వెళ్ళారు.


ఆ క్షణంలో బాల్యంలో బలంగా నాటుకుని తర్వాత మరుగునపడివున్న దృశ్యం పెళ్ళగించుకుని వచ్చి  నాయనమ్మ కళ్ళ ముందు నృత్యం చేసింది. 


*******


అన్నయ్య తను కరణం గారి మేనకోడలు డాక్టర్ గారి అబ్బాయి మేడ ఇంటి పద్మ అందరం కలసి సందడి సందడిగా ఆడుకుంటున్నప్పుడు చూసిన విషయమూ జ్ఞాపకం వున్న దృశ్యం అది.  చంకలో వెదురుబుట్ట పెట్టుకుని మా అందరిని  ఆసక్తిగా చూస్తూ మనసులో మాతో కలిసి ఆడుకోవాలనే కోరికను అదిమిపెట్టి  దూరంగా నిలబడి బిక్కముఖం వేసుకుని చూస్తున్న యేసుకుమారి. చీకటి పడుతున్న వేళకు యేసుకుమారి వాళ్ళమ్మ మా ఇంట్లో నుండి చెమట తుడుచుకుంటూ వచ్చి  చేతిలోని చద్దిమూటను తన  కూతురి చంకలోని వెదురబుట్టలో పెట్టి  ”మిడిగుడ్లేసు కుని అట్టా చూత్తావేమే, పెద్దోళ్ళ పిల్లలతో ఆడకూడదని చెప్పాగా. మనింటికాడ పిల్లలతో ఆడుదువు గాని పా” అంటూ రెక్క పట్టుకుని ఈడ్చుకుపోయింది. 


అప్పుడు నేను ఆశ్చర్యంగా చూసిన చూపు ఇప్పుడు ఇక్కడ మనమరాలి తో కూడిన తనకు అనుభవంలోనికి వచ్చినట్లైంది అనుకుంది నాయనమ్మ. 


****************


వాస్తవంలోకి వచ్చిపడింది.


ఒకోసారి పెద్ద పెద్ద విషయాలకే కాదు చిన్న చిన్న విషయాలకు కూడా గుండె చెరువై పోతుంది. కానీ అది చాలా పెద్ద విషయమని తర్వాతెప్పుడో తెలుస్తుంది అనుకుంటూ.. చిన్ని తల్లి వైపు చూసింది. 


ఆగకుండా హాయ్ చెప్పకుండా బొమ్మ ఇస్తానన్నా తీసుకోకుండా వెళ్ళిపోతున్న రీటా వైపు చూస్తూ కదలకుండా మౌనంగా నిరాశనిండిన కళ్ళతో  నిలబడి వుంది చిన్నితల్లి. అది చూసి నాయనమ్మ గుండె బ్రద్దలైపోయింది. అప్రయత్నంగా కళ్ళనిండా కురిసిన నీళ్ళు జలజలా రాలాయి. 


ఒక్క ఉదుటున వొంగి చిన్నితల్లిని ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది నాయనమ్మ. 


ఇంకా రీటా పాప ఇంటివైపు చూస్తున్న మనుమరాలి దృష్టిని మళ్లించడానికి మాయమాటలు చెప్పింది.”రీటా పాప వానలో తడిస్తే జ్వరం వస్తుందంట. అందుకే గబగబ వాళ్ళమ్మ నాన్న లోపలికి తీసుకెళ్ళారు. మనం కూడా గబగబా లోపలికి వెళ్ళిపోదాం పద”


గబగబ చకచక తపతప టపటప పకపక అంటూ నాయనమ్మ నేర్పిన  జంట పదాలను వల్లిస్తూ నాయనమ్మ మెడను వాటేసుకుంది చిన్నితల్లి.


మనుమరాలిని హత్తుకుంటూ.. “మనుషులు తోటి  వారి మధ్య గీసుకున్న గీతలు చాలా బలమైనవి క్రూరమైనవి. కులాలు మతాలు వర్ణాలు దేశాలు ఏవైనా  వాటిని చెరపడానికి కొన్ని తరాలు  వారి హృదయాలు కూడా అవసరమవుతాయి. ఈ లోగా గాయపడే హృదయాలెన్నో!  నాయనమ్మ భారంగా నిట్టూర్చింది.


************౦***************


 #ఈస్తటిక్ _సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.