24, ఆగస్టు 2023, గురువారం

కాటుక మబ్బులు



ఎడిట్ చేయని .. అసలు కథ. నిడివి దృష్యా మూడు పేజీలకు కథ కుదించక ముందు నేను పంపిన అసలైన కథ ఇది. (గమనించగలరు)


కాటుక మబ్బులు  - వనజ తాతినేని


పెళ పెళ మంటూ కొమ్మ విరిగి నేలబడిన చప్పుడు. తలొంచుకుని జొన్నలను కడుగుతున్న సరిత  వులికిపడి చప్పుడైన వైపు చూసి క్షణం ఆలస్యం చేయకుండా ఆడకి పరుగుపెట్టింది.. 


కొబ్బరాకులు చీల్చి ఈనెలను కట్టకడుతున్న  భూదేవమ్మ యిరిగి పడిన కొమ్మను చూసి “ అనుకుంటూనే వున్నా కాయల బరువు యెక్కువై కొమ్మ యిరిగిపోతాదని. అట్టే అయింది” అనుకుంటూ గబ్బుక్కున లేవబోయి మళ్లీ కూలబడింది. ఏడు పదులు దాటిన ముసల్ది కాలు చేయీ తీసుకుని మళ్లీ లేవబోయే సరికి యింకో కొమ్మ యిరిగిపడింది. 


మనుమడి పెళ్లాం సరిత “ఓయమ్మో! అత్తోయ్ ! నువ్వు చెట్టెందుకు యెక్కావ్! దిగు, దిగి రా..ముందు. ఆడ్నించి పడితే యేమైనా వుందా?” కేకలు బొబ్బలు పెడతాంది. భూదేవమ్మ సత్తువకొద్ది పరిగెత్తుకొచ్చి చెట్టుకు దూరంగానే వుండి పైకి చూసింది.కోడలు మీనమ్మ చెట్టు పంగలపై కాళ్ళుంచి నిచ్చెన యెక్కుతున్నట్టు యింకో పంగ కోసం చూపులతో  యెతుకుతుంది. 


“అమ్మే మీనమ్మా! ఏడికే అట్టా ఆకాశం లోకి యెక్కతావున్నావ్, కొమ్మలు యిరిగి పడింది తెలియడంలా, ఆడనుంచి పడితే నడుములు యిరుగతాయ్, కిందకి దిగమ్మా” బతిమాలింది.

 

“నేను దిగను, అల్లదిగో ఆ చిటారుకొమ్మన  పెద్ద మామిడికాయ వుంది. నేను అది కోసుకున్నాక దిగుతా” 


“ఓసి నీ పిచ్చి తగలెయ్య నువ్వు యెక్కింది మామిడిచెట్టు కాదే మునగ చెట్టు” అని మనవరాలి సాయ చూసి “అమ్మీ నువ్వు  యింటోకి పోయి మామిడికాయ వుంటే పట్టుకొని రా లేకుంటే అంగట్లో కొనుక్కొని రా, బిన్నా రా, నేను మీ అత్తను మాటల్లో పెట్టి పైకి యెక్కకుండా జూస్తా”  

 

సరిత  వురుకుతా యింట్లోకి పోయింది 


“మీనమ్మా నీకు మామిడి కాయ కావాలా,  అది నీకు అందదుగానీ  చిక్కం కట్టిన గెడ కర్రతో కోసుకుందువుగాని కిందకు రామ్మా”


“నేను రాను. మామిడికాయ కోసుకుని ఈడే కూకుని తింటా,నువ్వు పోయి రవ్వొంత ఉప్పు కారం పట్టుకొచ్చియ్యి” ఇంకో కొమ్మ యెక్కబోయింది.


“పైకి వద్దులే, ఇదిగో నీక్కనబడకుండా యీడో మామిడికాయ దాక్కుంది చూడు. నువ్వే కోయాలంట నువ్వే తినాలంట. కోద్దువు రా.. రా! అని పిలుస్తుంది చూడు” నమ్మబలికింది. 


“అయ్, నేనే కొయ్యాలంట నేనే తినాలంట మీకు యెవరికీ పెట్టనంట”.. మాటలను లల్లాయి పదాలుచేసి పాడుకుంటూ నిదానంగా దిగుతుంటే .. ఊపిరి బిగబట్టుకుని చూస్తావుండింది. 


సరిత పరిగెత్తుకుంటూ వచ్చి పమిటచెంగుచాటు నుండి మామిడి కాయ తీసి భూదేవమ్మ చేతికిచ్చింది.ఆమె కోడలు చూడకుండా వొత్తుగా వున్న మునగ కొమ్మపై మామిడికాయను వుంచి కోడలికి  చూపిచ్చి “ ఇదిగో మామిడి కాయ, బిన్నా కోసుకో! మళ్లీ ఈ  అమ్మి కోసుకుపోద్దేమో” అని ఊరించింది.


“ఆయ్ ఆయ్ భలేగుంది మామిడికాయ్” అనుకుంటూ దిగొచ్చి  చటుక్కున ములక్కాడ ను తుంపుకుని రెండుగా విరిచేసి తేగలు నమిలినట్టు నములసాగింది. 


“ అయ్యో కూతురా! నువ్వు యింత మతిస్థిమితం లేకుండా పొయ్యావేమిటే,యిదంతా మా ఖర్మ కాకపోతే ” నెత్తి కొట్టుకుంది భూదేవమ్మ. అమ్మమ్మ మనవరాలు యిద్దరూ చెరో చేయి పట్టుకుని సావిడిగదిలో మంచం పై కూర్చుండబెట్టారు. సరిత బయటకొచ్చి తలుపు గడియబెట్టి కర్రల కిటికీలోంచి చూసి “అమ్మమ్మా బయట గడిపెట్టా. నిన్నేమైనా కొట్టుద్దేమో జాగ్రత్త.”


“అది ఎవర్నీ యేమనదులేవే, ఓటిదంటే అంతా ఓడుదన్నట్టు దాన్ని అంత సలీజుగా చూత్తావ్, నేనుంటాలే నువ్వు బో..” కసిరింది. 


“మా ఆయనతో నేను నీళ్లోసుకున్నా పుల్లపుల్లగా యేవైనా తినాలుందని  పుల్ల మామిడికాయ తెచ్చిమ్మని సిగ్గు లేకుండా అడిగా, తెచ్చిచ్చినాడనుకున్నావా, లేనే లేదు. ఇన్నేళ్ళకు మన చెట్టు కాసింది గనక తింటన్నా, భలే బాగుందత్తా! నువ్వు కూడా వొక ముక్క తింటావా? మంచి పిల్లలు పుడతారంట.బొద్దుగా ఆరోగ్యంగా వుంటారంట”. సగం ములక్కాయను భూదేవమ్మ నోటి దగ్గర పెట్టి అడిగింది. 

 

రవ్వొంత నవ్వు రవ్వొంత యేడుపు కలగలిపి వచ్చాయ్. 

“నాకొద్దులే, కాయంతా వొకేతూరి తింటే నీక్కూడా నోరు పులిసిపోద్ది. కాసిని నీళ్లు తాగి పడుకో’ మందు బిళ్లలేసిన మంచి నీళ్ల గ్లాసు చేతికిచ్చింది.


“ అట్టే, నువ్వు చెపితే నేనెప్పుడైనా కాదన్నానా, నువ్వు కూడా పడుకో, అన్నం తిన్నావా నువ్వు, పెట్టుకొచ్చేనా.. అంటూ మంచం మీద నుండి లేవబోయింది. “నేను యిందాకే  తిన్నాలే.. నువ్వు పడుకో”.


బుద్దిగా పడుకుంది మీనమ్మ.  అమ్మయ్య! గట్టి వాన కురిసి తెరిపిన పడ్డట్టుంది పేణానికి  అనుకుంది. 


అమ్మమ్మా! “ నీతో అమ్మ మాట్టాడుద్ది అంట.. ఫోన్ తీసుకొచ్చి యిచ్చింది సరిత. ఎట్టుంది నీ కోడలికి అడిగినట్టుంది కూతురు. 


“ఏం చెప్పను లేవే మా యెతలు. ఎవురూ ఆర్చేది తీర్చేది కాకపోయే.  పూటకొక గండం. కొంసేపు యేమారినా యేం తంటాలు తెచ్చి పెట్టుదో నన్న భయమైపోయే. నిన్న చూస్తే మిద్దె మీదకుపోయి వాటర్ ట్యాంకు యెక్కి కూర్చుని పిల్లకాయలను బంతెయ్యి అంటది. పదిరోజుల కిందట యెనక నుంచి స్కూల్ బస్ పైకి యెక్కి కూర్చుని నేను కూడా స్కూల్ కి పోతా అని గోల. అణుకువ గల బిడ్డ దానికి యెందుకు యిట్టా వచ్చిందో, కాస్తయినా నెమ్మళ పడితే జొన్నాడో వేదాద్రి కో పోయి మూడు నిదర్లైనా చేపిచ్చుకని రావాలనుకుంటున్నా” 

“అన్న యేమంటున్నాడు?, నేను ఫోన్ చేసి మాట్టాడితే దానికి పిచ్చి లేదు యేం లేదు అన్నీ యేసాలు అన్నాడు” 


ఆ మాట వినగానే   భూదేవమ్మకు కోపం తన్నుకొచ్చింది. 


“ఏసాలు ఆడికి చేతైనట్టు పెపంచంలో యెవురికైనా  చేతోచ్చా . సీకటి పడే టయానికి యేనాడైనా యింటికాడ పడివుండాడా.. ఎప్పుడూ మంది కొంపల్లోనూ మంచె కాడ తెల్లారిపోయే! దాని యేడుపంతా పీల్చుకొని పీల్చుకొని గట్టిబడిపోయిన బూరగ దూది దిండు పాటి అయినా మనం అర్ధం చేసుకోవాల. సాటి ఆడదాన్ని అర్దం చేసుకోకుంటే యెట్టా, నీకు వచ్చినయి యింటి ముందు అంపాపురం తాడిచెట్టుకు వచ్చినయి యేళ్ళు, ఇప్పుడంటే అన్నావ్ గానీ ఇంకోతూరి ఆ మాటంటే అన్నోళ్ళు యెవురైనా చెప్పుచ్చుకొడతా. “


“ఆడు అన్నాడని చెప్పినాను కానీ నేను ఆమాట అన్నానా, సరితే  పిచ్చిదానితో యమ యాతనలు పడతన్నాం అంటే కూడా సర్ది చెపుతున్నా. నీ కోడలిని నువ్వే చూసుకో. తూరి తూరి పిలిచి నా పిల్లను విసిగిచ్చబాకు. నీ వల్ల కూడా కాకపోతే పిచ్చాసుపత్రి లో వేసుకోండి” 


“నేను వుండగా దాన్ని పిచ్చాసుపత్రిలో యెందుకేస్తానే, ఇంకో రెండు నెలలు మందులు వాడితే తగ్గిపోద్దని డాక్టరమ్మ చెప్పింది. నీ కూతురికి బరువో భయమో అయితే ఏరు కాపురం పెట్టి దూరంగా పోయి వుండమను. ఇంకోసారి పిచ్చాసుపత్రి గిచ్చాసుపత్రి అన్నావంటే దవడ పగిలిద్ది”  యెర్ర బటన్ ని కసిగా నొక్కింది. ఫోన్ మనుమరాలి చేతికిచ్చింది. 


**********

“అబ్బయ్యా శ్రీకరూ, చిన్నోడా బంగారు కొండా! మీ కోసరం అవ్వ చాక్లెట్లు దాచిపెట్టింది, రాండి, తీసుకోండి.. పిలిచింది మీనమ్మ. కొట్టాల ముందు బంతాట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ చాక్లెట్ల మీద ఆశతో జంకు జంకుగా దగ్గరకు వచ్చారు. వాళ్ళు దగ్గరకు రాగానే గట్టిగా హత్తుకుని ముద్దులాడింది. ఒళ్ళో కూసిండ బెట్టుకుని ఆటలాడింది. అవ్వ పిచ్చిది అని చెప్పింది అమ్మ. అదంతా వొఠ్ఠిదే అనుకున్నారు పిల్లలిద్దరూ. మీనమ్మ పెద్ద కొడుకు వేణు  యిదంతా చూస్తూ ”అమ్మకు నయమైపోతుంది పర్లేదు” అనుకున్నాడు. 


మీనమ్మ దుప్పటి కింద దాచిపెట్టిన కవరు లోనుంచి యేదో రహస్యంగా తీసి పిల్లకాయల చేతుల్లో పెట్టి గుప్పిట మూసేసి చాక్లెట్లు తినండి అంది. పిల్లలిద్దరూ గుప్పిట తెరిచి  వాటిని చూసి ముఖం నల్లంగా పెట్టుకుని “ఛీ. చాక్లెట్లు కాదియ్యి, నీ మందులు, నువ్వే తిను మాకొద్దు” దూరంగా పారిపోబోయారు. వాళ్ళు విదిలిచ్చుకుని పోవాలనుకుకొద్దీ గట్టిగా పట్టుకుని మందులు కాదియ్యి చాక్లెట్లే తినండి తినండి.. అని బలవంతంగా పెట్టబోయింది. పిల్లలు భయపడి గగ్గోలు పెట్టి యేడ్వసాగారు.. వేణు గబాల్న వచ్చి మీనమ్మను ఎనక్కి నెట్టి పిల్లకాయలను యెడంగా తీసుకోయి.. అవ్వా అని గట్టిగా అరిచాడు.


 ఏందబ్బయ్యా! అంత గట్టిగా అరుస్తున్నావ్ అంటా వచ్చింది భూదేవమ్మ. 


“ఆమె ను బైటకు రానీయొద్దని చెప్పినానా లేదా.. చాక్లెట్లని పిల్లకాయలకు మందుబిళ్ళలిచ్చి తిననంటే నోట్లో కుక్కుతుంది. ఈ పిచ్చిమేళంతో మేము యేగలేం కానీ హాస్ఫిటల్ లో పెట్టేసి వస్తా” 


“వద్దులేరా అబ్బయ్యా, బయటకు రాకుండా నేను చూస్తాగా. పిల్లలు భయపడతన్నారనుకుంటే సరితను పిల్లకాయలను ఊరికి పంపియ్యి” అని బతిమలాడుకుంది.  


మీనమ్మ నిదరబోతందిలే! లేచేవోపు చీరలకు గంజేసుకుని.తలస్నానం చేసుకుని వద్దాం అని తలుపు గడియపెట్టి పొయ్యింటి వైపు యెల్లింది భూదేవమ్మ.పనులన్నీ ముగించుకుని అన్నం గిన్నె పట్టుకుని వస్తుంటే కన్ను వాచిపోయి చిరిగిపోయిన చొక్కాతో సావిడి గది నుంచి బయటకొస్తున్న కొడుకు శేషగిరి ని అనుమానంగా చూస్తూ.. ఏమైందిరా.. అని అడిగింది.


“ఏముందీ!.. పిచ్చిది, మదమెక్కిన ముండ, దానమ్మ సిగతరగ,  మొగుడిని అని కూడా సూడకుండా వొళ్ళంతా రక్కింది కొరికింది”. కాళ్ళతో నేలని తాపుతూ అదీ చాలక యెదురుగా వుండ నీళ్ళకుండపై కోపమంతా చూపించాడు. 


“ఒళ్ళు బాగోలేని దగ్గర నీ మగోడి యేసాలేంటిరా.. అవతలకి పో..” అంది చీత్కారంగా.


కళ తప్పిన ముఖంతో  చింపిరి జుట్టుతో చిక్కిశల్యమైపోయి

మంచానికి అంటుకుపోయిన కోడలు కళ్ళనిండా కన్నీటితో ఏవేవో గొణుక్కుంటూ వుంటే .. పిచ్చిదాని మాటల్లా కాకుండా లోతుగా వున్నట్టు అనిపిచ్చి మనసు పెట్టి  వినింది.


“నేను యింకోతూరి తప్పు చేత్తానా.. పూట పూటకి దొంగ కూడు తినే కుక్క కు దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ముట్టనిస్తానా,భద్రంగా కాపలా కాయనూ..”


దేవుడేంటి, నైవేద్యం యేమిటి? అయోమయంగా చూసింది. తరువాత లోతుగా  ఆలోచన చేస్తుండగా.. 


“అత్తా! నేనేమైనా తప్పు మాట్లాడానా, నిజమే కదా చెప్పాను. తప్పు చేస్తే కూడా వొప్పుకోవాలి. కప్పెట్టేసుకుని  మోసం చెయ్యకూడదు గందా”  అంది మీనమ్మ.


 కిటికి దగ్గర తచ్చాడుతున్న సరితను చూసిన భూదేవమ్మ..

“ఏమోనే అమ్మా! నువ్వూ నీ పిచ్చి మాటలు, ఊకో, యెవరైనా యింటే  నీ మాటలకు యింకా నాలుగు కల్పితాలు చేసి రచ్చకెక్కిస్తారు.  దానికి బయటోళ్ళదాకా యెందుకు మనింటోవాళ్ళే చాలునుగందా”


వాత పడ్డ సరిత చప్పుడు చేయకుండా లోపలికి జారుకుంది. 


 రేయంతా ఆలోచనలు చేసిన భూదేవమ్మ తెల్లవారుఝామున  నిద్రలోకి జారుకుని పెళ్లున యెండ కాసేటప్పుడు మేల్కొంది. ఆ సరికే ఆమె  కళ్లకు శుభ్రంగా స్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకుని ముఖాన కాసంత బొట్టెట్టుకుని కనబడింది మీనమ్మ.  నిండా ఆశ్చర్యంలో మునిగి వుండగానే.. 


“అత్తా!కార్తీకమాసం కదా తులసి ముందర దీపాలు యెలిగిచ్చా చూడు” అంది. “ఇది కార్తీకమాసం కాదే అమ్మా  నవరాత్రులు”  మనసులో అనుకుని  గుమ్మం ముందుకొచ్చి చూసింది. నడవంతా కడిగి ముగ్గులు పెట్టి నిజంగానే తులసమ్మ దగ్గర దీపాలు పెట్టి వుండటం చూసి సంబరపడింది. మరొకనాడు చేతులు జోడించి ఈనుతున్న ఆవు చుట్టూ  ప్రదక్షిణలు చేస్తున్న మీనమ్మ ను చూసి ఆశ్చర్యపోయింది. 


 దీనికి పిచ్చి కొంత తగ్గి మాములు మనిషిగా మారతంది. ఓపిగ్గా యింకొన్నాళ్లు లాక్కొద్దాం. ఇంటి ముందర  కానుగ చెట్టు కింద మంచమేసి కూర్చోబెడితే సరి.దారిన వచ్చే పోయే వాళ్ళను చూసైనా మనుషుల లోకంలో పడుద్ది అనుకుంది. ఆలోచన మొదలైంది తడవూ దినంబు ఆ  పనే చేస్తుంది భూదేవమ్మ. కొందరు చెట్టు కింద కూర్చున్న మీనమ్మను పలకరించి కాసేపు మాట్టాడి ఆమెకు నిజంగా పిచ్చే అని తీర్మానించుకుని పోతే మరికొందరు పిచ్చి లేదు యేమి లేదు మనిషి మాములుగా వుందని మాటలతో యెదురుకోలు ఆడుకున్నారు. . 


చీర చెంగు ముఖాన యేసుకుని దారినపోయే  పిల్లలతో దాగుడుమూతలు ఆడుతూ కొట్టంలో ఆవులకు మేతేస్తూ ఆటిని నీళ్లకు వొదిలి గంగడోలు నిమురుతూ తువ్వాయిలతో ఆడుకుంటూన్న కోడలిని చూసి ఆనందపడింది భూదేవమ్మ.


ఒకనాడు సందేళ   కానుగు చెట్టు కింద కూసుని వుంది మీనమ్మ. క్రీగంట ఆమె వైపు చూసుకుంటూ వీధిలో నడిచి పోతున్న మనిషిని చూస్తూ పకపకా నవ్వింది. గేటు కాడికి పరిగెత్తిపోయి ఆ మనిషిని చేయి వూపి పలకరించింది.  అతను తనపాటికి తాను నడుచుకుంటూ పోతా వుంటే అదే పనిగా చూస్తానే వుండే కోడలి కళ్ళల్లో వెలుగు పెదాల పై సన్ననవ్వు చూసి ఆశ్చర్య పోయింది.  అంతలోనే మీనమ్మ  యెనక్కి మళ్ళి రెండు చేతులతో నేలమీద దుమ్మును తీసి నెత్తి మీద పోసుకుంటూ “రాధాకృష్ణుల పెళ్ళంట ఊరూ వాడలో వింతంట. తారాచంద్రుల ప్రేమంట,మొగుడికేమో మటంటా” పాడుకుంటా వుంది.


ఏయ్, లోపలికి పో, ఎదురుగా నిలుచుండి గుడ్లిరిమి చూస్తున్న మొగుణ్ని వెనక్కి నెట్టి గుప్పిళ్ళ నిండా దుమ్ము తీసి అతని ముఖాన జల్లింది. కోపంతో వూగిపోయినతడు  చేతికందిన దుడ్డు కర్రతోనూ అదిరిగిపోయాక గడ్డిమోపు కట్టుకునే రబ్బరు తాడుతో ముందు యెనక చూడకుండా బాదుతుంటే వీధి లో నడుస్తున్న మనషులు జాలిగా చూసారు.  వీధిలో పోతున్న ఆ మనిషి కూడా పాతేసిన గుంజలా నిలబడి మరీ చూసాడు. భూదేవమ్మ వచ్చి కొడుక్కి అడ్డుపడకపోతే ఘోరం జరిగిపోయి వుండేది. మీనమ్మ శవమై పడి వుండేది.



నెత్తరోడుతున్న గాయాలను దుమ్ము నిండిన తలను కడుగుతూ “పక్క పాపిట తీసిందని పక్కలిరగ తన్నినాడు పరాయి మగోడిని చూస్తే వూరుకుంటాడా”  లోపలిమాటను యెల్లగక్కింది. కోడలి వీపు పై వాతలకు వెన్న రాస్తూ.. కాలంనాటి ముచ్చటొకటి చెప్పుకొచ్చింది.


నా చిన్నప్పుడు మా వూళ్ళో ఇంద్రమ్మ అనే ఆమె సంవత్సరానికి వొకసారి శ్రావణ మాసంలో రాధా కళ్యాణం చేసేది. పొన్నచెట్టు కింద రాధ బొమ్మ ను కృష్ణుడి బొమ్మను నిలబెట్టి అచ్చం బృందావనాన్ని సృష్టించేది. ఎంత బాగుండేది అనుకొన్నావ్.  ఆ కళ్యాణానికి పిల్లలే పేరంటాళ్ళు అతిధులు. ఒక్క మగ పురుగును కూడా రానిచ్చేది కాదు. రాధా కళ్యాణం చేస్తే  యిష్టపడిన మగాడి ప్రేమ దక్కుద్ది అంట అని చెప్పేది. అదేదో బొమ్మల పెళ్ళి అని, అరిసెముక్క లడ్డూలు పెడతారనే సంబరం తప్ప ఆ వయస్సులో ఆ మాటలు నాకేడ అర్ధమయ్యేయి! ఇప్పుడు ఆలోసిత్త్తావుంటే ఆ పెళ్ళిలో పరమాత్మమంతా బోధపడిద్ది. రాధాకృష్ణులు వయస్సుతో సంబంధంలేని ప్రేమికులు గందా. లోకమంతా వింతగా తప్పుగా చెప్పుకోకుండా వారిద్దర్ని భార్యాభర్తల్లాగా నిలబెట్టాలని ఇంద్రమ్మ లాంటి వాళ్ళు చేసే తతంగం కాబోలు అని వ్యాఖ్యానించింది. 


మర్నాటికల్లా శేషగిరి  ఇనుప గొలుసులు తెచ్చి  మీనమ్మ కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసాడు.బీగాలు కూడా వేసాడు.  పిచ్చిది అందరినీ కొడుతుంది అని అడిగినోళ్ళకు అడగనోళ్లకు అందరికీ ప్రచారం చేసాడు.


 గొలుసుల బరువుతో కాళ్ళీడుస్తూ ముంజేతులకు పుళ్ళు పడి వొంటి మీద బట్ట కూడా సరిజేసుకోలేక అన్నింటికి తనపై ఆధారపడిన కోడలిని చూసి  కడుపులో నుండి దుఃఖం పొర్లుకొచ్చింది. “అయ్యో కూతురా! నీ గ్రహచారం బాగుండలేదు కదే, ఎవురితోనూ యేలెత్తి చూపించుకు యెరగని నీకు యీ అవమానపు కాలం యెందుకు రావాల” అని ఆక్రోశపడింది.  కొడుకు యిల్లు దాటాకా బండరాయెత్తి గొలుసుల తాళం పగలగొట్టి సంకెళ్ళు విసిరి పారేసింది. 


దీపాల అమాస ముసురు తగ్గి తెల్లమేఘాల మధ్య చంద్రుడు చల్లగా వెలుగులుజిమ్మే కాలంలోకి వచ్చిపడ్డాడు.వేణు  పిల్లలకు దసరా సెలవులొచ్చాయనే వొంకతో భార్య పిల్లలను తీసుకుని అత్తగారింటికి పోయి నెల్నాళ్ళు అవుతున్నా అయిపు లేడు.చేను వెన్నుమీద వుంది  యెరువు మందు చల్లాలన్న సోయ కూడా లేదేమో సన్నాసికి  అనుకుంటూ వేణుకి ఫోన్ చేసింది.  మనుమడు మాట్టాడిన తీరుకి యెడా పెడా వాయించింది భూదేవమ్మ.. 


“మీ అయ్య కొంప ముఖమే సూడట్లేదు. పొయ్యి నెలయ్యింది నీ తోడబుట్టిందానికి కన్నతల్లి అన్న మమకారమే లేకపోయ్యె, రెండు పండగలు వొచ్చిపోయినా తిరిగి చూడకపొయ్యే.  నీ తమ్ముడు హాస్పిటల్ లో చూపిచ్చి మందులిప్పించి చేతులు దులిపేసుకుంటుండే,  మీలో ఎవ్వుర్రా అమ్మ ను బాగా చూసుకునేది. మనసు పెట్టి పట్టుమని తలో వొక నెలైనా దగ్గరుండి చూసుకుంటిరా. పైగా దాని చేతులకు కాళ్ళకు గొలుసులేస్తుంటే చూసి గమ్మున వూరుకుంటిరి. నవమాసాలు మోసి కనీ చనుబాలు తాపి మీ పియ్యెత్తి మీ ముక్కు తుడిసి మీ గుడ్డలుతికి మిమ్మలను అపురూపంగా పెంచిన అమ్మను యిట్టాగేనా చూసేది. పైగా అది యెవుడితోనో లేచిపోయింది అంటావుంటిరి. నెలాపదినాళ్ళు వాడితో వుండింది మీలో యెవురైనా చూసినారా? చెప్పుకునే వాళ్ళు యెవురైనా కళ్ళారా సూసేరా. పిచ్చిదై తిరుగుతుంటే చూసినాళ్ళు ఆచూకీ చెప్పినారు కాబట్టి పోయి తీసుకొచ్చినారు.. అదే గదా జరిగింది. దానికి పిచ్చి లేకపోతే డాక్టరు మందులెందుకిస్తారనే యింగితగానం వుండొద్దు మీకు.మళ్ళీ మీయందరూ చదువుకున్నోళ్ళంట, థూ!. ఎన్నాళ్ళు కొంప సేద్యం వొదిలిపెట్టి వుంటారో వుండండి. మీ అమ్మను పిచ్చి ఆసుపత్రిలో చేర్పిచ్చేది  యెందుకు అది పిచ్చి తగ్గి  సుబ్బరంగా తిరుగుతుంటే.. మీరు వస్తే రండి లేకుంటేలేదు”  కరాఖండిగా చెప్పింది.


ఫోన్ లో మాట్టాడిందంతా వింటానే వుంది మీనమ్మ.వెక్కి వెక్కి యేడ్చింది. మనసు బరువుదీరా యేడ్చింది. కల్మషం అంతా కరిగిపోయిందాకా యేడ్చింది. వాన ధారగా కురిసినంతగా యేడ్చింది. 


ఆ రోజూ మాములుగానే తెల్లవారింది అందరికీ. భూదేవమ్మ కు తప్ప. ఆమె ఆశలను వమ్ము చేసి బతుకునే తెల్లార్చుకుంది మీనమ్మ. మగతగా పడి వుండటానికిచ్చిన మందు మాత్రలన్నీ వొకేసారి వేసుకుని శాశ్వత నిద్రలోకి జారిపోయిందని దుప్పటి కింద ఖాళీ డబ్బా చెప్పింది. 


“అయ్యో కూతురా! యెంత పని చేసినావే. ఇష్టాన్ని బతికిచ్చుకోవాలంటే చావడం వొక్కటే మార్గం అనుకుంటివా, ఈ మసల్దానితో వొక్క మాటన్నా చెప్పివుంటే  యాభై యేళ్ళకు పైగా మొగుడు లేని ముండగానే వుండి బతుకంతా తీపిగా యిష్టంగా బతికిన బతుకు గురించి చెప్పి వుండేదాన్ని కదే.” నెత్తి బాదుకుంటూ యేడ్చింది.  కడచూపు చూడటానికి వొచ్చిన వారికి కూడా ఆ గోస మనసుకి తాకి నిలువెల్లా కదిలించింది.  


మేము మనుషులమే అంటూ ఆయిన వాళ్ళు కంటికి కడివెడులెక్క కురిసి తేలారు.  కాస్త ఆలస్యంగా జరగవలిసిన కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. గుండె పగిలేదాకా యేడ్చి శోష వచ్చి పడిపోయిన భూదేవమ్మ ను నడిమింట్లోకి చేర్చారు. తెప్పరిల్లాక చల్ల కలిపిన నీళ్ళు మాడు మీద చల్లుకుని మూడు ముంతలు నీరు పైనుండి గుమ్మరిచ్చుకుని వణుకుతున్న వొంటితో చీర చుట్టుకుని యింట్లోకి నడవకుండా.. సావిడి గదిలోకి నడిచింది. మీనమ్మతో పాటు మీనమ్మ గురుతులు మాయమైపోయి బోసిపోయిన గదిని చూసి మరింత బావురుమంది. గది నడిమ కూలబడింది. కోడలితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. పద్నాలుగేళ్ళ పిల్లప్పుడు కాపురానికి వచ్చింది.ముప్పై యేళ్ళు  తల్లో నాలుకలా మెలిగింది. ఎంత పని చేసేవే బిడ్డా. అని పొగిలి యేడ్చింది భూదేవమ్మ. 


 గది గోడలు తామిద్దరూ రాత్రి చెప్పుకున్న రహస్యాన్ని మళ్ళీ వినిపిస్తున్నట్టు అనిపించింది ఆమెకు.


************

“అత్తమ్మా.. నీకో మాట చెబుతా, నిజమే చెబుతా నమ్మాలి నువ్వు.”


“చెప్పవే తల్లీ.. నువ్వెప్పుడైనా అబద్దం చెప్పావా”  


“నాకు పిచ్చి లేదత్తమ్మా.”అంది అత్త కళ్ళలోకి సూటిగా చూస్తూ.


“నాకు ఆ ఇసయం ఇడమరిచి చెప్పాలంటే పిచ్చి మొహమా! మందులేసుకోకుండా దిబ్బగుంటలో పడేసినప్పుడే కనిపెట్టా.  నీ మనసు నీ ఆలోచన నా కన్నీ తెలుసు. నువ్వు మాత్రం యేం చేత్తావ్, శరీర ధర్మం చెప్పింది చేసావ్. నువ్వు తప్పు చేసానేమో అన్న ఆలోచనతో   నలిగిపోవడం పాత కాపరంలో యిమడలేకపోవడం నాకు తెలియదనుకున్నావా?  తప్పు ఉసిగొల్పిన వొంటిదా  కోరుకున్న మనసుదా అని మధనపడతన్నావ్, తప్పు రెండింటిదీ అయితే  నువ్వసలు పశ్చాత్తాప పడనేకూడదు మానసిక దుఃఖం అసలే కూడదు”


“నువ్వీ మాటలు అంటుంటే యెందుకో మా తాత బాగా గుర్తొస్తున్నాడు. నీ వొళ్ళో కాసేపు పడుకొంటా అత్తమ్మా.”


“రావే తల్లీ.నా వొళ్ళో రవ్వొంతసేపు వొడ్డిగిల్లు. మనస్సు నెమ్మళం చేసుకో”  ఓదార్పుగా తల నిమిరింది తను. ఆశ్రమంలో గురువులు చెప్పే మాటలు మననం చేసుకుని కోడలి మనసు నెమ్మదిపడేటట్టు నాలుగు మాటలు చెప్పింది కూడా. 


“శారీరక ధర్మం ప్రకారం నడవాలనుకునే వారికి తప్పొప్పులు ఆలోచనలు అంటకూడదు. తొర్రలో పడ్డ నిప్పు రవ్వంత అయినా చెట్టునే దహించేస్తుంది.  గతం గతః అనుకో, అప్పుడే నీకు మనఃశ్శాంతి” 


కళ్ళ నీళ్ళతో చీర చెంగులో ముఖం దాచుకుంటూ.. 

“నేను చచ్చిపోతే ఏడుస్తావా అత్తమ్మా” అంది


అప్పుడైనా తట్టలేదు..ఈ మంద మెదడుకి,  ఇది యేదో అఘాయిత్వం తలపెట్టిద్ది అని.. 


అప్పుడు తను అంది


“ఏం మాటలే అయ్యి.  జరిగిందేదో జరిగిపోయింది. నేనుండంత కాలమూ..  నీ మొగుడి తో సహా యే  ఈగను  నీ మీద వాలనివ్వను. రోజూ చేనుకు పోదాము. పనులు చేసుకుందాం. మంచి తిండి తిని మంచి గాలి పోసుకొని ఆరోగ్యంగా నిలబడాలి నువ్వు. నీ మొగుడు చూసినప్పుడు మాత్రం పిచ్చిదానిలా  నటిస్తావుండు చాలు. ఆడు నీ జోలికి రానే రాడు అంటూ తన మాటలకు తనే పగలబడి నవ్వింది. మీనమ్మ  నవ్వకుండా నిశ్శబ్దంగా కన్నీరు కార్చింది. కరువుదీరా యేడ్వనీ, ఏడుపు మనిషికి మంచి ఔషదం అన్నట్టు  గమ్మున వుండిపోయింది. ఆ కన్నీటికి అర్థం ఇదా. మరోమారు గుండె బద్దలైంది. 


***************

మాత్రల డబ్బాన్ని అట్టెందుకు అందనిచ్చావ్ అవ్వా అంటా మనవరాళ్ళిద్దరూ  కూతురు మూకుమ్మడిగా భూదేవమ్మ చుట్టూ జేరి ఏట కుక్కలు మాదిరి వాసన కనిపెడుతూ కూపీ లాగను మొదలెట్టారు. 


“పిచ్చిది, ఎప్పుడు యేమి చేత్తదో నేనట్టా చెప్పేదే అమ్మల్లారా?”


“ ఏమోలే! పొరపొచ్చాలు అందరికీ వుంటాయి. మానబోయే పుండుని కెలుక్కుని బాధపడటం యెందుకు? ఇకనైనా నాయన్ని కనిపెట్టుకుని వుండవ్వా” అంది జయ.


“ మీ అమ్మకు బిడ్డ రూపంలో వున్న శత్రువ్వి గదే నువ్వు” దవడ గట్టిగా బిగించి నిరసనగా చూసింది మనుమరాలి వైపు.  


 “నువ్వు మాత్రం ఆ పిచ్చితనంతో యెన్నాళ్ళు పడతావ్ లే,మరిన్ని బాధల్లేకుండా తొందరగానే ముగిచ్చుకుని పోయింది నిన్ను వొడ్డున పడేసింది” అంది కూతురు.


అందరినీ నిర్లిప్తంగా నిస్తేజంగా చూసి మాట పొదుపు జేసింది భూదేవమ్మ. మనస్సులో గట్టిగా అనుకుంది..


కోడలి రహస్యాన్ని  యేనాటికి బైటకు పొక్కనియ్యకూడదు.కష్టమో కామితమో  యేదైనా యెట్టాంటిదైనా బిడ్డను అక్కునజేర్చుకుని ఆదరించాలే తప్ప వీధిన యేసుకుంటామా? తెల్లని గుడ్డపై  వున్న మరకలను బయటేసుకుని తిరగమని యే తల్లి చెబుతుంది? రహస్యాలను బట్టబయలు చేయని గది  గోడల్లా యిపుడు   తనూ వొక  నిలువెత్తు రహస్యపు గోడ, అంతే!


**************సమాప్తం***************







   


23, ఆగస్టు 2023, బుధవారం

కాటుక మబ్బులు కథ వెనుక.. కథ

 మిత్రులందరినీ పలకరించడానికి… ఓ కథ తో వచ్చేసాను. 

ఆ కథ వెనుక  … కథ

 వనజ గారూ.. “ఔనా!” అనే కథ రాసి ఆశ్చర్యపరిచారు అని  ఒకరు, మీరు అలాంటి కథ రాయడం విభ్రాంతి కల్గిస్తుందని ఒకరు, కథ లో  ఒక పాత్ర లో మీరు స్పష్టంగా కన్పిస్తున్నారని ఒకరు, మీరు బ్రిలియంట్ రైటర్ అని ఒకరు.. ఇలా కథలతో అనుబంధం వున్న మిత్రులు వ్యాఖ్యానించారు. నిజానికి ఆ కథలోనే చెప్పేసాను. రచయితలు సెల్ఫ్ సెన్సారింగ్ చేసుకుంటూనే కథలు రాయాలని. అలా రాయకుండా దశాబ్దం పైన లోలోలల అణచిపెట్టిన  కథ “ఔనా!” అని. ఆ కథ చదివిన ఒక మిత్రురాలు “ఏమిటి!? ఔనా! మీనమ్మ ను అలా వొదిలేసారు, తర్వాత ఏం జరిగిందో రాయరా? “ అంటూ ప్రేరేపించారు. ఆమె.. ఓ ఛానల్ లో ఫ్యామిలీ కౌన్సిలర్. అలా ఆమె అడిగిన తీరు వెనుక చలం మైదానం రాజేశ్వరి గురించి చర్చ నడిచింది మా మధ్య. 


తర్వాత.. ఈ కథ “కాటుక మబ్బులు” వచ్చింది. ఇప్పుడు.. ఆ ఫ్యామిలీ కౌన్సిలర్ ఈ కథ చదువుతారు. ఆమె లా ఆలోచించగల “ఔనా!” పాఠకులు చాలా మందికి ఈ కథ శాంతినిస్తుంది. రెండు కథలూ రాసింది నేనే. మొదటి కథ లో నిజం అనిపించే కల్పన వుంది కల్పన అనిపించే నిజం వుంది. ఇక ఆ కథకు సీక్వెల్ అయిన ఈ కథ లో  సమాజం కోరుకునే జడ్జిమెంటు వుంది. రెండు కథలు రాసిన రచయిత లో (నా లో ) సమాజం అర్ధం చేసుకోలేని సహృదయత హృదయ వైశాల్యం కరుణ మెండుగా వుంది. అందరికీ తమలో తమకు తెలియని ఈ కోణం వుంటుంది. ప్రతి మనిషి లో పేరెంటల్ వ్యూ అనే మనసు  వొకటి వుంటుంది. అలాంటి మనసు ప్రతి రచయిత లో తప్పకుండా వుండాలి అంటాను నేను. సమాజం అర్దం చేసుకోవడంలో విఫలమైనా రచయితలు కొన్ని పాత్రలను పోలిన (కొందరు రచయితలు సృజింజించిన పాత్రలు) మనుషులను అర్ధం చేసుకోవడానికి పేరెంటల్ మనసు వుండాలి. అప్పుడే జీవితంలో తడి వుంటుంది అని.. నేను బలంగా విశ్వసిస్తాను. సమాజం అర్దం చేసుకోవడంలో విఫలమైన చోట రచయిత వుంటాడు వుండాలి కూడా. రచయిత కు కన్ను స్థానం లో హృదయం వుండాలి అని. 

“కాటుక మబ్బులు” కథ చదివి “భూదేవమ్మ” పాత్ర లో  మీరే కనబడ్డారు అని ఒక కథకురాలు అంది. అందుకే.. ఈ వివరణ చెప్పుకున్నాను రాసుకున్నాను. 

మీకూ చెబుదామనిపించింది. 

ఆఖరిగా ఒక మాట. మనిషి ని సమాజం అర్ధం చేసుకోవాల్సిన పని లేదు. వుంటే గింటే నోరు ఓ క్యాజువల్ చూపు తప్ప. కానీ మనుషులకు వారి కుటుంబం, నా అనుకునే వాళ్ళు వుంటారు చూడండి వారు తప్పకుండా లోతుగా అర్ధం చేసుకోవాలి. వారికి క్షమించగల్గే పెద్ద మనసు వుండాలి. అవి లేనప్పుడు గిల్ట్ మరణాలు వుంటాయి. ఇగో సాటిస్పై లు వుంటాయి. అవి చెప్పాలనే నా ప్రయత్నం .. ఈ “కాటుక మబ్బులు” కథ. 

వీలైతే.. “ఔనా” కథ కూడా చదవండి. కింద కామెంట్ రూపంలో లింక్ జతపరుస్తాను. 

ఈ కథ ను లింక్ ద్వారా చదవలేకపోతున్నామనే మిత్రుల కోసం.. 

“కాటుక మబ్బులు” కథ pdf జతపరిచాను.. కథ ను చదివి మీ అభిప్రాయం చెబుతారు కదూ.. 

- వనజ తాతినేని.

ఆదివారం ఆంధ్రజ్యోతి లో 20/08/2022 న ప్రచురితమైన కథ..