30, నవంబర్ 2022, బుధవారం

రంగు వెలిసిన కల

“బహుళ “ త్రైమాసిక అంతర్జాతీయ మహిళా పత్రిక లో నేను రాసిన కథ “రంగు వెలిసిన కల”.. చదవండి.

“రంగు వెలిసిన కల”

బయట శరత్ పూర్ణిమ వెన్నెల పగలబడి నవ్వుతుంది. ఆమె లోపల మసకచీకటిలో ముణగదీసుకుని పడుకుని వుంది. స్మృతి పథంలో చేదు గుర్తులు.  ఎవరో పిలుస్తున్నట్లు తలుపు చప్పుడు. అయిష్టంగా లేచి తలుపు తీసింది. ఎదురుగా స్నేహితురాలు. 


 “ఏమే, ఏ లోకంలో వున్నావ్ నువ్వు, అసలు భూలోకం పైన నివసిస్తున్నావా, పాతాళ లోకం లోనా!?ఎన్ని సందేశాలు పంపాను. ఒక్కదానికి సమాధానం లేదు. ఇవాళ నీకిష్టమైన రోజు కదా,అందుకే వచ్చానిలా” అంటూ ఆమెను చుట్టేసింది స్నేహితురాలు.ఆ చేతిలో ఓ కానుక. లిల్లీ పూల గుచ్చం. స్తబ్దత నిండిన గదికి మదికి చైతన్యం ఇచ్చేలా.


నవ్వి స్నేహితురాలి ఆలింగనం నుండి దూరంగా జరిగింది ఆమె.


“ఎన్నాళ్లిలా జఢత్వం లో మునిగివుంటావ్. జీవితం అంటే విద్యార్థులు బోధన లే కాదు స్పందన సంతోషం కూడా వుండాలి. ఏమంటావ్ మరి”


మౌనం వహించింది.

 

 “నువ్వింకా అతని ప్రేమలో వున్నావా”  ఆశ్చర్యంగా ప్రశ్నించింది.

 

“లేదు లేదు, తనువు మనసు రెండూ గాయపడ్డాయి, వైరాగ్యం వచ్చేసింది”


“ఏం జరిగిందసలు? తెలుసుకోవచ్చా నేను, నీకు  అభ్యంతరమైతే వద్దులే మరి” 

 చాలా సంవత్సరాలుగా  వచ్చినప్పుడల్లా అడుగుతుంది ఈ మాట. ఆమె ఎప్పుడూ మౌనం వహించేది. ఎందుకో ఈ సారి మెత్తబడింది. 


“తెలుసుకుని ఏం చేస్తావ్, గతం గతః అనడం మర్చిపోమని చెప్పడం తప్ప. ఈ రోజు నిన్ను నిరాశపరచను లే”అంటూ అనునయించే ఆత్మీయురాలి ముందు తన అంతరంగాన్ని విప్పి చెప్పడం మొదలెట్టింది ఆమె.


స్నేహితురాలు ముందు గది వైపు వెళ్లి ఒకసారి బయటకు చూపు సారించి ఓరగా తలుపు మూసి వచ్చింది.


************

పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నేను  యూనివర్సిటీ లో చేరిన కొద్దిరోజుల్లో అతన్ని చూసాను. పదేళ్లైనా యెంత గుర్తుందీ అంటే.. అది యీ వేళే జరిగినట్టు.


సహాధ్యాయిని తో కూడి నడుస్తున్నాను.


“పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో

గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో

ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో

ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో… 


గుంపు మధ్యలో నుండి చీల్చుకు వస్తున్న ప్రశ్న గేయం…నా అడుగుల వేగాన్ని మందగింపజేచింది. పిచ్చాపాటి మాటలు ఆగిపోయాయి. 


అసంకల్పితంగా గుంపు వైపు కాళ్లు కదిలాయి. కరతాళ ధ్వనులతో పాటు ఒన్స్ మోర్ ప్లీజ్! అభ్యర్ధనల్లో నా గొంతు కలిసింది. 


మునివేళ్లపై కాళ్ళు పైకెత్తి నా ముందున్న వాళ్ళ భుజాల పై నుంచి ఆ గాయకుడిని చూసాను. ఎడమ మోచేతి పై తలను ఆనించి విలాసంగా సిమెంట్ బెంచీ పై పడుకుని వున్నాడు. అతని కాళ్ళు బెంచీపై కూర్చున్న వేరొకరి ఒడిలో. మిత్రుడు కాబోలు. తల్లి బిడ్డ పాదాలను ప్రేమతో సవరించినట్లు సవరిస్తున్నాడు. ఎండ తగలకుండా పనామా కేప్ ను ముఖం పై పెట్టుకుని వున్న అతను కేప్ ను తల పైకి జరుపుకుని ఒకసారి చుట్టూరా చూసాడు.  వేగవంతంగా అందరిని చూసిన కళ్లు వెనుకనున్న నా వైపు చూసి నిలకడగా నిలిచి విశ్రాంతి తీసుకున్నాయి. ఆపై గొంతు సవరించుకుని.. గేయాన్ని అందుకున్నాడు. భావ వాహిని గాన వాహిని పరిసరాలను స్తంభింపజేసింది. పాట పూర్తవగానే అతను లేచి గుంపును చీల్చుకొని వడివడిగా నడిచాడు.అతని వెనుక యువకులు యువతులు పరుగుదీసి పోటీ పడి అతనికి అభినందనలు తెలుపుతున్నారు. నేను ఉన్నచోటనే నిలబడి చూస్తున్నాను.


అతనిది మోహన రూపం  మధుర గాత్రం.  నా కన్నె హృదయాన్ని తెరవబోతున్న  తాళం చెవిలా ఉన్నాడతను. నిత్యం పాట కోసమో అతని కోసమో వెతుక్కొంటూనే వున్నాను. నెలలు గడుస్తూ వున్నాయి. అతను కూడా నన్ను చూస్తూనే వుండేవాడు. సూటిగా కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ కలవరం కల్గించేవాడు.  యూనివర్సిటీ ప్రాంగణంలో వొంటరిగా తిరిగే స్త్రీ కాని పురుషుడు కాని వుండటం అరుదుగా కనబడే దృశ్యం.చదువులు పెరిగినట్టు నవీన సంస్కృతి అలవడింది కదా! అలాంటిచోట నేను వొంటరిగా వుండటం చూపరులకు వింత. వారికి తెలియదు అతని ఊహల తోడుగా  నేను జంటగా వున్నానని, ఎద నిండా మథనం జరుగుతూనే వుందని. నోరు విప్పి మాట్లాడనన్నమాటే కానీ రాసుకునే కవిత్వం నిండా అతనితో మాటలే,అతని కథలే.


  అతను పాడుతున్నప్పుడు ఉపన్యసిస్తున్నప్పుడు మగ నెమలి పురి విప్పి ప్రదర్శన చేస్తున్నట్లుగా  ఆడ నెమళ్ళు మగ నెమలి చుట్టూ  ప్రదక్షిణ చేస్తున్నట్లుగా అనేకమంది స్త్రీలు అతన్ని చుట్టుముట్టి వుండేవారు. అతను నాకు కాకుండా పోతాడేమోనని బెంగ నన్ను వెంటాడేది. అదేమిటో…అతన్ని చూస్తూనే వశం తప్పేది మనసు. 


“నా హృదయం నా మనసు నా శరీరం అన్నీ నువ్వే. నా ప్రేమ మాత్రమే కాదు నువ్వు నా జీవితం” అనుకుంటూ లోలోపల పలవరించేదాన్ని. గొంతు దాటి బయటకు రాని భావావేశమేదో మూగ బాధై  గుండెను మెలిపెడుతూనే వుండేది. ఏ క్షణాన అతన్ని కలగన్నానో ఆ క్షణం నుండి నా మనసు మనసులో లేదు. అతని దొంగ చూపులు కూడా నాతో దాగుడుమూత లాడినట్లు  నను వెంటబడి తరుముతున్నట్టే వుండేవి.


నా తలపు వలపు గమనించిన  సహాధ్యాయి నన్ను హెచ్చరిస్తూ వుండేది. మనలా అతను చదువు కోసమే ఇక్కడికి రాలేదు అతనికి సంఘాల తోను ఉద్యమాలతో సంబంధం వుంది. వారిదంతా వేరొక ప్రపంచం. మనం వారితో కలవలేం. కలిసి మనలేం. ముందుకెళ్ళకు” అంది. అవన్నీ నాకభ్యంతరంగా తోచలేదు.వీలైతే అతని మార్గంలోకే నేను వెళతాను. లేదా అతని బిడ్డలకు తల్లినై అతని ఆశయాలతో పెంచుతాను అనుకున్నాను మనసులో. చూపుల సంభాషణల తోనే ఆ సంవత్సరమంతా అలా గడిచిపోయింది. 


సంవత్సరాంతర సెలవులు. ఇంటికి వెళ్ళాలి.రెండు మాసాలు అతన్ని చూడకుండా వుండగల్గడం అసాధ్యం. ప్రాణాన్ని వదిలేసి పోగలనా!?


అతను నదికి ఆవలి వొడ్డునున్న నగరంలో స్నేహితులతో కలసి వుంటున్నాడని లోకల్ రైలు లో ప్రయాణించి యూనివర్సిటీకి చేరుకొంటాడని తెలుసుకున్నాను. అతన్ని కలిసి నా మనస్సు విప్పి చెప్పాలని ఆ  నగరానికి వెళ్ళాను. అతని స్నేహితునితో  కబురు పంపాను.రాలేదతను. పరిచయస్తులు యిచ్చిన సమాచారంతో అతను తిరిగే తావులన్నీ వెతికాను.ప్రయాస వృధా అయింది. పగటి కాలమంతా ఓపికగా నది తీరంలో కూర్చున్నాను. రాత్రి సమయం అవుతున్నా అతను కనబడకపోవడంతో నిరాశగా హాస్టల్ గదికి చేరుకున్నాను. 


 వారం రోజుల తర్వాత  యూనివర్సిటీ లో ఒంటరిగా కనిపించాడు. అతన్ని సమీపించాను. ఎన్నో చెప్పాలనుకున్న నేను ఒక్కసారిగా మూగదాన్ని అయిపోయాను.ఎట్టకేలకు నోరు పెగల్చుకుని “అలా షికారు కి వెళదామా మీ నగరానికి. నది వొడ్డు చాలా బాగుంది” అని అడిగాను.  “పని వుంది. బేనర్ లు తయారు చేయాలి, కరపత్రాలు

వేయాలి” అన్నాడు.


బిడియంగా అతని పక్కనే కూర్చుని చేతి వేళ్ళు చూసుకుంటూ నేను ప్రేమిస్తున్నాననే సంగతిని చెప్పాను. సమాధానంగా  సన్న నవ్వు నవ్వాడతను.సిగ్గు పడి లేచి వచ్చేసాను.


*********

 ఆ నగరానికి ఈ నగరానికి  మధ్య కొండలను కలుపుతూ వంతెన. కింద పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న నది. అవిశ్రాంతంగా తిరిగే వాహనాలు. నడకదారిలో చేతిలో చెయ్యేసుకొని తిరుగుతున్న యువ జంటలు. వారిని చూస్తూ తమ జీవితాల్లో అలాంటి కాలం  కరిగిపోయిందని భారంగా నిట్టూర్చే చిన్నపిల్లల తల్లిదండ్రులు. సాయంత్రపు నడక కోసం వచ్చి కుర్ర జంటల చిలిపి చేష్టలను ముద్దు ముచ్చట్లను చూసి ముఖం చిటపడలాడించుకుంటూ వెరపు లేదని గొణుక్కొంటూ తిరుగుతున్న వృద్దులు. ఎవరి పనుల్లో వారుండగా తన పనిలో తామున్న నీటిలోని కొంగలు.  ఇవన్నీ చూస్తూ నేను.  


అక్కడ నేను వుండటానికి కారణం వుంది. అతను కలుద్దాం అన్నాడు. ఎగిరి గంతేసింది హృదయం.ఉత్సాహం పొంగిపొర్లుతుంది.. పాట పెదాలపై తన్నుకొస్తుంది.ఇష్టమైన పాట “తనన తననన తనన తననన

తనన తననన తానన తనననానా..” హమ్ చేస్తూనే వున్నాను.


 ఆత్రం భూమి మీద నిలవనివ్వడం లేదు. చెప్పిన సమయానికన్నా ముందే అక్కడికి చేరుకున్నాను.వంతెన ఆ చివర నుండి ఈ చివరి వరకూ చూపులతో జల్లెడ వేస్తున్నా. చెప్పిన సమయం దాటిపోయింది. అతనొస్తున్న జాడ కనబడలేదు. వస్తాడో రాడో నన్న అనుమానం పొడజూపింది. ప్రకృతిని పరిశీలిస్తూ కూర్చున్నాను.అంతకన్నా చేయగల్గింది ఏముంది గనుక?.


నది మధ్యలో చీలిన  ఒక పాయ వెంబడి అక్కడక్కడ పెరిగిన రెల్లు పొదలు. దట్టంగా పూసిన రెల్లుపూలను చూస్తుంటే నదిలో ఉవ్వెత్తున లేచిన సముద్ర  కెరటాల్లా గోచరించాయి.  ఆ రెల్లు పూలకు కిరీటం పెట్టినట్లుగా మెరుస్తున్న సాయంకాల సూర్య కిరణాలు. ఓహ్. ఎలాంటి అద్భుత దృశ్యాలకు ఆనవాలం ఈ నదీతీరం!! ఇలాంటి అద్భుతమైన దృశ్యాన్ని అతనితో కలసి పంచుకోలేనందుకు చింతించాను. ఎంతకీ రాడేమిటి విసుక్కుంది మనసు.నారింజ రంగులో వున్న సూర్యుడు ఎర్రని రంగులోకి మారి కొండల మధ్య అదృశ్యమవ్వకముందే మరో దిక్కున చంద్రోదయం. లోన హర్ష రాగ నాదం బయటేమో వెన్నెల ధారాపాతం. నది నీటిలో అలల పడవపై తేలి ఆడుతున్న చంద్రుడు. నది ఒడ్డున వరుసగా పెంచిన పున్నాగ చెట్లు. పూచిన పూలలో వీచే గాలిలో సుమధర పరిమళం.అతని గురించిన ఊహలతో తనువంతా అదో మైకం.


ఎట్టకేలకూ గంట నిరీక్షణ తర్వాత అతనొచ్చాడు. దుమ్ము కొట్టుకుపోయిన శరీరం చిరిగిన బట్టలు. అలసిన కళ్ళలో ఎర్రని జీరలు.  చాలా ఆలస్యం అయినట్లుంది కదా అంటూ చేయందుకున్నాడు. ఆ మునివేళ్ళ స్పర్శకి ఒళ్ళు ఝల్లుమంది. 


“అలా నడుస్తూ మాట్లాడుకుందాం పద” అన్నాను చొరవజేసి. 


ఈ పున్నమి వెన్నెల రేయంతా అతని చేతిలో చెయ్యేసుకుని తిరుగుతూ చంద్రుడికి వీడ్కోలు పలకాలని ఆశగా  వుంది. అతనవేమి పట్టనట్లుగా నా చేతిని వొదిలేసి నాలుగడుగుల దూరంలో నాకు అందకుండా ఈలపాట పాడుకుంటూ వెళ్తున్నాడు. అతని వేగాన్ని అందుకోవడానికి నేను అమిత ప్రయాస పడాల్సి వచ్చింది. ఇంత ఆహ్లాదకర వాతావరణంలో ప్రేమికులు ఇలాగేనా మసలడం!? నిస్పృహ కలిగింది. 


పున్నాగ పూల పరిమళం. చుట్టూ పరికించి చూసాను. దూరంగా పచ్చని పచ్చికపై ఒత్తుగా రాలిన పున్నాగపూలు. సంభ్రమంగా అటువైపు నడిచి కొన్ని పూలను యేరుకున్నాను. అతను నన్ను చూస్తూ   పక్కనున్న ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు యెంతకీ తెగడం లేదు. ఓ బెంచి బల్లపై కూర్చుని పున్నాగ పూలను జడలా అల్లుతూ కూర్చున్నాను. ఆ బెంచీ పైనే కూర్చుని వీలైతే అతని హృదయానికి దగ్గరగా తలవాల్చి అతని పాటలో లీనమైపోవాలి అని మధురోహలు చేసాను. ఎంతకీ అతని సంభాషణ తెగేటట్టు లేదు. 


 లేచి వెళ్ళి మాలలమ్ముతున్న పూలమ్మి దగ్గర ఆగి  ఒక్కటంటే ఒక్క గులాబీ పువ్వు ను అదీ ఎర్ర గులాబీ ని కొన్నాను. చేతినిండా లిల్లీ పూల గుచ్ఛాలను కొన్నాను.అడిగి మరీ  గుండ్రంగా బంతి లాంటి లిల్లీ పూల చెండును కట్టించుకొన్నాను. అప్పుడొచ్చాడతను. దగ్గరకొచ్చి విసుగ్గా ముఖం చిట్లించి “ఇవి యిప్పుడు అంత అవసరమా? “అన్నాడు. 


పున్నాగ పూలన్నా లిల్లీ పూలన్నా నాకు చాలా యిష్టం. అవి రెండూ అక్కచెల్లెళ్లేమో, ఎంత సుమధుర పరిమళం అనీ .. అంటూ గులాబీని అతనికి ఇచ్చి “ఐ లవ్యూ” అన్నాను. 


అతను నవ్వి.. “నా గది ఇక్కడకు దగ్గరే. అదిగో లైబ్రరీ ప్రక్కన కనబడుతూ వుందే అదే! వెళ్దాం పద” అన్నాడు.

 

అతని పక్కనే నడుస్తూ.. అశువుగా కవిత్వం వినిపించాను. 


“వెలుగు నీడల త్రోవ ప్రక్కన నిలబడి రేయింబవళ్ళ క్రీడని చూస్తున్నాడు చంద్రుడు 

మంచు దుప్పటి కప్పుకున్న ధరణిపై చందనాలు చల్లిపోవగా వచ్చాడు చంద్రుడు 

తాంబూలంతో పండిన పెదవులతో  ఎవరో ముద్దాడినట్లు ఉన్నాడు చంద్రుడు 

మూసిన తలుపులని తడుతూ ఇల్లిల్లూ తిరుగుతూ పెత్తనాలు చేస్తున్నాడు చంద్రుడు

పడతి ప్రేమలో  తడిసి విరహ వేదన చెంది ఆ చెలిని కూడ మబ్బు చాటుకేగెను చంద్రుడు”...


పూర్తి చేసి అతని చేతిని ముద్దాడుతూ.. నువ్వు నా చంద్రుడివి అన్నాను.


కొంటెగా కనుగీటుతూ.. భుజంపై చెయ్యేసాడు.నా సగము మేని తానైనట్టు పరవశం. 


అతను నా పక్కన నడుస్తూనే ఎదురుపడే  అమ్మాయిలను పరీక్షగా చూస్తున్నాడు. పార్క్ లో వొంటరిగా వున్న  ఒక స్త్రీ ని ఆగి మరీ చూస్తున్నాడు. ఆ యువతి కూర్చున్న భంగిమ వస్త్రధారణ తేడాగా వుంది. అతను వెనక్కి మళ్లి  ఆమెతో మాట కలిపి వీడుతున్నప్పుడు వెకిలిగా ఒక అశ్లీల మాటను విసిరాడు. 

 

 “వారు ఎవరైనా ఎలాంటి వారైనా కానీయ్ , స్త్రీల గురించి అలా మాట్లాడితే అసహ్యంగా వుంది, నాకు నచ్చలేదు” అన్నాను కోపంగా. 


“ఇందులో తప్పేముంది. నా ఉద్రేకాన్ని రెచ్చగొట్టే ఏ స్త్రీని వొదులుకోకూడదు అన్నది నా సిద్ధాంతం. రేపు చూడాలి దీని సంగతి” అన్నాడు ఆ స్త్రీని ఉద్దేశించి. 


ఆ మాటతో అతని స్వభావం పూర్తిగా అవగతమైనట్లైంది నాకు.


 “చాలామంది స్త్రీలతో సంబంధం వుందా నీకు” 


“ ఉంటే మాత్రం నీకెందుకు అభ్యంతరం”


“కనీసం నా  ఈ ప్రశ్నకైనా ఆకు కు అందకుండా పోక కు కందకుండా సమాధానం ఇవ్వొచ్చుగా”


నా ప్రశ్నకు సమాధానమివ్వకుండా..  “ఆర్ యూ వర్జిన్” కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగాడతను. సమాధానం చెప్పేలోగానే  అతని పెదాలపై వెకిలి నవ్వు వెటకారమైన మాటొకటి నా చెవిని తాకింది.  


 “అవును” అని చెప్పాలనుకున్న మాట ఆగిపోయింది. ఉండేలు దెబ్బ కి విలవిలలాడి  కుప్పకూలిన పక్షిలా మనసు. భుజంపై చేయి తోసేసి వడివడిగా  పార్క్  బయటకు నడిచాను. రైలు స్టేషన్ వైపు  నడుస్తూ ఆలోచించాను. 


అతని నడకలో కానీ నడతలో కానీ పట్నవాసపు పట్టభద్రుడి సంస్కారం లవలేశము కూడా గోచరించడం లేదు. పల్లెటూళ్ళో పుట్టి పెరిగిన నాకు ఆ అశ్లీల మాటలు వినడం ఎంత అలవాటైనా సరే అవే మాటలు ఇంకో భాషలో  అతని నోట  వినడం అసహ్యంగా వుంది. పుస్తకం ముఖ చిత్రం అందంగా వున్నంత మాత్రాన లోపల వున్నదంతా చదివించదగ్గ విషయం కాదేమో అన్న ఆలోచన నాకెందుకు కల్గలేదో! విచారించాను. ఇదంతా అతని గురించి నేను ఉన్నతంగా ఊహించుకోవడం వల్ల వచ్చిన చిక్కు. కానీ అతని లో వున్నది వున్నట్టుగా స్వీకరించడం మానేస్తే అతను నాకు దక్కకుండా పోతాడు. అలా జరగడానికి వీల్లేదంతే! ఎంతగా ప్రేమించానతన్ని నేను!!! జార విడుచుకుంటానా!? బంధమై అల్లుకోవడమే నా లక్ష్యం.


అతనిని మనసారా వాంఛించి మోహించి రాబోయే మధుర క్షణాలను పదే పదే ఊహించుకుంటూ నిత్యం మురిసిపోవడం కలలు కనడం కంటే ఆ క్షణాలను అనుభవిస్తే పోలా! ఇప్పుడే అనుభవిస్తే పోలా! అనవసరపు అలకలు ఈ మాట పట్టింపులు ఎందుకు! పైగా  నాకెంతో ఇష్టమైన శరత్ పూర్ణిమ నాటి  ఆహ్లాదకర రేయిని చెడగొట్టుకోవడం ఎందుకు?  క్షణంలో మనసు మార్చుకుని వెనుదిరిగి అతనున్న యింటి వైపు దారి తీసాను.


అపరిశుభ్రంగా వున్న వీధి గుమ్మంలో నుండి అడుగులు వేస్తూ మేడ యెక్కుతూ చుట్టూ చూసాను. మనుష్య సంచారం పెద్దగా లేని వీధి. పాత కాలపు మిద్దె అది.ఇరుకుగా దుమ్ము పేరుకున్న మెట్లు. నేను వెళ్లే సరికి అతను పుస్తకాలు ముందు కూర్చుని వున్నాడు. నన్ను చూసి.. “వచ్చావా, రా, మరి ఇందాక అంత బెట్టుపోవడం యెందుకో” అన్నాడు ఎగతాళిగా. 


గాలి వెలుతురు లేని ఇరుకు గది అది. రంగు మారిన చిత్రాలు బూజు పట్టి కళావిహీనంగా వున్నాయి.  చేగువేరా లెనిన్ ఇంకా నాకు తెలియని యెవరెవరివో చిత్రాలతో పాటు చలనచిత్ర నాయికలు. అరవై కేండిల్ బల్బు వెలుగు చిమ్ముతున్న మసక వెలుతురులో  కనబడిన దృశ్యం. చెల్లాచెదురుగా పడి వున్న పుస్తకాలు, విడిచి విసిరి పారేసిన బట్టలు, ఖాళీ మద్యం సీసాలు తిని పడేసిన ఆహార పొట్లాలు. ఆ అపరిశుభ్ర వాతావరణం చూసి జుగుప్స కలిగింది. ఒక్క క్షణం అడుగు వెనక్కి వేసాను. ఈ గదిలో మానవ మాత్రులేనా నివసించేది అని సందేహపడ్డాను. మళ్ళీ అంతలోనే బ్రహ్మచారుల నిరుద్యోగుల ఉమ్మడి వసతి గృహం ఎలా వుంటుందిలే యిలా కాకుండా అని మనసుకి సర్ది చెప్పుకున్నాను. 


అతనికి తనపై తనకు శ్రద్ధ లేదన్న ఆరోపణలో నుండి జాలి పుట్టుకొచ్చింది. శ్రద్దగా చూసుకోవడానికి నేనో లేదా నా లాంటి వారు ఎవరో వొకరు ముందు ముందు రాకపోరులే అనుకున్నాను. అయినా ఈ మనిషికి పరిసరాలను శుభ్రంగా వుంచుకోవడంలోనే ఆరోగ్యం వుంటుందన్న సృహ కూడా లేదేమిటో! పోనీ చేయదగ్గ ముఖ్యమైన పనులు వున్నట్లు వుండడు. నలుగురిని వెంటేసుకొని రికామీ గా తిరగడం తప్ప. తన ఆరోగ్యంపై తన దేహం పై శ్రద్ధ లేనివాడు గొప్ప గొప్ప ఆశయాల కోసం యితరుల జీవితాల్లో వెలుగు నింపడం కోసం యే మాత్రం పనిచేయగలడు? అలా అని అతనికున్న అంకిత భావాన్ని శంకించలేను అనుకుంటూ ద్వంద రీతిలో పొంతనలేని ఆలోచనలెన్నో చేసాను.


నేనిప్పుడే వస్తానంటూ అతను బయటకు వెళుతూ “కంగారు పడకు” అన్నాడు. ప్రశ్నార్ధకంగా చూసాను. 


“నా రూమ్మేట్స్ ఎవరైనా రావొచ్చు. అమ్మాయిలను తీసుకురావడమే నీ పనా అని కోప్పడతారు. నేను గదికి తాళం పెట్టి వెనుక వైపు నుండి వస్తాను “ 


వెనుక వైపు తలుపున్న సంగతి నేను గమనించనే లేదే అనుకుంటూ.. కిటికీ దగ్గరకు నడిచాను. బయట కనబడినంత మేరా పచ్చగా ఆహ్లాదంగా వుంది.  ఆ పచ్చదనంపై వెన్నెల విరజిమ్ముతూ పలుచగా పొగమంచు పరచుకుంటూ వుంది.ఆ వెనుక నదీతీరం.  ఈ మురికి గది కన్నా బయట యెంతో హాయిగా వుంది. అతను వచ్చాక ఆ సంగతి చెప్పి ఆరుబయలు విహారానికి వెళితే బాగుండును అనుకుంటూ చేతిలోని లిల్లీ పూల గుఛ్చాన్ని నీళ్లు పోసిన గ్లాసులో అమర్చి లైట్ ఆపేసి  కిటికీ దగ్గరకు నడిచాను. వెన్నెలతో పాటు బయట విసిరి పారేసిన చెత్తను చూసాను. మొదట మాములుగా తర్వాత పరీక్షగా. చూస్తున్నవి తొడుగులు అని అర్ధమయ్యాక ఎందుకో తేలికగా తీసుకోలేకపోయాను. మనసు ముడుచుకుంది. ఈ కాలంలోనూ అతనికి కూడా ఇదంతా సాధారణమైన విషయం కదా! ఎందుకంత ఆలోచన!? అని బుద్ధి మందలించింది. 


అతను వెనుక వైపు నుండి లోపలికి వచ్చాడు.తలుపు గడియ వేసి రావడం రావడం జబ్బను పట్టుకుని మూలనున్న చాప వైపు లాక్కుని పోయాడు. నివ్వెరపోయాను, ఏమిటలా జంతువులా! అవే నయమేమో ! 


అతని చర్యను మనస్సు తిరస్కరిస్తుంది.ఒక్కోసారి చేతి వ్రేళ్ళ కొనల మృదు స్పర్శే మనోహరం. మరోసారి బాహు బంధమే దుర్భరం. అవును,అడిగి అడగని  మధ్య వ్యత్యాసం అనంతం కదా!

ఉత్తర క్షణం అతని నుండి విడిపించుకుని వెళ్లిపోతే!  అంతకన్నా అపహాస్యం ఇంకోటి వుందా!?  ఆలోచిస్తున్నాను. ఆ క్షణాన ఆ వైరుధ్యాల వల్మీకంలో నుండి కోరిక బుస్స్ న పైకి లేచిందేమో! అతని నడుమును చుట్టేసిన నా చేతులు. 


ఇద్దరం లేచి బట్టలు ధరించాక “పద పద..త్వరగా నిన్ను బయటకు పంపాలి. వాళ్లొస్తే గదిని సానికొంప చేస్తున్నానని నన్ను గిరాటు వేస్తారు”. అంటూ భుజం పట్టుకొని ముందుకు తోసాడు.వెంటనే చేయి పట్టుకుని వెనుక తలుపు గుండా బయటకు తీసుకొచ్చి కొన్ని అడుగులు వేసిన తర్వాత యేదో మర్చిపోయినట్టు లోపలికి వెళ్లాడు. తిరిగొచ్చి నేను గదిలో వుంచిన లిల్లీ పూల గుచ్ఛాన్ని రోడ్డు పక్కన విసిరేసాడు. నా చేతిలో వొక వస్తువుని వుంచి “  ఈ సారి వచ్చేటప్పుడు ఇవేమి పెట్టుకొని రాకు,గాజులు కూడా” అన్నాడు. గుప్పిట తెరిచి చూస్తే అది నా లోలాకులలో ఒకటి.  “ఇక్కడి నుండి త్వరగా వెళ్ళు” తరిమినట్లు అనేసి వెనక్కి మళ్లాడు.


మనసు పడిన వాడితో  సమాగమానికి మధురోహలతో చెంగు చెంగున గెంతిన మనసు ఒక్కసారిగా టప్ మని గాలి తీసిన బుడగలా అయిపోయింది. కొసరి కొసరి తీపి ముద్దులతో మృదువుగా హృదయ రంజకంగా మధురంగా సాగాల్సిన క్రీడ, యాంత్రికంగా ఆత్రంగా అనుభూతి రహితంగా నా శరీరాన్ని ఆక్రమించుకోవడాన్ని మనసు జీర్ణం చేసుకోలేకపోతుంది. అంతే కాదు నన్ను దాహం తీరిన తర్వాత గ్లాసును పక్కన పెట్టినట్లు పెట్టేయడంతో దిమ్మెరపోయాను. శృంగారంలో రకరకాల ఉద్దీపనలు వుంటాయని చదివాను.ఏవేవో ఊహించాను. అవేమి లేకుండా ఏక పక్షంగా  భౌతిక సుఖం జుర్రుకోవడం రేప్ తో సమానం. కాకపోతే ఆ కలయిక నా అంగీకారంతో జరిగింది కాబట్టి అంతటి మాట నేను అనలేను. ఏ మాత్రం రసావిష్కరణ లేని నా తొలి సమాగం అది.


చెబుతున్న ఆమె కంఠం వణికింది. 


ప్రతి స్త్రీ యవ్వన ప్రవేశకాలం నుండి తమ తొలి సమాగం కోసం ఎన్నో కలలు కంటారు. కానీ నా దురదృష్టం ఏమిటంటే…ఎవరిని కల కన్నానో అతనే నిరాశను మిగిల్చాడు. అతను వీధిలో నన్ను వదిలేసి వెళ్లాక  శూన్యం నిండిన మనసుతో రైలు స్టేషన్ చేరుకొన్నా. శరత్ పౌర్ణమి వెన్నెల నగరంపై దేదీప్యమానంగా వెలుగుతుంది. నా లోపలేదో చీకటి కుమ్మరించినట్లు వుంది. తెలిమబ్బు తునకలు వినీలాకాశంలో వొక్కొక్కటి తేలిపోతున్నాయి.నా చుట్టూరా గాఢంగా అలముకున్న లిల్లీ పూల వాసన. అప్పుడు గుర్తొచ్చింది ఎదపై దాచుకొన్న లిల్లీ పూల చెండు. నలగని ఆ చెండు ని  చూసి కళ్లు చెమర్చాయి. తేలిపోతున్న కాళ్ళతో మనసు నిండా దుఃఖంతో హాస్టల్ కి  చేరుకున్నాను.అతన్ని మనసారా ప్రేమించాను కాబట్టే నాకు ఈ ఆశాభంగమా,నేనతని ప్రేమకు అర్హురాలిని కాదా!? 


మాటలు ఎంత  శక్తివంతమైనవి. ఎదుటివారిని గాయపరచటానికి ఎన్నడూ ఉపయోగించకూడదని అతనికి తెలియదా! పైగా మాటల ద్వారానే మనుషులను సంఘటితం చేసి వ్యవస్థ పై పోరాడాలనే సంగతి అతను మరిచాడా?మిగిలిన రాత్రంతా అతని గురించి ఆలోచిస్తూనే వున్నా. 


అతనిది భౌతిక వాదమే తప్ప నైతిక విలువలు కానీ ఆధ్యాత్మిక విలువలు లేని స్వేఛ్ఛా జీవనం.  నాలో వున్న భావుకత నా హృదయ దౌర్బల్యానికి చిహ్నం.అది అంటు రోగం కానందుకు అతనికి అది ఏ మాత్రం అంటనందుకూ నేను చింతించడం లేదు కానీ… అతనికి స్త్రీల స్నేహం పట్ల  ప్రేమల పట్ల నమ్మకం లేదు.  అతని హృదయంలో ఎవరికీ స్థానం లేదు. అనేకమంది స్త్రీల సాంగత్యాన్ని అతను కోరుకుంటాడు. అశ్లీల భాషలో సంభాషణ నెరపడం అతని అలవాటు. ఆ అశ్లీల భావాన్ని అతను ఆనందిస్తాడు. అది నేను ఎలా మనసుకు  తీసుకున్నానంటే తినే ముద్ద ముద్దకు పలుకురాయి తగిలినట్టు. అతని మనస్తత్వానికి సున్నితత్వం  ప్రేమ లాంటివి సౌకుమార్యాలు  పొసగవు. నేను వున్నది వున్నట్టు స్వీకరించలేను. కొన్ని నటనలు నాకసలు అతకవు. ప్రదర్శించినా అవి ఎంతో ఎబ్బెట్టుగా వుంటాయన్న సంగతి నాకు తెలుసు. కొన్నాళ్ళు నిశ్శబ్దంగా దూరంగా వుందాం అనుకొన్నాను.అది నా మధ్యతరగతి జడ్జి మనస్తత్వం కూడానూ. 


ఇంకా చెప్పాలంటే.. అతనికి రెండు గుణములు తక్కువ, తనకు తోచదు ఒకరు చెప్పినా వినడు. అతనిని వొదులుకోవాలా లేదా అన్న సందిగ్ధ దశలో  వుండగానే భగవంతుడు నాకొక మేలు చేసాడు. అతని వెకిలి స్వరూపం మొత్తాన్ని నాకు ఆ మర్నాడే బయలుపరిచాడు. నాకా సమయంలో “Man is the measure of all things” అని పైతాగరస్ కోట్ గుర్తుకు రావడం సమంజసమే!


యూనివర్సిటీ ప్రాంగణంలో .. అతను గుంపుతో ఎదురయ్యాడు. చాలా కాలం తర్వాత  నేనూ ఒంటరిగా లేను. నన్ను చూసిన అతని మిత్ర బృందం అతనితో సంభాషించడం విన్నాను.


“చిలక చిక్కిందా”


“ మరులు గొన్న చిలక రాకేమి చేస్తుంది,దానంతట అదే గదికి వచ్చి వాలింది”


“ అయితే రాత్రంతా నీకు పండగేనన్నమాట” వీపు వెనుక భళ్ళున నవ్వులు.


“ఆకారం పుష్టి నైవేద్యం నష్టి. మొత్తానికి అదొక చవిటి పర్ర” 


ఆ మాటలు వింటున్న నా హృదయానికి తీవ్ర అఘాతం తగిలినట్టైంది. అక్కడికక్కడ భూమి యెందుకు కృంగి పోలేదో అన్న అవమానం! శరీరం వణికింది. దవడలు పిడికిళ్లు గట్టిగా బిగుసుకున్నాయి.రైలింజన్ నుండి వెలువడ్డ పొగలా చెవుల నుండి వెచ్చని ఆవిర్లు. విసురుగా వెనక్కి వెళ్ళి బేగ్ ని అతని ముఖంపై విసిరి కొట్టి అసహ్యంగా చూసి ఖాండ్రించి ఉమ్మేసాను. అతను వెకిలిగా నవ్వి అసహ్యపు మాటనొకటి వదిలి వెళ్ళాడు. నాతో వున్న గుంపు నన్ను చూసి జాలిపడింది.అవమాన దుఃఖం నన్ను కమ్మేసింది.నేలన కూలబడిపోయాను.అది సుత యూనివర్సిటీ వొదిలేసే వరకూ అతని వైపు కన్నెత్తి చూడలేదు నేను. 

వీటన్నింటి మధ్య కోల్ఫోయిందేమిటో పొందినదేమిటో నాకై నాకు స్పష్టంగా తెలుసు.శరీరం నాది,హృదయం నాది, భావనలు కూడా నావే, బాధ కూడా ముమ్మాటికీ నాదే! 


ఇప్పుడు నాకు శరత్ పూర్ణిమ చల్లని వెన్నెలనూ  లిల్లీ పూల గాఢమైన పరిమళాన్ని ఆస్వాదించే మనసు లేదు.అదెప్పుడో ఆవిరై పోయింది.ఆ నాటి ప్రణయం రంగు వెలిసిన కల. మరలా కలలు కనే సాహసం కూడా చేయలేదు. 


భారంగా ముగించింది ఆమె.


*************

నిశ్శబ్దాన్ని బద్దలు చేసుకుని స్నేహితురాలి సోదరుడు లోనికి వచ్చాడు.


“మొదట నన్ను క్షమించాలి మీరు. కావాలని కాకపోయినా మీ సంభాషణను వినాల్సి వచ్చింది” అన్నాడు. 


ఆమె స్నేహితురాలి వైపు చురుగ్గా చూసింది. కావాలనే అతన్ని వెంటబెట్టుకొని వచ్చావు కదూ.. అన్నట్టు.

 

స్నేహితురాలు చెవి పట్టుకొని చూపి క్షమించమన్నట్టు చూసింది. 


“కనులుంది కలలు కనేందుకే కదండీ. రంగు వెలిసిన కల గురించి ఆలోచన వద్దు. ఇకపై మంచి నిర్ణయం తీసుకోండి” అని సోదరిని బయలుదేర తీసాడతను.


ఎవరితోనూ పంచుకోకూడదనుకున్న విషయం ఇలా బహిర్గతం అయినందుకు కొంత సిగ్గిల్లింది ఆమె. మళ్ళీ అంతలోనే పరాయి వ్యక్తులు ఎవరున్నారులే, ఒకరు ప్రియ నెచ్చెలి,మరొకరు నాతో జీవితాన్ని పంచుకోవాలని ఎదురుచూస్తున్న మనిషి.


*********

మరునాడు ఆమె యింటికి చేరుకొనే సరికి గుమ్మం ముందు.. రెండు  కుండీలు కనిపించాయి. ఒక దానిలో నాటడానికి పెరిగినంత  ఓ పున్నాగ పూల మొక్క, రెండవ దాంట్లో త్వరలో విరియటానికి సిద్ధంగా వున్న లిల్లీ పూల కుదురు. కుండీలను పక్కన పెడుతూ వాటి క్రింద వుంచిన కాగితాన్ని తీసి చూసింది.


అందులో… 


“నేనింత వరకూ ఏ స్త్రీ ని ప్రేమించలేదు. 

మీ పాత గాయాల  పచ్చిదనమే కాదు మచ్చ కూడా కూడా మాని పోయేంత వరకూ యెదురు చూస్తాను. నన్ను విశ్వసించి ప్రేమించగలరా!? రంగు వెలసిన కల స్థానంలో ఇంద్రధనుస్సు ని సృష్టిద్దాం మీరు వానై నేను యెండై” 


ఉద్విగ్నతకు లోనై గుమ్మం మెట్లపై కూర్చుని కనులు మూసుకుంది ఆమె. ఆనాటి రంగు వెలసిన కలను తుడిచేయగలనా నేను అనుకుంటూ. 


 ***************సమాప్తం************


Panteleimon Romanov రష్యన్ రచయిత. 1911 సంవత్సరం లో Without Cherry Blossom పేరుతో కథా సంపుటి వచ్చింది. ఆ సంపుటిలో టైటిల్ కథ  ప్రేరణతో).


24, నవంబర్ 2022, గురువారం

వాస్తవికత ఊహ పడుగు పేక ల కలనేత ఈ “ఊహ”

 ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటిలోని “ఊహల మడుగు” కథ కు సహ రచయిత కవి డా. కాళ్లకూరి శైలజ గారి వ్యాఖ్యానం. ధన్యవాదాలు శైలజ గారూ… 🙏💐

ఊహల మడుగు

--------------------

కథా రచన రచయిత కు ఒక సవాలు. పాఠకునికి  అనుభవం. తెలుగు భాషలో ఏడాదికి సుమారు లక్ష కథలు ముద్రణకు వస్తాయని ఒక అంచనా. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు వార్తలు, విశేషాలు, సంఘటనలు....ఇవన్నీ చెప్పే నోటి నుంచి వినే చెవికి వెళ్లే లోపు జరిగేదంతా కథన ప్రక్రియే అనిపిస్తుంది. అందరం కథకులమే! కానీ కథా రచయిత ఇంకొంచెం పరిశ్రమ చేస్తాడు.బుల్లితెర మీద, దిన -మాస పత్రిక లలో, వందలాది  కథల మైదానంలో పచ్చిక లా ఇబ్బడిముబ్బడిగా వస్తూ కొత్తదనం కోసం ఉవ్విళ్ళూరుతున్న రోజులివి. గమనిస్తే వీటిలో ఎలిమెంట్ ఆఫ్ సర్ ప్రైజ్ దిశగా ప్రయాణం జరుగుతోంది. పాఠకుల సంఖ్య కోసం,మార్కెట్ కోసం జరుగుతున్న ప్రక్రియలేమో అని ఒక సందేహం వస్తుంది కూడా.ప్రస్తుతం ఉన్న సాంకేతికత సహాయం తో  విశ్వసాహిత్యంలో ఏ మూల ఏ రచయిత ఏ కొత్త ప్రయోగం చేసినా దాన్ని అందరూ త్వరగా అంది పుచ్చుకోగలుగుతున్నారు. పైగా గ్లోబలైజేషన్ వలన భావోద్వేగాలలో కూడా సామ్యం పెరిగింది.  

                ఇవన్నీ ఇలా ఉండగా సమాజంలో ప్రతి వ్యక్తి జీవితం తన చుట్టూఉన్న వారితో చేరువయ్యే ఒక దగ్గరితనం వచ్చింది.దీనికి సోషల్ మీడియా ఒక కారణమని చెప్పాలి. ప్రతివారికి భావప్రకటన స్వేచ్ఛ, తమలాంటి అభిరుచులు, ఆశలు, స్థితిగతులున్న వారు ఇంకా  ఎవరున్నారో, వారిని  గురించి తెలుసుకోవడం సాధ్యపడుతోంది. కొన్ని ప్రత్యేకమైన జీవిత గాథలు  వెలికి వచ్చాయి.రచయితలు అట్లాంటి వారి మానసిక సంఘర్షణను కథగా మలచడం  మొదలుపెట్టారు.

          వనజ తాతినేని గారి  "ఊహల మడుగు" అనే కథ చదవగానే నేను ఒక విశిష్టమైన పఠనానుభూతిని పొందాను.కథనం, పాత్రచిత్రణ ,కథలోని పరిసరాలు,సంఘటనల అల్లిక---- ఇవన్నీ శిశిర ఋతువులో నెమ్మదిగా లోకాన్ని రోజురోజూ  అధికమౌతూ మంచు తెర ఆవరించినట్టు ,పాఠకుల మనస్సును కమ్ముకుంటాయి.

      కథ ఒక సారి కాదు రెండు మూడు సార్లు చదివించుకుంటుంది.మొదటి సారి దిగ్భ్రాంతి  తో కూడిన కన్ఫ్యూజన్ వస్తుంది.రెండవసారి వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి చదువుకుంటాం. 

      ఇక మూడోసారి రచయిత పక్కన నిలబడి బుద్దిగా,ఎరుకతో ప్రతి వాక్యాన్ని  చదువుతాం .అలా అని కథలో సంక్లిష్టత లేదు.నిజం చెప్పాలంటే ఇది కథ కాదు.యథార్థ జీవితంలో ఇందులోని కథానాయిక తో పాటు మనం కూడా నడుస్తూ ఉంటాం.

      కథానాయకురాలు పుట్టుకతో వచ్చే ఒక అవకారం తో పాటు, దివ్యాంగురాలు కావడం ఒకానొక జన్యుపరమైన డిఫెక్ట్, మరొక దురదృష్టకరమైన వైరస్ దాడి.

కారణాలు ఏవైనా ఫలితం అనుభవించేది మటుకు ఆ వ్యక్తి మాత్రమే కదా!

ప్రపంచంలో ఏ మూల చూసినా అటువంటి వారి పట్ల సహానుభూతి కన్నా,వారి నిత్య జీవన భారమే ఎక్కువ  శాతం సమస్యలకు  కారణమౌతుంది. దీనిని చాలా స్పష్టంగా ,సృజనాత్మకంగా 'డీల్" చేయడం రచయిత్రి యొక్క కథనంలో ఉన్న అభినివేశాన్ని తెలియజేస్తోంది.

                      'సర్రియలిజం' అంటే వాస్తవికత ,ఊహ పడుగు,పేక ల కలనేత గా ఉండడమని, మనందరికీ తెలుసు. 

కొంచెం వివరాల్లోకి వెళ్దాం.మనం ఏ మాటలు పైకి చెప్తామో వాటికి రెండు రెట్లు స్వగతంలో అనుకుంటాం.ఎలా ప్రవర్తిస్తామో దానికి మరెన్నో రెట్లు అంతరంగంలో తర్జనభర్జనలు పడతాం.చాలాసార్లు పర్యవసానాన్ని గురించి ఆలోచించి,మన ప్రవర్తనను మార్పు చేసుకుంటూ ఉంటాం.అలా చేయగలిగితే పరిణితి సాధించినట్టే . 

      ఈ కథలోని  కథానాయిక చేతన,

అంతశ్చేతన,ఉపచేతనల నడుమ ఊగిసలాడే భావ చిత్రాలను రచయిత్రి తర్కానికి లోబడి ఉంటూనే ఆశ్చర్యకరమైన విధానంలో వర్ణించారు.

           అన్ని విధాల ఆరోగ్యవంతులైన మనుషుల్లో భావోద్వేగాలను ఒక సరళరేఖలో  అమర్చినట్లయితే, దురహంకారం- ఆధిపత్య ధోరణి ఒకపక్క, ఆత్మన్యూనతా భావం- నిరసన వల్ల వచ్చే హింసాత్మక ధోరణి మరో పక్క ఉంటాయి.రచయిత్రి ఆ రెండో పక్కనున్న భావోద్వేగాలను స్పృశించడం ఈ కథలోని విశిష్టమైన అంశం.

                        ఈ తరహా కథలను విజయగాథలు గా చిత్రించే మోహం సర్వసాధారణం.చాలా సార్లు కథ ముప్పావు భాగం గడిచేసరికి కృషి ఫలితంగానో,అసంబద్ధంగానో, ఊహించని చోట నుంచి లభించే మంచితనం వల్లనో ఆ అభాగ్యులు కాస్తా భాగ్యవంతులైపోతారు.అంటే వారికి  డబ్బొస్తుందని కాదు; జీవితం లో ఏమి కోల్పోయారో వాటన్నింటినీ పొందినట్టు చూపిస్తారు.వారిని అవహేళన చేసిన వారంతా తల  దించుకుంటారు;ఒక్కోసారి సంపూర్ణ మానసిక పరివర్తన కూడా వచ్చేస్తుంది.

ఇది పాఠకుడికి, రచయితకు ఒక భద్రతా భావాన్ని ఇస్తుందేమో తప్ప , సత్యావిష్కరణ జరగదు.కృతకమైన సన్నివేశంగా మిగిలిపోతుంది.       అలాంటిది వనజ గారు కథా  శీర్షిక  "ఊహల మడుగు"అంటూ  హెచ్చరిస్తూ కథలోకి తీసుకెళతారు.

      వాస్తవికత,కల ఈ రెండూ కానిదే ఊహ. ఊహ మెలకువలో జరుగుతుంది.ఒక్కోసారి అది కల్పనామయ జగత్తుగా మారి, ఆ వ్యక్తిని అబద్ధపు జీవన విధానం వైపు మళ్ళించే ప్రమాదం కూడా ఉండవచ్చు.కథలో ఈ తప్పిదం జరగకుండా, వనజ గారు చాలా జాగ్రత్తగా వ్యవహరించారనిపించింది.

     ఊహను నాటకంలో,చలన చిత్రంలో అయితే చూపించడం సులభం.కాస్త blurred images

చూపటం వలన సాధ్యమవుతుంది.

               కథల్లో  ఊహకు ముందో వెనుకో, 'జరిగింది ఊహ' అని స్పష్టంగా తెలియజేయడం మనం ఇంత వరకూ చదివి ఉన్నాం.ఈ కథలో రచయిత్రి శైలి విభిన్నంగా ఉండడం వలన చదివిస్తుంది.ఇందుకు రచయిత్రి అభినందనీయురాలు.

        అక్కడక్కడా కొన్ని categorical statements  చేస్తూ,ఊహ ఏదో ,వాస్తవికత ఏదో అన్నది 'ట్రెజర్ హంట్' గేమ్ లోలా రచయిత్రి కొన్ని జాడలను విడిచిపెట్టారు.వీటిని అందిపుచ్చుకోవడమే పాఠకుడు చేయవలసిన పని.

              ఉదాహరణకు,

1. “ ఆశ్చర్య పోతున్న వారితో ఇలా మాట్లాడాలని రిహార్సల్ వేసుకుంటున్నాను”.....

2.“అవమానించ బడ్డ మనసుకు ఊహ లైనా శాంతి కలిగించేవే కదా”.....

ఇవి పాఠకుడికి కథ మీద పట్టు సాధించడానికి వ్రాయబడ్డ వాక్యాలు.


కథలో వచ్చే సైకియాట్రిస్ట్ పాత్ర ఇచ్చే సలహాలు రెండో పట్టు.


ఇక తల్లికి,కథానాయికకు మధ్య ఉన్న అనుబంధం గురించి తప్పకుండా చెప్పుకోవాలి.దివ్యాంగురాలైన  కూతుర్ని కన్న తల్లి--వరుసగా నిరాశ- నిస్పృహ- తప్పనిసరై భరించే తత్వం-దుఃఖం అనే దశల్లోంచి  ప్రయాణించి, ప్రయాణించి చివరకు acceptance లోకి, ఆ తర్వాత ప్రేమ లోని అత్యంత పవిత్రమైన 'ఆప్యాయత' అనే ఆవరణలోకి ఎలా అడుగులు వేసిందో మనం కూడా ఆ ఉద్వేగాలన్నింటినీ అనుభవిస్తే తప్ప అర్థం కావు.ఈ కధలో అమ్మ ఒక శక్తివంతమైన ప్రతీక. ఆమెను ఆదర్శ మానవి (ideal  humanbeing)అనుకోవచ్చు.

                                            “అందరూ అమ్మలా ప్రేమను మాత్రమే పంచడం ఎంత బాగుంటుంది?”

  ఈ వాక్యం తరువాత కధానాయిక తలపుల్లో మెదిలిన భావనను వనజ గారు అత్యంత అద్భుతంగా ఆవిష్కరించారు.ఆ వాక్యాన్ని పాఠకులు చదివినప్పుడు రచయిత ఉద్దేశ్యం ,గమ్యం,ఉత్తమాభిరుచి అవగాహన లోకి వస్తాయి.అంత గొప్ప వాక్యాన్ని మరి నేను కూడా వ్యాసంలో వ్రాసి తీరాలి కదా! ఈ వాక్యాన్ని వ్రాయడానికి ఎంతో గర్వంగా ఉంది.                                             

     “అప్పుడు నా ఆలోచనలు ఇంత భయంకరంగా ఉండవని అదో ఆశ”.

మళ్లీ కథనంతా చదవండి.నాతో మీరంతా ఏకీభవిస్తారని ఎదురు చూస్తూ ఉంటాను.

      ఆఖరి పేరా లో కథానాయిక తన పేరు చెప్పింది.పాఠకుడు సరిగ్గా చదివితే అసలీ వాక్యం అవసరం లేదనిపిస్తుంది.ఎందుకంటే కథ ప్రారంభంలోనే

“అమ్మ నాన్న పెట్టిన పేరును సార్థకం చేసుకునే భాగ్యం”

అంటూ ఒక వాక్యం మనకు ఎదురౌతుంది.

ఒకవేళ కథ చదివే తొందరలో దాన్ని మిస్సయితే,రచయిత్రి మళ్లీ మనకు చెప్పారు.ఇప్పుడైనా చదువుకోవచ్చు.

       మొత్తం మీద 'మానసిక విశ్లేషణ' అనే సాంప్రదాయకమైన పద్ధతిలో కాక, 'మనోధర్మాన్ని పరిశీలించడం" అనే కొత్త ప్రక్రియతో రచయిత కృతకృత్యురాలు అయ్యారు.

       ఈ కథలో ఉన్న సంఘటనలన్నీ తర్కానికి నిలబడగల సంబంధ బాంధవ్యాలను కలిగి వుంటాయి.ఇది శుద్ధ ప్రామాణిక గణిత సూత్రంలా అనిపిస్తుంది.

       మంచి కథను అందించిన వనజ తాతినేని గారికి హృదయపూర్వక మైన అభినందనలు.


కాళ్ళకూరి శైలజ . 
 

15, నవంబర్ 2022, మంగళవారం

లాలిత్యం - తీవ్రత

 ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటిలో "పైడి బొమ్మ " కథకు వ్యాఖ్యానం రాసిన శశికళ ఓలేటి  గారికి ధన్యవాదములతో .. ఆ కథ పరిచయం . 

పైడి బొమ్మ...నా మనోగతం.

అలనాటి రామచంద్రుడికి అశ్వమేధ యాగ నిర్వహణకు తన ధర్మపత్ని స్థానంలో స్వర్ణ సీత‌ అవసరమయ్యింది. ఈ కధలో రామచంద్రరావు గారికి...ధర్మబద్ధంగా తాళి కట్టిన భార్య అధర్మ మార్గాన్ని ఎంచుకుంటే....ఆపద్ధర్మంగా ఆదరించి,చేరదీసిన మహిళ....అత్యంత ఉన్నతంగా సతీధర్మాన్ని నెరవేర్చి, ఆయన ఏకపత్నీవ్రత దీక్షకు భంగం రానీయకుండా.. ఎటువంటి హోదాను,ఎటువంటి ఆర్ధిక భద్రతను కోరుకోకుండానే....తన సత్ప్రవర్తనతో, త్యాగనిరతితో, ఆధ్యాత్మిక నడవడితో... నిస్వార్థంగా...ఆయననూ, ఆయన పిల్లలను ఆదరించి, అలరించిన తీరు అద్భుతంగా తన కథ పైడిబొమ్మలో మలిచారు శ్రీమతి వనజ తాతినేని గారు.‌

     పద్మవల్లీ ఆండాళ్ళు గురించి రాస్తూ..." అలుపన్నది లేకుండా గానుగ రోలులో కణెంలా తిరుగుతూ పనిచేసేది!"...అంటుంది ఈ కథ చెప్పే నీలోత్పల, రామచంద్రరావు గారి మనవరాలు.‌ తన తాతయ్య దృష్టిలో నిజమైన నీలోత్పల ఆండాళ్ళు. బురదలో పుట్టినా...తన అస్థిత్వాన్ని హుందాగా లోకానికి చూపించే పద్మం లాంటిది ఆండాళ్ళు.ఆమెను తన పైడి బొమ్మగా వర్ణిస్తూ...తాతగారు తన జీవితంలోని ముఖ్య ఘటనలు, కుటుంబ సభ్యుల వంచనలు, మలుపులు, భార్యను దూరం పెట్టి,‌ఆండాళ్ళును ఆదరించవలసి వచ్చిన పరిస్థితులు, ఆండాళ్ళు... ఆయన పిల్లలను,మనవరాలినీ... సక్రమంగా పెంచి, ఆయనకు స్వధర్మపాలనలో అడుగడుగూ‌ తోడుగా నిలిచిన ప్రతీ వివరాన్నీ ఆయన డైరీలో రాసుకుంటారు.

     ఆయన నిష్క్రమణ ను స్థితప్రజ్ఞతతో స్వీకరించి..ఆశ్రమవాసం చేసి , అక్కడే తనువు చాలిస్తుంది ఆండాళ్ళు. అదే ఈ కధకు ఆరంభం.

        మానవ సంబంధాల్లో లోటుపాట్ల‌ గురించి మనకు అనేక పితూరీలు ఉంటాయి. నిజానికి తరచి చూసుకుంటే...ఎక్కడో అక్కడ మనకు జీవితంలో సమతుల్యత లభిస్తుంది. రామచంద్రరావు గారికీ,ఆయన పిల్లలకూ‌ అదే జరిగింది... ఆండాళ్ళు రూపంలో. సరోజ నెరవేర్చలేని కర్తవ్యాలు తను నెరవేర్చి, భర్తకూ,పిల్లలకూ..ఆమె పంచలేని ప్రేమను తను అందించి...ఆ ఇంటి ఇలవేల్పు అయ్యింది ఆండాళ్ళు...అది కూడా పూర్తి‌ నిష్కామంగా, నిస్వార్థంగా...ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా. 


           వనజగారి శైలిలో ఎంత లాలిత్యముంటుందో...అంత తీవ్రత కూడా ఉంటుంది. కుటుంబాల్లో పైకి పొక్కనీకుండా, కప్పెట్టేసే కొన్ని నగ్నసత్యాలు, అనైతిక ప్రవర్తనల గురించి... ఆమె చాలా కఠిన వైఖరి తో తమ కధల్లో చర్చిస్తారు. ఏ ఒక్క వాక్యమూ అసంబద్ధంగా ఉండదు. కధకు‌ అవసరమైన ప్రతీ రసాన్నీ సమపాళ్ళలో వాడుకుంటారు...ఆ విధంగా పాఠకులను తన కధనంలోకి నేర్పుగా లాగేసుకుంటారు. ఆ పాత్రల మధ్యనే తిరుగాడిన పాఠకులకు...కథ తాలూకు సారాంశం ,సందేశం చాలా గాఢంగా హత్తుకునిపోయి ఉంటుంది. 


       తమ కుటుంబానికి అంత సేవ చేసిన ఆండాళ్ళు...ఎవరూ లేని అనాధలా ఆశ్రమంలో చనిపోవడాన్ని...కథకురాలు నీలోత్పల తీవ్రంగా గర్హిస్తుంది. తాతగారి ఆస్తులు తీసుకున్న ఆయన పిల్లలు...ఆయన అత్యంతంగా ప్రేమించిన ఆండాళ్ బాధ్యత తీసుకోలేదన్న అసంతృప్తి ,ఆక్రోశం అడుగడుగునా వ్యక్తపరుస్తుంది. అక్కడ మనకు ఆమెలో రచయిత్రి నిష్పక్షపాత వైఖరి అడుగడుగునా కనిపిస్తుంది.


         నీలోత్పలకు తన తాతగారు ఒక హీరో. ధర్మం తప్పని రాముడంతటి వారు. కధలో ఎక్కడా కూడా ఆయన మీద పల్లెత్తు మాట వెయ్యలేదు. అయితే వయసులో ఉన్న సౌందర్యవతి అయిన భార్యను వదిలేసి, నెలల తరబడి వ్యాపార నిమిత్తం ఆమెకు దూరంగా ఉంటూ...ఆమెకు దారితప్పే అవకాశం ఆయనే ఇచ్చారు. స్త్రీకి వివాహం ద్వారా ఆర్ధిక,సాంఘిక భద్రతతో పాటూ లైంగిక సుఖం కూడా అవసరం అన్నది మౌలిక సూత్రం.‌ భార్య అక్రమ సంబంధాన్ని ఉదాసీనంగా తీసుకుని,ఆమెను పరిత్యజించి,పిల్లలను దూరం చేసి,ఆండాళ్ళును చేరదీసి...ఆయన అదే తన నైతిక విజయం అనుకోడం కాస్త అసంబద్ధంగా ఉంది. అదే ఆయన భార్యను సంస్కరించి, ఆమెను సమాదరించి,ఆమెకో వ్యాపకాన్ని సృష్టించి...ఉద్ధరించి ఉండుంటే...ఆయన మహోన్నతుడు అయ్యుండేవారు.‌అప్పుడు కథ వేరుగా ఉండేది. కధా సమయం యొక్క కాలమాన పరిస్థితులు, వ్యక్తుల మానసిక స్థితిగతులు, సంఘమర్యాదలు‌ కూడా పరిగణనలోకి‌ తీసుకుని ,‌రచయిత్రి కధలోని మలుపులను సృష్టించి ఉంటారు. 

ఇకపోతే క్రిష్ణమాచార్య పాత్ర. ఒక పాత్రత‌ ఉన్న కులంలో పుట్టి పాతకుడిలా ప్రవర్తించిన వ్యక్తి.బహుశా బ్రాహ్మణ కులానికున్న vulnerability రచయిత్రి వాడుకున్నట్టు అనిపించింది.‌ ఏ కులమో తెలియని ఆండాళ్ళు ఔన్నత్యాన్ని,అగ్రకులస్థుడయిన క్రిష్ణమాచార్య దిగజారుడు తనంతో పోల్చడానికి ఆ పాత్ర సృష్టించినట్లు ఉన్నారు రచయిత్రి. స్త్రీ జారుడు మెట్లు మీద ప్రయాణమే చెయ్యకూడదు.చెయ్యడం మొదలు పెడితే...ఆమెది అధోగతే,పతనావస్థే. అక్కడ బ్రాహ్మణుడున్నా, మరొకరున్నా...అదే పరిస్థితి.

       రచయిత్రి కధనాన్ని ఆద్యంతం చాలా ఆసక్తికరంగా కొనసాగించారు.‌డైరీలో పేజీలను నీలోత్పల మధ్యమధ్యలో తీసి చదవడం వలన,అక్కడక్కడా క్రోనలాజికల్ గా మనకు చిన్న అయోమయం ఉంటుంది.‌కానీ అంతలోనే మనకు అసలు విషయం అవగతం అవుతూ ఉంటుంది.‌డైరీలో ...తన మనోవ్యధను, భావోద్వేగాలను, ఆండాళ్ళు పట్ల ఎనలేని కృతజ్ఞతాభావాన్ని, భార్య వంచన పట్ల ఎగిసిపడిన దుఃఖావేశాన్నీ రామచంద్రరావు గారు రాసుకున్న తీరు హృదయానికి హత్తుకునేలా ఉంటుంది.  

ఒక అర్ధశతాబ్దం క్రిందట... చాలా గ్రామీణ నేపధ్యం ఉన్న వ్యాపార కుటుంబాల్లో...మానవ సంబంధాల్లో నెలకొని ఉన్న అనిశ్చితిని... కథావస్తువు గా తీసుకుని,తన అనుభవజ్ఞతతో, అద్భుతమైన శైలి, నైపుణ్యం తో,ఒక పరిపూర్ణమైన కధను అందించిన తాతినేని వనజ గారు సదా ప్రశంసనీయులు, అభినందనీయులు.‌ సహా రచయితగా ఈ కథను  నేను విశ్లేషించడం గౌరంగా భావిస్తూ ..వనజ గారి అముద్రిత కథా సంపుటికి అభినందనలు తెలియజేస్తూ .. 

ధన్యవాదాలతో

శశికళ ఓలేటి

టెన్నిసీ, యుఎస్ఏ.
13, నవంబర్ 2022, ఆదివారం

కుబుసం


పశువుల కొట్టానికి దూరంగా వున్న గడ్డి వాము దగ్గరకు వచ్చాడు సిద్దప్ప.  పరధ్యానంగా ఆలోచిస్తూ గడ్డిని దూయడం మొదలుపెట్టాడు. ఎంత బలంగా దూసినా పిడికెడు గడ్డి పరకలు కూడా బయటకు రాకపోవడం చూసి గడ్డిమోపు కట్టును వెదకడం మొదలెట్టాడు. కాసేపటి తర్వాత అతని ప్రయత్నం ఫలించింది. ఒక కాలిని వాముకు తన్ని పెట్టి రెండో కాలితో కాలికింద నేలను తొక్కి పట్టి బలంగా గడ్డిమోపు కట్టును పట్టుకుని  ముందుకు లాగాడు. కట్టు తెగి వెల్లకిలా వెనక్కి పడ్డాడు. నడుము విరిగినట్టైంది. చేతిలో గడ్డి పరకలతో పాటు  సగం తెగిన తెల్లని పాము    కుబుసం. భయంతో విసిరికొట్టాడు. చటుక్కున లేచి నిలబడి వెనక్కి మళ్ళాడు. కుబుసం విడిచిన పాము గడ్డిలో ఎక్కడో చోట దాగి వుంటుందని అతనికి తెలుసు. 

ఇంట్లోకి వెళ్ళదల్చుకోలేదు. భార్య రామేశ్వరి చూపులను ఎదుర్కోవాలంటే కూడా అదొక రకమైన భీతి. నిలువెత్తు మనిషిని అణువణువూ  చదివేసినట్లు వుండటమే కాదు ఉత్తరక్షణంలో తను చేయబోయే పనులకు అడ్డుకట్ట వేసేస్తుంది. లక్ష్యపెట్టకుండా ముందడుగు వేస్తే ఏం జరుగుతుందో చూచాయగా చెప్పి చూస్తుంది. తమ పెళ్ళై ఇప్పటికే నాలుగేళ్ళు గడిచాయి. ఆమె మాట ఆలోచన తప్పుకాలేదెన్నడూ.  సిద్దప్పకు ఒకరకంగా ఆమె మాటకు అవుననడం తండ్రి మాటను కాదనడం దుస్సహమైనది. తమ పెళ్ళి జరిగిన తీరును గుర్తు చేసుకున్నాడు.

************

 శ్రీశైలంలో స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిన తను ఆమెను దర్శించాడు. చూసిన మరుక్షణమే మనసు పారేసుకున్నాడు. తల్లిదండ్రులు ఆమోదం తెలుపుతారో లేదో అని ఆలోచించకుండా  కట్నం మాట లేకుండా పెళ్ళాడతానని మాట ఇచ్చేసాడు.  తర్వాత కుటుంబాన్ని వొప్పించడానికి మెప్పించడానికి చచ్చే చావొచ్చింది. 

రామేశ్వరి తండ్రి బసవుడుది హుబ్లీ ప్రాంతం. కలలో శ్రీశైల మల్లికార్జునుడు ఆదేశించాడని చెప్పి భార్యను వెంటబెట్టుకుని  శ్రీశైలం వచ్చాడంట.ద్విసంధ్యలూ తనివితీరా స్వామి దర్శనమైతే  అవుతుంది కానీ ఉదరపోషణకు మార్గం కనబడలేదు.  దేవస్థానం సమీపంలో వున్న ఫలహారశాలలో  సహాయకుడుగా చేరాను.  కొన్నాళ్ళకు భార్య కూడా  చేరింది. పనీపాటా భక్తి ప్రదక్షిణల  మధ్య నలుగురు పిల్లలను కన్నాం. తిండికి బట్టకు లోటు లేకుండా పిల్లలు   పెరుగుతుండగా వారికి  ఆస్తులు కూడా సంపాదించి ఇవ్వాలన్న ఆశ కల్గింది. ధర్మకర్త సాయంతో  సొంతంగా ఒక ఫలహారశాలను స్థాపించాను. రామేశ్వరి ముగ్గురు అన్నదమ్ముల తర్వాతది. అపురూపంగా పెరిగింది.  నాట్యమైతే నేర్చుకోలేదు కానీ  మాటకన్నా ముందు  ఆమె కళ్ళు చేతులు కాళ్ళు  మట్లాడతాయి. ఫలహార శాలకు వివిధ ప్రాంతాలనుండి వచ్చే భక్తుల మాట తీరును వస్త్రధారణను అన్నీ సునిశితంగా పరిశీలించేది. చక్కని మాటతీరుతో  అందర్ని ఆకట్టుకునేది. అన్నల వ్యతిరేకత వున్నా దిగువున వున్న సుండిపెంటకు పెళ్ళి ఇంటర్మీడియట్ వరకూ చదువుకుంది. తండ్రి నుంచి కన్నడంలో వచనాలు చదవడం నేర్చుకుంది.   యుక్తవయస్కురాలైంది. కూతురికి బాగా ఆభరణాలు చేయించి సమస్త వస్తు సామాగ్రిని కానుకనిచ్చి అత్తవారింటికి పంపాలనే నా ఆశ” అని చెప్పుకొచ్చాడు ఆయన.  

తీరా పెళ్లి సంగతులు మాట్లాడే సమయంలో ఆమె అన్నలు ముగ్గురు అడ్డుకున్నారు. పొలాలు ఇండ్లు తమకే సొంతంగా భావించిన వారు  నామ మాత్రపు స్త్రీ ధనం యిచ్చి అత్తవారింటికి పంపారు. కాంతే కనకం అనుకుని తృప్తి పడ్డాడు తను. రామేశ్వరి మెదడుకు చురుకైన ఆలోచన కల్గిందపుడే.ఆడ మగ మధ్య వ్యత్యాసం మనిషి స్వార్థం సృష్టించినదే అని పదే పదే అనేది.అన్నలపై విముఖత ప్రకటించేది కూడా. 

తన కుటుంబం విషయానికి వస్తే తండ్రి వీరయ్యది సీమలో  ఒక మాదిరి రైతు కుటుంబం. మెట్ట పంటల సేద్యం. అన్న భార్య బాగానే కట్నం తెచ్చింది.తలలో నాలుకలా మెలిగేది. ఆమెకు భర్త మాట వేదవాక్కు.ఇద్దరు ఆడపిల్లలు. తను రెండో కొడుకు.  రామేశ్వరి పెద్దగా కట్నం తెచ్చుకోపోవడం బతుకు తెరువు కొరకు ఊరు విడిచి వచ్చిన కుటుంబం అనీనూ ఫలహారశాల నడపడం గౌరవమైన పని కాదనే భావన తమ కుటుంబ సభ్యుల మనస్సులో బలంగా వుండేది. అందుకు తగ్గట్టుగానే వారి ప్రవర్తన.  రామేశ్వరికి అది మనసులో ముల్లు గుచ్చుకున్నట్టు వుండేది. ఇంట్లో వారితో మనసు విప్పి మాట్లాడేది కాదు. వచనాలు చదువుకుంటూ ఆలోచిస్తూ మరీ అశాంతిగా వుంటే తనకు చెప్పి మనసు భారం దించుకునేది.

రామేశ్వరి అలా ఎక్కువ కాలం మౌనంగా ఉండలేక పోయింది.  ఉత్సాహంగా కదిలే  కాళ్ళను  చేతులను స్తబ్దత నుండి విముక్తి కల్గించి  పనికి మళ్ళించింది. ఇంట్లో వ్యతిరేకత మొదలైనా తనతో కూడి పొలం పనులు నేర్చుకుంది. చేసే ప్రతి పని శ్రద్దగా  తీరుగా చేసేది. క్షణం తీరిక లేకుండా ఇంటి పనులు చేసేది.  మాట్లాడటాన్ని తగ్గించి  లోతు ఆలోచనలు చేసేది. క్లుప్తంగా మాట్లాడి ఎదుటి మనిషిని కట్టడి చేసేది. తమకు ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు. మనుమడు మాత్రమే వంశోద్దారకుడని ఆడపిల్లలు పరాయింటికి సొమ్మును దోచుకుపోయేవారని అవసరమైతే కుటుంబ పరువు కోసం వారి ప్రాణాలు తీయడం కూడ తప్పు కాదని గాఢాభిప్రాయం తండ్రిది. చెల్లెలు పర కులస్తుడిని ప్రేమించిన పాపానికి అతన్ని పొట్టన పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా  వేరొకరికి కట్టబెట్టటంలో తనది మౌనపాత్ర. చెల్లెలు ఆ బలవంత వివాహం తర్వాత ఒక బిడ్డను కన్నాక కూడా ప్రేమించినతనిని మరువలేక పెన్నలో మునిగి ప్రాణ త్యాగం చేసింది.  తండ్రి మూర్ఖత్వం కరుకు గుండె ఎలాంటిదో ఏమిటో అన్న సంగతి తెలియడానికి రామేశ్వరికి ఆ విషయం గురించి కూడా చెప్పాడు. విని మౌనంగా వుంది రామేశ్వరి. 

ఆడవారికి  చాకలి పొద్దు రాసుకోవడం  పాల చీట్లు లెక్కపెట్టుకోవడం, ముందు పెట్టిన గుడ్లు మురిగిపోకుండా  కోడి గుడ్లపై తారీఖు వేసుకోడం తెలిస్తే చాలని తండ్రి అభిమతం. కాడిగట్టిన ఎద్దును ముల్లు కర్రతో పొడిచినట్లు ఇంటి స్త్రీలను చూపులతోనూ బూతులతోనూ పొడుస్తూవుంటాడు. ఇంటాబయటా పెత్తనమంతా ఆయనిదే. అన్న తను కూడా ఆయన చెప్పినది వినడం ఆచరించడం.


అయితే రామేశ్వరి కాస్తో కూస్తో చదువుకున్నది విషయపరిజ్ఞానం కలది కావడం అసలు భరించలేకపోయాడు. అటువంటిది ఆమె ఆర్ధిక విషయాల గురించి మాట్లాడటం విని ఉగ్రంగా మారిపోయాడు. ‘నీ పెళ్ళాన్ని హద్దుల్లో పెట్టుకో’ అని  తనను తరచూ హెచ్చరిస్తూ వుంటాడు. 


రామేశ్వరి తండ్రి చనిపోయాడు. దిన వారాలకు వెళ్ళినప్పుడే ఆమె అన్నదమ్ములు ముగ్గురూ ఆస్థి పత్రాలపై సంతకం చేయించుకుని పదివేలు చేతిలో పెట్టి పంపించారు. తనను భర్తను అడగకుండానే సంతకం పెట్టిందని సంతకం పెట్టకపోతే ఆస్తుల్లో వాటా వచ్చేదని తిట్టిపోసాడు వీరయ్య. తన చేత అడిగించి కోడలి దగ్గర వున్న ఆ పదివేలు ను తీసుకుని పొలం కొన్నాడు. ఉన్న భూమిలోనే పంట సరిగా చేతికందనపుడు  పొలంపై పెట్టుబడి పెట్టటం ఎందుకని రామేశ్వరి వాదన.   కొన్న భూమిని తన పేరున ఎందుకు పెట్టలేదు?  ప్రశ్నించింది.

“ఆడోళ్ళ పేరున ఆస్తులు రాయడమా!? తరతరాలుగా అది మా ఇంటావంటా లేని పని. నా ముందు అంటే అన్నావ్ గానీ మా నాయన ముందు ఈ మాట అనేవు.కత్తి తీసుకుని నరుకుతాడు” అన్నాడు  సిద్దప్ప.

“అంత చేతకాని వాళ్ళు ఎవరు లేరులే ఇక్కడ” అంది. ఆశ్చర్యపోయి భార్య వైపు చూస్తుండిపోయాడు. ఆ రోజు  కూడా గడ్డిపరకలతో పాటు  తన చేతిలోకి పాము కుబుసం రావడం గమనించాడు. భార్య  ప్రశ్నించినపుడల్లా అలా జరుగుతుందెందుకో అర్దం కావడంలేదు. అలాగే జరిగినది అనుకోవడానికి రెండు మూడు సార్లు రూఢి దొరికింది కూడా. 

మరొకసారి కూడా అంతే ! ఇద్దరు బిడ్డలు చాలని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటానని తనతో చెప్పింది రామేశ్వరి.  మన ఇంట మగపిల్లలు తక్కువ ఆడపిల్లలు ఎక్కువ వున్నారు. ఇంకో రెండుతూర్లు చూద్దాం. ఆపు అన్నాడు వీరయ్య. తండ్రి మాటను భార్య దగ్గర వల్లించాడు. భర్త వైపు ఓ చూపు చూసి చెప్పకుండా ఆపరేషన్ చేయించుకుని వచ్చింది. ఇంట్లో అందరూ చూస్తుండగా భార్య  చెంపపై గట్టిగా వొకటిచ్చి తన అధికారం ప్రదర్శించుకున్నాడు. రామేశ్వరి చెంప పట్టుకుని సన్నగా నవ్వింది. కోపంగా గదిలోకి వెళ్ళి మంచంపై పడుకున్న  తనపై  పై కప్పు నుండి సగం విరిగిన  పాము కుబుసం రాలిపడింది. తీవ్రంగా భయపడ్డాడు. ఇంట్లో ఎవరికి కనబడని పాము కుబుసం తనకే ఎందుకు కనబడుతుందని తల్లి దగ్గర వాపోయాడు. “ఐదు ఆదివారాలు పుట్టలో పాలుపోస్తానని ప్రదక్షిణలు చేస్తానని  సుబ్రహ్మణ్యస్వామికి మొక్కుకో..”అంది.

రామేశ్వరి“నీకు కుబుసం కనబడితేనే భయపడుతుంటివి,పొద్దస్తమాను పొలంలో తిరిగేవారికి పామంటే భయమైతే ఎట్టబ్బా” అని నవ్వింది. 

ఇంకొన్నేళ్లు గడిచాయి. ఇవ్వాల్టికివాళ “ఉమ్మడి కుటుంబంలో ఎన్నేళ్ళు ఎదుగుబొదుగు లేకుండా వుందాం. మీ నాయనను పంపకాలు చేయమని అడుగు, నువ్వు అడగకపోతే నేనే అడుగుతాను” అని కూడా అంది. తను తండ్రిని అడగలేక భార్యకు చెప్పలేక తను సతమతమై పోతున్నాడు.

************

వీధి దీపాలు వెలిగి దొడ్డంతా వెలుతురు పడితే కానీ చీకటి పడిందన్న ధ్యాస లేని సిద్దప్ప గుర్తు చేసుకుంటున్న గతాన్ని వదిలి వర్తమానంలోకి వచ్చిపడ్డాడు. 

‘ఈ పాము కుబుసం ఏమిటో తనను వెంటాడుతూనే వుంది.ఒంటరిగా ఏ పని చేయాలన్నా భయమౌవుతుంది’ మనసులో అనుకుంటూ పశువులకు గడ్డి వేయకుండానే లోపలకు వెళ్ళాడు.

 

సిద్దప్ప తండ్రిని పంపకాల గురించి అడగకుండా రోజులు వారాలు నెలలు గడిచిపోతున్నాయి.భర్త మగ పెత్తనంలో నడిచే సగం మగ మనిషి సగం ఆడమనిషి అనుకుని నిట్టూర్చింది రామేశ్వరి.


 తనకంటూ సొంత వ్యాపకం వుండాలనుకున్న రామేశ్వరి డ్వాక్రా గ్రూఫ్ లో సభ్యురాలైంది. లోను డబ్బుతో స్వంతంగా పాడిగొడ్డును కొంది. నూనె గానుగ పెడదామని ప్రతిపాదన చేసింది. మగపెత్తనం సాగే ఆ కుటుంబంలో ఆడది సంపాదన పరురాలు కావడం ఆర్ధిక విషయాలు మాట్లాడటం కుటుంబానికి మింగుడు పడలేదు. వీలైనంత ఆమెను అణచివేయాలని చూసారు. ఆ విషయంలో అత్త తోడికోడలు కూడా తమ పాత్రను సమర్దవంతంగా నిర్వహించారు.అయినా రామేశ్వరి లెక్కచేయలేదు. చిన్న చితకా వచ్చే ఆదాయ వనరులను కాపాడుకుంటూ డబ్బును సృష్టించాలని తాపత్రయపడేది. ఆడదానిక్కూడా మెదడు వుంటుంది, అదీ ఆలోచించగల్గుతుందని అంగీకరించని జమానాలో  తను ఏమి చెప్పినా ఎగతాళిగా మారుతుందని కొన్నేళ్ళు మౌనం వహించింది. కాలమే కాదు కలసిరాని భర్త నైజం ఆమెను నిరాశపరిచేది. వానలు కురవకపోతే భూమి పంటకు  పనికి రానట్టే డబ్బులు కురవకపోతే ఏ పని చేయడం అంత సులభం కాదని అర్ధం చేసుకొంది.  


 సకాలంలోనే చినుకులు రాలుతున్నాయి. పంట విత్తే సమయానికి కుటుంబం నుండి వేరు పడితే బాగుండును అనిపించింది రామేశ్వరికి. తమ వాటాకు రెండు ఎకరాలు రానీ మూడెకరాలు రానీ పంట  పండినా పండకపోయినా స్వతంత్రంగా బతకడం ఆలోచించడం భర్తకు అలవాటు అవ్వాలంటే తండ్రి నీడ నుండి బయటకు రావాలని అప్పుడే తమ పిల్లలకు చదువు మంచి భవిష్యత్ వుంటుందని అనుకొంది.నోరు విప్పి తండ్రిని అడగడం భర్త వల్ల కాని పని అని గ్రహించి తనే చొరవ చేసింది.


“పిల్లలు పెద్దగా అవుతున్నారు. కాన్వెంట్ చదువులకు పట్నం పంపాలి. ఫీజులకు డబ్బులివ్వు మామా “ అని అడిగింది.

“డబ్బు లేం చెట్లకు కాయడంలేదు ఉన్నంతవరకూ ఊళ్ళో బడికిపోయి చదవడమే” అన్నాడు వీరయ్య. 


“మా బిడ్డలను బాగా చదివించుకోవాలని కోరిక. మా వాటా ఎంతొస్తే అంత మాకు పంచి ఇవ్వండి”  అంది. 

“వాటాలు పంచమని అడిగేంత పెద్దదానివా నువ్వు” అంటూ కోడలిపై చెయ్యెత్తాడు. చేతిలో వున్న పాల బిందెను ఆచేతికి అడ్డం పెట్టింది. సిద్దప్ప ఉరుక్కుని  వచ్చి భార్య చేతిలో బిందె లాక్కున్నాడు రెక్క దొరకబుచ్చుకుని లోపలికి లాక్కెళ్ళాడు. 

ఆడదాని నోటికి కాలికి సంకెళ్ళు ఎలా వెయ్యాలో తెలిసిన వీరయ్య కోడలిని మనుమరాలిని వీధిలోకి త్రోసాడు. కొడుకుని మనవడిని లోపలికి నెట్టాడు. సిద్దప్ప ఆ రోజు గడ్డివాము దరిదాపులకు కూడా పోలేదు. అయినా  ఏవేవో పిచ్చి పిచ్చి కలలు. కొట్టబోయిన చేతిని అడ్డుకుంటున్న  పాలబిందె. నడిరోడ్డు పై నిలబడిన తల్లీ బిడ్డ.  ముక్కలు ముక్కలుగా చేతికి వస్తున్న పాము కుబుసం. రామేశ్వరి తన వంక చూసిన చూపు. కలవరపడ్డాడు కలత చెందాడు. 

 నడిరోడ్డులో నిలబడ్డ రామేశ్వరి ఆ స్థితిలో పుట్టింటి గడప తొక్కకూడదని నిర్ణయించుకుంది. ఎదురింటి వారి ఆశ్రయం కోరింది. వాళ్ళ కొట్టంలో ఖాళీగా వున్న ధాన్యపు గదిని నీడగా చేసుకొంది.  కట్టుకొయ్యకు కట్టేసిన బర్రెగొడ్డును దూడను తాడు పట్టుకుని తెచ్చుకోగల్గింది కానీ తాళి కట్టిన మొగుడ్నికొడుకును  లాక్కొచ్చుకోలేకపోయింది. పిల్లను వెంటబెట్టుకునే పొలం పనికి కోళ్ళఫారంలో పనికి వెళ్ళి ధైర్యంగా బతకడం నేర్చుకొంది. కొడుకు శివ  వీధి వాకిట్లో నిలబడి తల్లి చెల్లి వైపు చూస్తుండం తప్ప దగ్గరకు రాలేని నియంత్రణ. ఆ కంచె దాటి వస్తే వాడు తన కొడుకుగా పెరుగుతాడు. రాకుంటే మరో తరం ఆడదానికి అన్యాయం జరుగుద్ది అనుకుంది.  అలా ఏడాది గడిచిపోయింది.

ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇల్లు కట్టించి ఇస్తానని ప్రకటించింది. సొంత స్థలం వుండాలని అదీ స్త్రీల పేరుతోనే వుండాలని షరతు పెట్టారు అని గ్రూఫ్ లీడర్ చెప్పింది. తను పదివేలు ఇచ్చింది కదా ఆ డబ్బుతో కొన్న పొలానికి బదులు ఖాళీగా వున్న వాముల  దొడ్డిని తన పేరున రాయమని వీరయ్యను వీధిలో నిలబెట్టి  అడిగింది. ‘కాదు పొమన్నాడు నీకు దిక్కున్న చోట చెప్పుకో’ అన్నాడు. 

 "రామేశ్వరి ఊరుకునే రకం కాదు  పంచాయితీ పెట్టిచ్చుద్ది చూడు" అంది తోడికోడలు మొగుడితో.

 అనుకున్నట్టుగానే ఊర్లో పెద్దల దగ్గర పంచాయితీ పెట్టించింది. తెగేదాకా  లాగకూడదు. కొడుకు భార్యే కదా, పరాయింట్లో ఎన్నాళ్లు తలదాచుకుంటుంది. వాళ్ళూ ఇల్లు కట్టుకొంటారు కోడలికి స్థలం రాసివ్వమని కొడుకుని పంపేయమని పెద్దమనుషులు సర్దిచెప్పారు. ముఖం గండుగా పెట్టుకుని అయిష్టంగా మిట్ట పల్లాలున్న పదిసెంట్ల భూమిని కోడలి పేరున రాసి ఇచ్చాడు. రిజిష్టర్ ఆఫీస్ లో పనై బయటికి వచ్చాక మామను ఉద్దేశించి “ మీ తాత ముత్తాత ఆస్తి నాకేమి  ఉచితంగా రాసియ్యలేదు. అర ఎకరా కయ్యి బదులు ఆ స్థలం రాసిచ్చావ్”  అంది. పళ్ళు పటపట నూరి ఒక బూతుమాట గొణిగి పై పంచె దులుపుకుని అవతలకు పొయ్యాడు. నాలుగు రోజులు గడిచాక స్థలం పత్రాలు పట్టుకొని కొడుకుతో సహా సిద్దప్ప  భార్య దగ్గరకు చేరాడు.  

జరిగిన విషయాలేవీ వారి మధ్యకు రానీకుండా జాగ్రత్తపడుతూ భర్తతో అన్యోన్యంగా వుంటూ.. అతనిని తెలివిగా శ్రమ మార్గంలోకి నడిపించింది. సిద్దప్ప రెండు ఎకరాల కౌలు పొలం చేసుకుంటూనే భార్య  కూతురు తో పాటు కోళ్ళఫారంలో పనిచేయడం మొదలెట్టాడు.  చిన్న వేన్ అద్దెకు తీసుకుని గుడ్లను పట్నంలో షాపులకు వేసి రావడం కోళ్ల మేత వేసుకురావడం చేస్తుండేవాడు.ఏడాదిపాటు కష్టపడి ప్రభుత్వం ఇచ్చిన చిన్న ఇంటితో పాటు రెట్టింపు ఇంటిని కలిపి నిర్మించుకున్నారు. రామేశ్వరి ఆలోచన ప్రకారం నూనె గానుగ పెట్టారు. సిద్దప్ప చేతిలో  డబ్బుల సందడి చూసి ఆ ఇంటి నుండి ఈ ఇంటికి రాకపోకలు మాములయ్యాయి. 

వ్యవసాయంలో మిగిలేది తవ్వింది పూడ్చటానికి కూడా రాక అప్పులపాలై నాలుగెకరాలు కరిగిపోయాక కానీ వ్యవసాయంపై ఆధారపడటం తప్పనిపించింది వీరయ్య కుటుంబానికి.ఆ విషయం వొప్పుకోవడానికి అహం అడ్డొచ్చి కాలు ఈడుస్తున్న ఎద్దుతో కాడి కట్టి సేద్యం చేస్తన్నట్టు సంసారం నడుపుకొస్తున్నాడు.అడపాదడపా సిద్దప్ప డబ్బు అందిస్తుంటే చూసిచూడనట్టు ఉండేది రామేశ్వరి.

పదవతరగతి దాకా కొడుకుని కూతురిని వొకే కాన్వెంట్ కి పంపించింది రామేశ్వరి.  ఒకోసారి ఆడపిల్ల చదువుకు  అంత ఖర్చు ఎందుకు? అని నసిగేవాడు సిద్దప్ప. కొడుకు శివ ట్యూషన్ కి  కూడా వెళుతూకూడా  ముక్కిమూలిగి ఏ గ్రేడ్ తెచ్చుకుంటుంటే స్కూల్ కి వెళ్ళేదాకానూ స్కూల్ నుండి వచ్చాక కూడా మనతోపాటు సమానంగా చాకిరిచేస్తూ కూడా వాడికన్నా మంచి మార్కులు తెచ్చుకుంటుంటే వద్దని అనడానికి నీకు నోరెట్టా వస్తుందయ్యా! ఎంతైనా నువ్వు ఆ ఇంటి బిడ్డ వే కదా! నీ ఆలోచనలు మాత్రం మంచిగా ఎట్టా వుంటాయ్” అంది విసురుగా. 


సందెవేళ దీపం పెట్టి నట్టింట్లో కూర్చుని భర్తకు వినబడేటట్టు వచనం చదివింది.


“తాను సృష్టించిన స్త్రీ తన తలనెక్కింది.

తాను సృష్టించిన స్త్రీ తన ఒడికెక్కింది.

తాను సృష్టించిన స్త్రీ బ్రహ్మ నాలుకకెక్కింది

తాను సృష్టించిన స్త్రీ నారాయణుని ఎడదకెక్కింది.

అందువల్ల, స్త్రీ స్త్రీ కాదు, స్త్రీ అబల కాదు స్త్రీ రాక్షసి కాదు.

స్త్రీ ప్రత్యక్ష కపిల సిద్ద మల్లికార్జునుడే కనవయ్యా’’


అది విన్న సిద్దప్ప మళ్లీ ఎప్పుడూ బిడ్డల మధ్య ఆడ మగ భేదం చూపించలేదు. 


ఇంటర్మీడియట్ లో శివ ను విజయవాడ హాస్టల్ లో చేర్పించి చదివిస్తే.. పక్కనే వున్న టౌన్ లో గవర్నమెంట్ కాలేజీలో చదివి మంచి ర్యాంక్ తెచ్చుకుంది మల్లి. రోజూ ఇంటి దగ్గర్నుండే అనంతపురం  వెళ్ళి బి టెక్ పూర్తి చేసింది.నూనె గానుగ చూసుకోవడం  తల్లి దగ్గరనుండి స్కూటీ తోలటం తండ్రితో కలిసెళ్ళి వేన్ నడపడం నేర్చుకుంది.  కాలేజ్ లో చేరేటపుడు తల్లి చెప్పిన మాటలు ఎప్పుడూ మననం చేసుకునేది. “ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకున్న రోజే ప్రేమ పెళ్ళి ఆలోచన చెయ్యాలి. ఆడమగ పిల్లలు కలిసి చదువుకునేచోట అనేక ఆకర్షణలు వుంటాయి. అలాంటి సాలెగూడులో పడకుండా బాగా చదువుకో. తర్వాత నీకిష్టమైన వాడిని ఎంచుకో. అంతే కాని తప్పు దారి పట్టకు’’. అనే మాటలను బాగా ఒంటబట్టించుకుని కుదురైన పిల్లగా పేరు తెచ్చుకుంది కానీ వానరాకడ ప్రాణం పోకడ తెలియదన్నట్టుగానే ప్రేమ పుట్టుక తెలియదని తర్వాత అనుకొనింది మల్లి .  

కరెంట్ హెచ్చు తగ్గులకు తగలబడి పోయిన మోటర్ ని విప్పుకుని బండి మీద వైండింగ్  షాపుకు తెచ్చింది మల్లి. అక్కడ తన క్లాస్మేట్  అర్జున్ కనిపించాడు. ఈ షాపు మాదేనండీ, నా తండ్రి ఎలక్ట్రీషియన్. నాకు కూడా ఈ పనులంటే ఇంట్రెస్ట్. అందుకే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసాను అన్నాడు. మల్లి కళ్ళల్లో ప్రశంస.

 “మోటర్ పూర్తిగా కాలిపోయింది. వైడింగ్ చేయడానికి కనీసం రెండు రోజులైనా పడుతుంది” అన్నాడు.

 “డ్రిప్ ఇరిగేషన్ కు అవసరమైన మోటర్ అండీ ఇది. ఇవాళ బిగించి నీళ్ళు వొదలకపోతే పంటకు చాలా నష్టం కల్గుతుంది” అంది.

 “మా దగ్గర స్పేర్ మోటర్ వొకటి వుంది. అది తీసుకొచ్చి బిగించి పెడతాను. ఈ మోటర్ పని అయ్యాక అది ఇచ్చేద్దురుగాని” అని మల్లి వెంట పొలానికి వచ్చి సాయపడ్డాడు.

నాలుగునాళ్ళు దగ్గరగా మసలడం వలన మల్లి కి అర్జున్ పై ఇష్టం కల్గింది.  ఓ వాలు చూపు విసిరింది చిరునవ్వు రువ్వింది.అర్జున్  లోన దాగిన కాముడుకి కలవరం కల్గింది.  తరచూ వారిరువురు కలవడానికి కారణాలు వెతుక్కున్నారు.

రామేశ్వరి విషయాన్ని త్వరగానే పసిగట్టింది. సున్నితంగా హెచ్చరించింది. “ఆ ఇంటి పరిస్థితులు ఎటువంటివో, అతనికి పెళ్ళి చేసుకునే ఉద్దేశం వుందో లేదో కనుక్కో. నలుగురి నోళ్ళలో నానడం మంచిది కాదు. ముఖ్యంగా నీకు అతను జీవితాంతం స్నేహితుడిగా అండగా నిలబడేవాడు స్త్రీ ధనాన్ని ఆశించనివాడు అవునో కాదో గ్రహించుకో. నువ్వు సరైన వాడినే ఎంచుకున్నానని అనిపిస్తే నాకు చెప్పు. పెళ్ళి జరిపిస్తాం” అని చెప్పింది.  

పది రోజుల తర్వాత “అర్జున్ లో ఏం చూసాను అన్నది కాదమ్మా, అతని తోడుంటే చాలు అని మంచిగా ఫీల్ అయ్యాను. మా నాన్న లాగే చెబితే వినే మనిషే అనిపించాడు. నేను అతన్నే పెళ్ళి చేసుకుంటాను”  అంది మల్లి. మీరు వద్దన్నా ఏదో ఒకరోజు గుళ్ళో పెళ్ళి చేసుకుంటాం” అని జరగబోయేదాన్ని సూచించింది.

పొలంలో కాయకూరలు తెంపుతూ మల్లి అర్జున్ పై మనసు పడిన విషయాన్ని సిద్దప్ప తో చెప్పింది.

“అదెట్టా కుదురుద్ది. చిన్నప్పటి నుండి శ్రీను గాడికి ఇచ్చి చేయాలని అనుకొంటిమి కదా! ఇప్పుడు వాడికి కాదని ఎవడికో యిచ్చి చేస్తే బాగుంటందా? పైగా అతను మన కులం కూడా కాదయ్యే,  మా నాయనను వొప్పించడం చానా కష్టం” అన్నాడు. నిజానికి శ్రీనుకి మల్లికి భర్త కాదగ్గ అన్ని అర్హతలున్నా సరే పురుషాహంకారానికి అచ్చు విలాసం అయిన ఆ ఇంట్లో పెరిగిన బిడ్డ శ్రీనుకి మల్లినిచ్చి చేయడం ఇష్టం లేదు. తిరుగులేని బాణం వేసింది రామేశ్వరి.“అంగం లింగం ఒకటయ్యాక నువ్వు నేను కాదని ఏమి చేస్తాం. గుట్టుగా పెళ్ళికి ఒప్పేసుకుందాం” అంది. 

సిద్దప్ప ఆశ్చర్యపోయాడు. కూతురు అంత ఇంగితజ్ఞానం లేనిది కాదని అతని నమ్మకం. భార్య చెప్పిన  నమ్మశక్యం కాని మాటలు గురించి ఆలోచిస్తూనే “ మరైతే నాన్న ఏమంటాడో అని”  అన్నాడు జంకుగా.

 “ వాటాల సంగతి అడక్కుండా పెద్ద పిల్లలిద్దరికి ఇచ్చిన కట్నం సంగతి మాటాడకుండా కయ్య రాసిమ్మని అడగకుండా వుంటే ఆయనే గమ్ముగా వుంటాడు. నేను మాట్టాడతాను. అక్కడికి వెళ్ళాక  మీ నాయన ముందు ఉత్తుత్తి ప్రతాపం చూపియ్యి. కాసేపు అట్టెట్టా కుదురుద్ది అని వీరంగం వెయ్యి చాలు” అని సూచనలిచ్చింది. 

తెల్లారేసరికల్లా ఊర్లోకి అడుగుపెట్టారు. విషయం ఎట్టా చెప్పాలా అని  సిద్ధప్ప మల్లగుల్లాలు పడుతుంటే.. తండ్రి వీరయ్యే కదిలించాడు. “మల్లి చదువు అయిపోయిందిగా. శ్రీను ని పంతులను పిలిపించి లగ్గాలు పెట్టుకుంటే బాగుంటది. ఏమంటావ్” అనడిగాడు కొడుకుని. 

“మల్లి కి శ్రీను ని చేసుకోవడం ఇష్టం లేదంట నాయనా, అది కాలేజీ లో చదువుకొనేటపుడు ఎవర్నో ప్రేమించింది అంట” 

“అనుకున్నదంతా అయిందన్నమాట. అందుకే ఆడముండలకు చదువులు వొద్దని చెప్పేది. మీరు ఇన్నారు కాదు” అన్నాడు తుస్కారంగా కోడలి వైపు చూస్తూ.

 

సిద్దప్ప తల్లి గొంతు కూడా లెగిసింది. “ఏవమ్మా కోడలా! సేద్యం లాభసాటి కాదంటివి. కోళ్ళ ఫారం నయమంటివి. కొడుకు చదువంటివి. కూతురు చదువంటివి. ఇల్లొదిలిపోయి ఇంటి పరువు తీసిపారేస్తిరి.టౌన్ కి పోయి కులం పోగొట్టుకునే పనులు చెయ్యాలా?  పిల్లను ఇచ్చేటపుడు తెచ్చుకునేటపుడు కులాచారం చూడకపోతే ఎట్టా? ఆ పెళ్ళి జరిగితే మేము వీధుల్లో తలెత్తుకుని తిరిగేదెట్టా” అంది.

“నేను అదే అంటున్నా అమ్మా, ఈ గడప దాటి పొయ్యాక అన్నీ పొయ్యాయి. ఇచ్చిన మాట  మర్యాద పొయ్యాక పరువు పోయినాక బతికి ఎందుకు? పరువు ఇంటి దూలం లాంటిది. ఈ ఇల్లే కూలి పోయినట్టుంది నాకు. అంటూ వీరావేశం తెచ్చుకుని “నీ కూతురు చేసిన పనితో ఈ ఇంటి పరువు పోయింది. నువ్వు నీ కూతురు గంగలో దూకి చావండి”అని వీరంగం వేసాడు సిద్దప్ప. 

భర్త నటిస్తున్నాడో లేక తన వాళ్ళ మధ్య వున్నాననే దైర్యంతో రంకెలు వేస్తున్నాడో అర్థం కాలేదు. వచ్చిన పని విజయవంతంగా ముగించుకుని వెళ్ళాలనే సృహ కల్గింది.

“వీరయ్య మనుమరాలు అయ్యిండి ఇంత పరువు తక్కువ పని చేసుద్ది అని నేను కలలో కూడా అనుకోలేదు మామా!.  ఆ ప్రేమించడమో గీమించడమో అంతవరకూ అయితే నేనే తిట్టో కొట్టో ఇంటిల్లపాది చస్తామని బెదిరించో దారికి తెచ్చుకుని వుండేదాన్ని.  శ్రీనుకిచ్చి పెళ్ళి చేసి వుండేవాళ్ళం.ఆ  ప్రేమ గీమ గీతలన్ని దాటిపోయి ఇప్పుడది  తల్లి కాబోతుంది.  డాక్టర్ దగ్గరకు తీసుకుపోతే ఐదవ నెల గడుస్తుందని చెప్పింది.  చిన్న పిల్ల దానికేమి తెలుసు అని అనుకుంటాం కానీ వాళ్ళు మాత్రం బోలెడు ఎదిగిపోయాం అనుకుంటారు. పైగా మైకంలో పడిపోయే. వివరం తవరం తెలియడానికి జ్ఞానం వడ్డించిన విస్తరి కాదయ్యే! అంది కావల్సినంత విచారాన్ని ముఖాన పులుముకుని గోడకు ఆనుకుని నేలచూపులు జూస్తూ. 

“ఛీ.. దానెమ్మ సిగ తరగ అంటూ మొదలై అనేక అశ్లీలమైన పదజాలంతో రెండుమూడు నిమిషాలు  రంకెలువేసాడు. ఒగరుస్తూనే ఇక దాన్ని తీసుకొచ్చి నా మనమడికిచ్చి పెళ్ళి చేయడమేమిటి? ఆ కులం తక్కువ వాడికే ఇచ్చి పెళ్ళిచేయండి.  శ్రీను కి రాజా లాంటి సంబంధం తెచ్చి పెళ్ళి చేస్తాను” అన్నాడు మీసం మెలేసి మూడవకాలి మీద ఊగిపోతూ. 

 

రామేశ్వరికి ఆ బూతు మాటల దాడికి కడుపు మండిపోయింది. ఆడదంటే అంత చులకన భావమా?  తండ్రి ముందు కూతురిని  కొడుకు ముందు కోడలిని పచ్చి బూతులు మాట్లాడుతుంటే చోద్యం చూస్తున్నట్లు చూస్తున్న భర్తను ఏహ్యంగా చూసింది. దానికి తోడు తన పెంపకాన్ని తప్పు పట్టినందుకూ లోలోపల రగిలిపోయింది. కర్రుకాల్చి వాత పెట్టినట్లు మాటలంటించింది.


“మీ అవ్వ తాత మీ మేనత్తను పెంచినట్టే నేను కూడా పెంచాను అని అంటారు కదే ముదనష్టపుదానా! అని గట్టిగా  నాలుగు మొట్టికాయలేసాను. కోపం తీరక గొడుగు ఇరిగిందాక కొట్టి కూడా వచ్చాను మామా! ఒకో యింటికి ఒకో సాలు. మల్లికి  మేనత్త సాలు తప్పిపోకుండా వచ్చింది. ఏం చేద్దాం మరి” అంది. నల్లబడ్డ ముఖంతో  అత్త పాలు పొంగి పోతున్నాయంటూ వంట వసారలోకి తప్పుకుంటే తోటికోడలు ముసి ముసి నవ్వులు నవ్వింది.

వీరయ్య సగం కాల్చి చెవిలో పెట్టుకున్న చుట్టను తీసి వెలిగించుకుంటూ కొడుకు వైపు క్రోధంగా చూసాడు ఇదంతా నువ్వే చెప్పి వుంటావు అన్నట్టు. సిద్దప్ప తల కిందకు వొంచాడు. 

“నా ఆస్థిలో దానికి ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వను. అంతా నా వారసుడికే రాసి పోతాను. నా గడప తొక్కవద్దు అని చెప్పు దానికి” అన్నాడు వీరయ్య అక్కడినుండి తప్పుకుంటూ. ఒక పని అయిపోయింది అని తేలిగ్గా నిట్టూర్చి ఎర్రటి ఎండలోనే చెప్పుల్లో కాలుంచింది రామేశ్వరి.

ఇంటికి వచ్చిన తల్లి ముఖం చూసి అక్కడ ఏం జరిగి వుంటుందో ఊహించింది కూతురు. కాళ్ళు ముఖం కడుక్కొని వచ్చిన తల్లికి చల్లని తేట మజ్జిగ నీళ్ళ గ్లాసును చేతికిచ్చింది. 

గ్లాస్ అందుకుని “మల్లీ, ఇటు రా” అని రెండో చేత్తో కూతురిని దగ్గరికి తీసుకుని “నువ్వు నన్ను క్షమించాలి” అంది. క్షణకాలం మల్లి కళ్ళల్లో తను కోరుకున్న వాడితో పెళ్ళి జరగదేమోనన్న భయం రెపరెపలాడింది. ఆ భయాన్ని గుర్తించిన రామేశ్వరి “నీ పెళ్ళి జరగడానికి ఎన్ని అబద్దాలు చెప్పాల్సివచ్చిందో తెలుసా! ఆఖరికి మీ నాన్నకు కూడా అబద్దమే చెప్పాను. ఆ అబద్దం ఆడకపోతే నీ పెళ్ళిని సులభంగా జరగనివ్వరు. నీ అన్నతో సహా అందరూ అడుగడుగునా అడ్డుపడతారు. అందుకే నువ్వు గర్భవతి వని అబద్దమాడాను, అందుకు నువ్వు నన్ను క్షమించాలి” అంది.

 “ఆపద్దర్మమో లేక వంద అబద్దాలు ఆడి వొక పెళ్ళి చెయ్యాలి అనుకోవడం తప్పు కాదులేమ్మా,నేను నిన్ను  అర్ధం చేసుకోగలను. నా కోసం మళ్ళీ తిట్లు తిన్నావ్ కదా అదే చాలా బాధగా ఉంది ’’  అంది మల్లి.

మల్లి పెళ్ళికి ముందు రోజే ఊళ్ళో కట్టుకున్న తన ఇంటి వెనుక భాగాన్ని  నూనె గానుగ పెట్టిన నాలుగు సెంట్ల స్థలాన్ని   కూతురికి సర్వహక్కులతో అనుభవించే విధంగా రాసి ఇచ్చింది. సిద్దప్పతో చెప్పింది. “లింగాయత్ చెప్పిందనే కాదు. నా దృష్టిలో ఆడ మగ ఇద్దరూ సమానమే! తల్లిదండ్రులకు బిడ్డలందరూ సమానమే! మన అబ్బాయికి ఈ విషయమే అర్థమయ్యేటట్టు చెప్పు” అంది.

 “వాడు చెల్లి పెళ్ళికి రానని నిర్మొహమాటంగా చెప్పేసాడు. ఇంకేం చెప్పను” అన్నాడు సిద్దప్ప.

“నేను జీవితకాలం యుద్ధాలు చేస్తూనే వుండటానికి ఓపిక తెచ్చుకుంటాను తప్పేదేముంది” అంది.  

స్నేహితులు తప్ప బంధువులెవరూ హాజరవని పెళ్ళికి ఆర్బాటాలు అవసరం లేదు అన్నారు వధూవరులు.  పెన్న అహోబిలం గుడిలో సింపుల్ గా పెళ్ళి జరిగిపోయింది. రామేశ్వరి తృప్తిగా నిద్రపోయింది ఆ రాత్రి. 

తెల్లవారుజామున గానుగ  ఎద్దులకు మేత వేయడానికి పాక లోకి వెళ్ళాడు సిద్దప్ప. దూసి వుంచిన గడ్డి కనబడలేదు.చాలా ఏళ్ళుగా గడ్డి దూయడం మానేసాడు. ఇంట్లోకి వెళ్లి భార్యని నిద్రలేపబోయి ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె ముఖం చూసి వద్దులే అనుకుని బయటకు వచ్చాడు.  గడ్డి దూయడానికి వామి దగ్గరకు వెళ్ళాడు. భయం భయంగా గడ్డివాము మీద చెయ్యేసి గడ్డిని దూసాడు. రెండు వాట్లు దూసాక  గడ్డితో పాటు మధ్యలోకి తెగని అయిదున్నర అడుగుల కుబుసం చేతిలోకి వచ్చింది.గుండె జారినట్లైంది. కుడి కాలి దగ్గర జరజర మని శబ్దం. కదలకుండా ఊపిరి బిగపట్టి నిలుచున్నాడు. అప్పుడే కుబుసం విడిచిన గోధుమ వన్నె త్రాచు నిగనిగలాడుతూ బిరబిర సాగిపోయింది.  వెన్నెల వెలుగులో స్పష్టంగా కనబడిన పాము  దాని నిగనిగలాడే  మెరుపును చూసి ఎక్కడో చూసినట్టు అనిపించింది. గుర్తు చేసుకోవడానికి అన్నట్టు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. రామేశ్వరి కనుల మెరుపు అది. ఆమె ఆలోచన మాట చెల్లుబాటైనప్పుడల్లా ఆమె కళ్ళల్లో వెలిగే మెరుపు అది. చిరుదరహాసం అతని పెదవులపై. 


*************

ATA 2022 సావనీర్  కథాస్రవంతి లో  ప్రచురితం. ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటి లో కథ.