బహుళ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బహుళ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జులై 2024, సోమవారం

పయిలం బిడ్డా!

 పయిలం బిడ్డా! -వనజ తాతినేని

మనుమడా! నా బంగారు తండ్రీ! ఎట్టా వుండావ్? నేను ఫోన్ చేస్తే నీకు అందుతుందో లేదో తెలియడంలా, అందుకే ఈ ఉత్తరం ముక్క రాస్తుండా. ఏడేళ్ళు అయిపోయింది నిన్ను చూసి. ఎప్పుడు వస్తావు రా నాన్నా! ఒక్కసారి వచ్చి ఈ ముదుసలి నాయనమ్మను చూసి పో. వొంటి నిండా హత్తుకుని  పౌత్ర స్పర్శ ని అందించి పో. ఈ ఎండా కాలం దాటిస్తానో లేదో.. భగవంతుడికి యెఱుక.  ఎండలకి భయపడి మీ అమ్మ దగ్గరికి వెళ్లడంలేదు. అన్నట్టు నీకు ఈసారి కొడుకు పుడితే తాత పేరో నాన్న పేరో పెట్టుకోవాలి. పెద్దల పేరు పెడితే పిల్లలు ఉజ్వలంగా వర్ధిల్లుతారని నానుడి. ఇదే మాట మీ అమ్మతో చెబితే మీ అమ్మ విసుక్కొంది. “ తాత ముత్తాల ఆస్థులు కావాలి కానీ వాళ్ళ పేర్లు ఎవరికి కావాలి” అని.  


అబ్బాయ్ ! మీ అమ్మ నీ దగ్గర్నుండి వచ్చాక చాలా నలిగిపోయింది రా. దిగులు ముఖంతో నవ్వడం మర్చిపోయింది. అడగ్గా అడగ్గా.. “ఏం చెప్పను అత్తమ్మా, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదుగా” అని వాపోయింది.  


ఒరేయ్ పొంగుమాలినోడా! నిన్నొక మాట అడుగుతాను చెప్పు?  నీ ఇంట్లో నీ అమ్మ గెస్ట్ ఎట్లా అయితది, నీ పెళ్ళాం బాబాయి కూతురు ఫ్యామిలీ మెంబర్ యెట్లైతదిరా! నేను పాత కాలం యెనిమిదవ తరగతి చదువుకున్నా. మా పంతుళ్ళు యెవరూ యిట్టా చెప్పిండ్లా. నీకు అమెరికా చదువులు యిట్టా నేర్పి వుండాయేమో మరి. మీ అమ్మ ఆ మాట తల్చుకున్నప్పుడల్లా కుమిలి కుమిలి యేడుస్తా వుంటది. నీ తాత మీ నాయన అహంకారం నీ మెదడుకి బాగా యెక్కినట్టు వుంది. నీ భార్యకు మీ అమ్మ గురించి తెలియదే అనుకో, నీక్కూడా తెలియకుండా పోయిందా? అంత మాట అనుడు ఏంట్రా! నేను అక్కడ వుంటే చెంపకి వొక్కటి ఇచ్చి పడేద్దును. 


ఇంకో సంగతి. అదేదో అమెజాన్ లో పుస్తకాలు అమ్ముకుంటారంట గందా, నేను కూడా అప్పుడప్పుడు అంట్లు తోముకునే స్క్రబ్బర్ లు కూడా  తెప్పించుకుంటాలే. అందులో మీ అమ్మ తను రాసిన పుస్తకాలను పెట్టి అమ్ముకోవాలనుకునిందే అనుకో.. ఆ సేల్స్ మేనేజ్మెంట్ తో మాట్లాడేదానికి ఇంగ్లీష్ మాట్టాడాలంట. నాకు ఇంగ్లీష్ మాట్లాడం రాకపోయే, కాస్తో కూస్తో వచ్చినా జంకు అత్తమ్మా, అబ్బాయిని కోడలిని ఆ పనేదో చేసిపెట్టమని రెండు మూడు సార్లు అడిగా. ఇద్దరూ గమ్ముగా వుండినారు తప్ప ఆ పని చేయలేదు అని బాధ పడింది. నిన్ను చదివించడానికి మీ అమ్మ యెంత కష్టపడింది రా! ఇల్లిల్లు తిరిగి చీరలమ్మింది. డబ్బులు వసూలుకు తిరిగింది. ఎక్కడెక్కడ నాణ్యమైన చీరలు తయారైతాయో తెలుసుకుని అక్కడికిబోయి చీరలు గుత్తంగా కొనుక్కొచ్చి అమ్మేది. చీరలపై కుట్టుపూలు కుట్టేది. పదిమందిని పెట్టి కుట్టించేది.మగరాయుడిలా నిలబడి నీ కోసం కష్టపడితే చైతన్య హాస్టల్లో చదివినోడివి కాదు నువ్వు. ఆ రెండేళ్ళు నువ్వు చదివినందుకే మూడెకరాల పొలం అమ్మిందన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నీ కాబోయే భార్య ని ఎమ్మెస్ చదివించుకుందామని నువ్వు చెబితే.. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని భవిష్యత్ లో నీకు చేదోడు వాదోడు గా వుంటుందని సంతోషించి సరేనంది. ఆ అమ్మి అమెరికా వచ్చాక ఫీజులు కట్టేదానికి డబ్బులు లేవని నువ్వూ, ఆ పిల్లను కన్నోళ్ళు కాడి కిందపడేస్తే.. అప్పటికప్పుడు తన చేతి గాజులు తీసి అమ్మి చిట్ పాడి ఎల్ ఐ సి లోన్ తీసుకుని నానా అవస్థలు పడి మొదటి సెమిస్టర్ ఫీజు డబ్బులు పంపింది మీ అమ్మ కాదూ! నీ భార్య ఉద్యోగం వచ్చాక తన తల్లికి గాజులు చేయించుకుందంట గాని మీ అమ్మకి ఏమైనా ఇచ్చిందంట్రా! “ఆ అమ్మి కన్నకూతుర్లాంటిదే అనుకున్నా! ఎంత బాగా చూసినా కోడలు  కోడలే! ఎన్నటికీ కూతురు కాలేదు” అని దిగులుగా చెప్పింది మీ అమ్మ. 


 నీ భార్య ని రెండేళ్ళు చదివించిన సొమ్ముతో ఆ నాడే మీ అమ్మ కి ఓ ఇల్లు అమిరివుంటే.. ఇంత వయసొచ్చాక ఇల్లు బాడుగకి ఇచ్చినోళ్ళు యెప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయడానికి నానా అవస్థలు పడేది కాదుగా, ఆమెకు మీ నుండి చిన్నమెత్తు సాయం లేదు వీసమెత్తు గౌరవం లేదు. ఎందుకే వాళ్ళపై నీకంత భ్రమత అని నేను చివాట్లు పెడతా. అయినా వినదు. నా కోడలికి ఆ చీర బాగుంటది ఆ నగ బాగుంటది. నా మనుమరాలికి అది కొనాలి ఈ నగ చేపియ్యాలి అని పరుగులు తీస్తది. నువ్వు పంపిచ్చిన డబ్బులను ఎగాదిగా వాడకుండా పొదుపుగా వాడుకుని మీకే అమర్చిపెట్టుద్ది. నీ కన్నా నేనే నయం గదే! దేశమంతా యాత్రలు తిరిగివచ్చా. నువ్వు పక్కనున్న చంద్రగిరి కోట చూడలేదు అరుణాచలం పోలేదు. ఎప్పుడు డబ్బులు లేవు లేవు అంటావ్, అని మందలిస్తే.. నేను కూడా చెడీబడీ కొనేసి దేశమంతా చుట్టేసి ఖరీదైన చీరలు చుట్టేస్తే నీ మనుమడు చేసిన అప్పులు తీరేవా? బిడ్డ నష్టపోయాడు, మోసపోయాడు, అప్పుల పాలై పోయాడు. వాడికి  నేనెలాగూ  సంపాదించి పెట్టలేను ఈ మాత్రం అండగానైనా వుండకపోతే యెట్టా! కొందరు జల్సాగా అనుభవించడానికే పుట్టి వుంటారు. కొందరు నాలా కష్టపడటానికి పుట్టి వుంటారు అని వేదాంతం చెబ్బుద్ది. అత్త కట్టిన సామ్రాజ్యంలో కోడలు రాజ్యమేలుద్ది అంటారు.మరట్టాగే వుంది నీ ఇంట్లో నీ భార్య తీరు  దానికి నువ్వు వకాల్తా పుచ్చుకుని మీ అమ్మ మీద విరుచుకు పడటమూనూ. 


మీ అమ్మను యెన్నోతూర్లు ఛీత్కరించినావంట. యెన్నోతూర్లు నువ్వు  అమెరికా కి ఇక రాబాకు అని అన్నావంట.  నువ్వెళ్ళిన పద్నాలుగేళ్ళకి మూడుసార్లు కాబోలు నీవుండే కాడికి వచ్చింది. వచ్చినప్పుడల్లా రానూపోనూ విమానం టిక్కెట్లు వచ్చాక ఆడ కట్టే హెల్త్ ఇన్సూరెన్స్  కలిపి నీకు భారం యెక్కువైతదే అనుకో, అయినా అట్లా ఛీత్కరించుకోవడం యేమైనా పద్ధతిగా వుందంట్రా? నిన్ను ఏరా! అంటేనే నచ్చని నువ్వు అమ్మని మాత్రం అగౌరవపర్చవచ్చా! పాపం! మీ అమ్మ మనసు యెంత గాయపడిందో! పద్దాక తల్చుకుని తల్చుకుని ఏడుస్తాది. నీకు ఫోన్ చేస్తే ఇరవై సెకన్లు ముప్పై సెకన్లు. ఫ్రెండ్స్ తో వుంటానంటివి ఆఫీసులో వుంటానంటివి. నీ కోడలికి ఫోన్ చేయ్ అని కట్ చేస్తావు.మీ ఆవిడకి ఫోన్ చేస్తే రెండు మూడు మాటలు. పిల్లదానితో ముచ్చట్లాడదామంటే పైన వుంది అంటది. మూడు నాలుగు రోజులకు ఒకసారి కూడా పిల్ల కనబడేది లేదు. నీ భార్య బాబాయి కూతురికి నీ పిల్లను మాలిమి చేసేస్తిరి. మీ అమ్మ పక్కన పడుకుని పిల్ల రైమ్స్ చూస్తుంటేనో పాటలు పద్యాలు చెప్పుకుంటూ వుంటేనో  దాన్ని బలవంతంగా తీసుకుపోయి నిద్రబుచ్చి చెల్లెలు పక్కన పడుకోబెట్టి బయటకుపోతారు మీరిద్దరూ. అప్పటికి మీ పిల్లను ఆ పిల్ల భద్రంగా చూసేది మా అమ్మ చూడనిది అని అర్థమా!?  ఆ క్షణాల్లో మీ అమ్మ మనసు యెంత నొచ్చుకుని వుంటది, ఆలోచించి చూడు. మీ అమ్మ దగ్గర  నేను వుండినప్పుడు మీ వేషాలన్నీ చానా  చూసాను లే! 


మీ అమ్మ అదేదో ప్రపంచ ప్రసిధ్ది గాంచిన  పుస్తకం కావాలని అడిగిందంట. ఇరవై డాలర్ల ఖరీదు చేసే ఆ పుస్తకం కొనిపెట్టకపోతివి. ఆ పుస్తకం ఆన్ లైన్ లో కుస్తీ పడి చదువుకుంది అంట. బాగా నచ్చింది అంట ఆ పుస్తకం. మీ నగరంలోనే మీకు అరగంట ప్రయాణదూరంలో వున్న ఆ రచయిత్రి స్మారక  కేంద్రం చూడాలని ఉవ్విళ్ళూరిందంట. సంవత్సరన్నర కాలంలో మీ అమ్మకు ఆ ఇల్లు చూపించడానికి నీకు తీరికేలేకపోయిందా? అంత బిజీగా వుండార్రా మీరు? నీకు క్రికెట్ ఆడుకోవడానికి,సినిమాలు చూడటానికి నీ భార్యా పిల్లతో కలిసి ఫ్రెండ్స్ ఇళ్ళకు పార్టీలకు వెళ్ళడానికి తీరుబడి వుంటుంది కానీ మీ అమ్మ అడిగిన చిన్న కోరిక తీర్చడానికి సమయంలేదా? మీ ఇంటికి రెండు మైళ్ళ దూరంలో వున్న లైబ్రరీ లో తను రాసిన పుస్తకాలు వుంచుదామని తనను తీసుకు వెళ్ళమని అడిగి అడిగి అలసి పోయిందట. అందుకూ తీరిక లేదు నీకు. ఇక అక్కడే వున్న తన స్నేహితురాలికి ఆరోగ్యం బాగుండక ఆపరేషన్ చేస్తే  చూడటానికి వెళ్దామని అడిగి అడిగి రోత పుట్టి అడగడం మానుకుంది అంట. ఏం బిడ్డవి రా అయ్యా! మీ అమ్మ ఏమన్నా విమానాలకి టికెట్లు కొని నయాగరా ఫాల్స్ చూపమని అడిగిందా వైట్ హౌస్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూపించమని అడిగిందా? అరగంట దూరం కార్లో పోయి వచ్చే ప్రదేశం చూపమని అడిగింది. దానికి అయ్యే ఖర్చు నువ్వు ఒకరోజు రెస్టారెంట్లో చిరుతిండి తినే ఖర్చు. నీ భార్య తినే ఐస్ క్రీమ్ అంత ఖర్చు. మీరు ఆర్డర్ పెట్టుకునే పిజ్జాలంత ఖర్చు.  తల్లి చిన్నపాటి కోర్కెను తీర్చలేని నువ్వేం బిడ్డవి రా!? నీకు నచ్చినవి ఇవ్వడం కాదూ అమ్మ అడిగినవి ఇవ్వడం తెలియదూ నీకు. 


మీ అమ్మ ఖరీదైన బహుమానాలు అడిగిందా, విహార యాత్రలు,విందు భోజనాలు అడిగిందా? తలకు మించిన భారం మీదేసుకుని పుట్టినరోజు పండుగలు చేస్తావుంటే చూసి ఊరకుండలేక పెద్దదానిగా, మంచి చెడు బిడ్డకు చెప్పుకుందామనుకుంటే వినే ఓపిక లేకుండే నీకు. కరోనా వచ్చి గదిలో పడివుంటే పదకొండు గంటలైనా ఇన్ని కాఫీ నీళ్ళు దాని ముఖాన పొయ్యకపోయే, అయ్యా!మందులు వేసుకోవాలి గా, ఇంతవరకూ ఏమీ తినకపోతే  యెట్టా?  ఏమైనా పట్టుకుని రా!  అని నీకు ఫోన్ చేసి చెబితే నువ్వు విసుక్కుంటూ కాసిని  పాలు అవెన్ లో కాచి అందులో నాల్గు బ్రెడ్ ముక్కలు వేసుకొచ్చి యిచ్చి యింకెప్పుడూ యిక్కడికి రాబాకు. నా భార్య నీకు చేసిపెట్టదు అని అమ్మను విసుక్కొనే బదులు నీ భార్యను   మందలించవచ్చు కదరా! అంత దద్దమ్మ వి అయిపోయావా నువ్వు? నువ్వు నీ భార్య కలిసి ఎంత అగమానం చేసి పంపినారు!!.

మీ నిరాదరణ  మీ ఛీత్కారాలు మీ మాటలు అన్నీ తల్చుకుని తల్చుకుని గట్టు తెగిన వాగు అవుతది. అట్టాంటప్పుడు దాన్ని చూస్తే కడుపు తరుక్కుపోద్ది. 


మీ అమ్మ కపటం లేని మనిషి రా! మీ నాన్న భర్త గా యెంతో ద్రోహం చేసినాడు. పీకలదాకా తాగొచ్చి తల పగలగొట్టాడు మక్కెలిరగదన్నాడు. ఎంతగానో అవమానించాడు. అలాంటి దుర్మార్గుడి నుండి తప్పించి మీ అమ్మను మేమే దూరంగా పంపించేసాం. నిన్ను పెట్టుకుని ఇరవై యేళ్ళు నీ కోసమే బతికింది పాటుపడింది. అటువంటి మీ అమ్మకు రోగమొస్తే యిన్ని మంచినీళ్ళు పొయ్యడానికి ఇంత కూడు పెట్టడానికి కష్టం అయిపోయిందా నీకు. మీ అమ్మ నీ దగ్గర వుండేదానికి యిష్టపడేది యెందుకో తెలుసా! నీ పిల్లను వొళ్ళో వేసుకుని ఆడించేది ఉప్పుమూట మోసోది, యెత్తుకుని మోసేది స్నానం చేపిచ్చి గోరుముద్దలు తినిపించేది ప్రేమ నిండిన హృదయంతో.  నీ పిల్ల ముద్దు మురిపాల్లో  చిన్నప్పటి  నిన్ను  చూసుకోవడం కోసం.  ఆ పసి స్పర్శ లో వుండే స్వచ్ఛత కోసం. ఆ ప్రేమలో ఆ స్పర్శ లో తన బాధలు కష్టాలు అన్నీ మర్చిపోవడం కోసం అక్కడ వుంటది. ఆమెకు మీ కన్నా యెక్కువగా యెవరుండారని  యిక్కడ వుండాలి చెప్పు.  ఒంటరితనం అనే పెద్ద రోగమే కాకుండా అనేక అనారోగ్యాలకు మందు మనుమరాలు అని, కొడుకు కోడలు దగ్గర వుంటే ఏ బాధలు తన దరిదాపుల్లోకి రావు అని అనుకోవడమే అది చేసిన తప్పా!? అదే పెద్ద శిక్ష అయిపోయింది దానికి. ఆప్యాయంగా కంచంలో ఇంత కూడు వెయ్యకపోయినా పెద్ద దరిద్రం యింట్లోకి వచ్చి కూర్చుంది అనే నవనాడులు కృంగ దీసుకునే మాట అనిపించుకుని గుడ్లనీరు గుడ్ల కుక్కుకుని మనవరాలి కోసం  సంవత్సర కాలం  వుండివచ్చింది. ఇన్ని చూసినాక ఒక సామెత గుర్తొచ్చింది. నీకు అమ్మ అల్లం పెళ్ళాం బెల్లం అయిపోయింది అని. మీరు చేసినవి చెప్పాలంటే యింకా చాలా వుండాయిలే, కతలు కతలుగా చెప్పింది మీ అమ్మ.  ఎనబై ఏళ్న ముసలిదాన్ని.  సరిగా గుర్తుండక అన్నీ అడగలేకపోతున్నా.  అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఇంకోసారి ఉత్తరం రాస్తానులే!


ఎక్కడో అక్కడ తప్ప తల్లులు  బిడ్డలకు ఏం ద్రోహం చేస్తారు రా నాయనా! కోడలు కూడా ఓ ఇంటి కూతురే కాబట్టి తప్పు దారిన నడుస్తుంటే  తమ బిడ్డే అని పక్షపాతం చూపకుండా   కొడుకుని మందలిస్తారు. ధర్మం చెబుతారు. నేను మీ తాత అదే చేసినాము. మీ నాన్న ను పెడన పెట్టాము. నిన్ను కూడా అప్పుల పాలు కాకుండా కాపాడుకోవాలని మీ అమ్మ మంచి సెబ్బర చెప్పబోద్దేమో, అంతేగా! నువ్వు మీ అమ్మ మాట ఏనాడైనా విన్నావా పెట్టావా?  మీ అమ్మ నిక్కచ్ఛిగా మాట్లాడుతుంది. మాట కరుకు కావచ్చోమో గానీ దాని  మనసు వెన్న. నేను మంచానా పడితే చూసేది కూడా మీ అమ్మే! నలుగురు కోడళ్ళున్న అత్తగా నేను మీ అమ్మ మనసు వరుస తెలిసిన మనిషిగా చెబుతున్నా! అంతెందుకు? మీ నాన్న పరాయిదాన్ని పెట్టుకుని  ఇరవై యేళ్ళ మిమ్మల్ని వొదిలేసి పోతే కయ్యలు పశువులు మోటరుబండ్లు అన్నీ అమ్ముకుని నాశనం చేస్తే నిన్ను నిలబెట్టింది మీ అమ్మ కాదూ! నీ పెళ్ళప్పుడు వచ్చి  దిష్టిబొమ్మలా నిలబడటం తప్ప మీ అయ్య చేసింది ఏముందిరా కూరలు బాగోలేదు, మర్యాదలు బాగా జరగలేదని వొంకలు పెట్టడం తప్ప. అట్టాంటి మీ నాన్న కు నయం కానీ రాచపుండు పుడితే యింటికి తెచ్చి హాస్ఫిటల్ కి తిప్పుతూ లక్షలు ఖర్చు పెట్టింది.  వచ్చిపోయే మీ నాన్న మరో సంతానాలను ఆదరించి మీ నాన్న కూసే వొంకర కూతలన్నీ భరించింది. ఏడాదిపాటు నరకం చూస్తూ కూడా  మనిషి బతికితే చాలని తాపత్రయపడింది. మీ నాన్నను అరచేతుల మధ్య  పెట్టుకుని చూసింది.ఆఖరికి మీ అమ్మ చేతుల మధ్యనే ఊపిరి వదిలాడు. దూరంగా వుండి  డబ్బులు పంపడం తప్ప మీ అమ్మ మీద రంకెలేయడం తప్ప నువ్వు చూసింది చేసింది ఏడ అని? మీ అమ్మ దగ్గర ఇంకా నీకు ఈయటానికి ఏమీ లేవు ఎముకలు తప్ప. సొమ్ము లేకపోయేసరికి మీ అమ్మ నీ కంటికి గౌరవంగా కనబడటం లేదేమో! అమ్మంటే అంతు లేని సొమ్ము అంటారు.మీ అమ్మ ను పరుల ముందు చులకన చేసుకోబాకు. నువ్వే చులకన చేస్తుంటే నీ భార్య యెట్లా గౌరవిస్తాది విలువనిస్తాది చెప్పు. వాసం గ్రాసం చూస్తున్నావు కదా అని అమ్మ ని బిచ్చగత్తె లాగా చూడకు.తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేరు నాయనా!   


అమెరికా కో ఇతర దేశాలకు పోయినాళ్ళందరూ కాసిన్ని డబ్బులేసి మనుషులు పోయినప్పుడు వాట్సాప్ కాల్ ల్లో కన్నీళ్ళు పెట్టడం కాదు కావాల్సింది. బతికి వున్నప్పుడు అమ్మా తిన్నావా! ఆరోగ్యం బాగుందా? అని అడగడంతో పాటు అక్కడ మనవాళ్ళ చుట్టూ యెవరెవరు వుండారు? వాళ్ళతో మన సంబంధ బాంధవ్యాలు యేమిటి అని ప్రశ్నించుకోవాలి. ఎవరితోనైనా అంటీముట్టనట్లుగా వుంటే  ఇక్కడ  మీకు బంధువులు స్నేహితులు ఎట్టా వుంటారు? నాకు ఎవరూ లేరు అనుకోవడం యెందుకు? ఉన్న వాళ్ళను నువ్వెంత విలువగా ఇష్టంగా పలకరిస్తున్నావ్ చెప్పు? ఈ ముసలి ముండకైనా యెప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడావా? మీ అమ్మ దగ్గర వుంటే నేను  వాట్సాప్  కాల్లో  మాట్లాడటం తప్ప.  అంతెందుకూ! మీ పిన్నమ్మ నిన్ను చిన్నప్పుడు రెండేళ్ళు పెంచింది.తన దగ్గర పెట్టుకుని చదివించింది. నీ ముడ్డి కడిగి నీ మూతి తుడిచి పక్కలో పడుకోబెట్టుకుని చక్కంగా ప్రేమగా పెంచింది. పెరిగి పెద్దవుతుంటే నీకు మంచి భవిష్యత్ వుండాలని తాపత్రయపడింది. అమెరికా లో ఇంకో మూల వున్న దాని బిడ్డ ఏదో ఇబ్బందిలో పడిందేమోనని వెళ్ళి చూసి రమ్మని వేడుకొంది. నువ్వు వొంకలు చెప్పావ్  ఆఖరికి పెడ చెవిన పెట్టావ్. రక్తసంబంధం వున్న వాళ్ళు నీకు ఆప్తుల్లా కనబడకుండా పోయారు. అమ్మ వైపు కానీ నాన్న వైపు కానీ బంధువులు ఎవరూ నీ వాళ్ళు కాకుండా పోయారు. భార్య తరపు బంధువులు ఆత్మ బంధువులై పోయినట్టున్నావ్. నీలాంటి వాళ్ళను చూసే అయినవాళ్ళకు ఆకుల్లో కాని వాళ్ళకు కంచాల్లో అని అంటారని నీకు తెలియదేమో!.  


పయిలం బిడ్డా! అన్ని బంధాలను పెడన పెట్టి డబ్బు సంపాదనే లోకంగా భార్య మాటే వేదవాక్కు గా బతకబాకు. బతకనేర్చిన మాటలు మాట్టాడబాకు. మళ్ళీ చెబుతుండా, మీ అమ్మ కుమిలి కుమిలి ఏడుస్తా వుండింది. అది మొగుడు లేకుండా బతకగల్గింది కానీ  బిడ్డ  చూసే  పెడసరపు చూపు భరించలేకపోతుంది. అయినా మీ అమ్మ బతకడం తెలిసిన మొగలాయి. మీ నాన్న ను వొదిలేసి బతికినట్టు నిన్ను నీ పాటికి వొదిలేసి బతకగలదు. అయ్య లేనివాడిగానే పెరిగావ్. వాడూ పొయ్యాడు.  ఇక అమ్మ కూడా లేకుండా  యెవురూ లేని వొంటి గాడివి అయ్యి నీ భార్యబిడ్డలు చాలనుకుని ఒంటిగా బతికేయకు బిడ్డా, పయిలం బిడ్డా! ఈ వేలు కు ఆ వేలు యెడం అంటారు. ఏడనో  సముద్రాల అవతల వున్నవాడివి, మనసులో నైనా ఆలోచనలో నైనా మీ అమ్మ లాగా మనఃస్ఫూర్తిగా నా వాళ్ళు అని అనుకోవడం నేర్చుకో. మనసు నిబ్బరంగా వుంటది.మంచికి చెడుకీ మనుషుల అండ వుంటది. అయినవాళ్ళను దూరం చేసుకోబాకు. మనిషికి రవొంత డబ్బున్నా కొండలాంటి అండ వుండాలి. అది పోబొట్టుకోబాకు.  ఇంట్లో పెద్ద బాలశిక్ష పెట్టుకొని యింటిల్లపాది చదువుకోండి చాలు. అప్పుడు  బయట భగవద్గీత చెప్పబడల్లేదు నువ్వు. అమ్మల గురించి బిడ్డలు బిడ్డలు గురించి అమ్మలు గర్వంగా చెప్పుకోవాలి. ఫిర్యాదు చేయకూడదు. వుంటాను మనుమడా! శుభాశీస్సులతో ..  నాయనమ్మ.  


పిల్లవాడిని మనిషిగా చేయడానికి తల్లికి ఇరవై ఏళ్ళు పడుతుంది. 

అతడిని మరో స్త్రీ ఇరవై నిమిషాల్లో 

“పూల్ “ ని  చేస్తుంది.  - రాబర్ట్ ప్రాస్ట్. 


(బహుళ త్రైమాసిక అంతర్జాతీయ మహిళా పత్రిక - ఏప్రిల్-జూలై సంచిక లో ప్రచురితం)







1, జూన్ 2023, గురువారం

జీవనగంగ

 గబగబ నడుస్తూ పని చేసే యింటికి  వెళుతుంది గంగ. చేతిలో వున్న ఫోన్ మోగింది. సరళ నుండి ఫోన్. యెత్తగానే అవతలి నుండి ప్రశ్న.

“ఎక్కడ వున్నావు” 


“ మీ యింటికి దగ్గరలో వున్నానండి అపార్ట్మెంట్ లో పని చేసుకుని వస్తాను”


“నేను యింట్లో లేను కానీ నువ్వు యింటికి వెళతావుగా , నేను చెప్పిన పని చేస్తావు కదా” అదో రకం వొత్తిడి పెడుతూ అడిగింది సరళ.


ఇబ్బంది పడుతూ నిమిషం పాటు ఆలోచించి “గంట తర్వాత వెళతాను, పర్వాలేదా అండీ”


“బయటకు వచ్చాక ఫోన్ చేయి, యెక్కడో వొక చోట కాలక్షేపం చేస్తాను. చెప్పిన మాట మర్చిపోకు. బుస్స్ మనే ఆ పాము కోరలు పీకి పడేసేలా వుండాలి. ఇంకెప్పుడూ బుస కొట్టకూడదు,కాటు అసలే వేయకూడదు”


“సరేనండీ”.. నడుస్తూ ఆలోచిస్తుంది. ఇలాంటి వొక రోజే కదా..ఉన్నపళంగా తన యింటి రాతంతా మారిపోయింది అని బాధగా అనుకుంటూ రెండు నెలల కిందట జరిగిన చేదును గుర్తుచేసుకుంది గంగ. 


**********

మసక చీకట్లోనే తడుము కుంటూ మెల్లగా యింటి వెనక్కి నడిచింది నర్సమ్మ. ఈడుస్తున్న కాళ్ళతో రెండడుగుల యెత్తులో వున్న బాత్రూమ్ లోకి పోవడానికి చానాసేపు పట్టింది. పది నిమిషాల తర్వాత తలుపు తీసి చుట్టూరా చూసి నివ్వెరపోయింది. ఐదారు ఆకులతో వొత్తుగా నవనవలాడుతూ గోడ వారగా పెరుగుతున్న కొత్తిమీర మడి తోటకూర మడి మాయమైపోయాయి. 


“అయ్యో అయ్యో, నా ఆక్కూర మడంతా మాయమై పొయ్యింది. నిన్న పొద్దుటేల కూడా చూసేను కదా. ఏ ముదనష్టపు చేతులు పడ్డాయో,పరక్కూడా లేకుండా పీక్కుపొయ్యాయి,ఆ చేతులిరగిపోనూ ఆళ్ళకు కుష్ఠు రోగం రానూ, ఆళ్ళ అమ్మ కడుపు కాల”.. తిట్ల దండకం తో సన్నటి దుఃఖపు గొంతుతో మడి దగ్గరకు నడిచింది నర్సమ్మ.


“అత్తా, యెవరో యెందుకు చేత్తారు, నిన్న మజ్జేనం నీ కొడుకే పీక్కుపోయి అమ్మేసుకుని తాగేసాడు” అన్జెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుంది గంగ.  


“ఓరి దుర్మార్గుడా, నీకు పోయేకాలం వచ్చింది రా,” అని తిట్టుకుంటూ రేకుల వసారాలోకి జేరి మంచంపై కూలబడింది. ఇంటిని వొకసారి కలియదిప్పి చూసుకుంది. ఒక పెద్ద గది దానిముందు రేకు వసారా.అందులో చిన్న వంట గది. వసారా లో తన మంచం. గవర్నమెంట్ కట్టించిన యిల్లు అది.  ఈ యింటి మీద కూడా వీడికి యిక అప్పు పుట్టనట్టు వుంది.అందినకాడికి యేదిబడితే అది యెత్తుకుపోవడమే మిగిలింది.ఇల్లు వొల్లు గుల్ల చేసుకుని నూరేళ్ళు బతికింది యెవరూ.. అందులో సగం ఆయువుంటే మా గొప్ప “ అనుకుంది ఖాళీ గా వున్న తన నుదుటిని తడుముకుంటూ. 


 తన చేత్తో తన కన్ను ని తానే పొడుచుకుంటున్నట్లు తమ బతుకుల్లో నెలకొన్న పేదరికాన్ని  యెన్నడూ జయించనివ్వని వ్యసనానికి బానిసైన కొడుకుని తలుచుకుని దిగులుపడింది. కళ్లల్లో గుచ్చుకుంటున్న పొద్దుకి యెదురుగా కూర్చుని కోడలిచ్చిన టీ తాగి నెమ్మదిగా లేచి గోనెపట్టా చేతబట్టుకుని కర్రపోటు సాయంతో ఆ కాలనీ సెంటరుకు బయలుదేరింది. 


మార్కెట్ లో గుత్తానికి  ఆకు కూర కట్టలు కొని మార్కెట్ బయట గోనెపట్టా పరుచుకుని కూర్చునేదాకా రోజూ కోడలు వచ్చి సాయపడుతుంది. ఆ రోజు కోడలిని సాయమడగాలన్నంత బుద్ది పుట్టక ఒంటరిగానే బయలెల్లింది. 


 నర్సమ్మ ఆకు కూరలు అమ్ముకుంటూనే కూసింత ఖాళీ దొరికితే చాలు కట్టల మట్టి దులిసేసి చీడ పట్టిన ఆకులేరేసి పచ్చబడిన ఆకులను తుంచేసి శుభ్రం చేసి క్యారీ బేగ్ లలో పెట్టి వుంచుతుంది.ఆ పనులన్నీ చేసుకునే తీరిక ఓపిక లేని కొందరు వాటిని వతనుగా ఆమె దగ్గరే కొంటూ వుంటారు. మరికొందరు ఆమెతో కూడా గీచి గీచి బేరమాడతారు. దయాశీలురు కొందరు ఆ వయస్సులో కూడా యేదో వొక పని చేసుకుని బతకాల్సిన అవసరాన్ని గుర్తించి గ్రహించి యింకొంత డబ్బును వుదారంగా యిచ్చిపోతారు. 


మధ్యలో నాలుగు ఇడ్లీలు తిని యింకోసారి టీ తాగి మధ్యాహ్నం దాకా పనిచేసుకుని యాభై వంద మధ్య డబ్బు చేసుకుని యింటికి చేరుకుంటుంది. కోడలు వుదయాన్నే వంట చేసి పెట్టి వెళ్ళి నాలుగిళ్లల్లో పనిచేసుకుని వచ్చేటప్పటికి .. నర్సమ్మ ఓ కునుకు తీసే వుంటుంది. 


కానీ ఆ రోజు గంగ ఇంటికి రావడం ఆలస్యం అయింది. 

నక్షత్రాలు కనబడనివ్వని కారు మేఘాలు నగరాన్ని కమ్మేసాయి. నగర శివారు  రాత్రి  దీపాలతో వెలుగుతుంది. మెయిన్ రోడ్ లో అడపాదడపా తిరిగే ఆటోలు తప్ప పెద్దగా సందడి లేని రోడ్డు. బస్టాఫ్ దగ్గర ఆగిన ఆటో లోనుండి  దిగిన గంగ నడుస్తుంది. 


వర్షాకాలపు గంభీరమైన నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ వీధి కుక్కల కాట్లాట. చేతిలోని గొడుగుని వాటికి  తర్జన గా చూపిస్తూ వడి వడిగా యింటికి చేరుకుంటూ.. మొగుడిని తలుచుకుని మహానుభావుడు ఖాళీ అయిన గ్యాస్ బండ యిచ్చేసి నిండు బండ తెచ్చాడో లేదో. అప్పు దొరికిందో లేదో అనే ఆలోచనలతో  యిల్లు చేరింది. 


వరండాలో మంచంపై కూర్చున్న అత్త.. “ఇంత ఆలస్యమైందేమే గంగా” అని అడిగింది. 


“యాభై మందికి వంట చేయడం చిన్నమాటా.. అన్ని చేసి సర్ది వచ్చేటప్పటికి యీ టైమైంది. కాళ్ళు పడిపోయినయ్యి అనుకో” 


“ఆడింకా రాలేదు.  నువ్వు కూడా యేమి తేకుండా చేతులూపుకుంటా వచ్చావే! అంత మందికి వండిచ్చుకుని నీకేం పెట్టలేదా” అడిగింది ఆరాగా ఆకలిగా. 


“వాళ్ళ పార్టీ అవ్వలేదు,రాత్రి పన్నెండింటికి అంట. అదవకుండా చుట్టాలు తినకుండా నాకెట్టా పెడతారు”అంటూ కాళ్ళు కడుక్కొని లోపలికి నడిచింది. 


“పిల్లలూ నేనూ  మద్దేనం యేదో వొకటి తిన్నాం. ఇప్పుడు యేం తినాలో యేంటో చూడు. సరిగ్గా కళ్ళు కనబడని నేను యేమి వండేది యెట్టా వండేది” అంది నర్సమ్మ. 


కుక్కపిల్లను వొళ్ళో కూర్చోబెట్టుకుని ఆడుకుంటున్న కృష్ణుడు తల్లిని చూసి గబుక్కున లేచాడు. 


మెటల్ గాజుకు గమ్ రాసి మునివేళ్ళతో చకచక దారాన్ని అల్లుతూన్న నవ్య తల్లిని చూసింది.చేతిలో గాజుని కిందేసి వొక్క వుదుటున లేచొచ్చి తల్లిని చుట్టేసి గగ్గోలు పెట్టి యేడ్చింది. . 


బడికి వెళ్ళి ఆరవ తరగతి చదువుకుంటూనే తల్లికి  ఉదయం యింటి పనిలో సాయం చేయడం సాయంకాలం  గాజులకు రంగులు అద్దడం రాళ్ళు అతకడం దారం చుట్టటం ద్వారా రోజుకు పాతిక ముప్పై రూపాయల సంపాదించి తల్లి చేతికిస్తుంది. అట్టాంటి పిల్ల అంతలా బావురమనడంతో బిత్తరపోయింది గంగ. . 


“ఎందుకు యేడుస్తున్నావే బంగారు తల్లీ,యేం జరిగిందో నువ్వైనా చెప్పవే అత్తా” అంది కంగారుగా. 


“ఏం జరగలేదులే గంగా, నువ్వు బెంబేలుపడమాకు. ఆ యెదవ సచ్చినోడు యేదో చేయబోయాడట. బిడ్డ బాగా భయపడినట్టుంది” అంది. 


“ఎవడాడు?


కూతురిని వొళ్ళోకి తీసుకొని వోదార్చి కాసిని మంచినీళ్ళు తాగిచ్చి యేం జరిగిందో చెప్పమని అడిగింది. 


 “ఆ రమణారావు డబ్బు యిస్తానన్నాడు. ఆ యింటికి వెళ్ళి డబ్బు తీసుకురా అన్నాడు నాన్న” అంటూ మొదలెట్టి జరిగిందేమిటో మననం చేసుకుని చెప్పసాగింది నవ్య. . 


 **********


సన్నగా రివటలా వుండి  పత్తికాయలంటి కళ్ళేసుకుని పెదాలు తడుపుకుంటూ ఆడాళ్ళని అదోరకంగా చూసే రమణారావు యింటికి వెళ్ళమంటే వెనక్కి తగ్గింది నవ్య. 


“ఆ యింటికి నేనెళ్ళను నువ్వే వెళ్ళు”  అంది తండ్రిని.   


“ఎల్లమని చెబుతుంటే నీక్కాదు. నా నాలుగు నాకు పడితేకాని కదలవేమో” అని కసిరాడు. 


అయిష్టంగానే కదిలింది.మూడొంతస్తుల  ఇంటి గేటు ముందు నిలబడి బెల్ కొట్టింది నవ్య. రమణారావు కుక్క తో కూడా వచ్చి తలుపు తీసాడు.ఆ యిల్లు చిన్నతనం నుండి నవ్య కు పరిచయమే.  తమ్ముడు పుట్టక ముందు తన తల్లి ఆ యింట్లో పనిచేస్తున్నప్పుడు  తనను కూడా తీసుకొచ్చి పెరట్లో కూర్చోబెట్టి పని చేసుకునేది. రమణారావు భార్య సరళమ్మ. అప్పుడామె యింట్లో లేదు. 


“ఎంత పెద్దదానివైపోయావే..నువ్వు అంటూ   బుగ్గ గిల్లాడు... టీచరమ్మ యింట్లో లేదు. కూతురిని తీసుకుని షాపింగ్ కి వెళ్ళిందంట. కాసిని కాఫీ కలిపియ్యవే నవ్యా.. తల పగిలిపోతుంది అన్నాడు. “నాకు కాఫీ పెట్టడం రాదండీ. మీరు డబ్బులిస్తే వెళ్ళిపోతా”.. అంది జంకుగా. 


“అదేం బ్రహ్మ విద్యా? నేను యెలా చేయాలో చెబుతాను నువ్వు చేద్దువుగాని. లోపలకు రా” అంటూ చొరవగా చెయ్యి పట్టుకుని వంటింట్లోకి లాకెళ్ళాడు. పాల గిన్నె పొయ్యి మీద పెట్టించి “నేను పైకి వెళ్ళి డబ్బులు పట్టుకొస్తా, పాలు పొంగకుండా చూడు” అని పైకి వెళ్ళాడు. నవ్య పాల వంక చూస్తూనే వుంది. లోలోపల బితుకు బితుకు మంటూ యేదో భయం.  కొద్దిసేపటికి పిల్లిలా చప్పుడు చేయకుండా వెనక నుంచి వచ్చి కొండచిలువలా వొళ్ళంతా చుట్టేసాడు. భయంతో అరుస్తూ విదిలించుకుంటూ గుమ్మం వైపు చూస్తే. తలుపులు  మూసేసి వున్నాయి. నవ్య వణికిపోతూ  బిగ్గరగా అరిచినా బయటకు వినబడని పెద్ద శబ్దంతో  టివి లో పాటలు. 


యెరుపెక్కిన కళ్ళతో  ముఖమంతా తడిచేసి  గుండెలపై కర్కశహస్తాలతో తడిమి తడిమి తర్వాత అకస్మాత్తుగా నీరుకారిపోయి కుర్చీలో కూలబడిపోయాడు. షాక్ నుండి అయోమయం లోకి తర్వాత  అసహ్యంలోకి మారిన ముఖంతో బయటకు రాబోతున్న నవ్య చేతిలో వెయ్యి రూపాయలు పెట్టాడు. “ఇక్కడ జరిగింది యెవరికీ చెప్పకు. అప్పుడప్పుడు వస్తూ వుండు. నీకు చాలా డబ్బులిస్తాను” అన్నాడు.


ఆ డబ్బులు అక్కడే విసిరేసి పరిగెత్తుకుని యింటికి వచ్చి పడింది. డబ్బు కోసం యెదురుచూస్తున్న తండ్రికి  జరిగింది చెప్పింది. డబ్బులెందుకు  పడేసి వచ్చావని తండ్రి వొక్కటిచ్చాడు. ఏడ్చుకుంటా వెళ్ళి నాయనమ్మకు చెప్పింది. అది విన్నాక ఆవేశపడిన నర్సమ్మ యెదురుగా లేని కొడుకుని తిట్టిపోసింది, దినవారాలు చేసేసింది. 


తల్లితో ఆ విషయమంతా చెప్పిన నవ్య  మళ్ళీ వెక్కుతూ యేడ్చింది. వింటున్న గంగ కోపంతో వణికిపోయింది. పిల్ల ఏడుపు చూసి కడుపు తరుక్కుపోయింది.తల్లి ముఖంలో కోపం, ఏడుస్తున్న అక్కను చూసి బిక్కముఖం పెట్టుకున్నాడు కృష్ణుడు.  


గంగ కాసేపటికి మనస్సు చిక్కబట్టుకుని కూతురి వైపు చూసింది.  నవ్య కళ్ళలో యింకా వీడని భయం. చీటికిమాటికి తాగుబోతు తండ్రి తిట్టే తిట్లకు కన్నీళ్ళు తప్ప మరే యితర కలలు కనని ఇంద్రధనుస్సు లసలే  పూయని అమాయకమైన సోగ కళ్ళు అవి. అమ్మ ను యెప్పుడూ విసిగించకూడదని వొట్టు పెట్టుకున్నట్టు వుండే ముఖం.  నాన్నను యేవీ తెచ్చిమ్మని అడగని నోరు అది.  జరిగినదాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే యెట్టా! ఆ సంగతి మర్నాడు చూద్దాం, పిల్లలు ఆకలి తీర్చాలి ముందు అని నెమ్మదిగా లేచింది.

 

స్టీల్ బేసిన్ లో పిండిని ముద్దగా కలుపుతున్న తల్లి చేతి కదలికను తదేకంగా  చూస్తున్నాడు కృష్ణుడు. అమ్మెందుకో బాగా కోపంగా వుందని అర్దమై దిగులేసింది.  కసిగా కదిలే ఆ వేళ్ళ కదలికల్లో కట్టుకున్న వాడిపై వున్న కోపావేశాలు కళ్ళలో బిడ్డలకు పట్టెడన్నం వొండి పొట్ట నింపలేని ఆక్రోశం వాడికేమీ తెలియకపోయినా నెమ్మదిగా తల్లి పక్కన చేరాడు. 


గంగ యేడేళ్ళ కొడుకు వైపు చూసింది. మాములుగా అయితే ఆమెతో పాటు పీటపై కర్రతో రొట్టెలు చేయడానికి సరదా పడేవాడు. కానీ వుదయం నుండి అర్దాకలితో వున్నాడయ్యే. ఆ పనిజోలికి వెళ్ళకుండా పక్కనే కూర్చున్నాడు. వాడి చిన్ని పొట్ట ఆకలిని కళ్ళలో వినబడని ప్రశ్నలను అర్దం చేసుకున్నది గంగ. పిండి కలిపిందే కానీ సిలిండర్  లేని పొయ్యి పై రొట్టె యెట్లా కాల్చాలో  పాలుపోలేదు.మూడు రాళ్ళ పొయ్యి కింద  మండటానికి కట్టెలు గతి లేని కిరోసిన్ లేని యిల్లే గాని ఆమె గుండెల్లో మొగుడు రగిలించిన  నెగడు మండుతూనే వుంది. కలిపిన పిండి డిప్పను పక్కన పెట్టి వరండాలో మూలనున్న అట్టపెట్టె తెరిచి చూసింది. రొండే దోసిళ్ళు వున్న కర్ర బొగ్గుల సంచి కనబడింది.  కుంపటిని తీసుకొచ్చి గుమ్మం ముందు కూర్చుని కుంపట్లో బొగ్గులేసి నిప్పు పుట్టించే పని మొదలెట్టింది. 


అత్త నర్సమ్మ కోడలు  గంగ ఆలోచనలు కనిపెట్టింది. 


“పొద్దుననగా యెల్లాడు గేస్ బండ పట్టుకొత్తానని. ఇంతవరకు అయిపులేడు.ఏడ తాగి తందనాలు ఆడుతున్నాడో.” అంది. గంగ మాట్టాడలేదు. మళ్ళీ నర్సమ్మే అంది.  “పిల్ల అంతా చెప్పేసి వుంటదని నీకు మెుకం చూపిచ్చడానికి సిగ్గేసి యేడాడ తిరుగుతున్నాడో” అంది.


అత్త వైపు చురుగ్గా చూసి  “నీ కొడుకు సిగ్గు పడటమా, అదో యెనిమిదో వింత అయ్యిద్ది. గేస్ బండ తెస్తాడని నీకు నమ్మకం వుందా యేంటి, చేసే యెదవ పనుల చిట్టా రోజు రోజుకి పెచ్చరిల్లిపోతుంది. ఎవడన్నా బిడ్డను చూసి యెదవ్వేషాలేస్తే దుడ్డు కర్ర తీసుకొని వాడి నడుం యిరగ్గొట్టాలి. తాగుడికి డబ్బులొస్తయి అని పెళ్ళాన్నో కడుపునబుట్టిన బిడ్డనో యెవడి పక్కలోనో పండబెట్టే తార్పుడుగాడి అవతారం యెత్తడు. సరళమ్మ యింట్లో పని మానేసింది యిందుక్కాదు,నేను తప్పించుకున్నాననుకుంటే బిడ్డను ఆడికి అప్పగించబోయాడు. తలుచుకుంటే భయమేస్తంది,వొళ్ళంతా కంపరంతో  వుడికిపోతుంది.  నీ కొడుకుని మాత్రం వొదుల్తానా? రానీ ఆడి పని చెప్తా”. కుంపట్లో మంట గంగ ముఖంపై తారట్లాడింది కాసేపు. 


ఆమె పిండి గిన్నె తీసుకొని వుండలు చుడుతుండగా.. 

“ఇదిగో గంగా! ఆడిని నేను తిట్టలేదనుకునేవు,ఆడికి ఫోన్ చేపిచ్చి తిట్టా.  దైవసాచ్చిగా చెపుతున్నా! ఇంకెప్పుడైనా ఆయన దగ్గరకు డబ్బెట్టుకు రమ్మని పిల్లను పంపావా కాళ్ళిరగ్గొడతా సన్నాసెధవా! మరీ యింత సన్నాసి యెధవ్వి అవుతావనుకుంటే పురిట్లోనే వడ్డ గింజేసి చంపి వుందును” అని తిట్టిపోసా. ఆ రమణారావును మాత్రం నేను వొదిలాననుకున్నావా?, నడివీధిలో పెట్టకపోయినా యింటెనకమాలకు పిలిచి ఆడి పెళ్ళాం పిల్ల ముందర బుగ్గల్లో బుగ్గల్లో పొడిచి మొకాన ఊసి వచ్చా!  నువ్వొచ్చాక నీకొక మాట చెప్పి పోలీసు స్టేషన్ కి పోదాం అని చూత్తన్నా, నువ్వేమంటావ్ మరి” 


 “ఇప్పుడేడ పోతాం, ఆలోచిచ్చుకోని నన్ను. ఏ సంగతి రేపు చూద్దాం.” 


ఈ మాటలేవిటికీ  అర్దం తెలియని కృష్ణుడు అమ్మ చేతిలో పిండి రొట్టైలయ్యీ  పళ్ళెంలోకి  పరుగెత్తి వచ్చే గోధుమ వర్ణపు చంద్రుడై నోట్లో వెన్నముద్దై కరిగి భగభగమని మండే జఠరాగ్నిని చల్లబరుస్తాయని ఆత్రంగా యెదురుచూస్తున్నాడు. నవ్య మంచంపై ముడుచుకుని  ఆలోచిస్తుంది. 


పిల్లలకు అత్తకు రొట్టెలు పెట్టి తను మజ్జిగ తాగి పడుకుంది గంగ. ప్రసాద్ పేరుకు ఆటో తోల్తాడు. అంగట్లో సరుకుల్లా ఆమ్మాయిలను బుక్ చేసి రమణారావుకు అప్పగించేవాడు.  భార్య గంగ తన సొంత ఆస్థి అనుకుని ఆమెను రమణారావు వైపుకు నెట్టడానికి శక్తియుక్తులన్నీ ప్రయోగించాడు. గంగ మొగుడిని ఛీత్కరించుకుంది. పెట్టెబేడా సర్దుకుని పిల్లలను వెంటబెట్టుకుని పల్లెటూరుకు బయలెల్లింది. కాళ్ళబేరానికి వచ్చినట్టే వచ్చాడు కానీ యింటికి రావడమే మానేసాడు. గంగ కాకపోతే మంగ అన్నట్టు వేరొక స్త్రీతో రెండో యిల్లు యేర్పరుచుకున్నాడు. ఆ సంగతి తెలిసినా పట్టించుకోలేదు గంగ. పట్టించుకుని గనుక యేమి చేయగలను,ఎక్కడైనా రెక్కలు ముక్కలు చేసుకుని బతకాల్సిందే కదా బిడ్డల చదువు కోసమైనా పట్నాన్ని అంటిపెట్టుకుని వుండాలి తప్పదు అనుకుంది. 


సన్నగా మొదలైన వాన కుంభవృష్టి గా మారింది. గంటల్లోనే లోతట్టు ప్రాంతంలో వుండే వారిళ్ళ మధ్య కలకలం.దాదాపు అందరి  ఇళ్ళను వరద చుట్టేసింది. పిల్లలు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. ఆడాళ్లు కంగారుగా చేతికందిన చెంబూ తపేళ మూటాముల్లె నెత్తినెట్టుకుని పిల్లలను పట్టుకుని  మోకాలు లోతు నీళ్ళలో కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నారు. మగవాళ్లు  ఇళ్ళ వరుసను బట్టి రోడ్డును అంచనా వేసుకుంటూ అందరినీ హెచ్చరిస్తూ ముందుగా నడిచారు. 


నర్సమ్మ అందరికన్నా చివరన నడుస్తూ వెనక్కి వెనక్కి చూసుకుంటుంది.  “నాయనా.. కిట్టయ్యా కుక్క పిల్లను చంకనేసుకున్నావా  లేదా? పిచ్చిముండ మునిగి చచ్చిపోద్ది” అంది. 


 “నానమ్మా, నేను కుక్క పిల్లను భుజానేసుకుని నడుస్తున్నా. నువ్వు గబగబ రా.. నీళ్లు పైకొచ్చేస్తున్నాయి” అని అరిచాడు కృష్ణుడు. అందరూ భయం గుప్పిటబెట్టుకుని వానలో తడుస్తూనే ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నారు. గంగ చేతిలో వున్నవి తలపై వున్న మూటను దించి అక్కడే పిల్లలను  కూర్చోబెట్టి నర్సమ్మ కోసం వెనక్కి వచ్చింది.  భుజం పట్టుకుని నడిపిస్తుంటే నర్సమ్మ వెనక్కి తిరిగి ఇంటి వైపు చూసుకుంటూ కళ్లు తుడుచుకుంటూ గొణుక్కుంటూ కోడలితో నడిచింది. ఎత్తుపై నుండి కూడా తదేకంగా  కనీకనబడని తన ఇంటిని చూసుకుంటూ వుండిపోయింది. ఆ రాత్రి కాళరాత్రే అయింది వారికి. అధికారులు వచ్చి  అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు.  రాజకీయ నాయకుల సహాయ కార్యక్రమాలు జరుగుతూనే వున్నాయి.


తెల్లారినాక కూడా వాన కురుస్తూనే వుంది.  గంగ నర్సమ్మకు టీ టిఫిన్ తీసుకొచ్చి యిచ్చి “ఇంకా రెండు రోజులు వాన యిట్టాగే వుంటదంట. ఇక మనం ఇంటి ముఖం చూత్తామో లేదో,  అంతా నానిపోయి కూలిపోద్దో యేమో, తలదాచుకోడానికి ఆ నీడ కూడా లేకుండా పోద్దేమో అత్తా! ఈ కష్టం పగోడికి కూడా వద్దు’’  అంది దిగులుగా.


“నాకు అదే దిగులుగా వుందే గంగా”


“నీ కొడుకెక్కడికి వెళ్లాడో.  మిత్తవల్లే యింత వరదొచ్చి పడిందే,పిల్లలు తల్లి పెళ్లాం యెట్టా వుండారో యెక్కడ వుండారో అన్న ఆలోచన ఇంగితగానం వుండొద్దు. ఇట్టాంటి వాడు బతికి వుంటే యేంటి చస్తే యేంటి?’’ అంది కోపంగా. 


“అంత మాట అనకే గంగా” అంటూ గట్టిగా ఏడ్చింది నర్సమ్మ. తెల్లారితే చాలు గుక్కెడు టీ కోసం పెర పెరలాడే ఆమె ఆ రోజు టీ ముట్టలేదు, టిఫిన్ తినలేదు.గోడకు ముఖం పెట్టుకుని ముడుచుకుని వుండిపోయింది. 


అప్పుడప్పుడూ “గంగా, అట్టా బయటకుపోయి మన ఇళ్ల దగ్గరోళ్ళకు  ప్రసాదు యేడన్నా కనబడ్డాడేమో అడిగి రా పో..”  అనీ, పిల్లలను “మీ నాన్న వచ్చాడేమో చూసిరండి పోండి’’ అని తరుముతానే వుంది.  నర్సమ్మ నసకు విసుగొచ్చిన పిల్లలు దగ్గరకు రావడం మానేసారు. గంగ కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ మొగుడి కోసం ఆరా తీస్తానే వుంది.


మూడో రోజుకు వాన తెరిపిచ్చింది. నాలుగో రోజుకు మునిగిన కాలనీ ఇళ్లు బురద మేటేసుకుని దుర్గంధం కొడుతూ బయటపడ్డాయి. పశువుల కళేబరాలు కుక్కల కళేబరాలతో పాటు కరెంట్ స్థంభానికి తట్టుకుని ఆగిపోయిన ప్లాస్టిక్ నవ్వారు మంచం.నవ్వారు పట్టెల్లో చిక్కుకున్న కాళ్ళతో ఉబ్బిపోయిన శరీరంతో  వున్న శవం. మంచం, వొంటిపై అరకొర బట్టలు చూసి నర్సమ్మ కొడుకు ప్రసాద్ గా గుర్తించారు. నర్సమ్మ కుప్ప కూలిపోయింది. గంగ నిబ్బరంగా పిల్లలిద్దరిని పట్టుకుని నిలబడింది.  


నర్సమ్మ మనసులో కుళ్ళి కుళ్ళి యేడుస్తుంది. “అయ్యో కొడుకా! నా చేత యెంత పని చేయించావురా. నన్నెంత కటికదానిగా చేసావ్ రా అయ్యా!   నీ బుద్ధి సక్రమంగా లేదని కోపంతో ఈ పని చేసాను. తాగొచ్చి వొళ్లు తెలియకుండా  మంచం మీద పడిపోతే   నిన్ను లెగవకుండా కట్టి పడేసా కదరా. ఆ తాడే నీకు ఉరితాడు అయ్యి నీళ్ళలో మునిగిపోతున్నా లెగవకుండా చేసింది కదరా అయ్యా.  నన్ను బిడ్డను చంపిన పాపిని చేసావు కదరా అయ్యా” అని. 


సరళ వచ్చి గంగ కు అండగా నిలబడింది.  నర్సమ్మ వచ్చి రమణారావు పై కేసు పెడతానని అనేసరికి భయపడి ఫిట్స్ లాగా వచ్చి పడిపోయాడని హాస్పిటల్ కు వేసుకుని వెళితే పక్షవాతం వచ్చే సూచనలన్నారని చెబుతూ…

 “గంగా..నీ మొగుడు చచ్చాడని నువ్వు యేడుస్తున్నావు నా మొగుడు యింకా  యెందుకు చావలేదని నేను యేడుస్తున్నా” అంది సరళ.  


“అయ్యో! అంతమాట యెందుకులేమ్మా, ఊరుకోండి అమ్మ గారూ” అంది. గంగ  జాలి నిండిన గొంతుతో చెమ్మగిల్లిన మనసుతో.  


కూలిపోయిన యింటిలో అప్పుల వాళ్ళ తాకిడితో చాలీ చాలని పరదా పట్టాల కింద తలదాచుకుంటుంది గంగ కుటుంబం. బతుకు భారంగా రోజులు వేగంగా గడుస్తున్నాయి. పశ్చాతాపంతో  నర్సమ్మ గుండెలు మండిపోతున్నాయి.  తప్పు చేసిన బిడ్డను మందలించవచ్చు దండించవచ్చు గానీ ప్రాణం తీసే హక్కు తనకు యేముందనీ అని లోలోపల కుమిలిపోయింది. ఎక్కువ కాలం  రహస్యం కప్పిపెట్టలేక  మనసు ఉగ్గబట్టుకోలేక చేసిన పాపం చెబితే పోతుంది అన్నట్టు  గంగ కాళ్ళు పట్టుకుని తను చేసిన పని  గురించి చెప్పింది క్షమించమని ప్రాధేయపడింది.


 గంగ నిర్లిప్తతంగా చూసి “ఇట్టా జరుగుద్దని నువ్వు మాత్రం అనుకున్నావా యేంటి, ఊరుకో అత్తా”  అంది. “ఈ మాట మరెక్కడా అనబోకు కడుపులో దాచుకో” అని కూడా చెప్పింది. నర్సమ్మ  పాప భారాన్ని యెక్కువ కాలం ఓపలేకపోయింది.గంగ మోసే తన భారాన్ని  కూడా తగ్గించేసి లోకం నుండి నిష్క్రమించింది. ఆ రోజు అండ పోయిందో బరువు తగ్గిందో యేమి బోధ పడలేదు గంగకు. అప్పు కోసం సరళ యింటి మెట్లెక్కింది మళ్ళీ. 


*********

జ్ఞాపకాల్లో నుండి బయటపడి..  అపార్ట్మెంట్ లో  త్వరగా పని ముగించుకుని కృత నిశ్చయంతో  సరళ యింటి మెట్లు యెక్కింది గంగ.


రెండు గంటల తర్వాత పార్క్ లో కూర్చున్న సరళ ఫోన్ మోగింది. “పని అయిపోయిందమ్మా యింటికి  వెళ్ళండీ” 


సరళ ఇంటికి చేరింది. బెడ్ రూమ్ లో భర్త విడిచిన షర్ట్ ని ముఖంపై కప్పుకుని మూడెంక వేసుకుని పడుకుని వున్నాడు. 


ఆమె ముఖంలో క్రూరమైన నవ్వొకటి తొంగిచూసింది.

 

“ఏమిటలా ముఖం పై మసుగేసుకుని చేతకాని దద్దమ్మాలా పడుకున్నారు. రంధి, అదే నిద్ర రంధి తీరిందా” అని నర్మగర్భంగా అడిగింది. 


ఉలికిపడి అనుమానంగా భార్య ముఖం వైపు చూసాడు. 


 “నీ స్త్రీ వ్యసనంతో నన్నెంత రంపపుకోతకు గురిచేసావు మదపత్రాష్టుడా! నా శరీరాన్ని రోగాల పుట్టగా మార్చావు. పసివాళ్ళని కూడా చూడకుండా చిన్న పిల్లలపై  అఘాయిత్యాలకు పూనుకుంటున్నావ్ . నీ పురుషత్వం తలెత్తి చూడకుండా  మానసికంగా నిన్ను బలహీనుడిని చేయడమే నీకు సరైన శిక్ష. నువ్వు ఈ గదిలో మగ్గి మగ్గి ఇలా కుమలాల్సిందే.” కసిగా తిట్టింది. 


అవమానంతో దిండు లో ముఖం దాచుకున్నాడు రమణారావు.


“నీ బతుక్కి సిగ్గు వొకటి వుండట్టు..ఆ ముఖం దాచుకోవడం వొకటే తక్కువ. కొడుకనే కనికరం లేకుండా  తెగువగా ఆ నర్సమ్మ చేసిన పని నేను చేయలేకపోతున్నా” అంటూ కోపంగా జుట్టు పట్టుకుని తల గుంజింది. 


భార్య వైపు  భయంగా చూస్తూ “వద్దు వద్దు. నా తప్పు తెలుసుకున్నాను  మారిపోయాను. నన్ను క్షమించు సరళా” అన్నాడు. ఏడుస్తూ.. ఛీ, థూ.. అనుకుంటూ అతనికి దూరంగా వెళ్ళింది ఆమె.


చీకటి పడుతున్న వేళ గంగ వచ్చి వంట ఇంటి గుమ్మం దగ్గర నిలిచింది. కూర్చోమని అన్నా కూర్చోకుండా.. 


“సరళమ్మా ! నిలువెల్లా కామంతో రగిలిపోయే మనిషిని ఉసిగొల్పి  మానసికంగా కుంగదీయాలి అని నాకో పని అప్పజెప్పావ్. డబ్బు అవసరం యెంతున్నా నేను  అన్నీ ఇడిసేసిన మనిషిని మాత్రం కాదండీ. నీ అంత చదువుకున్నదాన్ని కాకపోయినా మనుషులను వస్తువులను వాడుకున్నట్టు వాడుకోకూడదనే ఇంగితగేనం వుంది. నువ్వు చెప్పినట్టు కాకుండానే నీ భర్తకు  నాలుగు మంచి మాటల్జెప్పి ఇకనైనా మార్పు తెచ్చుకో. లేకపోతే నీ బిడ్డలకు మొహం కూడా చూపించలేక పోతావు అని మందలిచ్చాను, యెత్తి పొడిచాను, చీత్కరిచ్చాను. ఇని యిని  ఆఖరికి దిండులో తలదాచుకుని ఎక్కిళ్లు పెట్టి యేడిసాడు. ఇక ఆయన నడుము యిరిగిన పాము అనుకో”


“చాలా చాలా థ్యాంక్స్ గంగా! నువ్వన్నట్టు  యికనైనా ఆయన మారిపోతే చాలు” కృతజ్ఞత తో తేలికైన మనసుతో చిరునవ్వు ముఖంతో.


“అమ్మా!  ఇంకో మాట విను. నా బిడ్డలకు పొట్టనిండా కూడు పెట్టుకోలేకపోతే పస్తు పడుకోబెడతాను కానీ జారతనం చూపెట్టను. ఆపదలో వున్నప్పుడు సాయం చేసావని నీ మాట కాదనలేకపోయాను కానీ అది నీలాంటివాళ్ళు చెప్పదగ్గ పని కాదు నేను చేయదగ్గ పని కాదు. ఇంటి పని వంట పని  యివ్వాలనుకుంటే యివ్వండి. కష్టం చేసుకుని మీ బాకీ తీరుస్తాను కానీ యిట్టాంటి పని యింకెప్పుడూ చెప్పబాకమ్మా” బాధ నిండిన గొంతుతో  కళ్లు తుడుచుకుంటూ  వెళ్ళిపోయింది. 


చెంప పై చెళ్ళున కొట్టినట్లైంది సరళ కు. గంగను నేనెంత తక్కువగా అంచనా వేసాను. నాకు నా భర్త కు తేడా ఏం వుంది? నేను పురమాయించిన పని కూడా అత్యాచారం కన్నా తక్కువేం కాదు.తనెంత దిగజారిపోయి భర్తను రెచ్చగొట్టి నీరు కారిపోయేటట్టు చేయమని అడిగింది? గంగ కాబట్టి నర నరం  పదునుగా కోసినట్టు మెత్తగా స్పష్టంగా తనేంటో చెప్పింది. తల భూమిలో పెట్టుకున్నంత పనైంది సరళ కు.   ఇంకా ఆలోచిస్తూ...  దీనినే వ్యక్తిత్వం అని అంటారేమో!  పరిస్థితులు యెలా వున్నా గంగ లాంటి వారు విలువలను పణంగా పెట్టలేరు, తమ ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోలేరు. గంగ ముందు నిత్యం సిగ్గుతో తలొంచుకోలేను పని కూడా ఇవ్వలేను అనుకుంది సరళ. 


ఎదురుగా టివి లో .. గంగా పుష్కరాల ప్రత్యక్ష ప్రసారంలో వేటూరి పాట బ్యాక్ గ్రౌండ్ లో వినబడుతూ వుంది. “గండాలను పాపాలను కడిగివేయగా ముక్తినదిని మూడు మునకలే చాలుగా”  తెర వైపు చూస్తూన్న సరళ మానసిక స్నానం చేస్తూ గంగలో మూడు మునకలు మునిగింది.


*******************0**********************

“బహుళ త్రైమాసిక వెబ్ పత్రిక “ జూన్ 2023 సంచికలో ప్రచురితం.




Pic: Gibbs Garden GA USA

30, నవంబర్ 2022, బుధవారం

రంగు వెలిసిన కల

“బహుళ “ త్రైమాసిక అంతర్జాతీయ మహిళా పత్రిక లో నేను రాసిన కథ “రంగు వెలిసిన కల”.. చదవండి.

“రంగు వెలిసిన కల”

బయట శరత్ పూర్ణిమ వెన్నెల పగలబడి నవ్వుతుంది. ఆమె లోపల మసకచీకటిలో ముణగదీసుకుని పడుకుని వుంది. స్మృతి పథంలో చేదు గుర్తులు.  ఎవరో పిలుస్తున్నట్లు తలుపు చప్పుడు. అయిష్టంగా లేచి తలుపు తీసింది. ఎదురుగా స్నేహితురాలు. 


 “ఏమే, ఏ లోకంలో వున్నావ్ నువ్వు, అసలు భూలోకం పైన నివసిస్తున్నావా, పాతాళ లోకం లోనా!?ఎన్ని సందేశాలు పంపాను. ఒక్కదానికి సమాధానం లేదు. ఇవాళ నీకిష్టమైన రోజు కదా,అందుకే వచ్చానిలా” అంటూ ఆమెను చుట్టేసింది స్నేహితురాలు.ఆ చేతిలో ఓ కానుక. లిల్లీ పూల గుచ్చం. స్తబ్దత నిండిన గదికి మదికి చైతన్యం ఇచ్చేలా.


నవ్వి స్నేహితురాలి ఆలింగనం నుండి దూరంగా జరిగింది ఆమె.


“ఎన్నాళ్లిలా జఢత్వం లో మునిగివుంటావ్. జీవితం అంటే విద్యార్థులు బోధన లే కాదు స్పందన సంతోషం కూడా వుండాలి. ఏమంటావ్ మరి”


మౌనం వహించింది.

 

 “నువ్వింకా అతని ప్రేమలో వున్నావా”  ఆశ్చర్యంగా ప్రశ్నించింది.

 

“లేదు లేదు, తనువు మనసు రెండూ గాయపడ్డాయి, వైరాగ్యం వచ్చేసింది”


“ఏం జరిగిందసలు? తెలుసుకోవచ్చా నేను, నీకు  అభ్యంతరమైతే వద్దులే మరి” 

 చాలా సంవత్సరాలుగా  వచ్చినప్పుడల్లా అడుగుతుంది ఈ మాట. ఆమె ఎప్పుడూ మౌనం వహించేది. ఎందుకో ఈ సారి మెత్తబడింది. 


“తెలుసుకుని ఏం చేస్తావ్, గతం గతః అనడం మర్చిపోమని చెప్పడం తప్ప. ఈ రోజు నిన్ను నిరాశపరచను లే”అంటూ అనునయించే ఆత్మీయురాలి ముందు తన అంతరంగాన్ని విప్పి చెప్పడం మొదలెట్టింది ఆమె.


స్నేహితురాలు ముందు గది వైపు వెళ్లి ఒకసారి బయటకు చూపు సారించి ఓరగా తలుపు మూసి వచ్చింది.


************

పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నేను  యూనివర్సిటీ లో చేరిన కొద్దిరోజుల్లో అతన్ని చూసాను. పదేళ్లైనా యెంత గుర్తుందీ అంటే.. అది యీ వేళే జరిగినట్టు.


సహాధ్యాయిని తో కూడి నడుస్తున్నాను.


“పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో

గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో

ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో

ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో… 


గుంపు మధ్యలో నుండి చీల్చుకు వస్తున్న ప్రశ్న గేయం…నా అడుగుల వేగాన్ని మందగింపజేచింది. పిచ్చాపాటి మాటలు ఆగిపోయాయి. 


అసంకల్పితంగా గుంపు వైపు కాళ్లు కదిలాయి. కరతాళ ధ్వనులతో పాటు ఒన్స్ మోర్ ప్లీజ్! అభ్యర్ధనల్లో నా గొంతు కలిసింది. 


మునివేళ్లపై కాళ్ళు పైకెత్తి నా ముందున్న వాళ్ళ భుజాల పై నుంచి ఆ గాయకుడిని చూసాను. ఎడమ మోచేతి పై తలను ఆనించి విలాసంగా సిమెంట్ బెంచీ పై పడుకుని వున్నాడు. అతని కాళ్ళు బెంచీపై కూర్చున్న వేరొకరి ఒడిలో. మిత్రుడు కాబోలు. తల్లి బిడ్డ పాదాలను ప్రేమతో సవరించినట్లు సవరిస్తున్నాడు. ఎండ తగలకుండా పనామా కేప్ ను ముఖం పై పెట్టుకుని వున్న అతను కేప్ ను తల పైకి జరుపుకుని ఒకసారి చుట్టూరా చూసాడు.  వేగవంతంగా అందరిని చూసిన కళ్లు వెనుకనున్న నా వైపు చూసి నిలకడగా నిలిచి విశ్రాంతి తీసుకున్నాయి. ఆపై గొంతు సవరించుకుని.. గేయాన్ని అందుకున్నాడు. భావ వాహిని గాన వాహిని పరిసరాలను స్తంభింపజేసింది. పాట పూర్తవగానే అతను లేచి గుంపును చీల్చుకొని వడివడిగా నడిచాడు.అతని వెనుక యువకులు యువతులు పరుగుదీసి పోటీ పడి అతనికి అభినందనలు తెలుపుతున్నారు. నేను ఉన్నచోటనే నిలబడి చూస్తున్నాను.


అతనిది మోహన రూపం  మధుర గాత్రం.  నా కన్నె హృదయాన్ని తెరవబోతున్న  తాళం చెవిలా ఉన్నాడతను. నిత్యం పాట కోసమో అతని కోసమో వెతుక్కొంటూనే వున్నాను. నెలలు గడుస్తూ వున్నాయి. అతను కూడా నన్ను చూస్తూనే వుండేవాడు. సూటిగా కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ కలవరం కల్గించేవాడు.  యూనివర్సిటీ ప్రాంగణంలో వొంటరిగా తిరిగే స్త్రీ కాని పురుషుడు కాని వుండటం అరుదుగా కనబడే దృశ్యం.చదువులు పెరిగినట్టు నవీన సంస్కృతి అలవడింది కదా! అలాంటిచోట నేను వొంటరిగా వుండటం చూపరులకు వింత. వారికి తెలియదు అతని ఊహల తోడుగా  నేను జంటగా వున్నానని, ఎద నిండా మథనం జరుగుతూనే వుందని. నోరు విప్పి మాట్లాడనన్నమాటే కానీ రాసుకునే కవిత్వం నిండా అతనితో మాటలే,అతని కథలే.


  అతను పాడుతున్నప్పుడు ఉపన్యసిస్తున్నప్పుడు మగ నెమలి పురి విప్పి ప్రదర్శన చేస్తున్నట్లుగా  ఆడ నెమళ్ళు మగ నెమలి చుట్టూ  ప్రదక్షిణ చేస్తున్నట్లుగా అనేకమంది స్త్రీలు అతన్ని చుట్టుముట్టి వుండేవారు. అతను నాకు కాకుండా పోతాడేమోనని బెంగ నన్ను వెంటాడేది. అదేమిటో…అతన్ని చూస్తూనే వశం తప్పేది మనసు. 


“నా హృదయం నా మనసు నా శరీరం అన్నీ నువ్వే. నా ప్రేమ మాత్రమే కాదు నువ్వు నా జీవితం” అనుకుంటూ లోలోపల పలవరించేదాన్ని. గొంతు దాటి బయటకు రాని భావావేశమేదో మూగ బాధై  గుండెను మెలిపెడుతూనే వుండేది. ఏ క్షణాన అతన్ని కలగన్నానో ఆ క్షణం నుండి నా మనసు మనసులో లేదు. అతని దొంగ చూపులు కూడా నాతో దాగుడుమూత లాడినట్లు  నను వెంటబడి తరుముతున్నట్టే వుండేవి.


నా తలపు వలపు గమనించిన  సహాధ్యాయి నన్ను హెచ్చరిస్తూ వుండేది. మనలా అతను చదువు కోసమే ఇక్కడికి రాలేదు అతనికి సంఘాల తోను ఉద్యమాలతో సంబంధం వుంది. వారిదంతా వేరొక ప్రపంచం. మనం వారితో కలవలేం. కలిసి మనలేం. ముందుకెళ్ళకు” అంది. అవన్నీ నాకభ్యంతరంగా తోచలేదు.వీలైతే అతని మార్గంలోకే నేను వెళతాను. లేదా అతని బిడ్డలకు తల్లినై అతని ఆశయాలతో పెంచుతాను అనుకున్నాను మనసులో. చూపుల సంభాషణల తోనే ఆ సంవత్సరమంతా అలా గడిచిపోయింది. 


సంవత్సరాంతర సెలవులు. ఇంటికి వెళ్ళాలి.రెండు మాసాలు అతన్ని చూడకుండా వుండగల్గడం అసాధ్యం. ప్రాణాన్ని వదిలేసి పోగలనా!?


అతను నదికి ఆవలి వొడ్డునున్న నగరంలో స్నేహితులతో కలసి వుంటున్నాడని లోకల్ రైలు లో ప్రయాణించి యూనివర్సిటీకి చేరుకొంటాడని తెలుసుకున్నాను. అతన్ని కలిసి నా మనస్సు విప్పి చెప్పాలని ఆ  నగరానికి వెళ్ళాను. అతని స్నేహితునితో  కబురు పంపాను.రాలేదతను. పరిచయస్తులు యిచ్చిన సమాచారంతో అతను తిరిగే తావులన్నీ వెతికాను.ప్రయాస వృధా అయింది. పగటి కాలమంతా ఓపికగా నది తీరంలో కూర్చున్నాను. రాత్రి సమయం అవుతున్నా అతను కనబడకపోవడంతో నిరాశగా హాస్టల్ గదికి చేరుకున్నాను. 


 వారం రోజుల తర్వాత  యూనివర్సిటీ లో ఒంటరిగా కనిపించాడు. అతన్ని సమీపించాను. ఎన్నో చెప్పాలనుకున్న నేను ఒక్కసారిగా మూగదాన్ని అయిపోయాను.ఎట్టకేలకు నోరు పెగల్చుకుని “అలా షికారు కి వెళదామా మీ నగరానికి. నది వొడ్డు చాలా బాగుంది” అని అడిగాను.  “పని వుంది. బేనర్ లు తయారు చేయాలి, కరపత్రాలు

వేయాలి” అన్నాడు.


బిడియంగా అతని పక్కనే కూర్చుని చేతి వేళ్ళు చూసుకుంటూ నేను ప్రేమిస్తున్నాననే సంగతిని చెప్పాను. సమాధానంగా  సన్న నవ్వు నవ్వాడతను.సిగ్గు పడి లేచి వచ్చేసాను.


*********

 ఆ నగరానికి ఈ నగరానికి  మధ్య కొండలను కలుపుతూ వంతెన. కింద పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న నది. అవిశ్రాంతంగా తిరిగే వాహనాలు. నడకదారిలో చేతిలో చెయ్యేసుకొని తిరుగుతున్న యువ జంటలు. వారిని చూస్తూ తమ జీవితాల్లో అలాంటి కాలం  కరిగిపోయిందని భారంగా నిట్టూర్చే చిన్నపిల్లల తల్లిదండ్రులు. సాయంత్రపు నడక కోసం వచ్చి కుర్ర జంటల చిలిపి చేష్టలను ముద్దు ముచ్చట్లను చూసి ముఖం చిటపడలాడించుకుంటూ వెరపు లేదని గొణుక్కొంటూ తిరుగుతున్న వృద్దులు. ఎవరి పనుల్లో వారుండగా తన పనిలో తామున్న నీటిలోని కొంగలు.  ఇవన్నీ చూస్తూ నేను.  


అక్కడ నేను వుండటానికి కారణం వుంది. అతను కలుద్దాం అన్నాడు. ఎగిరి గంతేసింది హృదయం.ఉత్సాహం పొంగిపొర్లుతుంది.. పాట పెదాలపై తన్నుకొస్తుంది.ఇష్టమైన పాట “తనన తననన తనన తననన

తనన తననన తానన తనననానా..” హమ్ చేస్తూనే వున్నాను.


 ఆత్రం భూమి మీద నిలవనివ్వడం లేదు. చెప్పిన సమయానికన్నా ముందే అక్కడికి చేరుకున్నాను.వంతెన ఆ చివర నుండి ఈ చివరి వరకూ చూపులతో జల్లెడ వేస్తున్నా. చెప్పిన సమయం దాటిపోయింది. అతనొస్తున్న జాడ కనబడలేదు. వస్తాడో రాడో నన్న అనుమానం పొడజూపింది. ప్రకృతిని పరిశీలిస్తూ కూర్చున్నాను.అంతకన్నా చేయగల్గింది ఏముంది గనుక?.


నది మధ్యలో చీలిన  ఒక పాయ వెంబడి అక్కడక్కడ పెరిగిన రెల్లు పొదలు. దట్టంగా పూసిన రెల్లుపూలను చూస్తుంటే నదిలో ఉవ్వెత్తున లేచిన సముద్ర  కెరటాల్లా గోచరించాయి.  ఆ రెల్లు పూలకు కిరీటం పెట్టినట్లుగా మెరుస్తున్న సాయంకాల సూర్య కిరణాలు. ఓహ్. ఎలాంటి అద్భుత దృశ్యాలకు ఆనవాలం ఈ నదీతీరం!! ఇలాంటి అద్భుతమైన దృశ్యాన్ని అతనితో కలసి పంచుకోలేనందుకు చింతించాను. ఎంతకీ రాడేమిటి విసుక్కుంది మనసు.నారింజ రంగులో వున్న సూర్యుడు ఎర్రని రంగులోకి మారి కొండల మధ్య అదృశ్యమవ్వకముందే మరో దిక్కున చంద్రోదయం. లోన హర్ష రాగ నాదం బయటేమో వెన్నెల ధారాపాతం. నది నీటిలో అలల పడవపై తేలి ఆడుతున్న చంద్రుడు. నది ఒడ్డున వరుసగా పెంచిన పున్నాగ చెట్లు. పూచిన పూలలో వీచే గాలిలో సుమధర పరిమళం.అతని గురించిన ఊహలతో తనువంతా అదో మైకం.


ఎట్టకేలకూ గంట నిరీక్షణ తర్వాత అతనొచ్చాడు. దుమ్ము కొట్టుకుపోయిన శరీరం చిరిగిన బట్టలు. అలసిన కళ్ళలో ఎర్రని జీరలు.  చాలా ఆలస్యం అయినట్లుంది కదా అంటూ చేయందుకున్నాడు. ఆ మునివేళ్ళ స్పర్శకి ఒళ్ళు ఝల్లుమంది. 


“అలా నడుస్తూ మాట్లాడుకుందాం పద” అన్నాను చొరవజేసి. 


ఈ పున్నమి వెన్నెల రేయంతా అతని చేతిలో చెయ్యేసుకుని తిరుగుతూ చంద్రుడికి వీడ్కోలు పలకాలని ఆశగా  వుంది. అతనవేమి పట్టనట్లుగా నా చేతిని వొదిలేసి నాలుగడుగుల దూరంలో నాకు అందకుండా ఈలపాట పాడుకుంటూ వెళ్తున్నాడు. అతని వేగాన్ని అందుకోవడానికి నేను అమిత ప్రయాస పడాల్సి వచ్చింది. ఇంత ఆహ్లాదకర వాతావరణంలో ప్రేమికులు ఇలాగేనా మసలడం!? నిస్పృహ కలిగింది. 


పున్నాగ పూల పరిమళం. చుట్టూ పరికించి చూసాను. దూరంగా పచ్చని పచ్చికపై ఒత్తుగా రాలిన పున్నాగపూలు. సంభ్రమంగా అటువైపు నడిచి కొన్ని పూలను యేరుకున్నాను. అతను నన్ను చూస్తూ   పక్కనున్న ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు యెంతకీ తెగడం లేదు. ఓ బెంచి బల్లపై కూర్చుని పున్నాగ పూలను జడలా అల్లుతూ కూర్చున్నాను. ఆ బెంచీ పైనే కూర్చుని వీలైతే అతని హృదయానికి దగ్గరగా తలవాల్చి అతని పాటలో లీనమైపోవాలి అని మధురోహలు చేసాను. ఎంతకీ అతని సంభాషణ తెగేటట్టు లేదు. 


 లేచి వెళ్ళి మాలలమ్ముతున్న పూలమ్మి దగ్గర ఆగి  ఒక్కటంటే ఒక్క గులాబీ పువ్వు ను అదీ ఎర్ర గులాబీ ని కొన్నాను. చేతినిండా లిల్లీ పూల గుచ్ఛాలను కొన్నాను.అడిగి మరీ  గుండ్రంగా బంతి లాంటి లిల్లీ పూల చెండును కట్టించుకొన్నాను. అప్పుడొచ్చాడతను. దగ్గరకొచ్చి విసుగ్గా ముఖం చిట్లించి “ఇవి యిప్పుడు అంత అవసరమా? “అన్నాడు. 


పున్నాగ పూలన్నా లిల్లీ పూలన్నా నాకు చాలా యిష్టం. అవి రెండూ అక్కచెల్లెళ్లేమో, ఎంత సుమధుర పరిమళం అనీ .. అంటూ గులాబీని అతనికి ఇచ్చి “ఐ లవ్యూ” అన్నాను. 


అతను నవ్వి.. “నా గది ఇక్కడకు దగ్గరే. అదిగో లైబ్రరీ ప్రక్కన కనబడుతూ వుందే అదే! వెళ్దాం పద” అన్నాడు.

 

అతని పక్కనే నడుస్తూ.. అశువుగా కవిత్వం వినిపించాను. 


“వెలుగు నీడల త్రోవ ప్రక్కన నిలబడి రేయింబవళ్ళ క్రీడని చూస్తున్నాడు చంద్రుడు 

మంచు దుప్పటి కప్పుకున్న ధరణిపై చందనాలు చల్లిపోవగా వచ్చాడు చంద్రుడు 

తాంబూలంతో పండిన పెదవులతో  ఎవరో ముద్దాడినట్లు ఉన్నాడు చంద్రుడు 

మూసిన తలుపులని తడుతూ ఇల్లిల్లూ తిరుగుతూ పెత్తనాలు చేస్తున్నాడు చంద్రుడు

పడతి ప్రేమలో  తడిసి విరహ వేదన చెంది ఆ చెలిని కూడ మబ్బు చాటుకేగెను చంద్రుడు”...


పూర్తి చేసి అతని చేతిని ముద్దాడుతూ.. నువ్వు నా చంద్రుడివి అన్నాను.


కొంటెగా కనుగీటుతూ.. భుజంపై చెయ్యేసాడు.నా సగము మేని తానైనట్టు పరవశం. 


అతను నా పక్కన నడుస్తూనే ఎదురుపడే  అమ్మాయిలను పరీక్షగా చూస్తున్నాడు. పార్క్ లో వొంటరిగా వున్న  ఒక స్త్రీ ని ఆగి మరీ చూస్తున్నాడు. ఆ యువతి కూర్చున్న భంగిమ వస్త్రధారణ తేడాగా వుంది. అతను వెనక్కి మళ్లి  ఆమెతో మాట కలిపి వీడుతున్నప్పుడు వెకిలిగా ఒక అశ్లీల మాటను విసిరాడు. 

 

 “వారు ఎవరైనా ఎలాంటి వారైనా కానీయ్ , స్త్రీల గురించి అలా మాట్లాడితే అసహ్యంగా వుంది, నాకు నచ్చలేదు” అన్నాను కోపంగా. 


“ఇందులో తప్పేముంది. నా ఉద్రేకాన్ని రెచ్చగొట్టే ఏ స్త్రీని వొదులుకోకూడదు అన్నది నా సిద్ధాంతం. రేపు చూడాలి దీని సంగతి” అన్నాడు ఆ స్త్రీని ఉద్దేశించి. 


ఆ మాటతో అతని స్వభావం పూర్తిగా అవగతమైనట్లైంది నాకు.


 “చాలామంది స్త్రీలతో సంబంధం వుందా నీకు” 


“ ఉంటే మాత్రం నీకెందుకు అభ్యంతరం”


“కనీసం నా  ఈ ప్రశ్నకైనా ఆకు కు అందకుండా పోక కు కందకుండా సమాధానం ఇవ్వొచ్చుగా”


నా ప్రశ్నకు సమాధానమివ్వకుండా..  “ఆర్ యూ వర్జిన్” కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగాడతను. సమాధానం చెప్పేలోగానే  అతని పెదాలపై వెకిలి నవ్వు వెటకారమైన మాటొకటి నా చెవిని తాకింది.  


 “అవును” అని చెప్పాలనుకున్న మాట ఆగిపోయింది. ఉండేలు దెబ్బ కి విలవిలలాడి  కుప్పకూలిన పక్షిలా మనసు. భుజంపై చేయి తోసేసి వడివడిగా  పార్క్  బయటకు నడిచాను. రైలు స్టేషన్ వైపు  నడుస్తూ ఆలోచించాను. 


అతని నడకలో కానీ నడతలో కానీ పట్నవాసపు పట్టభద్రుడి సంస్కారం లవలేశము కూడా గోచరించడం లేదు. పల్లెటూళ్ళో పుట్టి పెరిగిన నాకు ఆ అశ్లీల మాటలు వినడం ఎంత అలవాటైనా సరే అవే మాటలు ఇంకో భాషలో  అతని నోట  వినడం అసహ్యంగా వుంది. పుస్తకం ముఖ చిత్రం అందంగా వున్నంత మాత్రాన లోపల వున్నదంతా చదివించదగ్గ విషయం కాదేమో అన్న ఆలోచన నాకెందుకు కల్గలేదో! విచారించాను. ఇదంతా అతని గురించి నేను ఉన్నతంగా ఊహించుకోవడం వల్ల వచ్చిన చిక్కు. కానీ అతని లో వున్నది వున్నట్టుగా స్వీకరించడం మానేస్తే అతను నాకు దక్కకుండా పోతాడు. అలా జరగడానికి వీల్లేదంతే! ఎంతగా ప్రేమించానతన్ని నేను!!! జార విడుచుకుంటానా!? బంధమై అల్లుకోవడమే నా లక్ష్యం.


అతనిని మనసారా వాంఛించి మోహించి రాబోయే మధుర క్షణాలను పదే పదే ఊహించుకుంటూ నిత్యం మురిసిపోవడం కలలు కనడం కంటే ఆ క్షణాలను అనుభవిస్తే పోలా! ఇప్పుడే అనుభవిస్తే పోలా! అనవసరపు అలకలు ఈ మాట పట్టింపులు ఎందుకు! పైగా  నాకెంతో ఇష్టమైన శరత్ పూర్ణిమ నాటి  ఆహ్లాదకర రేయిని చెడగొట్టుకోవడం ఎందుకు?  క్షణంలో మనసు మార్చుకుని వెనుదిరిగి అతనున్న యింటి వైపు దారి తీసాను.


అపరిశుభ్రంగా వున్న వీధి గుమ్మంలో నుండి అడుగులు వేస్తూ మేడ యెక్కుతూ చుట్టూ చూసాను. మనుష్య సంచారం పెద్దగా లేని వీధి. పాత కాలపు మిద్దె అది.ఇరుకుగా దుమ్ము పేరుకున్న మెట్లు. నేను వెళ్లే సరికి అతను పుస్తకాలు ముందు కూర్చుని వున్నాడు. నన్ను చూసి.. “వచ్చావా, రా, మరి ఇందాక అంత బెట్టుపోవడం యెందుకో” అన్నాడు ఎగతాళిగా. 


గాలి వెలుతురు లేని ఇరుకు గది అది. రంగు మారిన చిత్రాలు బూజు పట్టి కళావిహీనంగా వున్నాయి.  చేగువేరా లెనిన్ ఇంకా నాకు తెలియని యెవరెవరివో చిత్రాలతో పాటు చలనచిత్ర నాయికలు. అరవై కేండిల్ బల్బు వెలుగు చిమ్ముతున్న మసక వెలుతురులో  కనబడిన దృశ్యం. చెల్లాచెదురుగా పడి వున్న పుస్తకాలు, విడిచి విసిరి పారేసిన బట్టలు, ఖాళీ మద్యం సీసాలు తిని పడేసిన ఆహార పొట్లాలు. ఆ అపరిశుభ్ర వాతావరణం చూసి జుగుప్స కలిగింది. ఒక్క క్షణం అడుగు వెనక్కి వేసాను. ఈ గదిలో మానవ మాత్రులేనా నివసించేది అని సందేహపడ్డాను. మళ్ళీ అంతలోనే బ్రహ్మచారుల నిరుద్యోగుల ఉమ్మడి వసతి గృహం ఎలా వుంటుందిలే యిలా కాకుండా అని మనసుకి సర్ది చెప్పుకున్నాను. 


అతనికి తనపై తనకు శ్రద్ధ లేదన్న ఆరోపణలో నుండి జాలి పుట్టుకొచ్చింది. శ్రద్దగా చూసుకోవడానికి నేనో లేదా నా లాంటి వారు ఎవరో వొకరు ముందు ముందు రాకపోరులే అనుకున్నాను. అయినా ఈ మనిషికి పరిసరాలను శుభ్రంగా వుంచుకోవడంలోనే ఆరోగ్యం వుంటుందన్న సృహ కూడా లేదేమిటో! పోనీ చేయదగ్గ ముఖ్యమైన పనులు వున్నట్లు వుండడు. నలుగురిని వెంటేసుకొని రికామీ గా తిరగడం తప్ప. తన ఆరోగ్యంపై తన దేహం పై శ్రద్ధ లేనివాడు గొప్ప గొప్ప ఆశయాల కోసం యితరుల జీవితాల్లో వెలుగు నింపడం కోసం యే మాత్రం పనిచేయగలడు? అలా అని అతనికున్న అంకిత భావాన్ని శంకించలేను అనుకుంటూ ద్వంద రీతిలో పొంతనలేని ఆలోచనలెన్నో చేసాను.


నేనిప్పుడే వస్తానంటూ అతను బయటకు వెళుతూ “కంగారు పడకు” అన్నాడు. ప్రశ్నార్ధకంగా చూసాను. 


“నా రూమ్మేట్స్ ఎవరైనా రావొచ్చు. అమ్మాయిలను తీసుకురావడమే నీ పనా అని కోప్పడతారు. నేను గదికి తాళం పెట్టి వెనుక వైపు నుండి వస్తాను “ 


వెనుక వైపు తలుపున్న సంగతి నేను గమనించనే లేదే అనుకుంటూ.. కిటికీ దగ్గరకు నడిచాను. బయట కనబడినంత మేరా పచ్చగా ఆహ్లాదంగా వుంది.  ఆ పచ్చదనంపై వెన్నెల విరజిమ్ముతూ పలుచగా పొగమంచు పరచుకుంటూ వుంది.ఆ వెనుక నదీతీరం.  ఈ మురికి గది కన్నా బయట యెంతో హాయిగా వుంది. అతను వచ్చాక ఆ సంగతి చెప్పి ఆరుబయలు విహారానికి వెళితే బాగుండును అనుకుంటూ చేతిలోని లిల్లీ పూల గుఛ్చాన్ని నీళ్లు పోసిన గ్లాసులో అమర్చి లైట్ ఆపేసి  కిటికీ దగ్గరకు నడిచాను. వెన్నెలతో పాటు బయట విసిరి పారేసిన చెత్తను చూసాను. మొదట మాములుగా తర్వాత పరీక్షగా. చూస్తున్నవి తొడుగులు అని అర్ధమయ్యాక ఎందుకో తేలికగా తీసుకోలేకపోయాను. మనసు ముడుచుకుంది. ఈ కాలంలోనూ అతనికి కూడా ఇదంతా సాధారణమైన విషయం కదా! ఎందుకంత ఆలోచన!? అని బుద్ధి మందలించింది. 


అతను వెనుక వైపు నుండి లోపలికి వచ్చాడు.తలుపు గడియ వేసి రావడం రావడం జబ్బను పట్టుకుని మూలనున్న చాప వైపు లాక్కుని పోయాడు. నివ్వెరపోయాను, ఏమిటలా జంతువులా! అవే నయమేమో ! 


అతని చర్యను మనస్సు తిరస్కరిస్తుంది.ఒక్కోసారి చేతి వ్రేళ్ళ కొనల మృదు స్పర్శే మనోహరం. మరోసారి బాహు బంధమే దుర్భరం. అవును,అడిగి అడగని  మధ్య వ్యత్యాసం అనంతం కదా!

ఉత్తర క్షణం అతని నుండి విడిపించుకుని వెళ్లిపోతే!  అంతకన్నా అపహాస్యం ఇంకోటి వుందా!?  ఆలోచిస్తున్నాను. ఆ క్షణాన ఆ వైరుధ్యాల వల్మీకంలో నుండి కోరిక బుస్స్ న పైకి లేచిందేమో! అతని నడుమును చుట్టేసిన నా చేతులు. 


ఇద్దరం లేచి బట్టలు ధరించాక “పద పద..త్వరగా నిన్ను బయటకు పంపాలి. వాళ్లొస్తే గదిని సానికొంప చేస్తున్నానని నన్ను గిరాటు వేస్తారు”. అంటూ భుజం పట్టుకొని ముందుకు తోసాడు.వెంటనే చేయి పట్టుకుని వెనుక తలుపు గుండా బయటకు తీసుకొచ్చి కొన్ని అడుగులు వేసిన తర్వాత యేదో మర్చిపోయినట్టు లోపలికి వెళ్లాడు. తిరిగొచ్చి నేను గదిలో వుంచిన లిల్లీ పూల గుచ్ఛాన్ని రోడ్డు పక్కన విసిరేసాడు. నా చేతిలో వొక వస్తువుని వుంచి “  ఈ సారి వచ్చేటప్పుడు ఇవేమి పెట్టుకొని రాకు,గాజులు కూడా” అన్నాడు. గుప్పిట తెరిచి చూస్తే అది నా లోలాకులలో ఒకటి.  “ఇక్కడి నుండి త్వరగా వెళ్ళు” తరిమినట్లు అనేసి వెనక్కి మళ్లాడు.


మనసు పడిన వాడితో  సమాగమానికి మధురోహలతో చెంగు చెంగున గెంతిన మనసు ఒక్కసారిగా టప్ మని గాలి తీసిన బుడగలా అయిపోయింది. కొసరి కొసరి తీపి ముద్దులతో మృదువుగా హృదయ రంజకంగా మధురంగా సాగాల్సిన క్రీడ, యాంత్రికంగా ఆత్రంగా అనుభూతి రహితంగా నా శరీరాన్ని ఆక్రమించుకోవడాన్ని మనసు జీర్ణం చేసుకోలేకపోతుంది. అంతే కాదు నన్ను దాహం తీరిన తర్వాత గ్లాసును పక్కన పెట్టినట్లు పెట్టేయడంతో దిమ్మెరపోయాను. శృంగారంలో రకరకాల ఉద్దీపనలు వుంటాయని చదివాను.ఏవేవో ఊహించాను. అవేమి లేకుండా ఏక పక్షంగా  భౌతిక సుఖం జుర్రుకోవడం రేప్ తో సమానం. కాకపోతే ఆ కలయిక నా అంగీకారంతో జరిగింది కాబట్టి అంతటి మాట నేను అనలేను. ఏ మాత్రం రసావిష్కరణ లేని నా తొలి సమాగం అది.


చెబుతున్న ఆమె కంఠం వణికింది. 


ప్రతి స్త్రీ యవ్వన ప్రవేశకాలం నుండి తమ తొలి సమాగం కోసం ఎన్నో కలలు కంటారు. కానీ నా దురదృష్టం ఏమిటంటే…ఎవరిని కల కన్నానో అతనే నిరాశను మిగిల్చాడు. అతను వీధిలో నన్ను వదిలేసి వెళ్లాక  శూన్యం నిండిన మనసుతో రైలు స్టేషన్ చేరుకొన్నా. శరత్ పౌర్ణమి వెన్నెల నగరంపై దేదీప్యమానంగా వెలుగుతుంది. నా లోపలేదో చీకటి కుమ్మరించినట్లు వుంది. తెలిమబ్బు తునకలు వినీలాకాశంలో వొక్కొక్కటి తేలిపోతున్నాయి.నా చుట్టూరా గాఢంగా అలముకున్న లిల్లీ పూల వాసన. అప్పుడు గుర్తొచ్చింది ఎదపై దాచుకొన్న లిల్లీ పూల చెండు. నలగని ఆ చెండు ని  చూసి కళ్లు చెమర్చాయి. తేలిపోతున్న కాళ్ళతో మనసు నిండా దుఃఖంతో హాస్టల్ కి  చేరుకున్నాను.అతన్ని మనసారా ప్రేమించాను కాబట్టే నాకు ఈ ఆశాభంగమా,నేనతని ప్రేమకు అర్హురాలిని కాదా!? 


మాటలు ఎంత  శక్తివంతమైనవి. ఎదుటివారిని గాయపరచటానికి ఎన్నడూ ఉపయోగించకూడదని అతనికి తెలియదా! పైగా మాటల ద్వారానే మనుషులను సంఘటితం చేసి వ్యవస్థ పై పోరాడాలనే సంగతి అతను మరిచాడా?మిగిలిన రాత్రంతా అతని గురించి ఆలోచిస్తూనే వున్నా. 


అతనిది భౌతిక వాదమే తప్ప నైతిక విలువలు కానీ ఆధ్యాత్మిక విలువలు లేని స్వేఛ్ఛా జీవనం.  నాలో వున్న భావుకత నా హృదయ దౌర్బల్యానికి చిహ్నం.అది అంటు రోగం కానందుకు అతనికి అది ఏ మాత్రం అంటనందుకూ నేను చింతించడం లేదు కానీ… అతనికి స్త్రీల స్నేహం పట్ల  ప్రేమల పట్ల నమ్మకం లేదు.  అతని హృదయంలో ఎవరికీ స్థానం లేదు. అనేకమంది స్త్రీల సాంగత్యాన్ని అతను కోరుకుంటాడు. అశ్లీల భాషలో సంభాషణ నెరపడం అతని అలవాటు. ఆ అశ్లీల భావాన్ని అతను ఆనందిస్తాడు. అది నేను ఎలా మనసుకు  తీసుకున్నానంటే తినే ముద్ద ముద్దకు పలుకురాయి తగిలినట్టు. అతని మనస్తత్వానికి సున్నితత్వం  ప్రేమ లాంటివి సౌకుమార్యాలు  పొసగవు. నేను వున్నది వున్నట్టు స్వీకరించలేను. కొన్ని నటనలు నాకసలు అతకవు. ప్రదర్శించినా అవి ఎంతో ఎబ్బెట్టుగా వుంటాయన్న సంగతి నాకు తెలుసు. కొన్నాళ్ళు నిశ్శబ్దంగా దూరంగా వుందాం అనుకొన్నాను.అది నా మధ్యతరగతి జడ్జి మనస్తత్వం కూడానూ. 


ఇంకా చెప్పాలంటే.. అతనికి రెండు గుణములు తక్కువ, తనకు తోచదు ఒకరు చెప్పినా వినడు. అతనిని వొదులుకోవాలా లేదా అన్న సందిగ్ధ దశలో  వుండగానే భగవంతుడు నాకొక మేలు చేసాడు. అతని వెకిలి స్వరూపం మొత్తాన్ని నాకు ఆ మర్నాడే బయలుపరిచాడు. నాకా సమయంలో “Man is the measure of all things” అని పైతాగరస్ కోట్ గుర్తుకు రావడం సమంజసమే!


యూనివర్సిటీ ప్రాంగణంలో .. అతను గుంపుతో ఎదురయ్యాడు. చాలా కాలం తర్వాత  నేనూ ఒంటరిగా లేను. నన్ను చూసిన అతని మిత్ర బృందం అతనితో సంభాషించడం విన్నాను.


“చిలక చిక్కిందా”


“ మరులు గొన్న చిలక రాకేమి చేస్తుంది,దానంతట అదే గదికి వచ్చి వాలింది”


“ అయితే రాత్రంతా నీకు పండగేనన్నమాట” వీపు వెనుక భళ్ళున నవ్వులు.


“ఆకారం పుష్టి నైవేద్యం నష్టి. మొత్తానికి అదొక చవిటి పర్ర” 


ఆ మాటలు వింటున్న నా హృదయానికి తీవ్ర అఘాతం తగిలినట్టైంది. అక్కడికక్కడ భూమి యెందుకు కృంగి పోలేదో అన్న అవమానం! శరీరం వణికింది. దవడలు పిడికిళ్లు గట్టిగా బిగుసుకున్నాయి.రైలింజన్ నుండి వెలువడ్డ పొగలా చెవుల నుండి వెచ్చని ఆవిర్లు. విసురుగా వెనక్కి వెళ్ళి బేగ్ ని అతని ముఖంపై విసిరి కొట్టి అసహ్యంగా చూసి ఖాండ్రించి ఉమ్మేసాను. అతను వెకిలిగా నవ్వి అసహ్యపు మాటనొకటి వదిలి వెళ్ళాడు. నాతో వున్న గుంపు నన్ను చూసి జాలిపడింది.అవమాన దుఃఖం నన్ను కమ్మేసింది.నేలన కూలబడిపోయాను.అది సుత యూనివర్సిటీ వొదిలేసే వరకూ అతని వైపు కన్నెత్తి చూడలేదు నేను. 

వీటన్నింటి మధ్య కోల్ఫోయిందేమిటో పొందినదేమిటో నాకై నాకు స్పష్టంగా తెలుసు.శరీరం నాది,హృదయం నాది, భావనలు కూడా నావే, బాధ కూడా ముమ్మాటికీ నాదే! 


ఇప్పుడు నాకు శరత్ పూర్ణిమ చల్లని వెన్నెలనూ  లిల్లీ పూల గాఢమైన పరిమళాన్ని ఆస్వాదించే మనసు లేదు.అదెప్పుడో ఆవిరై పోయింది.ఆ నాటి ప్రణయం రంగు వెలిసిన కల. మరలా కలలు కనే సాహసం కూడా చేయలేదు. 


భారంగా ముగించింది ఆమె.


*************

నిశ్శబ్దాన్ని బద్దలు చేసుకుని స్నేహితురాలి సోదరుడు లోనికి వచ్చాడు.


“మొదట నన్ను క్షమించాలి మీరు. కావాలని కాకపోయినా మీ సంభాషణను వినాల్సి వచ్చింది” అన్నాడు. 


ఆమె స్నేహితురాలి వైపు చురుగ్గా చూసింది. కావాలనే అతన్ని వెంటబెట్టుకొని వచ్చావు కదూ.. అన్నట్టు.

 

స్నేహితురాలు చెవి పట్టుకొని చూపి క్షమించమన్నట్టు చూసింది. 


“కనులుంది కలలు కనేందుకే కదండీ. రంగు వెలిసిన కల గురించి ఆలోచన వద్దు. ఇకపై మంచి నిర్ణయం తీసుకోండి” అని సోదరిని బయలుదేర తీసాడతను.


ఎవరితోనూ పంచుకోకూడదనుకున్న విషయం ఇలా బహిర్గతం అయినందుకు కొంత సిగ్గిల్లింది ఆమె. మళ్ళీ అంతలోనే పరాయి వ్యక్తులు ఎవరున్నారులే, ఒకరు ప్రియ నెచ్చెలి,మరొకరు నాతో జీవితాన్ని పంచుకోవాలని ఎదురుచూస్తున్న మనిషి.


*********

మరునాడు ఆమె యింటికి చేరుకొనే సరికి గుమ్మం ముందు.. రెండు  కుండీలు కనిపించాయి. ఒక దానిలో నాటడానికి పెరిగినంత  ఓ పున్నాగ పూల మొక్క, రెండవ దాంట్లో త్వరలో విరియటానికి సిద్ధంగా వున్న లిల్లీ పూల కుదురు. కుండీలను పక్కన పెడుతూ వాటి క్రింద వుంచిన కాగితాన్ని తీసి చూసింది.


అందులో… 


“నేనింత వరకూ ఏ స్త్రీ ని ప్రేమించలేదు. 

మీ పాత గాయాల  పచ్చిదనమే కాదు మచ్చ కూడా కూడా మాని పోయేంత వరకూ యెదురు చూస్తాను. నన్ను విశ్వసించి ప్రేమించగలరా!? రంగు వెలసిన కల స్థానంలో ఇంద్రధనుస్సు ని సృష్టిద్దాం మీరు వానై నేను యెండై” 


ఉద్విగ్నతకు లోనై గుమ్మం మెట్లపై కూర్చుని కనులు మూసుకుంది ఆమె. ఆనాటి రంగు వెలసిన కలను తుడిచేయగలనా నేను అనుకుంటూ. 


 ***************సమాప్తం************


Panteleimon Romanov రష్యన్ రచయిత. 1911 సంవత్సరం లో Without Cherry Blossom పేరుతో కథా సంపుటి వచ్చింది. ఆ సంపుటిలో టైటిల్ కథ  ప్రేరణతో).