4, అక్టోబర్ 2011, మంగళవారం

అమ్మకో లేఖ

ఈ లేఖా సాహిత్యం 2001 వ సంవత్సరంలో మార్చి  నెలలో ..(తేదీ గుర్తులేదు )  ఆకాశవాణి విజయవాడ కేంద్రం  వనితావాణి లో ప్రసారమైనది. (స్క్రిప్ట్ యధాతదంగా )       

********************
అమ్మకో లేఖ -వనజ తాతినేని 

పోస్ట్ మెన్  తెచ్చే లేఖ  కోసం ఆ తల్లి ఇంట్లోకి వీధి వాకిలికి మధ్య  తిరగలి రాళ్ళ మధ్య పడి తిరిగే గింజలా తిరుగుతూనే ఉంది. ఎలా వుందో తన కూతురు. అత్తింట్లో యెన్ని భాదలు పడుతుందో! ఇన్నాళ్ళు వుత్తరం  రాయకుండా యెప్పుడూ  లేదు.. అనుకుంటూ  వీధీ వాకిట్లోకి వెళ్లి వీధి చివర వరకు  చూపుల దారి వేసివస్తుంది. 

ఉత్తరం రాలేదు కానీ ఒక దుర్వార్త వచ్చి గుండెని పిండి పిండి చేసేసింది. ఎవరి వుత్తరం కోసమైతే యెదురుచూసిందో ఆ కూతురు ఆ అమ్మకి వుత్తరం వ్రాయకుండానే మూడేళ్ళ కొడుకుతో సహా స్నానాల  గదిలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండురోజుల ప్రయాణం చేస్తే కానీ ఆ వూరికి చేరడం కష్టం కనుక ఆత్మహత్య గనుక లేనిపోని గొడవలెందుకని  దహన సంస్కారాలు నిర్వహించాం అన్న కబురుతో  కడసారి చూపుకి కూడా వీలవక ఆ తల్లి గుండెలవిసేలా యేడుస్తూనే  వుండగా .. ఆ తల్లికి అప్పటిదాకా యెదురు చూసిన లేఖ రానే వచ్చింది.  ఆత్రుతతో ఉత్తరం చదవసాగింది. ఆ ఉత్తరం తల్లి గుండె  బరువుని మరింత పెంచింది. 


అమ్మా! నెల రోజుల నుండి నా ఉత్తరం కోసం యెదురు చూస్తూ వుంటావ్  కదూ!  నేను నిత్య సంఘర్షణతో, అయోమయంలో వున్నాను కదమ్మా!
 
ఏ భావాన్ని యెలా ప్రకటించి నీకు వ్రాయగలను చెప్పు ? ఇప్పుడు నేను వ్రాస్తున్న యీ ఉత్తరం నీకు  మునుపటి వుత్తరాల్లా ఆనందం  కల్గిస్తుందో  లేదో కానీ ఆలోచింప జేస్తుందని నా నమ్మకం. ఏమిటీ యీ  ఉపోద్ఘాతం అని ఆశ్చర్యపోకు. స్త్రీల జీవితాలకే  లేదు కదమ్మా! 

మానవుడు సృష్టికి ప్రతి సృష్టి చేయ గల్గిన నైపుణ్యం సాధించారు కానీ మానవ విలువలు యిలా వుండాలని హద్దులు యేర్పరచ  లేకపోతున్నాడు  కదమ్మా! తరాలు మారే కొద్దీ అంతరాలు యేర్పడినప్పుడు మనసులు-అనుబందాలు అర్ధం లేనివే అవుతున్నాయి.పాత నుండి కొత్తకి పరుగులు  తీస్తూ వుండటం నాగరికత చిహ్నం అంట కదా!

ఏది శ్వాశతం కానీ ఈ అనంత సృష్టిలో మనిషి మనుగడకి ఊపిరి పోసే సరికొత్త ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టేసి "గుడ్డెద్దు చేలోపడి మేసినట్లు మనం జీవనం సాగిద్దామా? దానికి నో!అనే సమాధానం యిస్తారు కదా! ఫండ మెంటల్ రైట్స్ ఏర్పరచుకున్న మనం వాటిని నిర్వర్తించ కుండటంలో   వైఫల్యం చెందుతున్నాం. సమాజానికి మానవుడికి గల అవినాభావ సంబందాన్ని  గుర్తించాలని నా అభిప్రాయం.

సమాజం ఆరోగ్యం గా ఉండటానికి  కుటుంబాలు దోహదం చేస్తాయని ప్రపంచ వ్యాప్తంగా ఘోషించుకుంటూన్నాం.
ఆ కుటుంబం ఆరోగ్యంగా వుండటానికి మాత్రం భాద్యురాలు స్త్రీ అంటుంది మన భారతీయ సమాజం.
 కుటుంబంలో కష్ట-నష్టాలు,సుఖ-దుఖాలు అన్నింటికీ స్త్రీయే ఆధారం అన్నట్టు పెద్ద బరువుని ఎత్తి చేతులు దులుపుకుంటున్న మగధీరులు,వారికి తాన అంటే తందానా రీతిలో సమజమూను.

అసలు సమాజంలో స్త్రీకి పురుషుడుకి సమానమైన భాద్యతలు, స్తితి కూడా ఉండాలని భావించకపోవడమే అసలైన పొరబాటు. పొరబాట్లు అలవాటైన లోకంలో అడుగడుగునా అణచివేస్తూ క్రుశింపజేస్తూ నిరంతర జీవన ప్రయాణంలో సాగి పోవాల్సిందే తప్ప స్పీడ్ బ్రేకర్ లు,టర్నింగ్ పాయింటులు మచ్చుకైనా కానరాక మనుగడ సాగిస్తుంది మన భారతీయ మహిళ.


పుట్టుక ముందే తల్లి ద్వారా పోరాటం నేర్చుకుని మరీ పుడుతుంది నేడు పుట్టే ప్రతి ఆడ శిశువు. 
పుట్టుక నుండే తల్లిదండ్రుల ఆంక్షలు,పెరిగిపెద్దయ్యేటప్పుడు అన్నదమ్ముల ఆంక్షలు,చదువు కోసం ఆరాటం, ఉద్యోగం కోసం పోరాటం. ఇక జీవిత భాగస్వామ్యి ఎంపికలో తన ప్రమేయం లేక తల్లిదండ్రుల ఇష్టాలకి తలొగ్గి భాద్యతలు గుర్తించి మసలుకునే నాలాటి వారు ఎందరో!


అంతా ఎడ్జెస్ట్ మెంట్ ఎడ్జెస్ట్ మెంట్. తీరా మెట్టినింట స్వజాతి మనుషుల నుండే  ఈర్ష్యా-ద్వేషాలతో కూడిన వేధింపు   చర్యలు. జీవితం చుక్కాని లేని నావలా సాగిపోతుందో,సుడిగుండంలో పయనించాల్సి వస్తుందో..అంతా భయం భయం.
పుట్టిన దగ్గర నుండి కడసారి కాటి వరకు ఎన్నెన్నో ఘట్టాలు,అణచి వేతలు.

నేటి స్త్రీ  తన వ్యక్తిత్వం కోల్పోకుండా వుండాలని ఉనికిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తూనే  ఉంది. ఇదంతా ఎందుకు రాస్తున్నానో..నీకు అర్ధమవుతూ ఉంటుంది కదమ్మా! వైవాహిక జీవితంలో నేను అనుభవిస్తున్న నరక యాతన నుండి విముక్తి కోరుతున్నానని ఈ కష్టాల కడలి ఈదలేక వొడ్డున చేరదామనే నా పోరాటం నీరు కారుస్తూ మీరందరూ చేస్తున్న ప్రయత్నాలు నా మనసుని బాధిస్తున్నాయి. ఏ బిడ్డ అయినా తల్లి దగ్గర కష్టం పంచుకుంటుంది.బిడ్డని దగ్గరకు తీసుకుని ఓదార్చుతూ  తన చల్లని స్పర్శతో ఆత్మవిశ్వాసం కల్గించాలి కానీ నువ్వేమిటమ్మా ..నా నిర్ణయాన్ని  ఆక్షేపిస్తున్నావు? 

వ్యసనాలకి బానిసైన  భర్త పెట్టె మానసిక,శారీరక హింసలకి తట్టుకోలేని ఒక భార్య భర్త నుండి విడాకులు పుచ్చుకుని మానసిక ప్రశాంతతో బ్రతకాలనుకోవడం నేరమా?

ఒక స్త్రీ తన అంతరంగాన్ని విశదీకరించి వ్రాస్తున్న ఈ వుత్తరం మీ లాటి తల్లులని మారుస్తుందని నా నా నమ్మకం.
భార్య భర్తల మద్య ప్రేమ ఉండాలి..కానీ ఇక్కడ ఆంక్షలు.సహకారం ఉండాల్సిన చోట ఏర్పాటువాదం,అవగాహన ఉండాల్సిన చోట అహంకారాలు రాజ్యమేలుతున్నాయి. బతుకు బండి సాఫీగా నడవడానికి మూల సూత్రాలని మరచిన భార్యాభర్తల మద్య సమన్వయము యెలా సాధ్యం  చెప్పు?

సంసారం అంటే స్త్రీని గుర్రంలా మార్చి కళ్ళకు గంతలు కట్టి,ముకు తాడు బిగించి పగ్గాలు చేత బూని స్వారి చేసేవాడా పురుషుడు? 
కదలక పొతే కొరడా దెబ్బలని భరించ మన్నట్లు ఉంటుంది.మీ పెద్దల ఆలోచన  కూడా.. 
సుఖాలు లేకున్నా పర్లేదు.కష్టాలు మాత్రం వద్దనుకుని రాజీ పడి బ్రతుకుని ఈడ్చే స్త్రీలు ఎక్కువని చెప్పక తప్పదు సమానత్వం ఎండమావి లా గోచరిస్తుందని... 

ఏ దేశ చరిత్ర   చూసినా ఏముంది గర్వ కారణం? అబలల పై అత్యాచారాలు,యాసిడ్ దాడులు,భర్తల నిరంకుశత్వ  ధోరణి, ఆ దోరణి  భరించలేని భార్యలు ఎదురు తిరిగి భర్తని చంపే   స్థితికి జారిపోవడం ..ఇలాటివి వింటున్నాం. మన  దేశంలోనూ  ఇటువంటివి  అప్పుడప్పుడు  జరుగుతూనే  ఉన్నాయి  కదా !

కుటంబ  హింసని భరించలేని స్త్రీలు  విడాకులు కోరుకుంటే  ఆ స్త్రీకి అడుగడుగునా అవమానాలు,అవహేళనలు తప్పవు. తప్పులు అనీ పురుషుడివి అయినా నోరెత్తని ఇరుగు-పొరుగు సైతం విడాకులు కోరుకోగానే ఆ స్త్రీకి అక్రమ సంబంధాలు అంటగడతారు అలా తిరిగి కోలుకోనివిధంగా అపవాదులు వేసి తృప్తి పడతారు.


స్త్రీకి ఇలాంటివి అధిగమించే శక్తి కావాలి .ఆసరా అందించే వారి సంఖ్యా పెరగాలి. సభ్య సమాజంలో స్వేచ్చగా,గౌరవంగా బ్రతకడానికి చేయూత నివ్వాలి.కానీ మీలాటి వారందరూ చెప్పే మాటలు మాలాటి వారిని అడుగడునా అణచివేస్తూ..వికృత కోణాలలో ఆలోచించి వికృత రూపాలలో వేయి కోరలు  చాచి మమ్మల్ని కాటు  వేస్తున్నాయి.మా ధైర్యాన్ని   సన్నగిల్లిన్ప జేస్తున్నాయి . పరువు-ప్రతిష్టలకి వెరచి  సమాజం ఏమనుకుంటుందో అని భయంతో..అర్ధపం పర్ధం లేని మూర్కత్వపు చట్రాలలో బిగించి  చట్టాలనాశ్రయిస్తే ప్రయోజనం ఉండదని  కోర్టుల చుట్టూ తిరిగలేమని సమస్యలని,కష్టాలని  కడుపులోనే దాచుకోమని సలహా ఇస్తారు.

స్త్రీలకి  విద్యావకాశాలు పెరిగాయి. ఆ చదువలని సాగనీయడం లేదు.  చదువుకోవాలనే కోరికకి అడ్డుకట్టవేసి పెళ్లి చేసి మీ భాద్యత తీర్చేసుకున్నాము అనుకుంటున్నారు.   ఎట్టకేలకు కొంత మంది చదువుకుని ఉద్యగం చేస్తూ ఆర్ధిక స్వాతంత్ర్యం సాధించుకుంటే ఆ సంపాదన తన అవసరాలకి సైతం వాడుకునే స్వేచ్చ లేదు. 

ఈ పురుషాధిక్య ప్రపంచంలో ద్వితీయ శ్రేణి పోరురాలిగా జీవితం గడుపుతూ విముక్తి కోసం ఆక్రోశిస్తూ .. ఆడదానిగా పుట్టడం కంటే అడవిలో మాని పుట్టడం మేలని నిరాశ,నిసృహలతో కాలం వెళ్ళదీస్తూ..ఉంది. 

"మాతృస్వామ్య హక్కు కొల్పడమే ప్రపంచ చరిత్రలో స్త్రీ జాతి పొందిన పరాజయం అని.. స్త్రీని భోగ్య వస్తువుగా,వంట మనిషిగా,పిల్లలని కానీ పెంచే యంత్రంగా మార్చివేసారని ఎలుగెత్తి ఘోషించాడు..ఎంగెల్స్."


ఈనాటి మహిళా సంఘాలు సైతం అసలు సమస్యలని మరచి కొన్ని సమస్యలకే పరిమితం అయిపోతున్నారు.


మన చరిత్రలో యుద్దాలలో ధైర్య సాహసాలతో పోరాడిడిన స్త్రీ మూర్తులున్నారు.మార్గాన్ని నిర్దేశించిన వీరమాతలున్నారు. కానీ జీవితం అనే యుద్దంలో పోరాడేవారికి ఉత్శాహం  ఇవ్వలేని  మీలాటి వారు చరిత్రని పాఠాలుగా మార్చి చెబుతున్నారు. తప్పు చేయడం మగవారి వంతు వాటిని తప్పక భరించడం ఆడవారి ఖర్మం అంటూ  అదేదో పాటించవలసిన తప్పనిసరి హక్కు అయినట్లు నీతి బోధ చేస్తారు తప్ప  స్త్రీ మనసును,మనిషిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం  లేదు.

జీవితం అంటే కొంత సర్డుబాటే కాదనం.  మీ లాటి వారు ప్రతి క్షణం సర్దు బాటు అనుకోమంటారు. మనం నిర్దేశించుకున్న కొన్ని విలువలు ప్రకారం  జీవితాన్ని  జీవించడం కోసం అనుకోవడం  లేదు.  ఎక్కడినా స్త్రీకి వ్యక్తిత్వం మేల్కుంటే అక్కడ  వందమంది పురుషులు  అణచి వేయడా సమాయతమై ఉంటారు.అది సుపీరియర్ కాంప్లెక్స్ కాదా? అర్ధం పర్ధం లేని పంతాలకి పోయి కాపురం నాశనం చేసుకుంటావా? మగవాళ్ళు తప్పు చేస్తారు ఓర్చుకోవాలి అంటూ మళ్ళీ మళ్ళీ    చెప్పే పాత పాటలే వినే ఓర్పు నాకు లేదు. విడాకులు తీసుకుని నీ బిడ్డని పెంచగాలవా? అంటుంది మా అత్తగారు సవాల్ విసురుతూ..

నా చదువు నన్ను చదువు కొనిస్తే ఇలాటి పరిస్థితి వచ్చి నప్పుడు ఏదో ఒక ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది ఉండేది కదా!ఆర్ధిక స్వాతంత్ర్యం తో..నా బిడ్డని నేను పోషించుకునే స్థితి నాకు ఉండేది కదా.. అయినా ఇప్పుడు నాకు  దిగులు లేదమ్మా ! స్వయం ఉపాది కల్పనతో ఏదో ఒకటి చేయ గలననే దైర్యం,ఆత్మ విశ్వాసం  పుష్కలంగా ఉంది.

ఆర్ధిక స్వాతంత్ర్యం ,ఆత్మ విశ్వాసం లేని స్త్రీలు రాజీ పడిపోయి ఒకరిమీద ఆధారపడే దుస్థితి కల్గినదుకు అనుక్షణం సిగ్గుపడుతూ.. క్షణ క్షణం మరణిస్తూ.. నిత్యం సంఘర్షణతో ఆత్మ వంచనతో బతకడం జీవితం జీవించడం అనిపించు కుంటుందా?
 పాశ్యాత్య    దేశాలల్లో నవనాగారికతతో,ఆర్ధిక స్వాతంత్ర్యం ఉన్న స్త్రీలు చిన్న చిన్న సమస్యలకే విడాకులు పుచ్చుకునే సంస్కృతి ఉంటె ఉండవచ్చు కాక. మన దేశ సంస్కృతిలో   పెరిగిన స్త్రీలు ఎన్నో కష్టాలను భరించిన తర్వాత కానీ విడాకులు కోరుకునే పరిస్థితి వస్తుంది అని అర్ధం చేసుకోలేకపోతున్నారు కదమ్మా!పాశ్యాత్య నవనాగరికతను దిగుమతి చేసుకుని  మన భారతీయ కుటుంబ జీవన విదానాంకి భంగం కల్గిస్తున్నారంటూ మన  దేశం లోని ప్రతి స్త్రీని  అణగ ద్రోక్కడం సమంజసమా?  కాయ కష్టం చేసే స్త్రీలు సైతం ఆర్ధిక స్వాతంత్ర్యం తో.. తన ఆత్మాభిమానం నిలుపోగల్గుతుంది. ఉన్నంత లో  తన బిడ్డలని పెంచుకుంటుంది.  ఉన్నత వర్గాలలో పుట్టిన స్త్రీలు చదువు ఆర్ధిక స్వాతంత్ర్యం కల్గి తమ ఉనికిని కాపాడుకోగల్గుతున్నారు. మద్య తరగతి వారు మాత్రం దైర్యం లేక,తెగింపు లేక తెగని ఆలోచనలతో.ఊగిసలాడే మనస్తత్వం తో..స్వయం నిర్ణయం  తీసుకోలేక నిరంతర యుద్ధం చేస్తూ..కుటుంబ జీవనం అనే రాజుని గెలిపించి తాను మాత్రం సైనికుడిలా ఒరిగిపోతుంది. 

మద్య తరగతి స్త్రీకి ప్రతినిధిగా తప్పనిసరి పరిస్తుతుల్లో  మరలా రాజీ  పడిపోవడానికి నా మనసు అంగీకరించడం లేదు.ఆత్మ వంచనతో జీవించడం కన్నా ఆత్మ విశ్వాసంతో..పయనించాలి అనుకుంటున్నాను.  మా పక్కింటి పిన్ని గారు తప్పులు చేసిన భర్తని క్షమించడంలోనే ఔదార్యమ్ ఉంటుందని అంది. పత్శా తాపం  కల్గిన మనిషిని  క్షమించవచ్చు, కావాలని తప్పుడు దారిలో పయనిస్తున్న మనిషిని  భరిస్తూ జరిగినవన్నీ మరచి నటన అనే ముసుగు వేసుకుని కాపురం చేయడం నల్గురి దృష్టిలో  గౌరవంగా   ఉంటుందేమో కానీ నాకు మరణంతో సమానం.

స్త్రీకి వ్యక్తిత్వం ఉంటే అది శాపం అవుతుందా? చలం వ్యతిరేకించిన ఆలోచనల ధోరణి దశాబ్దాలు దాటినా అలాగే ఉంది. మారనిది,మాయనిది స్త్రీల పై అణచివేత,కొన్ని దేశాలలో ఓటు హక్కు లేదు.మరికొన్ని దేశాలలో స్త్రీల పై జరిగే అత్యాచారాలకి అంతే లేదు.ఇదీ ప్రపంచ దేశాలలో స్త్రీల దుస్థితి.కొంత లో కొంత మన భారత దేశంలోనే నయం అని తృప్తి పడతాం కానీ    మానవ హక్కులు పరిరక్షించే ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్ సంస్థ భారతీయ కుటుంబ స్త్రీల మనోగతాలను పరిశీలిస్తే తెలుస్తుంది. లెక్కలేనన్ని హింసాయుత దారుణాలు,వెలుగులోకి రాని అసంఖ్యాక దురాగతాలు .
నా స్నేహితురాలు అంది. భార్య-భర్తలు విడిపోవచ్చు  కానీ తల్లి దండ్రులు విడిపోకూడదని. వ్యసన పరుడైన తండ్రి నీడ బిడ్డల మీద పడటం ఏ మాత్రం మంచిది? తండ్రి చూపే  ప్రేమ,ఆదరణ కన్నా అతని దుర్వ్యసనాలే బిడ్డలపై ప్రభావం చూపుతాయని మానసిక వేత్తల అభిప్రాయం లెక్కలోకి తీసుకోరేం?


చదువుకుని ఉద్యోగం చేస్తూ ఆర్ధిక స్వాతంత్ర్యం కల్గిన నా ఫ్రెండ్ అక్క తన వ్యక్తిత్వము కాపాడుకునే ప్రయత్నంలో  విడాకులు పుచ్చుకుని  తన పిల్లలని పదిలంగా కాపాడుకుంటుంది. తనకి తరచు ఒక కల వస్తుంది అని చెబుతుంది. అది ఏమిటంటే తన కొడుకు తనని తండ్రి ప్రేమ నుండి దూరం చేసావని దూషిస్తూ అర్ధం పర్ధం లేని క్రమశిక్షణ కి గురి చేస్తున్నావని,తరచూ  నిందిస్తున్నావని అడుగుతావని అంటూ ఉంటాడట. ఆ కల నుండి మేలుకుని ఆలోచిస్తూ ఉంటానని, ఆ కల నిజం అయినా ఆశ్చర్య పోనని అంటుంది.  ఆమె భర్త తరపు బంధువులు  తరచు ఆమె ఇంటికి వస్తూ అలాంటి ఆలోచనలే ఇంజెక్ట్ చేస్తున్నారని తెలుసుకుని వారికి దూరంగా ఉంచడం చేస్తుంది.

స్త్రీలు తమ వ్యక్తిత్వాలని తాకట్టు పెట్టి  పిల్ల కోసం అన్నీ   భరించి తన రక్తమాంసాలను కరిగించి  తనకంటూ ఏమి మిగుల్చుకోకుండా  బిడ్డల బంగారు భవిష్యత్తు కుటుంబ జీవనంలోనే చూపగలదా? ఒంటరి మహిళల్లో  అలా పెంచలేరా?  అలా అనీ భరించి త్యాగమయి అనిపించుకోవడంలో.. జీవితం అంతా  అరగదీసుకోవాలా?  బిడ్డలు తల్లి త్యాగాలు గుర్తిస్తారా?  బిడ్డలు గుర్తిస్తారని తల్లి త్యాగాలు చేస్తుందా? అని ఆవిడ అడిగే ప్రశ్నలకి ఎవరు సమాధానం చెపుతారు? విడాకులు తీసుకున్నందుకు   ఆమె చుట్టూ జేరి ఆమెని మాటలతో చిత్రవధకి  గురుచేసి ఆమె నిర్ణయం తప్పని ఉద్భోద చేస్తూ ఉంటే ఈ ఊరినుండే బదిలీ   చేయించుకుని వెళ్లి పోయింది. తన నిర్ణయాలకి తనని వదిలేయక జీవితం అంతా తల్లిదండ్రుల కోసం, భాద్యతల కోసం,బిడ్డల కోసం,కుటుంబం కోసం, కరిగిపోయే కొవ్వొత్తిలా కరిగిపోవాలనుకోవడమే  ఈ సమాజం విధించే ఆంక్ష లైతే స్త్రీ శిశువు పుట్టగానే చంపేయడం మంచిది అనిపించక మానదు. అమ్మా! నన్ను అలా ఎందుకు చంపేయలేదు. నాకు ఎన్ని భాదలు తప్పి పోయేవో!నీకు పదే పదే నా భాదలు చెప్పి విసిగించే వారు ఉండే వారు కాదు. ఇక నిన్ను ఇబ్బంది పెట్టె ఉత్తరాలు వ్రాయను. దైర్యంగా తలెత్తుకుని జీవించే నీ కూతురిని చూస్తావు కూడా!

స్త్రీ మనసుని ఔపాసన పట్టిన వారు ఎవరైనా ఉంటే ఎన్ని కోణాలలో స్త్రీలో ఉదాత్త గుణాలని చూడ గల్గుతారో!ఒక మంచి వెంట చెడు ఒక చెడు వెనుక మంచి ఉంటాయన్న వేదాంతాన్ని ఒంట  బట్టించుకుని తల్లిగా కుటుంబ జీవనం ని విడిపోనివ్వకుండా బతుకు బండిని లాగక తప్పదనే నీ మాటని పెడ చెవిని పెట్టి మీ తరంలో మీరు తీసుకోలేని నిర్ణయాన్ని  మా తరంలో సాహసించి  నేను తీసుకున్నందుకు ఆక్షేపించినా సరే నేను నా నిర్ణయాన్ని మార్చుకోదలుచుకోలేదు.  అభినందనలు అందిస్తూ చేయూతనిస్తారో! ఆక్షేపిస్తారో! నావి అన్నీ ప్రశ్నలే! ప్రశ్నలోనే సమాధానం ఉందని  అమ్మలందరూ తెలుసుకోలేని వారు కాదు. అయిన మౌనం వహిస్తారు. మౌనం అర్ధాంగీకారం అనుకునే కన్నా మాకు స్పష్టమైన మీ ఆలోచన,అనుభవాల ధోరణి  పంచడం కావాలి. నేడు కాకున్నా  రేపు మాత్రం తప్పక మాదవుతుంది అనే ఆశతో ముందుకు సాగిపోయే "ఆమె" కి ప్రతినిధిని నేను. అపరాజితని నేను. 

అమ్మా నన్ను తప్పు చేస్తే దండించే నీవు  నేను తప్పుడు నిర్ణయం తీసుకుంటే దండించే అధికారం ఉందని మరువకు. ఎప్పుడైనా ఏదైనా చెప్పకుండా చేయని నేను ఇప్పుడు నీకు తెలియ కుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేక నా వేదనని.. నా లాటి వారి వాస్తవ స్థితులని తెలిపే ప్రయత్నం చేసాను.అర్ధం చేసుకుంటావనే ఆశతో ..


                                                                                                               ఇక ఉంటాను మరి
                                                                                                                          ఇట్లు
                                                                                                                        అపరాజిత.                                               
            ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ లేఖలో నా ప్రశ్నలు నీ ప్రశ్నలు సమస్త స్త్రీ ప్రశ్నలు ఉన్నాయమ్మా! వీటికి బదులు దొరికేది ఎన్నడు ? నేనూ నిన్ను అర్ధం చేసుకోలేని సమాజంలో మనిషినే నమ్మా ..నన్ను క్షమించు నన్ను క్షమించు తల్లీ .. అని ఏడుస్తూనే ఉంది. 

*************౦**************

3 కామెంట్‌లు:

సుధ చెప్పారు...

ఉత్తరం కోసం ఎదురుచూస్తున్న తల్లికి, ఆ ఉత్తరం చేరేలోపునే నెత్తిమీద వేసిన బండలా చేరిన వార్తలోని విషయం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎంతో ధైర్యంగా తన జీవితాన్ని తనే తీర్చుకోవాలనుకుని తల్లికి ఆ విషయం రాసింది. (పేరు కూడా సార్థకంగా అపరాజిత అని పెట్టారు). కానీ ఆమెని హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా నిరూపించారన్నమాట. అలాంటి పరిస్థితులలో ఉన్న అమ్మాయికి అమ్మనాన్నలనుంచి తగిన మద్దతు లభించాలని, వారు కుటుంబంకోసం అంటూ తమ జీవితాన్ని నాశనం చేసుకోకూడదనే ఉద్దేశంతో నేను రాసిన టపా....http://illalimuchatlu.blogspot.com/2008/07/blog-post.html.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సుధ గారు మీ పోస్ట్ చూసాను. నిజానికి ఏ సమయం లో నైనా పిల్లలకి తల్లిదండ్రుల సపోర్ట్ అవసరం. కొన్ని వర్గాలలో తల్లిదండ్రులు వారి పిల్లల మనోభావాలకి విలువనీయకుండా,వారు పడుతున్న దురవస్తలని పట్టించుకోకుండా సమాజం ఏమనుకుంటుందో అనే భావనతోనే వారి వారి భయాలని దాచుకుని బిడ్డల నిర్ణయాలకి విలువ ఇవ్వరు. అందువల్లనే స్త్రీలకి ఎన్నో కష్టాలు మానసిక వ్యధలు. ధనిక వర్గపు,శ్రామిక వర్గపు స్త్రీలకూ ఉన్న స్వేచ్చ,వెసులుబాటు మద్య తరగతి స్త్రీలకి లేనందువల్లనే మద్య తరగతి జీవితంలో వివాహ వ్యవస్త చావకుండా,చావనీయక స్త్రీ మాత్రం బలి అవుతూ ఉంది. చాలా మంది తల్లిదండ్రులు నిజాలు గుర్తించే టప్పటికే ఎంతో మంది స్త్రీ మూర్తుల జీవితాలు వివాహమనే సమిధలో కాలి బూడిద అవుతూ ఉన్నాయి. అపరాజిత కథ అలాటిదే! ఆమె తల్లిదండ్రుల లాగానే ఎంతో మంది తల్లిదండ్రులు. గడచిన దశాబ్ద కాలంలో కూడా మార్పు నాకు కనబడలేదు. అయితే అక్కడక్కడాకొందరు చట్టం పై అవగాహనతో.. తిరుగులేని ఆయుధం గా చట్టాలని ఉపయోగించుకోవడం చూస్తే.. బాధ కల్గుతుంది. చదువులు,ఉద్యోగాలు మనలని మనం తీర్చిదిద్దుకోవడానికి తప్ప కక్ష సాధింపు చర్యలకి కాదని తెలుసుకుంటే.. మనది వెలుగుల ప్రయాణమే! స్పందిన్చినందులకు ధన్యవాదములు.

Maitri చెప్పారు...

Vanajamaali,
It is sad but it is happening. But then it depends on the parents. As long as the girl is brought up with the proper values and retains the strength inculcated by the parents,I guess that it will not be the case. Paraents are the foundation.