31, అక్టోబర్ 2018, బుధవారం

రస స్పర్శ





నిశ్శబ్దం నిశ్శబ్దం .. భయంకరమైన నిశ్శబ్దం. నా  లోలోపల మాట్లాడుకునే మాటలే నాకు వినబడని నిశ్శబ్దం.  అమావాస్య రాత్రిలా  నన్ను చుట్టేసిన నిశ్శబ్దం. మైనస్ డిగ్రీలలో వెచ్చని రజాయిలా నన్ను అంటిపెట్టుకున్న నిశ్శబ్దం. నిశ్శబ్దంలో నుండి  నిశ్శబ్దంలోకి ప్రయాణిస్తూ నేను. ప్రచండమైన మనో వేగంతో యిల్లు నగరాలు దేశాలు ఖండాలు దాటి దట్టమైన  కీకారణ్యంలో ప్రవేశించాను. అక్కడ కూడా నిశ్శబ్దమే. నేను మనుషులకి దూరంగా కదా పారిపోయి వచ్చింది. ఇన్నాళ్ళూ వాళ్ళకు యిష్టంగా నాకు కష్టంగా వాళ్ళకు కష్టంగా నాకు యిష్టంగా మాట్లాడే శబ్దాల నుండి వెఱచి చేస్తున్న ప్రయాణం కదా యిది. పక్షుల కిలకిల రవాలని  కూడా అసహ్యించుకున్నానేమో..అవి కూడా వినబడని గాఢమైన నిశ్శబ్దంలో దారీతెన్నూ లేక నడుస్తూనే వున్నాను. ఊటలా పుట్టే ఆలోచనలపై కూడా  నిశ్శబ్దమనే పెద్ద బండపడి యెందుకు నడుస్తున్నానో తెలియని  సృహలో  నిసృహగా నడుస్తూనే వున్నాను. అలా పగలురాత్రెరుగని ప్రయాణంలో నిస్సత్తుగా మారి శరీరం గాలిలో తేలిపోతూన్నట్లు అనిపించి  కాసేపు విశ్రమించాలని అనుకున్నాను. ఉన్నచోటనే పడిపోయాను. రాళ్ళు ముళ్ళు వున్న సృహే  లేదు.

ఆ అచేతనావస్థలో అకస్మాత్తుగా   చెవులనుండి ఆత్మని చేరిన సంగీత ప్రవాహం. అనాదిగా వున్న నిశ్శబ్దంలో నుండి జనియించిన శబ్దం. అది సృష్టించిన అలజడిలో నుండి మేల్కొని చుట్టూ పరికించి చూడాలనుకున్నాను. కానీ కనులు తెరవలేకపోతున్నాను. నా విశ్రాంతిని,  నిశ్శబ్దాన్ని భగ్నం చేసిన ఆ శబ్దంపై  అంతులేని ద్వేషం కల్గింది. పైకి లేవలేక కుప్పకూలిపోయాను. లోకంలో వూరేగాల్సిన గాలినంతా యెవరో  పోగేసుకున్నట్లు దానిని పూరించి శబ్దాన్ని సృష్టిస్తూ వున్నట్లు అనిపించింది. వింటూ వింటూ నుండగా  ఆ  నాదంలో యేదో మహత్తర శక్తి వుందనిపించింది .  క్రమేపీ ఆ శక్తి నాలో ఆణువణువూ ఆక్రమించింది. నన్ను  నిద్రాణంలో నుండి బయటపడేసిన ఆ శబ్దాన్ని సృష్టించిన  వైతాళికుడిని చూడాలనుకుని లేచి కూర్చున్నాను.  ఈసారి శ్రమ పడకుండానే కళ్ళు మాములుగా తెరుచుకున్నాయి. మైళ్ళ దూరందాకా  విస్తరించిన ఊడల మఱ్ఱిచెట్టు మొదలునానుకుని విశ్రాంతంగా రాజసంగా కూర్చున్నాడతను. అరమోడ్పు కన్నులతో వెదురుకర్రపై వేళ్ళు కదిలిస్తూ పెదవులతో గాలిని వూయిస్తూ లోకాలలో పనిలేనట్టు తన లోకంలో మునిగిపోయి వున్నాడు.  నాకు దాహంగా వుంది అని అరిచాను.  అతను ఆ వెదురుకర్రని వూదటం ఆపేసి నెమ్మెదిగా లేచొచ్చి  తండ్రిలా నా చేయి పట్టుకుని నడిపిస్తూ తీసుకెళ్లి  సముద్రం ముందు నిలబెట్టాడు. అతన్ని పట్టించుకోవడం మానేసి సముద్రాన్ని చూస్తున్నా. కెరటాలు వువెత్తున్న వచ్చి భూమిని తన తలతో కసితీరా బాది  వెనక్కి వెళుతున్నాయి. అలసిపోతూ వున్నాయి. మళ్ళీ అంతలోనే వొచ్చి  తనప్రతాపం చూపుతున్నాయి.  ఎందుకో భూమిపై జాలేసింది. సముద్రం పొగరు అణచాలనిపించింది.

సముద్రానికి స్ట్రా వేసి తాగుతున్నా ..తాగుతూనే వున్నాను. ఎంత తాగినా దప్పికారడం లేదు. సముద్రమంతా యెండిపోతుంది. చేపలన్నీ,తిమింగలాలన్నీ యెగిరిపోతున్నాయి. నక్షత్రాలన్నీ నా చుట్టూ వెలుగుతున్నాయి. కనిపించినంతమేరా పూలపొదలు,ముత్యాల, పగడాల, బంగారు రాసులు. చిన్న పువ్వునైనా కోసుకోవాలని కానీ ముత్యాల  పగడాల రాశులని  తాకాలని కానీ నాకనిపించలేదు.  ఒక్క క్షణం నేనెవరిని ..అసలు నాకూ ఈ లోకానికి సంబంధమేమిటీ అన్న సందేహం వచ్చింది. తెలుసుకోవాలనిపించింది. మరుక్షణంలో అసలీ లోకంతో నాకు పనేమిటీ, నేను నేనే. నేను మాత్రమే నిజం అన్న అహం ఆవరించింది. తలెత్తి చూసాను. భూమి చాలా మైళ్ళ యెత్తులో,శిఖరాలు అంతకన్నా యెత్తులో కనబడుతూ వున్నాయి. నేనిక్కడ దాకా యెందుకు వచ్చాను,  అసలక్కడ లేనిది యిక్కడ వున్నది యేమిటన్న  సందేహం ముంచుకొచ్చింది. హఠాత్తుగా నాలోపల ఒక మనిషి వున్నాడని గుర్తుకువచ్చింది . వాడికి అన్నీ వున్నాయి అనుకోగానే  ఆకలి గుర్తుకొచ్చింది.  చుట్టూ చూసాను. తినదగిన ఆహార పదార్ధాలేవి  యెక్కడా కనబడలేదు. ఆఖరికి నీళ్ళు లేవు, గాలి లేదు, యేవీలేవు.  కానీ నేనున్నాను. అసంతృప్తి నిండిన నేనున్నాను.  నాకేమికావాలో తెలిసిన సృహలో  కొంత వినయంగానూ, తెలియని అజ్ఞానంలో కొంత అమాయకంగానూ, నాకేమి తెలియాల్సింది లేదన్న అహంకారంతో  కొంత నిర్లక్ష్యంగానూ సంచరిస్తూనే  వున్నాను.

ఉన్నాను, అలాగే సంచరిస్తూనే వున్నాను.మంటలు మంటలు నా చుట్టూతా మంటలు మంటలమధ్య కూడా నడుస్తూనే వున్నాను.అందులో దహించబడతున్నానేమోనని   భయం కల్గింది కానీ నాకు యిసుమంత వేడి తగలడంలేదు దూదిలా తేలి తేలి పోతున్నాను. ఎందుకంటే నాలో ఉన్న ఆరునదులను దాచుకుని వున్నందునేమో. ఆ ఆరు నదులు అగ్నికి లోబడి దహించనిదే నేను చేరుకోవాల్సిన గమ్యం నాకు కనబడదేమోనన్న దిగులు ఆవరించింది .   నిరాశగా నడుస్తూనే వు న్నాను. కొన్నాళ్ళకి   ఆ అగ్ని శిఖల మధ్య అతను. చిత్రంగా అతని చుట్టూ ఒక చీకటి  వలయం. ఆవలయంలో కూర్చుని శిల్పాలు చెక్కుతూనే వున్నాడు అతని చుట్టూ వున్న బండరాళ్ళన్నీ  శిల్పాలు గా మారుతూనే వున్నాయి..కొన్నాళ్ళకి  ఆ శిల్పాల అర చేతిలో దీపపు ప్రమిదలని  చెక్కుతున్నాడు. చెక్కడం పూర్తైన తర్వాత నోటితో ఉప్ మని వూది వాటినన్నింటిలో  నూనెని నింపాడు.  తరువాత  అన్నింటిని చేతితో తాకుతూ వెళుతున్నాడు. దీపాలు  వెలుగుతున్నాయి  కానీ కానీ అక్కడ వెలుగు లేదు. అక్కడ  ఆవరించిన భయంకరమైన  చీకటిలోకి  వూపిరి ఆడటంలేదు. దీపాలని వెలిగించి వెలిగించి అతను చెట్టుని ఆనుకుని కూర్చుని వెదురుకర్రని ఊదడం మొదలెట్టగానే దీపాలన్నీ వెలుగుతున్నట్లు గాలికి వూగుతున్నట్లు కనబడింది నాకు. విసుగనిపించింది. మెల్లగా ఆ వలయం మధ్య నుండి బయటకి చేరుకున్నాను  అక్కడపుడు అగ్ని లేదు. మళ్ళీ సంచారం. 


 కొన్నాళ్ళకి  ఓపిక సన్నగిల్లింది. తూలిపడిపోబోతున్న నన్నొక ఆత్మీయ హస్తం పట్టుకుని నిలబెట్టింది. మెత్తని  పచ్చిక తివాచీపై కూర్చుండబెట్టి ఈ లోకానికి అతిధిగా వచ్చావ్, క్షుద్భాధతో అలమటించడం నాకు బాధ కల్గిస్తుంది. రా .. వచ్చి ఆరగించు అన్నాడు  చేతితో దగ్గరగా వున్న రకరకాల ఆహారపదార్ధాలవైపు చూపుతూ.   తొలిసారిగా నాతో మాట్లాడుతూన్న అతని వైపు చూస్తూ    ఓహ్ ..నన్ను  యిప్పుడితని అతిధిని అంటున్నాడు. అతిధి మర్యాదలు చేయకపోతే నామోషీ గాబోలు, కనీసం  ఆకలి తీర్చేటప్పుడైనా అమ్మలాగా అనిపించ వచ్చు కదా !  ఆ ఆహారపదార్ధాలలో కాస్త మధురమైన ప్రేమని రంగరించి  కొసరి కొసరి తినిపించవచ్చుకదా !  ఏదో మొక్కుబడిగా పిలిచాడు. నేనెందుకు వెళ్ళాలసలు అని బీరాలు  పోయాను.  ఆకలి సంగతి మరిచి ఆసలెక్కడికి వెళ్ళినా అతనే యెందుకుంటున్నాడో అని ఆలోచన చేస్తూ ఆ ఆహార పదార్ధాలనుండి దూరంగా జరిగి  వో  రాతిపై కూర్చుండి పోయాను.

అతను ఎప్పటిలాగానే   చెట్టు క్రిందనే కూర్చుని దట్టీ లో నుంచి వెదురు కఱ్ఱని తీసి పెదవులకి ఆనించాడు. ఎప్పటిలాగానే నేనొకరకమైన  మైకంలో  కనులు మూసుకుని పోతుండగా నా అంతరంగం ఒకటి గుర్తుచేస్తుంది.ఈ సుందర వుద్యాన వనాలు, లతలు, ఫలపుష్ఫాదులు, ముత్యాల పగడాల రాసులు, గాలిలో తేలిపోయినట్లుండే యీ సంగీతం వినడం, మధుర పదార్ధాలు ఆరగించడం యివేమి కాదే నేను కోరుకున్నది. నాకు కావాల్సినది మరేదో, అదేమిటో హృదయానికి తెలుసు కానీ ఆలోచనకేమాత్రం అందనంటుంది.  శతాబ్దాల విరహంతో మనసు వేగిపోతుంది. హృదయం అలమటిస్తుంది.  ఆ యాతనని  చెప్పటానికి సమయం ఆసన్నమైంది కానీ నోరు పెగలనంటుంది. ఎట్టకేలకూ  అంతరంగంలో జ్వలిస్తున్న కోరిక ముందుకు తోసుకొచ్చింది. అవును నేను నా సఖుడిని కదా కోరుకున్నది. అతడే యీతడు కావచ్చు కదా అని తోచింది. తోచినదే తడవుగా  నేను నా అహాన్ని  త్యజించి బిడియం విసర్జించి  అతడు మాత్రమే సత్యం అన్నది  గ్రహించి జ్ఞాన వస్త్రాన్నికప్పుకుంటూ చేతులు చాచి  రా రమ్మని ఆహ్వానిస్తూ  అతని ముందుకు నడిచాను. అతను నా వైపు చూడనైనా చూడలేదు. తన లోకంలో తాను మునిగి వున్నాడు.  నాచుట్టూ మాయమైన సముద్రమంతా దుఃఖంలా మొలుచుకొస్తుంది. అందులో నేను మునిగిపోతున్నాను. దీనంగా అతనిపైనే దృష్టి నిలిపి నీ బాహుబంధాల మధ్య క్షణమైనా నన్ను విశ్రమించనీయి. ఎన్నివేల లక్షల   యోజనాలు తిరిగి తిరిగి వెతికాను నిన్ను. నిన్నిప్పుడే తెలుసుకున్నాను. నీ సమక్షంలో  గొప్ప శాంతిని పొందిన అనుభవాన్ని రవంతైనా  మిగలనీయ కూడదా, వేదనతో అలమటిస్తున్న నా  ఆత్మ రోదన వినిపించడం లేదా అని మౌనంగా నా మాటని  నివేదిస్తున్నాను. కళ్ళనిండా వున్న నీళ్ళను కమ్మేస్తూ మహా సముద్రం నన్ను ముంచేసింది.

సృహ వచ్చి చూసుకునే సరికి అతని ఆలింగనంలో నేను.  నన్ను రక్షించాడతను.సంతోషంతో నిలువెల్లా వూగిపోయాను.  సఖా ! నేను నువ్వు వేరు  వేరు కాదు  కదా,  మనం ఆత్మ ముద్రలం కదా అని గుస గుసగా అడుగుతూ, నా స్వరం నాకే కొత్తగా వినబడుతుంటే ఆశ్చర్యంగా కనులు విప్పాను. నాతలకి దగ్గరగా అతను  తలని వొంచి  దయాపూరితమైన ధృక్కుతో వాత్సల్యంతో నన్ను చూస్తూ   నీ అశాంతి మాయమైందా  అని అడిగాడతను . మాయం చేయడం నీ చేతిలో పని కదా, మళ్ళీ అశాంతి వొడ్డున నన్ను వొదిలేయకు. నన్ను నీ ఆలింగనంలోనే బంధించి ఆ పారవశ్యసౌఖ్యాన్ని శాశ్వతం చేయి అన్నాను. అతను మాట్లాడ లేదు. తలనెత్తి సాలోచనగా పైకి  క్షణకాలం   చూసి కనులు మూసుకున్నాడు. ఆ గడ్డం క్రింద  నొక్కుని చూస్తూ అతన్ని మరింత గట్టిగా హత్తుకోబోయాను. సుతిమెత్తని స్పర్శలో యేదో లోపించింది. మరుక్షణం మనసుకి  వుక్కపోసినట్లయింది. అప్రయత్నంగా అతని నుండి విడివడ్డాను.క్షణంలో నన్నావరించిన తేజస్సంతా తటిల్లతలా మెరిసి గాఢాంధకారంలో కలిసిపోయింది.  అర్ధమైంది, నేను అలమటిస్తున్నాననే జాలి దయతోనే  అతను నన్ను దగ్గరకి తీసుకున్నట్లు.   సంపూర్ణమైన ప్రేమతో  అక్కున జేర్చుకోని అతని  ప్రియ సాన్నినిధ్యం  నాకు మాత్రం వెగటు కల్గించదూ. పొతే పోనీయి లే అని నన్ను నేను స్థిమిత పరుచుకున్నాను. మరుక్షణంలోనే  నా ప్రేమలో నిస్వార్ధం, నా వాంఛలో పరిపూర్ణం గోచరించనిదే అతను మాత్రం యెలా స్వీకరించగలడు అని ప్రశ్నించుకున్నాను.  అతను క్రమేపీ నా మానసంలో నుండి కూడా అదృశ్యమై పోయాడు. వెనువెంటనే  అవ్యక్తమైన  దుఃఖం నన్నావరించింది. మృత భారమైన శరీరాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ వున్నాను.ప్రేమించడం అంటే మనని మనం గాయపరుచుకోవడమేకదా! గాయాలను మాన్పుకుంటూ మరింత ప్రేమించడమనే మార్గం ద్వారానే అతన్ని చేరుకోగలననిపించింది.

దేహం పొరలు పొరలు  తొలుచుకుంటూ నెమ్మెదిగా బయటకి వస్తుంది. తడిచిన మోచేయి చల్లగా ముఖానికి  తగులుతుంది.ఎవరో పై అంతస్తులో గతా గతా నడుస్తున్న శబ్దం. తోడుగా తలుపుపై మునివేళ్ళ శబ్దం. బలవంతంగా నెమ్మదిగా కళ్ళు తెరిచి యెదురుగా  వున్న కిటికీ వైపుకి చూసాను. దూరంగా గాలికి కదులుతున్న ఫైన్ వృక్షపు కొమ్మలు. అద్దాల తలుపులని బద్దలు కొట్టుకుని మరీ వచ్చిన   బుచుకు  బుచుకు మనే శబ్దం. అప్రయత్నంగానే లేచి కిటికీ ప్రక్కన నిలబడి  అద్దానికి ఆవల చూస్తే రోజ్ గ్రీక్ పూల పొదలపై తుమ్మెదల సంచారాన్ని చూసిన ఆనందంతో పేటియా రైలింగ్ పైన చక్కర్లు కొడుతూ గొంతువిప్పిన పక్షి.  తిరిగి మొదలైన అవుట్ ఫుట్ రొద. దూరంగా కూతవేస్తూ వెళుతున్న లోకల్ ట్రైన్ నా లోపలి  నిశ్శబ్దాన్ని పూర్తిగా భగ్నం చేస్తూ.



                            (ఇదొక అనుభవైకవేద్యం)

కామెంట్‌లు లేవు: