10, ఏప్రిల్ 2024, బుధవారం

సామ్రాజ్ఞి

 


సామ్రాజ్ఞి - వనజ తాతినేని


“ఈ రోజేనా, మీ అత్తమామ వచ్చేది?” కూతురు ఉజ్వల ను అడిగింది తల్లి అరుణ. 


“అవునమ్మా! ఆర్నెల్లు వారిని భరించాలంటేనే భయమేస్తుంది. శ్రీకర్ కి తల్లిని చూస్తే చాలు.. ఆమెపై ప్రేమ వరద గోదావరిలా  పొంగుతుంది. ఆమేమో కొడుకు ఇద్దరు బిడ్డల తండ్రైనా ఇంకా పసివాడిలా చూస్తూ నోట్లో ముద్దలు పెడుతుంది. మా అమ్మ వస్తే నీకు వంట పని తప్పుతుంది. మా అమ్మ ఎంత బాగా వంట చేస్తుందో” అని ఊరిస్తున్నాడు.


“అంత ఆందోళన పడకు. అసలు ఆమెను వంటింటి వైపు రానీయకు, నీకు కష్టమైనా సరే ఉదయం టిఫిన్ వంట రెండూ అక్కడ చేసి పడేయ్. మీ అత్తగారి సంగతి నాకు బాగా తెలుసు.  వీలైనంతగా వాళ్ళను పట్టించుకోకు. అభిమానం దెబ్బతింటే వుండమన్నా వుండదు. నెలరోజులకల్లా తిరుగు ప్రయాణంలో వుంటారు” విష బోధ చేసింది కూతురికి. 


“ సరేనమ్మా,రోజూ ఇలా ఆఫీస్ కి వెళ్ళేటప్పుడే కాల్ చేస్తాను,ఉంటా.. బై..”


శ్రీకర్ ది రిమోట్ జాబ్. మద్యాహ్నం మూడున్నరకు కమ్యూనిటీ బస్ స్టాప్ నుండి పిల్లలను ఇంటికి తెచ్చుకుని స్నాక్స్ ఇచ్చి..పిల్లలను తీసుకుని ఏర్పోర్ట్ కి బయలుదేరాడు. గంటకు పైగా ప్రయాణ దూరం. హెవీ ట్రాఫిక్. ఒక అరగంట ఆలస్యం అయ్యేటట్టుంది అనుకున్నాడు. రోజూ ఇలాంటి హెవీ ట్రాఫిక్ లో నుండే ఉజ్వల ఇంటికి రావాలి. పాపం అలసిపోతుంది. అమ్మ  వున్నన్నాళ్ళు వంట చేసే పని వుండదు. పిల్లలు నాన్నతో గడుపుతారు.. మా ఇద్దరికీ తీరిక దొరుకుతుంది. ఈ స్ప్రింగ్ అంతా హాయిగా గడిచిపోతుంది అనుకున్నాడు. సరళ శ్రీనివాస్  ఇమ్మిగ్రేషన్  ముగించుకుని లగేజ్  కలెక్ట్  చేసుకుని బయటకు వచ్చేసరికి శ్రీకర్ పిల్లలు కనబడ్డారు. మూడేళ్ళ తర్వాత కొడుకుని పిల్లలను చూడటం వారికి సంతోషం కల్గించింది. ఫారిన్ ట్రిప్ అదే తొలిసారి కావడం ముఫ్పై గంటలసేపు ప్రయాణం వల్ల  తల్లిదండ్రులు బాగా అలసిపోయారనిపించింది శ్రీకర్ కు. ఇంకో గంటన్నరకు ఇంటికి చేరుకున్నారు. ఉజ్వల ఇచ్చిన కాఫీ సేవించి ఇండియా నుంచి తెచ్చిన సరంజామా అన్నీ పరిచింది సరళ. బంగారు నగల బహుమానాలు పట్టు బట్టలు తీపి మిఠాయిలు పచ్చళ్ళు వడియాలు అన్నీ చూసి ఉజ్వల సంబరపడింది. 


అమ్మా! గోంగూర పచ్చడి ఉలవచారు ఓపెన్ చేసి అన్నం కలిపి పెట్టమ్మా.. అడిగాడు శ్రీకర్. సరళ తల్లి మనసు ఆర్ద్రమైంది.  వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి నెయ్యి వేసి  ముద్దలు చేసి కొడుక్కి పిల్లలకు తినిపించింది. నువ్వు కూడా తినమ్మా.. అని కోడలికి చేతిలో ముద్దలు పెట్టింది.     


 రెండు రోజుల తర్వాత ఆఫీస్ కి వెళ్ళివచ్చిన  ఉజ్వల ఇంట్లో అడుగు పెట్టేసరికి  వంటిల్లు ఘుమ ఘుమ లాడుతుంది. ఈవిడేదో వంటలు కానిచ్చినట్టు వుంది. నిజం చెప్పొద్దు నా వంటకు ఆ ప్లేవర్ రానేరాదు అని మనసులో అనుకుంటూ.. “ఏం చేసారత్తయ్యా” అని అడిగింది. “కొబ్బరి వేసి బెండకాయ వేపుడు, పప్పు చారు చేసానమ్మా. ప్రెష్ అయ్యి రా.. నువ్వు కూడా నాలుగు ముద్దలు తిని రెస్ట్ తీసుకుందువుగాని”.


ఉజ్వల మనసులో అనుకుంది.

“ఈమె ను వంటింటి జోలికి వెళ్లనివ్వకూడదని తను ఎంతగా ప్రయత్నిస్తుందో అంతగా అక్కడే పాతుకుపోతుంది.  శ్రీకర్  ఏమో “నీ హడావిడి వంట తిని జిహ్వ చచ్చిపోయింది. అమ్మ వున్నన్నిరోజులు ఆమె ను వంట చేయనీ” అని గట్టిగానే చెప్పాడు. 


ఉజ్వల   ప్రెష్ అయి  కిందకు వచ్చేసరికి సరళ పిల్లలకు గోరు ముద్దలు తినిపిస్తుంది. ఒళ్లు మండిపోయింది ఆమెకు. ఇదిగో ఇలా చేసే  కొడుకుతో పాటు పిల్లలను మాయలో పడేస్తుంది. నా పిల్లలు నాక్కాకుండా  చేసేస్తారు అని అతిగా ఊహించుకుంది.


“అత్తయ్యా! మీరిలా ప్రతిరోజూ చేత్తో ముద్దలు తినిపించడం అలవాటు చేస్తే.. అదే అలవాటుగా మారుతుంది. అలా చేయడం మాకు ఎక్కడ వీలవుతుంది? బౌల్ స్పూన్ ఇస్తే వాళ్ళే తినేస్తారు”అంది విసురుగా. 


సరళ చిన్నబోయింది. ప్లేట్ టేబుల్ పై పెట్టి బౌల్స్  తెచ్చి ప్లేట్ లో వున్న పదార్ధాలను అందులో వేసి  చెరో స్పూన్ ఇచ్చింది పిల్లలకు. మరొకరోజు ఉజ్వల వచ్చేసరికి పిల్లలు కిచెన్ సెట్ తో ఆడుకుంటూ మాట్లాడుకుంటున్నారు

“నానమ్మ పుడ్ చేస్తే యమ్మీ యమ్మీ.. గా వుంటాయి. నాకిష్టం అంది పాప. నాకు నానమ్మ చేసిన హాట్ డోనట్స్ ఇష్టం.. అన్నాడు బాబు. అవి డోనట్స్ కావు.. గారెలు అంటారట తాతయ్య చెప్పారు అంది  పాప. 


 “మీరు వడలు ఎప్పుడు తిన్నారు” ఉజ్వల ప్రశ్న.


“ఈ రోజు నానమ్మ చేసింది కదా, నీక్కూడా వుంచింది.తిను మమ్మీ” అంటూ హాట్ ప్యాక్ తీసుకొచ్చి ఇచ్చింది పాప. సింక్ దగ్గరకు వెళ్ళి చేయి కడుక్కొని డైనింగ్ టేబుల్ పై గిన్నెలు తీసి చూసింది. చింతకాయ పచ్చడి, ఇడ్లీలకి దోసెలకు పిండి పల్లీలు వేసి చేసిన కొబ్బరి చట్నీ.. రెడీ గా వున్నాయి. హమ్మయ్య, నాకు వంట గదిలో పనేమీ లేదు. రిలాక్స్ అవ్వొచ్చు అనుకుని ప్లేట్ లో  వడలు పెట్టుకొని చట్నీ వేసుకుంటుండగా బ్యాక్ యార్డ్ లో నుండి శ్రీకర్ వచ్చి “గారెలు చాలా బాగున్నాయి, నేనూ గట్టిగానే లాగించాను”అన్నాడు. వొళ్ళు మండిపోయింది ఉత్పల కి. 


“వాములు తినే సోములకు  పచ్చగడ్డి ప్రసాదం అంట. నేను చేసే పన్నీరు బిర్యానీ నీ ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటారు. నువ్వెప్పుడైనా మెచ్చుకున్నావా? ఎంతసేపు మా అమ్మ అంత బాగా చేస్తుంది ఇంత బాగా చేస్తుంది అని మెచ్చుకోవడమే తప్ప”


“ నువ్వు చేసే కేరెట్ హల్వా బాగుంటుంది పాలక్ పన్నీరు బాగుంటుంది అని ఎన్నిసార్లు కాంప్లిమెంట్ లు ఇవ్వలేదు. అంత ఉక్రోషం పనికిరాదు”అన్నాడు ఉడికిస్తున్నట్లు. 


గరాజ్ లో అత్తమామలు వాకింగ్ నుండి వచ్చిన శబ్దం వినబడి సైలెంట్ అయిపోయింది. 


“గారెలు వేడిగా వున్నాయో లేదో,చట్నీ వేసుకున్నావా అమ్మా” అడిగింది సరళ.


“వేడిగానే వున్నాయి అత్తయ్యా, చట్నీ కూడా వేసుకున్నాను. మమ్మీ లాగానే మీరూ గారెలు బాగా చేసారు, చాలా బాగున్నాయి అంటూ పోలిక తెచ్చి శ్రీకర్ వైపు చూసింది.

“అన్నట్టు మీ అబ్బాయి కి ఇష్టమని ఎక్కువగా గారెలు పకోడీ లు చేయకండి. శ్రీకర్ కి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా వుంది.మందులు కూడా వాడుతున్నారు. డీప్ ప్రై లు తగ్గించాను అందుకే” అంటూ మళ్ళీ శ్రీకర్ వైపు చూసింది ఎలా దెబ్బ కొట్టానో చూసావా.. అంటూ.


********


ఉజ్వల వంట తీరు చూస్తుంటే.. అమెరికా కొడుకు ఇంటికి వెళ్ళొచ్చిన తన స్నేహితురాలు వకుళ మాటలు గుర్తుకొస్తున్నాయి సరళకి. ఆమె రచయిత కూడానూ. మనుషులు మనస్తత్వాలను విడమర్చి  చెప్పింది


కొందరు వంట ఇష్టంగా చేస్తారు భర్తకు పిల్లలకు రుచికరంగా వడ్డించాలని. తామూ ఆహారాన్ని ఆస్వాదించాలని. మరికొందరు వంట ప్రేమతో చేస్తారు పిల్లలకు ఇష్టమైన పదార్ధాలని కొసరి కొసరి వడ్డించాలని. కొంతమంది బాధ్యతగా చేస్తారు.. అది వారి నిబద్ధత అని వేరే చెప్పనవసరం లేదు. చాలామంది మొక్కుబడిగా చేస్తారు.. రోజూ చేసే పనే పని అదేగా అన్నట్టు ఎక్కడ లేని విసుగుతో.  వంట చేసే అందరిలోనూ కనిపించే కోణాలు ఇవి. దీనికి ఎవరూ అతీతులు కారు. ఒక్కొక్కసారి వీరందరూ మనలో కూడా వుంటారు అంటూనే .. కోడలి గురించి మాములు అత్తగారిలా ఆరోపణలు చేసింది. 


 “నా కోడలు ఏదో మొక్కుబడిగా వంట చేస్తుంది. జాబ్ కూడా లేదు.  నన్ను వంటింట్లోకి రానివ్వదు. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ వంటిల్లుని నేను ఆక్రమించేసుకున్నాను అని చెబుతుంది.నేను పని చేయకుండా ఖాళీగా కూర్చోలేక కొంత, పిల్లలకు ఇష్టమైనవి చేసి పెట్టాలని ఆత్రం కొంత తప్ప నాకు మాత్రం ఓపిక వుందా? పదేళ్ళు అయింది బిడ్డకి వండి పెట్టక.  అక్కడ వున్నన్నాళ్లైనా వాడికి ఇష్టమైనవి వండి పెట్టుకోవాలని అనుకుంటాం తప్ప భార్య చేతి వంట తిననివ్వకుండా వుండాలని కాదుగా. వారిని విడదీయాలని కాదుగా”అంది బాధగా. 


“అసలు వంటింటికి ఆడదానికి అవినాభావ సంబంధం వుంది అనుకుంటా. నాకైతే ఈ వంటిల్లు పీడ వొదిలిపోతే బాగుండును అనుకొంటాను. రోజూ చేసి చేసి మార్పు లేని జీవితం చూసి చూసి రోత పుట్టింది, నా వంటింటి సామ్రాజ్ఞి కిరీటం ఎవరికైనా పెట్టేద్దామని వుంది” అంది తను.


 “ఏమిటో ఈ కోడళ్ళు!! వంటిల్లు తమ చేతిలో నుండి జారిపోతుందని ఆందోళన పడతారో ఏమిటో? వంటిల్లు జారిపోతే భర్త కూడా తమ చేతుల్లో నుండి జారిపోతారని సైకలాజికల్ ఫియర్  వుంటుంది అంట.  అదే కాబోలు నా కోడలికి” అంది వకుళ.  చెప్పడం ఆపలేదు.


“నా కోడలు పొద్దుటే లేచినప్పటినుండి సోపాల్లో జారగిలబడి రకరకాల యాప్స్ ల్లో  డీల్స్ చూసుకుంటూ కూర్చుంటే..  శ్రద్ధగా వంట చేయడానికి తీరిక ఎక్కడ? వేగిరంగా ఏది పూర్తవుతుందో అది చూసి వండి పడేయటమే! అలాంటి ఇల్లాళ్లు అందరూ.. ఒకటి తెలుసుకోవాలి. కుటుంబ ఆరోగ్యం డీల్స్ లో తక్కువ ధరకు దొరకదు అని. 


నాలుగేళ్ళు లేని పిల్లలకు నూడిల్స్ పాస్తాలు పిజ్జాలు శాండ్ విచ్ లు అలవాటు చేయడం పచ్చి బాదంపప్పులు నానబెట్టనివి పెట్టడం పూల్ మఖానా పచ్చివి పేకెట్ లో తీసి పెట్టేయడం.. ప్లాస్టిక్ లంచ్ బాక్స్ లో వేడి వేడి పదార్థాలు పెట్టి వెంటనే క్లోజ్ చేసి స్కూల్ బ్యాగ్ లో తోయడం. కోడలు చేసే ఈ పనులు చూస్తే నాకు భయం. ఈమెకు ఎంత నిర్లక్ష్యం! బాధ్యతా రాహిత్యం?. పిల్లల ఆరోగ్యం పట్ల భర్త ఆరోగ్యం పట్ల  తగినంత శ్రద్ద లేదు. ఇక తన ఆరోగ్యం పట్ల శ్రద్ద ఏముంటుంది? ఎప్పుడూ Hb 8% కన్నా తక్కువో కొంచెం ఎక్కువో.. అంతే! మళ్ళీ వీరివి సైన్సు సబ్జెక్టుల చదువులు. పచ్చి శెనగలు నానబెట్టి కుక్కర్ లో వుడికించి.. అవి వేడిగా వుండగానే తీసి ప్లాస్టిక్ బాక్స్ లో పోసి మూత పెట్టేసి ప్రిడ్జ్ లోకి తీయడం చూసాను నేను. వెంటనే అడిగాను.”ఏమిటమ్మా అలా వేడివేడివి ప్లాస్టిక్ డబ్బాల్లో పోసి .. ఆ వేడివే ప్రిడ్జ్ లోకి పెట్టకూడదు కదా” అని. 


“ఏమీ అవ్వదు అత్తయ్యా అని వొకసారి, వేడి గా లేవు అని అబద్దం తో వొకసారి నా మాట ను కొట్టి పడేసింది. ఆ తీరు చూస్తే భయం వేస్తుంది.  ప్రతి వంటా హై లో పెట్టి తక్కువ సమయంలో వండి అవతల పడేయడం లేదా మాడపెట్టడం. ఓపిక తక్కువ అసహనం ఎక్కువ. కొడుకు పిల్లల  ఆరోగ్యాలు ఏమైపోతాయో  అని వాపోయింది వకుళ.


ఆ మాటలన్నీ పదే పదే గుర్తుకు వస్తున్నాయి సరళ కు. ఉజ్వల వంట తీరు అదే లాగా వుంది అనుకుంది. 


పడక గది స్త్రీ పురుషుల దాంపత్య బంధానికి మూలం అయినట్లే వంట గది కుటుంబ సభ్యుల అనుబంధాలకు ఊతమైంది కదా! ఒకప్పుడు పురుషుల సంపాదన స్త్రీ చేతి వంటగా మారి ఇంట్లో అందరి కడుపు నింపుతుండేది. ఇప్పుడు ఇద్దరి సంపాదన ఆన్ లైన్ పుడ్ ఆర్డర్ లకి మాల్స్ లో కొనే వస్తువులకీ సరిపోవడంలేదు. చేతిసంచీలు దులిపేసుకోవడం క్రెడిట్ కార్డ్ లు గీకేయడం.ఉన్నరోజు పండగ లేని రోజు అలో లక్ష్మణా అంటూ ఇంటి వంట. ఆర్ధిక క్రమశిక్షణ లేదు ఆరోగ్యం పట్ల శ్రద్ద లేదు. ఇండియాలో చిన్నచిన్న పట్టణాల్లోనే ఇలా వుంటే అమెరికా లో ఎట్లా వుంటారో అనుకుంది కానీ కొడుకు కోడలు ప్రతిపనిలో కనబరిచే ప్లానింగ్ సంతృప్తినిచ్చింది సరళ కి. కోడలు ఉజ్వల కావాలనే తనని పక్కన పెడుతున్నట్లు అనిపించింది కూడా!


బ్యాక్ యార్డ్ లో మొక్కలను నాటుతూ .. “అబ్బాయ్ ! వంటింటి పని మొత్తం భార్య మాత్రమే చేయాలని అనుకోవద్దు. ఉజ్వల మాత్రం ఎంత పని చేస్తుంది? జాబ్  చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా ఎక్కడ చేస్తుందీ, నువ్వు కూడా కొంత చేయడం అలవాటు చేసుకో. అనునయంగా చెప్పింది. 


“నీ కోడలికి నాకిష్టమైన వంటకాలు  వొక్కటీ చేయడం సరిగ్గా రాదు. అసలు సరిగ్గా చేయాలని ప్రయత్నించదు కూడా. నేను ఫ్రెండ్స్ తో ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు తినేసి వస్తాను. అక్కడ మాత్రం రుచి ఎందుకు వుంటుంది చెత్త అనుకో అమ్మా! అన్నాడు నిసృహగా. 


“నేను వుండన్నీ రోజులు వంట నేర్పిస్తాను. నీకిష్టమైన పదార్ధాలు నువ్వే చేసుకుని తిను. మీ ఫ్రెండ్ వంశీ రుచికరంగా వంట చేసుకుని తిని  ఆస్వాదిస్తున్నాడు. ఫేస్ బుక్ లో పోస్ట్ ల్లో చూడటం లేదా నువ్వు.”


“చూస్తున్నాను లే అమ్మా, నేనూ వంట చేయాలి. రేపటినుండి వంట నేర్పించు,మనసు పెట్టి నేర్చుకుంటాను” అన్నాడు. 


“.ఉజ్వల ముందు పదే పదే నా వంటలు బాగున్నాయని అనకు. ఆమెకు అది నచ్చడం లేదు. ప్రతి బిడ్డకూ అమ్మ చేతి వంట అమృతం లాగానే తోస్తుంది అంట.  ముఫ్పై ఏళ్ళకు పైగా నాకు వంటిల్లే ప్రపంచం. అయినా మీ నాయనమ్మ నిత్యం నా వంటకు వొంకలు పెడుతుంది. విని మీ నాన్న నువ్వు తమ్ముడూ నవ్వుకోవడం లేదూ.. అని విడమర్చి చెప్పింది. శ్రీకర్ అర్ధమైంది అన్నట్టు నవ్వాడు. 


కోడలు పెద్ద చదువులు చదివి వేల డాలర్లు సంపాదిస్తున్నా వంటింటిని ఇంకొకరికి అప్పగించడం నామోషీ అనుకుటుందా లేక తన ఆధిపత్యం జారిపోతుందని అనుకుంటుందా అన్నది అర్ధం కాలేదు. రోజూ వచ్చేటప్పుడు పిజ్జా లు డోనట్స్ చికెన్ నగ్గెట్స్ శాండ్ విచ్ లు పట్టుకొని రావడం.పిల్లలకు తినిపించడం. శుభ్రంగా తను వంట చేసి పెడుతుంది కదా.. అనుకుని బాధపడింది.


మర్నాడు నుండి సరళ వంటింటి వైపు రావడం మానేసింది. ఉదయం కూడా భార్యాభర్తలు వాకింగ్ కి వెళ్ళసాగారు.  వాకింగ్ లో పరిచయమైన గుంటూరు ఆమె అడక్కుండానే అనేక విషయాలు చెప్పింది. మనసులో వున్నది బాధ కల్గించేది ఎవరికైనా చెప్పుకుంటే కాస్త ఉపశమనం కల్గుతుందని..ఆడవాళ్లు అలా బాధలు వెళ్ళబోసుకుంటారని అనుకుని సరళ  సానుభూతి తో వినేది.


“మగవాడు పెళ్ళవగానే అత్తమామలను కొడుకులా చూసుకుంటాడు.   తల్లిదండ్రులనేమో  పరాయివారిగా శత్రువుల్లా చూస్తుంటాడు. మనమేమైనా విషం పోసి పెంచామా వీడిని, ఇంత విషం కక్కుతున్నాడు అని తల్లిదండ్రులు విస్తుబోతారు. నిర్వేదంగా చూస్తూ వుండిపోతారు. సామెత వుండనే వుంది అంధుడికి అద్దం చూపినట్లు కొడుక్కి హితబోధ పనికిరాదు అని సతి బోధ మాత్రమే వినపడుతుంది అని. 


భర్త తల్లిదండ్రులు వారికి కేటాయించిన గది కి పరిమితమైపోవాలి. బధిరుల్లా చూస్తూ వుండిపోవాలి. భార్య వైపు బంధువులు మాత్రం వంటగది ని ఆక్రమించేస్తారు.ఇష్టమైన వంటకాలను చేసుకుంటారు. వారు దండిగా భుజిస్తారు.ఇతరులను మాత్రం  ప్రసాదంగా తీసుకోమంటారు. ఇంట్లో అన్నింటా వారిష్టాలే వర్ధిల్లాలి. పిల్లలకైతే వారే లవ్ బ్యాంక్ లు. నాయనమ్మ తాతయ్యలవి మాత్రం మొరటు ప్రేమలూ చేష్లలూనూ.  షాపింగ్  చేస్తే తమ వారికి నచ్చినవే అందరికీ నచ్చాలి. మగవాడికి నచ్చేవి కొనుక్కొంటే సతాయింపు. పుట్టింటి వైపు వారు  అవసరాల్లో ఏదైనా అప్పు గిప్పు సర్దితే.. ఇక అంతే సంగతులు. మన ఆర్ధిక పరిస్థితులపై  వారు పెత్తనం చెలాయించేస్తారు. ఇంట్లో మగవాడు కీలుబొమ్మ అయికూర్చుంటాడు. వాడికి అమ్మనాన్నలంటే అలుసు. అకారణంగా  వారిని విసుక్కొంటాడు.మీరిక రాబాకండి అని ముఖంపై ఛీత్కరిస్తాడు.  ఏ రోజైనా తల్లి అనారోగ్యం తో వంట చేయకుండా పడుకుంటే నువ్వు తిన్నావా చచ్చావా అని అడగలేడు కానీ ఇద్దరూ కలసి వంట చేసుకోవాలని మెసేజ్ పెడతాడు.  అత్త వంట చేయడం కోడలికి ఇష్టం లేకపోతే నువ్వు వంట గదిలోకి రాకు.. అని చెప్పేస్తాడు.


కోడలు నోరు విప్పకుండానే భర్తను ఆయుధం చేసి అత్తమామలపై ప్రయోగం చేస్తుంది. అయ్యో! మీరు మీరూ గొడవపడతారు నాకేం సంబంధం లేదు అది మీ ఇంటి విషయం అన్నట్టు చోద్యం చూస్తూ నవ్వుకుంటుంది. రంపపుకోత అనుభవిస్తూ కడుపు చించుకుంటే కాళ్ళపై పడుద్ది అని గుంభనంగా వుండి విమానం ఎక్కే రోజు కోసం ఎదురుచూస్తాను. తండ్రి తాతముత్తాల ఆస్తులు  కావాలి. నగానట్రా అన్నీ కావాలి. భర్త తల్లిదండ్రులు మాత్రం వద్దు. కొడుక్కి పెళ్ళి చేసి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవాలి. లేకపోతే ఈ తద్దినాలు ఎవరు భరిస్తారు అనుకుంటున్నారు కోడళ్ళు”  అని చెప్పింది ఆక్రోశంగా..


ప్రతి ఇంట్లోనూ వుండేవే కదండీ ఇవన్నీ. కోడళ్లు భర్తవైపు వారిని భరించలేరు. మా అత్త మంచిది అన్న కోడలు కానీ మా కోడలు బంగారం అన్న అత్తలు కానీ వుండరండీ. ఇది లోక సహజం.ఓదార్పుగా అంది సరళ.  మర్నాడు వాకింగ్ లో  గుంటూరు ఆమె కనబడలేదు. పక్కింటామె చెప్పింది.. ఆమె అదే సిటీ లో వున్న ఇంకో కొడుకింటికి వెళ్ళిందని.  


సరళ ఆలోచిస్తూ వుంది.. 

తను విన్న అనుభవాలన్నీ అత్తల కోణంలో నుండే చూసినవే! కోడళ్ళ తమ వెర్షన్ చెబితే ఎలా వుంటుందో మరి. పెద్ద  వయస్సు  అనుభవం బోల్డు వుంది కదా అని కోడళ్ళను చిన్నపిల్లగా జమకట్టి ఇగో ను ప్రదర్శించే అధికారాన్ని చెలాయించే  అత్తల గురించి కథలు కథలు చెబుతారేమో! అదీ చూద్దాం అనుకుంది.


బయట ఉద్యోగం చేస్తూ ఇంటా అనేక ఇతర పనులు చేసే స్త్రీలకు వంట చేయడం నుండి విముక్తి కోరుకోవాలనుకున్నా అది కుదరని పని. ఆకలి తీర్చుకోవడం ప్రధమ అవసరసం.  తమ కోసం తామైనా వంట చేసుకోక తప్పదు.  స్త్రీలు వంట  చేయకుండా తప్పించుకుంటున్నారో లేక తప్పదనుకుంటారో వారి వారి కుటుంబ పరిస్థితి పై పిల్లల ఆహార ఇష్టాలపై ఆధారపడి వుంటుంది తప్ప వేరొకరు చెప్పగల సలహాను కాదు తీర్పు కానేకాదు అనుకుంది.


మొబైల్ చేతిలోకి తీసుకొని వాట్సాప్ లో స్నేహితురాలు వకుళ కు మెసేజ్ టైప్ చేసింది. 


“ఈ ఆధునిక యుగంలో స్త్రీలు  గరిట పారేసి స్థిమితంగా కూర్చోనూ లేరు. పిల్లలను భర్తను ఆరోగ్యానికి హానికరమైన తిండి తినకండి అని చెప్పకుండా వుండనూ లేరు. వారికి కావాల్సిన నానారకాల వంటలు చేసి పెట్టనూ లేరు. మితిమీరిన స్వేచ్ఛ, అధిక సంపాదన ల ఫలితాలు ఇవి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని  పళ్లెంలో  ఆరగించడానికి బదులు డబ్బాలోని విటమిన్ మాత్రలను కొనుక్కొని తినే కాలం ఇది. వంటింటి సామ్రాజ్యాన్ని పుడ్ మార్కెట్ కూలగొడుతుంది. చాలా చోట్ల ఇంకా అత్తలు కోడళ్ళు వంటింటి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి

ప్రచ్ఛన్న యుద్దం చేస్తూనే వుంటారు.పాత సంప్రదాయానికి సంస్కృతి కి కాలంచెల్లి కొత్త సంస్కృతి ధాటికి పిల్లలు నలిగిపోకుండా వుండాలని ప్రయత్నం చేసే చేతులు మనవి. ఇలా ఎన్నాళ్ళో! బహుశా ఈ చేతుల్లో శక్తి సన్నగిల్లేవరకూ.. నేమో! 

ఇది నా అనుభవం.”

అని రాసి సెండ్ చేసింది. 


*******


ఏడున్నరకల్లా.. పిల్లలకు లంచ్ బాక్స్ లు సర్దేసి కూరలు కూడా చేసేసి రైస్  ఇన్స్టా పోట్ లో పెట్టేసి వెళ్ళిపోయేది ఉజ్వల. కాఫీ కలపడం టీ పెట్టడం, టేబుల్ పై పెట్టినవి పెట్టుకుని తినడం పాత్రలు కడిగి శుభ్రం చేయడం లాంటి పనులు తప్ప ఇంకేం పని లేకుండా పోయింది సరళ కు. పిల్లల బట్టలు వాషింగ్ మెషిన్ లో వేయడం బట్టలు మడత పెట్టడం ఇల్లు శుభ్రం చేయడం మొదలెట్టింది. అలా ఉన్నా కూడా తను చేసిన ప్రతి పనికి వొంకలు పెట్టడం, లేదా తన చేతిలో పని లాక్కుని మీరు మాకు గెస్ట్ లు అత్తయ్య గారూ మీరు పని చేయడం నాకిష్టం లేదు. హాయిగా రిలాక్స్ అవ్వండి “అనేది. కోడలి చతురత మాటకారితనం సరళ కు తెలియనిది కాదు. ఆమెకు తాము రావడం ఇష్టం లేదని ప్రతి చర్యలోనూ అర్థమవుతూనే వుంది. చాలీచాలకుండా అన్నం వొండటం ఒక కూర మాత్రమే చేయడం అదీ రుచి పచీ లేకుండా వుంటే తాము తెచ్చిన ఊరగాయలతో సర్దుకోవడం. శ్రీనివాస్ కొడుకుతో “కోడలు బియ్యం చాలా తక్కువ పెడుతుంది. మనిద్దరం తిన్నాక మీ అమ్మకు అన్నం వుండటం లేదు. బియ్యం కాస్త ఎక్కువ పెట్టమని కోడలికి చెప్పు” అని నిర్మొహమాటంగా చెప్పేసాడు.  


అదేమాట శ్రీకర్ భార్యకు చెప్పగానే పెద్ద యుద్దమే జరిగింది ఇంట్లో. 


“అన్నం చాలకపోతే కాసిని బియ్యం కడిగి పెట్టుకోవచ్చు కదా! కొడుకుతో చెప్పి నన్ను తిట్టించాలని కాకపోతే”అని సరళ పై విరుచుకుపడింది. 


“ఉజ్వలా! అమ్మని ఏం అనకు?  అసలు ఆ విషయం అమ్మ నాకు చెప్పలేదు. అమ్మకు అసలే మొహమాటం. నెలరోజులు పైనే నలిగిన విషయాన్ని అమ్మ అన్నం తినక చిక్కిపోవడం గమనించి ఆఖరికి నాన్నే ఈ విషయం నాకు చెప్పారు. దీనికే ఇంత రాద్దాంతం ఎందుకు? అదనంగా ఇంకో కప్పు బియ్యం వేసి వండు” అని సీరియస్ గా చెప్పాడు. 


మర్నాడు నుండి అన్నం ఎక్కువ వండటం అయితే చేసింది కానీ అత్తగారితో మాట్లాడం మానేసింది. మామ గారితో పొడి పొడి మాటలు. పిల్లలను వారి దగ్గరికి వెళ్ళనీయకుండా చేయడం చూసాడు శ్రీకర్. ఆ ఉక్కపోతను భరించలేకపోయాడు. మనుషులను మనసులను కలుపుదామని తన వంతు ప్రయత్నం చేస్తూ “ మే ఆఖరి వారంలో  పిల్లలకు సెలవులు ఇచ్చేస్తున్నారు. ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్దాం” అన్నాడు ఉజ్వల తో. “మీ ఇష్టం” అంది ఆమె. 


 “తమ్ముడు.. మాకు రిటర్న్ టికెట్ల్ బుక్ చేస్తానంటున్నాడు. కోడలు నెల తప్పింది అంట. బెడ్ రెస్ట్ చెప్పారంట. మీ నానమ్మ కూడా ఎండలకి సోలి పోతుందని అన్నాడు. మేము ఆమెను చూసుకోవాలి కదా!  పై వారంలో వెళ్దామని అనుకుంటున్నాం. పిల్లలకు సెలవులు ఇచ్చారుగా మాతో వాళ్ళను కూడా తీసుకెళ్తాం రా శ్రీకర్”  అన్నాడు. హఠాత్తుగా తండ్రి చెప్పిన విషయం విని మూగబోయాడు. తల్లి వైపు చూసాడు.


“అవును శ్రీ.. ఇక్కడ వుండి మేం చేసేది మాత్రం ఏముంది? మిమ్మల్ని అందర్ని చూసాం కదా! చిన్న కోడలు అవసరంలో వుంది. తల్లి లేని పిల్ల కదా! దగ్గరుండి చూసుకుంటే బావుంటుంది” అంది. 


“పిల్లలను కూడా పంపుదాం. హాలీడేస్ అక్కడ ఎంజాయ్ చేస్తారు” అంది ఉజ్వల. 


“వద్దు, వాళ్ళు ఇక్కడే వుంటారు” అన్నాడు ఖరాకండిగా. శ్రీకర్ కి తెలుసు.  పిల్లలు ఇండియాకి వెళ్ళేది తన తల్లిదండ్రులతోనే కానీ అక్కడికి వెళ్ళాక అత్తగారు పిల్లలను తమింటికి తీసుకెళ్ళి నెలకి వొకసారైనా  నాయనమ్మ తాతయ్య ను కలవనివ్వదని. పిల్లలపై ఉజ్వల తల్లి ప్రభావం పడకుండా వుండాలని కట్టడి చేయాలని అతని ప్రయత్నం. 


“పిల్లలను పంపొద్దని అంటున్నారు. మీ అమ్మ నాన్నకు వాళ్ళను చూసుకునే తీరిక ఎక్కడుంటుంది లెండి. వారికి చిన్నకొడుకు కోడలు అంటేనే ఇష్టం. అసలు నా పిల్లలను వాళ్ళు ప్రేమగా చూస్తారని  అనుకోను. దిగగానే వాళ్ళను మా అమ్మ తీసుకువెళుతుంది”అంది. భార్య వైపు అసహ్యంగా చూసి పక్కకు తిరిగి పడుకున్నాడు శ్రీకర్.అమ్మ నాన్న ను రెండు నెలలు కూడా తనింట్లో  ఉంచుకోలేని అసమర్ధతకు మౌనంగా కన్నీరు కార్చాడు. 


లగేజ్ చెకింగ్ అయి బోర్డింగ్ పాస్ లు తీసుకున్నాక.. సరళ శ్రీనివాస్ పిల్లలను భారమైన హృదయంతో దగ్గరికి తీసుకున్నారు.   


సరళ కోడలి దగ్గరికి వచ్చి..


“ఉజ్వలా! రేపటి నుండి నా వంటింటికి సామ్రాజ్ఞి ని నేను. నీ వంటింటి సామ్రాజ్ఞివి నీవు. నీ కోడలు వచ్చి ఆ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటుందేమో అని బెంగపడకమ్మా! నీ కొడుకు అమెరికా లో పుట్టి పెరుగుతున్నవాడు కదా! వంట చేయడం తప్పకుండా నేర్చుకుంటాడు.  భవిష్యత్ లో నువ్వు కూడా వాడింటికి ఎప్పుడైనా వెళ్ళి గెస్ట్ గా వుండి రావడమే! “ నవ్వుతూ చెప్పింది సరళ.


 ఉజ్వల అత్తగారి మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి బలవంతంగా రాని నవ్వు నవ్వింది. చెక్ ఇన్ అయ్యాక లోపలికి వెళుతూ వెనక్కి  వెనక్కి తిరిగిచూస్తూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి బాధగా ముఖం పెట్టాడు శ్రీకర్. తల్లిదండ్రులు కనబడే వరకూ చూస్తూ బై చెబుతూనే వున్నాడు. 


అందరూ లిఫ్ట్ దిగి  కారు పార్కింగ్ వైపు నడిచారు. శ్రీకర్ పిల్లలిద్దరిని చేతులు పట్టుకుని జాగ్రత్తగా నడిపించుకుని వెళుతుంటే.. ఉజ్వల చెవికి బ్లూ టూత్ తగిలించి “అమ్మా! నేనెలా డీల్ చేసానో చూసావా! దీన్నే పొమ్మనకుండా పొగపెట్టడం అంటారట కదా! అని పగలబడి నవ్వింది.


********సమాప్తం********


Disclaimer: ఈ కథను కథగానే చూడండి. బంధుమిత్రులు పరిచయస్తులు అందరూ ఈ కథ చదవగానే మాకు apt గా వుంది మా గురించే రాసింది ఈమె అని వివాదాలకు రావద్దు. కావాలంటే ఇందులో ఉదహరించిన విషయాల గురించి చర్చించండి. ఈ మధ్య ఏ కథ రాసినా కొంతమంది భుజాలు తడుముకుంటున్నారు. ఈ కథలో ఉదహరించిన విషయాలు కొన్ని నా మిత్రుల ఆనుభవాలు ఆలోచనలు కథకు తగిన విధంగా నా కల్పన మాత్రమే! కథ గురించి మాత్రమే చర్చించగలరు. ముందస్తు ధన్యవాదాలు.🙏 - వనజ తాతినేని. కామెంట్‌లు లేవు: