16, మార్చి 2023, గురువారం

ఊహల మడుగు

ఊహల మడుగు _వనజ తాతినేని


అందంగా కనబడాలనే శ్రద్ధలో  పావొంతు ప్రాజెక్ట్ పై పెడితే అనుకున్న విధంగా కంప్లీటైపోయేది.. మెత్తగా వ్యంగ్యంగా చురక అంటించాను నా ఇగోను సాటిస్ఫై చేసుకుంటూ. 


మాతృభాష తెలుగైన వాళ్ళిద్దరూ ఉలిక్కిపడ్డారు. టీమ్ మేనేజర్ నైన నావైపు గుచ్చిగుచ్చి చూసారు. మాస్క్ తో పాటు గాగుల్స్ పెట్టుకుని వుండటం మూలంగా ముఖం పోల్చుకోవటానికి కష్టంగా వుంది. టీమ్ అంతా ఇతర దేశీయులవడం వల్ల తమకు అంటించిన చురక వేరెవరికీ అర్థం కాదని వూపిరి పీల్చుకుని యింకా జీర్ణం కాని అవమానం దాచుకుని బయటకు నడిచారిద్దరూ. 


షిట్.. అంటూ భవిత కార్ డోర్ పై ప్రతాపం చూసిస్తే సబిత డ్రైవింగ్ సీట్లో కూర్చుని సీట్ బెల్ట్ వేసుకుంటూ... ఎవరే..  ఆ మహాతల్లి! ఎంతమాట అనేసింది?  పేరు చూస్తే ఓ.ఆర్. విన్సెంట్.  మాట్లాడిందేమో అచ్చుతెలుగు. సంవత్సరం కాలంలో ముఖం చూసిందే లేదు,  కోవిడ్ మహమ్మారి మూలంగా రిమోట్ వర్క్ తోనే కాలం గడిచిపోయింది మరి. 


‘’బయటకు వస్తుందిగా కాసేపు వెయిట్ చేయి  ఆ మొహం చూద్దాం యెవరో యేమిటో’’ అంది భవిత. 


 ఎదురుగా స్క్రీన్ పై కనబడుతున్న సి సి కెమెరా క్లిప్పింగ్స్ లో వారి హావభావాలను గమనిస్తూ వినబడని వారి మాటలను ఊహించుకుంటూ నవ్వుకున్నాను. ఇప్పుడు కాదు. కొన్నాళ్ళు వారివురుని  వీలైనంత వుడికించి  అప్పుడు నన్ను నేను వారికి చూపించుకోవాలి. వారు నన్ను చూసి ఆశ్చర్యపోవాలి. ఎన్నిసార్లు నన్నూ నా అవకరాలను  గేలిచేశారు గాయపరిచారు. ఈవేళ వారికన్నా ఉన్నత స్థానంలో వుంది. అందంలో  తెలివి తేటలలో స్టైల్ లో వారి కన్నా మిన్నగా వుంది. వారి కళ్ళల్లో ఆశ్చర్యాన్ని ఈర్ష్యను చూస్తే కానీ తన మనసు నెమ్మదిపడదు. 


పుట్టుకతోనే  వారికి బోలెడు డబ్బుంది.ఏమైనా డబ్బున్న వాళ్ళకు అహం ఎక్కువుంటుంది. బహుశా వారికి కావాల్సినవన్నీ అమరడం వల్లనేమో నాకేంటి అన్న తలబిరుసు వుంది. అసంతృప్తులు కూడా ఎక్కువే. ఇతరులను ఎద్దేవా చేయడమూ ఎక్కువే. వారు ఆత్మవిశ్వాసాన్ని కొనుక్కొంటారో తొడుక్కుంటారో కానీ  ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా కనబడతారు. మరి, నాలో దాగివున్న  ఉక్రోషం ఆత్మనూన్యత మాత్రం వారినెలాగైనా దెబ్బతీయాలని ఎదురు చూడదూ!. 


ఆశ్చర్యపోతున్న వారితో యిలా మాట్లాడాలని రిహార్సల్ వేసుకుంటున్నాను. మిమ్మలను కానీ మరికొందరిని కానీ ఇంప్రెస్ చేయాలని  నేను అతిగా ప్రవర్తించిందీ లేదు. ఐడెంటిఫికేషన్ కోసం ప్రాకులాడింది లేదు. మీలా ఎన్నడూ ఐడెంటీక్రైసిస్ తో అలమటించిపోలేదు. నా శారీరక లోపాన్ని అధిగమించాలని అందరూ నాపట్ల చూపుతున్న అసహ్యాన్ని జాలిని సానుభూతిని దాటి నన్ను నేను నిలబెట్టుకోవటానికి  ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రయత్నమే నా ఎదుగుదల. డబ్బుంటే ముక్కొంకర మూతొంకర కన్నొంకరలు కాలొంకర అన్నీ సరిచేసుకోవచ్చు కానీ ఆత్మనూన్యత భావాన్ని పోగొట్టేది మాత్రం మనపై మనకున్న నమ్మకం విశ్వాసం కఠోరశ్రమే. అదృష్టమేమి నా తలుపు తట్టలేదు. ఎన్నోసార్లు నిరాశ ఎదురైనా పట్టుదలతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి ఈ స్థానాన్ని చేరుకోగల్గానని వారికి చెప్పాలని తహతహలాడుతున్నాను.  


అంతే కాదు.. మీలాంటి అహంకారి మీ స్నేహితురాలి కూతురుకు తల్లినైనాను.ఆమె భర్తకు యిల్లాలినయ్యానని గర్వంగా చెప్పాలని ఉబలాటపడుతున్నాను. అప్పటికిగానీ నామనసు నా ఊహల ప్రపంచం రెండూ శాంతించవు మరి. అవమానించబడ్డ మనసుకు ఊహలైనా శాంతి కల్గించేవే కదా! అదొక వరం కూడా కదా!


*******


నాకు వారివి చిరపరిచితమైన ముఖాలు. నాకన్నా సంవత్సరం  ముందు పుట్టిన  నాకు అక్కైన రసజ్ఞ కు స్నేహితురాళ్ళిద్దరూ.  వారు ముగ్గురూ అందంలోనూ చదువులు ఆటలు కళలూ అన్నింటిలోనూ ఆరితేరిన వారూనూ. తనేమో పుట్టినప్పడే గ్రహణం మొర్రితో మెల్లకన్నుతో అవకరంగా పుట్టినదీనూ.  దానికి తోడు చిట్టి చిట్టి అడుగులేస్తున్న సంవత్సరంన్నర వయస్సులో హై ఫీవర్ లో   వచ్చిన పోలియో వల్ల కాలు చచ్చుబడిపోయి నడక కష్టమై మంచానికి అతుక్కుపోయినదీనూ.  అదృష్టం దురదృష్టం పక్కపక్కనే వున్నాయంటే యిదే కాబోలు. ఇద్దరి బిడ్డలలో వొకరలా వొకరిలా అని కళ్ళొత్తుకునే అమ్మ. ఏమి పట్టనట్టు నిర్వికారంగా చూసే నాన్న. నిర్విరామంగా మనసులో కుళ్ళుకుంటూ ఏడ్చుకుంటూ నేను. మొదటసారిగా నాకెదురైన అవమానం అక్క నుండే. తను వేసుకున్న అందమైన ఖరీదైన  లేస్  గౌన్ లాంటిదే తనకూ కావాలని పేచీ పెట్టింది. “నీకెందుకే అంత మంచి గౌన్, నువ్వు నాలాగా లేచి నడిస్తేనూ డాన్స్ చేయగలిగితేనూ అలాంటి గౌన్ కావాలి కానీ” అంది. వెక్కి వెక్కి ఏడ్చింది తను. అమ్మ అక్కను మందలించి ఆ గౌన్ గుచ్చుకుంటుంది, నీ గౌను చూడు మెత్తగా హాయిగా వుంటుందని బుజ్జగించే ప్రయత్నం చేసింది. 


అందరి చూపులలో కనబడే జాలి సానుభూతితో పాటు  ఏ ముసుగు లేకుండా అసహ్యం కూడా కనబడింది అక్క స్నేహితురాళ్ళిద్దరి మాటల్లోనే కదా! అమ్మో.. రసజ్ఞా మీ యింటికైతే వస్తాము కానీ నీ రూమ్ లోకి రాము. అక్కడ మీ చెల్లిని చూస్తే మాకు అసహ్యం అనడం వినబడింది తనకు. అసహ్యం అనేది ఒకటి ఉంటుందని పరిచయమైనదపుడే. 


నాన్నకీ అమ్మకు కూడా అక్క రసజ్ఞ అంటేనే ఎక్కువిష్టం. నేనంటేనే ఎవరికీ గిట్టదు. రాను రాను అమ్మంటే కూడా ద్వేషం ఏర్పడింది నాకు. సంగీతం చెప్పడానికి వచ్చే టీచరు దగ్గర తను కూడా సంగీతం నేర్చుకుంటానని అడిగింది. ఇపుడొద్దు తర్వాత నేర్చుకొందువు  అనేది అమ్మ. టీచరు చెబుతుంటే వింటూ నేర్చుకుంటూ రాగాలాపన చేయబోయేది. ఉహూ.. అక్క పాడినంత మధురంగా వుండేదికాదు నేనెప్పుడు నోరు మూస్తానోనని ఎదురుచూసేవారు ఇంట్లో వారందరూ. నా ప్రయత్నం చూసి అమ్మ జాలిపడేది  అక్క నవ్వుకునేది. అక్కనూ అమ్మనూ చంపేయాలనేంత ద్వేషం నాలో. నా పన్నెండేళ్ళ వయసప్పుడు ఆ ప్రయత్నం కూడా చేసాను. నాకిచ్చిన మందులన్నింటిని వొలిచి అక్క తాగే జ్యూస్ గ్లాస్ లో కలిపేసాను. ఎలాగైతేనేం అమ్మ కనిపెట్టింది. వెంటనే అక్క ను పై రూమ్ లోకి నన్ను తన రూమ్ లోకి మార్చేసింది. నన్ను  సైక్రియాటిస్ట్ దగ్గరకూ  తిప్పుతుంటే అక్క టాలెంట్ షో లకు ఛానల్స్ లో వచ్చే సింగింగ్ పోగ్రామ్స్ కు తిప్పుతూ వుండేవారు. 


అమ్మ చెప్పే చదువు నాన్న కొని తెచ్చి యిచ్చిన పుస్తకాలు చదవడం అపుడపుడు హాస్ఫిటల్ కు చెకప్ లకు వెళ్ళడం నాలుగైదు ప్లాస్టిక్ సర్జరీల మధ్య ఇరవై యేళ్ళు వచ్చేసాయి. “ఎందుకంత డబ్బు ఖర్చు పెట్టడం ఇంట్లోనేగా పడి వుండేది” అంది అక్క వొకసారి. “నువ్వు సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడంలేదు నోర్మూయ్” అని కసిరింది అమ్మ.గాయంపై గాయం. మళ్ళీ మళ్ళీ అయితే అవి మానేదెలా? దుఃఖం కూడా రావడం లేదు మనసు బరువు తీర్చుకోవడానికి. 


సర్జరీ తర్వాత అక్క కన్నా అందంగా వున్నానని మురిసిపోయేది అమ్మ. నాన్న సన్నగా నవ్వుకునేవాడు. నాకు తెలుసు అదంతా అబద్దమని. ముఖమైతే చూడటానికి  కాస్త బాగైంది కానీ నడకను ఏ నెమలి నుండి అడిగి ఎరువు తెచ్చుకోనూ. నా నడకలూ నాట్యాలూ అన్నీ ఊహలలోనే. శరీర గాయాలు మంచి కండ పట్టే ఆహారాలు తీసుకుంటే త్వరగా మానిపోతాయి మానసిక గాయాలెలా మానతాయి.


అయ్యో! నేననుకోలేదు అంత బాధ కల్గుతుందని అని  అక్క సన్నాయి నొక్కులు. ఇతరుల అవకరాలను హేళన చేసే రాక్షసత్వం  అదో పైశాచిక ఆనందం. వారికి ఎలాంటి శిక్షలూ వుండవా డాక్టర్ అని అడిగింది తను.


ఈ అమ్మాయికి శారీరక అవకరం కన్నా మానసిక బాధ యెక్కువుంది. మీరు తనపై  చాలా శ్రద్ద చూపాలి. ఆర్ట్ థెరపీ, మ్యూజిక్ థెరపీ బాగా పనిచేస్తాయి అని చెప్పారు సైక్రియాటిస్ట్. ఆ సలహా పుణ్యాన నా లోకంలో సంగీతం చదువూ  మరలా ప్రవేశించాయి. నాలుగేళ్ళు గడిచాయి.


ఇపుడు అవసరమైతే మూడు భాషల్లో అవలీలగా మాట్లాడగలను.  మేథ్స్  అర్దమవక అందరూ వెర్రిముఖాలు వేసుకుని చూస్తుంటే నేను చిటికెలో సాల్వ్ చేయగలను. అక్క కన్నా శ్రావ్యంగా పాడగలను. కొద్దికొద్దిగా నా ఆత్మవిశ్వాసం పెరుగుతున్నట్టుంది. అమ్మ కళ్ళల్లో  ఆనందపుతడి. నాన్న నా కోసం మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. నేను శరీరాన్ని మరిన్ని కోతలకు సంసిద్దం చేసుకుంటున్నాను. ఆ నడకలు నెమలి నడక హంస నడక కాకపోయినా మంద గమన, సామజవరగమన అనిపించుకోవడం కోసమైనా నడక యజ్ఞం చేయాలి.  ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరగడం అంటారే అలాగున అప్పుడప్పడూ ఇలా ఊహించుకుంటేనే వెర్రి ఆనందం. 


********


చేతిలో నలుగుతున్న ఫోటో. అమ్మ చిన్నగా దగ్గింది మెలుకువ కల్గిస్తూ. చేతిలో ఫోటో ఆల్బమ్  తను అమ్మకు ఇచ్చేసిందో  ఆమే నానుండి లాక్కుందో! ఫోటోలలో దృశ్యాలు కళ్లల్లో మెదులుతున్నాయి.  మనసు ఈర్ష్యతో మండుతుంది.  సవన్నా రివర్ స్ట్రీట్,  అమెరికాలో జార్జియా రాష్ట్రంలో పర్యాటక స్థలం. ముఖ్యంగా నవదంపతుల విహారయాత్రకు అనువైన ఆకర్షణీయమైన విడిది. విద్యుత్ ధగధగలతో మెరిసిపోతున్న భవనాలను ఆనుకుని ఇరుకు విశాలం కాని ఒక మాదిరి రహదారులతో అనేకమంది జంటల కలలనూ సరదాలను నిజం చేస్తూ వారి సంతోషాన్ని మరింత వెదజల్లుతుంది.  అర్దరాత్రి   పౌర్ణమి వెన్నెలకు తోడు దీపాల వెలుగులో  ఆ నదీ తీరం యేదో మార్మికలోకాన్ని మరిపిస్తుంది.   అక్క చేతిలో  చెయ్యేసి నడుస్తున్న అందమైన  ఇండో అమెరికన్ యువకుడు రోహిత్ విన్సెంట్.ఆ రాత్రి నదిలో నౌకా విహారం. మరి కొన్నాళ్ళు సవన్నా సముద్ర తీరంలో విడిది. అనేక యాంగిల్స్ లో దంపతుల విహారాన్ని సంతోషాన్ని  బంధించుకున్న  బోలెడు ఫోటోలు. అవి నిండిన ఆల్బమ్ లు. ఆమెకు ఆ అదృష్టం ఎలా పట్టిందంటే..


అక్క రసజ్ఞ పాటలు పాడి అలరించడానికి సాంస్కృతిక సంస్థల ఆహ్వానం అందుకుని అమెరికా దేశానికి వెళ్ళింది. అక్కడ అక్కను చూసి ఆమె పాటను విని  రోహిత్ విన్సెంట్  మనసు పడ్డాడు. అక్క పెట్టిన షరతులకు ఇష్టపడి పెద్దలతో వచ్చి పెళ్ళి చేసుకుని తీసుకువెళ్ళాడు. పాడితే జీవిత గతులైన మారాలి అంటే ఇదే కాబోలు. దానికి అదృష్టం అందలం యెక్కిస్తే  దీన్ని విధి వెక్కిరించిందని నాన్నతో చెబుతూ అమ్మ  పదేపదే కళ్ళుతుడుచుకుంది. చందమామ కథలో చదివినట్టు  రాకుమారుడు రెక్కల గుర్రం  ఎక్కి రానూ వచ్చాడు అక్కను తీసుకువెళ్ళాడు. అక్క కళ్ళల్లో మరింత గర్వం. చూసావా నన్ను అని వెక్కిరించినట్లు వుండేవి చూపులు. 


రోహిత్ విన్సెంట్ మొదటిసారి యింటికి వచ్చినపుడు చక్కగా పరిచయం చేసుకున్నాడు.భేషజాలు లేకుండా హాయిగా మాట్లాడాడు. తనపక్కన  నాన్న తరువాత అంత  దగ్గరగా కూర్చున్న వాళ్ళెవరూ లేరు.  స్నేహంగా అనిపించాడు.  ఉత్సాహంగా అనిపించింది. ఇంకొకసారి యింటికి వచ్చేటప్పటికి అతని చూపుల్లో ఏదో తేడా. అతని కళ్ళల్లో నా పట్ల జాలి సానుభూతి. భరించలేకపోయాను. మంచి రిహాబిటేషన్ సెంటర్ లో జాయిన్ చేయించండి అని నాన్నకు సూచిస్తున్నాడు. ఏమనుకుంటున్నాడతను? నేనొక శారీరక అవకరం  మనిషిని మాత్రమే కాదు మానసిక రోగిని కూడా అనా!?  అక్క  నాగురించి విపరీతం చేసి చెప్పి వుంటుందనిపించింది. ప్రపంచాన్ని కూడా   నాతో కలవనీయకుండా దూరం చేస్తుంది ఆ రాక్షసి. కోపంతో పళ్ళు నూరుకుంటూ పుస్తకాలు విసిరికొట్టాను. వాళ్ళు వెళుతున్నప్పుడు ముభావంగా వీడ్కోలు చెప్పానంతే. 


ఏడాది గడిచింది అమ్మ అమ్మమ్మ అయింది. వారి ఉదయసాయంత్రాలు మనుమరాలి ముచ్చట్లతో వెలిగిపోతున్నాయి. నా గదిలో మదిలో చీకటే యెంత పారద్రోలినా అంగుళం కూడా కదలడం లేదు. అందుకే నేనూ కళ్ళేలు లేని గుర్రాన్నెక్కి  ఆశల ఆకాశంలో విహరిస్తున్నాను. మనుషులు ఒకరి జీవితాన్ని మరొకరు ఎన్నటికీ జీవించలేరు అన్న సంగతి నాకు అర్దమైనట్టూ అందరికీ అర్దమైతే బాగుండును. ఇతరులతో పోల్చి ముఖ్యంగా అక్కతో పోల్చి నన్ను బాధ పెట్టడం న్యాయంగా లేదు మరి. 


 అక్క హానీమూన్ ట్రిప్ ఫోటోలలో నేను మర్చిపోలేని ఒక ఫోటో. బిఫోర్ ఐ డై వాల్.  సవన్నా రివర్స్ స్ట్రీట్ లో రహదారి పక్కనే వున్న పెద్ద బ్లాక్ బోర్డుపై వారి వారి విష్ లను వ్రాసుకుంటున్న టూరిస్ట్ లు.  అక్క కూడా ఏదో రాస్తుంది. వెనుకనుండి నవ్వుతూ చూస్తున్న ఆమె భర్త. కాసేపు అక్క స్థానంలో నేనే అక్కడ వున్నట్టు ఊహించుకుంటాను... నేనైతే అక్కడ ఏం రాస్తానో??  ఉహూ.. యెవరూ ఊహించలేరు. నా మనసులో వుందే.. అదే రాక్షసత్వం. ఊహలు శాంతినిస్తాయి. అక్క నిజమే. అక్క స్నేహితురాళ్ళు నిజమే. మరి నేను??. అందరికీ అన్నీ నిజాలు కావు. కొన్ని భ్రాంతులు. భ్రాంతులలోనుండి బయటపడాలి. వాస్తవాలను అంగీకరించాలి. అప్పుడే నీకు మందులవసరం వుండదంటాడు సైక్రియాటిస్ట్. అయినా ఊహలలో కూడా శాంతిగా బతకనివ్వరా నన్ను. ఊహలకు కూడా రేషన్ పెడతారా? అమ్మ నాన్న పెట్టిన పేరును సార్ధకం చేసుకునే భాగ్యం కూడా లేదన్నమాట.


 ******


ఢామ్మ్ అని ట్రాన్స్ఫార్మర్ పేలిన చప్పుడు. మధ్యాహ్నం ముసురులో విశ్రాంతి తీసుకుంటున్న కాకులన్నీ చెల్లాచెదురైపోయాయి.వర్షం సన్నగా కురుస్తున్న శబ్దం. ఎలక్ట్రిక్ బేట్ ఘాతాన్ని తప్పించుకున్న మశకమొకటి నా చుట్టూ తిరుగుతూ సంగీతాన్ని వినిపిస్తుంది.కాటేయడానికి ముందు ఆ మాత్రం వీనులవిందునందించాలని. అది కేరళలో విహారం చేస్తున్న జికా వైరస్ దోమైతే బాగుండును.ఆ వైరస్ మూలంగా మెదడు చచ్చుబడిపోయి యీ అనంతమైన ఆలోచనలకు శాశ్వతమైన ముగింపు వస్తుందని విరక్తి నిండిన ఆశ. లేదా ప్రపంచాన్నంతా కబళిస్తున్న కోవిడ్ కూడా నాపై జాలి చూపడం లేదు.  ఆలోచనల్లో వుండగానే కళుక్కుమన్న నొప్పి కడుపులో పొడిచింది. అపరాధభావం వేలసార్లకు మరొకసారి తోడై స్వరం బలహీనమై అమ్మా  అన్నానో లేదో  ఏంటమ్మా అంటూ చేతిలో పనొదిలేసి అరక్షణంలో నా ముందుంది అమ్మ. తలొంచుకొని రెండు వేళ్ళు చూపించాను.నాలో మెదిలిన భావాలను పసిగట్టి చుబుకం పైకైత్తి నుదుటున చిన్న ముద్దిచ్చింది. అదొక టానిక్ అని అమ్మకు బాగా తెలిసిందీ మధ్య. మంచంపై వున్న నన్ను రెండు చేతులతో వాటేసుకుని పైకి లేపి కొంచం కష్టంగా నడుస్తూ బెడ్ పాన్ అమర్చిన చెక్కకుర్చీలో కూర్చోబెట్టి.. పేంట్ బొందు విప్పి కిందకి లాగి టిష్యూ పేపర్ అందుకుంది. మనిషనే అక్కుపక్షి రెక్కలు తెగి లోలోపల నిలువెల్లా రక్తమోడుతుంటే కాస్త వెన్నుతట్టి ఓదార్పునిచ్చి చిన్న ఊతమిస్తుంటే ఎంత బాగుంటుంది.  అందరూ అమ్మలా ప్రేమను మాత్రమే పంచడం ఎంత బాగుంటుంది. అపుడు నా ఆలోచనలింత భయంకరంగా వుండవని అదో ఆశ. ఇతరుల చేతుల్లో వున్న బొమ్మను లాక్కోవాలనే ఉక్రోషపు ఆకాంక్ష  మాత్రం నాకెందుకూ!? 


వాట్సాప్ లో అక్క పిలుస్తుంది. అమ్మ ఫోన్ తీసుకుని "ఇంకాసేపు నీ కూతురుతో ముచ్చట్లు చెప్పుకో.  నేను నా కూతురును చూసుకోవాలి"  అని ఫోన్ పెట్టేసింది. ఎదురుగా బెడ్ పై చెల్లాచెదురుగా పడి వున్న అనేక పుస్తకాలనూ  గాలికి  రెపరెపలాడుతున్న పేజీలను చూస్తూ అనుకున్నాను. నాలాంటి శారీరక అవకరాలున్న  మనుషులకు లోపలా బయటా ఎన్ని గాథలుంటాయి ఎన్నెన్ని గాయాలవుతాయి. కొన్ని కలలుంటాయి ఊహలుంటాయి. మరికొన్ని భ్రాంతులుంటాయి. వాటన్నింటిని రికార్డ్ చేద్దామని.. అంతే! 


అన్నట్టు నా పేరు ఊహ. కొదవేమున్నది నాలో ఈ మాత్రం నవరసాల ఊహలకు విహారాలకూ,  ఊహల మడుగున మునిగి తేలుతున్న నేనూ మనిషి నేగా, గాయపడిన మనసు నేగా.


****************0******************


#ఈస్తటిక్ _సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.కామెంట్‌లు లేవు: