21, మార్చి 2023, మంగళవారం

నా అక్షరాల కోశాగారం

 ఈస్తటిక్ సెన్స్ బుక్ ప్రచురించాక..  మళ్ళీ యేమైనా రాయాలంటే.. నాకు ఒక విధమైన అయిష్టత ఏర్పడింది. 


బహుళ పత్రిక లో అనువాద కథ పరిచయం చేయాలంటే కూడా మనస్సు పెట్టలేకపోయాను. అది రైటర్స్ బ్లాక్ లాంటిది కూడా కాదు. అంతకన్నా యెక్కువ. 


ఒకరోజు రాత్రి కథ రాయాలనిపించింది.. రాయడం మొదలెట్టాను. రెండు రోజులలో కథ పూరైంది. ఆ కథను వొక పత్రిక  ప్రచురణకు వెళ్ళడానికి  కొద్ది గంటల ముందు మాత్రమే పంపగల్గాను.  ఆ కథ “రంగు వెలిసిన కల”


హమ్మయ్య! యిప్పట్లో కథ ను అంటుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నానో లేదో.. భండారు విజయ గారు “ఒంటరి మహిళ” సంకలనం కోసం కథను వెంటనే పంపండి అని వాట్సాఫ్ గ్రూఫ్ క్రియేట్ చేసి అందులో మెంబర్ గా చేర్చి.. సందేశం పంపారు. ఆమె గత మే నెల నుండి కథ పంపమని అడుగుతూనే వున్నారు. నేనే బద్దకించాను. ఒంటరి స్త్రీ గురించి ఇంకేం రాయగలను.. ఇప్పటికే చాలా కథలు రాసేను. స్త్రీ ఓరియంటెడ్ కథలు ఇక రాయకూడదు అని అనుకున్నాక మెడ మీద కత్తి పెట్టినట్లు ఇది వచ్చి పడిందేమిటి అని ఆలోచించాను. మాట యిచ్చినప్పుడు యెలా నిర్లక్ష్యంగా వూరుకుంటావు? ఇదసలు పద్దతేనా.. అని నా మీద నేను విసుక్కుని.. కథ రాయడానికి వుపక్రమించాను. మూడు రోజుల్లో కథ పూరైంది. వెంటనే భండారు విజయ గారికి కథ పంపేసాను.


నిజానికి కథ రాయాలనే తపన లేకపోయినా కథ రాయాల్సివస్తుంది. కానీ ఆ కథ లోని పాత్రలు ఇతివృత్తం అప్పటికప్పుడు రూపుదిద్దుకున్నవి కాదు. మెదడులో బ్లూ ప్రింట్ రూపంలో దాగి వుంటుంది. రాయడం మొదలెట్టాక..  పొగ పెడితే కలుగులో దాగిన ఎలుకల్లా పాత్రలు కథ బయటకు వస్తాయంతే! 


పాతికేళ్ళ కిందట తిరిగొచ్చిన కథలు రెండు మూడు అలాగే వున్నాయి. ఒక నవల అలాగే వుంది. అవి పూర్తి చేయడానికి సమయం రావడం లేదు అంతే! 


ఈ లోపు లో  నేను బాగా రాసానని మెచ్చుకునే వారు కొందరైతే.. ఏం బాగో లేదు అని  రహస్యంగా చెప్పే వొకరు అయినా వుంటారు. అందరూ పాఠకులలోనే వుంటారు. నేను ఏ వొక్కరి కోసమో రాయలేదు. నాకు రాయాలనిపించింది రాసుకుంటాను. ఇదిగో యిది నా గురించే రాసావు అని గొడవ పెట్టుకునే వారు వున్నారు. నా గురించి రాయకూడదు.. చాలా హిట్ అవుతుంది అని ఏళ్ళ తరబడి అడిగే ఫ్రెండ్ వుంది. మీరు రాయాలే కాని నా కథ కు మించిన కథ మీ కథల్లో వుండదు అంటుంది పొరుగింటావిడ. 


అసలు కథ రాయాలంటే నాకు మనస్కరించాలి కదా.. 


నేను తపన పడి రాయలేనివి కొన్ని 

రాయాలని రాయలేనివి కొన్ని 

అలవోకగా రాసేసినవి కొన్ని.. 

అసలు రాయకూడదు అనుకొని కూడా రాసేనవి కూడా కొన్ని.. 


మొత్తం.. 117 కథలు 3 మైక్రో కథలు మొత్తం 120 కథలు నా బ్లాగ్ లో పబ్లిష్ చేసేసాను. ఇక కొరవ యేమీ లేవు. 


ఒక్క కథ భండారు విజయ P Jyothi గారి సంపాదకత్వంలో వెలువడబోయే కథ మాత్రం వుంది. ఆ కథ పేరు "దీప వృక్షం " . 


ఇక.. 

మూడు అసంపూర్తి కథలు ఒక నవల  యెప్పుడు పూర్తవుతాయో చెప్పలేను. 😊


27 సంవత్సరాల రచనా ప్రస్థానం ఇది.


నా పుస్తకాలు కొంటారా కొనరా.. ఉచితంగా పంపిణీ చేయాలా.. అవన్నీ అప్రస్తుతం. 


కొందరికి చీరలు కొనుక్కోవటం బంగారం కొనుక్కోవడం వస్తువులు కొనుక్కొని ఇంటిని అలంకరించుకోవడం యెలాగో .. నాకూ.. నా భావాలను నా ఆలోచనలను రచనలుగా వ్యక్తీకరించుకోవడం యిష్టం.  నా సంతృప్తి కోసం అదే పని చేసాను. ఆ రాతలను భద్రపరిచాను. 


కథలు కవిత్వం వ్యాసాలు సరదా కబుర్లు.. స్పందనలు

చెప్పుకోదగిన  వ్యక్తిగతమైన విషయాలు..  బాల్యం  కుటుంబం.. కలగాపులగంగా.. 


ఈస్తటిక్ సెన్స్ కథా సంపుటిలో 14 కథలున్నాయి . రెండు కథలు గీటురాయి,కోకిలతల్లి 2019 లో రాసిన కథలు.2020 లో మొదలుపెట్టి  2022 జూలై వరకూ 12 కథలు రాసాను. కరోనకాలంలో ఎక్కువ రాయలేదు.అనారోగ్య కారణాల వల్ల రాయలేకపోయాను. ఈ కథలన్నింటిని ఈస్తటిక్ సెన్స్ కథాసంపుటిగా తేవడం జరిగింది. ఆ కథలన్నింటినీ ఇప్పుడు ఇక్కడ అంటే బ్లాగ్ లో మార్చి నెలలో గత పదకొండు రోజులుగా పదకొండు కథలను ప్రచురించాను. 

 

నా రాతలన్నీ.. ఇక్కడే ఉన్నాయి .. ఎప్పుడైనా ఎవరైనా చదవడానికి వీలుగా ప్రచురించాను. మీరందరూ చదువుతారని ఆశిస్తూ .. .. 

కామెంట్‌లు లేవు: