22, జనవరి 2017, ఆదివారం

దాహం

మిత్రులారా ! 22/01/2017 ఈ రోజు ఆదివారం ఆంధ్రజ్యోతిలో నేను వ్రాసిన కథ " దాహం" చదవండి...చదివి మీ అభిప్రాయం చెప్పండి.. ప్లీజ్! -వనజ తాతినేని.

చదవడానికి వీలుగా ..లింక్ కూడా ఇదిగోండి.

http://epaper.andhrajyothy.com/1078931/Sunday/22.01.2017…


మందుల వాసన కొడుతున్న రూమ్ లో నుండి బయటకి అడుగు పెట్టగానే  ఏరు ముందా ఏకాశి ముందా అన్నట్టు ఎత్తిపోస్తున్న గాలి కూడా  ఆహ్లాదంగా అనిపించింది. అద్దాల కిటికీలో నుండి బయటకి చూపు సారిస్తే పచ్చటి తురకేపాకు చెట్ల మధ్యనుండి  మబ్బులు పింజెలు పింజెలు లాగా తేలిపోతున్నాయి.పది గదుల పొడవున్న పరిశుభ్రమైన కారిడార్ అది. లోపలి గదుల్లో ఉన్న మనుషుల ఆలోచనల్లో కడలిని మించి  అలజడి.ఎవరో రహస్య శత్రువు మనసుకి గుబులు మేఘం తొడిగినట్లు ఉన్నారు.ఉష్.. నిశ్శబ్దం అనే హెచ్చరికల మధ్య  ఏవో పొడి పొడి మాటలు తప్ప  దుఖంతో పూడిపోయిన గొంతులు  పెగలడంలేదు.


నర్స్ స్టేషన్ దగ్గరకి వచ్చి నిలబడ్డాను.  పేషంట్స్ పైల్స్ చెక్ చేస్తున్న పి ఆర్ ఓ లక్ష్మి  తనని నేను పలకరించకుండానే "వచ్చేస్తున్నారు, డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. పది నిమిషాలు వెయిట్  చేయండి చాలు " అంది. అదేమాట అప్పటికనేకసార్లు  రెండు గంటల నుండి ఎంతో మంది  చెప్పి ఉంటారు. "నిన్ననగా  అడ్మిట్ చేసాము. ఇంతవరకు డాక్టర్ రాకపోతే ఎలా ! మీరేమో కీమో థెరఫీ స్టార్ట్ చేద్దామంటారు. శ్వాస సరిగా అందక ఆయన ఇబ్బంది పడుతున్నారు. ముందు దానికి ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పారు కదండీ"  అన్నాను. "ఆ సంగతి చెప్పడానికే డాక్టర్ గారు వస్తున్నారు కొంచెం ఓపిక పట్టండి, ప్లీజ్ !  


వీళ్ళ జో కొట్టే మాటలు వింటూ ఉండటం కన్నా నేరుగా వెళ్ళి డాక్టర్ తో మాట్లాడటమే నయమనుకుని రెండు అంతస్తుల క్రింద ఉన్న డాక్టర్ ని కలవడానికి క్రిందికి దిగుతున్నా.  ఎదురుగా  ఒకామె ఆదర బాదరగా మెట్లెక్కుతూ రెండు వందల పదకొండో నంబర్ రూమ్ ఎటు వైపమ్మా అని అడిగింది. 'ఇదిగో ఇలా పైకి వెళ్ళి కుడి ప్రక్కకి తిరిగి చివరికి వెళ్ళి కుడి వైపుకి తిరగండి చిట్టచివరి రూమే అది" అని చెప్పి మెట్లు దిగుతూ ఉండగా  వెనుకనుంచి " అమ్మాయి, మీది పాలెం కదా, ఫలానా వాళ్ళ అమ్మాయివేనా నువ్వు"  అంది. వెనక్కి తిరిగి "అవునండీ, మీరెవరూ ? గుర్తురావడంలేదు" అన్నాను. " మల్లికార్జున వాళ్ళ అక్కనమ్మా. నాపేరు కరుణ. మీ అమ్మకి నేను బాగా తెలుసులే. నువ్వు కూడా ఎప్పుడో చూసుంటావ్  కాబట్టి గుర్తు పట్టలేదనుకుంటా. ఇక్కడున్నావేమిటీ,ఎవరినైనా చూడటానికి వచ్చావా?" ఆరాగా అడిగింది.  "డాక్టర్ దగ్గరికి వెళ్లొస్తాను. మీరు పైకి పదండి,తర్వాతొచ్చి కలుస్తా!" అని మలుపు తిరిగి ఈమె ఇక్కడికెందుకొచ్చిందో అనుకుంటూ రౌండ్స్ లో ఎదురైన డాక్టర్ ని  చూసి వెనక్కి తిరిగాను .


 రూమ్ కొచ్చేసరికి ఎదురుగా ఉన్న రెండువందల పదకొండో రూమ్లో గట్టిగా ఏడుపులు వినిపిస్తున్నాయి. మెట్లమీద ఎదురైనామె  అడిగిన రూమ్ నంబర్ ఇదే కదా అనుకుంటూ ఆగి చూసాను. బెడ్ పై ఉన్న వ్యక్తి మల్లికార్జున్.తన ఊరు పాలెం మనిషి. కనబడినప్పుడల్లా అమ్మాయ్ బాగున్నావా ? పిల్లలెంతమంది ? బాగా చదువుకుంటున్నారా అని నోరారా పలకరిస్తాడు.మెట్లమీద ఎదురైనామె మల్లికార్జున ప్రక్కన  కూర్చుని చేయి పట్టుకుని గట్టి గట్టిగా ఏడుస్తూ "గ్రద్దొచ్చి కోడిపిల్లలని తన్నుకెళ్ళినట్లు ఇప్పటికే అమ్మని, నాన్నని, చిన్నోడిని మృత్యు దేవత ఇట్టాగే తన్నుకెళ్లింది, ఈ  క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు నీ పాలిట పడిందేమిటిరా తమ్ముడూ!  ఈ హాస్పిటల్ లో ఉన్నావన్న సంగతి రాత్రి  తెలిసిందగ్గర్నుండి కడుపులో నుండి దుఃఖం దేవుకొస్తుంది అంది.

చూస్తున్న నాకే కాదు అక్కడున్న అందరికి హృదయం ద్రవించింది. కళ్ళ నీళ్ళు కారిపోతుండగా ముఖం తిప్పుకున్నాను. నన్ను చూసిన మల్లికార్జున "నువ్వేంటమ్మా ఇక్కడ ?" అన్నాడు. "మావారికి బాగోలేదు. ఎదురుగా ఉన్న రూమ్ లోనే ఉన్నారు" అన్జెప్పి  లోపలికి వచ్చేసాను.ఎంత ఖర్చయినా నిన్ను కాపాడుకుంటాం మల్లికార్జునా. నువ్వు దిగులు పెట్టుకోబాకు.  మీ బావ ఎన్ని లక్షలైనా వెనుకాడొద్దు. మంచి మందులు వాడమను అని చెప్పాడు అంటున్న కరుణక్క మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.ముంచుకొస్తున్న మరణ భయంలో ఏదో చావని ఆశ ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. 


మావారిని  ఎక్సరే తీయించుకురావడానికి వెళుతుండగా చూసి  అంతా గ్రహించి అయ్యో పాపం అన్నట్టు చూసింది కరుణక్క.  


లంగ్స్ కి హోల్ వేయాలి మీరు కాసేపు బయటకెళ్ళి వెయిట్ చేయండి అంటూ  డాక్టర్స్  బయటకి పంపిస్తే గ్లాస్ విండో పక్కన నిలబడి మలికార్జున ఉన్న రూమ్ వైపు చూసాను.


మల్లికార్జున బెడ్ పక్కనే నిలబడి ఇదిగో.. నీకిష్టమని ఎండురొయ్యలేసి రాములక్కాయ కూర, బీరకాయ పచ్చడి తెచ్చా,  లేచి రెండు ముద్దలు తిను అంటూ తమ్ముడిని కూర్చోపెట్టి ముద్దలు  తినిపించసాగింది.మంచి నీళ్ళు  పట్టుకుంటున్న మల్లికార్జున భార్యతో ఆ అక్కా తమ్ముడి ప్రేమ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.ఇలాంటి ప్రేమలు చూసి చాలా కాలమైంది అన్నాను.


కరుణక్కని  మెచ్చుకోవడం సుతరాం ఇష్టం లేదన్నట్లుగా ముఖంపెట్టి "ఏదో తమ్ముడికి బాగోపోయేసరికి మా ఆడపడుచు అట్టా ఉంది కానీ మొన్నటిదాకా మా మీద కేసులేసి కోర్టుల చుట్టూ తిప్పింది. నిలవ నీళ్ళు  తాగనియ్యలేదు. ఒక్కడే కొడుకు. పెళ్ళైన పన్నెండేళ్ళకి పుట్టాడు. సరిగ్గా చదువే అబ్బలేదు. వాళ్ళ నాన్నతో పాటు మెకానిక్ షెడ్ లో పనిచేసుకుంటాడు  మాకు ముగ్గురూ కూతుళ్ళే. మొదటి కానుపులో పెద్దమ్మాయి.రెండో కానుపులో కవల పిల్లలు. అయినా ముగ్గురిని బాగా చదివించుకుంటున్నాం. పెద్ద అమ్మాయి వైజాగ్ లో డాక్టర్ కోర్స్ చదువుతుంది.రెండో అమ్మాయి ఇక్కడే యూనివర్సిటీలో చదువుతుంది. మూడో అమ్మాయి నెల కిందటే చదువుకోడానికి అమెరికా వెళ్ళింది.  ఆమె మాటల్లో బిడ్డలకబ్బిన విద్య  పట్ల గౌరవభావం కన్నా అతిశయమే ఎక్కువ కనబడింది నాకు.కష్టాలు వచ్చేదాకా మన వాళ్ళు ఎవరో  పరాయి వాళ్ళు ఎవరో తెలియదంట, ఇప్పుడంతా  నేను నా కుటుంబం బాగుంటే చాలు అన్నట్టు ఉంటున్నారు. అందుకే మీ వాళ్ళ ప్రేమాభిమానాలు చూస్తే ముచ్చటేసింది' అన్నాను.


మూతి తిప్పుకుంటూ రాజేశ్వరి లోపలి వెళ్ళగానే కరుణక్క  బయటకొచ్చి "లోపలికి రామ్మా ! ఎంతసేపని బయట నిలబడతావ్" అంది. " పొలాల్లో ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నారా ? యధాలాపంగానే అడిగా. గట్టు తెగిన ప్రవాహంలా ఆవేదన  పోటీ పడి వెలువడింది ఆడవాళ్ళ గొంతులనుండి.


నిద్దరలేస్తే ఆడికి పొలంలోకి పోకపోతే తోచదు.ఎప్పుడూ దొండపందిళ్ళు వేద్దామా, కాకరకాయలు తెంపుదామా, జామ తోట మధ్య కలుపు మొక్కలు దున్నేద్దామా అన్నట్టు ఉండేవాడు. ఏడాది నుండి పొలానికి వెళ్ళక కాలు చేయి పడిపోయినట్లే ఉంది. తాత ముత్తాతల నుండి వచ్చిన భూమి గందా, ఇట్టా రుణం తీరిపోయిందేమిటీ అనే దిగులు. చెంగుతో కళ్ళు తుడుచుకుంది కరుణక్క.


'పొద్దున్నేలేచి యేరు దాటెల్లి అటు అడ్డరోడ్డుకో, వన్ టౌన్ కో  గంపెడు జామకాయలేసుకెళ్ళి సాయంత్రానికి ఐదారొందలు సంపాదించుకొచ్చేవాడు. అయ్యన్నీ పోయే. ఈ మాయదారి రాజధాని ఎప్పుడయ్యేను,ఏం జేసెను. పాడిపొయ్యే పంటలూ పోయే, ఎప్పుడో ఇరవయ్యి అంతస్తుల మిద్దెలు కడతారని, ఐదు నక్షత్రాల హోటళ్లు కడతారని కలలు కనడమే సరిపోయే. అయ్యన్నీ మనకెందుకు వాటిల్లో పుట్టామా పెరిగామా?  కాసిని పచ్చడి మెతుకులు తిని భూమి తల్లి ఒళ్ళో తుండు గుడ్డేసుకుని ఒడ్డిగిల్లితే చాలు కలతలు లేని నిద్ర కళ్ళ మీద నాట్యం చేసి పోయేది. ఇప్పుడు చూడు ఎన్ని దిగుళ్ళో.  పెట్టుబడులకి, రోగాలని,పిల్లల చదువులకని చానా అప్పులు చేసాము. ఆ అప్పులన్నీ తీరవాలన్నా రైతులకిచ్చే ప్లాటులు విడగొట్టాలి. ఎప్పుడుకి జరిగేనో ఏమో అని ఒకటే దిగులు. పెద్దదో చిన్నదో బాధలు లేని జీవితం ఉంటదా? అప్పులయ్యే తీరతయ్యి. పిల్లలు ఎక్కి వస్తే ఎంతలోకి ? అని నేను దైర్యం చెపుతానే ఉన్నా, అయినా పొద్దస్తం ఆలోచన చేసి చేసి రోగం కొని తెచ్చుకున్నాడు  ఒక్క పిల్లకన్నా పెళ్ళి చెయ్యకపోయే,కాలం కర్మం కలిసి రాకపోతే సంసారం రోడ్డున పడుతుంది అంటారే అట్టా అయింది మా పరిస్థితి " రాజేశ్వరి ఏడుస్తుంటే  అక్కడ ఉండలేక బయటకొచ్చేసా.


ఒకే ఊరి వాళ్ళం అవడం వల్ల ఏ బేషజాలు లేకుండా మాట్లాడుకోవడం,రోజూ  నా ఫోన్ లోనుండి ఆన్ లైన్ కాల్ చేసి అమెరికా లో ఉన్న మూడో పిల్లతో మాట్లాడించడం, ఇంటి నుండి వచ్చే క్యారేజీలు పంచుకోవడం వల్ల మామధ్య   అదివరకు లేని  సాన్నిహిత్యం పెరిగింది. ముఖ్యంగా కరుణక్క నాకు బాగా నచ్చింది.గొంతు కాస్త పెద్దగా ఉండి ధాటిగా మాట్లాడుతుందన్నమాటే కానీ మనసు వెన్న. ఎద నిండా ప్రేమ నిండిన మనిషి  మహా ఐశ్వర్యవంతుడు లెక్క అన్నట్టుగా  ఉంటుంది.


ఆడపిల్లలకి అత్తింట్లో ఎన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్నా పుట్టింట్లో పరిస్థితి బాగోలేదంటే ముద్ద కిందకి దిగదమ్మా . మా ఆయన  చాలా మంచాడమ్మా. మనకి షెడ్ లో బాగానే మిగుల్తున్నయి కదా వాడికే కష్టం, ముగ్గురు ఆడపిల్లని చదివిస్తున్నాడయ్యే, కట్నం ఇచ్చిన ఎకరం పొలం వాడినే పండించుకోమనంటే పుట్టింటి మీద బ్రెమతతో నేనూ సరేనన్నాను . పొలం వాడికి ఇడిసి పెట్టేసి పదేళ్ళయింది.  కౌలుకిస్తే ఏటా అరవై వేలు వచ్చేయి. పండిచ్చుకోమన్నామే కానీ సొంతంగా ఇచ్చేస్తామని అనలేదు. రాజధాని కింద పొలం పొయ్యాక మా మరదలికి కళ్ళు నెత్తికెక్కాయి. కాగితమ్మీద రాసివ్వలేదన్నంత మాత్రాన నాకు కాకుండా పోయిద్దా !  ఇవ్వాల్సిన ఎకరం మాట అడక్కుండానే కవల పిల్లలో ఒకదాన్ని నా కొడుక్కివ్వమని అడిగాను. చదువు సంధ్యలు లేకుండా బండ పని చేసేవాడికి నేనివ్వను అని తెగేసి చెప్పింది . పిల్లనీయనప్పుడు నా పొలం నాకిచ్చేయండి అని అడిగితే  మీ అమ్మ అయ్యా నీకు రాసి ఇచ్చారా,పెట్టుపోతలు చాలా పెట్టాం  పొలం, గిలం ఏం లేదు పో.. అని మొహమ్మీద తలుపేసింది. అంతవమానం,అన్యాయం తట్టుకోలేకపోయా. మా ఆయన గొడవలెందుకు పోనీయవే అన్నా ఊరుకోలేదు.  కోర్ట్ లో కేసు వేసా. అంతదాకా ఎందుకులేక్కా,నీ పొలం నీకు  ఇచ్చేస్తానని  విడగొట్టి ఇచ్చాడు. అందుకే ఈ మధ్య రాకపోకలు లేవు మళ్ళీ ఇట్టా కలిసాం. అమ్మని, నాన్నని అరచేతుల్లో పెట్టుకుని చూసి కడ తేర్చాడు, తమ్ముడి కుటుంబానికి సాయంగా నిలబడతాడు. ఇప్పుడు వాడి బిడ్డలకి అండ లేకుండా చేసి పోవడానికి మిత్తువ ముంచుకొస్తుంది.ఎవరి ప్రాణం ఎవరికీ అడ్డు వేయగలం? బాధగా అంది. 


మల్లికార్జున పెద్ద కూతురు హిమజ పది రోజులు సెలవు పెట్టుకుని వచ్చింది. స్వయంగా డాక్టర్స్ తో మాట్లాడుతూ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏవి వచ్చాయో వెబ్ లో వెతుక్కుంటూ ఉండేది. మా వారి కేసు ఫైల్ చూసి భ్రుకుటి ముడిచి చాలా ఆలస్యం అయిపోయిందాంటీ, మన దేశంలో అధునాతన చికిత్స చేసే  బెస్ట్  హాస్పిటల్ ఇది.  మీరు, మేము కూడా మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం ! రిజల్ట్స్ ఎలా ఉంటాయో మరి, ముఖంలో ఏ భావం తొణకకుండా జాగ్రత్తపడింది. 

  

 మీ ఆయనకీ వ్యాది బాగా ముదిరి పోయిందటగా, నా  మేనకోడలు  చెప్పింది అనడిగింది కరుణక్క. అవునక్కా ! ఏదో ఆశ ఉంటుందిగా. తర్వాతెన్ని డబ్బులున్నా మనుషులు తిరిగి రారు కదా ! అందుకే డాక్టర్స్ ఏది చెపితే అది చేస్తున్నాం అన్నాను. అబ్బాయి అమెరికాలో ఉన్నాడంటున్నావుగా, డబ్బులకేమీ ఇబ్బంది ఉండదనుకుంటాలే అంది రాజేశ్వరి. బలవంతంగా ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాను.


"స్టేజ్ ఫోర్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా  సర్వైవ్ రేట్ అంతేమి ఉండదు  ఆంటీ ! మహా అయితే కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం" అంది.మరెందుకమ్మా! తెలిసి తెలిసి కూడా విపరీతంగా డబ్బు ఖర్చుపెడుతున్నాం? అనడిగా.


అది అయినవాళ్ళ బలహీనత.దాన్నే హాస్పిటల్స్ వాళ్ళు క్యాష్ చేసుకుంటారు.వైద్యం వల్ల ప్రయోజనం ఉండదని తెలిసి లక్షలకి లక్షలు కుమ్మరించడం కూడా ఒక విధమైన మొహమాటమే. ఆ అప్పులన్నీ తీర్చడానికి బతికున్న మనుషులు నానా చావు చస్తారు. అక్కడ ట్రీట్మెంట్ బావుంటుంది, ఇక్కడ  ట్రీట్మెంట్ బావుంటుందని సలహాలిచ్చేవారు ఎక్కువైపోతారు. అవన్నీ పట్టించుకోకండి ఆంటీ ! నాన్న కైనా, అంకుల్ ది అయినా ఒకటే స్థితి.   మనిషి కన్నా డబ్బు ఎక్కువ కాదు కానీ ఆ డబ్బు సంపాదించడం కూడా అంత సులువేమీ కాదుగా మనలాంటి  మధ్యతరగతి వాళ్ళకి "అంది హిమజ.


నిజమే తండ్రి ట్రీట్మెంట్ కోసం లక్షలకి లక్షలు పంపడానికి నా కొడుకు పడుతున్న పాట్లు తెలుస్తున్నప్పుడు మనసుకి  ముల్లు గుచ్చుకున్నట్లు ఉంటుంది.


సెలవు లేదని  హిమజ వెళ్ళిపోతూ " డ్రగ్ మిక్సింగ్ అప్పుడు మీరు వెళ్ళండి ఆంటీ ! మనం ఏమరుపాటుగా ఉంటే కాస్ట్లీ మందులన్నీ మళ్ళీ ఫార్మసీ కి వెళ్ళిపోతాయి" అని హెచ్చరించింది.


నాకెందుకో  కీమో ఇస్తున్నప్పుడు రెండుసార్లు  మోసం జరిగినట్లు అనిపించింది. మేమెవరం పార్మసీకి వెళ్ళాల్సిన పనిలేకుండానే స్టాఫ్ వెళ్ళి మందులు తెచ్చి డ్రగ్ మిక్స్  చేయించుకుని తెచ్చేశామని బిల్ చేతిలో పెట్టారు . అప్పటి నుండి కీమో థెరపీ కి కావాల్సిన  మందులన్నీ స్వయంగా నేనే వెళ్ళి తీసుకురావడం,స్టాఫ్ చేతికి ఇవ్వకుండా డ్రగ్స్  తీసుకువెళ్లి మిక్సింగ్ చేసేదాకా అక్కడే ఉండి ఆ బాటిల్స్ పైన పేరు వ్రాసిన  లేబిల్ అంటించిన తర్వాతనే అక్కడనుండి బయటకి వచ్చేదాన్ని. లేకపోతే డాక్టర్ హిమజ చెప్పినట్లు అంతా కంట్లో కనుమాయ. వైద్యమంతా ఇంతగా వ్యాపారమైపోవడాన్ని, అక్కడ జరిగే మోసాలని  జీర్ణించుకోలేకపోతున్నా.

హిమజ వెళ్ళాక తల్లికి తోడుగా ఉండటానికి రెండోపిల్ల  మంజు వచ్చింది. తల్లి ఇచ్చిన క్యారేజీ లని తీసుకుని పన్నెండుకల్లా హాజయ్యేవాడు కరుణక్క కొడుకు చంద్రశేఖర్.  అడుగడుకుకి సాయంగా నిలబడేవాడు. కృతజ్ఞతగా చంద్ర శేఖర్ వైపు చూసేది మంజు. వరసగా పదిరోజులపాటు చూపు, మాట కలిసేటప్పటికి ఇద్దరి మనసులు కూడా కలిసిపోయినట్లు ఉన్నాయి. మంజుని చూడగానే చంద్రశేఖర్ కళ్ళల్లో వెలుగు అతన్ని చూసినప్పుడల్లా ఆమె బుగ్గల్లో సిగ్గులు, అరనవ్వులు గమనించాను. 


భోజనమయ్యాక  మందులవల్ల మావారు ప్రశాంతంగా నిద్రపోతుంటే మెల్లిగా లేచి మల్లికార్జున దగ్గరకి వెళ్ళి  కూర్చున్నాను. అతనికి కాస్త ఓపిక వచ్చి లేచి కూర్చుని బాగానే మాట్లాడగల్గుతున్నాడు. "దసరా పండక్కల్లా రైతులకి ప్లాట్లు  విడగొడతారంట" అన్నాను ఈ పేపర్లో చదివిన విషయాన్ని గుర్తు చేసుకుని.  జీవం లేని ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు. భవిష్యత్ లో మంచి విలువ ఉంటుంది మీ భూమికి" అనగానే ...

"దేనికమ్మా విలువ? మనిషికా, భూమికా? వాళ్ళులాక్కున్నది భూములని మాత్రమేనా? రైతు ఆత్మని చంపేస్తున్నారు.రైతుకి అంతకన్నా వేరే మరణం ఏముందమ్మా! నాయకుల  ధనాశకి,అత్యాశకి అంతేలేదు. పేర్లు ఎవరెవరివో కానీ ఒక్కొక్కళ్ళకి వందల ఎకరాలు. ఇంట్లో ఆడాళ్ళ ఒంటిననిండా ఏడు వారాల,నవరత్నాల ఆభరణాలు.ఇళ్ళని బంగారు వెండి, వస్తుసామాగ్రితో నింపుకోవడానికి,  మోజుపడిన వాహనాలని వరు సలో నిలబెట్టుకోవడానికి,పది తరతరాలకి సరిపోయి ఇంకా  మిగిలిపోయేంత వెనకేసుకున్నా వారి దాహం తీరేటట్టులేదు. రైతులు ఇప్పుడు కూడా భూమిని అమ్ముకోవచ్చు అంటారు. భూమిని అమ్ముకుంటే డబ్బులొస్తాయి కానీ ఉన్న వూళ్ళో భూమి ఉండ విలువోస్తుందా?  ఇప్పుడు చాటెడు భూమి లేని  బికారినయిపోయా. నాకెందుకమ్మా లక్షలు? భూమి కావాలి, దున్నుకోడానికి, పంట వేసుకోవడానికి భూమి కావాలి" ఆవేశంతో ఊగిపోతూ దగ్గొచ్చి  ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు .


రాజేశ్వరి గబాల్న లేచి ఒక చేత్తో  గొంతు క్రిందనుండి గుండె దాకా సవరిస్తూ మరో చేత్తో  నీళ్ళు తాపిస్తూ   "కదిలిస్తే చాలు కడుపులో ఉందంతా కక్కుతావ్.  నువ్వొక్కడివే ఇచ్చావా ఏమిటీ ? అందరూ ఇచ్చారు. ఇవ్వనన్నవాళ్ళని బలవంతం చేసి మరీ ఇప్పించారు. ఆళ్ళందరికి లేని బాధ నీకొక్కడికే ఎందుకయ్యా అంటే ఊరుకోవు" అని కసిరింది. నావైపు తిరిగి  "ఇదమ్మా! ఈయన బాధ. వచ్చిన్నోళ్ళందరి దగ్గరా ఇదే గోస. ఊరుకోయ్యా అంటే ఊరుకోడు.అంది.పదెకరాలు భూమిని అయినకాడికమ్ముకున్నమాకు  తెలుసు  భూమి విలువ ఏమిటో. ఏం మాట్లాడగలను మౌనంగా అక్కడనుండి జారుకోవడం తప్ప.డిశ్చార్జ్ అయి వెళ్ళేముందు మా రూమ్ లోకి వచ్చింది రాజేశ్వరి.పొద్దున్న  చంద్రశేఖర్ వచ్చి చెప్పాడు. మాకందరికి ప్లాట్ లు ఒక్క చోటనే వచ్చినాయంట. పట్టాలిచ్చాక అంతా కలిపి మళ్ళీ పొలం చేద్దాం మామయ్యా  అన్నాడా పిల్లగాడు. మీ మామయ్య వల్లేమవుతుంది  ఎందుకులే అన్నా ఊరుకోలేదు. నేనుండాను కదా అత్తా  అన్నాడు. మామ అల్లుడు  ఏమి చెయ్యాలనుకున్నారో ఏమిటో?అంది.పోనీలే,ఈ మంచి వార్త విని మీ ఆయన హృదయం ఊరడిల్లి తొందరగా కోలుకుంటాడు, ఆ పిల్లాడు చంద్రశేఖర్ చక్కగా ఉన్నాడు, కష్టం సుఖం బాగా తెలిసినట్లు ఉంది. చదువు, ఉద్యోగం లేకపోతే మాత్రం ఏమైంది ? కుటుంబానికి అండగా ఉంటాడు. మీ మంజుని ఇచ్చి చేయండి ఈడు జోడు బాగుంటుంది" అన్నాను." మేమూ అదే అనుకుంటున్నాం. పిల్ల కూడా  మీ ఇష్టం అంది. అన్నీ బాగుంటే తొందరలోనే పెళ్ళి చేస్తాం. ఫోన్ చేస్తాను గట్టిగా రండి" అంది. బంధుత్వాలు బలపడుతుంటే ఎవరికీ మాత్రం సంతోషంగా ఉండదు.


తర్వాత నాలుగు రోజులకి మావారిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.  అకౌంట్స్ సెక్షన్ కి వెళ్ళాను. అక్కడంతా హడావిడిగా ఉంది.  సీరియస్ గా ఉన్న పేషంట్ ని వదిలేసి  అందరూ  వెళ్లిపోయారని వాళ్ళిచ్చిన  ఫోన్ నెంబర్స్ ఏవీ పనిచేయడంలేదని చెప్పింది క్లర్క్. వాళ్ళు బోలెడు బిల్ కట్టాలి. దానికెవరు బాధ్యత ? అంది నిస్సహాయంగా. కాసేపటికి చనిపోయిన మనిషిని మార్చురీకి తరలించడం చూసాను. పేద ధనిక తారతమ్యం లేకుండా డబ్బు కోసం పీక్కు తినడమే కనబడింది అక్కడ.  ఉపయోగం లేదని తెలిసినా డబ్బు కోసం వైద్యం చేస్తారు, అదే డబ్బు ఇవ్వకపోతే ప్రాణం పోతున్నా వైద్యం చేయరు.  డబ్బివ్వనిదే శవాన్నికూడా మార్చురీలోనే  ఉంచుకుంటారు. అంతా డబ్బు డబ్బు. పేషంట్ ఒంటిమీద చెయ్యేసి చూసే సమయం కూడా వారికి  కాలహరణమే. అదే కాలాన్ని మరొకచోట వెచ్చిస్తే మరికొన్ని నోట్లు సంపాదించొచ్చు. డాక్టర్స్ కీ  ధనదాహం పట్టుకుందని  అనడంలో  తప్పు లేదనిపించింది.


దీపావళి వెళ్ళిన ఐదో రోజున మంజుకి చంద్రశేఖర్కి పెళ్ళనీ  తప్పకుండా రమ్మని ఫోన్ చేసి ఆహ్వానించింది కరుణక్క.  పాలెంకి దగ్గరలోనే ప్లాట్లు ఇచ్చారమ్మా.  ప్లాట్లన్నీ కలిపి  దున్నేసి చుట్టూ ఇనుపకంచె వేసాం. అక్కడే పెళ్ళి చేయాలని తమ్ముడి కోరిక. ఉదయాన్నే తొమ్మిదింటికి  ముహూర్తం. డబ్బుది ఏముందిలే బుజ్జమ్మా. అన్ని ఖర్చులు నేనే పెడుతున్నా. కోడలికి నగలు,చీరలు  ఏమీ తక్కువజేయలేదు. మాకు మాత్రం ముద్దు ముచ్చట తీరొద్దా!  తమ్ముడు కూడా ఒక్క బిడ్డ పెళ్ళైనా కళ్ళార  చూసుకుంటాడని తొందరపడుతున్నా అంది.


 మావారికి కూడా కాస్త తేలిగ్గా ఉండటంతో  పెళ్ళికి వెళ్ళాం.  పచ్చని పందిరి క్రింద  పూలతో వేదికని అందంగా అలంకరించారు. వేదిక వెనుక  విశాలంగా షామియానా వేసి విందుకి ఏర్పాట్లు చేశారు. ఆహ్వానానికి, ఆతిధ్యానికి  లోటేమీ లేకుండా చూసుకునే బంధుమిత్రులు అడుగడుగునా కనిపించారు. చంద్రశేఖర్, మంజు చాలా సంతోషించారు మమ్మల్నిచూసి. పెళ్ళవగానే వెళ్ళి పోవద్దాంటీ ! వెనక  భూమంతా తోట వేయడానికి తయారుగా ఉంచాం. మీరెళ్ళి చూసి రండి అన్నారు.


నేను, మా వారు ఆసక్తిగా వెనుక వైపుకి  వెళ్ళి చూసాం. వెనుకనున్న భూమంతా పదునుగా దున్ని కొత్తగా చాలు వేశారు. నర్సరీ నుండి తెప్పించిన జామ మొక్కలని సాలు లో నాటాడానికన్నట్లు దూరం దూరంగా వేసి ఉంచారు. అప్పుడొక  ఊహాచిత్రం. ఆకాశ హర్మ్యాల మధ్య పచ్చని జామతోట.ఆ తోటని  ఇష్టంగా సాగుచేసుకుని ఫలించిన కష్టాన్ని చూసి మురిసిపోతూన్న మల్లికార్జున రూపం కదలాడింది.మేనమామ మనసెరిగి  అందుకు అనుగుణంగా నడుస్తున్న చంద్రశేఖర్ పై తెలియని వాత్సల్యం పుట్టుకొచ్చింది. పదిన్నరకల్లా పెండ్లి ఘట్టం ముగిసింది. తర్వాత  మొక్కలు నాటే కార్యక్రమం మొదలైంది. మొక్కని నాటటడం కన్నా  సంతోషకరమైన విషయమేముంటుంది అసలు?  తలా ఒక మొక్క నాటడానికి అక్కడ భూమి మాత్రమే లేదు గాని. మొక్క నాటలేనివారు నాటిన మొక్కలకి నీరు పోసి సంతృప్తి పడ్డారు.


తర్వాత విందు భోజనం కోసం దారితీశారు.వెనగ్గా ఉన్న మల్లికార్జున అప్పుడే నాటిన మొక్కల మొదళ్ళ దగ్గర మట్టిని సరిచేసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు. ఎలా ఉందండీ బావగారూ అని  మావారిని పలకరించాడు. ఇప్పటికి బాగానే ఉంది, తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం అని ఈయన సమాధానం. లేడి కాళ్ళు లేక చిక్కలేదు కాలం వచ్చి చిక్కింది అన్నట్టు రోగం చేతికి చిక్కాం మనం అన్నాడు మల్లికార్జున.  ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ ఇద్దరూ కలిసి నడుస్తూ ఆ చిన్నపాటి శ్రమకే అలసిపోయి చిన్నగా తోటలో కూర్చున్నాడతను. ఎవరో  మంచి నీళ్ళ సీసా అందించారు.చల్లగా ఉంటుందని నా చేతిలోని న్యూస్ పేపర్ తో  విసరసాగాను. అమ్మాయ్! నేను  విసురుకుంటానులే ఇటియ్యమ్మా అంటూ  పేపర్ తీసుకుని నెమ్మదిగా విసురుకుంటూ కాస్త ఆగి అందులో ఉన్న  హెడ్లైన్ చూస్తూ  పేపర్ ని  కోపంగా విసిరి కొట్టి ఈ దాహం ఈ భూ దాహం తీరడానికి మందే  లేదు అంటూ  ఆవేశంతో ఊగిపోయాడు. కంగారుగా  క్రింద పడిన  పేపర్ అందుకుని వెడల్పు చేసి చూసాను.కొత్త పరిశ్రమల కోసం వెయ్యి  ఎకరాల భూసేకరణ.


అంత ఆవేశమెందుకు? ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అంత అనుమానించాల్సిన పనిలేదు. పరిశ్రమలు వస్తే మంచిదేగా, పిల్లలు విమానాలెక్కడం మానేసి ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు. ఇతరదేశాలని అభివృద్ధి చేసే బదులు మనదేశమే అభివృద్ధి చెందుతుంది కదా అన్నాను.


ఇట్టా  పోర్ట్ లకి ఎయిర్ పోర్ట్ లకి, పరిశ్రమలకి, ఇళ్ళకి ఇన్నింటి కోసం ఈ పంటభూములన్నే లాక్కోవాలా ? కావాలంటే భూమి ఎక్కడలేదు? పచ్చగా పంట పండే వాటిల్లో పరిశ్రమలు పెట్టి ఏం తింటాం, మట్టి తింటామా ? మట్టి కూడా మిగలనిస్తున్నారా స్వామీ అంటూ  రెండు  పిడికిళ్ళలోకి  మట్టిని తీసుకుని ఈ మనుషులకి  దాహం ఎక్కువైపోయింది, ధనదాహం ఎక్కువైపోయింది,భూదాహం ఎక్కువైపోయింది. క్యాన్సర్ కన్నా మందు ఉందోమో కానీ ఈ ధనదాహంకి, భూదాహంకి మందే లేదు అని గొణుక్కుంటూ  సృహతప్పి  నేలకొరిగిపోయాడు.


అతని చుట్టూ అయినవాళ్ళు అల్లుకుంటే  నా చుట్టూ అంతులేని ఆలోచనలు.  అభివృద్ధి అంటే వనరుల విద్వంసమేనా ?  అభివృద్ధి పేరిట జరుగుతుంది మోసమేనా, భూదాహమేనా ? నాకూ ప్రశ్నల దాహం పట్టుకుంది, జవాబులిచ్చి దప్పికె వరు తీరుస్తారిప్పుడు ?

7, జనవరి 2017, శనివారం

హేమంత గానం
కిటికీ పై కొలువుదీరిన మా చేమంతి చెలులు . తెలిమంచు కురిసే సమయాన చిరునవ్వులు చిందుతూ నా నిద్రమత్తుని అటకెక్కించి .. హేమంతమంటే ఏమనుకున్నావ్ ... చంచలమైన మీ నయనాలని కాస్త కుదురుగా నిలబెట్టేది మేమే కదా ! ఇదిగో విరబూసిన మా ముఖారవిందాన్ని చూసే అదృష్టాన్ని మీకివ్వడమే కదా .. అని అల్లరిగా గుసగుసలాడతాయి. నగర జీవనంలో ఓ మొక్కని పెంచడం,పువ్వు పూయించడం అనే కష్టాన్ని ఇష్టంతో సాధించడం ..ఓ వ్యాపకమైంది .

 


ఇక రెండో చిత్రాన్ని నా కొడుకు బంగారానికి వీడియో కాల్ లో చూపగానే గట్టిగా నవ్వాడు. నాకు నవ్వొచ్చింది . ఎందుకంటే ... మా అమ్మ సూపర్, రీ యూజ్  ఐడియా సూపర్ .. అంటే సంతోషమే కదా ! . సంవత్సరన్నర క్రితం వాళ్ళ నాన్న గారికి గిఫ్ట్ గా తెచ్చిన scotch బాటిల్స్ ఈ డబ్బాలలో భద్రంగా పేక్ చేయబడి వచ్చాయి . నేను చూసేటప్పటికి నాలుగైదు డస్టబిన్ లోకి వెళ్లిపోయాయి . ఆఖరిన ఈ రెండు డబ్బాలు చూసి పారేయబోతుంటే వాళ్ళ దగ్గరనుండి లాక్కుని భద్రంగా దాచుకున్నాను. అప్పుడే నవ్వాడు ..ఏం చేస్తావమ్మా వీటిని ? పిచ్చి అమ్మా ..అన్ని దాస్తావు అన్నాడు . ఆ సమయంలో షాపింగ్ బిల్స్ అన్నీ అందులో జాగ్రత్త చేసాను. ఈ మధ్య వాటిని బయటకి తీసి మట్టి నింపి చేమంతి మొక్కలని నాటాను ఇదిగో ..నా ఐడియా ఇలా వికసించింది పూలతో పాటు. .


ఇక మూడవ చిత్రం ... నర్సరీలో తెచ్చిన గులాబీ మొక్క చచ్చిపోయిందని అనుకున్నాను . ఎలాగోలా చివురించి నన్ను  అబ్బురపరిచింది. ఈ గులాబీ మొక్కతో ఎదో అనుబంధం ఉంది నాకు ..చాలా జాగ్రత్తగా పెంచాను .చూపుడువేలంత ఎత్తు పెరిగిందో లేదో .. కృతజ్ఞతగా ఓ మొగ్గ తొడిగింది . బుజ్జిముండ ఎంత బావుందో .. ! అందుకే ముచ్చటేసి ఇలా పిక్ తీసి షేర్ చేస్తున్నా <3

2, జనవరి 2017, సోమవారం

ఆత్మీయ స్పర్శ

2017 జనవరి సంచికలో "తెలుగు వెలుగు " లో వచ్చిన నా కథ ..
ఆత్మీయ స్పర్శ

అసలే వేసవి కాలం . ఎంత మెత్తని దిండు క్రింద అయితేనేం ? ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నా.
ఇది లేకపోతే  నాకు ఒక్క క్షణం కూడా తోచదు అనే ఈమె ఇవాళ  నన్నసలు పట్టించుకోదేమిటీ ?  కాస్త తీసి బయట పడేస్తే  బావుండును. అందరినీ  చూస్తూ నైనా కూర్చోవచ్చు . ఎవరూ పలకరించే దిక్కులేక అటూ ఇటూ తిరక్కుండా ఓ మూలపడి  కూర్చోవడం విసుగ్గా ఉంది.

రోజులాగానే ఆమె నన్ను చేతిలోకి తీసుకుని అటూ ఇటూ  తిప్పుతూ సున్నితంగా సృశిస్తూ,నవ్వు ముఖంతో చూస్తూ ఆనందంగా గట్టి గట్టిగా మాట్లాడటం లేదు.ఆమె చేతిలో నేనున్నాను కానీ ఆమె చూపంతా  గడియారపు ముళ్ళ పైనే కేంద్రీకరించుకుని చూస్తూ ఉంది . క్షణ క్షణానికి  ఆనందం  ఆమె ముంగిట్లోకి నాట్యం చేస్తుందన భావనే మధురంగా ఉన్నట్టు. కళ్ళల్లో గిర్రున తిరిగే నీరు, పెదవులపై పూచే నవ్వు , కొద్దిగా వేగంగా కొట్టుకునే గుండె.

ప్లైట్ దిగిన తర్వాత కొడుకు ఫోన్ చేసాడు.   అమ్మయ్య నాకు కాస్త కదలిక వచ్చింది. నువ్వుఎక్కడున్నావమ్మా ! అన్నాడు . నేను ఎయిర్ ఫోర్ట్ కి రావడం లేదు నాన్నా! అనగానే అవునా అమ్మా  అంటూ నిరాశ పడ్డాడు. మళ్ళీ అంతలోనే సర్దుకుని పర్వాలేదులేమ్మా ! అన్నాడు. నీ క్కాబోయే మామగారు రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నారు కదా నాన్నా ! అందుకే రావడం లేదు . మీ ఇద్దరి లగేజ్ నలుగురు మనుషులకి సరిపోయే కారు కాదు కదా నాన్నా ! అందుకే వేరే కార్ ఏర్పాటు చేసాను. అని చెప్పింది.
"నా కోసం వచ్చిన కార్ డ్రైవర్. ఎక్కడమ్మా అతని  ఫోన్ నంబర్ చెప్పు"అన్నాడు. అతని నంబర్ చెప్పింది .
 డ్రైవర్  అసలే ఫాస్ట్ గా నడిపే  ఫాస్తైన కుర్రాడు పేరు  స్టాలిన్. కొంచెం ఆశ్చర్యంగా చూసింది ఆమె మొదటిసారి ఆపేరు విన్నప్పుడు. మా నాన్నకి స్టాలిన్ అంటే అభిమానమమ్మా ! అందుకే ఆ పేరు పెట్టాడు అన్నాడతను.
ఇదిగో స్టాలిన్! బాబుని జాగ్రత్తగా ఇంటికి తీసుకురావాలి. స్పీడ్ గా నడపవద్దు అని హెచ్చరించడమే కాకుండా  అన్నయ్య గారూ ! డ్రైవర్ కొంచెం స్పీడ్. మధ్య మధ్యలో కాస్త వేగం  తగ్గించుకోమని చెపుతూ ఉండండి అంటూ జాగ్రత్తలు చెప్పేసింది. నన్ను మళ్ళీ పక్కన పడేసింది.

కారు అక్కడ బయలుదేరిన దగ్గరనుండి గడియారం పైనే చూపులు. మామిడి కాయ పప్పు, బంగాళ  దుంప వేపుడు, బెండకాయ కొబ్బరి ఫ్రై, గోంగూర పచ్చడి  చేసేసింది  అవన్నీ కొడుకుకి ఇష్టమైన కూరలంట.   వచ్చి రాగానే బిడ్డకి అన్నం పెట్టుకోవాలి అంటుంది అత్త గారితో . నాకు, నా కొడుక్కి కూడా అంత శ్రద్దగా చేసి పెట్టొచ్చుగా అని గొణుక్కుంటుంది  ఆ ముసలమ్మ. మామిడి పండ్ల   రసం తీసి చల్లగా ఉండాలని ఫ్రిజ్డ్ లో పెట్టి ఉంచింది. ఎన్ని  పనులు చేసినా సమయం కదలదే ..ఇంకా పదిన్నరేనా !  అంటూ విసుక్కుంటుంది .

 శంషాబాద్ విమానాశ్రయం టూ విజయవాడ రెండువందల ఎనబై తొమ్మిది ప్లస్ ఆరు ఈజీక్వల్ట్ రెండువందల తొంబై  అయిదు. నాలుగు గంటలన్నర. ఇప్పుడు సూర్యా  పేట దాకా వచ్చి ఉంటారేమో అని లెక్కలేసుకోవడం . మధ్యలో కాస్త కునుకు తీయడం మళ్ళీ అంతలోనే ఉలికిపడి లేవడం గడియారం వైపు చూడటం. అప్పుడు నాతో  అవసరం పడిందేమో ..నన్ను చేతిలోకి తీసుకుని .."అన్నయ్య గారూ! ఎక్కడివరకూ వచ్చారు?  పిల్లలు ఏమైనా తిన్నారా ? మధ్యలో ఆగి ఏమైనా తినండి "అని పలకరింపు .  మళ్ళీ నిద్ర .

పెళ్లి పనులలో, బంధు మిత్రులని ఆహ్వానించడంలో, కొనాల్సినవి కొంటూన్నప్పుడు  మాత్రం నన్ను విపరీతంగా వాడుకుంటుంది. ఇప్పుడే ఇలా నిర్లక్ష్యం చేస్తుంది కానీ పాపం చాలా మంచామె . గుంభనం కల మనిషి .  ఒక్క భుజం మీద కాడిని మోస్తూ అలసిపోతూ, ఓపిక కూడబెట్టుకుంటూ, ఆర్ధిక విషయాలు చూసుకుంటూ, కొన్ని అసంతృప్తులని ఎదుర్కుంటూ  తన  కల నిజమయ్యే రోజు కొరకు ఎదురుచూస్తూ ఉంది.  నిజానికి ఆమె నా ద్వారానే ప్రపంచంతో మాట్లాడుతుంది తప్ప ఎవరితోనూ ముఖంలో ముఖం పెట్టి మాట్లాడి ఎరుగదు.

మళ్ళీ కాసేపటి తర్వాత  నాకు నిశ్శబ్దం నుండి విముక్తి కల్గింది.మాటలు నానుండి ప్రవహించాయి . "అన్నయ్య గారూ ఎక్కడి వరకూ వచ్చారు " అని అడిగింది. వచ్చేసామండీ. ఆటోనగర్ దగ్గర ఉన్నాం అని వినగానే గబుక్కున పక్క మీద నుండి లేఛి నన్ను చేతిలోకి తీసుకుని గది దాటి బయటకి వచ్చింది. ఆమె తండ్రి,అబ్బాయి తండ్రి, అత్తగారూ అందరూ గురకలు పెట్టి నిద్ర పోతున్న శబ్దం.  బిడ్డ వస్తున్నాడని ఒక్కరు కూడా మేలుకుని ఎదురుచూడ్డటం లేదు. ఏం మనుషులు వీళ్ళు ! అనుకుంటూ చిరాకు పడింది. ఆకలి,నిద్ర వాటి తర్వాతే ప్రేమైనా, ద్వేషమైనా ఏదైనా  ! అని గొణుక్కుంటూ తలుపులన్నీ తీసి గ్రిల్లు తాళం తీసి .. లిఫ్ట్ చప్పుడుతో అందరి నిద్ర చెడగొట్టటం ఎందుకని మూడంతస్తులు దిగిక్రిందికి వచ్చింది . వాచ్మెన్ దోమ తెరలు కట్టుకుని పడుకుని ఉన్నాడు. అతనికి కూడా నిద్రాభంగం కల్గనీయకుండా గేటు తీసుకుని రోడ్డు మీదకి వచ్చి నిలుచుంది.

ఆమె రెండు కాళ్ళు ఒక్క క్షణం కూడా కుదురుగా ఉంచుకోదు . అటూ ఇటూ తిరుగుతూ వీధి చివర మలుపులోకి  ఆత్రంగా చూస్తూనే ఉంది . ఇంకో రెండు అడుగులు కేసి మచిలీపట్నం రోడ్డు నుండి ఈ  సందులోకి ఏవైనా కారు వస్తుందేమోనని చూసింది. కారు రావడం లేదు కానీ పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చింది. రోడ్డుపై నిలబడ్డ ఆమెని  చూసి వాళ్ళు  స్లో అయ్యారు.  వాళ్లకి దగ్గరగా నడిచి "సర్ ! మా బాబు విదేశం నుండి వస్తున్నాడు అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నా" అంది . సరేనమ్మా అంటూ వాళ్ళు  ముందుకు కదిలారు.

వాళ్ళు మాకు పైనున్న కాలనీవైపుకి వెళ్ళారో లేదో  రెండు నిమిషాల తర్వాత ఇన్నోవా  కారు వస్తూ ఉంది . కారు అద్దాలలోనుండి అబ్బాయి ఎటువైపు సీట్ లో  కూర్చున్నాడోనని కళ్ళతో వెతుక్కుంటుంది ఆమె  . ఈ మనుషులకి బిడ్డలంటే అంత ప్రేమ కాబోల్సు. మొదటిసారిగా నాకు అమ్మ లేదని బాధ కల్గింది.  కారు  ఆగి ఆగగానే వెనుక సీట్ కారు డోర్ ని తీయడం కోసం  ఆమె హాండిల్ పై చేయి వేయగానే  అబ్బాయి లోపలి నుండి డోర్  తీసుకుని కిందికి దిగి అమ్మా! అంటూ ఎదురుగా నిలబడ్డాడు.

నిలువెత్తు కొడుకు ఆమె  ముందు అలా  నిలబడేటప్పటికి  ఉప్పెనలా దుఃఖం తన్నుకొచ్చింది.  బంగారం అంటూ అతన్ని  చుట్టేసుకుంది.  ఆమెలో  దుఖం వరదలా ప్రవహించి  బిడ్డని తడిపేసింది. ఆ బిడ్డ చేతుల మధ్య అమ్మ గువ్వలా ఇమిడిపోయింది. "ఈ  నాలుగేళ్ళు నువ్వు లేకుండా ఎట్టా గడిపానో బంగారం, కళ్ళల్లో ఒత్తులేసుకుని నా  బిడ్డని క్షేమంగా చూడు తండ్రీ అని దేవుడిని వేడుకుంటూ  రోజులు రోజులు లెక్కపెట్టుకుంటూ ఈ అమ్మ  నీ కోసమే బ్రతికింది  బంగారం" అంటూ కదిలి కదిలి పోయింది.

అమ్మా ! ఏడవబాకు. నువ్వు అలా ఏడిస్తే నేను తట్టుకోలేను. నేను వచ్చేసాగా . పిచ్చి అమ్మ .. అంటూ నవ్వాడు కన్నీళ్ళతో . అయినా ఆమె ఏడుస్తూనే ఉంది.  .ఎందుకమ్మా ఏడుస్తావ్! చూడు నేను బాగానే  ఉన్నానుగా! నువ్వే చూడు ఎలా అయిపోయావో ! అన్నాడు తల నిమురుతూ.

ఆమె  అంతకు మునుపే మనసులో ఎన్నో అనుకుంది.ప్రతి చిన్నమాటని నాలో భద్ర పరచడం ఆమెకి అలవాటు కాబట్టి  ఆ మాటలు నాకు ఎప్పుడో తెలుసు. ఆమె కథలు కవితలు వ్రాస్తుంది కదా ! నిన్ననే ఇలా వ్రాసుకుని నాలో సేవ్ చేసుకుంది కాబట్టి నాకు అదంతా కంఠతా వచ్చేసింది.
బంగారం ...
ప్రతి కలయిక ముందు వీడ్కోలు దుఃఖం అలాగే అంటి పెట్టుకుని ఉందని చెప్పనా !
గాయపడిన ప్రతిసారి పడిలేచిన కెరటమైపోయానని చెప్పనా !
 ఈ అమ్మ దుఃఖ కడలిని లోలోపల దాపెట్టి పైపైకి నిశ్చలంగా నిలబడి ఉందని చెప్పనా !
ఎందరికో సమాధానం చెప్పి అమ్మకి గొడుగై నిలుస్తావని ఎదురుచూస్తున్నానని చెప్పనా !  అనుకుంది మరి .

కాబోయే కోడలు తల్లీ బిడ్డల గాఢ పరిష్వంగాన్ని దుఃఖాన్ని బిక్క మొహం వేసుకుని  చూస్తుంది నాలాగే !  చప్పున కాబోయే కోడలిని పలకరించలేదని సృహ కల్గి  కొడుకు నుండి నుండి విడిపడి "అమ్మా ఎలా ఉన్నావ్ అంటూ ఆ అమ్మాయిని  దగ్గరకి తీసుకుంది . బాధపడకండి ఆంటీ ! ఇకనుండి అందరం కలిసే ఉంటాం కదా ! అని ఓదార్చింది . బిడ్డది ఎంత గొప్ప మనసు. ఈ పిల్లకి  ఓదార్చే విద్య కూడా తెలుసు. డిక్కీలో లగేజ్ అంతా క్రిందికి దింపించింది బ్యాక్ పేక్ , పాస్పోర్ట్ ఉన్న వాలెట్ అన్నీ తీసుకొచ్చి అబ్బాయికి ఇచ్చింది. నాక్కాబోయే కోడలు జాగ్రత్త పరురాలు. అబ్బాయిని నా అంత జాగ్రత్తగా చూసుకుంటుంది అనుకుంటూ  ఆమె  సరేనమ్మా ! మీరు వెళ్ళిరండి. రేపు కలుద్దాం అని ... ఇద్దరూ  కలిసి లగేజ్ అంతా  లిఫ్ట్ వైపు తేబోతుంటే  నేను తెస్తానుగా, నువ్వుండమ్మా  ..అంటూ చేతిలో లగేజ్ అందుకున్నాడు ఆ బిడ్డ. ఎంత శ్రద్ధ ,అమ్మంటే ఆ బిడ్డకి ఎంత ప్రేమ అనుకున్నాను .  నేను తెస్తాను కదా బాబూ మీరు పదండమ్మా అన్నాడు వాచ్మేన్.

ఇంట్లోకి వచ్చిన  సూట్కేస్ చక్రాల చప్పుడుకి ఒక్కొక్కరే ఆవిలించుకుంటూ  చిన్నీ.. అప్పుడే వచ్చేసాడా అంటూ బయటకి వచ్చారు. అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరి సంతోషం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది కూడా .   ఆమె కొడుకు స్నానం చేయడానికి గీజర్ ఆన్ చేసింది . వేసవి కాలంలో వేడినీళ్ళు  ఏమిటమ్మా అంటున్నాడు . అదంతేలే ..నువ్వెళ్ళు ముందు. నేను అన్నం కలిపి పట్టుకొస్తాను అంది. ఆమె ఏమో హడావిడిగా  టీపాయ్ పై కూర గిన్నెలు,నెయ్యి ,పెరుగు , అన్నం గిన్నె, పళ్ళెం ,మంచి నీళ్ళు అన్ని సిద్ధంచేసి కొడుకుకి గోరుముద్దలు తినిపించుకోవడానికి ఎదురుచూస్తుంది .

 ఒక్క వెలుగు వెలిగి ఆరిపోతూ  రోజూ అంతలా అరగదీసేస్తూ  ఉంటావు . ఇవాళ అసలు నన్ను పట్టించుకోవడం లేదు అన్నాను ఉక్రోషంగా.. అప్పుడామె నవ్వి .. కొద్దిగా వేచి ఉండు, నీ ప్రశ్నకి సమాధానం చెపుతా అంది .
కొడుకుకి ఇష్టమైన కూరలేసి గోరు ముద్దలు తినిపిస్తూ  ఆనందంగా ఊరి వస్తున్న  కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆమె ఇలా చెప్పింది..

 నాన్నా!  నీకిష్టం లేకపోయినా నేనే నిన్ను బ్రతిమలాడి విదేశానికి పంపాను. నువ్వు విదేశాలకి వెళ్ళి   బాగా చదువుకున్నావ్, ఎన్నో కష్టాలు పడ్డావ్ , మంచి ఉద్యోగం చేస్తున్నావ్ , ఇక్కడ  అమ్ముకున్నంత కాకపోయినా కొద్దిగా పొలం,నగానట్రా,కారు అన్నీ కొనుక్కున్నాం,ఆర్ధికంగా బాగున్నట్టు అనిపించినా ఏదో వెలితి,  ఇవేమీ ఇవ్వలేని భద్రత, నిశ్చింత  ఏదో కావాలనిపించేది నాకు. నిండుగా నవ్వింది లేదు, కడుపు నిండుగా తిన్నదీ లేదు,కంటి నిండా నిద్ర పోయింది లేదు. అనుక్షణం చెప్పలేని ఏదో అలజడి. అన్ని బంధాలలోనూ ఏదో అశాంతి,

ఆమె కంట కన్నీరు కారుతూనే ఉంది. కొడుకు ఓదారుస్తూ నిండు కుండ అన్నం కుడితితొట్టెలో  వేసిన రోజూ తెలుసూ, కొరివికారంతో తింటూ పరమాన్నంగా భావించిన రోజూ తెలుసు. ఏడేళ్ళ పసి వయసులో అమ్మ కష్టం తెలుసు, నాన్న నిర్లక్ష్యమూ అంతకన్నా బాగా తెలుసు. ఇన్నాళ్ళూ తప్పిపోయిన గొర్రె పిల్లని నేనేనెమో అనుకునేవాడిని. అయినవాళ్ళ ఇందరి మధ్య ఉండి నువ్వు ఇంత ఒంటరి తనం అనుభవించావా..అమ్మా ! అన్నాడు

నాన్నా ! అయినవాళ్ళ పలకరింపులలో కూడా కనబడే వెక్కిరింతలు, ఈర్ష్యాద్వేషాలు అన్నీ అనుభవించాను. చిన్న సాయం చేసి కూడా తాము లేకపోతే మనకి ఏమీ జరగదు, అన్నిటికి మీకు మేమే దిక్కు అన్నట్టు మాట్లాడే వాళ్ళు, చిన్న లోపాన్ని భూతద్దంలో చూస్తూ వాళ్ళే నిజాయితీ పరులు అని ఢంకా మోగించుకునేవాళ్ళు, వీళ్ళే మన చుట్టూ ఉంది . ప్రేమ నిండిన ఓ ఆత్మీయత కోసం అలమటిస్తున్నా . ఏళ్ళ తరబడి గూడుకట్టున్న దుఃఖాన్ని కరిగించే ఒక  స్పర్శ కోసం ఎదురు  చూస్తున్నా నాన్నా !   రెండేళ్ళ క్రితం హాస్పిటల్ లో పడి  ఉన్నప్పుడు కూడా ఆ  విషయం నీకు తెలియకుండా  ఉండాలనే జాగ్రత్త పడ్డాను కానీ  ఒకోసారి నా బిడ్డ స్పర్శ  తగిలితే చాలును  అరక్షణంలో నా రోగాన్ని జయించగలను  అని ఎన్నో సార్లు అనుకున్నాను"  చెపుతూ ఏడుస్తూనే ఉంది ఆమె.


 ఇదిగో  ఇది ఉంది చూడు ! అంటూ నన్ను ఎడమ చేతితో తీసి  అతనికి చూపించి మళ్ళీ  విసిరినట్లు ప్రక్కన పడేసి .. స్పర్శతో దీన్ని నువ్వు,  నేను ఏ ఆటైనా ఆడించగలము. అరక్షంలో ఎదురెదురుగా  కూర్చుని చూసుకోగలం, మాట్లాడుకోగలం,పెద్ద పెద్ద వ్రాతలని బట్వాడా చేసుకోగలం, వాన కురుస్తుందో ఎండ కాస్తుందో,ఎటు వైపుకి వెళుతున్నామో అన్నీ చెపుతుంది కానీ ఇది నాకొక ఆత్మీయ స్పర్శని ఇవ్వగల్గుతుందా ? నా దుఃఖ హృదయాన్ని  తన స్పర్శతో ఊరడించ గల్గుతుందా? అని అడిగింది . బిడ్డల భవిష్యత్ బాగుంటుందని,ఆర్ధిక ఇబ్బందులు తొలుగుతాయని  బిడ్డలని,భర్త ని దూరంగా విదేశాలకి పంపించిన వాళ్ళందరూ కోల్పోయేది ఈ ఆత్మీయ స్పర్శ నే . వీళ్ళు అక్కడికి వెళ్ళలేక ,వాళ్ళు యిక్కడికి రాలేక అనుబంధాలన్నీ మూగవోయి జీవచ్చవంలా బ్రతుకుతుంటారు . ఎప్పుడెప్పుడు వారి మధ్య  దూరం తగ్గి దగ్గరయ్యే క్షణం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు .  అక్కడ దొరికేది ఏదో, ఏమో  కానీ కోట్లు పోసినా దొరకనిది  మాత్రం ఇదే. ఈ స్పర్శ కోసమే అలమటించి పోతారు నాన్నా ! అని చెప్పింది.

అప్పుడు నాకు సిగ్గనిపించింది . నాలాంటి వాళ్ళు కోట్లాను కోట్లు ఉండి ఉండవచ్చు మావల్ల  మనుషుల  పై పై అవసరాలు తీరిపోవచ్చు.  కానీ  మనిషికి మనిషి మధ్య సజీవమైన స్పర్శని ఇవ్వలేవు కదా ! ప్రపంచంలో ఏ ప్రేమైనా ఎప్పటికో అప్పటికి కరిగి తరిగి పోతుంది కానీ తల్లికి బిడ్డ మధ్య  ఉన్న ప్రేమ ఎప్పటికీ కరగనిది తరగనిది కదా !  అనుకున్నాను . అవును మమ్మల్ని పుట్టించిన దేవుడికి మాకు స్పర్శ నివ్వడం ఎందుకు సాధ్యమవలేదూ ? స్పర్శ అంత గొప్పది కాబోలు .   సృష్టిలో కొన్ని కొన్నిఅసలు  సాధ్య పడవు కాబోలు. ప్చ్ సజీవ స్పర్శ లేని బ్రతుకు 
ఎంత దుర్లభం అనుకుంటూ వాళ్ళ వైపు చూసాను.