22, మార్చి 2016, మంగళవారం

సత్యవతి కథలు



మూడువందల యాబై  పేజీలు  నలబై  కథలు . సత్యవతి కథలు పేరిట మార్చి ఇరవై వ తేదీన విజయవాడలో  ఆవిష్కరించబడిన కథా సంకలం. ఇష్టంగా ఈ కథల సంపుటిని కొనుక్కోచ్చుకున్నాను. చాలా కథలు అదివరకు చదివినవే ! అయినా మళ్ళీ మళ్ళీ చదవాలనే ఆత్రుత.  కొన్ని పనులని వాయిదా వేసుకుని చదువుతూనే ఉన్నాను . 


అన్ని కథలూ ఏదో చెప్పాలనుకుని  చెప్పే ప్రయత్నం చేసిన కథలే! చైతన్యం నిండిన కథలే ! ఈ కథలలో చాలా పాత్రలు తమ అస్తిత్వాన్ని తాము కాపాడుకోవాలనే సృహ కల్గిన కథలు.  


కాలం మారుతుంది. దాదాపు అరవై   సంవత్సరాల కాలం నాటి నుండి నేటి వరకూ స్త్రీల జీవితాల చుట్టూ పెనవేసుకున్న అనేకానేక ఉక్కు కౌగిళ్ళ స్వరూపాలని మనముందు తీసుకొచ్చి నగ్నంగా నిలబెట్టి ఉతికి ఆరేసిన కథలివి. మంత్రనగరి లో అనసూయ దగ్గర మొదలై చాలా పొడుగ్గా ఉండి మంచి కుంచె ఉన్న గట్టి చీపురుతో ఎప్పటికైనా పని బడుద్ది గందా.. అనుకున్న స్వర్ణ కథ వరకూ వచ్చి ఆగిన కథలు.   

పురుషుడుకేం ఎప్పుడూ బాగానే ఉన్నాడు. గంగి గోవుల్లాంటి అమాయకమైన ఆడవాళ్ళని హింసించి,అదిలించి,బెదిరించి,మభ్యపెట్టి,కపట ప్రేమ చూపించి,బతిమలాడి,బామాలి ఎలాగైతేనేం తనకి కావాల్సినట్టు ఆనందంగా ,విలాసంగా,అహంకారంగా బ్రతుకుతూనే ఉన్నాడు. అతని జీవితంతో ముడిపడిన స్త్రీకి మాత్రం నిత్యం చేదు అనుభవాలే !  సత్యవతి గారి కథల్లో ఎక్కువ కథలు పీడిత స్త్రీల కథలే! ఒక పావు వంతు మాత్రం ప్రపంచీకరణ నేపధ్యంలో గడుసుగా మారిన ఇప్పటి స్త్రీల కథలు.  


ముందుగా .... సత్యవతి గారిని అందరికి పరిచయం చేసిన కథ ... "ఇల్లలకగానే " ఈ కథ పూర్తీ పేరు "ఇల్లలకగానే పండగౌనా" . పెళ్లికి  ముందు ఎంతో  చలాకీగా, ఉత్సాహంగా, చదువు సంధ్య అన్నీ ఉన్న అమ్మాయి  పెళ్ళవగానే ఇంటి భాద్యతతో   తానేమిటో తన పేరేమిటో  కూడా మర్చిపోతుంది. భర్తని, తల్లి దండ్రులని అందరిని  తన పేరు అడుగుతుంది. కానీ ఎవరూ చెప్పరు. స్నేహితురాలు ప్రమీల కలిసి తన గురించి చెప్పేదాకా శారద అనే ఇల్లాలు తనవేరో మర్చిపోతుంది. మెదడులో అరలన్నీ కూడా ఇల్లెంత బాగా అలకాలీ అనే విషయం మీదే కేంద్రీకృతమై ఉంటాయి. తర్వాత తనెవరో గుర్తించుకుని ఇంటికొచ్చి అటకెక్కి పాత పైళ్ళు తిరగదోడి తన సర్టిఫికెట్స్ ,బహుమతులు ,బొమ్మలు అన్ని పిల్లలకి గర్వంగా చూపుతుంతుంది.  ఇది ఇల్లలకగానే కథ. ఆడపిల్లకి పెళ్ళవగానే కుటుంబం భర్త పిల్లలు తప్ప తన గురించి సృహే ఉండకూడదు ఉంటే  వైఫ్ ఆఫ్ గానే ఉండిపోవాలనే ఆధిపత్య భావజాలానికి అనుగుణంగా స్త్రీని ఇంటికే పరిమితం చేసిన తీరుని వ్యంగంగా చెప్పిన కథ ఇది . 


గోధూళి వేళ కథలో చెరువు తులసమ్మ గా ప్రసిద్దికెక్కిన మహాలక్ష్మి కథ ఊహాత్మకంగా చెప్పిన తీరుకి ఆశ్చర్య పోవాల్సిందే! ఎనిమిదో ఏట పెళ్ళైన మహాలక్ష్మి పైటేసుకుని పదిహేనోయేట అత్తవారింట్లో కాలు పెట్టినతర్వాత మొగుడే కాకుండా మూడు తరాల ఆడవాళ్ళు వంకాయ కాల్చుకు తిన్నట్టో ,చిలకడ దుంప కాల్చుకు తిన్నట్టొ కాల్చుకు తింటే రాత్రివేళ భర్త కాల్చుకుతింటాడు. ఆ కష్టం సుఖం తల్లితో చెప్పుకుంటే ఆమె నవ్వేసి "అత్తింట్లో కాపురం అనుకుంటే అచ్చంగాయలు ఆడుకోవడం అనుకున్నావా ? ఆడ పుటకంటే అంతే  మరి. మేమంతా అల్లా బాధలు పడ్డవాళ్ళమే,అదే అలవాటవుతుంది "అని చెపుతుంది. తర్వాత మహాలక్ష్మి రోజూ సాయంత్రం తులసి గట్టు మీద కూర్చుని ఏడ్చి ఏడ్చి అలా పది సంవత్సారాలు ఏడవడం మూలంగా చెరువు తయారైన విధం అందులో నీళ్ళు ఉప్పగా ఉండటం అనే వర్ణన వెనుక దాగిన వేదన,దుఃఖం ఎలాంటిదో మనం అర్ధం చేసుకోవాలి.  ఇందులో హాస్యంకన్నా అప్పటి కాలంలో స్త్రీల కడగండ్లకి అద్దం  పట్టిన అద్భుతమైన చిత్రీకరణ కనబడుతుంది.నాకైతే తులసమ్మ చెరువు వర్ణన ఎంత నచ్చిందో !  గోధూళి వేళకి ఇంటికి చేరుకోవాలనే ఆత్రుత,ఒత్తిడి తో నలిగిపోతూన్న ఉద్యోగినులైన స్త్రీల మానసిక స్థితికి అద్దం  పట్టిన కథ ఇది  


అరుణ సంధ్య కథలో అరుంధతి మౌనం వెనుక బ్రద్దలయ్యే అగ్నిపర్వతాలూ..ప్రవహించే  ఆలోచనల లావాని పసిగట్టగల్గింది కోడలు లత మాత్రమే! కొడుకు రవి, కూతురు కరుణ దృష్టిలో ఆమెప్పుడూ అదో తరహా మనిషే. ఆమె బ్రతుకు మీద నిర్ణయం ఎప్పుడూ ఆమెది కాదు.మరిగే కాఫీ నెత్తి మీద పోసినా, తినే అన్నం మొహానికి పులిమినా పుట్టింట్లో పది రోజులుండి మళ్ళీ ఇంటికొస్తే  పగిలిపోయిన గాజులు,ఎండిన పూలు,ఖాళీ కండోమ్ పాకెట్లని ఊడ్చేసుకుని, పరుపులు ఎండేసుకుని ఇల్లంతా డెట్టాల్ తో కడిగేసుకుని మళ్ళీ సుఖంగా కాపురం చేసుకున్నప్పుడు కూడా  ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చిన అరుంధతికి పుట్టింది మొదలు    ఏం చదవాలో,ఏం బట్టలు వేసుకోవాలో,ఎలా మాట్లాడాలో, ఎవర్ని పెళ్ళాడాలో తండ్రి నిర్ణయిస్తే.. ఏం వండాలో,ఏం తినాలో,ఎక్కడ నవ్వాలో,ఎందుకు నవ్వకూదదో,ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో భర్త నిర్ణయిస్తాడు. ఏది ధర్మమో పిల్లలు నిర్ణయిస్తారు. ఏదీ తనది కాని జీవితంలో మరణమైనా తనది కావాలనుకున్న ఆమె ఆశ నిరాశ అవుతుంది. తెల్లని దూది పింజె మబ్బులు అరుణిమలో కరిగి పోవడం,పడమటి ఆకాశమంతా గాయపడిన హృదయంలా అయిపోవడం ఆపై చీకటి ముసురుకు రావడం చూస్తూ కూర్చుంది అరుంధతి. అంతలోనే కరిగిపోయిన అన్ని రంగుల్ని చూసి ఆశ్చర్యపడింది అంటూ కథ మొదలవుతుంది. అరుంధతి తన జీవితం సూర్యుడస్తమించడానికి  ముందున్న ఆకాశంలా ఉందని రాబోతున్నదంతా  చీకటని అంతకు ముందు ఎన్ని రంగులున్నా  కరిగి పోక తప్పదని చెప్పినట్లు  ప్రతీకగా ఆరంభంలోనే కవితా వాక్యాలతో ఆకట్టుకుంది. .  


ప్రపంచీకరణ నేపధ్యంలో మారుమూల పల్లెటూళ్ళలోకి కూడా చొచ్చుకుని రాగల్గిన  బహుళజాతి సంస్థల ప్రవేశాన్ని, వస్తు వ్యామోహాల మధ్య  ఇరుకున్న మగువని,   మార్కెట్ మాయాజాలాన్ని విదేశీ చదువులు, ఉద్యోగాలు ఆఖరికి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటూ దేవుడిని,  వ్రతాలని, పూజలని అన్నింటిని మోసుకుపోగల్గేలా మారిన,స్త్రీల జీవన పరిణామ క్రమాన్ని పద్నాల్గేళ్ళ క్రితం వ్రాసిన మంత్రనగరి కథలో కళ్ళకి కట్టినట్లు చూపించారు. చాలామంది అమ్మాయిలు ఇంటర్మీడియట్ లోకి రాగానే కలల్లోకి పిట్స్ బర్గ్ వేంకటేశ్వరుడు,నయగారా జలపాతం వస్తాయట   అని సుతిమెత్తని వ్యంగాన్ని నొప్పి తెలియకుండా ఇంజెక్ట్ చేస్తారు . ఝాన్సీ పిన్ని చెప్పిన కథలో సూర్యుడిని చూడని చీకటి గదుల్లో పెరిగిన అనసూయ కి పెళ్లైంది పిల్లలు  పుట్టారుఒళ్ళంతా తెల్లగా పాలిపోతుంది దానికి కారణం సూర్యరశ్మి తగలకపోవడమే ! ఆమె కూతురు కృష్ణవేణి తండ్రిని ఎందుకు బడి మాన్పించావ్ నాన్నా అని అడిగినందుకు మెడ మీద సాచి కొడతాడు ఆమె తల ఒంగిపోతుంది పెళ్ళయ్యాక ఆమె భర్త ఆమె తలెత్తి మాట్లాడటం భరించలేక మెడ మీద మేకు కొడతాడు. కృష్ణవేణి కూతురు ఝాన్సీ లక్ష్మి పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆడపిల్లలాగా ఉండటం అంటే ఏమిటీ ? అలా ఉండాలని ఎవరు చెప్పారు ? ఆడ లక్షణాలు అంటూ ఏమి ఉండవు అవన్నీ నామీదకి రుద్దడానికి నేను అమ్మమ్మని, అమ్మని కాదు అంటూ పురుషాహంకార పితృస్వామ్య ప్యూడల్ భావాలని తనపై రుద్దకుండా ఎదురుతిరుగుతుంది. ఈ ముగ్గురూ కూడా వాళ్ళ జీవితాల్లో అణ చివేతని భరిస్తూనే తన కూతురికి  తనలాంటి ఇరుకు జీవితం ఉండకూడదని భర్తతో పోరాడి  పిల్లలకి ఆసరాగా నిలుస్తారు. నాలుగో తరం వచ్చేసరికి కాస్త స్వేచ్చ స్వాతంత్ర్యం,చదువు, ఉద్యోగాలు, మనసుకి నచ్చినవాడిని పెళ్లి చేసుకునే దైర్యం వచ్చిన్దనుకున్న దశలో ఓ నీలికళ్ళ తెల్ల మనిషి భుజానికి ఒక సంచీ తగిలించుకుని వచ్చి రక రకాల వస్తువులు పరిచయం చేసి తర్వాత   సంచీ దులిపేసుకుని వెళ్ళడం లాంటి విషయాన్ని కథా గమనంలో అలఓకగా జొప్పించి మెప్పించిన తీరు ప్రశంశనీయం.


"గాంధారి రాగం" కథలో  మేథమేటిక్స్ లో కాలేజ్ ఫస్ట్ ,యూనివర్సిటీలో ఫోర్త్ ర్యాంక్, గర్ల్స్ స్టేట్ షెటిల్ చాంపియన్ , విదేశీ యువతితో ఇంగ్లీష్ లో చక్కటి సంభాషణ చేయగల్గిన సరస్వతి తనకన్నా తక్కువ చదువుకున్న భర్త సుబ్బారావు చాటున భాద్యత గల్గిన గృహిణిగా పిల్లలని పెంచుకుంటూ అతనికి కావాల్సినవి అందించుకుంటూ ఇంటెడు పనిముట్లుమధ్య ఒక మానవ పనిముట్టుగా షడ్రుచులశాకపాకాల  మధ్య పరిగెత్తుతూ పదిహేడేళ్ళు గడిపేస్తుంది.  గుండె రాగం తెలియనిభర్త,  గుండె రగిలించే రాగం పాడుతూ,  తనతో గాంధారి రాగం పాడిస్తున్నవాడికి తనేమిటో మర్చిపోలేదని నిరూపిస్తూ  కొడుక్కి కఠినమైన లెక్కచేసి పెడుతుంది.  కూతురు గీతకి షటిల్ ఇలా పట్టుకోవాలి, సర్వీస్ ఇలా చేయాలి అంటూ నేర్పుతుంది . ఆశ్చర్యపోతున్న కూతురిని చూస్తూ రేపటి నుంచి నేను ఆడతాను అంటుంది.  స్త్రీ సహజ తెలివితేటలని,ప్రతిభా పాండిత్యాన్ని బయటపడనీయకుండా గృహిణిగా పరిమితం చేసి తమ పాదాల క్రింద అణిచివేసిన పురుషుల  తీరుకి అద్దం  పట్టిన కథ  ఇది.


నలబై కోట్ల స్త్రీలున్న భారత దేశంలో ఓ ఇరవయ్యి మంది ప్రపంచస్థాయిలో ప్రతిభా మూర్తులుగా వెలిగిపోతుండగా వారిని చూసుకునే మురిసిపోతూ ఒకప్రక్క, ఆడపిల్ల పుట్టడమే శాపంగా భావించే   కోట్ల మంది మూర్ఖులు ఒకప్రక్క, తండ్రి చనిపోవడం మూలంగా ఆగిన  చదువు  అన్నావదిన నీడన నలబయ్యి ఏళ్ళు వచ్చేదాకా పనిమనిషిగా ఉండి గతిలేక తనకన్నాచాలా పెద్ద వాడైన సుందరాన్ని పెళ్ళాడుతుంది. తన కడుపునా ఒక బిడ్డ పుడతాడని ఆశపడుతుంది.  గోమతిని వంటింటికి పడక గదికి మాత్రమే  పరిమితం తప్ప ఈ వయస్సులో బిడ్డ ని కనడం నామోషీ  అని భావించి   మత్తు మందు ఇచ్చి మోసంచేసి గర్భస్రావం చేయించి రహస్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్  చేయించుకున్న సుందరరావు లాంటి పురుషునికి  గుణపాఠం చెప్పడానికి, ,ఆరోగ్యం నాశనమై పోతున్నా కొడుకుని కనాల్సిందే లేకపోతే ఒదిలేస్తాననే పూచిక భర్తకి బుద్ది  చెప్పాలని, పురుషుల అన్యాయాలకి బలైపోతున్న తనలాంటి వారందరినీ పోగేసి వారికి బుద్ది  చెప్పాలనే ప్రయత్నంలో, సాదు స్వభావులుగా ఉన్న స్త్రీ కూడా తిరగబడటం అనేది గొప్ప మలుపు ఉన్న   "గోవు" అనే కథ ఇది. అందరిని  తప్పక ఆకట్టుకుంటుంది. 

తల్లి చనిపోయిన కొన్నేళ్ళకి   తండ్రి పెళ్లి చేసుకుంటే అందుకు మనసులోనే వ్యతిరేకించి ఉన్న ఇంటిని ఆమెకే వ్రాసేసాడని ఆలోచన చేసిన రోష్ని తండ్రి ఆ ఇల్లు ఆమెకి వ్రాయకుండా రెండో పెళ్లి చేసుకోవడానికి ముందే తనకి అన్నయ్యకి   వ్రాసేసాడని తెలుసుకుని పశ్చాతాపబడుతుంది. ఆ ఇల్లు మీకే వ్రాసినట్లు ముందు మీకు తెలిసుంటే వృద్దాప్యంలో మీ బదులు ఆయనకీ సేవ చేసే మనిషి దొరికిందని  సంతోషించేవాళ్ళు మీరంతా ఆవిడని చీదరించుకునే వాళ్ళు కాదు అంటాడు రోష్ని భర్త. వృద్దాప్యంలో భార్య వియోగం తర్వాత పెళ్లి చేసుకుంటూ కూడా ఉన్న ఆస్తులని మొదటి భార్య బిడ్డలకి రాసేసి ఇంకొకామెకి అన్యాయం చేసినా ఒకింత ఆమెని పట్టించుకున్న  రామారావు పాత్ర, హుందాగా ప్రవర్తించిన శేషు పాత్ర మలి వివాహాలపట్ల కొంత గౌరవభావం కల్గిస్తూనే  బిడ్డల మనస్తత్వాన్ని ఎండగట్టే కథ. 

ఇలా ప్రతి కథ నర్మగర్భంగా కొన్ని చోట్లా, సూటీగా కొన్ని చోట్లా, వ్యంగంగా కొన్నిచోట్లా, ఆవేదనతో చాలా కథలని అనుభవిస్తాం. చదవడానికి కాసేపు విరామమిచ్చి చదివిన కథ గురించి ఆలోచిస్తాము. నేటి తరం స్త్రీల స్వేచ్చా స్వాతంత్ర్యాల వెనుక నిన్నటి తరంలో నలిగిపోయిన స్త్రీల మానసిక సంఘర్షణ, అస్తిత్వ వేదన అన్నీ ఈ కథల్లో  ఉన్నాయి . అందరూ తప్పక చదవవలసిన కథలు ఇవి .  చదివిన వాటిపట్ల స్పందిస్తూ చిన్నసమీక్ష వ్రాసుకున్నాను. ఇంకా కొన్ని వ్రాయలేక పోయాను. మళ్ళీ  తీరిక చూసుకుని తప్పకుండా వ్రాస్తాను . 


కొన్నాళ్ళ క్రిందట  సత్యవతి గారితో మాట్లాడుతున్నప్పుడు "పేరు లేని పిల్ల"  తర్వాత మీరేమీ వ్రాయలేదు ... వ్రాయండి సత్యవతి గారూ...  అని అడిగాను అభ్యర్ధనగా !

ఇంకానా .... ఇంకేమి వ్రాస్తానండీ బాబూ ! అన్నారు .

నిజంగానే ఇన్ని కథలు వ్రాయడానికి ఎన్ని అహోరాత్రాలు ఆలోచించి ఉంటారు . ఆ ఆలోచనలని కాగితంపై పెట్టడానికి ఎన్ని గంటలు శ్రమించి ఉంటారు ? గృహిణిగా, ఉద్యోగినిగా అన్ని భాద్యతల మధ్య రచనలు చేయడమన్నది ఇంకో పెద్ద భాద్యతగా భావించి  తపస్సుగా మార్చుకుని ఇన్నికథలు అందించారు. మొదటి చూపులోనే ఆకర్షణలో పడిపోయి అదే ప్రేమ అనుకుని పొరబడి పెళ్లి చేసుకుని విడిపోయి విడాకులకి వెళ్ళిపోయి స్వేచ్చగా బ్రతకడమే స్త్రీవాదం అని భావించే కథలు వస్తున్న కాలంలోనే నిజంగా స్త్రీలు అనుభవిస్తున్న బాధలు ఇవి .. వీటికి పరిష్కారం ఏమిటీ ..ఏమి చేయాలి అని ఆలోచింపజేసే కథలు ఇవి. ఇలాంటి కథలు వ్రాసిన సత్యవతి గారికి మనఃపూర్వక అభినందనలు,ధన్యవాదాలు చెపుతూ ... 



        


    

12, మార్చి 2016, శనివారం

ఒకే ఒక జీవితం

కొన్నాళ్ళ క్రిందటిమాట.

నా కొడుకు నాతో మాట్లాడుతూ ...  అమ్మా ! నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాకింగ్ కి వెళతావో, ప్రతి ఆరు నెలలకి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటావో, ఆహార విహారాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావో కానీ ... నువ్వింకా ముప్పై యేళ్ళు  బ్రతకాలి.

కొన్ని క్షణాలు మౌనంగా నేను. తర్వాత నవ్వేసి  "అంతా మనిష్టమేనా ఏమిటీ !? అంతా ఈశ్వర కృప"  అన్నాను.

"ఏమోనమ్మా .. నాకవన్నీ తెలియదు. కనీసం ఇంకో ముప్పై యేళ్ళైనా నువ్వు నాకుండాలి. అదంతే ! "

" ముప్పై యేళ్ళు అనే షరతు ఏమిటో ... ? " మందస్మితంతో నా ప్రశ్న.

"నా పిల్లలు నా అంత అయ్యేవరకూ ...  నువ్వు నాకు అండగా ఉండాలమ్మా ! "

లోలోపల తడిసిపోతున్నాను.   నా  సమాధానం వెళ్ళలేదు.

" నా పిల్లలని నువ్వు పెంచాలమ్మా ! నీలా నేను పెంచలేనేమోనని నాకు భయం " అన్నాడు.

అప్పటికి  ఆలు లేదు చూలు లేదు. కానీ అబ్బాయి  మనసులో కోరిక  అది.

అప్పుడు మనసులో నేననుకున్నాను "ఇప్పటికే నేను అలసిపోయాను నాన్నా ! నేను చేయాలనుకున్నవి కొన్ని మిగిలిపోయాయి. ముఖ్యంగా చాలా చదువుకోవాలి ,  ముందు ముందు ఇంకా నా పై బరువు,భాధ్యత వేయదల్చావా ... బంగారం " అని. వ్యక్తిగా నాకంటూ కొన్ని ఆశలు,ఆశయాలు ఉన్నాయి. అవి ఇంకా నెరవేరలేదు. నన్ను స్వేచ్ఛగా మెసలనీయవా ...నాన్నా !  అని మనసులో అనుకున్నాను కానీ బయటకి అనలేదు.

తర్వాత అబ్బాయి పెళ్లి జరిగింది. మనుమడో,మనుమరాలి కోసమో ఎదురుచూపు.

"కడఊపిరి విడిచేవరకు
కంటి పాపను కనురెప్పకాపాడినట్లు
బిడ్డకు అండ కావాలనే ఈ అమ్మ ఆశ"

ఈ మాటని నేనెప్పుడూ విస్మరించలేను.

ఇప్పుడు నా కొడుకున్న  వయసులో నేనున్నప్పుడు ...

నా ఆత్మాభిమానం దెబ్బతిన్న సందర్భాలలో నా ధిక్కార స్వరాన్ని నా వాళ్ళందరూ విన్నారు. భయపడ్డారు, బాధపడ్డారు. ఒకోసారి అండగా ఉండేవాళ్ళు, ఇంకోసారి విమర్శించేవాళ్ళు. అయినా నేను క్రుంగి పోలేదు, సడలిపోలేదు. ఒకానొకదశలో తీవ్ర మానసిక వేదనలో, శరీర అనారోగ్యంతో  పోరాడాను .  నేను నిలబడాలి, నా కొడుకుని నిలబెట్టుకోవాలి. అదే  నా బలమైన ఆకాంక్ష. ఆ ఆకాంక్ష తోనే ... బిడ్డని వీపున కట్టుకుని శత్రువులతో పోరాడిన ఝాన్సీ లక్ష్మి భాయిలా ... నా వాళ్ళతోటి, సమాజం తోటి పోరాటం చేసాను. ఎన్నో కష్టాలు,ఆర్ధిక నష్టాలు, రాళ్ళు, ముళ్ళు, పూలూ ... అన్నీ తెలుసు నాకు. అలాంటి అమ్మని నేను ... ఇంకా వ్యక్తిననే సృహ నాకెందుకు ? అమ్మగా అంకితమయ్యాననే సంతృప్తి చాలు కదా !

నా కొడుక్కి కూడా ... అదే చెప్పాలనిపించింది. జీవితమంటే .. పూలే కాదు ముళ్ళు కూడా అని.

వ్యక్తి స్వేచ్చ కుటుంబంతో ముడిపడినప్పుడే  అది సొబగుగా ఉంటుంది. సార్వజనీయత లభిస్తుంది. స్వేచ్చంటే రెక్కలు విరిగేదాకా ఎగరడంకాదు. ఆత్మస్వేచ్చ, ఎవరికీ లోబడని, ఎవరూ నియంత్రించలేని మానసిక స్వేచ్చ. స్వేచ్చంటే  స్వీయ నియంత్రణతో కూడిన ఇంగిత జ్ఞానం కూడా !

ఇదంతా ఎందుకంటే ... స్వగతం అక్షరమై ఇలా బయటపడింది ఈ వేళ.
నా గురించి నేను ... చెప్పుకుంటున్నాను ఇలా ! నా కొడుకు తన పిల్లలు తనంతయ్యేవరకు అమ్మ అండగా ఉండాలని కోరుకున్నందుకు ముచ్చటపడుతూ .. ఈ ముచ్చట చెపుతున్నాను.

నేను ఏ కథ వ్రాసినా ..ప్రతి కథ ఈమె కథే అనుకుంటూ ఆసక్తిగా చదివేసి ... నాదగ్గరున్న చనువుతో అడిగేసే  కొందరు... చిరునవ్వు నవ్వేసి నేను ... ప్రతి కథ నాదే అయితే ... నాకెన్ని జీవితాలు ఉండాలబ్బా..  అని ఆశ్చర్యపోతూ నేనూ.  ఉన్న ఒక జీవితమే వేగలేక చచ్చిపోతున్నాను అని నిట్టూరుస్తూ కూడా నేనే !.
రెండు కథల్లో అచ్చంగా నేనే దొరుకుతాను. కొన్ని కవితలలో నేనూ దొరుకుతాను. అదండీ సంగతీ !

నాకున్న పరిధిలో విజయవంతంగా ఉన్నాను. వివాహ వైఫల్య నడి సముద్రం నుండి బయటకి ఈది ఒంటరి మహిళ గా పోరాటం జేసి .. కుటుంబాన్ని గెలిపించుకున్న స్త్రీ ని నేను. నేను ఒంటరి మహిళ ని అని చెప్పుకోవడానికి సిగ్గుపడను. ఎందుకంటే సవాళ్ళని స్వీకరించగల్గే మనోధైర్యాన్ని భగవంతుడు నాకిచ్చినందుకు నేనెప్పుడూ గర్వపడతాను.  భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నా మనసు చెప్పిందే చేస్తాను.  ఒకే ఒక జీవితం ఇది.

మా అమ్మ నాకు జన్మనిచ్చి  ఖచ్చితంగా 49 సంవత్సరాలు అయినందుకూ ... అమ్మని తల్చుకుంటూ

అమ్మకి - బిడ్డకి మధ్య ...  నేనిలా కరిగిపోతూ ... 50 వ ఒడిలో అడుగిడిన సందర్భంలో ...  మెయిల్ ద్వారా నాకు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నెచ్చెలి భారతి  గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ...
పుట్టినరోజు శుభాకాంక్షలు  Vanaja ! అంటూ ... నాకు శుభాకాంక్షలు అందించిన  నా స్నేహిత "Google " కి ధన్యవాదాలతో ... వనజ.






5, మార్చి 2016, శనివారం

పలుచన కానీయకే చెలీ

సురేష్  సెలవు రోజు ఉదయం   రెండు రకాల టిఫిన్ లని  ఆరగించి  రెండవ సారి కాఫీ  రుచిని ఆస్వాదించి కాసేపు  పేపర్ ని  మరి కాసేపు టీవి కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తున్న సమయంలో కాలింగ్ బెల్ మ్రోగింది.

"ఏమండీ.. ఎవరో వచ్చినట్లు ఉన్నారు. కాస్త అటు వెళ్లి చూడరా.. అంది లక్ష్మి  .

బద్దకంగా లేచి డోర్ తీసాడు . లక్ష్మి స్నేహితురాలు వేణి  నిలబడి ఉంది.

"రండి రండి " అంటూ ఆహ్వానించాడు. "ఈమె వచ్చింది అంటే.. చాలా విషయాలే తెలుస్తాయి. కాస్త టైం పాస్ అవుతుంది కూడా అనుకున్నాడు" సురేష్.

"లక్ష్మీ ..వేణి గారు వచ్చారు." అంటూ చెప్పాడు.

"వేణీ..  నీకు ఎదురొచ్చి ఆహ్వానం పలుకలేను కాని ఇటు వంటింటి వైపు రా"అని పిలిచింది లక్ష్మి

"ఏం చేస్తున్నావు"అంటూ వచ్చింది.

ఇదిగో.. నాన్వెజ్ ఐటమ్స్  చేస్తూ.. బిజీగా ఉన్నానే! ఇవాళే కదా కాస్త రుచికరంగా మనసు పెట్టి చేసుకోగలం.  నీకప్పుడే  ఇంట్లో పని ఆంతా అయిపోయిందా ఏమిటీ? " .

"అసలు నేను పనేమీ అంటుకోలేదు. పిల్లలని తీసుకుని ఆయన వాళ్ళింటికి వెళ్ళారు. ఇక రాత్రికే రావడం,అందుకే నిన్ను చూసినట్టు ఉంటుందని  ఇటు వైపు వచ్చాను" 

"అందరూ  వెళ్ళారు కదా.. నువ్వు వెళితే బాగుండేది.. ఒక్కరోజన్నా అందరు కలసి  ఉన్న తృప్తి కలిగేది పెద్దవాళ్ళకి "

"అబ్బ..  అక్కడికి వెళ్ళాలంటేనే బోర్ లక్ష్మి.  కోడలిగా ఆ ఇంటికి వెళ్లి అక్కడ వంట ఇంట్లోకి వెళ్లి పడి పడి నానారకాలు వండి వడ్డించలేను. ఆరోగ్యం బాగోలేదని సాకు చెప్పి తప్పించుకున్నాను"

 ఇలా అంటున్నాని ఏమీ అనుకోవద్దు.. నెలకి ఒకసారి అయినా అలా అందరు కలిస్తే బాగుంటుంది కదా! పైగా ప్రతి ఆదివారం. మీ ఆయన,పిల్లలు అక్కడకి వెళితే.. వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టాలని మీ అత్తయ్యగారు హైరానా పడటం,పెద్దవయసులో ఆవిడని ఇబ్బంది పెట్టడం బావుండదేమో..ఒక సారి ఆలోచించు"

"మనుమడు,మనుమరాలకి  ముద్దుమురిపెంగా ఆ మాత్రం వండిపెట్టలేరా ఏమిటి? వాళ్ళ పాట్లేవో వాళ్ళే పడతారు నేనంత సున్నితంగా ఆలోచించలేను " మై లైఫ్ మై వే .. దట్సాల్ అంతే ! " తేలికగా చెప్పి సరేలే.. ఆ ముచ్చట్లు  ఎందుకు గాని..కాస్త టీ పెట్టవే.. తలనొప్పిగా ఉంది"  అంది.

"ఇదిగో..ఇప్పుడే టీ చేసి తీసుకుని వస్తాను. నువ్వు వెళ్లి ..హాల్లో..కూర్చో. సురేష్ ఉన్నారు నీకు మాటలకి మంచి కంపెనీ"అని వేణి ని అవతలకి పంపి.. చేతిలో పని ప్రక్కన పడేసి.. టీ తయారీలో చేయి పెట్టింది.

కాసేపటికి టీ కప్పులు  తీసుకుని వచ్చేటప్పటికి సురేష్,వేణి మంచి కబుర్లు లో ఉన్నారు.

ఇంతకీ.."కాలాతీత వ్యక్తులు" హీరోయిన్ ఇందిర కాదంటారా..? కల్యాణి  యే అని ఈ వ్యాస రచయిత అభిప్రాయం తో ఏకీభవిస్తున్నారా? అంటుంది వేణి.

"నేను ఏకీభవించడం కాదండీ! పాఠకులు  అందరు ఏకీభవించాలి కదా!" అంటున్నాడు సురేష్.

రాక్ లో ఉన్న బుక్స్ అన్నీ సోఫాలోకి వచ్చి చేరాయి. వీళ్ళిద్దరకి అప్పుడప్పుడు సాహిత్యం  విషయంలో  అలా చర్చలు జరుగుతూనే  ఉంటాయి.

టీ ఇచ్చేసి మళ్ళీ వంట పనిలో మునిగిపోయింది కానీ చాలా చిరాకుగా ఉంది లక్ష్మికి.

వేణి తనకి  స్నేహితురాలే!  ఒకే ఊరు. చిన్నప్పటి నుండీ స్నేహితురాలే ! కొంచెం నిర్లక్ష్యంగా, స్వార్ధంగా ఉంటుందన్న మాటే కాని స్నేహపాత్రురాలే! కాకపొతే.. మా ఇంటికి వస్తూ ఏం తెస్తావు..మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అని అడిగే రకం.

పుస్తకాలు,పేపర్ లు గట్రా బాగా చదువుతుంది కాబట్టి  మగవాళ్ళు అందరితో..అన్ని విషయాలు తర్కిస్తుంది. అందంగా లేకపోయినా ఆకర్షణీయంగా అలంకరించుకుంటుంది. మగవాళ్ళు అందరూ దీపం చుట్టూ శలభంలా తిరిగినట్టు  ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటారు. వేణి తో ఎక్కువసేపు మాట్లాడాలని ఆమె దృష్టిలో తామూ   పడాలనుకుని ఆసక్తి లేకపోయినా రక రకాల పత్రికలూ,నవలలు కొని అక్కడక్కడా చదివి అంతా చదివేసి జీర్ణం చేసేసుకుని ఆ రచనలని స్వీయానుభవం చేసేసుకున్నట్లు మాట్లాడే వాళ్ళు ఉంటారు.  అలాంటి  వాళ్ళతో మాట్లాడినంత సేపు మాట్లాడి తర్వాత వాళ్ళ మాటల గురించి  ఎక్కెసంగా తనతో చెపుతూ పడీ పడీ నవ్వడం తెలుసు. అదొక సరదా వేణికి . 

"ఇష్టం లేనప్పుడు మాట్లాడటం ఎందుకే ! తర్వాత తాటాకులు కట్టడం ఎందుకు ? బిజీ గా ఉన్నానని ఒక్క మాట చెప్పి కట్ చేసుకోవచ్చుగా అంటే .అందులో  ఎంత వినోదం ఉందొ నీకేం తెలుసు ? వాళ్ళు మాత్రం  ఆడవాళ్ళతో మాట్లాడాలని తాపత్రయ పడేది ఆ వినోదం కోసం కాదు"  అని నవ్వేస్తుంది. 


ఖాళీ కప్పులు తీసుకు రావాలని హాల్లోకి వెళ్ళిన లక్ష్మిని  "నా కోసం స్పెషల్ ఏమి చేస్తున్నావ్ ? పూర్ణాలు చేయి లక్ష్మి. నువ్వు చేసిన పూర్ణాలు చాలా బాగుంటాయి . వేడి వేడి పూర్ణాలకి గుంట పెట్టి నెయ్యేసుకుని తింటే ఎంత బాగుంటాయి. అంది అభినయిస్తూ . "ఇంకొసారి చేస్తానులే  శెనగపప్పు కొంచమే ఉంది ఇంట్లో"  

"నీ స్నేహితురాలు అడుగుతుందిగా . శ్రమ అనుకోకుండా చేసేసేయ్   కిరాణా షాపుకి నేనెళ్ళొస్తా! "అంటూ సురేష్ చెప్పుల్లో కాళ్ళు దూర్చాడు. 


"పూత పిండి మైదా వద్దు . బియ్యం మినప పప్పు నానపెడదాం పద " అంటూ సాయం చేసేదానిలాగా లేచింది వేణి. 

ఆదివారం మధ్యాహ్నం కాస్త నడుం వాల్చుదాం అనుకుంటే ఇలా వంటిల్లుకి బందీ అయిపోవాల్సి వస్తుంది అని మనసులో తిట్టుకుంటూ ..  ప్రిజ్ద్ లో నుండి బెల్లం తీసి బయటపడేసి కొబ్బరి తురిమే పనిలో పడింది  . సురేష్ షాప్ నుండి వచ్చేదాకా లక్ష్మితో  కబుర్లు చెప్పి తర్వాత లేచి వెళ్ళిపోయింది. భోజన సమయంలో నాన్ వెజ్ ఎక్కువ తినను ... తినను అంటూనే చేసిన వాటిలో సగభాగం తినేసింది. రాత్రికి పిల్లకి కూడా చారుమెతుకులే పెట్టాలి లేదా మళ్ళీ కూరలు చేసుకోవాలి అనుకుంది లక్ష్మి. భోజనం చేసాక ఇంటిముందున్న తోటపై పడింది వేణి కన్ను. ప్రొద్దున్నే పూజకి పూవులు దొరకడంలేదు అంటూ  విరగబూసిన చేమంతులని చొరవగా తుంచేసుకుంది. గులాబీలని, మర్నాడిచ్చే మందారు మొగ్గల్ని కూడా వదలకుండా కోసేసి వడిలో వేసింది.  మా కుండీలలో ఈ మొక్కలేదు . ఆ .. అంటులేదు అంటూ రకరకాలు  సేకరించింది. "ముంగిట ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుందని పూల మొక్కలని పెంచుకుంటే ... ఆ పూలన్నీ అలా తుంచేస్తావేమిటే"  కసురుకుంది . 


"ఇదిగో లక్ష్మి .. దేవుడి పూజకి పూలు కోసుకుంటుంటే వద్దంటున్నావ్ నీకు పాపం తగుల్తుంది జాగ్రత్త "అంటూ ..బెదిరించింది. పదిళ్ళకి సరిపోయే మునక్కాయల్ని కొట్టించుకుని సంచీలో పెట్టుకుంది బోసిపోయిన మొక్కలని చూసి మనసు బాధపడింది లక్ష్మి కి. సాయంత్రం  టీ  కి ముందు ఉల్లిపాయ పకోడీ, రాత్రి ఏడుగంటలప్పుడు వేడి వేడి పూర్ణాలు తిన్నన్ని తినేసి నేను ఒక్కదాన్నే తిన్నాననే  గిల్టీ ఫీలింగ్  కల్గుతుంది పిల్లలకి వారికి కూడా పెట్టవే అని బాక్స్ లోకి సర్దుకుంది . చీకటి పడింది నడిచేమి వెళతాను ఇటువైపు ఆటో లేవీ కూడా రావు బస్ స్టాప్ లో డ్రాప్ చేస్తారా అంటూ సురేష్ ని అడిగింది. అలాగేనంటూ బండి తీసాడు . అతని వెనుక ఎక్కి కూర్చుని చొరవగా భుజం మీద చెయ్యేసింది. గతుక్కుమంది లక్ష్మి మనసు. వేణీ  కుడి చేతికి ప్రతాప్ అన్నయ్య గిఫ్ట్ గా  అమెరికా నుండి  పంపిన ఖరీదైన రిస్ట్ వాచీ. 


సురేష్ ఇంటికి రాగానే "వేణీ చేతికి  ఆ వాచీ  ఎలా వెళ్ళింది? " అని అడిగింది. "ఆమె నన్ను అడిగింది నువ్వెలాగూ పట్టుకోవడం లేదుగా ఆమెకి  బాగా నచ్చిందందని  ఇచ్చేశాను" అన్నాడు. 


"అడిగిందని, నచ్చిందందని ఏది అడిగినా ఇచ్చేస్తారా మీరు !?  నా వస్తువు కదా  నన్నడగాల్సిన అవసరం ఉందని మీ ఇద్దరికీ అనిపించలేదా ? "  కోపంగా అడిగింది.  సురేష్ మౌనం వహించాడు. 


వేణీ  ఉద్యోగం చేసే అవసరం ఉన్నాకూడా  ఉద్యోగం చేయదు. అలా అని తన సరదాలు ఏమీ మానుకోదు. నగల దగ్గరనుండి పుస్తకాల వరకు చనువుగా అడిగి పుచ్చుకుని  తీసుకెళుతుంది.  లక్ష్మికి  అలా ఇష్టం ఉండదు. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఉద్యోగప్రయత్నం చేసింది. తను పనిచేసే ఆఫీస్ లోనే ఉద్యోగం రావడం వల్ల ఉద్యగం చేయడానికి తేలికగానే ఒప్పుకున్నాడు సురేష్.  ఇద్దరూ  ఉద్యోగం చేస్తుండబట్టి  ఆర్ధికంగా  వేణీ కన్నా మెరుగైన  పరిస్థితి లో ఉండి సొంత ఇల్లు,కారు అమర్చుకున్నారు. "నీకేం తక్కువ ? అందమైన భర్త, చక్కగా చదువుకునే పిల్లలు, సొంత ఇల్లు ,ఉద్యోగం అన్నీ ఉన్నాయి ' నాకే అన్ని అత్తెసరు దక్కాయి . దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి" అంటుంది. యధాలాపంగా అంటూ ఉండే మాటల్లో  ఈర్ష్య ధ్వనిస్తూ ఉంటుందని లక్ష్మికి అర్ధమైంది.  


లక్ష్మికి పదే పదే సురేష్ భుజంపై చొరవగా చేయెసి కూర్చున్న వేణి, ఆమె చేతికి ఉన్న వాచీ కళ్ళల్లో మెదులుతున్నాయి. ఈ వేణి స్నేహానికి ముగింపు ఇచ్చేయాలి. జాగ్రత్త పడాలి  అనుకుంది బలంగా.  


అప్పుడప్పుడూ .. వేణి  సురేష్ కి రింగ్ ఇవ్వడం గమనించింది.   లక్ష్మి గమనించినప్పుడల్లా   మీ ఫ్రెండ్  ఎందుకో మిస్సుడ్ కాల్  చేసింది. బాలెన్స్ లేదేమో ..  నువ్వు ఫోన్ చేసి మాట్లాడు అని ఫోన్  తీసుకొచ్చి  ఇచ్చేవాడు. 

"ఆమెప్పుడూ అంతే ! చాలా పిసినారి. అంతగా అవసరమైతే తనే తర్వాత ఫోన్  చేస్తుంది లే ! "అని నిర్లక్ష్యంగా ఊరుకొనేది. 


సురేష్ రహస్యంగా వేణి తో మాట్లాడుతున్నది గమనిస్తూనే ఉంది లక్ష్మి.  ఆమె ఆకర్షణలో పడిపోయాడు. తనలో లేని అందం,  పరిశీలనా శక్తి , అవగాహన  ఆమెకి ఉన్నాయని చాలా సార్లు  మెచ్చుకున్నాడు కూడా ! పరాయి ఆడవాళ్ళ పట్ల భర్త చూపే ఆసక్తులు తక్కువేమీ కాదని తెలుసు లక్ష్మి కి.  తెలిసి తెలిసి మూడో మనిషిని తమ మధ్యకి రానివ్వదలచుకోలేదు. 


మరుసటి ఆదివారం ఉదయాన్నే వేణి కి కాల్ చేసింది లక్ష్మి. "ఇంట్లో ఉన్నావా ? సాయంత్రం మీ ఇంటి వైపు వస్తున్నాం " అని.  

"లేదు లక్ష్మి .. అందరం కలసి నిన్న సాయంత్రమే అమ్మ వాళ్ళింటికి వచ్చాం " 

"సరేలే .. ఇంకెప్పుడైనా వస్తాను" అని పెట్టేసింది. 

సాయంత్రం ఆరింటప్పుడు లక్ష్మి, సురేష్, పిల్లలిద్దరూ కలసి కళాక్షేత్రం కి వెళుతూ .. "వేణి వాళ్ళింటికి వెళదాం సురేష్ " అంది. 

"వాళ్ళు ఊళ్ళో లేరు కదా .. తెలిసి ఎందుకు వెళ్ళడం ? " పిచ్చా నీకు అన్నట్టు చూస్తూ అన్నాడు . 

"లేదు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు.  వేణి కావాలనే అబద్దం చెప్పింది. కావాలంటే  మీకు నిరూపిస్తాను పదండి" అంది. ఒకవైపు పిల్లలు అవి గమనిసున్నారనే సిగ్గు కల్గింది లక్ష్మికి . 

భర్తని,పిల్లలని  కార్లోనే ఉండమని తనొక్కతే వేణి ఇంటికి వెళ్లి బెల్ కొట్టింది లక్ష్మి. తలుపు తీసిన వేణి ముఖం రంగులు మారిపోయింది. హడావిడిగా మర్యాదలు చేస్తూ ..ఇప్పుడే ఊరినుండి వచ్చాం . అంది.   


కళా క్షేత్రంలో జరిగే  "పాడుతా తీయగా " పాటల రికార్డింగ్ కార్యక్రమానికి  ఫ్రీ పాసులు వచ్చాయి. నా కొలీగ్  తెచ్చిచ్చారు, వాళ్ళమ్మాయి  పాటలు పాడేవాళ్ళలో ఉందని. నీకు అలాంటి కార్యక్రమాలంటే ఇష్టం కదా .. కళాక్షేత్రం మీ ఇంటికి దగ్గరే ఉంది, నేను  మీ ఇంటికి వచ్చినట్టూ ఉంటుంది. పిల్లలని, నిన్ను ఆ ప్రోగ్రాం చూడటానికి తీసుకెళ్ళినట్టూ  ఉంటుందనుకుని కాల్ చేసాను.  నువ్వేమో ఇంట్లో లేనని అబద్దం ఆడావు కదా 


"అబద్దమా ! నాకేం అవసరం అలా చెప్పడం , నిజంగా ఊరెళ్ళాము లక్ష్మీ ! " 


ప్రొద్దున్నే నీతో మాట్లాడాక  మా అమ్మతో  మాట్లాడాను . ప్రక్కనే మీ అమ్మ కూడా ఉంది.  నాతో  మాట్లాడింది కూడా ! మీరెళ్ళినట్లు ఏమీ చెప్పలేదు. పైగా పండక్కి  చీర కొనిపెట్టలేదని నువ్వు అలిగావని, ఫోన్ కూడా చేయడం లేదని బాధపడింది. ధాన్యం డబ్బులు వచ్చాక ఇస్తాను నువ్వెళ్ళి ఓ  రెండువేలు వేణి కి ఇచ్చి రామ్మా!  అని చెప్పింది. 

"..... "


ఇవిగో రెండు వేలు. నీకు ఇద్దామనే వచ్చాను తప్ప నీలా ఏదో ఒక ప్రయోజనం ఆశించి,వినోదం ఆశించి మీ ఇంటికి రాలేదు. స్నేహాలని, బంధాలని  మరీ అంత చులకన చేయకు వేణీ !  అది నీకు మంచిది కాదు, ఎవరికీ మంచిది కాదు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా చప్పున బయటకి వచ్చేసింది లక్ష్మి.    

   

(అనుపమ మహిళా మాస పత్రిక మార్చి 2016 సంచికలో ప్రచురితం )

4, మార్చి 2016, శుక్రవారం

బేగంపేట ప్యాలెస్ ప్రక్కన

చినుకు 2016 మార్చి సంచికలో వచ్చిన నేను వ్రాసిన  కథ


బేగంపేట ప్యాలెస్ ప్రక్కన 

రేపటి ప్రయాణం గురించి తలచుకుంటూ కళ్ళు మూసుకున్నానే కానీ నిద్ర రావడం లేదు . చెప్పలేనంత అలజడి గా ఉంది . "అమ్మా ! నువ్వు నా ప్రక్కన లేకుంటే  రిజల్ట్స్ అన్నీ నెగిటివ్ గానే ఉంటున్నాయి . వీసా స్టాంపింగ్ కి వెళ్ళేటప్పుడు  నువ్వు రా ! " అని బిడ్డ అడిగితే వెళ్ళకుండా ఎలా  ఉండగలను? బాగా  అలిసిపోయి ఉన్నా సరే ఓపిక చేసుకుని వెళ్ళాలి కదా !  ఆలోచనలతోనే ఓ రెండు గంటలు అటు ఇటు దొర్లి మూడున్నరకల్లా లేచి రెడీ అయిపోయి డ్రైవర్ కి కాల్ చేసా. అతను  లిఫ్ట్ చేయలేదు . మరొక సారి ట్రై చేసాను. మళ్ళీ అంతే !

అపుడు సమయం  నాలుగుగంటలవుతుంది. అతను నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేటప్పటికి అరగంటైనా పడుతుంది పది సార్లు కాల్ చేసినా తీయడు. కంగారేసి ప్రతి చిన్నపనికి, పెద్దపనికి కూడా సాయపడే  ప్రకాష్ కి కాల్ చేసి " . "అయ్యా ! ఆ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు .  ఈ రోజు అన్నయ్యకి వీసా ఇంటర్ వ్యూ .  హైదరాబాద్ వెళ్ళాలి కదా! నువ్వు వెళ్లి డ్రైవర్ని నిద్రలేపి  వెంటబెట్టుకుని  తీసుకునిరా !  .    

"అలాగేనమ్మా ! ఇప్పుడే వెళుతున్నాను"  అంటూ ఫోన్ పెట్టేసాడు . అయిదు నిమిషాల్లోనే  ప్రకాష్ నాకు కాల్ చేసి ... "అమ్మా ! నేను హైస్కూల్ దగ్గరలో ఉండి డ్రైవర్ కి  కాల్ చేస్తూనే ఉన్నాను .  నా ఫోన్ కూడా  తీయడం లేదమ్మా ! ఇల్లేమో నాకు తెలియదు, ఎప్పుడు దిగబెట్టడానికి వచ్చినా ఇక్కడే దిగిపోయేవాడు.  ఇప్పుడేం  చేద్దాం మరి ?

అన్నయ్యకి ఇంటర్ వ్యూ పదిన్నరకి .  ఇప్పుడు బయలుదేరినా నాలుగు గంటల సమయం  పడుతుంది.  కనీసం ఒకగంట ముందుగానయినా  అక్కడకి చేరుకోకపొతే ఎలా ? . నువ్వులాగే కాల్ చేస్తూనే ఉండు . ఈలోపు  ఎవరైనా డ్రైవర్ దొరుకుతాడేమో నేను ట్రై చేస్తానంటూనే నాకు తెలిసిన ఆల్టింగ్ కార్ డ్రైవర్స్ కి  కాల్ చేసా. పెళ్ళిళ్ళ సీజన్, వీసాల సీజన్ కాబట్టేమో  ఎవరూ ఖాళీగాలేమని సమాధానమిచ్చారు. ఇంతలోకి కోడలు వచ్చి "ఆంటీ నెయిల్  కట్టర్ కావాలంట " అంది. అసలే టెన్షన్ తో చస్తుంటే గోళ్ళు తీయడానికి వేళాపాళా  లేదా ?  ఇప్పుడు వెతికినా కనబడదు, కనబడినా ఇవ్వను "  కసిరినట్టు  అనేటప్పటికి పాపం... ఆపిల్ల బిక్క  ముఖం వేసుకుని వెళ్ళిపోయింది .  నేను మళ్ళీ డ్రైవర్ కి కాల్ చేయడంలో మునిగిపోయా. 

నా కొడుకొచ్చి "కూల్ గా ఉండమ్మా, ఎందుకంత కంగారుపడతావ్ !" భుజమ్మీద చేయేసి మృదువుగా అన్నాడు. అంతులేని కోపం ముంచుకొచ్చింది వాడి మీద. "నిప్పుల మీద నిలబడికూడా కూల్ గా మాట్లాడటం నావల్ల కాదు" అని విసురుగా వాడి చేయి తీసేసి   "మనమే నాలుగున్నరవరకు కూడా  రెడీ అవము. ఇంకాసేపు...అని మంచాలకి అతుక్కుని పడుకుంటే ఇలాగే ఉంటుంది " అంటూనే  .. వియ్యంకుడి గారికి ఫోన్ చేసి  "అన్నయ్య గారు.. మీ డ్రైవర్ ని పంపండి, లేదా ఎవరో ఒక డ్రైవర్ని అరేంజ్ చేయండి " అన్నాను. అరగంటైనా ఆయన నుండి  సమాధానం రాలేదు. బాధ్యత లేని మనుషులందరూ నాకెక్కడ దొరుకుతారో మనసులో విసుక్కుంటూ మళ్ళీ నేనే కాల్ చేసానాయనకి. 

" ఎవరూ దొరకలేదండీ ! మా డ్రైవర్ కుదరదన్నాడు " చెప్పాడాయన తీరికగా.  ఇంకేం చేద్దాం !? కార్  తీయమ్మా నువ్వే డ్రైవ్  చేద్దువు గాని, లేదా మీ నాన్నగారినైనా లేపు ఆయన తీసుకెళతారు" .

"అమ్మో !  ఈ రోడ్ ల పై  డ్రైవింగ్ నా వల్లకాదమ్మా !  నాన్నగారు కూడా వద్దు . అప్ అండ్ డౌన్ ఆయనవల్ల కూడా కాదు . ఇంకెవరన్నా దొరుకుతారేమో ట్రై చేద్దాం"

నేనెళ్ళి గాఢ నిద్రలో ఉన్న ఆయన్ని లేపితే విసుక్కుంటూ లేచి బయటకొచ్చి విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్లు  "మీ అమ్మకి వేరే డ్రైవర్ ఎవరూ దొరకనట్టు ఏరి ఏరి పెట్టింది. వాడొట్టి పెడసరం మనిషి. పోయినేడాది భార్య  చేత వార్డ్ మెంబర్ గా పోటీ చేయించాడు కూడా !  పదే పదే  లేబర్ యాక్ట్  అది, ఇది అని మాట్లాడతాడు . ఎవరిపైనో  తనని కులం పేరుతొ తిట్టి  అవమానించాడని ఎట్రాసిటి కేస్ కూడా పెట్టాడంట . అలాంటతన్ని ఎందుకు పెట్టుకున్నారు? అని భయంగా కొందరు   అమ్మో ! పదిహేను వేలా ! మళ్ళీ రోజు వారి బేటాలు కూడానా అని మరి కొందరు ఆశ్చర్య పోయారు. ఆడపెత్తనాలు ఇట్టాగే ఉంటాయి".  ఏదో ఒక ఒంకతో సాధించడమే పనిగా పెట్టుకున్నట్టుగా. అన్నారు

అంతలోనే   ప్రకాష్ కాల్ చేసి "అమ్మా ! పుల్ గా మందేసి పడుకున్నాడంట  చేయగా చేయగా వాళ్ళావిడ పోన్ తీసింది. ఇల్లెక్కడో చెపితే వెళ్ళిలేపాను, నేను నిద్రపోవాలి కదండీ అంటూ బద్దకంగా లేచాడు, బయలేదేరుతున్నాడులే!   నేను వెంటబెట్టుకుని వస్తున్నాను, కంగారు పడకు"  అన్నాక ఊపిరి పీల్చుకున్నా.

డ్రైవర్ వచ్చి మేము కారులో కూర్చునేటప్పటికి అయిదూ నలభై...  వాళ్ళింటికి వెళ్లి ఎక్కించుకురాకుండానే
 ఆలస్యమైపోతుందని  చెల్లి మా ఇంటి దాకా నడచి వచ్చేసింది. కారులో కూర్చుని "నాలుగు గంటలకి బయలదేరాలని చెపితే ఇప్పుడా బయలుదేరడం" అంటూ  డోర్ ని గట్టిగా వేస్తూ తనకోపాన్ని ప్రకటించింది డ్రైవర్ కి అర్ధంకావాలని .

" టైం కి చేరుకుంటాములే  పిన్నీ ! కంగారుపడకు సముదాయించాడు  నా కొడుకు . "

"అవునుమరి మనకి  హైదరాబాద్ రూట్స్ కొట్టిన పిండయ్యే మరి !" వ్యంగం ఆమె గొంతులో . 
ఎనిమిది అయ్యిందంటే  సిటీలో ఒకటే ట్రాఫిక్. ఆలస్యం అవుతుందేమోనని కంగారు. అయినా "ఇంత లేట్ చేసావేమిటి  రాంబాబు " అన్నాను . అతనేమి మాట్లాడలేదు . గంటకి నూట నలభై కిలోమీటర్ల వేగంతో  కారుని నడుపుతుంటే లోపల కూర్చున్న  నలుగురి చూపులు రెప్ప వాల్చ కుండా  భయంభయంగా  రోడ్డు వైపు చూస్తూనే ఉన్నాయి. 

సిటీలోకి ఎంటర్ అవగానే మొబైల్ లో నేవిగేషన్ పెట్టి డైరక్షన్స్ చెపుతూ ఉండగా ఎలాగైతేనేమి తొమ్మిది కన్నా...ముందుగానే బేగంపేట ప్యాలెస్  ఫంక్షన్ హాల్ ప్రక్కనున్న అమెరికన్ కాన్సులేట్ దగ్గరికి చేరుకొని  హమ్మయ్య అంటూ ఊపిరి  పీల్చుకున్నాం. ఎవరూ టిఫిన్ కాదు కదా కాఫీ ఊసు కూడా ఎత్తలేదు . డ్రైవర్ కి డబ్బిచ్చి  టిఫిన్ చేసి రమ్మని పంపి అందరం కలసి  అతని నిర్లక్ష్య ధోరణి గురించి వాపోయాము.
"అయినా అతనికి అంత పొగరేమిటమ్మా  !?" 
"అవును .. రోజు గడవకపోయినా దర్జాకేమి తక్కువలేదు . యజమానన్న గౌరవం లేదు, అతన్ని మనం  ఎంతగా గౌరవిస్తాం!? తాతయ్య కూడా డ్రైవర్ గారు అంటూ గౌరవంగా  పిలుస్తాడు. అతనేమో  మాటకి ముందు నువ్వు నువ్వు అంటాడు, అలా అంటుంటే నాకెంత కోపం వస్తుందో !  అని చెల్లి 
"మనింట్లో రెండు గ్లాస్ ల పద్దతీ లేదు . మనం టిఫిన్ చేస్తున్నప్పుడు  సమయానికతను వస్తే టిఫిన్ పెడతానా ఎంగిలి  ప్లేట్ తీసుకుని వెళ్లి  సింక్ లో పడేస్తాడు . నానమ్మ ఒకటే గొడవ . పని అమ్మాయి ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే  మనమే ఆ ప్లేట్   కడగాలి . అసలు నువ్వెందుకు  టిఫిన్, టీ  ఇచ్చి  అలా తయారు చేస్తావు అని.. ఆమె కాలంలో మనం లేము అప్పుడలా   ఉండేవాళ్ళు గానీ  ఇప్పుడందరూ  సమానమేనని చెప్పి ఆమెని ఒప్పించాలంటే తలప్రాణం తోక మీదకి వస్తుంది' అయినా  ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాను "

"గోపీచంద్ గారి డ్రైవర్ రవి రోజూ వచ్చి రాగానే కార్ శుభ్రం చేసుకుంటాడు . పిలవగానే వస్తాడు, ఎంత మర్యాదగా ఉంటాడని. వీడిలాంటి వాడిని ఎక్కడా చూడలేదు" చీదరించుకున్నట్టే అంది చెల్లి 

"అసలు డ్రైవరంటే  ఎంత వినయంగా ఉండాలి . డిక్కి డోర్  తీసుకుని మన సామాను మనమే పెట్టుకోవాలి,  మనమే తీసుకోవాలి.  మనం షాపింగ్కివెళ్లి బయటకోచ్చేసరికి ఇంజన్ ఆన్ చేసి ఎ.సి. వేసుకుని పడుకుని ఉంటాడు. మా డ్రైవర్స్ అలా ఉండరు. ఇతను  వేరేగా ఉన్నాడు" అంది కోడలు.

పోనీలే !  ధరలు మండిపోతున్నాయి అతనడిగినంత ఇస్తే మనకేమి తరిగిపోదులే  అనుకున్నాను ...కానీ ఇంత పొగరుబోతనుకోలేదు.  ఆత్మాభిమానానికి అహంకారానికి తేడా తెలియదతనికి .  అతనితో నిష్కర్షగా మాట్లాడాలన్న కూడా  భయమే !"మీలాగా మాకు చదువులు ఉన్నాయా !? పొలాలున్నాయా !? ఉద్యోగాలు ఉన్నాయా !" అంటాడు కానీ తన ప్రవర్తన బాగోలేదని తెలుసుకోడు . పిల్లలని  బాగా చదివించాలమ్మా అంటాడని  జీతం డబ్బులు ముందుగా ఇవ్వడంతో పాటు  పిల్లలకి ఫీజ్ కట్టుకోవడానికని అయిదు వేలు అదనంగా కూడా  ఇచ్చాను . అయినా చూడు ఎంత నిర్లక్ష్యమో !  నాక్కూడా కోపం వస్తుంది " 

దగ్గరలోనున్న చుట్టాలింటికి  వెళ్ళొ స్తానని చెల్లి వెళ్ళాక  నేను కొడుకు కోడలు మిగిలాము .  కొడుకు కోడలు ఫైల్ తెరిచి అవసరమైన పత్రాలన్నీ వరుసగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండగా... నేను బయటకి దృష్టి సారించాను . అబ్బో ఎన్ని కార్లో ! ఇక్కడికి సుమారు రోజుకి ఒక వెయ్యి కార్లు రావచ్చేమో  ! ఆ పరిసర ప్రాంతాలన్నీ నేల  ఈనినట్లు  జన సందోహంతో ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు  విమానం ఎక్కబోయే ముందు కారు ఎక్కకపోతే ఎట్లా అన్నట్లు ఆక్కడికందరూ  కారుల్లోనే వస్తున్నారు . .  ఆ పంక్షన్ హాల్ వాళ్ళు  గంటకి వందరూపాయలు పార్కింగ్ చార్జ్ ని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు . చుట్టూ పరికించి చూస్తూ ఇక్కడెక్కడైనా రెస్ట్  రూమ్స్ ఉన్నాయో లేదో ! అన్నాను . "ఉండమ్మా నేను  చూస్తాను"  అని వెళ్ళి అక్కడ ఎక్కడా ఆ సౌకర్యం ఉన్నట్లు కనబడక   గార్డ్ ని అడిగి వచ్చాడు . అతను చూపించిన వైపు వెళ్ళొచ్చి  "అబ్బో ! చాలా దరిద్రంగా ఉన్నాయమ్మా !  నువ్వు వెళ్ళలేవు " అన్నాడు   

ప్చ్ .. రోజూ ఇన్ని వందల మంది వచ్చి పోయే చోట కనీసం టాయ్లెట్ కి వెళ్ళే సౌకర్యం కూడా లేదు .  ఉన్న ఒకే ఒక టాయ్లెట్ దుర్గంధం వెదజల్లుతూ వెళ్ళిన వాళ్ళని అవసరాన్ని వాయిదా వేసుకోమన్నట్లు వెనక్కి పంపుతుంది .  ఈ పంక్షన్ హాల్ వాళ్ళు కొన్ని శౌచాలయాలు కట్టి వెళ్ళిన  ఒక్కొక్కళ్ళ   దగ్గరా పది రూపాయలు లెక్కన వసూలు చేసినా కిమ్మనకుండా ఇచ్చేసే  వాళ్ళు . వీళ్ళకి  నెలకి లక్షలకి లక్షలు ఆదాయాలు వచ్చేవి అసలు కన్నా కొసరు ఆదాయమే  బాగుండేది   అనుకున్నాను మనసులో . 


ఎదురుగా  చింత చెట్టు  లేలేత చిగురుతో  శోభగా ఉంది.  దాని కొమ్మ కొమ్మకి రాత్రుళ్ళు  రంగు రంగుల ఎలక్ట్రిక్  దీపాలు వెలిగే  విధంగా వైర్లు తోరణాలుగా వేసి ఉన్నాయి.  చెట్టు  మొదట  చుట్టూరా   కట్టిన చప్టాపై  కూర్చున్న ఓ తల్లి  దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ  చెట్టు మొదట్లో ఉన్న మట్టిని తీసి ముగ్గులేసుకుంటుంది . కాసేపటి తర్వాత ఆమె కూతురొచ్చి సంతోషంతో తల్లి పాదాలకి దణ్ణం పెట్టుకుని కళ్ళ కద్దుకోవడం కనిపించింది .  ఆ తల్లి ముఖంలో అమితమైన  సంతోషం .

చిన్న పాపని ఎత్తుకున్న ఓ తల్లి చేతిలో  ఫైల్స్ పట్టుకుని వక్క చెట్టుని  ఆనుకుని నిలబడి ఉంది.  ప్రక్కనే ఉన్నది ఆమె భర్తనుకుంటా... ఆమెకి ఏదేదో చెపుతూనే ఉన్నాడు .  లెగ్గిన్ - టైట్ టీ  షర్ట్ వేసుకున్న ఓ తెలుగింటి కోడలు "మామయ్య గారు వీసా  స్టాంపింగ్  అయిందండీ ,  ప్రశ్న లేమీ వేయకుండానే అప్ర్రూవ్  చేసేసారు. అంతా దేవుడి దయ. వచ్చేటప్పుడు దిల్ ఖుష్ నగర్  బాబా గుడికి వెళ్ళి దణ్ణం పెట్టుకుని వస్తాను " అని చెపుతుంది . ఒక్క బాబా ఏనా , అంతకు ముందెన్నడూ గుర్తుకురాని  మూడు కోట్లమంది  దేవతలు ఇతర  మతాల  వాళ్లకి వాళ్ళ వాళ్ళ దేవుళ్ళూ అందరూ  తప్పక గుర్తుకు వస్తారనుకుంటా! నవ్వుకున్నాను.   

ఇంకొక  అమ్మాయికి  వీసా రాలేదనుకుంటా ,   వచ్చి తండ్రిని కావిలించుకుని పెద్దగా ఏడుస్తూ  "సారీ డాడీ ఐ  యామ్ వెరీ వెరీ  సారీ డాడీ!  మీ కలని నేను నేరవేర్చలేకపోయాను . ఈ సారి ముందుగా  mac test కి  వెళ్లి ఇంటర్  వ్యూ  బాగా చేసి డెఫినెట్ గా  వీసా తెచ్చుకుంటాను....ప్రామిస్ డాడీ  నన్ను నమ్మండి " అంటూ వేడుకుంటుంది .

అమెరికా  వెళ్ళాలి,  డాలర్స్ సంపాదించాలనే వేలంవెర్రి కోరిక తల్లి దండ్రులది కాక పిల్లలదా !? అనుకుని నవ్వుకుంటూ నా కొడుకు వంక చూసాను . అయిదేళ్ళనాడు ఆరు నెలలు  పాటు గడ్డం పుచ్చుకుని బ్రతిమలాడి  మరీ అమెరికాకి పంపిన సంగతి గుర్తుకొచ్చిందేమో తనూ నవ్వాడు .

"అమెరికా అంటే భూతల స్వర్గమని  అక్కడ ఏ పనైనా చేసి డాలర్స్ సంపాదించి హాయిగా బ్రతికేయోచ్చు అని భ్రమలలో ఉంటున్నారు  ఆ గడ్డ మీద కాలు పెట్టాక కానీ తెలియదు సంపాదించడం ఎంత కష్టమో !  గ్యాస్ స్టేషన్ లో జాబ్ దొరుకుతుందా,మాల్ లోనో మోటెల్ లోనో జాబ్ దొరుకుతుందా ... అని వెతకడం మొదలెడతారు. ఓ పి టి  బేన్ చేస్తే  చాలామంది ఇంటి ముఖం పట్టక తప్పదు  అది తెలియకుండా చీమలు దారి వేసి నట్లు అమెరికా దారి పడుతున్నారు . వీళ్ళందరినీ చూస్తుంటే  జాలేస్తుందమ్మా ! .అన్నాడు నా కొడుకు 

ఇలా వచ్చేపోయే వాళ్ళని చూస్తూ మనసులో  ఉన్న గుబులుని  చిరునవ్వు మాటున మాటేసి  ఒక గంట సమయం గడిపేసాము . అబ్బాయికిచ్చిన రిపోర్టింగ్ టైం కన్నా ఓ పదినిమిషాలు ముందే క్యూ లైన్ దగ్గరకి చేరుకున్నాం .  సెక్యూరిటి గార్డ్ ఇంకా టైం ఉంది  దూరంగా వెళ్లి  వెయిట్ చేయండి అంటూ తోలేసాడు . నాకైతే  ఇంగ్లీష్ నేర్చిన తెలుగు కాపలా కుక్క ఆపరిసర ప్రాంతాలలో ఏ వీధి కుక్కలు  ఉండకూదదంటూ కర్ర పట్టుకుని మరీ తరుముతున్నట్టు అనిపించింది .  ఆ చురచుర మనే ఎండలో కాసేపు చెమటలు  క్రక్కాక  పదిన్నరకి వెళ్ళే వాళ్ళని పిలిచాడు . నా కోడలు పట్టిన చెమటని తుడుచుకోమని కర్చీఫ్ ఇచ్చి బెస్ట్ ఆఫ్ లాక్ చెప్పింది . నేనేమో వెన్నునిమిరి దైర్యంగా, కాన్ఫిడెంట్ గా ఉండు. స్టాంపింగ్ అవుతుందిలే అన్నాను. 

నా కొడుకు క్యూ లైన్ లోకి వెళ్ళాక  ఇంకోసారి వీధి కుక్కలని తరిమినట్లు తరిమించుకోకుండా మేమే కార్ పార్కింగ్ చేసిన స్థలానికి వస్తూ గోడ ప్రక్కకి నిలబడి   అక్కడ ఓపెన్ హాల్ లో  అనేక లైన్లలో ఇనుప కుర్చీలలో  కూర్చున్న వాళ్ళని ఆసక్తిగా చూస్తున్నాను   . పది పన్నెండు లైన్స్ ఉన్నాయి ఒక్కో లైన్ కి అయిదుగురో ఆరుగురో ఉన్నారు . వాళ్ళ ముందు నాలుగు పలకల ప్లాస్టిక్ ట్రే . అందులో వాళ్ళ జాతకాలని చూపించే  పత్రాలు ఉన్నాయి.  గొర్రెల మందలా  ఎలా పడితే అలా పరిగిత్తే  మన పౌరులు అక్కడ  క్రమశిక్షణ తో నడుచుకునే చీమల్లా నిశ్శబ్దంగా  రెండు చేతులతో పదిలంగా ఆ ట్రే ని పట్టుకుని   ఒక లైన్ తర్వాత మరొకలైన్ లోపలికి  వెళుతున్నారు, వస్తున్నారు. నాకైతే ఆ ట్రే  అలా పట్టుకుని వెళ్ళే వాళ్ళని చూస్తే అమెరికా దేశంలో అడుక్కు తినడానికి పర్మిషన్ ఇమ్మని అడుక్కున్నట్లు ఉంది .

గోడ కివతల ప్రక్కకూడా నిలబడి చూడ్డానికి వీల్లేదంటూ మరో ఇంగ్లీష్ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్ళండి వెళ్ళండి అంటూ తోలేసాడు . నేను, కోడలు వచ్చి కార్లో  వెనుక ఒకరు ముందు ఒకరు కూర్చున్నాం  ప్రక్క ప్రక్కన కూర్చోవడానికి వీలు లేకుండా కార్ డ్రైవర్ తన సీట్ ని కంపర్ట్ గా వెనక్కి వంచి పడుకుని నిద్ర పోతున్నాడు.  

పది నిమిషాలకి ఒకసారి బయటకెళ్ళి  గోడపై నుండి  కాన్సులేట్  లోపలకి  చూస్తూ మా అబ్బాయి ఇటువైపు  చూసినప్పుడల్లా  తనకి దైర్యం చెపుతూ థంబ్  చూపిస్తుంది కోడలు.    నేను పైకి బింకంగా ఉన్నా లోలోపల భయపడుతున్నాను. ఒకవేళ  స్టాంపింగ్ అవకపోతే !?  ఆ ఊహే భయంకరంగా తోచింది . అమ్మో ! పెళ్ళికి చేసిన  లక్షల అప్పులు లక్షణంగా నా తల చుట్టూ గిరగిరా తిరుగుతూ వడ్డీ ఇవ్వండీ , అసలెప్పుడూ అనడుగుతున్నట్టు అనిపించింది . దేవుడా దేవుడా ! మల్లన్నా ! ఎప్పుడూ..  నువ్వే నాకు అండ . నన్ను ఎవరి దగ్గర తల ఒంచి నిలబడేటట్లు చేయలేదు . ఇప్పుడు కూడా తలెత్తుకుని గర్విస్తూ జీవించేటట్లు  చేయి అంటూ మనసులో  వేడుకుంటూనే ఉన్నాను .

కాసేపటికి  చుట్టాలింటికి  వెళ్ళిన నా చెల్లెలు వచ్చేసింది.   ఇద్దరూ  అన్యమనస్కంగానే ఏదేదో మాట్లాడుకుంటున్నాము.  కాసేపటికి నా కొడుకు, కోడలు వచ్చేసారు . వాళ్ళ ముఖంలో రిజల్ట్ ఏమిటో తెలుసుకోవాలని కంగారుగా వెతికాను . నా చెల్లెలు .. "చిన్నీ  స్టాంపింగ్  అయిందా? " లేదా అని అడగడం కూడా ఇష్టం లేదాయే !  "లేదు పిన్నీ" అన్నాడు నా కొడుకు.  నిరాశని తట్టుకుంటూ నా కొడుకుకి దైర్యాన్ని నూరిపోయ్యాలిప్పుడు అనుకుంటూ  డోర్  తీసుకుని బయటకి వచ్చాను .  "అంతా ఒట్టిదే !  నేను నమ్మను .. నీ పాస్పోర్ట్  ఏది చూపించు" అని అడిగింది చెల్లి  . "రెండు రోజుల తర్వాత వస్తుందిలే " అని నవ్వుతూ చెప్పాడు .

"మల్లన్నా  ! నా నమ్మకం ఎప్పుడు వమ్ము కానీయవు . నీకు శతకోటి దణ్ణాలు తండ్రీ ... అని మనసులో అనుకుంటూ  సంతోషంతో  బిడ్డని దగ్గరికి తీసుకున్నాను . మనకి అనుకూలంగా ఫలితం వస్తే దేవుడు కరుణించాడని వ్యతిరేక ఫలితాలు ఇస్తే విధిరాత ఇలాగే ఉందని సరిపెట్టుకుంటానికి తయారుగా ఉన్నానేమో ! అని నాకు నేనే మొట్టికాయ వేసుకున్నాను   

ఏది ఏమైనా  నిమిషాలలో మన తలరాతలని మార్చేసే అమెరికా కాన్సులేట్ పట్ల నాకు నిరసన  భావం కల్గింది .ప్రతి నిత్యం వేలమంది ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ అమెరికా వెళ్ళకపోతే జీవితమే లేదనుకుంటున్న నా లాంటి తల్లిదండ్రుల పట్ల ఏవగింపు కల్గింది .     ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలిగిన వందల  మంది యువకులు  సారాన్ని పిండుకుని దేశాన్ని ఒదిలేసి వెళుతున్నట్లు  అనిపించింది .  చేసిన అప్పులు తీరిపోగానే అమెరికాని వదిలేసి రమ్మని  నా కొడుక్కి గట్టిగా చెప్పాలి అనుకున్నాను . మళ్ళీ అంతలోనే స్వరం మార్చేసి ..  నిజంగా నేనలా చెప్పగలనా ! వాడు రాగలడా ! ప్రసవ వైరాగ్యం లాంటిదే  ఇది కూడా ! అనుకున్నాను .

తిరుగు ప్రయాణం ముచ్చట్లతో  ఆనందంగా సాగుతుంది . మధ్య మధ్యలో నా కొడుకు నాలుగైదుసార్లు  డ్రైవర్ని వేగం తగ్గించి నడపమని. హెచ్చరిస్తూనే ఉన్నాడు   అయినా యజమాని మాటని ఖాతరు చేయకుండా  కారుని  130/140 కిలో మీటర్ల వేగంతో  నడుపుతూనే  తీసుకువచ్చాడు . నేనైతే ప్రయాణం పొడవునా  డ్రైవర్ నిర్లక్ష్య ధోరణికి రగిలిపోతూనే ఉన్నాను.

సెవెన్స్ దగ్గర  టిఫిన్ చేయడానికి ఆగినప్పుడు అతని గురించి మా మధ్య  మళ్ళీ మాటలు మొదలయ్యాయి  .  "అమ్మా !  అర్జంట్ గా  ఈ డ్రైవర్ని మార్చేయి .  వాడికి  అసలు మన మాటంటే లెక్కలేదు  యజమాని మాటని లక్ష్య పెట్టని వాళ్ళతో  పని చేయించుకోలేము.  చెప్పినా వినకుండా ఇంత మంది ప్రాణాలని రిస్క్ లో పెడుతున్నాడు వాడు"   అన్నాడు కోపంగా . 
 ఏమండీ రాంబాబుగారు  అని గౌరవంగా పిలిచే నా కొడుకు  డ్రైవర్ని  వాడు అని అనడంలో  నాకాశ్చర్యమేమీ కలుగలేదు . ఎక్కడైనా  మనిషి  ప్రవర్తన వల్లే  గౌరవం తగ్గిపోతుందని అర్ధం చేకున్నదాన్నయినా  అప్పటికి మాత్రం  నా కొడుకుని వారిస్తూ  . 
"ఉష్ ...  అతను వింటున్నాడు ఊరుకో ! . అయినా  ఈ రెండు రోజులేగా, మీరు వెళ్ళగానే ఇక తన అవసరం లేదని మాన్పించేసి వేరే డ్రైవర్ని పెట్టుకుందాం " అన్నా రహస్యంగా .  

" ఏమన్నా అంటే   సడన్ గా ఎక్కడ మానేస్తాడో మళ్ళీ అవసరానికి ఎవరైనా దొరుకుతారో లేదోనని అతనిని  భరించాల్సి వస్తుందేమో ! అవును కదూ అత్తయ్యా "...  కోడలు ప్రశ్న  .

కాదన్నట్టు తల అడ్డంగా ఊపి మారడానికి అతనికి అవకాశం ఇవ్వాలి . అతని నిర్లక్ష్యం మనకి బాధ కల్గినా ఒర్చుకోవడమెందుకంటే  మన సామాజిక వర్గం పైన, ధనవంతులపైన  మనలాంటి వారి పైన అతనికి అంతులేని ద్వేషం ఉంది కష్టపడకుండానే మనకన్నీ ఆయాచితంగా వచ్చేస్తున్నయన్న ఫీలింగ్ లో ఉన్నాడతను . గతంలో కన్నా మన ఆస్తులు కరిగిపోయాయని మళ్ళీ కష్టపడి ఇవన్నీ సంపాదించుకున్నామని  తెలియక కాదు. వాళ్లకి లేనిదేదో   మన దగ్గర ఉందని ఉక్రోషం, మనం అతని  వృత్తి పై ఆధారపడ్డామనే చులకన భావంతోనే అలా చేస్తున్నాడనిపిస్తుంది నాకు.  మనలో అందరూ అతను ద్వేషించినట్లుగాను  ఉండరు. అతని అపోహ అది . అలాగే  అతనిని మనం తక్కువగానూ  చూడటం లేదని అతనికి అర్ధం అయ్యే విధంగా ఉందామని ట్రై చేస్తున్నాను....అన్నాను సాలోచనగా . 

అవునన్నట్లుగా తలూపి "ఏదేమైనా తను   చేసే పనిని ప్రేమించడం లేదతను , బాధ్యతనేది  ఏ కోశానా లేదు,  ప్రవర్తన మారకపోతే ఎక్కడా నిలబడలేడన్నది  మాత్రం నిజం. అసలు వాళ్ళ మీద ఆధారపడటం ఎందుకమ్మా?  నువ్వు డ్రైవింగ్ నేర్చేసుకో ! అన్నాడు నా కొడుకు .
"ఇతరులపై ఆధారపడటం ఎప్పటికైనా మంచిది కాదని నాకు తెలుసు కానీ మనవల్ల ఇంకొకరికి ఉపాధి దొరుకుతుందని  అంతే"
"మీ అమ్మ ఈ మధ్య మార్క్సిజం బాగా చదివి అర్ధం చేసుకుంటున్నట్లుంది  . నువ్వు సంపాదించి పంపిందంతా దాన ధర్మం చేసేస్తుంది జాగ్రత్త  చిన్నీ ! అంటూ  నవ్వుతూ హెచ్చరించింది .

నువ్వు ఏమైనా  చెప్పమ్మా ! ఇతనిలాంటి వారిని  చాలామందిని చూసాను.   అక్కడ కూడా  ఇలాగే ఉన్నారు. అయిదేళ్ళ నుండి చూస్తున్నాను కదా !  అవకాశం వచ్చినా, ఊత ఇచ్చినా పైకి రాలేరు వాళ్ళలో సోమరితనం, నిర్లక్ష్యం. అకారణమైన ద్వేషం కనబడతాయి. కొంచమైనా బ్రతుకు పట్ల భయం ఉండదు, జవాబుదారిగా ఉండరు  చికాకుగా చెప్పాడు

"బ్రతకడానికి వాళ్ళకి   ఉన్న ధీమా అలాంటిది   ఈ యజమాని కాకపొతే ఇంకో యజమాని అన్న నిర్లక్ష్యం.  ఎలాగోలా బ్రతకపోతామా అన్న  విశ్వాసం .  అతనిలా  కాకపొతే ఇంకెలాగైనా బతికేస్తాడు . మనకి మాత్రం అలా బతకలేమా అన్న ధీమా లేకపోయిందెందుకు ?  ఎం ఎస్ చదివిన నువ్వు  ఉద్యోగం చేసుకోవడానికి అమెరికా అనుమతి కోసం వెంపర్లాడలేదూ ?   ఏ జామ్ నగర్ కో,  పూనే కో   వెళ్ళినా నెలకి  లక్ష కి పైగా  సంపాదిస్తావు  ! అయినా వీసా అప్రోవ్డ్ అవుతుందా లేదా అని  ఎంత టెన్షన్ పడ్డాము  ?  అంది చెల్లి

"ఎందుకంటే  పెద్ద  ఇల్లు, ఈ కార్లు , హోదా అన్ని మర్చిపోయి మనం  సాధారణంగా బ్రతకలేము ! .మనకి ఈస్థటిక్ సెన్స్  ఏ కోశానా లేకపోయినా సౌకర్యవంతంగా బతకడానికి మాత్రం ఎక్కువ డబ్బు కావాలి   జీవితం పట్ల ఆసక్తి అనురక్తి కన్నా  గొప్ప  హోదా కోసం, ఆపై విలాసవంతంగా  బ్రతకడం కోసం బ్రతుకుతున్న వాళ్ళమీ మనం .  మనవి భద్రమయ జీవితాలనుకుంటాము కానీ  నిత్యం అభద్రతతో బ్రతుకుతున్నది  మనలాంటి వాళ్ళమేనని  నీకు తెలియడంలేదా ?! . 

డ్రైవర్  నిర్లక్ష్యానికి మా అభద్రతాభావానికి  రెండిటికి మధ్య ఉన్న అర్ధంకాని విషయమేమిటో  బోధపడినా బోధపడకపోయినా 
"అవునమ్మా !  ఈ రోజు ఆవిషయమే  బేగంపేట ప్యాలెస్  ప్రక్కన బాగా  అర్ధమయింది ." నా భుజం పై తల ఆనించి కొంత దిగులుగా అన్నాడు . .  

పార్కింగ్ ప్లేస్ లో కార్ దిగి లిఫ్ట్ కోసం వెయిట్  చేస్తున్నాం . కార్  కీస్ తీసుకొచ్చి  నా చేతిలో పెట్టేసి వెళ్ళడానికి రెడీ అయ్యాడు  డ్రైవర్  .  " పై దాకా వచ్చి  కీస్ పెట్టి వెళ్ళోద్దా ! ఇక్కడే  నీకిస్తాడు ఏమిటీ .. అని మా చెల్లి  నా వైపు చూసింది   కంఠశోష  వచ్చేటట్టు ఇందాకంత   చెప్పావ్ కానీ  అతనిని మార్చడం నీ వల్ల కాదు అన్నట్లు  . 

నేను నా  మొహమాటాన్ని కొంచెం   ప్రక్కన బెట్టి 'రాంబాబు లోపల వాటర్ బాటిల్స్ , బేగ్స్ ఉండి పోయాయి. అవి తీసుకొచ్చి  పైన ఇచ్చి వెళ్ళు " అని కీస్ అతనికి ఇచ్చేసి లిఫ్ట్ లోకి వెళ్లిపోయాను . అప్పటికి కానీ   నా మనసు శాంతించలేదు.  అది తాత్కాలిమేనని తెలుసు .

(పత్రికలో వచ్చిన కథ ఇక్కడి వరకూ ) అసలు కథ కొనసాగింపు .....

మా వెనుకనే డ్రైవర్ వచ్చాడు . తెచ్చిన బేగ్,వాటర్ బాటిల్స్ క్రిందపెట్టి కార్ కీ నా చేతికి ఇస్తూ  "నేను రేపటి నుండి రానండీ ,మానేస్తున్నా" అన్నాడు.
"సరే రాంబాబు " అన్నా ఏమీ ఆలోచించకుండానే వాద ప్రతివాదనలేమీ లేకుండానే .
అతను లిఫ్ట్ లోకి వెళ్ళిన చప్పుడు తర్వాత "ఏం జరిగింది? ఎందుకా పొగరబోతు ముండా కొడుకు మానేస్తానంటున్నాడు ?" అడిగింది అత్తగారు.
"నానమ్మా! ఎందుకలా నోరు పారేసుకుంటావ్, మర్యాదగా మాట్లాడొచ్చు కదా ! విసుక్కున్నాడు నా కొడుకు.
వెళ్ళి పోయాడనుకున్న డ్రైవర్ వెనక్కి వచ్చి "లెక్క చూడండి "
"నువ్వే బాకీ ఉన్నావ్ కదా !" డైరీ తీసి లెక్కంతా స్లిప్ పై వ్రాసి ఇచ్చా.
తెల్లారిందో లేదో ... పాల పేకెట్స్ వేసే కుర్రాడు "మీ డ్రైవర్ బ్రాందీలో ఎండ్రిన్ కలిపి తాగేసాడంట బ్రతకడం కష్టం " అంటున్నారనే వార్త మోసుకొచ్చాడు.
ముద్దుగా ఉన్న పిల్లలు, పద్దతిగా ఉన్న అతని భార్య గుర్తుకు వచ్చి "అయ్యో ! వాళ్ళ సంగతి ఏమవ్వుద్దో ననైనా ఆలోచించవద్దీ మూర్ఖుడు " కోపంగా అన్నా.
అతనికెప్పుడూ ఇతరులతో గొడవేనండీ. కులం పేరుతో తిట్టారని కేసులు పెడతాడు. ఇప్పుడెవరికి చుట్టుకుంటుందో ?
పాలబ్బాయి  మాటలతో భయం నన్ను కొండ చిలువలా చుట్టేసి   ప్రత్యక్ష ప్రసారాలలో రకరకాల కథనాల రీళ్ళు కళ్ళముందు గిర్రున తిరగసాగాయి.  మల్లన్నా ! అతనికేమి కాకూడదు. అతను భార్యా,పిల్లలు సంతోషంగా ఉండాలి చేతులు జోడించి కనబడని దేవుడిని వేడుకున్నాను.
(ఈ కథ 2015 ఆగస్ట్ లో చినుకు పత్రిక కి పంపబడింది )


3, మార్చి 2016, గురువారం

ఈ దేశంలో ఏం జరుగుతుంది !?

"మతమా...  మతమా!! నువ్వేం పని చేస్తావ్ ? అనడిగితే మనుషులని ఎన్నటికి  కలవనీయకుండా చేస్తాను"
"కులమా...  కులమా  !! నువ్వేం పని చేస్తావ్ ? అనడిగితే ప్రాణ స్నేహితులని కూడా  విడదీస్తాను "
" వర్గమా ..వర్గమా !! నువ్వేం పని చేస్తావ్ ? అంటే అయినదానికీ కానిదానికి ఇతర వర్గాల వారిపై రాళ్ళేసి  రెచ్చగొడతాను"

నిజం, మన భారతీయ సమాజం ఇప్పుడలాగే ఉంది.

ఈ దేశంలో ఏం జరుగుతుంది !? ఉదాహరణ కే ఈ పోస్ట్ . సాధారణ వ్యక్తిగా వ్రాసానీ... పోస్ట్.

టీవిలో  ప్రసారమవుతున్న ఒక దృశ్యం చూసాను. ఏ తల్లి కన్నబిడ్దో యూనివర్సిటీలో పి హెచ్ డి చేసేంత తెలివిగల, బంగారం లాంటి బిడ్డ.  తల్లిదండ్రులు పెంచుకున్న ఆశలని అడియాసలు చేసి జీవితం మీద అంతులేని నిరాశతో ఉరి త్రాడుని ముద్దాడి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అతను దళిత విద్యార్ధి అని చెపుతున్నారు.

ఎవరైతే ఏమిటిరా !?  నీ వర్గీకరణ మండిపోనూ ! బంగారంలాంటి బిడ్డ ... అలా మరణించినందుకు అయ్యో ..పాపం! అని బాధపడక కులం పేరు పదే పదే ప్రస్తావించాలా..? అని టీవి వాడిని తిట్టుకుంటూ   పేస్ బుక్ లోకి వెళితే ఒక రచయిత ఎంతో విచారంతో ఆ అబ్బాయి మరణాన్ని అందుకు గల కారణాలని చెపుతూ ఒక పోస్ట్ వేసారు .
ఏమిటో...  ఈ కులాల మతాల పిచ్చిలో అన్యాయంగా సమిధలవుతున్నఇలాంటి  బిడ్డలని చూసి జాలేస్తుంది. సున్నితమైన అంశాలే కదా...  ప్రాణాలు తీసేది అని బాధపడ్డాను.

అంతలో ఇంకొకామె ఆమె రచయిత, సామాజిక కార్యకర్త ... ఎవరైతే ఆ అబ్బాయి మరణానికి కారకులో వాళ్ళే...  అయ్యో అని  ఇప్పుడు సానుభూతి చూపుతున్నారు ... వాళ్ళంతా మనువాదులే.... అని పోస్ట్ వేసారు. పైగా హిందూ మతవాదులు, అగ్రకుల అహంకారులు ఈ విద్యార్ధి మరణానికి కారకులు. వీళ్ళందరికీ ఆ విద్యార్ధి మరణం పట్ల సానుభూతి చూపడానికి కూడా అనర్హులు అని నొక్కి వక్కాణించారు.

నేను తెల్లబోయాను. అదేంటి !? ఈ చనిపోయిన విద్యార్ధి ఎవరో నాకసలు తెలియదు . మా ఇంటిప్రక్క అబ్బాయి కూడా కాదు.  కుల వివక్ష వల్ల వి. సి వేదింపు చర్యలవల్ల  మరణిస్తే ... దానికి కారణం వి. సి అవ్వాలి లేదా అక్కడ జరిగిన గొడవలలో పాల్గొన్న వ్యక్తులు కారణమవ్వాలి కానీ... ఈ దేశంలో  హిందూ మతం అవలంబిస్తున్న వారందరూ ... వి.సి కులమైన కమ్మ కులస్తులందరూ కారణం ఎలా అవుతారు !? ఒక వ్యక్తీ కారణం కావచ్చు ... ఆ కులస్తులందరూ కారణం కాదు, ఒక మత అనుబంధ సంస్థ సభ్యులు కారణం కావచ్చు . ఆ మతాన్ని అవలంబించే వాళ్ళందరూ  ఎలా కారణమవుతారు ?

మానవ సహజమైన స్పందన చూపడానికి కూడా మీరర్హులు కాదు అంటే ...నాలాంటి తటస్థ వాదులు  దానిని  ఎలా అర్ధం చేసుకోవాలి ? వ్యక్తిని వర్గానికి - సభ్యుడిని సంస్థ మొత్తానికి ఆపాదించి ఎలా చూడగలరు!?  ఒక ఐ ఎస్ ఐ ఉగ్రవాది ఎంతో మంది అమాయుకుల మరణానికి కారణమయ్యాడని ..అతను ఒక ముస్లిం  అని  నా చుట్టుప్రక్కల ఉన్న ముస్లిం మతస్తులందరినీ మీరే కారణమని తిట్టిన దాఖలాలు నా చుట్టూరా ఎక్కడా లేవు . నేనే కాదు నా చుట్టుప్రక్కల ఉన్న  హిందూ, క్రైస్తవ, బహాయి మతస్తులందరూ కూడా ఆ ముస్లిం మతస్తులని తూలనాడలేదు. మా పరిధిలో మేమందరం బాగానే ఉన్నాం, ఉంటున్నాం. ఇప్పటిదాకా నాతో  స్నేహంగా ఉన్న కవి మిత్రులు, రచయిత మితృలకి ఉన్నఫళంగా నేనెలా శత్రువునయ్యానో నాకేమీ అర్ధం కాలేదు. మీరు హిందువులు, మీరు అగ్ర కులస్తులు అయితే మీరు మా ఫ్రెండ్స్ లిస్టు లో ఉండనవసరం లేదు అని...  తన  రచనలకి అవార్డులందుకున్న స్థాయి గల వ్యక్తులు బహిరంగంగా ప్రకటించడాన్ని  ఏమంటారు ? కొంచెమైనా ఆత్మాభిమానం ఉన్న వారు వెంటనే అతని/ఆమె నుండి దూరంగా తప్పుకుంటారు కదా ! అలా అన్నాక కూడా అక్కడే వేలాడటానికి సిగ్గు,అభిమానం అడ్డొస్తాయి కదా !  సంస్కారవంతులని అనుకున్న మిత్రులందరూ కూడా ...  కులాధారంగా, మతాధారంగా  ఎన్నో తూలనాడారు. నేను ఎంతగా  భయపడిపోయానంటే  కనీసం లైక్ కొట్టడం కూడా మాహాపరాధం అన్నంతగా !


ఇంకొక కవి, రచయిత కవిత్వం వ్రాయడం లేదని ఆరోపణ. ఆ విద్యార్ధి మరణానికి సానుభూతి తెలపడానికి కూడా మీకు అర్హత లేదని తిడుతూనే మళ్ళీ కవిత్వం వ్రాయలేదని ఆరోపణ చేస్తారు . ఇదెక్కడి న్యాయం ?
అక్కడ వాళ్ళని వాళ్ళు ఆకాశానికెత్తుకున్నతీరు చూస్తే మరీ నవ్వొచ్చింది. ఈ దేశంలో బహుజనుల తరపున, దళితుల తరపున , మైనారిటీల తరపున, స్త్రీల తరపున జరిగిన అన్యాయాలకి స్పందించి ప్రశ్నించే హక్కు వారికి మాత్రమే  ఉందంట. అందుకనే..  వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చట. ఇలా అని చెప్పిన ఆ వ్యాఖ్య తర్వాత తొలగింపబడింది అనుకోండి.

మనువాదులన్నా, అగ్ర కులాల వాళ్ళన్నా, హిందూ మతోన్మాదులన్నా మౌనంగా భరిస్తున్నామని ఎక్కడ ఏం జరిగినా సమూహాలలోకి వచ్చి వ్యాఖ్యానించడమనేది ఎదుటి వాళ్ళ మనోభావాలని కించపరచడం క్రింద జమ అవదా ? మీ మతస్తులకి, మీ కులస్తులకేనా సున్నితమైన బాధపడే మనసు ఉన్నది . మిగతా వారు పాషాణ మనస్కులా !?  మేము పూజించే దేవుళ్ళని మీరేమైనా తిట్టవచ్చు. మేమేమి అనకపోయినా ఎక్కడ ఏ ఘర్షణ  జరిగినా హిందూ కులస్తులు, అగ్రవర్ణాల వారే కారకులు అవుతారు అని మీ నిశ్చితాభిప్రాయం.

కుల మత బేధాలు సమసిపోవాలని, అందరితో  ఆత్మీయంగా ఉండాలని సమాజం సంస్కారంగా, సంస్కరణలతో  చక్కగా ఉండాలని, ప్రగతి బాటలో నడవాలని కోరుకుంటున్న వారిని ... మీ మీ అసంబద్దమైన ఆరోపణలతో అన్యాయంగా దూషించడం మీకు మాత్రం  న్యాయంగా ఉందా ?

 హిందూ మత ద్వేషుల్లారా ! అగ్రవర్ణ మంటూ పదే పదే  తిడుతున్న వారూ ... నిజం చెప్పండి ..!? మీకొక కులం లేదా ? అది మార్చుకుంటున్నారా ? రిజర్వేషన్ లాంటి ఫలితాలని మీరు అనుభవించడం లేదా ? మీకొక మతం లేదా ? మీరు   వ్యక్తులుగా మాత్రమే చెలామణీ అవుతున్నారా ? మీరు ఏ వర్గం కాకుండానే ఉన్నారా ? హిందూత్వ రాజ్యం అంటున్నారు ? హిందువులందరూ  బిజెపి పార్టీ కి లేదా ఆ పార్టీ అనుకూల పార్టీకే ఓటు చేసి ఉంటారని మీరు చెప్పగలరా ? అసలు మీరే పార్టీకి వోట్ చేసారో మీరు చెప్పగలరా ? మీకు మాత్రం వ్యక్తీ స్వేచ్చ, మత స్వేచ్చ వగైరా వగైరా ..అన్నీ ఉండవచ్చు . హిందువులకి  మాత్రం ఏమీ అవసరం లేదు ... దేశంలో  మిగతా మతస్తులందరూ  హిందువులని  తిడితే మాత్రం పడి ఉండాలి, ఆంధ్రరాష్ట్రంలో కమ్మ కులస్తులని తిడితే పడి ఉండాలి.  అధికారంలో ఉన్నారు కాబట్టి తిట్టి తీరాలని అనేట్టు ఉన్నారు కొందరు.  నాలాంటి  సాధారణ వ్యక్తులు ఇలా ప్రశ్నిస్తే కూడా వారు తట్టుకోలేరు. అహంకారంతో మరింత తిడతారు కదా !

ఈ దేశంలో నిజాలని ఒప్పుకోరు . జీర్ణించుకోలేరు . సమాజాన్ని మారనివ్వరు . సమాజం మారిందని ఒప్పుకుంటే వారికి మనుగడ ఉండదని భయం. ఎప్పుడూ ఏదో  ఒక వివాదాన్ని భుజాల మీద మోస్తూ వార్తలలో ఉండాలి . ప్రతిదీ రాజకీయం చేయాలి. ప్రజలకి ఏం కావాలో వీళ్ళకి అక్కరలేదు. వీళ్ళు మాత్రం బాధితులపట్ల సానుభూతి చూపిస్తూ పోరాటం జరిపే వాళ్ళు. వీళ్ళకి మాత్రమే స్పందించే హక్కు, పోరాడే హక్కు ఉన్నవాళ్ళు . హిందువులు,అగ్రవర్ణం వాళ్ళు పాషాణాలు అని వీళ్ళ అభిప్రాయం. న్యాయం, ధర్మం అన్నీ మా వైపే ఉన్నాయని అడ్డ దిడ్డంగా వాదించే వాళ్ళు ఉన్నంతకాలం . వీళ్ళని చూసి జాలి పడటం మినహా ఏమి చేయగలం ? వీళ్ళు ఇలా తిట్టే కొలదీ హిందువులంతా ఒకే తాటి మీదకి వస్తారు. అది ఈ దేశానికి ఎంతమాత్రం మంచిది కాదు. (అది వాళ్ళకి కూడా తెలుసు ) తెలిసి కూడా స్వప్రయోజనాల కోసం అదే పని చేస్తుంటారు.

కుల,మత,ప్రాంత పరంగా తమలో నిద్రాణంగా ఉండే ఆధిపత్యఅవశేషాలను వదుల్చుకోవడానికి తమలో తామే యుద్ధం చేసుకునే వాళ్ళందరూ ఈ దేశంలో మైనారిటీలు అనుకుంటున్న వారందరికీ   శత్రువులు కారుకదా? మరి స్పందించడం లేదు అనే కారణంతో వాళ్ళందరిని తిట్టడం ఎందుకు ?  అదివరకు లేని కుల,మత భావనల్ని ఇప్పుడు పెంపొందిస్తున్నది రాజ్యం , రాజకీయ నాయకులు మాత్రమే కాదు. మేధావులు అని చెప్పుకునే రచయితలూ, కవులూ కూడా ! అంతకు క్రితం తటస్తంగా  ఉండే వాళ్ళు కూడా ... ఇప్పుడు  మత భావనలో, కుల పిచ్చిలో కూరుకు పోతున్నారు. అందుకు ఉదాహరణ నేనే !  నేను అవలంభించే మతాన్ని, నా కులాన్ని పదే పదే  తిడుతూ ఉంటే  నా ఆత్మ గౌరవం  కూడా దెబ్బ తింటుంది. ఖచ్చితంగా దానిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. ఇతర మతాల పట్ల లేని ద్వేషం నాకు కల్గుతుంది కదా !  ఈ దేశంలో మత భావనలు, కుల అహంకారాలు లేనివాళ్ళకి కల్గించడంలో "తిలపాపం తలా పిడికెడు " అన్నది నిజం .

 ఇక నాకెందుకో... ఈ మధ్య  సీతారామారావు బాగా గుర్తుకొస్తున్నాడు. సీతారామారవంటే నాకు ఒక రకంగా జాలి ఇష్టం కూడా ! కానీ అతనన్న మాటలు అతని ఆలోచనలు ఇప్పటి పరిస్థితికి చక్కగా అమిరిపోతాయి. ఈ క్రింది  మాటలు ఒక ప్రముఖ నవలలో ఒక పాత్ర ఆలోచనలు.  ఆ నవలా రచయిత ఒక సంఘ సంస్కర్త కొడుకు.ఇక సీతారామారావు ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి ... ఆయన దొంగ సంఘ సంస్కర్తలని బాగా గమనించాడు.  గర్హించాడు.

కొంతమంది సంఘ సంస్కరణ, విప్లవం అంటూ తిరుగుతుంటారు సంఘానికి పరిపక్వతదశ అనేది లేనే లేదు కదా ! మరి దేనికోసం వీళ్ళ ఆర్భాటం అని జాలేసేదంట సీతారామారావుకి. కుర్రతనంలో సంఘసేవ చేయాలనే ఉబలాటం కొద్దీ  సంఘంలో బాధపడే వాళ్ళని ఉద్దరిద్దామని పొలోమంటూ బయలుదేరతారు . కొన్నాళ్ళకి తాము చేసే పనిపట్ల ఏమీ లాభం లేదని తెలిసినప్పటికీ వెనక్కి తగ్గే అవకాశం ఉండదు . ఆ సంగతి లోకులకి చెప్పే దైర్యం ఉండదు. అప్పటికే వాళ్లకి సంఘంలో గౌరవం లభించి ఉంటుంది. వీళ్ళ మాటలు నమ్మి అనేక కష్టాలకి ఓర్చి అనేకులు వాళ్ళకి  అనుచరులై ఉంటారు . వాళ్లకి ఇప్పటివరకు నేను చెప్పిందంతా తప్పు ... అంటే ఆ అనుచరగణం ఊరుకుంటారా? అప్పటిదాకా వాళ్ళు చేసిన త్యాగం,పడిన కష్టాలు గుర్తుకొస్తే ... కొంపలు కూలిపోవూ ! అందుకే వాళ్లకి సత్యం తెలిసినా పైకి చెప్పరు.  నమ్మకం లేకపోయినా యధాప్రకారం సంఘసంస్కరణ ,విప్లవం అంటూనే ఉంటారు. ప్రజలని మభ్యపెడుతూనే ఉంటారు .  కానీ వాళ్ళ పిల్లలని ఉద్యమాల బాట పట్టనీయకుండా మంచి మంచి స్థానాల్లో కూర్చోబెడతారు . సోషలిజం కావాలనుకునే నాయకులు తమ ప్రత్యర్దులని బాధపెట్టి,హింసించి, చంపి తమ సిద్దాతాలని ఆచరణలో పెట్టబోతారు, ఈ సిద్దాంత ప్రకారం ప్రతి బలహీనుడిని బలవంతుడు దండించవచ్చు అజ్ఞానిని జ్ఞాని దండించవచ్చు భర్త భార్యని దండించవచ్చు . కానీ దండన వాళ్ళ మంచి కోసమే జరగాలని ఎక్కడుంది ? స్వార్ధం కోసం జరిగితే ఏం చేయగలరు ? అనుకుంటాడు సీతారామారావు
అదండీ ..సంగతి.  ఈ మాటలు ఎవరికీ వర్తిస్తాయో అందరికి అర్ధమై ఉంటుంది.

ఏ మతోన్మాదమైతే ప్రపంచాన్ని నాశనం చేయనున్నదో  ఆ మతం చెప్పింది , ఏ మతోన్మాదమైతే ఈ దేశాన్ని నాశనం చేయనున్నదో  ఆ మతం చెప్పింది , ఏ మతమైతే ప్రపంచంలో  ఎక్కడ అడుగు పెడితే అక్కడ బలపడాలని చాప క్రింద నీరులా వచ్చి చేరుతుందో  ఆ మతం చెప్పిందీ  కూడా ఒకటే ! అన్ని  మతాల సారమంతా ఒక్కటే ! మనిషిని మనిషి ప్రేమించుకోలేనప్పుడు మిగిలేది ద్వేషమే !  ఆ ద్వేషం తోనే అడ్డు గోడలు  కట్టుకుంటారు, ఆ ద్వేషంలోనే మాడి మసై పోతారు.

నిజం నుండి నువ్వు ఎంతగా పారిపోవాలని చూస్తావో ఆ నిజం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది ... అన్నది నిజం.

ఏ ప్రాణైనా కూడా  తన ఉనికిని  తానూ  కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. నా ఉనికిని నేను కాపాడుకోవడానికి నాకొక కులం అవసరం అవుతుందని, మతం నీడలో ఒదిగి ఉండాలని నేను అనుకోలేదు. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు అలా ఉండాలని నెట్టేస్తున్నారు. నేను అలా మారతానో లేదో నాకే తెలియదు. మా అమ్మ ఉగ్గుపాలతో నాకేం   నేర్పిందో దానికి విరుద్దంగా సమాజం ఏం నేర్పుతుందో నాకు మాత్రమే తెలుసు. అమ్మ అంటే ఏమిటో నిజంగా తెలిసినవారికి అమ్మ విశ్వజనీయత తెలిసినవారికి ఏ ద్వేషం అంటదు.
నాకీ  సిద్ధాంతాలు,రాద్ధాంతాలు పెద్దగా తెలియవు. నేను ఎక్కువ చదువుకోలేదు. తర్కాలు తెలియదు. నాకు తెలిసింది స్పందించడం అంతే ! నాకు అవకాశం ఉన్న చోట తప్పకుండా స్పందిస్తాను. ఆ స్పందనలో భాగంగానే  ఈ పోస్ట్.
(ఈ పోస్ట్ కి వ్యాఖ్యలు నిలిపి వేయడమైనది. గమనించగలరు)