కథల పరిచయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కథల పరిచయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, మార్చి 2023, బుధవారం

అనగనగ…

 కొందరు కథకులు కవులు ప్రపంచ కథల దినోత్సవం ప్రపంచ కవితా దినోత్సవం.. అంటూ రెండూ వరుసగా వచ్చాయని  వున్నాయని గుర్తు చేసారు.  పాఠకుడికి రోజూ కథ కవిత దినోత్సవమే కదా! కథ గురించి రాసిన మంచి కథ గురించి చెప్పుకుందాం. .. అనుకున్నాను.  


కథ అనగానే నాకు నాయనమ్మ చెప్పిన కథలే జ్ఞాపకం వస్తాయి. 


నాయనమ్మా ఈ కథ నీకు యెలా తెలుసు నీకు యెవరు చెప్పారు అని అడగడం తెలియని వయస్సులో అమాయకంగా  ఆమె చెప్పే కథ వింటూ.. ఆశ్చర్యపోతూ అనుమానంగా ఆలోచిస్తూ కళ్ళ మూసుకుంటే ఊహా ప్రపంచంలో  అనేక దృశ్యాలు మెదులుతూ కళ్ళు తెరిస్తే అవన్నీ మాయమై అయ్యో అవన్నీ యేమైపోయాయని దిగులుపడుతూ.. మళ్ళీ  యేదేదో వూహించుకుంటూ కళ్ళు మూసుకుంటే  కనబడే వేరొక దృశ్యాలు నిరాశ పెడితే వుసూరుమంటూ.. నాయనమ్మ చెప్పే కథలకు ఊ కొడుతూ ఊ కొడుతూ.. నిద్రలోకి జారుకోవడం.  కలల మధ్యలో పొంతనలేని కథలకు  కలవరింపులతోనో గావుకేకలతో యింట్లో అందరినీ నిద్ర లేపడం... అవ్వన్నీ  యిపుడు తలుచుకోవడం మధురంగానే వుంటాయి.


ఇప్పుడు నా మనుమరాలికి కథ చెబుతుంటాను. ఐ పాడ్ కనబడకపోతేనో టివీ పెట్టకపోతేనో మెల్లగా నాయనమ్మ పక్కన చేరి కథ చెప్పుకుందామా అని అడుగుతుంది. అనగనగా వొక రాజు అంట అనే కథ తనకు చెప్పడం వచ్చేసాక మరికొన్ని కథలు చెబుతుంటే ఊ హూ.. అంటూ కళ్ళు విప్పార్చుకుని చెవులు రిక్కించి శ్రద్దగా వింటూ వుంటుంది. విశ్యజనీయమైన ముచ్చట కూడా  యిది.. 


కథ గురించి చెప్పుకుని ఆ తర్వాత కథ చదివేద్దాం

కథ మనది కాదని కొందరంటే.. భలే వారు కథ మనది కాకపోడమేమిటీ? మనమేమి కథను విదేశీయుల నుండి అరువు తెచ్చుకోలేదు. విదేశాల్లో short story పుట్టకముందే మనకు సంస్కృతంలో కథలు ఉప కథలు వుండేవనే ఆధారాలు వున్నాయని చెపుతారు. లిపి పుట్టకముందు వాగ్రూపంలో కూడా కథలు చెప్పుకునేవారు.  తరతరాలుగా కథ సజీవ స్రవంతిలా ప్రవహిస్తూనే వుందని వుండబోతుందని కొందరు అన్నారు.


నేను పరిచయం చేయబోతున్న కథ “ఏ నాటికి ముగియని కథ” రచన.. యు ఆర్ అనంతమూర్తి. కన్నడ రచయిత. కన్నడంలో రాసిన యీ కథ శంకరగంటి రంగాచార్యులు తెలుగులో అనువాదం చేసారు. ఈ కథ గురించి సూచనాప్రాయంగా చదివి  వెబ్ అంతా వెదికాను. ఒక కథల ప్రేమికుడు యీ కథను పంపించారు. ఈ కథలో  వొక సౌందర్యం వుంది. భావుకత వుంది.తరతరాల పాటు విస్తరించిన ప్రయాణం వుంది. అదే ఈ కథను మర్చిపోనివ్వని కథగా నిలిపింది. ఇది మీ కథ నా కథ అందరి కథ. కథ చదివాక భలే వుంది కథ.. నిజమే కథ.. మన అవ్వలకు యెవరు చెప్పారో యీ కథ అనుకుంటాం.. 


తొంభై యేళ్ళు వున్న వొక వృద్ధుడు తన భార్య మునిమనుమడికి చెపుతున్న కథ ను వింటూ.. తన బాల్యం గురించి జ్ఞాపకం చేసుకుంటాడు. తన మునిమనుమడు లాగే తాను కూడా అవ్వ వొడిలో పడుకుని ఆమె చెప్పే కథను వింటూ… తర్వాత ఏమైంది కథ  అయిపోయిందా  అని అడిగేవాడినని గుర్తుచేసుకుంటాడు. ఆమె కథ అయిపోలేదని అయిపోదు కూడా అని చెబుతూ వుంటుంది. నాలుగైదు తరాలు ఆ కథను వింటూ తన కొడుకులు మనుమనుమలు మునిమనుమలు ఆ కథ వింటూనే వుంటారని ఆ ముదుసలి భార్య కథను సాగదీసి సాగదీసి యింకా యేవో జతకూరుస్తూ కథ చెబుతూనే వుంటుందని విసుగుపడుతూనే ఆ కథ ముదుసలికి యెవరు చెప్పివుంటారు నేనే కదా చెప్పి వుంటానని యవ్వనకాలం నాటి ఆలు మగల సరాగాలను గుర్తుకు తెచ్చుకుంటాడు. సాధారణంగా జేజమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పినట్టు కథ కంచికి మనమింటికి అని తేలికగా ముగించి పిల్లలను నిద్రపుచ్చే కథ ను ఆ అవ్వ చెప్పదు. ఆ కథ యేమిటంటే.. 


ఆ కథ ఒక రాకుమారుడు రాకుమారి ప్రేమను వారు మరణించాక వారిరువురు మళ్ళీ మళ్ళీ పుట్టడం ఒకో జన్మలో కలిసి వుండటం వొకో జన్మలో యెడబాటుతో దుఃఖించడం.. తో కథలో అనేక మార్పులు కూర్పులు చేరుతూ కథ సాగిపోతూనే వుంటుంది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అనురాగబంధం అది వొక జన్మతో తీరిపోయేదికాదని ఏడేడు జన్మల వరకూ అది ముడిపడే వుంటుందని అవ్వ చెప్పే కథ అంతర్లీనంగా బోధిస్తూ వుంటుంది. ఆ తర్వాత ఏమైంది కథ అయిపోయిందా అని పిల్లలు అడుగుతూనే వుంటారు. కథ అయిపోతే ఈ ప్రకృతి లో చెట్లు కాయలు కాయవు తీగలు పూలు పూయవు అని అవ్వ చెప్పే వుంటదని అది తను భార్యకు చెప్పే వుంటానని ముదుసలి పురుషుడు అనుకుంటూ వుండగా రచయిత కథ ను ముగిస్తాడు. 


అనాదిగా స్త్రీ పురుషులిరువురూ వొకరి కోసం వొకరు పుడుతూనే వుంటారు. ప్రకృతిలో వివిధ రూపాల్లో జీవిస్తూ మరణిస్తూ వుంటారు.. అదొక కాల జీవ ప్రవాహం. అది కొనసాగుతూనే వుంటుంది. 


కాలమూ ప్రవాహం జీవితం వెనక్కి మళ్ళటం అంటూ వుండదు అనేక మార్పులు చేర్పులు చేసుకొంటూ ముందుకు సాగిపోవడమే .. .. ఇదెన్నడూ

 కంచికి చేరని కథ.. తరతరాలు వంశపారంపర్యంగా అవ్వలు  పిల్లలకు చెప్పే కథ లాంటి కథను యీ రచయిత యెంత హృద్యంగా చెప్పాడో.. 

మీరూ చదవండి యీ కథ. .. ..


అనగనగా.. అనగనగా.. ఒక రాకుమారుడు ఒక రాకుమారి.. 


….. అంట.. కథ చదివించేది.. రేపు అంట..( పైన వున్న టపాలో.. )






12, ఏప్రిల్ 2020, ఆదివారం

చుక్క పొడిచింది

ఈ రోజు మూడు కథలు చదివాను..
కరివేపాకు, చెప్పుకింద పూలు, చుక్క పొడిచింది..
కథా సంపుటి పేరు: చుక్క పొడిచింది.
రచయిత: పాలగిరి విశ్వ ప్రసాద్
కథలపై నా చిరు అభిప్రాయం..
డబ్బును జీవన సోపానాలుగా మార్చుకునే వాడికి ప్రేమంటే ఏమిటో ఎప్పటికీ అర్దం కాదు. అది ఉప్మా తినేసి వదిలేసిన కరివేపాకు లాంటిది. ఈ కథ చదివాక అప్రయత్నంగా “చలం” గుర్తొచ్చారు. రచయిత వొప్పుకుంటారో లేదో!
చెప్పుకింద పూలు.. కథలో తరతరాల అణచివేత కనబడినా.. అవి అప్పటి పరిస్తితులు.ఈనాటికి దళితుల ఆలోచనలు ప్రగతి బాట పట్టినట్లు కాస్తంత వారి జీవితాలలో చిరుదీపాలు వెలిగాయనే చెప్పచ్చు. చదువుకున్న యువతలో నాకు ఆనాటి శీనడు కనబడ్డాడు. అయితే కథలో రచయిత ఆశాభావం కనబడలేదు. నిసృహ మాత్రమే కనబడింది. ఈ కథకు మాండలికం ప్రాణం పోసింది.
చుక్క పొడిచింది.. ఈ కథ రాసిన కాలానికి ఈకథ గొప్ప ఆలోచన. ప్యాక్షన్ రాజకీయాల మధ్య వేట కొడవళ్ళకు బాంబులకు బలై పోయిన మగవారి కథ. కానీ భర్తల మరణాన్ని తేలిగ్గా తీసుకోని భార్యల కక్ష కార్పణ్యాల విశ్వరూపం ఎలా వుంటుందో ఆ స్త్రీలు ప్రత్యర్ది వర్గం వారి చావును చూడటం కోసం దేనినైనా ఫణంగా పెడుతూ.. అనుకున్న దానిని సాధించేవరకూ .. ప్రశాంతంగా వుండలేరనే విషయాన్ని చెబుతూనే .. అంతకుముందులాగానే ప్రత్యర్ది దొంగ దెబ్బకు కక్షకు బలైపోయిన తన భర్తఎడబాటును జీర్ణించుకుంటూ ఇంకొక తరం.. అలాంటి కక్షలకూ కార్పణ్యాలకు గురి కాకూడదని వీలైతే కుటుంబం మొత్తాన్ని లేకుంటే తన బిడ్డలను దూరంగా తీసుకొని పోవాలని నిర్ణయించుకున్న సుజాత కథ.. ప్యాక్షన్ రాజకీయ కుటుంబాలలోని స్త్రీల ఆలోచనకు అద్దం పట్టింది. ఈ కథ వచ్చి 22 సంవత్సరాలైంది. ఒక సామాజిక అంశాన్ని సృశించి.. చైతన్యవంతమైన మార్పును కోరుకుంటూ సుజాత పాత్రను తీర్చిదిద్దిన విధానం రచయిత ఆలోచనలనూ ఆరోగ్యకరమైన శాంతియుత జీవన విధానం పట్ల వున్న ఆకాంక్షను తమ ప్రాంతంలో జరిగే విధ్వంస జీవన విధానం పట్ల వెగటును పట్టి ఇచ్చాయి.
ఇంకొక కథ "పాములు " విలాస జీవనానికై నైతిక విలువలను ఫణంగా పెట్టె భార్యాభర్త కథ ... సమాజంలో అంతస్తుల పట్ల పెరుగుతున్న వ్యామోహాన్ని నయా ధనవంతుల మేడిపండు జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది. 
ఈ రచయిత ఇకపై సంజాయిషీ చెప్పకుండా మరిన్ని మంచి కథలను అందించాలని కోరుకుంటాను. డిమాండ్ చేస్తున్నాను.
పి.రామకృష్ణారెడ్డి గారు కేతు విశ్వనాథరెడ్డిగారు, బండి నారాయణ స్వామి గారు ఈ కథలకు మంచి కితాబుని ఇచ్చారు.
మిగతా కథలు కూడా చదవాలి. చదవకుండా ఆపలేవు కూడా. ఈ సంపుటిలో మొత్తం పది కథలు ఉన్నాయి. ఏ కథకు ఆ కథ చదవదగిన కథ. గుర్తుండిపోయే కథలు.  
ధన్యవాదాలు పాలగిరి విశ్వ ప్రసాద్ గారూ.. మీ కథల సంపుటి అడిగి మరీ తెప్పించుకుని.. ఈ రోజుకు చదవగల్గాను.


27, మార్చి 2020, శుక్రవారం

ఉజ్వల రచనా శిల్పం "దీపశిఖ "

సాహిత్యం యొక్క పరమార్దం హృదయాలను వైశాల్యం చేయడం.. 

రచయితలకు క్రాంతి దర్శనం ఊహలలో దొరుకుతుంది. అర్దం చేసుకోగల పాఠకులకూ దొరుకుతుంది. కానీ రచనలలో రచయిత వెళ్ళినంత దూరం మనిషి వెళ్ళలేడు. అది అర్దం చేసుకుని సమకాలీనతను ప్రతిబింబిస్తూ రచనలు చేయగలవారు మాములు రచయితలు గానూ.. విపరీతధోరణులను సాహిత్యంలో ప్రవేశపెట్టినవారిని సంచలన రచయితలగానూ  గుర్తించడం లెక్కించడం సర్వసాధారణమైపోయిన రోజులివి.

రచయిత వెళ్ళినంత దూరం పాఠకుడు వెళ్ళగల్గినపుడు.. వ్యక్తి స్వేచ్ఛకు ప్రాముఖ్యత ఏర్పడుతుంది. సమాజానికి వ్యక్తికి దూరం పెరుగుతుంది. సమాజంలో ఇమడలేని మనిషి బాహ్య అంతర్యుద్దాలతో అలసిపోతాడు.అలసిపోతూ కూడా తాము కోరుకున్నదానిని సాధించుకుంటారు. అయితే రచయిత సమాజంలో ప్రస్తుత విలువలుకు అనుగుణంగా నడుచుకుంటూనే ఎవరిని నొప్పించకుండా తాను చెప్పే విషయాన్ని వొప్పిస్తూ ..అది సామాన్యమైన విషయమే అని పాఠకుల చేత ఒప్పింపజేస్తూ కథ వ్రాయడం కత్తి మీద సాములాంటిదే. అలాంటి కథను నేను చదివాను. ఆ కథ పేరు దీపశిఖ . కథా రచయిత శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి దేవి. ఈ కథ ఇతివృత్తం మనకు అక్కడక్కడా తారసపడేదే. అయితే జనబాహుళ్యంలో కుహనావిలువలతో బ్రతికే సమాజంలో ... నీతి తప్పి (??) ఒకడుగు ముందుకు వేసి బిడ్డను కనీ తాను అనుకున్నట్లు ఆ బిడ్డను పెంచిన విషయమే ఈ కథ. ఇష్టమైనదాన్ని కావాలనుకున్నప్పుడు హింస లేకుండా దానిని సాధించడం సాధ్యమా అని ప్రశ్నిస్తుంది కూడా ...  

స్త్రీలు పిల్లలను కనడానికి ఎంత ఇష్టపడతారో తనకు ఇష్టమైన పురుషుడి ద్వారా అక్రమ సంబంధం యేర్పరచుకుని పిల్లలను కనడానికి అంతగా ఆలోచిస్తారు జంకుతారు. పిల్లలను కనడానికి పురుషుడితో కూడిక ఇష్టమైనది కాకపోయినా పిల్లలకోసం అయిష్టంగానే కళ్ళుమూసుకుని .. వంశం నిలబెట్టడం కోసం హింసను అనుభవిస్తారు కొందరు.ఒక వివాహిత స్త్తీ తనకు కల్గిన ఇద్దరు పిల్లల తర్వాత తనకి ఇష్టమైన ప్రియుడుతో కూడి ఇష్టంగా బిడ్డను కనీ మిగతా బిడ్డలకన్నా అమితంగా ప్రేమించి అపురూపంగా పెంచుతుంది. ఆ విషయాన్ని కూతురికి ఆ తల్లి ఎలా తెలియజేస్తుంది ..కూతురు ఆ విషయాన్ని ఎలా స్వీకరిస్తుంది .. వివాహం కాకుండానే తల్లి కాబోతున్న తన రూమ్మేట్ కి ఏమి భోదిస్తున్నది అన్నదే .. ఈ "దీపశిఖ" కథ.  రచయిత చెప్పిన తీరు వలన ఈ కథకు ఒక గొప్పదనము ఆపాదించబడింది. అంతే కాక కుటుంబాలలో వ్యక్తుల ఇష్టాన్నో లేదా వేరొకరకమైన సంబంధాన్నో చూసి చూడనట్లు వదిలేస్తూ పరోక్షముగా సహకరించడం అన్నది అత్యంత సాధారణ విషయంగా ఉంటుందనేది సూక్ష్మప్రాయంగా చెప్పబడింది. ఈ రచయిత కాకుండా వేరొక రచయిత ఈ కథను వ్రాస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకుంటే ... చాలా విమర్శలు వస్తాయనే అభిప్రాయం కూడా  యేర్పడింది. 

ఈ కథ చదివేముందు ...మీకు  నేను ఎరిగిన కొన్ని విషయాలను చెప్పదలచాను. ఆ విషయాలకు కథకు ఏమిటి సంబంధం అని అడగకండి. సంబంధం ఉందని నేను అనుకున్నాను కాబట్టీ .. ఆ విషయాలను ప్రస్తావించడం జరిగింది. 

 నా చిన్నప్పుడు జరిగిన కొందరి విషయాలు నాకు బాగా జ్ఞాపకం. ఆ విషయాల గురించి తప్పొప్పుల బేరీజు వేయడం నాకప్పుడే చూఛాయగా తెలుసు. నాకే కాదు నాతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన అదే వయస్సు పిల్లలకు కూడా.. తెలుస్తుంది. అది పెద్దలు మనకు ఉగ్గుపాలతో నేర్పిన సంస్కారం లేదా విలువలు కావచ్చు. మా ఇంటి వెనుక వాళ్ళకు ఒక అమ్మాయి వుండేది. కుడిఎడమగా మా అమ్మ వయస్సు ఆమెది. మా అమ్మ వివాహం చేసుకుని కోడలిగా అడుగుపెట్టిన ఏణర్దానికి ఆమెకు వివాహం అయిందట. మా ఊరికి కొద్ది దూరంలోనే ఆమె భర్త ఊరు. కానీ ఆమె ఎపుడూ అత్తగారింట్లో వుండేది కాదు. ఆమె నాణ్యమైన నల్లని నలుపుతో తీర్చిదిద్దిన శిల్పంలా బారు జడతో అందంగా వుండేది.  ఆమె భర్త ఆమెకు  భిన్నంగా కొద్దిగా పొట్టిగా ఎత్తుపళ్ళుతో  ఏమంత అందంగా కనిపించేవాడు కాదు. నాకు ఉహ తెలుస్తూ వుండేటప్పటికి ఆమెకు నా వయస్సున్న కొడుకు వున్నాడు. ఆ పిల్లాడు మాతో ఆడుతూ పాడుతూ వుండేవాడు. ఆమె భర్త పది పదిహేనురోజులకు ఒకసారి వచ్చి ఆమెను కొడుకును తీసుకువెళతానని బలవంత పెట్టినపుడల్లా.. ఆమె తల్లి అల్లుడిని పట్టరాని కూతలు తిడుతూ.. నీ ఇంట్లో కూటికి గతిలేదు నీళ్ళ మజ్జిగ చుక్కకు గతిలేదు నా కూతురిని పంపను. కావాలంటే నా ఇంట్లోనే పాలేరుగా పడివుండు అని తిట్టిపేసేది. 

ఇక ఆ కూతురేమో సినిమాలో వాణిశ్రీ లాగే పైట వేసుకుని బిగుతు జాకెట్ ధరించి నిత్యం సన్నజాజులు ధరించి.. వయసున్న మగవాళ్లతో పరాచికాలు ఆడుతూ వుండేది. నేను చెంబు తీసుకుని పాటి మీదకు వెళ్ళినపుడో తోటి పిల్లలతో కలిసి ఆడుతున్నప్పుడో నాకు బాబాయి వరుసయ్యే ఆయనతో కలిసి గడ్డి వాముల దగ్గర కనబడేది. అప్పటికి ఆ కనబడటం అనేది పూర్తిగా అర్దం కాకపోయినా అది నాకు తప్పుగా అనిపించేది. అపుడపుడు పెద్దవాళ్ళ మాటల్లో.. ఆ తులసమ్మ కూతురిని మొగుడితో కాపరానికి పంపివ్వదు. దానిపై మన ఇంటి మొగాడికి కన్ను పడకుండా కాపలాకాసుకోలేక చచ్చే చావొచ్చింది అని తిట్టుకోవడం వినబడి మొత్తానికి ఆమె చేస్తున్నది తప్పని బాగా అర్దమైంది. కొన్నాళ్ళకు ఆమె మళ్ళ్ళీ గర్బవతి అయి.. పండంటి బిడ్డను కన్నది. ఆ బిడ్డను చూసి మా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చెవులు కొరుక్కొనే వాళ్ళు. తర్వాత బిడ్డలను వెంటబెట్టుకుని భర్త వెంట కాపురానికి వెళ్ళిపోతే పీడా విరగడైంది అని మెటికలు విరుస్తూ తిట్టి పోసిన ఆడవాళ్ళను చూసాను.

నా బాల్యం కనుమరుగై యుక్తవయస్కురాలినై పెళ్ళి అయి నాకెక బిడ్డ పుట్టాక  హఠాత్తుగా మా ఇంటి వెనుక వున్న తులసమ్మ కూతురిని ఆమె చిన్న కొడుకును చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆమె చిన్న కొడుకు నాకు బాబాయి వరసయ్యేతను ఎలా వుంటాడో అచ్చుగుద్దినట్టు అలాగే వున్నాడు. నాలో ఎన్నో ఆలోచనలు. అంత స్పష్టంగా మరొకరి రూపంలో తన ఇంట్లో తన బిడ్డగా చెలామణీ అవుతున్న ఆ బిడ్డను.. ఆమె భర్త ఎలా భరించగల్గాడు? లేదా అతనికసలు  భార్య యొక్క ఆ అక్రమ సంబంధం గురించి తెలియదా.. ? తెలియకపోవడానికి ఆస్కారమే లేదు అంత చిన్న చిన్న పక్క పక్కనే పల్లెటూర్లలో చాలా విషయాలు దాయాలని చూస్తే దాగేవి కూడా కాదు. కానీ.. ఆ తండ్రి బిడ్డను ప్రేమించి పెంచి పెద్ద చేసి తన ఆస్తి మొత్తాన్ని పెద్ద కొడుకుకు కొంచెం కూడా ఇవ్వకుండా రెండవ కొడుకుకే వ్రాసి చనిపోయాడు. ఇక ఆమె భర్తతో కలిసి చేసిన కాపురంలో ఎన్ని అనుమానాలు అవమానాలు భరించిందో కానీ.. చిన్న కొడుకంటే ఆమెకు పంచప్రాణాలు. అతనిని ప్రత్యేక ఇష్టంతో చూసేది. 

ఇక మా బాబాయి వరుసయ్యే ఆయనతో ఆకర్షణలో పడిపోయి భర్త దగ్గరకు కాపురానికి వెళ్ళకుండా హిస్టీరియా వచ్చినట్లు ప్రవర్తించే మా బంధువుల అమ్మాయి గుర్తుకొస్తూ వుంటుంది.,ఆమెను భార్య చనిపోయున పెద్ద వయస్సు ఆస్తిపాస్తులున్న పిల్లల తండ్రికిచ్చి వివాహం చేసారు. ఆమె ఆ భర్తతో సరిపెట్టుకోలేక ఎదురుగా ఆకర్షణీయంగా  ఉంగరాల జుట్టతో దబ్బపండులా మెరిసిపోయే నవ యువకుడితో సంబంధం పెట్టుకుని  భర్త దగ్గరకు వెళ్ళమంటే పిచ్చి పట్టినట్లు ప్రవర్తించేది. 

ఇవి వివాహం ముసుగులో కనబడే వ్యక్తి ఆకర్షణ లేదా ప్రేమ లేదా మరొకటో.. పెద్దలు పిల్లల మనసులను అర్దం చేసుకుని వివాహం జరిపించనపుడు వారు తమ అంతరంగాల్లో మరొకరిని జపిస్తూ వారి కోసం తపిస్తూ.. కోరికలతో జ్వలిస్తూ తమను తాము మోసం చేసుకుంటూ జీవిత భాగస్వామికి ద్రోహం చేస్తూ.. వుంటారు. అటువంటి భార్యలను భరించే భర్తలూ వుంటారు. తనకు పుట్టిన బిడ్డ కాదని తెలిసినా ఆ బిడ్డలను ప్రేమించే భర్తలు భార్యను క్షమించే భర్తలు వుంటారని తర్వాత తర్వాత అర్దం చేసుకున్నాను. స్త్రీలు కూడా తనకు యిష్టమైన పురుషుడితో కూడి.. అతని బిడ్డను అపురూపంగా నవమాసాలూ మోసి కనీ యిష్టంగా పెంచే వాళ్ళు వుంటారు. ఇందులో తప్పొప్పులను మనం బేరీజు వేసుకున్నట్లు వుండకపోవచ్చు. మన ఆలోచనలకు అందని ఇంకొక కోణం వుండవచ్చు. స్త్రీ పర పురుషుడితో కూడిన ప్రతి సమాగమూ.. అనైతికం కాకపోవచ్చేనేది.. కొంచెం సానుభూతితో చూడాల్సిన విషయంగా .. అర్దం చేసుకోవాలని ఈ కథ చదివాక నాకు అర్దమైంది. అలా అని అక్రమసంబంధాలను ప్రోత్సహిస్తున్నామని అనుకోకూడదు. మనకు తారసపడిన విషయాలను ఎలా అర్ధం చేసుకోవాలో మాత్రం తెలుస్తుందని చెప్పడమే నా ఉద్దేశ్యం. 

ఈ కథ చదివాక నేను ఎరిగిన ఆ ఇద్దరు స్త్రీలు నాకు మరింత అర్దమయ్యారు. వారిద్దరినీ నేను ఇపుడు అసహ్యించుకోవడం మానేసి.. మాములు స్త్రీలగా  చూడగల్లుతున్నాను. సాహిత్యం యొక్క పరమార్దం హృదయాలను వైశాల్యం చేయడం..  మానసిక పరివర్తన కల్గించడం  కొత్త ఆలోచనలను రేకెత్తించడం అంటే ఇదేనని నాకు అర్దమైంది. వీరలక్ష్మీదేవి గారికి ధన్యవాదాలు .. ఇంతమంచి కథను వ్రాసినందుకు అభినందనలు. 

"దీపశిఖ  " కథ లింక్ లో ఇక్కడ చదవవచ్చు 

"కొండఫలం" కథల సంపుటిలో  కూడా  చదవవచ్చు .. 


25, మార్చి 2020, బుధవారం

నా బ్లాగ్ మరియు కథలపై పత్ర సమర్పణ



కొద్దిగా ఆలస్యంగా పంచుకుంటున్న విశేషం. 
47 రోజులకు ... నా గోడపైకి మళ్ళీ తిరిగి వచ్చాను. .నా రాకకు కారణం ... కొంచెం సంతోషంగా అనిపించడమే ...
నా చుట్టూ వున్న స్త్రీల జీవితాలని, వారిపై వున్న అణచివేతని చూస్తూ వున్నప్పుడు అందులో నన్ను నేను చూసుకుంటాను. అప్పుడు నేనూ తోటి స్త్రీల పక్షాన నిలిచి కవిత్వపు జెండానవ్వాలనిపిస్తుంది. నేను విన్నవి, కన్నవి యిన్ని బాహ్య ప్రపంచపు బాధలు నాకు నిద్ర లేకుండా చేసి కలవరపెడతాయి ... అపుడవి కథలుగా రూపం సంతరించుకుంటాయి. వాటిని నా చుట్టూ ఉన్న ప్రపంచం గుర్తించి స్పందన తెలిపినప్పుడు ... నాతో పాటు మరికొందరు సమస్యలను బాధలను గుర్తిస్తున్నారని తెలిసి కొంత తెరిపినపడతాను.
ఇంతకీ విషయం యేమిటంటే ...నా ఫోన్ నెంబర్ కోసం google search చేస్తున్నట్లు నేను గమనించాను. వివరాలు చూద్దామని వెళితే ... ఇటీవలే ప్రచురితమైన ఒక సమీక్ష చదివి ... సంభ్రమాశ్చర్యాలకు లోనై ... వివరంగా చదువుకుంటూ వెళ్ళాను. నేను pen down చేసినప్పుడల్లా ... నన్ను మళ్ళీ నిలబెట్టేవి .ఇలాంటి ఉత్తేజాలే !
Pratyusha Velaga... deportment of English Sri Padmavati Viswavidyalayam ... నేను వ్రాసిన కథలపై సమీక్ష చేయడం (థియరి లో పేపర్ సమర్పించడం )..ఆనందం కల్గించింది ... Thank you so Much ప్రత్యూష .. http://www.jctjournal.com/gallery/107-feb2020.pdf
jctjournal.com gallery లో నేను కనుగొన్న ... ఈ వ్యాసాన్ని మీరు కూడా ఇక్కడ చూడవచ్చు . ప్రత్యూష కి ధన్యవాదాలు.

 వీలు చూసుకుని తనతో ఒకసారి మాట్లాడాలి . నా బ్లాగ్ ని కథలను ఆ అమ్మాయి క్షుణంగా చదివింది . రెండు రోజులు తర్వాత తెలిసింది ..తను పద్మావతి వడ్లమూడి గారి అమ్మాయని. మరింత సంతోషంగా ఫీల్ అయ్యాను.  పద్మ గారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని చెప్పారు. 

https://drive.google.com/…/191TgMwpNAvjdOHEhBAwTX4B6w…/view… లింక్ ఇక్కడ ప్రక్కనే తెరవవచ్చు  > నా బ్లాగ్ మరియు కథలపై ఆంగ్లంలో పత్ర సమర్పణ

కచ్చప సీత


నేను ఊర్మిళ నిద్ర గురించి చదివిన కథలలో మూడవది .. ఇటీవలే చదివాను .  " కచ్చప సీత " తల్లావజ్జల పతంజలి శాస్త్రి . ఆ కథ మార్చి 2020 చినుకు మాస పత్రికలో ప్రచురింపబడింది .
..ఆ కథపై ... నా చిరు వ్యాఖ్యానం .. ఇంకా ఎక్కువచెప్పి రచయితను పలుచన చేయదల్చుకోలేదు .

బాహ్యప్రపంచం నుండి తనను తాను వేరు చేసుకేవడం అంటే లోపలికి ముడుచుకోవడం. ఆ ముడుచుకోవడం కూడా తనను తాను శోధించుకోవడం కోసం. ఆత్మశోధన తనను తాను దృఢంగా నిలబెట్టుకోడానికి నిశ్చలంగా నిర్వీకారంగా మనగల్గడానికి దోహదం చేస్తాయి. మానవ సంబంధాలు అనుబంధాలన్నీ కర్తవ్యాలు కాదు బాధ్యతలు. బాధ్యతలు మోసే వ్యక్తులు  ఎల్లప్పుడూ నొప్పిని కూడా భరిస్తూ వుండాలి.  నొప్పిని  భరించలేక ఊర్మిళ తనను తాను శోధించుకుంటూ బాహ్యప్రపంచపు ఉనికిని మర్చి నిద్ర అనే యోగ స్థితిలోకి వెళ్లిపోయింది. అది మరలా లక్ష్మణుడో లేదా ... సీత వచ్చి కలిసేవరకూ ...
ఆ కథను  పైన ఇచ్చిన లింక్ లో చదవవచ్చు  ...







కథను చదవడానికి  వీలుగా .. డౌన్లోడ్  చేసుకుని చదవండి ప్లీజ్ . 

15, మార్చి 2020, ఆదివారం

విముక్త - ఓల్గా

నా బ్లాగ్ వీక్షకుల సంఖ్య అయిదు లక్షలకు పైగా నమోదు అయింది. చాలా రోజులనుండి స్తబ్ధత నెలకొని వుంది యేమీ వ్రాయడం లేదు. కానీ .. ఇవాల్టి ఈ సందర్భాన్ని వేడుక చేసుకోవాలనిపించింది .. నా అభిమాన రచయిత "ఓల్గా " గారి రచన "విముక్త " కథను అభిమానంగా పోస్ట్ చేస్తున్నాను . ఓల్గా గారి అనుమతి తీసుకోలేదు. కొందరు మిత్రులు ఈ కథ చదవాలని కోరినందువల్ల.. ఈ కథను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ చదివి ఆనందిస్తారని ఆలోచిస్తారని కోరుకుంటూ ... "ఎన్నడూ విచారణకు అంగీకరించకూ సీతా " అని అహల్య హెచ్చరిక ..ఈ కథ ముగింపులో నాకు కనబడింది. ఈ అహల్య కథ చదవాలంటే "మృణ్మయ నాదం " కథ చదవాల్సిందే ! విముక్త కథల సంపుటి కొనుక్కోవాల్సిందే .. విముక్త కథలు కన్నడం తమిళం నేపాలీ ఒరియా హిందీ ఇంగ్లీష్ భాషల్లో అనువాదం అయ్యాయి . ఈ విముక్త కథల సంపుటికి ఓల్గా గారికి  కేంద్రసాహిత్య అకాడమీ అవార్డ్, తమిళంలో అనువాదం చేసిన గౌరీకృపానందన్ కి అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్  లభించింది . జి‌ఆర్‌కే  మూర్తి .. ఈ కథను ఆంగ్లంలో అనువదించారు.చదవండి... 
విముక్త
పధ్నాలుగేళ్ల వనవాసాన్ని, అనేక కష్టాలను దాటి అయోధ్యకు తిరిగి వచ్చిన సీతారామలక్ష్మణులను స్వాగతించటానికి అంతఃపురమంతా కదలి వచ్చింది ఒక్క ఊర్మిళ తప్ప.ఆత్రంగా వెతికిన సీత కళ్లకు ఊర్మిళ ఎక్కడా కనిపించలేదు. అత్తగార్ల ఆలింగనాలు, కుశలప్రశ్నలు, మాండవి శ్రుతకీర్తుల స్నేహపు పలుకులు, సేవలు - ఇవేవీ సీత మనసుకెక్కటం లేదు.ఊర్మిళ ఏది? ఆరోగ్యం బాగా లేదా? హడావిడి కొద్దిగా తగ్గిన తర్వాత చెల్లెలు శ్రుతకీర్తిని దగ్గరకు తీసుకుని మెల్లిగా అడిగింది సీత. శ్రుతకీర్తి ముఖం వివర్ణమైంది. ఆమె ముఖం చూసి సీతకు భయం వేసింది."ఊర్మిళ కేమయింది? కుశలమే కదా?'' సీత ఆందోళన అర్థమైనా ఏం చెప్పాలో తెలియలేదు శ్రుతకీర్తికి. ఆమె ఊర్మిళను చూసి పధ్నాలుగేళ్లయింది."మాట్లాడకుండా అలా చూస్తావేమిటి? ఊర్మిళ ఏది? ఎలా ఉంది?'' సీత మరింత ఆందోళనగా అడిగింది."ఊర్మిళ ఎలా ఉందో నాకూ తెలియదు. అక్కను నువ్వెళ్ళిననాటి నుంచీ చూడలేదు.''సీతకేమీ అర్థం కాలేదు. తను పొరపాటుగా వింటున్నాననుకుంది. మళ్లీ గట్టిగా "శ్రుతకీర్తీ - నేను ఊర్మిళ గురించి అడుగుతున్నాను'' అంది."నేనూ ఊర్మిళ గురించే చెప్తున్నాను. మీరు వెళ్లాక ఊర్మిళ ఎవరికీ కన్పించలేదు. తన మందిరంలోంచి బైటికి రాలేదు. ఎవరినీ లోపలకు రానివ్వలేదు.''నిర్ఘాంతపోయింది సీత."ఎవ్వరినీ? అత్తగార్లను కూడా''"అవును. ఆమె గదిలోకి ప్రవేశం ఒక్క చారుమతి అనే దాసికే ఉంది. ఊర్మిళ యోగక్షేమాలు ఆమే మాకు చెబుతుంది.''సీతకు ఊపిరాడనట్లయింది.పధ్నాలుగేళ్లు మనుషులతో మాట్లాడకుండా - తన వాళ్లను చూడకుండా ఎట్లా ఉంది? అట్లా ఉండాలని నిర్ణయించుకుందంటే ఆమె మనసు ఎంత గాయపడి ఉండాలి. పధ్నాలుగేళ్లు. ఆమె రామలక్ష్మణులనూ, తననూ క్షమిస్తుందా?"ఇవాళ మేం వస్తున్నాం అన్న వార్త ఊర్మిళకు తెలుసా?''    శ్రుతకీర్తి తల దించుకుంది.సీత వెంటనే రాముని దగ్గరకు వెళ్లాలని చూసింది గానీ మంత్రులు, తమ్ముళ్ళు, పురప్రముఖులు మోహరించిన ఆ సమయంలో రామలక్ష్మణులను సమీపించటం అసాధ్యమనిపించింది.ఇంతలో శ్రుతకీర్తి ఒక స్త్రీని తీసుకొచ్చింది. "ఈమె చారుమతి.''సీత ఇంక ఆలస్యం చెయ్యలేదు."పదమ్మా - ఊర్మిళ దగ్గరకు వెళదాం.''"ఆమె ఎవరినీ చూడదు'' అంది చారుమతి ముక్తసరిగా."ఎవరివల్ల ఆమె అందరికీ దూరంగా బతుకుతోందో వాళ్లే వచ్చారని తెలిస్తే ఆమె వారిని తప్పక చూస్తుంది. పద.''  సీత చారుమతిని నడవమని కళ్లతోనే ఆజ్ఞాపించింది.

* * *
ఊర్మిళ మందిరం వందల యోజనాల దూరం ఉన్నట్లనిపించింది సీతకు. ఎంత నడిచినా రాదేం - అరణ్యవాసంలో ఉండగా లక్ష్మణుడితో పాటు ఊర్మిళా తమతో ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తూ ఉండేది సీతకు. రామలక్ష్మణులు తమ పనులలో అరణ్య సంచారంలో ఉంటే తనూ, ఊర్మిళా కలిసి అరణ్య సౌరభాలను ఆస్వాదించేవారు గదా అనుకునేది.ఎందుకు లక్ష్మణుడు ఊర్మిళను తీసుకురాలేదు? ఆ విషయం ఎప్పుడు ప్రస్తావించినా మౌనం తప్ప పెదవి విప్పేవాడు కాదు లక్ష్మణుడు. తాము అడవికి వచ్చేప్పుడు అయోధ్యలో అంతా గందరగోళం. అయోమయం. దశరథుని అనారోగ్యం, కౌసల్య దుఃఖం, అంతఃపురమంతా అల్లకల్లోలమైంది. తాను రాముని వెంట వెళ్లటానికి అందరినీ ఒప్పించటమే పెద్ద పనయింది.తీరా సరయూనది దాటుతుండగా మనసు కాస్త స్థిమితపడ్డాక ఊర్మిళ తమతో రావటం లేదనే విషయం గట్టిగా మనసును తాకింది. ఊర్మిళ ఎక్కడా కనబడలేదనీ, తమకు వీడ్కోలు కూడా చెప్పలేదనీ గుర్తొచ్చాక సీతలో ఆందోళన పెరిగింది.రాముడిని పదే పదే ప్రశ్నించేది."ఊర్మిళ వస్తాననలేదా? లక్ష్మణుడు ఒంటరిగా వస్తుంటే ఆమె ఎంత దుఃఖించిందో! అరణ్యవాసం దుస్సహమనుకుందా? లక్ష్మణుడు అయోధ్యలో ఉంటేనే బాగుండేదేమో. మనకోసం ఊర్మిళను ఒంటరిదాన్ని చేసి రావడం సమంజసమా?'' ఇలా మాట్లాడుతున్న సీతను రాముడు సమయానుకూలంగా సమాధానపరిచేవాడు. భర్త ృహీన, పుత్రవియోగి అయిన అత్తగారికి అండగా లేకుండా సీత వనవాసానికి వచ్చేసింది కదా. మరి ఆమెకు ఊర్మిళ కూడా లేకపోతే ఎలా? ముగ్గురు అత్తగార్లకూ ముగ్గురు కోడళ్లయినా ఉండొద్దా. రాముడు ఇంకా ఎన్నో చెప్పేవాడు. అంతఃపురంలో నిర్వహించాల్సిన బాధ్యతలెన్నో ఉంటాయి. అవి మహారాణిగా కౌసల్య ఎంతో సామర్ధ్యంతో నిర్వహించేది. ఇప్పుడామెకు శక్తి చాలదు. ఆసక్తి అసలే ఉండదు. ఆ నిర్వహణ భారం ఊర్మిళ తప్ప ఎవరు మోయగలరు?    "సీతా చెప్పు - ఈ విషయంలో నీకంటే ఊర్మిళ సమర్థురాలు కదూ? మనం అయోధ్యలో ఉన్నప్పుడు అమ్మ నీకంటే ఊర్మిళకు ఎక్కువ బాధ్యతలు అప్పజెప్పేది కదూ?''    "ఔను'' అని ఆలోచనలో పడేది సీత. ఊర్మిళ లౌకిక వ్యవహారాలలో చాలా సమర్థురాలు. చూపుతో శాసించగలదు. రాణీవాసాలలో జరిగే సమస్త విధులూ ఆమెకు తెలుసు. తండ్రి కూడా ఆ విషయంలో చెల్లినే ప్రశంసించేవాడు.    "నీకు విలువిద్యలో, ఉద్యానవన విహారాలలో ఉన్న ఆసక్తి మిగిలిన విషయాలలో లేదమ్మా'' అనేవాడు.నిజమే. ఆ అంతఃపుర అధికారాలూ, వాటి నిర్వహణా సీతకే మాత్రం నచ్చేవి కావు. ఉద్యానవనంలో ఆటలు, విలువిద్యాభ్యాసం, ప్రకృతిలో సేదదీరటం యివే ఇష్టం సీతకు. అయోధ్యకి వచ్చిన తర్వాత కూడా అత్తగారినుంచి బాధ్యతలు తీసుకునే ఆసక్తి చూపించలేదు సీత. ఊర్మిళ మాత్రం కౌసల్య వెంటే ఉండేది.సీతకు అంతఃపురం కంటే అరణ్యమే హాయిగా ఉంది. ఇక్కడ స్నేహం చేయటానికీ, గౌరవించటానికీ మనుషులుంటారు. అధికారం చలాయించేందుకు కాదు.    "నీకు ప్రియమైనది ఊర్మిళకు ప్రియమవ్వాలని లేదుగా. నువ్వు భూపుత్రివి. ప్రకృతి ప్రేమికురాలివి. ఊర్మిళకు నగరజీవితం, అంతఃపుర బాధ్యతలూ ప్రియం కావచ్చుగదా''రాముడెంత సముదాయించినా సీత ఊర్మిళ కోసం దిగులు పడేది భర్త వియోగాన్ని భరించటం అన్నింటికంటే పెద్ద కష్టం కదా -రావణుని చెరలో అదెంత పెద్ద కష్టమో సీతకు బాగా అర్థమైంది.సీత ప్రకృతి ప్రేమికురాలని తెలిసి రావణుడు ఆమెను అశోకవనంలో ఉంచాడు. ఆ వన సౌందర్యం వర్ణనాతీతం. మిథిలలో, అయోధ్యలో ఎక్కడాలేని వనవైభవం. రావణునివి పిచ్చి ప్రేలాపనలే గాని సీతను తేరిపార చూసే ధైర్యం కూడా లేదు. సీతకు అతను తృణప్రాయం.ఐనా అపహరణకు గురై పతి తన రక్షణార్థం వస్తాడని ఎదురుచూస్తూ కూర్చోవటం సీతకు నరకప్రాయంగా ఉంది.రాముడు వస్తాడు. రావణుని సంహరిస్తాడు. దీనిలో సీతకే సందేహమూ లేదు. తనను తాను రక్షించుకోగల శక్తిని నియంత్రించుకుని ఏ ప్రయత్నమూ చేయకుండా కూర్చోవటమే అసహనంగా ఉండేది. రాముని మనసు సీతకు తెలుసు. రావణసంహారం తానే చెయ్యాలనే రాముని సంకల్పం ముందు సీత ప్రతాపం వెనక్కు తగ్గక తప్పలేదు. "మన అనుబంధంలో మీకు చాలా ఇష్టమైనదేమిటి?'' అని అడిగింది సీత ఒకరోజు."నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవటం. నీ కాలిలో ముల్లు దిగినా నేనే తియ్యాలి. నిన్ను సమీపించబోయే క్రూరమృగాలను నేనే సంహరించాలి. నిన్ను రక్షిస్తున్నాననే భావన నాకు అయోధ్య సార్వభౌమత్వం కంటే ఎక్కువ గర్వాన్నీ ఆనందాన్నీ కలిగిస్తుంది'' అన్నాడు."నన్ను నేను రక్షించుకోగలను. విలువిద్యలో మీకు తీసిపోను'' అంది సీత నవ్వుతూ. రాముని ముఖం చిన్నబోయింది."నేను జీవించి ఉండగా నిన్ను నువ్వు రక్షించుకునే అవసరమే రాదు. రాకూడదు. నువ్వు నాకోసం చూడాలి. నా బలమైన బాహువుల రక్షణకోసం చూడాలి. అలాకాక నిన్ను నువ్వే రక్షించుకుంటే యిక నేనెందుకు? అలా ఎన్నడూ చెయ్యనని వాగ్దానం చెయ్యి'' సీత రాముని చేతిలో చేయి వేసింది.దాంతో అశోకవనంలో నిరీక్షణ తప్ప సీతకు మరో మార్గం లేకుండా పోయింది. అప్పుడు ఆ పతీ వియోగ వ్యధలో ఊర్మిళ ప్రతిక్షణం గుర్తొచ్చేది. ఎలా సహిస్తోంది ఊర్మిళ? 'నా ప్రియమైన చెల్లీ. ఎందుకక్కడ ఉన్నావమ్మా. ఆ అంతఃపురంపై అంత మక్కువ ఎందుకమ్మా' అని ఊర్మిళను కూడా తన దుఃఖార్తిలో కలుపుకునేది.చివరకు రావణసంహారం జరిగింది. అగ్నిపరీక్ష గడిచింది. అయోధ్య సీతారాముల రాకకై నిరీక్షిస్తోంది అని రాముడు సగర్వంగా చెప్పినప్పుడు సీతకు ఊర్మిళే గుర్తొచ్చింది.'ఊర్మిళ ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో. తన మందిరాన్ని ఎంత సుందరంగా అలంకరింపజేసిందో. తను లక్ష్మణుడి ఎదుట పడే క్షణం కోసం ఎంత అలంకరణ చేసుకుంటుందో. అంతఃపురం చేరగానే అత్తగార్లకు నమస్కరించి లక్ష్మణునితో పాటు ఊర్మిళ దగ్గరకు వెళ్లాలి. లక్ష్మణుని ఊర్మిళకు అప్పగించి వారి సంబరం చూసి - కొద్ది నిమిషాలు వారి ఏకాంతానికి భంగం కలిగించినా సరే - ఊర్మిళ మందిరం చూసే తన మందిరానికి వెళ్లాలి' ఆ దృశ్యాన్ని పదేపదే ఊహించుకుని ఆనందం పొందుతూ అయోధ్యకు తిరిగొచ్చింది సీత.ఇంత ఉద్వేగంతో వస్తే హృదయానికి హత్తుకోవడానికి ఊర్మిళ ఎదురు పడలేదు. పైగా హృదయాన్ని చీలుస్తూ ఊర్మిళ తనకు తాను విధించుకున్న అజ్ఞాతవాసపు వార్త ...
* * *
ఊర్మిళ మందిరం వెలుపలంతా అలంకరించి ఉంది. ఆమె గది తలుపులు మాత్రం మూసి ఉన్నాయి. చారుమతి మెల్లిగా తలుపు మీద తట్టి "అమ్మా - మీ సోదరి జానకీదేవి మిమ్మల్ని చూడాలని వచ్చారు'' అన్నది.సీత మనసు మనసులో లేదు.ఏమంటుంది ఊర్మిళ? తననేం అడుగుతుంది. తనేం చెప్పాలి?'తలుపులు ఎంతకీ తెరుచుకోలేదు.సీత తనే స్వయంగా పిలిచింది."ఊర్మిళా - నేనమ్మా. అక్కయ్యను వచ్చాను. అంతా చెబుతాను. మమ్మల్ని క్షమించి తలుపు తెరువు.''మెల్లగా ఊర్మిళ గది తలుపులు తెరుచుకున్నాయి. సీత ఒక్కక్షణం దిగ్భ్రమ చెందింది. సీతకు తెలిసిన ఊర్మిళ కాదీమె. ఆ కళ్లలో ఇదివరకు అమాయకత్వమే ఉండేది- మరి... ఇప్పుడు ... ఆ రెండు కళ్లలో వెలుగుతున్నదేమిటి? ఎంతో ఠీవిగా రాణిలా ఉండేది. ఇప్పుడామె శరీరంలో ఏదో గాంభీర్యం. సంయమనం. ముఖంలో ఆ తేజస్సు ఏమిటి? సీత తెప్పరిల్లుతుండగా ఊర్మిళ వచ్చి అక్కగారి పాదాలకు నమస్కరించి ఆసనం మీద కూర్చోబెట్టింది."ఊర్మిళా - పధ్నాలుగేళ్లుగా నీ గురించి ఆలోచిస్త్తున్నాను. ఎంతో బాధపడుతున్నాను'' సీత కళ్లలో కన్నీరు మరి ఆగనంటూ బైటికురికింది. "మా మీద నీకు కోపం ఉండొచ్చు.''ఊర్మిళ గంభీరంగా నవ్వింది."నాకెవరిమీదా కోపం లేదు.'' "మరి ఎందుకిట్లా అందరికీ దూరంగా - కోపం లేకపోతే ఇట్లా ఒక గదిలో బందీవవుతావా? నీ కోపాన్ని ప్రదర్శించు. ఆగ్రహించు. కానీ ఇలా ఎవరికీ కాకుండా పోకు. అసలేం జరిగిందో ఇలా ఎందుకు చేస్తున్నావో చెప్పు.''ఊర్మిళ నవ్వింది "నీకు తప్ప ఎవరికీ అర్థం కాదనే ఎవరికీ చెప్పలేదు ఇంతవరకూ...''సీత ఉత్సుకతతో ఎదురు చూస్తుండగా -"అక్కా... నేను కోపంతోనే మొదట ఈ గది తలుపులు మూశాను. నా భర్త నాతో ఒక్కమాట చెప్పకుండా, నా నిర్ణయంతో ప్రమేయం లేకుండా నేననేదాన్ని ఒకదానిని ఉన్నాననే ఆలోచన లేకుండా అన్నగారే సర్వస్వమని వెళ్లిపోయారు. కోపంతో దహించుకుపోయాను. ఈ అంతఃపురాన్ని నా తిరుగుబాటుతో తల్లకిందులు చేయాలనుకున్నాను. అందరూ మీ కోసం దుఃఖిస్తున్నారు. నా వైపు చూసేవారే లేరు. నిస్సహాయ ఆగ్రహం - నేనూ ఎవరినీ చూడదల్చుకోలేదు. సత్యాగ్రహం ప్రారంభించాను.''    
సీత మనసు అప్పటి ఊర్మిళను పట్టుకునే ప్రయత్నం చేస్తోంది."మొదలు పెట్టినపుడది ఆగ్రహమే - కానీ అది క్రమంగా సత్యం కోసం నాలో నేను, నాతో నేను చేసే అన్వేషణగా మారింది. నా కెందుకింత కోపం, నన్ను నేను కాల్చేసుకునే కోపం, నాకెదురైన ప్రతివారినీ దహించాలనే కోపం. నాకెందుకీ దుఃఖం. కారణం తెలుసు. కానీ ఆ కారణం లోపలికి, లోలోపలికి చూడాలనే తహతహ ఒకటి నాకు తెలియకుండానే పుట్టుకొచ్చింది. కోపం ఏమిటి? దుఃఖం ఎందుకు? ఆనందం దేనికి? నా శరీరానికీ, నాలో కలిగే ఈ ఆవేశాలకూ, ఉద్వేగాలకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇట్లా ఎన్నో ప్రశ్నలు - అవి నన్ను లీనం చేస్తున్నాయి. నా శరీరాన్ని గమనించటం, నా ఆలోచనల్ని... అవి నాలో రేకెత్తించే ఉద్రేకాన్ని గమనించటంతో మొదలుపెట్టాను. ఈ గమనికకు ఎలాంటి అంతరాయం కలిగినా నాకు అశాంతిగా ఉండేది. అందుకే నేను ఏకాంతాన్ని కోరుకున్నాను. ఒంటరితనాన్ని కాదు ఏకాంతాన్ని. నాలో నేను, నాతో నేను సంభాషించుకునే ఏకాంతాన్ని.ఆ సంభాషణ నన్నూ, నాకు సంబంధించిన వ్యక్తులనూ ఎదురెదురుగా నిలబెట్టేది. మా సంబంధాన్ని చీల్చి చూసేది. ప్రతి ఒక్క సంబంధాన్ని, మన తండ్రి, నీవు, లక్ష్మణుడు, రాముడు, కౌసల్య యిలా అందరితోటి నా సంబంధపు సారాంశం ఏమిటని పొరలు, పొరలు విప్పి చూశాను. అక్కగా నిన్ను ప్రేమించినపుడు, నన్ను ఒదిలి నీ భర్తతో నువ్వెళ్లిపోయినపుడు మన మధ్య సంబంధంలో జరిగిన మార్పు ఎలాంటిది - ఎందుకలా జరిగింది? ప్రేమను కోపంగా మార్చే రసాయనిక చర్య మూలం ఏమిటి?అసూయ, ద్వేషం, ప్రేమ, గౌరవం - వీటి మధ్య తేడా ఎంత? అసలుందా లేక ఒకే వర్ణ ఛాయా బేధాలా అవి? ఒక నీడలోకి ఇంకొక వెలుగు, ఒక వెలుగులోకి ఇంకొక నీడ ఎలా చొరబడుతుంది. ఏది వెలుగు? ఏది నీడ?ఒక్కొక్క ప్రశ్న ఉదయస్తున్న కొద్దీ నాలో సమరోత్సాహం వంటిది కలిగేది. మన పతులు ఈ పధ్నాలుగేళ్లూ రాక్షససంహారం కోసం యుద్ధాలు చేశారని విన్నాను. దాని వల్ల శాంతి చేకూరిందో, చేకూరుతుందో నాకు తెలియదు. కానీ నేనీ ప్రశ్నలతో చేసిన యుద్ధంలోంచి నాకు మాత్రం ఒక గొప్ప శాంతి, ఆనందం వచ్చింది.''ఊర్మిళ ముఖంలో ఆ శాంతి ప్రస్ఫుటమవుతూనే ఉంది. సీత ఊర్మిళను ఆశ్చర్యంతో చూస్తూ, ఆమె మాటలను వింటూ, ఆమె చేశానని చెబుతున్న యుద్ధాన్ని ఊహించుకుంటోంది. ఆమెకు లక్ష్మణుడి గురించి ఒక ఆరాటం మొదలైంది.    "లక్ష్మణునికి నీ మీద ప్రేమ ఉంది ఊర్మిళా - అతనితో -''సీత మాటలకు అడ్డు వచ్చింది ఊర్మిళ."పధ్నాలుగేళ్ల తర్వాత కలవబోతున్నాం మేమిద్దరం - ఏమో - నేను మాత్రం చాలా మారాను. మార్పు జీవన సంకేతం. దానికి అతను ఇచ్చే విలువను బట్టే మా ఇద్దరి జీవిత గమనం సాగిపోతుంది.నేను ద్వేషంతో కాకుండా న్యాయాన్ని గురించి ప్రశ్నించగల విజ్ఞత సంపాదించుకున్నాను. లక్ష్మణునితో నా సంబంధం అతను 'నా విజ్ఞతను ఎలా అర్థం చేసుకుంటాడు. ఎంత గౌరవిస్తాడు' అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అతను మిగిలిన అధికారాలను ఒదలకుండా వాటికి లోబడుతూ నాపై మాత్రం అధికారాన్ని ఒదులుకుంటాడా - ఏమో - చెప్పలేను. ఏదెలా జరిగినా నా శాంతి మాత్రం భగ్నమవదు. ఆ శాంతి అవతలి వ్యక్తికి కావాలా లేదా అన్నదే ముఖ్య.''సీత ముఖంలోని ఆందోళన ఊర్మిళకు అర్థమైంది. తనను తాను మరింత విప్పి చెప్పుకుంటే సీత ఆందోళన తగ్గుతుందా - ప్రయత్నించాలనుకుంది. "నా చుట్టూ ఉన్నవారితో నాకున్న సంబంధంలోని అధికారాన్ని గుర్తించినపుడు నాకు సమస్తం తెలిసిన భావన కలిగింది. సర్వ దుఃఖాలకూ మూలం అధికారమేనక్కా - ఇంకొక చిత్రం తెలుసా? ఈ అధికారాన్ని మనం పొందాలి. ఒదులు కోవాలి. నేను ఎవరి అధికారానికీ లొంగను. నా అధికారంతో ఎవరినీ బంధించను. అపుడు నన్ను నేను విముక్తం చేసుకున్న భావన. నాలో ఇక ఒకే ఆనందం. గొప్ప శాంతి. ఎంతో ప్రేమ. అందరి మీదా జాలి. పాపం ఈ అధికార చట్రాలలో పడి ఎలా నలుగుతున్నారో గదా - విముక్తం అయ్యే దారి తెలియక అశాంతులతో, దుఃఖాలతో, ద్వేషాలతో కుళ్లిపోతున్నారు గదా - అందరికీ చెబుదామా ఈ శాంతి రహస్యం అనుకున్నాను.    కానీ ఎవరికి అర్థమవుతుంది?పధ్నాలుగేళ్లు సత్యశోధనలో నే చేసిన గొప్ప తపస్సును నిద్ర అనుకున్న వాళ్లకు నా మాటలు అర్థం అవుతాయా? నిద్రపోయానట నేను. నిద్రకూ మెలకువకూ అర్థం తెలుసా వీళ్లకు? ఎన్నడైనా శాంతిగా నిద్రపోయారా? చైతన్యంతో మేలుకున్నారా? నాది నిద్ర అంటారు - పిచ్చి అంటారు నా మాటలు వింటే -''    "లేదు ఊర్మిళా నీ మాటలు ఎంతో బాగున్నాయి. నిజంగానే నువ్వు గొప్ప తపస్సు చేశావు.''    "నాకు తెలుసక్కా నీకు అర్థమవుతుంది. అందుకే ఇవాళ పెదవి విప్పాను. కానీ అక్కా - నీ జీవితంలో నాకొచ్చినటువంటి పరీక్షా సమయం వస్తే - అప్పుడు ఆ పరీక్ష నిన్ను మామూలుతనంలోకి, మురికిలోకి నెట్టకుండా, ద్వేషంతో, ఆగ్రహంతో నిన్ను నువ్వు దహించుకోకుండా కాపాడుకో. నీ మీద అధికారాన్ని నువ్వే తీసుకో - ఇతరులపై అధికారాన్ని ఒదులుకో. అప్పుడు నీకు నువ్వు చెందుతావు. నీకు నువ్వు దక్కుతావు. మనకు మనం మిగలటమంటే మాటలు కాదక్కా - నా మాట నమ్ము.''


    ఊర్మిళ మాట్లాడుతుంటే సీత మనసులోకి ఒక నెమ్మదితనం ప్రవేశించింది. ఒక్కరోజులో ఇన్నేళ్ల ఊర్మిళ సంఘర్షణను అర్థం చేసుకోలేను అనుకుంది సీత. రామునితో ఊర్మిళ చెప్పినవన్నీ చెప్పింది."ఈ మార్పు నా తమ్ముని బాధించదు గదా'' అన్నాడు రాముడు."ఊర్మిళను చూస్తేనే బాధలన్నీ పోయేలా ఉన్నాయి'' అంది సీత.
* * *
లక్ష్మణుడు అరణ్యంలో ఒదిలి వెళ్లాక, నట్టనడి సముద్రంలో మునిగున్నాననిపించినపుడు సీత కళ్లముందు మళ్లీ ఊర్మిళ కదలాడింది. జీవితంలో ఎడబాట్లు, అపనిందలేనా దక్కిందని ప్రశ్నించుకుని అరణ్యరోదనం చేస్తున్న ఆ సమయంలో సీతకు ఊర్మిళ మాటలన్నీ మళ్లా గుర్తొచ్చాయి. ఊర్మిళకు చెప్పకుండా లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్లాడు. తనకు చెప్పకుండా రాముడు తనను అరణ్యాలలో వదిలేసిరమ్మని లక్ష్మణుడిని నియోగించాడు.ఊర్మిళ సత్యాగ్రహమో, తపస్సో ఏదో చేసి తనను తాను కాపాడుకుంది. "అధికారాన్ని తీసుకో. అధికారాన్ని ఒదులుకో. అప్పుడు నీకు నువ్వు చెందుతావు. నీకు నువ్వు దక్కుతావు. మనకు మనం మిగలాలి'' ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఊర్మిళ ఈ మాటలే మళ్లీమళ్లీ చెప్పింది. అవి తనకు ఊర్మిళ గురించిన అశాంతిని తగ్గించాయి. మరి ఇప్పుడు తన మాటేమిటి? తను సత్యాగ్రహం ప్రారంభించాలా? ఆగ్రహం తగ్గేదెప్పుడు? సత్యం బోధపడేదెన్నడు? ఎట్లా-రాముని మీద ఎనలేని అనురాగం. అయినా ఎప్పటికప్పుడు వియోగం. రాముడి నుంచి తనకు విముక్తి ఎప్పుడు దొరుకుతుంది? ఎలాంటి పరీక్ష ఇది? అగ్ని పరీక్ష ఏపాటిది దీనిముందు - తనకు యుద్ధవిద్యలన్నీ వచ్చినా ఎన్నడూ ఎవరిమీదా యుద్ధం చెయ్యలేదు. కాని ఇప్పుడు తనమీద తనే యుద్ధం చేసుకోవాలి.యుద్ధం మొదలైంది. ఎన్నేళ్లు సాగుతుందో.
* * * 
"రామచంద్రుడు అశ్వమేధయాగం చేస్తున్నాడమ్మా. ఆహ్వానం పంపించాడు. నేను వెళతానమ్మా'' చెప్పాడు వాల్మీకి మహర్షి. కాసేపు సీత సమాధానం కోసం చూసి మహర్షి వెళ్లిపోవటం సీతకు తెలియలేదు. ఆమె దేనినీ గమనించే స్థితిలో లేదు.అశ్వమేధయాగం రాముడెలా చేస్తాడు? తను పక్కన లేకుండా ఎలా? తన స్థానంలో ఎవరు కూచుంటారు?సీత మనసులో జ్వాల రేగింది."ఎవరు కూచుంటేనేం? నీకేం సంబంధం''సీత మనసు చదివేసినట్లు మాట్లాడుతూ నవ్వుతూ వచ్చింది ఊర్మిళ.    "ఊర్మిళా - నువ్వు'' సీత ఆశ్చర్యానికి మేరలేదు.    "నేనే వచ్చాను. నువ్విక్కడ ఉన్నావని లక్ష్మణుడు చెప్పాడు. అశ్వమేధ యాగవార్త నీకు చేరుతుందని తెలుసు. నీ మనసులో అది ఎలాంటి భూకంపం లేవదీస్తుందో కూడా ఊహించాను. ఆ సమయంలో నిన్ను నిన్నుగా మిగల్చాలని వచ్చాను.''సీత ఊర్మిళను ఆలింగనం చేసుకుని పక్కన కూచోబెట్టుకుంది. చాలాసేపటి నిశ్శబ్దం తర్వాత, ఆ నిశ్శబ్దంలో అనేక మాటలు నడిచాక -"యాగం శ్రీరామచంద్రుడే చేస్తున్నాడా?'' అడిగింది సీత.    "మరెవరు చేస్తారు? చక్రవర్తులే గదా చెయ్యాలి.''"నేను లేకుండా ఎలా -''"ఆ ప్రశ్న నీకెందుకు రావాలి? వస్తే రాముడికి రావాలి. యాగం చేయించే వారికి రావాలి. అనవసరమైన ప్రశ్నలతో అశాంతి పడటం అవివేకం కదా?''సీతకంటే పెద్దదానిలా పలికింది ఊర్మిళ."నీకు తెలుసు. చెప్పు ఊర్మిళా రాముని పక్కన కూర్చునేదెవరు?''"నేను నీకు సమాధానం చెప్పి నీ అగ్నిని తాత్కాలికంగా చల్లార్చటానికో మరింత ప్రజ్వరిల్ల చేయటానికో రాలేదు. అనవసరమైన ప్రశ్నలతో నిన్ను నువ్వు హింసించుకోవద్దని చెప్పటానికే వచ్చాను.''"కానీ నేనిది మింగలేకపోతున్నాను.''"మింగవద్దు. అసలది నీ మనసులో ప్రవేశించనే వద్దు. నువ్వు రాముడి నుంచి విముక్తం కావాలి.''"ఊర్మిళా -''సీత వెక్కి వెక్కి ఏడ్చింది."ఎన్ని పరీక్షలు ఊర్మిళా...''"ప్రతి పరీక్షా నిన్ను రాముడి నుంచి విముక్తం చెయ్యటానికే. నిన్ను నీకు దక్కించటానికే. యుద్ధం చెయ్యి. తపస్సు చెయ్యి. లోపలికి చూడు. నీవనే యధార్థం కనపడేదాకా చూడు.''"చాలా కష్టంగా ఉందమ్మా'' సీత గొంతులోంచి మాట కష్టంగా వచ్చింది."చాలా హాయిగా కూడా ఉంటుందక్కా. ప్రయత్నించు మరి నే వెళ్తాను'' ఊర్మిళ లేచింది."అప్పుడేనా? నా పిల్లల గురించి వినవా? వారిని చూడవా?''"వాళ్లు నా దగ్గరకు వస్తే, నన్ను చూడాలని వస్తే తప్పకుండా చూస్తాను.''
* * *
ఊర్మిళ ఎంత హఠాత్తుగా వచ్చిందో అంత హఠాత్తుగా వెళ్లిపోయింది. సీత మనసులో జ్వాల మాత్రం అంత హఠాత్తుగా ఆరలేదు. దాని నాపటానికి సీత కఠోరశ్రమ చేసింది.ఎక్కడెక్కడో మూలమూలల దాగిన నిప్పురవ్వలు, ఎప్పటి నుంచో నివురుగప్పిన నిప్పులు కణకణ మండసాగాయి.ఆ మంటలో సుఖాన్ని అనుభవించటానికి అలవాటుపడుతున్న సమయంలో సీతకు వాటిని ఆర్పాలని తెలిసింది.రాముడిని ప్రేమించటం సుఖమా, రామునిపై ఆగ్రహించటం సుఖమా అనే ద్వైదీభావంలో మనసు కొట్టుమిట్టాడటం సీతకు తెలిసీ తెలియని స్థితిలో జరిగింది.ఆగ్రహాన్ని రగిలించుకోవటంలో, జ్వాలను పెద్దది చేయటంలో బాధగా కనపడే సుఖాన్ని పట్టుకోవటం తేలిక కాదు.రాముడిపై ప్రేమ యిచ్చే సుఖంలోని బాధను తట్టుకోవటమూ తేలిక కాదు.ఈ రెండిటినీ దాటి రాముడినుంచి విముక్తమయ్యే యత్నం ఎంతో యాతనాభరితమైంది సీతకు.ఐనా సీత ఆ తపస్సు చేసింది.కల్లోల కడలి శాంతి సాగరమయ్యే దాకా మథనం సాగించింది. క్రమంగా ఆ శాంతి సీతను ఆసాంతం ఆవరించింది.వాల్మీకి మహర్షి అశ్వమేధయాగం చూసి వచ్చేనాటికి సీత మనసు పూర్తిగా తేటపడింది.రాముని పక్కన యాగం కోసం కూర్చున్నదెవరు? అని అడగాలని వాల్మీకిని చూసిన తర్వాత కూడా సీతకు తోచలేదు.కొన్ని రోజుల తర్వాత వాల్మీకి సీతకో విషయం చెప్పేందుకు వచ్చాడు."రాముడు లవకుశులను స్వీకరించాడు. సీతనూ స్వీకరిస్తాడు. ఐతే సీత వచ్చి నిండు సభలో తను నిర్దోషినని ప్రకటించుకోవాలి.'' ఈ మాటలు సీత ప్రశాంతంగానే విన్నది. చిరునవ్వుతోనే విన్నది."అంత అవసరం ఉందంటారా నాకు'' అని మాత్రం అన్నది.శాంత స్మిత వదనంతో పిల్లలనుంచి కూడా విముక్తురాలై తానెక్కడ నుంచి వచ్చిందో అక్కడికి ప్రయాణమైంది.
(ఆదివారం ఆంధ్రజ్యోతి 7 మార్చి 2010 సంచికలో ప్రచురితం)



24, జనవరి 2020, శుక్రవారం

సాక్షాత్కారం

సాక్షాత్కారం కథ చదవండి .. సత్యం శంకరమంచి అమరావతి కథలు నుండి ... సేకరణ . 
కాపీరైట్స్ విషయమై    అభ్యంతరం ఉంటే తెలియజేయండి తొలగించగలను . 




8, ఆగస్టు 2019, గురువారం

తులసి పూలు

నేను రచయితలని గురువులు అనుకుంటూ చదివేను. రచయిత చెప్పినది ఆలోచించుకోడమే కానీ ఇది ఎందుకిలా రాసేరు అని ప్రశ్నించలేదు. - నిడదవోలు మాలతి
ఇపుడు ప్రశ్నించే తరం మన ముందు వుంది. అది మొన్న తెనాలిలో జరిగిన కొత్తకథ 2019 ఆవిష్కరణ సభలో విద్యార్ధులు చాలా ప్రశ్నలే వేసారు.
నేను కూడా వొక ప్రశ్నతో వచ్చానిపుడు. మహ్మద్ ఖదీర్ బాబు రీ టోల్డ్ కథల సంకలనం నుండి పొద్దున్నే వొక కథ చదివాను. “పుష్పలత  నవ్వింది” అనే  కథ. రచయిత కరుణ కుమార్.
రీ టోల్డ్ చేయబడిన యీ మంచి కథలో.. వొక వాక్యం.. ఇదేంటి.. యిలా వ్రాసేరు అని అనుకున్నా.. “పూలు పూయని తులసి మొక్కే నిత్యం పూజలు అందుకుంటుంటే నీకేంటి? దాన్ది పుణ్యమైతే ఈ మార్గం ఎంచుకున్న మన్ది కూడా పుణ్యమే” అంటుంది పుష్పలత తల్లి. ఈ వాక్యం వ్రాసింది “కరుణ కమార్” or ఖదీర్ బాబు?
తులసి మొక్క పూలు పూయకపోవడం యేమిటి? అగ్రికల్చర్ కస్టమ్స్ కళ్ళుకప్పి మరీ వేరే దేశాలకు భారతీయులు తులసి విత్తనాలు తీసుకువెళుతుంటే..
ఇలా రచయితలు నాతో సహా యేదో వొక విషయంలో పరధ్యానంలో పొరబడుతూనే వుంటారు. పాఠకులు ప్రశ్నిస్తూనే వుంటారు అని చెప్పడమే నా వుద్దేశం తప్ప భూతద్దంతో చూడటం కాదు. మహ్మద్ ఖదీర్ బాబు రీ టోల్డ్ కథలు 26 ఇంతకు ముందే చదివాను. మిగతా కథలు కోసం మళ్ళీ కొనుక్కొచ్చుకున్నాను. రూపాయలు 150/ యే కానీ.. విలువైన పుస్తకం. అబ్బూరి ఛాయాదేవి గారి రచన “సుఖాంతం” ను మా కిట్టీ పార్టీ సభ్యులకు వినిపించాను కూడా.
సరే మరి... పూలు పూసిన తులసి ని కూడా చూడవచ్చు. 
మాటలో మాట ...

గతంలో నేను కూడా మబ్బులు విడివడి అనే కథలో రంజాన్ రాఖీ పండుగ ఒకే రోజు వచ్చాయని వ్రాసేను. అప్పుడు ఎవరో చూసి చెప్పేదాకా నేనిలా వ్రాసేనని నాకు తెలియదు. ఆ దెబ్బతో వొళ్ళు దగ్గరపెట్టుకుని వ్రాయడం మొదలెట్టాను. ఇలాగే పరధ్యానంలో వ్రాసేవి కొన్నైతే .. కావాలని ఇతర మతం, సంప్రదాయాల పై కావాలని వ్యాఖ్యానించేవారు కొందరు. తర్వాతా వివాదాలు. ఇప్పుడు మరీ సందు ఎప్పుడు దొరుకుతుందా అని కాసుకుకూర్చుని ఉన్నట్టు వుంటారు. ఇతర మతస్తుల గ్రంధాలు అందరూ చదివి ఉండరు. కానీ వ్రాయడం చేస్తారు. మనోభావాలు దెబ్బతిన్నాయని వాదనలు. యేమిటో ..  అర్ధమై చావదు. ముసుగులు వేసుకుని బయటకు కనిపించే మనుషులు వేరు అంతరంగం వేరు అన్నట్టు వుంటున్నారు. ఇదో వేదన. మనుషులకు దూరంగా పారిపోవడం నయం లా ..వుంది. ఇక స్నేహాలు కూడానా ! 

మా ఇంట తులసితో నా స్నేహం ... యిలా ..

తులసిపూలు 


21, జులై 2019, ఆదివారం

" పూవై పుట్టి" కథ వెనుక ..

ఫ్రెండ్స్ ....
కొత్త కథ 2019 లో వున్న నేను వ్రాసిన కథ " పూవై పుట్టి" రచన వెనుక ఉన్న కథ
ఈ కథ గురించి తప్పనిసరిగా మీతో చెప్పాల్సిన నాలుగు మాటలు
ఈ కథను వ్రాసాక ఒకో పత్రికకు పంపి తిరిగి వచ్చినప్పుడల్లా tone మార్చి తిరగ వ్రాసాను. అలా మూడుసార్లు తిరగ వ్రాసిన కథ యిది. ఈ కథను ముగ్గురు మిత్రులు చదివారు. ఎవరికీ యిది నేను వ్రాసిన కథ అని చెప్పలేదు. ముగ్గురూ మూడు రకాల అభిప్రాయాలు చెప్పారు కానీ వొకరు కూడా యీ కథలో నిజ జీవిత ఛాయలను కనుగొనలేక పోయారు.. కొత్త కథ 2019 కి పంపినపుడు టైటానిక్ సురేష్ గారు ఆ కథను క్యాచ్ చేసారు. బాగా తీసుకువచ్చారు వనజ గారూ అని మెచ్చుకున్నారు.
ఈ కథ వ్రాయడం వెనుక నా ఆలోచనల్లో వూపిరి సలపనితనం వుంది. ఒక వేదనటీగ నా మస్తిష్కం పై వాలుతూ వుండి నన్ను నిలవనీయకుండా చేసింది. కథ వ్రాయక ముందు విపరీతంగా హోమ్ వర్క్ చేయాల్సి వచ్చింది. వ్రాసిన తర్వాత చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యాను. ఇప్పుడీ కథ బావుంది బాగోలేదు అనే ప్రశంస విమర్శ కోసం కూడా నేను యెదురుచూడటం లేదు. కథ పాఠకలోకంలోకి వెళ్ళింది అది చాలు. ఈ కథకు వొక మంచి ప్లాట్ ఫామ్ దొరికింది అది చాలు.
ఇంకొక విషయం ఏమిటంటే వంద కథలు వ్రాసిన అనుభవంలో ఈ కథను యెలా పడితే అలా వ్రాయలేదు. పూవు పూవు కలిపి జాగ్రత్తగా మాలనల్లినట్లు ఓర్పుగా కూర్చి కూర్చి వ్రాసాను. రచయితగా ఈ కథ వ్రాయడం నాకెంత తేలికో అంత కష్టమనిపించిన కథ యిది. మనసు ఉగ్గబట్టుకోలేక వ్రాయకుండా వుండలేని తనంలో వ్రాసాను. ఈ కథ వ్రాయాలని తపించాను. వ్రాసిన తర్వాత నా మనసుకు మరియు ఆలోచనకు నచ్చిన, సంతృప్తినిచ్చిన కథ యిది. నేనెపుడూ చెబుతూవుంటాను.. నాకథలన్నీ ముప్పాతిక వంతు జీవితకథ పావు వంతు కల్పన అని.. ఈ కథ పూర్తిగా కల్పన అనుకుంటే మంచిది. నన్నెవరూ ప్రశ్నలు వేయకుండా వుంటారు. పోనీ పూర్తిగా.. జీవితకథ అనుకోండి. అపుడుకూడా నన్నేమి అడగకండి. Even then I feel safe. 
బంగారు పళ్ళేనికి కూడా గోడ చేర్పు అవసరం.
అక్షరాలు బంగారం అవునో కాదో తెలియాలంటే... ఏదో వొక గోడ అవసరమైన కాలం... ఈ కాలం  పత్రికలు ప్రచురించడానికి అనుమతించని కథలు రావాలంటే ఇలాంటి కథాసంపుటాలు రావాల్సిన ఆవశ్యకత వుందని నేను భావిస్తున్నాను.
Thank you so much కొత్తకథ 2019. Thanks Khadeer Garu & Suresh Garu
కొత్త కథ 2019 ను కొనండి, చదవండి. చదువుతారు కదూ





31, జనవరి 2019, గురువారం

तितलियाँ ढूंढने वाले

నిష్క్రమణం


तितलियाँ ढूंढने वाले వినసొంపైన శీర్షిక. ఈ సౌందర్యమైన శీర్షిక వెనుక అంతులేని విషాదం వుంది. ఆ విషాద కథ హృదయాన్ని తుత్తినియలు చేస్తుంది. ఒక ఉర్దూ కథ కి అనువాదం "నిష్క్రమణం" అనే శీర్షిక  చదివి కొంచెం విచారించాను. ఈ కథ ప్రాంభం నుండి మనల్ని ఊపిరాడనీయదను. ఎవరో గుండెని పిడికిటి బిగించి క్షణానికోసారి నొక్కుతున్నప్పుడు వుండే నొప్పి. చాలా శక్తివంతమైన శిల్పం. 


ఈ కథను వ్రాసింది జహీదా హీనా.. భారతదేశంలో పుట్టి స్వాతంత్య్రం అనంతరం పాకిస్తాన్ కి వెళ్లిన ఆమె కవిగా కథకురాలిగా కాలమిస్ట్ గా ఇంకా మీడియా లో పనిచేస్తూ వున్నా సృజనశీలి. ఆమె వ్రాసిన కథ तितलियाँ ढूंढने वाले   


నార్జిస్ ఆమె భర్త హుసేన్ . మిలటరీ కాలంలో  స్వేచ్ఛగా ఆలోచనలు చేసినందుకే నిర్బంధించి భార్య భర్తలిరువురుని బంధిస్తారు . కొన్నాళ్ళకు హుసేన్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రకటిస్తారు జైలు అధికారులు. నార్జిస్ కి తెలుసు తన భర్త ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని. అప్పుడే ఆమెకు తెలుస్తుంది తాను తల్లి కాబోతుందని. ఆమె బిడ్డకోసం సత్యం కోసం ఆశతో జీవిస్తుంది . ఏదో ఒక నేరం చేసి జైలుకి వచ్చిన చాలామంది ఏ నేరం చేయకుండానే నార్జిస్ ను చూసి గౌరవభావంతో ప్రేమతో మెలుగుతారు. ఆమెకు కొడుకు పుడతాడు ఆ బిడ్డ పేరు మెహదీ తల్లితోపాటు జైలు నాలుగుగోడలమధ్యే పెరుగుతాడు. నార్జిస్ కి అందరూ క్క్షమాభిక్ష కోసం ఆర్జీ పెట్టుమని చెపుతారు . తప్పు చేయని తాను క్షమా భిక్ష పెట్టుకోవడం యిష్టం లేదని ఉరిశిక్ష అయినా చింతించనని చెపుతుంది. మర్నాడు ఉరి తీయబోతున్నారనగా బిడ్డకి ఎప్పటిలాగానే కథలు చెపుతుంది. రేపు ఇక తానూ కనబడనని సీతాకోకచిలుకలు వెతకడానికి వెళుతున్నానని అవి దొరకడం ఆలస్యమవుతుందని బిడ్డకి చెపుతుంది. 


సీతాకోకచిలుకలు స్వేచ్చకీ ప్రతీక. జైలు గోడల మధ్య సీతాకోకచిలుకలని చూడలేని బిడ్డకి వాటిని వెతుకుతూ వెళతానని చెపుతుండటం చదివిన పాఠకులకి  దుఃఖం వువ్వెత్తున్న ముంచుకొస్తుంది. పసిపిల్లవాడి అమాయకత్వం తల్లి ప్రేమ ఎంతో ఉద్దాతంగా చిత్రీకరించిన కథ యిది. రచయిత  స్త్రీ కాబట్టే  అంత సున్నితంగా హృద్యంగా కథను చిత్రీకరించగల్గిందని నాకు ఎన్నోసార్లు అనిపించింది. నేను చదివిన వేల కథల్లో ఇదొక అత్యుత్తమ కథ. బాగా గుర్తుండిపోయే కథ. ఈ కథను చాలా బాగా అనువదించిన షణ్ముఖరావు గారికి అనువాద కథగా పాఠకుల ముందుకు తీసుకువచ్చిన సాక్షి funday సంచిక వారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే! అలాగే జహీదా హీనా  ముందు నేను నిలబడగలిగే అవకాశం వస్తే నా కన్నీళ్లతో ఆమె చేతులను ముద్దాడతాను ఇంత హృద్యమైన కథ అందించినందుకు.  చదవండి పూర్తి కథ .. 


నిష్క్రమణం


నార్జిస్‌ కటకటాల వెనుక నుంచి తల్లిని చూసింది. ఆమె పండిన జుత్తునీ, ధారాపాతంగా కురుస్తున్న కన్నీటినీ చూసింది. ఆమె పక్కనే నిల్చుని ఉన్న సోదరుణ్ణి చూసింది. అతని తల విషాదంతో అవనతమై ఉండటాన్ని చూసింది. అయినా నార్జిస్‌కు అతని ఖిన్న వదనం స్పష్టంగానే కనపడింది.  నార్జిస్‌తో పాటు జైల్లో పెరుగుతున్న ఆమె కొడుకు మెహెదీ అమాయకంగా నవ్వుతున్నాడు. చప్పట్టు కొడుతూ మేనమామ వైపు చాక్లెట్‌ కోసం చెయ్యి చాచాడు. అప్పుడతను వొంచిన తల ఎత్తాడు. కటకటాల లోంచే పిల్లవాడి చేతుల్ని తన చేతిలోకి తీసుకున్నాడు. మామయ్య కన్నీరు మేనల్లుడి చేతిలో పడ్డది. మురికి తుడుస్తున్నట్టు నటిస్తూ ఆ చేతుల్ని తుడిచాడు. ఈ దృశ్యం నార్జిస్‌ జ్ఞాపకాల పెన్నిధిలో ముద్రితమైపోయింది. ఆమెలో ఒక ఉపశమన భావం కలిగింది. ప్రస్తుతం వార్ధక్యంలో ఉన్న తల్లి చనిపోయిన తర్వాత కూడా మెహెదీని చూసుకోవడానికి తన సోదరుడు ఉన్నాడనే భరోసా నార్జిస్‌కు కలిగింది. అతడు ఈ పిల్లవాణ్ణి పెంచగలడు. విద్యాబుద్ధులు చెప్పించగలడు. వాడి జీవితానికి మార్గదర్శి కాగలడు.క్షమాభిక్ష కోసం అర్జీపై సంతకం పెట్టమని ఆమె సోదరుడు ఎంతో ఒత్తడి చేశాడు. కానీ నార్జిస్‌ సుతరామూ ఇష్టపడలేదు. మిలటరీ పాలనలో నేరమేమీ చెయ్యకుండానే కేవలం ఆలోచనా విధానానికే ఉరిశిక్ష విధిస్తారు.అటువంటి స్థితిలో క్షమాభిక్ష అర్థించడం అనవసరమని నార్జిస్‌ దృఢంగా విశ్వసించింది. అభ్యర్థన సమర్పించడానికి గడువూ ముగిసిపోయింది. ఇప్పుడామె మృత్యు ముఖద్వారం వద్ద వేచి ఉన్నది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించడానికి చేయూతనిచ్చినట్టు ఆమె తల్లి నార్జిస్‌ చెయ్యి పట్టుకుంది.


నార్జిస్‌కు తన వారితో ఇదే చివరి సమాగమం. ఇక ఈ క్షణంలో వారు విడిపోవడమంటే శాశ్వతంగా వీడ్కోలు చెప్పుకోవడమే. ఈ క్షణం దుర్భరమైనదీ, అత్యంత దుఃఖభరితమైనదీ. ఈ క్షణంతోనే ఆమెకు అందమూ అనాకారితనమూ, మంచీ చెడూ, ప్రేమా ద్వేషమూ మిళితమై ఉన్న బాహ్యప్రపంచంతో సంబంధం తెగిపోనున్నది. పసివాడు మెహెదీ నవ్వుతూ తన మామతో ఏదో మాట్లాడేస్తున్నాడు. ఊచల మధ్య నుంచి తల దూర్చి మామని ముద్దు పెట్టుకున్నాడు. తన చిన్ని చేతివేళ్లని అమ్మమ్మ పండు జుత్తులో చొప్పించాడు.  ‘‘అమ్మా! ఇక మెహెదీకైనా స్వేచ్ఛ లభిస్తుంది. సంతోషించు. ఈ ఇనుప గొలుసులు, చేతి సంకెళ్లూ, నిర్బంధాలు ఇవే వాడి ప్రపంచమైపోయాయి. వాడూ ఈ బ్యారెక్స్‌లోనే పుట్టాడు. ఇంతవరకు ఇక్కడే పెరిగాడు. ఇక వాడు విడుదలవుతాడు. బడికి వెళ్లగలడు. బజారుకెళ్లగలడు. పార్కులో ఆడుకోగలడు. తమ్ముడూ! ఇక ముందు వీడిని పెంచే బాధ్యత నీదే.’’  ‘‘అక్కా! అక్కా! అలా మాట్లాడకు.’’ అంటూ నార్జిస్‌ సోదరుడు ఒక్కసారిగా భోరుమన్నాడు. అప్పుడామె మౌనం వహించింది. తల్లి వేదనా సోదరుడి దుఃఖం అర్థమయ్యాయి. కాని ఇతరులకు జీవితాన్ని ఇవ్వడానికి వేరొకరు మరణాన్ని ఆహ్వానించక తప్పదని, వారికి వివరించలేకపోయింది. సంపూర్ణమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సాధించాలంటే కొన్ని జీవితాలు ఉరికంబానికి బలి చెయ్యక తప్పదని వారికి విశదీకరించలేకపోయింది.


నార్జిస్, ఆమె భర్త హుస్సేన్‌ ఒకేసారి అరెస్టయ్యారు. అప్పటికే ఆమె గర్భిణి. ఇంటరాగేషన్‌ సమయంలో హుస్సేన్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పుకార్లు పుట్టించారు. మిలటరీ నిర్బంధంలో ఇవన్నీ సర్వసాధారణం. చిత్రహింసలు తట్టుకోలేక చనిపోయిన వారి శవాల్ని కుటుంబాలకు అప్పగించరు. కనీసం తెలియజెయ్యరు. మిలటరీ వారే పూడ్చిపెట్టేస్తారు. ఆ హత్యలని ఆత్మహత్యలుగా ప్రచారం చేస్తారు.హుస్సేన్‌పై ఆమెకు గల విశ్వాసం రవ్వంత కూడా చలించలేదు. ఆమెలానే అతడు కూడా అంతరాత్మ గల వ్యక్తి. అటువంటి ఖైదీలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కారు. వారు క్షమాభిక్షనూ అర్థించరు.ఈ చివరిచూపుల పర్వం ముగియగానే నార్జిస్‌ తల్లి ఒకవిధమైన నిర్వేదంలో పడిపోయింది. సోదరుడు కటకటాల్లోంచే ఆమె చేతిని ముద్దాడాడు. జుత్తు నిమిరాడు. తర్వాత వాళ్లు వెళ్లిపోయారు. కాదు, వారైవెళ్లలేదు. వారిని బయటకు తీసుకుపోయారు. నార్జిస్‌ ఒక్కసారి సోదరుణ్ణి దగ్గరకు తీసుకోవాలనుకుంది. కౌగిలించుకోవాలనుకుంది. కానీ ఇద్దరి మధ్య కఠినాతి కఠినమైన కటకటాలు అడ్డు నిలిచాయి. జైలు నియమాలను మనుషులే తయారు చేస్తారు. కానీ వాటిలో కాస్తంత కూడా మానవత్వం పాలు ఉండదు.  తన మామ అటు వెళ్లగానే మెహెదీ బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. అమ్మ చెప్పిన కథల్లోని లోకాలనూ స్థలాలనూ చూడాలని వాడు కలలు కంటున్నాడు. కానీ అమ్మ ఎక్కడికీ వెళ్లనివ్వడం లేదు.


‘‘నువ్వు రేపు వెళ్దువుగాని నాన్నా! మామయ్య నిన్ను రేపు బయటకు తీసుకెళ్తాడు.’’ అని నెమ్మదిగా అంటూనే నార్జిస్‌ మెహెదీ బుగ్గల్ని ముద్దు పెట్టుకుంది.జైలు వార్డెన్‌ మరియమ్‌ తల్లీ కొడుకుల వైపు ఒక్కసారి చూసింది. తర్వాత చూడలేక తన కళ్లను కిందకు దించుకుంది. ‘ఈమె ఎటువంటి మహిళ? ఉరిశిక్ష రద్దు కోసం క్షమాభిక్ష అర్జీనైనా పెట్టుకోలేదు. రేపు ఉదయం శిక్ష అమలు చేస్తారని తెలిసినా ఒక్క కన్నీటి బొట్టు కూడా విడువలేదు. ఏడవలేదు. భగవంతుడిని తిట్టుకోవడం లేదు. కనీసం జైలరునైనా తూలనాడటం లేదు’ అనుకుంది. నిజానికి నార్జిస్‌ ఒక విచిత్రమైన మహిళ. ఆమె చేతికి ఖురాన్‌ ఇచ్చినా, ఆమె దాన్ని కళ్లకు అద్దుకుని పక్కన పెట్టేసింది. తన పిల్లవాడ్నే ముద్దులతో ముంచెత్తింది. మౌల్వీ ప్రార్థన చేయించడానికి వచ్చాడు. సర్వవ్యాపి అయిన దయామయుడైన దేవుడిని తన పాపాలను ప్రక్షాళనం చేయమని కోరమన్నాడు. కాని ఆమె చిన్న చిరునవ్వే నవ్వింది. ఆ చిరునవ్వులో నేనేమీ చెయ్యలేదు అన్న అర్థం దాగి ఉంది. మౌల్వీ అటు వెళ్లగానే ప్రార్థనాసనమైన చాపని దిండు కింద పెట్టుకుంది. తన తలని దిండు మీద పెట్టుకుంది. పసివాడికి కథలు చెప్పడం మొదలుపెట్టింది.మహిళా వార్డులో అనేక రకాలైన నేరాలు ఆరోపించబడిన వారూ, నేరాలు నిరూపించబడిన వారూ ఉన్నారు. కానీ వారెవ్వరూ నార్జిస్‌ను తమతో పాటుగా ఒక దోషి అని పరిగణించలేదు. గత నాలుగేళ్లలో ఈ ‘చెడ్డ’ స్త్రీలంతా ఆమె పట్ల మంచిగా ప్రవర్తించారు.నార్జిస్‌ ఎవరి జుత్తు గానీ, ముక్కుగానీ కొయ్యలేదు. ఎవరి పశువుల్నీ సంపదనీ దొంగిలించలేదు. గంజాయిలాంటి మాదకద్రవ్యాలనీ అమ్మలేదు. ఎవర్నీ గాయపరచలేదు. హత్య చెయ్యలేదు. మరి ఇటువంటితీవ్రమైన శిక్షకు ఎందుకు గురి అవుతున్నదో ఆ స్త్రీలెవరికీ అర్థంకావడం లేదు.‘‘బీబీ! మిమ్మల్ని తప్పించలేదా?’’ ‘మృత్యుక్రమం’లోనికి నార్జిస్‌ని మార్చిన కొద్ది రోజుల్లోనే వార్డెన్‌ మరియమ్‌ అడిగింది.


‘‘దేని నుంచి తప్పించాలి?’’ నార్జిస్‌ కంఠంలో ఒక పవిత్రత ధ్వనించింది. ‘‘మరణం నుంచి’’‘‘లేదు. చావు మీద ఎవరికైతే నియంత్రణ ఉంటుందో వారు దాని నుంచి తప్పించుకోరు. అంతేకాదు, మెహెదీ ఉన్నాడు.నా తర్వాత వాడు జీవిస్తాడు. నేను వాడిలో జీవిస్తాను. వాడి తర్వాత వాడి పిల్లల్లో జీవిస్తాను.’’ఆ తర్వాత మరియమ్‌ మరే ప్రశ్నలూ వేయలేదు. ‘మరణ క్రమం’లో ఉన్న బీబీ ఒక గొప్ప తత్వవేత్త అని బ్యారెక్స్‌లో వ్యాపించిపోయింది. మరణం తర్వాత కూడా ఆమె పునరుత్థానం చెందుతుందనీ జీవావిష్కరణ పొందుతుందనీ అందరూ చెప్పుకున్నారు. ఆమెను గొప్ప మనోబలం గల వ్యక్తిగా అందరూ భావించారు. ఆ సంఘటన తర్వాత ఆమె వద్దకు వార్డెన్‌ ఎవరు వచ్చినా వినయంతో కిందకు చూసి నడుస్తుంటారు. జైలు సూపరింటెండెంట్‌ వచ్చినా వెంటనే ఆమె గది నుంచి పారిపోతాడు. ప్రతిరోజూ ఆమెనురెండుసార్లు గది నుంచి వెలుపలికి తీసుకు వెళ్లేటప్పుడు ఒక హఠాత్‌ నిశ్శబ్దం చుట్టూ ఉన్న వారిలో వ్యాపిస్తుంది. అప్పటి వరకు అరుస్తూ పోట్లాడుకుంటున్న స్త్రీలు కూడా ఒక్కసారిగా మౌనం వహిస్తారు. ఆమెను ప్రత్యేక వ్యక్తిగా చూస్తారు. నార్జిస్‌ ఊర్ధ్వలోకం నుంచి ఊడి వచ్చినట్టుగా గౌరవిస్తారు.ఆ చివరి భోజనం ఒక పండుగ విందు మాదిరిగా జరిగింది. ‘ది లాస్ట్‌ సప్పర్‌’ గొప్ప చిత్రకారుడు లియొనార్డో డావిన్సీ చిత్రపటం ఆమెకు గుర్తుకొచ్చింది. ఆ భోజనంతో మెహెదీ ఎంతో ఆనందపడిపోయాడు. ‘‘అమ్మా! తిండి బాగుందమ్మా!’’ అంటూ ఆమె మెడ చుట్టూ చేతులేశాడు.‘‘ఔను నాన్నా! నీ మాట నిజం!’’ నార్జిస్‌ అతడి నోటిలో ముద్ద పెడుతూ దుఃఖాన్ని దిగమింగుకుంటూ చూపు మరల్చుకున్నది. ఆమె కన్నీరు ఆ చిన్నవాడి కంటపడటం ఆమెకు ఇష్టం లేదు.


రాత్రి అయింది. మెహెదీ నిద్రలో మునిగిపోయాడు. కానీ నార్జిస్‌ వాడితో గుండె నిండుగా కబుర్లు చెప్పుకోవాలనుకుంది. వాడి మాటలు వినాలనుకుంది. బాగా పొద్దు పోయే వరకు వాడిని మెలకువగా ఉంచాలనుకుంది. ఉదయాన్నే ఆమెను తీసుకుపోవడానికి వారు వచ్చేసరికి వాడు గాఢనిద్రలో మునిగి ఉండాలనుకుంది.నార్జిస్‌ వాడి కళ్ల వైపు చూసింది. వాడి అందమైన నుదుటి వైపు చూసింది. వాడి కళ్లు హుస్సేన్‌ కళ్లలా ఉంటాయి. వాడి నుదురు హుస్సేన్‌ నుదురులాగా విశాలంగా ఉంటుంది. వాడి శరీరం కూడా హుస్సేన్‌ శరీరపు పరిమళమే వేస్తుంది. ఆ సుగంధంలో పుష్పాల సౌందర్యమూ, అనంతమైనజీవేచ్ఛా ఉంటాయి.హుస్సేన్‌! ఇప్పుడు  ఇక్కడ నువ్వు లేవు. ఇంకా ఎక్కడో ఉన్నావా? భూమ్యాకాశాల మధ్య సంచరిస్తున్నావా? లేక నీ జీవకణాలను పంచుకు పుట్టిన ఈ నీకుమారుడిలోఉన్నావా? నార్జిస్‌ రక్తం ఒక్కసారిగా ఉప్పొంగింది. మెహెదీని ఆప్యాయంగా పెనవేసుకుంది.‘‘అమ్మా! నాకు నిద్రొస్తుంది’’ అన్నాడు మెహెదీ.‘‘నాన్నా! మరికొద్ది సేపే మెలకువగా ఉండు.ఆతర్వాత నిద్రపోదువుగాని. ఇంకాసేపు నాతో మాట్లాడు నాన్నా!’’ నార్జిస్‌ గొంతులో చిన్న కంపం చోటు చేసుకుంది. ‘‘రేపు మావయ్య నిన్ను ఇంటికి తీసుకెళ్తాడు. కథలు చెబుతాడు. బజార్నీ చూపిస్తాడు.వెళ్తావు కదా!’’‘‘తప్పకుండా వెళ్తావమ్మా! నువ్వు కూడా మాతో బజారుకు వస్తావు కదా!’’ మెహెదీ నిద్ర మరచి కూర్చున్నాడు.‘‘నేను మీతో రాలేను నాన్నా!’’‘‘అయితే నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావా?’’‘ఉండను నాన్నా! నీకోసం సీతాకోక చిలుకల్ని పట్టుకోవడానికి వెళ్తాను.’’వరండాలో ఏదో శబ్దం వినబడింది. నార్జిస్‌ పైకి చూసింది. వార్డెన్‌ మరియమ్‌ కటకటాలు పట్టుకొని కబుర్లు చెప్పకొంటున్న తల్లీబిడ్డల వైపు చూస్తోంది. ఆమె అశ్రునయనాలతో ఉంది.‘‘మా అమ్మ రేపు నాకోసం సీతాకోక చిలుకల్ని పట్టుకోవడానికి వెళ్తోంది’’ అంటూ మెహెదీ ఉత్సాహంగా మరియమ్‌తో చెప్పాడు. వాడెప్పుడూ సీతాకోక చిలుకల్ని చూడలేదు. కాని తల్లి వాడికి వాటిని గురించి చాలా కథలు చెప్పింది.


‘‘ఔను రాజా! నువ్వు మీ అమ్మతో ఎక్కువ సేపు మాట్లాడు. ఆమెకు కుప్పలు తెప్పలుగా కౌగిలింతలూ ముద్దులూ ఇవ్వు’’ మరియమ్‌ స్వరం బొంగురుపోయింది. వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయింది.‘‘అమ్మానువ్వు సాయంత్రానికి తిరిగి వచ్చేస్తావు కదా!’’‘‘లేదు నాన్నా! సీతాకోక చిలుకలు చాలా వేగంగా ఎగురుతుంటాయి. నేను వాటిని వెంబడిస్తున్న కొద్దీ మరింత దూరం పోతుంటాయి. కాబట్టి వాటి కోసం నేను చాలా చాలా దూరం పోతాను.’’‘‘అమ్మా! నువ్వు ఎలాంటి సీతాకోకచిలుకల కోసం చూస్తావు?’’నార్జిస్‌ ఒక్క క్షణం ఆగింది. ‘‘నేనా? స్వేచ్ఛా స్వాతంత్య్రం అనే సీతాకోక చిలుకల కోసం చూస్తాను నాన్నా!’’ ఆమె కుమారుడి జుత్తుని ముద్దుపెట్టుకుంది.నిజానికి వాడికి ఆ మాటలకు అర్థం తెలీదు. ‘‘స్వేచ్ఛా స్వాతంత్య్రం ఏ రంగులో ఉంటాయమ్మా!’’‘‘హరివిల్లుకుండే అన్ని రంగుల్లోనూ ఉంటాయి.’’‘‘హరివిల్లు ఎలా ఉంటుంది?’’‘‘ఈసారి వర్షం కురిసినప్పుడు హరివిల్లుని చూపించమని మావయ్యని అడుగు.’’‘‘అప్పుడు నేను కూడా హరివిల్లు రంగుల సీతాకోక చిలుకల కోసం వెళ్తాను.’’‘‘నువ్వు వెళ్లొద్దు నాన్నా! ఆ సీతాకోక చిలుకలు వాటికవే నీ వద్దకు వస్తాయి. నేను వాటి కోసమే పైకి వెళ్లి వెతుకుతాను. కాబట్టి మరి నువ్వు వెళ్లనవసరం లేదు.’’ నార్జిస్‌లో చిన్న వొణుకు ప్రారంభమైంది. మనఃపూర్వకంగా తీవ్రమైన అనురాగంతో మెహెదీ మురికిపట్టని మెడని గట్టిగా ముద్దుపెట్టుకుంది.ఈ వారంలో మొదటిసారిగా ఆమె కన్నుల్లో నీరు ఉబికి ప్రవహించసాగింది.


మెహెదీ నిద్రపోయిన తర్వాత నార్జిస్‌ వాడిని పైకి ఎత్తి తన గుండెపై పడుకోబెట్టుకుంది. వాడిలో ఆమెకొక ఆశాకిరణం కనబడింది. ఈ ఆశే ఆమెలో హిమాలయమంత ఎత్తుకు ఎగురుతోంది. భవిష్యత్తులో తన జీవ చైతన్యాన్ని వాడు కొనసాగించగలడని, ఒక ఆవిష్కరణా భావం ఆమెకు కలుగుతోంది.చుట్టుపక్కల బ్యారెక్స్‌ నుంచి ప్రార్థనా గీతాలు వినిపించడం మొదలైంది. ఎవరో ఒకామె ‘నూరా రెహమాన్‌’ అంటూ శ్రావ్యంగా ఆలపిస్తోంది. ఈ రోజు బీబీ శాశ్వత నిష్క్రమణం అని వారికి తెలుసు. అందకోసమే ఈ సన్నద్ధత.నార్జిస్‌ గుండెలో ఏదో పోటు మొదలైంది. జైలు ప్రధాన ద్వారం వెలుపల తన సోదరుడు మట్టిలో ధూళిలో కూర్చుని వేచి ఉంటాడు. అతడు స్టాటిస్టిక్స్‌లో పెద్ద డిగ్రీ తీసుకున్నాడు. కాని ఆ గణిత జ్ఞానంతో తన అక్క అస్తమయానికి ఇంకా మిగిలి ఉన్న నిమిషాలను లెక్కించవలసి వస్తుందని అతడు ఏనాడూ ఊహించి ఉండడు. తమ తల్లి కన్న ఇద్దరిలో తనొక్కడే మిగిలిపోతాడని భావించి ఉండడు. తన మేనల్లుణ్ణి పెంచి పెద్దచేసే బరువు బాధ్యతలు తన మీదనే పడతాయని యోచించి ఉండడు.నార్జిస్‌ మనస్సులో చాలా ముఖాలు, ప్రియమైనవీ అప్రియమైనవీ, దయగలవీ క్రూరమైనవీ, బాగా పరిచయమైనవీ కానివీ పరిభ్రమించసాగాయి. తన అంతిమయాత్ర బాధారహితంగా సాగడానికి తమ నిద్రను త్యాగం చేసి ప్రార్థనాగీతాలను ఆలపిస్తున్న వారి పట్ల ఆపుకోలేని ప్రేమాభిమానాలు కలిగాయి. వారందరికీ మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొంది. ఆయా గొంతుల వారితో ఒక వారం క్రితం తనకు కలిసే ఉండేది. కాని వారెప్పుడూ తనని అర్థం చేసుకోలేదు. అంతేకాదు, వారికి తన గురించి ఏమీ తెలీదు.


క్షమాభిక్ష కోసం అర్థించే గడువు దాటిన తర్వాత ఆ వార్త బయటికి పొక్కింది. జైలు అధికారులు ఆమెను బ్యారెక్స్‌ నుంచి ‘మరణక్రమం’లోనికి మార్చడానికి వచ్చారు. పరిసరాల్లో భయంకరమైన నిశ్శబ్దం అలముకుంది. నార్జిస్‌తో పాటు మెహెదీ కూడా బ్యారెక్స్‌ని వీడేటప్పుడు కొందరు స్త్రీలు తలలు వంచుకుని కళ్లు తుడుచుకోవడం ఆమెకు కనపడింది. ఈ స్త్రీల ఏ చిన్న గడబిడ సన్నివేశానికైనా ఒకర్నొకరు తిట్టుకుంటారు. దుస్తులు చించుకుంటారు. దాంతో వారిని మ్యాట్రన్, వార్డెన్‌ బలవంతంగా విడదీస్తుంటారు. ఈరోజు వారి ప్రవర్తన భిన్నంగా ఉంది.నార్జిస్‌కు ఒక తాత్కాలికమైన నిద్రమత్తు వంటిది ఆవహించింది.ఆమె హృదయం కృంగిపోనారంభించింది. గుండె ఒక తీవ్రమైన అనునాదంతో కొట్టుకుంటోంది. ఈ హృదయ స్పందనే మృత్యు ముఖద్వారం వద్ద ఆమె ఘనవిజయంగా నిలుస్తుంది. ఆమె మరణం తర్వాత జీవిస్తుందా? మరి జీవచైతన్యం అంటే ఏమిటి? శరీరాన్ని వీడిన తర్వాత అది ఎక్కడకు పోతుంది? హుస్సేన్‌ ఎక్కడున్నాడు? ఎక్కడా లేడు. లేనే లేడు. అంతా సర్వనాశనమైంది. నాశనమంటే అర్థమేమిటి? ఆ మాటకు భాషాపరమైన అర్థం మాత్రమే ఆమెకు తెలుసు. మరికొద్ది సేపట్లో తనే ఆ అనుభవాన్ని పొందనుంది.‘‘బీబీ’’ మరియమ్‌ కటకటాల వద్దకు వచ్చి మృదువుగా పిలిచింది.


‘‘చెప్పమ్మా!’’‘‘బీబీ! ఆ చిన్నరాజుని పరుపు మీదనే ఉంచండి. వాళ్లు వచ్చేస్తున్నారు.’’ మరియమ్‌ మాట తడబడుతోంది.ఒక్క క్షణం నార్జిస్‌కు తన పాదాల కింద నేల ప్రకంపిస్తున్నట్లు అనిపించింది. కానీ నిలదొక్కుకుంది. తన మెడ చుట్టూ ఉన్న మెహెదీ చేతుల్ని నెమ్మదిగా విడిపించుకుంది. వాడిని ఆ కఠినమైన పరుపు మీదనే వదిలి పెట్టింది. ‘వాడు నా ముఖాన్ని గుర్తుంచుకోలేడు. వాడి జ్ఞాపకాలలో కేవలంనా పేరు, నా ఊహ, నా స్మృతి మాత్రమే మిగులుతాయి.’‘‘నన్ను క్షమించండి బీబీ! కటకటాలకు తాళాలు వేసి తీసే నా ఈ చేతులే నాకు తిండి పెడుతున్నాయి.’ మరియమ్‌ ఊచలపై తలపెట్టుకునిఏడవనారంభించింది.నార్జిస్‌ నులక మంచం మీద నుంచి లేచింది. కటకటాల్లోంచి మరియమ్‌ భుజాల మీద చేతులేసింది. మాటలకు నిర్వచనాలు లేవు.బరువైన అడుగుల చప్పుడు వినపడింది. నార్జిస్‌ మరియమ్‌ మోచేతిని నెమ్మదిగా తట్టింది. మరియమ్‌ తలెత్తి తన కన్నీటి తెరలలోంచే నార్జిస్‌ను చూసింది. తన కళ్లని తెల్లని మస్లిన్‌ దుపట్టాతోతుడుచుకుంది. ‘ఎటెన్షన్‌’లో నిలబడింది.తాళంలో చెవిని తిప్పి వీలైనంత నెమ్మదిగా తలుపు తెరిచింది. జైలు సూపరింటెండెంటు ఇనుప తలుపుని గట్టిగా గోడకు తగిలి పెద్దగా ధ్వని వచ్చేటట్టు తీశాడు.‘‘సర్‌! పిల్లవాడు నిద్రపోతున్నాడు. మేల్కొనగలడు’’ మరియమ్‌ నమ్రంగానే అంది.


‘‘నోర్ముయ్యి! వాడు నీ పిల్లవాడు కాడు’’ సూపరింటెండెంట్‌ అసహనంతో అన్నాడు.‘‘సర్‌! బిగ్గరగా మాట్లాడవద్దు. ప్లీజ్‌’’ యువ మేజిస్ట్రేట్‌ నిద్రపోతున్న మెహెదీ వైపు చూస్తూ, కనుబొమలు తుడుచుకుంటూ అన్నాడు.సూపరింటెండెంట్‌ భృకుటి ముడివేస్తూ చిరాగ్గా చూశాడు. ‘ఈ కొత్త ఆఫీసర్లు తమ గురించి ఏమనుకుంటారు?’ అనుకుంటూ పొంగి వస్తున్న కోపాన్ని అణచుకున్నాడు. తన అధికారిక విధానాన్ని మెదలుపెట్టాడు. మొదట నార్జిస్‌ని ఫొటోతోనూ పుట్టుమచ్చలతోనూ సరిపోల్చి గుర్తించాడు. యధావిధిగా ఒక పత్రాన్ని తెరిచి, దాన్ని బిగ్గరగా చదివాడు: ‘‘నేను.. క్షేమకరుడూ.. దయామయుడూ అయిన అల్లా పేరున ప్రారంభిస్తున్నాను..’ అని మొదలుపెట్టి ఇలా ముగించాడు. ‘‘మరణం ధ్రువీకరించబడేంత వరకు నేరస్తురాలిని ఉరితియ్యాలి.’’మెడికల్‌ ఆఫీసర్‌ ముందుకు వచ్చాడు. నార్జిస్‌ నాడినీ, గుండె కొట్టుకోవడాన్నీ పరీక్షించాడు. నిశ్శబ్దంగా తల ఊపాడు. సూపరింటెండెంట్‌ అతని చేత కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టించాడు. యువ మేజిస్ట్రేట్‌ ఆ సంతకాలను ధ్రువీకరించాడు. సూపరింటెండెంట్‌ గదిని విడిచి వెళ్లాడు.డిప్యూటీ సూపరింటెండెంట్‌ మరియమ్‌కు సంజ్ఞ చేశాడు. ఆమె ముఖం కంచులా కఠినంగా ఉన్నట్లనిపించింది. ఆమె కళ్లు నేలవైపు చూస్తున్నాయి. నార్జిస్‌ చేతుల్ని వెనక్కు వంచి ఒక చర్మపు తాటితో కట్టింది. మరియమ్‌ వేళ్ల వెచ్చదనం నార్జిస్‌కు తగిలింది. ఆమె ఒంటరిగా లేదు. లోపలా బయటా చాలామందే ఉన్నారు.సాయుధులైన రక్షకులు బ్యారెక్స్‌ని ఈసరికే కాపలా కాస్తుంటారు ప్రధాన ద్వారం వద్ద పన్నెండు మంది వార్డెన్లు ఈసరికే వారి వారి స్థానాల్లో ఉంటారు ప్రతివారి తుపాకీలోనూ పది బుల్లెట్లు ఉంటాయి నార్జిస్‌ సోదరుడు జైలు గోడల వెలుపల బయలులో కూర్చొని ఉంటాడు.


నార్జిస్‌కు మెహెదీ ముఖం కనపడుతోంది. ఆమె వాడినే కన్నార్పకుండా చూస్తోంది. మేట్రన్‌ నుంచి సంజ్ఞ అందుకుని మరియమ్, నార్జిస్‌ను ‘‘పద బీబీ’’ అంది.నార్జిస్‌ ఒక్క అడుగు ముందుకు వేసింది వెనక్కు తిరిగి మెహెదీ వైపు చూసింది. వాడు నిద్రలోనే కదిలాడు. చిన్నగా మూలిగాడు వాడికేదో పీడకల వచ్చి ఉంటుంది. నార్జిస్‌ గుండెను ఏదో పిండేసినట్లయింది. ఆమె తన కళ్లలో ఉబుకుతున్న కన్నీటిని అతి ప్రయాస మీద ఆపుకుంది. ఆమె తన ఆశల్నీ తనవంటి వారి ఆశయాల్నీ భగ్నం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లూ చేసిన వారి ముందుంది. కాని ఆమె ఓటమిని అంగీకరించలేదు. ఈ చివరి క్షణాల్లో తాము గెలిచిన సంతృప్తి వారికెందుకివ్వాలి?యువ మేజిస్ట్రేట్‌ కళ్లు ఆమె దృష్టిని వెంబడించాయి. ‘‘ఆ పిల్లవాడు ఎక్కడుంటాడు?’’ అని మేట్రన్‌ని అడిగాడు. నార్జిస్‌కు తన ఊపిరి తోడివేసినట్లయింది. తన సోదరుణ్ణి అగ్నిపరీక్షకు గురిచేస్తోంది.మేజిస్ట్రేట్‌ కనుబొమలు ముడిపడ్డాయి. నార్జిస్‌ వైపు పరీక్షగా చూశాడు. వరండాలో ఉన్న వార్డెన్‌ను పిలిచాడు. ‘‘సర్‌’’ అంటూ వార్డెన్‌ ముందుకొచ్చాడు.‘‘ఆ పిల్లవాణ్ణి జాగ్రత్తగా ఎత్తుకో’’ అన్నాడు.‘‘సర్‌. నేను వాడిని ఎత్తుకోవచ్చా?’’ అంది మరియమ్‌.‘‘సరే, వాణ్ణి బీబీతో పాటు అక్కడి వరకు తీసుకురా...’’‘‘కానీ, సర్‌! జైలు మాన్యువల్‌ అందుకు అంగీకరించదు’’ డిప్యూటీ సూపరింటెండెంట్‌ కలగజేసుకున్నాడు.‘‘నీ జైలు మాన్యువల్‌ తగలబెట్టు’’ అంటూ యువ మేజిస్ట్రేట్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మరియమ్‌ ముందుకొచ్చి మెహెదీని ఎత్తుకుంది. వాడు కదిలాడు. త్వరలోనే తిరిగి గాఢనిద్రలోకి జారుకున్నాడు.డిప్యూటీ సూపరింటెండెంట్‌ పర్యవేక్షణలో ఉరి ఖైదీ బిడారు బయల్దేరింది.


ఇద్దరు పోలీసులు దారి చూపుతున్నారు. మరో ఇద్దరు వెంబడిస్తున్నారు. నార్జిస్‌ మధ్యలో ఉంది. ఆమెకు కుడివైపున ఒక వార్డెన్, రెండోవైపున మరియమ్‌ ఉన్నారు. మరియమ్‌ భుజాన మెహెదీ ఉన్నాడు.నార్జిస్‌ చూపు మెహెదీపై స్థిరంగా ఉంది. అందరూ ముందుకు నడిచారు. ఆరుబయట అందమైన చల్లని రాత్రి నిష్క్రమించనుంది. నింగీనేలా కలసిన సుదూర తీరంలో ఉదయభానుడు ప్రభవించనున్నాడు. వెలిసిపోతున్న వెన్నెలలో వధ్యశిలా వేదిక నార్జిస్‌ కంటబడింది. పైకి దారితీసే మెట్లు కూడా స్పష్టంగా కనపడసాగాయి. మరణం భూమి లోతుల్లోనికి కృంగిపోతోంది. అధఃపాతాళాన్ని చేరడానికి పైవైపు మెట్లని ఎందుకెక్కాలో ఆమెకు అర్థం కాలేదు. ఉరిశిక్ష అమలు చేసే తలారివైపు చూసింది. అతడి పిల్లలు ఈరోజు ఉరివల్ల తండ్రి తెచ్చిన రాబడితో సంతోషిస్తారు. ఒక ఉరికి పది రూపాయలు చెల్లిస్తారు. నిజంగా అది వారికి ఎక్కువ మొత్తమే. ఆ డబ్బుతో చాలా కొనుక్కోవచ్చు.‘‘మరియమ్‌!’’ నార్జిస్‌ గొంతు ఆ నీరవ నిశ్శబ్దంలో ఒక మెరుపులా మెరిసింది. ‘‘బీబీ! మీ సేవలోనే ఉన్నాను.’’ వార్డెన్‌ మరియమ్‌ గొంతు కన్నీటితో గద్గదమైంది.ఇక్కడ ఈ స్థితిలో యజమాని ఎవరో, సేవకులెవరో చెప్పడం కష్టం. మృత్యువు అందర్నీ ఒకే పంక్తిలో నిలుపుతుంది. నార్జిస్‌ మరియమ్‌ను దగ్గరగా రమ్మని సంజ్ఞ చేసింది. మరియమ్‌ ముందుకు వంగింది. ఆమె భుజం మీద నిద్రపోతున్న మెహెదీ ఉన్నాడు. నార్జిస్‌ బంధనాలున్న చేతులతోనే మెహెదీని తాకే వ్యర్థ ప్రయత్నం చేసింది. అంతలోనే ఆగిపోయింది.మెహెదీ నిద్రలోనే నవ్వుకుంటున్నాడు. బహుశా దేవతా కన్యలతో ఆడుకుంటున్నాడు. నార్జిస్‌ తన జీవనఫలం, తన ప్రతిమ అయిన మెహెదీ వైపు నీరు నిండిన కళ్లతో చూసింది. వాడి నుదుటినీ, బుగ్గల్నీ ముద్దాడటానికి వంగింది.ఒక జీవితం మరో జీవితానికి వీడ్కోలు చెబుతోంది. నార్జిస్‌ వధ్య శిల మెట్లు ఎక్కింది. తలారి ఆమె ముందు వంగాడు. ఆమె కాళ్లను బంధించాడు. ఆమె ఛిద్రమవుతున్న ప్రపంచ దృశ్యాన్ని కడసారి చూపు చూసింది. దాన్ని మనసులోనే పదిలపరచుకుంది.కళ్లు మూసుకుంది. ఆ దృశ్యం ఆమెలో ముద్రించబడింది.చంద్రుడు అస్తమించిపోతున్నాడని ఆమెకు తెలుస్తోంది. ధ్రువనక్షత్రం ఆకాశంలో ప్రకాశిస్తోందని తెలుస్తోంది. మెహెదీ దేవతా కన్యలతో ఆడుకుంటున్నాడని తెలుస్తోంది. సూర్యుడు ఉదయించబోతున్నాడని తెలుస్తోంది.దేవుడి పవిత్రమైన పేరు మీద నిర్దేశించబడిన నిర్ణయం అమలు కాబోయే క్షణం ఆసన్నమైంది. 


Titliyan Dhoondhne Wale, 


ఉర్దూ మూలం : జహీదా హీనా, పాకిస్తాన్‌


అనువాదం: టి.షణ్ముఖరావు