ప్రత్యాహారం
మొన్నీ
మధ్య నాన్నకి జ్వరం వచ్చింది. తగ్గడానికి ఓ రెండు నెలలు పట్టింది.
ఆ రెండు నెలలు కాలంలో నాలుగు సార్లైనా నాన్నని చూడటానికి
తండాకి వెళ్ళినప్పుడు "పెళ్ళి చేసుకోరా! " అని అడిగాడు నాన్న . నేనేమి మాట్లాడలేదు .
"నువ్వు ఊ అంటే మల్లి చెల్లెల్ని నీకిచ్చి చేస్తానంటున్నాడు మీ మావ" అని చెప్పాడు.
చప్పున మల్లి
గుర్తుకొచ్చింది నీటి మీద నే వ్రాసిన
రాతలు గుర్తుకొచ్చాయి. ఒక చిన్న నిట్టూర్పు. ఆ రోజే మల్లి కనబడింది చంకలో ఒక బిడ్డ, చేతిలో ఒక బిడ్డ పూచిన తంగేడులా ఉంది. నన్ను
చూసి చిన్నగా నవ్వి "బాగున్నావా బావా" అనడిగింది.
తలూపాను. మంచి ఉద్యోగమే చేస్తున్నావంటగా పెళ్ళి చేసుకున్నావా?
నేను
సమాధానం చెప్పేలోపే అమ్మ అందుకుని "
ఆ మంచి ఉజ్జోగమే చేస్తన్నాడు . ఆడముండలని ఉంచుకునే
ఉజ్జోగం" అంది చీత్కారంతో. మల్లి సానుభూతిగా నా వైపు చూసింది
"నీ అయ్యకి సిగ్గులేక నీ చెల్లెలిని ఇచ్చి పెళ్ళి చేస్తానని అడగడానికి వస్తాడంట. పసి దాని జీయితం నాశనం చెయ్యడానికి
చచ్చినా నేనొప్ప " అమ్మ ఖండితంగా చెప్పేసింది
నీ
యవ్వ ! నేను
లేచోచ్చానంటే మూతి పళ్ళు రాలగొడతా, ఆడికేంటే? ఆడు మగాడు. మగాడు తిరక్క చెడ్డాడంటారు. నీ తమ్ముడు పిల్ల నీయాలని
ఉబలాటపడతా ఉంటే నీ గోలెంటే? మంచంలో ఉండే నాన్న అధికారం. సమాజం
మొత్తం అక్కడే కనబడింది నాకు .
నోరుమూసుకోవయ్యా
! మా బాగా
చెప్పొచ్చావ్ , ఆంబోతులా ఆడు ఊర్లలో పడి తిరుగుతుంటే ఆడి మొహాన ఉమ్మేయక మగాడు తిరుగుతాడని ఎనకేసుకోచ్చావ్
! నువ్వేమన్నా ఆడిని
ఆంబోతులేక్క పెంచావా,వదిలేసావా ? చదువుకుని మంచి ఉజ్జోగం చేసి ఈ గూడెంలో వాడు ఒకడు మంచిగా ఉన్నాడని చెప్పుకోవాలని
నువ్వు, బిడ్డ కష్టపడకుండా చల్లగా ఉండాలని నేను కలలు కన్నాం . ఆడు చేసే ఉజ్జోగమేంటో
కళ్ళార చూసావుగా " నావొంక తీవ్రంగా చూస్తూ నాన్నని మాటలతో చెండాడింది
"నువ్వు వాగబాకే ! ఆడికి పెళ్లి చేత్తానో లేదో చూడు "నాన్న పంతం. వాళ్ళిద్దరూ అలా వాదులాడుకుంటూనే ఉన్నారు.
నేనట్టా అడవివైపుకు వెళుతూ ఆలోచించసాగాను.
అమ్మ ఏమందీ ?
అచ్చోసిన ఆంబోతు అని. అవును ఒకప్పుడు గ్రామాలలో మేలుజాతి కోడె దూడని ఊరికి వదిలేసేవారు. దాన్ని
దైవ స్వరూపంగా భావించేవారు దానికి ఊర్లో ఏ
అడ్డు అదుపు ఉండేది కాదు .పంట చేలో పడిమేసినా, గడ్డివాము
పై పడి మేసినా అదిలించేవారు కూడా కాదు.
అదొక సామూహిక సంపద. ఆవులు ఎదకొస్తే వాటిని దాటించడానికి దొడ్లోకి ఆంబోతుని తోలుకోచ్చేవారు.
పశుసంపద వృద్దికోసం ఊరందరూ అలా ఒక ఒడంబిక చేసుకునే వారు. ఇప్పుడు ఆంబోతులు లేవు కానీ పశువులకి
గర్భధారణ కోసం ఇంజక్షన్ చేస్తున్నారు. అలాగే మనుషుల్లో కూడా సహజంగా పిల్లలు పుట్టే అవకాశం లేనివారికి సంతాన ఉత్పత్తి కోసం ఆర్టి ఫిషియల్ ఇన్సేమినేషన్ పద్దతులు అవలంభిస్తున్నారు. కాకపొతే స్పెర్మ్ డోనర్ ఎవరైనది రహస్యంగా
ఉంచుతూ. బిడ్డలు పుట్టడానికి
అన్ని మార్గాలు ఉన్నప్పుడు మనిషి కోర్కెలు తీరడానికి అలాగే మార్గాలు ఏర్పడుతున్నాయి
అందులో నేను చేస్తున్న తప్పేమిటో ? అనుకుంటూ
మళ్ళీ అంతలోనే తలవిదిల్చాను. నా ఆలోచనలెప్పుడో పెడదారి పట్టాయని తెలుసు . ఇంటికొచ్చి నిగ్గుతేలని ఆలోచనలతోనే అన్నం తిన్నాననిపించి బయలుదేరాను
.
వచ్చేటపుడు
అమ్మ నా వెనకాలే వస్తూ చెప్పింది. " నేనన్న మాటలకి మనసు
కష్టపెట్టుకోకు బిడ్డా ! నేను నిజమే మాట్లాడిన గందా, నీ యవ్వారాల మధ్య భార్యనేమి బాగా చూసుకుంటావు ? " దెప్పిపొడిచింది నన్ను నాకు గుర్తు చేస్తూ.
నన్ను
నేను మర్చిపోతే గదా ! ఒకప్పుడు అలా మర్చిపోబట్టే గదా ఈ
జీవితం ఇట్లయింది. కొద్ది దూరం వచ్చి అమ్మ ఆగిపోయింది.
దారంట నడుస్తూనే ఉన్నా. నా వెనుక
నుండి బావోయ్ అన్న మల్లి పిలుపు మంత్రంలా వినిపించింది, ఆగి వెనక్కి చూసాను. ఒగరుస్తూ నా దగ్గరికి వచ్చి ఆగింది .
"అత్త
చెప్పింది నిజమేనా !? అప్పుడెప్పుడో నన్ను పెళ్లి చేసుకోనంటే
చదువుకున్న పిల్లని ఇష్టపడ్డావ్ అనుకున్నా , ఇప్పుడేమో ఇట్టాంటి
మాట వింటున్నా అంటూ అనుమానంగా చూసింది. అబద్దం చెప్పడం ఇష్టంలేక అమ్మ చెప్పింది
నిజమేనే మల్లీ ! " అన్నా ఎటో చూస్తూ. మల్లి భయంగా వెనక్కి వెనక్కి అడుగేసుకుంటూ
అయిదారడుగులు వెనక్కి వెళ్లి గిరుక్కున తిరిగి
ఊరు వైపు పరుగులు తీసింది
నా
వయస్సు ముప్పై దాటి నాలుగేళ్ళైంది. గత ఆరేళ్ళ
నుండి నా ప్రొఫైల్ అప్డేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇన్ ఏ కాంట్రావర్షియాల్ రిలేషన్ షిప్ లోనే ఉంది, మేరీడ్ అని ఎప్పుడు మారుతుందో
లేదో అసలు నేనే అలాంటి ప్రయత్నం చేస్తున్నానో
లేదో నాకే తెలియడం లేదు
నా
దేశం చాలా అభివృద్ధి చెందింది .
మగవారి విలాసకేళీలో సమిధలగా మారిన అతివలున్నదన్నది ఎంత చేధైన నిజమో , ఆ మాదిరిగానే
నాకథ కూడా అంత చేదైన నిజమే! ఆకలితో అలమటిస్తూ వ్యభిచార జీవితం గడుపుతున్న వారితో పాటు విలాస జీవితం గడపడానికి శరీరాలని అమ్ముకుంటున్న వారిని, సరదాల కోసం ప్రేమ వల వేసే అతివలు
వీరినే సమాజం చూసి ఉటుంది. అలాగే తీరని రహస్య వాంఛలని డబ్బుతో కొనుక్కునే వారికి అమ్ముడయ్య
నా లాంటి వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాలాంటి వారి గురించి మాట్లాడుకోవడం తప్పేమికాదని
నాకనిపిస్తుంది. ఎవరెవరో
డబ్బనే ఎర వేస్తే గాలానికి చిక్కిన చేపని.
నా
కథని వ్రాసి లోకానికి నా లాంటి వాడి కథ చెప్పాలనుకున్నాను పత్రికలలో వచ్చిన కధల్లో, నేను చదివిన మూడొంతుల
కథలలో ఎప్పుడూ శారీరక సంబంధాల గురించిన కథలే ఉంటాయి. మానవ జీవితాలలో
లైంగిక అవసరాలకి ఉన్న ప్రాముఖ్యత వల్ల కావచ్చు ప్రతి కథ మలుపులోనూ ముఖ్యభూమిక లైంగిక
సంబంధమే అయి తీరుతుంది.అసలు మనిషికి ఎన్ని ఆశయాలుండాలి అవి లేకపోతే లేకపోయే కొన్ని ఆశలయినా ఉండాలి, ఆకాంక్షలుండాలి. వీటన్నింటిని గాలికొదిలేసి ఎక్కడ చూసినా
శరీరాల కోసం వెంపర్లాటే కనబడుతుంది. తిండి లేక గూడు లేక సరైన నిద్ర లేక
రోగాల రొస్టున పడి కుక్క చావు చచ్చేటాడికి కూడా శరీరం అనే కొలిమిలో కాలే కోరికల గురించే
మాట్టాడాల్సిన రోజు ఒకటుంటుంది కాబట్టే నా కథ కూడా అక్కడి నుండి చెపితేనే బాగుంటుంది. ముఖ్యంగా ఈ కథ వ్రాయడానికి కావలిసిన
అనుభవం నా దగ్గర పుష్కలంగా ఉంది కూడా !
నేనేమి
ధనవంతుడిని కాదు పేదరికంలో పుట్టి అష్ట కష్టాలు
పడి కాలేజ్ గేటు లోపలి అడుగు పెట్టినవాడ్ని.
నాకున్న అర్హత అందమైన రూపం,అవసరాలకి తగ్గట్టుగా
మారగల్గడం. ఈ రెండు నా పట్ల శాపాలై నన్ను కాల్చేసాయని తర్వాత
తెలిసింది. కాలేజీలో చేరిన కొన్నాళ్ళకి "వినత"
పరిచయమైంది. ప్రేమించానని చెప్పి వెంట పడింది. వినత ఆర్నెల్లు
పాటు నా చుట్టూ తిరిగి "మల్లిని నా హృదయంలో నుండి నా చేతే తోసేయించి నా ప్రేమని సంపాదించుకుంది రెండేళ్ళు నాతో కలసి తిరిగింది . కలసింది తమ మనసులేకాడు ఎన్నో సార్లు శారీరకంగా కూడా. ఆఖరికి ఏమైంది ? ప్రేమ లేదు, ఏమి లేదు. ఏదో కలసి సరదా గా తిరిగాం,
లైఫ్ ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మా డాడీ మా అంతస్తుకి
తగ్గ సంబంధం ఖాయం చేసారు. ఈ ఆకర్షణని ప్రేమనుకుని నేను నిన్ను పెళ్ళిచేసుకుని ఏం సుఖపడగలను?
నీతో అరకొర సౌకర్యాల మధ్య నేను బతకలేను అయినా నీకేమి పోయిందని ? లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసావ్! కలలో కూడా ఊహించని స్వర్గ సుఖాలు
అనుభవించావ్, కార్లలో
తిరిగావ్ , ఖరీదైన బట్టలు, స్టార్ హోటళ్ళొ విడిది, అన్నీ నా డబ్బుతోనే కదా ! ఎప్పుడైనా
గుర్తు వస్తే కాల్ చేయి . నాకు జస్ట్ ఫర్ చేంజ్ కావాలిగా ! కాజువల్ గా చెప్పి వెళ్ళిపోయింది. డైజస్ట్ చేసుకోలేకపోయాడు.
ఇన్నాళ్ళు "వినత " నా
ఫీలింగ్స్ తో ఆడుకుంది ఖచ్చితంగా చెప్పాలంటే తన దేహంతో ఆడుకుంది తనెందు గుర్తించలేకపోయాడు? తనకి చదువు పూర్తవగానే మంచి ఉద్యోగమే వస్తుంది ఉద్యోగం రాగానే వినతని పెళ్ళి చేసుకోగలననే ఊహలలో బ్రతికాడు.
ఆ ఊహలలోనే పతనమైన జీవితాన్ని
చూస్తే ఏడుపొస్తుంది . ఒరేయ్ ! నువ్వు మగాడివి రా ! ఏడుపుని దాచెయ్ దాచెయ్! అంటుంది వినత లాంటి
చాలామంది అమ్మాయిలకి ఆడుకునేందుకు హృదయాలు కావాలిప్పుడు. నాలా ఊహల్లో జీవించేవారికి వాస్తవం
అర్ధం కావడం కష్టం.
వాస్తవం
గుర్తించేటప్పటికి హృదయం బద్దలవడం ఖాయం.
వారి హృదయమే కాదు
అమాయకులైన
మల్లి లాంటి ఇతరుల హృదయం కూడా .
ఆ పస్త్రేషన్లో, ఎదగాలన్న కసితో చదువు పై శ్రద్ద పెట్టానంతే ! చదువు పూర్తైన ఏడాది
తర్వాత
కాని నాకో ఉద్యోగం రాలేదు .
మధ్యలో
ఎన్నో పార్ట్ టైం ఉద్యొగాలు చేసాను.
ఓ..ఎఫ్ ఎం స్టేషన్ లో జాకీ గా మారాను
ఒక
పెద్ద హోటల్ లో సర్వర్గా పని చేసాడు అప్పుడే పరిచయమయింది రాధ. పదహారేళ్ళ కూతురుంది అంటే
ఎవరు నమ్మరు. ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండటమే కాదు. ఆహ్లాదంగా మాట్లాడటం ఆహ్లాద పరచడం తెలుసు. అక్కడే లొంగిపోయాను.
మనిషికి యవ్వనం శాపం లాంటిది. ఉచ్చనీచాలు గ్రహింపుకి రానీయదు. రాధని పెళ్ళి చేసుకుందామని
అడిగాడు . తొందరేముంది చూద్దాం లే ! అని కొన్నాళ్ళు నెట్టుకొచ్చింది . తర్వాత అడిగితే పెళ్ళి లో తనకి నమ్మకం
లేదంది.
అమ్మ
నాన్న పెళ్ళి చేసుకోరా బిడ్డా అంటే ఇప్పుడప్పుడే కాదని దాటేస్తూ వచ్చాను. విషయం ఆ నోటా ఈ నోటా విన్న అమ్మ నాన్న నా దగ్గరికి వచ్చారు
ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే అప్పుడెప్పుడో
నన్ను కాలేజీలో చేర్పించడానికి వచ్చిన నాన్న
ఎప్పుడో తప్ప బసెక్కి బయటూరుకి వెళ్ళని
అమ్మ పొద్దునే ఎమ్ జి బి ఎస్ లో బస్ దిగి మని యార్దర్ ఫారం మీద ఉన్న అడ్రెస్స్ పట్టుకుని
సాయంత్రం దాకా తిరిర్గి తిరిగి నా ప్లాట్ కి చేరుకున్నారు. రాధ
వారిని సోఫా పై కాదు కదా ప్లాస్టిక్ కుర్చీలలో కూడా కూర్చోమని అనలేదు. ఇమీడియట్లీగా రమ్మని పోన్ చేసింది
ఉరుకుల పరుగుల మీద వచ్చిన నాకు నేలమీద ముంగాళ్ళపై కూర్చున్న అమ్మ నాన్న కనబడ్డారు. వారినాస్థితిలో చూసి నా ముఖం పాతాళంలోకి
క్రుంగిపోయింది.
"ఏమిటీ సంత ? ఇక్కడి దాకా ఎందుకు రానిచ్చావ్!
నాకిష్టం ఉండదని చెప్పానుగా మర్చిపోయావా ? విసుగ్గా ముఖం పెట్టి.
రాధని ఏమి అనలేక "అమ్మా ! ఇక్కడిదాకా ఎదుక్కుంటూ ఎందుకొచ్చిన్రు
? కబురంపితే నేనే వస్తును కదా ? " అడిగాననుకుని
గొణిగాను. ఇంకా నా మూలం గుర్తుంచుకుని సజీవమైన బాష మాట్లాడుతున్నదుకు
ఆశ్చర్యంగాను ఉంది
"ఏం బిడ్డా!? ఒక్క ఉత్తరం ముక్కైనా రాయకపోతివి పోన్లో
నైనా మాట్లాడక పోతివి. నువ్వేట్టా ఉండావో చూడాలని గుబులు
పుట్టింది. నెల నెల డబ్బు అంపిత్తే చాలా బిడ్డా ! నిన్ను కళ్ళారా చూసుకోవాలని మాకుండదు " చెల్లున
కొట్టినట్టుంది అమ్మ మాట. కళ్ళలో నీల్లూరినాయి
"అది కాదే అమ్మా.. ఇంత పెద్దూర్లో ఈ అడ్రస్ పట్టుకూడానికి
ఎన్ని అవస్థలు బడితిరో కదా అని బాధ ".. అన్నాను
తల్లి
దండ్రికి బిడ్డ ఆచూకి కనుక్కోవడం బాధేన్దిరా?
నోరు వాయా లేని కోడి కూడా పిల్లలని ఎదుక్కుంటది " అమ్మ దగ్గరకొచ్చి
చెయ్యట్టుకుంది. ఆ స్పర్శలో ప్రేమని నా మనసుని తాకడం లేదు గ్రద్ద
బారిన పడకుండా, గండు పిల్లి బారిన పడకుండా కొ కొ క్కో అంటూ హెచ్చరిస్తూ కల కల తిరుగాడుతూ ఉన్న తల్లి కోడి మెదులుతూ
ఉంది. రాధ గ్రద్దో,గండు పిల్లో అన్న సంగతీ తెలిసిపోయింది. రెండేళ్ళ నుండి పెళ్ళంటే ఎందుకు వాయిదా వేస్తున్నానో నన్న సంగతి అమ్మ
నాన్నకి అర్ధమై నేను బొంకుతున్నానన్న సంగతి తెలిసి పోయిందే అని తెగ బాధపడ్డాను
నేను సోఫాలో కూర్చోలేక వాళ్ళని
అక్కడ కూర్చోమనలేక వాళ్ళ ప్రక్కనే చతికిల బడ్డాను .
టీవి
చూస్తూ కూర్చున్న రాధ ని చూస్తూ ఏమ్మా ! ఇన్నాళ్ళు ఈడి సంగతి తెలియక
పెళ్ళాడమని బలవంత పెట్టాం. ఇప్పుడిసయం తెలిసిందిగా మీ ఇద్దరికీ పెళ్ళి చేత్తాం. ఊరికి పోదాం రండి
"నేను రాను. మీ అబ్బాయి వస్తే తీసుకుపోండి "
రాధ తలబిరుసు సమాధానం
"రానంటే ఎట్టాగమ్మా ! నా కొడుకుని కట్టుకున్నాక నువ్వు
మా కోడలవే గందా! ఆడిట్టపెకారమే మనువాడాడని అట్టా వదిలేత్తామ్మ మీ ఇద్దరు ఊరికొస్తే మా చుట్ట పక్కాలని పిలిచి తాళి కట్టించి బోయనాలు పెట్టుకుంటాం. ఏదో తప్పు చేసినట్టు మా ముఖాలేందుకు దాపెట్టుకోవాల ? మా కోడలు మంచి అందగత్తె, చదుకున్న అమ్మాయని చూపించుకుంటాం" అంది అమ్మ. దాచుకున్న ఆశలు తీరకపోయినా వాటిని కనబడకుండా దాచేసుకుని గొప్పగా మాట్టాడిందని
చాతీ విశాలమైంది నాకు
నేను
నీ కొడుకుని పెళ్ళాడానని ఎవరు చెప్పారు ?
అలాంటిదేమీ లేదు మా మధ్య చేతి
గ్రోళ్ళని ట్రిమ్ చేసుకుంటూ నిర్లక్ష్యంగా చెప్పింది రాధ
" మేము పెళ్ళే చేసుకోలేదు, నేను కోడలిగా మీ ఇంటికి రాను అన్నప్పుడు
ఆడిని వదిలేసిపో తల్లీ వాడికి
పెళ్ళి చేసుకుంటాం" అమ్మ లాజిక్
" నేనేమి నీ కొడుకుని పట్టుకుని వేలాడటం
లేదు. తనే నన్ను పట్టుకుని వ్రేలాడుతున్నాడు. నా కంటిన శని ఎప్పుడు వదులుతుందా అని ఎదురు చూస్తున్నా" ఆ మాటలు నాకేమి కొత్త కాదు. అయినా నా వాళ్ళ ముందు నేను
చేసిన వెధవపనిని సమర్ధించుకోవడం కూడా చేత కాక బోరున ఏడుస్తున్నా లోలోపల
ఏందీ
బిడ్డా ఆ మనిషి సమాధానం అట్టా చెపుతుంది ?
ఏమవుద్ది నీకు నువ్వు పెళ్ళి చేసుకోలేదా ? అనుమానంగా
అడిగింది
నేను
నోరు విప్పబోయేలోగా రాధ కూతురు "నిమిష" కాలేజ్ నుండి వచ్చింది. కొత్తవాళ్ళని చూసి ఎవరంకుల్ వీళ్ళు ? మరీ ఇంత మొరటుగా
ఉన్నారు ?
నా
సమాధానం వినకుండానే బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది
.
ఈ
పిల్ల ఎవర్రా?అట్టా లోపలి జొరబడింది అనుమానంగా చూస్తూ
"రాధ కూతురు" సమాధానం చెపుతూ అమ్మ మొహంలోకి చూడలేక
కళ్ళు నేలకి ఆనించేసాను.
నేనేమి
చెప్పకుండానే అమ్మకి నాన్నకి అర్ధమైపోయింది.
ఒక్కమాట
కూడా మాట్టాడకుండా లేచి సంచీ తీసుకుని గుమ్మం దాకా వెళ్లి వెనక్కి తిరిగి ముళ్ళ కంచె
మీద పడ్డావ్ బిడ్డా! ఎట్టా బయట పడతావో ఏందో ! కళ్ళ నిండా నీళ్ళతో వీడ్కోలు పలికారు. అడుగు కూడా ముందు వేయలేని అసక్తత నాలో. "తండా మొత్తం అడవిని నమ్ముకుని
బతుకుతుంటే తన అమ్మ నాన్న మాత్రం తనని బడి మెట్లు ఎక్కించడానికి తపన బడ్డారు తమ కాయకష్టాన్ని
రూపాయిగా మార్చి తాము గంజి తాగి బతికారు. వారి కళ్ళల్లో కాంతులు
నింపాలని పట్నం చేరిన తనేం చేసాడని ?
ఒక
పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానన్నమాటే
గాని నా జీతంలో నుండి ప్లాట్ కి
ఈ ఎమ్ ఐ
కి కట్ అవుతుంది తక్కువేమీ కాదు. అలాగే ఇంటి నిండా ఖరీదైన వస్తుసామాగ్రి కొనడం
కోసం చెల్లించే ఈఎమ్ఐ లు కుటుంబ ఖర్చు,
బయట పార్టీలకి, షాపింగ్ లకి, షికార్లకి అంతా ఊడ్చి పెట్టుకోవడంతో పాటు రాధ నగలు తీసుకుని బ్యాంకులో లోను
తీసుకోవడం వల్ల రాధ చీత్కరింపులు వెళ్ళిపోతాననే బెదిరింపులు మామూలైపోయాయి
వినత హ్యాండ్
ఇచ్చినాక కూడా తనలో ఎన్ని కలలుండేవి? వాటి
ఆనవాలు కూడా లేనంతగా దగా చేయబడ్డాడు "రాధ " నే ఈ రాక్షసి నా జీవితంలోకి ఏ దుర్ముహార్తాన వచ్చిందో? తను ఊబిలో దిగబడిపోయినట్లయింది. ఎవరో వచ్చి చేయూతనిచ్చినా బయటకి రాలేనంతగా, బాగుపడనంతగా రాత మారిపోయింది. మొన్న మొన్నటి దాకా రాధ బాగానే ఉంది.
తన దగ్గర డబ్బు లేదని తెలిసిపోయాక తననొక చవటలా జమ కడుతుంది. ఏమైనా అంటే.. నా పై మోజు తీరిపోయింది కాబట్టే అలా అంటున్నావ్
! నాకు రావాల్సిన డబ్బు నా నగలు ఇచ్చేస్తే ఒక్క క్షణం కూడా ఇక్కడ
ఉండనని గొడవ పడుతుంది. నలుగురినోళ్ళలో పడటం ఇష్టం లేక తనే సర్దుకుపోతూ నన్ను పీల్చి పిప్పి చేసేదాక ఈ రాక్షసి నన్నోదలదు
" అని నన్ను నేను
తిట్టుకొని క్షణం లేదు
రాధ
ఒక రోజు ఆత్మా హత్యా ప్రయత్నం చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టింది. రాదని వదిలించుకోవాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ? కళ్ళ ముందు ఒక పరిచయస్తుడు కదలాడాడు. అతను ఆంటీ ల బాయ్
ప్రెండ్ అతనిలా నేను ఒక "ఆంటీ" ని వెదుక్కోవాలి ఎస్, జాబ్ లేకపోయినా పర్వాలేదు. అంత
కన్నా ఎక్కువ డబ్బిచ్చి పోషించ గల్గే ఆంటీ
కావాలి. నా
ఆలోచనలు అలా పెడదారి పట్టాయి. ఆష ఆంటీ పరిచయం వల్ల సమాజంలో
ఉన్న మరి కొన్ని సరి క్రొత్త కోణాలు అర్ధమయ్యాయి. . నేను నైతికంగా పతనమయిపోతున్నట్లు
అర్ధమైపోయింది. అలా డబ్బు సంపాదన మొదలెట్టి రాధ పీడా వదిలించుకున్నాను కానీ అమ్మ ముందు తలవంచుకోవాల్సి వచ్చింది. మనియార్డర్ ద్వారా డబ్బు పంపితే నీ పాపిష్ఠి సంపాదన మాకొద్దని వెనక్కి కొట్టింది వృద్దాప్యంలో కూడా కట్టెలు కొట్టి అమ్ముకుంటూ , బఠానీలు,శెనగలు అమ్ముకుంటూ నాన్నని కూడా పోషిస్తూ ఉంది
ఆషా ఆంటీ కూడా
నన్ను త్వరగానే ప్రక్కకి నెట్టేసింది.
మేము కలిసి తిరిగే విషయం ఆమె భర్తకి తెలిసింది. ఆమెని గొడ్డుని బాదినట్లు బాదటం పిల్లల ముందే అసహ్యంగా తిట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యచేసుకోవడానికి
గల కారణాలని బంధువులకి స్నేహితులకి విడమర్చి
చెప్పి ఆమె మీద అసహ్యం కల్గించి తను సానుభూతి
సంపాదించుకున్నాడామె భర్త.
ఇంట్లో
భార్యని నిర్లక్ష్యం చేస్తూ గృహ నిర్భందంలో ఉంచి
తమ విచ్చలవిడి శృంగారాన్ని గొప్ప అర్హతగా చెప్పుకునే దురంహాకార పురుషులు ఉన్నప్పుడు
భర్త ఎడబాటుతో ఏ బలహీన క్షణాలలోనో ఇతరత్రా పద్దతులలోనో శారీరక అవసరాలని తీర్చుకునే వారిని అసహ్యించుకోవడం విచిత్రమని నాకనిపిస్తూ ఉంటుంది. డబ్బు ఉంటే అన్నీ సాధ్యమే !
ఆఖరికి స్వేచ్చ కూడా డబ్బుంటే దానంతట అదే వస్తుంది భార్యలని
హద్దు అదుపు లేకుండా తిట్టేవారిని,
చేయి చేసుకోవడాన్ని, అక్రమ సంబంధాలు కల్గి ఉండటాన్ని ఆడమగ తేడాలేకుండా ఎప్పుడో వ్యతిరేకించి ఉంటే బహు భార్యత్వం, అడల్టారీ
ఇలా వేళ్ళూనూకునేయే కాదని పించింది. మగవాడు ఎలా ఉన్నా తప్పు లేదని
చెప్పే నీతుల్ని శతాభ్దాలుగా పేరుకుపోయిన భావజాలాన్నిమనం
మార్చలేము. అసలు నన్నడిగితే పురుషుల వికృతాలని భరించడానికే వేశ్యా
వాటికలు ఏర్పడ్డాయనిపించేది. సమానంగా ఇప్పుడు నాలాంటి వారు పెరుగుతున్నారని అర్ధం చేసుకున్నాను, అలా నన్ను నేనే
సమర్ధించుకున్నాను. వాంఛల ముందు ఆత్మవంచన చాలా చిన్నది.
నాలాగే వినత,
రాధ, ఆష అంటీ, ఇంకా కొంతమంది
అవసరాల కోసం ఎన్ని ఆత్మవంచనలైనా చేసుకుంటారు. అందులో ఆడ మగ తేడా లేదు. ఏది నైతికం ఏది అనైతికం నిర్వచించడం
చాలా కష్టం. ఇలా దీర్ఘంగా ఆలోచిస్తూ అనుకోకుండానే నేను వ్రాసే కథకి మంచి ముగింపు ఇవ్వాలనుకున్నాను.
నాలాగే కొందరు పెడదారి పట్టకుండా నిస్సిగ్గుగా నా కథ వ్రాసి నాలా కొందరు
మారకుండా ఓ హెచ్చరిక చేయాలనిపిస్తుంది
అమ్మ
నన్ను చీత్కరించుకుంటుంది మల్లి నన్ను చూసి భయపడింది.
నా
అన్న వాళ్ళ దగ్గరే నాకున్న విలువేమిటో తెలిసినాక
ఈ జీవితానికి స్వస్తి చెప్పి మళ్ళీ జీవితాన్ని ఆరంభించుకోవాలని బలమైన కోరిక మొదలయింది.
అయితే అందులోనుండి బయటపడటమన్నది అంత తేలికేమి కాదు కూడా! ఆ ఒక్క పని తప్ప శ్రమలేని,
విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డ నేను ఆ మోజులో నుండి బయటపడటానికి ఇంద్రియాల
నిగ్రహం, మానసికశక్తి చాలా అవసరం. అప్పుడెప్పుడో మెడిటేషన్ చేయడమెలా అన్నది నేర్చుకున్నప్పుడు నాకు కల్గుతున్న ఇలాంటి స్థితినే ప్రత్యాహారం అంటారని చెప్పడం గుర్తుకు వచ్చింది. ఎస్.. ప్రత్యాహారంలో విజయం సాధించాలి
అనుకుంటూ పిడికిలి బిగించాను.
కథకిచ్చే
ముగింపే నా జీవితంలో రావాల్సిన మార్పుకి శ్రీ
కారం చుట్టడం నిజంగా బావుంది.
(మన తెలుగు డాట్ కామ్ 24 డిసెంబర్ 2014 ప్రచురణ)