30, మార్చి 2013, శనివారం

చిలిపి + చిరు పరీక్ష


సోదర సోదరీ బ్లాగర్ మహాశయులకు... మీ అందరికి  ఒక చిలిపి + చిరు పరీక్ష పెట్టి ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలని ఉంది.  సరదాగానే నండోయ్ !!

మనమందరం మన తోటి వారి బ్లాగులను చదువుతూనే ఉంటాం కదా! ఒక్కొకరిది ఒకో శైలి.  శైలి ని బట్టి మీరు వారిని గుర్తించ గలరా!?  ఒకోసారి  రచయిత  పేరు చెప్పకుండా  ఒక రచన ఇచ్చి చదివి  ఎవరు వ్రాసారో చెప్పమన్నట్లు  అన్నమాట

అలా చేయగలరేమో ప్రయత్నించండి. కామెంట్ ద్వారా మీ ఆన్సర్ చెప్పవచ్చు . ఖచ్చితమైన సమాధానం చెప్పినవారికి  బహుమానం గా వీరతాళ్ళు వేయబడును

దీనికి ఒక కారణం ఉంది/

 అది ఏమంటే  నేను క్రింద జత పరుస్తున్న  విషయం .. నాకు ఒక బ్లాగ్  ఫ్రెండ్  జన్మదిన శుభాకాంక్షలను ఇలా అందించారు. అది నాకు ఎంతగానో నచ్చింది   విలువైన మణి  మాణిక్యాలు తో సమానమైన ఈ ఆత్మీయ శుభాకాంక్షలు నాకు ఎంతో   విలువైనవి. అందుకే భద్రంగా దాచుకున్నాను హృదయం లోనూ.. అక్షరాల బోషాణం లోనూ  కూడా ,   ఆ ఫ్రెండ్ కి .. ఈ పోస్ట్ ముఖంగా మనసారా ధన్యవాదములు తెలుపుతూ నా మనసులో మాట ఇంకొకటి ...

ఈ బ్లాగ్ ప్రపంచం లోకి రాక మునుపు మనం ఎవరు ఎవరికీ ఏమి కాము. కానీ ఇక్కడి వచ్చిన తర్వాత మన వ్రాతలని బట్టి ఒకరికి ఒకరు అంతగా అభిమానించు కుంటున్నామో, వేరు వేరు సందర్భాలలో ఎలా స్పందించు కుంటున్నామో .. అన్నది గమనించుకుంటే  ఎన్నో ఆనంద,  అనుభూతి  క్షణాలు మన ఖాతాలో జమ చేయబడి ఉంటాయో కదా ! ఆ జ్ఞాపకాల నిధి ని  మనం అందరం సొంతం చేసుకుందాం

 శైలిని బట్టి  వ్రాసిన వారి ని  మీరు గుర్తించండి   మీకు అత్యంత  సూక్ష్మ గ్రాహి అన్న బిరుదు ఇవ్వడానికి తయారుగా ఉంది

ఇదిగో .. మీ పరీక్షా పత్రం .

ప్రియమైన వనజ గారు!
"జన్మదిన శుభాకాంక్షలు"
కుశలమేనని తలుస్తా!
ఏ ఒక సద్గుణాన్ని అలవర్చుకుంటే ఇతర సద్గుణములు యావత్తు తమంతట తాముగా వచ్చి వరిస్తాయో, ఆ సద్గుణం - 'స్ఫూర్తి సాహస సందేశాత్మకతలతో కూడిన "దైర్యం" '.
బహుశా ఈ కధ మీకు తెలిసే ఉంటుందనుకుంటాను -
ఓ రోజు ఒకానొక రాజు అంతఃపురం నుండి ఓ స్త్ర్రీ వెళ్లిపోతుంటే, అది చూసిన రాజుగారు, 'అమ్మా! ఎవరు నీవు?' అని ప్రశ్నించగా 'నేను ధనలక్ష్మీని, నీ అంతఃపురం వీడి వెళ్ళుతున్నాను' అని బదులిచ్చి వెళ్ళిపోయినా, అటుపై అదేరీతిలో ధాన్య, గజ, విజయ, మోక్ష ..... తదితర ఆరుగురు లక్ష్ములు తనని వీడి వెళ్ళిపోతున్న చలించని రాజు, ధైర్యలక్ష్మి వెళ్ళిపోతుండగా "అమ్మా! నీవు మాత్రం నన్ను వీడి వెళ్ళకు తల్లీ, నీవుంటే చాలు" అని ప్రార్ధించగా, ఆమె ఉండిపోయిందని, ఆమె ఉన్నచోటే మేమూ ఉంటామని ముందు వెళ్ళిన లక్ష్ములందరూ వెనక్కి తిరిగి వచ్చారని ఓ కధనం. దైర్యమనే ఒక్క సద్గుణం ఉంటే చాలు... ఉన్న స్థితి నుండి ఉన్నతస్థితికి ఎదగడానికి! ఆ ధైర్యం మీకు పెట్టని ఆభరణం.
వ్యాఖ్యలు పెట్టలేకపోయినను మీ ప్రతీ పోస్ట్ చదువుతుంటాను.
మీ రచనల్లో సూటిదనం ఉంటుంది, అది హృదయాన్ని తాకుతుంటుంది.
మీ రచనల్లో స్ఫూర్తి ఉంటుంది, అది చక్కటి సందేశాన్ని ఇస్తుంటుంది.
మీ రచనలు ఆలోచనాత్మకంగా ఉంటాయి, అవి బుద్ధిని పదునెక్కిస్తాయి.
వివిధ కోణాల్లో మీ రచనలు చదువుతుంటే, అందులో అంతర్లీనంగా ఓ ఉద్యమశీలిలా, ధైర్యశీలిలా, బుద్ధిశాలిలా, శక్తిశాలిలా, సాహసోపేతవనితలా ... విభిన్న రీతులో మీరే కదులాడుతున్నఅనుభూతి కల్గుతుంటుంది.
ఇక మీ మాతృప్రేమ వెల్లడి అవర్ణ్యం.

ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి: శక్తి: పరాక్రమః
షడతే యత్ర వర్తంతే తత్ర దేవః సహాయకః 

ప్రయత్నం,సాహసం, దైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ... ఈ ఆరూ ఉన్నచోట దైవం నుండి కూడా సహాయం లభిస్తుంది.
వనజ గారు!

పై ఆరు గుణాలున్న మీకు దైవానుగ్రహం సర్వదా సర్వత్రా ఉంటాయి. మీ మనోబీష్ట ప్రకారం మీ జీవనం నిండు నూరేళ్ళు ఆనందంగా ఆదర్శవంతంగా కొనసాగాలని ఆశిస్తూ -
మరోసారి చెప్తున్నా - 'జన్మదిన శుభాకాంక్షలు'.ఇక కనిపెట్టడం మీ పని. వీరతాళ్ళు ఇవ్వడం నా పని. 

29, మార్చి 2013, శుక్రవారం

మగువ మనసుకే తెలుసును


 మన భారతీయ మహిళ లకి  ఓ  నాలుగైదు ఏళ్ళగా  పరిచయం అయి ఉన్న చీరలు  ఇప్పటి కాలం లో స్త్రీల ఒంటి పై ఎక్కువగా కనిపించే చీర  " ఉప్పాడ " చీర

ఈ చీర ముచ్చట....

ఆ చీర చూస్తే చాలు ఆడవాళ్ళకి అమితమైన ప్రేమ పుట్టుకొస్తుంది. ఆహా.. ఏమి సొగసు,ఎంత నాణ్యత పట్టుకుంటే పాము కుబుసం లా జారిపోతూ ఉంటుంది పైగా ఒక కేజీ బరువు కూడా లేకుండా నాజూకుగా ఉంటుంది

ప్రపంచ ప్రఖ్యాతి  గాంచిన  కొన్ని వస్తువుల జాబితాలో "ఉప్పాడ చీర" కూడా చేర్చబడింది (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ) జి .ఐ కూడా లభించింది

మన ఆంద్ర ప్రదేశ్ లో వెంకటగిరి, ధర్మ వరం, పోచంపల్లి ,గద్వాల్ చీరలకి ప్రసిద్ది చెంది నట్లు ఉప్పాడ చీర కూడా ప్రసిద్ది పొందింది

నేను ఓ  రెండు నెలల కాలం లో మూడు సార్లు ఉప్పాడ వెళ్ళాను. అక్కడ చీరలు సేకరించి వాటిని అందంగా ఎంబ్రాయిడరీ కళతో అలంకరించి విదేశాలకి ఎగుమతి చేసే దిశలో ఆ ఊరికి నాకు ఒక అనుబంధం ఏర్పడింది

ఉప్పాడ ఒక గ్రామం. కానీ అక్కడి గ్రామీణుల జీవితాలలో అనుకోకుండా వెలుగు వచ్చింది సాదారణంగా చేనేత వృత్తిని వంశ పారంపర్యంగా కొనసాగిస్తూ వస్తున్న వారి జీవితాలలో ఓ చిన్న వృత్తి  పరమైన మార్పు వల్ల వారు తయారు చేసిన చీరల ప్రత్యేకత వల్ల ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ ఇంకా చెప్పాలంటే మన భారతీయ  చీర కట్టునే  ఉప్పాడ చీరతో నింపేశారు

గత రెండేళ్ళు గా ప్రముఖుల పెళ్ళి సందడి లో ఉప్పాడ చీర ప్రత్యేకంగా నిలబడింది. మా నేత చీర కట్టుకుని ఆ పుత్తడి బొమ్మ పెళ్లి కూతురిగా మారింది, మేము నేసిన పట్టు వస్త్రాలు ధరించి ఆ హీరో పెళ్ళికొడుకు గా ఎంతందంగా సంప్రదాయంగా కనిపించాడో !  అని మురిసి పోవడం పరిపాటి అయిపోయింది

ఉప్పాడ  లో తయారు చేయబడ్డ  పెళ్ళి  చీర  లక్ష రూపాయలు పై మాటే ధనవంతులకి హోదాని పెంచి సామాన్యులకి అందని చిటారు కొమ్మన ఉన్న అందని ద్రాక్ష అయిపోయే చీరలని చూస్తే ఈర్ష్య కూడా బయటపడుతుంది మళ్ళీ అంతలోనే "అబ్బ ఏముందిలే  ఆ చీరలో అంతా జరీ తప్ప . ఆ జరీ అసలు సిసలు వెండి జరీ కూడా అయిఉండదు. ఈ చీర చూడు పాతికవేలు అయితే ఏమిటీ ? ఆ లక్ష రూపాయల చీరకన్నా ఎంత అందంగా ఉందో " అనుకుంటూ మనసుని సర్ది పుచ్చుకునే మాటలు

ఓల్డ్ ఏజ్ వాళ్ళ  చీరలు అని ముఖం చిట్లించుకోకు. ఆ జార్జెట్ చీరలు ఏం బాగుంటాయి? పట్టు వస్త్రాలు ధరించడం  మన సంప్రదాయం. పట్టు చీర అందం ఇక ఏ చీరలోను కనబడదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు
టీ విలలో పెళ్ళిళ్ళు చూసి గాగ్రా చోళీ ఏమిటి అసహ్యంగా ..  ఈ వయొలెట్ పింక్ కలనేత జమ్ధాని చీర చూడు ఎంత అందంగా ఉందో ...  ఇది తీసుకో అని  ఒక అమ్మ కూతురితో మాట్లాడే మంద లిపు మాటలు భలే ఉంటాయి అచ్చు తెలుగులా అందంగా


త్రీడి చీరలు కావాలి , త్రీ కలర్స్ చీరలు కావాలి, అడ్డపట్టెలు వేసిన చీరలు కావాలి,  సెవెన్ కలర్స్ చీరలు లేవా! అయ్యో! వాటి కోసమే వచ్చాను. ఫుల్ పట్టుకు పట్టు వేసి నేసిన చీరలు కావాలండి .. జామ్ధాని చీరలు ఏడూ వేలకన్నా తక్కువలో దొరకవా !? ఇలాంటి సంభాషణలు

 ఆయ్ ! అంతేనండీ !! ఇందులో బోలెడు రకాలు ఉండాయండి. ఒరెయ్.. అమ్మ గారికి బుటా పల్లు చీరలు, ఫుల్ డిజైన్ చీరలు చూపించు" యజమాని  సమాధానాలు, ఆదేశాలూ నూ వినబడతాయి

మరి ఇది ఎంత ? పదివేలు !?   చాలా ఎక్కువ  గా ఉంది అన్న అనుమానపు  ప్రశ్నలు. ఇదే చీర మీరు షో రూం కి వెళ్లి కొంటె 15,000 పెట్టాలి అమ్మగారు. మళ్ళి అందులో డూప్లికేట్  చీరలు వచ్చేసాయండి. మా నేత చీరలని నకిలీ చేసేసి పవర్ లూమ్  చీరలు తయారు చేసేసి ఎక్కువ లాభాలకి అమ్ముకుంటు న్నారండి. ఈ చీరలు  మీరు ఎన్ని కావాలి అంటే అన్ని మేము ఇవ్వలేమండి ఒక్కో చీర నేయడానికి ఒక మనిషికి   పదిహేను రోజులు పడుతుంది. అని అంటూ  వారి ప్రత్యేకతని సింపుల్గా చెబుతూ ఉంటారు


ఇరవై మంది ఒక షాపులో కూర్చుంటే పది చీరలే పడతాయి ఆ చీరలు తీసుకోవడం  కోసం  అన్ని చేతులు  పోటీ పడతాయి.  నచ్చిన చీర దొరక బుచ్చుకుంటే మహిళ ముఖం లో ఎవరెస్ట్ ఎక్కిన ఆనందం తాండవిస్తుంది  లేకపోతే ఇంత దూరం వచ్చినా నచ్చిన చీర దొరకలేదు  అసలిక్కడ చీరలే లేవు మాల్స్ కి వెళితే నచ్చిన చీర ఒక్కటైనా దొరుకును అనే అసంతృప్తి సెగలు

ఇలా ఉంటాయండి అక్కడ మాటలు

ఉప్పాడ చీరకి విపరీత మైన డిమాండ్ ఏర్పడింది. దూర ప్రాంతాల నుండి కారులు కట్టించుకుని మరీ ఉప్పాడ కి చేరుకుంటున్నారు ప్రొద్దుగూకే వేళకైనా సరే నచ్చిన చీర దక్కించుకుని తిరిగి వెళతారు లేదా మళ్ళీ మళ్ళీ వస్తారు

ఇది ఈ చీరల ముచ్చట.

ఇక ఈ సంప్రదాయమైన వృత్తి  గురించి

మనరాష్ట్రం లో వ్యవసాయం తర్వాత చేనేత పని చేసేవారు ఎక్కువ ఉన్నారు. రోజంతా పని చేసినా సరే 150 రూపాయలు కి మించి ఆదాయం రాని  జీవితంలో ఎదుగు బొదుగు  లేని వృ త్తి అది.  నేత పనివారాల జీవితాలని శాసించే వ్యాపార ధోరణి  తక్కువ ఏమి  కాదు

 పట్టు నూలుని ఏక మొత్తం లో కొనుగోలు చేసి  దానిని చేనేత పనివారికి తూకం ప్రకారం ఇచ్చి మళ్ళీ తూకం ప్రకారం నేసిన చీరని తీసుకుని వారికి కూలిని ఇచ్చి ఆ చీరలని రెట్టింపు ధరలకి అమ్ముకునే  మాస్టర్ వీవర్ లు ఉంటారని చెపుతారు ఓ  డెబ్బయ్యి ఏళ్ల పెద్దాయనని చూసి మాట్లాడాను  చక్కగా నుదుటిన త్రిపుండం ధరించి ప్రసన్నంగా కనిపించి ఆప్యాయంగా పలకరించారు. ఏ వూరమ్మా మనది అని విజయవాడ అంది చెప్పాడు మా డ్రైవర్

మేము చాలా చీరలు కొని  అవి కారులో పెట్టుకుంటుంటే .. ఇలా వ్యాఖ్యానించారు కష్టం మాది ఫలితం వాళ్ళది. ఏం చేత్తాం !?


"మరి మీరు కూడా  నూలు  కొనుగోలు చేసి చీరలు తయారు చేసి అమ్మవచ్చు కదా ..తాతగారూ"  అని అంటే .. మా దగ్గర డబ్బు లేదమ్మా .. అప్పోసోప్పో చేసి నూలు కొనుక్కొచ్చి చీరలు తయారు చేసినా   ఎవరు కొంటారు మీలాంటి వాళ్ళు అందరూ వాళ్ళ దగ్గరే కొంటారు. వాళ్ళకి పోటీగా  చీరలు తయారు చేయడం మొదలు పెట్టామని తర్వాత పని కూడా దొరకదు అని వారి కష్ట నష్టాలు చెప్పుకొచ్చారు


అలాగే అలా సొంతంగా పెట్టుబడి పెట్టి వ్యాపారం ని విస్త రించుకున్న యువతరాన్ని నేను చూసాను

తండ్రి సంప్రదాయ చేనేత కళాకారుడు అతను  రాజస్థాన్,డిల్లీ  వైపు వెళ్లి అక్కడ చేనేత వస్త్రాల తయారీలో మెలుకువలు డిజైనింగ్ నేర్చుకుని వచ్చి అంతకు క్రితం వారికి తెలిసిన పనికి మెరుగులు దిద్దుకుని అద్భతమైన డిజైన్స్ తో చీరలు చేయడం మొదలు పెట్టారు. అవే జామ్దాని చీరలు

ఈ జామ్ధాని చీరలులో ప్రత్యేకత ఏమిటంటే పట్టులో జరీ  కలసిపోయి చీర వెనుక వైపు ముందు వైపు ఒకేలా ఉండటం అంటే జరీ తోనే డిజైన్ రావడం మరియు అది కట్ చేయకుండా ఉండటం వల్ల జరీ పోగులు గట్టిగా పట్టుకుని పీకినా కూడా బయటికి రావు శరీరానికి గ్రుచ్చుకుని ఇబ్బంది పెట్టవు అలాగే రకరకాల రంగుల్లో డిజైన్ ని నింపేస్తారు. డిజైన్ లో మలుపులు తిరిగిన దానిని బట్టి ముప్పయి మలుపులు, ఏబై మలుపులు వంద మలుపులు ఉంటాయి . ఆ తయారీ విధానం ని బట్టే చీర రేటు ఉంటుంది

 నేను 20,000 రూపాయల ఖరీదు అయిన  చీరల కొరకు  కొనుగోలు చేసాను. పట్టు పినిషింగ్, డిజైన్స్ అంతా బాగున్నాయి అలాగే మరొకటి గమనించాను "ఉప్పాడ " షాప్ లలో కూడా నకిలీ చీరలు  ఉన్నాయి అక్కడ కూడానా?  అనకండి.  అధిక లాభాల కోసం, డిమాండ్ ఎక్కువ ప్రొడక్ట్ తక్కువ కారణంగా "కంచి" లో తయారయ్యే ఉప్పాడ తరహా పవర్ లూమ్ శారీస్ ని  కొనుగోలు చేసుకుని వచ్చి ఉప్పాడ చీరలుగా చెలామణీ చేసుకుంటూ ఉండేవారు ఉన్నారు  నిజాయితీగా సప్లయ్ లేదమ్మా టైం పడుతుంది మళ్ళీ రండి అని మర్యాదగా చెప్పేవారు ఉన్నారు. అలాగే పట్టు నూలు కిలోధర మొదటి రకం కి రెండవ రకంకి   ఏడూ ఎనిమిది  వందల రూపాయలు తేడా  ఉంటుంది .  రెండవ రకం నూలుతో చీర తయారు చేసేవాళ్ళు ఉన్నారు అది నిశితంగా గమనిస్తే తప్ప తెలియదు. ఒక చీరకి ఒక కేజీ బరువు వస్తే  నూలు ధరలోనే ఏడెనిమిది వందలు మిగుల్చుకునే వ్యాపార మెలుకువలు అక్కడ రాజ్య మేలుతున్నాయి

మనం నాణ్యత రంగు డిజైన్  చెప్పి చీర తయారు చేయిన్చుకోవాలంటే కనీసం మూడు నెలల ముందు ఆర్డర్ పెడితే తప్ప మనకి సప్లై చేయలేమని చెప్పారు. అది కూడా ఎక్కువ  మొత్తం లో కొంటేనే  తయారీ చేసి ఇవ్వగలం అని చెప్పారు.

ఒక చేనేత కార్మికుని కొడుకు కొత్త దారులు వెదుక్కుంటూ చేసే పనిలో అంకితభావం చేకూర్చుకుని సంప్రాదాయ వృత్తికి హంగులు అడ్డుకుని కాస్తంత కళాత్మకత జోడించి నాణ్యత అనే నమ్మకాని జొప్పించి తన ఇంటి ప్రక్కనే కొన్ని షెడ్ లు వేసి తన తోటి కార్మికులతో చీరలు తయారు చేయించి ఉప్పాడ రాజ వీధిలో షాప్ నిర్వహించుకుంటూ అతి సాధారణంగా ఉండే ఈ యువకుడిని చూస్తే ముచ్చట వేసింది

వ్యాట్ టాక్స్  పై నిరసనగా సమ్మె జరిగే సమయంలో మేము కావాలనే ఉప్పాడ వెళ్ళాము . ఎందుకంటే అప్పుడైతే జన సందోహం ఉండదు కావలిసిన రంగులు,అసలు సిసలు అయిన చీరలు దొరుకుతాయని మాస్టర్ వీవర్స్ కి ఫోన్ చేసి గృహం లో అమ్మకం జరుపుతామని చెప్పిన తర్వాతే అక్కడికి వెళ్ళాం. అక్కడ వారి నిర్వహణా సామర్ధ్యం,పని తనం ఇంకా అక్కడ ఉన్న స్టాక్ చూసి ఆశ్చర పోయాము. వర్తకం  నడిచే రోజుల్లో అన్ని రంగులు డిజైన్స్ దొరకడం అసాధ్యం కూడా  "వెంకట రమణ " అనే ఈ యువకుడు తన ఇంటిలో వ్యాపారం నిర్వహించారు

రాత్రి ఏడూ గంటలు సమయం అప్పుడు అతని  స్వంత మగ్గాలు చూపించారు (వర్క్ షాప్ ) అక్కడ కొంత మంది బాల కార్మికులు కనిపించారు . లేబర్ యాక్ట్ ప్రకారం నేరం కదా అంటే .. లేదు మేడం గారు వాళ్ళు పగలు స్కూల్ కి వెళతారు ఇప్పుడు నేత పని నేర్చుకుంటారు. అలా నేర్చుకోకపోతే పని రాదు కదండీ . పని నేర్చుకోకపోతే ముందు తరాలకి చేనేత వస్త్రాలు అంటే తెలియవు కదండీ అని చెప్పాడు . నిజమే కాదా! ఆ మగ్గం పని నేర్చుకుంటున్న వీళ్ళే భావితరాల నేతగాళ్ళు. వీళ్ళ చేతుల్లో ఎంత అద్భుతమైన పని తనం దాగుంటుందో అనిపించింది ప్రతి చోట నిబంధనలు చట్టాలు గిరిగీసుకుని ఉంటె ఏమి చేయలేం, ముందు తరం వారు నేర్చుకోలేరు అని చెప్పారు. అందుకే అలా రాత్రి సమయాలలో పిల్లలు కనబడతారు

అలాగే  నాకు తెలిసిన ఒక యువకుడు మద్రాస్ లో సాఫ్ట్ వేర్  ఉద్యోగం  చేస్తూ నెలకి 65000 జీతం పుచ్చుకుంటున్న ఉద్యోగాన్ని వదిలేసి తండ్రికి సాయంగా ఉండటానికి వచ్చేసాడు. వారికి ముప్పై సొంత మగ్గాలు ఉన్నాయి

మన సంప్రాదాయ వృత్తులని వదులుకోకూడదవి  ఉద్యోగం వదిలేసి  వచ్చేసాను. మనం ఉపాధికోసం ఎక్కడెక్కడో  వెదుక్కుంటున్నాము, డబ్బు సంపాదించడం కన్నా మన జీవన విధానం ముఖ్యం కదా ! బహుళజాతి సంస్థల ఆధిపత్యం కి మనమే రాచబాట వేస్తున్నాం,  మనం ఇంకా ఎక్కడ అభివృద్ధి చెందుతాము.? అందుకే నేను ఇలా వచ్చేసానని ఆ యువకుడు చెప్పాడు

అవును కదా!  తరతరాల మన సంప్రదాయ వృత్తులని నిర్లక్ష్యం చేసి పరుగులేత్తుతుంది  మనం కాదా!? అనిపించింది

ప్రభుత్వ సాయం,ప్రజల ప్రోత్సాహం లేకుంటే ఏ కళ  అయినా ఏ వృత్తి అయినా కనుమరుగవుతాయి. అది నిజం

కేవలం ఉప్పాడ ఖరీదు అయిన చీరలే కాదు సాధారణమైన నూలు చీరలు ఉన్నాయి అవి కూడా కొనుక్కుని మనం కట్టుకోవడం అలవాటు చేసుకుంటే బావుంటుంది కూడా. చేనేత కార్మికులకి పని లభిస్తుంది కేవలం పట్టు చీరలు కొంటె వ్యాపారులకే లాభం మరి లాభాలలో అణాకాణీ  కూడా పనివారాలకి వెళ్ళదు అన్నది నిజం

అలాగే నేను గమనించిన విషయం మరొకటి ఉంది  ఉప్పాడ  లో మాస్టర్ వీవర్స్ దగ్గర బయట షాప్ లలోను కూడా ఒకే విధమైన ధరలు ఉన్నాయి అందరూ అక్కడ ధరవరల ల విషయం లో ఒకే విధానం తో నడుచుకుంటారు. నాణ్యత., పనితనం  చూసి చీరలు కొనుక్కోవాలి లేకపోతే  మోసపోగలరు  చేనేత వారి గురించి ఇంకా కొన్ని విషయాలు వారి మనసులో మాట వ్రాయాలని ఉంది.  మరి కొన్ని విషయాలు మరొక పోస్ట్ లో చెప్పుకుందాం . ఇప్పటికి స్వస్తి

(ఇక్కడ నేను చీరల ధరలు పొందు పరచడం లేదు అది వ్యాపార దృకోణం. నాకైతే ఇబ్బంది లేదు కాని నా తోటి వ్యాపారస్తుల కి హాని చేయకూడదు కదా! ఇప్పటికే ఉప్పాడ చీరలు ఓపెన్ మార్కెట్ అయిపొయింది అక్కడ ఎంత? బయట ప్రాంతాలలో  షాపులలో   ఎంత అన్నది తెలిసిపోతూనే ఉంది. అందుకే వెంటనే ఇమిటేషన్ చీరలు వచ్చి రాజ్యం యేలుతున్నాయి ఉప్పాడ  లో షాప్ లలో సహా!  అలాగే  అక్కడ  ప్రస్తుతం ఉన్న రకాలు అన్ని పరిచయం చేసాను  ఇంకా ఎక్కువ పరిచయం చేయాలని ఉన్నా కూడా మీరు చూసేటప్పుడు బ్లోగ్ ఓపెన్ అవడం ఆలస్యం అవుతుంది  కష్టం అవుతుంది కాబట్టి )

 దేశ విదేశాల లో ఉన్న సోదరీ మణులారా ! మీకు ఏమన్నా గైడ్ లైన్స్ కావాలంటే  ఈ e చిరునామా కి మెయిల్ చేయవచ్చు harivillucreations7@gmail .com  నా వీలుని బట్టి మీకు సమాచారం అందజేయగలను


జామ్దానీ చీరలు 


కలనేత చీర 3 రంగులు 
ఇక చాలండి .. మరి కొన్ని ఇంకో పోస్టులో . (అచ్చు తప్పులు ఉంటే  క్షమించేయండి .. ప్లీజ్ ప్లీజ్ !! బాగా బిజీ )

26, మార్చి 2013, మంగళవారం

సమూహం

ఇప్పుడు మనుషులు సమూహాలుగా విడివడిపోతున్నారు

అందరూ అన్నింటిలోను ఉంటున్నారు

ఎవరికీ వారు ప్రత్యేకంగా ఉండటానికి

గుర్తింపబడటానికి ,  ఆరాటపడి పో
తుంటారుప్రతి ఒక్కరు 

సమూహం లో ఇమిడి ఉండలేకపొయినా

నాలుగు గోడల మధ్య ఇమిడి ఉండాల్సిన

తప్పనిసరి బంధం అయితే ఉంది కదా!

అదే కుటుంబం.ప్రతి కుటుంబం  కుటుంబంగా లేకపోయినా

సమూహంలో ఒదిగిపోతుంది

అవసరాలకి కాదు కాలక్షేపాలకి

 

నా సమూహం ఎలా ఉండాలని  అనుకున్నానంటే...  

నీ సమూహం నా సమూహం వేరు వేరు కాదనుకున్నాను

మనకి   మనమే ఓ  సమూహం గా  ఉన్నామనుకున్నాను

 అయినా నీ సమూహంలో నాకు చోటు లేదని తోసేసాక

నీ ఇంకో సమూహంలో మాత్రం ఎలా ఉండగలను ?ఎవరి  సమూహాలు వారివి.

ఎవరి  అభిరుచిలు వారివి
  అస్తిత్వమో , అస్థిరత్వమో

మేలుకోమంటూ  హెచ్చరిస్తుంది

అందుకే   ఉక్కిరి బిక్కిరి అయ్యే   సమూహాల  నుండి


నన్ను నేను వెలివేసుకోవాలనిపిస్తుంది

ఒంటరి నక్షత్రం  తళుకులీనుతూనే ఉన్నట్లుగా


నేనొక ఒంటరి సమూహం నయి... తుంటరి ప్రవాహమై  

కాలం సాక్షిగా, జాలం సాక్షిగా

నాలో నేనే కరిగిపోవాలని ఉంది.   


22, మార్చి 2013, శుక్రవారం

అద్భుతః

అద్భుతః ... !!?

ఏమిటి అనుకుంటున్నారా!?

వద్దు వద్దు అనేవారు కూడా లొట్టలు వేసుకుని తినే శాకం ... ఇదిగో ఇది
ఈ రోజు  ఓ ..ప్రయాణం  కోసం  కలసి వెళ్ళడం కోసం నా ఫ్రెండ్ వచ్చింది తన కిష్టం అని ఒక శాకం చేసాను కబుర్లు చెప్పుకుంటూ  భోజనం చేస్తూ .. ఈ రోజు బ్లాగ్ లో  పోస్ట్ వ్రాసే తీరుబడి లేదు అన్నాను . ఇదిగో దీని గురించి వ్రాసేయి అని కంచం లో కూరని చూపింది . భలే గుర్తు చేసావు అనుకుంటూ .. తన కన్నా ముందు గబా గబా భోజనం ముగించి ఇలా వచ్చేసాను .

సరే ... ఈ శాకం తయారు చేయడానికి  కావాల్సినవి

లేత తెల్ల వంకాయలు ఒక అరకేజీ

టమాటొ  నాలుగైదు

పచ్చి గట్టి మామిడి కాయ (పులుపు)

పచ్చి మిర్చి  నాలుగంటె నాలుగు

కొత్తిమీర

ఉల్లిపాయలు రెండు

గింజ కట్టని లేత నవ నవ లాడే వంకాయలని తీసుకుని కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకోవాలి

నూనె సుమారుగా 75 గ్రాముల వరకు వేయాలి నూనె వేయడంలో తక్కువ చేయవద్దు (తర్వాత ఈ శాకం బాగోలేదని  నన్ను అనగలరు )

పొయ్యి మీద కళాయి ని పెట్టి నూనె వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర ,కరివేపాకుతో తాలింపు వేసి   పచ్చి మిర్చి ముక్కలు , ఉల్లిపాయ ముక్కలు ముందు తర్వాత  వంకాయ ముక్కలని వేయాలి

వెంటనే కొద్దిగా పసుపు,కొంచెం ఉప్పు చేర్చి సన్నటి సెగపై ముక్కలని మగ్గనిస్తూ .. మామిడి కాయను తోలుతో సహా చిన్న చిన్న ప్రమిదలంత ముక్కలగా అడ్డదిడ్డంగా కోసుకోవాలి

తర్వాత టమోటా లని కూడా పెద్ద ముక్కలుగా కోసుకుని కళాయిలో మగ్గుతున్న వంకాయ ముక్కల లో వేయాలి

ఇప్పుడు అదే సెగపై గరిట  పెట్టి కదపకుండా ముక్కలని ఎగరవేసి కలుపుతూ కొంచెం సేపటి తర్వాత మూడు స్పూన్ ల సాంబారు కారం వేసి మళ్ళీ ఒకసారి ముక్కలు చిదమకుండా  కలుపుకుని పైన  కొత్తి మీర  చల్లి సన్న సేగపైనే  ఉడక నివ్వాలి.

ఈ శాకం కేవలం ఇరవై  నిమిషాల సమయం లోనే  చేయడం అయిపోతుంది. చాలా తేలిక.  రుచి మాత్రం అద్భుతః అనాల్సిందే !

నేను మొట్ట మొదట నేర్చుకున్న  శాకం ఇది. మా పుట్టింట్లో పరిచయం లేదు కానీ నెల్లూరు ప్రాంతం వారు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ కూర లేనిదే ఏ విందు భోజనాలు ముగియవు.
అంత రుచిగా ఉంటుంది వండేట ప్పటి వాసన కూడా నలువైపులా వ్యాపించి నోరు ఊరిస్తూ ఉంటుంది  మా ఇంటి చుట్టు ప్రక్కల వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏమి  కూర అని.   నేను ఈ పేరు చెపితే ఇలా కూడా వండుతారా? అంటారు . సమాధానం గా ఒక గిన్నె లో కూర వాళ్లకి రుచి చూపడానికి వెళుతూ ఉంటుంది

 ఈ కూర చపాతీల లోకి,అన్నం లోకి చాలా బాగుంటుంది.  ఈ కూర చేయడం చాలా మందికి పరిచయం ఉంటే ...  అబ్బా .మాకు తెలుసు లేవమ్మా .. అనుకోకండి

తెలియని వాళ్ళు మాత్రం వెంటనే చేసేసి తినేసి ఒక కామెంట్ ఇచ్చేసి వెళ్ళండి. అప్పుడే  ఈ వంకాయ మామిడికాయ  కూరకి  నాతో పాటు  మీరు కితాబు ఇచ్చినట్లు .


20, మార్చి 2013, బుధవారం

విసిరి పారేసిన ఓ ... చూపు

ఇటీవల కాలం లో మా ఇంటి  ప్రక్కనే బహుళ అంతస్తుల భవనాలు చాలానే  వెలిసాయి. ఎక్కడెక్కడ నుండో  జనం వచ్చి పిట్టల్లా ఆ గూడులలో జొరబడుతున్నారు. ఎప్పుడు ఏదో ఒక కీసర బాసర.   వద్దనుకున్నా ఇతరుల మాటలు మన చెవుల్లో దూరి పోతుంటాయి 

ప్రొద్దు ప్రొద్దుటే  గోడ ప్రక్కనే అవతలి భాగంలో చేరిన పండితులవారు తన కొడుకుకి ఇలా వడ్డిస్తున్నారు.  


చక్కని గ్రంధం ని చదివి అర్ధం చేసుకోకుండా విషయం ఏమి లేదంటావే మూర్ఖుడా! విషయం ఏమి లేకుండా పుంఖాను పుంఖాలు ఎలా వ్రాస్తార్రా  వెధవ ! చదివే  వాళ్ళు అందరూ సన్నాసివెధవలనా  అర్ధం ? 

ముందు ఇతరులలో ఏం ఉందొ , ఏం లేదో తెలుసుకునే ముందు నాకన్నీ తెలుసునా !?అని ప్రశ్న వేసుకో! 

మరు క్షణం  తనకేమి జరుగుతుందో తెలియని జ్యోతిష్యుడు ఇతరుల కేమి జరుగుతుందో   చెప్పే వాడిలా ... నువ్వు ,నీ అసందర్భ ప్రేలాపనలూనూ ... 

నువ్వేమన్నా శంకరాభరణం శంకర శాస్త్రివా ! కోడి మెదడు వెధవా ..!  ఎప్పుడు పురుగులు ఏరుకుతినాలని చెత్తా చెదారం కెలికి నట్లు అందరి మనసులు కెలుకుతావు. అప్రాచ్యపు వెధవ ! నీకు ఈ జన్మకి బుద్ధి  రాదు ... 

మనుషులలో కలవలేని విద్యలు  ఎన్ని వచ్చి  ఉంటే  ఏమిటిరా ..ఎంత  గొప్పవైతే ఏమిటిరా ... ? నీ జన్మకి నీకు  అర్ధం కాని విషయమది  పరమశుంఠ... పరమ శుంఠ ని.. అని నొక్కి తిడుతున్నారు .  

అ లా సాగుతూనే ఉంది  ... ఆ మాటలు వింటూ  ఇదేదో "రుద్ర వీణ " కథ రివర్స్ లో వినబడుతుందే అనుకున్నాను.

అంతకు ముందు ఒక రోజు .. ఆ పండితులవారి కుమార్తె  తన అన్నయ్య పై  తండ్రికి ఇలా పిర్యాదు చేస్తుండ గా  నేను విన్న మాటలు ఇలా ...  

నాన్న గారు ! అన్నయ్య గారికి రోజు రోజు కి వెర్రి ముదిరి పోతుంది.  అన్నయ్య ఆఫీస్ లోనే వేరే సెక్షన్ లో  పనిచేస్తున్న  నా స్నేహితురాలు అన్నయ్య ఎదురు పడితే నమస్కారం అండీ బాగున్నారా ! అని పలకరించింది అట. " అసలు నువ్వెవరు ? నాకు నీతో  పరిచయం లేదే? నన్నెందుకు పలకరిస్తున్నావ్ ? నాకు ఇలాంటివి నచ్చవ్ , అయినా నమస్కారం చేసే పద్దతి ఇదేనా ?  ఎవరు ఏమిటో ఏమి తెలియకుండానే అందరిని కలిపేసు కుందాం అనుకుంటారు ... అని మండి  పడ్డాడంట. 

పాపం ఆమె బిక్క చచ్చి పోయి .అయ్యో ..! అలా  అంటారేమిటండి  నేను మీ చెల్లెలి స్నేహితురాలిని అని చెప్పినా వినకుండా  నాకు ఇలాంటివి నచ్చవ్ అని విదిలించి వేసాడట. పాతికేళ్ళు మీరు ఏం  నేర్పారో వాడు ఏమి నేర్చుకున్నాడో కాని తోటి మనుషులతో మాట్లాడే జ్ఞానం మాత్రం మీరు నేర్పలేదండి... అని  తండ్రిని నిర్మొహమాటంగా చెప్పేసింది 

అవునమ్మా..  దానం కొద్దీ బిడ్డలు అంటారు చచ్చు పుచ్చు దానాలు చేసి ఉంటాను .అందుకే  ఇలాంటి కొడుకు పుట్టాడు  ఉద్దరించడానికి. అయినా వీడి జ్ఞానం వీడిని  ఉద్దరించ లేనప్పుడు  ఇతరులని ఎలా ఉద్దరిస్తుందో తెలుసుకోడు. వీడు అందరిని వెలివేసినట్లు చూస్తే  వీడే మనుషుల లోనుండి వెలివేయబడతాడు .. అని బాధగా నిట్టూరుస్తూ  ఉండటం వినిపించింది 

మళ్ళీ ఈ రోజు సాయంత్ర సమయం లో   ఒక ప్రహసనం చూడాల్సి వచ్చింది 

ఈ సారి మాట విదిలింపు .. పండితులు గారి  కోడలి నోటంట విన్నా... 

అది ఇలాగున  వినబడింది 

మామగారు ...  మీ అబ్బాయితో వేగడం నా వల్ల కాదండి  పప్పు వండితే ఉప్పు లేదంటారు దప్పళం చేస్తే ఇలాగున చేసేది నేను చేసి చూపనా... ! అంటారు. చింత పండు చారులో కొత్తిమీర ఎందుకు దండగ అని ఒకటే నస.    కాపీ వేడి ఎంత ఉండాలో, ఎంత వేడిలో ఉంటే  ఎంత రుచిగా ఉంటుందో నీకు తెలియదంటారు. ఏ రంగు బట్టలు ఎలా ఉతకాలొ నన్ను చూసి నేర్చుకోమంటారు   నాకు వచ్చినట్లు నేను చేస్తాను మీకు నచ్చపోతే మీరే చేసుకోండి అంటే  అందుకు మాత్రం  నాకు ఉప్పుకి పంచదారకి తేడా తెలియదు అంటారు 

పెళ్లి అప్పుడు అందంగా ఉన్నావని  చేసుకున్నా ..ఇప్పుడు  పొత్రంలా తయారయ్యావ్ నిన్నేం చేసుకోను అంటారు, పిల్లలని పెంచే పద్దతి ఇది కాదంటారు మనీ మేనేజ్మెంట్ నీకు తెలియదంటారు నేను అసలు  ఏమి తెలియని శుద్ధ మొద్దుని అయితే   మీ కొడుకుతో కాపురం ఎలా చెయ్యనండీ!? నేను మామూలు మనిషిని నాకు బోలెడు లోపాలు. ఏ లోపం లేకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి ? ఈ సతాయింపులు, ములుకులు లాంటి మాటలు నేను పడలేనండీ 

మీ అబ్బాయి లాంటి .perfectionist, intellectual నాకు వద్దండీ మామగారు . మీకు దణ్ణం పెడతాను మా పుట్టింటికి పోతాను నన్ను పంపించేయండి మీరు అలా పంపక పొతే  ఏ 498A  నో పెట్టి మరీ పోతాను 
అని గట్టి గట్టిగానే ఏడుస్తూ చీదుతూ వాపోతుంది . 

వెంటనే ఆ కొడుకు గబా గబా గుమ్మం దగ్గర కి వచ్చి నిలబడి ...    నిన్ను  బయటకి వినబడే టట్లు  వాగవద్దన్నానా! అప్రాచ్యపు పీనుగా ! లోపలకి వచ్చి ఏడువు ఆ ఏడుపేదో.  బజారున పడతావెందుకే ! నలుగురు వింటున్నారు,  చూస్తున్నారు అనే ఇంగిత జ్ఞానం లేదు  అంటూ అతను మాత్రం గట్టిగానే తిట్ట సాగాడు.అచ్చు "కల్కి"  సినిమాలో " ప్రకాష్ రాజ్ లాగా"   

 ఆ పండిత మామగారు మాత్రం కోడలి వైపు తిరిగి  చేతులెత్తి....  "తల్లీ ! నిన్ను  వేడుకుంటున్నాను వాడి అపరిమిత జ్ఞానం అనే అజ్ఞానం ని సహనం అనే చిరునవ్వు పులుముకుని భరించు తల్లీ !  అని 

ఇదంతా చూస్తున్న ఇంటి ఆడపడుచు మాత్రం ఒకటి అనడం కూడా వినబడింది

  ఒరేయ్ సోదరా !  ఏ నక్షత్రం న పుట్టావురా!? మనిషి అన్నవాడికి  నిన్ను భరించడం ఎంత కష్టం రా ... నీ మితిమీరిన తెలివితేటలు,  నిక్కచ్చి తనం అని నువ్వు అనుకునే అహంకార చేష్టలు, వాగాడంబరం మానుకోకుంటే ... నీకు చిప్ప కూడు మాత్రం ఖాయం నిన్ను ఎవరు కాపాడలేరు అని అంది 

సందె వేళప్పుడు వాకిట్లో ముగ్గు పెడుతూ.. నేను అనుకున్నాను " అవును సోదరా... కాస్త ఒళ్ళు,నోరు అదుపులో పెట్టుకుని సాటి మనుషులని మనుషులుగా చూడటం నేర్చుకుంటే బావుంటుంది కదా ! " అనుకున్నాను 

 తర్వాత స్వగతంలో .. ఏమిటో ఈ  నగర జీవనం లో అన్ని పైత్యాలు వద్దన్నా నా కంట పడేవే ! కళ్ళు మూసుకోవాలో , చెవుల్లో దూది పెట్టుకొవాలో తెలియడం లేదు  అనుకుంటూనే... 


సందె దీపం వెలిగించి  "ఇరుగు చల్లన, పొరుగు చల్లన మనసులో కల్మషాలన్నీ  కరిగి  అందరి మనుగడ  చల్లగా ఉండాలని కోరుకుంటూ "  ప్రొద్దుటనుండి  నే చూసిన చూపులని విసిరి పారేసాను.  మనసు తేలికయిందని వేరే చెప్పక్కరలేదు అనుకుంటాను  

18, మార్చి 2013, సోమవారం

వంద వేల మందిని ఆకర్షించిన " బ్లాగిణి "

గత సంవత్సరం ఇదే రోజున "బ్లాగర్ గా నా అనుభవాలు " అనే పోస్ట్ వ్రాసాను. 

ఆ పోస్ట్ ఈ రోజు చదువుకుని కొంచెం సిల్లీ గా అనిపించి నవ్వుకున్నాను. ఎందుకంటే గత సంవత్సరపు అనుభవం  కంటే  ఈ రోజు నా అనుభవం సీనియర్ కదా! :) అందుకు .

గత సంవత్సరం కంటే ఇప్పుడు పరిణితి చెందినది అయితే నిజం  

మనసు విప్పి బోల్డ్ గా చెప్పేయడం నా అలవాటు. ఏ విషయం  అయినా దాచుకోవడం, గుభనంగా ఉండటం  నా వల్ల  కాదనుకుంటూ ఉంటాను. 

గత సంవత్సరం  ఈ బ్లాగ్ ప్రపంచం అందరూ మనవారే అనుకున్న  భ్రమ లో ఉండేదాన్ని. అందుకే నా పుట్టిన రోజు కూడా విష్ చేయలేదు అని ఉక్రోషం వెళ్ళ గ్రక్కినట్లు చదువరులకు అనిపించినా అక్కడ నేను నిజమే మాట్లాడాను కూడా. 

ఈ సంవత్సరం అయితే చాలా మాములుగా నా పుట్టిన రోజు జరుపుకున్నాను బ్లాగ్ లో ఎనౌన్స్ చేసుకోకుండా కూడా 

అయినప్పటికీ నా ఆత్మీయులు (మన బ్లాగర్ ఫ్రెండ్స్ ) వ్యక్తిగతం గా  అందించిన  ఆత్మీయ శుభాకాంక్షలు  చాలా చాలా మధురమైనవి. వారికి ఈ ఠపా ముఖంగా హృదయ పూర్వక ధన్యవాదములు   

ఒక సంవత్సర కాలంలో  నా బ్లాగ్ ని  అక్షరాల లక్ష మంది (100000) వీక్షకులు దర్శించారు అలాగే బ్లాగర్ లుగా ఉండి వీక్షించిన వారి సంఖ్య 53,000 మంది. 

 రోజు వారి  సమీక్షించుకుంటే   అత్యధిక వీక్షణా పేజీలు  ఒక రోజు కి 745 పీజీలతో అత్యధికంగా ఉన్న రోజు ఉంది 

ఏమి వ్రాయక పోయినా 300 పీజీలు వరకు వీక్షించిన రోజులు ఉన్నాయి. 

ఒక సంవత్సర కాలంలో నేను వ్రాసిన పోస్ట్లు లింక్స్ తో సహా..  268

సరదాగా ,కాలక్షేపంగా మొదలు పెట్టి సీరియస్ గా తీసుకుని వ్రాయడం మొదలెట్టి రెండేళ్ళు అయింది. 

ఈ రెండేళ్ళ లో నా జీవితం లో  బ్లాగ్ ఒక భాగం అయిపొయింది.  నా మనసులో మెదిలే భావాలు, 
హృదయానుగతాలు, నా భావేశం, మానసిక సంఘర్షణ, ఆలోచనలు - అనుభవాలు ,స్పందనలు అన్నీ  నా బ్లాగ్ తెల్లకాగితం పై అక్షరాలుగా మారి .. నాకొక పెద్ద  డైరీని మిగిల్చాయి. 

ఇక్కడ బ్లాగ్ - నేను వేరు వేరు కాదు రెండు నేనే ! నేనే బ్లాగ్ గా ఒకటిగా కలసి మెలసి ఉన్నాం విడదీయనంతగా  పెనవేసుకుని  ఉన్నాం . 

ఈ రెండేళ్లలో చాలా కథలు వ్రాసాను, కవితలు వ్రాసాను, వ్యాసాలూ వ్రాసాను  సింహావలోకనం చేసుకుంటే నేనే ఇవన్నీ వ్రాసానా !? అని ఆశ్చర్యం కల్గుతుంది. 

 పదునైదు సంవత్సరాలుగా వ్రాసిన   నా కవితలన్నింటిని కలిపి రెండు కవితా సంకలనాలుగా, కథలని ఒక కథల సంపుటిని తెచ్చే ప్రయత్నం లో ఉన్నాను. 

బ్లాగ్ వ్రాయ కుండా ఉండి  ఉంటే  నేను కథలకి అక్షర రూపం ఇచ్చేదాన్ని కాదు  కాగితం పై వ్రాయడం అంటే  అంత చికాకు నాకు. ఇంకా ఆలోచనలు లో మెదిలే అనేక   భావావేశాలు, జీవన సంక్లిష్టతలు నాలో అగ్ని కణాలుగా రగులుతూనే ఉన్నాయి  వాటికి అక్షర రూపం తెచ్చే ప్రయత్నం చేస్తాను నా ప్రయత్నానికి అవరోధం నాకున్న spondylitis

నా బ్లాగ్ ని చదివి నన్ను అభినందించి , నన్ను ప్రోత్సహించిన బ్లాగర్ మిత్రులందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు 

బ్లాగ్లోకపు ఉక్కు మహిళ  గా పరిచయం చేసిన జాజిమల్లి మల్లీశ్వరి  గారికి 

ఆ శీర్షిక ని అభిమానించి బలపరిచిన ఆత్మీయ మిత్రులందరికీ  మనసారా ధన్యవాదములు . 

గత ఏడాది కాలంగా నా బ్లాగ్ అందరిని ఆకర్షిస్తున్నా కూడా ఒక బ్లాగర్ గా  ప్రింట్ మీడియా లో  నా పరిచయం రాలేదని అనుకునేదాన్ని . ఆ లోటు తీర్చి " తెలుగువెలుగులు "  లో నన్ను పరిచయం చేసిన " వలబోజు జ్యోతి " గారికి  మనసారా  కృతజ్ఞతలు 

అందరిని అభిమానించడమే తప్ప మరొకటి తెలియదు నాకు. 

ఈ బ్లాగ్ ప్రపంచం "  ప్రపంచం ' ని మరింత దగ్గరగా చూపింది. నన్ను నేను ఇంకా బాగా అర్ధం చేసుకునేందుకు ఎంతగానో ఉపకరించింది. అందుకు "   చాలా చాలా సంతోషం. " 

ఆఖరిగా ఒక చిన్న మాట. 

నా అరచేతి మధ్య " మౌస్ "అమర్చి నాకు  అంతర్జాలం ని పరిచయం చేసి  నా ఒంటరి తనాన్ని అక్షర సమూహం చేసిన నా కొడుకు " నిఖిల్ చంద్ర " కి   మనసారా దీవెనలు. 

నాకు ఆత్మీయతని పంచిన అనేకానేక బ్లాగ్ మిత్రులకు హృదయ పూర్వక అభివందనం. నన్ను భరిస్తున్నందుకు  మరీ మరీ ధన్యవాదములు  

నా బ్లాగ్ ని పరిచయం చేసిన  అగ్రిగేటర్స్  "హారం "  జల్లెడ "   బ్లాగర్స్ వరల్డ్ "   బ్లాగిల్లు "   100 తెలుగు బ్లాగర్స్ "   బ్లాగ్ లోకం "    కూడలి "    సంకలిని  "    మాలిక "    తెలుగు బ్లాగులు "  అందరికి  మనః పూర్వక ధన్యవాదములు  

నా  లోకాన్ని అందంగా, అనుభూతి మయంగా మార్చిన  నాలో ఉన్న "బ్లాగిణి " కి  ధన్యవాదములు చెప్పకుంటే ఊరుకుంటుందా చెప్పండి !? 

 వేయి వందల మంది  ని ఆకర్షించిన "బ్లాగిణి" కి ధన్యవాదములు.  వంద వేల మందిని ఆకర్షించిన బ్లాగిణి  కూడా అనొచ్చు కదా!  :) 

(ఈ పరిచయం గర్వం తో కాదు. సంతోషం తో కాదు .. ఇంకా బాగా వ్రాయాలి అనే  భాద్యత పెరిగినందుకు కించిత్ భయం తో )

ఇండీ బ్లాగర్ ఇన్ లో నా బ్లాగ్ ప్లేస్ 82
నా బ్లాగ్ రద్దీలని చూపే మరో వివరం ..ఈ లింక్ లో      StatusCrop . com


15, మార్చి 2013, శుక్రవారం

నీలి మొగ్గనీలి మొగ్గ

గుప్పిట నుండి  ఇసుకలా కాలం జారిపోయింది 
జీవితం చేజారి పోయినట్లు  

 కొందరికి అంతే ! 
కావాలని పోగోట్టుకోక పోయినా పోతూనే ఉంటుంది 
జీవితం అంటే... 
ఒంటి  చేత్తో నింగి  కెగరడం
 శిధిల స్వప్నాలను మోసుకుంటూ  
తిరగడం  అయితే కాదు కదా !

కొందరంతే ! వెదికినా దొరకనంత గా దోచేసుకుని వెళ్లి పోతారు  
వేరెవరకి  ఇవ్వ లేనంతగా... నిస్సహాయతని నింపి వెళతారు     
దొరికేది ఏదైనా పోయింది ఎన్నటికి తిరిగి రానిదే  కదా ! 

పోగొట్టుకోవడం అనే అలవాటులో 
శూన్యం నింపుకున్న కళ్ళల్లో ఎప్పుడైనా 
అప్రయత్నంగా కారే కన్నీళ్ళు పోయిన దాని కోసం కాదు   
మళ్ళీ  మళ్ళీ మనసెక్కడ గాయ పడుతుందో నని 
   
బరువు గుండె మేఘాన్ని బాధ తెమ్మెర తాకినట్లు 
ఉన్మత్త తాకిడికి మనో ఆవరణ మంతా ధ్వంసమైనట్లు 
ఉలికులికి  పడుతూ ఉంటుంది. 

చిత్త ప్రవృ త్తుల  దాడులకి నలిగిపోయిన
ముగ్ద  మనోహర  ఈ  మొగ్గ   
వెంటాడే  నీలి నీడల ఉచ్చులని  తప్పించుకుని  
నడత నడక  మార్చుకుంటూ   
నేల రాలిన ఆశలని  మిణుగురుల వెలుగు లో ఏరుకుంటూ  
నవ్యోద్దీపనం గావించుకుంటుంది   


కాస్తో కూస్తో మిగిలిన నికార్సైన మనుగడతో  
కాసిని కలలు,  కూసిని కన్నీళ్ళు 
జీవితపు అక్షయ పాత్రలో  మిగిలిన  మెతుకుల్లా...  
అవి తన  కోసమే కాదు ఇతరుల కోసం 
పంచడానికి  ఉన్నాయనుకున్నపుడు 

పోయింది ఏదో తిరిగి దొరికినట్లు  
ఓ తీగ కొస చేతికందినట్లు 
ఓ ఆశ శ్వాసిస్తున్నట్లు   
ఓ ఉమ్మెత్త పుష్పించినట్లు 
ఈ నీలి మొగ్గ వికసించుతూ  

14, మార్చి 2013, గురువారం

Bheegi Palken


 కొన్ని పాటలు వింటూ  ఉంటే  రెక్కలు కట్టుకుని ఏ దూర తీరాలకో సాగిపోతే బావుండును అనిపిస్తుంది 

అలాంటి పాటే ఈ పాట . 

చాలా కాలంగా వెతుకుతున్నాను ... ఇప్పటికి దొరికింది 

స్మితా  పాటిల్, రాజబబ్బర్  కలసి నటించిన ఈ చిత్రం  "భీగీ పల్కీన్"  అంటే తడిచిన కనురెప్పలు  అని అర్ధం 


నాకు చాలా చాలా ఇష్టమైన పాట 


పాటకి అనువాదం :


జన్మ జన్మల తోడూ నీది నాది 

ఒకవేళ ఈ జీవితంలో నిన్ను కలవక పోయినట్లయిటే 

మళ్ళీ జన్మిస్తా ..... 

ఎప్పటి నుంచి అయితే 

ఈ భూమి సూర్యుడు  చంద్రుడు నక్షత్రాలు తిరుగుతున్నాయో 

అప్పటి నుండే నా చూపులు నీ  సైగలను అర్ధం చేసుకుంటున్నాయి 

రూపం మార్చుకుని .. ప్రియతమా 

నేను మళ్ళీ నిన్ను పిలిచాను 

జన్మ జన్మల తోడూ నీది నాది 

ఒకవేళ ఈ జీవితంలో నిన్ను కలవక పోయినట్లయిటే 

మళ్ళీ జన్మిస్తా ..... 

ప్రేమ రెక్కలు తగిలించుకుని దూరంగా ఎక్కడికైనా ఎగిరిపోదాం 

ఏ విషాద గాలులు మన దరికి చేరనంత దూరంగా 

సంతోషాల సువాసనలతో వేల్లివిరియాలి 

మన ఇల్లు ప్రపంచం 

జన్మ జన్మల తోడూ నీది నాది 

ఒకవేళ ఈ జీవితంలో నిన్ను కలవక పోయినట్లయిటే 

మళ్ళీ జన్మిస్తా ..... Hindi Lyrics:
janam janam kaa saath hain tumhaaraa humaaraa
agar naa milate is jeewan mein, lete janam dubaaraa

jab se ghoomei dharatee, sooraj  chaand, sitaare
tab se meree nigaahe, samaze tere ishaare
rup badal kar saajan maine, fir se tumhe pukaaraa

pyaar ke pankh lagaa ke, door kahee ud jaaye
jahaa hawaayen gam kee, hum tak pahuch naa paaye
khushiyon kee khushaboo se, mahake ghar sansaar humaaraa


जनम जनम का साथ हैं तुम्हारा हमारा
अगर ना मिलते इस जीवन में, लेते जनम दुबारा

जब से घूमे धरती, सूरज चाँद, सितारे
तब से मेरी निगाहें, समझे तेरे इशारे
रूप बदल कर साजन मैंने, फिर से तुम्हें पुकारा

प्यार के पंख लगा के, दूर कही उड़ जाए
जहाँ हवाएं गम की, हम तक पहुच ना पाए
खुशियों की खुशबू से, महके घर संसार हमारा

Song: Janam Janam Ka Saath Hai Tumhara Hamara
Singers: Mohd Rafi & Lata Mangeshkar
Film: Bheegi Palken

11, మార్చి 2013, సోమవారం

రాహువు మింగిన జాబిలి

రాహువు  మింగిన జాబిలి  

ఆమె ఆత్రంగా వెదుక్కుంటుంది..
అక్కడ తను పోగొట్టుకున్న దాన్ని ఏదో !
పగిలిన అద్దం ముక్కలలో జీవితం కనిపిస్తుంది..
రూపు,రేపు లేని తనంలో

ఒకప్పుడు అదే అద్దం ముందు
మెరుస్తూ అందంగా ఆమె..

ఋతువులు గతులు తప్పుతున్నా 
ప్రేమ ఋతువు ముందుగా వచ్చేసి
గుండెల్లో నగారా మ్రోగించగా
కమ్మేసిన మైకపు చీకట్లో
ఆకర్షణ వలయంలో
స్నేహం ముసుగులో,
మొహం ముంగిట్లో..
అందంగా.. రంగవల్లులు అద్దుకుంటూ..
అప్పుడు ఆమె ఆశలు లేత పచ్చగా..

ప్రేమకి పరాకాష్ట దేహాలు కలయికే
అని అతడు ఉద్ఘాటించాక..
బలమైన ప్రేమ నిరూపణ చూపాలనికుని
సందేహాలు విడిచి, ఏడడుగుల మాట మరచి
వాంఛితాల పయనంలో..
అష్టనాయికలా మురిపించింది..
రంగులద్దిన అతనే రంగులు మార్చేసుకుని..
చివరికి రంగం నుండి
నిష్క్రమించాక కానీ తెలియరాలేదు
జీవితం రంగు వెలిసిందని.

వమ్ముకాబడిన ఆశలతో 
అర్ధాంతర చావులతో,
అవమానవీయమైన దుస్థితిలో 
మూల్యం చెల్లించుకుంటూ 
సమూహంలో ఒంటరిగా,
ఒంటరిలో సమూహంగా
అర్ధం కాని  అయోమయాన్ని  మోస్తూ
నిన్నమొన్నటి కలల సారాన్ని
సుదూరంలో వెతుక్కుంటుంది.
.
బలం  కూడగట్టుకుని,
బలగాన్ని వెంటబెట్టుకుని
నయవంచకులని బహిర్గతం చేసే
నిత్య సమరశీలురాలవుతుంది.
ప్రేమ అనే నిశను చీల్చుకుంటూ ..
విచ్చే  వెలుగు రేఖ అవుతుంది.

కప్పుకున్న తమ ఆత్మ విశ్వాసపు తొడుగు..
కత్తివేటులనుండి ,యాసిడ్ దాడుల నుండి,
 మృగాల్ల  బారి నుండి  రక్షించ లేకపోయినట్లు.. 
అమాయకత్వపు ముసుగు 
నయవంచకులనుండి, 
అవాంచిత గర్భాలనుండి
బహుభార్యత్వం నుండి రక్షించ లేకపోతుంది .

అన్ని దశలలోనూ పోత్తాలు పొత్తాలుగా
జ్ఞానాన్ని అర్జించడమే కాదు
బ్రతుకే ఒక పరిజ్ఞానం అని తెలుసుకోలేకపోవడం..
బ్రతుకు అపహాస్యం కాబడకుండా
కాపాడుకోవడం  అని తెలియనంతకాలం ..
పోగొట్టుకున్న దానిని  వెదుక్కుంటూనే ఉంటుంది.

ఆమె రాహువు  మింగిన జాబిలి.  

8, మార్చి 2013, శుక్రవారం

" సారంగ " పాఠక "చేరి" లో నా వ్యాసం

"కాలాతీత వ్యక్తులు"   లో  " ఇందిర"

ఆకాశవాణి విజయ వాడ కేంద్రం శతవసంత  సాహితీ మంజీరాలు కార్యక్రమం లో "
కాలాతీత వ్యక్తులు " నవల ని ప్రసారం చేసినప్పుడు "ఇందిర" గురించి
విన్నాను.  చాలా ఆసక్తిగా అనిపించింది  చాలా కాలం తర్వాత    మళ్ళీ కొన్ని
నెలల క్రితం "కాలాతీత వ్యక్తులు " లో  కథా నాయిక ఎవరు అన్న సాహితీ వ్యాసం
 (ఆంధ్రజ్యోతి - వివిధ - శ్రీ వల్లీ రాధిక ) చదివాను.

ఇటీవల నేను "కాలాతీతవ్యక్తులు" నవలని కొని చదవడం మొదలెట్టాను ఏకబిగిన
చదివింప జేసిన ఈ నవల లోని పాత్ర లన్నింటి లోకి నన్ను ఆకర్షించిన  పాత్ర
"ఇందిర "

ఇందిర గురించి ఈ పరిచయం ఈ క్రింది  లింక్ లో...

 ఇందిర " కాలాతీత వ్యక్తే "   " సారంగ "  పాఠక "చేరి"  లో  నా స్పందన

ఉమెన్స్ డే కి అర్ధం


ఈ చిత్రం చూడండి ...


ఇది మహిళలు సాధించిన అభివృద్ధి. చదువులు,ఉద్యోగాలు,ఆర్ధిక స్వావలంబన అన్నీ బాగున్నాయి తన జాతి ని మాత్రం రక్షించుకోలేని అసహాయ స్థితి లో మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నాం.

ఆలోచించి చూస్తే ఏది మనం సాధించిన ప్రగతి !? అదః పాతాళము  లోకి అణగ ద్రోక్కివేసినట్లు కనబడటం లేదా!?

ఈ ఉమెన్స్ డే  కి అర్ధం ఉందంటారా? ఆలోచిద్దాం రండి. పరిష్కారం లభించినరోజు ప్రతి రోజు ఉమెన్స్ డే .. అనీ...  నా అభిప్రాయం .

మహిళా దినోత్సవం జరుపుకుంటున్న అందరికి శుభాకాంక్షలు

(చిత్ర కారుడు వెంటపల్లి సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తో )

6, మార్చి 2013, బుధవారం

శపిస్తున్నాశపిస్తున్నా
పున్నమిపూట నింగి ఎందుకంత నల్లని ముసుగేసుకుందో ..
ఇంతుల కన్నుల కాటుక కరిగి మేఘంగా మారినదని తెలియదెందుకో..
మద మత్సర క్రూర మనసుకు అర్ధం కాదు ఎందుకో ..

వేదన వెల్లువై ముంచెత్తదేమి ?
ఆక్రోశం  మేఘంలా  గర్జించదేమి?
దుఖం సముద్రమై చుట్టేయదేమి ?

ఈ మానవ మానసం ఎంత కఠినమైనది
నాతి ఎన్ని దౌష్ట్యాలకి కునారిల్లుతుంది
రాతి లెక్కన అయినా మారలేదేమి ?
ధూళి లెక్కన దూరంగా తరలిపోలేదేమి ?

ఈ భువిపై మానవజాతిని మిగిలి ఉంచడానికి
ఇంకా ఇంకా భారాన్నిమోస్తూనే ఉన్నదెందుకు ?
యుగాల ధర్మంలో పూజ్యం కాబడిన ఔన్నత్యం ఎంత గొప్పదో
శతాబ్దాల సహచర్యంలో దక్కిన విలువలు ఏ పాటివో
గుర్తు చేసుకుంటూ తీరిక లేకుందేమో !

నగ్నత్వం నింపుకున్న వెలుగు లాగున
స్తిగ్ధత్వం నింపుకున్న పువ్వులాగున
ఉండటం పాపమైనదో,నేరమైనదో,
శాపమైనదో తెలియజాలక

జనని ని ఆశ్రయించిన జానకిలా నిర్వేదంగా
అస్త్ర సన్యాసం చేసిన ఆచార్యుడిలా  విరక్తిగా
తనవారిపైనే అస్త్రం సంధించలేని పార్ధునిలా నిస్సత్తువుగా
తల్లికిచ్చిన మాట జవదాటని తనయుడిలా నీరవంగా నిలిచినట్లు

మానప్రాణాలపై దాడి చేసినప్పుడు ఎదుర్కోలేని అబలలా
పదఘట్టనల క్రింద నలిగిన పువ్వులా
పైశాచికాన్ని భరించిన పడతిలా
కాలనాగుల కాటుకు బలి అవుతూ
అడుగడుగునా రాళ్ళు ముళ్ళు నిండిన బాట లో
నలుగుతూ, నడుస్తూ నిర్వీర్యం అవుతూ..
ఈ నవీన నాగరిక సోపానాల పై ..
ధ్వంసమైన సంస్కృతికి ఆనవాలు గా నిలుస్తున్న
మానవజాతిని గొడ్రాలి గా మిగలమని శపిస్తున్నా!!
అమ్మని ..బొమ్మని చేసి ఆడినందుకు శపిస్తున్నా !!

                        (విహంగ  వెబ్ మేగజైన్ లో వచ్చిన కవిత )                                               

4, మార్చి 2013, సోమవారం

జీవితేచ్చ                                    అమ్మాయి గారు ..అమ్మాయి గారు  రండమ్మా నెత్తి మీద తట్ట బరువుగా వుంది దించడానికి ఓ చెయ్యి వేయాలి అంటూ  పిలుస్తుంది ముసలి అవ్వ.

మంచి పుస్తకం చదువుకుంటూ  వుండగా  యింతలోనే  యీ ముసలమ్మ వచ్చి   చదువుకోనీయకుండా  చేసినందుకు  వచ్చిన చిరాకును అణుచుకుంటూ బయటకి వచ్చింది పద్మ.

అబ్బా మళ్ళీ వచ్చావా, వద్దు అంటే యిప్పుడు వూరుకోవు కదా 

మంచి ఆహారం తల్లీ! రోగం,రొస్టు రాకుండా వుండాలంటే  యివే తినాలి అంటూ నిండు  గంపలో నుండి నాలుగు మొక్క జొన్న పొత్తులు తీసి పద్మ  చేతికి ఇస్తుంది.

 నిజమే అనుకో,   అవి వుడకబెట్టుకోడానికి బద్ధకం యెక్కువ.మొన్న యిచ్చి వెళ్ళిన కండెలే అలాగే వున్నాయి అంటూ .. ముసలి అవ్వ యిచ్చిన మొక్కజొ న్నపొ త్తులు తీసుకుంది. వద్దంటే  వూరుకోదు. మీరు బోణీ చేస్తే మంచిదమ్మా  పది నిమిషాల్లో తట్ట దులుపుకుని వెళ్ళిపోతాను అంటూ కాళ్ళకి బంధం వేస్తుంది. ఆ మాట అన్నాక తీసుకోక చస్తానా  అనుకుని...  సర్లే యివ్వు అని ప్రక్కన లక్ష్మి గారిని  కూడా పిలువు అంది .

 ఆమె ప్రక్క వాటా ముందుకు వెళ్లి. రమేష్ గారు..ఓ రమేష్ గారు రా తల్లీ  లేత కంకులు తెచ్చాను అంటుంది. ఆయన చచ్చిపోయి నాలుగేళ్ళు  అవుతుంటే  రమేష్ గారు అని పిలుస్తావే, నీ పిలుపుకి పైకి వెళ్ళిన ఆయన తిరిగి వస్తాడా.. అంటూ బయటకి వస్తారు లక్ష్మి గారు.

కోపం వద్దమ్మా, ఆయన మఖాను భావుడు ఆ మంచితనం వల్లే  నిన్ను పిలిచి యిచ్చి వెళ్ళా లనిపిస్తూ వుంటుంది.   అని చెపుతుంది. ఎప్పుడో ఆయన చేసిన సహాయాన్ని తలచుకుంటూ.

 ముసలమ్మా, ఆయన వొక్కడే  మంచి మనిషి కాదులే యిక్కడ అందరూ మంచి వాళ్ళే లే అంటూ గంపలో చేయి పెట్టి లేత పొత్తులని జాగ్రత్తగా యేరుకుని  వొక్కో పొత్తుని పైరేకులు లాగి గింజలు నిండుగా  వున్నాయో లేవో చూసుకుంటారు.

 పద్మ  అలాంటి దృశ్యాన్ని వో అయిదేళ్ళకి  పైగా చూస్తుంటుంది  కాబట్టి  ఆశ్చర్యం లేదు. "ఇదిగో యిదులో సగం కూడా గింజలు లేవు వొట్టిబొండులే ! నాకు అంతా నష్టమే! యింకోకటి యివ్వు అంటూ.. గంపలో వున్న కండె లన్నిటిలో సగానికి పైగా తీసి చూసుకుంటూ వుంటారు.

అబ్బ.. ఈవిడో జిడ్డు మనిషి  ఆమెకి యేది నచ్చదు  అనేకన్నా మనసుకి సంతృప్తి వుండదని అనుకుంటార౦రందరూ. ఇళ్ళ దగ్గర తిరిగి అమ్ముకునే చిల్లర వ్యాపారుల పట్ల చులక భావమే కాదు కొనే  వస్తువు  విలువలో ప్రతి పైసాకి న్యాయం చేకూర్చుకోవాలనుకుంటుంది  ఇలాంటి వాళ్ళే మాల్స్ లోకి వెళ్లి అక్కడ రంగుల ప్యాకింగ్ వలలో చిక్కుకుని పర్స్ లు ఖాళీ చేసుకు వచ్చి తర్వాత కూర్చుని లెక్క చూసుకుని గుక్క పట్టి యేడుస్తుంటారు అనుకుంది పద్మ  మనసులో

ప్రతి రోజూ యిట్టా చేస్తే కష్టం తల్లీ.ఏదో రమేష్ గారు మంచాడు అని యిచ్చిపోతా వుంటాను అంటూ..చెపుతూనే నా వైపు తిరిగి పైన వాళ్ళందరిని కేకేయి తల్లీ.. నేను తొందరగా పోవాలి..పిచ్చిది వొకటే ఉంది..అసలే కొత్త బొమ్మ జనాలు యెక్కువ వుండారు అంటుంది

పద్మ  గొంతెత్తి..గట్టిగా రమణా, లక్ష్మీ ,వాణి గారు, అమృత గారు,పాపక్క అంటూ మా పై భాగాల లో  ఉన్న వారిని, ప్రక్క భవనంలో నివాసముంటున్న అందరిని పిలుస్తుంది .

ఇష్టమైన వాళ్ళందరూ పద్మని మొక్కజొన్న పొత్తులు తీసుకుని వుంచమని చెపుతారు. కావాలని చెప్పిన వాళ్ళందరికీ తీసుకుని డబ్బులు యిచ్చేసి పంపుతుంది . తర్వాత  వీలున్నప్పుడు ఒక్కొక్కరే వచ్చి వాళ్ళకి తీసి వుంచిన పొత్తులను పట్టుకు వెళతారు. ఆ ముసలి అవ్వ అన్నటే  ఆ  యింటి వద్దనే తన గంప అంతా ఖాళీ అయిపోతుంది.

ఈ ముసలి అవ్వ..చాలా గట్టిది మనం యిక్కడ తీసుకుంటే..పచ్చి పొత్తులు పది రూపాయలకి  నాలుగు యిస్తుంది.మనం ఆమె దగ్గరికి వెళితే నిప్పుల మీద కాల్చినవి ఒక్కోటి పది రూపాయలు అమ్ముతుంది అంది. . పద్మ .

నిజానికి ప్రతి వ్యాపారస్తుడు చేసే పనే అది. తన దగ్గరికి వచ్చిన కొనుగోలు దారుడి పై అధిక బరువు వేసి లాభం గుంజుకోవాలని చూస్తుంటాడు. కొనుగోలు దారుడు యెక్కడ తక్కువకి లభ్యమవుతుందో తెలిసి కూడా తనకి అవసరమైనప్పుడు తప్పనిసరిగా యెక్కువ పెట్టి కొనుక్కుకుని  తీరతాడు..

పద్మ వాళ్ళ  యింటి ప్రక్కనే రెండు సినిమా హాళ్ళు.ఎప్పుడు కొత్త సినిమాల ప్రదర్శనలో హాళ్ళు కిట కిట లాడతాయి. హాలుకి ముందు భాగంలో మెయిన్ రోడ్ కి అవతలి ప్రక్క బస్సు స్టాప్ ప్రక్కనే  వున్న చెట్టు క్రింద యీ ముసలి అవ్వ నిప్పుల కుంపటి పెట్టుకుని మొక్క జొన్న పొత్తులని కాల్చి అమ్ముకుంటూ ఉంటుంది. ఆమెకి సాయంగా ఆమె  కూతురు . ఆ కూతురు కాస్త అమాయకంగా ఉంటుంది.సినిమాకి వచ్చే జనం తక్కువ అయినప్పుడూ తన బేరం బాగా సాగనప్పుడూ వున్న సరుకు అంతటిని గబా గబా గంప కెత్తుకుని ఆ  కాలనీలో తిరిగి అమ్ముకుని వెళుతూ ఉంటుంది. ఆ ముసలి అవ్వకి దగ్గర దగ్గర డెబ్బయ్యి యేళ్ళు వుంటాయేమో, కాస్త పొట్టిగా, ఓ మాదిరి లావుగా వున్నా చక చకా నడుస్తూ అమ్ముకుంటూ వుంటుంది.  పద్మ కి ఆమెకి మించిన జీవన స్ఫూర్తి  ఎవరిలో కనబడలేదు.

కొన్నాళ్ళ క్రితం ఈ ముసలి అవ్వ చాలా కాలం రావడం మానేసింది.నాలుగైదు నెలలు తర్వాత   యింటి గేటు ముందు నిలబడి..పద్మని  పిలుస్తూ వుంది . పద్మ  బయటకి వచ్చి . చూస్తే కళ్ళకి నల్ల కళ్ళద్దాలు వేసుకుని కనబడింది. ఈ మధ్య అసలు కనబడటం లేదు యె౦దుకని అవ్వా..అని అడిగింది..

ఎక్కడ రాను బిడ్డా !.. కంటికి శుక్లాల ఆపరేషన్  చేయించుకున్నాను. పొయ్యి దగ్గరకి వెళ్ళవద్దు,బరువు నెత్తికి యెత్తవద్దు అన్నారు డాక్టర్ గారు. అందుకే రావడంలేదు.అంది.

మరి బేరం  చేయడం లేదు కదా ..  నువ్వు క్రూచునే చోట యింకొకరు బండి పెట్టేసారు.ఇక అక్కడ నీకు బేరం యే౦ సాగుతుంది యిల్లు యెట్టా గడుస్తుంది? మీ అమ్మాయి వుంది కదా.. ఆమ్మాయిని పెట్టుకుని కూర్చోక పోయావా? అడిగింది పద్మ .

"అయ్యో! ఆ పిల్ల మంచిదయితే నాకు యీ కష్టం యె౦దుకు? చెప్పిన మాట వినదు. హోటల్ కాడ పని చేసేయడానికి కుదిరింది. ఆళ్ళు  ఈళ్లు తిన్న ప్లేటులు,తాగిన గ్లాసులు కడుక్కునే ఖర్మ నీకెందుకే..నాలుగు కండెలు కాల్చుకుంటే రోజు వెళ్లి పోద్ది అంటే వూరుకుంటుందా..దానికి యేది తోస్తే అదే చేసిద్ది. యినదమ్మా..అందుకే నాకు యీ బాధ" అంది.

ఏమన్నా డబ్బులు కావాల్నా..? ఓ..వంద రూపాయలు పట్టుకుని  వెళ్ళు.లే!.తర్వాత బేరం చేసేటప్పుడు అప్పు తీర్చేద్దువు  అని చెప్పి  అంత కన్నా ఎక్కువ ఇచ్చినా తిరిగి యిస్తుందో..యివ్వందో.. అన్న అనుమానం కల్గి యింకా యెక్కువ తీసుకో అని అనలేక పోయింది..

ఓ..వంద రూపాయలు డబ్బులు, కాస్త పచ్చడి,ఓ రెండు అరటి పండ్లు యిచ్చి రేపు మీ అమ్మాయిని రమ్మను. పాత చీరలు అన్ని ప్రక్కన పెట్టి వుంచాను అంది.
 అట్టాగే తల్లీ..యిలా నాలుగు యిళ్ళకి వెళ్లి నా పరిస్తితి చెప్పి నాలుగు డబ్బులు తెచ్చుకుని ఓ..రెండు నెలలు గడుపుకోవాలి..అంది

ఇంకా యీ అమ్మాయి తప్ప నీకు  పిల్లలు యెవరు లేరా ? పద్మ ప్రశ్న .

 "ఇంకా యిద్దరు కూతుళ్ళు వున్నారు. పిల్లలు చిన్నప్పుడే మా ఆయన చచ్చి పోయాడు.తాళి తీసి పడేసి గంప నెత్తికి ఎత్తుకున్నాను. కూరగాయలు అమ్మాను, వుప్పు చింతపండు అమ్మాను. ఆఖరికి ముప్పయి ఏళ్ల  నుండి యిలా మొక్క జొన్న కండెలు అమ్ముకుంటూ వుండాను అంది.

ఏంటి? ముప్పై యేళ్ల  నుండా అంది పద్మ  ఆశ్చర్యంగా . మరి యేమనుకున్నావ్ బిడ్డా, భూమి పుట్టినప్పటి నుండి యిక్కడిక్కడే తిరుగుతున్నాను అంది.

అప్పుడు దాక వింటూ వూరుకున్న పద్మ  అత్త గారు..అవును..నా చిన్నప్పుడు నుండి చూస్తూనే వున్నా, ఇలా తిరిగి అమ్ముకుంటూ వుంటుంది అంది. పద్మ  అత్తా గారికే తెలుసు అంటే ఈ ముసలి అవ్వకి ఎనబై ఏళ్ల పైమాటే అనుకుని  "మొత్తానికి మహా గట్టిదానివే "అంది. ఆ మాటలకి సంతోషంగా నవ్వుకుంటూ .

"ఏం  చేయను తల్లి ..బతికే దారి యెతుక్కున్నాను.  ముగ్గురు ఆడపిల్లలు.  ఈడు వచ్చిన ఆడపిల్లలని యింట్లో  పెట్టుకుని   యే౦ కాపాడుకుంటాం. చదువులు చదివిచ్చే వోపిక లేక చిన్నతనం లోనే పెళ్ళిళ్ళు చేసేసాను.చిన్నతనంలో కాపరాలు చేసుకోవడం చేతకాక  యిద్దరూ బిడ్డలని యేసుకుని నా కాడికే వచ్చి పడ్డారు.ఇద్దరికీ చెరో మగ పిల్లాడు వున్నారు. వాళ్ళని నేనే పెంచుకుంటూ.. మళ్ళీ ఆ కూతుళ్ళకి పెళ్లి చేసాను.మనుమలిద్దరిని యె౦తో కష్టపడి పెంచాను. చదువులు అబ్బలేదు కాని యిద్దరూ టాపీ మేస్త్రీలు అయ్యారు.  వాళ్ళకి పెళ్లిళ్ళు  చేసాను బందరు కాలువ కట్ట మీదే గట్టి యిళ్ళే  కట్టుకున్నారు. వాళ్ళకి బిడ్డలు. ఇప్పుడు పెద్ద మనుమడి కూతురు..నూజివీడులో ఇంజినీరు చదువు చదువు తా వుంది. ఆ అమ్మి కి బస్ పీజు కట్టాలి.అసలు ఆళ్ళ నాయన అంత డబ్బులు కట్టి నేను చదివిన్చలేను అన్నాడు. చదువు మూడో నేత్రం రా.. వెర్రి ముండా  కొడుకా. చదువు సంధ్యలు లేకపోబట్టీ కదా మనమందరం యిట్టా వుండాం . మీ పిల్లకాయాలని అయినా చదివీయకపోతే యెట్టారా అని ఆడిని నాలుగు కూకలేసి నువ్వు చదివీయకపోతే పోనే నేను చదివిచ్చుకుంటాను బిడ్డని అని చెప్పాను. ఆ అమ్మికి పీజులు,పుస్తకాలు,యీడ నుండి ఆడకి తీసుకు వెళ్ళే బస్ పీజులు అన్నీ నేనే కడతాను అని చెప్పింది.

పద్మ ఆశ్చర్యంగా చూసింది

ఇంకా నువ్వెందుకు కష్టపడటం మేము అందరం నీకొక ముద్దా పెట్టలేమా, యింట్లో పడి  వుండు అంటారు మనవళ్ళు.  మరి యీ పిచ్చిదాన్ని యెవరు చూస్తారు.. తల్లీ! ఈ పిల్ల నా భాద్యత కాదా, కాలు చేయి బాగా వున్నన్నాళ్ళు కష్టపడాలి.కాసిని డబ్బులు పోగేసి.. ఏయే అనాధ శరణాలయం కి యిస్తేనో  కదా    నేను చచ్చినాక యీ పిల్ల దాన్ని చూస్తారు అని చెప్పుకొచ్చింది.

  ఏ చదువులు  నేర్పని  గొప్ప  జీవిత ఆర్ధిక సూత్రం, మనిషి తత్త్వం

వింటున్న పద్మకి  తల తిరిగిపోయింది.  కన్న బిడ్డలని పెంచడానికే నానా తంటాలు పడుతూ.. జీవితమంతా వీళ్ళ  కోసమే అరగదీసుకుంటున్నాను  అనుకునే తల్లి దండ్రులని చూసే కాలమిది.ఒక్క బిడ్డని పెంచడానికే నానా అవస్థలు పడుతున్న నీరస,భీరువ తరం యిది. ఒంటి చేత్తో తన పిల్లలని, మనుమలని, ముది మనుమరాళ్ళ గురించి కూడా శ్రమిస్తూ.. వున్న ఆ ముసలి అవ్వ అంటే పద్మకి  గౌరవం ఏర్పడింది.

 పద్మ తన గురించి తానూ ఆలోచించుకోవడం మొదలెట్టింది..

చేసే పని తక్కువ, అలసట ఎక్కువ

జస్ట్ నలబై యేళ్ళ కే  జీవితం అంటే యింత నిర్లిప్తత యె౦దుకు?  రోజు వొకేలా జీవితం.వండటం,పెట్టడం,యేదో తిన్నాను అనిపించేలా  తినడం .అంతే!

తన ఫ్రెండ్ వొకరు అంటూ వుంటారు. మనం చేసే ప్రతి పనిని యిష్టంగా చేయలేకపోయినా కనీసం తినేటప్పుడైనా  యిష్టంగా, ప్రియంగా తినడం  నేర్చుకోవాలి. అప్పుడే తిన్న ఆహారానికి విలువ వస్తుంది. మనిషికి ఆరోగ్యం వస్తుంది అని. ఎప్పుడూ యేదో ఒక అనారోగ్యం అనేకన్నా అనారోగ్యంగా వున్నానని భావించడమే తనలో వున్న నీరసానికి  కారణమేమో.

అమ్మయ్య, యెలాగోలా నా భాద్యత తీరింది. పిల్లలని పెంచాను. వాళ్ళు మంచి విద్యావంతులై వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడగల్గి వున్నారు. ఉన్నవి చేజార్చుకున్నందుకు వుక్రోషం మినహా  మళ్ళీ క్రొత్తగా సంపాదించుకోవాలన్న తాపత్రయం లేదు. "చస్తూ యేమన్నా కట్టుకు పోతామా, ఒకరిని మోసం చేయకుండా, ధర్మంగా సంపాదించుకుని అవి చాలక పొతే వున్నవి అమ్ముకుని యెలాగోలా బిడ్డలని పెంచుకున్నాం. ఈ కాలంలో  యె౦త కష్టపడ్డా  నిత్యావసరాలే తీరడం లేదు. ఇక ఆస్తులు కూడా బెట్టాలి అంటే అవినీతి మార్గంలో వెళ్ళాలి. అది నాకు అసలు చేతకాని పని అననుకుంటూ వుండేది  పద్మ .

అలాగే యేదో వున్నదానితో కాలక్షేపం చేస్తూ కృష్ణ రామా అనుకుంటూ కాలం గడిపేయడమే అనుకుందామా..  అంటే అందుకు మనసు ఒప్పుకోదు.  ఏదో చేయాలని ఆరాటం. కాలు బయటకి కదిపి యేమి చేయలేని అసక్తత. ఏ పని చేయాలన్నా అనుమతి కావాలి. మనసులో వున్న మాటలు చెపితే..  ఒకోసారి మృదువుగా యిప్పుడు అవన్నీ యె౦దుకు? నేను సంపాదిస్తున్నాను.పిల్లలు సంపాదిస్తున్నారు.ఇక యిప్పుడు నువ్వు చేయాలా హాయిగా రెస్ట్ తీసుకోక  అని ఒకోసారి, మళ్ళీ యింకోసారి అడిగితే   ఆ చేసావులే ! పెట్టావులే! అవన్నీ చేసేముందు యింట్లో వంట పనులు, యింటి పనులు చేసి అప్పుడు ఖాళీ వుంటే  బయట వుద్యోగం చేద్దువు గాని అనే చెళ్ళు మనే  మాటలు శూలాల్లా గుచ్చుకునేయి. 

 కేవలం యింటి పని వంట పని మాత్రమే చేస్తూ వుండాల్సిందేనా  అనుకుని నిరాశ చెందింది

తన కోసం తను బ్రతికిన క్షణాలు యేవి తనకి మిగిలేలా వుంచని కుటుంబం  పట్ల జీవితం పట్ల వైరాగ్యం కల్గింది పద్మకి.

ఎక్కడ పని అక్కడే ! వంట ఇంట్లో శుభ్రం చేయని గిన్నెలు, బారెడు  పొద్దెక్కినా శుభ్రం చేయని ఇల్లు, కుర్చీలో లుంగలు చుట్టి విసిరివేయబడ్డ వుతికిన బట్టలు తనలో పెరిగిపోతున్న బద్ధకానికి  గుర్తులు మాత్రమే  కాదు. జీవించడం పట్ల వున్న అనాసక్త కి కారణం కూడానేమో!

ఎంతసేపని పుస్తకాలు చదువుతూ,టీ .వీ చూస్తూ, కాలక్షేపపు కబుర్లు చెప్పుకుంటూ బ్రతుకు బలవంతంగా యీడుస్తూ గడపడం? తనకి శరీరానికి  అనారోగ్యం కాదు.అది మనసుకే. మనసుకి వున్న అనారోగ్యం వదిలితే తప్ప తనలో వుత్సాహం రాదు అనుకుంది.

 విధి వంచించి భర్తని దూరం చేసినా జీవిత కాలమంతా వొంటి చేత్తో కష్టపడుతూ.. ఎనబై యేళ్ళ ముదుసలి కూడా అంత  ఆత్మ విశ్వాసంగా  బ్రతకడం గురించి చెప్పినప్పుడు చదువుకుని తెలివితేటలూ కల్గిన తను ఖాళీగా కూర్చోవడమంత  సిగ్గు చేటు యింకోటి లేదనిపించింది. అందరూ డబ్బు కోసం,అవసరాల కోసం పని చేయాలన్న రూల్ యేమి లేదు.. అభిరుచి మేరకు పనులు చేయాలి. చేసే పని మనసుకు సంతృప్తి కల్గించాలి. అదే మనిషికి,మనసుకు ఆరోగ్యం కూడా అనుకుని వేసుకున్న ముసుగు లో నుండి బయటకి వచ్చి శ్రమించడానికి సిద్దపడింది 

నెమ్మదిగా తనలో నిదురించిన శక్తిని మేలుకొలిపింది.కుట్టు మిషన్ ని దుమ్ము దులిపింది. వరండాలోకి మిషన్ జేర్చింది. కుట్టు పని చేయడం మొదలెట్టింది. నెమ్మదిగా ఆమె చుట్టూ నలుగురు చేరడం    మొదలెట్టారు కుట్టుపనికి వున్న డిమాండ్ దృష్ట్య ఆ యింటిగుమ్మం లోకి  రాక పోకలు యెక్కువైనాయి. తనలా వుబుసు పోక కూర్చున్న ఇంకో యిద్దరినీ చేర్చుకుంది. అక్కడొక టైలరింగ్  మరియు ఎంబ్రాయిడరీ షాప్ వెలిసింది. తనలో ఉన్న సృజనాత్మకత కలగలిపి అక్కడ రంగుల హరివిల్లు ప్రత్యక్షమైంది.

 తన స్వయంసంపాదన మొదలయ్యాక తనలో  జీవకళ  నిండుకుంది. ఒకరిపై ఆధార పడకుండా   బ్రతికే బ్రతుకులో స్వేచ్చ వుంది. స్వాతంత్ర్యం వుంది . అన్నిటికన్నా ముఖ్యంగా జీవితేచ్చ వుంది. ఆ జీవితేచ్చ లేకుండా కాకిలా కలకాలం బ్రతికి యే౦  ప్రయోజనం అని కూడా అనుకుంది   బ్రతికినన్ని నాళ్ళు కాలేకపోయినా కొన్నాళ్ళైనా జీవితాన్ని  జీవించడం ముఖ్యం అనుకుంది.పద్మ.

ఇంటిల్లపాది తమకి తగని పని, పరువు తక్కువ పని చేస్తున్నావని మానేయమని వొత్తిడి పెట్టారు. అయినా వెనుకడుగు వేయలేదు.

ఈ పద్మ కి యేమొచ్చింది? పిల్లలు బాగా సంపాదించడం మొదలెట్టాక  ఈమెకి ఆశ మొదలయినట్టు ఉంది. వెళ్ళిన వాళ్ళతో అయిదు నిమిషాలు కూడా మాట్లాడలేనంత తీరిక లేకుండా సంపాదన యావలో పడింది అనే మాటలు వినబడుతున్నా విననట్లు నటించింది. 

తన కుటుంబం కోసం యిన్నాళ్ళు శ్రమించింది. ఇకమీదట యితరులకు  కొంచెమైనా సాయం చేయడం కోసం కష్టపడాలి అని ఆమె తీసుకున్న దృఢ సంకల్పం ముందు యింట్లో  వారి వ్యతిరేకత, పదుగురి మాటలు గాలిలో కలసిపోయాయి. 

శ్రమించడంలో యెంత  అర్ధం వుంది. శ్రమ సంపదని సృష్టిస్తుంది.ఆ సంపదని తన కోసం,తనవారికోసం   మాత్రమే కాకుండా  యితరుల కోసం కూడా వుపయోగించడం  అనే ఆలోచనలో వుత్సాహం వస్తుంది.

పరోపకార్థం ఇదం శరీరం అంటారు. మనిషిగా తోటి మనుషులకి చిన్న మెత్తు  సాయం అయినా చేయగలగడం సంతృప్తిని యిస్తుంది. ఆత్మ సంతృప్తి అనేది మత్తు మందు లాంటిది దానికోసం కొన్ని కొన్నిటిని పట్టించుకోవాల్సిన పనిలేదని అనుకుంది.

 పద్మ తనలో నూతన ఉత్సాహం మేల్కొలిపి జీవితేచ్చని  కలిగించిన   ముసలి అవ్వకి  యెప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే వుంటుంది. .
                     __________________________0_____________________

3, మార్చి 2013, ఆదివారం

రేగడి విత్తులు


ఈ రోజు నేను ఒక నవల పూర్తిగా చదివి తీరాలని పట్టుబట్టి కూర్చున్నాను

ఆ నవల పేరు "రేగడి విత్తులు" ఆ నవలని ఒక  వారం రోజుల క్రితం తిరిగి తిరిగి  చాలా ఇష్టంగా కొని తెచ్చుకున్నాను.

తానా  నవలల పోటీలో  రూ ॥ 1,20,000 లు బహుమతిగా గెలుచుకున్న మొదటి నవల.

ఈ నవలా రచయిత్రి    పైడి చంద్రలత

ప్రతి పుటలోను తెలుగు తనం ఉట్టిపడుతూ చదివిన దానినే మళ్ళీ ఇంకోసారి వెనక్కి వెళ్లి చదువుకుంటూ  దాదాపు పది గంటలు ఏకబిగిన ఆ నవలని చదివాను .

చాలా చోట్ల అరే ! మా కుటుంబం ఇందులో కనబడుతుందే అనుకుంటూ లీన మైన సందర్భాలు ఎన్నో!

నేను కదిలి కదిలి.. పోయి  దుఖించినప్పటి  తాలుకూ దృశ్యం చూడండి. దృశ్యం అని ఎందుకు అంటున్నానంటే అక్కడ వ్యవసాయం, భూమి తో ఏ చిన్న పాటి అనుబంధం ఉన్న వ్యక్తులైనా  అంతగా మమేకం కావాల్సిన రచనా భాగం  ఇది . అందులో నేను పూర్తిగా మమేకం అయిపోయాను

అదేమిటో ఇక్కడ చదవండి ..

రామనాధం తిన్నగా పొలం దగ్గరకి వెళ్ళాడు పున్నమ్మ అస్తికల మీద వేసిన మామిడి చెట్టు మహా వృక్షమై ఉంది
  ( ఈ దృశ్యమే నవల కవర్ పేజీ) రామనాధం మెల్లిగా వంగి మట్టిని చేతిలోకి తీసుకున్నాడు

ఈ మట్టి - ఈ రేగడి లోనే తన తల్లి ఒరిగింది ఈ రేగడి తల్లిలా లాలించింది ఈ రేగడి ఓ తండ్రిలా  తనకై పాఠాలు నేర్పింది ఓ  స్నేహితుడిలా  ఓదార్చింది దీనికి తనకి ఉన్న సంబంధం ఒక్క సంతకమేనా !? తన కొడుకు సులభంగా "అగ్రిమెంట్ రాసుకుందా మంటున్నాడు  ఏమని రాస్తాను అగ్రిమెంట్ ? తన ప్రాణాన్ని అమ్ముతాననా? తన తల్లిని ధారాదత్తం చేస్తాననా? తన తండ్రిని పరాయి పాలు చేస్తాననా?

రామనాదానికి చెంపలు తడి గట్టాయి

జంతు ప్రపంచానికి ఆవలగా మనిషి వేసిన మూడు అడుగులు .. బాష,వ్యవసాయం,లిపి అంటారు

ఈ నాటికి మనది వ్యవసాయ ప్రధాన దేశం వ్యవసాయమే జీవనాధారం  కానీ ఈనాడు మట్టిమీద మమకారం లేదు,వ్యవసాయం మీద ఆప్యాయత లేదు ఎక్కడ చూసినా వ్యాపార దృష్టి వ్యవసాయాన్ని వ్యాపార దృష్టితో చూస్తే ఎలా? ఓ ఏడు  ధనం కురుస్తుంది ఓ ఏడు కొట్టుకు పోతుంది  ఆటు పోట్లుకు తట్టుకు నిలబడితేనే రైతు

ఈనాడు వ్యవసాయ కుటుంబాల లోవారు డాక్టర్ లు  అవుతున్నారు ఇంజినీర్లు అవుతున్నారు వ్యాపారులు అవుతున్నారు వాళ్ళు ఏ  పని చేసినా వ్యవసాయం చేసినట్లే కష్టపడి పని చేస్తారు ముప్పై ఏళ్ళ నాడు నేను ఇక్కడ అడుగు పెట్టినట్లే ఎవడో ఒకడు రాకపోతాడా? ఈ గడ్డను బీడు కాకుండా కాపాడక పోతాడా? అంటూ ఆశావాదంతో అనుకుంటూ ఉంటాడు

ఆఖరికి  అదే పొలంలో కాపు సారా బట్టీలు పెట్టి ప్రక్కనే పచ్చగా ఉన్న పంటపై దాడి చేసి పంటని నేల  మట్టం చేసి వెళ్ళిన చోటనే .. రామనాధం ఆవేశం తో ప్రతిజ్ఞ బూనతాడు విత్తనాలతో ముడిచిన ఈ పిడికిలి దౌర్జన్యానికి లొంగదు నడిడ్డను ను వెతుక్కుంటూ వచ్చాం గని గడ్డను చేసాం మనల్ని మన గడ్డ మీదే నిలవనీయని విషాద పరిస్థితి వస్తే మరో నడిగడ్డ కు  పోదాం  ఈ భారత దేశంలో నదులకేం కొదువ ? ఈ గడ్డ  మనతో మమేకం చెందక ముందే మనం  మన గడ్డగా భావించాం మమేకం అయ్యాం తాద్యాత్మం చెందాం ఈ గడ్డ నుండి మానని వేరు చేసి చూస్తే పోరాటం తప్పదు మరో నడి  గడ్డను గని గడ్డ చేసేవరకు .. రామనాధం కంఠం ఖంగు మంటుంది

వాళ్ళు  మొక్కలని నాశనం చేసారేమో విత్తనాల్ని కాదు కదా! మళ్ళీ పొలం దున్ను కొత్త విత్తనాలు ఏద పెడదాం రేగడి విత్తులు విధ్వంసానికి లొంగవు రేగడి ఉన్నంత వరకు మబ్బు ఉన్నంత వరకు సూర్యుడు ఉదయిన్చినంతవరకు  విత్తులు మొలకెత్తు తూనే  ఉంటాయి

నా రేగడి విత్తులు చిరంజీవులు !

ఇది నవల ముగింపు

రెండు మూడు ప్రాంతాల బాష  కలసి ముప్పేటగా అచ్చు తెలుగు పదాలతొ.. ఈ నవల సరళంగా సాగి పోతుంది వ్యవసాయం లో వచ్చిన పెను మార్పులు, పంట భూములని వాణిజ్య పరంగా మార్చి వ్యవసాయం ని వాణిజ్యం చేసిన తీరు ముక్కారు పండే పంట పొలాలను చేపల చెరువులు రొయ్యలు చెరువులుగా మార్చడం క్రమేపి  వ్యవసాయం ని కనుమరుగు చేసే పరిస్థితులకి దారితీయడం లాంటి అనేక అంశాలు  ఈ నవలలో ఉన్నాయి

ఇంకా మన తెలుగు వారి  సంస్కృతి - సంప్రదాయాలు పెళ్లి ముచ్చట్లు , పాటలు , కొన్ని మూడాచారాలు అన్నీ ఉన్నాయి

హరిత విప్లవం కాస్తా జన్యు విప్లవంగా మారడం జన్యు విత్తనాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుకోవడం లాంటి విషయాలు ఎన్నో ఈ నవలలో కథ గా ఇమిడి పోయాయి .

రచయిత్రి వ్యవసాయమే వృత్తి  నేపధ్యంగా గల కుటుంబం నుండి వచ్చినందు వల్ల చాలా సునిశితంగా ఆలోచించి ఇతివృత్తంలో అనేక అంశాలని  జొప్పించి హృద్యంగా మలచగల్గారు .

ఒకటి రెండు సార్లు చదివితే కాదు,  ఈ నవల ని అనేక మార్లు చదవ గల్గితే ఇంకా చక్కని అనుభూతితో పరిచయం చేయ గలనేమో అనిపించింది కానీ ..

నా ఈ స్పందన  మీతో పంచుకుని  ఈ నవలని పరిచయం చేయాలని ఈ చిన్న ప్రయత్నం కొండని అద్దం  లో చూపినట్లు.

తప్పకుండా చదివి చెప్పండి  పుస్తక ప్రియుల అందరి దగ్గరా ఉండవలసిన నవల ఇది.

ఈ నవల  ఇచ్చట లభ్యం

విశాలాంధ్ర బుక్ హౌస్ (అన్ని ప్రదేశాలు)
ప్రభవ ప్రచురణలు (నెల్లూరు )
నవోదయ పబ్లిషర్స్ (విజయవాడ)

1, మార్చి 2013, శుక్రవారం

పెట్టెట్టుకుని...

ఈ రోజు మా చుట్టుప్రక్కల ఉన్న మహిళలందరూ  కూడుకుని  ఒక చిన్న చిట్  మొదలెట్టాం  

ఇప్పుడు అందరూ నాజూగ్గా  కిట్టీ పార్టీ  అని అంటున్నారు కాబట్టి నేను అలాగే అంటున్నాను లెండి :)

మా సంఘం లో   ఉన్న ఇద్దరు  మహిళలు మాట్లాడుకుంటున్నారు . వాళ్ళ యాస నాకు భలే గమ్మత్తుగా తోస్తుంది . కొత్త కొత్త పదాలు దొరుకుతాయి అనుకుని ఓ ..చెవి అటేసి ఉంచాను

ఒకామె అంటుంది "  మా ఆడపడుచు అస్తమాను భర్త తో దెబ్బలాడి  పెట్టె ట్టుకుని వచ్చేస్తుంది " అని

అది విన్న నాకు  ఈ పెట్టె ట్టుకుని రావడం ఇంకా ఉందంటారా అన్న సందేహం వచ్చింది . చూసిన సినిమాలలో పెట్టేట్టుకుని ఉన్నపళంగా బయట పడే దృశ్యాలు , మరియు నవలలో,కథ ల లో చదివిన సన్నివేశాలు చప్పున గుర్తుకు వచ్చేసాయి. నేను కూడా ఒక కథలో వ్రాసినట్లు గుర్తే!

ఆకాశం లో సగమో, నేల మీద సగమో,  సమాజం లో భాగమో ఏదైతేనేం కాని స్త్రీ పెట్టేట్టుకుని బయట పడే సన్నివేశం మాత్రం పురాతనమైనది అని నా గట్టి నమ్మకం .

అలా బయట పడటం అనేది ఒక ఆయుధం కూడా ! కొన్నాళ్ళకి బతిమాలించుకుని బెట్టుగా ఇష్టం లేకుండా వెళ్ళినట్లు వెళ్లి అక్కడ వీర తాండవం చేయవచ్చు అని  ఒక ఫ్రెండ్ రహస్యంగా చెప్పింది కూడా .

ఆలుమగల మధ్య విభేదాలు వచ్చినప్పుడు , కుటుంబ కలహాలు వచ్చినప్పుడు, లేకపోతే  బలవంతంగా ఉద్దేశ్య పూర్వకంగా బయటకి నెట్టి వేయ బడినప్పుడు  ఇలా పెట్టె ట్టుకుని పుట్టింటినో , రక్త సంబందీకుల ఇంటినో  ఆశ్రయించక తప్పని పరిస్థితి .  ఆశ్రయం ఇవ్వడం లో కొంత మందికి అభ్యతరం లేకపోయినా తర్వాత వచ్చే సమస్యలకి భయపడి వెన్ను చూపించే వారు కొందఱు .

కొన్ని చోట్ల చూసినట్లు,విన్నట్లు దయతో సానుభూతితో ఆశ్రయం ఇచ్చినట్లు,  తర్వాత వారు సహాయం చేస్తే బాగా చదువుకుని మంచి స్థితి లో బ్రతికి  లోకాన్ని గెలిచినట్లు  ఊహించుకుంటే మాత్రం చాలా తప్పు అంటాను నేను

అలాంటి సహాయం అందరికి  అన్ని చోట్లా లభించక పోవచ్చు . కొందరి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అవుతుంది  కూడా

అందుకు ఉదాహరణ గా  ఒక యదార్ధ విషయం చెపుతాను . నాకు తెలిసిన ఒక అమ్మాయి పదవ తరగతి పూర్తి అవుతూనే మేనమామ కిచ్చి వివాహం చేసారు ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు . భర్తతో ఎప్పుడు గొడవపడి పుట్టింటికి వచ్చేసేది  ఆమె తల్లిదండ్రులు కొన్నాళ్ళు  తమ ఇంట్లో ఉండనిచ్చి తర్వాత ఆమెని ఒప్పించి ,అవసరం అయితే బెదిరించి భర్త దగ్గర వదిలేసి వచ్చేవారు . కన్న తల్లి కూడా ఆ అమ్మాయి చెప్పే సమస్యలు వినేది కాదు అలాటివన్నీ చెప్పకూడదు మామయ్యా కి చాలా ఆస్తి ఉంది నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మగవాళ్ళు చేసేవన్నీ పట్టించుకోకూడదు చూసి చూడనట్లు పోవాలి అని హిత బోధ చేసేవారు.  ఆ అమ్మాయికి ఆఖరికి విసుగువచ్చి పోలీస్ కమీషనరేట్ కి వెళ్లి  గృహ హింస  చట్టం క్రింద తల్లిదండ్రి భర్త అమ్మమ్మ అందరి పైనా కంప్లైంట్ ఇచ్చింది అయిన వాళ్ళందరూ  ఆరోపితులు కాబట్టి  ఆ అమ్మాయికి షెల్టర్ లేకుండా పోయింది ఆమె ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్ట లో ఉండి  మూడు నెలలు పోరాడి తనకి తండ్రి నుండి వారసత్వంగా లభించిన ఆస్తి ని ,భర్త నుండి భరణం ని పొంది తన పిల్లలు ఇద్దరినీ తన దగ్గరకి తెచ్చుకోగల్గింది. అప్పుడు అందరూ ఆమెని ప్రశంసించారు  బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుని పార్లర్ స్టార్ట్ చేసింది   తర్వాత  తనకి సహాయం చేసిన ఒక లాయర్ వల్ల మోసపోయింది తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా  అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఆమెని మాయ పెట్టి ఇంకొకరు సర్వ నాశనం చేసారు  ఆమె అలా అదః పాతాళం లోకి  కూరుకు పోయింది

కష్టం వచ్చినప్పుడు ,ఆవేశంలో ఉన్నప్పుడూ పెట్టేట్టుకుని బయటకి వచ్చిన స్త్రీకి తగిన సహకారం,సహాయం కూడా లభించడం కష్టం .

చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఆర్ధికంగా ఎంతో  కొంత సంపాదించుకునే వారికి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు

అదే  గ్రామీణ మహిళలు విషయానికి వస్తే అక్కడ ఇంకా కొన్ని సంశయాలు ఉండనే ఉంటాయి .కారణాలు ఏవైనా
భర్త ని వదిలేసి వచ్చిందంటే తలవంపులుగా భావిస్తారు కొన్నాళ్ళ తర్వాత నిదానంగా సర్ది చెప్పి, భర్త తో జీవితం గడపడానికి పంపే ఏర్పాటు చేస్తారు .  విరిగిన మనసులు అతకడం బహు కష్టం కాబట్టి మళ్ళీ పుట్టింటికి వెళితే ఆదరించరు  అనే కారణం చేతను అయిన వాళ్ళ సూటీ పోటీ మాటలని తట్టుకోలేక తామున్న పరిస్థితుల్లో సర్దుకుని, రాజీ పడటం ఇష్టం లేక ఆత్మహత్యలకి పాల్బడుతున్న వారు ఎందఱో!

అసలు నన్ను అడిగతే  చాలా సమస్యలు పెళ్లి మూలం గానే వస్తాయి అప్పటి దాకా మంచి అబ్బాయిగా ఉన్నవాడు భర్త కాగానే మారిపోతాడు పెళ్లి అంటేనే నరక కూపం పెళ్లి పరమ రోత అనే స్త్రీలని చూస్తున్నాం

ఇకపోతే ఇంకో రకం బాపతు . చదువుకుంటూ ప్రేమ - పారిపోయి పెళ్లి లాంటి ఆకర్షణ లో పడి పెద్దలకి తెలియకుండా  ఇంటి నుండి బయట పడిన అమ్మాయిల పరిస్థితి కూడా అగమ్యగోచరమే ! ప్రేమించి గడప దాటించిన వాడు మంచి వాదు అయితే గంజి నీళ్ళు అయినా తాగి బ్రతక గల్గుతారు అలా కాని పక్షంలో అమ్మాయిల పరిస్థితి ఘోరాతి ఘోరం

షార్ట్ టైం షెల్టర్స్ కి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చే సుశీల గారు చెప్పిన మాటలు వింటే అప్రయత్నంగా రోమాలు నిక్కబొడుచు కున్నాయి  స్కూల్ స్థాయిలోనే ఇల్లు దాటిన ఆడపిల్లలు కొన్నేళ్ళ తర్వాత సొంత రాష్ట్రానికి తీసుకు రాబడి అటు స్వంత ఇళ్ళకు వెళ్ళ లేక  లేదా ఇంటి వాళ్ళు రానీయక  బ్రతకాలనే ఆసక్తి లేక, పని చేయడానికి ఆసక్తి చూపించక, పాత జీవితం జీవించడానికే ఇష్టపడి అర్ధ రాత్రుళ్ళు గోడలు దూకి పారిపోవడానికి ప్రయత్నించడం  లాంటి విషయం చెపుతుంటే భయం వేసింది

నేను చాలా కాలం క్రిందట ఒక నవల చదివాను  ఆ అమ్మాయి మంచి కుటుంబంలో పుట్టి పెరిగి ప్రేమ వలలో చిక్కుకుని అతనితో కలసి వెళ్ళిపోయి అనేక ఇక్కట్లు పడి  ఆఖరికి ట్రైన్ లో నుండి దూకి చచ్చిపోతుంది  ఈ కాలం అమ్మాయిల తెగింపు చేష్టలు చూసి ఇలా అనుకుంటాను "ఆ నవల పేరు గుర్తుకు తెచ్చుకుని అలాంటి నవలలు కొని ఉచితంగా అమ్మాయిలకి పంచి పెట్టాలని"

మొన్నీమధ్య ఒక కార్పోరేట్ స్కూల్ విద్యార్దిని   ఆమె చదువుకుంటున్న క్యాంపస్ లోని  డైనింగ్ హాల్ లో పనిచేసే  మెస్ బాయ్ ని ప్రేమించి ఇద్దరు  వెళ్ళి పోబోయి బయట పడ్డారు. ఆ అమ్మాయిని ఇంటికి పంపేసారు  ఆ పిల్ల చెప్పిన సమాధానం ఏమిటన్నది వింటే తప్పు ఎవరిదీ అనాలో వీలు కాదు మా ఇంట్లో మా అమ్మ నాన్న ఎన్ని డబ్బులైనా ఇస్తారు  మా కోసం ఖర్చు చేస్తారు కానీ కుక్క పిల్ల ల పై చూపించే ప్రేమ కూడా మాపై  చూపించరు అని.

ఈ తల్లి దండ్రులు కఠినులు  అనుకోవాలా? పిల్లల మానసిక స్థితి బాగోలేదనుకోవాలా?

ఏదైనా ఈ "పెట్టె ట్టుకుని " బయట పడే పద్దతి ని హర్షించాలో , నిరసించాలొ  నాకే అర్ధం కాదు

పెట్టె ట్టుకుని బయట పడటం అంటే సవాళ్ళ రోట్లో తల పెట్టడమే! ధీర వనితలగా నిలబడటం,  నిలబెట్టు కోవడం మాత్రం చాలా కష్టం  అని మాత్రం చెప్పదలచాను.

ఏటికి ఎదురీదిన వాళ్ళు ఉంటే  వాళ్ళ విజయవంతమైన ప్రయాణం కి అభివందనం  వారికి ఏ  చిన్న పాటి స్వార్ధం లేకుండా సాయం అందించిన వారికి అభివందనం


(ఏమిటో మార్చి 8 వస్తుంటే నాకు స్త్రీలు సాధించిన విజయాలతో పాటు ఇంకా తడబడే అడుగులుని , వైఫల్యాలని గుర్తు తెచ్చుకుంటే బావుంటుంది  నిశిత దృష్టి తో పరిశీలించుకుంటే ఇంకా బావుంటుంది అనుకుంటాను)