28, ఫిబ్రవరి 2019, గురువారం

దుఃఖపు రంగు




దుఃఖపు రంగు -వనజ తాతినేని 


ఇంటి వెనుక నుండి మొదలయ్యే అడవి. పేరుకు అడవే  కానీ.. ఒక పచ్చని చెట్టు కూడా కనబడని  ఆరుబయలు. చిన్న చిన్న చిట్టీతి పొదలు బొమ్మేడు,చిట్టికీసర చెట్లు. గట్టి ఎర్రటి నేల. చిన్న గాలికే నేల దుమ్మురేగి చెట్ల ఆకులు కూడా జేగురురంగు వేసుకున్నట్టు వుంటాయి.


ఆ కొండంచు పల్లెలో గుట్టల మధ్య నిలువుగా పెరిగిన చిట్టి కీసర కొమ్మలని వంకీ కట్టిన కర్రతో లాగి తన దగ్గర ఉన్న తాడుతో ముడేసి నేలబారుకి వొంగేలా  లాగి మళ్ళీ అదే చెట్టు మొదలకి ముడేసింది. ఆకులని తింటున్న మేకల మందని చూస్తూ పక్కనే వున్న పెద్ద రాతిపై కూర్చుని  యెక్కడో ఆలోచిస్తూ కూర్చుంది సోనా.  పిల్లిలా శబ్దం కాకుండా యెటునుండి వచ్చాడో  భూక్యా  మోకాళ్ళ మీద నేలపై కూలబడి సోనా కాళ్ళు పట్టుకుని “నన్ను మాఫ్ చేసినానని చెప్పు సోనా, మళ్ళీ లగ్గం చేసుకుని నీకు చాలా అన్యాయం చేసినా, వోలి  కింద యిచ్చిన పశువులని కూడా తిప్పి తోలుకొచ్చుకున్నా వొక్క మాట అనలేదు మీ అమ్మ బాపు. ఇంట్లో పని, మడిలో పని అన్నీ నీ చేత చేయిస్తున్నా  అని కుమిలిపోతుండా. అది రాచ్చసి ముండ. నీ యెంక చూసినా వూరుకుంటల్లే. దాని నోటికి జడిసి కుక్కిన పేనల్లే పడి వుండాను గానీ  యింటికి అసలైన లచ్చిమిదేవి  నువ్వే, నువ్వు నా వైపు చూసి చిన్న నవ్వైనా నవ్వనిదే నేనెట్టా బతకనే సోనా”  అంటూ ఆమె వొడిలో తలపెట్టాడు. కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా  చూస్తూ   భర్త  తలపై ప్రేమగా చేయి వేయబోయి క్షణంలో మనసు మార్చుకుంది. 


మోసాకారికి  మాటలకేమి కొదవ. మాట మాటకి రంగులద్దడమే కదా అని అనుకుంటుండగానే  మరిన్ని మాటలు చెపుతూ ఆమె వొళ్ళోనుండి  లేచి నడుము చుట్టూ చేతులు బిగించి “లేత కొబ్బరి లాంటి నిన్నువొదిలి ముదురు ముంజెలాంటి దానితో సర్దుకోవాల్సి వస్తుంది. నువ్వు ఊ  అనవే.. సోనా!  దాన్ని బయటకి తోలేస్తా” అన్నాడు కళ్ళనిండా మోహంతో. సోనాకి  గొంగళి పురుగు ప్రాకినట్టై౦ది. రెండు చేతులతో అతన్ని విసురుగా  వెనక్కి నెట్టేసి లేచి బిరబిరా పోయి కొమ్మలందక మే మే అని అరుస్తున్న మేకపిల్ల ముందుకి  కొమ్మని లాగి చివురలంది౦స్తుంటే...."యెన్నాళ్ళు వొంటిగా పడి వుంటావ్, మొగుడ్ని కదా,  ముద్దు  మురిపం తీర్చుదామనుకున్నా నన్నే  కాదంటావా,  ఛీ కొడతావా, బాడ్కోవ్ దానా,  యింటికి రావే నా కొడుకుని అంటుకోవే నీ పని చెపుతా " అంటూ కొట్టడానికి మీదకి వచ్చాడు భూక్యా. అంతలో  యింటెనుక నుండి ఓయ్ ..అంటూ  చేతులూపుతూ కేకలు పెడతన్న రుక్కుని చూసి తోక జాడించి  మెల్లగా జారుకున్నాడు. భూక్యా  వెళ్ళిన వైపే చూస్తూ సన్నగా నవ్వుకుంది సోనా.


ఆ రాత్రి  చిన్నింటిలో  పడుకున్న సోనా దగ్గరికి మళ్ళీ వచ్చాడు భూక్యా . ఆమె పై అధికారంగా చెయ్యేసాడు.  తోసేసి మంచం దిగి లేచి నిలబడింది. నిద్రపోతున్న పిల్లాడిని యెత్తుకుని “నన్ను అంటుకోనీయకపోతే ఈడిని  నువ్వు అంటుకోడానికి ఈల్లేదు. నాకే కదా కన్నావ్ యెవరికో కనలేదు కందా” అన్నాడు ఓ ముతక మాటని వదులుతూ. చెరుకాకు సర్రున కనురెప్ప పై కోసినట్టై౦ది సోనాకి. వెనకనుంచి భూక్యా  చొక్కా పట్టుకుని గుంజి  గుమ్మానికి అడ్డంగా నిలబడి నా బిడ్డనీయ్ అని లాక్కోబోయింది. చూరు కింద గోడమేకుకి  తగిలిచ్చిన పలుపుతాడు తీసుకుని సోనా ని గొడ్డుని బాదినట్టు బాది “నీ బిడ్డ అంట, బిడ్డను నువ్వేమన్నా పుట్టింటి కాడనుంచి తీసుకొచ్చినావా, సూది దారమే గంద తెచ్చింది అది తీసుకుని పోవే” అని  వీధిలోకి నెట్టి తడిక బిగగట్టుకుని డాబా యింట్లోకి  పోయాడు.  పక్కలవాళ్ళు చోద్యం జూసినంత సేపు జూసి ఆ యింట్లో గోల మనకెందుకులే అనుకుని మెల్లగా  టీవిల ముందుకి సర్దుకున్నారు.  రెండు గంటలు  గడిచి పోయాయి. సినిమాకి పోయిన రుక్కు తిరిగొస్తూ వీధిలో పడున్న సోనాని దాటుకుని యేమి యెరగనట్టు ముందుకుపోయింది. పలుపుతాడు దెబ్బలకి వొళ్ళంతా పొంగింది సోనాకి.  జ్వరం ముంచుకొచ్చింది   నోరు పిడచగట్టుకు పోతుంది. ఎవరైనా నీళ్ళు యియ్యకపోతారా అన్నట్టు చూస్తూ వుంది.  ఊరంతా సద్దుమణిగింది కానీ గొంతులో చుక్క నీళ్ళు పడలేదు. ఆకాశంలో చంద్రుడికి మల్లే నడీధిలో సోనా. లోపల్నుంచి కృష్ణుడి యేడుపు ఆగకుండా వినొస్తుంది.దాంతో జతచేరి భూక్యా  కీచురు గొంతు.  “ఆపరా ముండ నా కొడకా, యెప్పుడు చూసినా గీ గీ అని యేడుస్తూనే వుంటాడు” అని విసుక్కుని “ఈడిని తీసుకుపోయి దాని వొళ్లో వేసిరా పో” అన్నాడు. ఆ మాట యెప్పుడంటాడా అని కాస్కుకూర్చున్న రుక్మి కృష్ణుడిని యెత్తుకుని  సోనా దగ్గరికి వొచ్చి “చెల్లీ, ఇదిగో బిడ్డ యేడుస్తున్నాడు పాలిచ్చి పడుకోబెట్టు.అయినా నువ్వు  భర్తకి యెదురు చెప్పడమెందుకు, యిన్ని దెబ్బలు తినుడు యెందుకు, గుట్టుగా సర్దుకుని వుండొచ్చు గంద. నాకేమన్నా పిల్లా జెల్లా పుట్టునా. ఇల్లు  పొలానికంతటికీ నీ బిడ్డే వారసుడు గందా, లోపలికి వచ్చి  కాస్త యెంగిలిపడి సర్దుకుని పడుకో, ఆవు ఎదై వొకటే అరుస్తా వుంది పొద్దున్నేఆంబోతు కాడికో   హాస్పిటల్కో తోలుకుపోవాలి, నీళ్ళు మోయాలి యెట్టా చేస్తావో యేమో” అని గది లోపలికి పోయి ఠక్కున  తలుపేసుకుంది. భుజాన బిడ్డనేసుకుని లేచొచ్చి  మళ్ళీ పాకలో కుక్కి మంచంలో కూలబడింది సోనా.ఏడుపు కూడా రానంత నిర్వేదంలో కళ్ళు మూసుకుంది.

 

మర్నాడు  పొద్దున్నే ఆవుని ఆంబోతు వున్నకాడికి తోలుకుపోయి దాటించుకుని వచ్చింది.  బిడ్డని వీపుకు గట్టుకుని పెద్ద  ప్లాస్టిక్ సీసాల  నిండా నీళ్ళునింపుకుని వాటికి తాడు గట్టుకుని భుజాన వేసుకుని పాడి ఆవుని  యెద్దులని తోలుకుని చేను వైపుకి పోయింది. కానుగ కొమ్మకి ఉయ్యాల కట్టి బిడ్డని అందులో వేసింది. పాడి ఆవుని చెట్టుకి కట్టేసి గడ్డి  వేసింది. నాగలి కట్టి మడి దున్నుతూ దూరంగా వస్తున్న మనిషి చూసి సంబరపడింది సోనా. దుక్కి ఆపి గబగబ యెదురెళ్ళింది. అన్నా అని వాటేసుకుని యేడ్చింది.  “ఇంత దూరం యెట్లా నడిస్తివి. మధ్యాహ్నానికి నేనే యింటికి వస్తును గందా”  అంది.  


“అబ్బ ఈ కొండ కింది తండా యింత దూరం  వుంటదనుకోలేదు చెల్లీ. చెల్లెలు కొడుకని పొలాలు వున్నాయని యింత దూరం నిన్నిస్తాడనుకోలేదు బాపు.  ఈ అడివిలో పడి మూఢాచారాలలో మగ్గుతా వుంటివి. మీ పక్కింటి వాళ్ళు  రోజూ అమ్మకి ఫోన్ చేసి నీ కష్టాలు చెపుతావుండే.నువ్వేమో పెదవిప్పి చెప్పకపోతే యెట్టా. నీ వరస నచ్చలేదు చెల్లీ, నువ్వు ఊ అంటే ఆడ్ని మూడు చెరువులు నీళ్ళు తాగిచ్చి నీ బిడ్డనీ నిన్ను యీడ నుండి తప్పించి తీసుకుని పోతాను” అన్నాడు మురళి. 


“అన్నా, వేలు మనదే కన్ను  మనదే కదన్నా. రెండో పెళ్ళి చేసుకునే రోజు పెద్దమనుషుల ముందు వొప్పుకున్నా కదన్నా. పెద్దమ్మవారు నెత్తిమీద కూకుని అట్టా  వొప్పుకునేలా చేసింది. వొప్పుకునేదాకా యెన్ని దినాలు నస పెట్టినాడని. నిలుచున్నా కూకున్న పండున్నా ఆఖరికి గుడికి పోయినా పక్కపక్కనే చేరి రాగి  సంకడి లో చికెన్ ముక్కని తిన్నట్టు మెదడుని  నంజుకు తిన్నాడు.  ఉప్పలమ్మ కోపం వచ్చి ఇల్లు మొత్తాన్ని జీవాలని  వూడ్సి పెట్టేసింది. ఒక్కసారే అమ్మ నాయనని కాటికి చేర్చాను, వొంటి గాడిని అయిపోయాను అని ఏడుపు. ఆ దోషం పోవాలంటే మాశిమ్మని పెండ్లాడాలని లేకపోతే పుట్టబోయే బిడ్డకి కూడా కీడు జరుగుద్ది  అని గణాచారి చెప్పాడంట. అట్టా చెప్పి చెప్పి నాచేత వొప్పించాడు” అని తన బతుకు బుగ్గైన తీరుని అన్నతో దిగులుగా చెప్పింది. 


“రుక్కు ఆ గణాచారి చెల్లెలేనంట కదమ్మా, బావ కన్నా వయసులో  చాలా పెద్దదంటా కదా ! “


“ఏమో అన్నా అవన్నీ నాకంత తెల్వ” అంది తలదించుకుని. కాడి వొదిలేసి బిడ్డని చంక నెత్తుకుని పశువులని తోలుకుని యింటికి వచ్చారు అన్నా చెల్లెలు. 


బావమరిదిని చూసి మంచం పై నుండి  లెగవకుండానే "అబ్బో ..లగ్గమయిన మూడేళ్లకి గాని బావని చూడను  కుదిరిందే నీకు" ఎగతాళిగా అన్నాడు భూక్యా  .  "చేసే వుజ్జోగం అట్టాంటిది బావా, చెల్లి పెళ్ళికే నేను  రాలేకపోతిని గందా, అయినా నువ్వేమన్నా కొత్తోడివా యేంటీ"  అన్నాడు.  


"మా పెండ్లికి నువ్వు లేవు గందా, నీకేమి తెలస్తాది యిక్కడ యేంజరిగిందో!  మీ చెల్లిని  మీ మేనమామ కొడుక్కి చేయాలనే గందా లగ్గం పెట్టితిరి. ఆడేమో లగ్గం రోజుకి మొహం తప్పించే, యెక్కడో  చెట్టుకి ఉరేసుకుని చచ్చిపోయే  నీ చెల్లిని చేసుకోవడం యెందుకిష్టం లేకపోయిందో  యెవరికీ యెరుక. సమయానికి నేను అక్కడుండబట్టే మా అమ్మ పోరింది   దీన్ని లగ్గం చేసుకోమని. నీ చెల్లెలిది  యినపపాదం. ఎక్కడ పాదం పెడితే అక్కడ నాసినం అయిపోద్ది.  నీ చెల్లెల్ని లగ్గమాడేకే మాకు కష్టాలు వచ్చి పడ్డాయి. గత్తరొచ్చి మందంతా చచ్చినట్టే మా అమ్మ నాన్న చచ్చిపోయిరి" అన్నాడు ఆవేశంగా. 


ఆరోపణలు నిందలు అన్నీ మౌనంగా విని “తాగేనీళ్ళు  బాగోక  డయేరియా వచ్చి చచ్చి పొతే  మధ్యలో నా చెల్లెలు యే౦ చేసింది బావా!, అయినా ఆ దినాల్లో మీ వూర్లో చాలా మంది చచ్చిపోయారు కందా, తండాల్లో వాళ్ళకు చెప్పినట్టు నాకు కథలు చెప్పకు.  ఈ కథలు చెప్పే నా చెల్లికి చాలా అన్యాయం చేసావు నువ్వు. ఆ వుసురు గొట్టుద్ది నీకు”. కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు మురళి.   

 

“చెల్లిని చూడటానికి వొచ్చావా, పంచాయితీ  పెట్టను వొచ్చావా, అంత కష్టమనిపిస్తే  నీ చెల్లిని తీసుకుని పో ..నా కొడుకుని మీకియ్య. ఏమేవ్, రుక్కు, ఆ సూది దారం,మెత్త తెచ్చి యిటు పడెయ్యి, ఈ సాతాను దాన్ని అన్న తోడ్కొని పోతాడంటా” అని కేకేసాసాడు. రుక్కు సోనాకి పెండ్లి  నాడిచ్చిన సూదులు దారాల పూసల డిబ్బీ, మెత్త తీసుకొచ్చి అరుగుమీద పెట్టి కృష్ణుడిని యెత్తుకుని లోపలికి పోయింది.


“వద్దన్నా, నా రాత యిట్టా అని సర్దుకుంట. బిడ్డని వొదిలి నేనుండలేను. నేను పోతే  నీళ్ళు మోసేదానికన్నా పనికొచ్చిది అని రుక్కుని వొప్పించి యింకోదాన్ని  లగ్గం  చేసుకుంటాడు. ఆడిబుద్ది అంతే.. మడిసైతే మనసుంటాది. అది లేనోడికి యెంత చెప్పినా వొకటే. వాదనాడక వూరుకో అన్నా” అని అన్న ను బతిమాలాడింది సోనా.

 

“ఆడికి రుక్కు మీద  కూడా మోజు తీరిపోయిందమ్మా . పోనీ వాడితో అప్పుడప్పుడైనా  సర్దుకోమ్మా,నీ  కష్టాలు తగ్గుతాయి” అన్నాడు  చెల్లి కళ్ళలోకి నేరుగా చూడకుండా.


“నిలువునా పేణమన్నా తీసుకుంటా కాని వాడికి వొగ్గి యింకా  బిడ్డలని కనీయలేనన్నా. ఆ తండ్లాట కూడా  నాకొద్దన్నా “ అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ.


“గుదికొయ్యకి దూడని   కట్టేసి  పాలు పిండుకోడానికి ఆవుని తిప్పుకున్నట్టు నా చెల్లి జీవితాన్నే నీ చుట్టూ  తిప్పుతున్నావ్ కదరా బద్మాష్” అని భూక్యాని  తిట్టుకున్నాడు. “నీ కోసమే ఈ ఫోన్ కొని తెచ్చా.రోజూ అమ్మ బాపుతో మాట్లాడు, నీకేం కష్టం అనిపించినా ఫోన్ చేయి.తెల్లారేసరికి నీ కాడ వుంటా, నేను పోయొస్తా చెల్లీ” అన్నాడు కళ్ళ నీళ్ళు దాచుకుంటూ. “మళ్ళీ  తొందరగానే వొస్తానులే “అని వెనక్కి వెనక్కి తిరిగి చెల్లిని చూసుకుంటూ దారిబట్టి పోయాడు మురళి.   


అన్నట్టుగా పదిరోజులకల్లా రానే వచ్చాడు మురళి. తనతోపాటు  బోర్ వేసే వాళ్ళని కూడా తీసుకు వచ్చాడు.రెండు చోట్ల బోరు దించినా వందల అడుగుల లోతుకి పోయినా జల జాడ చిక్కక పోయేసరికి వుసూరుమన్నాడు. “ ఈడ భూదేవి  తల్లి కండ్లలో కూడా నీరింకి  పోయిందనుకుంటా అన్నా” అంది సోనా నవ్వుతూ. 


“నవ్వు ఎట్టా  వస్తందమ్మా నీకు” అన్నాడు విచారంగా మురళి.


"చదువుకున్న తెలివితేటలు చూపిత్తారు, ఆ మాత్రం బోర్లు వేయించడం మాకు తెలియక" అన్నాడు వెటకారంగా భూక్యా .  "పెద్ద కాలువకి నీళ్ళు వొదిలినంత కాలమూ తండాలో బాయిల్లో  నీళ్ళు వుంటాయి. ఎండల కాలంలోనే యిబ్బంది. గొడ్డు గోదా మందకి తాగేదానికి నీళ్ళు కావాలి,  ఆడది బిందె పుచ్చుకుని నీళ్ళు మోయాలి మగోడు పుల్లరి కాపు కాయాలి, కట్టెల మోపు మొయ్యాలి.మరి ఇంటో పని చేయడానికి మడిసి వుండాలి కదా అందుకే రుక్మి ని పెళ్ళి చేసుకున్నా అని అర్ధం చేసుకోవాలె ..మడి వుంటే మాత్రం మాన్యాలు పండటానికి నీళ్ళు వుండొద్దు" అన్నాడు భూక్యా   తాను యేమీ తప్పు చేయనట్టు తననితాను సమర్ధించుకుంటూనూ. 

 

చెల్లి తలపై చెయ్యేసి "ఆ దేవుడే నిన్ను నీ బిడ్డని చల్లగా చూడాలి" అంటూ ఆశ్వీరదించినట్లు గొణిగి కళ్ళు తుడుచుకుంటూ బోర్ లారీ యెక్కేసి పోయాడు  మురళి..  

 

మిట్ట మధ్యాహ్నపు యెండ నిప్పులు చెరుగుతుంది.టింగ్  టింగ్ మంటూ చేతి పంపు  కొట్టినప్పటి చప్పుడు. తొంబై యెనిమిది తొంబై తొమ్మిది వంద అని అంకెలు లెక్కబెట్టుకుంటూ అలుపొచ్చి ఆగి ధార క్రింద బెట్టిన బిందె లోకి తొంగి చూసిన సోనా  వూసూరుమని నిట్టూర్చి దేవుడా, యీ బిందె నిండటానికి చేతులు నడుము పడిపోయేటట్టు యింకెన్ని సార్లు పంపు కొట్టాలో అని అనుకుంటూ  విచార పడుతుండగా ..


 “నిద్ర లేచినదగ్గర్నుండి ఆ పంపుని పట్టుకుని యేలాడతానే వుంటావ్ కదే సోనాబాయీ.. ఆ పంపన్నా విరిగింది కానీ నీ చేతులు యిరగడం లేదు. ఏం మోత, దిక్కుమాలిన మోత

తండా లో నుండి  యిక్కడిదాకా చీమలబారులా  బిందె లేసుకుని నీళ్ళకి తిరుగుతారు గానీ  పంచాయితీ వాళ్ళని  ట్యాంక్ లతో నీళ్ళు పోపియ్యమని అడగరు” అని అరుస్తూ వచ్చి నిలబడింది లక్ష్మి. 


“దిగుడు బాయిలో ఇయ్యాల నీళ్ళే వూరడంలేదమ్మా, ఊరినా బురద బురదగా వుండాయి. ఆటి కోసమే కొట్టుకుంటా వుండారు. మీరైతే యేమీ అనరని యిటొచ్చా”  వేడుకోలుగా చూస్తూ చెప్పుకుంది.  


" సరేలే, ఇయ్యాలటికి  మోసింది చాల్లే, నీళ్ళన్నీ మీరే మోసుకుపోతే మేమైపోవాలి. లక్ష రూపాయలు పెడితే కానీ నీటి  చుక్క తగలడం లేదు.  మమ్మల్ని వుద్దరీయడానికి ఆడ నుంచి ఈడ దాకా వస్తారు " అని నాలుగు మాటలరాళ్ళనేసి గేటు దగ్గరే నిలబడింది. సోనా బిందెలెత్తుకుని బయటకి దాటితే గేటు తాళం వేసుకోవడానికి అన్నట్టు. వెనక చూపులు సూదులు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటుండగా బిందెలనూ కేనులని నింపుకుని పైకెత్తుకుంటుండగా ..    

  

“ఏమే సోనా బాయీ! ఎలక్షన్లు వచినప్పుడన్నా గట్టిగా పట్టుబట్టి  తండాలో లోతు బోర్లు వేసి వాటర్ ట్యాంకు కట్టించమని అడగొచ్చు కదా,  రెండు వందల ఓట్లు వుండాయి. మీ ఆయన వార్డ్ మెంబర్ కూడా, అడగడానికి   కూడా నోర్లు అరువియ్యాలి మీకు” అంటూ విసుక్కుంది.  లక్ష్మి అమ్మగారు చెప్పింది నిజమే, లేకపోతే   నీళ్ళు మోయడానికే   యింటికొక మనిషి అవసరపడ తన్నారనే సాకు చెప్పి రెండో పెళ్ళాన్ని రాజమార్గంలో తెచ్చుకుంటారు తండాలో మగవాళ్ళు అని మనసులో  అనుకుంది సోనా.


తల మీద రెండు బిందెలు రెండు చేతుల్లో రెండు  పదిలీటర్ల ప్లాస్టిక్ కేన్ లు పుచ్చుకుని తండా వైపు నడక సాగించింది సోనా. తలలోంచి చెమట ధారగా జారుతూ ముక్కు కొసనుండి క్రిందికి జారిపడుతూ కొన్ని చుక్కలు   పెదాలపై పడుతూ . అప్రయత్నంగా పెదాలని తడుపుకుని ఉప్పగా తగిలిన చెమట చుక్కలని ఉఫ్ అని వూదిపడేసి గబా గబా  నడక సాగించింది. 


మధ్యలో మోటారు బైకు మీద పోతున్న కాలేజీలో చదువుకునే  తండా పిల్లగాడు. టీవి లో కనబడే దృశ్యం గుర్తుకొచ్చింది.  గతుకుల రోడ్డు పై కూడా కుండ క్రింద పడకుండా చుక్క నీళ్ళు చిందకుండా బండి పై సవారీ చేయుడు సులువేమో కానీ నెత్తి మండ కుండా కాలు కాలకుండా చుక్క నీరు యింటికి వచ్చేది కల్ల.. ఈ సారి అన్న వచ్చినప్పుడు  మోటర్ సైకిల్ బండన్నా కొనీయమని అడగాల, ఈ నీళ్ళ మోసుడు తప్పడానికి.  అప్పుడు దూరంగా పోయి అయినా  బండికి కట్టుకుని నీళ్ళు మోసుకో వచ్చు  అనుకుంది.  


వేప  చెట్టుకి కట్టేసిన పాడి ఆవు  దూరంగా వస్తున్న సోనా ని  చూసి తలని విదిలిస్తూ లేచి నిలబడి మెడలో పలుపుతాడు లాక్కుంటుంది. ఇంటి పక్కనే చిన్న పాకలో కట్టేసిన దూడ  కూడా సోనా  వైపు ఆశగా చూసింది. ఆ పాక యెదురుగా యెండలో నేల మీది కూర్చుని గిన్నెలో వున్న అన్నాన్ని రెండు వేళ్ళతో వొక్కో మెతుకుని తీసుకుని తింటూ మధ్య మధ్యలో చుట్టూ చేరిన కోడిపిల్లలకి  మెతుకులు  విసురుతూ చిద్విలాసంగా నవ్వుకుంటున్న సోనా   కొడుకు  కృష్ణుడు.  తల్లిని చూసి అమ్మా భో భో లు భో భో లు   అన్నాడు.  తల్లి కోడి   కృష్ణుడి యెదురుగా నిలబడి యెట్టాగొట్టా బెదరగొట్టి గిన్నెలో వున్న అన్నాన్ని యెగజిమ్మి పిల్లలకి పెట్టాలని కాసుకు కూర్చున్నట్టుంది.  


దూరంనుండే ..ఉష్ ఉష్ అంటూ కోడిని పిల్లలని అదిలించి..చేతుల్లో ఉన్న నీళ్ళ కేన్ లని అరుగు మీద పెట్టి గుమ్మం ముందు నిలబడింది సోనా. రుక్కు  వచ్చి నెత్తి మీద వున్న బిందెల్ని  దింపడానికి సాయపడుతుందేమోనని. కొంచెం సేపు ఎదురు చూసింది కూడా. దర్జాగా  పరుపు మంచంపై పడుకుని టీ వి సీరియల్ లో మునిగిపోయిన ఆమె సోనా  ని చూడనట్లు నటించింది. మోకాళ్ళు  వొంచి రెండు  బిందెలని జాగ్రత్తగా కిందికి దించి వూపిరి పీల్చుకుంటూ తల మీద చుట్టగా పెట్టుకున్న తుండుని విదుల్చుకుంటూ వెళ్ళి   యెండలో కూర్చున్న కొడుకుని గబుక్కున యెత్తుకుని చంకలో కూర్చో బెట్టుకుని చెట్టు కిందకి పోయింది. తుండుతో ముఖం తుడుచుకోబోతుండగా కృష్ణుడు కింది పెదవిని ముందుకు నెట్టి.. దాహంగా వుందని సూచిస్తూ ఫ్ఫ్ ట్రూ  ప్ఫ్ ట్రూ  అమ్మా అన్నాడు శబ్దం చేస్తూ  .


మంచినీళ్ల కుండ మూత పై బోర్లించిన గ్లాసు తీసుకుని మూత తీసి నీళ్ళు  ముంచబోయి ఖాళీగా కనబడిన కుండని చూసి నివ్వెరపోయింది సోనా. గుమ్మలో నిలబడిన రుక్కు  “ ఎండకి వొళ్ళు చిటబుడతా వుంటే ఆగలేక మంచి నీళ్ళ కుండలో నీళ్ళు పోసుకున్నా. మరి యే౦ చేయను గాబులో చుక్క నీళ్ళు లేకపోయే”అంది.  నడిపెండలో మళ్ళీ బిందెలేసుకుని రెండు మైళ్ళు నడిచిపోవాలి గాబోల్సు..  మనసులో  అనుకుంటూ  అప్పుడే దించిన బిందెలో నుండి నీళ్ళు ముంచుకొచ్చి క్రష్ణుడుకి తాగించబోతుంటే కళ్ళ నుంచి రెండు చుక్కలు  గ్లాసులోకి రాలి పడి ఆ నీళ్ళలో కలిసిపోయాయి. ఏ నీళ్ళు అయితేనేం రంగు ఒకటేగా అనుకుంది సోనా. 


(2019 ఫిబ్రవరి 23 ఆదివారం ప్రజాశక్తి స్నేహ ఆదివారం సంచికలో ప్రచురితం)




కామెంట్‌లు లేవు: