27, ఆగస్టు 2011, శనివారం

గాలి కదుపులేదు..నవమినాటి వెన్నెల

నాకు చాలా చాలా.. ఇష్టమైన పాటలు.. ఈ రోజు యూ ట్యూబ్ లో.. దొరికాయి. మనసంతా ఎంతో..ఆనందం. ఆ ఆనందం ముందు..ఏవి సాటి రావు.. మీరు..ఓ.. సారి చూసేయండి.
ఇది కథ కాదు చిత్రంలో.. గాలి కదుపులేదు కడలికంతు లేదు

గాలికదుపు లేదు కదలికంతు లేదు
గంగ వెల్లువ కమండలంలో
ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరిగీస్తే అది ఆగేదేనా (గాలి )
ఆ నింగిలో మబ్బునై
పాడనా పాటలెన్నో
ఈ నేలపై నెమలినై
ఆడనా ఆటలు ఎన్నో (నింగిలో)
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే
లేగకేది కట్టుబాటు
మళ్ళి మళ్లి వసంతమొస్తే
మల్లెకేల ఆకు చాటు (గంగ)
ఓ..తెమ్మేరా ఊపవే
ఊహల ఊయల నన్ను
ఓ మల్లికా ఇవ్వవే
నవ్వుల మాలిక నాకు
తల్లి మళ్ళీ తరుణ య్యింది
పువ్వు పూచి మొగ్గయింది
గుడిని విడిచి వేరొక గుడిలో
ప్రమిదనైతే తప్పేముంది (గంగ)
శివరంజని చిత్రంలో..

నవమినాటి వెన్నెల నేను.. 

26, ఆగస్టు 2011, శుక్రవారం

చీమ కథ

ఈ రోజు వుదయాన్నే యింట్లో  పూజ ముగించుకుని తులసి పూజ కూడా చేసుకుని ప్రదక్షిణం  చేయడం మొదలెట్టాను.సగం కళ్ళు మూసుకుని ప్రదక్షిణం చేస్తూ..యానికాని పాపానిచ జన్మాంతర కృతానిచ అని చెప్పుకుంటూ గిరగిర తిరిగేస్తున్నాను.

"వచ్చేస్తుంది వచ్చేస్తుంది ప్రక్కకు త్రప్పుకో.." అని మాటలు వినబడుతున్నాయి. ఎవరబ్బా అనుకుంటూ నా పని నేను చేసుకుంటున్నాను.చెపుతుంటే వినవచ్చు కదా వాళ్ళకెలాగు తొందరే! నీకు  కూడా అంత  తొందరెందుకు ?  వాళ్ళ పద ఘట్టనల కింద పడితే బతికి బయటపడటం యె౦త కష్టం,  చెపుతుంటే వినవు అన్న మాటలు  దీర్ఘంగా  మళ్ళీ వినబడుతున్నాయి.

ఈ సారి వులికిపడ్డాను. ఎవరబ్బా  యింతగా క్లాసు తీసుకుంటున్నారు అని పరీక్షగా చూసాను. ఎవరు కనబడలేదు.ఈ మధ్య  నాకన్నీ బ్రాంతిగా వుంటున్నాయి.కాస్త జాగురకత వుండాలి.లేకపోతే అభాసుపాలు కాగలను అనుకుని.. మూడవ ప్రదక్షిణం  ముగించబోతుండగా ఒక జీవిని తొక్కేసాను.

 వెంటనే ఈ సారి గావుకేకలే వినబడ్డాయి. అయ్యో! నేను చెపుతుంటే వినడమే మానేసావు, ఇప్పుడు చూడు యేమైందో..

ఈ మానవులంతా కర్కశ హృదయులు. ఎప్పుడూ కళ్ళు పైనే వుంటాయి.వాళ్లకి కావాల్సింది సాధించుకోవడానికి, నిర్ధాక్షిణ్యంగా యితర జీవజాతిని నాశనం చేస్తారు. ఇప్పుడు నీ నడుములు విరిగిపోయాయి.ఇంకా నయం, యింకొద్దిగా వుంటే  ప్రాణాలే పోయేవి. అంతా నా ఖర్మ అని వినబడుతుంటే..అనుమానం వచ్చి  పరీక్షగా క్రిందికి చూసాను.

రెండు చీమలు..ఒక చీమ నేను ప్రదక్షణలు చేస్తున్నప్పుడు..పొరబాటున తొక్కేసినట్లు ఉన్నాను.ఆ చీమని  నేను తొక్కేయడం  మూలంగా అడ్డంగా పడిపోయి వుంది.

ఇక రెండో చీమ ఆందోళనగా గాయపడిన చీమ చుట్టూ తిరుగుతూ మాట వినని భర్త చీమని చూసుకుని యేడుస్తూ, ముక్కు చీదుతూ, వాపోతూ వుంది.(ఇవన్నీ  నాకెలా తెలుసు అనుకోకండీ. ఒకోసారి అన్నీ అవే తెలుస్తాయి.పశుపక్ష్యాదుల,కీటకాల,మొక్కల భాషలు అన్నీకూడా..ఎంతైనా మనిషి మహా మేధావి  కదా ఈ మధ్య కాస్త జ్ఞానం పెరిగింది కూడా )


నేను కొంచెం బాధ పడుతూ.. అయ్యొయ్యో! యెంత  పని చేసాను ? అనుకుంటూ..చేతిలో అక్షతలు తులశమ్మమూలం దగ్గర  వొదలి చటుక్కున వొంగి చీమని పరీక్షగా చూసి వైద్యురాలి అవతారమెత్తాను.

రెండో..చీమ హడావిడిగా తిరగడం మొదలెట్టింది.
తన పతి ప్రాణానికి యేమి హాని కలిగిస్తానో అనుకుని. అలా  తిరుగుతూనే  యేమిటో  వెదకడం  చేస్తుంది ..తన  బలగాన్ని  కూడబెట్టె  ప్రయత్నం  చేస్తున్నట్టు వుంది.

నేను  కాస్త  ఫస్ట్ ఎయిడ్   చేయడం మొదలెట్టి అది  అయ్యేటప్పటికి  చీ  చీ ..అనుకుంటూ  పదిమందిని పోగేసింది .


ఆ  పోగైన  జీవులని    చూడగానే  నాకు  భయం  వేసింది. ఎక్కడ  పట్టుకుని కసిదీరా కుట్టి  పడేస్తాయేమోనని   రెండు  నిమిషాలు  దూరం  జరిగాను .అన్ని  చీమలు క్రమశిక్షణతో లైన్లో  వెళ్లి గాయపడిన  చీమని పరామర్శించి  వస్తున్నాయి .ఇవతలకి  వచ్చి  సంభాషణలు  జరుపుకుంటున్నాయి.

ఏమైనా సరే వదలకూడదు. నీకు ఈ స్థితి కల్పించిన ఈ మానవ స్త్రీని శిక్షించవలసిందే అని తీర్మాని౦చుకోవడం  వినబడుతుంది. మెల్లగా జారుకోబోయి.. యెహే..ఈ చీమలకి భయపడటం యేమిటి? అయినా నేను కావాలని త్రొక్కానా  యేమిటి? నా పని నేను చేసుకుంటుంటే..అవే వచ్చితెగ తిరుగుతూ ఆహారం కోసం అన్వేషణ అనుకుంటూ తెగ ఫోజులు కొడుతుంటాయి.ఆ మాత్రం వేటాడకుండా తేరగా మానవులకి  కూడా వచ్చేస్తున్నాయి కాబోలు. వెదవ బిల్డప్పులు యివీను అని అనుకున్నాను మనసులో .

చూసారా  చూసారా? ఎన్ని  మాటలు అంటుందో, మనకి  తెలియవనుకుంటుందేమో అన్న  మాటలు  వినబడ్డాయి. వులికి  పడ్డాను .అమ్మో, యిదేమిటి ? యిలా  మనసులో అనుకున్న  మాటలు వినబడుతున్నాయి.
ఇప్పుడిక్కడ  నుండి  కదలడం  కూడా  మంచిది  కాదనుకుంటూ  యెoదుకైనా  మంచిదనుకుని  అక్కడున్న  కుర్చీలో కూర్చుని  కాళ్ళు  పైకి  పెట్టుకుని మరీ  కూర్చున్నాను . ఆ చీమలదండు  వైపు  చూస్తూ  కూర్చున్నాను. ఆర్ .నారాయణమూర్తి  గారి  చీమలదండు చిత్రం  గుర్తుకువచ్చింది. అప్రయత్నంగా  భయం వేసింది కూడా.

ఏం చేస్తున్నాయా? అని దొంగచూపులు చూస్తున్నాను. ఒక రెండు చీమలు వెళ్లి తులశమ్మ కుండీ ప్రక్కనే ఉన్న పుట్టలోకి వెళ్లి మూడవ చీమతో తిరిగి వచ్చాయి.ఆమె "రాణి చీమ " అనుకుంటాను. కాస్త పెద్దగా స్టైల్గా వుంది. హుందాగా వొక సైనిక చీమ దారిచూపుతుండగా వెనుక రాణి వెడలె దర్పంతో మందగమనంతో వచ్చుచున్నది.


నా పై ప్రాణాలు పైనే పోయేటట్లు వున్నాయి ఆమెని చూసి.

పట్టుకుందంటే  నలిపేసే లోపే కండ కంది చురచురలతో మంటెంత్తాల్సిందే, అలా వుంది.  రాణి చీమని తీసుకొచ్చి గాయపడిన చీమని చూపాయి మిగతా చీమలు..

ఎలా జరిగింది యిది..అని అడిగింది విచారణ ప్రారంభిస్తూ. యే౦ఫాస్ట్! ఈ  చీమల్ని చూసి మనం సిగ్గుపడాలి అనుకున్నాను.

ఆడ చీమ చెప్పడం మొదలెట్టింది. రోజు  మేమిక్కడే ఆహార సేకరణ చేస్తాము.ఆ.. మానవ స్త్రీ..నిత్యం ప్రాతః కాలాన్నే వచ్చి  అదీ పుట్టలో..మన ఆహారపునిల్వ  గదులలో ఆహారం చేర్చుచుండగా వచ్చి రెండు చెంబుల నీరు గ్రుమ్మరించి మన రాజ్యాన్ని వరదలమయం చేసేస్తుంటుంది. అలాగే ఆ తులసి  మొక్క  చుట్టూ  తిరుగుతూ  నిత్యం  మనవాళ్ళ  ప్రాణాల్ని  బలితీసుకుంటుంది .ఆమెని  అసలొదల వద్దు.   యే మాత్రం  వుపేక్షించక  శిక్ష  అమలుచేయండి రాణి  వారు  అంటుంది ఆక్కసుగా గాయపడిన  చీమ  వారి  భార్యామణి .

నాకు  కొంచెం  భయం ,ఆసక్తి  రెండు  పెరిగాయి యే౦  జరగబోతుంది అని.
"ఊహు..అని మీరేమంటారు మంత్రి వర్యా " అన్నారు రాణి చీమవారు.
మనం కాదు రాణివారు గాయపడిన చీమవారి అభిప్రాయం కనుక్కుని..ఆ విధముగా తీర్పు నివ్వండి అని మంత్రి చీమగారు సెలవివ్వగానే..
చెప్పండి, మీ భాద యేమిటో? అలాగే యే౦ శిక్ష యిమ్మందురో? అని ఖండిత చరణములతో వున్నమగ  చీమ ని అడుగగానే..

రాణి వారూ, ఆ మానవ స్త్రీ తప్పిదం యే౦ లేదు. నేనే ప్రతి నిత్యం ఆమె..పూజ చేసేటప్పుడు ఆమె చెప్పుకునే మంత్రోచ్చారణ వినడం కోసం, ఆలాగే ప్రదక్షిణం చేసేటప్పుడు ఆమెతో కూడా తిరుగుతూ వుంటే ..నాకు కూడా ఫుణ్య ఫలం దక్కునను వుద్దేశ్యంతో నేను ప్రదక్షిణం  చేయుచుండెడదను. పైగా ఆమె పెట్టేడు ప్రసాదం వలన మనకి  యె౦తో ఆహార భద్రత కూడా. ఆమెని మన్నించ వచ్చును   అని చెప్పుకొస్తుంది.

అబద్దం... అంతా అబద్దం రాణి వారు..ఈ మానవ స్త్రీ గతంలో..కూడా శివాలయంలో  108 దినములు 108 ప్రదక్షిణములు   చేస్తూ.. కళ్ళు నెత్తిమీద  పెట్టుకుని అడ్డదిడ్డంగా మన జాతిని కర్కశ పాదాల క్రింద తొక్కేసి పుణ్యం సంపాదించుకున్నాను అనుకుంటుంది. ఇతర ప్రాణులకి హాని చేయకుండా వుండటమే అసలైన పుణ్యం అని అన్నీ తెలుసు అనుకున్న యీ మానవులకి తెలియదా అంది ఆవేశంగా..

నువ్వు..వూరుకుంటావా కాసేపు. నన్నసలు  మాట్లాడనివ్వవా అని  మగ చీమ భార్యని కసురుకుని చెప్పనారంభించింది.

మానవులు వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడానికి,కోర్కెలు కోరుకొవడానికి గుడికివచ్చి నైవేద్యాలు పెట్టి మనకి ఇంత ఆహారం పెడుతుంటారు. కానీ  మనం మన  ఆత్రం కొద్ది ఆ ఆహారాన్ని జేరవేసుకునే ప్రయత్నంలో..వారి దారికి అడ్డువచ్చి వాళ్ళ కాళ్ళ క్రింద పడి నలిగి పోతున్నాం, అది వాళ్ళ తప్పు యెలా అవుతుంది.

బలవంతునిదే రాజ్యం. బలవంతుల చేతుల్లో బలహీనులు నలిగి పోవాల్సిందే కదా అంది.

ఆడ చీమ ఓరి దేవుడో, నా మొగుడికి గుళ్ళు గోపురాలు తిరిగి జ్ఞానం వచ్చేసినట్లుంది.
ఇప్పుడు కాళ్లు,నడుము విరకొట్టుకుని అవిటితనంతో అటుచావకక బతకక మంచంలో పడి వుంటే నేను నా బిడ్డలు యెలా బతకాలి. నా పిల్లలు యింకా కసుచీమలు. నా నౌఖరిగిరి  యేమగును. నేను యేమి చేయను అని ఆరునొక్కరాగం మొదలెట్టింది.

నాకు గుండెలు దడ దడలాడుతున్నాయి.నష్ట పరిహారం క్రింద యేమడుగుతుందో, యిక లాభంలేదు డిఫెన్స్ మొదలెట్టాలి అనుకున్నాను. అనుకున్నదే తడవుగా నోరువిప్పాను.

రాణి చీమ గారు నా వల్ల పొరబాటు జరిగినది వాస్తవం. నేను కాదనడం లేదు.

అయినా మీ సైనికులు మా యిండ్లలో  రాజాలా దొరబడి మా ఆహారపదార్ధాలని దొంగిలించి దొంగదారులలో మీ గిడ్డంగులకి తరలిస్తుంటే కూడా గెమాక్సిన్ చల్లకుండా,రక్షణ రేఖ గీయకుండా వూరుకుంటున్నాను.

నా కొడుకైతే..మీ పుట్టలు వెతుక్కుంటూ వచ్చి అక్కడ బియ్యం, బెల్లం, పంచదార లాటివి జల్లి మరీ వస్తాడు.


నేనయితే మీ కోసం వొక డబ్బాలో..పంచదార పోసి పెట్టి మీకు వదిలేసి వేరొక డబ్బాలో పంచదార పోసి ప్రిజ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. మా   పదార్దాలన్నీ  మీ  కంపుతో వాడకోను వీలు లేకుండా వుంటే కూడా  చూస్తూ  వూరుకుంటున్నాను  మిమ్మల్ని చంపడం  పాపమని. అదీ కాకుండా నిత్యం పూజలో పండు, ప్రసాదం కాకుండా మీ కోసమని పటికబెల్లం పలుకులు ప్రత్యేకంగా తెచ్చి అవే ప్రసాదంగా పెడుతున్నాను.

సాద్యమైనంత  జాగ్రత్తగా మిమ్మల్ని మీ బిడ్డలని త్రోక్కకుండా నిర్దాక్షణ్యంగా వూడ్చి పడేయకుండా మా తుడుపుడు చర్యలలో రుద్దిపడేయకుండా సమయం వెచ్చించి జాగ్రత్తలు తీసుకుని మీకు హాని కలగకూడదని తాపత్రయపడతాను.

అల్లాగే మా ఏ.సి.గదుల్లో మా మంచాల కింద పరుపుల  కింద చేరి కాపురాలు పెట్టి చల్లగా గుడ్లు పెట్టి  మీ  సంతతి వృద్ది చేసుకుంటుంటే  మమ్మల్ని యే౦ చేయడంలేదు  కదా అని తీవ్రంగా అడుగుతూ నేను  చూసి చూడనట్లు వూరుకుని యింట్లో  వారితో యెన్ని తిట్లు తింటున్నానో,  అది మీకు తెలుసా?

దోమల లాగా మీరు యే మలేరియనో,చికెన్ గున్యా నో..యిస్తారనుకుంటే..ఒక్క పిపీలికం వుండేదా?  యే హిట్టో ,పెస్ట్ కంట్రోల్ మందో కొట్టి సమూలంగా నాశనం చేసేవారిమి అన్నాను.

నాకు మీజాతి పై గౌరవభావం. మీ క్రమశిక్షణ,ఆహారపు వేట,సేకరణ,ముందుచూపు,కష్టించి పనేజేసే తత్వం అన్నీ..నాకిష్టం. మీ జాతిని చూసి నేర్చుకోవాల్సిన విషయాల గురించి అందరికి చెపుతుంటాను అని వాస్తవాన్నేఅందంగా నాటుకునేటట్లు చెప్పాను.

అవును రాణివారు ఆ..మానవ స్త్రీ చెప్పినది నిజం అని గాయపడిన చీమ నన్నే  సపోర్ట్  చేసింది.

ఇదిగో, ఇంటాయనా! నువ్వెన్ని  అయినా  చెప్పు.ఒక్కసారైనా  ఆమెని నేను కుట్టకుండా వదలను. అప్పుడు గాని నా కక్ష తీరదు అంది అక్కసుగా కోపంగా.

అప్పుడు మన బిడ్డలకి..నేనున్నా వొకటే నువ్వు లేకపోయినా వొకటే అన్నారు..మగచీమ.

సరే సరే..యింతటితో వదిలేయండి. ఇప్పటికే చాలా సమయం పని గంటలు వృధా.
ఆ గాయపడిన సైనిక చీమవారిని..వైద్యశాలకి..పంపి..ఈ..ఆడ చీమవారికి పని గంటలు యెక్కువ  యిచ్చి ఆహారం యెక్కువ యివ్వండి అని ఆదేశములు యిచ్చి వెనుదిరిగి వెళ్ళారు రాణి చీమవారు.

భలే భలే రాణివారు. మీ తీర్పు  అద్భుతం అని నేను యెగిరి గంతులేస్తున్నాను. మొత్తానికి నాకూ పిపీలిక భాష వచ్చేసిందోచ్! అనుకుని  సంతోష పడుతున్నాను.

ఎవరు..ఆ రాణి   వారు! యేమా  తీర్పు, లేచి  "టీ"  పెట్టు ..అని  ఆర్డర్స్ . టక్కున  మేల్కొని ఓస్ ..యిదంతా  కలా ? అనుకున్నాను వులికిపడి లేచి చుట్టూ చూసుకుంటూ వంట గదిలోకి వెళ్లాను.

ఇది వో చీమ కథ. కథే కదా అని తక్కువ చేయకండీ..  

(నిత్యం మనకి తెలియకుండానే మన చేత బాధింపపడి   ప్రాణాలు కోల్పోతున్న జీవాల గురించి ఆలోచనతో)

24, ఆగస్టు 2011, బుధవారం

బ్రహ్మ కడిగిన పాదము

                                                                   
 బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము


                                                             చెలగి వసుధ కొలిచిన నీ పాదము

                                                                  బలి తల మోపిన పాదము


                                                               తలకగ గగనము తన్నిన పాదము


                                                                 బలరిపు గాచిన పాదము


                                                          కామిని పాపము కడిగిన పాదము

                                                              పాము తలనిడిన పాదము


                                                              ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము 


                                                                   పామిడి తురగపు పాదము


                                                              పరమ యోగులకు పరి పరి విధముల
                                                                      పరమొసగెడి నీ పాదము
                                                                 తిరువేంకటగిరి తిరమని చూపిన
                                                                  పరమ పదము నీ పాదము                                                                        అన్నమాచార్య కృతి


                                                    స్వరార్చన: విదుషీమణి "భారత రత్న"    ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి 
ఇక్కడ వినండీ ..చూడండీ..
  

13, ఆగస్టు 2011, శనివారం

ఆకలి కేకలు వినబడని కొత్త బంగారు లోకం

ప్రపంచంలో.. ఏ మూల కూడా ఆకలి కేకలు వినబడని..కొత్త బంగారు లోకాన్ని కాంక్షిస్తున్నాను..
ఆ మాటలు.. వినగానే..అది అంత సాధ్యమా ..అనిపించింది నాకు.  ఆ లోకం కోసం ఓ.. ఆపన్న  హస్తం 

ఆకలి కేకలు అనగానే మనకి  సోమాలియా నే గుర్తుకు రానవసరం లేదు. మన భారత దేశంలో.. ఆకలికేకలు విలయ తాండవం చేస్తున్నాయి.


గయలో బుద్దుని సాక్ష్యంగా పితృ దేవతలకి  పిండం పెట్టి పెట్టకుండానే..ఆ . నీటి లో.. ఆ. పిండాల ముద్దలను ఏరుకుని తినే.. వారు..,వాటి కోసం గొడవ పడేవాళ్ళు..చూస్తుంటేనే. మనసు వికలమవుతుంది.

అలాగే.. కడప జిల్లాలో ఆకుల గంగమ్మ అనే మహిళా చేపట్టిన అన్న మహా యజ్ఞానికి  వేళా పాళా..లేకుండా వచ్చే అన్నార్తులు.. సాదించిన శ్వేత విప్లవం,హరిత విప్లవానికి  ఆనవాలు ఏమో!

వీధులలోను,దేవాలయాల వెంబడి,బస్సు,రైల్వేస్టేషన్లోనూ అన్ని చోట్లా..ఆకలికి..మాడి అలమటించే వాళ్ళే.
అన్నం పరబ్రహ్మ  స్వరూపం అంటారు. అన్నిదానాలలోకి..అన్నదానం అత్యుత్తమమైనది..అని పేర్కొంటారు. 
ధనవంతులు..ఆడంబరంగా రక రకాల ఆహారపదార్ధాలు వండించి .. నాగరిక మైన వ్యక్తుల నాగరిక తిండి వల్ల .. టన్నుల కొద్దీ  ఆహార పదార్దాలను . .చెత్త కుండీల పాల్జేయడం  మూలంగా యేమైనా సంతృప్తి వుంటుందంటారా? 

ఆడంబరంగా ఖర్చు పెట్టి అట్టహాసాన్ని  ప్రదర్శించుకోవడం తప్ప.

అనాధలుగా పెరిగే వారు కోట్ల మంది, అందరూ వుండి ..అనాధలుగా.. మారుతున్న కొందఱు.

అందరి ప్రాధమిక అవసరం..ఆహారం. అది... దొరకక ..డొక్కలు..అంటుకుని..దీన స్థితిలో వున్న అన్నార్తులని  చూసైనా  .రాజకీయ నాయకుల రహస్య ఖాతాలలోని..ద్రవ్య నిల్వలు..బయటికి రానివ్వని కసాయి  గుండెలకన్న.. మన మధ్యే వుంటూ సాదారణంగా..జీవిస్తూ కూడా ఆకలితో.మాడే పదుగురికి..అయినా పట్టెడన్నం పెట్టె..ఓ..అమృత హృదయం గురించి..చెప్పడమే.. యీ  పోస్ట్.

గ్రీష్మపు యెండ .రోళ్ళు బద్దలవుతాయి  అంటారు,అటువంటి యెండా  కాలం.

అసలే .. యెండలు  చురుక్కుమనే..గుంటూరు పట్టణం.

ఓ..మహిళ.. వాళ్ళుండే మూడంతస్తుల మేడ పైభాగపు గదుల నుండి..బయటకి..వస్తూ ఉంటుంది. ఆమె..రెండు చేతుల్లో..రెండు కేన్ లు.బరువుగా వుంటాయి. అప్పుడే చేసిన  వేడి వేడి పదార్దాలుతో.. బరువుగా మెట్లు దిగి వచ్చి..కొంచెం దూరం నడచి వచ్చి ..కూడలిలో.. ఆటో..కోసం నిలబడుతుంది... ఆటో  వాళ్లకి ఆమె తనని ఎక్కడికి..తీసుకు వెళ్ళాలో..చెప్పలేదు. అందుకే.. అంత  త్వరగా ఆటో..కిరాయికి కుదరదు.

ఓ..అరగంట అయినా నిలబడ్డాక కానీ.. ఎవరో..ఒకరు..వచ్చాక.. ఆటో యెక్కి కూర్చుని.. రోడ్ల వెంట.. వెదుకుతూ..ఉంటుంది. ఎక్కడ భిక్షువులు,వీధిబాలలు, దిక్కులేనట్టు పడి  వుండే  ఆనాధ  వ్తుద్ధులు.. కనబడగానే  ఆటో ఆపి.. గబా గబా వారికి..తన వద్ద వున్న పేపర్  ప్లేట్లలో.. తాను వండి తెచ్చిన మధుర పదార్ధం వొకటి..నోటికి రుచికరంగా ఉండే పదార్దం ఒకటి.. వడ్డించి..చేతికిస్తుంది
.


అలా..అన్నార్తులని వెదుకుతూ..తాను తెచ్చినవి అయిపోయే వరకు వడ్డిస్తూ వెళుతుంది.
అలా వారానికి రెండు సార్లు..

ఎందుకు అలా.. మీరే వెళతారు.. అంతగా పెట్టాలనుకుంటే.. యే అనాధ శరణాలయాల్లోనో...యేడాదికొక సారి డబ్బు యిస్తే  సరిపోతుంది..కదా ..అన్న మాటలకి..ఆమె.. సమాధానం యిలా..

అందరు.. కేవలం డబ్బు మాత్రమే  యిస్తూ ఉంటారు. అది.. కొన్ని పరిమితుల్లో..కొందరికే చేరుతుంది. ఆ డబ్బు కొన్నిసార్లు అపాత్ర దానం అవుతుంది. అందుకే.. అమ్మా...! ఆకలి అంటూ..మన యింటి  ముందుకు వచ్చేవారికి.. గుప్పెడు అన్నం పెట్టడమో.. చందాల రూపంలో..డబ్బు యివ్వడం కంటే..

నిజంగా ఆకలి కలవారెవరో.. గుర్తించి వారికి కడుపు నిండుగా పెట్టడం..మంచిది కదా, అందువల్ల మనము చేసే సాయం వారికే అందుతుంది. కడుపు నింపిన సంతృప్తి మనకి..వుంటుంది...అంటారు.కొన్ని దేవాలయాల దగ్గర  చూడండి.. కొన్ని ప్రత్యెక రోజుల్లో.. బీదాబిక్కి జనం పోగవుతారు .వారంతా రోజు గడవని వారేం కాదు. దాతల విరాళాల  ద్వారా  అన్నదానం నిర్వహిస్తూ. కొంతమందిని.. పనిపాట లేని సోమరిపోతులుగా.. పెంచి పోషిస్తూ వుంటారు. అది యేమి  సమంజసం అనిపించుకుంటుంది?

వారి పిల్లల పుట్టిన రోజులకి,పండుగలకి.. యే  మాత్రం డబ్బు ఆడంబరంగా.. ఖర్చు పెట్టకుండా.. ఆ డబ్బుని.. యిలా.. స్వయంగా  వండి.. అన్నార్తులని  వెదుక్కుంటూ..వెళ్లి పెట్టిరావడం  ని..అభినందించ కుండా వుండలేను.

ఏ.. దానం చేసినా.. ఇంకా కొంత యిస్తే..బాగుండును అనుకుంటారట. అదే అన్న దానం అయితే..కడుపు నిండగానే సంతృప్తిగా.. యిక  చాలమ్మా అని.. అన్నదాతా! సుఖీ భవ ..అంటారు. అది చాలదా? అది భగవంతుడు మెచ్చే పని కాదా ..! అంటారు.అలాగే..చాలామంది.. మిగిలిపోయిన, మనకి యిష్టం లేని, పనికి రాని ఆహార పదార్ధాలు యితరులకిస్తూ వుంటారు. అది కూడా చాలా తప్పు.మనం తినేదే యితరులకి..పెట్టాలి.. మనకి పనికి రాని పదార్దాలు.. ఇతరులకి పెట్ట కూడదు అంటారు కదా అని అన్నాను.

అందుకు ఉదాహరణ శబరి భక్తి. భగవంతునికి అయినా.. తినకూడ  వీలుకాని పదార్దములు.. నైవేద్యంగా పెట్టకూడదట. అని..మా నానమ్మ చెప్పే మాట చెప్పాను ఆమెకి.

ఆమెకి..భర్త సహకారమే కాదు అలా చేయమని ప్రేరేపించేది..ఆమెకి పనులలో సాయపడేది, ఒకోరోజు ఎక్కడెక్కడ.. ఆకలికి బాధ పడే వారెక్కడ వుంటారనేది బైక్ పై  తిరుగుతూ అన్వేషించేది కూడా అతనే..

అతను.. నా మిత్రుడు కూడా.

అతను,అతని భార్య యిద్దరు కలసి.చేసే ఆ సేవలో నిజాయితీ వుంది.

పైగా అతను పెద్ద ధనవంతుడు కాదు...ఓ..మాస్టర్ టైలర్. ..

అతని పేరు పరిమళమే భావాలు పరిమళమే! ఇవే కాకుండా అనాధలని, అనాధ  పిల్లలని.. హోమ్స్ లో..జాయిన్ చేయడం అప్పుడప్పుడు  వెళ్లి వారిని పలకరిస్తూ వుండటం.. అతని కిష్టమైన వ్యాపకం కూడా..

డబ్బు కావాలంటే.. యెవరైనా యిస్తారు. మనం సేవ చేసి.. చూపాలి.. అనడం పరిపక్వత కల్గిన ఆలోచన అనిపిస్తుంది నాకు.

అంతకు క్రితం నేనూ  ఏదైనా సాయం చేయాలంటే..ద్రవ్యరూపంలో..యిచ్చేదాన్ని. ఇప్పుడు ఆలోచిస్తాను. నాకుప్రేరణ కల్గించే విషయం యిది. 

12, ఆగస్టు 2011, శుక్రవారం

న్యూస్ పేపర్ వాళ్ళ కన్నా మా బ్లొగొరోళ్ళు మిన్న...

ఒక చెవిలో.. పోన్ పెట్టుకుని హడావిడిగా ..అమ్మా..అమ్మా.. అని  పిలుస్తూ  వచ్చాడు మా  అబ్బాయి . (ఒక చెవిలో కాకుంటే  రెండు చెవులలో పోన్.. పెట్టుకుని మాట్లాడతారా అని ...సందేహపడకండి. ఒకోసారి నాలుగు నంబర్స్ తో..కూడా  మాట్లాడే..కాలం ఇది) 

 నేను ఏమిటి.నాన్నా..అన్నాను.. 

నాకు ఒక పేపర్ కావాలి. అందులో..ఒక ఇంపార్టెంట్  న్యూస్ చూడాలి. వెతికి ఇద్దువు రా..అన్నాడు.

అలమరలో..ఉంటాయి.. నువ్వే వెదుక్కో! నా తల ఖాళీగా లేదు అన్నాను. నిజంగా తలే ఖాళీగా లేదు.నెట్ లో..తల పెట్టాను కదా..

నా.. మాటకి నవ్వుకుని... అవతలి గదిలోకి వెళ్లి..కాసేపటికి.. మళ్ళీ కేకలు..ఈ సారి కొంపలు మునిగిపోయినట్లు..రేంజ్ లో  అన్నమాట.

హడలిపోయి..పరిగెత్తాను.(నడకే లెండి)

ఏమిటిది..?  తలతో..సంజ్ఞ తో..అడిగాడు.. నేను అలాగే ..సంజ్ఞతో.. "!?" .. అడిగాను. అలమర వైపు తల చూపించి"??" అడిగాడు..

ఆటు చూసాను...మీరు చూద్దురు గాని ..ఇదిగో..ఇలా...చూసారు  కదా ఇదిగో..ఇలా కనబడ్డాయి...అన్నమాట.

ఏమిటి ఇది? ఒక సారి.. ఫ్లాష్ బేక్..కి..వెళ్ళండి వనజ గారు..అన్నాడు. వెంటనే నాకు అర్ధం అయిపోయింది.


ఒకసారి మా అబ్బాయి ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉండగా.. డిఫెన్స్ మినిస్ట్రీ తరపున ఆర్మీ లో పొస్ట్స్ ఫిలప్ కోసం..కాంపస్ సెలక్షన్స్ జరుగుతున్నాయి.నేను వెళతాను అన్నాడు.సరే! అన్నాను. 

వెళ్ళే ముందు మన డిఫెన్స్ మినిస్టెర్ ఎవరు అమ్మా అని అడిగాడు. నాకు కొపం వచ్చింది.కోపం రాదా..ఏమిటీ?
ఇంజినీరింగ్ చదివే పిల్లవాడు.. అలా మరీ దేశ జ్ఞానం లేకుండా అవమానంగా చదువు కొనసాగిస్తుంటే తట్టుకోలేకపోయాను. ఈ కాలం పిల్లలే అంత. సబ్జక్త్ తప్ప ఏమి తెలుసుకోనవసరం లేదనుకుంటారు.
పైగా మా ఇంట్లో....రెండు దినపత్రికలు.. తెలుగు..మాకు.ఇంగ్లీష్ పేపర్ మా వాడి కోసం ప్రత్యేకం. ఆ పేపెర్ ఎప్పుడు చదివినట్లు నేను చూడనే లేదు..ఎప్పుడైనా..నేనే ..ఏ యౌంగ్ వరల్డో తిరగవేసి బొర్లేసి చదివేదాన్ని.(మనకంత ఇంగ్లీష్ రాదులెండి)

నేను మావాడు అడిగిన ప్రశ్నకి.. జవాబు తెలియదు..అన్నాను. అపనమ్మకంగా చూసాడు. ఎందుకంటే.. నేను వంటలు మాడి మసి బొగ్గైపోతున్నా.. పేపెర్ విడిచి రాను. పైగా..అందరికన్నా నేనే ముందు చదివేసి..రుబ్బి రుబ్బి పడేస్తాను కనుక.1977 నుండి.. పేపర్ చదవడం అలవాటు. స్వయం పేపర్ వచ్చాక..నచ్చిన వ్యాసాలు,విషయాలు..కట్ చేసుకుని దాచుకుని మళ్ళీ మళ్ళీ చదువుకునే అలవాటు మా పెదనాన్నగారి నుండి అరువు తెచ్చుకున్నాను.(ఇప్పుడు అరువు ఇచ్చేసాలెండి)..

ఆ విషయమే నేను చెప్పబోయే విషయం..అన్నమాట. నేను మా అబ్బాయి అడిగిన దానికి..తెలిసినా సమాధానం తెలియదని చెప్పడం తో ..కోపంగా కేంపస్ సెలక్షన్స్ కి..వెళ్ళాడు. అక్కడ ఆ సెలక్షన్స్ అనివార్య కారణాల వల్ల జరగలేదు.ఒక వేళ జరిగి ఉంటే..ఆ..ప్రశ్నే అడిగి ఉంటే..ఏమవును..పరువు? చాలా భాధ కల్గి ఆ రోజు తిట్టాను.
మా కాలంలో..పక్కింటి వాళ్ళ పేపర్ కొసం గోతి కాడ గుంటనక్కలా.. కాసుకు కూర్చుని..ఏంత ఆసక్తిగా ఎన్ని విషయాలు తెలుసుకున్నామో..కథలు కథలు గా వర్ణించి చెప్పాను.ఇక ఆపు మహాతల్లో! అని దందం పెట్టెదాకా..అన్నమాట. అప్పటి నుండి కాస్తంత..ప్రపంచ విషయాలు తెలుసుకోవడం మోదలెట్టాడు..లెండి.
ఇప్పుడు..నాకు అన్యోపదేశంగా ఆ విషయం గుర్తుచేస్తున్నాడు.అని అర్ధమై..


అయితే ఏటట ..అన్నాను. ఆ సిస్టం తీసుకునివెళ్ళి డస్ట్ బిన్ లో..పడేస్తాను.పీడాపోద్ది అన్నాడు. ఆ..పని చేయి. తిండి నిదర లేకుండా..దాని ముందు కూర్చుని లేవదు..అంది మా అత్తమ్మ సందు దొరికింది కదా అనుకుని.


ఆ..ఏమున్నాయి పేపర్ లో..విషయాలు.. అంతా బోర్.. అన్నాను. రాజకీయ నాయకుల ఊసరవెల్లి..తనాలు..ఒకరినొకరు తిట్టుకోవడం మళ్ళీ కలవడం.. కొట్టుకొవడం..పేపర్ అన్నా న్యూస్ చానల్ అన్నా.. సీరియల్స్ లా మొహం మొత్తిపొయింది.అర్దం కాని కవిత్వంలా వాటిని పక్కన పడేశాలే..అన్నాను.
అయినా గూగుల్ వార్తలు ఉండగా..ఇవి ఎందుకు దండగ..రేపటి నుండి పేపర్ మానేద్దాం..అన్నాను
మూడేళ్ళనుండీ ఒకే రకమైన వాదనలు..చావులు,ఓదార్పులు,దణ్ణాలు,..చూడ లేక చస్తున్నాను అన్నాను.

అయిన అన్నానన్నాను అనుకోకు కానీ..కానీ.. సాగదీసి మరీ చెపుతూ.. న్యూస్ పేపర్ లో వార్తలు..కొంతమంది విలేఖరులు సేకరించి.. అక్కడా ఇక్కడ జరిగినవి రాస్తూ ఉంటారు. పది పదునైదు మంది చూసొచ్చి.చెప్పింది రాసింది చదివేకంటె..మా బ్లొగొరోళ్ళు....ఎంచక్కా విన్నవి కన్నవి,చదివి రాస్తుంటే ..రాసుకుంటుంటే వాటిని చదివేదెవరు? కళ్ళు పోతాయిరా ..చదవకుంటే ..పాపం కదా..!? అన్నాను సరదాగా మీకు ఈ మధ్య తెగ తెలివితేటలు,సెన్సాఫ్ హ్యూమర్ పెరిగిందే..హమ్మా..మా..అమ్మా..!అన్నాడు నా కొడుకు.

మరి ఏమనుకున్నావు,నన్నేమనుకున్నావ్? పిచ్చిదాన్ని అనుకున్నావా? పేపర్ పిచ్చిదాన్ని అనుకున్నావా? అంటూ ..కొనసాగించబోయాను.

నిఖిల్..వాళ్ళ అమ్మవనుకుంటున్నారు..అన్నాడు..తెలివిగా.. ఎందుకంటే అంతకు ముందు నేను చేసే పని..అంటే నెట్ లొ..తలదూర్చడం ..అప్పటి సంగతి..ఒకప్పటి సంగతి..గుర్తుచేసుకుంటూ..పూర్తి చేసాడు. పేరడీ పాటని.

న్యూస్ పేపర్ వాళ్ళ కన్నా మా బ్లొగొరోళ్ళు మిన్న అంటున్నాను కదా.. సరదాగా (సీరియస్ గా కాదు)
నిజానికి..వార్తా పత్రికలూ లేకుంటే..మనం చాలా వెనుకబడి ఉంటాం కూడా.. సరదాగా అంటున్నాను సీరియస్ గా కాదు ప్లీజ్..(మన్నించాలి)
జై.. బ్లొగొరోళ్ళు.జై..అగ్రిగ్రేటొర్స్. జై..ఇంటెర్నెట్ అన్నాను ఇదిగో..ఇదే నీతో వచ్చిన చిక్కు.. కొంచెం మెచ్చుకుంటే.. యెవరేస్ట్ యేక్కేస్తావు.. పడిపోతావ్..జాగ్రత్త అమ్మా.. అన్నాడు రహస్యం కనిపెట్టి మరీను.

ఏమిటో మాయ..నువ్వు చెప్పేది నిజమే..బంగారం అన్నాను కొంచెం నేలమీదకి కళ్ళతో క్రిందికి చూస్తూ.. కాళ్ళు ఆనించి జాగ్రత్తగా..చూసుకుంటూ..

8, ఆగస్టు 2011, సోమవారం

తోకలు అవసరమా ?

కార్పోరేట్ స్కూల్లో మీ పిల్లలని చేర్పించ దలచారా? అలాగే మంచి చదువుల కోసం బయట ఉండటం వల్ల చాలా విషయాలు తెలుసుకుంటారు అని తల్లి దండ్రులు భావిస్తున్నారా? 

కొంత నిజమే ఉండవచ్చు ఏమో! కానీ కార్పోరేట్ స్కూల్స్  లో..ఫలితాలలోనే కాదు చాలా విషపు భావాలని.. పెంచి పోషించి మన పిల్లలకి.. సమాజం నుండి విడివడి వర్గాలు తయారు చేసుకోవడంలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ..బీజాలు నాటుతున్నారు. 

విద్యలవాడ గా పేరు గాంచిన  విజయవాడలో..కార్పోరేట్ స్కూల్స్ లో..కానివ్వండి కాలేజెస్ లలో కానివ్వండి..తెలంగాణా ప్రాంత  వాసులు..కొందరు విజ్ఞులు వాళ్ళ ప్రాంతాల పిల్లలని విజయవాడ లో చేర్పించవద్దని  మొత్తుకున్నావినకుండా.. లక్షమందికి పైగా విద్యార్దులని.. విజయవాడలో చేర్పించినట్లు లెక్కలు చెపుతున్నాయి..ని బోగట్టా. పెద్దవాళ్ళు ప్రాంతాల పేరిట  హద్దులు రేపుతుంటే.. పిల్లలలో.. అంతర్లీనంగా కులభావన రేకేత్తిస్తున్నారు. 

కోస్తా ఆంద్ర లో ఉన్న కుల అభిమానం ఇతర ప్రాంతాలలో..అంతగా వేళ్ళూను కోలేదని చెపుతుంటే సంతోషంగానే ఉంటుంది. ఇప్పుడు కులాలు,మతాలూ,ప్రాంతాలు,దేశాలు,ఖండాలు  సరిహద్దులు  దాటిపోయి ప్రపంచమే..ఓ..కుగ్రామం గా మారిపోతుంటే..ఇంకా కులాలు ఏమిటి అని..ఆధునికంగా ఆలోచించే వారికి..ఓ..హెచ్చరిక. వాళ్ళ పిల్లలు కూడా.. కులం కోరలకి..చిక్కి.. కళ్ళు మూసుకుపోయే బీజాలు ఇక్కడ పడుతున్నాయి. తల్లిదండ్రులు ఇది గమనించండి. పిల్లల పసి మనస్సులో  చిన్నతనంలో పడే బీజాలు అంత త్వరగా ఎండిపోవు.పెరిగి పెద్దయి వట వృక్షాలుగా మారతాయి ఏమో..అని..ఆలోచన  చేయండి.

సాదారణంగా.. పిల్లల పేర్లు లో..చాలా మందికి వాళ్ళ కులం ని పట్టించే లేదా గుర్తించే విదంగా పేర్లు ఉండటం ఉంది.ఉదాహరణకి..శాస్త్రి,రెడ్డి,చౌదరి,నాయుడు,గౌడ్,యాదవ్..ఇలా..అన్నమాట.అది మగ పిల్ల వారికీ మాత్రమే పరిమితం అయిందేమో..ఒకప్పుడు. ఇప్పుడు అయితే.. ఆడపిల్లలకి..కూడా.. కులం పేరు చేర్చుకుని పేర్లు పెట్టుకుని గర్వంగా ఫీల్ అవుతున్నారు. తల్లిదండ్రులు కూడా అలా పెట్టటం అనివార్యం అయినట్లు..నడుచుకుంటున్నారు.

 ఒక ఉదాహరణ..చూడండి. ఒక కార్పోరేట్ స్కూల్లో.. ఒక   సినీ కధా రచయిత పిల్లలు.. చదువుతున్నారు. అతనికి.. బహు భార్యాత్వం. నలుగురు పిల్లలు అదే స్కూల్లో చదువుకుంటూ..వాళ్ళ నాన్న గురించి..వాళ్ళ అమ్మల గురించి.. ఇటీవల విడుదలైన వాళ్ళ  నాన్న రాసిన సినిమా కథలోని అంశాలు.ఆ సినిమాలో..పేర్లు..వాళ్ళ పేర్లు అన్నీ ఎందుకు..ఎలా మ్యాచ్ య్యే విదంగా పెట్టబద్దాయో..  అన్న విషయాలతో..పాటు.. హే.. మీ కులం పేరు ఏమిటో..నీ పేరులో..లేదేమిటి..నా పేరులో చూడు నాయుడు అని ఎలా పెట్టుకున్నామో.. కులం కావాలమ్మా? ఏ కులమో..తెలియందే.. నీతో..ఎలా మాట్లాడాలి..అని మాట్లాడిన అమ్మాయి.. మా చెల్లి కూతురు క్లాస్స్ మేట్ .

తండ్రి..తన కథల్లో కూడా వీలైనంత కుల ప్రాధాన్యతని,పౌరుషాన్ని చూపి.. యదాశక్తిగా ఆంద్ర దేశంలో..కుల గజ్జి బీజాలని వేసి..ఇప్పుడు..హైటెక్ పోకడలతో.. బహు భార్యత్వం గొప్ప అనిపించేంతగా  పిల్లలని పెంచడం..ని.. ఏమనుకోవాలి.?

తర్వాత మా చెల్లెలు కూతురు తన పేరు  చివర  మా  కులం పేరుని తగిలించుకోవడానికి.. అదిక ప్రాధాన్యం ఇచ్చి..ఎన్నో ప్రక్రియల  తర్వాత పేరు ప్రక్క తోక తగిలించుకుని వాళ్ళ కన్నా మనమే ఎక్కువ  అని మురిసిపోడం దౌర్భాగ్యం అనుకుంటాను నేను. తల్లిదండ్రులుగా మా చెల్లెలు, ఆమె భర్తా కూడా  కూతురికి.. మంచి మాటలు చెప్పడం పోయి..కులం తోక తగిలించుకుని సంబరపడిపోతున్నారు. అలా పేరు మార్పు కోసం విపరీతంగా ప్రయత్నం చేసేటప్పుడు అది అంత అవసరమా అన్నాను. ఖచ్చితంగా అవసరం. అలా లేకపోతే.. నాలుగు శతాబ్దాలు వెనక్కి వెళ్ళినట్లే అంటే.. ఏం అనగలం చెప్పండి.మన మధ్యే మనవారిలోనే..ఇన్ని మార్పులు.  తోకలు అవసరమా ?.

ఇక  పిల్లలు చూస్తే  వాళ్ళు వాళ్ళ పేర్లుతో..పిలుచు కోవడం మానేసి..ఇంటి పేరులతో..పిలుచుకోవడం...ప్యాషన్. ఒకోసారి నాకే  అనుమానం వస్తుంది. మా.. అబ్బాయి ఫోన్ తీయకపోతే.. మా ల్యాండ్ లైన్ కి కాల్ చేసి ఆంటీ తాతినేని ఉన్నాడా అంటారు.. ఎవరు బాబు  నువ్వు మాట్లాడేది అంటే.. నిమ్మగడ్డ..అంటాడు..నీ పేరు చెప్పు  అంటాను వాదనగా..అప్పుడు  వారి పేరు చెపుతారు  .

ఒకోసారి.. నాకు చిరాకు వచ్చి ఆ పేరు.. కలవాళ్ళు మాఇంట్లో  ఎవరు లేరని టపీ మని పోన్ పెట్టేస్తాను. అలా చాలా సార్లు జరిగాక "అమ్మ " ముందు అలా ఇంటి పేర్లుతో  పిలిస్తే కోపం ..ఆన్సర్ చెప్పదు .. నిఖిల్..అని చెప్పండి.. మీ పేరే చెప్పండి..ఇంటి పేరు చేపితే  కోపం..అని  మా వాడు చెప్పాక..జాగ్రత్త పాటించే వారు.ఇవి మగ పిల్లలకే అంటే పొరబాటు పడినట్లే!

ఇక  ఇప్పుడు ఆడపిల్లలు కూడా కులపు కోరలకి చిక్కుకుంటున్నారు. ఎనిమిదవ తరగతి చదివే ఒక అమ్మాయి తమ కులం వారు ఎవరో..తెలుసుకుని.. వాళ్ళతోనే మాట్లడటం,  ఫ్రెండ్  షిప్ చేయడం,మిగతావాళ్ళు ని అంటరానివారిగా చూడటం..యెంత ప్రమాదానికి దారి తీసిందో!ఒక..అమ్మాయితో...జస్ట్ కామన్ టాక్ ..అంతే ..తర్వాత ఆ ఆమ్మాయి.. వేరే కులం అని తెలుసుకుంది.ఛీ..!! మీరు ఆ కులం అని తెలియదు.తెలిస్తే..మాట్లాడేదాన్ని  కాదు  అన్న మాటలకి.. పాపం ఆ వేరే కులం అమ్మాయి ఆత్మ హత్య చేసుకుంటే అందుకు ప్రేమ కథలల్లి.. ఆ గొప్పింటి అమ్మాయి ని కాపాడిన స్కూల్ యాజమాన్యం ఇక్కడే. 

తల్లిదండ్రులు..విచక్షణతో..ఆలోచించరు ఎందుకని.? సమాజంలో.. ఒకే కులం వారే ఉండరు.తమ పిల్లలు కులతత్వంలో కూరుకుపోతుంటే. బయటకు  లాగే ప్రయత్నాలు చేయక  ఎందుకు ప్రోత్శాహిస్తున్నారు  ? 

అసలు కులం ప్రసక్తి..ఎందుకు వస్తుంది.అని ప్రశ్న మనలో..కొందరికి రావచ్చు. కులాల వారిగా అన్నదాన సత్రాలు,కులాలవారీగా వివాహవేదికలు,కులాలవారీగా వనభోజనాలు..నిర్వహిస్తుంటే..మనం ఎప్పుడైనా అభ్యంతరం చెప్పామా? పేద వారికి ..వివాహాలు, పేద  విద్యార్డులకి..స్కాలర్షిప్ లు ఇలా ఇస్తుంటే..  ఎవరి కులంలో..పేదవారికి వారు సాయం చేసుకుంటున్నారు..అనుకున్నాం కదా.. ఇప్పుడు కొత్తగా  ఏర్పడటం  ఏముంది  అనేవారు  ఉన్నారు. అయితే..సమాజంలో..ఆర్ధిక వెనుకబాటు తనం ఉన్న వారిని ఉన్నత వర్గం ఆడుకోవడానికి..కాలేజెస్ లో.కుల  వర్గాలు ఏర్పరిచి పిల్లల మనసులో..విషబీజాలు ఏర్పడానికి మద్య గల సున్నితమైన సరిహద్దురేఖ ఏమిటో..తెలుసుకోలేకపోవడమే..దురదృష్టకరం. 

దేశాలు దాటి వెళ్లినా .. అక్కడ కూడా  ధన అహంకారం,ఆధిపత్యపు ధోరణి,కుల వివక్ష చూపుకుంటూ వేరు కుంపట్లు ఏర్పరుచుకున్న వైనాలని  మౌన  ప్రేక్షకుల్లా  చూస్తున్నాం. ఇక్కడ ఏవైతే ఉన్నాయో..అక్కడికి అవే మోసుకు వెళుతున్నారు. ప్రపంచమంతా జాతుల మద్య తెగల  మద్య.. ఘర్షణలు అనివార్యం అయిపోయాయి.ఇప్పుడు ఈ కుల వివక్షలు కూడా అంతరిక్షానికి..కూడా  మోసుకు వేళతామేమో..అనిపిస్తుంది.

ఈ పోస్ట్ వ్రాసినందుకు..నన్ను తెగిడే వారు ఉంటారని నాకు తెలుసు. పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు.. కులతత్వాన్ని నూరిపోసే స్కూల్స్ ,కాలేజస్ బారిన పడకుండా  జాగురుకతో..అన్నీ తెలుసుకుని పిల్లలని మంచి విద్యాలయాలో చేర్పించండి..మార్కులు  ఒక్కటే కాదు.. కలసి మెలిసి ఉండే తత్వం.. మానవత్వం..మనిషితత్వం కావాలి. తల్లిదండ్రులు అవి పెంచుకుంటే పిల్లలకి..ఆలస్యంగా అయినా అవి అలవడతాయి.
     

7, ఆగస్టు 2011, ఆదివారం

స్నేహ దీపాలు

స్నేహం అంటే.. 

నేను గతంలో.. ఈ విషయమై  రెండు పోస్ట్ లు వ్రాసాను.అందుకే..మళ్ళీ వ్రాయబోను. నాకు చాలా ఇష్టమైన పాటలు రెండు.. నా చిన్నప్పుడు విన్న పాటలు..ఇప్పటికి వినే పాటలు..  ఒకటి రంగూన్ రౌడీ. లో..ఓ..జాబిలీ వెన్నెలా ఆకాశం ..వేటూరి గారు అరటి పండు ఒలిచి పెట్టినంత తేలికగా చిన్న చిన్న పదాలతో.. ఎంత గొప్ప భావాన్ని జోప్పించారో!.

అందుకు కారణం అంతకు  ముందే వచ్చిన ముకద్దర్ కా  సికిందర్ ..చిత్రంలో.. కళ్యాణ్ జీ   ఆనంద్ జీ..అందించిన  ట్యూన్స్ కావచ్చు..లేదా అంజాన్ సాహిత్యం కావచ్చు ఏమో! కానీ చిన్నతనం లోనే..ఆ పాట సాహిత్యం అంటే చాలా ఇష్టం ఏర్పడింది. 

ఇంకొక విషయం ఏమంటే.. ఆ చిత్రాన్ని వడ్డే రమేష్  (వడ్డే నవీన్ వాళ్ళ తండ్రి.) వాళ్ళు నిర్మించిన చిత్రం ..నవీన్  తల్లి.. (నళిని) మా వూరి ఆడపడుచు.అందుకని.. వారి  బేనర్ పై నిర్మించే చిత్రాలపై.. మావూరి వారందరికీ.. క్రేజ్ ఉండేది.పెద్ద వాళ్ళు..సినిమాలకి వెళుతూ.. పిల్లలని తోడ్కొని వెళ్ళేవారు. అలా ఆ చిత్రం చూసి.."ఓ..జాబిలీ" పాట కి ..వీరాభిమానిని అయ్యాను.

 తర్వాత నేను ఇంటర్ లో ఉండగా.. డిల్లీ నుంచి వచ్చి మా కాలేజ్ లో చేరిన ఒక అమ్మాయి..రోజు అదే పాట పాడేది. తన గొంతు ఎంతో..బాగుండేది. అలా హిందీ పాటకి.. బానిస అయి పోయి..తర్వాత వివిదభారతిలో..రెండు బాషలలో..ఆ పాటలు విని..  తరాత దూరదర్శన్ లో.. ముకద్దర్ కా సికిందర్ చూసి..అమితాబ్..ఎక్స్ ప్రేషన్స్ కి.. హృదయం కరిగి కన్నీరు మున్నేరు  అయిపోయి..(పైకి..కనపడుతూనే ఉండటం స్పెషల్ అన్నమాట) మహదానందంతో..లీనమైపోతూ   ఉంటాను.  ఇది ఈ పాటల  వెనుక కథ.

ఎందుకో..ఓ..జాబిలీ సోలో..(పి.సుశీల)ఇష్టం నాకు.

పాట సాహిత్యం:

ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం 
ఉన్నదే నీకోసం (ఓ )
ఎదురు చూసింది నిదుర కాసింది (ఎ)
కలువ  నీ కోసమే..
వెలుగువై రావోయి 
వెలుతురే తేవోయి 

నువ్వు లేక నవ్వ లేక 
ఎందరున్నా ఎవరు  లేక 
జంట గాని  తోడు లేక ఒంటిగా నేనుండలేను ..
స్నేహ దీపాలు వెలగనీ చాలు 
చీకటే లేదోయి వెలుతురే కావోయి 
వెలుతురే తేవోయి..(ఓ)

గువ్వ లాగా  నువ్వు రాగా
గూడు నవ్వే గుండె నవ్వే 
వేకువల్లె నీవు రాగా 
చీకటంతా చెదిరిపోయే 
తుడిచి కన్నీళ్లు కలసి నూరేళ్ళు (తు) 
జతగా ఉందామోయి
వెలుగువే  నీవోయి వెలుతురే కావోయి..(ఓ)

బాల్యంలో.. మిత్రుని కోసం ఓ..అమ్మాయి పడే ఆరాటం..యెంత బాగా చెప్పారో కదా వేటూరి. 
అలాగే .. డ్యూయెట్  కి..అదే సాహిత్యం.  
తెలుగు పాట  సాహిత్యానికి..దృశ్యానికి.. హింది పాట  నేపధ్యం కి,భావానికి..అభిమాని ని.. అయి..ఈ పాటలు రెండు స్నేహం ..కోసమే..కదా! అందుకే గుర్తు చేస్తూ.. వింటూ..చూస్తూ..   

  ఏ వయసులో నైనా మనిషి కి.. మనసుకి..ఒక మనసైన స్నేహం కావాలి. ఆ స్నేహం  కోసం ఆరాటపడే.. రెండు హృదయాల పాటలే.. స్నేహ హృదయానికి..ఈ నాటి బహుమతులు.. వనజ 

6, ఆగస్టు 2011, శనివారం

సీతాకోక చిలుక..అందం..

మేడమ్! మేడమ్!! అని పిలుపులు.

ఊహు ..వినిపించుకుంటే కదా!మళ్ళీ మేడమ్! ఏక్ బార్ ఆవో..మేడమ్ ! జల్దీ ఆవో!

ఇక తప్పదు.ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు ఈ పిలుపులు..

మేడమ్ మేడమ్..అని పిలుస్తూ ఏదో సి.ఈ.వో.ని పిలిచినట్లు.

మేడమ్ అన్నది ఒకటే తక్కువ నా మొహానికి..అనుకున్నా విసుగ్గా..

ఇప్పుడేగా కలర్ కాంబినేషన్, డిజైన్ పిల్లింగ్ చూపించి లోపలకి వచ్చాను.ఇంతలోనే మళ్ళీ పిలుపులు..

మళ్ళీ ఏమొచ్చిందో!? అనుకుంటూ వెళ్లాను.

వెళ్లి చూద్దునుకదా! మా వర్కర్స్ చాలా సంతోషంగా నవ్వుకుంటూ కనిపించారు.

ఏమిటి సంగతి? అన్నాను. "దేఖో మేడమ్! తితిలీ"అన్నారు.

చూద్దును కదా! అందమైన సీతాకోక చిలుక ఎంబ్రాయిడరీ చేసే చీరపై చక్కగా వాలి కనువిందు చేస్తుంది.

ఆ చిత్రం మీరు చూడండీ!

సీతాకొక చిలుక. చాలా ఆశ్చర్యంగా.. చూసాను.  మేము ప్యాచ్ చేస్తున్న సీతాకోక చిలుక ప్రక్కనే వాలి..అలాగే ఉండిపోయింది.

అది చూసి నవ్వుకుంటూ ఆ ఆశ్చర్యకరమైన విషయాన్ని  నాకు చూపటానికి..నన్ను పదే పదే..పిలిచారన్నమాట  అనుకుని


గబ గబ లోపలికెళ్లి.. కెమెరా తెచ్చి ..ఆ సీతాకోక చిలుకమ్మ విన్యాసాలని..క్లిక్ క్లిక్..మనిపించాను.

 ఆ చిత్రాలివే! చూసారు కదా!

నా కస్టమర్ ఆర్డర్ ప్రకారం..నేను కలంకారీ.. అద్దకం తో..తయారైన డిజైన్ పీస్ ని.. పట్టు బట్టపై..అతికించి..మళ్ళీ దాని పై ఎంబ్రాయిడరీ చేయడం మా పని.

దాదాపు నేను..కాట్ ఎంబ్రాయిడరీ ని.. ఒక చిన్న స్వయం ఉపాదిపధకంగా..మొదలెట్టి  పది ఏళ్ళు దాటింది.
మొదట ఆరుగురు తమిళ సోదరులతో.. మొదలెట్టి.. తర్వాత తర్వాత.పది పన్నెండు మంది  వర్కర్స్ తో..పెద్ద ఎత్తున వర్క్ షాప్ నిర్వహించి.. పది మందికి..పని కల్పించే  వృత్తిలో ఉన్నాను. ఈ వృ త్తి నాకు చాలా ఆసరాగా..నిలిచింది.

తమిళులు,నేపాలీలు,కలకత్తా,కేరళ మొదలగు ప్రాంతాల నుండి వచ్చి.. మా షాప్ లో..వర్క్ చేసేవారు. అలా ఇంకా కొనసాగుతూ.. సాగుతూ ఉంది..ఇప్పుడు కూడా..

ఇక క్రింద చూడండీ..
    


ఏ మాత్రం కదల కుండా ఒక పావుగంట సమయం అలాగే..మమ్మల్ని అందరిని..మురిపించి తర్వాత పక్కనే ఉన్న తులసి మొక్క పై వాలింది..ఆ సీతాకోక చిలుక.. ఆ చిత్రం చూడండీ!


 సీతాకోక చిలుక  సంగతులు.. ఇవండీ..

ఈ పోస్ట్ చదివేసాక .. వనజ గారు మీరు ఎంబ్రాయిడరీ వర్క్  షాప్... అట కదా! అనే మిత్రుల కోసం ఇంకొక మాట..

మహిళలు-స్వావలంబన ..ఇది నాకు బాగా తెలుసు. మా పెళ్లి అయ్యేటప్పటికి.. నా చదువు ఇంటర్ మీడియట్  చదువు మాత్రమే.

ఒక గృహిణి గా ఇక చదవటం అంటే కుదరని పని  కదా!

ఆ తర్వాత కొన్ని పరిస్థితుల్లో.. నాకు.. ఆర్ధిక అవసరాల దృష్ట్యా.. ఏదైనా పని కావాల్సి వచ్చినప్పుడు..అత్తెసరు చదువులతో..చిన్నాచితకా ఉద్యోగాలు చేయడం ఇష్టం లేక.. అప్పటి పరిస్థిని బట్టి   చేయ వీలు కాక కూడా.. అన్వేషణ మొదలెట్టాను.

అప్పుడు అప్పుడప్పుడే మొదలైన ట్రెండ్..ఎంబ్రాయిడరీ.  కొంచెం బెరుకుగానే స్టార్ట్ చేసాను. 

చాలా మెలుకువలు నేర్చుకుని.. "ఘర్ కా దుకాన్ " రన్ చేయడం మొదలు పెట్టాను. ఆ.. ప్రయత్నంలో.. మన భారతదేశంలో.. వివిధ ప్రాంతాలకి..బొంబాయి,సూరత్,వారణాసి,కలకత్తా, బెంగుళూరు, కోయంబత్తూరు,పుట్టపాక ఇలా అన్నీ  చుట్టేసి రక రకాల వస్త్రాల మెటీరియల్స్, చీరలు..కొని తెచ్చిఇంట్లో ఉండే..అమ్మకాలు చేసి.. సంవత్సరానికి.. 20   లక్షల టర్నోవర్ తో సమర్దవంతంగా నిర్వహించాను.అలా ఆరేళ్ళ పాటు గడిచింది.

మేము  కొనుగోలుకి వెళ్ళినప్పుడు.. అయిదుగురు ఆరుగురు (అంతా స్త్రీలమే) కలసి సిండికేట్ గా వెళ్ళేవాళ్ళం.  తలచుకుంటే ఇప్పుడు అదంతా..ఒక వండర్ అనిపిస్తూ ఉంటుంది నాకు. 

తర్వాత  తర్వాత.. వ్యాపార రహస్యాలు లేకపోవడం,కస్టమర్ టేస్ట్ మారడం,అప్పులు ఇవ్వ వలసి రావడం,ఇచ్చిన అప్పులని వసూలు చేసుకోలేకపోవడం లాంటి.. మైనస్ పాయింట్స్ వల్ల నష్టాలు రావడం తో.. సేల్స్ తీసేసి ఓన్లీ వర్క్   షాప్ నిర్వహిస్తూ.. ఎంతో మంది కస్టమర్స్ ..ఎన్నో..అనుభవాలు. లాభాలు-నష్టాలు  అదంతా నాకసలు లెక్కలోవే కావు 

ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. కలర్స్ కెమిస్ట్రీ నేర్చుకుని,డైయింగ్,ప్రింటింగ్.ఫ్లోరల్ డిజైన్..అన్నీ..చుట్టేసి.. మళ్ళీ విద్యార్ధిని..గా మారి.. నా అభిరుచికి తగ్గట్టుగా మాస్టర్స్ పట్టభద్రురాలినై..
కాస్త కవిత్వం.. ఇంకాస్త పైత్యం  వగైరాలతో.. జీవితాన్ని ఆస్వాదిస్తూ..ఈ బ్లాగ్ లోకం లో..పడ్డానండీ.

మాకు దగ్గరలో ఉన్న మహిళా  పారిశ్రామిక వాడలో ఒక  చిన్న  తరహా  పరిశ్రమ  స్థాపించాలని  ఉత్సాహపడ్డాను.కానీ అంత సులభతరం కాదని నానా  రకాల ప్రయత్నం తర్వాత  భోధపడింది.మహిళలకి అన్ని చోట్లా అవరోధాలే!

త్వరలో..ఓ..మంచి వ్యాపార కూడలిలో.."బోటిక్ " స్టార్ట్ చేయాలని..నా ప్రయత్నం కూడా.      

ఎన్ని అవాంతరాలు ఎదురైనా   ఎన్ని కష్ట-నష్టాలు  ఎదుర్కొన్నా  నన్ను వీడి వెళ్ళనివి  మాత్రం నా ప్రియ స్నేహితులు,  పుస్తకాలు.

రేడియో వినడం, మనసు స్పందిస్తే వ్రాయడం..ఇవి వ్యాపకాలు.

అందరూ  తీరిక సమయాలలో.. పుస్తకాలు చదువుతాం అంటారు. పుస్తకాలు చదవడం కోసమే..నేను తీరిక  చేసుకునేదాన్ని.

ఏం  సంపాదించుకున్నారంటే.. . నేను ఒకటే చెపుతాను. "మంచి మిత్రులు, జ్ఞాన సముపార్జనం ".

ఇవి రెండింటికి   ..ఏవి సరి పోవు, సరిరావు కూడా.. అని నా నిశ్చితాభిప్రాయం. 

అందుకే..  మేము ఎకరాలు కోల్పోయినా..నగలు నాణ్యాలు..కోల్పోయినా.. బాధ పడను. అవి మళ్ళీ...  రావచ్చు పోవచ్చుకదా.!

 నా అనుభవంలోనే  కాదు, ఇతరుల అనుభవాలనుండి ..నేర్చుకున్నది ఏమిటంటే .. అసలైన ఆస్తి ఆత్మ విశ్వాసం...అని.  

"డూ  మోర్, లెర్న్ మోర్, గివ్ మోర్, బి కమ్ మోర్.." అదే..నాకు..జీవిత పాఠం .

ఇదండీ. మహిళలు స్వావలంబన లో.. నా ఆవలంబన.  హమ్మ ! సీతాకోక చిలుకా..!! నా గురించి చెప్పేయించింది చూడండీ.. ఆమెని మెచ్చుకోండి. 

అలాగే.. మా వర్కర్స్.  నేను వాళ్ళని,వాళ్ళ కుటుంబాలని  పోషిస్తున్నానో.. లేక వాళ్ళ పని ఊత వల్ల నాకు ఆర్ధిక బలం చేకూరుతుందో..ఇద్దమిద్దంగా.. చెప్పలేను. కానీ వాళ్ళ చేతిలో.. పని మాత్రం అద్భుతం. వాళ్ల చేతుల్లో రూపు దిద్దుకున్న ఎన్నో..కళా ఖండాలు ఉన్నాయి. ఒక్కొక్కటి  ఒకోటి ఒకోటిగా ఇక ముందు పరిచయం చేస్తాను. 

ఇదండీ! ఒక్క పోస్ట్.. రెండు విషయాలు...  చదివినందుకు ధన్యవాదములు. సెలవండీ !!      

5, ఆగస్టు 2011, శుక్రవారం

ఆ..బ్లౌస్ ఖరీదు అక్షరాలా.. వన్ మిలియన్ యూరోస్

ఒక ఆసక్తికరమైన..విషయం చూడండీ!

క్రింద చిత్రం లో ఉన్న నటీ మణి .. అందరికి కాకపోయినా కొందరికి అయినా తెలుసు.


బాలీవుడ్ నటీ మణి  "మల్లికా ఆరోరా" ధరించిన జార్జెట్ శారీ..చాలా బాగుంది కదా! అందులో..పెద్ద విశేషం ఏంలేదు.కానీ.. ఆమె ధరించిన బ్లౌస్ ఉంది చూసారు..ఆ బ్లౌస్ ఖరీదు ..చెపితే..కళ్ళు తిరిగి టపీ మని  పడిపోయాను నేను.మీరు అలా పడకుండా చూసుకోండి ..మరి.

ఆ బ్లౌస్ తయారీలో.. అక్షరాలా అయిదు వందల కేరట్ విలువ కల్గిన బెల్జియం డైమండ్స్ తో..తయారు చేసారట. ఆ..బ్లౌస్ ఖరీదు అక్షరాలా.. వన్ మిలియన్ యూరోస్ ..అట.

ఏమిటో.. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అనే వారు..కానీ..ఇలా.. బ్లౌస్ ల  పాలు కూడా..అన్నమాట.
ఈ బ్లౌస్ ని  ఈమె కి..ప్రదర్శించడానికి  కట్టబెట్టారో.. లేక..అచ్చంగా..ఇచ్చేసారో.. వివరంగా..తెలియదు. మొత్తానికి..ధరించి మాత్రం  హొయలు ఒలకబోస్తుంది.. చూడండీ!
  
celebritysaree.com వారి సౌజన్యం తో..  ఈ  చిత్రం సేకరణ. 

4, ఆగస్టు 2011, గురువారం

దణ్ణాలండి

ఇప్పుడే..నా స్నేహితురాలు "రమ" ఇంటికి.. చాలా రోజుల  తర్వాత వెళ్ళివచ్చాను.

నేను  వెళ్లగానే  మా ''రమ"  పెంపుడు కొడుకు "బుజ్జి పండు" తన ఆనందాన్ని"భౌ ..భౌ" ల రూపంలో చెబుతూ..గుండ్రంగా గిర్రున తిరుగుతూ.. 

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ..సూర్యునిచుట్టూతిరుగును..రీతిలో..ఒక ఐదు నిమిషాల పాటు.. ఆ విన్యాసంతో..నన్ను గుక్క తిప్పుకోకుండా..ఐ మీన్  కదలకుండా.. నిలబెట్టి తర్వాత కుర్చీ చూపెట్టి కూచోపెట్టి.. రెండు చేతు లతో..(అంటే తన ముందర కాళ్ళతో) నా  మోకాళ్ళకి.. తర్వాత నా పాదాలకి  వరుస  దణ్ణాలు పెట్టి.. ప్రేమ  ఒలికించి..నన్ను ఆనందపరవశాన ఊగిస్తుండగా.. నాకు ఒక సందేహం వచ్చింది.

" ఏంటిరా  బుజ్జి పండూ!" నా పై ఇంత ప్రేమ ఒలికిస్తున్నావ్? ఇన్ని  దణ్ణాలు   పెడుతున్నావు...నా కుర్చీ లాగేస్తావా ఏమిటీ? అన్నాను సరదాగా.. ముఖ్య మంత్రులు మారిన వైనాలు గుర్తుకు వచ్చి. మారినప్పుడల్లా అనుకున్నదే అయిందని భాదపడుతూ ..  దణ్ణాలు పెట్టినట్లు ..గుర్తుకు వచ్చి.. 

ఔరా!ఎంత మాట ? .. అవన్నీ..బుజ్జి పండు వల్ల కాదు.. ఆ స్థాయికి..ఇంకా ఎదగలేదు తల్లీ! అంది ..వాడి తల్లి... కానీ తల్లి..నా నెచ్చెలి..  

"ఏమిటి విశేషాలు "అన్నాను.."నువ్వు రావడం లేదు..రక రకాల ప్రకటనలు..పేరడీలు లేక ఏడుస్తున్నాయి.నాకేమో..నవ్వులు పూయక ఏడుస్తున్నాను." అంది. 

నవ్వులు పూయక పోతే ఏమి.. "సంపెంగలు పూస్తున్నాయి,జాజులు పూస్తున్నాయి.. సుమ పరిమళాలు ఆస్వాదిస్తూ..అన్నాను.(నిజం గానే..రమ వాళ్ల తోటలో..రక రకాల చెట్లు.పూలు,కాయలు,ఫలాలు..ఎంత బావుంటుందో.. అలా తోట పెంచాలని నా కోరిక కూడాను) రోజు.... ఇలా రాకూడదూ.. బోర్ కొట్టి చస్తున్నాను అంది.

 నేను వెళితే.. అన్నీ.. "ప'' గుణింతాల తోనే కాలక్షేపం. అంటే.. ప్రకటనలు,పాప,పాట,పుస్తకం, పువ్వులు..ఇవే..ప్రాధాన్యం అన్నమాట. 

టి.వి.లో వచ్చే ప్రకటనలకి..పేరడీలు కట్టి జోక్స్ పేల్చడం,పాటలు పాడుకోవడం (నేను పాడను పాటల పరిచయాలు చెపుతాను అంతే!నేను పాడితే.. వినే వాళ్ల ఖర్మ కి..వాళ్ళు  పడి పోతే.. మల్లిక్ గారి  పరుగో పరుగు కార్టూన్ చూసి నవ్వుకున్న లెవల్లో.. నవ్వడం తో..పాటు లేచి పరుగులు కూడా తీస్తారు అన్నమాట .అందుకే ప్రయోగం కూడా చేయను.) పిల్లలతో..ఆడుకోవడం,పుస్తకాలు గురించి..చర్చించుకోవడం ఉంటుంది.  మా అందరికి బహు  ఇష్టమైన వ్యాపకం అది . ఈ మధ్య వెళ్ళడం లేదు.

"నల్లపూస వై పోయావు.".అంది.. రమ'
"అవును"...అన్నాను.  

మా మాటలు వింటుంటే "బుజ్జి పండు'" గాడికి కోపం వచ్చినట్టు ఉంది.నన్ను పట్టించుకోరు ఏమిటి..అని నా పైకి..ఎగిరెగిరి నమస్కారాలు పెడుతున్నాడు. సరే వాడిని..కాస్త  ప్రేమగా సవరదీసి శాంతింపజేసినాక  వాడిని  ఇంటి లోపలపడేసి టి.వి. ఆన్ చేసి వచ్చింది. చక్కగా టి.వి.కార్యక్రమాలు చూస్తూ  ఉన్నాడు  బుజ్జిపండు.

వాడికి  దణ్ణాలు పెట్టడం బాగా అలవాటు చేసావు. బాగా పెడుతున్నాడు.  కానీ మనం  దణ్ణాలు పెట్టాలంటే భయం వేస్తుందే? అన్నాను. 

ఆహా ..ఎక్కడి కో వెళుతున్నావ్?   చెప్పు చెప్పు అంది.

" ఏం లేదు తల్లీ..! గుడికి వెళితే.. గుడిలో..దేవుడికి..నమస్కారం  ఎలా పెట్టాలో..తెలియని వారికి.. తెలిసిన వారు నమస్కారం పెట్టడం నేర్పిస్తుంటారు. అలా వాడికి కూడా  నువ్వు నేర్పాలి అన్నాను.  

అది కూడా ఉందన్నమాట అంది.

 ఓ.. బేషుగ్గా ఉంది అన్నాను.

నిజంగా.. ఈ కాలం పిల్లలకి.. నమస్కారం ఎలా పెట్టాలో తెలియదు అంటుండగానే.. దీప్తి వచ్చింది.( రమ వాళ్ల  ప్రక్కింటి అమ్మాయి) నిజంగా నే నాకు తెలియదు..ఆంటీ.! ప్లీజ్ . చెప్పరా ? అడిగింది. 

సరే.. నేను వినేవాళ్ళు దొరికారు కదా అని చెప్పడం మొదలెట్టాను. నిజంగా నాకు అంతగా తెలియదు. ఎప్పుడో.."భక్తి' టి.వి లో..ధర్మ సందేహాలు లో.. చెపుతుంటే..విన్నాను. అదే చెప్పడం మొదలెట్టాను. 
మన సమవయస్కులకి..హృదయం ప్రక్కగా చేతులు  ఉంచి  నమస్కారం చెయ్యాలట. ఇక రెండు. మనకన్నా పెద్దవారికి.. గురువులకి..ముఖ మద్యమంకి.. (నాసిక భాగం వద్దకు చేర్చి ) రెండు చేతులు..జోడించి నమస్కారం చేయాలట. ఇక భగవంతునికి అయితే..రెండు చేతులు తల పైకి నిలువుగా పైకి చేర్చి..నమస్కారం చేయాలట. అది కాకుండా సాష్టాంగ నమస్కారం..భగవంతునికి పురుషులు ఎలా చేయాలో..స్త్రీలు ఎలా చేయాలో.. పెద్దలకి..ఎలా పాద నమస్కారం చెయ్యాలో..చెప్పాను.  పనిలో పనిగా.. మా రమ అడిగిన సందేహం ఏమిటంటే..గుడిలో.. పూజారికి.. పాద  నమస్కారం చేయకూదదట కదా అంది. 

అవును..అని అంటారు.ఎందుకంటే .. గుడిలో..మనం భగవంతునికి తప్ప ఎవరికి..నమస్కరించ కూడదు. ..అట. 

ఒకవేళ మనం  కానీ ఎవరైనా కానీ నమస్కరిస్తే.. ఆ నమస్కారం స్వీకరించిన  వారు  "భగవదార్పణం'" అని  అనాలట.అంటే ఈ నమస్కారం భగవంతునికే చెందాలని..చెప్పడం అన్నమాట అని చెప్పాను..దీప్తితో. 

అయ్యా బాబోయ్..ఇన్ని ఉంటాయా ? అంది ఆశ్చర్యంగా.

.అవును మరి..అని .. వీటి అన్నిటికన్నా "హాయ్'" అనేయడం తేలిక కదా అన్నాను.. నవ్వుతూ..  

మరి..ఆ పిల్ల అలానే పలకరిస్తుంది నన్ను. 

అయినా.. ఈ కాలం  పిల్లలకి.. పెద్దవాళ్ళని గౌరవించడం తెలుసా !? అన్నాను.. 

తెలియదు ఆంటీ !మా సిలబస్ లో..లేదుగా అంది అల్లరిగా.. 

నవ్వుకుని.. అవన్నీ.. అక్కడ ఉండవమ్మా.. ఇక్కడ ఉంటాయి  అన్నాను  వాళ్ల ఇల్లు చూపిస్తూ...

ఎవరు నేర్పుతారు.. ?  కౌన్ జాబ్ జాయేంగీ?అంది. 

ఇంకేం..ఆన్సర్ ఉంది..పెద్ద వారి దగ్గర.  కాసేపు మౌనం. ఆ మౌనాన్ని చేధిస్తూ.. రమ.. పిల్టర్ కాఫీ పరిమళం. అవి తాగేస్తూ.. మళ్ళీ..దణ్ణాలు కబుర్లే! 
జగన్ గారు ఆ పెద్దాయన పోయాక పాపం చేతులు దిన్చిందే లేదు. మోచేతి ఎముక అరిగి పోయి ఉంటుంది.అతని  దణ్ణాలు అందుకుని అందుకుని ..రాష్ట్రం  మొత్తం కరిగి కన్నీరు అయిపోయింది కానీ..  ఇటాలియన్ అమ్మ కరగలేదు.  ముఖ్య మంత్రిని చేయలేదు.

మొత్తానికి..  దణ్ణాలు ఆ ఫలించి  కడప జనానీకం ఓట్ల వర్షం కురిపించింట్లు.. ఇంకో మూడేళ్ళ తర్వాత ఆంద్ర ప్రదేశ్ (క్షమించాలి అవిభక్త  ఆంధ్రప్రదేశం అన్న మాట. అది  కాకపోతే సీమ ఆంధ్ర అన్నమాట .నాకైతే ..తెల్లరేటప్పటికి..తెలంగాణా ఇచ్చినా ఆనందమే!) మొత్తం జగన్.. గారికి.. ఓట్ల వర్షం కురిపిస్తే బాగుండును. ఈ మూడేళ్ళలో ఇంకా చాలా దణ్ణాలు పెడతారు కదా..అన్నాను. 

అవును మరి అప్పుడు వీధి వీధిలో ఉన్న వై.ఎస్.ఆర్ గారి విగ్రహాలు ఆనంద భాష్ఫాలు  కారుస్తారు. ఆయన ఆనందం చూసి వరుణుడు కరిగి ఒక్క సీమలోనే విస్తృతంగా  వర్షమై కురిసి .. వై.ఎస్.ఆర్ శంకుస్థాపన చేసి చేసి ఆగిపోయిన ప్రాజెక్ట్లు లు  క్రింద పొలాలకి..నీళ్ళు అయినా సంవృద్ది గా ఇస్తాడు.. అన్నాను. .. 
ఇంకా చెప్పాలంటే ఇంటి ఇంటిలోనూ  దేవుడి పొటోలు ప్రక్కనే..ఉంచి పూజలందుకుంటున్న వై.ఎస్.ఆర్.. కొడుకు పెట్టిన పార్టీకి ఓట్లు వేసిన వారిని.. మతాల బేధం లేకుండా.. ఆయన దేవుడితో చెప్పి..దీవెనలు ఇప్పిస్తాడు అన్నాను. 

అమ్మో..దణ్ణాలు కి ఇంత కథ ఉందా? నేను మా బుజ్జి పండు గాడికి..చాలా రకాల దణ్ణాలు నేర్పాలి..అంది.రమ.  

నేర్పితే నేర్పావు కానీ..నువ్వు మర్యాదగా వేసి కూర్చోపెట్టిన  కుర్చీ క్రింద జేరి.. నాకు  దణ్ణాలు పెట్టినట్లు పెట్టి  కుర్చీ..లాగేయమని చెప్పక .. అసలే.. నడుం నొప్పి.. పోద్దస్తమాను..సిస్టం ముందు కూర్చుని.అన్నాను. 

అయితే..మా మీద శీతకన్ను వేసింది ఇందుకన్న మాట..అంది రహస్యం కనిపెట్టి... మరి? అన్నాను. ఇంతలో.. ఇంటి నుండి పోన్.. దాని పీక నొక్కో..నొక్కకుండా  లేదా..ఇంట్లోనే   పెట్టి రాకూడదూ.. అంది. అప్పుడే  వెళతానంటే కల్గిన ..బాధనంతా.. ముఖం లో .. ప్రకటిస్తూ.. .. 

అరగంటే.. అని చెప్పి వచ్చాను.. ఇక నన్ను ఒదిలేయి  తల్లి.. నీకు ..  వేయి దణ్ణాలు  పెడతాను.. అన్నాను. 

ఇప్పుడు వదిలేస్తున్నాను. ఈ సారి నాలుగురెట్లు..సమయమన్నా ఉండాలని.. వేయి దణ్ణాలు  తో.. వేడుకుంటున్నాను..అంది..నాటకీయంగా.. 

తధాస్తూ  ..అన్నాను..అభయ హస్తం చూపిస్తూ.. నమ్మిందో లేదో..కానీ.. కానీ..నన్ను వదిలింది.. కాసిని పూలని కానుకగా ఇస్తూ.. ఇలా నా సాయంత్రం గడిచిపోయింది.

దణ్ణాలు ...తల్లీ..! ఈ  దణ్ణాలు గోల ఏమిటి? మమ్మల్ని ఒదులు.. అంటారా.. ? 

మీకు..నా బ్లాగ్ దర్శించినందులకు  దణ్ణాలండి.  "దండం దశ గుణ భవేత్" అని తప్పులుంటే మన్నించండి...దండించండి ..కూడా.. అని కోరుకుంటూ..  

ఈ... దణ్ణాలు.. మాత్రం టైపు చేయలేక తెగ ఇబ్బంది పడ్డానండి. మరి అంత తేలికా ఏమిటీ.. దణ్ణాలు  పెట్టడం అంటే అనకండి. వచ్చిన వారు.. మెచ్చేవారు.కాస్త ..నవ్వుకోండి.. ఏదో..సరదాగా... సరదాగా కాసేపు ..అంతే.!