సామాజికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సామాజికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఏప్రిల్ 2026, ఆదివారం

ప్రేమ శాపం కూడా!

 ప్రేమ శాపం కూడా! 

అతి ప్రేమ నీకు శాపం లాంటిది అవుతుంది 

జాగ్రత్త !!

ప్రేమ లోని భక్తి కూడా తాను ప్రేమించే దాన్ని 

నాశనం చేయగలదు, జాగ్రత్త !! 

మితిమీరిన ప్రేమ కూడా..

నీలాగా శాశ్వతం కాదు, జాగ్రత్త!!

అతి ప్రేమ బరువు కింద.. 

నువ్వు నలిగి పోగలవు,  జాగ్రత్త!!

గబ్బిలంలా జ్ఞాపకాలను పట్టుకుని 

వేలాడే రాత్రుళ్ళు నీకు చిరునామా కాగలవు జాగ్రత్త!!

వాన కురిసినట్టు ప్రేమ కురిసి 

మాయమైపోతుంది. జాగ్రత్త!!

డోలాయమానంలో  సాలెగూడు వల లోకి

గుడ్డిగా  ప్రవేశించకు జాగ్రత్త!!

నీదిగా భ్రమించే ప్రేమ అక్షరాల ఇంద్రజాలం. 

అది తుడిచి పెట్టుకుపోతుంది జాగ్రత్త.!!

వందల మైళ్ల దూరం నుంచి మనసు

మనసుతో మాట్లాడుతుంది అనుకుంటావ్

అదంతా మాంత్రిక గారడీ. జాగ్రత్త!! 

నీ అర్ధం లేని అనుమానాలతో ఇతరులను

ద్వేషిస్తూ ముఖం చాటు చేసుకోకు.జాగ్రత్త!!

నువ్వు ఇతరులను ప్రేమించే ముందు..

నీ హృదయంలో ఎవరున్నారో చూసుకో, జాగ్రత్త!!

నువ్వు ప్రేమించే వారి హృదయంలో .. 

ఎవరున్నారో అంజనం వేసి చూడకు, జాగ్రత్త!! 

వీటన్నింటికి విరుగుడు మందు..

చంచలమైన నీమనసుకు తాళం వేయి జాగ్రత్త!! 


నిన్ను నీవు ప్రేమించుకోవడమే శాప విమోచనం.

జాగ్రత్త .. జాగ్రత్త.. జాగ్రత్త. 

 

(Insta  ప్రేమల్లో మునిగి ఒక యువతి ఆత్మహత్య ప్రయత్నం చేసింది.అబ్బాయి పై కేస్. ఏమి ఎరుగని ఇంకొక అమ్మాయి. ముగ్గురూ అవివాహితులే)




29, మార్చి 2026, ఆదివారం

రానిక చెలీ నీ కోసం

  

రానిక చెలీ.. నీ కోసం


చెరువుగట్టు గంగానమ్మ గుడి

సంచారం లేని ప్రదేశం. 

ఆలస్యంగా ఉదయపు నడకకు వెళ్ళాను. 

జిలుగు వెలుగుల చీర కట్టుకుని వున్న పల్లెటూరి స్త్రీ ఫోన్ లో గట్టిగా మాట్లాడుతుంది. 

వినాలని లేకపోయినా చెవులకు రబ్బర్ హారన్ లా తాకుతున్నాయి. 

ఎవరినో నోరు పట్టని అశ్లీల భాష లో కత్తితో మాంసం కండలను  నరికినట్టు నరుకుతూ దుమ్మెత్తి పోస్తూ…కాని బంధం ఆచూకీని పట్టి ఇచ్చింది. 

ఆవేశాన్ని దాచుకుని కన్నీళ్ళతో ఇంకెవరికో ఫోన్ చేసింది. 

“బయటకు వస్తావా అని అడిగాడు. చీకటితో వచ్చాను. ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా రాలేదు. పిల్లలు నిద్రలేచి ఆకలికి అమ్మను వెతుక్కుంటూ వుంటారు. వాళ్ళకి ఓ ఇరవైరూపాయలకు ఇడ్లీ తెచ్చి ఇస్తావా? నేను వచ్చేస్తున్నాలే”  అంటుంది పిచ్చి తల్లి.


జాలిగా ఆమె వైపు చూసాను. “గుండెను బతికించే పిడికెడంత ప్రేమ మరుగు ప్రదేశాల్లో

ఉండదమ్మా, బహిరంగంగా వెతుక్కో! లోకానికి ఝడిసి ప్రమాదం అంచుల్లోకి వెళ్ళకు. 

ఈ చెరువులో చచ్చిన చేపల్లా పైకి తేలతావ్. జాగ్రత్త!!” అని చెప్పాలనుకుని ఆగిపోయాను. 

నా ఏడుపు గొట్టు పాటల టేస్ట్.. పొదికలో.. నుండి.. 


రానిక చెలీ నీ కోసం, రాదిక వసంత మాసం.. అని పాడటం మొదలు పెట్టింది. 


నేను పాట ఆపదల్చుకోలేదు. కొబ్బరి చెట్లు నీడన వేసి వున్న సిమెంటు బెంచీ పై కూర్చున్నాను. ఆమె కూడా బెంచీకి ఆ చివర కూర్చుని..  పాట శ్రద్ధగా విని కళ్ళు తుడుచుకుంటూ ఊర్లోకి దారి తీసింది. 


నేను ఆలోచిస్తూ కూర్చుని వుండిపోయాను.  రోజంతా గడుస్తున్నా ఆమెను మనసులో నుండి తీసేయలేకపోతున్నాను. 

హ్మ్.. 



30, జనవరి 2026, శుక్రవారం

మాట విలువ

 


ఇలా నిండా పూచిన మామిడి చెట్టును చూడగానే… “మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే! మాటలు రాని మూగ మనసు పాడెనులే” అనే పాట అప్రయత్నంగా గుర్తుకొస్తుంది. 

లోకంలో సుందరమైన విషయాలు చాలా వున్నాయి. 

అందులో నిజాయితీ గా నిరాడంబరంగా పలికే మాటలు కూడా ఒకటి. ఆ మాటలు పక్షుల పాటల వలె హృదయం నుండి దుముకుతాయి. ఆ మాటల్లో అర్థం కాని క్లిష్టత గాయ పరిచే వాడితనం వుండకూడదు. మాట సొబగులు అద్దుకున్నంత మాత్రాన అందంగా వుండదు. మన పెదవుల నుండి మన భావనల నుండి వెలువడే మాట, రాసే విషయం వివేకంతో నియంత్రించబడాలి. అప్పుడే ఆ మాటలను పలికే పెదవులు, రాసే వ్రాతలు అందంగా అనిపిస్తాయి. 

మాటలు వచ్చినంత మాత్రాన సరికాదు. ఆ మాటకు మృదుత్వం ముఖ్యం. మనం వేటగాళ్ళం కాదు. ఎప్పుడూ మాట అనే  బాణాలతో  ఇతరులను గాయపరచడానికి. 

గాయబడితే మనుషులు దూరంగా జరుగుతారు. నటించడం వేరు స్వభావం వేరు. రెండింటిని ఎదుటివారు గుర్తించగలరు. 

నా దృష్టిలో అందమైన పెదవులు అంటే సదా చిరునవ్వులు చిందించే లిప్ స్టిక్ వేసుకున్న పెదవులు కాదు. అందంగా వుండి ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడే పెదవులు కాదు. హృదయపూర్వకంగా మాట్లాడే మాటలు, మాటలో మృదుత్వం ధ్వనించే మాటలు, ఉచ్చరించే పెదవులు. 

మాటలు రావడమే యోగ్యతా కాదు. బాగా రాయగలమని విర్రవీగడం యోగ్యతా కాదు. 

ప్రకటనాశక్తి ఒక యోగం. అది అందరికీ సంప్రాప్తించదు. దానిని సరైనరీతిలో ప్రదర్శించడం మర్చిపోవద్దు. 

శుభోదయం మిత్రులారా!

28, జనవరి 2026, బుధవారం

Don’t Shoot a message

 Don’t Shoot me a message.. 


బాధాకరమైనప్పటికీ ఇది నిజం

విషయం నొప్పి కలిగించేది అయినప్పటికీ 

నిజం ఇదే! 

అవును , నువ్వు నాకు ప్రియమైన వ్యక్తి వే! 

కానీ ఎక్కడ నిలుచుండి పోవాలో కూడా 

నాకు బాగా తెలుసు.

నా స్థానం, నా పరిమితులు, నేను దాటకూడని 

హద్దులు యేమిటో కూడా నాకు తెలుసు.

అందుకే నేను నిన్ను వెంబడించను,

నా భావాలతో నిన్ను ఇబ్బంది పెట్టను, 

నీపై నన్ను గురించిన ఆలోచనా భారం మోపను.

కేవలం దూరం నుండి చూస్తూ నిశ్శబ్దంగా  ఆరాధిస్తాను.

బహుశా ఏదో ఒక రోజు ఈ భావాలు 

మసకబారిపోవచ్చు, పోకపోవచ్చు కూడా!

కానీ ప్రస్తుతానికి… 

ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా 

నా హృదయాన్ని భావాలను అనుభూతి 

చెందడానికి అనుమతిస్తాను

బాధాకరమైనది అయినప్పటికీ ఇది నిజం. .



7, జనవరి 2026, బుధవారం

సాయం సేయంగా..






సాయం సేయంగా..  - వనజ తాతినేని


వెలుగు రేకలు తో పాటు ఇంటికి వచ్చిన

భర్తని చూసి భార్య ముఖం తెరిపిన పడింది. 

ఏడికి పోయావ్ చెప్పా పెట్టకుండా..

ఆ ఏడిసేదేదో ఇద్దరం కలిసి ఏడుద్దాం గా..

పేణం యెంత తన్నుకలాడిందో..

ఎన్ని కీడు ఆలోచనలు యెత్తుకున్నాయో

కోపం ఏడుపూ కలగలిసిన గొంతు వణుకుతుంది 


********

నీకో కథ చెబుతా.. రా కూచో.. 

ఒడిని చూపి చేతులు సాచినాడతను

ఆమె పసిపిల్లలా మారింది. 

ఆమె జత్తులో వేళ్ళు కదుపుతూ.... కథలోకి దారులు వేసాడతను 


*********

ఆ.. నిర్మానుష్య రాత్రిలో 

వీధి దీపం ఖాళీ బెంచీ రెండూ

నన్ను పిలిచాయ్. . 

రా! కాసేపు వచ్చి కూర్చో! 

ఏ ఊరూ, ఇంత పొద్దు పోయిందాక

ఎందుకు తిరుగుతున్నావు అని

ప్రశ్నలు అడగనులే!

మనసున్న మనిషి వొకడు ప్రతి రోజూ

మంచినీటి సీసా రెండు బిస్కెట్ పేకెట్లు వుంచి వెళతాడు.

కాస్త పానీయం పుచ్చుకుంటావా?

పిమ్మట కొంచెం ఎంగిలి పడు. 

అలసిపోయినట్లు కనబడుతున్నావు

రవంత విశ్రమించు. 

కునుకు పడితే కలతలన్నీ మర్చిపోతావు

అని 


*********


లేచావా! బలిసిన దోమలను తరుముదామంటే

చలికి మరింత వణికి ముడుచుకు పోతావని ఆగాను. 

వెలుతురు వచ్చాక నువ్వే దారి పడతావులే!

అలిగి వచ్చిన నీకు అమ్మ నాన్న వుండే వుంటారు.

బ్రతుకు ఈడ్వలేక నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్న నీకు

భార్యాబిడ్డలూ వుండే వుంటారు.

అమ్మా! నాన్న ఏడి? అని బిడ్డలు అడుగుతారు

ఇల్లాలు ఆందోళన చెందిన మనసుతో 

కన్నీరు ఊరే కళ్ళతో రహదారిని వెతుక్కుంటూ వుంటుంది.

ఇంటికి వెళ్ళు.. నాయనా! 

వలస బతుకులు సంచారుల బతుకులు ఇంతే!

తాత్కాలికంగా వేసుకున్న నీ గుడిసె ముందు 

రాత్రి వేసిన రంగుల ముగ్గులు నీకు స్వాగతం పలుకుతాయి

పగలంతా బతుకు యుద్దం చేసినా

రాత్రి వచ్చే రంగుల కలలకు ఈ రంగవల్లులు ఉద్దీపన.

కడుపు చూసే అమ్మ  గుండె పంచే ఆలి

దైర్యమిచ్చే నాన్న  బతుకుపై తీపి ఆశ కల్గించే బిడ్డలనూ

వదలకుబోకు నాయనా! 

ఒంటరితనం శిక్ష వేసుకోకు. 

వస్తువులు కూడా తోడు వెతుక్కుంటాయి. 

చెట్లు కూడా వేళ్ళతో ఆత్మీయంగా అల్లుకుంటాయి. 

వెళ్ళు… ఇంటికి వెళ్ళు! అని మెత్తంగా మందలించాయి. 


*********

పార్కులో మనుషులు మాయమయ్యాక..

అతనొక్కడే లోపలికి వెళ్లాడు. 

నీటి సీసా, రెండు బిస్కెట్ పాకెట్లు వున్న  సంచీని

అక్కడ తగిలించి .. బెంచీకీ వీధి దీపానికి నమస్కరించి

ఇంటి దారి పట్టాడు. 

(విదేశాల్లో నానా అవస్థలు పడుతున్న H1b యువ కుటుంబాల యాతనలకు సహానుభూతిగా 💦💦)

©️Vanaja Tatineni


 



07/01/2026 06:00 am


 



10, సెప్టెంబర్ 2025, బుధవారం

5 M లు గురించి తెలిస్తే చాలు.. నల్లేరు బండిపై నడక.

  


మనిషి జీవితం  బాగుండాలంటే 5 m ల గురించి కచ్చితంగా తెలిసివుండాలి. 


 Mouth : నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. నోరు అదుపులో లేకుంటే వీపు దెబ్బలు తినాల్సి వస్తుంది అనికూడా  అంటారు కదా! మాటలతో కోటలు కట్టవచ్చు. హృదయాలను కూడా గెలవవచ్చు. సందర్భోచితమైన మాట మనిషికి ప్లస్ అవుతుంది. నేను నిజాలే మాట్లాడతాను, మంచే మాట్లాడతాను,  కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతాను అని అనకూడదు అధికార స్వరం ఝళిపించకూడదు. సత్యం కూడా ప్రియంగా మాట్లాడాలి. విమర్శ కూడా సున్నితంగా  వుండాలి. చెడు విషయం కూడా నిదానంగానే చెప్పాలి. పరుషమైన మాట విషం. సున్నితమైన మాట పువ్వులాంటిది. పూలచెండు కొడితే ఊరుకుంటారేమో కానీ ముళ్ల తీగతో కొడితే ఊరుకుంటారా? 

 

Mind: మన ఆలోచనే మన భవిష్యత్ బలం కూడా అవుతుంది.  ఎప్పుడూ సక్రమమైన ఆలోచనలు చేయాలి. ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ తో వుండాలి. నెగిటివ్ థింకింగ్ వల్ల వ్యతిరేక ఫలితాలు ఎదురవుతాయి. నలుగురితో కలవలేరు. మాట్లాడలేరు. మనకన్నా ఉన్నతస్థాయిలో వున్న వారితో పోల్చుకుని మనల్ని మనం బలహీనం చేసుకోకూడదు.  మన మైండ్ కి అద్దం లాంటిది ముఖం. ఆ ముఖమే చెబుతుంది అంట.. అసలు మనం ఎలా వున్నామో!   ప్రతి రోజు మన ఆలోచనలు ప్రక్షాళనం చేసుకోవాలి. నిన్నటి అనుభవాలు నుండి పాఠం నేర్చుకుని  చేదు అనుభవాలను తుడిచి పెట్టేసి నిత్య నూతనంగా రోజు   ప్రారంభించు కోవాలి.  ఒక్కటి గుర్తుంచుకోండి. మన మెదడు కుడితి తొట్టి కాదు. 

 

Moods: బావోద్వేగాలు. మనం  కోపం  ఆవేశం లాంటివి అదుపులో వుంచుకోవాలి. మితిమీరిన బావోద్వేగాలు మనిషి వివేకాన్ని విచక్షణను కోల్ఫోయేటట్లు చేస్తాయి. స్వతహాగా చీమకు కూడా హాని చేయని వ్యక్తులు కట్టలు తెంచుకున్న కోపంలో ఆవేశంలో హత్యలు చేసారని వినడం జరుగుతుంది.

మూడ్స్ బావుంటేనే సరైన నిద్ర పడుతుంది. మానసిక వ్యాధుల బారిన పడకుండా వుంటారు. గుర్తుంచుకోండి..తరచూ moods swing అయ్యే వారు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. 

 

 Manner: నీ దగ్గర లక్షలు కోట్ల కొలదీ డబ్బు వుండవచ్చు. కానీ నీకు సాటి మనుషులను గౌరవించడం మర్యాద తెలియకపోతే నువ్వు జీరో లెక్క. పెద్దలు గురువుల యెడల గౌరవభావం బలహీనుల పట్ల  దయ, జాలి మూగజీవాలు పట్ల కరుణ కలిగివుండటం బాధితుల పట్ల సానుభూతి కలిగి వుండటం ముఖ్యం. మర్యాదా పురుషోత్తమ లక్షణాలు ఇవే!  ఇవి పెద్దల ద్వారా పిల్లలకు సంక్రమిస్తాయి.


Money;  ధనం మూలం ఇదం జగత్.  డబ్బు వ్యవహారంలో మనిషి చాలా జాగ్రత్తగా వుండాలి. ఇచ్చిపుచ్చుకోవడం అవసరమే కానీ … డబ్బు ఇచ్చేటప్పుడు వున్న స్నేహాలు. బంధుత్వాలు తిరిగి పుచ్చుకునేటప్పుడు వుండవు. రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావు!? అంటే రక్తం పంచుకుపుట్టిన వాళ్ళను శత్రువులుగా మారుస్తాను, స్నేహితులను దూరం చేస్తాను అన్నదట. మితిమీరిన ఖర్చు కూడదు. మితిమీరిన నమ్మకంతో అనువుకాని చోట పెట్టుబడి పెట్టడం.. కూడా మంచిది కాదు. డబ్బు లేనప్పుడు నీ విలువ ముప్పాతిక శాతం తగ్గుతుంది. డబ్బు వుంటే నీలో వున్న పది వంకలను కప్పెడుతుంది. 


ఇవి పాటించగల్గితే మనిషి జీవితాన్ని సానుకూలంగా మార్చుకోవచ్చు.  

10, అక్టోబర్ 2024, గురువారం

సంతృప్తి జీవితానికి ముడి సరుకు

 


కొందరు తమకు ఉన్నదాంతో లభించిన వాటితో సంతృప్తి పడరు. నిత్యజీవీతావసరాలకు సరిపడ సంపాదిస్తున్నప్పుడు దానిని ఎలా ఖర్చు పెట్టాలో ఏం చేయాలో ఏం చేయకూడదో అనే ప్లానింగ్ లేకుండా నడుచుకోవడం వల్ల నిద్ర లేవగానే .. ప్రతిరోజూ రూపాయి కోసం వెతుక్కోవడమే! సంపాదనలో కొంత భాగం కొత్త వ్యాపారాలకు పెట్టుబడి పెట్టడం.. అందులో విజయవంతం కాకపోతే నిరాశలో కృంగిపోవడం. పెద్ద పెద్ద లక్ష్యాలు వున్నప్పుడు ఓపిక అవసరం. డబ్బులు లేక ఓపిక సహనం లేక ఎవరినో వొకరిని నిందించడం “నువ్వు అప్పుడు అలా చేసావు కాబట్టే నేనిలా వున్నాను” అనడం అనుకోవడం ఇతరులను blame చేయడం మంచి పద్దతి కాదు. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం నిర్లక్ష్యం అతి విశ్వాసం తో పాటు పరిస్ధితులు సహకరించకపోవడం వుంటుంది. వాటిని తట్టుకోగల్గే సామర్ధ్యం లేనప్పుడు.. జీవితంతో ప్రయోగం చేయకూడదు. ఉన్నవాటితో లభించినదానితో 

ప్లానింగ్ చేసుకుని సౌకర్యంగా బతకడం అలవాటు చేసుకోవాలి. 

రెండు నిమిషాలు తల్లిదండ్రులు చెప్పే అనుభవపూర్వకమైన మాటలు సలహాలు వినిపించుకోని వాళ్ళు…. ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళతో గంటలు తరబడి మాటలతో కాలాన్ని వృధా చేస్తారు. 

కొందరు మెగుడూ పెళ్ళాం బాగానే వుంటారు ఒకరు గీచిన గీత మరొకరు దాటకుండా. మధ్యలో వెర్రివాళ్ళు కన్న తల్లిదండ్రులు. వారిని తమ జీవితాల్లో వచ్చే ప్రతి సమస్య కి కారకులను చేయడం పరిపాటి అయిపోతుంది. 

జన్మ ఇచ్చినందుకు ఇప్పటిదాకా ఎన్నో ఇచ్చి ఖాళీ అయిపోయి  రిక్త హస్తాలతో నిలబడి ఇంకా ఏమి ఇవ్వాలో అర్దం కాని నిస్సహాయతలో..  కన్నీరు కార్చే తల్లిదండ్రులున్న లోకం ఇది. 

మనిషి అంటే అనంతమైన కోర్కెలు కాదు. విఫలమైన ఆశలు అపజయాలు నిరాశ నిసృహలు కూడా! అన్నీ కలిపితే జీవితం. 

నెలవారీ సంపాదనలో నుండి కుటుంబ అవసరాలు తీరకముందే వాటిని వాయిదా వేసి ఆ డబ్బుతో బిట్ కాయిన్స్ కొనేవాడు షేర్ మార్కెట్  లో  పెట్టుబడి పెట్టేవాడు లాటరీ టికెట్ కొనేవాడు వొకటే నా దృష్టిలో.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అప్పు చేయాలనే మాట మరిచి.. లగ్జరీ గా బతకడానికి అప్పు చేసేవాళ్ళకు జీవితంలో సుఖం శాంతి రెండూ శూన్యం..

ఆఖరిగా చెప్పొచ్చే మాట.. 

తల్లిదండ్రులు... తమ జీవితకాలం పెట్టుకునే భ్రమలు పిల్లలు.  physically mentally emotionally... అయినా తల్లిదండ్రులకు బుద్ధి రాదు. బిడ్డలకు మనసూ వుండదు. తొక్కేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే! అయినా వాళ్ళకు శాంతి సంతృప్తి వుండదు. 

సంతృప్తి జీవితానికి ముడి సరుకు. 

15, సెప్టెంబర్ 2024, ఆదివారం

వ్యవసాయం వొక్కటే కాదు

 Back to roots.. 

143 కోట్ల భారతదేశం.. ప్రపంచ దేశాలకు పెద్ద మార్కెట్ వనరు. కానీ మన దేశం యువత పని నైపుణ్యం పెంపొందించుకోలేక కొత్త సవాళ్ళను ఎదుర్కోలేక ప్రభుత్వ సబ్సిడీలు ప్రోత్సాహకాలు అందక.. ఉద్యోగ భద్రత లేక విదేశాలకు వున్నత చదువుల పేరిట ఉద్యోగ అవకాశాలు పేరిట విమానాలు ఎక్కుతున్నారు. 

లక్షల మంది విద్యార్థులు బిలియన్ డాలర్స్ ఫీజులు చెల్లించి విదేశీ యూనివర్సిటీ లను ఆర్ధికంగా ఆదుకుంటున్నాయి. కంపెనీలు నష్టాల్లో నడుస్తూ ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తుంది. కొత్త ఉద్యోగాలు లేవు వున్నా ఏడెనిమిదేళ్ళ అనుభవం తప్పనిసరి. ఇప్పుడు వెళ్ళిన లక్షలమంది విద్యార్దుల్లో 90% మందికి OPT లో జాబ్ దొరకడం కష్టం. H1b వచ్చినా జాబ్ రావడం కష్టం. OPT అయిపోతుంటే CPT లోకి మారతారు. మళ్ళీ ఫీజులు మోత. నాలుగైదు ఏళ్ళ నుండి USA వెళ్ళిన విద్యార్దుల్లో ఐదేళ్ళు పూర్తైనాక సగం పైగా మంది తిరిగి వచ్చేస్తారు. 

పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా.. అక్కడే చూరును పట్టుకుని వేలాడేవాళ్ళ గురించి చెప్పలేం. కానీ కొద్ది సంవత్సరాల్లో  లక్షలమంది తిరిగి వస్తారు. అది నిజం. 

రానున్న కాలం అంతా పుడ్ ఇండ్రస్ట్రీ దే! ఎందుకంటే పెరిగే జనాభాకి మారుతున్న వాతావరణ పరిస్తితులకు అనుగుణంగా ఆహార ఉత్పత్తుల ఎగుమతి కి ప్రధాన కేంద్రం భారతదేశం కావచ్చు. 

టెక్నాలజీ మనిషి పని ని సులభతరం చేస్తుందేమో మిగతా గ్రహాల మీద ఇళ్ళు కూడా కట్టిస్తుందేమో కానీ.. మనిషి పొట్ట నింపలేదు. గుప్పెడు గింజలు పండించలేదు. వ్యవసాయ ఆధారిత రంగాలకు సమశీతోష్ణ మండలమైన మన దేశం పెద్ద పీట వేసుకునే మార్గాలు బోలెడు. యువత ఆ వైపు దృష్టి సారించితే చాలా మంచిది. 

ఉదాహరణకు విదేశాల్లో రెస్టారెంట్ లో పని చేయడం కన్నా మన దేశంలో house cleaning డాట్ కామ్ పెట్టుకుని పదిమందికి పని చూపించవచ్చు. బాగా బతకవచ్చు. ఆ పనికి బోలెడు డిమాండ్ కూడా. 

ఇలా బోలెడు మార్గాలు. వెతుక్కోవాలి. 

ఏం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రా బాబూ.. పాతిక ఎకరాల పొలం మంచి ఇల్లు కోట్ల లో డబ్బు వుండి కూడా 33 ఏళ్ళు వచ్చినా పెళ్ళి కాకుండా తల్లిదండ్రుల అతి గతి పట్టించుకోకుండా.. ఇండియా వస్తే ఉద్యోగం పోద్ది ఏమో అనుకుంటూ వున్న వలసజీవుల కోసం brain drain ల కోసం, అక్కడ చాలీ చాలనీ జీతాలతో క్రెడిట్ కార్డ్ అప్పులతో hypocrisy తో బతుకుతున్న NRI ల కోసం బాధపడుతున్నాను. వారి కోసం రాజు-వెట్టి కథ రాసాను. 

బతకడానికి.. అనేక అవకాశాలు. డాలర్ కలలు కల్లలు ఇకపై. 

విదేశాలనుండి తిరిగి వచ్చిన అందరూ… వ్యవసాయం చేస్తారని చేయమని కాదు, అనేక వృత్తులు వున్నాయి. మనను చూసి ఇంకో పదిమంది అదే రంగంలోకి వచ్చినా సరే.. అవకాశాలు వుండనే వుంటాయి. పని ని గౌరవించే సంస్కృతి రావాలి మన దేశంలో. పక్క వాళ్ళతో పోల్చుకోవడం మానేసి పోటీ పడాలి. సాప్ట్వేర్ ఉద్యోగాల్లో నిత్యం కొత్త కోర్సులు నేర్చుకుంటూ అప్ డేట్ అవడం లేదూ… అలాగే! 

వ్యవసాయంలో హైబ్రిడ్ వల్ల రసాయనిక ఎరువులు గుమ్మరించడం వల్ల  మితిమీరిన పురుగుమందు వాడకం వల్లా జరిగిన జరిగే నష్టం ఇంతా అంతా కాదు. ఆధునిక వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం చేయకపోతే భూమి పనికి రాదు. మనుషులు మాయం అయిపోతారు. ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. మిద్దె తోటల ఉద్యమం ఈ basics మీదనే సక్సెస్ అవుతుంది. మీ ఆహారం మీరే పండించుకోండి అన్నది విలువైన concept. 

నేను కథలో చెప్పినది వ్యక్తి కేంద్రకం. అది సమిష్టి గా మారినప్పుడు ఫలితాలు ఎక్కువగా వుంటాయి. కథ కాకుంటే నవల లో అయితే ఇంకా విపులంగా చర్చ నడిచి వుండేదేమో! చూద్దాం… నవల రాస్తానేమో! 

వ్యవసాయానికి మంచి రోజులు రావాలి. వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు రావాలి. YouTube లో 

Gunapati’s Channel వుంటుంది చూడండి.. గ్రామీణ ప్రాంతం యువ జనుల స్యయంకృషిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పరిచయం చేస్తుంది ఆ చానల్. 




2, సెప్టెంబర్ 2024, సోమవారం

విజయవాడ వరద కు కారణం

 


ఎక్కడో ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దులలో కొండప్రాంతలలో పుట్టిన బుడమేరు..

A.కొండూరు,మైలవరం,జి.కొండూరు మండలాల గుండా విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలోకి ప్రవహిస్తుంది..

బుడమేరుకి రెడ్డిగూడెం నుండి కోతుల వాగు,జి.కొండూరు మండల గంగినేని నుండి పులివాగు,(మా ఇంటి పక్క నుండి వెళ్ళుతుంది)మునగపాడు(మా గ్రామం)నుండి బీమ్ వాగు,CH మాధవరం నుండి లోయవాగు,గడ్డమణుగు లోయప్రాంతం నుండి దొర్లింతలవాగు ఉపవాగులుగా ఉన్నాయి..


సరిగ్గా 20ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది. 20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో దానికి మూల్యం నేడు చెల్లించుకుంటున్నారు. 20ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. ముఖ్యంగా 2019 నుండి జగన్ పాలనలో వైకాపా నాయకుల కబ్జాకి బలైంది బుడమేరు..అసలు బుడమేరుతో విజయవాడ మునకకు ముఖ్య కారణం YS రాజశేఖర్ రెడ్డి..


విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానదికంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది.2005లో చివరి సారి బుడమేరు బెజవాడ పుట్టిముంచింది. 2005సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపుకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్‌ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువున ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది.


ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్‌లో గరిష్టంగా 11వేల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70వేల క్యూసెక్కులకు చేరింది. బుడమేరు ప్రవాహాన్నినియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్‌ను కూడా 70వ దశకంలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్‌ మీదుగా నగరంలోకి ఇది ప్రవేశిస్తోంది.


2005లో వచ్చిన వరదలకు కారణాలను వివరిస్తూ దేవినేని ఉమామహేశ్వరరావు గారు,సీపీఐ అనుబంధ రైతు సంఘం నాయకుడు కొల్లి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం చూపకపోతే కృష్ణా జిల్లాకు ఎప్పటికీ ముంపు పొంచి ఉంటుందని ఆందోళనకు దిగడంతో ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి స్వయంగా విజయవాడ వచ్చారు. విజయవాడలో ఉన్న వరద పరిస్థితి మొత్తాన్ని ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. బుడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే దానిని మళ్లించడం ఒక్కటే మార్గమని భావించారు.

పోలవరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలో కలిపే డిజైన్ అప్పటికే ఖరారైంది. బుడమేరు ప్రవాహానికి దిగువన పోలవరం కుడికాల్వ కృష్ణానదిలో గుర్తించి అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని అధికారులకు నాటి సీఎం వైఎస్సార్‌ సూచించారు. విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరి చేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూస్తామని, వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్నకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


పోలవరం కుడి కాల్వ నిర్మాణంలో భాగంగా 2007-08 నాటికి బుడమేరు దిగువ ప్రవాహాన్ని కుడి కాల్వలోకి మళ్లించారు. కొత్తగా మరో కాల్వను తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌ నుంచి వచ్చే జలాలను కృష్ణా నదిలో కలిపే కాల్వలోకి మళ్ళించారు.ఇక్కడే సాంకేతికంగా ఓ సమస్య తలెత్తింది. పోలవరం కుడి కాల్వను గరిష్టంగా 37,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు.


విటిపిఎస్‌ మీదుగా ప్రవహించే కాల్వలకు అంత సామర్థ్యం లేదు. వాటిని వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలని ప్రతిపాదనలు ఉన్నా, థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ లోపల కాల్వలను విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వల సామర్థ్యం పెరగలేదనే వాదన ఉంది. దీనికి తోడు కృష్ణానది ముఖ ద్వారంలో ఉన్న నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.


విటిపిఎస్‌ నుంచి కృష్ణా నదిలోకి బుడమేరు వరద నీరు చేరాలంటే కృష్ణానదిలో నీటి మట్టం తగిన స్థాయిలోఉండాలి. కృష్ణా నదిలో ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు. అదే సమయంలో పోలవరం కుడి కాల్వ నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగువన విజయవాడ వైపే వెళ్లాల్సి ఉంటుంది.


20ఏళ్ల నిర్లక్ష్యానికి మూల్యం....

20ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో విజయవాడ నగరంలో న్యూ రాజరాజేశ్వరి పేట, సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. రోజుల తరబడి ప్రజలు వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. బుడమేరుకు వెలగలేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడకు వరద ముంపు తప్పిపోయింది.


2008 నుంచి విజయవాడ రూరల్‌ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో మరో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్‌టెన్షన్‌, నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి. అంతకు ముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతమనే సంగతిని పూర్తిగా విస్మరించారు.


2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కిన సంగతి కూడా ప్రజా ప్రతినిధులు విస్మరించారు. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని రాజకీయ నాయకులు యథేచ్ఛగా ధ్వంసం చేశారు. కాలనీలకు కాలనీలను విస్తరించి నివాస ప్రాంతాలను విస్తరించడంలో 2009 నుంచి విజయవాడలో ఎన్నికైన ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్,వైసీపీలకు ఇందులో ఎక్కువ భాగస్వామ్యం ఉంది.

బుడమేరు ఉగ్రరూపం దాల్చినపుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలు చోట్ల మలుపులు ఏర్పడ్డాయి. రెండు, మూడు దశాబ్దాల క్రితం నాలుగైదేళ్ల క్రితం బుడమేరుకు వరదలు వచ్చినా పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి. బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊళ్లను ముంచెత్తుతున్నాయని, విజయవాడ, నిడమానూరు ప్రాంతాల్లో ఉన్న “యూ ” టర్నింగ్‌లను సవరించాలని 20ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది.


బుడమేరును ఆక్రమణల నుంచి విడిపించి దాని గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలని ప్రతిపాదించారు. విజయవాడ మార్కు రాజకీయం ఆ పనుల్ని అడ్డుకుంది. ఇళ్లను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరించడంతో ప్రభుత్వం కూడా వదిలేసింది. ఇదే అదనుగా బుడమేరును యథేచ్ఛగా ఆక్రమించేశారు. ఇక విటిపిఎస్‌ నుంచి ప్రవహించే వరద ప్రవాహ మార్గంలో ఉన్న నిర్మాణాలు కూడా విజయవాడ ముంపుకు కారణమవుతున్నాయి. వాటిని సరిచేసే సంకల్పం ఏ పార్టీకి లేకపోవడమే ప్రస్తుత పరిస్థితి కారణమైంది.


ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సుకు నీటిని అందించే నీటి వనరుల్లో బుడమేరు ఒకటి, పశ్చిమగోదావరిలో తమ్మిలేరు, ఎర్రకాల్వలతో పాటు కృష్ణాలో బుడమేరు కొల్లేరుకు ప్రధాన నీటి వనరుగా ఉంటుంది. కొల్లేరులో వరద ప్రవాహాన్ని స్వీకరించకుండా ఆక్రమణలతో నిండిపోవడంతో వరదలు దిగువకు చేరడంలో జాప్యం జరుగుతోంది. ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రవహించే వర్షపు నీరంతా బుడమేరు ద్వారా 170కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి కొల్లేరును చేరుతుంది.


విచిత్రం ఏముంటే పగలు కూడ పరదాలతో తిరిగినోడి భజన బృందం గాళ్ళు..Z + కేటగిరి 70 సంవత్సరాల నవయువకుడు ప్రజలలో తిరుగుతుంటే వెటకారం చేయడం.

సేకరణ. శీలం శేషురెడ్డి Facebook వాల్ నుండి. 


3, ఆగస్టు 2024, శనివారం

వయనాడ్ విపత్తు గురించి ముందే హెచ్చరించిన ఒక కథ

 వయనాడ్ విపత్తు గురించి ముందే ఊహించిన లయ. 

చురాల్ మల కి చెందిన 8 th క్లాస్ చదువుతున్న గత సంవత్సరంలో ఒక వ్యాసం రాసింది. అదే నిజమైంది. కవుల ఊహ కల్పన కావచ్చు కానీ.. సత్యాలు కూడా గ్రహించి హెచ్చరిస్తారు. 

ఈ లింక్ లో చదవండీ..

: In a chilling premonition penned by Laya, a ninth standard student at Meppadi GHSS, her story "Agrahathinte Duranubhavam” (The Misery of Desire) in the digital magazine “vellaram Kallukal” seems eerily prophetic following recent tragedies in Mundakkai and Chooralmala. 

Laya wrote the story when she was an eighth standard student at Vellarmala GVHSS. The story vividly describes the potential devastation caused by landslides and rising water near waterfalls. Those who read the story wonder if Laya intended it as a . warming. While Laya herself is safe.her loved once are not. 

If it rains, landslides will rush down towards the waterfall, engulfing everything in their path, including human lives. Many people have died this way Laya wrote. 

In the story, two friends, Anaswara and Alamkrita, sneak away to see a waterfall without their families knowing. A bird approaches the girls who are mesmerized by the water fall’s beauty and warns them to  leave immediately. As the children flee and glance back at the mountain, they witness rain cascading down one side, and the parrot transforming into a girl. In Laya’s story. It’s recounted that the bird appeared as a child named Amritha, who tragically perished after falling into the waterfall before. 

“Leave, children here comes great danger” the bird urgently advises the girls in the tale. 

There are two poems in the magazine that glorify the river, which is an integral part of the students' lives. Children described the waves and warmth of the river through their imagination.Experiences of life near the rever blossomed into stories and poems. Ironically, the rever itself, described by students with most beautiful words caused their deaths. At least a bird arrives with a warning for the girls in Laya’s story. Some readers perceive in Laya’s story an indication that nature warns of certain disasters. But did the people of Mundakkai and Chooralmala receive any warning before the real tragedy.

Mathrubhumi.com  నుండి సేకరణ 

23, జులై 2024, మంగళవారం

తిల పాపం తలా పిడికెడు

 కృష్ణా గుంటూరు జిల్లాల్లో మా బంధువుల్లో చాలామంది మతం మారారు. వారి ప్రార్థనలు వారివి. వారి సమూహాలు వారివి. నిజానికి హిందువులుగా వున్నవారు వారిని గతంలో వారి మాదిరిగానే మంచీ చెడు కి కలుపుకోవాలని చూసినా వారు కలవరు. కొత్త మతం పుచ్చుకున్న వారికి గుర్తులెక్కువ అన్నట్లు ప్రసాదాలు తీసుకోరు భోజనం చేయరు. ప్రతిదానికి ప్రార్ధనలు చేస్తారు. హిందువులు తిథి నక్షత్రం వారం వర్జ్యం చూసినట్టు. వివాహ గృహప్రవేశ ముహూర్తాలు మళ్ళీ హిందూ సంప్రదాయమే! హిందువుల ఇళ్ళ మధ్య కావాలని చర్చి నిర్మిస్తారు. తొలి ఏకాదశి వస్తే శివరాత్రి వస్తే కావాలని తెల్లవారుఝామున ప్రార్ధనలు మొదలెడతారు వారి ప్రార్ధన రోజులు కాకపోయినా. ఆరోగ్యం బాగోకపోయినా ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నా బైబిల్ తో వెళ్ళి కూర్చుంటారు. ఇష్టం లేదు మొర్రో అన్నా ఊరుకోరు. అయినా దశాబ్దాల తరబడి మా పల్లెల్లో ఎక్కడా గొడవలు లేవు. క్రిస్టమస్ వస్తే కేక్ కట్ చేస్తే నిరభ్యంతరంగా తీసుకుంటాం. అలాగే మా ఊరిలో శివాలయంలో  ముస్లిం లు అభిషేకాలు చేయించుకుంటారు. నేను ఎన్నోసార్లు చూసాను. మాకు డ్రైవర్ గా వచ్చే అతను ముస్లిమ్. కళ్యాణీ బిర్యానీ తెచ్చుకుని కార్ ట్రంక్ లో పెట్టుకుంటాను అంటే కోప్పడతాను. పర్వాలేదు లోపల పెట్టుకో అంటాను. వద్దు మేడమ్! మీరు తినరు గా! వాసన మీకు ఇబ్బంది కల్గిస్తుంది ఏ సి వేస్తాం గా అంటాడు. నా చిన్నప్పటి నుండీ చూసాను.. ఎవరూ ఎవరితోనూ గొడవ పడలేదు. తిట్టుకోలేదు. కొట్టుకోలేదు. మా అమ్మ నా చిన్నప్పుడు దిష్టి మంత్రం ముస్లిమ్ ఆమెతో పెట్టించేది. కాలికి నల్ల దారం కట్టేది. మేము పీర్లు పండక్కి జెండా చెట్టుదాకా వాళ్ళతో కలిసిన జ్ఞాపకం. మా ఊర్లో గంగానమ్మ గుడిలో కడవ పూజకు కప్పల పెళ్ళికి పొంగళ్ళు పెట్టేటప్పుడు జంతు బలి అప్పుడు ముస్లిమ్ లు డప్పు శబ్దానికి చిందేయడం హడావిడి చేయడం సర్వసాధారణం. 

ఏమిటో హిందూ ముస్లిమ్ క్రిష్టియన్ అంటూ మనుషులను విడదీసే సంస్కృతి నాకు భూతద్దం వేసి వెతికినా కానరాదు. స్వయానా మా నాన్నగారి అక్క అంటే నా మేనత్త తాను చనిపోయాక అంతిమ సంస్కారం చర్చి వారే నిర్వహించాలని ముందుగానే డబ్బు చెల్లించుకున్నారు. మాకు ఎవరికీ అభ్యంతరం లేదు. 

సాహిత్యంలో హృదయాన్ని విశాలం చేసుకునే కథలెన్నో చదివాను. కొన్ని కథలు పలుకురాళ్ళ లా తగిలినా.. కథ లో  ఏదో వొక కోణం బాగుందనిపించి.. ఊరుకుంటాను. బాహాటంగా చెప్పి గెలవలేం. వాక్ఫటిమ విసృతజ్ఞానం నాకు లేదులే అనుకుంటా! కొంతమంది కొన్ని కట్టు కథలు చెప్పి మెప్పించడానికి చూసేవారిని ఎండగడుతూ  నిర్మొహమాటంగా చెప్పినట్టు  రాసినప్పుడు .. చూసి సంతోషిస్తాను. సాధారణమైన మనిషిని. ఏవేవో చదివి భయభ్రాంతులకు గురికావడం నాకిష్టం లేదు. 

కులం గురించి మతం గురించి మాట్లాడకూడదు అనుకుంటూనే.. ఈ మాట చెప్పాలనిపించింది. అంతే! 

కొందరు మత విద్వేష కథలు రాస్తూనే వుంటారు.ఎందుకు అంటే చెప్పలేం. మళ్ళీ వారు ఈ దేశంలో కూడా నివసించేవారు కాదు.

ఇంత పెద్ద దేశంలో ఎక్కడో ఏదో జరుగుతూ వుంటాయి. నిజమే కావచ్చు కాకపోవచ్చు.మీడియా కూడా సరిగ్గాలేదు కాబట్టి నిజాలు తెలుసుకోలేం. బాబ్రీ మసీదు కూల్చేసారని గుజరాత్ అల్లర్లు జరిగాయని దేశం అంతా ప్రజలు తమ జీవితాలను అగ్ని గుండాలుగా మార్చుకోలేరు. కారంచేడు లో జరిగిన సంఘటన చుండూరు లో జరిగిన సంఘటనల బట్టి ప్రపంచంలో వున్న కమ్మ రెడ్డి దళిత సోదరులు రక్తం చిందించుకోవడం లేదు. సంఘటనల వెనుక కారణాలు వుంటాయి. మన వ్యక్తిగత జీవితాల్లో వుండటం లేదా? అలాగే! సమస్య అనే వృత్తం లో కూర్చుని దాని గురించే ఆలోచిస్తూ కూర్చోం. బయటపడి జీవితం కొనసాగిస్తాం. పక్కవాళ్ళకు ఆ సమస్య గురించి చెప్పి భయభ్రాంతులకు గురిచేయడం మంచిది కాదు. రేప్ లు జరపడం తప్పు అని అనగల్గం కానీ ఆపే శక్తి మనకు లేదు. రేప్ గురించే మాట్లాడుతూ వుండిపోవడం కూడా సైకోయిజానికి గుర్తు. పసి పిల్లలను హౌస్ అరెస్ట్ చేసే వుంచండి అన్నట్టు వుంటుంది. అది నా అభిప్రాయం. రచనలు కూడా అలా వుండకూడదు అని నా అభిప్రాయం. అక్షరం రెండు వైపులా పదునువున్న కత్తి. మంచి చెడూ రెండూ సృష్టించగలదు.అధ్యయనాలు చేసి పాఠకుడు కథ చదవడు. అందుబాటులో వున్నది చదువుతాడు. అధ్యయనం చేసిన వారే చదవాలనుకుంటే ఆదివారం పత్రికలు వొదిలేసి వెబ్ లో ముద్రించుకోవచ్చు కదా! సాధారణ పాఠకుడిని భయభ్రాంతులకు గురిచేయడం ఎందుకు? 

ఈ మధ్య news channel లో చూసాను. ఒక నాయకుడు  అంటాడు. వంద కోట్ల మంది భారతీయులను చంపే ఆయుధం నా దగ్గర వుంది. బహుశా పాకిస్థాన్ దగ్గరున్న అణ్వస్త్రం అని అతని ఉద్దేశ్యం ఏమో! అతను అలా అన్నాడని నూట యాభై కోట్ల కు దగ్గరగా వున్న దేశ జనాభాలో వందకోట్ల మంది పక్కనే వున్న ముస్లిమ్ ని అనుమానంగా చూడాలా? నమ్మకంగా ప్రశాంతంగా తన బతుకు తను బతకాలా? కొందరు వ్యక్తుల స్వార్ధం కోసం మాత్రమే ఈ మాటల తూటాలు అడప దడప జరిగే సంఘటనలు. వాటిని తలుచుకుంటూ భయపడుతూ బ్రతుకు దుర్భరం చేసుకోం. మనుషుల్లో దాగున్న పైశాచికాన్ని అక్షరాల ఆయుధం తో ప్రేరేపించకూడదు అని నా అభిప్రాయం. ప్రేరేపిస్తే ఎలా వుంటుందో చదువుకున్న అందరికీ తెలుసు. పద్నాలుగేళ్ళ పైగా ఈ రాష్ట్రంలో కులకాష్టం రగిలిస్తూనే వున్నారు. ఈ సారి ప్రజలు వివేకవంతులైనారు. అయినా PayTM batch ఇంకా విషం కక్కుతూనే వుంది. 

నిన్న ఒక చిన్న కామెంట్ పెట్టాను ABN channel live లో. అక్కడ KGF summit జరుగుతుంది సత్యవాణి గారూ మాట్లాడుతున్నారు అప్పుడు. పెనమలూరు బాలికల వసతి గృహం గురించి చెబుతున్నారు. అది నిజం కూడా! మళ్ళీ ఇంకో కామెంట్ పెట్టాను. మా పోరంకి యువకుడు తోటకూర గోపిచంద్ అంతరిక్ష యాత్రికుడు గా వెళ్ళి వచ్చాడు అని . అంతే నా కామెంట్ కింద ఇద్దరు ముగ్గురు ఎంత అసహ్యంగా వ్యాఖ్యానించారో.. రిపోర్ట్ కొట్టి ఆ కామెంట్ డిలీట్ చేసుకుని వచ్చాను. మనసంతా పాడైపోయింది. మత ద్వేషాలు కుల ద్వేషాలు దేశ దురభిమానం తో మనుషులు కుంచించుకుపోయారు. అందరికీ సంఘాలు వున్నాయి. మా కులానికి వుంటే తప్పేంటి? మా కులం లో పేదవారు లేరా? వాళ్ళ సంక్షేమం కోసం మా కుల అంతర్జాతీయ సంఘం వుంటే తప్పేమిటి? నాకేమీ అర్ధం కావడం లేదు. గర్వంగా మా ప్రాంతపు యువకుడు అంతరిక్షానికి వెళ్ళివచ్చాడు అనే మాట కూడ బూతు లా కనబడితే యెలా? ప్రతి దాంట్లో కులం మతం ప్రాంతం దేశం అద్దడమే! ఇవన్నీ చదువుకోని వారిలో లేవు. మేధావులుగా చెప్పుకునే వారిలోనే వున్నాయి. ఆ భూతాలు మిగతా వారిని భయపెడతాయి మనుగడ లో వుండటానికి అంతే! వీలైతే కథ రూపంలో పెట్టాలి.  మనిషి మారలేదు🥲

కమ్మ రాజధాని అమరావతి 

కమ్మ పరిపాలన 

కమ్మోళ్ల రాజ్యం మాకొద్దు 

కమ్మ లం... లు 

ఏమిటిరా ..బాబూ ఈ శిక్ష మాకు ..  ఎందుకు మా మీద ఇంత ద్వేషం ? ఎందుకు మా మీద ఇంత శిక్ష ? యూ  ట్యూబ్ లో ఛానల్స్ చూడాలంటే భయం న్యూస్  చూడాలంటే చాట్ వైపు దృష్టి వెళ్లకుండా కట్టడి చేసుకోవాలి పేస్ బుక్ తెరవాలంటే భయం  మెసెంజర్ లో నోటిఫికేషన్ చూస్తే జంకు 

ఒక్కటి మాత్రం చెప్పగలను మీలా ..మాకు PayTM బ్యాచ్ లేరు మీ అంత ద్వేషం నీచ సంస్కారం ఉన్నవాళ్ళం కాదు కానీ ఎల్లకాలం చూస్తూ ఊరుకోము ... ఊరుకోము  ఊరుకోము . అని బాహాటంగా చెప్పడం నేర్చుకున్నాను. కులం పేరిట జరిగే వివక్ష అవమానాలను క్షమించం. 

సాహిత్యం సోషియల్ మీడియా రెండూ పతనావస్థ కి చేరుకున్నాయి.😢😢

3, జూన్ 2024, సోమవారం

I am an Author ..

 నేనొక రచయిత ని.. అవునంటారా కాదంటారా!? 

భోజరాజుకు కథలు చెప్పిన 32 సాలభంజికలు

వొక్కొక్కరే ముందుకు రావాలిప్పుడు. 🤗🫢

**********

ఓ సాహిత్య కార్యక్రమానికి హాజరై శ్రద్దగా సభను వింటున్నాను. నన్ను పలకరించి తనను పరిచయం చేసుకున్నాడు ఆ యువ రచయిత. ఓ రెండు పుస్తకాలు నా చేతిలో వుంచి.. 

‘కథలు రాయడం చాలా సులభం, తెలుసా అండీ “ అన్నాడు.

అవునా! అన్నట్టు చూసాను. లోలోపల నాకెందుకు.. వొక్కో కధ రాయటానికి సంవత్సరాలు తరబడి పడుతుంది.. నాలో ఆలోచనాశక్తి సన్నగిల్లిందేమో! విభిన్నమైన అంశాలతో కథలు రాయాలని అవి అందరూ మెచ్చుకోవాలని అత్యాశ కాబోలు అనుకుని .. 

“ఎన్ని కథలు రాసారు ఇప్పటికి” అన్నాను .. నా వయసులో సగం వయస్సే వున్న అతన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ.. 

“150 పైగానే రాసాను. ఇంకా కవిత్వం వ్యాసాలు సమీక్షలు కూడా ! “ అన్నాడు.

“ఎన్నేళ్ళ రచనా ప్రస్థానం”.. నా ప్రశ్న 

“కేవలం ఐదేళ్ళేనండీ.. మహాప్రస్థానం చదివే తీరిక దొరకలేదు నాకు. కానీ నా జీవితకాలంలో ఆరుద్ర సమగ్ర సాహిత్యం అంత రాయాలని నా కోరిక అండీ.” అన్నాడు. 

‘మంచిది. చేతి కీళ్ళు అరిగిపోగలవు జాగ్రత్త ‘’ అన్నాను. 

అతను పక్కకెళ్ళాక  ఇంకో రచయిత మిత్రుడొచ్చి.. “ఏమిటీ ఆ యువ రచయిత తో అన్ని కబుర్లు” అన్నాడు. 

 అతను చెప్పినవన్నీ చెప్పాను. 

గట్టిగా నవ్వి ఆ రచయిత కి మెదడు తో పని ఎందుకు? రెండు చిన్న పనులు తెలుసంతే! Copy > paste సోషల్ మీడియా వేదిక, కథల యాప్ .అతని రచనల్లో నీ కథలు కూడా వున్నాయి .. చూసుకో! అని హెచ్చరించాడు. 

 ఓహో అదా సంగతి అని నవ్వుకున్నాను… 

నేను రాసినదాన్ని ఎలా భద్రపరచుకోవాలి.. అచ్చమైన రచయిత మెదడుకి పని చెప్పానన్నమాటే కానీ.. ఈ గ్రంధచౌర్యం భావ చౌర్యం  చేసిన ప్రసిధ్ధ రచయితలు  గుర్తొచ్చి మరింత నవ్వుకున్నాను. 

ఆంగ్ల రచనలు చదివి తమ భాషలో కథలు రాసి ఎందరో ప్రసిద్దులైనారు. ఒకామె ఒక ప్రసిద్ద బెంగాలీ నవల గురించి ఆంగ్లంలో  వ్యాసం చదివి తన భాషలోకి అనువదించి వ్యాసం రాసింది. అలాంటికోవలో వాడే ఈ రచయిత అనుకున్నాను. 

ఇతనూ… ఎప్పుడో వొకప్పుడు ఏ ఫేస్ బుక్ గోడ పైనో  తన కథ చూసి .. నా రచన ఇది అని గగ్గోలు పెట్టటం ఖాయం.

ఈ మధ్య వొక రచయిత అన్నారు .. storyline చెబితే ChatGPT 10 pages కథ ఇచ్చింది అంట. దాన్ని 100 పేజీల నవల రాస్తాడు అంట. లక్షల రూపాయల బహుమతి, అకాడమీ అవార్డ్ లు రావచ్చు నేమో! 😊

ప్రపంచమా! వర్దిల్లుమా… ఆలోచనాశక్తి నశించి.. ChatGPT Al తోనూ copy>paste తోనూ.. 😢😢

……….. 

PS: నా ఆలోచనాశక్తి తో రాసాను. 😊🎈




16, ఏప్రిల్ 2024, మంగళవారం

మా..కృష్ణాజిల్లా వాళ్ళంటే…

 ఒక మధ్యతరగతి కుటుంబం. తల్లి తండ్రి కొడుకు కోడలు ఇద్దరు పిల్లలు అందరూ కలసి జీవిస్తున్నారు. తల్లిదండ్రులు వృద్దులైపోయారు. ఒంట్లో ఓపిక సన్నగిల్లింది. అయినప్పటికి ఏదో ఒక పని చేసి కొడుకుకి ఇతోధికంగా సహాయపడాలనే తాపత్రయంతో వుంటారు ఇద్దరూ కూడా! కొడుకు ఒక ప్యాక్టరీ లో టెక్నీషియన్ గా  చిన్న ఉద్యోగం చేస్తూ వుంటే కోడలు కూడా ఓ పచ్చళ్ళ తయారీ కేంద్రంలో గంటల లెక్కన పనిచేస్తూ.. చన్నీళ్ళకు వేణ్ణీళ్ళు తోడు అన్నట్లుగా పొదుపుగా గుట్టుగా జీవనం సాగిస్తూ వున్నారు. తండ్రి అనారోగ్యంతో వుండగా అతనికి హాస్ఫిటల్ మెడికల్ ఖర్చులకు చాలా ఖర్చు చేయాల్సివస్తుంది. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సరైన పోషకాహారం కూడా తీసుకోని పరిస్థితులు నెలకొనివుంటాయి. 

ఉదయాన్నే అర లీటరు పాలు తీసుకుంటే పెరిగే పిల్లలకు ఇవ్వాలా అనారోగ్యంతో వున్న వృద్ధులైన తల్లిదండ్రులకు ఇవ్వాలా అనే  సంశయంతో ఆ కొడుకు నలిగిపోతూ వుంటాడు. సాయంత్రం ఇంకో అర లీటరు పాలు కొని మజ్జిగ అవసరాలకు వాడుకుంటూ వుంటారు. భర్త అసహాయతను అర్ధం చేసుకున్న భార్య కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆమె కొంత చురుకుగా తెలివిగా ఆలోచించింది. ఉదయం పాలు రాగానే అందులో నుండి పావు వంతు పాలు చేసి ఆ పావు వంతు నీళ్ళు కలిపి కాచి పిల్లలకు ఇచ్చింది. ఆ పావు వంతు పాలతో ఇంకో రెండు పావులు నీళ్ళు కలిపి తేయాకు పుదీనా అల్లం వేసి మంచి టీ తయారుచేసి అత్తమామలకు ఇచ్చింది. 

మర్నాడు కొడుకు అదనంగా మరొక పేకెట్ పాలు తీసుకువచ్చి  తల్లితండ్రులకి కూడా పాలు ఇవ్వమని చెబుతాడు భార్యకు. భర్త ఫ్యాక్టరీ నుండి కొంత దూరం స్నేహితుల బైక్ ఎక్కి కొంత దూరం నడిచి వచ్చి ఆ డబ్బుతో పాల పేకెట్ తెచ్చినట్లు తెలుసుకుంటుంది.  కొడుకు చేస్తున్న ఆ పనికి తల్లిదండ్రులు చింతించారు. పాలు తాగితే అజీర్తిగా వుందని పాలు తాగమని గట్టిగా చెప్పేసారు. ఇంకా కోడలు చేసే తేనీరు చాలా నచ్చిందని చెప్పారు. తల్లిదండ్రుల మాటలకు కొడుకు కొంత తెరిపిన పడ్డాడు.

కోడలు ఆలోచిస్తుంది.  పాలు పోషకాహారమే కానీ చాలా ఆహారపదార్థాల లో కన్నా పాలల్లో పోషక విలువలు లేవని చదివి తెలుసుకుంది కాబట్టి.. 5 అరలీటర్ల పాలు కొనడం బదులు అదే ఖర్చుతో కేజీ నువ్వులు కేజీ బెల్లం కొని తెచ్చి.. నువ్వులు మంచి సువాసన వచ్చేదాకా వేయించి బెల్లం వేసి రోట్లో  దంచి  ఉండలు చేసి పిల్లలకు అత్తమామలకు ఇవ్వడం మొదలెట్టింది. ప్రతి రోజూ కోడలు చేసిన హెర్బల్ తేనీరు తాగ్రుతూ.. ఉత్సాహంగా వుంటున్నారు.  నువ్వు వుండలు తినడం వల్ల శరీరానికి కాల్షియం ఐరన్ లభించడంతో వృద్దుడైన తండ్రికి. కొంచెం ఓపిక వచ్చింది కూడా. 

కొడుకు తన ముందున్న  సమస్య తీరినందుకు సంతోషపడ్డాడు.   భార్య వివేకంగా పొదుపుగా సంసారాన్ని నడుపుకుని రావడం చూసి చాలా అభినందించాడు. నేను ఎక్కువ సంపాదించడం లేదని అసమర్థుడిని అనుకోకు. నిజాయితీ వున్నవాళ్ళు అడ్డదారులు తొక్కలేరు. అప్పులు ఎగకొట్టలేరు. నా సామర్థ్యం ఇంతే! అని చెప్పాడు.  నా తల్లిదండ్రులను బాగా చూసుకోగల్గిన మంచిమనసు వున్న వివేకవతివైన భార్య వి నువ్వు నాకు లభించడమే నా అదృష్టం. నేను ఇంకో చిన్న ఉద్యోగం చేయడానికి కష్టపడతాను అని భార్యకు మాట ఇచ్చాడు. 

  ఇక్కడ ఈ వాస్తవ కథలో  చెప్పిన విషయం మాములుగా వుండే విషయం కావచ్చు. కానీ ఇక్కడ ఆ ఇల్లాలిలో కనబడిన వివేకం తన భర్తని సంక్షోభంలో నుండి గట్టెక్కించింది అని తెలుసుకోవాలి. 

మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ వుండేవే! భర్త ఆర్థిక పరిస్థితిని బట్టి భార్య సహకరించడం నేర్చుకోవాలి. కుటుంబ నిర్వహణ ఖర్చులను లెక్కించుకోవడం, అనవసరమైన వస్తువులు,  ఎక్కువ బట్టలు కొనకుండా వుండటం నగ నట్రా కొనకుండా వుండటం, బంధువులకు మిత్రులకు ఎక్కువ రోజులు ఆశ్రయం ఇవ్వకుండా వుండటం వివేకవంతమైన ఆలోచన. బంధుమిత్రులు పడిమేసిన ఇల్లు గుల్ల అది ఏనాటికి కోలుకోలేదు  అని పెద్దలు సామెత చెప్పారు. అది నిజం కూడా.  అలాగే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనవసరమైన వేడుకలు నిర్వహించకుండా అప్పుల పాలవకుండా జాగ్రత్త పడటం మరీ అవసరం. ఇతరులతో పోల్చుకోవడం వల్ల అసంతృప్తి తప్ప ఏమీ వుండదు. 

ఎంత సంపాదించారు అన్నది కాకుండా ఎంత ఖర్చును అదుపులో వుంచితే అంత అప్పుల పాలు కాకుండా వుండగలుగుతారు అని తెలుసుకోవాలి. కళ్ళు వెళ్ళిన చోటుకల్లా కాళ్ళు వెళ్ళకూడదు. అప్పుల్లో పుట్టి అప్పుల్లోనే జీవితాంతం బతికే పరిస్థితి తెచ్చుకోకూడదు. చిన్న సంసారం చింతలు లేకుండా వుండాలంటే కొంత ప్లానింగ్ గా ముందుకు వెళ్ళడం కొంత సర్ధుబాటు, కొంత త్యాగం అవసరం.  మధ్యతరగతి మందహాసంలో ఎన్నో అణచివేతలు వుంటాయి. అవి ప్రతి ఇల్లాలికి అనుభవం లోకి వచ్చేవే! కోరికలే గుర్రాలైతే కాళ్ళు విరగడం కూలబడటం మాత్రం  ఖాయం. అందలాలకు అర్రులు చాచటం వల్ల ఎలాంటి ప్రయోజనం వుండదు. భర్తలకు భార్యలు సహకరిస్తే కుటుంబం శాంతిగా వుంటుంది. సర్ధుబాటు చేసుకోవడం సాధ్యాసాధ్యాలు అంచనా వేయడం వలన  ఎవరి జీవితమైనా ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. 

ఇంతకీ చెప్పోచ్చేది ఏమిటంటే.. ఈ పై కథలో చెప్పినట్లు.. మా కృష్ణాజిల్లా ఇల్లాళ్లు వివేకవంతులు ముందు చూపు వున్నవారు. పెరట్లో కాయించిన కూరగాయలు తిని అవి లేకపోతే జాడీ కూరలు తిని పాలు పెరుగు నెయ్యి అమ్మి మజ్జిగ తాగి సాదా కాటన్ చీరలు కట్టుకుని సింపుల్ గా బతుకుతూ..వుండేవారు. వీరే ఎక్కడైనా పెండ్లిపేరంటాలకు హాజరైతే వొంటినిండా నగలు పెద్ద అంచు పట్టుచీరలతో ధగధగలాడిపోతూవుంటారు. వారి పిల్లలు చదువుకుని మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయి వుంటారు. అదీ మా ఇల్లాళ్ల ముందు చూపు. 

మా కృష్ణాజిల్లా వాళ్ళు అంటే.. 

“పక్కింట్లో పెళ్ళి అయితే బంధువుల్లో ఎవరిదో ఒకరిది పట్టుచీర అడిగి తెచ్చుకుని దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కుట్టించుకుని విజయా బ్యాంగిల్ స్టోర్ లో అద్దె నగలు తెచ్చుకుని డంబాసారం ప్రదర్శించే వాళ్ళు కాదబ్బా.. “ అనేది మా పెద్దమ్మ. 

ఓ భుజాలు తడుముకోకండి.. 🤣🤣 విజయా బ్యాంగిల్ స్టోర్స్ ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం 😊👍