సాయం సేయంగా..
వెలుగురేకలుతో పాటు ఇంటికి వచ్చిన
భర్తని చూసి భార్య ముఖం తెరిపిన పడింది.
ఏడికి పోయావ్ చెప్పా పెట్టకుండా..
ఆ ఏడిసేదేదో ఇద్దరం కలిసి ఏడుద్దాం గా..
పేణం యెంత తన్నుకలాడిందో..
ఎన్ని కీడు ఆలోచనలు యెత్తుకున్నాయో
కోపం ఏడుపూ కలగలిసిన గొంతు వణుకుతుంది
********
నీకో కథ చెబుతా.. రా కూచో..
ఒడిని చూపి చేతులు సాచినాడతను
ఆమె పసిపిల్లలా మారింది.
ఆమె జత్తులో వేళ్ళు కదుపుతూ.... కథలోకి దారులు వేసాడతను
*********
ఆ.. నిర్మానుష్య రాత్రిలో
వీధి దీపం ఖాళీ బెంచీ రెండూ
నన్ను పిలిచాయ్. .
రా! కాసేపు వచ్చి కూర్చో!
ఏ ఊరూ, ఇంత పొద్దు పోయిందాక
ఎందుకు తిరుగుతున్నావు అని
ప్రశ్నలు అడగనులే!
మనసున్న మనిషి వొకడు ప్రతి రోజూ
మంచినీటి సీసా రెండు బిస్కెట్ పేకెట్లు వుంచి వెళతాడు.
కాస్త పానీయం పుచ్చుకుంటావా?
పిమ్మట కొంచెం ఎంగిలి పడు.
అలసిపోయినట్లు కనబడుతున్నావు
రవంత విశ్రమించు.
కునుకు పడితే కలతలన్నీ మర్చిపోతావు
అని
*********
లేచావా! బలిసిన దోమలను తరుముదామంటే
చలికి మరింత వణికి ముడుచుకు పోతావన ఆగాను.
వెలుతురు వచ్చాక నువ్వే దారి పడతావులే!
అలిగి వచ్చిన నీకు అమ్మ నాన్న వుండే వుంటారు.
బ్రతుకు ఈడ్వలేక నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్న నీకు
భార్యాబిడ్డలూ వుండే వుంటారు.
అమ్మా.. నాన్న ఏడి అని బిడ్డలు అడుగుతారు
ఇల్లాలు ఆందోళన చెందిన మనసుతో
కన్నీరు ఊరే కళ్ళతో రహదారిని వెతుక్కుంటూ వుంటుంది.
ఇంటికి వెళ్ళు.. నాయనా!
వలస బతుకులు సంచారుల బతుకులు ఇంతే!
తాత్కాలికంగా వేసుకున్న నీ గుడిసె ముందు
రాత్రి వేసిన రంగుల ముగ్గులు నీకు స్వాగతం పలుకుతాయి
పగలంతా బతుకు యుద్దం చేసినా
రాత్రి వచ్చే రంగుల కలలకు ఈ రంగవల్లులు ఉద్దీపన.
కడుపు చూసే అమ్మ గుండె పంచే ఆలి
దైర్యమిచ్చే నాన్న బతుకుపై తీపి ఆశ కల్గించే బిడ్డలనూ
వదలకుబోకు నాయనా!
ఒంటరితనం శిక్ష వేసుకోకు.
వస్తువులు కూడా తోడు వెతుక్కుంటాయి.
చెట్లు కూడా వేళ్ళతో ఆత్మీయంగా అల్లుకుంటాయి.
వెళ్ళు… ఇంటికి వెళ్ళు అని మెత్తంగా మందలించాయి.
*********
పార్కులో మనుషులు మాయమయ్యాక..
అతనొక్కడే లోపలికి వెళ్లాడు.
నీటి సీసా, రెండు బిస్కెట్ పాకెట్లు వున్న సంచీని
అక్కడ తగిలించి .. బెంచీకీ వీధి దీపానికి నమస్కరించి
ఇంటి దారి పట్టాడు.
(విదేశాల్లో నానా అవస్థలు పడుతున్న
H1b యువ కుటుంబాల యాతనలకు సహానుభూతిగా 💦💦)
07/01/2026 06:00 am


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి