The Solitary Reaper - William Wordsworth
ద సోలిటరీ రీపర్
ప్రముఖ ఆంగ్ల కవి - విలియం వర్డ్స్‌వర్త్ రాసిన కవిత కు తెలుగు అనువాదం వినండీ. అనువదించిన వారు P. సింహాద్రమ్మ. విశాఖపట్టణం
అదుగో! అక్కడ!
ఆమె పాటను శ్రద్ధగా వినండి
వొంటరిగా పొలంలో పనిచేసుకుంటోంది
దూరంగా ఉన్న పర్వత ప్రాంతాలనుంచి వొచ్చిన పిల్ల
పంట కోస్తూ తనలో తానే పాడుకుంటోంది
కాసేపు ఆగి వినండి... లేదా నెమ్మదిగా వెళ్ళండి
ఒక్కతే కోస్తూ కోసిన వెన్నుల్ని కట్టగా కడుతూ
ఒంటరిగానే పాడుకుంటోంది
ఏదో ప్రాచీన గానం ఒంటరి విషాద గీతం
వినండి! లోయలనిండా నిండిపోయి
కొండల్లో ప్రతిధ్వనిస్తోంది
లోతైన ధ్వనిలో ఉప్పొంగిపోతోంది
ఎక్కడినుండో దూరాభారాలనుండి వొచ్చి
అరేబియా ఎడారి ఇసుక తిన్నెల మధ్య అలసిపోయి
ఏ నీడలోనో విశ్రాంతి తీసుకునే ప్రయాణీకులకు
ఏ చకోర పక్షీ కూడా ఈమె పాడినంత శ్రావ్యంగా
స్వాగత గీతాలు పాడివుండదు
వసంత కాలంలో కోయిల పాట కూడా ఇంత మాధుర్యంగా వినబడి ఉండదు
అంతగా ఉత్తేజ పరిచేలా ఎన్నడూ వినలేని స్వరం అది
సముద్రాల నిశ్శబ్దాన్ని బ్రద్దలు చేస్తూ
సుదూరంగా వ్యాపించిన హెబ్రైడ్స్ ద్వీప సమూహాల
మధ్యనుండీ వస్తున్న సాంప్రదాయ సంగీత విభావరేమో అది!!
ఆ పాట ఏదో సుతి మెత్తటి సందర్భం గూర్చి పాడినదా!
లేక రోజూ ప్రతినిత్యం జరుగుతున్న ఏదేని ప్రాముఖ్యత గల అంశమా?
ఏదేని సహజంగా ఉండే విషాదమా
ఏదేని కోల్పోయిన విషాదమా
ఎప్పుడో ఒకనాడు బాధించినదా
లేక మళ్ళీ ఇప్పుడదే బాధిస్తున్నదా
ఎవరైనా చెబుతారా నాకు?
ఆమె ఏం పాడుతోంది?
కవితలా ? వాటి ఛందస్సు తీరు తెన్నులా
బహుశా ఏనాటి తన గుండె గాయాల గురించా
తీరని కోర్కెల గురించా
సుదూరంగా ఉండే చిన్న చిన్న సంతోషాల గురించా
తాను ఒకనాడు చేసిన యుద్ధాల గురించా
లేక మరికొంచెం నిజాయితీ గా చెప్పాలంటే
తన సహజ కష్టాల గురించా
తాను పోగొట్టుకున్నదీ , లేక
తనను పదే పదే తాకుతున్న
ఏదేని దుఃఖపు తెరల గురించా??
అర్ధం ఏమైనా అయి ఉండొచ్చు
ఆపిల్ల పాటకి అంతే లేనట్టుంది
తాను పని చేసుకుంటుండగా పాడడం
కొడవలి వంపులోంచీ చూసాన్నేను
కదలకుండా నిశ్చలంగా నిలబడి విన్నానా పాట
కొండ చిగురుకి ఎక్కుతూ
నాగుండెలో ఎన్నాళ్లకయినా ఆ గానాన్ని దాచుకున్నాను
ఇంకేనాటికీఆ స్వరం నాకు వినపడ నప్పటికీ......
(ఎప్పటికీ ఆపాట వినలేక పోయినప్పటికీ......)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి