30, మార్చి 2026, సోమవారం

అప్పుడప్పుడూ…

 






అప్పుడప్పుడూ.. - వనజ తాతినేని.


జన్మకి  కీర్తించడానికి వొకరు దొరుకుతారు. 

వారిని కీర్తిస్తూ వీరు తమని తాము మర్చిపోతారు. 

వారికి తెలుసు వీరికి నిస్సందేహంగా తెలుసు. 

కీర్తించబడుతున్న దానికి విశేషణం లేదని

అందుకు అనర్హులు అని.

కానీ..  ఒకటనుకుంటారు

అట్లా అప్పుడప్పుడు పరస్పరం గుర్తించుకోకపోతే 

జీవితం చప్పగా వుంటుంది అని. 

ఒక రకంగా వీరిది జన్మ సాఫల్యం. 

లోకం దృష్టిలో! 


29 March 2026. 

©️Vanaja Tatineni



29, మార్చి 2026, ఆదివారం

రానిక చెలీ నీ కోసం

  

రానిక చెలీ.. నీ కోసం


చెరువుగట్టు గంగానమ్మ గుడి

సంచారం లేని ప్రదేశం. 

ఆలస్యంగా ఉదయపు నడకకు వెళ్ళాను. 

జిలుగు వెలుగుల చీర కట్టుకుని వున్న పల్లెటూరి స్త్రీ ఫోన్ లో గట్టిగా మాట్లాడుతుంది. 

వినాలని లేకపోయినా చెవులకు రబ్బర్ హారన్ లా తాకుతున్నాయి. 

ఎవరినో నోరు పట్టని అశ్లీల భాష లో కత్తితో మాంసం కండలను  నరికినట్టు నరుకుతూ దుమ్మెత్తి పోస్తూ…కాని బంధం ఆచూకీని పట్టి ఇచ్చింది. 

ఆవేశాన్ని దాచుకుని కన్నీళ్ళతో ఇంకెవరికో ఫోన్ చేసింది. 

“బయటకు వస్తావా అని అడిగాడు. చీకటితో వచ్చాను. ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా రాలేదు. పిల్లలు నిద్రలేచి ఆకలికి అమ్మను వెతుక్కుంటూ వుంటారు. వాళ్ళకి ఓ ఇరవైరూపాయలకు ఇడ్లీ తెచ్చి ఇస్తావా? నేను వచ్చేస్తున్నాలే”  అంటుంది పిచ్చి తల్లి.


జాలిగా ఆమె వైపు చూసాను. “గుండెను బతికించే పిడికెడంత ప్రేమ మరుగు ప్రదేశాల్లో

ఉండదమ్మా, బహిరంగంగా వెతుక్కో! లోకానికి ఝడిసి ప్రమాదం అంచుల్లోకి వెళ్ళకు. 

ఈ చెరువులో చచ్చిన చేపల్లా పైకి తేలతావ్. జాగ్రత్త!!” అని చెప్పాలనుకుని ఆగిపోయాను. 

నా ఏడుపు గొట్టు పాటల టేస్ట్.. పొదికలో.. నుండి.. 


రానిక చెలీ నీ కోసం, రాదిక వసంత మాసం.. అని పాడటం మొదలు పెట్టింది. 


నేను పాట ఆపదల్చుకోలేదు. కొబ్బరి చెట్లు నీడన వేసి వున్న సిమెంటు బెంచీ పై కూర్చున్నాను. ఆమె కూడా బెంచీకి ఆ చివర కూర్చుని..  పాట శ్రద్ధగా విని కళ్ళు తుడుచుకుంటూ ఊర్లోకి దారి తీసింది. 


నేను ఆలోచిస్తూ కూర్చుని వుండిపోయాను.  రోజంతా గడుస్తున్నా ఆమెను మనసులో నుండి తీసేయలేకపోతున్నాను. 

హ్మ్.. 



28, మార్చి 2026, శనివారం

తాపడం



తాపడం    -వనజ తాతినేని


కేవలం కోపం ద్వేషం మాత్రమే కాదు

అకారణంగా ఇతరుల ఈర్ష్య ద్వేషాలకు

గురైనప్పుడు మాత్రమే కాదు

ఎవరో అపరిచితులు ప్రకటించే

అభిమానం ఆరాధన ప్రేమ ఇష్టం

లాంటివి కూడా నన్ను  అస్థిరతకు గురిచేస్తాయి

అభద్రతాభావం లోకి నెట్టబడతాయి. 

అప్పటిదాకా అత్తిపత్తి లాగా  స్లీపింగ్ ట్రీ లా నత్తగుల్లలా

ముడుచుకుపోయే నేను కఠినశిలలా ఎడారిలో

పాతేసుకుని వున్న నేను నెమ్మదిగా నీవైపుకు

జరుగుతాను. ఎందుకంటే ప్రాణానికి ప్రాణం 

తాపడం చేసి వుంచాను కాబట్టి. 

మరణించక మునుపే నేను నీలో ఎప్పుడో

మరణించాను గనుక. నా భుజంపై చేరిన 

ధూళి రేణువులైనా, హృదయం పై ముచ్చటపడి వాలబోయే

సీతాకోకచిలుకనైనా నిర్ధాక్షిణ్యంగా దులిపి పారేస్తాను. 

పొడవైన ముళ్ళ కోటు తొడుక్కుంటాను. 

ద్రోహం నా ఇంటి పేరు కాదు కాబట్టి.


28 March 2026  02::22pm. 


©️Vanaja Tatineni 


The Imprinting    - Vanaja Tatineni


It is not merely anger or hatred;

Nor is it only when I am subjected—without cause—

To the envy and malice of others;

Even the affection, adoration, love, and fondness

Professed by total strangers

Render me unstable—

Pushing me into a state of insecurity.

I—who, until that moment, remained curled up

Like a touch me not,  or a sleeping tree,  

and withdraw myself into the shell just as a snail.

I—who stood planted like a hard rock in the desert—

Slowly drift toward you.

For I have bound my very life to yours—

Affixing it inextricably.

Because, long before my physical death,

I had already died within you.

Whether it be a speck of dust settling on my shoulder,

Or a butterfly, charmed by my heart, poised to land upon it—

I ruthlessly brush them all away.

I wear a sharp, thorny over coat.

For betrayal is not my surname.


(The original poem in Telugu “TaapaDam)


ప్రకృతితో సహవాసం


సహవాసం   - వనజ తాతినేని 

రేకులన్నీ విచ్చుకుంటున్నప్పడు  

కన్నార్పకుండా చూస్తూ 

హృదయంలో నిలుపుకోడం అద్భుతం

అచ్ఛం పసిపాప కళ్ళల్లోకి నేరుగా చూస్తూ 

మన హృదయానికి లంకె వేసుకున్నట్టు

******

మధువు సేకరణలో మునిగిన రెండు భ్రమరాలు 

కాసేపు ఆగి  ఆ మకరందాన్ని మించిన తీయదాన్ని 

పెదవుల మధ్య పంచుకున్నాయి.

*******

సౌందర్యాన్ని శరణు వేడుకో. 

తప్పక నీకు అభయమిస్తుంది 

కొంత నీక్కూడా అంటుతుంది

అంతర్నేత్రం విచ్చుకుని. 


28 March 2026. 06:45am 

©️Vanaja Tatineni 


27, మార్చి 2026, శుక్రవారం

అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి గీతం

 


అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి 

గాయనీ గాయకులు: జి.ఆనంద్, ఎమ్.శారద 


 *************

అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి 

రామదాసు నిర్మించిన ఆలయం (2)

సీతారాముల స్థిరవాసం 

అది భద్రుని బ్రోచే పావన నిలయం


అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి 

రామ దాసు నిర్మించిన ఆలయం 


1.చరణం:


పావని గౌతమి కదలగా 

అరుణ కాంతి వెద జల్లగా (2)

భద్రాచలమే భక్తికి మూలం

భక్తకోటికది పుణ్యతీర్ధం


అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి 

రామ దాసు నిర్మించిన ఆలయం


2. చరణం:


అందగాడమ్మా శ్రీరాముడు 

ఎంతటి అందగాడమ్మా (2)

ఆజాను బాహుడమ్మా 

అరవింద నేత్రుడుమ్మా 

కోదండ రాముడమ్మా 

కారుణ్య దాముడుమ్మా (ఆ)

సీతమ్మ వలచిన గోపన్న కొలిచిన

భద్రుని బ్రోచిన శ్రీరాముడు (2)

శంఖు చక్రధారుడు


అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి 

రామ దాసు నిర్మించిన ఆలయం 


***************




కాలం ఎంచుకున్నది హృదయం నిలుపుకున్నది

 కాలం ఎంచుకున్నది, హృదయం నిలుపుకున్నది


అనుమతి లేకుండా వచ్చే రుతువుల వలె, 

మీ దారిలో ఎవరు తారసపడతారో 

కాలమే నిర్ణయిస్తుంది.


అది మీ సాధారణ రోజుల్లోకి అపరిచితులను పంపి

చిన్ని చిన్ని క్షణాలను 

మరపురాని అధ్యాయాలుగా మారుస్తుంది.


కానీ హృదయం 

ఆ నిశ్శబ్దమైన మొండి హృదయం 

ఎవరు నిలిచి ఉంటారో నిర్ణయిస్తుంది.


ఒకరిని దగ్గరగా ఉంచుకునేది క్యాలెండర్ కాదు, 

బంధాన్ని శాశ్వతం చేసేది గడియారం కాదు

ఈ ఆత్మ నా సొంత ఇల్లులా అనిపిస్తోంది 

అని గుసగుసలాడే భావనే అది.


కాలం మీకు వేలాది ముఖాలను పరిచయం చేయవచ్చు 

కానీ మీ హృదయం గుర్తుంచుకోవడానికి 

కొన్నింటిని మాత్రమే ఎంచుకుంటుంది.


కొందరు హడావిడి వానలా వచ్చి వెళ్ళిపోతుంటారు

మరికొందరు  రోజూ మీ చర్మంపై పడే 

సూర్యరశ్మిలా నిలిచిపోతారు.


చివరికి జీవితం అంటే ఏమిటంటే..

మీరు అనుకోకుండా కలిసిన వారి గురించి కాదు 

మీ హృదయం వదులుకోవడానికి నిరాకరించిన వారి గురించే 


మూలం: జస్విందర్ చాహల్


 - స్వేచ్ఛానువాదం: వనజ తాతినేని.

22, మార్చి 2026, ఆదివారం

యుద్ధ కవితలు

 యుద్ధ కవితలు


ప్రపంచమంతా.. యుద్ధం గొడుగు కింద చేరింది

తమది కాని యుద్ధాన్ని చేస్తూ మోస్తూ

కొన్ని గొడుగు చువ్వలు విరిగి పొయ్యాయి. 

గొడుగు చిరిగి పోయింది. ఇప్పుడు ఎండ వాన నుండి రక్షణ కరువు

చెట్టు కిందకు చేరేవు ఆశ్రయం కోరుతూ మబ్బులు లేని పిడుగులు పడతాయి. 

 

**

ఆకాశం నుండి ఓ క్షిఫణి దూసుకు వస్తున్నప్పుడల్లా

ఓ దుఃఖ మేఘం భళ్ళున కన్నీరు గుమ్మరించి పోతుంది.

సామ్రాజ్యవాదం చిరునామా కర్కశం

ఇనుప ముళ్ళ పాదరక్షలు ధరించింది 

బడి పువ్వులను నలిపేస్తోంది. దువా చేస్తున్న

సమూహాలను లక్ష్యం చేసుకుంటుంది.


***


యుద్ధాన్ని ఆపే శక్తి ఏ మతానికి లేదు

మతం కూడా మానసిక యుద్ధమే!  

మానవజాతి ని ఉద్దరించుకోవడానికే మతం పుట్టింది. 

అదే మతం మనిషిని చంపుతుంది. 

జంతువులకు మతం లేదు. పాపం

ఎంతో కొంత అవి బతికి పోయాయి.


****

అధికంగా చదువుకున్న మూర్కులున్న ఇజ్రాయల్ 

మరో మూర్ఖ సంస్కృతి ని దత్తత తీసుకుంది. 

శాంతి ఒప్పందాలు ఆక్రమణలు ఏది ఆగవు

ఆకలి కేకలు ఆగవు. సామూహిక దాడులు ఆగవు. 


*****

యుద్ధం ఒకందుకు ప్రారంభం అవుతుంది 

మరొకందుకు ముగుస్తుంది

ధనం ఇంధనం పరస్పర ప్రేరకాలు

ఆధిపత్య భావన అహంకారం కవల పిల్లలు. 


******

యుద్ధ రక్కసి కి ప్రజలను ఆహారంగా 

విసురుతారు నేతలు. 

శవ పేటికలపై పన్నులు వేసి ఆయుధాలను

కొనుగోలు చేస్తారు.

***********

PS: (మనమేమి చేయలేము. కవిత్వం రాసుకోవడానికి కొంత సరంజామా దొరికింది. వాట్సాప్ ద్వారా Gas సిలిండర్ బుక్ అయ్యింది. డాలర్ రేటు పెరుగుతూ ఉంది. అక్కడ మాత్రం వాయింపు. జీవితానికి వేరే ఆప్షన్ లేదు) 


#వనజతాతినేని

#vanajatatineni

#follower

#hilights

#warpoetry

#యుద్దకవితలు

#సిరివెన్నెల 

#griefpoetry




20, మార్చి 2026, శుక్రవారం

కవి సమయాలు

గింజులాట    - వనజ తాతినేని 

నువ్వు యెప్పుడూ స్పష్టం

నేనెప్పుడూ .. అస్పష్టంగానే

ఈ గింజులాట జీవిత కాలం 

ఒకనాటి మురిపెం పువ్వులది

యాభైరెట్ల ఆనందం తుమ్మెదలది.

సఫలం కాని జీవితాలపై .. 

సానుభూతి వడగళ్ళ వర్షం. 

వద్దు.. ఆత్మ హననాలపై  

కనికరం వద్దు. జాలి దయ

సానుభూతి భరించడం కష్టం

మిక్కిలి అవమానకరం.   

***************

అతడు: మీ కవులు జీవితాన్ని ఆస్వాదించలేరు అనుభవించలేరు. ఎంత సేపూ ఊహల్లో మునిగి తేలుతూంటారు. ఆరోపణ దండిగా వినబడుతుంది. 

ఆమె: అనుభవం  మంచిగానో చెడ్డగానో వుంటుందని ఊహించగలరు కాబట్టే.. కొత్త కొత్త అనుభూతి పరంపర లో నిండా మునిగి తేలుతారు. ఇక అనుభవం తో పనేముంది!?  స్థిరంగా చెప్పింది.

నేను: ఏమిటబ్బా! రెండు సబబుగానే వున్నట్టు వున్నాయి. 🤔🤗 ఎవరి వైపు చెప్పాలిప్పుడు.😘😅

**********************

 "పువ్వు చుట్టూ వాత్సల్యపు నీడలా 

నువ్వు నా చుట్టూ ఉన్నావు ఈశ్వరా! 

అవసరమైనప్పుడల్లా.. గీతానివై తారసపడతావ్!

 నా లోపలి వెలుగు నా లోపలి స్వరం.. నేనే కానీ..  

అది నువ్వే అని ఎరుకలో వున్నాను. 🙏

****************


నా కవిత్వంలో..

నీ జాడ వెతుక్కోకు 

భంగపడతావ్.

ఉక్రోషంగా..

మొగ్గ రేకులను

బలవంతంగా విడదీసి 

మధువును రుచి 

చూడటానికి ప్రయత్నించకు

పోక్సో చట్టం వుంది 

జాగ్రత్త!! 








19, మార్చి 2026, గురువారం

ఛాయా చిత్రం

 అప్ డేట్.. 


ఔద్దత్యం లేనే లేదు

అది నా ఔన్నత్యం అవునో కాదో నాకే తెలియదు. 

అందరి దృష్టి ని ఆకర్షించాలని కాదు. 

నా వాల్ .. నా ఇష్టం. 

కనీసం profile pic పెట్టుకునే స్వాతంత్ర్యం 

లేదా.. నాకు !?

మొన్నామధ్య ఇదే శారీ తో వున్న ఫోటో పెట్టుకుంటే.. ఎవరో వచ్చి ఏదో.. వాగుతాడు. 

ఫోటో తో సహా డిలీట్ చేసాను కోపంగా. 

కథలు కవిత్వం పెడతాను కాబట్టి Public comment చేయవచ్చు అనే option ఇచ్చాను. ఎవడో ఏదో వాగుతాడు. Friends and Friends option లోకి మార్చుకున్నాను. 

ఈ Option లో కూడా ఎవడో ఒకడు ఏదో ఒకటి వాగుతున్నాడు. Only Friends వరకూ comment పెట్టే Option లోకి కుదించేసాను. 

ఏంటి బాబూ ! అసలు మీ సమస్య! ? అని అడగాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్త!!

ఫోటోతో సహా డిలీట్ చేసానని అప్పుడే  మా వదిన మళ్ళీ తీసింది ఈ ఫోటో. చేతిలో రెండు Chaco Bar లు ఉన్నాయని నవ్వకండి. నేనసలు తినను. ఫ్యామిలీ మెంబర్స్ వి పట్టుకున్నాను. 

14 th న కజిన్ కూతురు పెళ్ళి లో.. 

ఆ పెళ్ళికి చాలామంది వచ్చారు. మనమేం ఎగబడి ఫోటోలు దిగం వారితో. 

రచయితలు కూడా సెలబ్రిటీ లే.. కదా! 

PS: జాగ్రత్తగా కామెంట్ చేయండి. 

ఎప్పుడో ఒకప్పుడు కాస్త మంచి చీర కట్టుకుని.. సింపుల్ గా ఓ నగ పెట్టుకొని.. కాస్త ఓ ఫోటో తీసుకుని ఇక్కడ పోస్ట్ చేసుకుంటాం. అంతే! అదో సరదా! కట్టిన చీరే కట్టి బిళ్ళ మడతలు పెట్టి కట్టి తిప్పి కట్టి.. 

అన్నమాట. 

ఈ ఫోటో అస్సలు డిలీట్ చేయను. నవ్వకపోయినా బాగానే వున్నాను.. వెనుక వున్న పువ్వుల గుత్తులు వల్ల. 😍❤️😘

ప్రశంసలు ఎన్నైనా స్వీకరిస్తాం. విమర్శ ను కూడా భరిస్తాం. కానీ అవాకులు చెవాకులు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదు. అది నేను భరించలేని విషయం కాబట్టే.. ఈ బ్లాగ్ లో కూడా కామెంట్ ఆప్షన్ తీసివేయబడింది. 

14/03/2026 . 


18, మార్చి 2026, బుధవారం

ఆమె_వంటగది

 వంటిల్లు కూడా స్త్రీ అభిరుచి లో ఒక భాగమే. 


ఆమె_వంటగది -Doranala Vidura Reddy  గారి కవితా పరిచయం

                                                                        - వనజ తాతినేని.

                                                                                                                                -               ఇటీవలకాలంలో ఫేస్ బుక్ లో నేను చదివిన కవిత్వంలో ఒక మంచి కవిత గురించి చెప్పాలనుకున్నాను. మిత్రులతో మాటల్లో కవిత్వాన్ని విశ్లేషించడమే తప్ప నేనెప్పుడూ కవిత్వాన్ని పరిచయం చేసే బాధ్యతను తలకెత్తుకోలేదు. ఎందుకో ఈ కవిత అలా.. అలా.. ఆలోచనల్లో మిగిలిపోయింది. మీలో చాలామంది ఈ కవిత చదివి వుండివచ్చు కూడా!  నా దృష్టిలో బాగుంది అనుకున్న ఈ కవిత ఎలా వుంది అంటే.. ఇదిగో ఇలా! 


భారతీయ సాంప్రదాయంలో  స్త్రీని వంటింటికి మహారాణిని చేసారు. ఏ రాజప్రాసాదాలలోనో ధనవంతుల ఇళ్ళల్లోనో పుడితే తప్ప ఆమె కి C/o వంటింటి చిరునామా మారే యోగం లేదు. 

కేవలం వంటింట్లో ఎక్కువ సమయం వినియోగించాల్సిన పరిస్థితి భారతీయ స్త్రీలకు వివాహం పిమ్మట తప్పనిసరి అయి వున్నప్పటికీ అదే జీవితం అయి వుండాలనే నియమం పాటించాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి మనిషికి ఆహారం ఫ్రాథమిక అవసరం. పురుషుడు బయట ప్రపంచంలో బతుకువేట కొనసాగిస్తూ వుంటే స్త్రీలు ఇల్లు పిల్లలు పెద్దలను చూసుకునే బాధ్యత వహిస్తూ ఇంటికే పరిమితమైన కాలం నుండి మనం చాలా ముందుకు వచ్చేసాం. చాలామంది స్త్రీలకు  ఇంటి నిర్మాణంలోనూ ఇంటి నిర్వహణలోనూ భర్తకు చేయూతనివ్వాలిసిన అవసరం వున్న కాలం ఇది. ఒకవేళ స్త్రీ ఉద్యోగిని కాకుండా వున్నా కూడా బాధ్యతలకు కొదవేమీ లేదు. పుల్ టైమ్ గృహిణులకు కూడా ఊపిరి సలపనివ్వని పనులుతో హైరానా పడిపోతుంటారు. వీటన్నింటి మధ్య ఈ కవితలోని  గృహిణిని ఇంటి పని నుండి వంట పని నుండి తనను తాను విడదీసుకున్న ఒక స్వేచ్ఛాభిలాషణ కల్గిన స్త్రీగా చూడగల్గాం. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. గృహిణి అయినంత మాత్రాన స్త్రీ పూర్తిగా వంటింటి చాకిరీతో అలిసి అవిసి పోతారు అన్న నానుడి నుండి అపప్రధ నుండి  ఈ కవిత బయట పడేసింది. స్త్రీలు మాత్రం ఈ కవితలో వున్న ఐరనీ అంది పుచ్చుకుంటారో లేదో! 


స్త్రీ తనకు వుండే చక్కని అభిరుచులతో   అనునిత్యం తనని తాను నవ ఉత్తేజంతో నింపుకుంటూ జీవితాన్ని ఆస్వాదించడానికి ఆస్కారం వుంటుందని వుంది అని ఈ కవి తన కవిత ద్వారా తెలియజేసారు. 


ఆ గృహిణి ఇష్టంగా గార్డెనింగ్ హాబీని కొనసాగిస్తూ,  నిత్యం ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతుంది.ఇంటి అలంకరణలో రామాయణ ఇతివృత్త మధుబని పెయింటింగ్ గోడకు వ్రేలాడుతుంది, రమణ మహర్షి సందేశంతో  వున్న ప్రేమ్ గోడకు తగిలించి వుంటుంది. ప్రపంచం లోని మనుషుల మనస్తత్వం ఎలా వుంటుందో తెలుసుకోవాలనుకునే ఆసక్తి కల్గి    Steave de రాసిన ” How to read People” పుస్తకం చదువుకుంటూ వుంటుంది. ఇక ఆ ఇంట్లో  అమ్మానాన్నల అపురూపమైన ప్రేమతో  చక్కగా పెరిగిన పిల్లల ఆచూకీ తెలుపుతూ “అమ్మాయి చిత్రించిన అమ్మా నాన్న చిత్రం, కొడుకు తల్లికి పంపిన ఉంగరం బహుమానం”  ఇంకా  “బిజినెస్ టూర్ లో వున్న భర్త  తరచూ పంపే మెసేజెస్” ఇవన్నీ వుంటాయి.  ఈ చిహ్నాలన్నీ  ఆ కుటుంబ  సభ్యుల మధ్య వున్న  చిక్కని ప్రేమ ను అనుబంధాన్ని ఆప్యాయతలను తెలియజేస్తాయి. అలా అని ఆమెకు ప్రపంచంతో సంబంధం లేకుండా పోదు. మిత్రులతో ఫోన్ కాల్స్ తాత్విక చర్చలు చేస్తూ వుంటుంది. వెరసీ ఆమె గృహిణిగా వుంటూనే తనకిష్టమైన  ఆర్ట్ వేయడం పాటలు వినడం లాంటి వ్యాపకాలతో సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ వుంటుంది. వంటిల్లు ఇల్లు కూడా స్త్రీ అభిరుచి లో ఒక భాగమే అన్న భావన బలంగా చెప్పిందీ కవితలోని ఆమె. 


ఆనందం ఒకరు ఇస్తే వచ్చేది కాదు  అది బయట వెతక కూడదు అది మనలోనే వుంటుంది. మనకు నచ్చినట్లు మనం మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు అని. ఆ గృహిణి ఇచ్చే సందేశం అపూర్వంగా వుంది.  


ఈ కవిత కవి  ఊహ కావచ్చు  అనుభవంలోకి వచ్చిన దృశ్యం కావచ్చు. కవిత్వరీకించిన తీరు మాత్రం ప్రశంసనీయం. ఈ కవిత్వం చదివిన స్త్రీలు కూడా తమ అభిరుచులకు తగ్గట్టుగా తమ ఖాళీ సమయాలను ఉత్తమాభిరుచులకు కేటాయించుకుని ఇంటిని ఒంటిని మనసు ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుని ఆనందమయమైన జీవితాన్ని నిర్మించుకోవాలని ఆరాటపడాలి. 

తమ జీవితాల్లోని మొనాటనీ ని విచ్ఛిన్నం చేసుకోవాలి. తమ జీవితాల్లో పొడచూపే ప్రతి చిన్న కుటుంబ విషయానికి శారీరక మానసిక ఇబ్బందులకు కారణం జీవిత బాగస్వామ్యి యే కారణం అని నిందించటం సాధించడం అనే బలమైన బలహీనతలను బ్రేక్ చేయాలి. తమ జీవితంలో 60% పైగా ఆనందం తమలోనే వుందని గుర్తించాలి. 


ఇకపోతే ఈ  కవిత్వంలో కవి ఇమేజరీలను చాలానే వాడారు. దృశ్యం, శ్రవణం, స్పర్శ, వాసన, రుచి, అనుభూతి దేనిని వదల్లేదు. అందువల్ల పాఠకుడు ఈ కవిత్వానికి  బాగా కనెక్ట్ కాగల్గారు ప్రతీకలను కూడా బాగానే వదిలారు రామాయణ ఇతివృత్తం, వినాయకుని ప్రతిమ,  అమ్మ నాన్న చిత్రపటం లాంటివి.


ఏమైనా ఇది  పురుషకోణంలో నుండి స్త్రీల అభిరుచులను పట్టి ఇచ్చిన కవిత్వం.. ఒకవేళ పట్టించుకున్న కవిత్వమే అయినా కూడా  అద్భుతం, ఆనందమే! ఈ కవిత క్లాసికల్ సాహిత్యం అనవచ్చును. వాస్తవానికి దగ్గరగా నాగరిక జీవితానికి సంబంధించినదిగా వుంటుంది. ఈ కవిత్వంలో చిన్న శ్లేష, పురుషుల అండర్ టోన్ కూడా వినబడింది. స్త్రీలు ఉద్యోగం చేయకపోతేనేం ఊళ్ళేలక పోతేనేం !? ఇంట్లో  ఇల్లాలిగా వుంటూ పిల్లలను చక్కగా పెంచి ఇంటిని ఆహ్లాదకరంగా వుంచుతూ తనూ ఆహ్లాదంగా వుండొచ్చు.భర్త పూర్తి ప్రేమను తన వైపుకే మరల్చుకోవచ్చు కదా అని.  


కవుల కవిత్వం ఆమె_వంటగది దగ్గర మాత్రమే ఆగిపోకుండా.. ఇంకా ఇంకా వంటింటి సాంప్రదాయం ఆమె లకు పరిమితం చేయకుండా.. అతను_వంటగది వరకూ రూపాంతరం చెంది అందరి మనసుల నుండి నవ్య నీరాజనం అందుకునే స్థితికి ఈ కవి కవిత్వం, పురుషుల కవిత్వం సాగాలని  హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను. 


కవి విదురా రెడ్డి గారికి  హృదయ పూర్వక అభినందనలు. 


కవిత చదవండీ… 


#ఆమె_వంటగది.. 


కాఫీ సమయానికి 

తూర్పు కిటికీ లోంచి చూస్తే

ఉదయించే సూర్యుడు దర్శనమిస్తాడు

అలాగే ఎర్రని పూలు పూసే

'వెస్ట్ ఇండియన్ జాస్మిన్ ' మొక్క హాయ్ చెబుతుంది


ఓవెన్ ప్రక్కన  

ఇండోర్ ప్లాంట్  'అరాలియా గ్రీన్ ' 

నేను నీకు తోడు అంటూ 

హరితపు నవ్వులు పంచుతుంది


తన ఆలోచనలను

రచనలుగానో , చిత్రాలు గానో మార్చడానికి

ఆ ప్రక్కనే సుందరమైన పింగాణీ కప్పులో

పెన్సిల్, ఎరేజర్, ఎర్ర సిరా, నీలి సిరా కలాలు ఉంటాయి

ఓ వైట్ ఆర్ట్ బుక్ కూడా


🌿


పడమర వైపు గోడకు

రామాయణ ఇతివృత్త ' మధుబని పెయింటింగ్ '

వ్రేలాడుతూ ఉంటుంది


ఉత్తరం గోడకు రమణ మహర్షి సందేశం

“Happiness is your nature. 

It is not wrong to desire it. 

What is wrong is seeking it outside when it is inside"

అందమైన ప్రేమ్ గా వ్రేలాడదీయబడి ఉంటుంది


దక్షిణం వైపు గోడకు

తన కూతురు పదవతరగతిలో ఉన్నప్పుడు చిత్రించిన

"అమ్మా నాన్న " బొమ్మ ఉంటుంది


ఎడమ చేతికి వ్రేలికి 

తన కొడుకు అమెరికా నుంచి పంపిన ఉంగరము ఉంటుంది


🌿


ప్రస్తుతం స్టవ్ ప్రక్కన

రసం మరకలు ,పాల మరకలతో 

సగం చదివిన

స్టీవ్ డే వ్రాసిన  " HOW TO READ PEOPLE "

పుస్తకం ఉంది


తన మొబైల్ లో ఎంతో ఇష్టమైన

ఎయిటీస్ , నైంటీస్ తెలుగు , హిందీ పాటలు

ట్యూన్ అవుతూ ఉంటాయి


అప్పుడప్పుడు 

భర్త బిజినెస్ టూర్ నుంచి పంపే 

మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్ హాయిగా ఉంటుంది


మధ్యలో

మిత్రుల తాత్విక చర్చల కాల్స్ 


తాగాలనుకున్నప్పుడు

ఓ కప్పు వెచ్చని కాఫీ తోడు కూడా


కిచెన్ లోంచి హాల్ లోకి చూస్తే

చక్కని చేమంతి మాలతో అలంకరించిన

వినాయకుని నిలువెత్తు శిల్పం దర్శనమిస్తుంది


🌿


ఆమె ఉన్నచోటనే

ఓ కమనీయతను సృష్టించుకున్న

స్థితానికి ప్రజ్ఞతకు మధ్య ఎదిగిన మనసు రవ్వ


మనసు

ఎడారిని కూడా

ఊటి తోటగా మార్చి వేస్తుంది


ఆనందించండి జీవితాన్ని

మీ చుట్టు చిన్ని దృశ్యాలను చేర్చుకుని


దుఃఖమైన

సంతోషమైన మనసు రాజ్యమే 😊


                                               ✍VIDURA' S LINES

                                                          20/11/2025