6, మార్చి 2026, శుక్రవారం

కాలర్ ట్యూన్ కథా కమామిషు

 చిన్న కథ సరికొత్త కథ చదివేయండి.. ఫ్రెండ్స్!!

కాలర్ ట్యూన్ కథాకమామీషు 

  • -వనజ తాతినేని. 

నగరం నడ్డిబొడ్డున వున్న  టెలికామ్ నెట్ వర్క్ మెయిన్ ఆఫీస్ కి వెళ్ళాడు ఆనంద్. 

రిసెప్షన్ లో ఇచ్చిన టోకెన్ నెంబర్ తీసుకుని లాంగ్ సోఫా లో విశ్రాంతిగా కూర్చున్నాడు. ఆ హాల్లో పదిమందికి పైగానే వున్నారు. ఎవరి మొబైల్ లో వారు తలదూర్చి ఎందుకొచ్చారో అన్న సంగతి మర్చిపోయి బ్రౌజింగ్ లో మునిగిపోయారు. క్యూ కదులుతూ వుంది. ఆనంద్ వంతు వచ్చింది. 


“చెప్పండి సర్! మీకు ఏ విధంగా సహాయపడగలను!?”


“మేడమ్! నాకు నాకిష్టమైన కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవాలని వచ్చాను. మీరు హెల్ప్ చేయాలి” 

“ఇంత చిన్న విషయానికి మీరు స్టోర్స్ వరకూ రావాల్సిన పని లేదు, మై ఎయిర్ టెల్ ఆప్ డౌన్లోడ్ చేసుకుని కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవచ్చు” అంటూ.. ఆనంద్ వైపు చూసి నవ్వింది. ఆ నవ్వులో ఎగతాళి గోచరించింది ఆనంద్ కి. 


స్ట్రాంగ్ గా ఆన్సర్ చేసాడు.  “ఇరవై సంవత్సరాల నుండి నాకిష్టమైన పాటను కాలర్ ట్యూన్ గా సెట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. నా ఆశ నెరవేరడం లేదు.. కావాలంటే నా నెంబర్ పోర్టబిలిటీ చేసుకోగలను. కానీ నేను వుండే ఏరియాలో ఆ నెట్ వర్క్ సరిగ్గా వుండదు. నేను మీ నెట్ వర్క్ మారను, నాకిష్టమైన కాలర్ ట్యూన్ కావాల్సిందే!” మొండి పట్టు పట్టాడు. 


 “మీకిష్టమైన పాట ఏమిటో చెప్పండి!? నేను ట్రై చేస్తాను” అంది కాస్త జాలి ప్రదర్శిస్తూ.


ఇంకెప్పుడన్నా అయితే.. మీ జాలి నాకవసరం లేదు అని తలపొగరుతో బయటకు వచ్చేసేవాడే!కానీ తన కల నెరవేరాలి! తప్పదు, ఆమె జాలి చూపులను విధిగా భరించి పని చేయించుకోవాలి అని మనసులో అనుకుంటూ… తనకు కావాల్సిన పాట చెప్పాడు. వింటూనే

ఓహ్.. ఈ పాటేనా.. అంటూ అతి తేలికైన స్వరం ప్రదర్శించి సిస్టమ్ లో చెక్ చేసింది. ఐదు నిమిషాలు చెక్ చేసింది మధ్య మధ్యలో ఆనంద్ ని చూసి చిరునవ్వులు చిందిస్తూ.. క్రమంగా సెంట్రల్ ఏ సి లో  కూడా ఆమె ముఖంలో చిరుచెమటలు. టిష్యూ పేపర్ తో చెమట తుడుచుకుని.. 

“సర్! మీరు అడుగుతున్న పాట ఫిమేల్ వెర్షన్ లో వుంది కానీ మేల్ వర్షన్ మా నెట్ వర్క్ పరిధిలో లభించడం లేదు. పోనీ ఇదే సెట్ చేయమంటారా!?” అడిగింది ఓపికగా.


“నో నో… గట్టిగా అరిచాననుకున్నాడు ఆనంద్ అరవకుండానే. “ సారీ! మేడమ్, ఇరవై ఏళ్ళ నుండి ప్రయత్నిస్తున్నా మీరు ఇవ్వలేకపోతున్నారు. ఈ విషయంలో మీరు టోటల్లీ ఫెయిల్యూర్!. BSNL లో ఇవ్వగల్గినప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు!? అసహనం ప్రదర్శించాడు. 


“ఆ మేల్ వెర్షన్ సాంగ్ కి copyrights వారు ముందుగానే తీసేసుకున్నారు సర్! ఈ నెట్ వర్క్ లో రావడం కష్టం” ఈసారి వీలైనంత సానుభూతిగా చెప్పింది. 


హ్మ్… అంటూ కూర్చున్న కుర్చీని శబ్ధం అయ్యేటట్టు జరిపి విసురుగా బయటకు వచ్చాడు. ఇలా అనుకున్నాడు బాధగా..


“సారీ! పూజా! నువ్వు నిరాశ అందించినట్టే నాకిష్టమైన ఈ పాట కాలర్ ట్యూన్ గా సెట్ చేసుకుందాం అంటే..  ఏళ్ళ తరబడి నిరాశ పరుస్తుంది. నువ్వెప్పుడైనా నీ జ్ఞాపకాల నిధి నుండి.. నా జ్ఞాపకాన్ని వెలికి తీసి నన్ను ఒకసారి ప్రేమగా పలకరిస్తావని… నువ్వు ఫోన్ చేసినప్పుడు.. 

నీకు నాకు ఇష్టమైన పాట “కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై” ముఖేష్ పాట నీ చెవినబడాలని నేను నిన్ను మర్చిపోలేదు అని చెప్పాలన్న  నా ప్రయత్నం. ఇరవై ఏళ్ళుగా నువ్వు నాకు ఫోన్ చెయ్యలేదు. నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు అని నేను నా నెంబర్ కూడా మార్చకుండా వున్నాను. ఇవాళే ఈ పాట కాలర్ ట్యూన్ గా వినిపించే నెట్ వర్క్ కి మారిపోతాను. నువ్వు నన్ను తలుచుకుంటున్నావని నా మనసుకు గట్టిగా అనిపిస్తుంది. ఇప్పుడే .. నాకిష్టమైన నీకిష్టమైన పాట.. నా కాలర్ ట్యూన్ గా.. సెట్ చేసుకుంటాను.


మరి… నీ ఫోన్ నెంబర్ ఏమిటీ!? నీ కాలర్ ట్యూన్ ఏమిటో… నాకెలా తెలుస్తుంది!? ఇన్నాళ్ళు నువ్వు నాకు కాల్ చేయలేదు, కేవలం రెండు రోజులు మాత్రమే వెయిట్ చేయ్, ప్లీజ్!! మనకిష్టమైన పాట వినిపిస్తాను” మనసులో ప్రాధేయపడుతున్నాడు ఆనంద్. పూజ కు అది వినిపిస్తుందా!? 


పూజ రెండు రోజులు ఆగి ఆనంద్ కి ఫోన్ చేయాలని కథకురాలినైన నేనూ మనసారా కోరుకుంటున్నాను. 


 ఆనంద్ ఇప్పటి ఈ యాతనకు ఈ కథ…  రేపు మరో రూపం కవిత అనుకుందాం. సరేనా!


(2006 నుండి 2012 వరకూ Hutch network లోనూ అప్పటి నుండి ఇప్పటి వరకూ ఎయిర్ టెల్ నెట్ వర్క్ లోనూ కూడా .. కభ కభీ మేరే దిల్ ముఖేష్ వెర్షన్ లభ్యం కాని విషయాన్ని  తీసుకుని సరదాగా ఈ కథ రాసాను. 😊😊) 

చదివినందుకు ధన్యవాదాలు మిత్రులారా! 🙏


కామెంట్‌లు లేవు: