27, మార్చి 2026, శుక్రవారం

కాలం ఎంచుకున్నది హృదయం నిలుపుకున్నది

 కాలం ఎంచుకున్నది, హృదయం నిలుపుకున్నది


అనుమతి లేకుండా వచ్చే రుతువుల వలె, 

మీ దారిలో ఎవరు తారసపడతారో 

కాలమే నిర్ణయిస్తుంది.


అది మీ సాధారణ రోజుల్లోకి అపరిచితులను పంపి

చిన్ని చిన్ని క్షణాలను 

మరపురాని అధ్యాయాలుగా మారుస్తుంది.


కానీ హృదయం 

ఆ నిశ్శబ్దమైన మొండి హృదయం 

ఎవరు నిలిచి ఉంటారో నిర్ణయిస్తుంది.


ఒకరిని దగ్గరగా ఉంచుకునేది క్యాలెండర్ కాదు, 

బంధాన్ని శాశ్వతం చేసేది గడియారం కాదు

ఈ ఆత్మ నా సొంత ఇల్లులా అనిపిస్తోంది 

అని గుసగుసలాడే భావనే అది.


కాలం మీకు వేలాది ముఖాలను పరిచయం చేయవచ్చు 

కానీ మీ హృదయం గుర్తుంచుకోవడానికి 

కొన్నింటిని మాత్రమే ఎంచుకుంటుంది.


కొందరు హడావిడి వానలా వచ్చి వెళ్ళిపోతుంటారు

మరికొందరు  రోజూ మీ చర్మంపై పడే 

సూర్యరశ్మిలా నిలిచిపోతారు.


చివరికి జీవితం అంటే ఏమిటంటే..

మీరు అనుకోకుండా కలిసిన వారి గురించి కాదు 

మీ హృదయం వదులుకోవడానికి నిరాకరించిన వారి గురించే 


మూలం: జస్విందర్ చాహల్


 - స్వేచ్ఛానువాదం: వనజ తాతినేని.

కామెంట్‌లు లేవు: