కథేమో ఆమెది. జీవితమేమో నాది.
ఆమె అంత అందంగా ఏమి వుండదు. నిజం చెప్పాలంటే నాకన్నా అందమైనదేం కాదు. కానీ చురుకైనది తెలివైనది. ఏ విషయమైనా త్వరగా ఆకళింపు చేసుకోగలదు. మనసారా నవ్వగలదు. బేషరతులు లేకుండా ఇతరులను ప్రశంసించగలదు. కపటం లేకుండా ప్రేమించగలదు. ఆమె ఎల్లప్పుడూ నా తలపుల నిండా కిక్కిరిసి వుండేది. ఆమె పట్ల ఈర్ష్యతో నా హృదయం భగభగమండుతూ వుండేది. నా భర్త తో కూడిన ఏకాంత సమయాల్లో కూడా ఆమెను పదే పదే స్మరించేదాన్ని. కొన్నిసార్లు స్వగతంలా. కొన్నిసార్లు సాధింపుగా. అతను ఓపికగా భరించేవాడు. లేదా వెళ్లి పిల్లల దగ్గర పడుకునేవాడు.
నా ఈ ప్రవర్తన వెనుక కారణం వుంది. నా భర్త హృదయంలో ఆమె చెరపలేని పచ్చబొట్టుగా ముద్రింపబడి వుంది. అలా అని ఆమె చెడ్డది నాకు ద్రోహం చేసే మనిషి కాదని కూడా నాకు నిశ్చయంగా తెలుసు. ఒక విధంగా ఆమె నా పాలిట దేవత. ఆమె మాటల్లో మాయ మంత్రం ఏమైనా వున్నాయేమో అని నాకు అనుమానం. ఆమె ఏం చెపుతుందో ఏమో! నా భర్త తు చ తప్పకుండా పాటిస్తాడు. ఆ విషయం మా అత్తగారు కూడా హెచ్చరిస్తుంది దృవ పరుస్తుంది. . “ఇదిగో .. సుధా! మీ కాపురం చక్కబడుతుందని నేను కలలో కూడా అనుకోలేదు.అందుకు కారణం ఆమె” అనేది. నాకు లోలోపల అగ్గి రాజుకునేది. మనిషి మాటల్లో సత్యం కరుకుగా అయినా వుండాలి. అబద్దం ధర్మం కోసమైనా చెప్పివుండాలి. మొదటిదే నిజం.
నిజమే! నా అనుమానపు చూపులు సూటీపోటీ మాటలు వల్ల దుకాణంలో ఆడవాళ్ళను పనిలోకి పెట్టుకోవడం మానేసాడు నా భర్త. అయినా నా అనుమానపు జబ్బు ఆముదం జిడ్డులాగా నా మనసును అంటిపెట్టుకుని వుండేది. కారణం నా భర్త అందగాడు.అతన్ని ఎవరైనా నాకు దూరం చేస్తారని నా భయం. ఈ విషయం వల్లే మా మధ్య తరచూ గొడవలు జరిగేవి. అవి తారాస్థాయికి చేరుకుని నేను పిల్లలను కూడా వదిలేసి పుట్టింటికి చేరుకున్నాను. రెండేళ్ళ తర్వాత మళ్లీ కలిసాం.
అప్పుడే చెప్పాడు ఆమె గురించి. మన హితం కోరే మనిషి మనల్ని విడదీసే మనిషి కాదని. ఒకసారి బిల్ బుక్ ల మధ్య ఓ కాగితం చూసాను. ముత్యాలకోవ లాంటి దస్తూరి. ఆ దస్తూరి నా భర్తదే!
“ఆమె చిటారు కొమ్మన వున్న మిఠాయి పొట్లం కాదు అందని పండు కాదు. చిటారు కొమ్మన ఊయలలూగుతున్న యెన్నడూ రాలని దేవతా పుష్పం. అయినా దోసిలి పట్టే వుంచాను. ఆమె తలపు నాలో ఏదో తెలియని అతి మృదువైన బాధను రేపుతుంది. ఏకాగ్రతగా పని చేసుకుంటున్నప్పుడు ఆమె మాటల్లో కర్తవ్యదీక్షను బోధించే తాత్వికత, ఏదైనా పాట వింటున్నప్పుడు సంగీతం విన్నట్లుండే ఆమె పలుకులు గుర్తుకు వచ్చేవి. పుస్తకం చదువుతున్నప్పుడు పుటల్లో ఆమె రూపం ప్రత్యక్షమై.. నేను నేను కాకుండా పోయిన రోజులవి. ఆమె ఎల్లప్పుడూ అదృశ్య నీడ రూపంలో సున్నితమైన స్పర్శను నా శరీరంపైనా, మనసుపైనా ప్రసరింపజేస్తూ వుండేది.” అని.
అత్తెసరు చదువులు చదివిన ఆ రాత లోతులు అర్థం కాకపోయినా ఎవరిని ఉద్దేశించి రాసుకున్నాడో నాకు అర్థం అయ్యింది. ఆ రాత్రి పెద్ద యుద్ధమే జరిగింది.
“ఫేస్ బుక్ లో రాసుకుంటూ వుంటాడు కదా! ఆ కవిత్వం కాకరకాయ ఏమో! అంతా నీ అనుమానం” అని కొట్టిపారేసింది అత్తగారు.
అలా లేదని నేను వాదిస్తుంటే ..
“నువ్వసలే అనూరాధ నక్షత్రంలో పుట్టావ్ , నీది అసూయ ఈర్ష్య ద్వేషాల స్వభావం. నీలాంటి అనుమానపు పిశాచాన్ని కట్టబెట్టి నా బిడ్డ గొంతు కోసాను అంది.
చుట్టం చూపుగా వచ్చిన మా అమ్మ కల్పించుకుని పదహారేళ్ల పిల్లనిచ్చి పెళ్ళి చేసాను. పదహారేళ్ళ నుండి ఇవే తగువులు. మా పిల్ల మాకు బరువు కాదు. తీసుకుని పోతాం” తగ్గేదే లేదు అన్నట్లు.
నేను కొంచెం తగ్గాను. అప్పటికి గొడవ సద్దుమణిగింది. ఆ రాత్రి నా భర్త స్థిరంగా స్పష్టంగా చెప్పాడు. “ ఆమె నా స్నేహితురాలు మాత్రమే! అంతకుమించి ఏమీ కాదు, కాబోదు. నువ్వు ప్రతిసారి ఇలాగే గొడవపడితే నీతో నేను గొడవపడలేను విడాకులు ఇచ్చేస్తాను” అని. నేను జంకాను. నా అనుమానం నిరాధారమైనది కాదు కానీ.. నా భర్త ఆమె స్నేహం అంతకు మించి అభిమానం ప్రేమ గొప్పవి. హద్దులు ఎరిగినవి. అనుబంధాలు ఎంత సున్నితమైనవి . ఒక చోట తెగి పోయి మరొక చోట పెనవేసుకుంటాయి . బాహ్యంగా కాదు అంతర్లీనంగా, దృఢంగా.
మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. కథంతా ఆమెదే! జీవితమే నాది. నాకేం లోటు లేదు సంతోషం కూడా నిండుగానే వుంది. కానీ.. కానీ.. నా భర్త హృదయంలో ఇప్పుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఆమె వుంటుంది. ఏం చేసి కూడా ఆమెను తొలగించడం సాధ్యం కాలేదు. ఆ విషయం తల్చుకుంటే దుఃఖం పొంగుతుంది. ఒకసారి ఏమైందంటే… నేను ఆత్మహత్య ప్రయత్నం చేసాను. హాస్పిటల్ లో బెడ్ మీద నేనుప్పప్పుడు నా భర్త హృదయవిదారకంగా రోదించడం నాకు తెలుస్తూనే వుంది. అదెలాగంటే ఆమెకు ఫోన్ చేసి .. “చూడు నేస్తం ! ఈ పిచ్చిది ఎంత పని చేసిందో! పిల్లలు వచ్చి అమ్మనేంటి ఇలా చేసావ్ నాన్నా! అంటే నేను ఏం సమాధానం చెప్పాలి? నా చుట్టూ ఎన్ని గాలి వార్తలు పోగయ్యేవి. నీ చుట్టూ ఎన్ని అపవాదుల గోడలు కట్టేసేవారు” అని. ఆ సమయంలో కూడా ఆమె కోసం కూడా సమానస్థాయిలో తల్లడిల్లిపోయాడు. అంతకన్నా విషాదం ఏముంటుంది నాకు. పరమసత్యాన్ని జీర్ణించుకుంటూ బతకడానికే బతికాను అనుకుంటా. మేము విడిపోయి మళ్ళీ కలిసిపోయేటప్పుడు కంటికి రెప్పలా కాపాడతానని మా వాళ్ళకు మాటిచ్చాడు. ఏనాడూ మాట తప్పలేదు. కానీ .. కానీ అతని హృదయంలో నాకు స్థానం లేదు. అది నాకు కచ్చితంగా తెలుసు.
ఇదంతా జరిగి 15 సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు చదువులు పూర్తై ఉద్యోగాల్లో కుదురుకున్నారు. నేను కూడా కళ్ళకున్న అనుమానపు పొరలు తొలగించుకుని మనసును విశాలం చేసుకున్నాను. మా కుటుంబాల మధ్య స్నేహం బలపడింది.
బాల్య వివాహాలు చేయడం సరియైన నిర్ణయం కాదని “పుత్తడి బొమ్మ పూర్ణమ్మ” కథ చెప్పినట్లు
భర్తల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రియురాళ్ళ గురించి భార్యల దుర్భర వేదన గురించి కూడా కథలు కథలుగా చెప్పాలి. వివాహానంతరం కూడా స్త్రీ పురుషుల మధ్య కలిగే ఆకర్షణ వల్ల జరిగే పరిణామాలు గురించి చెప్పాలి. తలలు బోడులైనా తలపులు బోడులా అనే వేమన పద్యం ఉదహరించుకోవాలి.
శారీరక ఆకర్షణలా? భావసారూప్యత పట్ల కలిగే ఆకర్షణలా.. లేక నిజంగానే తన వారందరినీ కూడా మరిపించే ప్రేమ అనే దివ్యౌషధం అనేది ఒకటి వుందా? అది యాదృచ్ఛికంగా తారసపడుతుందా? నా భర్త హృదయంలో నాకు స్థానం లేకపోవడం అనే నష్టాన్ని ఎవరు పూడుస్తారు? తప్పు నా భర్త దా? ఆమె దా? లేక నాదా?
హృదయాలలో ప్రేమ దివ్వె వెలిగించడం ఎవరు నేర్పిస్తారు? నేను మరొక పురుషుడి రూపాన్ని హృదయంలో ప్రతిష్టించుకున్నాను అంటే నా భర్త భరించగలడా?
అనూరాధ నక్షత్రంలో పుట్టిన వారికేనా ఈ ఆలోచనలు ప్రశ్నలు? మా అత్తగారిని అడగాలి జవాబు ఏం చెబుతుందో!
ఇప్పటి వరకూ.. నేను చెప్పిన కథ విన్నారు కదా! మరొక భాగంలో కథ చూపిస్తాను.
వేచి వుంటారు కదూ! _ సుధ.
కథ చదవడానికి తయారుగా వున్నారా!?
ఇది ప్రేమ కథేమో అని మీరు భావిస్తే లేదా ఒక అనుమాన పిశాచి చెబుతున్న కథ అని భావిస్తున్నట్లైతే.. ఇది వారిద్దరి స్నేహం అమలిన ప్రేమ వల్ల జరిగిన నా హత్య కాని హత్యకు పోస్టుమార్టం రిపోర్ట్ అనుకోండి. జరుగుతున్న కథ మీరే చూడండి.
ఎవరి కథలో ఎవరు కలలా, ఊహలా కేవలం పాత్రగా మిగిలిపోయారు. ఎవరి జీవితం ఎవరితో సాగుతుంది. ఆమె యాదృచ్చికంగా ప్రయాణంలో కలిసిన ప్రయాణికురాలేనా?. అతని హృదయంలో నిజంగా ఎవరు వున్నారు? అది తెరిచి చూడగల్గింది ఎవరూ!? మీరే చెప్పండి. ఇక కథ నుండి నేను తప్పుకుంటున్నాను.
“కథేమో ఆమెది, జీవితమేమో నాది.”
సెలవు. సుధ. 🙏
**********
హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్న సుధ కొడుకు కోడలు.. వీకెండ్ రోజున లేటెస్ట్ మోడల్ సెవన్ సీటర్ ఇన్నోవా కారుతో వచ్చి సర్ప్రైజ్ చేసారు.ఇంత పెద్ద కారు ఎందుకు సన్నీ! మీకు సరిపడా కొనుక్కుంటే బాగుండేది అంది సుధ.
“అమ్మా! మాకు మాత్రమే కాదు మనందరి కోసం కొన్నాం కారు. ప్రతిదానికి లెక్కలు వేయకు.” మెత్తగానే అయినా గట్టిగా చెప్పాడు. ఆ రోజంతా సందడిగా గడిచిపోయింది. మర్నాడు కుటుంబం అంతా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేసుకుని హంసలదీవి బీచ్ కి వెళ్ళాలనుకుని బయలుదేరారు. హైవే పై వాయువేగంతో ప్రయాణిస్తుంది కారు. బెంజ్ సర్కిల్ దాటిన తర్వాత సడన్ గా సుధ అంది. “ఆంటీ వాళ్ళు ఇటువైపేగా వుండేది. ఆమెను కూడా తీసుకుని వెళదాం సన్నీ”అంది.
డ్రైవింగ్ చేస్తున్న సన్నీ ఆశ్చర్యంగా తలతిప్పి తల్లిని చూసాడు. వెంటనే తండ్రి వైపు చూసాడు. అతను ఆశ్చర్యంగానే చూస్తున్నాడు. “ఆంటీ కి కాల్ చేయ్ రెడీగా వుండమని” అని తొందర చేసింది. తండ్రి ఫోన్ తీసుకుని నెంబర్ సేవ్ చేసుకుని కాల్ చేసాడు. ఆమె వెంటనే స్పందించింది.
అయ్యో! నేనెందుకు మీరు ఫ్యామిలీ తో సరదాగా వెళుతున్నారు. మధ్యలో నేనెందుకు? మొహమాట పడింది.
“లేదాంటీ .. మీరు కూడా వస్తే బాగుంటుంది అని అమ్మ చెప్పింది. ఇదిగో అమ్మతో మాట్లాడండి.”
ఫోన్ వెనక్కి అందించాడు. “అక్కా! మీరు రాకపోతే ఎలా? తప్పకుండా రావాలి. మేము వస్తున్నాం” అని చెప్పి ఫోన్ కట్ చేసింది.
ఆమె.. అడ్రెస్ చేంజ్ అయింది అంటూ లొకేషన్ షేర్ చేసింది. పది నిమిషాల్లో ఆమె షేర్ చేసిన ల్యాండ్ మార్క్ దగ్గర కారు ఆపాడు సన్నీ. అతను డోర్ తెరుచుకుని దిగాడు.
ఎదురుగా నడిచి వస్తున్న అతను ఆమె వైపు చూసాడు. అతన్ని చూడగానే ఆమె ముఖమంతా సంతోషంతో విచ్చుకుంది. కళ్లు నక్షత్రాల్లా వెలిగిపోతున్నాయి. రెండేళ్లైంది మరి అతన్ని చూసి. చూడగానే ఆత్మీయ భావం. కళ్ళతోనే హృదయాన్ని తడిమే పలకరింపు. ఎప్పటిలాగానే చూడగానే నవ్వు విచ్చుకుంది. చంద్రమోహనం ఆ వదనం, చందన కలశం ఆ నయనం హమ్ చేయబోయి బలవంతంగా అణచుకొంది. మర్యాదగా సన్నీ కూడా కారు దిగాడు. ఒకొరికొకరు కుశల ప్రశ్నలు వేసుకునే సమయంలో భార్యని చెల్లెల్ని బ్యాక్ సీట్ లోకి కూర్చోబెట్టాడు సన్నీ. “అయ్యో! నేను రావడం మూలంగా పిల్లలు వెనక్కి సర్దుకోవాల్సి వస్తుంది. లేకపోతే సరదాగా ఎంజాయ్ చేసే వాళ్ళు కదా” అని నొచ్చుకుంది ఆమె.
“వాళ్లు యూత్! వదిన మరదళ్లు మరిన్ని కబుర్లు చెప్పకుంటారు లే అక్కా! మాతో పాటు మీరు రావాలనే కదా మా అందరి కోరిక.” మా అందరి అనే మాటను నొక్కి పెట్టి అంటున్న తల్లి వైపు నిశితంగా చిన్నపాటి అనుమానంగా చూసాడు సన్నీ.
తండ్రిని తన పక్కనే కూర్చోమని తల్లిని ఆమెను మిడిల్ లో కూర్చోమన్నాడు. బీచ్ వైపుగా ప్రయాణం. సుధ మనసు గందరగోళంగా వుంది. అయినా నిబ్బరంగా కనబడటానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అత్తమామల ఆరోగ్యం, అమ్మాయి ఉద్యోగం,పెళ్ళి ప్రయత్నాలు గురించి ఆమె ప్రశ్నలు. సుధ సమాధానాలు. ఆమె పిల్లల క్షేమసమాచారాలు గురించి సుధ అడిగి తెలుసుకుంది.
“ఆంటీ! మీ ఫోన్ ఇవ్వండి. మీ ప్లేలిస్ట్ కనెక్ట్ చేస్తాను అన్నాడు సన్నీ. బ్లూటూత్ కనెక్ట్ అయ్యాక వరుసగా నాలుగైదు పాటలు ప్లే అయ్యాక సుధ అంది. మీ ఫ్రెండ్స్ ఇద్దరూ వినే పాటలు ఒకటే! భలే బాగుంటాయి అక్కా!” అని. సన్నీ నవ్వుకున్నాడు.
నిన్న సాయంత్రం తండ్రికి తనకు జరిగిన సంభాషణ గుర్తు చేసుకున్నాడు.
తండ్రి డ్రైవింగ్ లో వుంటే ఫోన్ తన చేతిలో వుంది. స్క్రీన్ పై వాట్సాప్ కి వస్తున్న నోటిఫికేషన్ చూసాడు. “ఆర్ యూ ఓకే!” అని అడుగుతూ వున్న సందేశాన్ని.
“ఆంటీ ఏదో అడుగుతున్నారు నాన్నా!” అన్నాడు.
“మీరు వచ్చారు కదా! పనుల్లో బిజీగా వుండి గుడ్ మార్నింగ్ మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు.” అంటూ ఆర్కైవ్ లో వున్న మెసేజ్ ఓపెన్ చేసి కొడుకు చేతికి ఇచ్చాడు. తండ్రి ఇష్టదైవం లైవ్ స్క్రీన్ షాట్ గుడ్ మార్నింగ్ చెబుతూ ఒక పువ్వు. డిలీట్ చేయని చాట్ అంతటా అదే వరుస.ఎప్పుడైనా పంచుకున్న పాటలు అటు ఇటు వైపు నుండి. అంతే!
కారు స్టేడియం పక్కనే ఆపాడు అతను. సన్నీకి తెలుసు. తండ్రి తనతో ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు పార్క్ దగ్గరకో, స్టేడియం దగ్గరకో తీసుకుని వచ్చి ఒంటరిగా మాట్లాడతాడని. అది తన చదువు విషయమైనా, ఉద్యోగ విషయమైనా, రెండేళ్ళపాటు నలిగిన తన ప్రేమ వివాహం విషయమైనా, ఆర్ధిక విషయాలైనా,
నడుస్తూ.. కొడుక్కి చెప్పాడతను. “నేను రిప్లై ఇవ్వకపోతే ఆంటీకి భయం సన్నీ! సమ్ థింగ్ రాంగ్ అనుకుంటుంది. మీ అమ్మ అసలు మా స్నేహమే సమ్ థింగ్ రాంగ్ అనుకుంటుంది. నిత్య జీవిత సమస్యల్లో కష్టనష్టాల్లో భావ ప్రపంచపు అలజడిలో మేము ఒకొరికొకరం మనసైన ఓదార్పు. మా స్నేహం వల్లో మా అనుబంధం వల్లో ఇరు కుటుంబాల్లో ఎవరికి కూడా చీమంత కూడా హాని కలగలేదు కలగబోదు కూడా! ఇంకా చెప్పాలంటే మా స్నేహం వల్ల మా జీవితాలను ఉన్నతంగా నిలబెట్టుకున్నాం. అది గర్వంగా చెప్పుకుంటాం.” అతని గొంతు సన్నగా వణికింది. కళ్ళల్లో సన్నని తడి.
సన్నీ విచలితమై “అర్థమైంది నాన్నా!” అంటూ తండ్రిని హగ్ చేసుకున్నాడు.
“నువ్వు మాత్రం జాగ్రత్తగా వుండు, అమ్మాయిలతో స్నేహం చేయకు, స్నేహం ఎలాంటిదైనా జీవితాల్లో చిచ్చు పెడుతుంది.నరకప్రాయం చేస్తుంది.అందులో నీ భార్య జాబ్ చేస్తుంది. ఏమైనా తేడాలొస్తే వెంటనే విడాకులకు రెడీ అయిపోతారు.’’
“నాకు అలాంటి ఇబ్బంది రాదులే నాన్నా! మీ కోడలికి అండర్ స్టాండింగ్ ప్రేమ ఎక్కువే!”
“మీ అమ్మకు మాత్రం అవి లేక అలా చేస్తుందా! ఎక్కువై ఎక్కువ ఊహించుకుని అలా చేస్తుంది. నీకూ చెల్లికి తెలియనిది ఏముంది?”
“అవును, చెల్లి చెబుతుంది అమ్మ బిహేవియర్ ఒకోసారి నాన్సెన్స్ గా వుంటుంది అని.”
చెబుతూ సాలోచనగా చూసాడు తండ్రి వైపు.
“నీకో విషయం తెలుసా!? ఆంటీని నేను కళ్ళతో చూసి ఏడేళ్ళు అయింది. మళ్ళీ మీ పెళ్ళికి వచ్చినప్పుడు చూడటమే! కానీ మీ అమ్మకు అనుమానం చావదు”
సన్నీ ఈసారి ఆశ్చర్యంతో పాటు జాలిగా చూసాడు తండ్రి వైపు.
“సన్నీ! నాదో రిక్వెస్ట్!”
“చెప్పు నాన్నా! చెల్లి పెళ్ళికి పర్సనల్ లోన్ తీసుకుంటాను. పది లక్షల వరకూ ఇవ్వగలను. మీరు డబ్బు గురించి బెంగ పడవద్దు.”
“విషయం అది కాదు రా! సడన్ గా నాకేమైనా అయితే అమ్మను చూసుకున్నట్టు కాకపోయినా ఆంటీ గురించి కూడా నువ్వు పట్టించుకోవాలి. ఫైనాన్షియల్ గా కాదు, క్షేమ సమాచారాలు అవీ కనుక్కుంటూ వుంటే చాలు.”
“ అయ్యో నాన్నా! మీరిలా చెప్పడం బాగాలేదు, మీకేమవుతుంది? మేమంతా లేమూ” ? తండ్రి భుజం చుట్టూ చేయి వేసాడు.
“లేదు రా, ఏదైనా చెప్పి రాదు కదా! నీకు ఒక మాట చెబితే నాకు తెరిపిగా వుంటుంది అని.”
సన్నీ తండ్రిని మళ్ళీ హగ్ చేసుకుని చాలా సేపు అలా వుండిపోయాడు. గతంలో వచ్చిన స్ట్రోక్ సంగతి గుర్తుంది. మనసులో తెలియని భయం ప్రవేశించింది.తండ్రితో వీలైనంత ఎక్కువ గడపాలి అనుకున్నాడు.
డ్రైవింగ్ సీట్లో తండ్రిని కూర్చోబెట్టాడు. ఇద్దరూ కలిసి నగరం అంతా తిరిగారు.స్నేహితులను బంధువులను కలిసి స్వీట్స్ పంచుకున్నారు.
“రేపు బీచ్ కి వెళదాం నాన్నా! బాపట్ల వద్దు. హంసలదీవి వెళదాం. చెల్లి కూడా చూడాలంటుంది”
“మీ ఇష్టం, మీరు ఎక్కడికంటే అక్కడికి”..
*********
ఆలోచనలు నుండి బయటకు వచ్చి తండ్రి వైపు చూసాడు.
నిన్న తండ్రితో జరిగిన సంభాషణ వల్ల ఆంటీతో మరింత గౌరవంగా మసలుకున్నాడు సన్నీ.
మనసులో ఇలా అనుకున్నాడు.
“వారిద్దరి మధ్య కేవలం దూరం మాత్రమే వుంది.అది చాలా ఉద్దేశపూర్వకమైన దూరం.
వారిద్దరూ వారి అనుబంధాన్ని ఎన్నడూ బయటికి వ్యక్తం చేయడం వుండదు. అలాగే వందలసార్లు ప్రశ్నించినా దాన్ని ఖండించే ప్రకటనలు కూడా వుండవు.
తల్లి మనసులో ఏం వుందో తెలియదు. ఆంటీని ఏమీ అవమానించదు కదా! కావాలని అందుకే పిలిచిందేమో! చిన్నపాటి అనుమానం మొలకెత్తింది. కానీ అటువంటివి ఏమీ లేకుండా ట్రిప్ అంతా సరదాగా గడిచిపోయింది. రిటర్న్ లో ఆమెను ఎక్కిన చోటున దించి వెళ్లారు. “రేపు రండి అక్కా! చాలా రోజులైంది మీరు వచ్చి” అని ఆహ్వానించింది.”అమ్మాయి పెళ్లికి వస్తాను. ఇప్పుడు మిమ్మల్ని అందరిని చూసానుగా” జవాబు ఇచ్చింది. ఆమె అతను కళ్ళతో వీడ్కోలు తీసుకున్నారు.
హైబ్రిడ్ జాబ్ కావడం వల్ల సన్నీ, వల్లి సిటికీ వెళ్ళడానికి తొందరపడలేదు.
మర్నాడు ఉదయం తొమ్మిది గంటలప్పుడు టీ కప్ లు తీసుకుని తల్లిని టెర్రస్ పైకి పిలుచుకుని వెళ్లాడు సన్నీ.కాసేపు పిచ్చాపాటీ మాట్లాడాక విషయంలోకి దిగిపోయాడు.
“అమ్మా! రోజూ నాన్నను సాధించి చావగొడతావ్, మళ్ళీ నువ్వే ఆమెను పిలుస్తావు. సొంత అక్క చెల్లెళ్ళు అన్నంత ఇదిగా వుంటావు. నువ్వేంటో అసలు నాకు అర్థం కాకుండా పోయావు నాన్న ఫోన్ కి చాట్ లాక్ కూడా వుండదు. నువ్వెందుకు ఆయన మీద గూఢచర్యం చేస్తావు.పదే పదే ఫోన్ చెక్ చేస్తావు, ఎవరితో నైనా మాట్లాడుతున్నాడేమోనని ఫోన్ చేసి చెక్ చేస్తావ్, నాన్న వాట్సాప్ లైవ్ లొకేషన్ నీ ఫోన్ కి ఎందుకు పెట్టుకున్నావు.ఈ మధ్య యూట్యూబ్ నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది నీకు. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నువ్వు ఇంకా మారావా!? నాన్న కాబట్టి నిన్ను భరించాడు.” కోపంగా ప్రశ్నించాడు.
సన్నీ! నేనేంచేయను? నా మనసు స్థిమితంగా వుండదు. మీ నాన్న నాకు దూరమై పోతాడేమోనని నాకు భయం. నిన్న ఆంటీ ని రమ్మని పిలవడం వెనుక నాది ఒక స్వార్థం వుంది. మీ ఆంటీ మీ నాన్న కళ్ళెదుట లేనప్పుడు ఎప్పుడూ ఆయన మనసులోనే తిష్ట వేసుకుని వుంటుంది. భార్య గా నాకు ఆ సంగతి బాగా తెలుసు. కనీసం ఆమె ఎదురుగా వున్న కాసేపైనా మీ నాన్న హృదయంలో నేను వుండాలనే తాపత్రయంతో ఆమెను గుడికి బీచ్ కి రమ్మని పిలిచానంతే! అంటూ గట్టిగా ఏడ్చేసింది.
తల్లిని ఆ స్థితిలో చూసి చలించిపోయాడు. “ఎంత అమాయకత్వం అమ్మకి!” అంటూ జాలిపడ్డాడు. తల్లి కన్నీరు తుడుస్తూ తాను కన్నీరు పెట్టుకున్నాడు.
“నువ్వు అనుకున్నట్టు ఏమి వుండదు అమ్మా! అంతా నీ ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్. నాన్నను అనుమానించి అనుమానించి ఆయనకు నీపై ప్రేమ లేకుండా చేసుకున్నావు. ఇతరులవైపుకు ఆయన్ని నువ్వే నెట్టేసావేమో ఆలోచించుకో! నాయనమ్మ ఏం చెప్పిందో తెలుసా! మీ అమ్మ నాన్న కలిసి వుండాలని నేను ఎంత కృషి చేసానో ఆమె కూడా అంత కృషి చేసింది. రెండు మూడు సార్లు ఆమెను కలిసి మాట్లాడాను,మంచి మనిషి. మన మంచి కోరే మంచి స్నేహితులు వుండాలి” అని క నా చిన్నప్పుడే చెప్పింది. నీకు తెలియకుండా నాన్న ఎక్కడికైనా వెళ్ళగలడా చెప్పు? నీ అనుమానంతో నాన్నను నిత్యం సాధిస్తే నాన్నకు గుండె పోటు రాక ఏమొస్తుంది? నీ ఆలోచన మార్చుకో, క్షణం క్షణం మారిపోయే నీ చిత్తాన్ని మార్చుకో. మా నాన్నను కాస్త ఎక్కువ కాలం బతకనీయమ్మా! చేతులు జోడించాడు. ఆ చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సుధ.
“అమ్మా! నీ జీవితం ఎప్పుడూ సుధామధురమే! నువ్వు ఊహించుకున్న కథ కథగానే వుంటుంది. వేరే కథగానే మిగులుతుంది. కథలెప్పుడూ వాస్తవం కాదు. వాస్తవంగా కనబడే మరు మరీచకలు. నువ్వు మా నాన్న గురించి ఊహించుకుంటున్న కథ కూడా అంతే!” ఏడుస్తున్న తల్లిని అలాగే వదిలేసి కిందికి వచ్చి చెల్లిని తల్లిని ఓదార్చమని పంపాడు.
తర్వాత రోజు కుటుంబం అంతా మ్యారేజ్ రిసెప్షన్ కి వెళ్లారు. ఎన్నడూ లేనంత సంతోషంగా కనబడింది సుధ. చక్కగా రెడీ అయింది కూడా! భర్త పక్కన నిలబడి రెండు మూడు ఫోటోలు తీయించుకుంది. అమ్మ చాలా సంతోషంగా వుంది. నేనిచ్చిన కౌన్సిలింగ్ కూడా బాగా పనిచేసినట్టు వుంది అనుకున్నాడు సన్నీ.
ఈ కథకు ఎవరూ చూపించగల పరిష్కారం లేదు. అసలు ఏమీ లేని కథకు పరిష్కారం ఏముంటుంది?. చక్కని ముగింపు కూడా లేదు. కేవలం ఒక నిశ్శబ్దం మాత్రమే వుంది.అది అర్థమైన వారికి అర్ధమైనంత! అపోహలు పడేవారికి పడినంత, పట్టనంత.
అతనికి ఆమెపై ఆకాశమంత ప్రేమ, ఆరాధన వుంది.
ఆమెకు ఎనలేని ఆత్మ స్వేచ్ఛ వుంది.
జ్ఞానం నిండిన అహంకారం వుంది.
అతను ఆమెను యెన్నడూ నిరోధించడు.
కానీ ఆమె అతని ప్రేమకు తనని తాను బందీ చేసుకుంది.
వారిరువురు వేరు వేరుగా జీవిస్తూ ఒకరి జీవితంలో మరొకరు మైలు రాళ్ళు.
ప్రయాణం చాలానే వుంది. సాగుతుంది.
**************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి