నువ్వూ నేనూ - ఓ ప్రేమ -వనజ తాతినేని
శ్రీకాంత్.. నేనో విషాద సంగీతం
పాషాణంగా మార్చిన హృదయాన్ని కూడా బద్దలు కొట్టే ఆయుధం ప్రేమ అని నా ప్రగాఢ విశ్వాసం. ఆ కలల్లోనే జీవించాను. కల చెదిరింది కథ మారింది.
కలే కన్నాను లే.. అని హమ్ చేసుకుంటూ బయటకొచ్చాను.అది అమ్మ నివసించే ఇల్లు. నాన్న ప్రేమగా తన ప్రియురాలికి కట్టించి ఇచ్చిన ప్రేమ మందిరం. ఇప్పుడది నా ప్రేమ మందిరం. నాన్న తన కొడుకులతో గడపడానికి భార్యతో కలిసి ఫారిన్ ట్రిప్ లో. అమ్మ పుట్టింటి బంధువుల ఇంటికి కలకత్తా నగరానికి.
మిట్ట మధ్యాహ్నానికి కాస్త ముందు తోటంతా వెలుగుతోంది.
పూలన్నీ బృందగానం చేస్తున్నాయి. తుమ్మెదలు సీతాకోక చిలుకలు తికమక పడుతూ ఎంగిలి విందులో మునిగి తేలుతున్నాయి. రెండు కదంబ వృక్షాల మధ్య వేసిన సిమెంట్ బెంచీ పై కూర్చుని వుంది సావేరి. ఆమె పక్కగా పచ్చని చెట్ల నీడన పర్ణశాల లాంటి కుటీరం. లోపల కట్టిన చీర ఉయ్యాలలో పాపాయి నిద్రపోతోంది.
నల్లంచు పసుపు పచ్చని బెంగాల్ కాటన్ చీర పసుపుపచ్చ అంచు వున్న నల్ల హై నెక్ బ్లౌజ్ విరబోసిన కేశాలు పచ్చికపై జీరాడుతూ. అచ్చం వనలతాసేన్ లా వుంది. ఒడిలో పుస్తకమైతే వుంది కానీ.. చూపులు నదిలో కదులుతున్న పడవపై.
వెనుక నుండి చప్పుడు కాకుండా వచ్చి భుజాలపై చేతులు వేసాను. ఆమె కనులు తిప్పి నన్ను
చూసి నవ్వింది. ఆమె గడ్డం కింద చేతులుంచి పద్మం లాంటి ముఖాన్ని వెనక్కి వంచి నుదుటిపై ఓ ముద్దిచ్చాను.
“ఈ చీరలో ఎంత బాగున్నావో తెలుసా! అచ్చం బెంగాలీ వనిత లా. అమ్మ నిన్నిలా చూస్తే సంతోషిస్తుంది. ఆమె చీర ల్లో నుంచి ఈ సరికొత్త చీరను తీసి నీకు బహుమతిగా ఇమ్మని అమ్మ చెప్పిందిలే!
“అత్తయ్య అంగీకరించారా!?” ఆత్రుతగా అడిగింది.
“ ఊ…శ్రీ ..నువ్వు పాప ని కూడా అంగీకరించాలి, తల్లి బిడ్డ లను వేరు చేయవద్దని ఆజ్ఞాపించింది కూడా!”
“ వారితో మాట్లాడతాను నేను” సంభ్రమంగా అంది.
“ ఉహూ, ఇప్పుడు కాదు, రాజమండ్రి దాకా వెళ్ళొద్దామా,రికార్డింగ్ స్టూడియో కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఆర్డర్ పెట్టి ఎయిర్ నెట్ లోకి మార్పించుకుని వచ్చేద్దాం”
“పాపాయి నిద్రపోతుంది కదా శ్రీ! నువ్వెళ్లి వచ్చేయ్! ఈ లోపు నేను వంట చేసేస్తాను”
అంతే! నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు ఖాళీ. సగంలో ఆపేసిన వంట. తీగపై ఆరేసిన బట్టలుతో సహా ఎక్కడివి అక్కడే. గేటు ముందు కారు టైర్ల గుర్తులు.
ఏటి ఒడ్డుకు వెళ్ళి చూపులతో గాలించసాగాను. బల్లకట్టు నరసింహ చెప్పాడు. మీ ఇల్లు వెతుక్కుంటూ రెండు కార్లలో మనుషులు వచ్చారయ్యా!. ఆమెను చిన్నబిడ్డను ఎక్కించుకుని వెళ్లిపోయారు అని. ఊహిస్తూనే వున్నాడు తను. జరిగిపోయిందలాగే! సావేరి కి కాల్ చేసాను. వాయిస్ మెయిల్ కి వెళుతుంది కాల్.
రెండు రోజులుగా పది నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తూనే వున్నాను. అందుబాటులో లేదని నెట్ వర్క్ సమాచారం. నేను ఎక్కడ వెతకాలి, వైజాగ్ లోనా హైదరాబాద్ లోనా!?
“ఎక్కడున్నావు సావేరీ! నాకు దూరంగా! నువ్వెక్కడ వున్నా, నా లోపల నువ్వు అత్యంత స్పష్టతతో ఉన్నావు”
కంటికెదురుగా పోర్టబుల్ రేడియో. నెలల పర్యంతం మూగబోయిన రేడియో ని ఆత్రుతగా పెట్టి చూసాను. ఆమె గొంతు వినిపిస్తుందేమోనని. తన పిచ్చి కానీ ఇంతలోనే అక్కడికెలా వెళ్ళగలదూ? లేదు. కాలాన్ని వెనక్కి తిప్పి పరిచయ ప్రారంభంలో ఆగాడు.
మొదటిసారి రేడియోలో సావేరి గొంతు విన్నప్పుడు “ఈమెలో నిండైన ఆడతనం ధ్వనిస్తుంది” అనుకున్నాడు. మరొకసారి “నేను దేవత ను చూడలేదు కానీ, ఆ స్వరాన్ని విన్నాను” అనుకున్నాడు.
కొన్నాళ్ళుగా వింటూనే వున్నాడు. నా అన్వేషణ పూర్తైంది. తుదకు నేను ఆగిపోవాల్సిన చోటు లంగరు వేసుకోవాల్సిన తీరం ఆమె నని దృఢపరుచుకున్నాను. అందుకు నా దగ్గర రీజన్ వుంది. జీవితానికి కావల్సిన వస్తువు వొక్కసారే లభిస్తుంది. అది ఏమిటన్నది మనస్సు గట్టిగా చెబుతుంది. అది మన పక్క నుంచి వెళుతున్నప్పుడు యదాలాపంగా చూసి అది జార విడుచుకున్నామా మళ్ళీ మరొకటి అలాంటి వస్తువు దొరకనే దొరకదు అని.
సావేరి ని కళ్ళారా చూసిన తర్వాత మరింత విశాలం అయ్యాను. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ప్రాధమిక సత్యం. ఆకర్షణ ను మించి ఆమె నాకొక విభ్రాంతి. నా జీవితంలోకి తను యెలా చొచ్చుకుని వచ్చిందో! అదొక కలా లేక కల్పన అన్నట్టు. చీకటి గదిలోకి భళ్ళున పరుచుకున్న కాంతి లా. జీవితకాల నిరీక్షణ సాఫల్యమైనట్లు గానూ.
ఆమె నడిచే కవిత్వంలా వుంటుంది. దీర్ఘరాత్రిలా మందంగా కదులుతుంది. ఆ కదలిక కంటికి నిండుగా ఇంపుగా కనిపిస్తుంది. పాట సరే, మాట మరీ వినసొంపు . అందుకే నా హృదయ ఫలకం పై ఆమె రూపాన్ని చెక్కుకున్నా”
ఈ సంగతిని టైప్ చేసి మెసేజ్ పంపేసాను..
ఆమె నుండి సమాధానం .. దీర్ఘంగా సాగింది.
“పూల రెక్కల పై ప్రేమ లేఖలు.. అనుభూతి వర్షంలో తడుపుతాయేమో కానీ..
ప్రేమ అనేది వెలిబుచ్చే భావాలలో కాదు. మన ప్రవర్తన లో ఎదుటివారి పట్ల మనం తీసుకునే శ్రద్ధ లో ప్రదర్శింపబడుతుంది” అని.
ఆమె చిత్తాకర్షిణి, రసాకర్షిణి, శరీరాకకర్షిణి. ఈ మూడు ఆమెలో మెండుగా వున్నాయి. ఒకదానితో మరో రెండు పోటీ పడుతూ ఎల్లప్పుడూ దిగ్వుణీకృతమై వెలిగిపోతుంటాయి. ఆమె కళ్ళల్లో నాపై ఇంతింత అనరాని అభిమానం కనబడుతుంది. రహస్య ప్రేమ తాలూకూ అభిమానం. దానితో పాటు కోర్కెలను దాచుకున్న దీపాల్లా వెలిగే కళ్ళు. ఆమెనలా చూస్తే నా రక్తంలో నగారాలు ప్రతిధ్వనిస్తాయి.సంకోచాలు ముడులు విప్పేసుకుంటాయి.
ఛామాన చాయ కన్నా కొద్దిగా పైన రంగు. విశాలమైన కళ్లు. సొట్ట బుగ్గలు.ఆర్ట్ చిత్రాల్లో నాయికలా వుండేది. ఇద్దరి ఆలోచనలూ సామీప్యం. నా స్వరమూ ఆమె స్వరమూ కలిస్తే సంగీత రసోత్సవం. ఇరువురి శరీరాలు కలిస్తే శృంగారోత్సవం. ఇద్దరికీ జీవితం అంటే ఆనందంగా జీవించడం అనే రహస్యం తెలిసి వుండటం.
అలా ఆనందంగా వుంటే ఓర్చుకుంటుందా లోకం!? ఇన్ని కలగలసిన జంటను విడదీయడం ఆ మాత్రం సహజం అన్నట్టు పన్నాగాలెన్నో. ఏ ప్రేమికులను నిండు జీవితం బతకనిచ్చిందీ లోకం!?
బలవంతాన విడదీస్తుంది. జరగబోయే నాటకాన్ని పరిహాసంగా చూస్తుంది.
నా జీవితం పూరించాల్సిన పొడుపు కథ కాదు. అనుభూతి తో ఆనందాన్ని నింపుకోవాల్సిన పాత్ర.
ఆమెను వెనక్కి తెచ్చుకోవాలని ఒంటరిగానే వైజాగ్ వెళ్ళాను. విఫలయత్నం చేసినా కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు. ఏవేవో కేసులు, పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణ. వారం రోజులు రిమాండ్. స్నేహితుల కృషితో బెయిల్. వారి చివాట్లు. వదిలేయ్ రా! అనే హితబోధలు. హైదరాబాదు వెళ్ళిపోదాం రమ్మని బలవంతం.
అప్పుడు స్పష్టంగా చెప్పాను.
“ఎవరిలోనైనా ఉత్తమమైనదాన్ని మనం గుర్తించినప్పుడు వారిని మనం మనసారా ప్రేమిస్తాం. వారు తిరిగి మనను ప్రేమించినా ప్రేమించకపోయినా ద్వేషించినా శత్రువుగా పరిగణించినా కూడా! కేవలం వారి శరీరాన్ని మాత్రమే కాంక్షిస్తున్నట్లైతే అనుభవాన్ని పొందేందుకే అనేక దారులు వెదుకుతారేమో! నేను ఆమెను మనసారా ప్రేమించాను, కామించాను, జీవించాను. కాలక్రమంలో ఇద్దరిలో వొకరికి మొహం మొత్తి లేదా మోసం చేయాలనుకునే ఆలోచనే లేదు. ఆమె ఏనాటికైనా తిరిగి వస్తుంది. ఆమె కొరకు ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండటమే నా ధ్యేయం” అని.
“పోయి పోయి వివాహిత స్త్రీ వలలో చిక్కుకున్నావ్! ఆమె ఇక తిరిగిరాదు రా! ఆ పిచ్చిలో నుండి బయటకు రారా శ్రీ!”
చెప్పిందే చెప్పి చెప్పి వారు అలసిపోయారు విసిగిపోయారు. వదిలేసి వెళ్లిపోయారు.
ఒంటరితనంలో ఉదాసీనత నిలువెల్లా కమ్ముకుంది. వియోగం వేదన నిండుగా కలగలిపి చుట్టేసాయి. మనసు గాలికి వూగుతున్న పక్షి పంజరంలా వుంది.
ఏదో కొత్త నెంబరు నుండి ఫోన్. సావేరి అయివుండొచ్చు అనే నమ్మకం వమ్ముకాలేదు. వీడియో కాల్ లో వొకరినొకరు చూసుకుని పన్నీరయ్యారు, కన్నీరయ్యారు.
“శిశిర వసంతౌ పున రాయతౌ- అన్నారు శంకరభగవత్పాదుల వారు” అది నిజం అవుతుందేమో!
తీవ్ర ఉద్వేగాన్ని అణుచుకుంటూ “పాప ను తీసుకుని వెంటనే వచ్చేయ్ సావేరి” అన్నాను.
చిన్నగా “రాలేను శ్రీ “ అంది. పైగా తనను మర్చిపొమ్మని చెప్పింది. “నీకు అతనే కావాలనుకుంటే పాప ను వదిలేసి వెళ్ళు అంటున్నారు. పాప నా ప్రాణం” అంది.
“మరి నేనూ!? “
మౌనమే సమాధానం.
ఆమె కుటుంబ రాజకీయాలను అసహ్యంగా తిలకించాను.చొరవ చేసి సావేరి భర్త తో మాట్లాడాను. అతను నన్ను ఎన్నో విధాలుగా నిందించాడు. హద్దులు మీరి దూషించాడు. అప్పుడు నేనూ దూషించాల్సి వచ్చింది. కంచానికి మంచానికి న్యాయం చేయలేని వెధవ ఎదుటివారి తప్పులను సులభంగా కనిపెట్టడం అనే విద్య బాగా తెలుసేమో! అని.
“సావేరికి విడాకులు ఇచ్చెయ్యి, పాప తో సహా ఆమెను గౌరవంగా చూసుకుంటాను” అని అరిచాను.
సావేరి అక్కను కూడా కలిసాను. నిజానికన్నా అబద్దాన్ని గొప్పగా నమ్మడానికి అలవాటు పడిన మనిషి ఆమె. పేరుకే న్యాయదేవత. విడాకులు ఇచ్చాక అనే అబద్దంతో నిజంగా నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తుంది ఆమె. నేను ఆశ్చర్యపోలేదు.సంప్రదాయ మూఢత్వంలో మగ్గుతున్న వీరందరిని అధిగమించి సావేరి కి నా దగ్గరకు వచ్చేసే ధైర్యం లేదని తెలుసుకున్నాను గనుక ఓ శుష్క మందహాసం చేసి ఆమెకు ఓ నమస్కారం పెట్టి వచ్చేస్తుండగా “ఇడియట్! పచ్చని సంసారం నాశనం చేస్తాడట” అని వినబడింది.
“ఎంత పచ్చని సంసారమో నీ చెల్లెలు సావేరి చెప్పింది వినపడదు కదా! మీరందరూ మూగ చెవిటి మాత్రమే కాదు,హృదయం స్థానంలో బండరాయి వున్నవాళ్ళు కదా!”
అనేక ఆకాంక్షలతో జీవించాలని కలగన్న మనుషులను కేవలం రెండు దేహాలు తమ కలయిక కోసం చేసే యుద్దం లాగా నీతి బాహ్యమైనది గా చూస్తూ.. పరువు ప్రతిష్టలు పేరిట కట్టడి చేసే అజమాయిషీ, అధికార ప్రదర్శన అంతా అబ్సర్డ్.
సావేరి ఆ మాట వొక్కటి అనకుండా వుంటే.. ఈ కథ మంచి ముగింపుకు అర్హమైనదిగా వుండి వుండేది. ఆమె ది తృణీకారం కాదు నిస్సహాయత కాదు కేవలం ఉదాసీనత. ప్రపంచంలోని కోట్లమంది స్త్రీల్లాగా ఆమె కూడా ఉదాసీనంగా బతికేయగలదు.
మరి నేనూ!! కొరగాని ఆశ గూడు విడిచి వెళ్ళిపోయింది. అనుమానపు పొర మంచుతెర వలె జీవన ఉషస్సును అడ్డుకుంటుంది.ఇంకెలా బ్రతికేది!?
“సమాజం మనని వెలివేస్తే భరించలేం అనుకుంటాం కానీ ఆ సమాజాన్ని మనం వదిలేయం. ఎవరో నియంత్రించినట్లు మనను మనమే నియంత్రించుకుని ఆగిపోతాం” నువ్వు అదే చేస్తున్నావు అని సావేరి కి చెప్పాను కూడా.
నా ప్రేమను మా కలయికల అనుభూతిని గాఢానుభవాన్ని గౌరవించలేని సావేరి అయినవాళ్ళ శుష్క వాగ్ధానాలకు డాంబికమైన విలువలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిందా?. మా గాఢమైన అనుబంధాన్ని తుంచేసిన ఆ చిన్నపదం చాలదూ! “వదిలేయరాదా! ఇంతటితో” అని.
“ ఈ మాట చాలదూ!! గుండె పగలడానికి, దుఃఖ మహాసముద్రంలో మునిగిపోవడానికి.” పది రోజులు పది యుగాల్లాగా గడుస్తున్నాయి. అనుక్షణం రంపపు కోత అనుభవిస్తున్నా.ఆనందం అనుభవించినప్పుడు దాన్ని అంటిపెట్టుకుని వుండే బాధను కూడా స్వీకరించాలి కదా!
ప్రేమ ని పొరలు పొరలుగా వొలిచి చూసాక భ్రమలు తొలగిపోయాక సహజత్వాన్ని సహజంగా
స్వీకరించడమే విజ్ఞత.
- Forgetting the Safe Zone in Unconditional Love has heartbreaking lessons.
అయినా కల లో కూడా సావేరి స్వరం వెంటాడుతుంది. మౌనంగా వున్నప్పుడు కూడా లోన దాగిన స్వరం వినబడుతూనే వుంది. అమృతం పంచడం కూడా పాపమేనా? ఫోన్ చేస్తే ఆన్సర్ చేయలేదు. జవాబుగా మెసేజ్ లో కొన్ని కన్నీటి చుక్కలు. ఆమె తుది నిర్ణయం అదేనా!?
ఎడతెగని ఆలోచనలు. తిండి నిద్ర ధ్యాస లేని ఆలోచనలు. ఉద్యోగం వదిలేసానో పోయిందో తెలియదు. మనుషులు అసంకల్పితంగా చేసే ప్రణయ రహస్య ప్రస్థానాల గాథ ఇలా ముగిసిపోవల్సిందేనా!?
సావేరి నన్ను విస్మరిస్తూ తిరస్కరిస్తూ తనను తాను పోగొట్టుకుంది. అవకాశం వచ్చినప్పుడల్లా కళ్ళు తెరిచి చూడలేక. హృదయంతో పరికించి చూడటం గుర్తించడం చేతకాక. ఇప్పుడు ఆమె లేక నన్ను నేను పోగొట్టుకున్నాను. శకలాలు శకలాలుగా మనసు ముక్కలైంది. ఈ మానసిక వైకల్యంతో బాధపడుతూ బ్రతకలేను. జీవించి వుండటానికి కూడా పెద్దగా కారణాలేవి కనబడటం లేదు. జీవన కాంక్షా పుష్పం వడలిపోయింది.
ఏది రానీ రాకపోనీ! ఎప్పటికైనా రాక తప్పనిది మరువక వచ్చేది మరణమే గనుక దాన్నే యిష్టంగా ఆహ్వానిస్తున్నా. ఇంతకన్నా ఆమెను కదిలించేది యేముంటుంది? ఆమె ను కదిలించాల్సిన అవసరం కూడా లేదని యింకో మాట కూడా అనుకున్నాను.
ఒకరు లేకపోతే వచ్చే ఖాళీ ని వేరొకరెవరో పూరించలేరు. పూరించాలని ప్రయత్నించినా అది అతుకుల బొంతే!
“రెండు నాల్కలు రెండు గుండెలు రెండు జీవితాలు లేవు.
వసంతంలో పుట్టి శిశిరంలో రాలిపోయేది కాదు నా ప్రేమ. నేను రాలిపోవడమే తప్ప”
కథ ముగింపు తర్వాత కొన్ని కన్నీళ్ళు మాములే! అవి రోజులా నెలలా సంవత్సరాలా.. వారికే వదిలేద్దాం. అనుబంధాన్ని కాలంతో కొలవలేం. ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. చూసే వారిక్కూడా తెలిసిపోయిందేమో!
“అమ్మ గారూ! త్వరగా వచ్చేయండమ్మా! అబ్బాయి పరిస్థితి ఏమీ బాగాలేదు” అని పని ఆమె కామాక్షి అమ్మకు ఫోన్ చేసి చెప్పటం విన్నాడు.
“బంగారం లాంటి బిడ్డ. పెళ్ళై బిడ్డ వున్న తల్లిని ప్రేమించాడంట.మనక్కూడా ఎక్కడా అనుమానమే రాలేదు చూసావా?. చిలక గోరింకల్లా వుండేవారు. ఆమె తరపు వాళ్ళొచ్చి లాక్కొని పోయారు. అట్టా పోయే ఆమె ఎందుకు రావాలీ అసలు? బిడ్డ ఆమె కోసం అలమటించి పోతన్నాడు. ఏడ చూసినా ఇయ్యే కథలు” జాలి కోపం విసుగు కలగలిపి భర్త తో చెబుతుంది. “మనసు చెడితే మగాడు బతకలేడే కామాక్షి! అమ్మ గారు వచ్చేదాక కనిపెట్టుకుని వుండాలి మనం” అంటున్నాడు శివయ్య.
నిజం చెప్పాడు శివయ్య. తనదేమన్నా కాలక్షేపపు ప్రేమా? కల్తీ ప్రేమా!? టీనేజ్ ఆకర్షణల నుండి ఒక్క రాత్రి కలయికతో ముగిసిపోయే ప్రేమ వరకూ అనేక రకాలు పరిచయమే! వాటికెప్పుడూ కట్టుబడని తను సావేరి ప్రేమలో మమేకమై పోయాడు. అందుకే ఈ బాధ. ”మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మాములు ప్రేమ కాదు. అగ్ని లాగా స్వచ్ఛమైనది.” అప్రయత్నంగా గుణ ని గుర్తు చేసుకున్నాను.
శివయ్య పక్కన నిలబడి బలవంతాన భోజనం తినిపించాడు. మీ మనసేమి బాగా లేదు నేను ఈడే పడుకుంటా అని తుండు పరుచుకుని నా గదిలో పడుకున్నాడు. అతన్నే చూస్తూ నేను. అలా రెండు రోజులు గడిచాయి.
అర్ధరాత్రి దాటింది. తీపి లేని బ్రతుకు ముగింపు దశలో తీపిలేని చల్లని ద్రవంలో విషం కలిసి మెత్తగా గొంతు దిగుతుంది. భగ్న హృదయం మండుతుంది. ఎక్కడో సావేరి మంజుల స్వరం వినబడుతుంది ఆఖరి జోల పాడుతున్నట్లు. మరణ దేవత సమీపంగా వచ్చి సావేరి రూపంలో నన్ను తన ఒడిలోకి చేర్చుకుని కరుణతో మెత్తని స్పర్శతో తల నిమురుతుంది.
ఇంకేమీ వద్దు. ఇంకేమీ వద్దు. మూసి ఉన్న కిటికి తలుపుల మధ్య నుండి సన్నని వెలుగు రేఖ. గాలికి పక్కకు వొదిగిన పరదా కదలికలు. శబ్దం ఉనికి తెలియజేస్తూ ఫ్యాన్ రెక్కలు. కళ్ళ ముందు ఏవేవో క్రీనీడలు మరుగవుతూ.
సావేరి పంచి ఇచ్చిన ప్రేమ నా ఆత్మానుభూతి. నా భగ్న ప్రేమ మిగిల్చింది జన్మ వైరాగ్యం. శూన్యం ఆక్రమిస్తుంది.
ఆ శూన్యం లో నుండి దగ్గరవుతున్న అమ్మ రూపం, అమ్మ స్పర్శ, ఓ గట్టి అరుపు. అంతే!
“అమ్మా! నన్ను క్షమించు. సావేరి ని నిందించకు. నీ అంత దైర్యం ఆమెకు లేదు.
నా ఈ ముగిసిన కథ సావేరి కి అందేట్టు చేస్తావు కదూ!”
అమ్మ ఏడుపు అంబులెన్స్ శబ్దం కలగలిసి విషాద సంగీతం లా చెవుల ద్వారా మెదడు ని గుచ్చుతుంది.
(వేరు చేయడం ద్వారానో, విడివడ్డం ద్వారా
ప్రేమ మరణించదు.
*ఓషో)
***************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి