7, ఫిబ్రవరి 2025, శుక్రవారం

పాపాయి ఏడ్చింది

 పాపాయి గుక్క పట్టి ఏడుస్తుంది 

అమ్మ ఉగ్గబట్టుని బిక్క ముఖం వేసుకుని సముదాయిస్తుంది. నానమ్మ పాపాయి ని భుజానేసుకుని ఊరుకోబెట్ట చూస్తుంది పాపాయి ఏడుపు తారాస్థాయినందుకుంది. చుట్టుపక్కల ఇళ్ళ తలుపులన్నీ బార్లా తెరుచుకుని  వొక్కక్కరే బాల్కనీ లో కొచ్చి నిలబడి అచ్చెచ్చో అయ్యొయ్యో అనుకుంటూ  సానుభూతి వాక్యాలు బట్వాడా చేస్తున్నారు. పాపాయి గగ్గోలు పెడుతుంది. నాన్న, బాబాయి బొమ్మలన్నీ చేతపట్టుకొచ్చి పాపాయి కళ్ళ ముందు సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. జేజమ్మ ఇంటి  లోపల్నించి మట్టి మూకుడు ని వేడి చేసుకుని వచ్చింది. తీగనున్న  తమలపాకు ను తుంచి  ఆముదం పట్టించి మూకుడు పై వేసి వెచ్చబరిచింది. తమలపాకును అరచేతిలో వేసుకుని కాళ్ళపై పాపాయికి పడుకోబెట్టుకుని పొట్టపై తమలపాకు వేసి మర్ధనా చేసింది. కాళ్ళు చేతులు పైకెత్తి సవ్యంగానూ అపసవ్యంగానూ అడ్డంగానూ  నిలువుగానూ కోలాటం చేయించింది. బొడ్డు లో  నాలుగైదు ఆముదం చుక్కలు వేసి మృదువుగా వేళ్ళనూ పొత్రంలా తిప్పింది. పాపాయి ఏడుపు మానింది. నానమ్మ భుజంపైకి చేరి అమ్మ వైపు చూసి  కిలకిల నవ్వింది. 

అందరూ హమ్మయ్య అని నవ్వుకుంటూ లోపలకు చేరుకున్నారు. 

***************

పాపాయి ఏడ్చినట్లు పాపాయి వాళ్ళమ్మ ఏడుస్తుంటుంది అప్పుడప్పుడు. నాన్న కోపమైన కేకలు కూడా. అదేం చోద్యమో.. అప్పుడు తెరచి వున్న తలుపులన్నీ గబగబా మూసుకుంటాయి. మూసిన తలుపుల పక్కనే నిలబడి శబ్దాలను శ్రద్ధగా వింటూంటాయి. వీలైతే దీపాలు కూడా ఆర్పేస్తారు. సద్దుమణిగాక అనుకుంటారు “పద్దాక ఏం బాగోతం ఇది? చూడలేక కళ్ళూ వినలేక చెవులు గగ్గోలు పెడుతున్నాయి. ఇదొక రకం కచేరి” అని. 

అమ్మ ఏడ్చింది. నాన్న కోపానికి, మందేయకుండా వుండటానికి మందేయకూడదా ఎవరైనా ! అని పాపాయి ఏడుపు భాషలో ప్రశ్నిస్తుంది.  

కామెంట్‌లు లేవు: