కామయ్య తోపు, కామయ్య తోపు దిగడానికి లేచి రావాలండీ ! బస్ కండక్టర్ గట్టిగా అరిచాడు
మీరు టిఫిన్ చేయడానికి దిగుతారా సార్ ! వెనుక సీట్ లో కూర్చున్న కృష్ణ చేతిలో క్యారేజ్ బుట్టతో సహా లేచి నుంచుని అడిగాడు.
"ఊహూ" తల అడ్డంగా ఊపాను. కృష్ణ నేను పనిచేసే బాంక్ లో ఈ మధ్యే అటెండర్గా జాయినయ్యాడు. రోజూ ఆ బస్టాప్ దగ్గరకి రాగానే మర్యాదగా అతనా మాటడగడం నేను తల అడ్డంగా ఊపడం రెండూ అలవాటైపోయాయి.
బస్ స్టాప్ లో ఆగగానే యధాలాపంగా నా కళ్ళు ఆ టిఫినీ బండి పై ఆగుతాయి . ఒక్కసారి ఆమెని చూపుతో పరామర్శించి ఆ బండి చుట్టూ ఉన్న జనాన్ని చూస్తాను. వాళ్ళ కడుపులో ఆకలితో పాటు కళ్ళల్లో ఆకలిని తీర్చడానికి చెమటలు క్రక్కుతూ ఉన్నట్టుంటుందామె . బంగారు రంగు ఛాయ, చక్కని కళ గల ముఖం. ఉంగరాల జుట్టూ. శుభ్రంగా తయారై అంత కన్నా శుభ్రంగా బండి చుట్టుప్రక్కల పరిసరాలని ఉంచుతుంది. ప్రక్కనే కూతురు . ఆ పిల్లకి పదిహేడు పద్దెనిమిదేళ్ళు ఉన్నట్టు ఉంటుంది. పలహారాలు తింటున్న వారికి మంచినీళ్ళిచ్చి, కావాలన్న వాళ్లకి మరొకమారు చట్నీలు వేస్తూ డబ్బులు తీసుకుంటూ ఆమెకి సాయంగా ఉంటుంది. ఇక ఆమె రెండు చేతులని అయిదారు చేతులుగా మార్చుకుని మరిగే నూనె మూకుట్లో ఆర్డర్ ని బట్టి బజ్జీలో, పునుగులో, జిలేబీలనో వేస్తూ, ఆకులలో ఫలహారాలని పెట్టి అందిస్తూ కారిన చెమటని తుడుచుకోను కూడా తీరికలేకుండా ఉంటుంది చెమట చుక్కలు కోటేరులాంటి ముక్కు నొక్కులో ఆగి ముత్యంలా మెరుస్తూ ఉంటాయి.శ్రమ సౌందర్యంలో ఉన్న అందమంతా ఆ చుక్కలో కనబడుతూ ఉంటుంది.
బస్ అక్కడ ఎక్కువసేపు ఆగి ఉంటే నా చూపు అందరి చూపులాగానే ఆమె ముఖంపై నుండి క్రిందికి దిగుతుంది. చక్కటి శరీరాకృతి. నిజానికి అదే ఆమె అసలైన పెట్టుబడి. ఆమెని చూసి లొట్టలేయడానికే మగవాళ్ళు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అక్కడాగి తీరతారు. దానికి ఉదాహరణ మా అటెండర్ కృష్ణ నే ! వాడి వయసు ఇరవైకి పైన. తండ్రి చనిపోతే అతని స్థానంలో అనేక రికమండేషన్ లతో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఎన్నో అప్పుల్లో ఉన్న కుటుంబం గుర్తుకురాదు వాడికి . రోజూ అక్కడాగి ఇరవై ముప్పై రూపాయలకి సరిపడా టిఫిన్ ఆరగిస్తాడు .
"రోజూ అంత ఖర్చు పెట్టడం ఎందుకు ? ఇంటిదగ్గర చేసుకుంటే అందరూ తింటారు కదా " అంటే "ఇంటికెళితే ఏముంటుందండీ చప్పిడి కూర, రేషన్ బియ్యం కూడు తప్ప. మినపప్పు కొని, బియ్యం కొని ఆయన్నీ చెయ్యాలంటే మాటలా అండీ , అయినా ఇంట్లో అంత కష్టపడి చేసేవారు ఎవరుండారండీ? అందరూ టీవిలకి అతుక్కుపోతా ఉంటిరి. కూరల కోసమే కర్రీ పాయింట్ ల మీద పడాల్సొస్తుంది" అని విసుక్కుంటాడు.
వాడి మాట నిజమే ... టిఫిన్ బండ్ల దగ్గర, నూడిల్స్ బండ్ల దగ్గర,పానీ పూరీ బండి దగ్గర ఎక్కడ చూసినా తుగిడీ తుగిడీలుగా జనం. ఆవురావురంటూ నోట్లో నాలుగేళ్ళు కుక్కుంటూ. అన్నపూర్ణా హోటల్ ముందైతే రాత్రి పూట పదిన్నరకి కూడా ఇసుకవేస్తే రాలనంత జనం. ఇళ్ళల్లో ఆడవాళ్ళు అందరూ ఖాళీగా ఏం చేస్తుంటారో !?
ఈ మాటే ఒకసారి ఆఫీస్ లో అంటే కొలీగ్ నళిని "ఆడవాళ్ళని మీ మగవాళ్ళుఇంక అంతకన్నా ఏమి అనగలరులెండి . వాళ్ళు మాత్రం పొద్దస్థమాను కష్టపడటం లేదూ ! అయినా పాత రోజులు కావండీ ఇప్పుడు. ఇంట్లో నలుగురుంటే కనీసం నలుగురికీ వారికి ఇష్టమైన నాలుగు కూరలు వండాలి. ఉదయాన్నే తిన్న టిఫిన్ సాయంత్రం తినకూడదు. రెండు చట్నీలు ఉండాలి రకరకాల రుచులు కావాలి. ఇవన్నీ చేయడానికి ఖర్చు సంగతి అలా ఉంచండి . ఆడవాళ్ళకి మాత్రం ఓపికుండవద్దూ ! అంటుంది.
ఇక సరళ గారైతే మా ఇంట్లో అయితే రాత్రి పూట అందరూ టిఫిన్ చస్తారు. ఒకోకరికి ఒకో రకం ఆ బాధంతా పడలేక ఎవరికీ కావాల్సింది వాళ్ళని తెచ్చుకోమని డబ్బులిస్తాను. వాళ్ళతో పాటు నాకు కూడా తెచ్చేస్తారు." పని తప్పి పోద్ది అన్న సంతోషం ఆమె మాటల్లో.
రోజూ అలా హోటల్ తిండి తింటే దెబ్బ తినే ఆరోగ్యం సంగతి ఏమిటీ ? అసలే ఈ మధ్య ఏవేవో కల్తీ నూనెలతో పదార్ధాలు తయారుచేస్తారని చదువుతున్నాం ! మీరు పిల్లలని, మగవాళ్ళని హోటల్స్ వైపు మళ్ళనీయకూడదండీ, అత్యవసరమైన పనిగా వంటింటి వైపు వేయాలి వాళ్ళ అడుగులు. అప్పుడే ఆరోగ్యాలు బావుంటాయి" అన్నానొకసారి.
"అబ్బ ! మధ్యలో ఈయన నసేమిటో? ఎవరి పని వారు చూసుకోక, ఎవరి తిండి వాళ్ళు చూసుకోక ప్రతిదానికి ఆర్గ్యూ చేసి చంపుతాడు." నళిని తను వినాలనేట్టుగానే. ఇక నేనెప్పుడూ వాళ్ళతో ఆర్గ్యూ చేయలేదు. చేసి గెలవలేమని తెలిసి . నా ఆలోచనల్లో నేనుండగానే "ఏం సార్ ! ఏమీ మాట్లాడరేంటీ? నేను అన్నది నిజమా కాదా ? "
"ఏమన్నావ్ రా ? వినలేదు మళ్ళీ చెప్పు ". "నిలబడి తింటామన్నమాటే కానీ రుచిలో ఫైవ్ స్టార్ హోటల్ రుచికేమీ తీసిపోవు. పైగా తినే తిండి పై టాక్సో ,గీక్సో కట్టే పనిలేదు . వాళ్ళకేమో అద్దె,కరంట్ బిల్లు ఖర్చులుండవు కాబట్టి నాణ్యంగా వేడి వేడిగా పెడతారు, అది చాలదూ జనం ఎగబాడటానికి" అన్నాడు.
ఒరేయ్ కృష్ణా! ఈ విషయాలన్నీ నీకెలా తెలుసురా? అనడిగా ఆశ్చర్యంగా .
"కొన్ని అట్టాగే తెలుస్తా ఉంటాయండీ అంతే"
"అదే ఎట్టా తెలుస్తాయి అని "
పుట్టినదగ్గర్నుండి టీవి చూస్తున్నాను . బెజవాడలో బతుకుతున్నాను అదేమన్నా విచిత్రమా సార్ తెలియకుండా ఉండటానికి "
"అబ్బా ఏమి మనిషండీ బాబూ ఆవిడ. చేతిలో హృదయం ఉంది మాటలో హృదయం ఉంది " అని ఒక రోజు పొగిడే వాడు.
నిలబెట్టి రోజుకి అయిదారు వేలు సంపాదిచ్చేస్తుంది. చుట్టుప్రక్కల బళ్ళ బేరాలన్నీ పోయాయి. వాళ్ళు ఈగలు తోలుకోవడమే ఇక. రంకు ముండ అందరిని చూసి ఒకటే నవ్వుద్ది. ఆ నవ్వుకే పడిపోతారు. ఇక మా బళ్ళ దగ్గరకెవరొస్తారు ఇంకో సెంటర్ వెతుక్కోవాల్సిందే అని ప్రక్కనాడు తిడుతున్నాడని ఇంకో రోజూ చెప్పేవాడు. రాత్రి ఇద్దరు మనుషులకి బాగా మందు పోపిచ్చి ఆ టిఫినీ బండి దగ్గరకి పంపిచ్చి గొడవ చేయించారట . ఒకడైతే ఆమె పై చెయ్యేసి ఎదవ పనులు కూడా చేసాడంట. తల్లీ కూతుళ్ళు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారంట అని ఇవాళ వార్త మోసుకొచ్చాడు.
"అయ్యో ! ఇబ్బందేమీ లేదుగా, వాళ్ళు బాగున్నారా " అన్నాను .
"ప్రొద్దున్నే తెలిసింది ఊరుకుంటానా ? వెళ్లి పలకరించి వచ్చా!ఎవడో చెప్పండి మా కట్టమీద కుర్రాళ్ళమి వెళ్లి ఇరగొట్టి వస్తాం" అన్నానని చెప్పుకొచ్చాడు.
"ప్రొద్దున్నే తెలిసింది ఊరుకుంటానా ? వెళ్లి పలకరించి వచ్చా!ఎవడో చెప్పండి మా కట్టమీద కుర్రాళ్ళమి వెళ్లి ఇరగొట్టి వస్తాం" అన్నానని చెప్పుకొచ్చాడు.
కొన్నాళ్ళ తర్వాత ఛీ ఛీ ! మనుషుల్లో నీతి నిజాయితీ తగ్గి పోతున్నాయి అన్నాడు మొహం చించరిచ్చుకుంటూ.
"ఏమైందిరా కృష్ణా "
" వొక కానిస్టేబుల్ రోజూ వచ్చి గంటల తరబడి అక్కడే కూర్చుంటున్నాడట . ఆ మనిషికి లొంగి పోయింది అంటున్నారందరూ"
"ఏదో వొక అండ కావాలి కదరా! అందుకోసం అయి ఉంటుందిలే! ఏ అండా లేకపోతే అంతమంది మగాళ్ళ మధ్య నెట్టుకురావడం కష్టం కదా ! "
"పెళ్లీడు కొచ్చిన పిల్లని పెట్టుకుని ఆ వయస్సులో ఆమెకావేషాలేమిటో.? మా ఇంట్లో వాళ్ళవరైనా ఆట్టా చేస్తే నడిరోడ్డులో డొల్లిచ్చిడొల్లిచ్చి కొట్టి బందరు కాలవలో ముంచేవాడిని". ఉక్రోషం వాడి మాటల్లో. ఆ సాయంత్రం టిఫినీ బండి దగ్గర దిగాలా వద్దా అన్నట్టుగా ఉన్నాడు. "ఏం ఇవాళ వెళ్ళవా ? " మాట్టాడకుండా విండో లో నుండి చూసాడు కానీ బస్ దిగలేదు. . "దేశం ఏమీ గొడ్డుబోలేదు లెండి ఈమె ఒక్కదాని బండేనా ఉందీ అన్నపూర్ణ హోటల్ దగ్గర తింటా" అన్నాడు. ఆ బెట్టు నాలుగు రోజులే ! రోజూ వాడి దృష్టంతా ఆమె మీదే ఉండేది . ప్రతిరోజూ మా మధ్య టిఫిన్ బండి మాటలు తప్ప ఇంకేమీ లేనట్లు ఆమె మాటలే చెప్పేవాడు.
"ఆమె భర్తకి ఏదో జబ్బు అంటండీ ! ఇంట్లోనే ఉంటాడు. బండి దగ్గరుండి డబ్బులు తీసుకునే పిల్ల ఆమె కూతురే ! ఇంకో కొడుకు కూడా ఉన్నాడు, చిన్నదైనా సొంతిల్లే ! ప్రక్కనే సందులోనే ఇల్లు. పగలల్లా ఇంటి పని చేసుకుని పిండ్లు రుబ్బుకుని సాయంత్రానికి రెడీ అయిపోద్ది." ఆమె గురించి వివరాలు తెలుసుకొచ్చాడు. కృష్ణ ఆలోచనలే కాదు పాదాలు ఆ టిఫినీ బండి చుట్టూ తిరుగుతూ ఉండేవి .
"ఏమండీ! మగాడు తన కన్నా పెద్దదాన్ని పెళ్లి చేసుకుంటే తప్పేంటీ !? ఏమైనా నష్టం జరుగుతుందంటారా ?"
"నష్టమేమి లేదురా, అదివరకు అలా చేసుకోవడానికి భయపడే వాళ్ళేమో ! ఇప్పుడంత భయపడటంలా . ఒక ఏడాది రెండేళ్ళు పెద్దైనా సరే శుభ్రంగా కాపరం చేసుకుంటున్నారు" .
"నేననేది ఒక ఏడూ రెండేళ్ళు తేడా కాదండీ, పది హేనేళ్ళు ఇరవయ్యేళ్ళు తేడా " అంటూ అడిగాడు. నాలో ఎక్కడో లేశ మాత్రమున్న అనుమానం నిజమవుతుంది . "బాగోదు కృష్ణా! అసహ్యంగా ఉంటుంది "
"కృష్ణుడుకి రాధ మేనత్త అవుద్ది అంట గదండీ అయినా ఆళ్లిద్దరి మధ్య సంబంధం ఉండేదంట కదా !"
"సంబంధం కాదు రా అది ప్లేటోనిక్ లవ్" నేను వివరించే ప్రయత్నం వాడి ముందు వీగిపోయింది.
"అంటే ఏంటండీ అదీ పెళ్లి లేని ప్రేమా - సంబంధాలు లేని ప్రేమా ఇవరంగా చెప్పాల్సిందే మీరు" అంటూ ఎదురుగా కూర్చున్నాడు. పని ఉందని మేనేజర్ పిలవడంతో అప్పటకి తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నాను .
మర్నాడు "నిన్న రాత్రి బండి కట్టేసేదాకా అక్కడే ఉన్నానండీ. నా కూతురిని పెళ్లి చేసుకుంటావా ? అంది. నేను మాట్లాడలేదు. ఏడుపొచ్చేసింది ఆ డొక్కు మొహందాన్ని, ఎత్తు పళ్ళదాన్ని నేనెలా చేసుకుంటానండీ. డబ్బు లేకపోతే లేకపోయింది కానీ నాకేం అందం తక్కువా? కుర్ర హీరో "ఆది" లాగా ఉంటావని మా కట్ట మీద ఆడపిల్లలందరూ రెప్పార్చకుండా చూస్తారు నన్ను. రేపో మాపో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసినట్టే కదా !. అప్పులు తీరిపోయ్యాక పెళ్లి చేస్తే నాలుగు లక్షలు కట్నం వస్తది అంటది మా అమ్మ " అని చెప్పుకొచ్చాడు. .
"ఏమన్నావ్ మరి? " అడిగాడు ఆసక్తిగా .
"మా అమ్మ కట్నం కావాలంటది" అని చెప్పాను . "అన్ని డబ్బులు ఇవ్వలేను గాని ఏమి అడిగితే అదిస్తాను అంది. ఏమడిగినా ఇస్తావా? అన్నాను ఇస్తానంది. అందుకే ఆమె కూతురిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పాను. మా వాళ్ళు ఒప్పుకోలా . ఆ పిల్లేమీ బాగోలేదు. అయినా ఆ పునుగుల బండామెతో వియ్యం అందుకోవడమేమిటీ? పరువు తక్కువ. ప్రొద్దుటూరు మామయ్య అరెకరం పొలమిచ్చి పిల్లనిస్తామని అంటున్నాడు. ఆ పిల్లని చేసుకుందువుగాని అంది అమ్మ. అదే సంగతి చెప్పానామెకి. నవ్వి ఊరుకుంది". అన్నాడు.
కొన్నాళ్ళ తర్వాత " పది రోజులు సెలవు పెడుతున్నానండీ" అన్నాడు. ఎందుకురా అంటే పని ఉందని చెప్పాడు కానీ అసలు విషయం చెప్పలేదు. ఖాతాదారుడొకరు చెప్పారు మీ అటెండర్ పెళ్లి చేసుకున్నాడు అని. "ఎవరిని? "ఆశ్చర్యంగా అడిగా. నేనడిగిన విధానం చూసి అతనాశ్చర్యపోయి ... "మిమ్మల్ని కూడా పిలవలేదా? ఆ పునుగుల బండమ్మాయి కూతురిని పెళ్ళిచేసుకున్నాడు. ఇంట్లో తెలియకుండా జమలాపురంలో పెళ్లి చేసుకోచ్చాడంట. కృష్ణ వాళ్ళమ్మ ఒకటే ఏడుపు. ఈడికి పెట్టె టిఫిన్ లో అదేదో మందు పెట్టింది. లేకపోతే కాణీ కట్నం లేకుండా ఆ కర్రి మొహందాన్ని ఎందుకు చేసుకుంటాడు అని. మొత్తానికి వీడెల్లి ఆ రొచ్చులో పడ్డాడు". " రొచ్చు" అన్న మాట వినగానే నాక్కోపం వచ్చింది. ఆ రొచ్చు ముందు నిలబడే రోజూ టిఫిన్ తినే వాళ్ళలో ఇతన్ని చూస్తాను. అప్పుడు రొచ్చు అనిపించలేదేమో !
సెలవు అయిపోకుండానే ఆఫీస్ కి వచ్చాడు కృష్ణ . కొత్త పెళ్లికొడుకు మెరిసి పోతున్నాడు. "నేను ఉద్యోగం మానేస్తున్నానండీ ! మా అమ్మతో బాగా గొడవగా ఉందండీ ! మా తమ్ముడిని పెడతారంట ఉద్యోగంలో . నేను సరేనన్నాను నెల మొత్తం చేసినా కూడా ఇక్కడ అయిదేలు రావు . మా అత్తమ్మతో కలిసి నేను టిఫిన్ బండి నడుపుకుంటాను ఒక్క రోజులో నెలకొచ్చే ఆదాయం వస్తది" అన్నాడు.
"నిజమేలే !" అన్నట్టు తలూపి ఊరుకున్నా. " మీరొక సహాయం చేయాలి. మా అత్త ఇల్లు ష్యూరిటీ గా పెట్టి లోను తీసుకోవాలి సర్ ! అన్నాడు. "ఆ ఇల్లేనా నీకిస్తానంది" అడిగాను. నవ్వేసాడు. ఇంటి కాగితాలు అన్నీ పట్టుకురండి. చూసి లోన్ వచ్చేది రానిది చెపుతాను అన్నా . పేపర్స్ అన్నీ సరిగ్గానే ఉండటంతో శ్రద్ద తీసుకుని త్వరగా బాంక్ లోన్ వచ్చేటట్లు ఏర్పాటు చేసాను. కృష్ణ, అతని అత్త కలిసి టిఫిన్ బండి బాగా నడిపే వారు. సంపాదన బాగుండేది. నెల నెలా బాకీ కట్టడానికి వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళేవాడు. అప్పుడడిగాను మీ అత్త గారు నీకు ఇల్లు ఇచ్చేస్తుందా అని.
"ఇల్లు కాదండి అసలు సంగతి వేరే ఉంది" అన్నాడు .
"నాకు తెలుసులే అది" అనగానే "మీరు భలే కనిపెట్టేసారండి. ఆమెపై మనసు పడే, వెనుకా ముందూ ఆలోచించకుండా ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నా. ఒంటిగా ఉన్నప్పుడు నాకిస్తానన్నది ఇమ్మని అడిగా.
మీ మామకి ఎయిడ్స్ వచ్చింది. ఆయన్ని హాస్పిటల్ కి తిప్పడానికే బోలెడు డబ్బులు అయిపోయాయి. ఇక పిల్లకి కట్నమిచ్చి పెళ్ళేం చేయగలను? చక్కని పిల్లాడివి, బుద్ధిమంతుడువి, ఉద్యోగం కూడా ఉంది. నా కూతురిని నీకిచ్చి చేస్తే దిగులుండదనుకున్నాను. వ్యాపారం బాగా సాగాలని కాస్త పైట ప్రక్కకి జరిపి చిన్న చిరునవ్వు నవ్వుతున్నా! అంత మాత్రానికే నేను రంకు దాన్ని అయిపోలేదు. తప్పబ్బయ్యా ! నీ తల్లిలాంటిదాన్ని అట్టాంటి ఆలోచన పెట్టుకోబాకు" అందండీ !
"అనుకున్నదొకటి అయిందొకటా? అయినా తప్పుగా ఆలోచించావేమో కృష్ణా" అన్నాను .
"ఆమె మాటలని నమ్మలేదు ఎక్కడో అనుమానం ఉంది కానీ ఏమీ చేయలేను. ఎక్కిన మత్తు,వికారం దిగిపోయింది నా పెళ్ళాం అమాయకత్వం చూసి జాలేసి నోరు మూసుకుని ఊరుకున్నా"
"అనుకున్నదొకటి అయిందొకటా? అయినా తప్పుగా ఆలోచించావేమో కృష్ణా" అన్నాను .
"ఆమె మాటలని నమ్మలేదు ఎక్కడో అనుమానం ఉంది కానీ ఏమీ చేయలేను. ఎక్కిన మత్తు,వికారం దిగిపోయింది నా పెళ్ళాం అమాయకత్వం చూసి జాలేసి నోరు మూసుకుని ఊరుకున్నా"
ఆమె తెలివికి నవ్వుకుంటూనే మరి ఇప్పుడేం చేస్తావ్ ? నామాటల్లో ఎగతాళి కనబడినట్టు ఉంది కృష్ణ కి
"కాళ్ళకి మడుగుల లెక్కన బంక మట్టి అతుక్కుంది. ఎట్టో గట్టా కడుక్కోవాలి, తప్పదు కదండీ ! మోహంలో పడి ముఖం పగలగొట్టుకున్నానో, కష్టాలు విని కరిగిపోయానో తెలియడంలేదు సర్ ! ఇకనుండి ఆ ఇంటికి పెద్ద కొడుకుగా నిలబడాలనుకుంటున్నా ! "
కృష్ణ మాటలకి ముచ్చటేసింది. ఎంత మంచాడు వీడు అనుకున్నా. కొన్నాళ్ళకి నాకు వేరే ఊరికి ట్రాన్స్ఫరై వెళ్ళాక అప్పుడప్పుడు ఫోన్లో మాటలు. తర్వాత నిదానంగా అవి తగ్గిపోయాయి .
రెండేళ్ళ తర్వాత మిత్రుడి కూతురు పెళ్ళికని విజయవాడకి వచ్చి కాస్త సమయం చూసుకుని కృష్ణ ని చూసేళదామని కామయ్య తోపు సెంటర్లో బస్ దిగాను. కృష్ణ అక్కడే ఉన్నాడు నన్ను చూసి చాలా సంతోషించాడు. కుర్చీ వేసి అతిధి మర్యాదలు చేయబోయాడు. వద్దని వారిస్తూ ఎలా ఉన్నారు కృష్ణా ? అనడిగాను
"ఏదో పర్వాలేదండీ. కొడుకు పుట్టాడు " సంగతి చెపుతున్నప్పుడు సంతోషం. "వ్యాపారం ఎలా ఉంది ? "
" మా అత్త చచ్చిపోయిందండీ. అంటూ ముఖం క్రిందికి దించుకున్నాడు. కళ్ళల్లో సన్నటి నీటి తెర. మంచి మనిషండీ! ఆడది కదా ! తన బ్రతుకు తను బతుకుతున్నా లోకం ఓర్వలేకపోయింది. మొగుడు మంచోడు కాక పిల్లలని పెంచడానికి నానా తిప్పలు పడింది. లోకుల నోళ్ళలో నానింది. మా మామ కన్నా ముందే మా అత్త చచ్చిపోయిందండీ. పువ్వులాగా పంపిచ్చా. కళ కళ లాడతానే పోయిందండీ. ఆమె పోయినాక వ్యాపారం బాగా సాగడంలేదండీ" విచారం అతని కళ్ళల్లో. ఆమె చిరునవ్వు ముఖం నా కళ్ళముందు కదలాడింది . రెప్పదాటని కన్నీళ్ళే వో ఉబికాయి. బండి దగ్గర ఆమె నిలబడే చోటు వైపు చూసాను. అదే సన్న నవ్వు ముఖంతో మసక మసకగా కనబడి మాయమైపోయినట్టు అనిపించింది కొంచెం గుండె బరువైనట్టు అనిపించింది.
నూనె కళాయి ముందు నిలబడి పునుగులు,బజ్జీలు వేస్తున్న అమ్మాయిని చూసి "ఆమె నీ భార్య కదూ !" అనడిగాను బిడ్డ తల్లైన ఆ అమ్మాయి కొద్దిగా ఒళ్ళు తేలింది లోపలి పోయినట్లుడే బుగ్గలు పూడి కొత్త అందంతో మెరుస్తున్నాయి.
"అవునండీ"
“మీ అత్త ఢక్కా ముక్కీలు తిని ఉంది కాబట్టి మగవాళ్ళ చూపులని భరించింది. పాపం చిన్న పిల్ల. ఈ పిల్లనెందుకురా నడిరోడ్డులో నిలబెట్టావ్? " మందలింపుగా అన్నాను.
సాగినన్నాళ్ళు ఇంట్లోనే ఉంటారు, సంసారం బండి సాగకపోతేనే కదండీ బయటకొచ్చేది. మా ఆవిడకి మా అత్త అందం రాలేదన్నమాటే కానీ మా అత్తలా రుచికరంగా వంటలు చేయడం వొచ్చు సార్ ! వ్యాపారంలో పోటీ ఎదుర్కోడానికి అది కూడా చాల్లేదు . అందుకే మా ఆవిడని నిలబెట్టా" అన్నాడు.
కృష్ణ మంచి నీళ్ళు టీ అందిస్తూ, డబ్బులు తీసుకుంటూ మధ్య మధ్యలో భార్య వైపు ఎవరైనా వంకరగా చూస్తున్నారేమోనని చుట్టూరా గమనిస్తూ భార్య పైన ఓ చూపేస్తూ నాతో మాట్లాడుతున్నాడు.
"ఇంతమంది జనం మధ్య ఆ పిల్లకి ఇబ్బంది కదరా ! వేరే మార్గం ఆలోచించు"
"ఆలోచించడానికి ఏమీ లేదండీ ! నగల షాపులాళ్ళు, కార్ల కంపెనీలాళ్ళు , బట్టలషాపులాళ్ళు ఆఖరికి గడ్డం గీసుకునే రేజర్ కోసం కూడా ఆడాళ్ళని చూపిస్తూ టీవీలలో ఎడ్వర్టైజ్మెంటులు ఇస్తున్నారు కదా !. నా వ్యాపారం బాగా సాగడానికి చెమటలు కక్కే మా ఆవిడని చూపిస్తే తప్పేం ఉందిలే సార్ ! అన్నాడు తెలివిగా .
ఆర్ధిక శాస్త్రం చదవకపోతేనేం ? వ్యాపార రహస్యం తెలుసుకున్నవాడు. ఇక కృష్ణ బతుకుకి డోకా లేదు. ఆశ్చర్య పోతూనే మెచ్చుకోక తప్పింది కాదు. కృష్ణ దగ్గర వీడ్కోలు తీసుకుని రోడ్డు దాటి బస్ ఎక్కి టిఫిన్ బండి వైపు చూసాను. ఆమె నవ్వుతూ కనబడుతుందేమోనని. కొన్ని ఖాళీ లంతే, ఎప్పటికి నింపబడవు.
(19/06/2016 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం )
1 కామెంట్:
బండ్లదగ్గర తిండి ఆరోగ్యంకాదని తెలిసినా జిహ్వచాపల్యం చంపుకోలేనివాళ్ళు అవసరంలేకపోయినా తినేవాల్లె ఎక్కువయ్యారు.కారణాలు అనేకం.కల్తీల్లో వుండే రుచి అలా ఆకర్షిస్తోంది.దానితోపాటే కధలోలాంటి బండిఆమే అందాలు ,ఆకర్షణలు,అవన్నీ తెలిసిన వాస్తవాలే.ఐ నా ముసుగేసుకుని నటించే చాలా మంది నిజాన్ని అంగీకరించారు.అత్త మీద మోజుతో చేసుకున్నా,ఆమె భర్తకి ఎయిడ్స్ అనే ట్విస్ట్ బావుంది.ఆడవాళ్ళని ప్రకటనల్లో అంగ ప్రదర్శనల్లో చూపించే వ్యవస్తలో సంబంధాల్లో ని అసహజాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికిలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి