వితరణ (కథ )
చదవండి ఫ్రెండ్స్ .. (ఉషోదయ వెలుగు పత్రికలో ప్రచురణ )
దసరా పండుగ వస్తుందంటేనే సరదా ఇంటి గుమ్మం ముందు తచ్చాడుతూ ఉంటుంది. రోజంతా బద్దకంగా చేసే ఇంటిపనిని త్వరత్వరగా ముగించుకుని సంప్రదాయంగా చక్కగా ముస్తాబై ..రోజుకొక అలంకారంలో శోభిల్లే అమ్మని కనులారా వీక్షిస్తూ మనసారా ధ్యానిస్తూ .. పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో గడపడమంటే ఎంతో ఇష్టం వైష్ణవికి. కానీ ఈసారి ఆమెకి పూర్తి అవకాశం చిక్కలేదు సెలవలకి వచ్చిన పిల్లలతో, వారిరాకని పండుగగా భావించి వచ్చిపోయే బంధుమిత్రులతో ఇల్లంతా సందడిగా ఉంది. తెల్లవారుజ్హామునే లేచి గుడికి వెళ్ళింది. గుడి చుట్టూ ప్రదక్షణం చేసుకుని ..గుడి ఆవరణలో పద్మాసనం వేసుకుని కూర్చుని మౌనంగా అమ్మని ప్రార్ధించుకోసాగింది.
ఆమె ప్రశాంతతని భగ్నం చేస్తూ "ఏమ్మా..శాంతమ్మ గారూ! బాగున్నారా ? చాలా రోజుల తర్వాత చూస్తున్నాను మిమ్మల్ని " అంటూ ఎవరిదో పలకరింపు. "దేవుడి దయ వలన అంతా బాగున్నారు. మనమరాలి చదువు పూర్తైపోయింది. ఇక ఇంటికి వచ్చేసాను. అయిదేళ్లపాటు రోజూ ఉదయాన్నే తన దర్శన భాగ్యాన్ని కల్గించిన కంచి కామాక్షి ఇక మీ ఊరు వెళ్ళమని చెప్పింది. అమ్మ అజ్ఞ ఇస్తే తప్పుతుందా ? " అంది.
"అదృష్టవంతులు, అన్నేళ్ల పాటు రోజూ ఆమె దర్శన భాగ్యం కల్గింది మీకు. నాకు ఒక్క రోజు కూడా సెలవీయదు ఇల్లు. ఏదో ఇంటికి కూసింత దూరంలో ఉన్నాను కాబట్టి ఈ గుడికైనా రావడం".. అంది మీనాక్షమ్మ.
"మా వూరు వెళ్లి అక్కడే ఉందామనుకునే లోపే అక్కడొద్దు. ఆ ఇల్లు అమ్మేస్తున్నాం, వచ్చి మా పుట్టింట్లో ఉండండి అంది కోడలు విజయ. అదీ అమ్మ ఆజ్ఞే అనుకుంటున్నాను"
"అత్తా కోడలు ఒకే ఇంటి ఆడపడుచులు కదా ! అన్నదమ్ములతో కలిసి ఉండే అదృష్టం దక్కిందని భావించాలి మీరు" .
"అంతే,అంతే ..ఎనబై యేళ్ళ వయసులో పుట్టిన ఇంటిలో ఉండే భాగ్యం రోజూ చీకటితో దేవుడికి సేవచేసుకునే భాగ్యం ఇచ్చిన భగవంతుడిని యేమి కోరుకోను ..అందరూ చల్లగా ఉండాలని తప్ప." ..అంది శాంతమ్మ.
"మీ అబ్బాయి ఆర్ధిక పరిస్థితి బాగోలేదని వింటున్నాను,నిజమేనా" అని అడిగింది మీనాక్షమ్మ.
" పది లక్షల అప్పుంటే కోట్లు అప్పు ఉన్నాయని చెప్పుకోవడం లోకం తీరు. ఏమిటో, వాడికి అన్నిటిలోనూ ఎదురే. యే వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా కలిసి రావడం లేదు. అందులో ఇద్దరు పిల్లలని డొనేషన్ కట్టి మెడిసన్ చదివించడం అంటే మాటలా ! చెప్పండి. ఏవో వొడిదుడుకులు ఉన్నమాట వాస్తవమే కానీ ..అంత అప్పుల బాధ లేదు. వాడికేమిటమ్మా,కోట్లు ధర పలికే ఇరవై ఎకరాల భూమి ఉంది. భగవంతుడి దయ ఉంటే అన్నీ దాటేయవచ్చు.."అని చెపుతున్న ఆమెని ఆసక్తిగాను,అబ్బురంగానూ చూసింది వైష్ణవి. జీవితాన్ని కాచి వడపోసిన ఆమె మాటలు హృదయంతో తీసుకునేటట్లు ఉన్నాయి అనుకుంది. శాంతమ్మ గారికి నమస్కారం మామ్మ గారూ అంటూ నిండు మనస్సుతో నమస్కరించింది.
సౌభాగ్యవతీ భవ,దీర్ఘాయష్మాన్భవ, ..అని దీవించి .. అమ్మా ..నేను పెద్దదానిని అయిపోయాను.. ఈ వొత్తులు,నువ్వుల నూనె తీసుకుని వెళ్లి ఆ కాలభైరవుడి ముందు దీపం వెలిగించి రా ..అని వైష్ణవికి పురమాయించింది.
మీరే దీపం వెలిగించకూడడా ! అంది వైష్ణవి.
"ఎవరైతే ఏమిటమ్మా .. దేవుడు ముందు దీపం వెలిగించామా అజ్ఞానమనే చీకటి తొలగించామా అన్నదే ముఖ్యం. పాపం,పుణ్యం అన్నీ ఎవరి ఖాతాలో వేయాలో భగవంతుడికి తెలుసు. మనం కేవలం నిమిత్త మాత్రులమి మాత్రమే "అంది.
ఆ మాటలతో శాంతమ్మ గారిపై పూజ్యభావం కల్గింది వైష్ణవి. అప్పటి నుండి వారి పరిచయం దినదినాభి వృద్ధి చెందసాగింది.రోడ్డుకి అవతలి వైపున శాంతమ్మ గారి ఇల్లు ఇవతలి వైపున గుడి ఉండటం మూలంగా .. రోడ్డుపై వెళ్ళే వాహనాల రద్దీలో ఆమె రోడ్డు దాటటం కష్టంగా ఉండేది. వైష్ణవి వేకువఝామునే త్వరత్వరగా బయలుదేరి వచ్చి ఆమెని రోడ్డు దాటించి గుడిలోపలికి తీసుకుని వచ్చేది. శాంతమ్మ గారు చెప్పే అనేక భక్తీ విషయాలు, యాత్రా అనుభవాలు చాలా ఆసక్తిగా ఉండేవి. రోజూ దైవ దర్శనంతో పాటు శాంతమ్మ గారి దర్శనం కల్గకపోతే యేదో వెలితిగా ఉన్నట్టు ఉండేది వైష్ణవికి. దసరా పోయి దీపావళి వచ్చింది..దాన్ని ఆనుకునే కార్తీకం వచ్చింది. వేకువనే నాలుగు గంటలకల్లా దీపాలు పెట్టె వరుసలో శాంతమ్మ గారూ వైష్ణవి పోటీ పడేవారు. ఎప్పటిలాగానే ..ఈ నువ్వుల నూనె వడ్డించు తల్లీ, ఈ వొత్తులు తీసుకెళ్ళి ఆ దీపారాధన కుంది లో వేసి రామ్మా .. అంటూ వైష్ణవి చేతికి ఆ వస్తువులని అందించేది.
శాంతమ్మ గారు అందరిని ఆప్యాయంగా పలకరించేది, ఇతరులు చెప్పేదాన్ని ఓపికగా వినేది కూడా ! సహృదయం ఉన్న వ్యక్తే కాదు ..అందరికి పెట్టే గుణం ఉన్న వ్యక్తి కూడా ! ప్రతి రోజూ ఇంటి ముందు తోటలో కాసిన జామకాయలనో, నారింజ కాయలనో, సీతా ఫలాలనో పనివాళ్ళ చేత జాగ్రత్తగా కోయించి సంచీకి వేసి పెట్టేది. వైష్ణవి సాయంతో ఆ బరువైన సంచీని గుడిలోపలకి తెప్పించి.. గుడికి వచ్చిన అందరికి జాకెట్ ముక్క ఓ పండో ఫలమో పెట్టి వారి చేతికిచ్చి తృప్తి పడేది. ఒకో రోజు నాన పెట్టిన శెనగలు, కందులు కూడా తెచ్చి అందరికి పంచేది.
"నా కోడలు రాక్షసి, మేనకోడలని కొడుక్కి చేసుకుంటే నరకం చూపుతుంది. కొడుకేమో రేసులకి వెళ్ళడం, క్రికెట్ బెట్టింగులు కట్టడం. నా భర్త నుండి వచ్చిన ఆస్తులని అన్నింటిని కర్పూరంలా కరిగించేశారు. ఇక కోడలి ఆస్తి మాత్రమే ఉంది. నేను కనబడితే చాలు భర్త మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తూ తిట్టిపోస్తుంది . ఈ వయసులో ఒక్కదాన్ని వండి వార్చుకునే ఓపిక ఎక్కడుంది నాకు. పుట్టింట్లో ఉంటె మాత్రం మేనల్లుళ్ళ భార్యలు ఎందుకు వండి పెడతారు. ఓపిక లేకపోతే కొడుకు ఇంటికే వెళ్ళాల్సింది. ఇప్పటిదాకా వాళ్ళ పిల్లలకేగా చేసి చేసి వచ్చారు. ఇప్పుడొచ్చి మా ఇంట్లో కూర్చుంటే ఎట్లా అని అంటుంటారు. ఆ అనే మాటలేవో నా ముందు అనరు ఇంటికొచ్చిన బంధువుల దగ్గర అనడం నేను విన్నాను. ఈ బతుకు ఎట్లా తెల్లారుతుందో..? " అని చెప్పుకుని బాధపడింది.
ఒక రోజు వైష్ణవి గుడికి రావడం ఆలస్యమైంది. అప్పటికే గుడికి వచ్చిన శాంతమ్మ గారు రావి చెట్టూ కట్టిన చెప్టా మీద కూర్చుని పూజ కోసం వచ్చిన ఒకామెకి వొత్తులు,నూనె ఇచ్చి దీపం వెలిగించమని అడిగింది. ఆమె అలా చేయడానికి తిరస్కరించడమే కాకుండా "అదేంటి మామ్మగారూ ! మీకు అలా నువ్వుల నూనె, వొత్తులు చేతికి ఇవ్వడం మంచిది కాదని తెలియదా ? అని తీవ్రంగా ప్రశ్నించింది. "లేదమ్మా నాకు తెలియదు. ఓపిక లేక అడుగుతున్నాను కానీ ఒకరికి మంచిది కాదని తెలిస్తే నేను అలా ఎందుకు చెపుతాను" అంది.
ద్వజస్థంభం దగ్గర దణ్ణం పెట్టుకుంటున్న వైష్ణవి ఇవన్నీ వింటూనే ఉంది. అంత పెద్ద వయసు వచ్చింది ఆమెకి . గుడిలోకి వచ్చి మరీ అబద్దాలు చెపుతుంది. తెలిసినవారు ఎవరూ పత్తితో చేసిన వొత్తులు,నువ్వుల నూనె చేతికి ఇవ్వరు ..ఇంకొకరు ఇస్తే తీసుకోరు,శని దోష నివారణ కోసం చేస్తూ ఉంటారు అలా . అని వివరంగా చెపుతుంది ఆమె
వైష్ణవికి వెంటనే తట్టింది శాంతమ్మ గారు నీలం రంగు జాకెట్ ముక్కలని మాత్రమే పంచి పెడుతుంది అని. కొందరు ఆమె ఇస్తున్నవేవీ తీసుకోకుండా వెళుతున్నారేమిటో అనుకునేదాన్ని. అందుకు కారణం ఇదా ..అనుకుని ఆశ్చర్యపోయింది. ఎన్నో సూక్ష్మ విషయాలు తెలిసిన ఆమెకి ఈ విషయం తెలియదంటే వైష్ణవికి కూడా నమ్మశక్యం కాలేదు. అప్పటిదాకా శాంతమ్మ గారి మీద ఉన్న గౌరవం చటుక్కున జారిపోయింది.
జరిగినవేమీ తెలియనట్లే .. రోజూ లాగానే శాంతమ్మ గారి దగ్గరకి వచ్చి ఈ రోజు ఆలస్యం అయిపోయింది. మీరు తొందరగానే గుడికి వచ్చేసారే మామ్మగారూ, రోడ్డు ఎవరు దాటించారు మిమ్మల్ని అని అడిగింది.
ఎలాగోలా నిదానంగా నేనే దాటానమ్మా ! ఇదిగో ఈ వొత్తులు నూనె తీసుకుని వెళ్లి దీపం వెలిగించి రా ..అంటూ వైష్ణవి చేతికి ఇచ్చింది. వైష్ణవి మాములుగానే తీసుకుంది. అంతకు ముందు శాంతమ్మ గారిని తీవ్రంగా ప్రశ్నించిన స్త్రీ మళ్ళీ వచ్చి వైష్ణవిని చేతితో వారిస్తూ.. "అలా ఆమె చేతిలో నుండి ఆ వస్తువులని ఎప్పుడూ తీసుకోకండి. శని దోష నివారణ కోసం ఇస్తూ ఉంటారు అని .. ఇదిగోండి మామ్మగారు మీకు ఇందాక చెప్పాను అయినా మళ్ళీ మీరు ఆమె చేతికి అవే వస్తువులని మళ్ళీ ఇచ్చారు. మనం మాత్రమే బాగుండాలని అనుకోవడం కాదండీ ఇతరులూ బాగుండాలి అనుకునేవాళ్లు ఎప్పటికీ మీలా చెయ్యరు. అంత వయసు రాగానే సరికాదు, అన్ని తీర్ధయాత్రలు చేసాను అని చెప్పుకుంటే సరికాదు. మంచి అన్నది మనం చేసే పనుల్లో ఉండాలి. అందరూ ఎవరి విశ్వాసం కొద్దీ వాళ్ళు గుడికి వస్తూ ఉంటారు,పూజలు,అభిషేకాలు చేయించుకుంటారు తప్ప మనం మన రాతలని దోషాలని ఇంకొకళ్ళకి అంటించాలని చూడరు. ఇది మీకు మంచిది కాదు" అని దులిపేసింది.
"అంత పెద్ద పెద్ద మాటలెందుకు పోనీ లెండి, నాకు ఏమీ తెలియదు కాబట్టి సహాయం చేస్తున్నాననుకుని ఆమె చెప్పేవన్నీ గుడ్డిగా చేసాను. ఆమెకి తెలిసి చేసింది అంటే .. ఆ పాపం ఆమెకే ! పైన భగవంతుడున్నాడు ఆయనే చూసుకుంటాడు అవన్నీ ! అంటూ దీపం వెలిగించి వచ్చింది.
శాంతమ్మ గారు వైష్ణవి చేయి పట్టుకుని "అమ్మా ! పెద్దమనసు చేసుకుని నన్ను క్షమించమ్మా ! ఇక ఎప్పుడూ అలా చేయను. పుత్ర ప్రేమతో .. గుడ్డిదాన్నై ఏదో బిడ్డకి దుష్ట గ్రహాలూ పట్టి పీడిస్తున్నాయి నివారణ కోసం అలా చేయమంటే చేస్తున్నాను తప్ప ఎవరికీ కీడు కలగాలని కాదు. నన్ను నమ్మమ్మా" ..అంటూ పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుంది
"అయ్యో ..అలా అనకండి మామ్మ గారూ .. ఈ లోపం అంతా మీలో లేదు, మీలాంటి నాలాంటి ఎందరికో పండితులు పుర్రెలకి అంటించిన జాడ్యం ఇది. దేవుడు అన్నిచోట్లా ఉన్నాడనుకుంటూనే నిత్య జీవితంలో కలిగే అశాంతులని తగ్గించుకోవడానికి,మానసిక నిబ్బరం పెంచుకోవడానికి ప్రశాంతత కోసం గుడికి వస్తాం తప్ప మన బాధలని ఇంకొకరి బదిలీ చేద్దామని కాదు. మనం చేతితో ఇచ్చినంత మాత్రాన ఇంకొకరు పుచ్చుకున్నంత మాత్రాన అన్ని బాధలు సమసిపోతాయనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. మంచిని ఇతరులకి పంచడమే వితరణ. నేనూ మీలో మంచినే చూసాను. ఎవరిది పాపమో పుణ్యమో నాకు తెలియదు. మీరే అంటారుగా పాపం,పుణ్యం అన్నీ ఎవరి ఖాతాలో వేయాలో భగవంతుడికి తెలుసు. మనం కేవలం నిమిత్త మాత్రులమి మాత్రమే అని అంది వైష్ణవి.
"చిన్నదానివైనా భగవత్తత్వాన్ని వొంటపట్టించుకున్నావ్. చల్లగా ఉండమ్మా" ..అంటూ మనఃస్పూర్తిగా దీవించింది శాంతమ్మ.