19, మార్చి 2023, ఆదివారం

రుణ బంధాలు

రుణ బంధాలు - వనజ తాతినేని


హఠాత్తుగా ఓ విషయం గుర్తుకొచ్చింది కరుణకు. అయ్యో! అతనికి నేను డబ్బు బాకీ పడ్డాను కదూ అనుకుంటూ వున్న పళాన లేచి పర్స్ తీసుకుని బండేసుకుని అతనిని వెదుక్కుంటూ బయలుదేరింది. అనేకసార్లు రోడ్డు ప్రక్కన ఆగుతూ నాలుగుచక్రాల తోపుడుబండ్లపై  పండ్లు కూరగాయలు అమ్ముతున్న అనేకమందితో మాట్లాడుతూ అతని ఆనవాళ్ళు చెబుతూ  ఆరా తీసింది. ఆచూకీ అందినట్టే అంది జారిపోతుంది.  అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరికొంతమందిని అడుగుతూ  వెతుక్కుంటూ మరొక సెంటరుకు   వెళ్ళింది. 


అక్కడో పరిచితురాలు కనబడింది. ముఖమంతా సంతోషంగా విప్పార్చుకుని మిమ్మలనే తలుచుకుంటున్నాను. ఎక్కడుంటున్నారు అని ఆరా తీసింది.కుశలప్రశ్నలు అయ్యాక ఫోన్ నెంబరు అడిగితీసుకుని మిమ్మలను వొక సహాయం చేయమని అడుగుదామనుకుంటున్నాను. ఇక్కడేమి అడుగుతానులెండి అని కాస్త సంస్కారం ప్రదర్శించి సాయంత్రం ఫోన్ చేస్తాను అంటూ సెలవు తీసుకుంది. 

సహాయం అనగానే గుండె గుబేల్మంది కరుణకు. ఏమి సహాయం అడుగుతుందో ఏమో! డబ్బుకు సంబంధించినదైతే కాదు కదా! అదే అయితే చాలా జాగ్రత్తగా వుండాలి.  నేనెక్కడనుండీ తెచ్చివ్వగలనూ!  అసలే ఆధారితను.కొడుకు అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నంతమాత్రాన అమ్మలకు ఆర్ధిక స్వాతంత్ర్యం  వుంటుందా?  ఆర్ధిక స్వాతంత్ర్యం వున్నా యిచ్చే మనసు వుంటుందా, పిల్లలకు యేవో అమర్చాలని, అది కొనాలి యిది కొనాలనే తాపత్రయంతో కొట్టుమిట్టాడతారు. తమ అవసరాలను కూడా వాయిదా వేసుకునో అసలు మానుకునో యింకా పిల్లల కోసం తాపత్రయపడే వారిలో నేను కూడా వుంటాను. ఇక  నేనేమి యితరులకు యేం సాయం చేయగలను? అని ఆలోచనచేస్తూ  వెతుకున్న మనిషి గురించి మరిచిపోయి నాలిక్కరచుకుంది.ఆపై రహదారికి యిరువైపులా దృష్టి సారించింది.అలా రెండు మూడు కిలోమీటర్లు చూపుల జల్లెడ వేసి గాలించినా అతని జాడ కనబడలేదు. 

ఇలా వెదికితే యీ వెదుకులాట సఫలం కాదనుకుంటూ తెలిసినతను ప్రకాష్ కు ఫోన్ చేసింది. అతని గుర్తులు చెప్పి అతను ఎక్కడన్నా కనబడుతున్నాడా అనడిగితే ఆమె  గతంలో చెప్పినది గుర్తుపెట్టుకుని అతను మీకు యివ్వాల్సిన డబ్బులు యివ్వలేదా అని అడిగాడు. అందుక్కాదు వేరే పని వుంది. అతను యెక్కడ కనబడినా నాకు ఫోన్ చేయి లేదా అడ్రస్ అడిగి తీసుకో అని చెప్పి  ఇంటికి వచ్చి పడింది. 

కరుణ అతనికి యివ్వాల్సిన నూట యెనభై రూపాయల సంగతి ఆమెను వెంటాడుతూనే వుంది. అతని పేరు కూడా సరిగా గుర్తు లేదు. ఏదో ముస్లిమ్ ల పేరు.  నాలుగు చక్రాల బండిపై కూరగాయలు అమ్మేవాడు. తాజాగా నాణ్యంగా వుండేవి. తూకం కూడా మోసం లేకుండా యిచ్చేవాడు.  రేటు యెక్కువైనా అతని దగ్గరే కొనేది కరుణ.  అతను వొకోసారి నెలల తరబడి కనబడేవాడు కాదు. అపుడు చచ్చుపుచ్చుల రైతుబజారు కూరగాయలే ఆధారం. చానాళ్ళ తర్వాత కనబడిన అతనిని కూరగాయలు తీసుకుని  రావడం లేదే అని అడిగితే యేవో యిబ్బందులు చెప్పాడు. కూరగాయలు కూడా తక్కువ తెస్తున్నావ్ యెక్కువ రకాలు తెచ్చుకుంటే అందరూ కొనుక్కుంటారు. నీకూ తిరిగినందుకు గిట్టుబాటవుతుంది కదా అంటే రైతులు అప్పివ్వడం లేదు. పెట్టుబడికి డబ్బులేదని చెపితే జాలి కలిగి  వెంటనే నేనిస్తాను వొక నెలలో నాకిచ్చేయాలని షరతు పెట్టి  డబ్బిచ్చి ఫోన్ నెంబరు అడిగితీసుకుంది. ఆ మొత్తం ద్విచక్రవాహనం బాగు చేయించుకోవటానికి కేటాయించుకున్న మొత్తం. ఆ అవసరాన్ని మరో నెలకు వాయిదా వేసి బండి రిపేరులతో ఆగిపోయి నానా యిబ్బందులు పడింది కూడా.

ఇక ఆ తర్వాత అతను ఆ వీధిలో కనబడటం మానేసాడు. ఫోన్లే.. పాపం! అతను యేమి యిబ్బందిలో వుండి రావడం లేదో నా డబ్బులు కోసం బాగా బేరం జరిగే కాలనీలో బతుకుతెరువు పోగొట్టుకుంటాడా అని ఆలోచన చేసింది కరుణ. అనుకున్న నెలరోజుల తర్వాత అతనిచ్చిన నెంబరుకు ఫోన్ చేస్తే ఆ నెంబరులో ఉలుకుపలుకు రెండూ లేవు. కోపంగా యేనాడో ఋణపడివుంటాను. అందుకే బీరువాలో దాచుకున్న డబ్బుకు కాళ్ళొచ్చి అతని చేతిలోకి నడిచెళ్ళాయని తిట్టుకుని సరిపెట్టుకుంది.  అందుకే తనకుమాలిన ధర్మం పనికి రాదు, అడిగి మరీ సాయం చేయకూడదు అంటారు పెద్దలు.పెద్దల మాట తాను వింటేగా! కష్టంలో వున్నామనగానే కరిగిపోయే మనసు. తగినశాస్తి జరిగింది తనకు అని నిట్టూర్చింది.

రెండేళ్ళ తర్వాత రోడ్డు వారగా అదే బండిలో కూరగాయలమ్ముకుంటూ కనబడ్డాడతను. బండి ఆపి కాలనీలోకి రావడం  లేదెందుకని అడిగితే అప్పుడునుండి యిక్కడ వుండటం లేదమ్మా   ఇక్కడ బతకలేకపోతున్నానని మా ఊరికి వెళ్ళపోయా. అక్కడా ఏం లాభం లేదు.బతకడం కష్టంగా వుంది.మళ్ళీ ఇక్కడే నయమని వచ్చేసాను అన్నాడు. సరేనని తలూపి నాణ్యంగా కనబడుతున్న కూరగాయలు తీసుకుంది. నేను పర్స్ తీసుకుని రాలేదు రేపు అటువైపు రా డబ్బులిచ్చేస్తా అంది కరుణ. 

“మీకు యివ్వాలి కదమ్మా” అన్నాడతను.” నేనిపుడు ఆ డబ్బులు విషయం అడిగానా” అని తీవ్రంగా మందలించి “నేను యివ్వలేక పోతున్నాను అని ఫోన్ చేసి చెప్పి వుండాల్సింది. మనుషులపై నమ్మకం లేకుండా చేస్తున్నారు కదయ్యా” అని కోపగించుకుని వచ్చేసింది. అతను కూరగాయలు అమ్ముకోవడానికి కాలనీలోకి రానూ లేదూ అతనికి కరుణ కూరగాయలకివ్వాల్సిన డబ్బులు యివ్వనూలేదు. అలా ఆమె అతనికి బాకీ పడిపోయింది. 

గతమంతా జ్ఞాపకం వచ్చి.. ఏమైనా సరే అతని డబ్బు అతనికిచ్చేయాలి. రేపు యెలాగైనా సరే అతని ఆచూకీ కనిపెట్టాలి. పెనమలూరు మసీదు సందులో వుంటాడంట. పేరు బడే సాహెబ్ అంట. ఈ వివరాలు చాలు. అతనిని వెతికి పట్టుకోడానికి అని స్థిమితపడింది.

సాయంత్రం కాఫీ త్రాగుతున్న సమయంలో పొద్దున కనబడిన పరిచితురాలు ఫోన్ చేసింది. విషయం యేమై వుంటుందో అని సంశయిస్తూనే ఫోన్ తీసింది. అనుకున్నదంతా అయింది. ఆమెకు డబ్బు అవసరపడిందంట. ఒక లక్ష రూపాయలు ఇవ్వాలి మీరు. వడ్డీ యెంతైనా పర్లేదు.. ఒక నెలలో ఇచ్చేస్తాను అంది. లేవు అని చెప్పి ఆమెను వదిలించుకోవడానికి పావుగంటపైనే పట్టింది. మరలా రేపు చేస్తాను ఆందామె.ఆమెకా అవకాశం లేకుండా నెంబరు బ్లాక్ లిస్ట్ లో పెడుతూ మనుషులు చెపితే విని అర్దం చేసుకుంటే బాగుండును అనుకుంది. 

అమెరికాలో కొడుకున్నంత మాత్రాన డాలర్లు చెట్లకు కాస్తాయా యేమిటి? ఈ కోవిడ్ మొదలైనప్పటినుండి డబ్బు అప్పివ్వమని పీక్కుతింటున్నారు జనం. సర్దుబాటు చేయమనే వారు అప్పు అడిగేవారు సాయం చేయమని అడిగేవారు పూజలు చేయించుకోమని అడిగేవారు ఇలా ఎందరో. అడగడానికి కూడా మొహమాటపడుతూ అడిగేవారు కొందరైతే ధాటీగా అడిగేవారు ఇవ్వక తప్పదని జులుం చేసేవారూ కొందరున్నారు. ఈ బాధలేమిటో  భగవంతుడా అని విసుక్కోవటం పరిపాటి అయిపోయింది కరుణకు. 


“తండ్రీ కుబేరా! కాస్త దయ తలచి నా వరండా తోటలో మనీ ప్లాంట్ తీగకు నోట్ల ఆకులు కాయించు తండ్రీ.. నన్ను అప్పు అడిగిన వారందరికీ పంచుతాను. నాలా తల్లులందరూ అమెరికా కొడుకులున్న తల్లులుగా మారేందుకు ఊత మిస్తాను” అని కోరుకుంటున్నాను. ప్చ్.. కుబేరుడు కూడా ప్రార్దిస్తున్న భక్తుల మధ్య రద్దీలో వున్నాడు కాబోలు ఆయన కూడా నా మాట వినిపించుకోవడంలేదు అని హాస్యపు ఆలోచనలు చేసింది. ఇలా అప్పులడిగిన వారందరికీ డబ్బు యివ్వగల్గితే  తనకు యెన్ని స్నేహాలు బంధుత్వాలు నిలిచివుండేవో అనుకుంది కరుణ. డబ్బు వుండి కూడా యివ్వలేదని భావించిన స్నేహితుల ప్రవర్తన నిష్ఠూరాలు గుర్తొచ్చి మనసంతా చేదుగా మారిపోయింది.    

 

కరుణ కుటుంబానికి  వాళ్ళు మంచి స్నేహితులే. ఉన్నపళంగా యేదో ఆపదలో చిక్కున్నారు. కష్టపడి కొనుకున్న భూమిని ఓ ధనవంతుడు ఆక్రమించి రౌడీయిజం చెలాయించి అక్కడ వున్న షాపుని రాత్రికి రాత్రే దౌర్జన్యంగా నేలమట్టం చేయించాడు. దానిని కాపాడుకోవాలంటే  అప్పటికప్పుడు పది లక్షలు ఖర్చు పెట్టాలని వకీలు చెప్పాడంట.ఆమాట విన్న కరుణ “అయ్యబాబోయ్ అంత డబ్బా.. నేనిచ్చే పరిస్థితులలో లేను” అంది. “మీకు పరపతి వుంది. మీరు  అప్పు అడిగితే యెవరూ కాదనరు. మీరు తప్ప యెవరూ చేయలేరు యీ సాయం” అని ముందర కాళ్ళకు బంధం.

 ‘’కాదండీ నేను యెవరినీ అడగలేను అదీ అబ్బాయికి తెలియకుండా’’అని కరుణ మొహమాటం. 

‘’తప్పేముంది. అబ్బాయిని అడిగే చేయండి’’ అని వారి సలహా. 

‘’సరే అడిగి చూస్తాను’’ అంది నిజాయితీగానే. 

ఏదో రెండు మూడు ప్రయత్నాలు చేసింది కూడా. కానీ వాళ్ళు పెట్టిన షరతులు వడ్డీల రేట్లు విని తనవల్ల కాదనిపించింది కరుణకు. అడిగిన మిత్రునికి  మెసేజ్ చేసింది ఆపదకాలంలో ఆదుకోలేనందుకు క్షమాపణ అడిగింది కూడా.  ప్రస్తుతం తామెదుర్కొంటున్న ఆర్ధిక యిబ్బంది గురించి కూడా వివరించింది. తానున్న పరిస్థితిలో  యేమీ సహాయం చేయలేను కూడా చెప్పింది. అప్పుడేమి అనకపోయినా తర్వాతర్వాత వారి నిష్టూరపు మాటలు దెప్పిపొడుపు మాటల వల్ల  బాధపడుతూ అశాంతితో వారి నెంబరును బ్లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రుణాలు  యిస్తేనో యిప్పిస్తేనో మనగలిగే నిలిచివుండే స్నేహాలా యివి?  ఆ ఒక్క కారణం చేత ఆత్మీయులు శత్రువులైపోతారా అని విరక్తి చెందింది.

అలాగే మరికొందరు స్నేహితులు. అమ్మాయి చదువుకు యితర దేశం వెళుతుంది ఖర్చుల కోసం రెండు లక్షలు కావాలని వొకరు, కాలేజీ ఫీజులు కట్టాలని మరొకరు, ఆస్థి తనఖాలో వుంది విడిపించుకోకపోతే దిక్కులేని వారిమైపోతాము నాలుగు లక్షలు సర్దుబాటు చేయండని  యింకొకరు కాళ్ళావేళ్ళా పడటం జరిగింది. అప్పటికప్పుడు మాయమైపోవడానికి ప్రవరుడికి తెలిసిన పసరు విద్య నాక్కూడా తెలిసివుంటే బాగుండునని బలంగా కోరుకుంది కరుణ. ఫోన్ నెంబరు మార్చేయాలనుకుంది. ఆ నెంబరుతో ముడిపడిన లంకెలను గుర్తు తెచ్చుకుని ఆ ప్రయత్నం మానుకుంది. రెండేళ్ళ కాలంలో స్నేహితులనదగ్గవారిలో సగానికి పైగా దూరం జరిగారు ఆమెకు.  తొలుత నిష్ఠూరమాడినా తర్వాత అర్దం చేసుకొన్న కొందరు మాములుగానే వున్నారు. కరుణ కూడా వారిపట్ల సానుకూలధోరణితో పాపం! యేదో ఇబ్బందులొచ్చి నన్నడుగుతున్నారు తప్ప అంతకుముందెన్నడూ నన్నడిగినవాళ్ళు కాదు వీళ్ళు.అవసరంలో సాయం చేయలేని అసక్తకు నాకు మాత్రం బాధ లేదూ! అని కళ్ళు తుడుచుకుంది.

అప్పు అడిగినవారు యెంత ఆశతో  యిస్తారనే నమ్మకంతో ఇవ్వరనే అపనమ్మకంతో ఆలోచనలు చేస్తూ నలిగిపోతారో.. ఇవతలివారు కూడా వారి సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకుంటూ లేవని చెప్పడానికి  మొహమాటపడుతూ చెప్పలేక నలిగిపోతారు. ఇచ్చే మనసుండి అవకాశం లేక లేదని చెప్పడం కూడా  మనిషికి అదొక యాతన.  గుమ్మం ముందు నిలిచి భవతి బిక్షాందేహి అని అడిగిన ఆదిశంకరుడికి కేవలం ఉసిరిక మాత్రమే ఇవ్వగల్గిన పేద ఇల్లాలు తన ఆర్ధిక దుస్థితిలో   సిగ్గిల్లుతూ  అభిమానం పడే యాతనలాంటిదే, ఇవ్వడం కుదరదని చెప్పేటపుడు కలిగే యాతన కూడా. నా బాధను కూడా స్నేహితులు అర్దం చేసుకుంటే బాగుండును అని బాధపడుతుంది. -

ధనం మూలం మిదం జగత్ అన్నట్లు ధనంతోనే అన్ని బంధాలు ముడిపడివున్నవని అర్దమవుతున్నప్పుడు మంచి స్నేహాలు కనుమరుగైపోతున్నందుకు కరుణకు బాధగా వుంటుంది. ప్చ్..నాకంటూ కొంత సొంత డబ్బు వుంటే బాగుండును తిరిగి  యిచ్చినా యివ్వకపోయినా చిన్నచిన్న అవసరాలలో సాయపడివుండేదాన్ని. మాట సాయం చేయవచ్చు కానీ అప్పు తెచ్చి యివ్వడం అంటే సుతారం యిష్టంలేదు. వారు తిరిగివ్వడం ఆలస్యమైతేనో వారి పరిస్థితులు మారిపోయి అసలివ్వకపోతేనో ఆ రుణ బాధ  వొత్తిడి భరించడం నావల్లకాదు.  గతంలో నమ్మకంగా చెప్పిన మాటలకు మోసపోయి డబ్బు యిప్పించి వాళ్లు ముఖం చాటేసి వెళ్ళిపోతే  యిప్పించిన పాపానికి రుణం తీర్చాల్సివచ్చింది. అలాగే బేంక్ రుణాలకు ష్యూరిటి యిచ్చి యిబ్బందులు పడింది.రుణం అంటే పామును చూసినంత భయం ఆమెకు. రుణం తెచ్చుకున్నా ఎవరికైనా యిప్పించినా  ఆ రుణం తీర్చకపోయినా మనసుకు శాంతి వుండదు.నియంత్రణ లేని ధరల కాలంలో అప్పు చేయనివాడు దున్నపోతై పుట్టును అన్నట్టుంది అనుకుంది. 

కరుణ కొడుకుతో ఆ విషయాలను పంచుకుంది. “అర్దించడమన్నది యెవరికైనా అభిమానాన్ని చంపుకోవలసి రావడమే!  చూసేవారికి దూరపుకొండలు నునుపు. ఇక్కడ వున్నవాళ్ళు కోట్లు సంపాదిస్తారు అనుకుంటారేమో! ఇక్కడా అందరివీ చాలీచాలని బతుకులే. ఎవరినీ అప్పు అడగకుండా గుట్టుగా సంసారం నెట్టుకొచ్చుకుంటున్నామంటే క్రెడిట్ కార్డ్ ల చలువే తప్ప మరొకటి కాదమ్మా”అన్నాడతను.“సహాయం చేయమని అడిగిన వాళ్ళందరికీ మనం సహాయం చేయలేమూ అప్పులు యివ్వలేము.  నువ్వు కూడా మధ్యవర్తిగా వుండి అప్పులు ఇప్పించవద్దు. డబ్బు వ్యవహారాలతో పెట్టుకుంటే బంధుత్వాలు స్నేహాలు కూడా దెబ్బతింటాయమ్మా.ఇలాంటి వాటి జోలికి నువ్వు వెళ్ళవద్దు అని నిక్కచ్చిగా చెప్పి  అంతగా నీకు చిన్న చిన్న సాయాలు యేమైనా చేయాలనుకుంటే గిఫ్ట్ అకౌంట్ వొకటి యేర్పాటు చేసుకో. నేను అపుడపుడు అందులో డబ్బు వేస్తాను. ఆ డబ్బును నీ యిష్టమైనట్లు ఖర్చు పెట్టుకో, యెవరికైనా యివ్వాలనిపిస్తే యివ్వు. నేను సంపాదించడం లేదు నాకు ఆర్థిక స్వాతంత్ర్యం లేదు అని పదే పదే కించపరుచుకోకు “అన్నాడు తల్లి మనసును ఆమె ఆలోచనలను పసిగట్టి.

అమ్మకు గిఫ్ట్ అకౌంట్. సంతోషంతో పొంగిపోయింది కరుణ.

అబ్బాయి చెప్పిన సూచనలు ప్రకారమే నడుచుకోవాలి. డబ్బు ప్రసక్తి లేని స్నేహాలు బంధుత్వాలు వుంటేనే మంచిది. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలు. ఈ విషయంలో యిలా కచ్చితంగానే వుండాలి. అలాగే అమ్మలందరినీ పిల్లలు యిలా అర్దం చేసుకుంటే యెంత బాగుండును. అయినా  మనుషులు తనలా బాధ్యతలన్నీ తీరిపోయాయని రిలాక్స్ అయిపోయి ఖాళీగా వుండటం వల్ల అనవసరపు ఆలోచనలు పెరగడం అయినవారిపై అధిక శ్రద్ధతో ఆరాలు అనవసర జోక్యాలు పెరుగుతాయి.ఓపిక వున్నన్నాళ్ళు యేదో వొక పనిచేయాలి. పిల్లలపై అన్నివిధాలా  ఆధారపడటం నిరాశావాదంలో ముంచేస్తుంది. చేసే పనిలో వ్యాపారంలో నష్టం వచ్చిందని ప్రయత్నం మానుకోకూడదు. కొత్తమార్గాలు అన్వేషించాలి. నిలబడటం ఆలస్యమైతే కావచ్చు కానీ నిలబడటం సాధ్యమే. ప్రయత్నాల వల్ల మనుషులతో సాంగత్యం పెరుగుతుంది. అనుభవాలను మార్పిడి చేసుకుంటాం అంతే కదా అనుకుంది ఆత్మవిశ్వాసంతో. 

మరుసటిరోజు  ప్రొద్దునే ప్రకాష్ ఫోన్ చేసాడు. ‘’అమ్మా! నువ్వు వెతుకుతున్న కూరగాయల బండి అతను సెంటర్ లో బండి పెట్టాడు. మామిడిపండ్లు అమ్ముతున్నాడు. వెంటనే వస్తే దొరుకుతాడు. నువ్వు వెంటనే రా, నేను అక్కడే వుంటాను’’ అన్నాడు. 

కరుణ వెంటనే బయలుదేరి వెళ్ళింది.  వెళ్ళేటపుడు నూట యెనబై రూపాయలు తీసుకుని వెళ్ళడం మర్చిపోలేదు. ఎదురుగా బండి ఆపిన  ఆమెను చూసి   కూరగాయల బండి అతని ముఖంలో రకరకాల భావాలు.’’ తొందరలో మీ డబ్బులు యిచ్చేస్తానండి’’ అన్నాడు సూటిగా ఆమె వంక చూడలేక మామిడిపండ్ల వైపు చూస్తూ. 

‘’ఇదిగో, నీకు కూరగాయల డబ్బులు నూట యెనబై రూపాయలు యివ్వాలి కదా, ఈ రుణబాధ నాకసలు నిద్ర పట్టకుండా చేస్తుంది అవి యివ్వడానికే వచ్చాను” అని డబ్బు యిచ్చేసింది.  “నేనప్పుడు నీకిచ్చిన డబ్బు నీకు సాయం చేసాననుకో. నువ్వు ఆ అప్పు సంగతి మర్చిపో’’ అని చెప్పి వచ్చేసింది కరుణ. 

‘’ మొత్తానికి భలేవారమ్మా మీరు’’ అన్నాడు ప్రకాష్ నవ్వుతూ.  

కరుణ నవ్వి బండి తీసింది. రుణ భారం తీర్చుకున్న ఆమెకు మనసులో భారం తీరింది. ఆలోచనల్లో  కొత్తపుంతలు. నా పాత ఎంబ్రాయిడరీ షాపు మళ్ళీ ప్రారంభించాలి.  దానితోపాటు నాణ్యమైన కుంకుడుకాయలు సేకరించి పూర్తి ఆర్గానిక్ పద్దతులలో పొడి పట్టించి విదేశాలకు యెగుమతి చేయడం ఆర్ధిక స్వావలంబనలో బలపడటం. మరొకటి యేమిటంటే అడిగిన వారందరికీ రుణాలు ఇవ్వడం ఇప్పించడం చేయలేనోమో కానీ  నాకొడుకిచ్చిన గిఫ్ట్ మనీ నాకుండగా యిలాంటి చిన్న చిన్న సాయాలు యీ మాత్రం చేయలేనా! చిన్నచిన్న సాయాలే రుణబంధాలు అనుకుంటూ  ఉత్సాహంగా ముందుకు సాగింది.

****************0***************

#ఈస్తటిక్ _సెన్స్ కథాసంపుటిలో స్వీయ ప్రచురణ.
కామెంట్‌లు లేవు: