28, సెప్టెంబర్ 2015, సోమవారం

నదీ వియోగ గీతం

నదీ వియోగ గీతం

నాలోనూ ఒక నది నీలోనూ ఒక నది

అంతర్లీనంగా ప్రవహిస్తూ

అందుకే నది ఆలపిస్తున్న గీతం వినబడుతుంది మనకి 

నది పుట్టుక ఒక అనివార్యం

బిందువు గానే పుడుతుంది

సింధువుగా మారేవరకు

ఎనిమిది దిక్కులనడుమ ప్రయాణం చేస్తూ

లక్షలమంది సంతానంతో విలసిల్లుతుంది

పాయలు పాయలుగా చీలిన చీర కుచ్చెళ్ళలో

బిడ్డలు సేద్యపు దోబూచులాట ఆడుకుంటుంటే పచ్చగా దీవిస్తుంది .

అందుకే మనం నదిని పూజిస్తాము

ప్రతి సదనంలోనూ వెలుగులు నింపిన

నదీమ తల్లి ముందు మోకరిల్లి

నిండు హృదయంతో కృతజ్ఞత చెపుతాము

నదిని ప్రేమిస్తాము

నది మనసుపై ఆనందాల పడవనెక్కి విహరిస్తాము

సేదదీరుతాం ఈదులాడతాము మలినాలని విసర్జిస్తాము

అయినా నది ప్రేమతో తడిపేస్తుంది

నది ఒక క్షేత్రమైంది

క్షేత్రాన విసిరివేయబడ్డ బీజాలెన్నో మొక్కలై మానులై

పంటలై పిట్టరెట్టా పూలు ఫలాలతో ఎప్పుడూ పురిటి కంపు కొడుతుండేది

నది నేత్రమైంది

తన ఒడ్డున విలసిల్లిన నాగరికతలన్నీ

ఇసుకలో నడిచిన పాదముద్రలై

కనుమరుగై పోతుంటే నిశ్శబ్దంగా చూస్తూ ఉంది

నది తీర్ధమైంది మన కల్మషాలని కడిగేస్తూన్నా

మన దాహార్తిని తీరుస్తూన్నా

అడ్డంగా ఆనకట్టలెన్నో కట్టేస్తున్నాం

నదిగతిని మార్చేస్తున్నాం

వెలుగుల ఆకారం లాంటి నదీ

సూర్య కిరణాలని తన నీటి కెరటాలపై అలంకరించుకుని

తళ తళ లాడుతుండే నది

రాత్రివేళ జలతారుపరదాని కప్పుకుని

తనని తానూ అలంకరించుకునే నది

ఇప్పుడు బిడ్డలఇళ్ళని వెలిగించడానికి విద్యుత్పాదకమైంది


ఆకుపచ్చని మైదానాలూ  లోయలూ  

జీవరహితం

నాగరికత యెల్లువలో

నదిని నమ్ముకున్న బ్రతుకులు

కొడిగట్టే దీపాల్లా ఉన్నాయి. 

నది  ఆనవాలుగా గలగలలు బిరబిరలు 

మంద్రమైన పరవళ్ళుఏవీ వినిపించవు

శ్రావ్యమైన నది పాట ఇక మనకి వినిపించదు

ఉప్పెనై విరుచుకు పడినప్పుడు భయ విహ్వలలై

వరదై ముంచెత్తుతున్నప్పుడు నిశ్చే స్టులై తలవొంచకతప్పదు

భావితరంలో నది అంటే ..ఒక రంగస్థలం

ఆనకట్టలు విద్యుత్ కేంద్రాలు ఇసుక రేవులు ఇవే పాత్రలు

నది ఒక్కటే ! రేవులనేకం మధ్య చిక్కి శల్యమవుతున్న నది

అభివృద్ధి హస్తాల నడుమ బంధింపబడిన నది

సాగరుని చేరలేక వియోగ గీతాన్ని ఆలపిస్తూ ఉంది .

తీరం వెంట సాగుతున్న మనకి అది వినిపిస్తూనే ఉంది.


(ప్రరవే వేదిక పై చదివిన కవిత) 27/09/2015





24, సెప్టెంబర్ 2015, గురువారం

మనలేని మనం

మనలేని మనం

అక్కడేముందో చూద్దామని తొంగి చూసా

అర్ధం కాని అగాధమేదో ఆశ్చర్యంగా

పోనీ అక్షర గవాక్షంలో నుండైనా చూద్దామనుకున్నా 

శ్వేత పత్రమే దర్శనమిచ్చిందక్కడా

చెలిమన్న వల వేసినా చిక్కని

మరుగుజ్జు మనసు తటస్థించిందచట


పచ్చని హృదయ సీమలో

ద్వేషం కలుపు మొక్క మొలకెత్తిందక్కడ

పీకేయ్యడానికి ఏ మందు లేదనుకుంటా

ఒక వాక్యం నిలువునా చీల్చేస్తే

విడివడిన పదాల్లా నువ్వూ నేను

వెలుగు చీకటి ఒకే చోట ఉండలేనట్లు

ఒకే తావున మనలేము మనం

అది చెరసాలైనా సరే !

ప్రేమ లేని చోట ద్వేషమైనా మనగలనా !


20, సెప్టెంబర్ 2015, ఆదివారం

ఖాళీ సంచి

ఖాళీ సంచి 


పిల్లలకేం..   వాళ్ళు  బాగానే ఉంటారు  

నిశ్చలంగా ఉన్న సరస్సులో రాయేసినట్లు 

వాళ్ళ మూడ్స్ ని అమ్మలకి  బట్వాడా చేసేస్తారు 

చూపుకి చూపుకి మధ్య యోజనాల  దూరం 

ఈ హృదయానికి ఆ మెదడుకి మధ్య అంతే దూరం 


ప్రేమలకి దిగుళ్ళకి  బానిసని అయినందుకేమో 

దుఃఖ కడలిని ఎదన దాచేసి  

కనుల పొరలు నదులని ఆపలేక 

అనేక రాత్రులని దిండుకాన్చి తెరిపిన పడతారు 


ఆకాంక్షలన్నింటిని  అదిమిపెట్టుకుని  

లేని గాంభీర్యాన్ని అంటిపెట్టుకుని

అస్థిత్వమంటూ మరిచిన  అమ్మలై    

ఉన్నదీ లేనిదీ  తెలియని ఒక భ్రమలో  

 తెలియకుండానే జీవితం జీవితాన్నే 

పరాయీకరణ  చేసేసుకుంటారు . 


అప్పుడప్పుడూ అమ్మలకి 

ఇష్టమొకటి ఉందని  గుర్తుకొస్తుందేమో 

మనసుకి నచ్చే వ్యాపకాలతో 

అలా గాలి పీల్చుకుందామనుకుంటారా   

హఠా త్తుగా ఏవో సంకెళ్ళు పడతాయి 


ఎన్నాళ్ళుగానో ఎదురుచూసినరోజుని  

పాలుగామార్చి వారు  నీరులా  

కలసి ప్రవహించాలని కలగంటారా    

వారి  ప్రమేయం లేకుండానే 

నిశ్శబ్దంగా కరిగిపోతుందా  రోజు 


చీకటిలో రంగులన్నింటిని చూడాలని

నిశ్శబ్దాన్ని చిత్రించే కుంచెని చేబూనాలని    

వసంతాన్ని కురిపించే ఆకాశం క్రింద 

మైమరుపుతో తడవాలని 

కాసిని ఎడారి మాటలని వినాలని  

ఊహల వలయంలో  తిరిగే సాలీడులా 

అమ్మలేం కొట్టుకుపోలేరు  కాని  


కాస్త నాలుగు గోడలు దాటి   

మస్తిష్కాన్ని  బ్రద్దలు క్రొట్టే ఆలోచనల తావున

పావురంలా స్వేచ్ఛగా  శాంతిగా మసలాలనుకుంటే 

 జీవితం జీవితాన్నే  ఒక ఖాళీసంచీగా మార్చి  

బిడ్డలెప్పుడో  చేతికి తగిలించుకుని

వెళ్ళిపోయారని గుర్తుకువచ్చినప్పుడు 

జీవితమంటే అర్ధంకాని సంవేదన 

ఎందుకయ్యిందో ఎరుకపడతారు. 






16, సెప్టెంబర్ 2015, బుధవారం

తోటమాలి

తోటమాలి

రాలు పూలకి రాతి దెబ్బ తగలకూడదని

శ్రద్దగా పచ్చికని పెంచుతున్నతను

ఋతువులతో సహజీవనం చేస్తూ 

పరవశంగా ప్రకృతి ఒడిలో ఓలలాడుతూ

పెదవి అంచున మురళిలా మధుర ధ్వనం

తీయనైన అతని స్నేహితం వర్ణరంజితం

యవ్వన సీమలో అదో అందమైన కలవరం

ఏ కలికి వ్రాయలేని కమ్మని కావ్యం

అతని ప్రేమ నదిలో మునిగి తేలాక

గత జన్మల గాఢ పరిచయమేదో

జ్ఞప్తికి వచ్చి ఒడలెల్లా నిరీక్షించా

అష్ట పదితో నడిచే వరం కొఱకు

తీరని ఋణ మేదో మిగిలి ఉన్నట్లు

మనసు సంకెల వేస్తే తలొంచాను

మురిపెంగా మమత ముడుల కొఱకు

విరులూ వనమూ

ఫలమూ సర్వమూ

కాచే పాలికాడతను

నా తోటమాలి అతను 


14, సెప్టెంబర్ 2015, సోమవారం

మబ్బులు విడివడి

ఫ్రెండ్స్ .... సెప్టెంబర్ నెల "జాబిలి" మాస పత్రికలో ప్రచురింపబడ్డ నా కథ .. తప్పక చదివి మీ అభిప్రాయం చెపుతారు కదూ !

మబ్బులు విడివడి       _వనజ తాతినేని


"మీ అల్లుడు గారు నన్నైనా వదిలేస్తారు కానీ స్నేహితులని మాత్రం అసలు వదలరు. ఎందుకు నాన్నా ! రెండు రోజులు ముందు రండి అని పదే పదే చెపుతారు" అని నిష్టూరపడింది విజయ తన తమ్ముడి పెళ్ళికి ఆహ్వానించడానికి వచ్చిన తండ్రితో . "అందుకే కదమ్మా సాహిబ్ ఫ్యామిలీని, మేథ్యూస్ ఫ్యామిలీని కూడా రెండు రోజులు ముందుగానే రమ్మని చెప్పి వస్తున్నాను " అని నవ్వారు ఆయన .

నేను మాత్రం నవ్వలేకపోయాను . నిజంగా మా ముగ్గురు స్నేహితులమి కలిసి నా బావమరిది పెళ్ళికి వెళ్ళే అవకాశం ఉందా !? ఆ పెళ్లి కన్నా ముందుగా ఈ ఏడాది రంజాన్  మాసంలో రాఖీ  పండుగ కలిసి వచ్చింది.   ఆ రోజునే మేథ్యూస్ కొడుకు ఆర్య పుట్టిన రోజు కూడా ! మూడు సందర్భాలు కలిసిన ఆ రోజుని ఎంత బాగా సెలెబ్రేట్ చేసుకోవాలని అనుకున్నామో ! అనుకున్నదొకటైతే అయింది మరొకటి.

మేము ముగ్గురం బాల్య స్నేహితులమి.  ఒకే వీధిలో పుట్టి పెరగడమే కాదు ఒకే బడి, ఒకే కాలేజ్ ఆఖరికి ఒకే విశ్వ విద్యాలయంలో వేరు వేరు భాష లలో విద్యార్ధులకి పాఠాలు భొదించే ఆచార్యులమీ కూడా! మా ముగ్గురికి పెళ్ళిళ్ళు జరిగి బిడ్డలు పుట్టిన తర్వాత మా బంధం మరింత బలోపేతం అయింది. అంతగా మా కుటుంబాలు అల్లుకు పోయాయి స్నేహమనే దారంతో అల్లుకున్న మా కదంబ మాలని ఎవరూ త్రుంచ లేరని మా ప్రగాఢ విశ్వాసం కూడా ! ఎవరో దిష్టి పెట్టినట్లు ఆ విశ్వాసానికి బీటలు పడ్డాయిప్పుడు.

ఒక నెల రోజుల క్రితం అనుకోకుండా యూనివర్సిటీకి సెలవలు ప్రకటించడం తో మా మిత్రులు ముగ్గురం కలిసి ఎన్నాళ్ళుగానో చూడాలనుకుంటున్న బార ఇమాంబర గుర్తుకు వచ్చింది. కుటుంబాలతో కాకుండా ఈ సారి మేము ముగ్గురమే ప్రయాణం అయ్యాం . లక్నో ఎక్స్ ప్రెస్ కి తత్కాల్ లో టికెట్స్ బుక్ చేసుకుని అక్కడ ఏమేమి చూడాలో గూగుల్ లో సెర్చ్ చేసి చూసుకుని నోట్ చేసుకుని గైడ్ ని కూడా మాట్లాడుకుని మరీ వెళ్లాం. అక్కడ రైల్వే స్టేషన్ లో దిగగానే బాగా ఆకర్షించింది గుర్రపు బండి ప్రయాణం . ఆర్ధికంగా బాగా అభివృద్ధి చెందిన నగరంలో అన్ని వాహనాలతో పాటు గుర్రపు బండ్లు ఉండటం సంతోషం కల్గించింది. లక్నో ని నవాబుల నగరం కోటల నగరం అని కూడా పిలుస్తారంట . ఇక్కడ లేనిది అంటూ ఏమీ లేదు . ఈ నగరం దేశానికి గుండె కాయ లాంటిది అని చెప్పాడు టాంగా వాలా .

హోటల్ కి వెళ్లి త్వర త్వరగా రెడీ అయిపోయి గైడ్ ని  తీసుకుని నగరం చూడటానికి వెళ్లాం . నగరం మధ్యగా ప్రవహిస్తున్న గోమతి నదీ పచ్చని పార్క్ లు అన్నింటిని చాలా ఆసక్తిగా గమనించాం . మేథ్యూస్ అయితే తన చిన్న నోట్ బుక్ లో అన్నీ వివరంగా వ్రాసుకుంటుంటే ..నేను ఆ నగరాన్ని కోటలని అన్నింటిని కెమెరా లో బందించాను . బారా ఇమాంబారా , చోటా ఇమాంబారా మరియు అరవై అడుగుల ఎత్తుతో ఠీవిగా నిలబడిన రూమి దర్వాజా అస్ఫీ మసీద్ అన్నింటిని చూడటానికి రెండు కళ్ళు చాలలేదు . అదంతా గొప్ప సంస్కృతి సంపద. ఏదో ఒకసారి చూసి తిరిగి రావలనిపించలేదు ప్రయాణాన్ని వాయిదా వేసుకు ఇంకో రెండు రోజులు అక్కడే ఉండి మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చాము . రెండు వందల పాతికేళ్ళ నిర్మాణాలని అప్పటి సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి ఆచ్చెరువు చెందాము .

సాయం సమయంలో ఆస్ఫీ మసీద్ మెట్ల మీద కూర్చుని చల్ల గాలిని పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ గైడ్ తెలుపుతున్న విషయాలని వ్రాసుకుంటూ విద్యుత్ దీపాల కాంతులలో ఆ పురాతన అద్భుత నిర్మాణాన్ని కనులలో నింపుకుంటూ అనుభూతిని నింపుకున్నాను . ఎప్పుడు సెలవలు దొరికినా ఇక్కడే వస్తాము మాకు బాగా నచ్చిందీ నగరం అని చెపితే గైడ్ కూడా సంతోషించాడు . ఎన్నాళ్ళగానో చూడాలనుకున్న ప్రదేశాలని చూస్తున్న ఆనందంలో నేను సాహిల్ ని బాగా గమనించలేదు కానీ మాథ్యూస్ బాగా గమనించాడు . తను మర్సియా బుక్స్ కొనుక్కున్నాడు . అందరం కలసి ముషాయిరాకి వెళ్ళాము మేథ్యూ తన కొడుకుని అక్కడున్న సైనిక్ స్కూల్ లో చేర్చాలని ఎంతగా ఉబలాట పడ్డాడో . వివరాల్నీ సేకరించాడు . అని చోట్లా సాహిల్ ముభావంగానే ఉన్నాడు ముఖ్యంగా ఏబై మీటర్ల పొడవు పదహారు మీటర్ల వెడల్పు తో అతి పెద్ద గా నిర్మించిన సెంట్రల్ హాల్ ని చూసిన తర్వాత ఒక మాటన్నాడు "ఇలాంటి నిర్మాణ శైలి భారతీయుల వల్ల అవుతుందా" అని .

నేను నివ్వెర పోయాను. చరిత్రని మర్చి పోతున్నావ్ ! ఇక్కడంతకీ ముందు గొప్ప రాజులు ఉండేవారు, రాజ్యాలు ఉండేవి. మొఘలు సామ్రాజ్యపు రాజులు గొప్ప వాళ్ళే ! కాదనను, కానీ పరిజ్ఞానం ఏ ఒక్కరి సొంతం కాదు టర్కీ వాళ్ళో, యూరిపియన్స్ గొప్ప వాళ్ళు అనే ముందు మన హంపీ నిర్మాణాలని, అజంతా ఎల్లోరా కట్టడాల సాంకేతిక పరిజ్ఞానాన్ని తక్కువగా చూడకు . ముస్లిం దండయాత్రలో కూల్చి వేసింది కట్టడాలని, దోచుకు వెళ్ళింది మన సంపదలని మాత్రమే కాదు మన సాంస్కృతిక జీవనాన్ని కూడా విచ్చినం చేసారు " అన్నాను. సాహిల్ మౌనంగా ఉండిపోయాడు .

తర్వాత నేను మాథ్యూస్ మాట్లాడుకుంటూనే ఉన్నాం . ప్రతి దేశంకి మూలమైన ఒక సంస్క్రతి ఉన్నప్పటికీ కొన్ని వందల ఏళ్ళకి అది మాయమైపోతుంది. సాంఘిక ఆర్ధిక కోణాలు అసమానతలు ప్రజల జీవితాలని దుర్భరం చేస్తాయి అందుకనేమో అంతకు ముందు రాజైన .అక్బర్ దీన్ ఇ ఇలాహీ స్థాపించాడు లాంటి విషయాలతో చరిత్రని సింహావలోకనం చేసుకున్నాం . తిరుగు ప్రయాణం లో కూడా సాహిల్ ఎక్కువ మాట్లాడలేదు . అలసి పోయాడేమో అనుకున్నాను కానీ తనలో భావ వైరుధ్యం చోటు చేసుకుందని నేననుకోలేదు. అప్పుడప్పుడు సంభాషణల్లో పాలు పంచుకుని ఈ దేశంలో అందరూ సమానం కాదన్నట్లు మాట్లాడాడు . నేను వాదించాను . చరిత్ర,వర్తమానం తెలిసిన మనమే ఇలాంటి అపోహలతో, అహంతో మనసులో ద్వేషాన్ని పెంచుకుంటూ పొతే భవిష్యత్ లో ఈ దేశ చిత్రపటం ఎలా ఉంటుందో ఊహించావా ? ఎక్కడో చోటు చేసుకున్న చిన్న ఘర్షణ వల్ల రాజకీయ నాయకుల స్వార్దానికి ఊతమై వారి వారి ప్రసంగాలతో కావాలని విద్వేషాలని రగిల్చి రాత్రికి రాత్రే గ్రామాలని స్మశానాలుగా మార్చివేసారు. ఆ సంఘటనలని వార్తలలో చూసి , వీడియో దృశ్యాలలో చూసి మనం ఎంత దిగ్భ్రాంతికి గురయ్యాం. కొన్ని దృశ్యాలని చూసి " ఏమైందీ వీళ్ళకి ? తోటి సోదరులపై ఇంత కక్ష పెంచుకున్నారు. ఎక్కడైనా పొరబాటు జరిగితే చట్టం ఉంది,న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయం కోసం పోరాడాలి కానీ ఇలా మారణాయుధాలతో దాడి చేసి తరిమి తరిమి కొడతారా ? పసి పిల్లలని కూడా చూడకుండా ... నేను కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటే

"అరె భాయి... ఊర్కో ! ఇంత సున్నితంగా ఉన్నావే ! రాజకీయమనే పాము పడగనీడన బతుకుతున్నాం మనం. వాళ్ళే నరికిస్తారు తగలబెట్టిస్తారు, మళ్ళీ వాళ్ళే వాటేసుకుని మంచిగ చేసాం అంటారు. ఓట్ల ముందు నాలుగు రూకలు విసిరితే వాలిపోయే పావురాళ్ళు ఈ అమాయక జనం. వీళ్ళలో కొందరు చూడు రేపు ఇలా జరిగింది అనేదానికి సాక్ష్యం కూడా చెప్పరు. అయిపోయిందేదో అయిపొయింది. ఇప్పుడు మేమంతా బాగున్నాం అంటారు" అని నువ్వు నన్ను ఓదార్చే ప్రయత్నం చేయలేదా ? మనం ఆ వీడియో లని విద్యార్ధులకి చూపించి అక్కడ ఏం జరిగిందో అన్న అవగాహన కల్గించలేదా ? ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావ్ ? గట్టిగానే అడిగాను . సాహిల్ మాట్లాడకుండా దుప్పటి కప్పుకుని నిద్రకుపక్రమించాడు. అలా మా విహార యాత్ర ముగిసింది.

ఊహ తెలిసిన దగ్గరనుండి ఏ బేదాభిప్రాయం లేకుండా పెరిగిన మా మధ్య లక్నో పర్యటన వాదాలు, బేధాలు సృష్టించింది . రోజూ కలవడాలు లేవు మధ్యాహ్నపు భోజనం పంచుకోవడాలు లేవు. ఒకొరికొకరు  ఎదురైనప్పుడు ఏవో ముక్తసరి మాటలు లేదా తప్పించుకుని తిరగడం చేస్తున్నాడు సాహిల్ . మా మధ్య ఇలా ఉంటే  యూనివర్సిటీలో మరో రకపు గొడవలు . ర్యాగింగ్ తాకిడికి ఒక అమ్మాయి చనిపోవడం అందుకు భాధ్యులు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని అనుకోవడం ఆ వర్గానికే చెందిన వాడిని నేనూ  కావడం దురదృష్టకరం. 


క్లాస్ తీసుకుని స్టాఫ్ రూం కి వెళుతుంటే సాహిల్ ఎదురయ్యి " మీ వాళ్ళే ఇలా చేసారంట . ఆ అమ్మాయి చావుకి వాళ్ళే కారణమట . ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది రాష్ట్రాలలో కుల పీడన, దేశంలో మత పీడన సర్వసాధారణం అయిపోయింది . ఇప్పుడు కూడా లౌకిక రాజ్యం అంటూనే మాట్లాడతావా ? అన్నాడు . దెబ్బ తిన్న పక్షిలా విల విల లాడి పోయాను . రాజ్య మౌన ఉపేక్షని నిరసిస్తూ ఎన్ని తీర్మానాలు చేపట్టాం, అక్కడ జరిగిన దానికి నిరసనగా మన విధ్యార్ధులతో కూడి మౌన ప్రదర్శన చేసిన విషయం మర్చిపోయావా? నువ్వేనా ఇలా అంటుంది అడిగాను ఆవేదనగా. నిరసనగా చూస్తూ వెళ్ళిపోయాడు .

ఆదివారం వచ్చిందటే ముగ్గురి ఇళ్ళల్లో ఎక్కడో ఒకచోట కలిసేవాళ్ళం . సాహిల్ మాట్లాడక పోవడం వల్ల మిగతా రెండు కుటుంబాలు కూడా కలవడం మానేశాయి ఇళ్ళల్లో కూడా అర్ధమైపోయింది. అందరూ మౌనంగా బాధగా ఉన్నాం . ఎలా ఉండేవి ఈ కుటుంబాలు? ఎలా అయిపోయాయిప్పుడు ? ఏదో ఒకటి చేయండి, సాహిల్ అన్నయ్యతో మాట్లాడండి మళ్ళీ ఎప్పటిలా మనమందరం కలసి ఉండాలి. రేపు వాళ్ళింటికి వెళ్లి నేను రాఖీ కట్టాలి .  శుభాకాంక్షలు చెప్పి   ఇఫ్తార్ విందులో పాల్గొని తర్వాత   అందరం ఆర్య పుట్టినరోజు వేడుకలో పాలుపంచుకోవాలి అని విజయ గొడవ చేసింది.

నాన్నా ! రేపు సెలవు కదా, రేష్మా వాళ్ళింటికి వెళదాము, రేష్మాకి రాఖీ  విషెస్ చెప్పొద్దూ ..నన్ను వాళ్ళింటికి తీసుకు వెళ్ళు అని సావర్ణిక అడగడం మొదలెట్టాడు . ఉదయాన్నే మాథ్యూస్ కి కాల్ చేసి అందరం కలసి సాహిల్ ఇంటికి వెళదామని చెప్పాను . 


మేమందరం కలసి వెళ్ళే టప్పటికి సాహిల్ ప్రార్ధన కోసం మసీదుకి వెళ్ళాడు . హీరా మా అందరికి మర్యాద చేసి ఖీర్ తీసుకువచ్చింది, వాడిని రానివమ్మా !  ముబారక్ చెప్పి అప్పుడు తింటాం అన్నాను . ఏమోనన్నయ్యా ! ఎందుకో ఈమధ్య ఆయన సరిగా లేరు . రేష్మా మీ ఇంటికి వెళదామని అడిగింది. మాట్లాడలేదని మళ్ళీ మళ్ళీ అడిగింది . విసుక్కుంటూ నాలుగు దెబ్బలేసారు కూడా ! అని చెప్పింది . నేను మాథ్యూ స్ వంక దిగులుగా చూసాను .


పిల్లలు, ఆడవాళ్ళు ఎవరి గోలలో వాళ్ళున్నారు . నెల రోజుల తర్వాత కలిసేటప్పటికి వాళ్ళ మధ్య ఎన్నో ముచ్చట్లు . వాళ్ళకేం వాళ్ళు బాగానే కలిసిపోయారు . సాహిల్ మాతో అది వరకటిలా మాట్లాడ గలడా !? ఏదో బిడియం. మాథ్యూస్ నా భుజం పై చేయి వేసి బాధపడకు వాడు మాములుగానే ఉంటాడులే ! అక్కడేదో సాతాను పట్టింది వాడికి. అందుకే అలా మాట్లాడాడు అని ఓదార్పు వచనాలు చెప్పాడు .

నెల రోజులుగా మా మధ్య ముసురుకున్న అపోహల మబ్బులు చలన రహితంగా పడి ఉన్నాయి. వాటిని కదిలించే శీతల పవనాల ఆచూకీ కోసం వెదుకుతున్నాను నేను . ఏ ఉరుములు మెరుపులు లేవు ఉక్కపోతలో ఆలోచనలు జిగట జిగటగా ఉన్నాయి . ఆ జిగటని కడిగేసే అవగాహన వాన కురుస్తుందా ! మా స్నేహపాత్ర తిరిగి నిండుతుందా !? ఈ దేశంలో ఎక్కడో జరుగుతున్న కొన్ని సంఘటనలకి నిజంగా అందరూ భాధ్యులేనా !? నా మాటల్లో , నా ప్రవర్తనలో , నా ఆతిధ్యంలో ఎప్పుడైనా నువ్వు వేరు నేను వేరు అనే భావం కల్గేటట్లు నేనున్నానా ! ఏవేవో అపోహలతో ఎందుకు నన్నుదూరంగా నెట్టేస్తున్నాడు. నెట్టేసినా సరే వాడిని కలుపుకోవాలి . ఇది మా స్నేహానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు, దేశం మొత్తం ఉన్న సమస్య . నాయకులు వేరు ప్రజలు వేరు . భిన్న సంస్కృతితో తరతరాలుగా మమేకమైపొయిన జాతి మనది. అయిదేళ్ళు పాటు పరిపాలించే నాయకులొచ్చి ఇది ఒక మతానికి చెందిన దేశమనో లేదా ఈ దేశ వారసత్వానికి ప్రతీకలమనో చెప్పుకున్నంత మాత్రాన మిగతా మతాల వారందరూ ఈ జాతీయులు కాకపోతారా? అలాంటి నాయకులకి బుద్ది చెప్పాలంటే వారి కుళ్ళు కుతంత్రాలు అర్ధం చేసుకున్న వారే నడుంబిగించాలి. అందుకు మా లాంటి ఆచార్యులు, గురువులు ముందుండాలి . ముందు నా మిత్రునికి ఉన్న అపోహని తొలగించాలి. ఈ దేశం మనందరిది. చరిత్ర తెలుసుకోవడానికే తప్ప తవ్వి తవ్వి తెలుసుకుని ఆంతర్యాలు పెంచుకోవడానికి కాదనీ,  మా రాజులు గొప్పని మీ రాజులు తక్కువ అని గేలిచేసుకుని వైషమ్యాలు పెంచుకోవడానికి కాదని సాహిల్ కి చెప్పాలి . ప్రస్తుతానికి అది నా భాద్యత. పట్టుదలలు, భేషజాలు పెంచుకుని ఆచార్యుల స్థానంలో ఉన్న మేమే ఇలా ఉంటే  మిగతావారికి ఎవరు తెలియజేస్తారు. అని నిజాయితీగా అనుకున్నాను .

సాహిల్  ఇంట్లోకి రాకమునుపే బయటున్న అన్ని జతల చెప్పులని చూసి మేమంతా వచ్చామని ఊహించినట్లు ఉన్నాడు . బయట నుండే అక్కా అంటూ విజయని కేకేసాడు. భయ్యా! అంటూ విజయ సంభ్రంగా వరండాలోకి వెళ్ళింది , నువ్వు వస్తావని నాకు తెలుసక్కా .. అంటూ లోపలి వచ్చాడు .ఏరా ! ఎలా ఉన్నావ్ అంటూ మాథ్యూస్ని పలకరించాడు.నాలాగే మనిషి కాస్త చిక్కినట్లు అనిపించాడు. వాడి కళ్ళలో ఏదో దిగులు. సావర్ణిక ని, ఆర్య ని దగ్గరకి తీసుకున్నాడు . విజయ, మార్గరెట్ వాడికి నేను ముందు అంటే నేను ముందు అంటూ రాఖీ కట్టడంలో పోటీ పడ్డారు . రేష్మా తనకి నేను తెచ్చిన కొత్త గౌనుని టెడ్డీని సంబరంగా తండ్రికి చూపుతుంది .

నా వంక చూడకుండా తప్పించుకు తిరుగుతున్న సాహిల్ దగ్గరకి నేనే వెళ్లి  ముబారక్ చెప్పాలని చేతులు చాచాను. సాహిల్  ఉద్విగ్నతకి  లోనై బద్మాష్ ! ఇన్నాళ్ళు ఏమైపోయావురా! ఏదో అన్నానని మాట్లాడటం మానేస్తావా అంటూ నా మీదే నెపం వేస్తూ నా చేతులమధ్య హృదయానికి దగ్గరగా ఇమిడి పోయాడు. ఆ స్నేహ పరిష్వంగంలో కన్నీళ్ళు కారిపోతున్నాయి. చొక్కాలు తడసి పోతున్నాయి ." ఇక చాల్లే ఆపండి ! భార్యలు రాచి రంపాన పెట్టినట్లు ఒకరికొకరు చెప్పుకుని ఏడ్చు కుంటున్నట్లున్నారు మీరిద్దరూ ఇప్పుడు " అని విజయ మేలమాడింది. అందరూ పక్కున నవ్వాము .

నీలో ఉన్న అభద్రతా భావం తగ్గించడం నిన్ను హృదయానికి హత్తుకోవడం నా విధి అంటూ ...సాహిల్ ని మళ్ళీ దగ్గరకి తీసుకున్నాను. వాడి వెన్నుని నిమురుతూ ఉంటే వాడి తలపై ఉన్న టోపీని తీసి నాకు పెడుతూ కనీళ్ళు కార్చాడు . ఆ కన్నీళ్ళని చూసి నాకు దుఃఖం ముంచుకొచ్చింది వాడి భుజంపై తలవాల్చి ఇన్నాళ్ళనుభవించిన చెలిమి లేమిని, దుఖభారాన్ని దించుకున్నాను.ఈసారి మాథ్యూస్ కూడా మాలో ఇమిడి పోయాడు . . ఏం జరుగుతుందో అర్ధంకాకపోయినా మా ముగ్గురి దుఃఖాన్ని చూసి మా చుట్టూ చేరి వారి చిట్టి చేతులతో మాకు దడి కట్టారు . మేము వారిని చూసి చిప్పిన కళ్ళతో నవ్వుకుంటూ .. అక్కడే క్రింద కూర్చున్నాం రేష్మా"మత్ రోకో అంకుల్ జీ ! బాబా అభీ ఠీక్ హై" అంటూ నా చేయి పట్టుకుంటే ... ఆర్య " మామా .. మేరా ఘర్కో జల్దీ ఆవో, నేను బర్త్ డే కేక్ కట్ చేయాలి. ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు అంటూ మూడు బాషలు కలిసిన మాటల్లో సాహిల్ ని తొందర పెట్టాడు మా స్నేహానికి ప్రతీకగా !

13, సెప్టెంబర్ 2015, ఆదివారం

నలిగే దారి





కలల తీరం వెంబడి ప్రయాణం
అట్టే సాగడం లేదు.

తరిగే మైలురాళ్ళు దిశానిర్దేశకాలు కాలేక
కాళ్ళకి తగిలి పెక్కు గాయాలు చేసి
వికటహాసం తో విరగబడుతున్నాయి.

నలుగురూ నడిచే త్రోవ నలగలేదు ఎందుకో..!?
అది చీకటి మాటున అని తెలిసాక ..
నాలిక్కరుచుకుని నడక, నడత మారాక

వెలుగురేఖల వెంబడి ప్రయాణం
ఎంతకీ ముగియడంలేదు.

చుట్టూ .. ఉన్న చీకటిని తరిమివేయడానికి..
వికాసం పంచుకోవడానికి .
మంచిని పెంచటానికి.. చెడుని త్రుంచ డానికి .
ఇప్పుడు నేను నడిచే దారి.. "నలిగేదారి"

ఎన్నాళ్ళకి ...



ఈ మధ్య ఓ తెలుగు దిన పత్రికలో నా బ్లాగ్ గురించి పరిచయం 
ఇక్కడ  (లింక్ నొక్కండి )
అసలు ఊహించనిది . 






చినుకు కోసం






నెఱ్రులు వారిన పుడమి తల్లిని జూచి

ఓ..కారు మేఘం కరుణ జూపింది

చినుకు చినుకు రాలి సందడి చేసాయి.

ఇల గొంతు తడిపిన చినుకు అమృతమే అయింది.

ఎండిన కొమ్మ రెమ్మలకి ప్రాణ శక్తి పుంజుకుంది

నాగలి భూమిని చీల్చింది..

పల్లె పాదాలు పొలం బాట పట్టాయి

విత్తనాల గంప చంకకెక్కింది

ఆశలని నారుగా చల్లబడ్డాయి.

నాటి నుండి ఆశగా ఆకాశం వైపు

నేలవైపు తడుముకుంటుంది చూపు

ఇది ఎండా కాలం కాదు

ఇది వానా కాలం కాదు

ఇది చలి కాలం కాదు.

మదిని ఒణికించే ఆశల కాలం

ఇది చినుకు కై నిరీక్షించే కాలం.

ఆశ ఆనే తల్లి వేరు పోసుకుని

బీడు భూముల మధ్య

మొండిగా ఎండిన చెట్టు లా

నిలబడి ఉన్న రైతన్నకనులు

మరల వచ్చే చినుకు కోసం

కాయలు కాచే కాలం

(ఇటీవల ఓ..పల్లె ముఖ చిత్రం ఇలా కనిపించింది)

4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

మహీన్


"మహీన్  మహీన్ ....   ఎక్కడున్నావ్ ? " ఓపిక లేకపోయినా అరుస్తుంది  షమ్మీ 

ఆమె మా ప్రక్కింటి డాబాలో పైభాగాన అద్దెకి ఉంటుంది . మేము కొత్తిల్లు కొనుక్కుని అక్కడికి వచ్చాకనే  పరిచయం.   మిషన్ కుడుతుంది కాబట్టి అందరూ ఆమెతో బాగానే మాట్లాడుతుంటారు . షమ్మీ కూతురు మహీన్ నేను టీచర్ గా పనిచేస్తున్న స్కూల్ లోనే   పిప్త్ క్లాస్ చదువుతుంది.  అనారోగ్యంతో ఉన్న షమ్మీ చిన్న పనికీ  పెద్ద పనికీ  కూతురిని  పిలుస్తూన్నట్లు ఉండే కేకలు నాకలవాటైపోయాయి. తలెత్తి వాళ్ళింటి వైపు చూసాను 

" ఇదిగో ఇక్కడే ఉన్నానమ్మా " వరండాలో నుండి గదిలోకి వస్తూ అంది మహీన్ .

"మీ నాన్న వస్తున్నానని ఫోన్ చేసాడు .. అన్నం వండు , నా ఆరోగ్యం అసలే బావుండలేదు" నీరసంగా అంది.

వెలుగుతున్న కళ్ళతో " నాన్న వస్తున్నాడా  ! ఇప్పుడే వండేస్తాను  ! అంటూ రెండవ గదిలోకి వెళ్ళింది మహీన్ . 
 సరైన పోషణ లేక చిక్కి పోయి  జుట్టంతా రేగిపోయి పిచ్చి దానిలాగా ఉంది.  షమ్మీ కాస్త ఓపిక తెచ్చుకుని జడవేయాల్సింది అనుకున్నాను .   

బియ్యం కడిగిపెట్టి వచ్చి తల్లి ప్రక్కలో కూర్చుని "అమ్మా   ! నాన్న వచ్చాక రేపు  నేను స్కూల్ కి వెళతాను కదా ! "

."............. "

మాట్లాడమ్మా! స్కూల్ కి వెళతాను కదా ! ఆఫ్ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. ఇన్నాళ్ళు స్కూల్ కి వెళ్లలేదని పిల్లలందరూ ఎక్కిరిస్తున్నారు  . ఏడుపు ముఖంతో అడిగింది.  

"నేనేం చేయను.  నాకీ రోగం వచ్చి ఉండకపోతే రోజుకి నాలుగు జాకెట్ లయినా కుట్టి నీకు పీజు కట్టేదాన్ని. . ఆరేళ్ళ నుండి  మీ నాన్న  సంపాదిచ్చి ఇస్తేనే  ఫీజు కట్టానా ? 

ఏమో ! అవన్నీ నాకు తెలియదు .. నువ్వు ఫీజ్ కడితే నేను స్కూల్ కి వెళతాను  పెంకిగా అంది.

మీ ప్రిన్సిపాల్ కి కాస్తైనా జాలి, దయ లేదు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే బాగుంటదని ఆ స్కూల్లో జాయిన్ చేశా ! మీ మేనత్త కొడుకు ఆ స్కూల్ పెట్టినాయనకి స్నేహితుడిగా! ఫీజ్ కట్టలేం,  పెద్ద మనసు చేసుకుని ఈయేటికి ఎట్టాగొట్టా రానీయండి . వచ్చే ఏడూ గవర్నమెంట్ స్కూల్ కి పంపుకుంటా .. అని అడిగాను బాధగా చెపుతుంది. 

నేను షమ్మీని పలకరించి ...  మహీన్ కి పీజ్ కట్టలేదని  స్కూల్ మానిపించారా ? ఆశ్చర్యంగా ఉందే?. అన్నాను . 

"అవునండీ ! వారం రోజులుగా అందుకే  స్కూల్ కి రావడం లేదు."   

"ఆరోగ్యం బాగోలేదని తోడుగా ఉంటుందని అనుకున్నాను "

నా మాట ని పట్టించుకోకుండా  తన ధోరణిలో  తను  "ఆ  స్కూల్ పెట్టినాయన  మా మేనల్లుడికి స్నేహితుడు కూడానూ .. అతన్ని  ఫీజులు తగ్గించమని  అడగడం  కూడా నామోషీ అయినట్లు ఉంది .  ఎలాగోలా ఈ ఏటికి ఫీజులు కట్టేయి వచ్చే ఏడు  నేను సాయం చేస్తా అని మొండి చేయి, బీద నోరు  చూపిచ్చాడు.  మేనమామ ఏ పాటి సంపాదిచ్చి ఇస్తాన్నాడో ఎరగడా? నెలకి ఏబై యేలు సంపాదించుకుంటున్నాడు . పది వేలు అప్పు అడిగినా  ఎప్పుడూ  లేవనే అంటాడు. దయలేని చుట్టాలు ఉండా ఒకటే లేకున్నా ఒకటే ! మంచిగా ఉన్నరోజుల్లో వచ్చి ముప్పూటలా తినిపోతారు" ... అని తిట్టడం మొదలెట్టింది. 

నాకేం మాట్లాడాలో కూడా తోచక అక్కడినుండి లోపలకి వెళ్లాను . లోపలి నుండి  ఓ కన్ను మహీన్ వైపే వేసి చూడసాగాను . 

ఇక ఆ ఆక్రోశం, తిట్లు ఆగవని పదేళ్ళ మహీన్ కి తెలుసు  కాబోలు  నెమ్మదిగా అక్కడి నుండి లేచి అరమారలో ఉన్న పుస్తకాల సంచీని తీసుకుని నేలపై కూర్చుని సంచీలో పుస్తకాలని తీసి ఇష్టంగా హృదయానికి హత్తుకుంది. ఆ పిల్ల  కళ్ళలో నీళ్ళు ఊరాయి. మళ్ళీ పుస్తకాలని సంచీలో సర్ది ఎక్కడుందో అక్కడ పెట్టేసింది . కుక్కర్ మూడు విజిల్స్ వేసేదాకా ఆగి  పొయ్యిని ఆపేసి వచ్చి తల్లి వైపు చూసింది. ఆమె గోడవైపుకి  తిరిగి పడుకుని ఉంది .  మెల్లగా బయటకి వచ్చి మెట్లు దిగి వీధిలో పిల్లలతో కలసి ఆడుకోవడానికి క్రిందికి దిగింది. ఓ గంట ఆడుకుని ఇంట్లోకి వచ్చింది. తల్లి టీవి చూస్తూ ఉంది . స్నానం చేసి వచ్చి చాప పరుచుకుని పడుకుంది . "కాసేపు చదువుకోరాదు ఎప్పుడూ  ఆటలేనా ? " అంటూ మహీన్ ని మందలించి చానల్ మార్చింది . 

"మీ  పెద్దాళ్ళు ఎప్పుడూ ఇంతే అలా చేయి,ఇలా చేయి అని ఆర్డర్ లు వేస్తారు .. మీరు చేసేపని మాత్రం సరిగా చేయరు, నువ్వు టీవి చూస్తుంటే నేనెలా చదువుకోను " అంటూ  విసురుగా లేచి వెళ్ళి టీవి రిమోట్ తీసుకోబోయింది .  

"ఈ రెండు నాటికలు అయిపోనీ,కట్టేస్తా ! నువ్వు కూడా చూడు  బాగుంటాయి " అంది షమ్మీ 
 పూలు మాల కట్టుకుంటూ  "ఇలా కదూ పిల్లలని చెడగోట్టేది"  అనుకుంటూ  మహీన్ ని పిలిచాను . 

అంతలోనే  మహీన్ తండ్రి వచ్చాడు .  ఒక చేతిలో సూట్ కేస్, రెండవ చేతిలో  పొట్టేలు మాంసం సంచీ .తల్లి మంచం పై నుండి లేచి నవ్వు పులుముకుని తండ్రి చేతిలో సూట్కేస్ ని , మాంసం సంచీ అందుకుంది.

ఆ సంచీ చూడగానే మహీన్ కి గుండె  గతుక్కుమంది   చిన్నగా  పిట్ట గోడ దాటి మా వైపుకి వచ్చింది "ఇప్పుడు నేను అల్లం, వెల్లులిపాయలు కోసం కొట్టుకి వెళ్ళాల్సి వస్తుంది, కొట్టతను బాకీ డబ్బులు ఎప్పుడిస్తారు ? అని అడుగుతాడు ఆంటీ ! నేను ఇప్పుడు కొట్టుకి వెళ్ళనంతే! కావాలంటే అమ్మ వెళ్ళే సరుకులు తెచ్చుకుంటుంది "   భీష్మించుకుని  అలాగే కూర్చుని  నాకు పూలు అందిస్తూ కూర్చుంది.

పంపు దగ్గర  కాళ్ళు కడుక్కుని  లోపలికి వస్తూ  నా దగ్గర కూర్చున్న కూతురుని చూసి   "ఏం మహీన్ .. ఎట్లా ఉన్నావ్ ? బాగా చదువుకుంటున్నావా? 

తండ్రి పరామర్శకి కోపం ముంచుకొచ్చింది. "స్కూల్ కి వెళ్ళకుండా ఎట్లా చదువుకుంటారు కొత్త పాఠాలు అర్ధమయ్యేటట్లు ఎవరు చెపుతారు "  అడిగేసింది. 

చూడు  రాధమ్మా ! ఈ పిల్ల మొండితనం ?  "ఫీజులు కట్టలేదని క్లాస్ కి వెళ్ళనివ్వని వాళ్ళకి ఫీజులెందుకు కట్టాలి  వచ్చే ఏడూ ఇంకో స్కూల్లో జాయిన్ చేయిస్తానంటున్నా  ! స్కూల్ గీలు జాన్తానై, ఇంట్లోనే చదువుకో అంటే వినదు, ఒకటే నస"  అంటూ లోపలికి వెళ్ళిపోయాడు . 

మహీన్ కి ఇప్పుడు కూడా నాన్న డబ్బులు తేలేదని అర్ధమై పోయింది. అనుకున్నట్టుగానే షమ్మీ  సరుకులు లిస్టు సంచీ తెచ్చి "శీనంకుల్ కొట్టుకెళ్ళి ఈ సరుకులు పట్టుకు రా! "

"నేనేళ్ళను, నాన్నని వెళ్ళమను"

"నాన్నకి పనులు చెప్పకూడదు, ఇప్పుడుదాకా తిరిగి తిరిగి ఇప్పుడేగా ఇంటికొచ్చాడు " 
"
అయితే నువ్వే వెళ్ళు" మొండికేసింది. వెళ్ళమని చెపుతుంటే నీక్కాదు .. గట్టిగా రెండు దెబ్బలేసింది 

ఏడుస్తూనే సంచీ పట్టుకుని బయలుదేరింది. నేను వస్తున్నాను ఉండు మహీన్ .. నాకు కొన్ని సరుకులు తెచ్చుకోవాలి  అంటూ సంచీ ,డబ్బు తీసుకుని బయలుదేరాను . నాక్కావాల్సిన వస్తువులు తీసుకున్నాక షమ్మీ దగ్గర సరుకుల లిస్టు తీసుకుని "డబ్బులేయీ" అడిగాడతను 

"త్వరలోనే ఇస్తానని అమ్మ చెప్పమందంకుల్ " .

"బియ్యం కొనడానికి డబ్బుల్లేకపోయినా మాంసం కూరలు మాత్రం కావాలి. మీకు అప్పులిచ్చి ఇచ్చి మేము అప్పులు పాలై పోతున్నాం. ఈ నెలలో బాకీ అంతా కట్టకపోతే ఊరుకోనని చెప్పానని మీ అమ్మకి చెప్పు" అంటూనే కావాల్సిన వస్తువులు తీసి ఇచ్చాడు.    

ఇంటికొచ్చిసంచీ తల్లికిచ్చి ముసుగేసుకుని పడుకుంది.గంట  తర్వాత  తల్లి "అన్నం తిందువుగాని రా" అని పిలిచినా లేవకుండా దొంగ నిద్ర నటించింది. అది తెలుస్తూనే ఉంది నాకు 
 గిన్నెలో  మాంసం కూర తీసుకొచ్చి  నాకిస్తూ .. "చూడండి ..ఇప్పుడు దాకా మేలుకువతోనే ఉంది కదా . ఇప్పుడే నిద్రపోయిందా! అన్నీ వేషాలేస్తుంది. ఈ పిల్లకి బడి పిచ్చి పట్టింది " అంటూ వెళ్ళింది.    

తెల్లారి లేచి కొన్ని ఇంటి పనులు చేసి గబా గబా తయారై  స్కూల్ బేగ్ తగిలించుకుని  "అమ్మా ! స్కూల్ కి వెళుతున్నా! నాన్నని  వచ్చి ఫీజు కట్టమను"  అంది . 

"పీజ్ కట్టకుండా ఎట్టా రానిస్తారు. నాన్నకి డబ్బు అందలేదంట" మహీన్ ముఖంలోకి చూస్తూ అంది.   
బేగ్ తీసి మూలకి విసిరి పడేసింది "నేను గవర్నమెంట్ స్కూల్ కి వెళతానంటే వద్దంటారు. ఇక్కడ ఫీజులు కట్టడానికి డబ్బులేవంటారు?"  మరి నేనెట్లా చదువుకోవాలి? " కోపంగా అరిచింది.

ఆ సంవత్సరం  స్కూల్ మొదలైనప్పుడూ జరిగిన సంగతి కళ్ళలో మెదిలింది నాకు. ఇంటి ప్రక్కన గొడ్లచావిడిలో కాపరముండే రాములమ్మ కూతురు ప్రసన్న తో కలసి హైస్కూల్ కి వెళతానని గోల చేసింది. వాళ్ళు ఉత్తరాది నుండి కూలి పనుల కోసం వచ్చి బతుకుతున్నారు. ఆ పిల్ల కూడా పొద్దునేలేచి  రెండిళ్ళలో పనిచేసి తొమ్మిదింటికల్లా స్కూల్ కి వెళుతుంది.

"వాళ్ళతో కలిసి నువ్వు బడికి వెళ్ళడం ఏమిటి ? పిల్లని ఆ మాత్రం చదివించలేకపోయావా అని మా వాళ్ళందరూ తప్పు పడతారు. పీజు కట్టలేకపోతే బడైనా మానేయి కాని గవర్నమెంట్ బడికి వద్దు."  అని మహీన్  తండ్రి హుకుం జారీ చేసాడు.

అప్పుడప్పుడూ  షమ్మీ మాటల్లో  ఆమె  అతనికి  రెండవ భార్య అని తెలుస్తుంది . ఆయన మొదటి భార్య సంతానం ఇద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారని కూడా  చెప్పింది.  పేరుకి భర్తన్నమాటే  కానీ  మహీన్ తండ్రి సంసారం గురించి ఏమి పట్టించుకోడు. ఏమిటో  ఈ బాధ్యతలేనితనాలు. వీళ్ళ కడుపున పుట్టిన పాపానికి పిల్లలు బలి అవుతారు  అని అనుకునేదాన్న.

వేసవి కాలం సెలవల తర్వాత నా వద్దనే  ఐదువేలు అప్పు పుచ్చుకుని  ఫీజులు కట్టడానికి వచ్చింది షమ్మీ .  నిరుడు కట్టాల్సిన పీజు కొంత, పుస్తకాలకి కొంత జమ వేసుకుని  కొత్త తరగతిలో వేసారు . దసరా సెలవలు కూడా ఇచ్చేసారు.  మళ్ళీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా  కట్టకపోతే  స్కూల్ వాళ్ళు మాత్రం ఎలా క్లాస్ కి రానిస్తారు ? 

"ఎలాగోలా  సర్దుబాటు చేసుకుని పిల్లకి పీజ్ కట్టలేకపోయారా? మహీన్ చాలా బాధపడుతుంది ." అన్నాను నేను 

"అసలీ రెండో పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సింది రాధక్కా !   మొదటి భర్త ఎంత బాగా చూసుకునేవాడు. యాక్సిడెంట్లో చనిపోయి  ఒంటరిదాన్ని చేసాడు. భర్త పొతే మనం పోతామా ? బోలెడు  జీవితం ఉంది .పెళ్ళి చేసుకొమ్మా !  నేను పొతే నీకు అండ  ఎవరు ఉంటారని మా అమ్మ  ఒకటే పోరింది.  ఇతనికి భార్య ఇద్దరాడపిల్లలని  తనతో  కూడా తీసుకుని పుట్టింటికి పోయిందట. ఇక రానట్టే ! చెప్పుల షాప్ ఉంది. బాగా ఆదాయం వస్తుంది అని చెప్పాడు కదా అని పెళ్ళికి ఒప్పుకున్నాను.  పెళ్ళైన ఏడాదికే మహీన్ పుట్టింది. అప్పటికే చెప్పల షాప్ లేదు. ఉన్న పిత్రార్జితాన్ని అన్నదమ్ములందరూ కలిసి  అమ్మి వాటాల్లో వచ్చిందంతా  మొదటి భార్య పిల్లలకే  ఇచ్చేసారు. నాకు  తెలియనీయకుండా.  నిలువ నీడలేదు, ఉద్యోగమూ లేదు. ఇంట్లో కూర్చుంటే బిడ్డతో పాటు భర్తని కూడా నేనే పోషించాల్సి వస్తుంది.  రోజంతా మిషన్ కుట్టినా  అతుకు బోతుకూ వేసుకోవడమే ! ఎన్ని ఖర్చులకని సరిపోతాయి?   పైగా బంధువలిళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి అన్నింటికీ హాజరవ్వాలి.అక్కడ బడాయితనం చూపిస్తూ కానుకలివ్వాలి. అన్నదమ్ముల సరుకు వేసిరావడం, డబ్బు వసూలు చేసుకురావడం లాంటి పనులు చేస్తూ నెలకి ఇరవయ్యి రోజుల పాటు తిరుగుతూనే ఉంటాడు. అలా తిరిగి పనులు చేస్తూనే ఉన్నావ్ కదా ! పిల్లకి పీజు కట్టుకోవాలని డబ్బులడిగి పట్టుకురా అని పోరుతూనే ఉంటాను  . అయినా ఖాళీ చేతులతో ఊపుకుంటూ వచ్చాడు.   అంటూ ... తన గతాన్ని వర్తమానాన్ని కలబోస్తూ  కష్టం నిష్టూరం  అంతా  చెప్పుకొచ్చింది కన్నీళ్ళతో.

ఆమెనెలాఓదార్చాలో తెలియలేదు నాకు మౌనంగా వింటూ కూర్చున్నాను. 

మొగుడి మీద కక్ష ముంచుకొచ్చింది షమ్మీకి  మహీన్ దగ్గరికి వచ్చి ప్రేమగా దగ్గరికి  తీసుకోబోయింది . మహీన్ దూరంగా జరిగింది.        

అయిదవ తరగతి చదువుతున్న మహీన్ కి   కొన్ని తెలుస్తున్నాయి. ఇదిగో ఎలా వ్రాసుకుందో చూడు .. అంటూ  తన నోట్ బుక్ లో వ్రాసుకున్న  విషయాన్ని షమ్మీకి చూపించాను .  

"నాన్నకి  వారానికి రెండుసార్లు ముక్క కావాలి , అమ్మ  వాయిదాల పద్దతిలో ఖరీదైన చీరలు కొనుక్కోవాలి ఇవన్నీ మానేస్తే నాకు ఫీజు కట్టడానికి డబ్బులు రావా ? అని ఒక రోజు  

"స్కూల్  మానేసి  పొద్దస్తమానం ఇంట్లో ఉండటం ఏమి నచ్చలేదు,ఎలాగైనా సరే తను చదువుకోవాలి " అని ఇంకో రోజూ
"బాగా చదివి ఉద్యగం చేయడానికి ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలి. గవర్నమెంట్ స్కూల్ కి మాత్రం వద్దంటారు. అందరూ చదువుకోవాలనే కదా  ఆ స్కూల్స్ పెట్టింది. ఒకసారి  ప్రసన్నతో వెళ్లి స్కూల్ చూసాను . ఎంత బావుందో ఆ స్కూల్. గేమ్స్ పిరియడ్ ఉందట,  ఆ స్కూల్లో లైబ్రరీ ఎంత బావుంది. మరి ఎందుకు అక్కడ చదవడానికి ఒప్పుకోరో అర్ధం కాదు" అంటూ ఇంకో రొజూ తేదీలు వేసీ  మరీ డైరీ లాగా వ్రాసి పెట్టుకుంది .   

నేను షమ్మీ ఆ వ్రాతలు చూస్తూ ఉండగానే ..   బేగ్ తీసుకుని బయటకొచ్చేసింది. తల్లి వెనుక నుండి పిలుస్తూనే ఉన్నా వినకుండా .. పరిగెత్తుకుంటూ వెళ్లి  స్కూల్ బస్ ఎక్కేసింది. 

"ఏం చేయను  రాధమ్మా ! ఇలా చేస్తే నేనేం చేయగలను " అంటూ అక్కడికక్కడే చతికిలబడి కన్నీళ్లు పెట్టుకుంది. జాలి అనిపించింది 

ఎలాగోలా నేను సర్దుబాటు చేస్తాను  త్వరలో నాకు ఇచ్చేద్దువుగాని, కాసేపాగిన తర్వాత మనమిద్దరం వెళ్లి ఫీజ్ కట్టేద్దాం ..అని చెప్పాను  షమ్మీతో.  

"వద్దు రాధమ్మా ! నేను మీ బాకీ తీర్చలేను,  ఈ రోగంతో నేను బ్రతికీ ఉంటానో లేదో తెలియదు ఎలా జరగాలంటే అలాగే జరుగుద్ది కానీయండి "  అంది 

నేను  స్కూల్ గేట్ లోకి అడుగుపెట్టే టప్పటికే  ఫ్రెండ్స్ ..  మహీన్ ని అడుగుతున్నారు ఇన్నాళ్ళు స్కూల్ కి ఎందుకు రాలేదని, తెలిసిన కొందరూ ఫీజ్ కట్టేసారా? అనినూ . 

అసెంబ్లీ అయ్యాక   క్లాస్ కి వెళ్ళకుండా ఆఫీసు రూమ్ కి వెళ్ళింది.  నేను   మహీన్  వెనుకనే  వెళ్లాను . కరస్పాండెంట్  ముందు కెళ్ళి "సర్" పిలిచింది . 

"మహీన్  ఈ రోజు పీజ్ కట్టేస్తున్నారా ?" అడిగాడు .

"లేదు సార్, మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు , మిషన్ కుట్టలేకపోతుంది, మా నాన్న డబ్బులు తేడు, అయినా సరే నేను ఈ ఇయర్ చదువుకోవాలి సర్. తర్వాతా చదువుకోవాలి,  ఫీజ్ కట్టలేనికారణంగా నా చదువు ఆగకూడదు,  ఎవరు ఆపకూడదు   ఈ ఇయర్ అయ్యే లోపు ఫీజ్ డబ్బులు మొత్తం నేనే కట్టేస్తాను. వచ్చే సంవత్సరం గవర్నమెంట్ స్కూల్ కి వెళతాను . ఫీజ్ కడితేనే నాకు టిసి ఇవ్వండి, కట్టకపోతే ఇవ్వొద్దు . మీరు నన్నిప్పుడు  క్లాస్ కి వెళ్ళనిస్తారా? "సూటిగా అడిగేసింది. ఆ పిల్ల దైర్యానికి, చదువుకోవాలనే ఆకాంక్షకి ముచ్చటేసింది. 

"మీ అమ్మ నాన్న ఫీజ్ కట్టలేకపోతే నువ్వెలా కట్టగలవు? " 

"కడతాను సార్! "దృడంగా చెప్పింది. 

"సరే, క్లాస్ కి వెళ్ళు" అన్నాడాయన . నేను నవ్వుకుంటూ  కరస్పాండెంట్ తో మాట్లాడి మహీన్  కుటుంబ పరిస్థితి చెప్పాను. ఆయన సానుభూతితో సమస్యని అర్ధం చేసుకున్నట్లు అనిపించింది. నేను కొంత డబ్బు కట్టి మరికొంత  తర్వాత కడతారని రిక్వెస్ట్ చేసి ఒప్పించి ఎలాగైతేనేం  మహీన్ చదువు  ఆ సంవత్సరానికి  బ్రేక్  పడకుండా  చేయగల్గాను.

సాయంత్రం స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళడానికి  స్కూల్ బస్ ఎక్కలేదు మహీన్. నేను బస్ స్టాప్ లో నిలబడి ఉంటే నా ఎదురుగా  నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఉంది 
.
ఆ పరిస్థితిలో గనుక మహీన్ చూస్తే  అవమానంతో క్రుంగిపోయే షమ్మీ ముఖం,  పరువు తీస్తున్నావ్  కదే  అంటూ మహీన్ ని కొడుతున్న  తండ్రి ఆవేశం  నా  కళ్ళ ముందు కదిలాయి.  ఈ లోకంలో లేనట్టు అరుస్తుంది మహీ "మూరేడు ! మూరేడు !" మరువం కలిపిన మల్లె మొగ్గల చెండు ఆమె చేతిలో గర్వంగా నవ్వుతూ వేలాడుతుంది .   

(ఆగస్ట్ 2015 "మాతృక"  మాస పత్రిక లో  వచ్చిన నా కథ )

3, సెప్టెంబర్ 2015, గురువారం

జుమ్మా కథల గురించి నా స్పందన




 మీరు బహుమతిగా  ఇవ్వడానికి  "జుమ్మా" ని  ఎంపిక చేసుకున్నందుకు  ధన్యవాదములు . "జుమ్మా " నే  ఇవ్వాలని మీకెందుకనిపించిందని  వేంపల్లె షరీఫ్ గారు అడిగినప్పుడు  చిన్నగా నవ్వేసి ఊరుకున్నాను కానీ నేను సమాధానం చెప్పలేదు ..  ఎందుకంటే .. ఇదిగో ఇందుకు  ...

జుమ్మాకి లభించిన పురస్కారాన్ని గౌహతిలో అందుకున్న రోజు వేదికపై ఈ రచయిత చదివిన ప్రసంగం  "సారంగ" లో వచ్చినప్పుడు చదివి కళ్ళు చెమర్చాయి . అంతకి ముందు అప్పుడప్పుడూ వివిధ పత్రికలలో వచ్చినప్పుడు ఈ సంపుటిలో ఉన్న కొన్నికథలని నేను చదివే ఉన్నాను కానీ  జుమ్మా  సంకలనంలో  వచ్చిన అన్ని కథలని నేను తొలిసారి చదివినప్పుడు .. ఎంతో ఉద్వేగానికి గురై   ఈ అబ్బయ్య ఎంత బాగా వ్రాసాడనుకున్నాను అమ్మ మనసుతో .  షరీఫ్ వాళ్ళమ్మ అయితే "మా అమ్మ ముండ నాక్కూడా చదువు చెప్పించి ఉంటె   .నా బిడ్డ రాసిన కథ నేను కూడా చదువుకుని   మురిసి పోయాదాన్ని కదా ! అని విచారపడిందట."  ఆ అమ్మ చదవకపోతే ఏం !? ఎంతో మంది అమ్మలు ఈ కథలని చదివి మనఃస్పూర్తిగా మెచ్చుకుని చల్లగా ఉండు బిడ్డా అని దీవించి ఉంటారు . ఇంకా ఇంకా మన జీవితాల్లో ఉన్న కథలకి అక్షర రూపం  కల్పించాలనే కోరికని వెలిబుచ్చి ఉంటారు కూడా  అననుకున్నాను . ఎవరిని ప్రత్యక్షంగా విమర్శించకుండా సుతిమెత్తగా తానూ చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు  .

నాకు బాగా నచ్చిన కథ  "ఆకుపచ్చ ముగ్గు " చేతుల్లోనే కాదు మన హృదయాలలోనూ వేసుకోవాల్సిన ముగ్గు అనిపించింది నాకు. అక్కతమ్ముడి  మధ్య ఆత్మీయ అనురాగాలకె కాదు హిందూ  ముస్లిమ్స్ మతాల మధ్య  ఉన్న సూక్మాతిసూక్ష్మమైన తేడాని మన మధ్యన ఉంచి  రచయిత దృక్పదాన్ని మనకి పట్టిస్తుంది .
ఆకుపచ్చ ముగ్గు లో అక్క జీనత్  కి ముగ్గులు వేయడమంటే చాలా ఇష్టం .  ముస్లిమ్స్ అయినందువల్ల  ఇంటి ముందు ముగ్గు వేయడం ఉండదు. చుట్టుప్రక్కల  హిందువుల ఇళ్ళముందు   ముగ్గులేసుకుంటుంటే ఆమె నోట్స్ పుస్తకాలలోనూ,  ఇంటి వెనుక ఇసుకతో ముగ్గులేసుకుంటూ , అరుగులమీద నీటిలో ముంచిన వేలితో ముగ్గులేసుకుంటూ ఉంటుంది . అలా చేతిలో గోరింటాకు పెట్టడం ద్వారా తనలోబలీయంగా అంతర్లీనంగా   ముగ్గులువేయాలన్న కోరికని తీర్చుకుంటున్నానని చెపుతుంది.   ముగ్గు ఇంటి ముందు వేస్తే తప్పు కానీ చేతిలో వేస్తె కాదుకదా ! ఒక మతానికి మరో మతానికి మధ్య తేడా ఇంతేనా ? ఇంత మాత్రం దానికేనా ఇన్ని మత  గొడవులు జరుగుతుంటాయి ? అన్న కథకుడి ఆలోచన  మన దృఖ్పదాలని సునిశితం చేస్తాయి . పెళ్ళికి ముందు చెట్టు నుండి కోసుకొచ్చిన బత్తాయి పండులా ఉండే అక్క , పెళ్లై నాక అప్పుడప్పుడూ తమ్ముడి చదువు కోసం డబ్బు సాయం చేసిన అక్క  ఒక మాదిరి షావుకారు భార్య అయి ఉండి కూడా వరుసగా ముగ్గురు ఆడపిల్లల్ని కనడం మూలంగా  వాళ్ళ భవిష్యత్ గురించి భయపడుతూ, దిగులుపడుతూ ఉంటుంది.  ..తన బిడ్డలకి నీవే దిక్కు అని కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం చూస్తే ముస్లిం కుటుంబాలలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎంత భారంగా   అనిపిస్తాయో చెప్పకనే చెపుతాయి .

దస్తగిరి చెట్టు కథలో సెలవల్లో(నానీమా)  అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాలనే కోరికను తల్లి పట్టించుకోవడంలేదని దిగులుపడి పోతాడు నూర్జహాన్ కొడుకు.  వాళ్ళమ్మ తో ఇలా అంటాడు "నన్ను అమ్మమ్మ వాళ్ళ ఊరికి పంపమంటే పంపకబోతివి రేపు జూడు పొలం కాడికి పోయి పురుగులమందు తాగి చావక పొతే తూ  నా కొడుక " అను  అంటాడు. అప్పుడు ఆ అమ్మ కదిలి కదిలి ఏడ్చిన వైనం చదువరులకి హృదయం ద్రవింపజేస్తుంది. గ్రామీణప్రాంత  ముస్లిం కుటుంబాల ఆర్ధిక స్థితి గతులు ఎంత దయనీయంగా ఉంటాయో చెపుతుందీ కథ .   పుట్టింటివారు పేదవారైతే మెట్టినింటి వారు చూసే చిన్న చూపుతో పాటు చాటు మాటుగా పుట్టింటికి సొమ్ము జేరవేస్తుందేమో అన్న అనుమానంతో సూటీ  పోటీ మాటలు  అత్తచాటు కోడళ్ళందరికి  ఏదో ఒక సమయంలో అనుభవమే . అలాగే గ్రామీణ ప్రాంతపు వ్యవసాయదారుల కుటుంబంలో  పిల్లలతో పాటు  అందరూ శ్రామికులే ! ప్రొద్దునే లేచి తండ్రి పొలానికి  వెళితే తర్వాత కేరేజీ పట్టుకుపోయే డ్యూటీ పిల్లలది . కేరేజీని కూడా మోయలేని లేత చేతులు  ఎండలో పడి  మైళ్ళ దూరం నడుస్తూ కేరేజీని ఆ చేతిలో నుండి  ఈ చేతిలోకి మార్చుకుంటూ చేనుకి వెళతాడు .  ఈ కథ చదువుతున్నప్పుడు దృశ్యం కళ్ళ ముందు ఉన్నట్టే ఉంది  పసివాళ్ళ బాధని అక్షరాల్లో పొదిగిన తీరుకి కనులు పదే పదే చెమర్చాయి. . కథ ఆఖరిలో   ఆ పిల్లవాడు దువా చేస్తాడు ఇలా .. "యాల్లా ! మా అమ్మమ్మ వాళ్ళు బీదవాల్లనే గదా అమ్మీ అక్కడకి పంపనంటాది . మా నానీమా  వాళ్లకి ,మాకు కూడా దండిగా డబ్బులివ్వు అప్పడు మా నానీమా ఊరుకి వెళ్ళొచ్చు " అని కోరుకుంటూ దస్తగిరి చెట్టుకి మొక్కుని కట్టుకుంటాడు. (దస్తగిరి చెట్టు అనగానే నాకు పీర్లు పండుగ గుర్తుకొచ్చింది   పీర్లు పండుగప్పుడు పీర్లుని ఊరేగించి ఒక చెట్టుదగ్గర భధ్ర పరుస్తారు. ఆ చెట్టుని జెండా చెట్టు అని కూడా అంటారు .  ఆ పండుగలో  హిందువులు కూడా పాల్గొంటారు . కొంత మంది  కోరికలు కోరుకుని నిప్పులమీద నడుస్తారు. అలాగే ముడుపులు కడతారు . కోరిన కోరికలు తీరతాయని  విశ్వాసం కూడా  హిందూ ముస్లిం ఐక్యత కి ఈ పండుగ ఒక ఉదాహరణ )

జీపొచ్చింది, రజాక్ మియా సేద్యం  ఈ రెండు కథలు రైతు జీవన చిత్రాన్ని వ్యదార్ధ యదార్ధ గాధలని పరిచయం చేసింది .  ముస్లిం రైతైనా, రెడ్డి రైతైనా వ్యవసాయంలో మిగిలేది దుఃఖమే నన్న సంగతి  కథకుడు చెప్పిన తీరు చాలా నచ్చింది . వ్యవసాయం అంటేనే రైతన్న కష్టాలు నష్టాలు . రజాక్ మియా తండ్రి టైలర్ గా పని చేస్తూ ఉంటాడు , మలకోల రెడ్డి సహృదయుడు.  పిల్లలు కలవాడివి మిషన్ కుట్టి ఏమి సంపాయిస్తావ్ .. ఈ నాలుగెకరాలు దున్నుకుని బ్రతుకు పో  అంటూ  రజాక్ మియా తండ్రి పేరున  రాసి ఇస్తాడు . తండ్రికాలంలో వ్యవసాయం గిట్టబాటు గానే ఉంటుంది . ఆ నాలుగేకరాలకి ఇంకో ఎకరం చేసి చనిపోతాడు .  రజాక్ మియా తరంలో అనావృష్టి కి గురై పంటలు పండక  నూకల మూట కోసం రెడ్డి చుట్టూ రోజుల తరబడి తిరిగే తీరు, అతని పొలాన్ని కాజేసేందుకు ఆ రెడ్డి కొడుకు పన్నిన పన్నాగం చదివితే ఆకశంలో గ్రద్ద భూమి పై కోడి పిల్ల పై కన్నేసి అక్కడే చక్కర్లు కొడుతున్నట్టు అనిపించింది. ఇక   జీపొచ్చింది కథలో వెంకటరెడ్డి  బోరు కోసం పడినపాట్లు చేసిన అప్పులు ఏంటో మంది రైతుల జీవన చిత్రాన్ని కాళ్ళ ముందు ఉంచాయి .  కరంట్ బిల్లులు కట్టలేక పంటలు వేయకుండా ఉండలేక  ఎండే పంటని కాపాడుకోవడానికి  స్టార్టర్ కోసం పడిన ఆరాటం చదువుతుంటే గుండె బరువెక్కుతుంది. రెండు కథల లోనూ  ముగింపు  మరణంతో  గుండెల్ని పిండేస్తుంది. వ్యవసాయం వద్దురా బాబు అనిపిస్తుంది.

ఇక అయ్యవారి చదువు కథ. నేనెప్పుడు ఈ కథ చదివినా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. కుటుంబం గడ్డు పరిస్థితుల్లో ఉన్నాసరే ఆ పిల్లవాడు  అరకొర సౌకర్యాల మధ్య పట్టుదలతో ఒక విధమైన కసి తో చదివి కుటుంబానికి ఓ వెలుగవువుతారు.   . కథలో పిల్లాడి తండ్రి వ్యవసాయం కోసం  అప్పులు చేస్తాడు .  ఆ అప్పులోళ్ళ బారి నుండి తప్పించుకోవాడానికి పోద్దస్తమాను పొలంలోనే  గడుపుతాడు .  ఆ పిల్లాడు ఇంటి దగ్గర ఉండి చదువుకోవాలనుకుంటాడు కానీ ఆ చదువు సాగదు మధ్య మధ్యలో ఇంటి పనులుతో  ప్రోద్దుకూకిపోతుంది . తెల్లారే పరీక్ష . తల్లిని దీపం బుడ్డి పెట్టుకుని చదువుకుంటానని అడగాలనుకుంటాడు . అంతలో ఆ దీపం బుడ్డి  కిందపడి అందులో ఉన్న కిరోసిన్ అంతా  నేలపాలవుతుంది . తల్లి కోపంగా ఆ పిల్లాడిని కొడుతుంది. పిల్లాడు ఏడుస్తూ పడుకుంటాడు.  తండ్రి అప్పు తీసుకున్న వాళ్ళతో చెపుతున్న మాటలకి కళ్ళల్లో కట్టలు తెంచుకున్న దుఃఖం . అలాంటి దుఃఖం లో నుండే కసితో చదువుతాడు తర్వాత ఆ పిల్లాడే  స్కూల్ టీచర్ అవుతాడు .   ఈ కథలో ఒక చోట పిల్లాడి తల్లి ఇలా అంటుంది " ఆడోల్ల దగ్గర లెక్కలు  ఎట్టోచ్చాయిరా ..నేన్నీ  కోసం లంజరికం జేయాల. అబ్బడ్నోదిలి నా దగ్గర అడగడానికి సిగ్గన్నా ఉండాల " అంటుంది .   గ్రామీణ ప్రాంతాలలో  పేద కుటుంబాలలో  బయట పనిపాటా చేయకుండా ఇంట్లోనే ఉండే  ఆడవాళ్ళకి లేని ఆర్ధిక  స్వాతంత్ర్యాన్ని చెప్పిన విధం చివుక్కుమనిపిస్తుంది .

ఇక అంజనం కథలో .. ఎప్పుడో ఇల్లు వదిలిపోయిన కొడుకు  కోసం తల్లి పడే తపన అంజనం వేయించి వాళ్ళు చెప్పినట్లు తిరుగుతూ డబ్బుకి డబ్బు  పోసి శ్రమ తీసుకుని నిరాశతో అర్ధం పర్ధం లేని సెంటిమెంట్ తో దిగులుని దాచుకుని కొడుకు వస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది .  స్వామీజీలు బాబాలు ,గణాచారులు చెప్పే మాయ మాటలకి అమాయకంగా మోసపోవడం  వీళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడాన్నిమన కళ్ళ ముందుంచుతాడు రచయిత.    తల్లి  మనసుకి ఏ విధంగా స్వాంతన కల్గుందో  తెలుసుకుని అందుకు అనుగుణంగానే నడుచుకోవాలనుకుంటాడు .

శుక్రవారం పూట  నమాజుకి వెళ్ళాలి .  నిష్వార్ధంగా నమాజు చేయాలి . ప్రక్కన బాంబులు పడినా సరే  చలించకుండా అల్లా మీదే ద్యాస పెట్టాలి అని చెప్పే తల్లి  మసీద్ దగ్గర అపాయం పొంచి ఉందని తెలిస్తే  ఆ దరిదాపులలోకే  బిడ్డని పోవద్దని హెచ్చరిస్తుంది . దేవుడి పై విశ్వాసం కన్నాకూడా   బిడ్డ చల్లగా క్షేమంగా ఉండటమే కావాలి ఆ తల్లికి . మత వైషమ్యాలతో మానవత్వాన్నేమరిచి  బాంబులు పేల్చి మారణకాండ  సృష్టిస్తే ప్రతి  శుక్రవారం ఏ  మసీద్ కి వెళ్ళాలన్న అదే దృశ్యాలు వెంటాడతాయి.  ఏ శుక్రవారం నెత్తు రోడకుండా చూడు తండ్రీ అని అందరమూ మనఃస్పూర్తిగా ప్రార్దిస్తాం . మనిషికి మనిషికి మధ్య మతం తో ముడిపడని ఆత్మీయ బంధమేదో ఉంది . తల్లి బిడ్డలా మధ్యే కాదు అందరిలో కూడా . జుమ్మా కథలోనూ  అదే ఉంది .

పర్దా కథ .  ముస్లిం కుటుంబాలలో పర్ధా ముఖ్యమైన ఆచారం . ఆడపిల్లలని ఎండ ముఖాన పడకుండా గదులలోనే మ్రగ్గ బెట్టి మళ్ళీ  పర్దా లలోనే మగ్గేవిధంగా ఉంచే ఆచారాల  వెనుకనున్న  అణచివేత గుండెల్ని మెలి పెడుతుంది
కడుపు నిండిన వాళ్ళకే సంప్రదాయం ఆచారం మొదలైనవి పాటించాలని కంకణం కట్టుకుంటారు . జేజీ ఆ కడుపు నిండనప్పుడు పర్దా నఖాబ్ ల ఊసే లేకుండా బిడ్డలని పెంచి పెద్దజేసుకోవడానికి మగాడిలా కష్టపడింది . ఈ కథలో జేజీ నిలువెత్తు ఆత్మవిశ్వాసం. కథ చదువుతుంటే మనచుట్టూ ఉన్న అనేక ముస్లిం జీవితాలు కనబడతాయి అక్కడ జేజికి  పర్దా మాటున మనుమరాలిని బందీ చేయడం అసలు నచ్చదు . అలాగే ఆమెకి  అలవాటు లేని పర్దా కట్టుకుని పట్టణ వాతావరణంలోనూ ఇమడలేక కొడుకుకి ఎదురు చెప్పలేక మళ్ళీ పల్లెకి తిరిగి వెళ్ళిపోతుంది. పర్ధాని సర్ది పట్టుకుని నీళ్ళు నిండిన కళ్ళతో వెళుతున్న జేజి వంక నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు పిల్లవాడు ,

రూపాయి కోడి పిల్ల కథ పిల్లల సున్నితమైన మనసుని ,జీవకారుణ్యాన్ని పెద్దల కఠిన మనస్తత్వాన్ని హృద్యంగా చూపించారు . .ఆ పసి మనసు కోడి పిల్ల కోసం పడే తపన తండ్రి కోడి పిల్ల చచ్చిపోతే తినడానికి పనికిరాదనే కోపంతో అంజాద్ని కొట్టి హజ్రత్ దగ్గరకి వెళ్ళమని తరమడం నెత్తురోడుతున్న కోడి కన్నీల్లోడుతున్న అంజాద్ చదువరులకి .. అయ్యో అని మనసు మూలుగుతుంది . 

తెలుగు దేవుళ్ళు కథ సున్నితంగా కొట్టిన కొరడా దేబ్బలాంటిది. అసలీ కథని ఎంత బాగా వ్రాసారు  ఎంత బాగా వ్రాసారు అని ఎన్నిసార్లు అనుకున్నానో ! పుస్తకం పట్టని అక్షరాస్యులకి చెవుల్లో ఇల్లు అట్టుకుని  మరీ వినిపించానీ కథని . అన్ని మతాల పిల్లలు కలిసి చదువుకునే బడిలో ఒక మతానికి సంబంధించిన దేవుడి బొమ్మ స్కూల్ బ్యాడ్జీ పైన ,బెల్ట్ బకిల్ పైన ఉండటమే కాదు స్కూల్లో జరిగిన పోటీలలో గెలిచిన వారికి బహుమతిగా కూడా హిందువుల దేవుళ్ళ బొమ్మలని బహూకరించడం లాంటివన్నీ మతాధిపత్య భావజాలానికి సూచనగానే కనబడతాయి . గౌసియా  దానిని తీవ్రంగా గర్హిస్తుంది స్కూల్ యాజమాన్యాలని ప్రశ్నించాలని చాంద్బాషా పై వత్తిడి తెస్తూ ఇలాంటి పనులు ఒంటరిగా చేయడం కంటే పడుగురుతో కల్సి చేయడమే బలం చేకూరుతుందని సలహా  కూడా ఇస్తుంది. 
చాపరాయి , పలకల పండుగ కూడా మంచి కథలు .  మనం ఎన్నో కథలని చదువుతాం . అందులో కొన్ని బాగా నచ్చుతాయి . కొన్ని పర్వాలేదనిపిస్తాయి . కానీ ఆ కథా సంపుటిలో కథలన్నీ ఒకదానికి మించి మరొకటి బావున్నయనుకోవడం చాలా అరుదు . అలాంటి కథా సంపుటే  "జుమ్మా"గ్రామీణ జీవితానికి అద్దం  పట్టే కథలు ఇవి . ఈ కథలలో పాత్రలు మనకి సుపరిచితమైనవే ! కానీ వాళ్ళ జీవితాల్లోకి జీవన విధానంలోకి జొరబడి ఈ జీవితాలు ఇలా అని చెప్పిన మంచి కథలు ఇవి . చదువుతూ ఉంటె హృదయం ఆర్ద్రమవుతుంది . ఒకోచోట మన కళ్ళు తెలియకుండానే వర్షిస్తాయి . 
ఈ కథల గురించి ఇంకా ఎంతో చెప్పాలని ఉంది వ్యక్తీకరించే బాష లేకపోవడం చేతకాకపోవడం కూడా కాదు . కానీ చెప్పలేని మూగతనం . ఎన్నో రాత్రులు  తనవి తనవి కానీ జీవితం తాలూకు సంఘటనలు, అనుభవాలు నిద్రపొనీయకుండా కనురెప్పలపై కూర్చుని కథలు అల్లే దాకా స్థిమితంగా ఉండనీయని తనాన్ని ఎలా సంభాళించుకున్నాడో అని అనుకున్నప్పుడు దుఃఖం ముంచుకొస్తుంది . ఎందుకంటే రచయిత తపన ఎంతో కొంత  నాకు తెలుసు కాబట్టి . 
షరీఫ్ .. మీకు జుమ్మా పునర్జన్మ అని చెప్పారు . నిజం . కథకుడిగా మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. జీతీ రహో ..బేటా ! అమ్మ మనసుతో చెపుతున్నాను   సునిశిత  పరిశీలన,  జీవితానుభవం,  గ్రామీణ నేపధ్యాలతో సామాజిక భాద్యతతో  మీరింకా మంచి కథలు వ్రాస్తారు ఆ కథలు గుండె గుండె ని తడతాయి . కథలలో ఎందఱో తమని తాము చూసుకుని మురిసిపోతారు . మా బాధలు ఇంత బాగా చెప్పావా బిడ్డా ..అని మురుసుకుని మనసారా దీవిస్తారు .  మీ చేతిని  ఆప్యాయంగా ముద్దాడతారు. ఇది నిజం . 
 ఒకటి చెప్పడం మరచాను . ఈ జుమ్మా పుస్తకాన్ని  నేను బహుమానంగా పంచింది కూడా శుక్రవారమే !
(  2013 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న  "జుమ్మా " కథా సంపుటిలో  కథలు  ఇవన్నీ ! రచయిత వేంపల్లె షరీఫ్ )