ఖాళీ సంచి
పిల్లలకేం.. వాళ్ళు బాగానే ఉంటారు
నిశ్చలంగా ఉన్న సరస్సులో రాయేసినట్లు
వాళ్ళ మూడ్స్ ని అమ్మలకి బట్వాడా చేసేస్తారు
చూపుకి చూపుకి మధ్య యోజనాల దూరం
ఈ హృదయానికి ఆ మెదడుకి మధ్య అంతే దూరం
ప్రేమలకి దిగుళ్ళకి బానిసని అయినందుకేమో
దుఃఖ కడలిని ఎదన దాచేసి
కనుల పొరలు నదులని ఆపలేక
అనేక రాత్రులని దిండుకాన్చి తెరిపిన పడతారు
ఆకాంక్షలన్నింటిని అదిమిపెట్టుకుని
లేని గాంభీర్యాన్ని అంటిపెట్టుకుని
అస్థిత్వమంటూ మరిచిన అమ్మలై
ఉన్నదీ లేనిదీ తెలియని ఒక భ్రమలో
తెలియకుండానే జీవితం జీవితాన్నే
పరాయీకరణ చేసేసుకుంటారు .
అప్పుడప్పుడూ అమ్మలకి
ఇష్టమొకటి ఉందని గుర్తుకొస్తుందేమో
మనసుకి నచ్చే వ్యాపకాలతో
అలా గాలి పీల్చుకుందామనుకుంటారా
హఠా త్తుగా ఏవో సంకెళ్ళు పడతాయి
ఎన్నాళ్ళుగానో ఎదురుచూసినరోజుని
పాలుగామార్చి వారు నీరులా
కలసి ప్రవహించాలని కలగంటారా
వారి ప్రమేయం లేకుండానే
నిశ్శబ్దంగా కరిగిపోతుందా రోజు
చీకటిలో రంగులన్నింటిని చూడాలని
నిశ్శబ్దాన్ని చిత్రించే కుంచెని చేబూనాలని
వసంతాన్ని కురిపించే ఆకాశం క్రింద
మైమరుపుతో తడవాలని
కాసిని ఎడారి మాటలని వినాలని
ఊహల వలయంలో తిరిగే సాలీడులా
అమ్మలేం కొట్టుకుపోలేరు కాని
కాస్త నాలుగు గోడలు దాటి
మస్తిష్కాన్ని బ్రద్దలు క్రొట్టే ఆలోచనల తావున
పావురంలా స్వేచ్ఛగా శాంతిగా మసలాలనుకుంటే
జీవితం జీవితాన్నే ఒక ఖాళీసంచీగా మార్చి
బిడ్డలెప్పుడో చేతికి తగిలించుకుని
వెళ్ళిపోయారని గుర్తుకువచ్చినప్పుడు
జీవితమంటే అర్ధంకాని సంవేదన
ఎందుకయ్యిందో ఎరుకపడతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి