ఫ్రెండ్స్ .... సెప్టెంబర్ నెల "జాబిలి" మాస పత్రికలో ప్రచురింపబడ్డ నా కథ .. తప్పక చదివి మీ అభిప్రాయం చెపుతారు కదూ !
మబ్బులు విడివడి _వనజ తాతినేని
"మీ అల్లుడు గారు నన్నైనా వదిలేస్తారు కానీ స్నేహితులని మాత్రం అసలు వదలరు. ఎందుకు నాన్నా ! రెండు రోజులు ముందు రండి అని పదే పదే చెపుతారు" అని నిష్టూరపడింది విజయ తన తమ్ముడి పెళ్ళికి ఆహ్వానించడానికి వచ్చిన తండ్రితో . "అందుకే కదమ్మా సాహిబ్ ఫ్యామిలీని, మేథ్యూస్ ఫ్యామిలీని కూడా రెండు రోజులు ముందుగానే రమ్మని చెప్పి వస్తున్నాను " అని నవ్వారు ఆయన .
నేను మాత్రం నవ్వలేకపోయాను . నిజంగా మా ముగ్గురు స్నేహితులమి కలిసి నా బావమరిది పెళ్ళికి వెళ్ళే అవకాశం ఉందా !? ఆ పెళ్లి కన్నా ముందుగా ఈ ఏడాది రంజాన్ మాసంలో రాఖీ పండుగ కలిసి వచ్చింది. ఆ రోజునే మేథ్యూస్ కొడుకు ఆర్య పుట్టిన రోజు కూడా ! మూడు సందర్భాలు కలిసిన ఆ రోజుని ఎంత బాగా సెలెబ్రేట్ చేసుకోవాలని అనుకున్నామో ! అనుకున్నదొకటైతే అయింది మరొకటి.
మేము ముగ్గురం బాల్య స్నేహితులమి. ఒకే వీధిలో పుట్టి పెరగడమే కాదు ఒకే బడి, ఒకే కాలేజ్ ఆఖరికి ఒకే విశ్వ విద్యాలయంలో వేరు వేరు భాష లలో విద్యార్ధులకి పాఠాలు భొదించే ఆచార్యులమీ కూడా! మా ముగ్గురికి పెళ్ళిళ్ళు జరిగి బిడ్డలు పుట్టిన తర్వాత మా బంధం మరింత బలోపేతం అయింది. అంతగా మా కుటుంబాలు అల్లుకు పోయాయి స్నేహమనే దారంతో అల్లుకున్న మా కదంబ మాలని ఎవరూ త్రుంచ లేరని మా ప్రగాఢ విశ్వాసం కూడా ! ఎవరో దిష్టి పెట్టినట్లు ఆ విశ్వాసానికి బీటలు పడ్డాయిప్పుడు.
ఒక నెల రోజుల క్రితం అనుకోకుండా యూనివర్సిటీకి సెలవలు ప్రకటించడం తో మా మిత్రులు ముగ్గురం కలిసి ఎన్నాళ్ళుగానో చూడాలనుకుంటున్న బార ఇమాంబర గుర్తుకు వచ్చింది. కుటుంబాలతో కాకుండా ఈ సారి మేము ముగ్గురమే ప్రయాణం అయ్యాం . లక్నో ఎక్స్ ప్రెస్ కి తత్కాల్ లో టికెట్స్ బుక్ చేసుకుని అక్కడ ఏమేమి చూడాలో గూగుల్ లో సెర్చ్ చేసి చూసుకుని నోట్ చేసుకుని గైడ్ ని కూడా మాట్లాడుకుని మరీ వెళ్లాం. అక్కడ రైల్వే స్టేషన్ లో దిగగానే బాగా ఆకర్షించింది గుర్రపు బండి ప్రయాణం . ఆర్ధికంగా బాగా అభివృద్ధి చెందిన నగరంలో అన్ని వాహనాలతో పాటు గుర్రపు బండ్లు ఉండటం సంతోషం కల్గించింది. లక్నో ని నవాబుల నగరం కోటల నగరం అని కూడా పిలుస్తారంట . ఇక్కడ లేనిది అంటూ ఏమీ లేదు . ఈ నగరం దేశానికి గుండె కాయ లాంటిది అని చెప్పాడు టాంగా వాలా .
హోటల్ కి వెళ్లి త్వర త్వరగా రెడీ అయిపోయి గైడ్ ని తీసుకుని నగరం చూడటానికి వెళ్లాం . నగరం మధ్యగా ప్రవహిస్తున్న గోమతి నదీ పచ్చని పార్క్ లు అన్నింటిని చాలా ఆసక్తిగా గమనించాం . మేథ్యూస్ అయితే తన చిన్న నోట్ బుక్ లో అన్నీ వివరంగా వ్రాసుకుంటుంటే ..నేను ఆ నగరాన్ని కోటలని అన్నింటిని కెమెరా లో బందించాను . బారా ఇమాంబారా , చోటా ఇమాంబారా మరియు అరవై అడుగుల ఎత్తుతో ఠీవిగా నిలబడిన రూమి దర్వాజా అస్ఫీ మసీద్ అన్నింటిని చూడటానికి రెండు కళ్ళు చాలలేదు . అదంతా గొప్ప సంస్కృతి సంపద. ఏదో ఒకసారి చూసి తిరిగి రావలనిపించలేదు ప్రయాణాన్ని వాయిదా వేసుకు ఇంకో రెండు రోజులు అక్కడే ఉండి మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చాము . రెండు వందల పాతికేళ్ళ నిర్మాణాలని అప్పటి సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి ఆచ్చెరువు చెందాము .
సాయం సమయంలో ఆస్ఫీ మసీద్ మెట్ల మీద కూర్చుని చల్ల గాలిని పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ గైడ్ తెలుపుతున్న విషయాలని వ్రాసుకుంటూ విద్యుత్ దీపాల కాంతులలో ఆ పురాతన అద్భుత నిర్మాణాన్ని కనులలో నింపుకుంటూ అనుభూతిని నింపుకున్నాను . ఎప్పుడు సెలవలు దొరికినా ఇక్కడే వస్తాము మాకు బాగా నచ్చిందీ నగరం అని చెపితే గైడ్ కూడా సంతోషించాడు . ఎన్నాళ్ళగానో చూడాలనుకున్న ప్రదేశాలని చూస్తున్న ఆనందంలో నేను సాహిల్ ని బాగా గమనించలేదు కానీ మాథ్యూస్ బాగా గమనించాడు . తను మర్సియా బుక్స్ కొనుక్కున్నాడు . అందరం కలసి ముషాయిరాకి వెళ్ళాము మేథ్యూ తన కొడుకుని అక్కడున్న సైనిక్ స్కూల్ లో చేర్చాలని ఎంతగా ఉబలాట పడ్డాడో . వివరాల్నీ సేకరించాడు . అని చోట్లా సాహిల్ ముభావంగానే ఉన్నాడు ముఖ్యంగా ఏబై మీటర్ల పొడవు పదహారు మీటర్ల వెడల్పు తో అతి పెద్ద గా నిర్మించిన సెంట్రల్ హాల్ ని చూసిన తర్వాత ఒక మాటన్నాడు "ఇలాంటి నిర్మాణ శైలి భారతీయుల వల్ల అవుతుందా" అని .
నేను నివ్వెర పోయాను. చరిత్రని మర్చి పోతున్నావ్ ! ఇక్కడంతకీ ముందు గొప్ప రాజులు ఉండేవారు, రాజ్యాలు ఉండేవి. మొఘలు సామ్రాజ్యపు రాజులు గొప్ప వాళ్ళే ! కాదనను, కానీ పరిజ్ఞానం ఏ ఒక్కరి సొంతం కాదు టర్కీ వాళ్ళో, యూరిపియన్స్ గొప్ప వాళ్ళు అనే ముందు మన హంపీ నిర్మాణాలని, అజంతా ఎల్లోరా కట్టడాల సాంకేతిక పరిజ్ఞానాన్ని తక్కువగా చూడకు . ముస్లిం దండయాత్రలో కూల్చి వేసింది కట్టడాలని, దోచుకు వెళ్ళింది మన సంపదలని మాత్రమే కాదు మన సాంస్కృతిక జీవనాన్ని కూడా విచ్చినం చేసారు " అన్నాను. సాహిల్ మౌనంగా ఉండిపోయాడు .
తర్వాత నేను మాథ్యూస్ మాట్లాడుకుంటూనే ఉన్నాం . ప్రతి దేశానికి మూలమైన ఒక సంస్క్రతి ఉన్నప్పటికీ కొన్ని వందల ఏళ్ళకి అది మాయమైపోతుంది. సాంఘిక ఆర్ధిక కోణాలు అసమానతలు ప్రజల జీవితాలని దుర్భరం చేస్తాయి అందుకనేమో అంతకు ముందు రాజైన .అక్బర్ దీన్ ఇ ఇలాహీ స్థాపించాడు లాంటి విషయాలతో చరిత్రని సింహావలోకనం చేసుకున్నాం . తిరుగు ప్రయాణం లో కూడా సాహిల్ ఎక్కువ మాట్లాడలేదు . అలసి పోయాడేమో అనుకున్నాను కానీ తనలో భావ వైరుధ్యం చోటు చేసుకుందని నేననుకోలేదు. అప్పుడప్పుడు సంభాషణల్లో పాలు పంచుకుని ఈ దేశంలో అందరూ సమానం కాదన్నట్లు మాట్లాడాడు . నేను వాదించాను . చరిత్ర,వర్తమానం తెలిసిన మనమే ఇలాంటి అపోహలతో, అహంతో మనసులో ద్వేషాన్ని పెంచుకుంటూ పొతే భవిష్యత్ లో ఈ దేశ చిత్రపటం ఎలా ఉంటుందో ఊహించావా ? ఎక్కడో చోటు చేసుకున్న చిన్న ఘర్షణ వల్ల రాజకీయ నాయకుల స్వార్దానికి ఊతమై వారి వారి ప్రసంగాలతో కావాలని విద్వేషాలని రగిల్చి రాత్రికి రాత్రే గ్రామాలని స్మశానాలుగా మార్చివేసారు. ఆ సంఘటనలని వార్తలలో చూసి , వీడియో దృశ్యాలలో చూసి మనం ఎంత దిగ్భ్రాంతికి గురయ్యాం. కొన్ని దృశ్యాలని చూసి " ఏమైందీ వీళ్ళకి ? తోటి సోదరులపై ఇంత కక్ష పెంచుకున్నారు. ఎక్కడైనా పొరబాటు జరిగితే చట్టం ఉంది,న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయం కోసం పోరాడాలి కానీ ఇలా మారణాయుధాలతో దాడి చేసి తరిమి తరిమి కొడతారా ? పసి పిల్లలని కూడా చూడకుండా ... నేను కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటే..
"అరె భాయి... ఊర్కో ! ఇంత సున్నితంగా ఉన్నావే ! రాజకీయమనే పాము పడగనీడన బతుకుతున్నాం మనం. వాళ్ళే నరికిస్తారు తగలబెట్టిస్తారు, మళ్ళీ వాళ్ళే వాటేసుకుని మంచిగ చేసాం అంటారు. ఓట్ల ముందు నాలుగు రూకలు విసిరితే వాలిపోయే పావురాళ్ళు ఈ అమాయక జనం. వీళ్ళలో కొందరు చూడు రేపు ఇలా జరిగింది అనేదానికి సాక్ష్యం కూడా చెప్పరు. అయిపోయిందేదో అయిపొయింది. ఇప్పుడు మేమంతా బాగున్నాం అంటారు" అని నువ్వు నన్ను ఓదార్చే ప్రయత్నం చేయలేదా ? మనం ఆ వీడియో లని విద్యార్ధులకి చూపించి అక్కడ ఏం జరిగిందో అన్న అవగాహన కల్గించలేదా ? ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావ్ ? గట్టిగానే అడిగాను . సాహిల్ మాట్లాడకుండా దుప్పటి కప్పుకుని నిద్రకుపక్రమించాడు. అలా మా విహార యాత్ర ముగిసింది.
ఊహ తెలిసిన దగ్గరనుండి ఏ బేదాభిప్రాయం లేకుండా పెరిగిన మా మధ్య లక్నో పర్యటన వాదాలు, బేధాలు సృష్టించింది . రోజూ కలవడాలు లేవు మధ్యాహ్నపు భోజనం పంచుకోవడాలు లేవు. ఒకొరికొకరు ఎదురైనప్పుడు ఏవో ముక్తసరి మాటలు లేదా తప్పించుకుని తిరగడం చేస్తున్నాడు సాహిల్ . మా మధ్య ఇలా ఉంటే యూనివర్సిటీలో మరో రకపు గొడవలు . ర్యాగింగ్ తాకిడికి ఒక అమ్మాయి చనిపోవడం అందుకు భాధ్యులు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని అనుకోవడం ఆ వర్గానికే చెందిన వాడిని నేనూ కావడం దురదృష్టకరం.
క్లాస్ తీసుకుని స్టాఫ్ రూం కి వెళుతుంటే సాహిల్ ఎదురయ్యి " మీ వాళ్ళే ఇలా చేసారంట . ఆ అమ్మాయి చావుకి వాళ్ళే కారణమట . ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది రాష్ట్రాలలో కుల పీడన, దేశంలో మత పీడన సర్వసాధారణం అయిపోయింది . ఇప్పుడు కూడా లౌకిక రాజ్యం అంటూనే మాట్లాడతావా ? అన్నాడు . దెబ్బ తిన్న పక్షిలా విల విల లాడి పోయాను . రాజ్య మౌన ఉపేక్షని నిరసిస్తూ ఎన్ని తీర్మానాలు చేపట్టాం, అక్కడ జరిగిన దానికి నిరసనగా మన విధ్యార్ధులతో కూడి మౌన ప్రదర్శన చేసిన విషయం మర్చిపోయావా? నువ్వేనా ఇలా అంటుంది అడిగాను ఆవేదనగా. నిరసనగా చూస్తూ వెళ్ళిపోయాడు .
ఆదివారం వచ్చిందటే ముగ్గురి ఇళ్ళల్లో ఎక్కడో ఒకచోట కలిసేవాళ్ళం . సాహిల్ మాట్లాడక పోవడం వల్ల మిగతా రెండు కుటుంబాలు కూడా కలవడం మానేశాయి ఇళ్ళల్లో కూడా అర్ధమైపోయింది. అందరూ మౌనంగా బాధగా ఉన్నాం . ఎలా ఉండేవి ఈ కుటుంబాలు? ఎలా అయిపోయాయిప్పుడు ? ఏదో ఒకటి చేయండి, సాహిల్ అన్నయ్యతో మాట్లాడండి మళ్ళీ ఎప్పటిలా మనమందరం కలసి ఉండాలి. రేపు వాళ్ళింటికి వెళ్లి నేను రాఖీ కట్టాలి . శుభాకాంక్షలు చెప్పి ఇఫ్తార్ విందులో పాల్గొని తర్వాత అందరం ఆర్య పుట్టినరోజు వేడుకలో పాలుపంచుకోవాలి అని విజయ గొడవ చేసింది.
నాన్నా ! రేపు సెలవు కదా, రేష్మా వాళ్ళింటికి వెళదాము, రేష్మాకి రాఖీ విషెస్ చెప్పొద్దూ ..నన్ను వాళ్ళింటికి తీసుకు వెళ్ళు అని సావర్ణిక అడగడం మొదలెట్టాడు . ఉదయాన్నే మాథ్యూస్ కి కాల్ చేసి అందరం కలసి సాహిల్ ఇంటికి వెళదామని చెప్పాను .
మేమందరం కలసి వెళ్ళే టప్పటికి సాహిల్ ప్రార్ధన కోసం మసీదుకి వెళ్ళాడు . హీరా మా అందరికి మర్యాద చేసి ఖీర్ తీసుకువచ్చింది, వాడిని రానివమ్మా ! ముబారక్ చెప్పి అప్పుడు తింటాం అన్నాను . ఏమోనన్నయ్యా ! ఎందుకో ఈమధ్య ఆయన సరిగా లేరు . రేష్మా మీ ఇంటికి వెళదామని అడిగింది. మాట్లాడలేదని మళ్ళీ మళ్ళీ అడిగింది . విసుక్కుంటూ నాలుగు దెబ్బలేసారు కూడా ! అని చెప్పింది . నేను మాథ్యూ స్ వంక దిగులుగా చూసాను .
పిల్లలు, ఆడవాళ్ళు ఎవరి గోలలో వాళ్ళున్నారు . నెల రోజుల తర్వాత కలిసేటప్పటికి వాళ్ళ మధ్య ఎన్నో ముచ్చట్లు . వాళ్ళకేం వాళ్ళు బాగానే కలిసిపోయారు . సాహిల్ మాతో అది వరకటిలా మాట్లాడ గలడా !? ఏదో బిడియం. మాథ్యూస్ నా భుజం పై చేయి వేసి బాధపడకు వాడు మాములుగానే ఉంటాడులే ! అక్కడేదో సాతాను పట్టింది వాడికి. అందుకే అలా మాట్లాడాడు అని ఓదార్పు వచనాలు చెప్పాడు .
నెల రోజులుగా మా మధ్య ముసురుకున్న అపోహల మబ్బులు చలన రహితంగా పడి ఉన్నాయి. వాటిని కదిలించే శీతల పవనాల ఆచూకీ కోసం వెదుకుతున్నాను నేను . ఏ ఉరుములు మెరుపులు లేవు ఉక్కపోతలో ఆలోచనలు జిగట జిగటగా ఉన్నాయి . ఆ జిగటని కడిగేసే అవగాహన వాన కురుస్తుందా ! మా స్నేహపాత్ర తిరిగి నిండుతుందా !? ఈ దేశంలో ఎక్కడో జరుగుతున్న కొన్ని సంఘటనలకి నిజంగా అందరూ భాధ్యులేనా !? నా మాటల్లో , నా ప్రవర్తనలో , నా ఆతిధ్యంలో ఎప్పుడైనా నువ్వు వేరు నేను వేరు అనే భావం కల్గేటట్లు నేనున్నానా ! ఏవేవో అపోహలతో ఎందుకు నన్నుదూరంగా నెట్టేస్తున్నాడు. నెట్టేసినా సరే వాడిని కలుపుకోవాలి . ఇది మా స్నేహానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు, దేశం మొత్తం ఉన్న సమస్య . నాయకులు వేరు ప్రజలు వేరు . భిన్న సంస్కృతితో తరతరాలుగా మమేకమైపొయిన జాతి మనది. అయిదేళ్ళు పాటు పరిపాలించే నాయకులొచ్చి ఇది ఒక మతానికి చెందిన దేశమనో లేదా ఈ దేశ వారసత్వానికి ప్రతీకలమనో చెప్పుకున్నంత మాత్రాన మిగతా మతాల వారందరూ ఈ జాతీయులు కాకపోతారా? అలాంటి నాయకులకి బుద్ది చెప్పాలంటే వారి కుళ్ళు కుతంత్రాలు అర్ధం చేసుకున్న వారే నడుంబిగించాలి. అందుకు మా లాంటి ఆచార్యులు, గురువులు ముందుండాలి . ముందు నా మిత్రునికి ఉన్న అపోహని తొలగించాలి. ఈ దేశం మనందరిది. చరిత్ర తెలుసుకోవడానికే తప్ప తవ్వి తవ్వి తెలుసుకుని ఆంతర్యాలు పెంచుకోవడానికి కాదనీ, మా రాజులు గొప్పని మీ రాజులు తక్కువ అని గేలిచేసుకుని వైషమ్యాలు పెంచుకోవడానికి కాదని సాహిల్ కి చెప్పాలి . ప్రస్తుతానికి అది నా భాద్యత. పట్టుదలలు, భేషజాలు పెంచుకుని ఆచార్యుల స్థానంలో ఉన్న మేమే ఇలా ఉంటే మిగతావారికి ఎవరు తెలియజేస్తారు. అని నిజాయితీగా అనుకున్నాను .
సాహిల్ ఇంట్లోకి రాకమునుపే బయటున్న అన్ని జతల చెప్పులని చూసి మేమంతా వచ్చామని ఊహించినట్లు ఉన్నాడు . బయట నుండే అక్కా అంటూ విజయని కేకేసాడు. భయ్యా! అంటూ విజయ సంభ్రంగా వరండాలోకి వెళ్ళింది , నువ్వు వస్తావని నాకు తెలుసక్కా .. అంటూ లోపలి వచ్చాడు .ఏరా ! ఎలా ఉన్నావ్ అంటూ మాథ్యూస్ని పలకరించాడు.నాలాగే మనిషి కాస్త చిక్కినట్లు అనిపించాడు. వాడి కళ్ళలో ఏదో దిగులు. సావర్ణిక ని, ఆర్య ని దగ్గరకి తీసుకున్నాడు . విజయ, మార్గరెట్ వాడికి నేను ముందు అంటే నేను ముందు అంటూ రాఖీ కట్టడంలో పోటీ పడ్డారు . రేష్మా తనకి నేను తెచ్చిన కొత్త గౌనుని టెడ్డీని సంబరంగా తండ్రికి చూపుతుంది .
నా వంక చూడకుండా తప్పించుకు తిరుగుతున్న సాహిల్ దగ్గరకి నేనే వెళ్లి ముబారక్ చెప్పాలని చేతులు చాచాను. సాహిల్ ఉద్విగ్నతకి లోనై బద్మాష్ ! ఇన్నాళ్ళు ఏమైపోయావురా! ఏదో అన్నానని మాట్లాడటం మానేస్తావా అంటూ నా మీదే నెపం వేస్తూ నా చేతులమధ్య హృదయానికి దగ్గరగా ఇమిడి పోయాడు. ఆ స్నేహ పరిష్వంగంలో కన్నీళ్ళు కారిపోతున్నాయి. చొక్కాలు తడసి పోతున్నాయి ." ఇక చాల్లే ఆపండి ! భార్యలు రాచి రంపాన పెట్టినట్లు ఒకరికొకరు చెప్పుకుని ఏడ్చు కుంటున్నట్లున్నారు మీరిద్దరూ ఇప్పుడు " అని విజయ మేలమాడింది. అందరూ పక్కున నవ్వాము .
నీలో ఉన్న అభద్రతా భావం తగ్గించడం నిన్ను హృదయానికి హత్తుకోవడం నా విధి అంటూ ...సాహిల్ ని మళ్ళీ దగ్గరకి తీసుకున్నాను. వాడి వెన్నుని నిమురుతూ ఉంటే వాడి తలపై ఉన్న టోపీని తీసి నాకు పెడుతూ కనీళ్ళు కార్చాడు . ఆ కన్నీళ్ళని చూసి నాకు దుఃఖం ముంచుకొచ్చింది వాడి భుజంపై తలవాల్చి ఇన్నాళ్ళనుభవించిన చెలిమి లేమిని, దుఖభారాన్ని దించుకున్నాను.ఈసారి మాథ్యూస్ కూడా మాలో ఇమిడి పోయాడు.
ఏం జరుగుతుందో అర్ధంకాకపోయినా మా ముగ్గురి దుఃఖాన్ని చూసి మా చుట్టూ చేరి వారి చిట్టి చేతులతో మాకు దడి కట్టారు . మేము వారిని చూసి చిప్పిన కళ్ళతో నవ్వుకుంటూ .. అక్కడే క్రింద కూర్చున్నాం రేష్మా"మత్ రోకో అంకుల్ జీ ! బాబా అభీ ఠీక్ హై" అంటూ నా చేయి పట్టుకుంటే ... ఆర్య " మామా .. మేరా ఘర్కో జల్దీ ఆవో, నేను బర్త్ డే కేక్ కట్ చేయాలి. ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు అంటూ మూడు బాషలు కలిసిన మాటల్లో సాహిల్ ని తొందర పెట్టాడు మా స్నేహానికి ప్రతీకగా !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి