29, సెప్టెంబర్ 2012, శనివారం

" కల్హార " గురించి

 మై డియర్ ఫ్రెండ్.. 

మీరు తన్హాయి పై వెలిబుచ్చిన అభిప్రాయం ని మీ అనుమతి లేకుండానే నేను నా బ్లాగ్ లో పోస్ట్ చేసాను. అందుకు మన్నించండి. 

విహంగ లో  తన్హాయి పై .. నేను చేసిన సమీక్ష "ఓ..కాంత ఏకాంత గాధ " చదివి.. మీ అభిప్రాయం ని నాతో పంచుకోవాలనిపించి ఉంటుంది. తన్హాయి పై మీ స్పందన ని మీ అభిప్రాయాన్ని నేను స్వాగతిస్తాను. 

ఎవరి అభిప్రాయాలు వారివి కదా! మీతో.. నేను విభేదించ  వలసిన అవసరం లేదు. 

ఈ  నవల పై చాలా చర్చ జరగవలసి ఉంది అనుకుంటాను నేను.  మీరు వెలిబుచ్చిన అభిప్రాయంలో..

అదేదో అమర ప్రేమ లా కల్హార,కౌశిక్ ప్రేమ ను గురించి రచయిత్రి చెప్పటం హాస్యాపదం గా తోచింది...కనీసం రచయిత్రి కొన్ని సంఘటను కల్పించి, ఒకరంటే ఒకరికి, తమ జీవిత భాగస్వాముల కంటే ఎందుకు ఇష్ట పడ్డారో వివరించాల్సింది... 

ఇది బావుంది..

 కల్హార మన మధ్య కి  క్రొత్తగా ఏం రాలేదు.ఇలాంటి పాత్రలు చాలా ఉన్నాయి. మన మధ్యే ఉంటాయి. 

వివాహితుల జీవితాల్లోకి మూడో వ్యక్తీ ప్రవేశం యాక్సి డెంటల్ గా జరగవచ్చు. ఆ మూడో వ్యక్తీ మన చుట్టూ ఉన్నవారో,మనకి బాగా తెలిసిన వారో..కానవసరం లేదు కదా!
కల్హార కి అలాగే జరిగింది.

 చైతన్య కి బాధ కల్గించిన  కల్హార గురించే చెప్పారు. మరి మీరు మృదుల మాటేమిటి? ఆమె కూడా కౌశిక్ వల్ల బాధ అనుభవించిన వ్యక్తే కదా! అంటే మగవాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినా సర్దుకుపోవడం అమ్మయ్య.. నా మొగుడు నాకే దక్కాడు అని సంతోషించే స్థాయిలో మృదుల ఉంది కాబట్టి.. ఆమె పాఠకుడి స్థాయిలో ఓ..ఉత్తమ పాత్ర అయి ఉంది కదా..
ఇలా తన్హాయి విషయంలోనే జరుగలేదు."కాలాతీత వ్యక్తులు" నవలలో కల్యాణి పాత్ర ,ఇందిరా పాత్ర ల గురించి ఇప్పటికి చర్చ జరుగుతూనే ఉంది. కల్హార గురించి అలాగే చెప్పుకుంటారు కూడా!

మై డియర్..ఫ్రెండ్.. మనం కష్టం వస్తే ఎవరికీ చెప్పుకుంటాం? స్నేహితులకి. అలాగే కల్హార ప్రతి విషయాన్ని ఆమె ఫ్రెండ్ మోనికా తో షేర్ చేసుకుంది. తన మానసిక స్థితికి కారణం ఏమిటో తెలుసుకుని..అందువల్ల సఫర్ అయ్యే పరిస్థితి తన కుటుంబానికే కాబట్టి..భర్తని స్నేహితుడిలా భావించి అతనికి చెప్పుకుని.. ఏం చేద్దాం అని అడగడం..ఆమెలోని గిల్టీ కి కారణమే! కానీ చెప్పడమే తప్పు అంటే.. కల్హార పాత్రకి అర్ధం లేదు. 

రహస్య ప్రేమికుడి ని మోస్తూ.. జీవిత భాగస్వామిని  మోసం చేసేస్తే.. అది..   మోసం చేసినట్లు కాకుండా ఉంటుందా? కల్హార చేసినది తప్పే! కొన్ని పాత్రలు అంతే! తప్పులు చేస్తారు. 

ఒక  కథ చదివినప్పుడు అందులో పాత్రలు మన మనసు పై తిష్ట వేసుకుని కూర్చుంటాయి. మనం వద్దని తోసి రాజేసినా..మన ఆలోచనలని వీడి  పోవు. అలాంటి పాత్రే కల్హార పాత్ర. 

నేను తన్హాయి సమీక్ష   వ్రాసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. మీకు కల్హార ఎందుకు నచ్చలేదో.. అలాగే నాకు భిన్నంగా కల్హార పాత్ర నచ్చింది. అలా అని ఆమె ప్రవర్తన ని నేను ఎంకరేజ్ చేయబోను. కల్హార పాత్ర లోని విజ్ఞత,విలక్షణ మాత్రమే నాకు నచ్చింది. ఆమె భావోద్వేగాలు కల వ్యక్తీ. చాలా మంది మాములుగా తీసుకుని ప్రతిది  మనకెందుకు మన లైఫ్ మనది అనుకుని  స్పందించని విషయాలకి ఆమె స్పందిస్తుంది. అందుకే ఆమెని చైతన్య భర్తగా ఆమెని కట్టడి చేసాడు. కాని మనసుని అలా కట్టడి  చేయలేక పోయాడు. కల్హార చపల చిత్తురాలు కాదు. అలా అయితే ఆమెకి ప్రతి చోట రహస్య ప్రేమికుడు ఉంటారు. కేవల కౌశిక్ మాత్రమే ప్రేమికుడు  అవడు. ముగింపులో కూడా.. ఆమె మనసు  కఠినం చేసుకుని రాయిలా నిలబడుతుంది. ఆమె దృడచిత్తురాలు. ఒకానొక అనుమానపు ప్రశ్నని జీవితాంతం ఎదుర్కునే దృడ చిత్తురాలు . ఆ పెయిన్ భరించడానికి సిద్దపడింది అంటే ఎంత దైర్యం ఉండాలి. ?   

ఎవరో అన్నారు గ్లామరైజ్ చేస్తున్నారు అని.  నేను అనైతికతని గ్లామరజ్ చేయలేదు  ఎవరి జీవితాల్లో అయినా ఇలాంటి పరిస్థితి  స్త్రీ,పురుషులు ఎవరికీ వచ్చిన ప్పటికి  విచక్షణ తో నడుచుకోవాలి.  అసలు అలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. ఒకవేళ వస్తే ఏం చేయాలో చెప్పింది కదా! ఆ  కోణంలో తన్హాయిని చూద్దాం. అని మాత్రమే నేను చెపుతాను.  నిజమే ! మీరు చెప్పినట్లు మనని ప్రేమించే వారిని మోసం చేయకూడదు. 

నన్ను .. తన్హాయి పై సమీక్ష వ్రాసినప్పుడు ఇంకెవరో అన్నారు ఆమె జీవితం లోను " తన్హా"  ఉండవచ్చేమో    నేమో..అని. నేను కల్హార నో, లేక మృదుల నో.. అయి ఉండాలని లేదు కదా! నన్ను అనేవారు "కల్హార" అయి ఉండవచ్చేమో..ఎవరికీ తెలుసు. ? పాత్ర లని సప్పోర్ట్ చేసినందుకు ఆ పాత్ర స్వభావం వారికి అప్లై అయిపోదు. అలా అయితే.. ఈ ప్రపంచం అంతా  కేవలం మంచి వారిగా మిగిలిపోవాలి..లేదా.. దుష్టత్వంతో.. నిండి పోవాలి.:)

జీవితాల్లో అనేకానేక కథలు. అందులో "తన్హాయి" నవల కథ ఒకటి. తన్హాయి లో కల్హార పాత్ర ఒకటి. అంతే! . 

ఒక పాత్ర నచ్చినప్పుడు ఆ పాత్ర  గురించి  మాట్లాడటం.. ఒక పాత్రని  సృజిస్తే.. ఆ పాత్ర రచయితో,రచయిత్రురాలో ఒరిజినల్  అయి ఉండాలని ఆలోచించడం పాఠకుడి ఊహల్లో మెదిలే విషయం. అందుకు ఎవరు ఏం చేయగలరు చెప్పండి? 

కల్హార ని అర్ధం చేసుకోవడానికి హృదయ వైశాల్యం కావాలి.  (అది మీకు లేదని నేను అనడం లేదు) తప్పు వైపు  నడవకుండా..తనని తానూ కట్టడి చేసుకునే క్రమంలో భర్తకి చెప్పి బాధ పెట్టింది. పరాయి స్త్రీ వైపు ఆకర్షితుడు అయి ఆమెకి ద్రోహం చేయాలని చూసినా అతనిని క్షమించింది..మృదుల. ఇద్దరూ స్త్రీ మూరులే! ఇద్దరూ వివాహ బందాన్ని నిల బెట్టుకున్న వారే! అందుకు  ఇద్దరినీ అభినందిద్దాం. 

అయినా కల్హార  పాత్ర ప్రభావాన్ని నేను ప్రక్కకి పెట్టి  "ఓ..కాంత ఏకాంత గాధ"  సమీక్ష చేసాను. మరొకసారి  చదవ గలరా!

కల్హార పాత్ర నచ్చడం నచ్చక పోవడం.. నవల చదివిన వారి వ్యక్తీ గత అభిప్రాయం. అందులో మీ అభిప్రాయం ఒకటి. 

మళ్ళీ "కల్హార" గురించి నాలో ఆలోచనలు రేపి ఈ పోస్ట్ వ్రాయిన్చినందుకు మీకు ధన్యవాదములు.  


27, సెప్టెంబర్ 2012, గురువారం

ఓ.. సాహితీ మిత్రుడి బ్లాగ్ పరిచయం

ఒక్క పది నిమిషాలు వెలుగు చూడకపోతేనే అంధకార బంధరం అంటూ ఉంటాం 
చీకట్లో చిరుదివ్వెలు అని అంటూ ఉంటాం.. మనం. 
కన్నులుండి చీకటిని చూడటానికి భయపడి.. వెలుగు వైపు వెతుక్కునే మనం.. 
అసలు వెలుగునే కనలేని ఒక వ్యక్తి.. తన భావోద్వేగాల్ని..వెలిబుచ్చి.. ఇతరుల సాయంతో.. అందమైన కవితలని..మన ముందుకు తెస్తుంటే.. అభినందిద్దామని అనిపించదూ!

"వెలుగుపూలు " పేరుతో.. తన ఆత్మ విశ్వాసాన్ని అక్షరాలగా వెదజల్లే.. ఈ బ్లాగ్ ని చూడండి..మనకి మరో  లూయిస్ బ్రెయిలీ,హెలెన్ కెల్లర్, కాంప్బెల్ గుర్తుకురావడం లేదు..! 


"తన్హాయి " గురించి మరో స్పందన


ఓ.. కాంత   ఏకాంత గాధ "తన్హాయి " గురించి మరో స్పందన 

నా మిత్రురాలు ..ఇన్నాళ్ళు "తన్హాయి"  చదవలేదు . ఇప్పుడు  చదివి  తన స్పందన తెలిపారు .. 
ఆ స్పందనని ..  ఇలా  షేర్ చేసుస్తున్నాను.   ఎందుకంటే  ఈ నవలపై  చర్చ జరగాల్సి ఉంది .

వీలు వెంబడి. నా స్నేహితురాలికి నేను.. కొన్ని ప్రశ్నలకి సమాధానం  ఇవ్వాలి. మావి.పుస్తకం పై అభిప్రాయ బేధాలే లెండి  మా ఫ్రెండ్ షిప్ చెడే టట్టు  కత్తులు  కటార్లు .. పట్టుకోం... :)

యధాతదంగా ఆమె అభిప్రాయం  ఇక్కడ...

వనజ గారు,
నిన్ననే తన్హాయి నవల చదివటం పూర్తి అయ్యింది. ఈ మధ్యనే ఐపాడ్ వర్షన్ వస్తే, మీటింగ్ ల లోను, ప్రయాణం లోను, అలా , అలా చదివేసానండి. ఆ తరువాత మీ సమీక్ష చదివాను... విహంగ లో రాసినది.

నీహారిక వాదన, అందరి వాదనలు, వాటికి మీరిచ్చిన సమాధానాలు అన్నీ చదివాను.
మీరు రాసిన సమీక్ష చాలా బాగుంది. కాని నా అభిప్రాయాలు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది.
First of all , అలా flight  ప్రయాణం లో పరిచయం అయ్యి పెళ్ళి అయ్యిన ఒక స్త్రీ ప్రేమలో టప్పుక్కున పడటం హాస్యాపదం.

ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే,ఇద్దరు ఒకరి రూపం ఒకరికి నచ్చి ముందు ఆకర్షితులయ్యారు.
 తరువాత, ఒకరి అభిరుచులు (? పుస్తక పట్టనం, భాషా పరిజ్ఞానం వగైరా, వగైరా ) కలిసి, సంభాషణ పొడిగించారు.
తరువాత తెలిసి తెలిసి ఇద్దరు ఒకరి మోజులో ఒకరు మునిగిపోయారు.
రచయిత్రి చాలా తెలివిగా వారిద్దరి మధ్య శారీరక సంబంధం లేదు అన్న ఒక్క పాయింట్ మీద cash chEsukuni కల్హార ని , తన నవలని, పాఠకులు   మెచ్చుకునేలా   ఒక బుట్టలో పాడేసారు.
నాకీ నవల ఫక్తు యద్దనపూడి సులోచన రాణి రాసే చెత్త నవలలాగే అనిపించ్చింది.
మీకెందుకో కొన్ని విషయాలు చెప్పలని అనిపిస్తుంది. పెళ్ళి అయిన స్త్రీ నిజంగా ఇంకొక పురుషుని పై ఆకర్షితురాలు కాని, ప్రేమ కాని కలగాలంటే (పరాయి పురుషుడి పై) అతను ఆ స్త్రీ యొక్క గతం అన్నా కావాలి, లేదా కొన్ని సంవత్సరాల అనుబంధం అన్నా ఉండాలి.
అంటే ఒకే చోట పని చెయ్యడం కాని, ఒక కారణం కోసం తరుచుగా పని చేసేవారు కాని అలా..
అప్పుడు కూడా ఆ వివాహిత స్త్రీ కాని , పురుషుడు కాని ఆకర్షితులయ్యేది ఒకరి పద్దతి, నడవడిక, తెలివి తేటలు అలాంటివి నచ్చి...అంతే కాని flight  లో కలిసి, అంతాక్షరి పాటలు పాడుకుని, పుస్తకాలు గురించి చర్చించుకుని కాదు.
ఒక వేళ అలా నిజం గా జరిగే సంఘటనలు కనక ఉండి ఉంటే, వారిద్దరు చపల చిత్తులే అని అర్ధం నా ఉద్దెశం లో!
ఇక తరువాత రచయిత్రి రక రకలుగా వర్ణించిన కల్హార మాన్సిక సంఘర్షణ, నిజాయితి
ఇవన్ని తలచుకుంటే నవ్వొచ్చిందండి.
చైతన్య కల్హార గురించి కలలో కూడా అనుకుని ఉండడు కదా, అలా ఆఫీస్ కి వెళ్ళి, పర పురుషుడితో అది కూడా అసలు పరిచయమే లేని ఒక పరాయివాడితో తన భార్య సరస సంభాషణలు చేస్తుందని?
మరి కల్హార అలా చేసినప్పుడు, చైతన్య తను అంతక ముందు కల్హార ఏదో సేవా కార్యక్రమాలలో పాల్గొంటాను అంటే అభ్యంతరం పెడతాడు కదా, ఎక్కడ ఇంటిని నిర్లక్స్యం చేస్తుందో అని.. మరి మనిషిని అయితే పాపం అదుపులో పెట్టగలిగాడు కాని, ఆమే మనసుని అదుపులో పెట్టలేకపోయాడు కదా?
ఒక రకంగా చెప్పాలి అంటే, కల్హార పాత్ర చాలా స్వార్ధపరురాలి పాత్ర. పెళ్ళికి పూర్వం ఎంత ప్రాక్టికల్ గా డీల్ చేసిందో పెళ్ళి తరువాత కూడా అలాగే డీల్ చేసింది. కూతురు గురించి, భర్త గురించి ఎదో మహా త్యాగం చేసినట్టు రాసిందే రచయిత్రి? అది ఆమె కనీస బాధ్యత కాదా కూతురు తో, భర్త తో వివాహిత స్త్రీ లా గడపటం?
పైగా నిజాయితీగా మనసులో తను ఫీల్ అయ్యిందేదో భర్త కి చెప్పెసి, నిజాయితీ పరురాలయ్యిందా? తన మన్సులోంచి ఆ guilt  ఫీలింగ్ తప్పించుకోవడానికి చైతన్యని ఒక పావులా వాడుకుంది.
ఎంత బాధ పెట్టింది తన భర్తని? అసలు చైతన్య భార్యని ముందు ముందు మాత్రం నమ్ముతాడా?
కల్హార తను మోజుపడ్డ డాక్టర్ తో శారీరక వాంచ తీరక పోతే ఆ ప్రేమకి స్వస్తి చెపుతుందా?

చైతన్య ఇంటిలోనే కౌశిక్ కల్హార ని దగ్గరకి తీసుకుంటే ఊరుకుందే? అప్పుడు కల్హారకి ఏమీ తప్పు అనిపించలేదా? ఏమో నండి...నాకు ఏ కొసానా నచ్చలేదు ఈ నవల.

నేను పెళ్ళి అయ్యింది కనక కల్హార  ప్రేమలో పడకూడది అనటం లేదు. పెళ్ళి అయ్యిన స్త్రీలు ప్రేమలో పడరా అంటే, భేషుగ్గా పడతారు. మగవారు ఎలా అయితే అలా బయట కి వెళ్ళి, అందమయిన అమ్మయిలను చూసి మోహితులౌతారో, ఒక్కోసారి వశం తప్పుతారో, అలాగే ఆడవారు కావచ్చు..తప్పు లేదు.. కాని అందులో లోతు ఎంత? ఒక్క వారం? ఒక్క నెల? కొన్ని నెలలు? అంతే కదా? అదేదో అమర ప్రేమ లా కల్హార,కౌశిక్ ప్రేమ ను గురించి రచయిత్రి చెప్పటం హాస్యాపదం గా తోచింది...కనీసం రచయిత్రి కొన్ని సంఘటను కల్పించి, ఒకరంటే ఒకరికి, తమ జీవిత భాగస్వాముల కంటే ఎందుకు ఇష్ట పడ్డారో వివరించాల్సింది...
నా ద్రుష్టిలో ఒకరిని బాధ పెట్టే పనులు (మనలని ప్రేమించే వారిని) మనం ఎప్పుడు చెయ్యకూడదు..ఒక వేళ అలా జరిగినా, సంభాలించుకుని, తగు విధంగా మళ్ళీ అలాంటి తప్పు చెయ్యకూడదు అని గట్టిగా నిర్ణయించుకుని కౌశిక్ తో తెగతెంపులు చేసుకోవాలే కాని, ఆ విషయం భర్తతో చర్చించి, అతనికి తీరని వ్యధ కలిగించకూడదు.
నాకెందుకు ఇదంతా చెపుతున్నారు మీరు అంటే, ఊరికే చెప్పాలని అనిపించిందండి.

చలం మైదానం ఇప్పుడే చదవటం మొదలుపెట్టాను. త్వరలో మీతో ఆ పుస్తకం మీద నా అలోచనలు కూడా తెలియపరుస్తాను.

ఇదండీ ..ఆమె స్పందన,  అభిప్రాయం. "తన్హాయి " పై సమీక్ష "విహంగ " లో  లింక్ 

ఆమె  అభిప్రాయాన్ని స్వాగతిద్దాం ..  

26, సెప్టెంబర్ 2012, బుధవారం

అలసి సొలసిన పదములకు ప్రణమిల్లుతూ ...

ఒక దశాబ్ధ కాలం నుండి చలన చిత్రాలలోని పాటలు చిత్ర కథకి సంబందం లేని సాహిత్యంతో.. దృశ్యంతో కూడా సంబంధం లేని..పాటలతో పిచ్చి గొంతులతో కుప్పి గంతులతో వెగటు కల్గిస్తున్నాయి. అలాంటప్పుడు.. గత కాలపు చిత్రాలు గుర్తు రాక మానవు. అలాంటి చిత్రం చూడాలి అనుకున్నప్పుడల్లా నాకు సీతాకోక చిలుక చిత్రం.. ఆ చిత్రంలోని పాటల సాహిత్యం.. ఆ సాహిత్యాన్ని అందించిన వేటూరి గుర్తుకు వస్తారు. పెదవులపై తెనేలూరతాయని కవుల కల్పన కావచ్చోమో కానీ పెదవులపై పదములు ఊరతాయి వేటూరి గుర్తుకు వస్తే.. అనుకుంటాను నేను. 


సీతాకోక చిలుక చిత్రంలోని పాటల గురించి  చెప్పాలంటే "వేటూరి "  గారి.. పద విన్యాసం గురించే చెప్పుకోవాలి.

ఈ చిత్రం లో పాటల సాహిత్యం గురించి  ప్రస్తావన వస్తే.. వేటూరి గారిని మెచ్చని పామరుడు కూడా ఉండ డని అంటూ ఉంటారు.

రెండు పాటల సాహిత్యంలో    నాకు అమితంగా  నచ్చిన సాహిత్యాన్ని చెప్పడమే ఈ పోస్ట్. అసలు ఈ పోస్ట్ ని "వేటూరి ఇన్  " సైట్ కోసం వ్రాయాలి అనుకున్నాను. కానీ  దైర్యం చాల లేదు. నేను  వ్రాయగలనో...లేదో.. ఓ అపనమ్మకం.

అదే నా బ్లాగ్ లో అయితే తప్పులు ఉంటే  సవరించుకోగలను అనే భావనతో వ్రాస్తున్నాను

అచ్చు తప్పులు ఉన్నా, అసలు తప్పే అయినా, భావం అది గాకున్నా మన్నించాలి.

ముందుగా ... అలలు కలలు ..అనే పాట  సాహిత్యం గురించి...
 అలలు  కలలు  ఎగసి  ఎగసి  అలసి  సొలసి  పోయే  

..... ఎంత చక్కని సారూప్యం.  అలుపెరగ కుండా ఎగసి పడే అలల తొ కలలని పోల్చి రెండు కూడా అలసి సొలసి పోయాయి ..అని చెప్పడం..లో ..ఆంతర్యం..ఇలా అర్ధం చేసుకోవచ్చేమో.. నా కలలతో పాటు.. ఈ సముద్ర తీరంకి వస్తావని అలలు కూడా ఎదురు చూసి చూసి అలసి పోయాయి అని  

పగలు  రేయి  ఒరిసి  మెరిసి  సంధ్యరాగంలో 

పగలు రేయి గా మారే ఆ సమయంలో ద్వికాలములు ఒరుసుకుంటూ.. మెరుస్తున్న ఆ సంధ్యా రాగంలో..
ప్రాణం  ప్రాణం  కలిసి  విరిసె  జీవన  రాగంలో  ..

ఇరువురి మనసులు కూడా కాదు.. ఊహు..అంతకన్నా ఎక్కువైన భావం ని చెప్పాలంటే ప్రాణం అంటాం కదా.. ఆ రెండు  ప్రాణాలు ఒకటైనప్పుడు విరిసిన జీవన రాగంలో..

నీ  చిరునవ్వుల  సిరిమువ్వల  సవ్వడి  వింటే
నీ  చిరునవ్వుల  సిరిమువ్వల  సవ్వడి  వింటే
ఆ  సందడి  విని  డెందము  కిటికీలు  తెరచుకుంటే ....

నీ చిరునవ్వులు సిరిమువ్వల సవ్వడి వింటే.. ఆ రెండు చేసే సందడికి డెందము అంటే హృదయం కిటికీలు చేరుచుకుంటే..
నీ  పిలుపు  ఆనే  కులుకులులకే  కలికి  వెన్నెల  చిలికే  
నీ పిలుపులకే కలికి (పడతి) వెన్నెల లాంటి..  వెలుగు చల్లదనం ని కలబోసినట్లు  నవ్వింది..
నీ  జడలో  గులాబీ కని  మల్లెలెర్రబడి  అలిగే 
నువ్వు జడలో ముడుచుకున్న గులాబీ పువ్వుని చూసి తమని ముడవలేదనే  కోపంతో.. మల్లెలు అలిగి ఎర్రబడ్డా యని  చెప్పడం...
నువ్వు  పట్టుచీర  కడితే  ఓ  పుత్తడి  బొమ్మ
ఆ   కట్టుబడికి  తరించేను  పట్టు  పురుగు  జన్మ
నా  పుత్తడియా  బొమ్మా  

 పుత్తడి బొమ్మ లాంటి ఆమె పట్టు చీర  కడితే ఆ చీర తయారీకై ప్రాణం కోల్పోయిన ఆ పట్టు పురుగు జన్మే తరించి పోయిందని.. వర్ణించిన ..
ఆ కవి కలాన్ని... 

ఈ చిత్రంలో పాటగా వింటున్నప్పుడు  ఒక పొరబాటు దొర్లినట్టు అనిపిస్తూ ఉంటుంది. 

ఆమె ని వర్ణిస్తూ అతను చెప్పవలసిన భావాన్ని.. ఆమె చెప్పుకున్నట్లు.. వాణీ జయరాం గళంతో.. ఆ పాటలో ఉండటం  గమనిస్తాం. అంత సొబగ లేదు  అని  అనిపిస్తూ ఉంటుంది. కానీ చిత్రం దృశ్యంలో గమనిస్తే.. ఆమె కొరకు అతను పంపిన సందేశంలో.. ఉన్నభావాన్ని ఆమె పాడుకుంటూ.. అతనికై పరువులు తీస్తున్డటం  కలసి నప్పుడు ఆమె పాడుకోవడం గమనిస్తాం. పాట సాహిత్యం  తీరుకు.. దృశ్యంకి అసలు సంబందమే లేదు కదా.. కానీ వైవిద్యమైతే ఉంది కదా.. అలాంటి దృశ్య కావ్యమే ..ఈ చిత్రం.   

మీరు గమనించండి..  వేటూరి గారు ఈ చిత్రంలోని పాటల సాహిత్యం అందించిన తర్వాతనే ఇళయ రాజా గారు.. ట్యూన్ కట్టారట. కానీ అలలు కలలు ఆనే పాటకి ముందు.. ట్యూన్ ఇచ్చిన తర్వాత ఆ ట్యూన్ కి  తగ్గ సాహిత్యం ని అందించినట్లు ఒక ఇంటర్యూ లో చెప్పడం విన్నాను. బాణీలకి తగ్గట్టు సాహిత్యం అందించడం ఆప్పుడు ఉందన్నమాట.  

అలాగే  మాటే  మంత్రము .. పాట సాహిత్యంలో.. 
మాటే మంత్రము.. మనసే బంధం
ఈ మమతే  ఈ సమతే మంగళ వాద్యం.. అంటూ  పెళ్ళికి కావాల్సిన అసలు సిసలు అయిన అర్హత గురించి చెప్పారు. 

నేనే నీవుగా పూవు తావిగా సంయోగాలు సంగీతాలు విరిసేవేళ ..అని ఒక చరణంలో.. 

యెదలో కోవెల ఎదుటే దేవత 
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే   వేళలో  ..  అంటూ ప్రేమికుడి మనసుని ఆవిష్కరించారు. .. 

ఇలాంటి   సాహిత్యం తో.. ప్రేక్షకుల అనుభూతి పై  ఇంద్రజాలాన్ని  ప్రయోగించడం "వేటూరి" కే చెల్లింది.


ఇక నాకెంతో ఇష్టమైన ఈ పాట ..

సాగర సంగమమే ... ప్రణయ సాగర సంగమమే..

సాగర సంగమమే ... ప్రణయ సాగర సంగమమే..

కలలే అలలై ఎగసిన కడలికి

కలలే అలలై ఎగసిన కడలికి

కలలో ఇలలో

కలలో ఇలలో దొరకని కలయిక

సాగర సంగమమే ... ప్రణయ సాగర సంగమమే..

కన్యా కుమారి నీ పదములు నేనే

కన్యా కుమారి నీ పదములు నేనే

కడలి కెరటమై కడిగిన  వేళ

సుమ సుకుమారి నీ చూపులకే

తడబడి వరములు అడిగిన వేళ

అలిగిన నా తొల అలకలు నీలో పులకలు రేపి

పువ్వులు విసిరిన పున్నమి రాత్రి  నవ్విన వేళ

సాగర సంగమమే ... ప్రణయ సాగర సంగమమే..

ఆ....ఆ.... ఆ.... ఆ......

భారత  భారతి పద సన్నిధిలో

కులమత సాగర సంగమ శృతిలో

నా రతి  నీవని వలపుల హారతి

హృదయం ప్రమిదగ వెలిగిన వేళ

పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి  కన్నుల నీరిడి

కలసిన మనసుల  సందెలు  కుంకుమ చిందిన వేళ

సాగర ..సంగమమే ..

ప్రణయ ...సాగరసంగమమే... సాగర సంగమమే....


ఈ ప్రణయ సాగర సంగమం గురించి.. ఈ  అందమైన దృశ్య కావ్యంలో చూడటమే.. బావుంటుంది
ఆస్వాదించే రస హృదయులకి ...ఈ పాట  పంచామృతం


బాల్య దశ లో ఉండగా ఈ చిత్రం నా  మనసు పై వేసిన ముద్ర కన్నా.. అర్ధం చేసుకునే ప్రయత్నంలో   ఈ పాటల సాహిత్యమే .. నాకు వికాసం కల్గించింది అని  చెప్పుకోవడం నాకు ఎప్పటికి గర్వకారణమే !

  పాటల తోటమాలి   "వేటూరి" . పదములకు ప్రణమిల్లుతూ ....24, సెప్టెంబర్ 2012, సోమవారం

సాగరసంగమమే...నాకు పన్నెండేళ్ళప్పుడు అనుకుంటాను.. మా రిక్షా మేట్స్ తో కలసి  ఓ..ఆదివారం పూట  మైలవరం అశోక్ దియేటర్ లో మ్యాట్నీ షో కి  వెళ్లి  "సీతాకోక చిలక " చిత్రం చూసాను. 

ఆ రోజు ఎవరు సినిమా గురించి మాట్లాడుకోలేదు.మౌనంగా ఉన్నాం.  ఎవరి ఇళ్ళకి వారు చేరుకునే తొందరలో..ఉన్నాం కాబట్టి. . 

తెల్లవారి మళ్ళీ సినిమా ప్రసక్తి వచ్చింది. అందరూ ఆ చిత్రం బాగోలేదు.. అని అన్నారు. ఎందుకంటే మతాంతర, కులాంతర వివాహం కాబట్టి.. బాగుందని చెపితే పెద్ద వాళ్ళు నాలుగు ఉతుకు తారనే భయం. 

మూడు దశాబ్దాల క్రితం ఎవరూ కూడా ప్రేమ వివాహాలని ప్రోత్సహించే స్థితిలో లేరు కాబట్టి.మేము వెళుతున్న రిక్షా ముందు వెనుక మరో రెండు రిక్షాలు మేము కూర్చున్న రిక్షాతో పాటు మొత్తం మూడు రిక్షాలలో పిల్లలు మొత్తం పద్దెనిమిది మంది పిల్లలలో అందరు ఆ సినిమా చూసినవారే.. అందరూ కూడా ఏం బాగోలేదు ఆ సినిమా..అని ఏకగ్రీవంగా చెప్పేశారు. తర్వాత పెళ్లీడు వచ్చాక కుల మత  ప్రసక్తి లేకుండా ప్రేమ వివాహాలు చేసుకున్నవారు ఉన్నారు. అప్పుడు మాత్రం.. సినిమాని మెచ్చుకునే దైర్యం లేదు.

నేనయితే  మాత్రం ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఏ కులమయితే  ఏ మతమయితే ఏముంది.?   వాళ్ళు ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకున్నారు తప్పేముంది? అని అని చెప్పాను. 
మా వెనుక ఉన్న రిక్షా రాఘవులు.. మేము వెళుతున్న రిక్షాని క్రాస్ చేసి.. ఏమిటమ్మాయి ! సీతాకోక చిలక సినిమా బాగుందా!? పలుపుతాడు  తీసుకుని  నాలుగు ఉతికేవాళ్ళు లేక పొతే సరి. అన్నాడు. నాకు రోషం ముంచుకు వచ్చేసి .. ఏం! మీకు ఎందుకు బాగోలేదో నాకెందుకు ? నాకు నచ్చింది అంతే..!అన్నాను. 

ఈ పిల్లకి పెద్దదవగానే చదువు గిదువు మానిపించి.. పెళ్లి చేసేయమని .. సాంబయ్య  బాబాయికి చెప్పేయాలి. లేకపోతే ఈ పిల్ల ప్రేమించే  పెళ్లి చేసుకుంటుంది.. అని అన్నాడు. మా నాన్నతో..నువ్వేమిటి చెప్పేది.. నీ పని నువ్వు చూసుకో.. అని గట్టిగా సమాధానం చెప్పాను కానీ.. రాఘవులు అన్న మాటలు నాకు చాలా అవమానంగా అనిపించాయి. అతను వినకుండా.. పెద్ద వీడి బోడి పెత్తనం నా మీద చూపిస్తాడేమిటి..!? సినిమా చూసి బాగుందో లేదో చెప్పాను కాని వీడికి నేను ప్రేమించి  పెళ్లి చేసుకుంటానని చెప్పానా? అంటూ వినేటట్టు  ..వినకుండా..ఇంకా కొన్ని తిట్లు  స్కూల్ దగ్గర దిగే వరకు తిడుతూనే ఉన్నాను 

తర్వాత మా అమ్మకి చెప్పాను.. ఆ రిక్షా  రాఘవులు "సీతాకోక చిలక" సినిమా బాగుందని చెపితే.. ఆ చచ్చినోడు ఏమిటేమిటో..అన్నాడు.  వాడు ఎందుకలా అన్నాడో..అడుగమ్మా..! 
నువ్వు కూడా ఆ సినిమా చూసి రా.. ! బాగుందో  లేదో .. చెప్పమ్మా..! అని కొద్ది రోజులు నస పెట్టాను. మా అమ్మ ఆ సినిమా చూడనూ లేదు. రిక్షా రాఘవులని   మా అమ్మాయిని   అలా ఎందుకన్నావని  తిట్టనూ లేదు.

పల్లెలలో..ఉన్న పెద్ద వాళ్ళల్లో అంతర్లీనంగా.. ఈ ఆడ పిల్లలని చదువుకోవడానికి  పంపుతున్నాం  గోపాలరావు గారి అమ్మాయిలా ఏ క్రిష్టియన్ మతస్తుడినో కట్టుకుని వస్తే.. నలుగురిలో ఎంత తలవంపు..? మునుసబు గారి  చిన్న అబ్బాయి సినిమా నటి జయసుదని పెళ్లి చేసుకుంటేనే వాళ్ళు ఒప్పుకోలేదు, మన కులం కాదని అనుకుంటూ ఎంత పేరు,డబ్బు ఉన్నా కూడా వారికి మనసంగీకరించ లేదు అని చెప్పుకునేవారు. మన పిల్లలు అలాగే చేస్తారేమో అని  భయపడేవారు. అందుకనేమో.. మా అమ్మకూడా  ఆ సినిమా విషయం గురించి మాట్లాడలేదు అనుకునేదాన్ని.

ఏమైనా సీతాకోక చిలక సినిమా నాకు బాగా నచ్చింది అన్నానని..నేను ఏ కులాంతర,మతాంతర వివాహమో చేసుకోలేదు. నేను ఇంటర్ మీడియట్ చదువుతుండగానే  మా పెద్ద వాళ్ళు చూసిన సంబంధమే, నాకు వరుసకు అత్త అయ్యే ఆమె కొడుకునే కనీసం పెళ్లి చూపులు లేకుండా ఒక్క చూపు కూడా  చూడకుండా  పెళ్లి జరిగిపోయింది. రిక్షా రాఘవులు మాటని నేను అబద్దం చేసేసాను కూడా!

సరే దర్శకుడు భారతీరాజా గారికి  హ్యాట్సాఫ్ చెప్పుకుంటూ..  చిత్ర రాజం "సీతాకోక చిలక" చిత్రం లో నాకు నచ్చిన అంశాలు.. 

పాటలు చాలా బాగుంటాయి. అలాగే పాటల సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. అప్పటికి వేటూరి గారు ఎవరో తెలియదు కానీ రేడియోలో  పాటలు వస్తుంటే గబా గబా నోట్స్ తీసుకుని వ్రాసేసుకునేదాన్ని. తర్వాత ఆ పాటలని ఇంకోసారి వచ్చేటప్పుడు వింటూ  తప్పులు సరిదిద్దుకుని పాఠం చదువు కున్నప్పటికన్నాశ్రద్దగా పాటలని చదివేదాన్నేమో.. ఆ పాట సాహిత్యం బాగా అర్ధం అయ్యేది.  ఆ పిచ్చో లేక పొతే ఇంకేదన్నానో కానీ  నా  ఇంట్రెస్ట్ మాత్రం అదే ! కావాలంటే నేను ఇంటర్ మీడియట్ చదివేటప్పుడు మాకు  బోటనీ    సబ్జక్ట్ భోధించిన "అనార్కలి " మేడం  తిట్లు సాక్షిగా  ఎప్పుడూ పాటలే చదివేదాన్ని అన్నమాట.

చిత్ర కథ కి వస్తే కులం, మతం ధనిక-పేద తారతమ్యాలు అనేవి కొన్ని వందల సంవత్సరాలుగా మనుషుల మనస్సులో పేరుకుని పోయి.. మనుషుల్లో సహజంగా దాగిన మానవత్వాన్ని కూడా మరుగున పడేసి కర్కశత్వంతో గిరి గీసుకున్న సమాజంలో మార్పు తీసుకురావాలన్న సందేశంతో  ఆ చిత్రం ఉంటుంది.

కులం,మతం అనేవి ప్రవహించే నదులు లాంటివి. ప్రవహించి ప్రవహించి ఆఖరికి అవి కడలి ఒడికి చేరాల్సిందే కదా! అలాగే మనుషుల మధ్య అంతరాలు సమసిపోవాలి. యువతీ యువకుల మధ్య సహజంగా వికసించే ప్రేమ,ఆకర్షణ కలగలిపి అవి పెళ్లివరకు దారితీసే దశలో ఈ కులం,మతం తప్పకుండా అడ్డుగోడలై నిలిచి ఎంతో మంది  ప్రేమికులని విడదీస్తూ ఉంటాయి. మనుషుల మధ్య ఈ అంతరాలు సమసిపోయి ఎవరు అడ్డుకున్నా వెరవక రెండు మనసులు ఏకమయ్యే అపూర్వ ప్రేమ సంగమమే సాగరసంగమం.

సీతాకోక చిలక ఆనే టైటిల్  కూడా.. ఎంత అర్ధవంతంగా  ఉంటుందో కద్దా!?
గొంగళి పురుగు చూడటానికి ఎంతో  అసహ్యంగా ఉంటుంది కదా ! అలాగే పచ్చని చెట్టు ఆకులని తినేసి.. ఆ ఆకుకే గూడు కట్టుకుని ప్యూపాగా మారి.. ఆ దశ నుండి క్రమ క్రమంగా వికాసం చెంది  అందమైన సీతాకోక చిలకగా  మారడం చూసే కన్నులకి ఎంత ఆహ్లాదకరం. 

 కులం మతం ఆనే గొంగళి  పురుగులు సమాజమనే మొక్కకి  పట్టిన చీడ లాంటివి.. అవి సమాజ వికాసానికి నిరోధకంగా మారతాయి. మనుషుల్లో ఆలోచన కల్గిస్తూ.. కులాంతర మతాంతర వివాహాలని ఆమోదించక తప్పదని  అప్పుడే ఈ సమాజం.. సీతాకోకచిలుకలా ఆహ్లాదంగా ఉంటుందనే సందేశం ఉంటుంది. ఇంత ఆలోచనా విధానం నాకు అప్పుడు లేకపోయినా కూడా ఆ సినిమా నచ్చింది. నచ్చినందుకేమో.. ఇంత డీప్ గా ఆలోచించాను. 


"సీతాకోక చిలక" చిత్రంలో.. ఈ బిట్  నాకు  చాలా  ఇష్టం అలాగే  సాగర సంగమమే పాట కూడా.. . 

సాగర సంగమమే... ప్రణవ సాగర సంగమమే!
సాగర సంగమమే... ప్రణవ సాగర సంగమమే!

జానకి కన్నుల జలధి తరంగం ... జానకి కన్నుల జలధి తరంగం ... 
రాముని మదిలో విరహ సముద్రం  
చేతులు కలిపిన సేతు బంధనం 
ఆ సేతు హిమాచల ప్రణయ కీర్తనం 

సాగర సంగమమే... ప్రణవ 

ఈ బిట్ ఎంత బాగుంటుందంటే.. జానకి కన్నుల జలధి తరంగం .. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.. అర్ధం అంత లోతు గనుక. ఆ విషయం అప్రస్తుతమే కానీ .. మనసు పెట్టి చది చూస్తే మీ నయనం చెమ్మగిల్లడం ఖాయం.   

రావణుడు సీతమ్మని అపహరించి లంకలో అశోక వనంలో బంధించి వుంచితే రామచంద్రుడిని తలచుకుంటూ కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతూ ఉంటే హనుమంతుని ద్వారా సీత జాడని తెలుసుకున్న శ్రీరామచంద్రుడు లంకకి ఈవల సముద్ర తీరాన వుండి వారధి కట్టే ప్రయత్నంలో ఉన్నప్పుడు  రాత్రి సమయంలో సీతని తలుచుకుంటూ విరహాన్ని అనుభవిస్తుంటే ఆ విరహాన్ని సముద్రంతో పోల్చిన కవి భావన అర్ధం చేసుకున్న మనసులకి ఎంతో రసజ్ఞత ఉందని అనుకుంటాను. తన విరహాన్ని మోసుకుని వెళ్ళేగాలి కూడా సీతకి వేడిగా తగలకూడదని శ్రీరామచంద్రుడు కోరుకున్నాడని ఎక్కడో చదివిన విషయం గుర్తుకొచ్చి అందలి భావనని అనుభవించి మనసు మూగపోతుంది నాకు. అలాంటి సాహిత్యమే ఇది కూడా అనిపిస్తుంది నాకు. జానకి  కన్నుల జలధి తరంగం, రాముని మదిలో విరహ సముద్రం.. 

ఎంత గొప్పగా చెప్పారు.. ఆ మహానుభావుడు 


చేతులు కలసిన ఆ సేతు బంధనం అనేది.. ఆ సేతువుని నిర్మించడమే కాదు..

చిన్నారి స్నేహితులు .. ఈ యువ జంట ప్రేమకి సాయం చేయడాన్ని  తెలుపుతాయి.

ఆసేతుహిమాచల ప్రణయ కీర్తనం.. 

నిజమే కదా! కన్య కుమారి నుండి హిమాచలం వరకు మనందరికీ ఆదర్శ ప్రాయమైన జానకిరాముల  ప్రణయ బందాన్ని ఆచంద్ర తారార్కం కీర్తించేవారిమే కదా!


ఈ చిత్ర కథకి "వేటూరి" సాహిత్యంతో   అర్ధవంతమైన  రూపమిస్తే  పోస్తే.. ఇళయ  రాజా సంగీతం ప్రాణం పోసింది.
మీరే ఒకసారి విని ,చూడండి. రేపు.. ఇంకొక పోస్ట్ లో "వేటూరి" గారిని తలచుకుంటూ.. సాగరసంగమమే... పాట.. గురించి చెప్పాలని ప్రయత్నం. 

పేరేమిటి !?


ఫ్రెండ్స్ .. ఈ తీగకి కొన్ని పూవులు పూసి.కాయలు కాసి..పండ్లు గా మారాయి.

ఈ మొక్కని ఏమంటారు. !?

ఎవరైనా చెప్పగలరా? ఆయుర్వేద వైద్యంలో వాడతారని ఈ కాయలని తెంపుకుని వెళుతున్నారు మరి.


22, సెప్టెంబర్ 2012, శనివారం

సెలబ్రిటీస్ స్పెషల్

 అప్పుడప్పుడు   కొన్ని విషయాల పట్ల  మనకి తెలియ కుండానే మనలో  అమితాసక్తి కల్గుతుంది. నేను ఈ మధ్య
ఒక దిన పత్రికలో ఆరాధ్య "బి " ని పొదివి పట్టుకుని ఉన్న తల్లి ఐశ్వర్యరాయ్ బచ్చన్ చిత్రం ని ఆసక్తిగా చూసాను. ఆ చిత్రం క్రింద ఉన్న విషయం ని చదివేసి.. ఆరాధ్య "బి " ముద్దుగా ఉంది అనుకుని..

అయినా ఈ విషయాన్ని పత్రికలూ అంతగా ప్రాచుర్యం కల్పించాలా?

ఈ దేశంలో ఎంతమంది శిశువులు జన్మించలేదు. అలాగే ఒక పసి పాప జన్మించింది.  తల్లి గర్భంలో శిశువు ప్రాణం పోసుకోకముండు నుండి పుట్టుక ముందు.పుట్టుక తర్వాత  ఆ పసి పాపని జనులకి చూపాలని ఆ చూపే గొప్పదనం తమకే దక్కాలని తెగ ఆరాట పడిపోతున్న మీడియా వాళ్ళని చూస్తే చిరాకు వేస్తుంది.

సెలబ్రిటీ  ల వ్యక్తి గత జీవితాల గురించి అభిమానులకి ఆసక్తి ఉంటుంది. ఆ విషయాలని పత్రికల ద్వారానో.. టీవి ల ద్వారానో. అంతర్జాలం ద్వారానో..తెలుసుకుంటూనే ఉంటారు.

వెర్రి ముదిరితే రోకలి తలకి చుట్టుకున్నట్లు..అభిమానులకి తోడూ  రాయడానికి వార్తలు లేకో.. సమయాలు భర్తీ చేసుకోవడానికో.. ఏదో ఒక విషయానికి ప్రాచుర్యం కల్పించి చూసేవారికి తలబొప్పి కట్టేవిధంగా మొట్టడం అలవాటైన
ఎలక్రానిక్ యుగంలో ..ఉన్నాం గనుక యధాలాపంగా నైనా భరించక తప్పదు.

 గత రెండేళ్లలో తెలుగు సెలబ్రిటీల  మూడు పెళ్ళిళ్ళు  చూసి వైరాగ్యం వచ్చేసిందేమో.. నాకు మాత్రం ఈ ఆరాధ్య "బి" చూసి ముద్దు కల్గినా ఎందుకో మీడియా వారిపై   చిరాకు కల్గింది.

గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారికి పుట్టిన బిడ్డలకి ఏ మాత్రం స్వేచ్చ ఉండదు. వారు అందరి  పిల్లలు లాగా  ఇతర పిల్లలతో..స్వేచ్చగా ఆడుకునే సమయాలు ఉండవు. అంతా కార్ల ప్రపంచం. అన్నింటికీ మించి భద్రత సమస్య.
 ఎవరి ఈర్ష్యా ద్వేషాలకి,అక్రమ డబ్బు సంపాదనకి.. పిల్లల్లని టార్గెట్ చేస్తారేమో అన్న భయం ఉంటుంది. పిల్లలు పెరిగి పెద్దయి.. వారంతగా వారు కోరుకుని మీడియా ముందుకి  వస్తే తప్ప పిల్లలగా ఉన్నప్పుడు వారి రక్షణ లో భాగంగా..వారిని ప్రదర్శించడం  వారి పెద్దలు  ఇష్టపడక పోవచ్చు. వారిని  చూపించాలని మీడియా  వారి వెంట పడాలా అనిపించక మానదు కానీ... వాళ్ళు అలా వేటగాళ్ళ లా ఉంటేనే కదా.. జనులకి మంచి చెడు విషయాలు ఆసక్తి కర విషయాలు తెలిసేది.:)

ఇటీవల twitter లో "బిగ్ బి" ఎత్తుకుని ముద్దాడుతున్న పసి పాప "ఆరాద్య " అవునని కాదని  మాటలు నడిచాయి
కానీ ఆ పాప Kbc 6 ఎపిసోడ్స్ లో ఒక వీక్షకురాలి బిడ్డని చూసి అమితాబ్ ముచ్చట పడి ఆ బిడ్డని ముద్దు చేసినప్పటి చిత్రం అని Ntv  వివరణ లో తెలిసింది.

అదిగదిగో పులి అంటే..ఇదిగిదిగో తోక అన్నట్లు..మీడియా ప్రచారానికి ఏదో ఒక విషయం కావాలి.
ఏమైనా ఆరాధ్య .. జనులకి "ఆరాధ్య"మయిపోయింది కదా! మరి మాటలా..! ఇంట్లో అందరి బిగ్ బి ల మధ్య పుట్టిన సెలబ్రిటీ చైల్డ్. సెలబ్రిటీస్  స్పెషల్ కాదంటారా!

ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే.. అంతర్లీనంగా నాకు సెలబ్రిటీస్ గురించి  ఆసక్తి ఉంది కదా! ప్చ్..దృశ్య వ్యసనం.ఐశ్వర్య రాయ్ బచ్చన్ చిన్నప్పటి చిత్రం (తల్లితో)

కౌన్ బనేగా కార్యక్రమం  చూసి నవ్వులు చిందించి "బిగ్ బి "  నే ఆకట్టుకున్న  చిన్నారి.

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఓల్డ్ లవ్ లెటర్

నగరంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకి అతి కష్టంపై ఒక రోజు మాత్రమే  హాజరయి తనకి భాషాభిమానం ఉందని తృప్తి పడుతూ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ,  సాహితీ వేత్తల ప్రసంగాలు వినడంలో నిమగ్నమయింది స్నేహ .

అప్పుడప్పుడు తెలిసినవారు ఎవరైనా కనబడతారేమోనని చూపులతో ఆ హాల్ అంతటిని జల్లెడ పడుతుంది.

తెలుగు భాష మరుగున పడకుండా మనమేమి చేయాలో ఉద్భోదిస్తూ  ఆంగ్లంలో మాట్లాడుతున్న ప్రముఖ సాహితీ వేత్తని  ఆహుతులు తప్పనిసరై  భరించారు.  ఎవరైనా అభ్యంతరం తెలిపితే తెలుగు వారు వివాదం చేయడంలో ముందుంటారన్న అపవాదుని మూట గట్టుకున్నట్లవుతుందేమోనన్న భయంతో.

తరువాత పొరుగు రాష్ట్రంలో నివసిస్తున్న భాషాభిమానులు తెలుగు సాహిత్యంలో అంతో ఇంతో పేరున్నవారు మాట్లాడుతూ వారు నివసిస్తున్న రాష్ట్రంలో తెలుగు భాషని వ్యాప్తి చేయడానికి నిధులందిస్తే మన భాష ని అక్కడ కూడా వ్యాప్తి చేయడానికి అవకాశం ఉంటుందని విన్నమిస్తుంటే విని

"మూల విరాట్టుకే నైవేద్యం పెట్టడానికి  లేకుంటే మూలన కూర్చున్న ఉత్సవ విగ్రహం  వచ్చి నాకు నాకు అని అన్నట్లుగా ఉంది" అనుకుంది స్నేహ చిన్నగా  నవ్వుకుంటూ..

అంతలో నాలుగైదు వరుసల ఆవల మరొకరితో కలసి వెళుతున్న ఆనంద్  ని  చూసింది. అప్రయత్నంగా చేతిని ఊపింది. ఆనంద్ అయితే గమనించలేదు కానీ అతని ప్రక్కన ఉన్న అతను "ఎవరో నిన్ను చూసి పలకరిస్తున్నారు " అని చెప్పినట్లు ఉన్నాడు. ఆనంద్  స్నేహ వైపు చూసాడు. వెంటనే ఆమె ఉన్న వరుస వైపు వచ్చాడు.

"బాగున్నారా?" పలకరించాడు. అతన్ని చూసిన సంతోషం లో వెంటనే తల ఊపింది అందమైన అబద్డంలా

ఇక్కడ సీట్లు ఖాళీ గా లేవుకదా, అక్కడికి వెళ్లి కూర్చుంటాను. లంచ్ టైం లో మాట్లాడుకుందాం అని చెప్పి తనతో వచ్చిన వ్యక్తి ప్రక్కకి వెళ్లి కూర్చున్నాడు.

సభ నడుస్తున్నంతసేపు  లంచ్ టైం  ఎప్పుడవుతుందా అన్నట్లు ఎదురుచూసింది స్నేహ.
మధ్య మధ్యలో ఆనంద్ వైపు చూస్తుంది. పదేళ్ళ క్రితంలాగానే అలాగే సన్నగా ఉన్నాడు.ఎక్కడ ఉంటాడో వివరంగా తెలియదు కాని ఓ..ప్రముఖ దిన పత్రికలో విలేఖరిగా పని చేస్తున్నట్లు విన్నది.  విని చాలా బాధపడింది కూడా.

ఎంత మంచి కవి.  కలసి చదువుకునే రోజుల్లో ప్రతి రోజు  అతని కవిత్వం కోసం పడి పడి  ఎదురుచూసే వారిలో తను కూడా ఉండేదన్నది ఎప్పుడు మర్చిపోలేదు. అతని వ్రాసిన కవిత్వం సంపుటిగా కూడా వచ్చింది.తరువాత అతనెప్పుడు వ్రాసినట్లు లేదు.ఎక్కడైనా ఒక్క కవితైనా కనబడుతుందేమోనని కనిపించిన ప్రతి పత్రికలోను, దినపత్రికల లోను వెతుకుతూ ఉంటుంది.ఆనంద్ ఏమి వ్రాస్తాడో  చూడాలి అని ఆమె ఆశ కూడా.

 లంచ్ బ్రేక్ కన్నా ముందే లేచి వచ్చి" లంచ్ కి వెళదాం రండి " అని పిలిచాడు ఆనంద్.

స్నేహ అందుకోసమే చూస్తుంది కనుక వెంటనే లేచి వెళ్ళింది.

"ఇన్నేళ్ళ తరువాత మిమ్మల్ని చూడటం చాలా ఆనందం కల్గింది. అందుకే అలా చెయ్యి ఊపి నా ఉనికి  చెప్పాల్సివచ్చింది" అంది కొంచెం సిగ్గుగా..

"ఆత్మీయులని  చూసినప్పుడు అలా  ఆనందంని  ప్రకటించడం విడ్డూరం కాదు కదండీ.! అది వారి మధ్య ఉన్న అనుబంధాన్ని పట్టి ఇస్తుంది." అని చెప్పాడు ఆనంద్ మిత్రుడు.

తనని తానూ పరిచయం చేసుకుంటూ  "ఐ యాం మిత్ర "అని చెప్పాడు.

"ఈ రెండు రోజులనుండి మీరు కనబడతారేమో అని చూస్తున్నాను, వూరిలో లేరేమో, అందుకే ఇక్కడి రాలేదు .. అనుకున్నాను " అన్నాడు ఆనంద్.

ఆ మాటల్లో  ఇన్నేళ్ళ తర్వాత కూడా నువ్వు కనబడవేమో ! అన్న నిరాశ పడినట్లు అనిపించింది.

" అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చేసారు, అందుకే రాలేకపోయాను. చాలా మిస్ అయ్యాను కూడా." చెప్పింది.

 చాలా బాగా ఏర్పాటు చేసిన  భోజనాల స్థలం వద్దకు వెళ్లి చేతులు శుభ్రం చేసుకుని ప్లేట్లు తీసుకుని ఇష్టమైన పదార్ధాలు  పెట్టించుకుని.. దూరంగా వెళ్లి తినడానికి ఉపక్రమిస్తూ.. ఏమిటి.."కభీ కభీ" చిత్రంలో "అమితాబ్"  వి అయిపోయారు  ? అడిగేసింది ఉగ్గబట్టుకోలేనట్లు.

కొంచెం సేపు మౌనం తర్వాత  "కవిత్వం వ్రాయాలన్న ఆసక్తి, వ్రాయించే స్పందన, అనుభూతి కూడా ఉండాలిగా.?".
అన్నాడు ప్రశ్నిస్తున్నట్లు.

"అవునేమో! అయినా అందరూ స్పందనతోనే కవిత్వం వ్రాస్తున్నారు అంటారా? మీలాంటి మంచి కవిత్వం వ్రాయగల్గినవారు వ్రాయకపోవడం ఒక రకంగా కవిత్వ ప్రక్రియకి అన్యాయం చేసినట్లే! " అంది స్నేహ.

"మాటైనా, బాటైనా, నా తీరు ఇంతేనేమో! మీ రచనలు చూస్తున్నాను. బావుంటున్నాయి అని చెప్పను కాని కొన్ని లోపాలు కన్పిస్తూ ఉంటాయి" అని నిర్మొహమాటంగా చెప్పాడు.

 అలవాటైన ఆ నిర్మోహమాటాన్ని తట్టుకుంటూనే "మనిషిలో ఏ మాత్రం మార్పు లేదు" అనుకుంటూ  తన రచనల్లోని లోపాలని అంగీకరించింది.

"రేపు ఆఖరి రోజు కదా!  మీరు కూడా వస్తారుగా " అడిగాడు మిత్ర.

 "రేపు  కొందరు స్నేహితులు వస్తానని ఫోన్ చేసి చెప్పారు కాబట్టి తప్పకుండా వస్తాను." చెప్పింది స్నేహ.

"అయితే మీరొక హెల్ప్ చెయ్యాలి, మీరు చాలా అందమైన లేఖలు వ్రాస్తారని ఇంతకు  క్రితమే ఆనంద్ చెప్పాడు.
మీరు నాకొక ప్రేమ లేఖ వ్రాయాలి"  అని చొరవగా అడిగేసాడు మిత్ర.

"అస్సలు కుదరదడీ,మా వారు ఊరుకోరు "నవ్వుతూ చెప్పింది.

 తన మాటలో దొర్లిన తప్పు  అర్ధమయి "సారీ సారీ !! నాకొక అందమైన ప్రేమ లేఖ వ్రాసి పెట్టాలి.అది నా ప్రేయసికి ఇవ్వగానే ఆమె ఇంప్రెస్స్ అయిపోయి నా ప్రేమకి  పడిపోవాలి " అని చెప్పాడు.

"ఒరేయ్ ! అమ్మాయిలూ నిజాయితీ అయిన ప్రేమకి, స్వచ్చమైన ప్రేమకి కూడా పడటంలేదు. నువ్వు ప్రేమించే అమ్మాయి  ఒక్క  ప్రేమ లేఖకే పడిపోతుందా!? ఇలాంటి ప్రయత్నాలు మాని వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ అమ్మాయి తల్లిదండ్రులతో పెళ్లి విషయం గురించి  మాట్లాడు "అని మందలించాడు ఆనంద్.

"నేను కూడా ఒక కవినని ఆమె ముందు నిరూపించుకోవాలి.ఇంత  మంది  మిత్రులు ఉండి  కూడా నాకు ఈ చిన్న సాయం చేయలేరా? " విచారం తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు మిత్ర.

అతను అడిగినతీరు నచ్చి "నేను తప్పక  వ్రాసి పెడతాను సరేనా! హామీ ఇచ్చేసింది స్నేహ.

"మీరు చాలా సునిశితులండి ! చిన్న పాటి తప్పులని కూడా గుర్తిస్తారు.మీతో జాగ్రత్తగా మాట్లాడాలి" అని అంటూనే.. "రేపటికి నాకు ప్రేమ లేఖ ఇచ్చేస్తారుకదా !" మళ్ళీ అడిగాడు.

"అదిగో.. మళ్ళీ అలాగే అంటున్నారు" అంటూ  నవ్వేసింది. "అయినా నా ప్రేమ లేఖ అందుకునే అదృష్టం ఒక్కరికే ఉంటుంది లెండి." అంది తమాషాగా అంటున్నట్లు.

భోజనం  ముగించి సభ జరుగుతున్న హాల్లోకి వెళ్లి ముగ్గురూ ఒక చోటునే కూర్చున్నారు.

ఆనంద్ తో చాలా మాట్లాడాలి అనుకున్న స్నేహకి ఆ అవకాశం లభించడం లేదు అనే కన్నా ఆనంద్ ఆ అవకాశం ఇవ్వడంలేదు అన్నది అర్ధం అయింది. ఆమె మనసుకు బాధ కల్గింది. మధ్య మధ్యలో ఆనంద్ వైపు చూస్తుంది. అతను చాలా మాములుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడనిపించింది.

 సమయం ఆరు గంటలవుతుండగా   "ఇక నేను వెళ్ళాలి మీరు కూడా మా ఇంటికి  వస్తే చాలా సంతోషం. "వెళదాం రండి " ఆహ్వానించింది.

"ఇప్పుడే ఇక్కడ మరొక  ఫ్రెండ్ కలుస్తానని  చెప్పాడు. వీలుంటే..రేపు వస్తాము. మీరు వెళ్ళిరండి." చెప్పాడు ఆనంద్.

స్నేహ మరేం మాట్లాడకుండా  "వెళ్లొస్తాను " అని చెప్పి లేచి వచ్చేస్తూ ఎంట్రెన్స్ వరకు వచ్చాక వెనుతిరిగి చూసింది. ఆనంద్ తనవైపు చూస్తూ కనిపించాడు. మనసు కొంచెం తేలిక పడినట్లు అనిపించింది.

రాత్రి పన్నెండు గంటల తర్వాత అందరు నిద్ర పోయారనుకుని తీర్మానిన్చుకున్నాక మిత్ర కిచ్చిన మాట కోసం బెడ్ లైట్ వెలుతురులోనే   ప్రేమ లేఖ వ్రాయడం మొదలెట్టింది. అరగంట గడిచినా.. ఒక్క వాక్యం వ్రాయడానికి కూడా ఆమె మనసు అంగీకరించలేకపోతుంది.

 తనకి ఏమైంది? తమ చుట్టూ జరిగే సంఘటనలని,తన అనుభవాలని,ఊహలని కలిపి ప్రవాహంలా వ్రాసే తను ఒక్క ప్రేమ లేఖ వ్రాయలేకపోతుంది. తల పగిలిపోతుంది. కలం కదలనంటుంది. విసుగ్గా అనిపించి లేచి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడింది.పరదాలని ప్రక్కకి నెట్టి బయటకి చూసింది. మసక వెన్నెలని తరగి పోతున్న చంద్రుడిని చూసాక ముసుగేసిన  ఆమె మనసు బయటకి వచ్చింది. ఆనంద్ రూపం, ఆనంద్ మనసు కళ్ళ తడిలో కదలాడింది.

వెనుకకి వచ్చి వ్రాయడానికి ఉపక్రమించింది.

ఎన్నటికి మరువలేని స్నేహమా!
ప్రేమ ప్రయాణంలో అంతర్ధానమైన హృదయమా!!
మత్తు మందుని మించిన మోహమా!
పిరికితనంతో మొహం చాటేసిన పాషాణమా !

ఈ ప్రణయ వేదికని జ్వాలగా రగిలిస్తూనే మలగని జ్యోతిగా మిగిలున్నావు.
ఉబికి వచ్చే ఉప్పునీటి ఆనవాలుగా మిగిలున్నావు.

 క్షణ క్షణం నిన్ను తలవకుండా ఉండలేని నా పంచ ప్రాణమా!
నా ప్రాణ శక్తిని తోడేసుకుని నిర్జీవిగా వదిలేసి వెళ్ళిన ..నా చెలి! నెచ్చెలి!!
గతమొక జ్ఞాపకం లా మారింది..

ఆనాటి కల  నే మరచేనా !?

చేరువైన చెలిమిని ఆహ్వానిస్తుంటే కెరటంలా మదిని తాకావు.గుండె గుడిలో దీపమై వెలిగావు.
వెంటాడే నీ చూపులు మాట లాడతాయి, నీ మందస్మితాలు పాటలుపాడుతాయి

నీ మౌనంకూడా మంత్రంలా మారి కాలాన్ని కరిగిస్తుంది.నీ ఊహలు నా ఊహలు కలిసి శ్వాసిస్తాయి.
నా ధ్యాసలు నిన్ను దాటి మరో ప్రపంచం వైపు మరలను అంటున్నాయి.

ఇది.. నీ కోసం నేను పడిన తపన.
తలచుకుంటేనే... నరకప్రాయమైన ఈ బతుకు నాకెందుకు? అన్న నా ప్రశ్నకి సమాధానమే లేదు.

ఒకప్పటి నీ బాసలు బ్రతికిస్తున్నాయేమో ! మానని గాయాన్ని రేపుతున్న మంటలా..ఇలా..

నా ఎదని అల్లుకున్న తీగవైనావు అన్నావు  నా పాదాల చెంత కైనా చేరే పువ్వునవుతావన్నావు.
నీ కలల హారతిలో నా కలల కర్పూరం జతజేస్తానన్నావు

రాగమనే పరిమళాన్ని చవి చూపించి అనురాగమనే గంధాన్ని చిలకరించి....

నీ మనసుని, నీ యవ్వనపు ప్రాయాన్ని ముడుపుగా కట్టి దాచి ఉంచి
వాటిని దోచుకునే ఒడుపులు తెలిసిన చెలికాడివి నీవే కదా ! అని ఊరించావు

పుచ్చ పువ్వులా పూసిన పున్నమి లాంటి మన ప్రేమ వెన్నెలలా విరగబడి నవ్వుతుండగానే

దప్పిక గొన్న రాకాసి మబ్బుల్లా కమ్మేసిన క్షణాలు
గ్రహణం లా కాటేసిన అంతరాలు ..

ఆహుతి గా మారిన  నా ఒకే ఒక్క మనసు

ఈ గతమంతా  చేదు  తీపైన జ్ఞాపకం

జీవితానికి వెలకట్టే షరాబులున్న ఈ లోకంలో  నా ప్రేమకి వెలకట్టగల షరాబు నీకన్న వేరెవ్వరు ? ఆ వెల  మనం కలగన్న మనదైన రాత్రిన  నేను కట్టే  కొంగు బంగారమంత.

మనిషి సగమయ్యేది తనని తాను తగ్గించుకున్నప్పుడు,  తనలో  తనదైన ఇంకో సగంని ఐక్యం గావించు కున్నప్పుడు...

కలలు కల్లలు గా మిగిలిపోయిన ఇప్పుడు జీవనం అంతా దుఖపు నది. జీవితపు సంతోషతీరం ఆవలి ఒడ్డున ఊరిస్తూ ఉంటుంది.

నదిని దాటించే తెప్ప కూడా దుఃఖ రాశులతో తొణికిసలాడు తుండగా తెప్పని ఒడ్డుకు లాగే ప్రయత్నం లో గెలిచి అలసి

మమకారాల నివాళులందుకుంటూ క్షమించి  చెలిమి నిచ్చే చల్లని చేయినయి

ఇలా ఏక బిగిన వ్రాసేసి.. ముగింపు ఏం వ్రాయాలో తెలియక ఆగిపోయింది.

 మొదటి నుండి  చదివింది. మళ్ళీ మళ్ళీ చదివింది.కానీ ముగింపు వ్రాయలేకపోయింది.

ఇది నేనే వ్రాశానా?  తనని తానూ ప్రశ్నించుకుంది. "కాదు కాదు.. నాలో ఉన్న ..ఇంకో మనసు అచ్చు తను వ్రాసే రీతిన  తన చేత ఇలా వ్రాయించింది" అను కుంటూ.. ఆనంద్ కూడా ఇలాగే రాస్తాడు  అతని కోసమే అప్రయత్నంగా ఈ లెటర్ రాసిందని అర్ధమయి

రెండు మనసుల స్పందన ఒకటే కదా! అందుకే ఇలా వ్రాయగల్గాను అని  ఒక నిట్టూర్పు నిడిచి

ఆ కాగితాలని భద్రంగా దాచి పెట్టి పడుకుంది. నిశిరాత్రి ఆమె ఆలోచనలలో కరిగిపోయింది.

తెల్లవారుతూనే ఇంటి పనులు అన్ని చేసుకుని అందరికి అన్ని సమకూర్చి తొమ్మిది గంటలకల్లా సభలు జరుగుతున్నచోటుకి వచ్చేసింది. ఆనంద్, మిత్ర అప్పటికే అక్కడ వేచి చూస్తున్నారు. .

"అరె!ఆలస్యంగా వచ్చినట్లున్నాను" అంది.

"లేదండి, నేనే త్వరగా వచ్చేసాను. నాకు ఆ లెటర్ ఇచ్చేస్త్రారా?" ఆత్రంగా అడిగాడుమిత్ర.

"సారీ !..నేను వ్రాయలేకపోయాను అని చెప్పి. మీ అడ్రస్ ఇస్తే త్వరలో వ్రాసి పోస్ట్ లో పంపుతాను సరేనా.. "
క్షమాపణ గా అడిగింది.

"పర్వాలేదు..స్నేహ గారు ఏ లేఖ వ్రాయాలన్నా ఫీలింగ్స్ ఉండాలి కదా!  నా ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ గా మారలేవు కదా! ఆనంద్ అన్నట్టు ఎవరి ఫీలింగ్స్ వాళ్ళే ఎక్స్ ప్రెస్ చేయాలి. నా తంటాలు ఏవో నేను పడతాను. మీకు ఇబ్బంది కల్గిస్తే క్షమించండి"  హృదయ పూర్వకంగా చెప్పాడు.

స్నేహ మాట్లాడకుండా ఉండిపోయింది.

ఆనంద్ ఒంటరిగా దొరికినప్పుడు.. హ్యాండ్ బాగ్ లోనుండి ఒక కవరు తీసి అతని చేతిలో ఉంచింది.  అది తను రాత్రి వ్రాసిన అసంపూర్తి లేఖ.

"ఏమిటిది !? "  కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు ఆనంద్

ప్లీజ్ ఆనంద్ ! నన్ను ఇప్పుడు ఏమి అడగకు, నేను వ్రాసినదే!  కానీ అది నాలా నేను వ్రాయలేదు వ్రాసింది, వ్రాయించింది  ఎవరో నీవు  మాత్రమే  చెప్పగలవు " చెమర్చిన కన్నులతో వణుకు తున్న గొంతుతో చెప్పింది.

ఆనంద్ ఆ కవరుని పదిలంగా గుండెకి దగ్గరగా చేర్చుకున్నాడు.

దాదాపు తొమ్మిదేళ్ళ  వారి  కలయికలో  కొన్ని అపార్ధాలు   మబ్బుల్లా   మాయమయ్యాయి.

 ఎన్నటికి  తీరం చేరని నౌకలా ఎన్నటికి కలవని ప్రేమలు ఉంటాయి.

వ్రాసుకున్న లేఖలు, చేదు, తీపి జ్ఞాపకాలు గుండెల్ని గుచ్చే గులాబీల్లా  వాడకుండా ఉంటాయి.

ఒంటరి పయనం ఒకరిదైతే.. అన్నీ ఉన్నా ఒంటరితనం వెదుక్కునే ఇంకొకరు కావచ్చు.
లేదా  ఎవరి జీవితాలు వారివి కావచ్చు. కానీ ఆ లేఖలు మాత్రం బ్రతికే ఉంటాయి.

 "చిక్కి శల్యం అయినా సరే. శవం అయ్యేదాకా అయినా సరే!"

ఒక నెల రోజుల తర్వాత  ఆనంద్ పేరుతొ ప్రచురితమైన  కవితని  ఒక పత్రికలో చూసి ఆత్రంగా  అది చదివిన స్నేహ నయనం చెమ్మ గిల్గింది, హృదయం భారమైంది.

తన లేఖ అతనిలో స్పందన కల్గించింది, అందుకే ఇన్నేళ్ళకి ఈ అక్షరాల రూపంలో అతని మనో భావాలకి రూపం వచ్చింది అని అనుకుంది.

ఆమె  డైరీ లో మరో పుట ఇలా నల్లని అక్షరాలతో..నిండి పోయింది.

తొలకరి చినుకు లాంటిది  స్నేహం
పువ్వులో పరిమళం లాంటి ప్రేమ.

మంచును కరిగించే  కిరణం స్నేహం
కల్మషం ని కడిగేసే జడి వాన ప్రేమ.

ఒక కలలా సాగే పయనం స్నేహం
పవన వీచికలో  వినిపించే పాట  ప్రేమ

ప్రేమ, స్నేహం నమ్మకంలో నమ్మకమై ఉంటుంది.

నిజంగా నీ హృదయంతో  నువ్వు పిలిచినప్పుడు ఈ రెండు నీతోనే ఉంటాయి
నీలోనే ఉంటాయి. గుర్తించే మనో నేత్రం మనకుంటే చాలు....     

19, సెప్టెంబర్ 2012, బుధవారం

ఐదు "వ " కారముల చేత
ఆరోగ్యం తిరిగి పుంజుకోవడానికి  విశ్రాంతి తీసుకుంటూ  ఆ సమయాలలో   వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతూ ఉన్నాను.

నేను చదివిన పుస్తకాలలో ...

నాకు బాగా నచ్చిన కొన్ని విషయాలు ఇలా పంచుకుందామని  వచ్చాను.

మానవుడు ఐదు  "వ " కారముల చేత పూజ నీయుడు అవుతాడట.
వస్త్రం,వపుష్ట ,వాక్కు,విద్య,వినయం.

మొదటిది వస్త్రం..
అంటే మంచి వస్త్ర ధారణ కల్గి ఉండటం వలన గౌరవింప బడతారు.

రెండవది శరీర సౌష్టవం.
వంశాన్ని,మన గుణాలని,మన తేజస్సుని ఆధారం చేసుకునే సంతతికి శరీర అందాలు వస్తాయి.

మూడవది వాక్కు.
ఎంత బాగా చదువుకున్నా ఒకోకరి మాట తీరు సరిగా యండదు. కొంతమందికి ఏ చదువు లేకపోయినా సంస్కారంతో,హృదయానికి హత్తుకునేలా మాట్లాడతారు.

నాల్గవది విద్య
విద్య క్రమశిక్షణతో కూడినది అయి,మానవతా విలువలతోను కూడి..  కొంత ఆధ్యాత్మికత తత్వంతో ముడిపడి ఉండాలి.

ఐదవది  వినయం
పైన ఉదహరించిన నాలుగు గనుక ఉంటె ఐదవ గుణం అదే అలవడుతుంది.

విద్యా దదాతి వినయం వినయాత్ యాతి పాత్రతామ్
పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతఃసుఖమ్

విద్యతో వినయం సిద్దిస్తుంది.
వినయంవలన తగిన అర్హత లభిస్తుంది.
ఆ అర్హతే ధనం ని సంపాదిస్తుంది.
ఆ ధనం వలన ధర్మం తద్వారా సుఖం లభిస్తుంది.

 అందరికి సిద్ధి బుద్ధి ని ప్రసాదించే ఆ  విఘ్నేశ్వరుని మనసారా ప్రార్దిస్తూ..వినాయక చవితిని జరుపుకుందాం.

బ్లాగ్మిత్రులందరికీ "వినాయక చవితి" శుభాకాంక్షలు.

17, సెప్టెంబర్ 2012, సోమవారం

మనసైనవి

చామంతి ఎంతందం !
పిడికెడు మన్ను చాలదా మొక్క ఎదగడానికి,పువ్వు వికసించడానికి

కొమ్మకి పూసిన తొలి పువ్వు..

గడ్డి పువ్వు అయితేనేం? సీతాకోకచిలుకకి ఎంత మక్కువ..

.

15, సెప్టెంబర్ 2012, శనివారం

డూ డూ ..బసవన్న ..

మా ఇంటి ముందుకొచ్చే ...

బసవన్న కరుణ చూపులు
 

ఫోటోకి పోజులిస్తూ..

మాకు సంతసం  కలిగించ దీవెనలు అందిస్తూ..


14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

త్యజించు లేదా ప్రేమించు.....

ఈ రోజు హిందీ దివస్ .

హిందీ జాతీయ భాష.

భారతీయులందరూ రాజ భాషగా అమలుపరచు కుంటున్నాం.

ఈ సందర్భంగా ..ఒక మంచి కవిత.

నా కవిత అనుకునేరు.. హిందీ భాషపై నాకంత పట్టులేదు.

హిందీ భాషా కవయిత్రి "సుభద్రా కుమారీ చౌహాన్ " గారిది.

ఈమే కవితలు సరళంగా,సహజంగా ఉంటాయి. ఆమె కవితలలో దేశభక్తి తో పాటు భగవంతునిని ఏ విధంగా ప్రార్ధించ వచ్చో..తెలుసుకోవచ్చును.

నిర్మలమైన హృదయంతో.భగవతారాధన ఆమె కవితలో చూడవచ్చును. ఆ కవితనే నేను ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను.

ఆమె తన కవితతో..ఇలా ప్రార్ధిస్తున్నారు..
టుకరా దో యా ప్యార్ కరో

"ఓ..దేవా..! నిన్ను పూజించే అనేక మంది అనేక రకాల పద్దతులలో నీ వద్దకు వస్తారు.
నీ సేవకై అత్యంత విలువైన కానుకలు అనేక విధాలుగా తెస్తారు.

వారు అంగరంగ వైభవంగా ఆడంబరంగా.. అలంకరణ లతో ఆలయంలోకి వస్తారు.
ముత్యాలు,మణులు విలువైన వస్తువులు తీసుకు వచ్చి నీకు కానుకలుగా సమర్పిస్తారు.

పేదరాలైన నేను ఏమి కూడా నా వెంట తేలేదు.
అయినప్పటికీ ధైర్యం చేసి ఆలయంలోకి పూజించడానికి వచ్చాను.

ధూపదీప నైవేద్యాలు లేవు. అందమైన అలంకరణ లు లేవు.
అయ్యో! నీ మేడలో వేయడానికి కనీసం పూల మాల కూడా లేదు.

నిన్నేవిధంగా స్తుతించగలను? నా స్వరం లో మాధుర్యం కూడా లేదు
మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేయడానికి నా మాటలలో చాతుర్యం లేదు.

దానం లేదు,దక్షిణ లేదు రిక్త హస్తాలతో వచ్చాను.
పూజించే విధానం కూడా తెలియదు. అయినప్పటికీ ..ఓ... స్వామీ !! నేను వచ్చాను.

పూజా మరియు పూజా సామగ్రి అయి ఉన్న ..ఓ..ప్రభూ.. ! నీకై ప్రార్దించే నన్ను అర్ధం చేసుకో!
దానాలను,దక్షిణ లను త్యజించి ఈ బికారిణిని అర్ధంచేసుకో..

నేను ప్రేమ మైకం కమ్మిన దాహార్తిని. హృదయాన్ని చూపడానికే వచ్చాను.
కేవలం నా దగ్గర ఏదైతే ఉందొ.. అది.. హృదయం మాత్రమే ! దానిని అర్పించడానికి వచ్చాను.

నీ పాదముల యందు అర్పిస్తున్నాను. ఇది నీకు నచ్చినట్లు అయితే స్వీకరించు.
ఈ వస్తువు (హృదయం ) కూడా నీదే కదా! త్యజించు లేదా ప్రేమించు

ఈ ప్రార్ధన ఎంత బాగుందో..కదండీ! ఎంత స్వచ్చమైన హృదయంతో.. ప్రార్ధన చేసింది.

ఈ కవిత.. అప్రయత్నంగా నాకు మొన్ననే నా ఫ్రెండ్ గుర్తు చేసింది. ఎందుకంటే ఆ రోజు ఆమె నా బ్లాగ్ చూసి.. ఈ కవిత చెప్పింది. నాకు చాలా బాగా నచ్చింది. భగవంతునికి భక్తుడు సమర్పించే స్వచ్చమైన హృదయంతో కూడిన ప్రార్దనే కదండీ!

ఈ కవిత పదవతరగతి.. పాఠ్య భాగంగా కూడా ఉంది అట.

సుభద్ర కుమారీ చౌహాన్ కవితలు మరిన్ని చూడాలనుకుంటే ..ఈ లింక్ లో చూడవచ్చు.

12, సెప్టెంబర్ 2012, బుధవారం

లోపాలని ప్రేమించగలమా!?

లోపం  కల్గిన వారిని మనసు నిండుగా ప్రేమించాలేమో!

లోపాలు అంటే శారీరక అంగవైకల్యం,మానసిక వైకల్యం మాత్రమే  కాదు.

మనిషిలో బాహ్యంగా కనిపించే అవలక్షణాలు,అంతర్లీనంగా తిష్ట వేసుకున్న లక్షణాలు,వ్యసనాలు..  కావాలని  చేసే నిర్లక్ష్యాలు ఇవన్నీ లోపాలు అని అనాలేమో.!

శారీరక అంగవైకల్యం కలవారిని,మానసిక వైకల్యం కలవారిని ఏ  మనిషైనా నిండుగా ప్రేమించాలి. సాయం చేయాలి చిన్న ఊతనైనా ఇవ్వగలగాలి.

ఇతరులలో కనిపించే అవలక్షణాలని వారు మన వారు కాకపోయినా  ఒకప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఒకసారైనా సరే  కొంతైనా  ఏహ్యభావం ని ప్రదర్శిస్తాము.

వారిని లోపాలతో సహా ప్రేమించలేము.ఆ అవసరం కూడా రాదు కూడా.. కాకపొతే వారిని  సాటి మనిషిగా చూడగలం.

ఇక మన వారి విషయంకి వస్తే.. చిన్న చిన్న లోపాలు లేకుండా క్లీన్ చిట్ అంటూ ఎవరు ఉండరు. మనలో ఉన్న లోపాలని కూడా భరిస్తూ..మనల్ని ప్రేమించే వారు ఉంటారు.

ఇక అవలక్షణాలు అంటే సోమరితనం,జూదం,త్రాగుడు,స్త్రీలోలత్వం.. ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని భరించేది.. కుటుంబ సభ్యులు మొత్తం కూడాను.

అందరికన్నా ఎక్కువ భరించేది భార్య,

అందరూ అంటుంటారు చూడండి.. ఆ మహా తల్లి కాబట్టి  ఆయనని ఇన్నాళ్ళు భరించింది ఇంకెవరు భరించరు..అంటూ ఉంటారు.

ఎందుకంటే ఒక పురుషుడిలో అవలక్షణాలని భరించి అసహ్యించుకుంటూ.. కూడా ప్రేమించేది భార్య మాత్రమే ! అవలక్షణాలు కల్గిన భార్యని భర్తలు భరించరా? లోపాలతో..ప్రేమించరా..అని పురుషులు నా పై దండెత్తకండి. జనరల్ గా చెపుతున్నాను..అంతే!

ఒక ఉదాహరణ చూడండి.. తన సంపాదనలో అధిక మొత్తాన్ని త్రాగుడి వ్యసనానికి ధారపోసే బడుగు జీవిని  మొదలుకుని,మధ్య తరగతి వారు,ధనవంతుల త్రాగుడు వ్యసనంని,వారి ప్రేలాపాలని నిత్యం భరించేది ..ఆర్ధికంగా చితికి పొతే మానసిక వ్యధ చెందేది, పురుషుడు వ్యసనాల వల్ల  కుటుంబం చితికి పోయి ..బిడ్డలపై ఆ ప్రభావం పడితే
ఆ తల్లికి ఎంత నరక ప్రాయం చెప్పండి.?

అయినా సరే .. భర్తని అతనిలో ఉన్న లోపాలతో సహా భరిస్తుంది..ప్రేమిస్తుంది.

అందుకు నేను ఒకే ఒక ఉదాహరణ చెపుతాను. వారుణి వాహినిలో తూగి పోతున్న భర్తలని భార్యలు భరించడంలేదా? ప్రేమించడం లేదా?

అలా కాని పక్షంలో మందు బానిసలుగా మారిన ప్రతి ఇల్లు.. భార్య రహిత గృహంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కదా!

కొందరికి నోటి దురుసుతనం,కొందరికి స్త్రీలోలత్వం, కొందరికి జూదం ..ఇలాంటి అవలక్షణాలని సాధ్యమైనంతవరకు భరిస్తూ..అసహ్యిన్చుకుంటూ..గత్యంతరం లేకనో..లేకపోతే నిండు మనసుతో.. నిజంగా ప్రేమిస్తూ ఉంటారు.

అలాగే అందరిలోనూ లోపాలు ఉంటాయి. తల్లి దండ్రులలో,  సోదరీ సోదరులలో, బిడ్డలలో..బిడ్డల జీవితం పంచుకున్న కోడళ్ళు,అల్లుళ్ళ లో ..అందరిలో లోపాలు ఉంటాయి.

అవసరాల దృష్ట్యా  కంటే.. అర్ధం చేసుకునే తత్వంతో.. లోపంతో సహా ప్రేమించ గలగడం సాధ్యమే!

అలాగే.. తమ అవలక్షణాలతో.. ఇతరులకి ఇబ్బంది కల్గిస్తూ,భాదిస్తూ ఏళ్ళ తరబడి హింసిస్తూ.. తమ ప్రవర్తనని ఏ మాత్రం మార్చుకోలేని వారిని భరించే వారు ఉంటారు. భరించలేక ప్రక్కకు వైదొలగిన వాళ్ళు ఉంటారు.

ఏదైనా.. మనిషిలో ఉండే సహృదయత,సహజ సిద్దంగా ఉండే ఓర్పు, క్షమా గుణం,సానుభూతి..అన్నిటికన్నా.. మీదు మిక్కిలి ప్రేమ కలిపి లోపాలు తో సహా.. ప్రేమించ గల గుణం ఉన్న వారు.. ఉన్నారు.

వారిని దృష్టిలో ఉంచుకుని .. "లోపం  కల్గిన వారిని మనసు నిండుగా ప్రేమించాలేమో!" అని వ్రాసాను.

 స్త్రీల లో కూడా అనేక అవలక్షణాలు కల్గినవారు ఉంటారు. పెత్తనం చెలాయించడం, గడసరితనం ,షాపింగ్ పిచ్చి,డబ్బు పిచ్చి,నగల పిచ్చి..ఇంకా వగైరా ..

వారిని భరిస్తూ.. ప్రేమిస్తూ.. ఉండే పురుషులు ఉన్నారు. వారు కూడా..అభినందనీయులే! అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మనిషి అంటే..స్త్రీ-పురుషులిరువురు ..కూడా కదా!