ఒక దశాబ్ధ కాలం నుండి చలన చిత్రాలలోని పాటలు చిత్ర కథకి సంబందం లేని సాహిత్యంతో.. దృశ్యంతో కూడా సంబంధం లేని..పాటలతో పిచ్చి గొంతులతో కుప్పి గంతులతో వెగటు కల్గిస్తున్నాయి. అలాంటప్పుడు.. గత కాలపు చిత్రాలు గుర్తు రాక మానవు. అలాంటి చిత్రం చూడాలి అనుకున్నప్పుడల్లా నాకు సీతాకోక చిలుక చిత్రం.. ఆ చిత్రంలోని పాటల సాహిత్యం.. ఆ సాహిత్యాన్ని అందించిన వేటూరి గుర్తుకు వస్తారు. పెదవులపై తెనేలూరతాయని కవుల కల్పన కావచ్చోమో కానీ పెదవులపై పదములు ఊరతాయి వేటూరి గుర్తుకు వస్తే.. అనుకుంటాను నేను.
సీతాకోక చిలుక చిత్రంలోని పాటల గురించి చెప్పాలంటే "వేటూరి " గారి.. పద విన్యాసం గురించే చెప్పుకోవాలి.
ఈ చిత్రం లో పాటల సాహిత్యం గురించి ప్రస్తావన వస్తే.. వేటూరి గారిని మెచ్చని పామరుడు కూడా ఉండ డని అంటూ ఉంటారు.
రెండు పాటల సాహిత్యంలో నాకు అమితంగా నచ్చిన సాహిత్యాన్ని చెప్పడమే ఈ పోస్ట్. అసలు ఈ పోస్ట్ ని "వేటూరి ఇన్ " సైట్ కోసం వ్రాయాలి అనుకున్నాను. కానీ దైర్యం చాల లేదు. నేను వ్రాయగలనో...లేదో.. ఓ అపనమ్మకం.
అదే నా బ్లాగ్ లో అయితే తప్పులు ఉంటే సవరించుకోగలను అనే భావనతో వ్రాస్తున్నాను
అచ్చు తప్పులు ఉన్నా, అసలు తప్పే అయినా, భావం అది గాకున్నా మన్నించాలి.
ముందుగా ... అలలు కలలు ..అనే పాట సాహిత్యం గురించి...
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
..... ఎంత చక్కని సారూప్యం. అలుపెరగ కుండా ఎగసి పడే అలల తొ కలలని పోల్చి రెండు కూడా అలసి సొలసి పోయాయి ..అని చెప్పడం..లో ..ఆంతర్యం..ఇలా అర్ధం చేసుకోవచ్చేమో.. నా కలలతో పాటు.. ఈ సముద్ర తీరంకి వస్తావని అలలు కూడా ఎదురు చూసి చూసి అలసి పోయాయి అని
పగలు రేయి ఒరిసి మెరిసి సంధ్యరాగంలో
పగలు రేయి గా మారే ఆ సమయంలో ద్వికాలములు ఒరుసుకుంటూ.. మెరుస్తున్న ఆ సంధ్యా రాగంలో..
ప్రాణం ప్రాణం కలిసి విరిసె జీవన రాగంలో ..
ఇరువురి మనసులు కూడా కాదు.. ఊహు..అంతకన్నా ఎక్కువైన భావం ని చెప్పాలంటే ప్రాణం అంటాం కదా.. ఆ రెండు ప్రాణాలు ఒకటైనప్పుడు విరిసిన జీవన రాగంలో..
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకుంటే ....
నీ చిరునవ్వులు సిరిమువ్వల సవ్వడి వింటే.. ఆ రెండు చేసే సందడికి డెందము అంటే హృదయం కిటికీలు చేరుచుకుంటే..
నీ పిలుపు ఆనే కులుకులులకే కలికి వెన్నెల చిలికే
నీ పిలుపులకే కలికి (పడతి) వెన్నెల లాంటి.. వెలుగు చల్లదనం ని కలబోసినట్లు నవ్వింది..
నీ జడలో గులాబీ కని మల్లెలెర్రబడి అలిగే
నువ్వు జడలో ముడుచుకున్న గులాబీ పువ్వుని చూసి తమని ముడవలేదనే కోపంతో.. మల్లెలు అలిగి ఎర్రబడ్డా యని చెప్పడం...
నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మ
ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ
నా పుత్తడియా బొమ్మా
పుత్తడి బొమ్మ లాంటి ఆమె పట్టు చీర కడితే ఆ చీర తయారీకై ప్రాణం కోల్పోయిన ఆ పట్టు పురుగు జన్మే తరించి పోయిందని.. వర్ణించిన ..
ఆ కవి కలాన్ని...
ఈ చిత్రంలో పాటగా వింటున్నప్పుడు ఒక పొరబాటు దొర్లినట్టు అనిపిస్తూ ఉంటుంది.
ఆమె ని వర్ణిస్తూ అతను చెప్పవలసిన భావాన్ని.. ఆమె చెప్పుకున్నట్లు.. వాణీ జయరాం గళంతో.. ఆ పాటలో ఉండటం గమనిస్తాం. అంత సొబగ లేదు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ చిత్రం దృశ్యంలో గమనిస్తే.. ఆమె కొరకు అతను పంపిన సందేశంలో.. ఉన్నభావాన్ని ఆమె పాడుకుంటూ.. అతనికై పరువులు తీస్తున్డటం కలసి నప్పుడు ఆమె పాడుకోవడం గమనిస్తాం. పాట సాహిత్యం తీరుకు.. దృశ్యంకి అసలు సంబందమే లేదు కదా.. కానీ వైవిద్యమైతే ఉంది కదా.. అలాంటి దృశ్య కావ్యమే ..ఈ చిత్రం.
మీరు గమనించండి..
వేటూరి గారు ఈ చిత్రంలోని పాటల సాహిత్యం అందించిన తర్వాతనే ఇళయ రాజా గారు.. ట్యూన్ కట్టారట. కానీ అలలు కలలు ఆనే పాటకి ముందు.. ట్యూన్ ఇచ్చిన తర్వాత ఆ ట్యూన్ కి తగ్గ సాహిత్యం ని అందించినట్లు ఒక ఇంటర్యూ లో చెప్పడం విన్నాను. బాణీలకి తగ్గట్టు సాహిత్యం అందించడం ఆప్పుడు ఉందన్నమాట.
అలాగే మాటే మంత్రము .. పాట సాహిత్యంలో..
మాటే మంత్రము.. మనసే బంధం
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యం.. అంటూ పెళ్ళికి కావాల్సిన అసలు సిసలు అయిన అర్హత గురించి చెప్పారు.
నేనే నీవుగా పూవు తావిగా సంయోగాలు సంగీతాలు విరిసేవేళ ..అని ఒక చరణంలో..
యెదలో కోవెల ఎదుటే దేవత
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో .. అంటూ ప్రేమికుడి మనసుని ఆవిష్కరించారు. ..
ఇలాంటి సాహిత్యం తో.. ప్రేక్షకుల అనుభూతి పై ఇంద్రజాలాన్ని ప్రయోగించడం "వేటూరి" కే చెల్లింది.
ఇక నాకెంతో ఇష్టమైన ఈ పాట ..
సాగర సంగమమే ... ప్రణయ సాగర సంగమమే..
సాగర సంగమమే ... ప్రణయ సాగర సంగమమే..
కలలే అలలై ఎగసిన కడలికి
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో ఇలలో
కలలో ఇలలో దొరకని కలయిక
సాగర సంగమమే ... ప్రణయ సాగర సంగమమే..
కన్యా కుమారి నీ పదములు నేనే
కన్యా కుమారి నీ పదములు నేనే
కడలి కెరటమై కడిగిన వేళ
సుమ సుకుమారి నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళ
అలిగిన నా తొల అలకలు నీలో పులకలు రేపి
పువ్వులు విసిరిన పున్నమి రాత్రి నవ్విన వేళ
సాగర సంగమమే ... ప్రణయ సాగర సంగమమే..
ఆ....ఆ.... ఆ.... ఆ......
భారత భారతి పద సన్నిధిలో
కులమత సాగర సంగమ శృతిలో
నా రతి నీవని వలపుల హారతి
హృదయం ప్రమిదగ వెలిగిన వేళ
పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి కన్నుల నీరిడి
కలసిన మనసుల సందెలు కుంకుమ చిందిన వేళ
సాగర ..సంగమమే ..
ప్రణయ ...సాగరసంగమమే... సాగర సంగమమే....
ఈ ప్రణయ సాగర సంగమం గురించి.. ఈ అందమైన దృశ్య కావ్యంలో చూడటమే.. బావుంటుంది
ఆస్వాదించే రస హృదయులకి ...ఈ పాట పంచామృతం
బాల్య దశ లో ఉండగా ఈ చిత్రం నా మనసు పై వేసిన ముద్ర కన్నా.. అర్ధం చేసుకునే ప్రయత్నంలో ఈ పాటల సాహిత్యమే .. నాకు వికాసం కల్గించింది అని చెప్పుకోవడం నాకు ఎప్పటికి గర్వకారణమే !
పాటల తోటమాలి "వేటూరి" . పదములకు ప్రణమిల్లుతూ ....