మమ్మీ .. మమ్మీ ! టూ టైమ్స్ పిలిచినా పలకవు. నేను ఊహ మమ్మీ రూమ్ కి వెళ్ళి పడుకుంటాను. బెడ్ దిగబోయిన వేద చేయి పట్టుకుని ఆపేసింది జనిత.
"ఇప్పుడెందుకు ఆ రూమ్ కి, ఎందుకో పిలిచావ్ గా, చెప్పు ఏం కావాలి ?"
నేను పిలిచినపుడు నువ్వెందుకు పలకలేదు. ఊహా మమ్మీ రూమ్ కి వెళతానని అనగానే రెస్పాండ్ అయ్యావు. నువ్వు బేడ్మామ్ వి.
నో నో ..వేదా ! ఊహా మమ్మీ ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళాలి కదా ! నువ్వెళ్ళి తనని డిస్ట్రబ్ చేస్తావని ఆపాను అంతే !
మళ్ళీ పడుకున్నాడు వేద . కొడుకు వైపుకి తిరిగి చేయి మీదేసి దగ్గరకి లాక్కుని నుదుటి పై ముద్దు పెట్టి నిద్రపో అంది. తల్లి నడుంపై చేయేసి కాళ్ళపై కాళ్ళేసి కళ్ళు మూసుకున్నాడు. జనిత కూడా హమ్మయ్య అనుకుని కళ్ళు మూసుకుంది .
"మమ్మీ ! నా కొక డౌట్ ... నువ్వు క్లియర్ చేయగలవా !
చెప్పు నాన్నా ?
"మరీ మరీ ..నాకు డాడ్ ఏడీ ? ఎక్కడ ఉన్నాడు ?" పక్కల్లో బాంబ్ పడినట్టు ఉల్కిపడి లేచి కూర్చుంది.
"చాలా మంది పిల్లలకి డాడ్ ఉండడు వేదా , నువ్వు చాలా ఇంట్రెస్ట్ గా తెలుగు లో మహాభారత్ చదువుతున్నావ్ కదా ! అందులో పాండవులకి పాండు రాజు తండ్రి. కానీ దేవతలా ద్వారా కుంతీకి ముగ్గురు కొడుకులు, మాద్రి కి ఇద్దరు కొడుకులు పుట్టారు కదా ! అట్లా అనుకో .. నువ్వు కూడా అలాగే పుట్టావ్ . డాడీ ఉంటాడు. కానీ కనబడడు "అంది.
"మా స్కూల్ లో చాలా మంది పిల్లలకి , నా ఫ్రెండ్స్ కి మన నైబర్స్ పిల్లలకి డాడ్ కనబడుతున్నాడు కదా ! వాళ్ళందరి డాడ్ చక్కగా స్కూల్ లో డ్రాప్ చేసి వెళతారు , గ్రౌండ్ లో ఆడుకుంటారు,షాపింగ్ కి తీసుకెళతారు. మనింట్లో డాడ్ ఎందుకు ఉండడు? నేనెందుకు డిఫ్ఫ్రెంట్ గా ఉండాలి , నాకు డాడ్ కావాలి అంతే " మారాం చేసాడు.
"నువ్వలా అడగకూడదు . నీకు మమ్మీ ఉంది కదా, అది చాలదూ !"
"మరి ఊహా మమ్మీ కూడా మమ్మీ అనే చెప్పావు కదా ! ఇద్దరు మమ్మీలు ఉన్నారు కానీ డాడ్ లేడు అని మా ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నారు. నాకు డాడ్ కావాలి . డాడ్ కూడా మనింట్లో ఉండాలి " అన్నాడు వేద గట్టిగా.
గుండెల్లో బండ పడినట్టు అయింది జనిత కి.
"సర్లే ! త్వరలో మీ డాడ్ ని తీసుకు వద్దాం. నువ్వు నిద్రపో , గుడ్ బాయ్స్ ఎప్పుడూ బేడ్ క్వొచ్చన్స్ వేయరు . నువ్వు గుడ్ బాయ్ వా/ బేడ్ బాయ్ వా ? ఎలా అనిపించుకోవడం నీకిష్టం చెప్పు ? అంది.
వేద మోహంలో అసంతృప్తి . అడిగిన ప్రశ్నకి సమాధానం దొరకలేదు . మమ్మీ డౌట్ సరిగా క్లియర్ చేయలేదు . రేపు ఊహా మమ్మీ ని అడిగి తెలుసుకోవాలి, ఆమైతే జనిత మమ్మీ లాగా ఎస్కేప్ అవదు, అన్నీ వివరంగా చెపుతుంది అనుకున్నాడు . నెమ్మదిగా వేద నిద్రలోకి జారుకున్నాడు .
వేద వేసిన ప్రశ్నకి జనితకి నిద్ర పట్టలేదు ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవలసి వస్తుందని తెలుసు కానీ మరే ఇంత త్వరగా ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకోలేదు . బెడ్ పై నుండి లేచి వేద కి దుప్పటి కప్పి ఊహా రూమ్ ముందు నిలబడి డోర్ నాక్ చేసింది. ఊహ వచ్చి తలుపు తీసింది. ఊహా ! నిద్ర పోలేదా ?
"లేదు జనితా, కొంచెం ఫీవర్ గా ఉంది ".
వచ్చి బెడ్ పై కూర్చుంది. వేదా నిద్రపోయాడా ? "ఊ ..నాకు డాడ్ ఎవరూ అని అడిగాడు . అదివరకు కూడా అడిగాడు . ఏదో ఒకటి చెపుతూ వచ్చాను . రేపు నిన్ను కూడా అడగవచ్చు. అది చెపుదామనే వచ్చాను .
ట్వంటీ ఫస్ట్ సెంచరీ చివరికి వచ్చాం . సెక్స్ ఎడ్యుకేషన్ లేని దేశాన్ని మన దేశాన్నే చూసాను . రేపు స్కూల్ కి వెళ్ళి క్లాస్స్ టీచర్ తో మాట్లాడి రావాలి . ఆమె ఒకసారి కలవమని కాల్ చేసి చెప్పారు. వేద తోటి పిల్లలతో ఎక్కువగా గొడవ పడుతున్నాడట. అలాగే చిల్డ్రన్స్ సైక్రియాటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి."
" అన్నీ నువ్వే నిర్ణయించుకుని చెప్పేసావుగా! నేనేమన్నా హెల్ప్ చేయాలా ?"
"నో నో ..నేను చూసుకోగలను"
"జనితా ! నాదొక అడ్వైజ్. వేదని సైక్రియాటిస్ట్ దగ్గరకి తీసుకు వెళ్ళడం దండుగ అనిపిస్తుంది .తనొక ఇన్సేమినేషన్ బేబీ అని చెప్పేస్తే ఏమవుతుంది?
ఎప్పటికైనా నిజం తెలియాలి కదా ?
అవన్నీ తెలియడం అవసరమని నేననుకోవడంలేదు. డాడ్ కావాలని కూడా అడుగుతున్నాడు . చుట్టూ ఉన్న పిల్లలకి తండ్రి ప్రత్యక్షంగా కనబడటం చూస్తున్నాడు కదా ! ఇప్పుడెవరినయినా తీసుకుని వచ్చి తండ్రిగా పరిచయం చేయాలేమో, అదొక న్యూసెన్స్ నాకు ? అంటూ లేచి నిలబడి నువ్వు పడుకో, గుడ్ నైట్ అని, నీ కార్డ్ ఇస్తావా ? మనీ కావాలి అంది .
కార్డ్ ఇస్తూ .."ఈ సారి మనీ చాలా తక్కువగా ఉన్నాయి జనితా, ఇక నుండి ప్రతి నెలా కూడా ఇలాగే ఉంటాయి. నేను ప్లాట్ తీసుకున్నాను. దానికి మనీ కట్ అయిపోతాయి"
"అదెలా ... ఊహా ! నాకు మాట మాత్రం చెప్పకుండా అలా ఎలా ప్లాన్ చేసావ్ ? మనమిప్పుడు ప్రతి నెలా చాలా ఇబ్బంది పడాలి . అయినా ఇప్పుడు నీకు ప్లాట్ ఎందుకు ? " విసుగ్గా అంది .
"ఏమో ఎలాగోలా నువ్వే మేనేజ్ చేసుకో ! నాకు జాబ్ వచ్చి పదేళ్ళు అయింది . ఇంతవరకూ కొద్దిపాటి ఆస్తి కూడా లేదు నాకు,గోల్డ్ కూడా లేదు. ఇప్పుడన్నా సేవ్ చేసుకోకపోతే కష్టం అనీ" ...
"నీకు ప్రత్యేకంగా కావాలని నీకెందుకు అనిపించింది .. మనిద్దరిలో ఎవరికీ ఉన్నా నీది కాకుండా పోతుందా ? నేను నువ్వూ అంటూ వేరు చేసి మాట్లాడుతున్నావ్ కొత్తగా ".
"కొత్తగా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు జాగ్రత్త పడాలని అనిపిస్తుంది .కదా "
"ఏం తెలుసుకున్నావ్ ? నీకు వేరుగా ఎస్సెట్ ఏర్పరుచుకోవాలని అనుకున్నావంటే ఇదేదో సీరియస్ విషయమే, చెప్పు ఏం తెలుసుకున్నావ్ ?" ఎదురుగా వచ్చి కూర్చుని కళ్ళలోకి సూటిగా చూసింది.
నువ్వు .. ఆ షైనీ తో చాలా క్లోజ్ గా ఉంటున్నావ్ . ఆమె ఎక్కువగా ఇక్కడికి వస్తుందని మీరిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారని తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు . నువ్వు అలా నన్ను మోసం చేస్తావని నేననుకోలేదు . నన్నునిర్లక్ష్యం చేస్తున్నావ్ , అలాగే వేద ని కూడా నా దగ్గరికి రానివ్వడం లేదు . వాడు నాతో ప్రేమగా ఉండటం ఓర్చుకోలేకపోతున్నావ్".
"రెండూ నిజమే ! ఈ విషయంలో అబద్దం ఆడాల్సిన అవసరం నాకు లేదు . నేను షైనీ క్లోజ్ గా ఉంటే నీకెందుకు అభ్యంతరం? మనమేమీ మేరేజ్ బాండ్ వ్రాసుకోలేదు . నీతో లైఫ్ లాంగ్ ఉంటానని కూడా ప్రామిస్ చేయలేదు . నేను చేసిన మోసం ఏముంది ఇందులో ?"
"నువ్విలా అంటావని నాకు తెలుసు . అచ్చు స్త్రీ-పురుష వివాహంలో ఎలాగైతే పురుషుడి ఆధిపత్యం ఉంటుందో అలాంటి ఆధిపత్యమే నువ్వు చూపుతున్నావ్ . ఇద్దరం ఇష్టపడ్డాం. పేరెంట్స్ కి ఇష్టం లేకపోయినా వాళ్ళకి దూరంగా ఇలా ముంబయిలో బ్రతుకుతున్నాం. నీకు తల్లిని కావాలనిపిస్తుంది అన్నావ్. అడాప్ట్ చేసుకుందాం అంటే .. ప్రెగ్నెంట్ అయ్యాననే ఫీలింగ్, బిడ్డని మోయాలనే కోరిక ఉందన్నావ్ . నాకు తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నావ్ నువ్వెక్కడ బిడ్డని కేరీయింగ్ చేయగలవంటూ జాలి చూపిస్తూనే ఆస్తమా ఉందని జీన్స్ ద్వారా పుట్టే పిల్లకి వస్తాయని నువ్వే ప్రెగ్నెంట్ కావడానికి నిర్ణయించావ్. నువ్వే కన్నావ్ . రాత్రుళ్ళంతా నేను వేద ని కనిపెట్టుకుని ఉండటం , నువ్వేమో రాత్రుల షిఫ్ట్ ఉన్న జాబ్ లో ఉంటూ పగలు రెస్ట్ తీసుకోవడం నేనేమో రాత్రింబవళ్ళూ చాకిరీ చేయడం ... నువ్వేమో నీ పేరున ఆస్తులు అమర్చుకోవడం, ఆఖరికి వేద స్కూల్ రిజిష్టర్ లో తల్లిగా నీ పేరే వ్రాయించుకున్నావ్. బిడ్డ, ఆస్తులు, సుఖం అన్నీ నీకు. కష్టంమాత్రం నాకు. పైగా నాపై మోజు తీరిపోయింది నీకు . కొత్త స్నేహాలు మొదలెట్టావ్ . వేద నాకు దగ్గరవకూడదని కూడా ప్రయత్నం చేస్తున్నావ్. నిన్నెలా అర్ధం చేసుకోవాలి.
"నువ్వు అతిగా ఏదేదో ఊహించుకుంటున్నావ్ . నిన్ను నేను మోసం చేస్తానా ? అంత మోసం చేసే దానిగా కనిపిస్తున్నానా చెప్పు ? అంటూ లాలనగా దగ్గరికి తీసుకుంటూ అడిగింది .
జనితని ప్రక్కకి నెట్టేసి .. కిటికీ దగ్గరకెళ్ళి నిలబడి "జనిత ఆస్తులన్నీ తన పేరునే అమర్చుకుంటుందని . నీకంటూ ఒక్క రూపాయి అన్నా దాచుకున్నావా" అని మా అమ్మ అడిగిందాకా .. నాకా ఆలోచనే రాలేదు. ప్లాన్డ్ గా పదేళ్ళలో సేవింగ్స్ అన్నీ నీ పేరు మీద ఎస్సెట్ గా మార్చుకున్నావ్ . నాకేం ఇచ్చావ్ ?"
"ఓహ్ .. ఇదంతా మీ అమ్మ నీకెక్కిస్తున్న ద్వేషమన్నమాట. ఆమెకి మొదట నుండి మన సంబంధం ఇష్టం లేదు. ఈ విధంగా నీ మైండ్ పొల్యూట్ చేస్తుంది. పేరెంట్స్ తో మాట్లాడకూడదని అనుకున్నాం కానీ ఆ రూల్ ని నువ్వు బ్రేకప్ చేస్తున్నావ్, నాకిది నచ్చలేదు "
"మన విషయం వదిలేయ్ ! వేద కి ఏం చెపుదామనుకుంటున్నావ్ , ఏం చెప్పినా క్లారిటీ ఉండాలి . నన్ను అడిగాడు నాకు మీ ఇద్దరూ అమ్మలైతే నాన్నఎవరు అని అడిగాడు మేమిద్దరం ఫ్రెండ్స్ .. మేమిద్దరం కలిసి ఉంటూ నిన్ను పెంచుకుంటున్నాం అని చెప్పాను . నువ్వేమో నా పొట్టలో నుంచి పుట్టావ్ అని వాడికి చెప్పావ్ . పైగా నువ్వే అసలు మమ్మీ వి ఊహా మమ్మీ కేర్ టేకర్ లాంటిది అని చెప్పావంట. ఆఖరికి నన్ను కేర్ టేకర్ ని చేసావ్ " దుఖాన్ని బయటకి రానీయకుండా అదిమిపెట్టింది ఊహ .
"షటప్ ఊహా ! నువ్వూ, వేద కలిసి .. నా మైండ్ తినేస్తున్నారు ... మీ ఇద్దరూ ఎలాగైనా చావండి." దిండుని తీసుకుని ఊహ మీదకి విసిరి కొట్టి రూమ్ నుండి బయటకి వెళ్ళిపోయింది.
ఊహ కి చాలా తేలికగా అనిపించింది . ఎన్నాళ్ళుగానో లోపలున్నది అంతా కక్కేసాక మనసుకి కల్గిన జ్వరం తగ్గిపోయినట్లు అనిపించింది . మార్నింగ్ మాములుగానే డ్యూటీకి వెళ్ళిపోయింది. సాయంత్రం ఇంటికొచ్చేసరికి ... వేద స్కూల్ నుండి ఇంటికి వచ్చేసి హోం వర్క్ చేసుకుంటున్నాడు . జనిత మమ్మీ స్నాక్స్ చేసి ఇవ్వకుండానే ఆఫీస్ కి వెళ్ళి పోయింది అన్నాడు.
బేగ్ అక్కడ పడేసి ప్రెష్ అవకుండానే త్వర త్వరగా స్నాక్స్ చేసి ఇచ్చి ..తర్వాత ప్రెష్ అయి వచ్చి కాఫీ కలుపుకుని వచ్చి వేద ముందు కూర్చుని జనిత మమ్మీ స్కూల్ కి వచ్చిందా .. అని అడిగింది . స్కూల్ కి రాలేదు కానీ నీకో లెటర్ ఇమ్మంది అంటూ బేగ్ లో నుండి లెటర్ తీసి ఇచ్చాడు. లెటరా .. ఆశ్చర్యంగా చూస్తూ అందుకుంది . చదివిన ఆమె ముఖంలో త్వర త్వరగా రంగులు మారిపోయాయి . జనిత రూం లోకి వెళ్ళి చూసింది . అంతా ఖాళీగా కనబడింది. నిస్సత్తువగా అక్కడే బెడ్ పై కూలబడి పోయింది .
" ఏమైంది మామ్ ? "వేద కుదిపి అడిగేంతవరకూ తనే స్థితిలో ఉందో అర్ధం కానంత అయోమయంలో ఉంది ఆమె .
"ఏం లేదు ... నాన్నా ! జనిత మమ్మీ ప్రమోషన్ పై లండన్ వెళ్ళింది. అదే వ్రాసింది లెటర్ లో "
"నాకు చెప్పకుండానే వెళ్ళింది మమ్మీ" వెక్కుతూ అన్నాడు .
"త్వరగానే వచ్చేస్తుంది. మమ్మీకి ఇలాంటి టూర్ లు అలవాటేగా ! నీకు నేనున్నాను కదా! అంటూ దగ్గరికి తీసుకుంది కానీ జనిత మమ్మీ ఇక ఎప్పటికి రాదని, షైనీతో కలిసి ఎక్కడికో ఎగిరిపోయిందని చెప్పలేకపోయింది.
సెవెన్ థర్టీకి తెలుగు క్లాస్ కి తీసుకువెళ్ళింది. పిల్లలకి క్లాస్ చెపుతూ ఉంటే వింటూ రిసెప్షన్ లో కూర్చుండి పోయింది. మధ్యలో పిల్లలకి ఫిఫ్టీన్ మినిట్స్ టెస్ట్ పెట్టి టీచర్ బయటకొచ్చింది.
"ఏమిటీ ఊహా ! అంత డల్ గా ఉన్నావ్? " అని పలకరించింది. ఆమెతో ఊహ కి క్లోజ్నేస్ ఎక్కువే. జనిత విషయం చెప్పింది.
"అయ్యో ... ఇప్పుడెలా నీకు?" అనడిగింది. "జాబ్ ఉంది కాబట్టి కొద్దిగా పర్లేదు కానీ వేదని కూడా చూసుకోవాలి కాబట్టి ఆర్థికంగా ఇబ్బందే ! ఇలా ఉంటుందని నేనసలు ఎప్పుడూ ఊహించలేదు" అంది దిగులుగా .
"ఒకప్పుడు మన అమ్మల కాలంలో పురుషుడు చేసినట్లు చేసింది జనిత. నువ్వు కూడా అంత గుడ్డిగా నమ్మాల్సింది కాదు" అంది సానుభూతిగా .
"అసలు చిక్కంతా వేద ని పెంచడంలోనే ఉంది. ఏం చేయాలో ఏం చెప్పాలో ? చాలా ప్రశ్నలే వేస్తున్నాడు. చెప్పినా అర్ధం కాని వయసు "
"నేను ఒకటి చెపుతాను ఏమీ అనుకోవు కదా !"
"చెప్పండి టీచర్, మీ అడ్వైజ్ కూడా చాలా అవసరం నాకు "
"నచ్చినట్లు బ్రతికే హక్కు ఉన్నంత మాత్రాన, లైంగిక స్వేచ్చ వచ్చినంత మాత్రాన స్త్రీ పురుషుల మధ్య ఉండే సహజమైన సంబంధం రాణించినంతగా స్వలింగ సంపర్కాలు, సహజీవనాలు రాణించవు. పిల్లలు కావానుకుంటే తండ్రిని ఎన్నుకోవడం. తండ్రి ఎవరో సమాజానికి పరిచయం కాకుండా గుప్తంగా ఉంచడమూ , పిల్లల ఆలోచనలు, మానసిక స్థితి ఇవన్నీ ఆలోచించకుండా ముందుకి వెళ్ళిపోయారు మీరిద్దరూ . ఇప్పుడు జనిత తనదారి తను చూసుకుంది."
"పదేళ్ళ కాలం తనతోనే లోకంగా బ్రతికాను. పిచ్చిగా ప్రేమించాను. చాలా ఈజీగా వదిలేసుకుని వెళ్ళిపోయింది, వేద కూడా తనకి అడ్డనుకుంది" బాధగా కళ్ళు తుడుచుకుంది.
"బయలాజికల్ నీడ్స్ విషయంలో మానవుడికి మిగతా జీవులకి తేడా వుంది కదా ! విచక్షణ కూడా ఉంది. సహజమైన మానవ సంబంధాలన్నీ ప్రకృతి పురుషుడు లాంటివి . నిజానికి పురుషులు అచ్చులు లాంటి వారు . స్వరం కలవాడు. స్త్రీలు హల్లులు లాంటి వారు . అచ్చుల సాయం లేనిదే హల్లులు పలక లేనట్లే పురుషుల సాయం లేనిదే స్త్రీలు ముందుకెళ్ళలేరు. పరస్వరం కలవాల్సిందే ! స్వరాలూ రెండు రకాలు ఉన్నట్టు పురుషుడు హ్రస్వములు లాగా బిడ్డ పుట్టుకకి కారణంగానే మిగిలిపోవచ్చు. దీర్ఘములు లాగా దీర్ఘంగా కొనసాగవచ్చు . భాషైనా , బతుకైనా పరస్వరం జతకూడనిదే అందగించదు.
"పర స్వరం ! యెస్.. పరస్వరం కావాల్సిందే "అంది ఊహ .
"నేను చెప్పింది అర్ధమైందా? ఏదో నాకలవాటైన భాషలో, రీతిలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను" అంది టీచర్ .
ఊహ నవ్వి .. "అక్షరాలలో భావాన్ని బాగానే అర్ధమయ్యేవిధంగా చెప్పారు టీచర్ ".
"మానవ సమాజం క్రమపద్దతిలో సాగిపోవాలంటే తల్లి తండ్రి ఇద్దరూ అవసరం . మీలాంటి వాళ్ళు నేనిలాగే కంటాను, ఇలాగే పెంచుతాను అని అనవచ్చు కానీ, ఒంటరిగా పిల్లని పెంచడం ఒంటరిగా పిల్లని కన్నంత తేలికకాదు. ఒంటరి మహిళలు ఎదుర్కొనే సమస్య కంటే భిన్నమైన సమస్య ఇది. లక్షాధికారైనా లవణమన్నమే తింటాడన్నది ఎంత నిజమో, పుట్టిన ప్రతి బిడ్డా తన పుట్టుకకి కారణమైన తండ్రిని చూడాలనుకుంటాడు. అలా అడగకుండా ఉండటమంటే ఎంతో క్లారిటీ రావాలి. అది మీరు అనుకున్నంత తేలిక కాదు"
" వేదని నేను పెంచి పెద్ద చేస్తున్న కాలంలోనే జనిత రాదనీ, తన బిడ్డపై తనకి హక్కులు ఉన్నాయని అనదని గేరంటీ ఏమీ లేదు. చాలా సమస్యలున్నాయి, కానీ వాటిని ఫేస్ చేయడానికి సిద్దంగానే ఉన్నాను . వేదని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వొదులుకోను " స్ధిరంగా పలికింది ఊహ .
"మంచి నిర్ణయం" భుజం తట్టి మెచ్చుకుని ఆమె క్లాస్ కి వెళ్ళిపోయింది .
రాత్రికి తనని వాటేసుకుని పడుక్కున్న వేద ని చూస్తూ .. ఇప్పుడు వీడికి ఒక నాన్నని వెదకాలి. చాలా కష్టం అయినా వెతకాలి. దొరుకుతాడో లేదో, తన వయసు థర్టీ టూ యేగా, ట్రై చేయాలి. తనవంక ఆరాధనగా చూసే శ్యామ్ మనసులో మెదిలాడు .
(అడుగు వెబ్ సాహిత్య మాస పత్రిక ఆగష్టు మాసం 2017 సంచికలో ప్రచురితం )
1 కామెంట్:
చాలా బాగారాసారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి