12, ఆగస్టు 2017, శనివారం

కథ కాని కథ

ఫ్రెండ్స్ .. ఈ రోజు  నా చేదు అనుభవం గురించి చెప్పదలిచాను. నిజానికి  నా ఈ చేదు అనుభవం ఒక కథ అవుతుంది కూడా ..అయినా అనుభవాన్ని అనుభవంగానే చూడదల్చాను. ఇక్కడే share చేసుకోవడం ఎందుకు అంటే ఇక్కడ అంటే ఈ ఫేస్ బుక్ లో మసిలే వ్యక్తుల మానసిక రోగం ఇలా ఉంటుందని  మీకు అనుభవమవుతుందని...  
నాకు ఒక రోజు ఉదయాన్నే ఒక ఫోన్ కాల్ వచ్చింది. అపరిచితవ్యక్తి మేడమ్ బాగున్నారా ? అని పలకరించాడు. ఎవరండీ మీరు ? అనడిగినాను. అదేంటి మేడమ్ నన్ను గుర్తుపట్టలేదా ..నేను తిరుపతి నుండి మాట్లాడుతున్నాను అన్నాడు . నేను రాంగ్ నెంబర్ అని కాల్ కట్ చేసాను. మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఓపికగా మీరెవరో నాకు తెలియదు,అసలు నాకు తిరుపతిలోనే ఎవరూ తెలియదు అన్నాను. అదేంటి మేడమ్..లాస్ట్ సండే మీరు తిరుమలకి వచ్చారు కదా ..నేను పోలీస్ కానిస్టేబుల్ ని. మీకు చాలా హెల్ప్ చేసాను. మీరు నాతో చాలా క్లోజ్ గా కూడా మాట్లాడారు. ఇంతలోనే అలా మాట్లాడతారేమిటీ, మరీ మర్చిపోయినట్లు అన్నాడు. నాకు చిరాకు వచ్చేసి మళ్ళీ కాల్ కట్ చేసాను. మళ్ళీ కాల్ వచ్చింది. నాకు కోపం నషాళానికి అంటింది. నేను తిరుపతి రాలేదు, మీరెవరో నాకు తెలియదు, ఏ నెంబర్ కి చేయబోయి ఈ నెంబర్ కి చేసావో సరిగ్గా చూసుకోండి అని మర్యాదగానే చెప్పాను. సారీ..మేడమ్.. మీ పేరు  XXX కాదా ..అని అడిగాడు. కాదు బాబూ .. నా పేరు, ఊరు చెప్పాను. అతను నమ్మినట్లు కనబడలేదు. టచ్ లో ఉందాం అంటూ .. మీరే ఈ నెంబర్ నాకిచ్చారు. ఇంటికెళ్ళగానే ఇలా మారిపోతారని నేను అనుకోలేదు ..అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. బాబూ ..ఈ నెంబర్ ఫలానా నేను అనబడే స్త్రీ ది. నేనొక రచయిత ని. ఏదైనా కథ, కవిత చదివినప్పుడు నెంబర్ సేవ్ చేసుకున్నారేమో  అది చూసుకోండి అన్నాను. ఇంకా నమ్మినట్టు కనబడలేదు కానీ ఆలోచనలో పడి ..ఒక్క క్షణం తర్వాత నేను మళ్ళీ కాల్ చేస్తాను మీరు లిఫ్ట్ చేయండి మేడమ్ అన్నాడు. బాబూ! నేను ఫలానా వ్యక్తి అని మీకు రుజువు కావాలంటే ..ఇంటర్నెట్ లోకి వెళ్లి గూగుల్ సెర్చ్ చేయండి ..నా పేరు మీద. అక్కడ నా ఫోటో,బ్లాగ్ ,రచనలు,నివాసం, రచనల క్రింద  మొబైల్ నెంబర్ కనబడతాయి. అవి చూసిన తర్వాత అంటే నా ఫోటో చూసిన తర్వాత కూడా నేను తిరుపతి, తిరుమల లో మీకు కనబడ్డానని, మీరు హెల్ప్ చేసానని నేను మీకు నా ఫోన్ నెంబర్ ఇచ్చానని అనిపిస్తే కాల్ చేయండి అని చెప్పాను. మళ్ళీ సాయంత్రం కాల్ చేసి "సారీ మేడమ్.. మీరు కాదు కానీ నాకు పరిచయం అయిన ఆమె నెల్లూరు అని టీచర్ గా వర్క్ చేస్తున్నాని చెప్పారు. వీడ్కోలు సమయంలో ఫోన్ నెంబర్ అడిగితే ఈ నెంబర్ ఇచ్చారు" అని చెప్పాడతను. 
ఇలా ఉంటాయి కొందరి స్త్రీల తెలివితేటలు, బజారుతనాలు. ఎక్కడబడితే అక్కడ దొరికిన వాడిని అవసరాలకి ఉపయోగించుకోవడం, వాళ్ళతో క్లోజ్ గా మూవ్ కావడం .. ఆఖరికి ప్లేట్ తిప్పేయడం ..ఇతరుల నెంబర్ ఇచ్చి జారుకోవడం ..ఇవీ వీళ్ళ ప్రతివతా లక్షణాలు. అతనెవరో ఓపికమంతుడు కాబట్టి వివరంగా చెపితే అర్ధం చేసుకున్నాడు.  నిజం తెలిసాక కాల్ చేసి విసిగించినందుకు క్షమాపణ చెప్పాడు.   మరి ఆ టీచర్ అన్న వృత్తికే అనర్హురాలైన ఆ నీచ మనస్తత్వం కల స్త్రీ ని ఏమనాలి. ఆమె ఎవరో ..నాకు తెలుసు. అయినా లైట్ గా తీసుకుని వదిలేసా .. ఆమె నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉండవచ్చు, లేదా నా రచనలు చదువుతూ ఉండి ఉండవచ్చు. కచ్చితంగా నా ఫోన్ నెంబర్ తెలిసీ .. అతనికిచ్చి నన్ను ఇరికించాలని చూసింది మరి. బహుశా ఆమెది నెల్లూరు కాకపోవచ్చు ,టీచర్ కూడా కాకపోవచ్చు. అన్నీ అబద్ధాలే చెప్పి ఉండవచ్చు కూడా ! 
అమ్మలూ ..టేక్ కేర్.  కొందరు మగవాళ్ళే కాదు, కొందరు  ఆడవాళ్ళు ప్రమాదకరమైన వాళ్ళే !  అడిగినవారందరికీ ఫోన్ నెంబర్ ఇవ్వకండి. అందరూ నాలా ధైర్యవంతులు,సహనం కలవారు కాకపొతే చాలా సమస్యలు కొని తెచ్చుకున్నట్లే ! రచయితని కాబట్టి ..ఇలాంటి వాటిని ఎదుర్కొనే తెలివి, ఆత్మవిశ్వాసం ఉంది.  మరి మీరూ  వ్యక్తిగత వివరాలు ఇతరులకి  ఇచ్చేముందు ఆలోచించుకోండి . జర భద్రం.

ఇంకొక విషయం ఏమిటంటే ..ఫలానా వ్యక్తి  నెంబర్ నా దగ్గర ఉంది అంటే ..వాళ్ళతో నేను మాట్లాడుతున్నాని అర్ధం కాదు. వారి నెంబర్  చూసుకుని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండటానికి జాగ్రత్తపడి సేవ్ చేసుకోవడం , బ్లాక్ లిస్ట్ లో పెట్టటానికి కావచ్చు.  ఎవరి దగ్గరో నా నెంబర్ ఉంది అంటే వారు నాతో మాట్లాడుతుంటారు అని కూడా కాదు. వారి దగ్గర ఉంటే ఉండవచ్చు. వారు నాకు పరిచయం కూడా లేకపోవచ్చు. 
 
కొంతమంది కాలక్షేపానికి ఫోన్ చేసి  మాట్లాడి అటు విషయాలు ఇటు ఇటు విషయాలు అటు ఇంకా నాలుగు లేనిపోనివి జేర్చి అనకాపల్లి నుండి అమెరికా దాకా మోసే వాళ్ళు కాలాన్ని వృధాచేయకుండా మంచి పనులకి ఉపయోగిస్తే మరీ మంచిది కదా !