ఒకప్పుడు వానాకాలం వస్తుందంటే
కళ్ళు కలల సీతాకోకచిలుకలయ్యేవి
ఊహలను మాలలుగా అల్లడం అలవాటేమో
తుది మొదలు సృహ వుండేది కాదు
రాతి పుష్పాలపై తుంటరి తుమ్మెదలు
ప్రదక్షిణలు చేసి చేసి విసిగిపోయినట్లు
మధువుకై శోధించి స్వప్నించి తుదకు
వరుణుడిని అర్ధించి కడకు
అమృతంతో తడిసిన పూలరెక్కలపై విహరించి
తూలి తూగి సోలిపోతాయని..
పూల గోష్ఠి కి తుమ్మెదల చెవులనుండి రక్తం కారిందని
మకరందం గ్రోలే సీతాకోకచిలుకలు
పూల రంగులకు మూర్చిల్లి
తమ అయిదు నెలల ఆయువును త్యాగం చేసాయని..
తుమ్మెదలకు పరిమళాన్ని జల్లుకునే పనిలేదనో
ఇలా యేవేవో..
ఇప్పుడైతే…
ఇతర ప్రాణులు అర్దం చేసుకున్నట్టు
వెలుగు నీడల భాషను అర్దం చేసుకోలేని
మనిషినేమో
పసితనం అక్కడే ఆగిపోయి వుంటే
యెంత బాగుండేదని అత్యాశ పెనుగులాట..
నిత్యం రంగుల పండుగను చూస్తూ
యెగరలేని రాతి సీతాకోకచిలుకను నేను
అకాల వృద్దాప్యపు చొక్కా తొడుక్కున్న
నత్తగుల్లను నేను.
18/05/2022.
18/05/2022.