ఎవరున్నారని..
అన్యమనస్కంగానే ఆఫీస్ లో వర్క్ చేస్తున్న శ్రావ్య కి మనసంతా పాప చుట్టూనే తిరుగుతుంది.
జ్వరం తగ్గింది లేదో, రెండవ మోతాదు సిరఫ్ యిచ్చారో లేదో! కొంచెమైనా పాలు త్రాగిందో లేదో, తప్పని సరిగా హాజరు కావాల్సిన పని రోజులు. సెలవు పెట్టడానికి వీలు లేని సంవత్సరాంతపు లెక్కలు.
చేస్తున్నకొద్దీ పని తవ్వుకుని వస్తుంది. ప్రక్కవాళ్ళు చేసే పనిని కూడా నైపుణ్యం అని కితాబు విసిరి అరగ రుద్ది చేయించే మేనేజర్.
మాములుగా అయితే అభ్యంతరం చెప్పేది కాదేమో, ఇప్పుడు పసిగుడ్డు అలా జ్వరంతో పడివుంటే చూసుకునే వీలు లేక మనసు బాధగా మూలుగుతుంది. పేగు పాశం మెలిపెడుతుంది. వాసు కి కాల్ చేసి ఒకసారి పాపని చూసి రమ్మని చెపితే! మనసులో అనుకుంది.
ఊహు ప్రయోజనం లేదు అనుకుంటూనే..మళ్ళీ మొబైల్ చేతిలోకి తీసుకుని నెంబర్ డయల్ చేసి కాల్ బటన్ నొక్కబోయి ఆగిపోయింది.
పిచ్చి మొహం! నిన్న నువ్వు కాల్ చేసి చెపితే మాత్రం అతను యే౦ పట్టించుకున్నాడు గనుక? ఈ రోజు మళ్ళీ చెప్పాలనుకున్నావ్..అని మనసు చీవాట్లువేసింది. ఉష్..అని నిట్టూర్చి ..క్రెష్ కి కాల్ చేసింది..
"పాపకి యెలా ఉంది" అడిగింది
క్రెష్ నిర్వాహకురాలు సుధ స్నేహశీలి. తన ఆదుర్ధాని అర్థం చేసుకుని "పాపకి మీరు చెప్పినట్లు కరెక్ట్ టైం కి మందు యిచ్చాను. జ్వరం తగ్గింది. నిద్రపోతుంది. మీకేం కంగారు వద్దు. జాగ్రత్తగా చూసుకుంటాను. మాములుగా సాయంత్రం వచ్చి తీసుకుని వెళ్ళండి” అంది.
కాస్త మనసు శాంతించింది. లంచ్ టైములో కొలీగ్, స్నేహితురాలు లత అడిగింది "పాపకి యెలా వుంది? ఇంట్లోనే వుంచి వచ్చావా? "అని.
“లేదు, క్రెష్ లోనే వదిలివచ్చాను.జ్వరం తగ్గింది పర్వాలేదు" అని చెప్పింది.
“మీ అమ్మ గారికి అనారోగ్య సమస్య లేకుంటే ఆవిడే చూసుకునేవారు. ఆవిడ అనారోగ్యం మీకు పెద్ద యిబ్బంది తెచ్చిపెట్టింది”
ఇబ్బంది యేముంటుంది. పిల్లలని తల్లిదండ్రులేకదా చూసుకోవాలి. పాపం అమ్మ మాత్రం యెవరి పిల్లల్నని చూస్తుంది. అన్నయ్య పిల్లలిద్దరిని నాలుగేళ్ళు వచ్చేదాకా పెంచిచ్చి అలసి పోయింది.అయినా పిల్లలని పెంచే అలవాటు పోయిన దశలో పిల్లని పెంచడం యెంత కష్టం? ఏదో కాసేపు యెత్తుకుని ముద్దు చేసి లాలించడానికినూ అచ్చంగా అమ్మలా పెంచడానికీనూ యెంత తేడా!? పాల బాటిల్స్ కడగడం వాళ్లకి యే మాత్రం బాగోకున్నా హాస్పిటల్ కి తిప్పడం రాత్రుళ్ళు మెలుకువగా వుండి చూసుకోవడం యెంత కష్టం. వాళ్ళ బాధని మనం అర్ధం చేసుకోవాలి. మన వుద్యోగాలు,మన సంపాదనలు, మన సరదాల కోసం వాళ్ళని అరగదీస్తున్నాం.
కోడలు వుద్యోగం చేస్తుందని ఆమెకి సాయపడాలని ఆరు సంవత్సరాలు నడుం విరిగేలా చాకిరి చేసి యిద్దరి పిల్లలని పెంచి యిచ్చింది. అయినా కోడలికి యింత కృతజ్ఞత లేదు. ఈ మధ్య మంచి ట్రీట్మెంట్ కోసమని హైదరాబాద్ వెళితే.. ఒక వారం రోజుల లోపలే తను బండెడు చాకిరి చేయలేకపోతున్నానని పెద్ద గొడవ చేసిందట.అమ్మ-నాన్న
వింటూన్నారనే జ్ఞానం కూడా లేకుండా అన్నయ్యని సాధించడం చూసి వాళ్ళే అక్కడ వుండలేక వచ్చేసారు.
అవసరం వున్న నీకు సాయంగా వుండలేకపోయాను. పరాయి బిడ్డకి చాకిరి చేసి చేసి అలసిపోయాను పనివాళ్ళకి వున్నపాటి విలువ కూడా సంపాదించుకోలేకపోయాను అని అమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంటే వింటున్నప్పుడు చాలా బాధగా వుంటుంది.
సర్ది చెపుతూ నువ్వే వదినని అర్ధం చేసుకోలేదేమో, అయినా వదిన పరాయి బిడ్డని అంటావెందుకు? అయినా నువ్వు నీ కొడుకు బిడ్డలనే కదా పెంచి పెద్ద చేసావు. ఎందుకమ్మా అలా అనుకుంటావ్ అని సర్ది చెపుతుంటాను అని చెప్పుకొచ్చింది.
మన ఆడవాళ్ళలో కూడా కొంత మందిలో యెంత చదువుకుని వుద్యోగాలు చేస్తున్నా సంస్కారం, కృతజ్ఞత వుండదు. మీ అమ్మగారి లాంటి అత్త గారిని కళ్ళకద్దుకుని చూసుకోవాలి. మరి మీ వదిన తీరు యేమిటో! అంది లత.
నేనయినా అమ్మని తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ యిప్పించాలని మనసులో వున్నా ఆచరించి చూపలేను. అసలు అమ్మ యిక్కడికి రాదు కూడా. మా అత్త గారు నా డెలివరి టైములో చేసిన గొడవ నేను మర్చిపోలేదు. అమ్మని నాన్నని వూరికే యిక్కడ కూర్చుని తిని పోవడానికి వచ్చినట్లు యెన్ని మాటలు అన్నారో, కాన్పుకి పుట్టింటికి వెళ్ళక వారిని యెన్ని మాటలు అనిపించానో !
అమ్మ కూడా నాకు సాయంగా ఉండాలని యెంతగా అనుకుందో, నడుం నొప్పి బాధిస్తున్నా నాకు,పాపకి సేవలు చేయాలని యెంత ఆత్రుత పడిందో?మా అత్తగారి మాటలకు గాయపడి నేనే వాళ్ళని పంపించేసాను. వాళ్ళు వెళ్ళిన రెండు రోజులకే అత్తగారు వెళ్ళిపోయింది. నెలరోజుల పసి గుడ్డుతో యెంత అవస్థ పడ్డానో వాసుకి అంతా వినోదంగా వుంటుంది.
ఇంటి లోన్ తీసుకుని వున్నాను కాబట్టి ఉద్యోగం మానేయలేను. పైగా "వాసు” సేలరీ కూడా బాగా కట్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో జాబ్ మానేయలేను.
వాసుకి స్నేహితులు తప్ప యెవరూ, యేమీ పట్టవు. స్నేహితులు అతని చేత ష్యూరిటీ సంతకాలు యిప్పించుకుని నల్లపూసై పోయారు. ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీ వారికి వాసు జీతంలో నుండి ఆ మొత్తం కట్ అవక తప్పడం లేదు.ష్యూరిటీ పెట్టినందుకుగాను తానే ఆ లోను అమౌంట్ లు తీర్చక తప్పని పరిస్థితి.రాత్రుళ్ళు ఆలస్యంగా రావడం మామూలైపోయింది. ఈ మధ్య డ్రింక్ కూడా చేస్తున్నాడు.
అసలు ఫ్రెండ్స్ అంటే యెవరు? అవసరానికి అలా ష్యూరిటీ సంతకాలు పెట్టించుకుని మొహం చాటేసేవారా? స్నేహం ముసుగులో అలా ప్రవర్తించే వాళ్ళు నిజమైన స్నేహితులేనా? అసలు మనుషులపై నమ్మకమే పోతుంది. ఎవరిని నమ్మాలో యెవరిని నమ్మకూదదో అర్ధం కావడం లేదు.
ఏదైనా ప్రశ్నిస్తే ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళాను తప్పేముంది అంటాడు. ఆ ఫ్రెండ్స్ మూలంగానే కదా చాలా యిబ్బంది పడుతున్నాం అంటే నాకు ఫ్రెండ్స్ ముఖ్యం అంటాడు.
వాదనకి కాకపోయినా వాస్తవం తెలుసుకుంటాడని "మరి నన్నెందుకు చేసుకున్నావ్.."అని అడగాల్సి వస్తుంది.
ఓహో.. యిప్పుడు నన్ను నువ్వే కదా పోషించేది, అందుకే నీకు లోకువైపోయాను అంటాడు.అలిగి అన్నం తినడు. రెండు రోజులు బ్రతిమాలించుకుని అలా అడగడం నా తప్పని చెంపలు వేసుకుని సారీ చెపితే గాని శాంతించడు. తప్పు కాకపోయినా సారీ చెప్పడం, కుటుంబ బాధ్యత మోయడం, పాపను చూసుకోవడం వుద్యోగం చేయడం అన్నీ చేసుకుంటూనే వున్నాను. అసలు మాది ప్రేమ వివాహమేనా అన్న అనుమానం వస్తుంది. అమ్మ నాన్నని వొప్పించి యెంత ఇష్టపడి చేసుకున్నాం. కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా వరుసగా తన పరిస్థితిని బాధగా చెప్పింది.
మళ్ళీ స్నేహితురాలి భుజంపై చేయి వేసి ఓదార్చుతూ పక్కనే వచ్చి కూర్చుంది లత.
“అసలు నేనే పొరబాటు చేసినట్లు ఉన్నాను . సొంత ఇల్లు అమరుతుందని ఆశతో వుద్యోగం చేస్తానని సంబరపడ్డాను కానీ ఆ ఇల్లు మా మధ్య వైరుధ్యాలు పెంచుతుందని అనుకోలేదు. నేను అప్లై చేయడం వెంటనే జాబ్ రావడం అదృష్టం అంటారు. అలాగే అమ్మ వాళ్ళు యిచ్చిన డబ్బుతో యిల్లు కొనడం,దానికి పూర్తి డబ్బు సమకూరకపోతే లోన్ తీసుకోవడం నా జాబు ష్యూరిటి పై లోన్ ఇవ్వడం వలన నా పేరుతొ యిల్లు రిజిస్టరై వుండటం సరదాకి యిల్లు నాది కదా అనడం కూడా నచ్చలేదు. వాసుకి ఆ మాటే బాగా నాటుకుపోయి నూన్యతా భావం వచ్చేసింది. నన్ను చాలా నిర్లక్ష్యం చేస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నాను. కన్నీళ్లు కారుతుండగా అంది.
ఓదార్పుగా స్నేహితురాలి భుజంపై చేయి వేసింది
నిన్నటికి నిన్న క్రెష్ నుండి పాపకి బాగా జ్వరంగా వుందని కాల్ చేసారు. తను ఖాళీగానే వున్నాడు. నేను వెంటనే కాల్ చేసి పాపని యింటికి తీసుకుని వెళ్ళు వాసు. నేను హాస్పిటల్ లో అపాయింట్ మెంట్ తీసుకుని యింటికి వస్తాను అని చెపితే నాకు తీరికలేదు. ఫ్రెండ్స్ తో వేరే పని మీద బయటకి వెళ్ళాలి, అవన్నీ నువ్వే చూసుకో అని చెప్పి ఫోన్ కట్ చేసాడు. వర్కింగ్ అవర్స్ అయ్యేవరకు పాపకి యెలా వుందో అని నేను యెంత టెన్షన్ అనుభవించానో,ఇలాటి నిర్లక్ష్యాన్ని యెలా అర్ధం చేసుకోవాలి, తండ్రిగా అతనికి యే౦ పట్టదా?
-క్రెష్ కి వెళ్లి పాపని తీసుకుని హాస్పిటల్ లో చూపించుకుని యింటికి వెళ్లేసరికి వాసు యింట్లోనే వున్నాడు. తీరిగ్గా టీవి చూసుకుంటూ. కూరగాయలు లేవు. ఉదయం చేసిన కూరలు వేసి పెట్టానని బేగ్ వేసుకుని వుద్యోగాలు వెలగ బెట్టడం కాదు. మొగుడు కంచంలో యే౦ కావాలో కూడా చూసుకోవాలని పరుషమైన మాటలు.ప్రక్కనే వున్న కూరగాయల మార్కెట్ కి వెళ్లి కూరలు తెచ్చే తీరిక తనకి వుండదు.నేను మాత్రం అన్ని పనులు చేయాలనుకుంటాడు. ఎందుకింత క్రూరమైన హింస? నాకు అర్ధం కావడం లేదు.
“ఉదయమే.. జ్వరంతో వున్న పాపనేసుకుని వెళ్లి కూరగాయలు తెచ్చి వంట చేసి అతనకి లంచ్ బాక్స్ సర్ది టిఫిన్ రెడీ చేసి టేబుల్ పై పెట్టి.. పాపతో సహా బయటపడి మనసు పీకుతున్నా జ్వరంతో వున్న బిడ్డని క్రెష్ లో వదిలేసి వచ్చాను. ఈ వుద్యోగం అవసరమా అనిపిస్తుంది” మనసులో బాధ౦తా చెప్పుకుంది.
" ఊరుకో.. యిలా యెన్నైనా సర్దుకుపోవాలి ఆకాశంలో సగం మనం " చెప్పింది నవ్వుతూ.
"అవును కదా"అని నవ్వుతూ శ్రావ్య.
లంచ్ బాక్స్ తీసి అలా యేదో కెలికి తిన్నాననిపించింది. సాయంత్రం వరకు ఆలోచన బరువుతో అలాగే పని చేసుకుని బయటపడి క్రెష్ కి వెళ్ళింది.
క్రెష్ సుధ "మేడం పాపని వాళ్ళ నాన్నగారు వచ్చి మద్యాహ్నమే తీసుకుని వెళ్ళారు " అని చెప్పింది.కొంచెం ఆశ్చర్యం,సంతోషంతో యింటికి దారితీసింది. బస్ లో సీటు దొరికింది. విండో సీట్ లో కూర్చుని కళ్లు మూసుకుంది. ఆమె కనుల ముందు మనోహర దృశ్యం.
***********
ఇంట్లోకి ఫ్రవేశిస్తూనే…
వాసు పాపని ఆడిస్తూ కనపడ్డాడు. ఆమె ఆడగక ముందే అతనే చెప్పాడు. “పాపకి జ్వరం తగ్గిందిలే, కంగారు పడకు. పాపకి స్నానం చేయించాను.నువ్వు ఫ్రెష్ అయి రా” అన్నాడు.
పాపని అతని చేతుల్లో నుంచి తీసుకుంది.పాప మొహం జ్వరం తగ్గి తేటగా వుంది. స్నానం చేయించి వుండటం వల్ల పువ్వులాగా ప్రెష్ గా వుంది. కొంచెంసేపు అలా చూసి పాపని అతనికి యిచ్చి ఆమె ప్రెష్ అయి వచ్చింది.
“శ్రావ్యా! నేను కాఫీ కలిపాను,త్రాగి చూడు” చెప్పాడు. మళ్ళీ ఆశ్చర్యం .
“ఆ రెండు కళ్ళల్లో యిన్ని ఆశ్చర్యాలు చూపకు. నువ్వు నిన్న యెంత నొచ్చుకున్నావో అర్ధం అవుతూనే వుంది.నేను రాత్ర౦తా ఆలోచించాను. నిన్ను బాధపెడుతున్నాని అర్థమవుతుంది. నేను
మారాలనుకుంటున్నాను”.
మౌనంగా వింటుంది శ్రావ్య
“ఉదయాన్నే లేచి కూరగాయలు అవి తీసుకొచ్చి నీకు హెల్ప్ చేద్దామనుకున్నాను. అలవాటు లేక మెలుకువ రాలేదు నేను నిద్ర లేచేటప్పటికే నువ్వు ఆఫీస్ కి వెళ్ళిపోయావు. పాపకి జ్వరం తగ్గిందో లేదో ఆలోచించాను నాకు సిగ్గుగా అనిపించింది” అపాలజిక్ గా అన్నాడు .
అతని మాటల్లో నిజాయితీకి చలించిపోయింది శ్రావ్య,
మళ్ళీ వాసునే మాట్లాడసాగాడు.
నేను నిన్ను సాధించాలని, దూరం పెట్టాలని యేదో వొక మాటలు అంటున్నాననుకున్నాను కానీ నువ్వు చేసే శ్రమ, మన యింటి కోసం నువ్వు పడే తాపత్రయం అన్నీ అర్ధమయ్యే కొద్ది నీ పై జాలి కల్గింది. పెళ్ళికి ముందు మన నాలుగేళ్ల ప్రేమలో యెప్పుడూ కస్సుమనే నీలో యింత ఓర్పు యెలా వచ్చిందో! ఆశ్చర్యంగా అనిపిస్తుంది కూడా. నాకు ఫ్రెండ్స్ మాత్రమే కాదు నువ్వు,పాప కూడా ముఖ్యమే !అయినా మనకిప్పుడు యెవరున్నారు, అదే యిక్కడ యెవరున్నారని?
“ఎవరున్నారని నాకైనా.. యెవరున్నారు నీకైనా యెవరున్నారని నీలా నాకైనా” నవ్వుతూ పాట అందుకున్నాడు. ఆమెని రారమ్మని చేయి చాచాడు.
శ్రావ్య అతని బాహువుల మధ్య యింకో పాపలా సంతోషంగా వొదిగిపోయింది.
*********
కండక్టర్ గట్టిగా హెచ్చరించాడు ఫలానా స్టేజ్ లో దిగివాళ్లు ముందుకు రావాలని…
ఉలికిపడి లేచింది. ఇంట్లోకి వెళ్లకుండానే కారిడార్ లో పాపను ఎత్తుకుని తల్లి కనబడింది. ఆశ్చర్యపడలేదు.
నువ్వు ఎప్పుడొచ్చావమ్మా అంది.
“మధ్యాహ్నం వచ్చానమ్మా…రాగానే అల్లుడికి ఫోన్ చేసి చెప్పాను. పాపను క్రెష్ నుండి తీసుకొచ్చేయమని.
నా బంగారుతల్లిని చూసుకోవడానికి ఈ అమ్మమ్మ లేదూ”
శ్రావ్య ఊహలు తల్లకిందులయ్యాయి. కలలెన్నటికీ నిజమవవేమో! వాస్తవం ముల్లై గుచ్చుతుంది. భారంగా నిట్టూర్చింది.