28, ఏప్రిల్ 2012, శనివారం

దానికి ఓ..లెక్క ఉంది "లెక్కల కథ"

అసలు మనుషులంటే లెక్క లేకుండా పోతుంది.. అంటారు కాస్త పెద్దరికం కొని తెచ్చుకుని.
ఈ ఇంట్లో నా మాటకి లెక్క లేదు..అంటుంది..ఓ..ఇల్లాలు ముక్కు చీదుకుంటూ,కొంగుతో కళ్ళు వత్తు కుంటూ ..
రోడ్డు  ఎక్కామా !? అది వన్ వే అయితే ఏమిటీ .. కాకపొతే ఏమిటీ ...ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు లెక్క ఉందా వాళ్లకి అంటాం .. సవ్యంగా నడవని వారిని, ఇతరుల మాటలని లక్ష్య పెట్టని వారిని.

అసలు లెక్క లేకుండా ఉండటం ఉండదేమో! మనిషన్నాక సంతానంలో ఎన్నో వాడో.. లెక్క కావాలి. కాస్త లెక్కలలోనే అటు ఇటుగా ఉండవచ్చునేమో కానీ లెక్క మాత్రం ఉంటుంది కదా!
మనుషులకి మీరున్నారని అనడానికి ..జనాభా లెక్కింపు, పశు సంపద లెక్కింపు,వాహనాలు లెక్కింపు,పులులు లెక్కింపు.. అన్నీ లెక్కలోనివి. ఓహ్ ఎన్ని లెక్కలు. !!

అలాటి లెక్కలు వేసుకునే వాళ్ళ గురించి ఓ..మాట.

లెక్కలేదని దిగులు పడకుండా మనని సజీవంగా ఉన్నామని గుర్తించ దానికి ఏమో.. సంవత్సరానికి నాలుగైది సార్లు జనాభా లెక్కలు వేయడానికి వస్తారు.
ఈ రోజు.. ఉదయాన్నే జనాభా లెక్కలు వాళ్ళమీ అని ఓ..ఇద్దరు స్త్రీ మూర్తులు ..వచ్చారు.అప్పుడు నేను పూజలో ఉన్నాను. మా వర్కర్ అమ్మాయితో..ఒక్క అయిదు నిమిషాలలో వస్తాను. ఈ లోపు.. ప్రక్కన వివరాలు రాసుకుని రండమ్మా ..అని చెప్పమని చెప్పాను.
ఈ అమ్మాయి వెళ్లి మేడం పూజ చేసుకుంటున్నారు. అంతలోకి ప్రక్కన వ్రాసుకోమని చెప్పారు అని చెప్పింది.
అందులో ఒకామె  మేము ఇంటి దగ్గ్గర పూజలు చేసుకునే  వచ్చాము అన్నీ చేసుకుని వచ్చాము తొందరగా రమ్మని చెప్పమ్మా.. అంది.
అంతటితో..ఆగకుండా.. మేము ఏదో భిక్ష గాళ్ళని చూసినట్లు చూస్తారు.అప్పుడు రండి..ఇప్పుడు రండి అని చెపుతారు..అంది నొచ్చుకున్నట్లు.
నాకు కోపం వచ్చేసింది. నేను చెప్పినది ఏమిటి? ఆమె మాట్లాడుతుంది ఏమిటీ..అనుకుని.. మా వివరాలు వ్రాయవలసిన అవసరం లేదు మీరు వెళ్ళిపొండి..అని చెప్పాను. కోపం ఆంతా నడకలో చూపిస్తూ. ప్రక్కకి వెళ్ళారు.
నాకు మరు క్షణంలోనే..అయ్యో..అనిపించింది. వాళ్ళు అన్నది నిజమే కదా..! వాళ్ళ ఇంటి పనులు అన్నీ చూసుకునే కదా వారి విధులు నిర్వర్తించడానికి బయలు దేరి వచ్చి ఉంటారు. అసలే ఎండల కాలం.. వాళ్ళకి కొంచెం సహకరిస్తే సరిపోయేది.అనవసరంగా మనసు నొప్పించి ఉంటాననే  ..ఆ ఆలోచనలతోనే పూజ మీద మనసు లగ్నం కాక ..ముగించుకుని వచ్చేసాను. ఆ జనభా లెక్కలు వ్రాసుకునే వారు అక్కడ ఇంకొకరి వివరాలు వ్రాసుకుని ప్రక్కన వారి వివరాలు కోసం తొందర పెడుతున్నారు..ఆ ఇంటి ఆవిడ బాత్ రూం లో ఉన్నారు. కొంచెం ఆగమని చెప్పింది. అక్కడా  ఆమె అలాగే మాట్లాడింది. నేను చూస్తూ ఊరుకున్నాను. మరి కొంత సేపటికి మరి ఇద్దరు వచ్చారు. జనాబా లెక్కలు అన్నారు. సరే కూర్చుని రాసుకోండి అని చెప్పాను. మా ఇంట్లో వారి వివరాలు వ్రాసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ అడిగారు. అవి కూడా అవసరమా అని అడిగాను. అవసరమే అని చెప్పారు. వీళ్ళకి పోన్ నంబర్  అవసరం ఏముంటుంది?   ఎందుకబ్బా.. అని మనసులో అనుకుని ఓహో.. పోన్ ఉందా లేదా అన్నదానిని బట్టి ఆర్ధిక పరిస్థితి ని లెక్కవేస్తారు గాబోల్సు అనుకున్నాను. తర్వాత కులం గురించి అడిగారు. నాకు కొంచెం తిక్క గా తోచి..ఈ సారి జాతీయత,మతం.కులం విషయాలు మూడు కలిపి ఒకే సారి చెప్పేసాను. మీకు పంచదార కార్డ్ ఉందా అని అడిగారు. నాకు నవ్వు వచ్చింది. తల ఊపాను..ఉంది అన్నట్లు.
వైట్ కార్డ్ అని అడిగారు ప్రశ్నార్ధకంగా.. చూస్తూనే!
నవ్వాపుకుంటూ పింక్ కార్డ్ ఉంది. ఇదే గ్రామ పంచాయితీ లో పద్నాలుగు ఏళ్ళ నుండి పింక్ కార్డ్ ఉంది అని చెప్పాను.
ఎందుకంటే .. మూడు అంతస్తుల భవనానికి యజమాని అయి ఉండి, పది ఎకరాలు పొలం ఉన్న ప్రక్కింటి వారు వైట్ కార్డ్ హోల్డర్. . ఆరోగ్య శ్రీ పధకం క్రింద నెల రోజులు పాటు ఓ..ప్రముఖ వైద్య శాలలో వైద్య సేవలు పొంది..అతి పేదవారిగా చెలామణి అయిపోతూ .. ఇప్పుడు కూడా ఒక రూపాయికి కిలో బియ్యం చొప్పున తెచ్చుకుంటున్న వారిని చూస్తే.. నాకు ప్రభుత్వ గుడ్డితనం మీద విపరీతమైన ద్వేషం కల్గుతుంది. అనర్హులై  ఉండి వేరొక అర్హులైన ప్రజలకి చెందవలసిన పధకాల ఫలితాలను అందుకుని ప్రభుత్వాన్ని మోసగించే వారిని చూస్తే వెగటు కల్గుతుంది.

అందుకు కారణం ..చిత్త శుద్ధి లేని గ్రామ పరిపాలనా అధికార గణం..అయిదు వందల రూపాయలు లంచం తీసుకుని వైట్ కార్డ్ పొందేందుకు అర్హులుగా వ్రాసి పడేస్తారు. ఇందిరా గృహ పధకం,వితంతు పెన్షన్లు..ఇలా అన్ని పథకాలలోను.. ప్రజా ప్రతినిధుల హవాతో..వారి వారి అనునూయులకి ఫలితాలు దక్కే విధంగా యధాశక్తి ప్రయత్నం చేస్తారు.
ఇలా నా ఆలోచనలు సాగుతుండగా ..

జనాభా లెక్కలు వ్రాసుకునే వారు..మేడ మీద భాగాల వివారాల కోసం నన్నడిగారు.
పైకి వెళ్లి వ్రాసుకోమని చెప్పాను. మేము వెళ్ళ లేము కాస్త అందరి పేర్లు మీరు చెప్పేయండి..అని అడిగారు. అలా చెప్పటం భావ్యం కాదు.ఎవరి వివరాలు వాళ్ళే చెప్పాలి కదా .. అయినా అందరి వివరాలు నాకు తెలియదన్నాను. కొత్తగా వచ్చారా మేడం అని అడిగిడి ఒకావిడ..
లేదు.. చాలా కాలం గా ఇక్కడే ఉంటున్నాము. అయినా సంవత్సరానికి ఇలా జనాభా లెక్కలు అంటూ నాలుగైదు ఇదు సార్లు వస్తారు.. ఇలా లెక్కలు వేసుకుని ఏమి చేస్తారు..అని అడిగాను. మా డ్యూటీ ఇంతవరకే నండీ అని చెప్పి నేను అడిగినదానికి వివరాలు చెప్పకుండానే..

ప్రక్క ఇంటికి వెళ్ళారు.ఆమె టీచర్ గా వర్క్ చేస్తున్నారు. జనాభా లెక్కలు అనగానే .. ఆమె మీ ఐడెంటి కార్డ్ చూపండి అని అడిగారు. వాళ్ళు మేము ఐడెంటి కార్డ్ మర్చిపోయి వచ్చామని చెప్పారు. ఆ టీచర్ నిర్మొహమాటంగా కార్డ్ చూపిస్తేనే మా వివరాలు చెపుతాను. రేపు కార్డ్ తీసుకుని రండి అని మొహం పైనే తలుపు వేసేసారు.
వంట ఇంటి ప్రక్క గోడ వద్దకి వచ్చి.. "ఈ లెక్కలన్నీ రాజకీయ పార్టీ వాళ్ళు వేయిస్తున్న లెక్కలండీ!.
కులం,మతం..ఈ ప్రాతిపాదిక పైన వారి వోట్ బ్యాంకు బలాన్నిలెక్కించుకొవడానికి ..ఇలా లెక్కలు వేయిస్తారు.
వీరికి రోజుకి వంద రూపాయల లెక్కన ఇచ్చి వివరాలు సేకరించడానికి ఇలాటి వాళ్ళని పంపుతారు. మూడు నెలల క్రితమే కదా ఆధార్ కార్డ్ కోసం జనాభా లెక్కలు రెండు సార్లు లెక్కించారు. ఇక ఇప్పుడు జనాభా లెక్కలు ఉండవు. ఉంటే మాకు కూడా డ్యూటీలు వేసేవారు " అని చెప్పారు ఆవిడ.
ఆశ్చర్య పోవడం నా వంతు అయింది. ఇవండీ లెక్కలు సంగతి.
దానికి ఓ..లెక్క ఉంది..నాకు కొంచెం తిక్క ఉంది.. అని అనుకోవాలేమో కదా!

ప్రజలు గొర్రెలు మందలు ..అన్నమాట నిజం అనుకోవాలేమో! గొర్రెల మంద లెక్క కూడా అవసరమే కదా!

(పశువుల లెక్క,పులుల లెక్క,గొర్రెల మంద లెక్క ..అని ఉదాహరించినందుకు.. క్షమాపణలు చెప్పుకుంటూ.. నాబోటివాళ్ళ కన్నా  ఆ జంతువులే కాస్త ఎక్కువ చైతన్యంతో ఉన్నాయేమో అనుకుంటూ..)
దానికి ఓ..లెక్క ఉంది."లెక్కల కథ" ఇది.

5 వ్యాఖ్యలు:

కాయల నాగేంద్ర చెప్పారు...

వనజ గారు "లెక్కల కథ"లో లెక్కలేనన్ని కథలు చాలా బాగా చెప్పారు. ఇలా లెక్కించడం వల్లే ప్రభుత్వ లెక్కలన్నీ తప్పుడు తడకలా ఉంటున్నాయి. ఈ లెక్కలవల్ల రాజకీయ నాయకులకే ఉపయోగం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. లెక్కలు ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయడానికే పనికొస్తున్నాయి. ప్రభుత్వ లెక్కలను ఏదో మొక్కుబడిగా కాకుండా దేశప్రయోజనాలను దృష్తిలో
పెట్టుకుని నిర్వహిస్తే బాగుంటుంది.

oddula ravisekhar చెప్పారు...

సామాజిక సమస్యలపై దృష్టి పెట్టారు.బాగుంది.కొనసాగించండి.

శశి కళ చెప్పారు...

అవును ఇలాటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అక్కా...మంచి పోస్ట్ వ్రాశారు

వనజవనమాలి చెప్పారు...

naagendra gaaru.. Thank you very much.. andee!

@Raja shekhar gaaru.. Thank you very much..Sir!

@Shashi baagunnaaraa!? thank you very much.

జలతారువెన్నెల చెప్పారు...

వనజ గారు, ఈ పోస్ట్ మీది చాలా బాగా నచ్చిందండి మీది.మీరు ఎమన్నా బుక్స్ రాసారా?