9, ఏప్రిల్ 2012, సోమవారం

ఆమె విజయం - అతని అయోమయం

కొత్తగా పెళ్ళైన జంట.  కొత్త కాపురం. జంట నగరంలో ఉద్యోగ జీవితం.
ఒక ఆదివారం..ఇలా ..
ఏమండీ!
"..... "
అబ్బ..మిమ్మల్నే నండీ!
ఉలకరు పలకరు.. ఆఫీస్, చానల్స్,న్యూస్ పేపర్   జీవితమంటే  ఇదే కాదండీ ..
కాస్త అక్కడి నుండి లేచి ఇలా వచ్చి ఇంట్లోకి ఏం అవసరమో చూడవచ్చు కదా! అంది విసుగ్గా భార్య.
"ఏమిటోయి? ఆదివారం కూడా రిలాక్స్ గా ఉండనివ్వవు. ఏం కావాలో అన్నీ నువ్వే చూసుకోవచ్చును కదా! సేలరి అంతా నీ  హోల్డింగ్ లోనే ఉంటుంది. ఇక నాకు బరువు భాద్యతలు ఎందుకు చెప్పు?  అన్నాడు భర్త.
" అబ్బ ! ఏం సెలవిచ్చారండి.  ఆదివారం మీకేనా ? వారమంతా ఇంటా బయటా చాకిరి చేసి వారాంతపు గాడిద చాకిరి   ఆదివారం స్పెషల్. కాస్త మీరు అటు  వెళ్లి ఎలెక్ట్రిసిటి బిల్ ,పోనే బిల్లులు కట్టి రండి. "ఈ సేవ " సేవలు కూడా ఆదివారం మధ్యాహ్నం వరకే! కాస్త వెళ్లి రాకూడదూ " అడిగింది అభ్యర్ధనగా..
సరే వెళతాను కానీ లంచ్ స్పెషల్ ఏమిటీ.. ? రోజు హడావిడి తిండ్లు తిని నోరు చప్పబడి పోయింది. కాస్త హాట్ గా, స్పైసీ స్పైసీ గా రెండు మూడు రకాలు చేయకూడదు " అన్నాడు భర్త.
అమ్మో! రెండు మూడు రకాలా! అని గుండె గుబెల్మంది ఆమెకి. అయినా పైకి మాత్రం  అలాగే మీకు ఇష్టమైనవి చెప్పండి చేస్తాను అని హామీ ఇచ్చేసింది.
ఓ..రెండు గంటల తర్వాత భర్త ఇంటికి చేరాడు.  వస్తూనే  ఆ "ఈ సేవలో" చేంతాడంత క్యూలో  నిలబడి  బిల్లులు కట్టేటప్పటికి నా తల ప్రాణం తోకకి వచ్చింది. ఇంకెప్పుడు నాకు ఇలాటి పనులు చెప్పకు." అన్నాడు  విసుగ్గా.
"మీరూ  ఆదివారం స్పెషల్స్ చేయమని చెప్పకండి, గంటల తరబడి వంట ఇంట్లో చెమటలు కక్కుకుంటూ రక రకాలు చేయడం యెంత కష్టమో మీకేం తెలుసు? " అంది ఆమె మాట  బాకీ ఉంచుకోకుండా..
ఇదిగో..ఎదురు సమాధానం చెప్పకు. కాస్త ఆడవారి అణిగి ఉండటం మంచిది ..అన్నాడు సరదాకో, సీరియస్ గానో..
"వెదవ జీవితం..సుఖం-శాంతి లేకుండా పోయింది. మీరే పెద్ద కష్ట పడిపోయినట్లు బిల్డప్ లు..ఆమాత్రం బిల్లు లు నేను కట్టి రాలేనా? వచ్చే నెలలో మీరు ఇంట్లో వంట చేయండి..నేను బయట పనులు చేస్తాను " అంది.
అబ్బో! వంట ఏమన్నా బ్రహ్మ విద్యా..! అంత మాత్రం మాకు వచ్చులే! ఇంట్లో కూర్చుని వంట చేయడానికి యెంత బిల్డప్ లో!  వచ్చే సారి నుండి నేను వంట చేస్తాను. నువ్వు బయట పనులు  చేయి.  యెంత కష్టమో నీ కే తెలుస్తుంది " అని  భర్త.
ఏమి కాదు వంట చేయాలంటే..ఎన్ని పనులు చేయాలో, కూరలు తరగాలి.పిండి రుబ్బాలి. పొయ్యి ముందు సెగలు కక్కాలి మీకేం తెలుసు వంట ఇంటి సంగతి? అని ఆమె..
 ఇలా ఇరువురు కలసి తీరిగ్గా తింటూ మీరు ఏం గొప్ప,మేము మాత్రమే గొప్ప అని వాదులాడుకున్నారు. ఆఖరికి బెట్ కట్టుకున్నారు.
 తెల్లవారితే ఇరువురు  ఉద్యోగాలకి పరుగులు, సాయంత్రానికి ఉసూరు మనడాలు .. అన్నీ మామూలే!
 కేలండర్ ఇంకో పేజి చిరిగింది మళ్ళీ నెల వారి పనులు తయారు.
ఈ సారి బయట పనులు భార్య మణి వి, ఇంటిలో వంట పని భర్త గారివిను. అలా పనులు వాటాలు వేసుకున్నారు. ఎవరికి వారు పట్టుదలతో కేటాయించుకున్న పనులు  తేలికగా చేయాలనుకున్నారు.
భార్య బయటకి వెళ్లిన రెండు  గంటల  లోపునే అన్ని పనులు చేసుకుని పండ్లు,కూరగాయలు, గ్రాసరీ అన్నీ కొనుక్కుని గుమ్మం ముందు ఆటో దిగింది. ఆమె గెలిచిందని వేరే చెప్పనవసరం లేదు కదా!
భర్త గారు వంట ఇంట్లో హైరానా పడుతున్నారు. ఒక వంటకం కూడా పూర్తి కాలేదు.
భార్య భర్త గారి పనితనం చూసి యెగతాళి చేసింది. నడుం బిగించి వంట పనికి ఉపక్రమించింది. ఓ..గంట లోపు  వంట పనులు అన్నీ అయిపోయాయి.  ఆమె దిగ్విజయంగా బయట పనులు, వంట పని చేసి పడేసింది.
భర్త వారు  మాత్రం హాయిగా టీవితో కాలక్షేపం చేస్తున్నారు. ఇంతలో ఏదో షార్ట్ సర్క్యూట్.. చూస్తే ఫ్యూజ్ కట్.
"ఏమండీ ఫ్యూజ్ వేయండి.".అంది
"అమ్మో ! నాకు భయం" అన్నాడు భర్త వారు.
ఆమె మెట్ల నిచ్చెన వేసుకుని ప్యూజ్ తీసి ప్యూజ్ వేసింది.
ఏమిటోయి..  ఆడ మనిషి వి అయి కూడా మగవాళ్ళు చేసే అన్ని పనులు చేస్తున్నావు..  మన పెల్లైయిన కొత్తల్లో  మీ ఊర్లో అలాగే చేట్టిక్కి జామ కాయలు కోస్తున్నావు. బిడియం భయం లేకుండా ? అన్నాడు కొంచెం భయంగా.
" నాకు చిన్నప్పటి నుండి అన్ని పనులు చేయడం అలవాటు. మా ఇంట్లో ఆడ పనులు,మగ పనులు అంటూ విభజించరు. అందరూ అన్ని పనులు చేయాలని అలా నేర్చేసుకున్నాం"  అంది.
"ఏమోనబ్బా! ఆడవారు పువ్వులాగా సుకుమారంగానే ఉండాలి. మగవారిలా అలా చెట్లు ఎక్కడాలు,కరంటు స్తంభాలు ఎక్కడాలు, బజారు పనులు చేయడాలు ఏమిటీ? అన్నాడు.
 ప్రతి పురుషుడిలోను.. స్త్రీ లక్షణాలు 15 శాతం వరకు ఉంటాయట. అలాగే ప్రతి స్త్రీలోనూ 20 శాతం వరకు పురుష లక్షణాలు ఉంటాయట. అవసరాన్ని బట్టి మనుగడలో అవి బయట పడతాయని మాకు  సైకాలజీ భోదించే మేడం చెప్పారు" అంది.
 రెండు గంటల లోపే అన్ని పనులు ముగించుకుని నువ్వు నాకన్నా త్వరగా ఎలా రాగలిగావు! ఎవరి హెల్ప్ తీసుకున్నావు నిజం చెప్పు? అడిగాడు అనుమానంగా.
" అయ్యో ! మట్టి బుర్ర వారు ఆ మాత్రం అర్ధం చేసుకోలేరా? మీలా అందరు ఇంకా కూడా  ఆడ పనులు -మగ పనులు అని ఆలోచించ బట్టే, విభజించుకోబట్టే నేను త్వరగా అన్ని పనులు చేసుకుని రాగల్గినాను "అని చెప్పింది గడుసరి భార్య.
అయినా  ఆ భర్త గారికి ఏమి అర్ధం కాలేదు, అయోమయంగా ఇంకా ఏదో అనుమానంగా  చూస్తూనే ఉన్నాడు.
మీకు ఎవరికి అయినా అర్ధం అయితే ఆమె అవలీలగా అన్ని పనులు చేయడం ఎలా సాద్యం..?
అది ఎలా సాద్యమైనదో.. చెప్పండి.!  సరదాకే నండీ! ఆడవారిని కించపరుస్తూ.. వ్యాఖ్యలు వద్దు. కానీ సాద్యం.
ఎలాగంటే రేపు నేను చెప్పే లోపు చెప్పేయండి. మీరే  విజేత కావచ్చు.
(ఇది ఒక అనుభవం లో నుండి పుట్టిన కథ)

17 వ్యాఖ్యలు:

రాజి చెప్పారు...

వనజవనమాలి గారూ ..
నాకు తెలిసిన వరకు ఐతే ఆడవాళ్ళకి స్పెషల్ క్యూలు,కొన్ని చోట్ల ఆడవాళ్ళకి హెల్ప్ చేయాలనిపించే వాళ్లు కూడా వుండటం వల్లనేమోనండీ..
కరెక్టేనంటారా??

జలతారువెన్నెల చెప్పారు...

అన్నీ మన పనులే అనుకుంటే అన్ని పనులు సక్రమంగానే చేసుకోవచ్చు ఆడవారైనా , మగవారైన. ఎప్పుడైతే ఈ పని నాది కాదు అని మనకి మనం అనుకుంటమో అప్పుడు వస్తాయి కష్టాలు. ఇస్టమైనదేది కష్ట్టం అవ్వదు. పైగా నీ పని, నా పని, ఆడవారి పని, మగవారి పని అని తేడాలు లేకుండా మన పని, మనకోసమే కదా అనుకుంటే ఏ పనైనా అవలీలగా చేసుకోవచ్చు. అలవాటు లేని పనిని కొన్ని సార్లు చెయ్యగా చెయ్యగా అలవాటైపోతుంది. కాని ఇష్టం లేని పని ఎన్ని సార్లు చేసినా కష్టమే కదా? మంచి పోస్ట్ అండి వనజగారు!

పల్లా కొండల రావు చెప్పారు...

పనులు పంచుకుని ఉంటారు.

రసజ్ఞ చెప్పారు...

కొంచెం తెలివిగా ప్లాన్ చేస్తే తప్పకుండా సాధ్యం. చాలా మటుకు బిల్ల్స్ అవీ online లో కట్టచ్చు. ఇహ కూరగాయలు అవీ కొనడం అంటారా ఇవి బాగా అలవాటయిన పనులు కనుక తొందరగా అయిపోతుంది. ఇక్కడ మీరు చెప్పిన విషయం బాగుంది ఆడపని, మగపని అంటూ ఉండవు. పని ఎవరికి చేతనయినది, ఎవరు చురుకుగా చేయగలిగినది వారు చేస్తే బాగుంటుంది.

అజ్ఞాత చెప్పారు...

ఈవిడవెళ్ళిన చోట్ల ఆడవాళ్ళ్ క్యూ లు లేవండి. అందరూ....అదీ సంగతి.

Kalasagar చెప్పారు...

బావుంది వనజ గారూ...

శ్యామలీయం చెప్పారు...

పోదురూ బడాయి.
మగవాళ్ళు గెలిస్తే అందులో అందమేముంది.

రాజీవ్ రాఘవ్ చెప్పారు...

ఇందులో కొత్తగా చెప్పడానికేముందండీ...
బయట పనులు రెండు గంటల్లో పూర్తి చేసారంటే, దానికి కారణం.. అన్ని చోట్ల ఉన్నట్టే ఈ.సేవ వద్ద కూడా లేడిస్ కి సేపరేట్ లైన్ ఉండడం......
ఇక వంట విషయానికి వస్తే దానిలో ఎలాగూ లేడిస్ అనుభవజ్ణులు కాబట్టి, ఆ పనిని కూడా అవలీలంగా చేసేస్తారు....
చివరగా చెప్పేదేమిటంటే మగాళ్ళతో పోల్చుకుంటే లేడిస్ ఎపుడూ సహనశీలంగా ఉంటారు. అందుకని వారు అన్ని పనులు చేయగలరు... (సహనశీలత కల్గిన మగాళ్ళకు క్షమాపణలు చెప్పుకుంటూ)

వనజవనమాలి చెప్పారు...

రాజీ ..మీరు చెప్పింది కరెక్ట్. థాంక్ యు!

@ కష్టే ఫలే గారు..ధన్యవాదములు. మీ అనుభవం ముందు..నేను ఏంటండీ!

@రాజీవ్ రాఘవ్.. నిజం అదే కదా! అయినా పనులకి ఆడ పని ,మగ పని తేడా ఏమిటీ చెప్పండి!? థాంక్ యు!

వనజవనమాలి చెప్పారు...

రసజ్ఞ .. సౌలభ్యం ని బట్టి ఇంట్లో పనులు ఇంట్లో ఉన్నవారు అందరు చేయడం మంచిది కదా!కేవలం ఆడ పనులు,మగ పనులు అని ..విభజించుకోవడం వల్ల ఒకే రకమైన పనులు చేయడం పట్ల విరక్తి, అసహనం కల్గుతుంది. అందుకే అన్ని పనులు చేయడం నేర్చుకుంటే.. బాగుంటుంది.

@ జలతారు వెన్నెల గారు..

మన వ్యవస్థలో ఇంకా ఆడ పనులు,మగ పనులు భావ జాలం అలాగే ఉంది. సంపాదించడం ఒకటే చాలు.ఇక తతిమా పనులు నావల్ల కావు అంటే ఇప్పుడు సరిపడదు. అన్ని పనులు ఇద్దరు చేసుకోగలగాలి. అలాటి భావజాలం ఉండబట్టే భర్తకి రెండు గంటలు పట్టే పనిలో..ఆమె ఆ పని కాకుండా ఇంకా కొన్ని పనులు చేసుకుని రాగాల్గింది అంటే.. లేడీస్ క్యూ తక్కువ ఉన్నట్లే కదా!
ఆ భావజాలం మారాలనే నా ఈ చిన్ని ప్రయత్నం. అందులో నా అనుభవంని..మిక్స్ చేసి..ఇలా.

వనజవనమాలి చెప్పారు...

కొండలరావు గారు..పని విభజన అవసరం. అలాగే ఒకే పని ఎల్లప్పుడు ఒకరే చేయడం కష్టం కదా!

నాకైతే వంట చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఇతరులకి ఇష్టమైనవే చేయాలి. ఇంట్లో ఆడ వాళ్ళ ఇష్టాలకి అవకాశం ఉన్నా..వారు ప్రత్యేకించి చేసుకోరు. నాకు వంట చేయడం అంటే.. కన్నా.. ఇతర పనులు చేయడం చాలా సులువు అనిపిస్తుంటుంది. అలా ఈ పోస్ట్ లో.. భావ ప్రకటితం చేసాను.. ధన్యవాదములు.

@కళాసాగర్ ..ధన్యవాదములు

@శ్యామలీయం గారు..నమస్కారం అండీ! ఎవరు ఓడితే ఎవరు గెలిస్తే ఏమిటండీ! ఓడి..గెలవడం అక్కడ సాధ్యపడింది కదండీ.. పాపం ఆయనకీ వంట చేయడం ఏం చేతనవును అని? సానుభూతి సంపాదించుకుని..మరీ డబుల్ చాకిరీ చేసి..గెలిచానుకుంది.నిజం ఏమిటో..మీకు తెలియదా.. !? అక్కడ గెలిచిది..పురుషుడే నండీ! పాపం భార్య..అధిక శ్రమలో గెలిచానుకుంటుంది. ఓడింది ..భార్యే కదండీ! Thank you veru much.. sir.

వనజవనమాలి చెప్పారు...

Thank you very much..To all..

oddula ravisekhar చెప్పారు...

ఆసక్తికరం .కొనసాగించండి....

అజ్ఞాత చెప్పారు...
ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

వనజ గారు,

జిందగీ మే కుచ్ జీత్ నే కేలియె కుచ్ హార్నా పడత హై, హార్ కర్ జీత్నే వాలే కో కేహతే హై - బాజీగర్ గెలుపు మగవాడి ఇంటి చిరునామా! :):):)

జీవితం లో కొన్ని సార్లు గెలవటానికి ఓడిపోయినట్లు నటిస్తుండాలి, గెలుపు కోసం అలా ఓడిపోయి నట్లు నటించి, గేలిచే వాడే మగాడు. అయినా వంట చేయటం పెద్ద బ్రహ్మాండమైన విద్యానా? మగవారు అది చేయలేరా? నేను నాలుగవ తరగతి లోనే చేసి దేవుడికి నైవేద్యం పెట్టె వాడిని. సాంబార్ చేస్తే ప్రతి ఆదివారం నా మిత్రులందరు వచ్చి లోట్టలేసుకొంట్టు తిని పోతారు. ప్రతి హోటల్ లోను వంటవాళ్లు మా మగవారే! వంటలలో నల భీమ పాకం అని పేరు వినే ఉంటారు. ఏ పని చేసినా భారి ఎత్తున, స్టాండర్డ్స్ సెట్ చేయటం మగవారి ప్రత్యేకత మేడం. కావాలంటే నెల్లూరు రాధా థియేటర్ వీది లో ఒక దోశల కొట్టు ఉంట్టుంది, సాయంత్రం 5.30 మొదలుపెడితే రాత్రి 11 గం || వరకు లేయకుండా కారం దోశలు ఏ రెండు వేలో పోస్తాడు. అక్కడ తినటానికి వేరే ఊర్లవారు కూడా వచ్చి, దిగి, తిని వేల్తారని మా మితృడు ఒకడు చెప్పాడు.
పుస్తకాలు చదివి, మీరు మగవారిని చాలా తప్పుగా అర్థం చేసుకొంట్టున్నారు.

వనజవనమాలి చెప్పారు...

శ్రీనివాస్ గారు.మధ్యానం మా అమ్మాయి నేను కూడా ఈ విషయం చెప్పుకుని నవ్వుకున్నాం. నల,భీమ పాకాలు గురించి ,అలాగే ప్రసిద్దమైన చెఫ్ లు గురించి కూడా. మగవారికి వంట రాదు అని నేను చెప్పలేదండి. ఆ ఇంట్లో భర్త కి రాదు అని చెప్పాను.అంతే. మా ఇంట్లో కూడా మగవారికి వంట రాదు. ఎప్పుడు వంట చేసి చేసి ..నాకు విసుగు. ఆకలి తెలిసినప్పుడు వంట కూడా తెలిసి ఉండటం తప్పు కాదు కదా! వంట ఏమి బ్రహ్మ విద్య కాదులెండి. మా అబ్బాయి వంటలు చెడగోడుతూ..నేర్చుకున్నాడు. :):)
మా ఇల్లే నా అనుభవం ..కి కేరాఫ్. అని చెప్పడం నా కర్తవ్యమ్ కూడా! రాదా-మాదవ్ దియేటర్.. కొంచెం ముందుకు వెళితే..వెంకట రమణ హోటల్.. అన్ని నాకు చిరపరిచితం. మీరు చెప్పిన దోసెల అంగడి నిజం. థాంక్ యు!

వనజవనమాలి చెప్పారు...

Ravi shekhar gaaru..Thank you!