24, సెప్టెంబర్ 2013, మంగళవారం

ముకుళిత
"ముకుళిత"  ఈ పేరు వినగానే  ఆసక్తిగా  చూసింది మాలతి. 

అమ్మాయి పేరు బావుంది. అమ్మాయి కూడా బావుంటుందా ? అమితాసక్తి.


“అవును, అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. కాకపొతే కాస్త రంగు తక్కువ.మీకు నచ్చుతుందో లేదో ?” సంశయం.


పేరెన్నికగల మాట్రిమోని వారితో యెదురుగా కూర్చొని మాట్లాడుతున్నాడు రావుగారు, ఆయన కూతురు మాలతి    


“మీ మనుమడికి ముప్పై నాలుగేళ్ళు దాటుతున్నా కళ్యాణ ఘడియ తోసుకురావడం లేదన్న మీ బాధని  అర్ధం చేసుకోగలం . గత అయిదారేళ్ళుగా  యెన్ని  సంబంధాలు  మీ ముందు వుంచాం, వొక్కరైనా మీకు నచ్చారా ? పసుపుని వస్త్రకాయం పట్టినట్లు  అమ్మాయిలని  వొడపోత పడుతున్నారాయే !  ఆమ్మాయి రంగు తక్కువ , కుదిరికలు అంత బాగోలేవు  మరీ చెక్క బొమ్మలా ఉంది  అని వొంకలు పెట్టుకుంటూ పోతూ వుంటే ముదురు బెండకాయలా బ్రహ్మచారి ముదిరిపోతున్నాడు, కాస్త ఆలోచించడి రావు గారు. యెన్నోసంబంధాలు  కుదిర్చిన అనుభవంతో చెపుతున్నాను   ఇప్పటి అమ్మాయిలు చూస్తేనేమో ముప్పై యేళ్ళు దాటాయా? అంత  బాలా కుమారుడు మనకి జోడీ కాలేడులే అని యెగతాళిగా మాట్లాడుతూ నవ్వడం పరిపాటి అయిపోయింది .  అమ్మాయిల మాటలకి  మనసు చివుక్కుమంటున్నా వోర్చుకోక తప్పడంలేదు.  అదివరకటి కాలంకాదిది,  అమ్మాయిలనీ, గుండెల పై బరువుగున్నారు, గంతకి తగ్గ బొంత లాంటి సంబంధం చూసేసి చటుక్కున పెళ్ళి చేసి పంపిద్దామని అమ్మాయిల తల్లిదండ్రులు అనుకోవడంలేదు. ఆమ్మాయిల చదువులు అటకెక్కటంలేదు  మగ పిల్లలతో సమానంగా చదివి సమానంగా ఉద్యోగాలు చేస్తూ  పెళ్ళి సవాల్ ని వొడుపుగా  విసిరి కావాల్సినదానిని చేజిక్కించుకుంటున్నారు . అబ్బాయిలేమో చదువుకుని అందంగా ఉండి ఉద్యోగం చేయనవసరం లేని అమ్మాయిల కోసం గాలిస్తున్నారు .  ఓ.మాదిరి చదువులు చదివి, గొప్ప అందగత్తెలు కాకున్నా కాస్త మధ్యరకంగా ఉన్నా సరే అమ్మాయిల  కలల వాకిళ్ళు విదేశీ ద్వారంలో తెరుచుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఇలాంటివన్నీ మీరు అర్ధం చేసుకుని  యేదో వొక లోపం వున్నా సరిపెట్టుకోవాలి”  అని వున్నమాటే చెప్పింది  లక్ష్మి.


ప్రక్కనే వున్నరావు గారి కూతురు  మాలతి కల్పించుకుని  "రంగు విషయంలో నాకు పెద్ద పట్టింపు లేదు మనమందరం   అనుకునే బంగారు రంగు కాంతులీను శరీరఛాయలో  అందం దాగి ఉండదు . మనం మన కళ్ళతో పాటు హృదయంతో కూడా చూడగల్గితే  అమ్మాయిల యొక్క  అందమంతా వారు  సంపాదించిన జ్ఞానం తాలూకూ వెలుగంతా కళ్ళలో కాంతులీనుతూ ఉంటుంది. వారి ఆత్మవిశ్వాసం అంతా వారి మాటల్లో  ప్రకటితమవుతుంది . వారి వివేకం అంతా బాహ్యంగా వారి కదలికలలో కనబడుతుంది వారి ఆలోచనా విధానమంతా స్పందించే తీరుని బట్టి అంచనా వేయవచ్చు. " అమ్మాయి చదువుకుందా ? వివేక వంతురాలేనా అన్నదే ముఖ్యమండీ" అని సైకాలజీ సబ్జక్ట్ చదువుకున్న మాలతి  చెప్పింది.


మాలతి గారి మాటలు విన్న లక్ష్మి తల పట్టుకుంది. అణువణువూ ఇంతగా పరిశీలించే వీరికి తగిన సంబంధం కుదర్చగలనా ? అనే అనుమానం  ఆమెకి  యెప్పటిలాగానే  కల్గింది. ఎలాగోలా ఈ పెళ్ళి కుదిరితే బావుండును. నాలుగు లక్షలు ఇస్తామన్న రావు గారి మాట తెగ ఊరిస్తుంది.మరి కొంత  డబ్బు వేసుకుని డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలి . తనకన్నా వెనుక మాట్రిమోని స్టార్ట్ చేసిన రాణి  యెప్పటి నుండో  డైమండ్ నెక్లెస్ పెట్టుకుని తిరుగుతూ డాబు ప్రదర్శిస్తుంది అనుకుంది మనసులో.


  డైమండ్ నెక్లెస్ కళ్ళ ముందు మెదలగానే విషయం  తొందరగా ముందుకు జరపాలని తోచి  "అమ్మాయిని ముందుగా మీరు చూస్తారా? యెక్కడికైనా  గుడికి కానీ  పార్క్ కి కాని పిలిపించమంటారా ? "


"ఆ అమ్మాయి ముందు మాకు  నచ్చి, తర్వాత అబ్బాయికి నచ్చితేనే వారితో విషయం మాట్లాడదాం . అప్పటి వరకు యే  విషయం వారికి చెప్పకుండా ఉండటమే మంచిది" కండీషన్ చెప్పారు రావు గారు.


"అలాగే  రేపు శుక్రవారం అష్టమహా లక్ష్మి గుడికి  అమ్మాయిని పిలిపించుదాం . మీరు చూసి   యే  సంగతి చెపితే తర్వాత విషయం మాట్లాడుకోవచ్చు"   అంటూ తన ముందు ఉన్న ఫోన్ నంబర్ లిస్టు లో  ముకుళిత నాన్న నంబర్ ని వెతికి కాల్ చేసి విషయం చెప్పింది.   మీరు ఆరున్నరకి గుడి దగ్గరికి చేరుకోవాలి అని చెప్పి  చేతికి ఉన్న వాచ్ లో టైం చూసుకుంటూ లేచి నిలబడింది ఇంకా యెక్కువసేపు  అక్కడే వుంటే  మరిన్ని ప్రశ్నలు వేస్తారని ఆఫీస్ బయటకి నడచింది.


ఆమెతో పాటు బయటకి నడుస్తూ మాలతి “ ఈ అమ్మాయైనా సంజయ్ కి నచ్చుతుందంటారా నాన్నగారూ” అంది


“ఏమోనమ్మా ! వాడిష్టం. వీళ్ళు చెప్పినదాని ప్రకారం అమ్మాయికి ముప్పై ఏళ్ళు దాటాయి. ఎందుకని ఆ అమ్మాయికి యింకా  పెళ్ళి కాలేదో ?” అనుమానం వెలిబుచ్చాడు .


“మనలాగానే  ఆ అమ్మాయికి అనేక గొంతెమ్మ కోర్కెలు వున్నాయేమో యెవరు చూసారు ?” మాలతి విసుక్కుంది.

 

 “మన  బంధువులలో సంజయ్ వయసున్న వారికి యేడెనిమిది యేళ్ళు వున్న పిల్లలు కూడా ఉన్నారు . వాళ్ళ దాకా ఎందుకు?   వాడి కన్నా చిన్నది.మన రమ్య కి మాత్రం ఇద్దరు పిల్లలు పుట్టి చక్కగా స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నారు . ఒక్కగానొక్క కొడుకు విదేశాలకి వెళ్లి చదువుకుని అక్కడే  వుద్యోగం చేసుకుంటున్నాడు . గుణవంతుడు ,వెనుక బోలెడంత ఆస్తిపాస్తులు  అయినా వాడికి కళ్యాణ ఘడియ రావడం లేదని నేను బాధపడుతుంటే మీరేమో వచ్చిన సంబంధాలన్నిటిని యిలా వొంకలు  పెట్టి చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది”  అని వెళ్లి విసురుగా కారు లో కూర్చుంది.


“పెళ్ళంటే మాటలా ?  నేనలా  అన్నీ  వివరంగా చూసి మీ ముగ్గురికి పెళ్ళిళ్ళు చేయబట్టే  మీరందరూ సుఖంగా సంతోషంగా వున్నారు”  సమర్ధించుకున్నారు రావు గారు .


మర్నాడు సాయంత్రం "అష్ట మహాలక్ష్మి " గుడికి చేరుకున్నారు .


ముకుళిత , ఆమె తండ్రి కూడా వచ్చారు.  చామాన ఛాయకన్నా వొకింత  తక్కువ రంగుతో  విశాల నయనాలు, సంపెంగ లాంటి ముక్కు, గడ్డం క్రింద చిన్న నొక్కు , నవ్వకుండానే నవ్వినట్లు ఉండే  పెదవులు, చక్కని  జుట్టు  అయిదడుగుల ఆరంగుళాల  యెత్తులో పొందికగా వున్న ఆమెని చూడగానే మాలతికి బాగా నచ్చేసింది . తండ్రికి కూడా అదే విషయం చెప్పింది. రావు గారు కూడా అమ్మాయి రంగు తక్కువ అంటూనే వొప్పుకోక తప్పదు అన్నట్లు తల ఊపారు.


మాలతి  ముకుళితకి కొడుకు సంజయ్ వివరాలు అన్నీ చెప్పి సంజయ్  ఫోన్లో మాట్లాడాలంటే కాస్త  మొహమాట పడతాడు. అతనితో మాట్లాడాలనుకుంటే  ఫేస్ బుక్ లో చాట్ చేయవచ్చు అని సంజయ్  ఐడి ఇచ్చింది.


 మీ ఇద్దరూ మాట్లాడుకుని త్వరలోనే మీ  అంగీకారం తెలిపితే  వెంటనే వివాహం చేయాలన్న కోరికని బయట పెట్టింది. ఆమె ఆత్రుత ని అర్ధం చేసుకున్నట్లు చిన్నగా నవ్వింది ముకుళిత.


ఆ రోజు రాత్రి సంజయ్ కి తనే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది ముకుళిత . 


సంజయ్  ఆమె రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తూ  “మీ పేరు చాలా బావుంది యెవరు పెట్టారు” అడిగాడు ఆసక్తిగా . 


"అమ్మ" చెప్పింది. ఓ..నాలుగైదు రోజుల పాటు చిన్న చిన్న సంభాషణలతో మొదలైన వారి  చాట్ సీరియస్ విషయాల వైపు మళ్ళింది


"పెళ్ళైన తర్వాత కూడా మీరు వుద్యోగం చేయాలనుకుంటున్నారా? " సంజయ్ ప్రశ్న 


"నాకిష్టమైనంతకాల వుద్యోగం చేస్తూనే వుంటాను"


"ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, నేను సంపాదిస్తున్నాను నా వెనుక బోలెడు ఆస్తి పాస్తులు ఉన్నాయి"


"ఉద్యోగం చేయాలనుకున్నది నా అభిరుచి కూడా అవుతుందని మీరెందుకు అనుకోకూడదు"  ఆమె యెదురు  ప్రశ్న 


"అవసరం లేనప్పుడు యెందుకు  శ్రమపడటం  ?"


"నా స్కిల్స్ అన్నీ సొసైటీకి వుపయోగపడాలి. సొసైటీకి వుపయోగపడనప్పుడు నా యీ చదువు నిరర్ధకం అవుతుంది కదా? " ఆమె వాదన వినిపించింది.


"ఇల్లు చక్కబెట్టుకోవడం, మంచి తల్లిగా ఉండటం గురించి కూడా ఆలోచించవచ్చు కదా!" అతని మనసులోని కోరిక 


"ఇలాంటి ప్రశ్నలు వేసి భార్య ఇంటికే పరిమితం కావాలని కోరుకోబట్టీ నేనిన్నాళ్ళు పెళ్ళికి అంగీకారం తెలుపలేదు . మీరిప్పుడూ యిదే కోరుకుంటున్నారు.సారీ !  నన్ను అలా వుండాలని  శాసించే వారిని నేను పెళ్ళి చేసుకోలేను నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే వొకతను కూడా యిలాంటి అభిప్రాయాలే వెలిబుచ్చాడు. నన్ను ప్రేమిస్తున్నాడు అనే భావన కన్నా నా వ్యక్తిత్వాన్ని  గౌరవించిన వారంటనే నేను యెక్కువ యిష్టపడతాను నా అంతగా నేను యిష్టపడితే తప్ప వొకరి భావాలని, ఆలోచనలని బలవంతంగా మోయలేను. బలవంతంగా నాపై రుద్దాలని ప్రయత్నించినప్పుడల్లా నేను నా చుట్టూ ఒక చట్రాన్నిబలంగా బిగించుకుంటాను లుక్ లైక్ టచ్ మి నాట్ .


వెరీ గుడ్ మీ పేరుకి అసలైన నిర్వచనంలా వుంటారన్నమాట . నవ్వుతూ సంజయ్ కామెంట్ .


“నా కొలీగ్ ఒకతను రెండేళ్ళు నన్ను వాచ్ చేసి చేసి నా యిష్టాలు అయిష్టాలు తెలుసుకుని నాకు యెలా  ఉంటే నచ్చుతుందో తెలుసుకుని  సరిగా అలాగే ప్రవర్తిస్తూ నాకు దగ్గరయ్యే ప్రయత్నం చేసాడు అతనికి నా అందం తెలివితేటలు అన్నీ నచ్చాయేమో కానీ వాటితో పాటు  అతనికి నేను సంపాదించే డబ్బు కూడా చాలా అవసరం వుద్యోగం తప్పకుండా చేయాల్సిందే అని చెప్పాడు. అతనికి నో చెప్పాను.  ఎవరో ఒకరులే  నన్ను యిష్టపడితే చాలు పెళ్ళి చేసేసుకుని జీవితాంతం అతనిపై పడి బ్రతుకుదాము అనుకునే మనిషిని కాదు, అల్లాగే అతని ఆర్ధిక అవసరాలకి డబ్బు సంపాదించే యంత్రాన్ని కాదు. అవసరాలకి ముసుగేసి ప్రేమ నటించే మనుషులంటే నాకు అసహ్యం. అలా అని అతనిని నేను ద్వేషించనూ లేదు. అతనికి నో చెప్పాననే అక్కసుతో నా పై  అపవాదులేసి నేను అతను ప్రేమించుకున్నామని  వివాహం తర్వాత  అతను నన్ను వుద్యోగం మానేయమని  చెప్పానని అందుకు నేను అంగీకరించలేదని  నా జీతం డబ్బు అంతా నా తల్లిదండ్రులకే ఇవ్వాలని షరతు పెట్టానని ప్రచారం చేసాడు.  ఆమె గురించి అడగకుండానే చెప్పింది .. 


అప్పుడు మీరు ఫీల్ అవ్వలేదా ?సంజయ్ సందేహం 


నేను ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నాను. ఎవరైనా  నా అనుమతి లేకుండా నా నీడని కూడా తాకడం సాధ్యం కాని పని. నా తోటి బాటసారుల పట్ల అభావమే తప్ప అభద్రతా భావమే లేదు నిరభ్యంతరంగా మీ ముసుగులు తీసేసి నడవండి. వెలుతురులో తడవండి, ఈ పువ్వుల్లా నవ్వండి,నాలా ఉండండి అని చిన్న మెసేజ్ పంపాను. ఆత్మ విశ్వాసం తొంగి చూసింది ఆమె మాటల్లో 


“ఇంతేనా,మీ లేట్ మేరీడ్ వెనుక కారణాలు యింకేమైనా వున్నాయా?” అతని అనుమానాలు . 


“వచ్చిన ప్రతి సంబందానికి వొంకలు  పెట్టి పంపుతున్నానని యింట్లో వాళ్ళు , కావాల్సిన వ్యక్తిని నేనే వెదుక్కునే ప్రయత్నం చేసాను అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. వొకరిని ప్రేమించాననుకుని అపోహ పడ్డాను బహుశా అది ఆకర్షణ ఏమో! అతను ప్రేమిస్తున్నాడు అనుకుని భ్రమ పడ్డాను.అతనికి భార్య పిల్లలు ఉన్నారని తెలిసినప్పుడు షాక్ కొట్టినట్లై దూరం జరిగాను. ప్రేమ పైనే కాదు మనుషులపైనే నమ్మకం పోయింది చెప్పింది 

 

“మనుషులు అందరూ ఒకే విధంగా ఉండరు. మీలా ఆలోచించేవాళ్ళు ఉండవచ్చు” అన్నాడు సంజయ్ .


“నాలాంటివారు వుంటారో లేదో నాకు తెలియదు . నేనిలాగే వుంటాను  నాణానికి బొమ్మ బొరుసు రెండు వుంటాయేమో కానీ నా గురించి నేను చెప్పినా నా గురించి యింకొకరు  చెప్పినా ఇలాగే ఉంటుంది నా ప్రేమ లో పూర్తిగా ప్రేమే ఉంటుంది , నా ద్వేషం లోనూ ద్వేషమే ఉంటుంది. నాలో ద్వైదీ భావనలేవి ఉండవు. కలగా పులగమైన భావనలతో, అయోమయస్తితిలో, నాకు నేనే అర్ధం కాని స్థితిలో నేనుండను. నా గీత నేనే గీసుకుంటాను, నేగీసిన గీతని నేనే చేరిపేసుకుంటాను తప్ప వేరొకరికి ఆ అవకాశమే మిగల్చను” గర్వంగా చెప్పుకుంది 


"మీ గురించి చెప్పారు మరి నా గురించి అడగలేదు" అడిగాడతను 


"నేను చెప్పిన మూడు విషయాలు మీకర్ధమైయితే నేను మీకు నచ్చనని ఖచ్చితంగా  నాకు తెలుసు. నచ్చనప్పుడు మీ గురించిన విషయాలు అడగడం అవసరం కాదు కదా !  అందుకే  ఈ ముకుళిత ముడుచుకునే ఉంటుంది వికసింపజేసే కిరణం తాకేవరకు" తెలివిగా చెప్పింది 


“మీరు నాకు నచ్చారు . ముఖ్యంగా మీ నిజాయితీ చాలా నచ్చింది నా గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఏమైనా అడగవచ్చు”


అవసరం లేదు . మీ గురించి అంతా తెలుసుకున్నాకే .. ఇంకోసారి పెళ్ళి చూపులకి సిద్దమయ్యాను . పెళ్ళి అంటేనే ఒక  లైఫ్ టైమ్ కమిట్మెంట్,  పూర్తి నమ్మకం,  కొన్ని సర్దుబాటు ,  ఇరువురి మధ్య అవగాహన కావాల్సినవి ఇవే !


 "మీరు నాకు పూర్తిగా  నచ్చారు. నేను మీకు నచ్చినట్లేనా?" అడిగాడతను 


"పెళ్ళి తర్వాత నేను యెలా  వుండాలన్నది మీరు చెప్పనేలేదు. అది స్పష్టంగా చెప్పాలి " అడిగింది . 


"నేను మొదటే చెప్పాను కదా! హౌస్ వైఫ్ గా  వుంటే చాలు . " అతని కోరిక . 


"సరే నండీ, ఆలోచించుకుని  మీ అమ్మ గారితో  నా నిర్ణయం చెపుతాను  bye.. అండీ " గౌరవంగా చాట్ ముగించింది 

"bye .. అండీ. సంతోషకరమైన వార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను " చెప్పాడతను . 


మరుసటి రోజు ఉదయాన్నే నిర్ణయం కోసం మరింత  సమయం వేచి ఉండనీయక ముకుళిత  మాలతికి ఫోన్ చేసింది. 


"ముకుళిత  చెప్పు ! నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం” అడిగింది మాలతి.

 

"సారీ అండీ,మీ అబ్బాయిని నేను పెళ్ళి చేసుకోవాలనుకోవడం లేదు " చెప్పింది . 


శుభవార్త వస్తుందని ఆశించిన మాలతికి తీరని ఆశాభంగం ఎదురైంది . 

 

“మీ అబ్బాయికి ఉన్నత చదువులు  చదువుకుని, వుద్యోగం చేయని  యిల్లు  దిద్దుకోగల అందమైన అమ్మాయి కావాలి. భర్త చదువు వుద్యోగం, సంపాదించే డాలర్లు, ఆస్తిపాస్తులు అందచందం చూసి మురిసిపోయే అమాయకమైన అమ్మాయి అయితే మరీ మంచిది. అది అతని కోరిక. నేనలాంటి  అమ్మాయిని కాదు కాబట్టి భర్త అనే తోడూ కోసం  వుద్యోగం, తల్లిదండ్రులు, మాతృ దేశం  యివ్వన్నీ  వదిలేసుకుని అతనికి పూర్తిగా నచ్చిన విధంగా నేను మారలేను. నేనే కాదు, ఈ తరం ఆడపిల్లలెవరూ అంత వ్యక్తిత్వం  చంపుకుని బ్రతకలేరు. వివాహం అనేది స్త్రీ పురుషులిద్దరికీ అవసరమే! కీవలం స్త్రీకి వొక్కరికే అవసరం  అన్న అభిప్రాయం మార్చుకుంటే మంచిది.” చెప్పి తనే లైన్ కట్ చేసింది. 


ఈ సంబంధం కూడా చెడగొట్టుకున్నాడా ? తల పట్టుకుంది మాలతి 


ఈ కాలం అమ్మాయిలూ యెంత  ఫాస్ట్ గా ఉన్నారు ?  యెంత  ఖచ్చితంగా మాట్లాడుతున్నారు ? ముకుళిత లాంటి అమ్మాయిలు  తమకేం కావాలో  తెలుసుకుని  మంచి  ఆలోచనా  ధోరణితో  యెంత  స్పష్టంగా  మాట్లాడుతున్నారు!  వీళ్ళు  పెళ్ళి చేసుకుంటే అసలా పెళ్ళిళ్ళు సఫలం అవుతాయా? మగవాళ్ళ అహంకారం అడుగడుగునా తలెత్తి  అణగద్రొక్కాలని   చూస్తుంటే  యీ తరం అమ్మాయిలది ఆత్మ విశ్వాసమో, అతి విశ్వాసమో అర్ధం కాకుండా తయారయ్యారు.  అందుకే పెళ్ళైన  మూన్నాళ్ళకే  పెళ్ళిళ్ళు పెటాకులైపోతున్నాయి.  చలం  ఆశించిన   స్త్రీల  స్వేచ్ఛ యిదేనేమో ! ఇక వీడికి పెళ్ళి కావడం చాలా కష్టమేమో! వీడు ఆడపిల్లై పుట్టినా బాగుండేది అనుకుని దిగులుపడింది మాలతి.

1 కామెంట్‌:

హితైషి చెప్పారు...

అమ్మాయిలూ, అబ్బాయిలూ ఇరువురు కూడా తమ తమ ఆలోచనా విధానం మార్చుకోవాల్సి ఉందని ఈ కథ చెప్పింది. ఎక్కడా అనవసర వర్ణనలు,సంభాషణలు లేకుండా కథ సూటిగా చక్కగా ఉంది. బావుందండి