11, సెప్టెంబర్ 2013, బుధవారం

నాయనమ్మ చెప్పిన కథ



అది వర్షా కాలం . ధర్మం  కుంటి  నడక నడుస్తున్నా నెలకి నాలుగు వానలు కురిసే కాలం .

 కృష్ణానదీ గమనంలో రెండు పాయలుగా చీలిపోయి మధ్యలో ఉన్న దివిసీమ గ్రామాలు.
పడవ మీద యేరు దాటి అవతలకి వెళ్ళడమే తప్ప రవాణా సౌకర్యం అంతగా లేని ఆ ఊర్లకి ..  వేరే మార్గమే లేదు .

ఆ రోజు ప్రొద్దుట నుండి  తెర్లు  తెర్లుగా  కడుపులో నొప్పి వచ్చిన మాదిరిగా జల్లులు పడుతూనే ఉన్నాయి . యేరు ఉదృతంగా ప్రవహిస్తూనే ఉంది .. అయినా ఆ ఏటి తీరాన పుట్టి పెరిగిన వారికి ఏటి నడకలు తెలుసు కాబట్టి  అటునిటు రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు . నాలుగు పడవలు  అటుఇటు తిరుగుతూనే ఉన్నాయి .  వాన కురుస్తూనే ఉంది చీకటి పడుతుండగా .. యేరు దాటి ఆవలోడ్డుకి వెళ్ళిన పడవలు  రెండు తిరిగి రానేలేదు .
ఈవల ఉన్న రెండు పడవలు  ఇక అటువైపుకి వెళ్ళ నట్టే!

పడవ రాముడు  ఏటి ఒడ్డున ఉన్న పాకలో కూర్చుని తీరిగ్గా చుట్ట కాల్చుకుంటూ ఉన్నాడు . అంతలో అదరాబదరా.. పరిగెత్తుకుంటూ .. ఏటి ఒడ్డుకి వచ్చి నిలబడింది రంగమ్మ..  చేతిలో తాటాకు గొడుగు ఉంది .. ఆ గొడుగు క్రింద  పదేళ్ళ కొడుకుని తడవకుండా చూసుకుంటూ తానూ తడుస్తూ మనిషి అంతా ముద్ద ముద్దగా తడిసి పోయి  ఒంటికి చుట్టుకుపోయిన చీరతో నడక కష్టంగా సాగిస్తూ వచ్చింది .

ఆమెని చూసి ఇప్పుడు ఈ మనిషిని యేరు దాటించాలి కాబొలు.. ఒక్క మనిషి కోసం ఆవలోడ్డుకి ఏమి  వెళతాం ? ఎక్కడోచోట  చుట్టాలో, తెలిసిన వాళ్ళో ఉండి  ఉంటారులే ! పడవ  వెళ్ళదని  చెప్పేస్తే పొలా ? పెందరాడే  ఎక్కడో చోట .సర్దుకుంటాది ... అని మనసులో అనుకుని

ఇప్పుడు ఆ పక్కకి ఎల్లేదానికి కుదరదమ్మా.. ఇక రేపోద్దునే  పడవ  విప్పేది .కేకేసి  చెప్పాడు .

అయ్యో! అలా అంటే  ఎట్టాగయ్యా .. పిల్లగాడికి బాగోకపోతే ఆచార్యుల గారి దగ్గరకి తీసుకొచ్చా..  ఒళ్ళు మాడిపోతా ఉంది  ఇట్టా ఉన్న బిడ్డని పెట్టుకుని ఎవరింటికి పోతాను .. ? అదీగాక ఇంటి కాడ పాలు తాగే  పసి పిల్ల ఉంది . పాలు తీయాల్సిన గేదెలు ఉన్నాయి. ఇద్దరమే ఉన్నామని అనుకోకుండా కాస్త అటుప్రక్క దింపయ్యా ! బతిమలాడుకుంది

రంగమ్మ మాటలు విననట్టే..లేచి నిలబడి తుండు ముక్క దులుపుకుని తలకి చుట్టుకుంటూ ఊరివైపుకి  అడుగులు వేయసాగాడు . ఆడమనిషి అంతలా బతిమలాడుతుంటే అలా వెళ్ళిపోవడం న్యాయంగా ఉందా ! వచ్చే  సాలుకి ధాన్యం కొలిచేటప్పుడు నాలుగు మానికలు ఎక్కువ కొలిపిస్తాను ..కాదనకుండా  రాయ్యా .. నన్ను కాస్త దించి రా..
కావాలంటే  మా ఇంటికాడే అన్నం తిని గుడికాడ పడుకుందువు  గాని ..  అని బ్రతిమలాడింది.

అయినా రాముడు వినడంలేదు .. అప్పుడు రంగమ్మ ఒక మాట అంది . నువ్వు గనక నన్నుఅవతలోడ్డున దించితే .. నీకొక బహుమానం ఇస్తాను " అంది .

"ఏమిస్తావు" అడిగాడు వాడి మనసులో వంకర ఆలోచనలు

" మా ఆయనకీ కూడా చూపనిది నీకు చూపిస్తాను " అంది .

ఆ మాట వినగానే నడుస్తున్నవాడల్లా  గిరుక్కున వెనుదిరిగాడు . పడవ తాడు విప్పుతూ .." మాట తప్పకూడదు" అని హెచ్చరించాడు

 "ఇచ్చిన మాట తప్పను"  అంటూ ...  ఆమె మరో మారు మాట ఇచ్చింది

సన్నగా వర్షం కురుస్తూనే ఉంది . తాటాకు గొడుగు క్రింద పిల్లవాడు .. కురుస్తున్న జల్లులో తడుస్తున్న ఆమెని చూస్తూ .. రంగమ్మ ఇచ్చే బహుమతి ఏమై  ఉంటుందా.. అని  ఆలోచిస్తూ .. లభించబోయే బహుమానం కోసం   ఆత్రంగా  చూస్తున్నట్లు .. ఆవలోడ్డుకి  త్వరత్వరగా తీసుకువెళ్ళి .. పడవ ఆపాడు .

రంగమ్మ ముందు దిగి .. తర్వాత పిల్లవాడిని దించుకుని పదేళ్ళ పిల్లవాడిని చంకన వేసుకుని .. నడక సాగించింది .

ఆమె వెనుకనే .. రాముడు   నడవసాగాడు .. ఆమె వడి వడిగా అడుగులువేసుకుంటూ వెళ్ళిపోతుంది ...

నాకు ఇస్తానన్న బహుమానం ఇవ్వలేదు .అంటూ  దారికెదురుగా ...వెళ్లి అడ్డంగా నిల బడ్డాడు .

సరే ! చూపిస్తాను .. ఉండు అంటూ .. పిల్లవాడిని క్రిందకి దించింది  రంగడి ఎదురుగా నిలబడింది .  అప్పుడామే మొహం  మీద సన్నటి వెలుగు పడతా ఉంది ..  ఆ వెలుతురు లోనే .. ఆమె నుదుట ఉన్న కుంకుమ ని గట్టిగా తుడిచేసుకుంది .

రాముడు కి  ఆమె ఎందుకల్లా చేస్తుందో అర్ధం కాలేదు . ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు . .. నుదు టున ఉన్న కుంకుమంతా  శుభ్రంగా తుడి చేసుకున్నాక.. "ఇదిగి.. ఇది మా  ఆయన చూడకుండా ఉండేది ..నువ్వు చూసేది " అంది .

అమ్మ నీయమ్మ ! ఎంతటి జాణవే  నువ్వు !  అనుకుని ఉసూరుమంటూ ..వెనుదిరిగాదు రాముడు  .

అప్పటి కాలంలో నుదుట కుంకుమ లేని భార్యని భర్త చూడలేడు . ఎందుకని అంటే .అతను మరణిస్తే తప్ప ఆమె నుదుట కుంకుమ లేకుండా ఉండనే ఉండదు . రంగమ్మ అందుకే ..భర్త చూడనిది చూపిస్తాను అని అంత  నమ్మకంగా చెప్పింది .

నాకు ఈ కథ తలచుకున్నప్పుడల్లా తెగ నవ్వు వచ్చేస్తూ ఉంటుంది .

ఇలాంటి కథలెన్నో మా నాయానమ్మ నాకు చెప్పేది . ఆ కథలలో ఎక్కువగా.. మగవారి అవకాశవాదం ,ఆడవాళ్ళ సమయస్పూర్తి ,ఆపద వస్తుందనుకున్నప్పుడు .. ఆడవారు ఎలా తమని తాము కాపాడుకునేవారో ,చాకచక్యంతో పనులు చేయించుకునే వారో ..లాంటి విశేషాలు ఉండేవి .

ఏదో ఒక సామెత ఉంది కదా ! యేరు దాటేదాక పడవ  మల్లాయ్ ! ఏరు దాటాక ఓటి  మల్లాయ్ (కరక్టేనా ?}  అనడం  ఇలాంటిదే అనుకుంటాను .

ఇక ..కొన్ని విషయాలలో .. నేనెలా ఉంటానంటే .. చెపుతాను

నాయనమ్మ చెప్పే కథలలో ,... సాంప్రదాయం, కొన్ని మూడాచారాలు ఉండేవి  . ఇప్పుడు కాలం లో చూస్తే భర్త భార్య నుదుటున కుంకుమ కాకపోయినా స్టిక్కర్ బిళ్ళ అయినా చూస్తున్నాడా? అని అనిపిస్తూ ఉంటుంది  బొట్టు లేకుండానే .. పతి  దేవుడు ముందు ..నేను తిరిగేస్తూ ఉండేదాన్ని ఒకోసారి గాజులు, ఆభరణాలు కూడా బరువే! వాటికి వ్యతిరేకం అని కాదు . ఎందుకో నిరాసక్తత .

 ఏ పార్టీలకో, శుభ కార్యాలకో,గుడికో వెళ్ళేటప్పుడు తప్ప ఇంట్లో ఉండే  మహిళలు కళ్ళకు కాటుక పెట్టుకుని ... నుదుటున కుంకుమ పెట్టుకుని,  మట్టిగాజులతో, తలలో పువ్వులతో కళ  కళ  లాడుతూ తిరుగుతూ ఉన్నారంటే నిజంగా గ్రేటే ..కదా!

అలాంటి వారందరికీ మహిళలకి వందనం .

నిజం చెప్పొద్దూ ..నేను అలా ఉండను .. నన్ను చూస్తే ఏ కొత్త మతం పుచ్చుకున్నానో అనుకునే ప్రమాదం ఉంది కూడా!  బొట్టు, అలంకారాలు మనసుకి నచ్చితే చేసుకోవాలి, బలవంతంగా కాదని నేను అనుకుంటాను. ఖచ్చితంగా చెప్పాలంటే మనసుకి నచ్చి నట్టు చేస్తాను .

ఒక మనిషి మరణిస్తే అలంకారాలన్నింటిని  బలవంతంగా త్యజించాలి అనుకునే దానికి నేను పూర్తీ వ్యతిరేకం. మా తాత గారు మరణిస్తే  మా..నానమ్మని  నిండుగా అలంకరింపజేసి ..నలుగురిలొ కూర్చోబెడుతుంటే రోజు అభ్యంతరం చెప్పేవాళ్ళం. పద్నాలుగో రోజు .. ఏవేవో చెయబొతుంటే  చేయనీయకుండా బలవంతంగా అడ్డుకున్నాం కూడా.

ప్రతి నిత్యం ముగ్గులు పెట్టుకుంటాం . దీపం పెడతాము  కొన్ని సంప్ర దాయాలు తప్పనిసరిగా పాటిస్తాం.
కానీ ఏదీ బలవంతంగా ఆచరించం .

( ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ .. అలాంటి పాటలు మీకు ఇష్టం ఉండవా ? అలాంటి పాటలు గురించి చెప్పరు   అని  ఒక  ఫ్రెండ్ అడిగారు .. అప్పుడు ఈ కథ .. గుర్తుకొచ్చింది).

7 కామెంట్‌లు:

Sharma చెప్పారు...

మీ నాయనమ్మ గారు చెప్పిన ఈ కధలో మంచి చతురత , సమయస్ఫూర్తి బాగున్నాయి . ఈ కట్టూ , బొట్టూ , కాటుక , పూలు , గాజులు పెళ్ళితో రావన్నది మన సమాజ మేధావులు మరచిపోయారు . మెట్టెలు , మంగళసూత్రం మాత్రమే అప్పుడు అదనంగా ఆడవాళ్ళకి చేర్చబడతాయి , అంతకు ముందున్న అలంకరణకు తోడుగా .
ఆ రోజుల్లో జనాభా బహు అల్పం నేటి జనాభాతో పోలిస్తే . ఆ భర్త పోయిన ఆడవాళ్ళని చూడగానే , సమాజం లోని వారికి తెలియాలని , ఆ ఆడవాళ్ళకు ఆకోరికలు కలుగకూడదన్న ఆలోచనతో యిటువంటివాటిని ఆరంభించి ఆచారమని , సంప్రదాయమని నామకరణం చేసేశారు . అదే సమయంలో ఆ ఆడవాళ్ళకి ఆ కోరికలుంటాయని , అవి తీరే మార్గం లేక మానసికంగా బాధప్సడ్తుంటారన్నది మరచిపోయారు . ఆ పై కొంతమంది మగవాళ్ళ స్వార్ధానికి ఆ ఆడవాళ్ళు వుపయోగ పడటానికి నిరాటంకంగా , యస్ధేఛ్ఛగా కొనసాగించి , ఆ ఆడవాళ్ళకు ' రంకులాడి ' అని గొప్ప పేరు పెట్టారు . ఇది అంతా స్వార్ధ పూరిత చర్యగా భావిస్తున్నాను .
అయితే ఒక్క విషయం మనం జ్ఞప్తిలో వుంచుకోవాలి . ఏదైనా ఓ ఆచారం గాని , సంప్రదాయం గాని ప్రారంభిస్తున్నప్పుడు , అది పుట్టిన ఆ సందర్భం సదుద్దేశమే . కాలక్రమేణా అవి తుఫనులా , సైక్లోనులా మెల మెల్లగా ఆ తీవ్రత తగ్గు ముఖం పట్టి , పక్కదోవలు పడ్తుంటుంది . అసలుకే ఎసరు తెస్తుందన్నమాట .
ఇందులో ఆ ఆచారాలు , సంప్రదాయాలు ప్రారంభించిన వాళ్ళది తప్పు కాదు .
ఉదా : జనాభా పెరిగిపోతుందని , అఱికట్టాలని , ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు ప్రారంభించింది . ఇది ఓ రకంగా సదుద్దేశమే . కాని దీనిని వక్ర మార్ఘంలోకి తీసుకు వెళ్ఖ్ళారు ఆమె క్రింద స్థాయి అనుచర వర్గం . పెళ్ళి కాని వాళ్ళకు కూడా ఆ ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసేసి .
ఇలాంటివి ఎపుడూ ఈ సమాజంలో కంపిస్తూనే వుంటాయి . వ్?ఈటిని విమర్శించుకోకుండా ఎవరికి యిష్టమైనట్లు ( ఎదుటివారికి యిబ్బంది కల్గించకుండా వున్నంతవరకు ) వాళ్ళు నడుచుకోవటం చాలా మంచిది .
ఇక కధ విషయానికొస్తే ఓ చిన్న తప్పు దొర్లింది ( పడ నడిపేది రాముడైతే , ఓ స్థాయిలో రంగడు అని ప్రచురింపబడింది ).

అజ్ఞాత చెప్పారు...

మీరు "బడిత పుచ్చుకు బాదినా బాగానే
ఉంటుంద"ని మరో సారి నిరూపించారు. నిజానికి సమయస్ఫూర్తి ఆడవారి సొత్తు, మాట నేర్పు కూడా.

SRINIVASA RAO చెప్పారు...

ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ .. baga vrasaaru..great

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Sharma గారు .. మీ అభిప్రాయానికి ధన్యవాదములు. నా పోస్ట్ కన్నా మీ వివరణే సమాంతర పోస్ట్ అయింది . :) థాంక్ యూ అండీ ! .పేరు సవరించాను *

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే..మాస్టారూ !..ధన్యవాదములు .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీనివాసరావు గారు ..ధన్యవాదములు .

ranivani చెప్పారు...

బాగుంది వనజ గారూ .మా నాన్నమ్మ కూడా ఇలాగే కథలు చెప్పేవారు .అవసరమున్నపుడు ఓడమల్లయ్య గారు ,అవసరం తీరాక బోడిమల్లయ్య అంటారట.ఇదీ మా నాన్నమ్మ చెప్పిందే .