13, మార్చి 2022, ఆదివారం

బంగారు భూమి

పళ్ళు తోముకుంటూ పై  అంతస్తులో నుండి కిందకి చూసింది లావణ్య. అత్త వర్ధనమ్మ  పశువుల శాల పక్కనున్న ఇనుప జల్లెడ కోళ్ళ గూడును తెరిచింది. కోళ్ళన్నీ బిల బిల బయటకు పరిగెత్తాయి. చద్దన్నంలో ఆవకాయ కారం కలిపి తీసుకొచ్చిన గిన్నె చేతిలోకి తీసుకుని అన్నాన్ని నలువైపులా వెదజల్లింది. అవి తింటూ వుంటే  ఆమె తదేకంగా వాటినే చూస్తూంటే “ అవి ఒట్టి అన్నం తినవా నాయనమ్మా! వాటికి కూర కలపకుండా కారం యెందుకు కలిపావు? పాపం కోడిపిల్లలకు మంట పుట్టదూ, రేపు నెయ్యేయి” అన్నాడు చిన్న మనుమడు కార్తీక్. ఆమె నవ్వుకుని మనుమడిని యెత్తుకుని ముద్దు పెట్టుకుంది.  ఇదిగో యీ మాయ ప్రేమలు కురిపించే ఆమె పిల్లలనూ తన పిల్లలనూ కూడా జారిపోనీయకుండా  భద్రంగా గుప్పిట్లో పెట్టుకుంటుందని పళ్ళు నూరుకుంది లావణ్య. “తెల్లారిందా గొడ్ల చావిట్లో తిరగడానికి. పైకి రా, బ్రష్ చేసుకుందువుగాని” అని  కొడుకుని గట్టిగా పిలిచింది.


పాలేరు షెడ్ శుభ్రం చేస్తుంటే గేదెలకు చిక్కని కుడితి తాపించింది వర్ధనమ్మ.  పాలు పిండి ముందు పాలని ఒక కేన్లో  పోసిచ్చి అమ్మకు యిచ్చిరా అని  కార్తీక్ కి యిచ్చి పైకి పంపింది. ఎనక తీసిన పాలను ఇంకో కేన్లో పోసింది. పాలేరొచ్చి యింకో గేదె పాలను తీసి కేన్ లో పోసాడు. నువ్వు టీ తాగి పొలమెళ్ళు.  కేంద్రానికి పాలు వంశీ బాబు తీసుకెళుతాడు లే అని అతన్ని తొందరజేసింది. తర్వాత ఆవుపాలు తీసుకుని పైకొస్తుంటే కొడుకు నరేష్ పాలేరు కలసి పొలానికి వెళ్ళడానికి కిందకి వస్తూ ‘’అమ్మా..  వూర్లో వాళ్ళు బీర గింజలకు వస్తారు మానిక పదిహేను వందల లెక్కన యిచ్చేయి‘’ అన్నాడు. అంత తక్కువకా అన్నట్టు ఆశ్చర్యంగా ముఖం పెట్టింది. మరో మాట మాట్టాడే అవకాశం లేకుండా మోటర్ సైకిల్ పై పాలేరుని యెక్కించుకుని వెళ్ళిపోయాడతను. 


వంటగట్టుపై పాల తపాళ పెట్టి.. “మానిక మూడు వేలు లెక్కన కొనుక్కొచ్చి అందులో సగం రేటుకు యివ్వమంటాడు వీడికేమైనా పిచ్చి పట్టిందా యేంటి” అంది కోడలితో. 


కోడలు ఆ మాటకు యేమి మాట్లాడకుండా “పాలు పాలేరు యిచ్చి వచ్చేవాడు కదా’’ అంది. “పిల్లలకు చిన్న చిన్న పనులు చెప్పాలి. వాళ్ళు పని నేర్చుకుంటారు. పాలు కొలవడం పోసుకొనేటపుడు లెక్కపెట్టడం రీడింగ్ చూసుకోవడం ఇవి మాత్రం చదువు కాదేంటి’’ అంది.అసంతృప్తిగా ముఖం పెట్టి ఆమెకు మామగారికి కాఫీ కలిపిచ్చి పిల్లలకు పాలు కలిపి తను గ్రీన్ టీ తీసుకుని హాలులోకి వచ్చింది లావణ్య.


వంశీ తాతతో కలిసి డాబాపై ఎండబోసి పెట్టిన బీర గింజలు తీసుకొచ్చి వరండాలో గుమ్మరించి చచ్చు గింజలను సన్న గింజలను యేరిపారేస్తూ కనిపించాడు. పిల్లలిద్దరికీ పాలు తాగించి వారికి పాల కేన్ యిచ్చి పాలకేంద్రానికి పంపింది వర్ధనమ్మ.


 మామగారు టిఫిన్ బాక్స్ లు తీసుకుని చేలోకి వెళుతుంటే నేనూ వెళతానని బయలుదేరుతున్న కొడుకుతో.. “ అబ్బాయ్ వంశీ! నువ్వు కూడా మీ నాన్నలా తయారైతావా యేమిటి? పుస్తకాలు అంటుకోకుండా చేను చెట్టు గొడ్డు గ్రాసం ట్రాక్టర్ దుక్కి సాళ్ళు అంటూ తెగదిరుగుతున్నావ్. మీ పెదనాన్నలా అమెరికా వెళ్ళి వుద్యోగం చేయవా” అనడిగింది లావణ్య. 


‘’అమ్మా! నువ్వసలు ఆ మాటన్నావంటే వూరుకోను. నేను అసలు ఆ అమెరికా వెళ్ళే చదువులు చదవను ఆ వుద్యోగం చేయను. రోజూ చేలోకెళ్ళి వ్యవసాయం నేర్చుకుంటా. నాకిదే బాగుంది. నువ్వు రోజూ యిదే మాటంటే నేనసలు బుక్ పట్టుకోను నన్ను కొట్టినా సరే’’ అని విసురుగా వెళ్ళిపోయాడు వంశీ. ఆ మాటలు చెప్పిన కొడుకు తీరుకు విస్తుపోయింది లావణ్య.


వీడికి రోజు రోజుకు తిక్క పెరిగిపోతుంది ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవకపోతే యెలా అనుకుంది. ‘’మీ అబ్బాయికి సబ్జెక్టు కంప్లీట్ అవదు. నెక్స్ట్ క్లాస్ కు ప్రమోట్ చెయ్యలేం. ఇప్పటికే మీ అబ్బాయి స్టడీస్ లో చాలా డల్’’ ఓపికగా చెప్పింది టీచరు.కొడుకు బదులు క్లాస్ కు తెర మీద ప్రత్యక్షమైన లావణ్యను చూసి. 


‘’ఈ వొక్కరోజుకే లెండి. రేపటికి యెలాగోలా బుజ్జగించి క్లాస్ కి కూర్చోబెడతాను. ఏ లెసన్ చెబుతున్నారో చెపితే నేను సాయంత్రం చదివిస్తాను’’ అన్న లావణ్యను చూసి మనసులో విసుక్కుని లెసన్ నెంబర్ చెప్పింది టీచర్. 


సాయంత్రం చేను నుండి వచ్చిన వంశీకి స్నానం చేయించి  అత్తమామలతో పాటు ఛానల్స్ ముందు కూర్చోనీయకుండా పుస్తకాల ముందు కూర్చోబెట్టే ప్రయత్నాలన్నీ వీగిపోయాయి లావణ్యకు. మనుమడు చెబుతున్న పొలం కబుర్లన్నీ విని మురిసిపోతూ మరిన్ని విషయాలను వాడి బుర్ర కెక్కిస్తుంటే వుడికిపోయింది. 


“ఎపుడూ యివే ముచ్చట్లా మీకు. కొడుకును యిట్టా తయారుచేసింది గాక మళ్ళీ వీడినికూడా అట్టాగే తయారు చేయడానికి చూస్తున్నారు. అసలీ మట్టి పిసుక్కోవడంలో అంత ఆనందం యేముందండీ? ఎకరాలు వున్నాయని చెప్పుకోవడమే కానీ పొదస్తమానూ కష్టపడటమే గాని యిందులో మిగిలేదమన్నా వుందా చచ్చిందా? ఎపుడూ తవ్వుకోవడం పూడ్చుకోవడం. పిల్లలకు బాగా చదువుకోవాలని చెప్పడం పోయి ఆ పొలం అట్టా ఈ పొలం ఇట్టా అని చెప్పి వ్యవసాయం నూరిపోస్తున్నారు. వీళ్ళను తీసుకెళ్ళి హాస్టల్ లో పడేస్తేకానీ మాట వినరు “ అని వంశీకి రెండు తగిలించి బరబరా వేరే గదిలోకి లాక్కుపోయింది. 


“వాడు చదువుకుంటానంటే మేము వద్దన్నామా, అయినా వాడేమన్నా అయ్యేయస్ లు అయ్పీయస్ లు చదువుతున్నాడా? చిన్న పిల్లాడు, చదివేనాటికి వాడే చదువుతాడు.మా పిల్లలిద్దరూ అట్టా చదివినోళ్ళు కాదూ “అంది అత్త గారు.


నరేష్ ట్రాక్టర్ పనిచేసిన లెక్కలు రాసుకుని విత్తనాల సేకరణ గురించి మాట్టాడి ఇరుగుపొరుగు రైతులతో ముచ్చట్లు రాజకీయాలు అన్నీ ముగించుకుని ఇంట్లోకి వచ్చేటప్పటికి తొమ్మిది దాటిపోయింది. స్నానం భోజనం ముగిసేటప్పటికి మరో అరగంట. అప్పటిదాకా ఓపిక పట్టిన లావణ్య నోరు విప్పి భర్త ముందు గట్టు తెగిన ప్రవాహమే అయింది. 


‘’మీరు పిల్లలను రోజూ యిలా వెంటేసుకుని తిప్పితే వారికి అక్షరం ముక్క రాదు.  ఇప్పటికే వచ్చిందంతా మర్చిపోతున్నారు. ఒక్క పదం కరెక్ట్ గా రాయలేరు చదవలేరు. అన్నీ స్పెల్లింగ్ మిస్టేక్ లే! అసలు చదువు మీద శ్రద్ధ లేదు. ఈ సంవత్సరం కూడా స్కూల్ మాములుగా నడవకపోతే వాళ్ళకు ఫీజులు కట్టడం కూడా దండగ. పిల్లలను పొలాలెంట తిప్పొద్దు అంటే మీరు వినరు.తొమ్మిదేళ్ళ పిల్లాడు రాజకీయాలు కూడా మాట్లాడుతున్నాడు. ఇట్టా వుంటే నేను అస్సలు ఊరుకోలేను. సిటీలో కాపురం పెట్టి చదివిచ్చుకోవాలి లేదా పిల్లలను  హాస్టల్ లోనైనా వెయ్యాల్సిందే ‘’ అంది. 


నరేష్ యేమి మాట్లాడలేదు. అతనంతే! ఎక్కువ మాట్లాడడు. చెప్పాల్సింది వొక్కసారే చెబుతాడని లావణ్య కు తెలుసు కాబట్టి  అంతకుముందొకసారి చెప్పినదానిని మరొకసారి గుర్తు చేసుకుంది.


 ‘’పిల్లలు చదివి ఉద్యోగాలు చేయకపోతే వాళ్ళు బతకలేరా. ఏం మనం బాగా బతకడం లేదా? ఎపుడూ సిటీ సిటీ అని మోజు పడతావ్. ఏం తక్కువైంది నీకు? పట్టణంలో వుండే సౌకర్యాలతో అంత కన్నా ధీటుగా అరవై లక్షలతో కట్టిన యిల్లు నౌకరులు పాడి పంట ధనం ధాన్యం అన్నీ వున్నా యేదో లోటు వున్నట్టు ముటముట లాడిపోతావు. పిల్లలు ప్రకృతిలో పెరగాలి. పొలాల్లో తిరగడం వ్యవసాయపు పనులు యెలా చేస్తున్నారో చూడటం నేర్చుకోవటం కూడా విద్యే. నేచులర్ సైన్స్ అది. ఇక ఇంగ్లీష్ చదువులంటావా? ఏం మా అన్న నేను పదవతరగతి వరకూ తెలుగు మీడియంలో చదివి తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదివి వాడు సాప్ట్వేర్ ఇంజినీర్ అవలేదా నేను ఎమ్ పార్మసీ చెయ్యలేదా. నువ్వు ఊగినట్టు నేనూ ఊగి అమ్మ నాన్నలను వొదిలేసి పొలం కౌలుకిచ్చేసి ఏ హైదరాబాద్ లోను ఉద్యోగం చేసుకుని బతకొచ్చు. ఉద్యోగాలు చేసేవాళ్ళు యింతకన్నా యేం బావుకుని తింటున్నారు. నాణ్యమైన పాలు దొరకక కూరగాయలు దొరకక దోమలతో కుట్టిచ్చుకుంటూ అగ్గిపెట్టెలాంటి గదుల్లో బతకడమేగా. ఇక్కడున్న గౌరవం తృప్తి అక్కడ వుంటాయా? ఆలోచించుకుని అసంతృప్తిని తగ్గించుకుంటే యిల్లు ప్రశాంతంగా వుంటుంది అని.  అతని మాట అప్పుడేనా  యెప్పుడైనా అదేనని ఆ మౌనానికి అర్థం అదేనని అర్దమై నిట్టూర్చింది.


లావణ్యకు  జీవితం పట్ల అసంతృప్తి పేరుకుపోతుంది.  రేపుదయం అత్త తో మాట్లాడాలి అనుకుంది. లావణ్య మేనత్త హేమ ఇంటి విషయాల నుండి అంతర్జాతీయ విషయాల దాకా అరటి పండు వొలిచి నోట్లో పెట్టినట్టు మంచి చెడూ విశదీకరించి చెబుతుంది. పిల్లల చదువుల విషయంలో అత్త సలహా తీసుకోవాలి అనుకుని నిద్రకు ఉపక్రమించింది. 


మర్నాడు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మేనత్త హేమకు ఫోన్ చేసింది లావణ్య. కుశల ప్రశ్నలయ్యాక ఆటోమేటిక్ గా వ్యవసాయం వైపు మళ్ళాయి కబుర్లు. 


పట్టిసీమ నీళ్ళు పక్కనే పుష్కలంగా పారుతూ ఉన్నాయి అని సంబరపడ్డాము. రెండు పంటలూ పండితే పంటసిరి దంతసిరి వున్నట్టే అనుకున్నాం.  నాలుగేళ్ళకే వరి పండించడం అనేది బుద్ధి తక్కువ పనని తెలిసొచ్చింది మాకు. ఖర్చులు చూస్తే తడిసి మోపెడు చేతికొచ్చేది చింకి చాటెడు. అందుకే  ఈ సంవత్సరం రైతులందరూ కలసి చేపల చెరువులకు లీజుకు యిస్తున్నారు. ఎకరానికి నలభై వేలు అంట. నాలుగు సంవత్సరాలకు బాండ్ రాయించుకుని నాలుగోవంతు అడ్వాన్స్ తీసుకుని యిచ్చేస్తున్నారు అని చెప్పింది లావణ్య.


“అది యెట్టాగమ్మా!?  బంగారం పండే పొలాల్లో చేపల చెరువులా?ప్రభుత్వం అనుమతి యివ్వొద్దూ, అయినా ఆ తర్వాత  పంటలు పండవు పొలాలు చవకేసి పోతాయి. ఎందుకట్టా బంగారంలాంటి మాగాణి గడ్డనంతా పాడు చేసుకుంటున్నారు ఇంకోసారి ఆలోచించుకోండి.” అంది హేమ.


“ అసలు  రైతుకు యేం మిగులుతుందత్తా? మగకూలీలకు రోజుకు ఎనిమిది వందలు ఆడకూలీలకు ఆరొందలు అంట. ధాన్యం తోలిన నాలుగు నెలలకు కూడా ప్రభుత్వం డబ్బులివ్వకపోయే. వ్యవసాయం చేసి చేతి చమురు వదిలిచ్చుకునే కంటే చెరువులకీయడమే నయం అంటున్నారు నరేష్.  మేము నాలుగు యెకరాలిచ్చాం. అవి పిల్లల ఫీజులకి సరిపోతాయి. ఇంకా రెండు యెకరాల్లో ఆర్గానిక్ పద్దతిలో తినడానికి వరి వేస్తున్నాడు. ఎకరానికి యెనిమిది బస్తాలు లెక్కన పండుతున్నాయి.  అవి యింట్లోకి సరిపోతాయి. ఈ వేసవికి రెండు యెకరాల్లో బీర వేసాము. పూత వచ్చిన దగ్గర్నుండి మందు కొట్టడమే. లేకపోతే పువ్వు పిందె అవకుండా రాలిపోవడమే. మందు రెండువేల ఐదొందలు మందు కొట్టిన కూలీకి ఐదొందలూ మొత్తం మూడువేలు. రోజు మార్చి రోజు మందు కొట్టాల్సిందే. రెండు లక్షలు వచ్చాయి. ఖర్చులకు లక్షా నలభై వేలు పోనూ  మిగిలింది అరవై వేలు. రెండెకరాలలో అన్ని రకాల విత్తనాల పంట పెడుతున్నారు.పదెకరాల మిరప చేను పదెకరాల మొక్కజొన్న. మిరపలో మిగలడం అనేది లాటరీ తగిలినట్టే అనుకో. కాస్త పరవాలేనిది మొక్కజొన్న వొక్కటే. పాలేరుకు రెండు పూటలా భోజనం టిఫిన్ టీ లు, నెలకు ఇరవై వేలు జీతం. పనికి రానిరోజు కి జీతం యివ్వాల్సిందే. ట్రాక్టర్ డ్రైవర్ కు పద్దెనిమిది వేలు అదనంగా బేటాలు. వీళ్ళందరికీ వంట మనిషిలా వంట చేయాలి నేను అంది విసుగ్గా.


‘’అవునా.. పెద్ద కమతం అమ్మా మీది. ఖర్చులు కూడా యెక్కువే “  అని ఆశ్చర్యపోయింది హేమ.


‘’చూడటానికి ముఫ్పై యెకరాల జరీబు,పెద్ద యిల్లు, కారూ, బుల్లెట్, ట్రాక్టరూ మందీ మార్బలం. అత్తగారిని హాస్పిటల్ కు తీసుకెళ్లాలన్నా పిల్లలను హాస్పిటల్ కు తీసుకెళ్ళాలన్నా ఆయనకు  యేనాడు తీరిక వుండదు.ఎప్పుడూ పనుల ఒత్తిడి! బస్సుల్లో ఆటోల్లో పడి  నేను పోవాల్సిందే.  పిల్లలు పొద్దున్నే ఏడింటికి స్కూల్ బస్ యెక్కితే సాయంత్రం పావు తక్కువ ఐదింటికి వచ్చేది.  తీసుకెళ్ళేటపుడు తీసుకొచ్చేటపుడు  బస్ లో పడి యెన్ని వూళ్ళు తిరుగుతారో. మొదట యెక్కి చివర దిగేది మా పిల్లలే. ఈ కోవిడ్ లాక్ డవున్ వల్ల పిల్లల చదువులు చట్టుబండలయ్యాయి. పుస్తకం అంటుకునే పని లేదు. పొద్దస్తమాను చేలల్లోనే.ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాను బోలెడు డబ్బులు వస్తాయి అంటాడు పెద్దాడు. ఏటి ఈత లంక మేత చందాన. తల బొప్పి కట్టి పోతుంది పిల్లలతో. నాకు  ఇంత సుఖం లేదూ సరదాలు అసలే లేవు’’ అని అన్ని విషయాలు కలగాపులగంగా కలిపి చెప్పేసింది లావణ్య.


మేనత్త హేమ అంతా  విని అనునయంగా మందలించింది “ఎందుకమ్మా అంత నిరాశ. భవిష్యత్ ను కలగనాలి. భవిష్యత్ లో నీ కొడుకు గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త అవుతాడేమో, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కాగలడమో! పిల్లలకు ఆసక్తి వున్న పనులలోనైతేనే రాణించగలరు.  చదువులలో వెనకబాటు అంటావా! చిన్న తరగతులే కదా,ట్యూషన్ పెట్టించి శ్రద్ధ పెడితే త్వరగానే దారిలో పడిపోతారు. స్వతహాగా నీ పిల్లలు తెలివైన వాళ్ళు చురుకైన వాళ్ళూనూ. దిగులుపడకు”అని మంచి మాటలు చెప్పింది. 


‘’ఎంత కష్టపడ్డా యెప్పటికైనా వున్న పొలంలో సగమే కదత్తా మాకు వచ్చేది. మా బావగారు వాటా పంచుకోకుండా యెందుకు వూరుకుంటారు. ఏ రెండేళ్ళకో చుట్టం చూపుగా వచ్చిపోతారు. ఇక్కడ పెద్దవాళ్ళ అనారోగ్యాలు చూసుకోవాలి  వ్యవసాయపు యిబ్బందులు పడాలి పెద్దవాళ్ళ పెత్తనాలు భరించాలి. అసలు యెన్ని వుంటయ్యో!  వాళ్ళకు అన్ని కరెక్ట్ సమయాలకు జరిగిపోవాలి ఐదు నిమిషాలు ఆలస్యం అవకూడదు. ప్రతి దానికి వొంకలు పెట్టుద్ది మా అత్త గారు’’ అంది లావణ్య.


‘’అమెరికా వాళ్ళు ఆస్థుల్లో వాటాలకు రారని చెప్పలేం. వస్తే వచ్చారులే. మనిషికి తృప్తి వుండాలమ్మా. నరేష్ కు పుట్టిన వూరు కన్న తల్లిదండ్రులు భూమి సెంటిమెంట్. అతనికి అందులో తృప్తి వుంది. కష్టమైనా నష్టమైనా వ్యవసాయం చేయడంలో అతనికి ఆనందముంది. ఇప్పుడు భూములకు రేట్లు పెరుగుతున్నాయి. వున్నదాంట్లో సగం వచ్చినా నీకు తక్కువేముందమ్మా. ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. ఆ వాటాల గురించి ఆలోచించకు. ఇక పెద్దవాళ్ళంటావా, వాళ్ళు అలాగే వుంటారు లేమ్మా. మన అమ్మ నాన్నలను బాగా చూసుకోవడం లేదని తమ్ముడు మీద మనకు కినుక వుండదూ! అత్తమామలనే అమ్మనాన్న అనుకో. నరేష్ మంచోడు.వివేకం కలవాడు.తల్లిదండ్రులను నొప్పించలేక మౌనంగా వుంటాడు కానీ నిన్ను కష్టపెడతాడా చెప్పు.బట్టలుతకడానికి మనిషి ఇంటి పని చేయడానికి సహాయానికి మనిషి వుంటారు కదా. వంట చేసేసి నీకిష్టమైన పుస్తకాలు చదువుకో, టీవి చూడు. పైన రూఫ్ గార్డెన్ పెంచుకో. అసంతృప్తి పెట్టుకోబాకు. జీవితంలో బోలెడు కష్టాలున్నవాళ్ళున్నారు వాళ్ళతో పోల్చుకుని సంతోషపడు. నువ్వు కూడా టూ వీలర్ నడపడం నేర్చుకో. చేనుకు వెళ్ళు లేదా విటిపియస్ దగ్గర ఆర్గానిక్ ప్రొడక్ట్స్  అమ్మే షాపు పెట్టుకో. కూరగాయలూ పాలూ పెట్టవచ్చు. కారం పేకింగ్ లు చేసి ఆర్డర్ యిచ్చిన వాళ్ళకు పంపడం లాంటి పనులు చేసుకో. ఉత్సాహంగా వుంటుంది’’ అని సర్ది చెప్పి అనుకూలమైన సూచనలు చేసింది. 


“అంతేలే అత్తా! నువ్వు చెప్పింది కూడా బాగానే వుంది. నీతో మాట్లాడితే మనసు తేలికపడుద్ది ప్రశాంతంగా వుంటది. థాంక్యూ అత్తా”అంది. 


నవ్వుకున్న హేమ “అసలు మీకున్న వసతి పొలం అండ దండ వుంటే మా అబ్బాయిని అమెరికా పంపేవాళ్ళం కాదు. పిల్లలను పంపి మేమెలా అలమటించి పోతున్నామో నన్ను మీ అత్తగారిని చూస్తూ కూడా నువ్వు అమెరికా అమెరికా అని కలవరిస్తావు యెందుకమ్మా. భూమిని నమ్ముకుని కష్టపడాలి ప్రయోగాలు చేయాలి. ఏ రంగంలో సవాళ్ళు లేవు చెప్పు? పట్టణాలలో ఎంత సంపాదించినా తినే తిండి పీల్చే గాలి  అన్నీ కల్తీలై అనారోగ్యాలతో జనం అలమటిస్తున్నారు. పల్లెల స్వచ్ఛతను కాపాడుకుంటూ ఆధునిక వ్యవసాయం చేసుకోవాలి. అవన్నీ చేయలేకపోయినా స్వంతానికైనా పండించుకుని  మంచి ఆహారం తినగల్గాలి. ముందు ముందు రైతే రాజు, అది మర్చిపోకు” అని తీపి ఆశ కల్గించింది. 


మేనకోడలు తేలికైన హృదయంతో ఫోన్ పెట్టేసాక ఆలోచనలలో మునిగింది హేమ. 


ఆర్గానిక్ ఫార్మింగ్ అని పలవరిస్తున్నారందరూ. అసలీ భూములను కాలుష్య రహితం చేయడం సాధ్యమయ్యే పనేనా? ఇన్నేళ్ళు విచ్చలవిడిగా రసాయన ఎరువులు కుమ్మరించి పురుగుమందులు వెదజల్లి కలుషితం అయిన నేలను శుద్ధి చేయడం అంత సులువైన పనా? ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తే ఎకరాకు ఏడెనిమిది బస్తాలకు మించి పండటం లేదని యిపుడేగా చెప్పింది మేనకోడలు. పెద్ద రైతులు యేదో విధంగా వొక దాంట్లో పోయినా మరొకదాంట్లో సరిజేసుకుంటారు. చిన్నా చితక రైతు నిలబడేది యెట్టా? వాళ్ళు అప్పుల ఊబి నుండి బయట పడటం సాధ్యమేనా? అసలు ఆర్గానిక్ ఉత్పత్తులు అని అమ్మేవాటిలో నిజమెంత!?


ఇందాక తను చెప్పినట్టు నిజంగా రైతు రాజయ్యే రోజు వస్తుందా? కూలీ అయ్యే రోజు  లేదా కార్పొరేట్ ఫ్యాక్టరీలలో దినసరి కూలీ అయ్యే రోజు వస్తుందా!? అసలు విచ్చలవిడిగా రసాయన ఎరువులు పురుగు మందులు చల్లిన పంటలు తిని మనుషులకు యెన్నెన్ని రోగాలు. ఆ విపత్తును తలుచుకుంటే వణికిపోయింది. దాని కన్నా కోవిడ్ 19 విపత్తు చాలా చిన్నది.పంచభూతాలను పిడికిట బిగించి వికృతంగా నవ్వుకుంటున్న మనిషి.ప్రపంచాన్ని అదుపులో పెట్టి మొట్టమొదట స్థానంలో వుండాలనుకున్న దేశం కుట్రో తప్పిదమో వైరస్ బారినపడిన పడి విలవిలలాడే మనుషులు. ఏముందీ,యెక్కడుంది వికాసం!?  ఉత్థాన పతనాలలో మానవజాతి. విచారంతో ఆ రాత్రంతా హేమకు కంటి మీద కునుకే లేదు. 


మర్నాడు సాయంత్రం వేళ పక్కింటి శాంతితో కలసి కూరగాయల దుకాణంకి వెళ్ళింది హేమ. అది హోల్సేల్ దుకాణం. ఆ ఊరులోనూ చుట్టు ప్రక్కల ఊర్లలోనూ పండించిన కూరగాయలను రైతులు అక్కడ ఎక్కువగా అమ్ముతుండటం వల్ల ఎప్పుడు చూసినా నవ నవలాడే కూరగాయలే వుంటాయి. 


శాంతి వంకాయలు బెండకాయలు బీరకాయలు క్యాలీఫ్లవర్ క్యాబేజీ చిక్కుడుకాయలు పచ్చి మిరపకాయలు టమాటాలు కొంటూ వుంటే నాణ్యమైనవి ఎంచి తూకం గిన్నెలో వేయడానికి సాయపడింది కానీ హేమ తీసుకోలేదు. ఆఖరికి ఆకు కూరలు కూడా తీసుకోలేదు. 


అది గమనించిన శాంతి “మీరేమీ తీసుకోవడంలేదు.. అన్నీ నేనే తీసుకుంటున్నాను. తీసుకోండి మీరు కూడా “ అంది. 


మీరు తీసుకున్న కూరగాయలన్నింటికి విత్తు నాటినప్పటినుండి ఎరువులు క్రిమి సంహారక మందులు  వాడుతుంటారు.పిందె నిలవడానికి పుచ్చుపట్టకుండా  పురుగు రాకుండా వుండటానికి విపరీతమైన పురుగుమందులు పిచికారీ చేస్తారు. ఇక రసాయన ఎరువులు సంగతైతే చెప్పనవసరమే లేదు. ఈ కూరగాయలు తింటే పోషక ఆహారం సంగతి అటుంచి కాలక్రమేణా వ్యాధుల బారిన పడతాం. మీకు తెలుసు కదా, నేను అల్సర్ తో ఎంత ఇబ్బంది పడుతున్నాను.

అందుకే వీలైనంత తక్కువ పురుగు మందులు చల్లి పండించిన కూరగాయలు తీసుకుంటాను.. అవి ఏమిటంటే .. రండి నేను కొనేటపుడు చూద్దురు గాని.. అంటూ తన వెంట తిప్పింది.


దొండకాయలు, మునక్కాయలు, దోసకాయలు, పచ్చి అరటికాయలు, కేరెట్, సొరకాయ, గుమ్మడికాయ, పొట్లకాయ గోరుచిక్కుడు కాయలు చిలకడ దుంపలు తీసుకుంది. 


శాంతి ఆసక్తిగా చూస్తూ వుంది.తిరిగి వస్తూ మరిన్ని విషయాలు ముచ్చటించుకుంటూ నడక సాగించారు.


“ శాంతీ! నేను ఏ కూరగాయను ముట్టుకున్నా మొక్క, చెట్టు, తీగ మొదళ్ళలో రసాయన ఎరువులు కుమ్మరిస్తున్నట్లూ పైన పురుగు మందులు పిచికారీ చేస్తున్నట్లూ  అన్పిస్తూ వుంటుంది. కంచంలో అన్నం వడ్డించుకుని  కూర్చుని ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటేనూ అదే ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది. అందుకే ఆచీ తూచీ కూరగాయలు తీసుకుంటాను. నగరంలో పుట్టి పెరిగి నగరాల్లోనే వుంటున్న మీరెప్పుడూ కూరగాయలు పండించే పొలాల్లోకి వెళ్ళి చూడలేదేమో! నేను అపుడపుడు చూస్తుంటాను కాబట్టి ఇవ్వన్నీ నాకు తెలుసు” అంది హేమ. 


“ఈ ఊరు పాడిపంటలకు కూరగాయలకు ప్రసిద్ది కాబట్టి అన్నీ ప్రెష్ గా చీప్ గా దొరుకుతాయి, పల్లెటూరి వాతావరణం ప్రశాంతంగా వుంటుందని ఇక్కడ ఇల్లు కొనుక్కొన్నాం అండీ. మీరేమో ఇలా వుంటుందని చెబుతుంటే భయమేస్తుందండీ”.


చిన్నగా నవ్వింది హేమ  “ఈ ఊరు ఇప్పుడున్న ఊరిలో పావువంతు వుండేది అదివరకు. మూడొంతులు మీలా ఆశించి వచ్చి స్థిరపడినవారే! పంట పొలాలన్నీ కాలనీలుగా మారిపోయాయి. మనదేశ జనాభాకి సరిపడ ఆహారం పండించాలంటే సేంద్రియ వ్యవసాయంలో కుదరదు. అందుకే సంకరజాతి విత్తనాలు వాడి అధిక దిగుబడి సాధించడం అవసరమైపోయింది. వ్యవసాయం అధిక ఖర్చుతో కూడిన పని అవడం వల్ల అధిక దిగుబడుల కోసం ఎరువులు గుమ్మరిస్తున్నారు. మన పెద్దల తరానికి మన తరానికి ఆరోగ్యాలలో మార్పు ఆహారం వలనే శాంతి. మీరు కూడా రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని వారానికి నాలుగు రోజులైనా సహజంగా పండించిన కూరగాయలు తినే ప్రయత్నం చేయండి అని సలహా యిచ్చింది.


“రూఫ్ గార్డెన్ చేయాలని ఉంది కానీ ఇంట్లో వాళ్ళ సహకారం లేదండీ.”అని వాపోయింది శాంతి. 


నిన్న మా మేనకోడలు ఫోన్ చేసింది. వాళ్ళు పండించిన బీర తోటకు చల్లిన పురుగు మందుల గురించి చెబుతుంటే వణుకు వచ్చింది.రాత్రంతా నిద్రపట్టలేదనుకోండి. మనం తిండి కాదు రసాయనాలు తింటున్నాం అనిపించింది. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే మన భావితరాల వారు నిత్య అనారోగ్యం పాలవుతారు. అంది ఒకింత దిగులుతో.


“మనమొక్కరమే ఏం చేయగలం చెప్పండి!? నలుగురితో పాటు నారాయణా అనుకోవడమే”


“లేదు శాంతి నాకొక ఆలోచన వుంది. స్త్రీలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అదీ కుటుంబ ఆరోగ్యం కోసం. కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ కోసం మా భూమిని సిద్ధం చేయాలనుకుంటున్నాను. సొంత స్థలం లేని వారందరూ తలాకొంత భూమిని కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయ పద్దతిలో కూరలు పండించుకోవడానికి అవకాశం కల్గించాలని అనుకుంటున్నాను.నాతో కలిసి నడిచే వారి కోసం ప్రయత్నిస్తున్నాను. ఇద్దరు ముగ్గురు కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా వున్నారు.

మా అందరి ముందున్నదీ వున్నది వొకటే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే చాలా కష్టనష్టాలుంటాయి.అయినా సరే సిద్దపడుతున్నాము.మీరు కూడా మాతో కలిసి పనిచేయవచ్చు అని ఆహ్వానించింది.


“అలాగేనండీ! ఇంట్లో వొప్పుకుంటే అలాగే చేద్దాం. మీరు చెప్పేది వింటుంటే నాకు ఉత్సాహంగా వుంది ”.


ముందు మనమంతా ఈ కోవిడ్ మహమ్మారిని జయించాలి.మనందరికీ రేపటి గురించి ఆశ వుండాలి. ఫలవంతమైన జీవితాల కోసం కమ్మని కలలతో  తీపి ఆశతో రేపును ఆహ్వానిద్దాం. సరేమరి. ఇకవుండనా మరి అని లోపలికి వచ్చింది హేమ. 


కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని వచ్చి టేబుల్ పై వదిలి వెళ్లిన మొబైల్ ఫోన్ తీసుకుని చెక్ చేసింది.  కాల్ లిస్ట్ లో మేనకోడలు లావణ్య నెంబరు కనబడింది. నీళ్లసీసా తీసుకుని బాల్కనీలోకి వచ్చి కాల్ చేసింది. 


అత్తా! నీకొక  స్టన్నింగ్ అండ్ గుడ్ న్యూస్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. మా బావగారూ తోడికోడలు పిల్లలూ అందరూ ఇండియా వచ్చేస్తారు అంట.ఈ సంవత్సరం అంతా కూడా రిమోట్ వర్కే కదా! అది చేసుకుంటూనే ఇక్కడ డైరీ ఫామ్ పెట్టడానికి పనులు మొదలు పెడతారంట. అక్కడ సంపాదించిన డబ్బంతా ఇక్కడ పెట్టుబడి పెడతారంట. తమ్ముడిని కూడా పార్టనర్ ని చేస్తాను అని చెబుతున్నారు మా బావగారు. ఇక మా భూములన్నీ ప్రయోగశాలగా మారిపోనున్నాయి”


“మంచి విషయమే! మీ వాళ్ళకు అక్కడ జీవితం నచ్చలేదేమో,ఇక్కడికి  తిరిగిరావడం కూడా అంతకన్నా మంచి అవకాశాలు లభిస్తాయనేమో! ఏదైతేనేం తెలివి తక్కువ ఆలోచన మాత్రం కాదు. ఎంతోమంది యువత కూడా ఇక్కడ వారికి వున్న వనరులను సద్వినియోగం చేసుకోగలమని నమ్మకంతో తిరిగి వస్తున్నారు.సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తున్నారు. అదే కొన్ని విదేశాలకు కడుపుకూటికి వెళ్ళిన వాళ్ళు అంతో ఇంతో ఇంటికి పంపుదామనే ఆశతో వెళ్ళిన వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరుగా.

వారివి బాధలైతే వీరివి అవకాశాలు.అవకాశాలు సృష్టించుకునే వారికి చేజిక్కించుకునే వారికి కొదవేముంది? అందులో మీకు రాజకీయ పలుకుబడి కూడా వుంది కదా” అంది హేమ.


ఈ మాటా నిజమే అత్తా! అక్కడ పదిహేనేళ్ళపాటు పెరిగిన పిల్లలు ఇక్కడెలా అడ్జెస్ట్ అవుతారో ఏమిటో! సడన్ గా ఈ నిర్ణయాలు ఏమిటో!  ఆ పిల్లలే ఇక్కడ వుండటానికి వస్తుంటే నా పిల్లల గురించి నాకు బాధ ఎందుకు!? వారి ఉద్దేశ్యాలు మంచివైతే  ఉమ్మడి కుటుంబంగా కలిసి వుంటాం. లేకపోతే విడిపోతాం. ఏదైనా వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు అని సంతోషపడుతుంది మా అత్తగారు. చూద్దాం ఏం జరగనుందో!  


లావణ్య మాటలలో ఎన్ని అనుమానాలు సంశయాలు వున్నప్పటికీ పాజిటివ్ థింకింగ్ తో స్పందించడం చాలా పాజిటివ్ గా అనిపించింది హేమకు. మేనకోడలి సంతోషంలో తన సంతోషం కలగలిపి “వలస వెళ్ళిన ఏ భారతీయుడు తిరిగి వచ్చేసేడన్న మాట విన్నా అనావృష్టికి ఎండిపోయిన ఊరి చెరువు తొలకరికే నిండి తొణికిసలాడుతున్నట్లు వుంటుంది. ఊరంతా పచ్చదనం పగిలినట్టువుంటుంది. మనసులో ఏదో తీపి ఆశ ఆకాశమంత ఆవరిస్తుంది” అంది కవితాత్మకంగా. అప్రయత్నంగా ఓ సినీగీతం అందుకుని “పాడిపంటలకు పసిడి రాసులకు కళకళలాడే భూమి.. మన జన్మభూమి బంగారు భూమి ఇక్కడ ఏం తక్కువ అనుకుంటాను” అంది పాటా మాటా కలిపేసి ఒకింత గర్వంగానూ అతిశయంగాను. 


“నీకు మరీ అంత దేశభక్తి పనికిరాదు. జాగ్రత్త అత్తా! ఈ సారి నేను ఫోన్ చేసేటప్పటికి నీ ఆలోచనలు మారిపోయి నిసృహగా ఏముంది ఈ దేశంలో కులం మతం అవినీతి తప్ప అంటావ్ చూడు” అని నవ్వుతూ ఫోన్ పెట్టేసింది లావణ్య.


మేనకోడలి మాటల్లో సత్యం చురుక్కుమనిపించింది హేమకు. “తలదాచుకోవడానికి ఇంత నీడ కూడు గుడ్డ లేని నిరుపేదలు ఎన్ని కోట్లమంది ఈ దేశంలో. వారి గురించి ఆలోచించే వారెవరూ!? వారి బతుకులతో కూడా వ్యాపారం చేయాలని చూసేవారు తప్ప అన్న చింత తరచూ ఆమె మెదడును తొలుస్తూనే వుంటుంది.ఐదు వేళ్ళు ఎప్పటికీ సమానం కాలేకపోతే మాన్లే కానీ ప్రతి పూటా ప్రజలందరికీ ఐదు వేళ్లు తినే కంచంలో పెట్టగల్గే భాగ్యం వుంటే బాగుండును కదా! అదే కదా అసలు సిసలైన బంగారు భూమి.ఈ బంగారు భూమిలో మనుషుల మనస్సులో కల్మషం భూమిలో విషం పండించకుండా వుంటే అంతే చాలు అనుకుంది భారంగా నిట్టూర్చి.


••••••••••••0••••••••••••••••••


(బహుళ త్రైమాసిక అంతర్జాతీయ పత్రిక మార్చి ప్రత్యేక సంచికలో ప్రచురితం)

కామెంట్‌లు లేవు: