8, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఎల్లలెరుగని మాతృ హృదయం

 బహుళ త్రైమాసిక పత్రికలో “నిగమ” పేరుతో నేను వ్రాస్తున్న శీర్షిక “రసోత్కృష్టమ్”

ఫిబ్రవరి సంచికలో ఈ కథ….

ఎల్లలెరుగని మాతృ హృదయం

లిలిక నకోస్  

గ్రీకు నవలాకారిణి కథా రచయిత జర్నలిస్ట్

(1903- 1989)

 ఈ కథ కేరళ రాష్ట్రంలో  పాఠశాల విద్యార్దులకు తొమ్మిదో తరగతి ఆంగ్ల పాఠ్యాంశంగా వుంది. రచయిత 16 వ సంవత్సరాల వయస్సపుడు  మూడు నాలుగేళ్ళపాటు గ్రీక్ టర్కీ యుద్ద వార్తల మధ్య భయం భయంగానే పెరిగారు. తర్వాత కాలంలో కూడా టర్కీ ప్రభుత్వం ఆర్మేనియన్ లపై మారణకాండ జరిపింది. ఆ ఊచకోత పదివేలకు పైగా మంది ఉరితీయబడ్డారు. అనేక స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. ఆ దారుణకాండ జరిగినకాలంలో ఆర్మేనియన్ ప్రజలు స్వస్థలాలు విడిచి చెట్టుకొకరు పుట్టకొకరు తరలిపోయి ఇతరప్రాంతాలలో కాందిశీకుల క్యాంప్ లలో తలదాచుకున్నారు. ఆ విషయాలను స్పురింపజేస్తూ యుద్ద వాతావరణ నేపధ్యంలో జరిగిన కథగా  ఈ కథను చిత్రించారు.  కథ చదువుతున్న పాఠకుడికి ఇది వాస్తవ చిత్రీకరణేమో అని అనిపించకమానదు. 

దేశాల మధ్య అంతర్యుద్దాల మూలంగా ప్రజలు ఎన్నో ఇక్కట్ల పాలవుతారు. గూడు విడిచిన గువ్వలై   ప్రాణాలు అరచేతపెట్టుకుని తమది కాని ప్రాంతానికి ఎక్కడికో పరుగులు తీస్తారు.లేదావిసిరివేయబడతారు.

తలదాచుకోవడానికి ఇంత నీడ కరువై ఆకలిదప్పులతో అలమటిస్తారు.  అగమ్యగోచరమైన బతుకీతలో తుఫాను గాలికి అలల్లాడిపోతున్న నావలా కొట్టుమిట్టాడుతుంటారు. 

ఆర్మేనియన్ క్యాంప్ లో తలదాచుకుంటున్న  పద్నాలుగేళ్ళ బాలుడు “మికిలీ “ తల్లి చనిపోతూ అతనికి అప్పజెప్పిన చిన్నారి తమ్ముడిని కాపాడుకోవడానికి ఎంత యాతన అనుభవించాడో! బక్కచిక్కి ఎముకులపోగులా మారి వికారంగా మారిన ఆ పసివాడికి ఇన్ని పాలు కుడిపేవాళ్ళు కరువై పైగా అసహ్యానికి గురై.. దూరంగా నెట్టబడుతున్నప్పుడు ఆపద్బాందవుడులా ఎదురైన ఒక చైనా యువకుడు అతని భార్య మానవత్వ పరిమళాలను పూయించిన వైనమే ఈ కథ. మనుషుల్లో  సహజంగా వుండే దయ కరుణ సానుభూతిని ప్రదర్శించి తోటి మనిషికి మనిషి పట్ల జీవితంపట్ల  కాస్తంత నమ్మకాన్ని మిగిల్చిన అపురూపమైన కథ ఇది. కథను చదివి ఎవరికివారు అనుభూతిని పొంది తీరవలసిందే తప్ప భావాన్ని చెప్పడానికి భాష కోసం తడుముకోవాల్సిన కథ. 

మానవుడు ఎక్కడైనా మానవుడే! దేశాలు ప్రాంతాలు సంస్కృతి వేరు కావచ్చునేమో కానీ జీవితాలు స్పందనలూ భావనలూ భావోద్వేగాలు అందరిలోనూ ఒకటిగానే వుంటాయని ఆ మాతృమూర్తి నిరూపించింది. మనిషి అంతరంగం కరుణాసముద్రం. ఆ కరుణ అందరిలోనూ వుంటుందని చెప్పలేం. దయ గల హృదయమే దేవాలయం మందిరం మసీదు గురుద్వారా.. అన్నీనూ.  ఈ కథ తోటి మానవుల పట్ల కాస్త దయను సానుభూతిని ప్రదర్శించి మనిషితనం చాటుకోమని ఉద్బోదిస్తుంది. ఎల్లలు లేని మాతృ హృదయానికి శిశువు రూపంతో కానీ జాతి మతాలతో కానీ పనిలేదని మాతృ హృదయం మాతృ హృదయమేనని చాటి చెబుతుంది. సాహిత్యం ఇరుకు మనసులను  విశాలత్వం చేస్తుంది.  సంకుచిత స్వభావం కలవారిని మార్చడానికి ఇతోధికంగా తోడ్పడుతుంది. మన చుట్టూ వున్న ప్రపంచాన్ని బాగా అర్దం చేసుకోవడానికి ఉపకరిస్తుంది.  ముప్పేటలా కలగలిపిన భావాల వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్న సగటు మనిషికి సరైన త్రోవ చూపించి మనీషిగా మిగల్చడానికి చేయూతనిచ్చి నడిపిస్తుంది. అందుకే మంచి మంచి కథలను మనం చదువుకోవాలి. ఆ కథలను ఇతరులతో పంచుకోవాలి. అందుకోసమే ఈ కథా పరిచయం.       

 -నిగమ

మాతృత్వం

(MATERNITY)

-- లిలికా నకోస్ (గ్రీక్ రచయిత)

“మార్సెయిల్‌”' పట్టణపు శివార్లలో నెలరోజుల పైబడి “ఆర్కేనియన్‌”కాందిశీకులు విడిది చేసి ఉండడంతో అది ఒక చిన్నపాటి గ్రామసీమగా రూపుదిద్దుకుంది. ఎవరెక్కడ చోటు దొరికితే అక్కడ స్థిరపడిపోయారు. డబ్బున్న కాందిశీకులు గుడారాలు వేసుకున్నారు. మిగిలిన వారిలో కొందరు ఊడిపోతోన్న రేకుల షెడ్ల క్రింద కాలక్షేపం చేస్తున్నారు.

అయితే అధిక సంఖ్యాకులు మాత్రం ఉండడానికి దిక్కుతోచక గోనె బరకాలని వెదురు కర్రల మీది ఛాందినీలా నిలబెట్టి దానికింద కాలం వెళ్ళమారుస్తున్నారు. ఏదేనా ఒకటి రెండు రేకులు దొరికి గోడల్లా ఏర్పాటు చేసుకోగలిగిన వాళ్ళు మహా అదృష్టవంతులేనన్నమాట.

 ఎంతదృష్టవంతులంటే స్వంతంగా పోష్ ‌లోకాలిటీలో ఒక స్వంతభవనాన్ని నిర్మించుకున్నంతటి ఆదృష్టవంతుల కింద లెక్క. ఎవరికి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ వచ్చిందాంతో కలో గంజో తాగి కాలక్షేపం చేస్తున్నారు.పిల్లలు కూడా మరీ మలమల మాడిపోకుండా ఓ డొక్క ఎండినా ఏదో కొంత తినగలుగుతున్నారు.

అయితే అణగారిన వాళ్ళలో కూడా అతి దరిద్రులూ దౌర్భాగ్యులో వున్నట్లే ఈ కాందిశీకుల్లో కూడా ఉన్న ఓ నికృష్టజీవి “మికలీ”. “మికలీ” పనైతే చేయలేడు కాని ఆతనికి కూడా అందరిలాగా ఆకలి వుంటుందిగా! వాళ్లూ వీళ్ళూ కనికరించి విసిరేసిన రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకుని కాలక్షేపం చేసేవాడు, అయితే అతని శరీర తత్వాన్నిబిట్టి ఎంత ఎంగిలి రొట్టెముక్కలు తిన్నా శరీరం తెగబలిసిపోయింది. ఇంతకీ “మికలీ" కి పద్నాలుగు సంవత్సరాలు. ఆతను పని చెయ్యాలంటే వచ్చిపడ్డ మరో ముఖ్యమైన అవరోధం ఏమంటే వాళ్ళమ్మ కళ్ళు మూస్తూ, మూస్తూ వదిలిపెట్టి వెళ్లిన పసికందు భారం ఒకటి అతని మెడకు చుట్టుకుని ఉంది. అయితే ఈ పసికందుకు విపరీతమైన ఆకలి ఎడతెరిపి లేకుండా గాడిద ఓండ్ర పెట్టినట్టు ఏడుస్తూండడంవల్ల అతనిని ఆ చుట్టుపక్కల్నించి తరిమేశారు.నిద్రాభంగమైతే ఎంత సహృదయాులైతే మాత్రం భరించగలరా?

ఆసలు ఈ పసికందు హోరెత్తించే ఆకలి గోలకి మికలీ కి పేగులు తోడేసినట్టుండేది, ఆయితే అతని తల్లి అతని భుజస్కంధాలపై ఉంచిన బాధ్యత భారాన్ని వదలించుకోవడం ఆంత సులభంగాదు కదా! ఏడుపు విని వినీ అతని బుర్ర పూర్తిగా దిమ్మెక్కిపోయి పిచ్చెక్కినవాడిలా తిరగడం మొదలెట్టాడు. తానెక్కడెక్కడ తిరుగుతున్నా చెవులు హోరెత్తించే కర్ణకఠోరమైన ఈ పిల్లాడి ఏడుపు కూడా వుంటూండడంతో అందరూ  మికలీని అసహ్యించుకోసాగారు. ఏడ్చి ఏడ్చి ఆ పసికందు ఎప్పుడో ఒకప్పుడు హరీమనాలని మనస్ఫూర్తిగా వాంఛించసాగారు.

ఆయితే అటువంటిదేమీ జరగకపోగా ఈ “న్యూసెన్స్‌” విపరీతం కాసాగింది. ఈ కొత్తగా పుట్టిన శిశువు కరువు కాటకాలకు, ఆకలికి వాడు విపరీతంగా ఏడ్చి ఏడ్చి బతకాలని నిశ్చయించుకున్నట్లు తోస్తోంది. కరువును మించినట్టుగా భూనభాలు అదిరిపోయేలా రోదిస్తున్నాడు. ఇవన్నీ వినలేని మాతృమూర్తులు చెవుల్లో  దూది కుక్కుకుని మరీ తిరుగుతున్నారు. మికలీకి ఇంచుమించు పిచ్చెక్కినంత పనిగావుంది. తాగినవాడి స్థితిలో తిరగసాగాడు. పాలు కొని పడదామంటే అతని దగ్గర చిల్లిగవ్వయినా లేదు.

ఏ మాతృమూర్తి అయినా దయదల్చి తన స్థన్యాన్ని అందిస్తుందేమోనంటే ఏ తల్లికీ ఆ వాత్సల్యమూ లేదు, ఉన్నా ఆ మాతం క్షీరసంపదా ఉన్నట్టు తోచదు.ఇది చాలదా మనిషిని పిచ్చెత్తించడానికి ?

ఇది పని కాదని మికలీ ఆవలి వైపున ఉన్న క్యాంపుకి వెళ్ళేడు

ఆక్కడ ఆంటోలియన్‌ కాందిశీకులు ఉన్నారు. వాళ్ళూ ఆర్మేనియన్‌ కాందిశీకులాగే ఆసియా మైనర్‌లో తురుష్కుల మూకుమ్మడి హత్యాకాండకి ఝడిసి ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చినవాళ్లే.

వాకబు చేయగా చేయగా మికలీకి ఆ క్యాంప్‌లో దయామయులైన తల్లులున్నారని వారిలో దయ ఎంత నిండుగా వుందో స్తన్యం కూడా ఆంత ఉదారంగానూ వున్నదని, వారు అనాధలైన శిశువుల ఆకలిని తమ స్తన్యంతో తీరుస్తారని తెలిసింది- ఈ చిన్నారి పాపడిని కూడా ఆ తల్లులు అనుగహిస్తే తాత్కాలికంగానైనా ఈ ఆకలి రోదన శమించవచ్చని ఆశపడ్డాడు మికలీ. మనిషిని జీవింపజేసేది ఆశే కదా!

అయిశే ఆ క్యాంపూ ఆర్మేనియన్‌ క్యాంపంత హృదయవిదారకంగానే వుంది.ముసలివాళ్ళు కటిక నేలమీద పరున్నారు. వాళ్ళ కాళ్ళకి ఏ ఆచ్చాదనా లేదు. చిన్నపిల్లలు మురికి నీటి చెలమల్లో ఆడుకుంటున్నారు. ఇతన్ని చూస్తూనే వృద్దురాళ్ళు లేచి కూర్చుని సానుభూతిగా -

“ఏంకావాలి బాబూ? అని అడగసాగారు.తను వచ్చిన పనిని ముసలమ్మలకి చెపితే మాత్రం వాళ్ళేమైనా ఆర్బగలరా తీర్చగలరా? అందుకే తిన్నగా మేరీమాత గుర్తు జండా ఎగురుతున్న ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేడు. ఆ టెంటు లోపలనుంచి చిన్నారి శిశువుల రోదనలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. బహుశః  ఈ టెంటులో దయార్ద్ర హృదయులైన మాతృమూర్తుల ఉండి వుండవచ్చు, అందుకే ధైర్యం చిక్కబుచ్చుకుని..

“పవిత్రమైన మేరీమాత స్వరూపాన్ని ధరించిన ఈ టెంట్‌లోని దయామూర్తులెవరో ఈ ఆకలితో అలమటిస్తోన్న ఈ దిక్కూమొక్కూ లేని మాతృహీనుడికి పాలను ఇచ్చి ఆకలి బాపండి తల్లీ! నేను ఆర్మేనియన్ కాందిశీకుల క్యాంప్‌ నుంచి వస్తున్నాను అని హృదయ విదారకంగా కేకవేసాడు మికలీ,

ఈ అభ్యర్థనకు జవాబుగా ఒక అందమైన, నల్లటి పడతి వచ్చింది. ఆప్పటికే ఆమె చేతులలో అరమూతగా కన్నులు మూసుకుని పాలుగోలుతోన్న శిశువు వున్నది

మికలీ హృదయం ఆనందపరవశంలో నాట్యమే చేసింది. దాహార్తితో విలవిలలాడే ఎడారి పయాణీకుడికి ఒయాసిస్సు కనిపిస్తే కలిగేలాటి ఆనందం అది. ఈ ఆనందంతో అతని శరీరం గజగజావణికి పోసాగింది, చుట్టుపక్కల వారు కూడా కొందరు ఆతృతగా ముందుకి వచ్చి మికలీ భుజంమీద దుప్పటిలో చుట్టబెట్టుకువున్న ఆ ఏడ్చే శిశుశువును (మికలీ చిన్నారి తమ్ముడుని) బయటకి తీసి చూడబోయారు.

"ఏదీ ఈ ఆకలిగావున్న శిశువును చూపించు, ఇంతకీ ఇది అబ్బాయా? ఆమ్మాయా!'” దయ ఉట్టిపడే మధురన్వరంతో అడిగింది ఆ పడతి.

హృదయ విదారకంగా కేకలు వేయడం ఇప్పుడు వారి వంతు అయింది. ఆది శిశువా? శిశువు అనేకంటే నరరూపంలో వున్న ఒక దెయ్యపు పిల్ల అంటే సరిపోతుంది. ఎముకల పోగులాటి  బక్క పల్చటి శరీరం మీద దెయ్యం తలకాయ లాంటి పెద్ద తల. ఇప్పటిదాకా చప్పరించడానికి ఏమీ దొరకక  దాని బొటనవేలిని అది చప్పరించిందేమో ఆ వ్రేలు రుబ్బుడు పొత్రమంత సైజుకి ఉబ్బిపోయి వుంది. తన చిన్నారి తమ్ముడు ఇంత ఏహ్యంగా, జుగుప్సాకరంగా తయారయి వుంటాడని ఊహించని మికలీకే ఒక్కసారి షాక్‌ తిన్నట్టయింది.

“ఓయి దేవుడా! ఇది మనిషి పిల్లకాదు.ఇది మనుషుల రక్తాన్ని పీల్చే ఒక రకమైన గబ్బిలం, నిజంగా

 నా వక్షం నిండా పాలున్నా ఇలాటి తురుష్కుజాతి గబ్బిలానికి పాలిచ్చి దైవాపచారం చెయ్యలేను...”

“అవును... ఇది దైవాపచారమే....ముమ్మాటికీ దైవాపచామరే” శృతి కలిపారు మిగిలిన వాళ్ళు.

“ఏమిటేమిటి?.... ఏదీ చూడనియ్‌.... గబ్బిలంకాదర్రా....ఇది

సైతాను భూతపు మరో రూపమే.... ఒరే అబ్బాయి,వెంటనే ఈ క్యాంపు

లోంచి మొహం కనబడకుండా పోతావా చితకొట్టమంటావా? నువ్వు అడుగెట్టినచోట పంచమహాపాతకాలు చుట్టుముడతాయి" అంటూ మికలీని దూరంగా తరిమేశారు. ఏం చేయగలడు? నిస్సహాయుడు నిరాధారుడు. కనీసం సానుభూతి చూపేవాళ్ళైనాలేరు. గుడ్లనిండా నీళ్ళు కుక్కుకుని..

“ఆదరించువారే లేరా ఈ వనిలోన? మమ్మాదరించు దాతలు లేరా ఈ ధరలోన” అని వాపోతూ తిరగసాగాడు. అతని ఆకలిదప్పుల మాట దేవుడెరుగును? ఈ శిశువును ఆకలి రక్కసి కోరలు నుండి కాపాడడం అతనికి తక్షణ సమస్య అయి కూర్చుంది.అయితే తను ఏం చేయగలడట! ఈ శిశువు ఏడ్చి ఏడ్చి ఎంత త్వరగా మరణిస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. నాగరికులమైన మనకైతే పాపం అతడు అజ్ఞాని అందుకే అతడు మనంత నాగరికంగా ఆలోచించ లేకపోయాడు అనుకుందుము. అతడు ఏకాకి.అన్నీ పోగొట్టుకున్నవాడు. ఇంతసేపు అతను మోస్తున్నది ఆకలితో అలమటిసోన్న ఒక చిన్నారి శిశువును కాదని.... నర రూపంలో ఉన్న ఓ దెయ్యపు పిల్లనని అనిపించేసరికి వెన్నులోంచి వణుకు పుడుతోంది. అయినా అతనిలో లవలేశంగానైనా మిగిలివున్న బాధ్యత, మానవత్వం ఆ శిశువుని అలా మోయిస్తూనే వున్నాయి. అయ్యో పాపం పసివాడు.మికలీ ఒక షెడ్డు నీడలో చేరాడు, బయట వేడిగా వుంది. షెడ్డు లోనూ వెచ్చదనం పరుచుకుని వుంది. అతనికి తన కడుపులో ఎలకలు పరిగెడుతున్న సంగతి గుర్తువచ్చింది. వీధులలో సగం సగం తిని పడేసిన పదార్దాలనో, అవ్వీ దొరకకపోతే పెంట కుప్ప మీద పడి వున్న పదార్థాలను కుక్కలతో పోటీ పడోతినాలి. తప్పదు. అప్పుడు మొదటిసారిగా అతనికి జీవితం అతి భయంకరమైన దానిగా తోచ సాగింది. తోస్తేమాత్రం ఏం చెయ్యగలడు!

చేతుల్ని ముఖానికి అడ్డుపెట్టుకుని వెక్కి వెక్కి ఏడవనారంభించాడు. ఎవరు వింటారు. ఈ దీనుడి ఏడుపు? ఎవడికి కావాలట. ఎవరు ఎలా పోతే మాత్రం?? తొందరపడి ఆలా అనెయ్యకండి. సర్వసాక్షికి ఇవేమీ తెలియవనే అంటారా?....ఏమో !

మికలీ తలెత్తి చూసేసరికి అతని ముందు ఒక చైనా యవకుడు నిలబడివున్నాడు,  మికలీ ఆతన్ని ఆ క్యాంపులో చాలాసార్లు చూసాడు కాని అంతగా గమనించలేదు అయితే ఆ చైనీయడు మికలీని ఆతని అవస్థనూ నిత్యం చూస్తూనేవున్నాడు, అతగాడు ఈ క్యాంపులో పేపరుతో చేసిన రక రకాల ఆటవస్తువులూ ఏవేవో గమ్మత్తు వస్తువులు అమ్మి వ్యాపారం చేద్దామని వస్తూండేవాడు. ఆయితే అతని దగ్గర ఎవ్వరూ ఏమీ కొనేవారుకాదు.ఈ చైనా వాడు చింతాకుల్లాటి కళ్ళతో, తప్పడముక్కుతో, పచ్చగా, కుదమట్టంగా వుండడంతో క్యాంపులోని పిల్లలు ఆటపట్టిస్తూ ఉండేవారు.పైగా

“వీలింగ్‌, స్టింకింగ్‌ చింక్‌* అని పిలుస్తూ హేళన చేసేవారు.

మికలీ కేసి ఆ చైనా యువకుడు చాలా దయగా చూశాడు.అంత చిన్నకళ్ళల్లోనూ విశ్వమంత విశాలమైన దయ ఉబికి ఉబికీ తన్నుకు వస్తూ కనబడుతోంది.

“అలా ఏడవకూడదమ్మా అబ్బాయ్‌...” అన్నాడు ఎంతో సిగ్గుతో ముడుచుకుపోయినవాడిలా  వున్న మికిలీతో. “రా అమ్మ రా! నాకూడా రా.” అన్నాడు.

నేను రాను. అన్నట్టు తల అడ్డంగా వూపడం ఈ మాటు మికలీ వంతయింది....మికిలీ అక్కణ్తించి వేగంగా పారిపోదామని కూడా భావించాడు. ఈ ప్రాచ్యదేశస్టుల క్రూరత్వాన్ని గురించి మికలీ వాళ్ళ దేశంలో వున్నప్పుడు ఎన్నో రకాల కథలు విన్నాడు. వాళ్ళ దేశంలోనేకాదు ఈ క్యాంపులోకూడా తరచు వినబడేదేమంటే....ఈ చైనావారూ జపాన్‌ వారూ క్రైస్తవ పిల్లల్నిఎత్తుకుపోయి....యూదుల్లా వారి రకాన్ని పిండుకుని కడుపునిండా తాగుతారట.

అయితే ఆ చైనీయుడు ఒక అంగుళమయినా కదలకుండా అలాగే నిలబడివున్నాడు. నిండా మునిగిపోయేవాడిలో గడ్డిపోచయినా ఆశని కల్పించినట్టు చావుకి ఇన్ని చావులుండవుకదా అని అతని కూడా బయలుదేరి వెళ్ళాడు. పొలంగట్టు మీంచి నడిచి వెళ్ళటంతో చేతుల్లో పిల్లాడితో సహా తూలిపడిపోయాడు మికలీ.

అయితే చైనా యువకుడు మికలీ చేతిలోని శిశువును తానే అందుకుని తన గుండెలకు సుతారంగా హత్తుకుని ముందుకు నడవసాగాడు.

వాళ్ళు  అనేకమైన కాళీ ఇళ్ళని దాటుకుంటూ వెళ్ళారు. చివరికి ఒక తోట మధ్యలో వున్న కర్రలతో కట్టిన ఒక ఇంటి ముందు ఆగేరు, 

తలుపు మీద సున్నితంగా రెండు మూడు సార్లు తట్టాడు. ఒక చిరుదీపం దాల్చిన ఓ చిన్నపాటి యువతి వచ్చి తలుపు తీసింది. ఈ చైనా యువకుని చూడగానే ఆ అమ్మాయి కొద్దిగా సిగ్గుపడింది,బుగ్గలు ఎరుపెక్కాయి ఆయినా చిరునవ్వుతో వారికి స్వాగతం పలికింది. మికలీకి ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. లోపలికి వెళ్లాలంటే భయం, ఆందోళన ఏవేవో ఉద్వేగాలు అందుకే తడబడుతూ నిలబడ్డాడు.

“నందేహంలేదు....లోపలికి రావోయ్‌....ఈమె నా భార్యే…

“కానున్నది కాకమానదు"” అనుకుంటూ లోపలికి ఆడుగేశాడు మికలీ.

అది పెద్దగదే....అయితే దానివి కాగితాలు అంటింపుతో రెండు భాగాలుగా చేసారు...బీదరికం కనపడుతున్నా ఆ ఇంట్లో ఆరోగ్యం ఉట్టిపడుతూ వుంది. సౌజన్యం సరేసరి. 

 “ఇది మా పాప... అంది ఉయ్యాలలో ఆడుకుంటూన్న ముద్దు పాపాయిని చూపిస్తూ. ఆ పాపాయి ఎంతో ముద్దుగా వున్నాడు.ఇంతటి ఆందోళనలోనూ మికలీ పాపాయి దగ్గరిగా వెళ్లి బుగ్గగిల్లి అభినందించకుండా వుండలేకపోయాడు. కడుపునిండా పాలుతాగినట్టున్నాడు. హాయిగా

నిద్రపోతున్నాడు.

భర్త భార్యను సంజ్ఞచేసి పిలిచాడు.చాపమీద కూర్చోమన్నాడు. కూర్చోపెట్టి ఈ దెయ్యపు(లాటి)శిశువును చేతికందించాడు. చూడగానే ఆమెకూడా వెర్రికేక పెట్టింది.అయితే భయంతోనో ఏహ్యభావంతోనో వేసిన కేకకాదు.దయ చిప్పిల్లి  వేసిన సానుభూతి చిహ్నమైన కేక. ఆ శిశువును గుండెలకదుముకుని  పాలు కుడుపసాగింది. ఆమె పాలిండ్లు ఆర్ద్రమై పాలను ఎగచిమ్మేయి. ఆకలిగొన్న శిశువు ఆవురావురని పాలు తాగసాగింది,

కామెంట్‌లు లేవు: