8, నవంబర్ 2015, ఆదివారం

మర్మమేమి

మర్మమేమి 

ఆ రోజు  తెల్లవారుఝామున పిన్ని కొడుకు  గృహ ప్రవేశం.  విజయవాడ బస్టాండ్ లో గుంటూరు బస్ ఎక్కి కూర్చున్నాను. సమయం ఏడవుతున్నా  సూర్యుని పసిడి కిరణాలు పుడమిని తాకడంలేదు . మంచుతెరల మధ్య చలిగా ఉంది కాస్త కాఫీ తాగితే బావుండుననుకున్నా  కానీ బద్ధకం ముందు కాఫీ సెకండరీ అయిపొయింది. మొబైల్ తీసుకుని  ఇయర్పొన్స్ తగిలించుకుని ఇష్టమైన పాటల పొదికని తెరిచి  ఒక పాటని  ఎంపిక చేసుకుని వినడం మొదలెట్టాను." నేనొక అనామికను ఈ కథలో అభిసారికను" ..  ఏదో రిలీజ్ కాని చిత్రంలో పాట. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు . వినడంలో ఇష్టంగా లీనమైపోయాను.  

కొంచెం సేపటికి ఒకమ్మాయి వచ్చి నా ప్రక్కన కూర్చో బోతూ .. విండో సీట్ నాకిస్తారా అనడిగింది.  ఏ సీటై తే ఏమిటీ  గమ్యస్థానం చేరకపోతామా పైగా  కృష్ణమ్మ  బిర బిరలు చూసే భాగ్యం కూడా లేదని నాకనిపించి ఎడమ వైపుకి జరిగి కూర్చున్నాను. ఆమె విండో ప్రక్క సీట్లో హమ్మయ్య అనుకుంటూ  కూర్చుంది. బస్ బయలు దేరటానికి సిద్దంగా ఉన్నట్లు స్టార్ట్ చేసి పెట్టుకుని కొంచెం సేపు ప్లాట్ పారం  మీదే ఉంచడం డ్రైవర్ కి అలవాటనుకుంటా ! ఇంతలోకి ఒక వ్యక్తీ బస్ ఎక్కాడు . డోర్  దగ్గరే నిలబడి బస్ అంతా పరికించి చూసి దిగేసాడు. మళ్ళీ అనుమానంగా బస్ ఎక్కి చూస్తున్నాడు . ఏంటయ్యా ! వస్తావా రావా? మీవాళ్ళు ఎవరైనా రావాలా అని డ్రైవర్ అడుగుతున్నాడు. ఆతను మాట్లాడకుండా దిగేయగానే బస్ కదిలింది . 

నా ప్రక్కన కూర్చున్న అమ్మాయి అతన్ని చూస్తూనే ఉంది . అతను క్రిందికి దిగగానే ఆమె చేతిలో ఉన్న ఫోన్ ని సైలెంట్ ప్రొఫైల్ లోకి మార్చడం చూసాను . ఆమెకి ఒక కాల్ వచ్చింది . ఆ కాల్ వంక చూస్తూ ఉండిపోయింది కానీ లిఫ్ట్ చేయలేదు . బేగ్ లో ఉన్న రెండో ఫోన్ తీసి చక చక ఒక నంబర్ డయల్  చేసి తల వంచి " వాడికి అనుమానం వచ్చింది " బస్ స్టాండ్ కి వచ్చి ప్రతి బస్ ని చెక్ చేస్తున్నాడు. నేను బురఖా వేసుకుని ఉన్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే  గుర్తు పట్టేసేవాడే ! నేను మళ్ళీ చేస్తాను . వాడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు . ఫోన్ తీయక  పొతే అనుమానం వస్తుంది అని కట్ చేసి ..." ఆ చెప్పు ఏంటీ పోన్ చేసావ్ ? " అవతల ఏం  మాట్లాడుతున్నాడో  వినబడదు కదా అప్పటికే బస్  కృష్ణ లంక దాటేస్తుంది నేను కాలేజ్ కి వెళుతున్నానని చెప్పాను కదా ! ఇప్పుడే ప్రభాస్ కాలేజ్ వైపు వెళ్ళడానికి ఆటో ఎక్కుతున్నాను . తర్వాత మాట్లాడతాను అని చెప్పి పోన్ కట్ చేసింది. 

మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి అడిగింది.   ఏమిటి అన్నట్టు చూసాను  నాకొక పోన్ వస్తుంది . మీరు నేను కలసి ఒక ఆటోలో సింగ్ నగర్ స్టాప్ లో నుండి ప్రభాస్ కాలేజ్ వైపుకి వెళ్ళే  ఆటో ఎక్కామని చెప్పాలి ..ప్లీజ్ చాలా ప్రాబ్లం లో ఉన్నాను అంది . ఆమె చెప్పేది వింటూనే నాకు చాలా అయోమయంగా అనిపించింది కానీ  పాపం  ఏదో  ప్రాబ్లం అంటుంది కదా ! అనుకుని అలాగే అని తల ఊపాను నేను అలా అంగీకారం తెలపగానే .. ఒక నంబర్ కి కాల్ చేసి మా ఆయన లైన్ లోకి వస్తాడు మీకు ఇందాక చెప్పినట్లు చెప్పండి అని ఫోన్ నాకిచ్చింది . చెవి దగ్గర పెట్టుకున్నాను అటువైపు నుండి ఒక మాట కూడా అర్ధం కాలేదు . నేను ఒప్పుకున్న విషయం నెత్తి మీద పెద్ద బరువులా తోచి .. నేను మీ ఆవిడ ఇప్పుడే సింగ్ నగర్ దగ్గర ఆటో ఎక్కాం.  ప్రభాస్ కాలేజ్ దగ్గర దిగిపోతాం అని గబా చెప్పేసి ఆ అమ్మాయికి పోన్ ఇచ్చేశాను . విన్నావుగా .. ఇక సాయంత్రం వరకు డిస్ట్రబ్ చేయకు నేను పోన్ స్విచ్ ఆపేస్తున్నా ! క్లాస్ లకి వెళ్ళాలి కదా ! సాయంత్రం ఆన్ చేస్తా . అంటూ  ఆ పోన్ స్విచ్ ఆపేసి ఇంకో చేతిలో ఉన్న పోన్ తీసుకుని వేరొక అతనితో మాట్లాడుతుంది . అతనితోనే అని ఎందుకు అనుకున్నానంటే .. వెధవ ..వాడితో  ఇక సాయంత్రం దాకా గొడవలేదు నేనెక్కడికి రాను బంగారం అనడగుతుంది . ఆపకుండా ఒకటే కబుర్లు . నాకైతే ఒంటికి కారం రాసుకున్నట్టు ఉంది . 

కాసేపటి తర్వాత తనని ఎవరూ గమనించే వారు లేరనుకుని ముఖానికి కట్టుకున్ననఖాబ్   తీసేసింది . నేను ఉలికి పడ్డాను , నుదుటున ఎర్ర రంగు దోస గింజ ఆకారపు  స్టిక్కర్.  స్కార్ఫ్ , నఖాబ్ కట్టుకుంటే - మొగుడు కూడా గుర్తు పట్టలేడు....  ఈ అమ్మాయిలకి ఏం పోయే కాలం వచ్చింది మరీ ఇలా తయారవుతున్నారు. భర్త తో విభేదాలు ఉంటే పెద్దల మధ్య పరిష్కరించుకోవచ్చు లేదా విడాకులు తెసుకోవచ్చు ..ఎందుకీ ముసుగు నాటకాలు ? ప్ర్రాబ్లం  లో ఉన్నానని చెప్పి  నాతొ అబద్దపు సాక్ష్యం చెప్పించినందుకు కోపం  చిరాకోచ్చేసింది నాకు. 

ఆ అమ్మాయి వంక కూడా చూడకుండా ప్రక్క సీట్ వైపు చూసాను . అక్కడ ప్రక్క ప్రక్కనే కూర్చున్న అమ్మాయి అబ్బాయి . అమ్మాయి టైట్  జీన్స్ వేసుకుని పైన టీ  షర్ట్ వేసుకుంది.  శరీరంలో ఒంపుసొంపులన్నీ గీత గీసినట్లు కనబడుతూనే ఉన్నాయి . ముఖానికి మాత్రం స్కార్ప్ కట్టుకుని ఉంది . ప్రక్కన కూర్చున్న కుర్రాడి చేయి ఆమె ఒంటిమీద నాట్యం చేస్తూ ఉంది . నా వెనుక సీట్ లో కూర్చున్న కళ్ళద్దాల పెద్ద మనిషి పేపర్ చదువుకుంటున్నట్లు నటిస్తూనే ఎడమ ప్రక్కన సీట్లో కూర్చున్న జంట  రొమాన్స్ ని ఆస్వాదిస్తూ సొంగ కార్చుకుంటున్నాడు . ఛీ ఛీ .. సభ్యత సంస్కారం లేకుండా పోతుంది జనాలకి విసుక్కుంటూ నేను తెచ్చున్న మాస పత్రిక తీసి అందులో మునిగిపోయాను.  

కొద్ది సేపటికే  నా ఎడమ ప్రక్క సీట్లో కూర్చున్న అమ్మాయి లేచి వాళ్ళ వెనుక సీట్లో కూర్చున్నతనితో  గొడవ పడసాగింది . యూ..  రాస్కెల్ ఎన్ని సార్లని చూస్తూ ఊరుకుంటాం . వెనుక సీట్లో కూర్చున్న వాడివి బుద్దిగా కూర్చుని  నీ ప్రయాణం నువ్వు చేయి. ముందు  సీట్లో ఉన్న నన్ను టచ్ చేస్తావెందుకు ? కోపంగా అడిగింది  నిన్ను నేను టచ్ చేసానా, నేను టచ్ చేసానా ! సరిగ్గా చూసుకో ఎవరు టచ్ చేసారో . పబ్లిక్ లో ఉన్నామనే సెన్స్ లేకుండా బస్ లో కూర్చుని రొమాన్స్ చేస్తున్న మీకు అందరూ అలాగే కనబడుతున్నరేమో అన్నాడు .  ఆ అమ్మాయి రెచ్చిపోయి ఎవరు టచ్ చేసిందో నాకు తెలియదనుకున్నావా ? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు . అంటూ  ఇదిగో అజయ్  ఈ ఉంగరం ఉంచుకో ! ఎవడో బద్మాష్ గాదు పదే  పదే నా ఒంటిమీద  టచ్ చేస్తూ మైమరుపులో పడిపోతే వాడి వ్రేలి నుండి ఈ ఉంగరం లాగేసా ! కసిగా అని   కూర్చుంది  ఆ వెనుక సీట్లో కూర్చున్న పెద్దమనిషి  ఎడమచేతి వ్రేలి వైపు చూసుకుంటూ  కిక్కురుమనకుండా కూర్చున్నాడు. ఇవన్నీ చూస్తుంటే చాలా  అసహ్యమేసింది . లేచి వెళ్ళిపోయి ఆఖరి సీట్ లో కూర్చున్నాను .

నా ప్రక్కనే కూర్చున్న పిల్ల హాయిగా ప్రశాంతంగా పుస్తకం చదువుకుంటూ ఉంది నన్ను చూసి పలకరింపుగా నవ్వి .. ప్రతి రోజు  ఈ బస్ లలో ఇలాగే గొడవలు పడుతుంటారు అంది . నేనేమీ మాట్లాడలేదు . యూనివర్సిటీ స్టాప్ వచ్చింది. అక్కడ చాలా మంది ముసుగు వేసుకున్న అమ్మాయిలూ , ఆ జంట కూడా  దిగేశారు. వాళ్ళ దారులు వేరైయ్యాయి . 

యూనివర్సిటీ లోపలకి వెళుతున్న అమ్మాయిలని చూసాను . సీతా కోక చిలకల్లా రంగు రంగుల బట్టలు వేసుకుని అందరూ ముఖానికి స్కార్ప్  కట్టుకుని ఉండారు .  అమ్మాయిల ముఖం కనబడకుండా దాచుకున్నంత మాత్రాన వాళ్లకి రోడ్ సైడ్ రోమియోల వల్ల ఈవ్ టీజింగ్ తగ్గుతుందా !? అందంగా ముఖం ఉన్నా లేకపోయినా ఆకారం కనబడుతూనే ఉంది గా ! పైగా అవయవ సౌష్టవాన్ని కనబడకుండా బట్టలు వేసుకుంటున్నారా  అంటే అదీ లేదు.  ఎవరిని మభ్య పెట్టడానికి ఈ ముసుగులు ? ఈ ముసుగులు వల్ల రక్షణ ఏమైనా ఉందా ?  తల్లిదండ్రులకి కూడా బిడ్డల ప్రవర్తన పట్ల నమ్మకం పోతుంది . ఏమైనా అంటే  మీకేమి తెలియదు మీరు ఊరుకోండి అంటూ  విదిలించి పడేస్తారు. దారిపొడవునా ఆలోచిస్తూనే ఉన్నాను .  

గుంటూర్ బస్టాండ్ దగ్గరకి రాగానే  లోపలకి వెళ్ళకుండానే నేను బస్ దిగుదామని లేచి నిలబడ్డాను. నేను మొదట కూర్చున్న సీట్ లో అమ్మాయి బురఖా వేసుకునే బస్ దిగిపోయి నా ముందు నుండే ఎవరిదో బండెక్కి తుర్రున వెళ్ళిపోయింది . పాపం ఆ  మొగుడి అనుమానం నిజమే అయి ఉంటుంది  ఈ కాలపు అమ్మాయిలూ మాములుగా లేరు అనుకున్నాను .  నా ప్రక్కన కూర్చున్న అమ్మాయి లేచి నింపాదిగా బేగ్ లో పెట్టుకున్న బురఖాని తీసి తొడుక్కుంది .  నేను ఆ అమ్మాయి  వంక ఆశ్చర్యంగా చూస్తున్నాను . నన్ను చూసి చిన్నగా నవ్వి  నాతో  పాటు బస్ దిగిపోయింది . 

నేను సిటీ బస్స్టాప్  వైపు అడుగులు వేస్తున్నాను ఆ అమ్మాయి నాతొ పాటే నడుస్తూ .. ఎక్కడికి వెళ్ళాలి ఆంటీ అడిగింది చొరవగా .. బృందావన్  గార్డెన్స్ అన్నాను . అదిగో ఆ బస్ వెళుతుంది అంటూ ఎక్కేసింది. నేను దిగే స్టాప్ లోనే దిగి నాతొ పాటే  నడుస్తూ ఎక్కడికి వెళుతున్నారు అంది  దగ్గరలోనే నూతన గృహప్రవేశ ఆహ్వానం అన్నాను  తనూ అక్కడికే అని చెప్పింది  . లోపలకి రాగానే మళ్ళీ బురఖాని విప్పేసి బాగ్ లో కుక్కేసి .. ఇప్పడు హాయిగా ఉంది అని నా వైపు చూసి స్నేహంగా నవ్వింది .  నీ పేరేమిటమ్మా అడిగాను . షహనాజ్ మేడం  అని చెప్పింది.  నా గురించి అడిగింది చెప్పాను . మీరు నా ఫ్రెండ్ కి ఆంటీ నా !? శృతి  ఇక్కడ లేకపోయినా గృహప్రవేశానికి వెళ్ళమని కాల్ చేసి  మరీ మరీ చెప్పింది. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ .  అందుకే వచ్చాను.  శృతి కూడా మీ గురించి అప్పుడప్పుడూ చెపుతూ ఉండేది.  ఇలా  మిమ్మల్ని కలవడం చాలా సంతోషం అంది. 

షహనాజ్ చాలా కలుపుగోలు మనిషి. ఇంగ్లీష్ టీచర్ గా కూడా పని చేస్తుందట. తన మతాచారాల పట్ల ఎంత గౌరవం ఉందో  అంతకి మించి చాంధసవాదం  పట్ల విముఖత ఉందని గ్రహించాను.  మధ్యాహ్నం భోజనాల తర్వాత  ఎవరూ అప్పటికప్పుడే ఇళ్ళకి వెళ్ళడానికి ప్రయాణం కట్టకూడని  షరతు పెట్టింది మా మరదలు .  చుట్టాలందరూ ఉండిపోయారు కూడా !  సరదాగా  ఆటాపాటా లతో పాటు  రకరకాల పోటీలు నిర్వహించారు కిట్టీ పార్టీల అనుభం అనుకుంటా ! అందరూ భలే చురుకుగా ఉన్నారు. అందరిలోకి నేనే వెనుకబడి ఉన్నాను. నన్ను గెలిపించి బహుమతి ఇవ్వాలని నా మరదలికి తట్టిందో ఏమో  స్త్రీలకి  కవితల పోటీ నిర్వహిస్తే బావుంటుంది అని అనౌన్స్ చేసింది ఆ  కార్యక్రమంలో నేను పాల్గొన్నాను కూడా ! నాకన్నా ముందు  షహనాజ్ పేరు వచ్చింది. ఆమె  "ముసుగెందుకు"  అనే కవిత చదివింది .  ఆ కవిత నాతొ పాటు చాలా మందికి నచ్చింది . హాలంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది.  నేను కవిత్వం వినిపించకుండా ముసుగు గురించే మాట్లాడాను . వాతావరణ కాలుష్యం నుండి కాపాడుకోవదానికో చర్మ సంరక్షణ కోసమో అమ్మాయిలూ స్కార్ఫ్ కట్టుకోవడం లేదని  ఆకతాయీ అబ్బాయిల నుండి రక్షించుకొవడానికి కూడా  ఎక్కువమంది స్కార్ఫ్ కట్టుకోవడం లేదని ఆ రోజు జరిగిన బస్ అనుభవాలని వివరించి ముసుగులు విడనాడాలని నేను కోరుకుంటున్నానని చెప్పాను.  అక్కడున్న అమ్మలందరూ నాతొ ఏకీభవించారు కూడా ! అలా చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటూ   చాలా సంతోషంగా  మధ్యాహ్నమంతా గడచిపోయింది .  

చీకటి పడబోతుండగా   షహనాజ్ నేను` ఇద్దరం కలిసే తిరుగు ప్రయాణమయ్యాం. దారంతా సంప్రదాయం పేరిట పర్ధా  వెనుక నలిగిపోతున్న తన లాంటి ఆడపిల్లలని గూర్చి చెపుతూనే ఉంది. తామెంత స్వేచ్చ కావాలని కోరుకుంటున్నామో  బురఖాని విడనాడాలని అనుకుంటున్నామో కూడా చెప్పింది.  ఆశ్చర్యంగా అనిపించింది నాకు. 

షహనాజ్ తన గురించి మరింత వివరంగా చెప్పింది. ఎమ్ ఏ బి ఈ డి చేసాను . ఈ గుంటూరు లోనే ఉద్యోగం చేసేదాన్ని విజయవాడ కి చెందిన బాంక్ ఎంప్లాయ్ మ్యాచ్ వచ్చింది బోలెడంత కట్నం ఇచ్చి పెళ్లి చేసారు . ఉద్యోగం చేస్తూనేఉన్నాను .  ఇద్దరు పిల్లలు పుట్టారు . వాళ్ళ పెంపకం అంతా అమ్మ చూసుకునేది. మా ఆయనకీ నెల్లూరు ట్రాన్స్ ఫర్  అయింది. నాకేమో జీతం పెరిగింది . ఉద్యోగం  మానేయమన్నారు . నేను మానేయలేదు అమ్మ  నాన్న సాయంగా ఉందామని ఉన్న ఊరు వదిలేసుకుని గుంటూరుకి కాపురం వచ్చేసారు. ఒక ఏడాది అలా గడిచిందో లేదో మా మధ్య గొడవలు వచ్చేసాయి. బురఖా లేకుండా కాలేజ్ లో తిరుగుతున్నానని అమ్మానాన్నల అండ చూసుకుని పెట్రేగి పోతున్నానని మా ఆయనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాననే గర్వంతో ఎవరిని లెక్క జేయడం లేదని మా అత్తగారు గొడవపెట్టుకునే వాళ్ళు . ఆఖరికి ఉద్యోగం మానేసి అత్తవారింట్లో కాపురం ఉంటేనే నాతోనే కలసి ఉంటానని మా ఆయన పేచీ పెట్టాడు . విసిగిపోయాను.  జాబ్కి రిజైన్ చేసేసి అత్తారింటికి  వెళ్ళిపోయాను.  జీవితం గురించి ఏవేవో కలలు కంటాం కానీ పీడకలల్లాంటి జీవితం మన ముందు ఉంటుందని ఇప్పుడు తెలుస్తుంది. నలబయ్యి వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఒదులుకుని ఇప్పుడు ఇంటిప్రక్క స్కూల్ లో ఎనిమిదివేల రూపాయల జీతంతో  టీచర్ గా చేస్తున్నా. అదీ అత్తగారు  అడుగడుగునా విధించే ఆంక్షలతో అంటూ  నవ్వుతూ చెప్పినా అందులో ఉన్న బాధ నాకర్ధమయ్యింది . మెల్లగా ఆమె చేతిని నా చేతిలోకి తీసుకుని ఓదార్పు వచనాన్ని సరఫరా చేసాను . 

బస్ టోల్ గేట్ దగ్గరలో ఆగిపోయింది. ముందు చాలా వాహనాలు ఉన్నాయి. అన్నీ కదిలి టోల్గేట్ చెకింగ్ దాటేసరికి  వర్షం ప్రారంభమయ్యింది.  చలికాలంలో వర్షాకాలం. షహనాజ్ సన్నని కూనీ రాగంతో ఏవో పాటలు పాడుకుంటుంది. భలే పాడుతున్నావే అన్నాను . అవన్నీ ఇంట్లో బంద్. కనీసం మా అమ్మాయి తరానికైనా మా సంప్రదాయాలు మారితే బావుండును. అందుకోసమే నేను పోరాడుతున్నాను మా వాళ్ళని కూడా మార్చాల్సిన అవసరం ఉంది .  నేనొక్కదాన్నే మారాలనుకుంటే విడాకులు తీసుకుంటే అయిపోయి ఉండేది మేడమ్  కానీ నేనలా అనుకోవడం లేదు. మా బంధువులందరికీ  ఒక్కొకటి అర్ధమయ్యే రీతిలో చెప్పుకుంటూ పోతున్నా ! నా రహస్య అజెండా వారికి తెలియదు అని నవ్వింది. ఆ మాట అర్ధమై నేను నవ్వేసా !      

సంప్రదాయాలని విసర్జించి స్వేచ్చగా మసలాలని షహనాజ్ లాంటి వారు  కోరుకుంటుంటే అదే ముసుగుని వేసుకుని పెడదారిన పడుతున్న కొందరిని చూస్తున్నా,. మంచికి చెడుకి ఒకే కత్తి లాగా బురఖా, స్కార్ఫ్ మారడం చూస్తూన్నాం అనుకున్నాను. యాసిడ్ దాడులు, ప్రేమోన్మాదులు,ర్యాగింగ్ వికృతాలతో  పాటు స్కార్ఫ్ మోసాలు కూడా !  బస్  దిగే టప్పుడు ప్రొద్దున  బస్ బస్ వెదుకుతున్న అబ్బాయి మళ్ళీ కనిపించాడు . బహుశా అతని భార్య  ఏ వారధి దగ్గరో దిగిపోయి ఆటో ఎక్కేసి  ప్రభాస్ కాలేజ్ దగ్గరకి వెళ్ళి పోయిందని తెలుసుకోలేలేడేమో కూడా అనుకున్నాను మనసులో .   

వర్షం కురుస్తూనే ఉంది. ఇద్దరం  తడుస్తూనే సిటీ బస్టాండ్ వైపు నడుస్తున్నాం  సడన్ గా మా ఇద్దరి ముందు అతను. ఏయ్ .. ఏమిటిలా దారికి అడ్డం పడుతున్నావ్ .. తప్పుకో అంటూనే ఉన్నా . అతను ప్యాంట్ జేబులో నుండి కత్తి  తీసి  షహనాజ్ పొట్టలోకి దించేసాడు. భయంతో వెర్రి కేకలు పెట్టాను. మళ్ళీ ఇంకోసారి పొడిసేసాడు.  పొడిసిన కత్తిని పైకిలాగి క్రింద పడేసి షహనాజ్ తలకి కట్టుకున్న నకాబ్ ని లాగిపడేసి అలాగే నిలబడిపోయాడు .  క్రింద  పడిపోతున్న షహనాజ్ ని పట్టుకుని హెల్ప్ హెల్ప్ అని కేకలు పెట్టాను . రక్తం దారలుగా  కారుతుంది వర్షపు ధారలలో కలసి పారుతుంది అది చూసాక  వర్షం నా కళ్ళల్లో కురుస్తుంది.  

నా కేకలకి చుట్టూ ఉన్న మనుషులు మమ్మల్ని చుట్టేసి జరిగింది అర్ధమై పారిపోకుండా  అతన్ని గట్టిగా పట్టుకున్నారు .  పోలీస్ లు వచ్చేసారు , అంబులెన్స్ లో షహనాజ్ ని ప్రక్కనే ఉన్న  హాస్పిటల్ కి తీసుకు వెళ్ళారు తనతో నేనూ వెళ్ళాను . కత్తిపోట్లు అంత బలంగా తగల్లేదు కాబట్టి షహనాజ్ కి ప్రాణ భయం  ఏమీ లేదు కానీ .. ఆమె ఇంటి వాళ్ళని తలచుకుంటే ఒణుకు వచ్చేసింది. ఈ సంఘటన దేనికి దారి తీస్తుందో అర్ధం కాలేదు. ఆమె ఇంటి వాళ్ళందరూ హాస్పిటల్ కి వచ్చారు. నేనేవరనే ఆరాలు అనుమానపు చూపులు.   షహనాజ్ మామగారు విషయాన్ని సేకరించుకొచ్చారు.   పొడిచినతన్ని  కత్తితో సహా టూ టవున్ పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళారని . అతను చెప్పిన మాటలు ఏమిటంటే  తన  భార్య  బురఖా వేసుకుని ప్రియుడితో తిరుగుతూ తనని మోసం చేస్తుందని .. ఆ రోజు ప్రొద్దున్నే ఆ నల్ల చీర కట్టుకున్నామె  ప్రక్కన కూర్చుని ప్రయాణం చేస్తుంటే తను చూశానని . . తిరిగి వచ్చేటప్పుడు బురఖా వేసుకుని వచ్చేది కూడా తన భార్యే అనుకుని చంపేయబోయానని చెప్పాడట . ఇంకా ఒణికి పోయాన్నేను.   

1 కామెంట్‌:

Saraswathi Durbha చెప్పారు...

బాగుంది. మీ కథలు విసుగు, విరామం లేకుండా ఏక ధాటి గా చదివింప చేస్తాయి.