అక్షరాత్మ ఆశ్లేషం
శరదృతువుని తరుముతూ హేమంతం వేగిర పడుతుంది
ఎడగారున పూసిన మల్లెలు బొట్లు బొట్లుగా మంచుని కురుస్తున్నాయి
ఎల కోయిల తోడు లేక అపస్వరాల పాటనే గొంతెత్తి పాడుకుంటాను
మనస్సాకాశంలో భావాలు పక్షుల్లా ఎగిరిపోతుంటాయి
ఆలోచనల ఎడారిలో వాక్యం ఎండమావిలా తోస్తుంది
కవీ... ప్రేమగా పిలిచింది అక్షర కుటీరం
నువ్వెంత్తెత్తుకి ఎదిగినా గుమ్మంలోనుంచి తలొంచి లోనికి రమ్మంటుంది
వెళ్ళకపోయినా తనే అతిధిలా వచ్చేస్తుంటుంది
ఎలా ఉన్నావ్ ! ఆత్మీయ పరామర్శ
బిలంలో చీకటి పిగిలిపోయింది
ముత్యాలసరాలలో దాగున్న స్పర్శాతీత భావమేదో పరిమళమై అల్లుకుంది
పూలతోటల్లో జీవన మహోత్సవాన్ని చేసుకుంటున్న సీతాకోక చిలకల లాస్యం
రేకులు విప్పి భ్రమరం కోసం మధుపాత్రని సిద్దం చేసిన పద్మం
పదముల కంటిన ధూళి ప్రదక్షిణ చేసిన గర్వం
పూవుపై రాలిన హిమబింధువు పూజకెళ్ళి సార్ధకమైన అహం
క్షణభంగురమైన నురగ బుడగలో వెలిసిన సప్తవర్ణాల శోభ
అన్నీ సొంతమైపోతాయి అయినా
ఎప్పుడూ ఇచ్చే అలక్ష్యపు సమాధానమే...
చూస్తున్నావుగా అంటూ
అప్పుడు నిజమైన ఓ పరికింత తర్వాత
ఎలా ఉన్నావో చెప్పనా ... ?
ఎందుకట తెలుసుకోవడం ... మాటల్లో బింకం
అదంతా ఒట్టి శబ్దమే... లోలోపట ఉత్సుకం
ఏ అలంకారం లేని అమ్మ పాటలా
భగవంతుని కీర్తించే సంకీర్తనలా
నేలరాలిన పూల చేవ్రాలులా
అభావమైన కంటి బాసలా...ఉన్నావ్ అంది
పరిహాసమా ... ఉదార విన్యాసమా
స్వేచ్చగా గాలికెగురుతూండే వస్త్రంలాంటి నేను
కవిత్వ గులాబీ ముళ్ళకి చిక్కుకున్నాను
దిగుళ్ళ పల్లకిని బోయిలా మోస్తున్న హృదయం
మజిలీ మాట మరచి గమ్యం చేరేదాకా పరుగులెత్తిస్తుంది
బెంగటిల్లకు ...
నీలోనే అమృతముంది నీలాగే మళ్ళీ నువ్వు మారడానికి
అయినా నేనున్నానుగా వాగ్ధాన బీజమేదో హృదయ క్షేత్రంలో నాటుకుంది
1 కామెంట్:
నీ లోనే అమృతముంది..నీలాగే మళ్లీ నువ్వు మారడానికి...
చదివిన ప్రతీసారీ...సరికొత్త అర్థం...చాలా చాలా బావుంది
వనజ మేడమ్
కామెంట్‌ను పోస్ట్ చేయండి