2, నవంబర్ 2015, సోమవారం

వస్త్రాపహరణమొక సంస్కృతి


మాతృక మాస పత్రిక " గుండె చప్పుడు " లో నా కవిత.  

వస్త్రాపహరణమొక సంస్కృతి
ఇంటా బయటా జాతి గౌరవాల గురించే మాట్లాడుతాం
ఏ జాతి అని అడగకండి . 
ఇక్కడ జాతికి ఒక రంగు ఉండాలి
అన్ని రంగులు అసలు సమానమే కాదు 
అవసరమైతే యుగాలనాటి సంస్కృతిని తెరపైకి ఈడ్చుకొస్తాము
వస్త్రాపహరణం జుట్టుపట్టుకుని ఈడ్వడం లాంటి
అన్ని పర్వాలు ఇక్కడుంటాయి ఆధునీకరణ చేసుంటాయి
ఇక్కడ జాతులకి కొన్ని ధర్మాలుంటాయి
స్వజాతికే ధర్మం కొమ్ముకాస్తుందన్నట్టు
అనుకుంటే పొరబాటే !
చెలగాటం ప్రాణ సంకటం నిత్య వినోదమిక్కడ
ఒక్క ఓట్ల కాలమప్పుడు తప్ప క్రమంతప్పని ఋతువుల్లా
మతం కులం జాతి లింగ వర్గ పేద ధనిక తారతమ్యం మరీ ఉంటుంది
ఇక్కడధికారం అణువణువునా కాపుకాస్తుంది
కడగొట్టు జాతి వాడు పిర్యాదివ్వడం కూడా
పాపమని సొంత రాజ్యాంగం రాసుకున్నారేమో ,
ప్రశ్నించే అధికారాన్ని కాలరాస్తూ కాళ్ళతో మట్టగిస్తూ
బట్టలూడదీస్తారు కళేబరాల్ని ఈడ్చినట్లు నడి రోడ్దున పడేస్తారు
చెత్త మనుషులనుకుని చెత్త ఊడ్చి పడేసినట్లు వదిలేస్తారు
ఆడమగ తేడా లేకుండా నిలువుగా వివస్త్రలు కాబడి
నిశ్చే ష్టులై నడి రోడ్డుపై నిలుచుంటే
నగ్నత్వాన్ని కథలుగా చెప్పుకుంటూ నిలబడిన లోకులు
కాకులు కూడా కాలేకపోయారు
ఇక్కడ కాకులకి కులముంది మతముంది
మీ నగ్నత్వాల సాక్షిగా ఇక్కడ నిజమెప్పుడూ నిష్టూరమే !
మౌనంగా ఉపేక్షించే చచ్చుజాతి పుచ్చుజాతికి
నిలబడిన చోట సంఘీభావం తెలపడానికి కూడా భయమే
ఎవరి ఆయుధం వారి చేతిలోనే ఉండాలిప్పుడు
అరువు ఆయుధాలు ఎన్నటికి దొరకవు
అమ్మల్లారా !
చీరకొంగుల్లో చిటికెడు కారమైనా దాచుకోకుండా
చేతిలో చిన్న చురకత్తైనా లేకుండా ..పిర్యాదు చేయడానికి వెళ్ళకండి .
మీ మీద లెక్కలేనన్ని పిర్యాదు లుంటాయక్కడ
బట్టలిప్పుకుని బరి తెగించి దేశం పరువు తీస్తున్నారని 
పరువు హత్యలు చేయగలరు
లేదా దేవతా వస్త్రాలు ధరించడం
మా జాతి సంస్కృతీ అని చాటేయనూ గలరు 
జాగ్రత్త తల్లీ ! 
ఈ సారి పోలీస్ హవుస్ లకి వెళ్ళేటప్పుడు
తోళ్ళు తాటాకులు కూడా రహస్యంగా తీసుకెళ్ళండి
ఏం జరిగినా రహస్యంగా దాచుకోండి.

కామెంట్‌లు లేవు: